పాలస్తీనా


శ్రీ నార్ల (1938)

సమర్పితము:

శ్రీ సూరపనేని వెంకటరత్నము

శ్రీ యార్లగడ్డ వెంకటకృష్ణారావు

ప్రియ మిత్రులు

1

స్వాతంత్య్ర ప్రేమకూ, సామ్రాజ్య తత్వానికీ... జాతీయతకూ, జాత్యహంకారానికీ... ధర్మానికీ, అధర్మానికీ- ప్రస్తుతం మూడు దేశాలలో బహిరంగ సంఘర్షణ... భయానక యుద్ధం... జరుగుతున్నది. ఆ మూడు దేశాలు ఇవి: చీనా, స్పెయిన్, పాలస్తీనా.

చీనా మహారాజ్యాన్ని కబళించి, ఆసియా ఖండం మీద ఆధిపత్యాన్ని సంపాయించాలని చూస్తున్నది- జపాను.ఈ దుష్ప్రయత్నాన్ని ప్రతిఘటించడానికి అఖండమైన త్యాగాన్ని చేస్తున్నారు,- చీనావారు.

స్పెయిన్ దేశాన్ని సామంత రాజ్యంగా చేసుకుని, మెడిటరేనియన్ ప్రాంతంలో అప్రతిహతంగా విలసిల్లాలని ఆశిస్తున్నది,- ఇటాలియన్ ఫేసిస్టు ప్రభుత్వం. "విజయమో వీరస్వర్గమో" అనే మహాదీక్షతో స్వీయ స్వాతంత్య్ర రక్షణ కోసం పోరాడుతున్నారు,- స్పెయిన్ ప్రజలు.

సరిగా ఇదేవిధంగా... ఇవే పరిస్థితులలో... పాలస్తీనా అరబ్బులు బ్రిటీష్ ఇంపీరియలిజంతో సంఘర్షిస్తున్నారు.

చీనాలో జపానువారు చూపుతున్న రాక్షసత్వానికిగాని, స్పెయిన్​లో ఫేసిస్టులు ప్రదర్శిస్తున్న అమానుషత్వానికిగాని, పాలస్తీనాలో బ్రిటిష్ ఇంపీరియలిస్టులు అవలంబిస్తున్న విధానం తీసిపోదు. అయితే, చీనా -- స్పెయిన్ దేశాలలో జరుగుతున్న ఘోరకృత్యాల్ని గురించి మనకు వార్తలు వస్తూ ఉంటాయి. పాలస్తీనాను గురించి మాత్రం యథార్థమైన సంగతులు తెలియవు. ఇందుకు ముఖ్య కారణం,- మనకు విదేశ వార్తల్ని పంపించే రాయిటర్ న్యూస్ ఏజెన్సీ. ఈ సంస్థకు బ్రిటిష్ ప్రభుత్వం వారి ధన సహాయం ఉంది. పైగా, దీనికి యూదు జాతివారి పట్ల అభిమానం హెచ్చు. అసలు దీని సంస్థాపకుడే యూదు జాతివాడు. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి కళంకాన్ని తెచ్చే సంఘటనల్నీ- పాలస్తీనా అరబ్బులకు అనుకూలమైన వార్తల్ని- ఈ సంస్థ కప్పి పుచ్చుతున్నది.

"అరబ్బు దుండగీళ్ళు ఈనాడు ఫలానాచోట అల్లరి చేశారు."

"అరబ్బు బందిపోటు దొంగలు నిన్నను ఫలానా బ్యాంకును దోచుకున్నారు."

"అరబ్బు హంతకులు నేటి ఉదయం ఫలానా బస్తీలో యూదుల్ని చిత్రవధ చేశారు".

రాయిటర్ పాలస్తీనానుగురించి పంపించే వార్తల ధోరణి ఇదే! ఈ వార్తల్ని చదువుతూ ఉంటే మానవాధములైనవారు ఎవరో కొందరు దౌర్జన్యాలను చేస్తూ, ప్రజల ప్రాణ మానవిత్తాల్ని హరిస్తూ ఉన్నట్టు తోస్తుంది; ధర్మయుతమైన ప్రభుత్వం మీద పితూరీ చేస్తున్నట్టు కనపడుతుంది. కాని, న్యాయానికి పాలస్తీనాలో జరుగుతున్నది పితూరీ కాదు; స్వాతంత్య్ర సమరం. దానిలో పాల్గొంటున్నవారు దుండగీళ్ళుగాని, బందిపోటు దొంగలుగాని, హంతకులుగాని కాదు; జాతీయాభిమాన పూరితులైన వీరశేఖరులు. ఈ విషయాన్ని బ్రిటిష్ కలోనియల్ మంత్రి మాల్కాం మాక్డోనాల్డ్ కూడా ఇటీవల అంగీకరించక తప్పిందికాదు. కామన్సు సభలో 1938 నవంబర్ 24వ తేదీనాడు పాలస్తీనా సమస్యను గురించి ఉపన్యసిస్తూ ఇతడు "పాలస్తీనా అరబ్ ఉద్యమంలో పాల్గొంటున్నవారిలో చాలా మంది దేశాభిమాన ప్రేరితులైన వారని చెప్పక తప్పదు. వారి దేశాభిమానం వక్రమార్గాల్ని పట్టిన పట్టి ఉండవచ్చునుగాని, అసలు వారి దేశాభిమానాన్ని మాత్రం శంకించడానికి వీలులేదు." అని అన్నాడు. ఇక పాలస్తీనా అరబ్బులు చేస్తున్నది స్వాతంత్య్ర సమరం కాదని ఎవరనగలరు?

