పిలిచెద నిను మది తల్లీ తల్లీ

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

రాగం: సారమతి      తాళం: ఆది

పల్లవి:
పిలిచెద నిను మది తల్లీ! తల్లీ!
మురహరు చెల్లీ! పురహరు మల్లీ!
మనసొక చిల్లి మనుగడ లొల్లి
నిజమిది తల్లీ! త్రిదశ మతల్లీ

చదివిన కొద్దీ కలవరమద్దీ
ముదిరెను తల్లీ! నతసురవల్లీ!
పెరిగిన మంటే పురిటి గృహమ్మై
ప్రభవము నందు నువు గద ముందు

మదనుని బూదే కదనము లూదే
హృదయములందే హిమములు చిందే
మనసిజమారుని మనసును దోచే
మహిళవు నీవే మహితవు గావా!

శివపదమందే శిరసును ముందే
సమముగ ఉంచే సుగుణము పంచే
తలపుల తల్లీ! మహిమల మల్లీ!
సచిదానందా! కను కృప చింద!