పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/22

ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

29


మీఱఁగఁ బల్కుచున్ గురువుమేరలఁ బోక చరించువారికిన్
జాఱును గాక భక్తి సహజం బగునే? వరభక్తివర్ధనా!

93


అవిరళలింగపూజయు నిరంతరసద్గురుభక్తియుక్తియున్
సవినయజంగమార్చనయు సత్యము శౌచము సచ్చరిత్రయుం
దవిలి ప్రసాదసేవయును దా నొడఁగూర్పక వట్టిమాటలం
దవునె యుదాత్తభక్తి సుగుణాకర! శ్రీకర! [1]దోషిభీకరా!

94


కింకయుఁ [2]గపటము శౌర్య మ
హంకారము మచ్చరంబు ననృతంబును ని
శ్శంకితవృత్తియుఁ దమలో
శంకరుభక్తులకుఁ జనునె? సత్యవిచారా!

95


క్రోధంబుఁ బగయు నరయ వి
రోధంబును [3]డాంబికంబు రోషమనీషా
గాథలుఁ దమలో మిథ్యా
బోధలు భక్తులకుఁ జనునె? పురుషనిధానా!

96


సడ్డలు బండపదంబులు
వడ్డాచారంబులును వివాదముఁ జలమున్
వెడ్డరిమాటలుఁ దమలో
గొడ్డాచారములు తగ వగునె? సర్వజ్ఞా!

97


సుస్థిరుఁ డై సజ్జనభ
క్తిస్థితి వర్తించునట్టిధీరుఁడు భక్తుం
డస్థిరమతి స్వేచ్ఛాభ
క్తిస్థితి వర్తించునతని దేవుఁడె యెఱుఁగున్.

98
  1. దోష
  2. కవచము
  3. దంభకంబు