అన్నట్టు, కొందరు పాలస్తీనాలో అరబ్బులకూ యూదలకూ జరుగుతున్న సంఘర్షణను బట్టి పాలస్తీనా సమస్య కేవలం "అరబ్బు - యూదు" సమస్య అని భావించడం కద్దు. భారత దేశ సమస్య కేవలం "హిందూ - మహమ్మదీయ" సమస్య అని భ్రమించడం ఎలా ఉంటుందో, ఇది కూడా సరిగా అంతే!

2

పాలస్తీనా చాల చిన్న దేశం. దాని వైశాల్యం సుమారు 900 చదరపు మైళ్ళు మాత్రమే! కాని దానికి ప్రాచీన చరిత్రలోనేమి, ప్రస్తుత కాలంలో నేమి విశేష ప్రాముఖ్యత ఉన్నది. ఇందుకు మొదటి కారణం, - దాని ఉనికి.

పాలస్తీనా మూడు ఖండాలకు—ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలకు—మధ్యస్థంలో ఉన్నది. అంచేత ప్రపంచపు రహదార్లకు అది పెద్ద జంక్షన్ అయింది. పూర్వకాలంలో ప్రపంచం ఎగుమతి దిగుమతులు పాలస్తీనా పడమటి దిక్కులో ఉన్న రహదారిపైగానే నడుస్తూ ఉండేవి. వర్తక వ్యాపారాలకు మాత్రమే కాకుండా, ఆనాటి జైత్ర యాత్రలకు కూడా ఆ మార్గమే ఉపకరించేది, అస్సీరియన్, పర్షియన్, బాబిలోనియన్, యూరపియన్ సైన్యాలు ఈజుప్టుపై దండెత్తి వెళ్లిందీ, ఈజిప్టు వాటిని తరిమి కొట్టిందీ ఆ మార్గం వెంటనే.

పాలస్తీనా తూర్పు దిక్కులో కూడా ఇలాంటి రహదారే ఉండేది. ఇది దక్షినాన గాజా దగ్గర బయల్దేరి, జోర్డాన్ ఎడారికి తూర్పుగా సిరియాలోకి వెళ్ళి, అక్కడి నుంచి మెసపొటోమియా అస్సీరియా, ఆర్మీనియా ఆసియామైనర్ మొదలైన ప్రాంతాలను చేరుకునేది. ఈజిప్టు నుంచి అరేబియాకు వెళ్ళే రోడ్డు కూడా గాజా మీదుగానే పోయేది.

ప్రాచీనకాలంలో పాలస్తీనా ఇన్ని రోడ్లకు జంక్షన్ అయితే, ప్రస్తుతం ఇది అంతకు మించిన వైమానిక మార్గాలకు జంక్షన్. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల మధ్య ప్రయాణం చేసే విమానాలు ఇక్కడనే మజిలీ చేస్తున్నాయి.

ఇక, పాలస్తీనా ప్రాధాన్యానికి రెండో కారణం,- దానిలో ఉన్న పుణ్యక్షేత్రాలు. యూదీయులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు - వీరందరికి కూడా అది పవిత్ర భూమి.

యూదుజాతికీ, దాని మతానికీ, దాని విజ్ఞానానికీ పాలస్తీనా జన్మస్థానం. హిందువులకు వారణాసివలెనే, యూదీయులకు జెరుసులం అతి పవిత్ర క్షేత్రం. వారి మతంలోనూ, వారి చరిత్రలోనూ ప్రసిద్ధికెక్కిన హెరాడ్ దేవాలయం ఈ నగరంలోనే ఉండేది. ఇప్పుడు ఆ దేవాలయం అంతటికీ మిగిలింది ఒక జీర్ణకుడ్యం[1]. దీన్ని "వెయిలింగ్ వాల్" అంటారు. పర్వదినాలలో యూదీయులు ఇక్కడచేరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. "శిథిలమైపోయిన మా రాణ్మందిరం కోసం మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము; వినాశనం చేయబడ్డ మా దేవ మందిరం కోసం మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము; విలిప్తమైన మా ప్రతిభ కోసం, గతించిన మా మహా పురుషుల కోసం, భస్మీపటలమైన మా భాగ్యరాసులకోసం, మేము ఏకాంతంగా కూర్చుని విలపిస్తున్నాము" - ఇదే వారి ప్రార్ధనల సారాంశం. ఈ విధంగా వారు అక్కడ విలపిస్తూ ఉంటారు గనుకనే ఆ జీర్ణకుడ్యానికి "వెయిలింగ్ వాల్" (విలాపకుడ్యం) అనే పేరు వచ్చింది.

"వెయిలింగ్ వాల్" మాత్రమే కాకుండా "జియాన్" పర్వతం కూడా జెరుసులం నగరంలోనే ఉన్నది. ఈ పర్వతం కూడా యూదీయుల దృష్టిలో చాలా పవిత్రమైంది.

