పుట:అభినయదర్పణము.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాయుహస్తలక్షణము

గీ.

అర్ధచంద్రంబు దక్షిణహస్తమునను
నెనయ నర్ధపతాకంబు నెలమి వామ
హస్తమునఁ బట్టఁగా వాయుహస్త మగును
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

59

కుబేరహస్తలక్షణము

గీ.

దక్షిణకరంబునన్ ముష్టి దనరుచుండ
వైపుగను బద్మకోశంబు వామహస్త
మునను బట్టిన ధనదుఁడై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

60

[1]ఈశానహస్తలక్షణము

చ.

మొనసిన శంఖహస్తమును ముందఱఁ బట్టుక వామపార్శ్వమున్
ఘనత్రిపతాకహస్తమును గట్టిగ దక్షిణహస్తమందునం
బనివడ వామహస్తమున బాగుగ నామృగశీర్షహస్తము
న్నెనయఁగఁ బట్టి చూపినను నీశ్వరహస్తము రంగనాయకా!

61

దశావతారహస్తలక్షణములు

మత్స్యావతారహస్తలక్షణము

గీ.

ఎలమి మత్స్యకరమువట్టి చెలువు మీఱఁ
బూని త్రిపతాకములు రెండుభుజములందు
జాఱఁబట్టిన మత్స్యావతార మౌను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

62

కూర్మావతారహస్తలక్షణము

గీ.

మెఱయఁగాఁ గూర్మహస్తంబు మేల్మిఁ బట్టి
పొదవి త్రిపతాకములు రెండు భుజములందు
జాఱఁబట్టినఁ గూర్మావతార మౌను
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

63
  1. సం. అభి. దర్పణమందు దిక్పాలురఁ జెప్పుసందర్భమున నిది వదలఁబడినది.