పుట:అభినయదర్పణము.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్రహస్తలక్షణము: వినియోగము

చ.

వరుసగ నర్ధచంద్రములు వైపుగఁ బట్టుక రెండుచేతులం
బరువడి నడ్డదిడ్డముగ బాగుగఁ జేతులు మూసి పట్టుచో
నిరవుగఁ జక్రహస్త మగు నింపుగఁ జక్రము సూపఁ జెల్లునో
మురహర! వాసుదేవ! విను, మోహన! కస్తురిరంగనాయకా!

29

సంపుటహస్తలక్షణము: వినియోగము

క.

ఇరుకరపుసర్పశీర్షము
మురహరి! కరతలము లడ్డముగ మూసినచో
సరవిని సంపుటహస్తము
గరిమను సంపుటమునకును గస్తురిరంగా!

30

పాశహస్తలక్షణము

చ.

పరఁగిన సూచిహస్తములు బాగుగఁ బట్టుక రెండుచేతులన్
వరుసగఁ దర్జనీలు నదె వంచుక వ్రేళ్ళును రెండు సేర్చి తా
గరిమను [1]నూర్ధ్వధోముఖముఁ గా మఱియున్ మెలిగాను బట్టినన్
నిరతము పాశహస్త మగు నిక్కము గస్తురిరంగనాయకా!

31

వినియోగము

గీ.

సరఁగ నన్యోన్యకలహపాశంబులకును
నెలమి ద్వేషంబునకు మఱి గొలుసునకును
ననువుగా బాశహస్త మై యలరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

32

కీలకహస్తలక్షణము

చ.

అల మృగశీర్షహస్తములు నంతట నూర్ధ్వ మధోముఖంబుఁ గా
నెలమిఁ గనిష్ఠికాంగుళిని నించుక వంచియు రెండుఁ గూర్చియున్
మెలిగను బట్టియున్న నది మేదినిలోనను గీలకం బగున్
జలరుహనేత్ర! భక్తజనసన్నుత! కస్తురిరంగనాయకా!

33
  1. ‘ఊర్ధ్వాధోముఖము’లని యుండఁదగును