ఇక, క్రైస్తవులకు పాలస్తీనాలో ప్రతి అంగుళం కూడా పూజనీయమైనట్టిదే. వారి మత సంస్థాపకుడైన ఏసుక్రీస్తు పుట్టిందీ, పెరిగిందీ, తన సందేశాన్ని చాటిందీ, చివరికి సిలువ మీద ఆత్మార్పణం చేసిందీ పాలస్తీనాలోనే. ఆయన జీవితంతో సంబంధం ఉన్న ప్రతి ప్రదేశమూ క్రైస్తవులకు ఒక మహాపుణ్యక్షేత్రం. వీటిలో జెరుసులం నగరానిది అగ్రస్థానం.

పోతే, మహమ్మదీయుల దృష్టిలో కూడా జెరుసులం పెద్ద పుణ్యక్షేత్రమే! మక్కా, మదీనాల తర్వాత జెరుసులంకు వీరు ప్రాధాన్యతను ఇస్తారు.

ఉనికిని బట్టీ, వివిధ మతాలతో ఉన్న సంబంధాన్ని బట్టీ పాలస్తీనాకు ఏర్పడ్డ ఈ అధిక ప్రాముఖ్యత వల్లనే ప్రాచీనకాలం నుంచీ కూడా అది అనేక సంఘర్షణలకు... అనేక యుద్ధాలకు... కేంద్రమైంది.

ఈజిప్షియనులు, పర్షియనులు, యవనులు, అరబ్బులు, టర్కులు మొదలైనవారు అనేకులు వివిధ సమయాలలో పాలస్తీనా పైకి దండెత్తి వెళ్ళారు; దాన్ని జయించి పరిపాలించారు. ప్రస్తుత సమస్యను తెలుసుకోడానికి ఈ ప్రాచీన చరిత్ర అనవసరం. కాని, రెండు మూడు ముఖ్యమైన తేదీలను మాత్రం గుర్తుంచుకోవలసి ఉంటుంది. అవి ఇవి:

క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జెరుసలుమును ధ్వంసం చెయ్యడం, అక్కడ నుంచి యూదుజాతి వారిని వెళ్ళగొట్టడం జరిగింది.

1516లో టర్కీ పాలస్తీనాను జయించుకుంది. అప్పటి నుంచి 1917 వరకు పాలస్తీనా టర్కీ పరిపాలనలోనే ఉంది.

3

టర్కీ నిరుంకుశ పరిపాలన క్రింద పాలస్తీనాతోపాటు తక్కిన అరేబియా అంతా కూడా అతి హైన్యస్థితిని అనుభవించవలసి వచ్చింది. దాన్ని భరించలేక అరబ్బు జాతి నాయకులు విప్లవ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు 1910 తర్వాతగాని ఒక రూపానికి రాలేదు.

1911 లోనో, 12లోనో మెసపటోమియాకు స్వాతంత్య్రాన్ని సంపాయించాలని బాగ్డాడ్​లోని ఇరాక్ సైనికోద్యోగులు ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. సిరియా స్వాతంత్య్రం కోసం డమాస్కస్​లో ఇంకొక రహస్య సంఘం ఏర్పడింది. మక్కా గ్రాండ్ షెరీఫ్ అయిన హుస్సేన్ -ఇతడు మహమ్మద్ ప్రవక్త వంశీయుడు- అరేబియానంతటినీ తన ఆధిపత్యం క్రింద స్వతంత్ర రాజ్యంగా చెయ్యాలని కలలు కనసాగాడు. నెజ్డ్ ఎడారులలో ఇబిన్ సాద్ తలయెత్తి, వాహబీ స్వాతంత్య్రోద్యమానికి నాయకుడయ్యాడు. మొత్తం మీద అరబ్బు జాతి అంతా కూడా టర్కీ దాస్యశృంఖలాల నుంచి తప్పించుకోవాలని తహతహలాడ సాగింది.

సరిగా ఈ సమయంలో ఐరోపా మహాసంగ్రామం (1914) ప్రారంభమైంది. ఈ మహా సంగ్రామంలో టర్కీ జర్మనీ పక్షాన్ని వహించింది. ఇది అరబ్బులకు చక్కని అవకాశంగా కనబడింది.

బ్రిటన్, ఫ్రాన్సు మొదలైన మిత్రమండలి రాజ్యాల పక్షాన చేరి, వాటి సహాయంతో విప్లవాన్ని ప్రకటించి, టర్కీదాస్యాన్ని వదుల్చుకుంటే, స్వరాజ్యాన్ని సంపాయించుకుంటే, ఈ ఆశ, ఈ కల అరబ్ జాతినంతటినీ ఆయుధ ధారణకు పురికొల్పింది.

అరబ్బుల దాస్య బాధను-వారి స్వరాజ్యాకాంక్షను-స్వప్రయోజనానికి వినియోగంచుకోవాలని మిత్రమండలి రాజ్యాల వారు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నారు. అరబ్బులందరి చేత తిరుగుబాటు చేయిస్తే అది టర్కీ సామ్రాజ్యం వెన్నున పొడిచినట్టవుతుంది. ఇంతటి సదవకాశాన్ని చేయిజారిపోనివ్వడమే!

