పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధాతుగర్భపదమునకు భ్రష్టరూపము దాగబ (దాగోబా). ధాతుగర్భము మీఁది దిబ్బకు స్తూపమని పే రయినను కాలక్రమమున నీరెండు భాగములు కలిసిన సంపూర్ణ నిర్మాణమునకే స్తూప మనుపేరు రూఢి యయినది. బుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, అర్హతులు, చక్రవర్తులు మాత్రమే స్తూపగౌరవమున కర్హు లని బౌద్ధుల మహాపరినిర్వాణ సూత్రమునఁ దెలుపఁబడినను విఖ్యాతు లయిన బౌద్ధాచార్యులకును స్తూపములు వెలసినవి. శారీరకధాతువులను మాత్రమే కాక పరిభోగిక ధాతువులను, అనఁగా బుద్ధుఁడు కాని, అర్హతులు కాని, చక్రవర్తులు కాని, ఆచార్యులు కాని యుపయోగించిన భిక్షాపాత్రములు, చేతికఱ్ఱలు, పానపాత్రములు - ఇట్టివానిని గూడ పదిలపఱిచి స్తూపములు నిర్మించుట వాడుకయయినది. కాలక్రమమున బుద్ధునితో సంబంధముగల పవిత్రక్షేత్రములందు ధాతురహితముగనే, వట్టి స్మారకచిహ్నములుగఁ గూడ స్తూపములు వెలయుచు వచ్చినవి. స్తూపములకు సింహళమున 'దాగబ' (దాగోబా) లనియు, నేపాళదేశమున 'చైత్యము' లనియు, బర్మాదేశమున 'పెగోడా' లనియు వ్యావహారిక నామము చెల్లుచున్నది. బౌద్ధయుగమున స్తూపమున కీరీతిని ప్రాముఖ్యము కలిగెను. బౌద్ధకళయందు బుద్ధుని మహాపరినిర్వాణమునకు స్తూపమును,