పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వశైల, అపరశైలములు

మౌర్య వంశానంతరకాలపు స్తూప శాసనములను బరిశీలించినచో నం దిది 'చెతికియానం నికాయస మహాచెతి య' మనఁగా చైత్యకనికాయముయొక్క మహాచైత్య మని పేర్కొనఁ బడినది. మహా సాంఘికులలో చైత్యక వాదు లొకరు. ఈబౌద్ధ సంఘమును దాక్షిణాత్య బౌద్ధులు చైత్యవాద సంఘ మని, ఉత్తరాది బౌద్ధులు చైత్యశైల సంఘ మని వ్యవహరించుచుండిరి. ఈ సంఘముకాక అమరావతి నాగార్జునుని కొండ శాసనములందు పూర్వశైల (పువసేలియ), అపరశైల (అపరసేలియ) నికాయములు కూడఁ బేర్కొనఁ బడినవి. పూర్వశైల, అపరశైలము లను పేరఁబరఁగిన యిచటి బౌద్ధ సంఘారామములు బౌద్ధవాఙ్మయమునందు కడుంగడు ప్రసిద్ధికెక్కినవి. రమ్యహర్మ్య కళాసౌందర్యమును, ప్రకృతి దృశ్యసౌందర్యమును గూడ నీ సంఘారామములకుఁ గలదని యేడవశతాబ్ది నిచ్చటి కరుదెంచిన యువాన్‌చాంగ్ అను చీనా యాత్రికుఁడు వీనిని కీర్తించియున్నాఁడు. ఇవి పూర్వోక్త శాసనములందుఁ గొన్నిట పూర్వమహావనశైల (వుపమహావన సేలియ), అపరమహావన శైల (అపరమహావన సేలియ) నామములఁ బరికీర్తితము లయినవి. క్రీస్తుశకము రెండవ, మూఁడవ శతాబ్దుల నాఁటి 'గండవ్యూహ' మను నొక