టర్కీ సూయజ్ కాల్వకు సమీపంలో ఉన్న రాజ్యం. అది ఆ కాల్వ మీద దండెత్తితే, దాన్ని జయిస్తే, బ్రిటన్ - ఫ్రాన్సుల ఆటకట్టినట్టే![2] అంచేత ఎంత త్వరగా టర్కీని దెబ్బకొడితే, అంత మేలు.

ఈ ఆలోచనతో బ్రిటిషువారు ఈజిప్టులో తమ హైకమిషనర్​గా ఉంటున్న సర్ హెన్రీ మాక్-మహొన్​ను అరబ్బు జాతీయ నాయకులతో రహస్య రాయబారాల్ని సాగించవలసిందిగ ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞ ప్రకారం అతడు మక్కాలోని షెరీఫ్ హుస్సేన్​తో ఉత్తర ప్రత్యుత్తరాల్ని నడిపాడు. "ఏడెన్​ను మినహీయించి మిగిలిన అరేబియా అంతాకూడా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డానికి మిత్ర మండలివారు అంగీకరిస్తే మేము మీ పక్షానచేరి విప్లవం కొనసాగిస్తాము" అని సర్ హెన్రీ ఉత్తరానికి హుస్సేన్ ప్రత్యుత్తరాల్ని వ్రాశాడు. దానికి ఒప్పుదలకాకుండా సర్ హెన్రీ బేరానికి దిగాడు. కొన్ని రోజులపాటు ఈ బేరం సాగిన తర్వాత బసరా—బాగ్డాడ్ ప్రాంతం బ్రిటిష్​వారి అధికారం క్రిందనూ, అలెప్పొ బైరూత్ జిల్లాలు ఫ్రెంచివారి అధికారం క్రిందనూ తాత్కాలికంగా ఉండవచ్చునని హుస్సేన్ అంగీకరించాడు. ఆ తర్వాత 1915 అక్టోబర్ 24వ తేదీని బ్రిటిష్ ప్రభుత్వం వారి తరఫున సర్ హెన్రీ "మక్కా షెరీఫ్ సూచించిన సరిహద్దులలోని అరబ్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని అంగీకరించడానికీ, దాన్ని (ఆ స్వాతంత్య్రాన్ని) స్థాపించడంలో తోడ్పడ్డానికీ వాగ్దానం చేస్తున్నాము," అని తెలియబరిచాడు.

అరబ్బుల సహాయం అవసరం కావడం వల్ల, బ్రిటిష్​వారు అరేబియానూ—దానిలో ఒక భాగమైన పాలస్తీనానూ—ఈ విధంగా అరబ్బు జాతివారికి వాగ్దానం చేశారు. కాని, అరబ్బుల సహాయం అవసరమైనట్టే, వారికి యూదీయుల తోడ్పాటు కూడా కావలసివచ్చింది. అంచేత వారు అరబ్బులకు ఇచ్చి వేస్తామన్న పాలస్తీనానే యూదీయులకు కూడా వాగ్దత్తం చేశారు.

4

స్వదేశ భ్రష్టులైన యూదీయులు పశ్చిమాభిముఖులై యూరప్​లోని వివిధ దేశాలకు వలస వెళ్ళి, అక్కడ నివాసమేర్పరచుకున్నారు. కాని ఒక చోటనైనా వారికి శాంతి, భద్రతలు చిక్కలేదు. అన్యజాతీయులు, అన్య దేశస్థులు, అన్య మతం వారు అనేక కారణాల చేత ప్రతి చోటనూ వారిని అనుమానంగా చూడ్డమే!

"ఏసుక్రీస్తును సిలువ వేసినవారు" అని యూదీయులకు ఒకకళంకం ఉంది. దీన్ని సాకుచేసుకుని, ప్రతి దేశంలోనూ క్రైస్తవ మతగురువులు వారి మీద ప్రజా విద్వేషాన్ని రగుల్కొల్పేవారు. ఇంతే కాదు. యూదీయుల ప్రజ్ఞావిశేషాలే వారికి ఒక లోపంగా పరిణమించాయని కూడా చెప్పవచ్చు. తమ అపార మేధా శక్తి వల్ల వారు ఏ భాషనైనా సులభంగా అభ్యసించగలరు; ఏ వృత్తిలోనైనా తేలికగా చాకచక్యాన్ని సంపాయించగలరు. అంచేత ఎంతటి హైన్యస్థితిలో—ఎంతటి పరదేశానికి వెళ్ళినా—వారు ఇట్టే పైకి రాగలరు. ఇది స్థానిక ప్రజల అసూయను రేకెత్తించడం సహజం.

ఈ అన్ని కారణాల వల్ల ప్రతిదేశంలోనూ యూదీయుల్ని హింసించడం, ప్రతి చోట నుంచీ వారిని తరిమి కొట్టడం సంభవించింది; సంభవిస్తున్నది.

