పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలకు బుద్ధ భగవానునియెడల భక్తిగౌరవములను, మతవిషయకమగు ప్రబోధమును గలిగించుటకు బౌద్ధశిల్పులు బుద్ధజీవిత కథలను, బౌద్ధగాథలను చిత్రించుచుండిరి. బౌద్ధగాథలు మొదట చాల పరిమితముగానే యుండినను క్రమముగ నవి యసంఖ్యముగఁ బెరిగినవి. వీనిలో, ఈజన్మమున బుద్ధుఁడయి నిర్వాణపదవి నొందిన బోధిసత్వుఁడు దయ, అహింస, ప్రేమలకు లక్ష్యముగఁ గడపిన పూర్వజన్మములకు సంబంధించిన వృత్తాంతము లగు జాతక కథలు ప్రజారంజకము లయినవి. ప్రపంచ కథా వాఙ్మయమునం దెల్ల ఈజాతకకథావళి కడుంగడు ప్రాచీన మయిన దనియే కాక, యూరోపీయ ప్రాచీన కథా వాఙ్మయమునందలి చాలకథల కాకరము లిందే కలవని ప్రాచ్య పరిశోధక పండితులగు విదేశీయులును, భారతీయులునుగూడ అభిప్రాయ పడుచున్నారు. మొట్టమొదట, బౌద్ధకళ యారంభదశలో, శిల్పమున బుద్ధుని చిత్రింపవలసి వచ్చినప్పుడు భౌతికమాన విధేయములయిన నామరూపములను విడిచి యా సాధువతంసము నిర్వాణము నొందెనని తెలుపుటకు గుర్తుగ నచ్చటి స్థలమును శూన్యముగా నుంచువారు. చిత్రాభావమే బుద్ధభావమునకు చిహ్నముగ నుండెను. కాలము గడచినకొలఁది, మొదట ---------