ఇంగ్లండు నుంచి వారిని 1290 లోనూ, ఫ్రాన్సు నుంచి 1394లోనూ, స్పెయిన్ నుంచి 1492లోనూ, పోర్చుగల్ నుంచి 1497లోనూ, నేపుల్సు నుంచి 1540లోనూ, వియన్నా నుంచి 1670లోనూ, బొహిమియా నుంచి 1745 లోనూ తరిమివేశారు. యూరప్ పశ్చిమ భాగంలోని ఒక్కొక్క దేశంలో నుంచి ఇలా తరిమి వెయ్యగా, యూదీయులు యూరప్ తూర్పు దిక్కుకు (రష్యా, పోలెండు మొదలైన తూర్పు దేశాలకు) చేరుకున్నారు. కాని, కొంత కాలమైన తర్వాత ఇక్కడి నుంచి గూడా వారికి ఉద్వాసం చెప్పారు.

తమకు ఒక దేశం—ఒక జాతీయ కేంద్రం—లేకపోవడం వల్లనే అందరి తావుల్ని పడుతూ, ఎక్కడనూ నిలువ నీడలేక అల్లాడవలసిన గతి పట్టిందిగదా అని యూదు జాతివారికి సంతాపం కలిగింది. అయితే, ఎంత సంతాపంలో ఉన్నప్పటికీ ఏదో అస్పష్టమైన ఆశా రేఖ వారికి కొంత కొత్త బలాన్నీ ఉత్సాహాన్నీ ఇస్తూ ఉండేది. ఆ అస్పష్టమైన ఆశారేఖ,- పాలస్తీనా!

పాలస్తీనా తమ మాతృదేశం; తమ పుణ్యభూమి; తమ జాతీయకేంద్రం; తమ విజ్ఞాన వాటిక. ఏనాటికో ఒకనాటికి ఏదో ఒక విధంగా అది తిరిగి తమది కాకపోతుందా! తిరిగి అక్కడ తాము సుఖంగా, స్వేచ్ఛగా శాంతంగా జీవించగల భాగ్యం పట్టకపోతుందా? క్రైస్తవుల ఘోరహింసకు బలి అయిన ప్రతియూదీయుని హృదయాంతరాళంలోనూ అస్పష్టంగా ఉన్న ఈ ఆశా రేఖకు ఒక స్వరూపాన్ని కల్పించి, దాన్ని ఒక మహోద్యమంగా చేసినవాడు డాక్టర్ థియొడోర్ హెర్జల్.

డాక్టర్ హెర్జల్ ఆస్ట్రియా దేశస్థుడు. అతడి నివాసం వియన్నా. వృత్తి జర్నలిజం; నాటకాలు వ్రాయడం. అతడు చాల అందమైనవాడు; అందాన్ని మించిన ప్రతిభ గలవాడు.

"డ్రేఫస్ కేసు"ను తన పత్రికకు రిపుర్టు చెయ్యడానికి 1894లో డాక్టర్ హెర్జల్ ప్యారిస్ నగరానికి వెళ్ళాడు. ఈ కేసు చరిత్ర ప్రసిద్ధికెక్కినట్టిది. దీనిలో ముద్దాయి ఒక యూదు సైన్యాధ్యక్షుడు (జనరల్). పేరు,- డ్రేఫస్. ఫ్రెంచి సైనిక రహస్యాన్ని ఏదో విదేశ ప్రభుత్వానికి అందజేశాడని అతడి మీద కేసు వచ్చింది.

డ్రేఫస్ నిర్దోషి అని అందరికీ తెలుసు. అయితే మాత్రమేమి? అతడు యూదుజాతివాడు. ఆ జాతికి చెందడమే ఒక నేరం. ఇక ఆ జాతికి చెంది ఉండికూడా ఉన్నత సైనికోద్యోగి కావడం క్షమింపరాని పెద్ద నేరం. అంచేత అతడిని శిక్షించ వలసిందే! అతడు అనేక యుద్ధాలలో పాల్గొన్నమాట నిజం. ఎన్నో సైనిక గౌరవాల్ని పొందిన మాట నిజం. కాని, యూదు జాతివాడైనందున అతడి విషయంలో ఈ సంకోచాలు అనవసరం. తప్పక అతడిని శిక్షించవలసిందే! కఠినంగా శిక్షించ వలసిందే! డ్రేఫస్​కు కఠిన శిక్షే పడింది. ముందు దేశద్రోహాన్ని చేసినందుకు అన్ని సైన్యాల ముందు ఆ గౌరవం పొందడం. ఆ తర్వాత అజన్మ ద్వీపాంతర వాసం.

ఈ కేసులో స్వజాతీయుడైన డ్రేఫస్​కు జరిగిన ఘోరాన్యాయాన్ని కళ్లార చూచినప్పుడు "అన్య దేశాలలో ఉండి, ఆ దేశాలకు యూదీయులు ఎంత ప్రేమ పూర్వకంగా సేవ చేసినప్పటికీ, వారు ఆ దేశస్థులలో ఐక్యమైపోలేరు. వారు ఐక్యమైపోవాలని అనుకున్నా ఆ దేశాలవారు అలా జరగనివ్వరు." అని హెర్జల్ నిశ్చయించుకున్నాడు. అయితే, మరి యూదీయుల గతి ఏమిటి? ఆ క్షణంలో అతడి మనోవీధిని ఒక మెరుపు మెరిసింది- పాలస్తీనా! యూదులు తిరిగి పాలస్తీనా చేరుకోవలసిందే! పాలస్తీనా చాలా చిన్న దేశం. అక్కడ ప్రపంచంలోని అందరు యూదులు స్థిరపడ్డానికి తగినంత ప్రదేశంలేదు. అంచేత అందరూ అక్కడికి చేరుకోవడం అనేది అసంభవం. కాకపోతే సంభవం కాగల కార్యం ఏదంటే,- పాలస్తీనా యూదీయులకు తిరిగి జాతీయ కేంద్రం కావడం. "జాతీయ కేంద్రం" అనే ఈ ఆశయాన్ని సాధించడానికే హెర్జల్ 1897లో "జియోనిజం" అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు.

హెర్జల్ ప్రారంభించిన ఈ ఉద్యమం అతడి ప్రతిభా విశేషం వల్లనేమి, రాజకీయ చతురత వల్లనేమి[3] సత్వరాభి వృద్ధిని చెంది, ఐరోపా మహాసంగ్రామం నాటికి ప్రపంచ వ్యాప్తిని గాంచింది.

5

యుద్ధం వ్యయంతో కూడిన వ్యాపారం. ఈ వ్యయమైనా ఒక కోటీ, రెండుకోట్లూ కాదు; శతకోట్లు, సహస్రకోట్లు. ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం అదనపు శిస్తుల వల్ల సంపాయించడం పడదు. అంచేత, ఋణాన్ని చేసితీరాలి. ప్రభుత్వాలకు పెద్ద పెద్ద ఋణాల్ని ఇవ్వగలవారు బ్యాంకర్లు. లండన్, ప్యారిస్, న్యూయార్క్: ఈ నగరాలలోని పెద్ద బ్యాంకర్లు చాలా వరకు యూదుజాతివారు. అంచేత ఈ నగరాలలో తనకు తగిన పరపతి పుట్టాలంటే, తాను "జియోనిజం" పట్ల అభిమానాన్ని చూపించాలని బ్రిటన్ అనుకుంది. ఈ ఆలోచనతో యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాను యూదీయులకు జాతీయ కేంద్రంగా చేస్తానని అది వాగ్దానం చేసింది.

బ్రిటన్ యూదులకు ఈ విధంగా వాగ్దానం చెయ్యడానికి ఇంకో కారణం కూడా ఉంది. బాంబుల్ని చెయ్యడానికి "ఆల్కొహాల్" చాలా అవుసరం. యుద్ధ సమయంలో మామూలుగా ఉండే చిక్కుల వల్లనేమి, జర్మన్ సబ్ మెరీనులు ఓడల్ని ముంచి వేస్తూ ఉండడం వల్లనేమి, బ్రిటన్​కు "ఆల్కొహాల్" తగినంతగా దొరకడం అసాధ్యమైపోయింది. ఈ కష్టసమయంలో డాక్టర్ చెయిమ్ వైజ్​మన్ కేవలం దేవుడిలా అడ్డుపడ్డాడు.

డాక్టర్ వైజ్​మన్ మాంఛెస్టర్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ప్రొఫెసర్. అతడి పుట్టుక రష్యన్ పోలెండ్​లో.[4] చదువుకున్నది జర్మనీలో 1904 ప్రాంతాలలో ఇంగ్లండ్ వచ్చి, అక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు. బ్రిటన్​లోని "జియోనిస్టు" నాయకులలో అతడే అగ్రగణ్యుడు. "ఆల్కొహాల్" తగినంతగా లభించక బ్రిటన్ విషమస్థితిలో పడ్డప్పుడు డాక్టిర్ వైజ్​మన్ కొయ్యలో నుంచి దాన్ని (ఆల్కొహాల్) తియ్యడానికి ఒక చక్కటి పద్ధతి కనిపెట్టాడు.

ఆపత్సమయంలో ఇంత మహాపకారాన్ని చేసినందుకు చాలా సంతోషించి, అప్పటిలో బ్రిటిష్ ప్రభుత్వంలో "మ్యూనిషన్సు" (ముందుగుండు) మంత్రిగా ఉన్న లాయడ్ జార్జి "మిమ్మల్ని సముచితరీతిగా గౌరవించాలని అనుకుంటున్నాము. మీరు ఏమి పారితోషికాన్ని కోరుకుంటారు కోరుకోవలసింది" అని డాక్టర్ వైజ్​మన్​ను అడిగాడు. ఇందుకు అతడిచ్చిన జవాబు ఇది.

"నాకు కావలసిన పారితోషికం మా యూదుజాతివారికి ఉపకారం చెయ్యడానికి అవకాశం మాత్రమే."

ఈ పరిస్థితిలో డాక్టర్ వైజ్​మన్​ను సంతోషపెట్టడానికి కూడా పాలస్తీనాను యూదీయుల జాతీయ కేంద్రంగా చేస్తామని మాటనివ్వవలసి వచ్చింది.

6

ఇప్పటికి పాలస్తీనా విషయమై బ్రిటన్ రెండు వాగ్దానాల్ని చేసింది. ఒకటి: ఆ దేశాన్ని అరబ్బుల స్వతంత్ర రాజ్యంగా చేస్తాననడం. రెండు: దాన్నే యూదీయుల జాతీయ కేంద్రంగా చేస్తాననడం.

ఈ రెండు వాగ్దానాలు పరస్పర విరుద్ధమైనట్టివి. పాలస్తీనా, అరబ్బుల స్వతంత్ర రాజ్యమైతే, యూదీయుల జాతీయ కేంద్రం కాలేదు. ఇక, అది యూదీయులకు జాతీయ కేంద్రమే అయితే, అరబ్బులకు అక్కడ స్వాతంత్య్రం ఉండదు. ఒక దాన్ని నిలబెట్టుకోవాలంటే, రెండోదాన్ని తప్పక తోసివెయ్యవలసిన స్థితిలో ఈ రెండు వాగ్దానాల్ని చెయ్యడమే తగని పని. కాని, బ్రిటన్ ఇంతకంటే కూడా ఘోరమైన పనిని ఇంకొకదాన్ని చేసింది. అదేమంటే- అటు అరబ్బులకూ, ఇటు యూదులకూ కాకుండా పాలస్తీనాను తానే స్వాహా చెయ్యాలను కోవడం!

టర్కీ నుంచి తాము జయించుకోబోతున్న అరేబియా రాజ్యాల్ని, వీళ్ళకూ వాళ్ళకూ కట్టబెట్టడం దేనికనుకుని కాబోలు, బ్రిటన్, ఫ్రాన్సులు తమలోతాము ఒక రహస్యపు ఒడంబడికను చేసుకున్నవి. దీన్ని "సైక్స్-పికాట్ ఒడంబడిక" అని అంటారు. ఇది జరిగింది 1916 మే నెలలో.

ఈ "సైక్స్-పికాట్ ఒడంబడిక"లోని ముఖ్యమైన షరతులు ఇవి: మెసపటోమియా రాజ్యమూ, పాలస్తీనాలోని రెండు వోడ రేవులూ (హైఫా, ఎక్రి) బ్రిటన్ అధీనంకావాలి. సిరియాకోస్తా ఫ్రాన్సు పరిపాలన కింద ఉండాలి. డమాస్కస్, అలెప్పో, మోసుల్ ప్రాంతాలు ఫ్రాన్సు (పరిపాలన కింద కాదుగాని) పలుకుబడిలో ఉండాలి. ఇక, పాలస్తీనా (పెద్ద ఓడరేవులు రెండూపోగా మిగిలిన భాగం) బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా రాజ్యాల నిర్ణయాన్ని అనుసరించి ఏర్పడే ప్రభుత్వానికి లోబడి ఉండాలి.

తెర వెనక జరిగిన ఈ కపట నాటకం (సైక్స్-పికాట్ ఒడంబడిక) సంగతి యూదీయులకు తెలిసిందో, లేదోగాని, అరబ్బులకు మాత్రం తెలియనే లేదు. బ్రిటను తన వాగ్దానాన్ని చెల్లించుకుంటుందనీ, తమకు స్వాతంత్య్రం లభిస్తుందనీ ఆశపడుతూ, వారు విప్లవాన్ని సాగించారు. టర్కీ వారు స్వమతస్థులు. మహమ్మదీయులకు స్వమతస్థులంటే ఎంత పక్షపాతమో అందరికీ తెలిసిన విషయమే! అయితే, ఇక్కడ స్వమతస్థల పక్షం వహించడమంటే, తమ దాస్య శృంఖలాల్ని తామే మరింత బిగించుకోవడమన్న మాట! ఇక, అన్యమతస్థులైన బ్రిటీష్ వారితో చేరితే, స్వాతంత్య్రం లభిస్తుంది. స్వమతస్థుల పట్ల పక్షపాతమా! లేక, స్వాతంత్య్రం పట్ల పక్షపాతమా? ఆరబ్బుల స్వాతంత్య్ర కాంక్షే నెగ్గింది; వారు టర్కీ మీద తిరగబడ్డారు.

ఆరబ్బుల తిరుగుబాటును అణచివెయ్యడానికి టర్కీ మదీనాకు సేనల్ని పంపించింది. ఈ సేనలు మక్కాలోని పుణ్యస్థలాల మీద ఫిరంగుల్ని కాల్చాయి. టర్కీ చేసిన ఈ తెలివి తక్కువ పనివల్ల, ఆరబ్ జాతివారిలో పరిపూర్ణమైన సంఘీభావం ఏర్పడింది. హుస్సేన్ మూడో కుమారుడైన ఫైజల్ నాయకత్వం క్రింద—ఇంగ్లీషు యువకుడైన టి.ఇ. లారెన్సు తోడ్పాటుతో—వారు హెడ్ జాజ్ గుండా దండెత్తివెళ్ళి, సినాయ్​గల్ఫ్ వరకు ఆక్రమించు కున్నారు.

ఈ లోపుగా బ్రిటీష్ సేనాని ఆలెంబీ ప్రభువు ఈజిప్టు నుంచి పాలస్తీనా పైకి దండయాత్ర ప్రారంభించాడు. ముందు పాలస్తీనాను ఆక్రమించుకొని, ఆ తర్వాత సిరియా గుండా టర్కీ పైకి దండెత్తాలని అతడి ఉద్దేశం. ఆలెంబీ పాలస్తీనాను జయించుకుపోతూ ఉంటే, మదీనాలో వున్న టర్కీ సైన్యాలు అతడిని ఎదుర్కొనకుండా ఆరబ్బులు (ఫైజల్ అనుచరులు) కాపాడారు. మదీనా నుంచి టర్కీ దళాలు రైలులో (పిలిగ్రిమ్స్ రైల్వే) వస్తూవుంటే, ఆరబ్బులు ఆ రైలు పట్టాల్ని మందుగుండుతో పేల్చివేస్తూ ఉండేవారు. తన కుడివైపు నుంచి టర్కీవారు ఎదుర్కుంటారనే భయం ఈ విధంగా తొలిగిపోగా, ఆలెంబీ అతి సులభంగా పాలస్తీనాలోని వివిధ ప్రాంతాల్ని జయించుకుంటూ, జెరుసులం సమీపించాడు.

ఈ సమయానికి "సైక్స్-పికాట్ ఒడంబదడిక" జరిగినట్టు ఆరబ్బులకు చూచాయగా తెలిసింది. అయితే, వారు దాన్ని నమ్మలేదు. "సర్ హెన్రీ మాక్–మోహన్ ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని వాగ్దానం చేసిన బ్రిటన్ ఇంత ద్రోహాన్ని చెయ్యడం అసంభవం" అని వారు అనుకున్నారు. "ఆలెంబీ విజయానికి మనం చేసిన అపారసేవను చూచిన తర్వాత కూడా బ్రిటన్ కృతజ్ఞత చూపుతుందా?" అని వారు మనస్సును సమాధానపరుచుకున్నారు. బ్రిటన్ వాగ్దానం మీద, దాని ధర్మబుద్ధి మీద ఇంత విశ్వాసాన్ని పెట్టుకున్న ఆరబ్బుల మీద సోవియట్ ప్రభుత్వం చేసిన ప్రకటన పిడుగులా పడింది.

రష్యాలో 1917 నవంబర్​లో బోల్షివిక్ విప్లవం జరిగి సోవియట్ ప్రభుత్వం ఏర్పడగానే, ఆ ప్రభుత్వం వారు "రష్యా ఇక ఐరోపా మాసంగ్రామంలో పాల్గొనదు," అని ప్రకటించారు. ఇంటితో ఆగక, మిత్రమండలి రాజ్యాల కపటాన్ని బయట పెట్టడానికి వారు యుద్ధ సమయంలోనూ, అంతకు పూర్వమూ పరస్పరంగా చేసుకున్న రహస్యపు ఒడంబడికల్ని కూడా లోకానికి వెల్లడి చేశారు. వీటిలో ఒకటి,- "సైక్స్-పికాట్ ఒడంబడిక". అప్పుడు ఆరబ్బులకు బ్రిటన్ వాగ్దానాల మీదనూ, ధర్మబుద్ధి మీదనూ పోయిన విశ్వాసం తిరిగి ఎన్నడూ ఏర్పడలేదు; ఇక ఏర్పడదు కూడా!

7

బ్రిటన్ చేసిన వాగ్దానాల్ని చెల్లించకపోవడం ఒక పాలస్తీనాలోనే కాదు, ఇండియాలో, ఈజిప్టులో, ఇంకా ఎన్నో ఇతరచోట్ల అది ఈలాగే చేసింది. అయితే, పాలస్తీనాలో చేసినంత ఘోరంగా అది ఈ పనిని ఇతర చోట్ల చెయ్యలేదేమో!

పాలస్తీనాను ఆరబ్బు స్వతంత్ర రాజ్యంగా చేస్తానని ముందు మాట ఇచ్చి, ఆ తర్వాత దాన్ని తానే వశపరచుకోవడానికి బ్రిటన్ ఒక సాకు చెబుతుంది. అది ఏమంటే,- సర్ హెన్రీ మాక్-మాహోన్​కు హుస్సేన్ సూచించిన ఆరబ్బు స్వతంత్ర రాజ్యం సరిహద్దులలో పాలస్తీనా లేదట. ఇది కేవలం అబద్ధమనే చెప్పాలి. అరేబియా అంతటిలో సారవంతమైన ప్రదేశాలలో ఒకటైన పాలస్తీనాను—తూర్పు మెడిటరేనియన్​కు ఆయువుపట్టులలో ఒకటని చెప్పదగిన హైఫా ఓడరేవు ఉన్న పాలస్తీనాను—మూడు ఖండాల రహదార్లకు జంక్షన్​గా ఉండి, అరేబియా అంతటికీ ప్రాముఖ్యతను తెచ్చే పాలస్తీనాను—హుస్సేన్ తాను సూచించిన సరిహద్దులలో చేర్చలేదనడం నమ్మదగిన విషయం కాదు.

ఒకవేళ ఈ వాదాన్ని కొట్టివేసినా, ఇంతకంటే బలీయమైన ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఆరబ్బుల్ని విప్లవం చెయ్యవలసిందిగా ప్రబోధిస్తూ బ్రిటీష్ విమానాలు లక్షలాది కరపత్రాల్ని వెదజల్లాయి. ఈ కరపత్రాలలో అరేబియాను స్వతంత్ర రాజ్యానికి వారు స్వయంగా పేర్కొన్న సరిహద్దులలో పాలస్తీనా ఇమిడిఉంది.

అంచేత, పాలస్తీనా విషయంలో బ్రిటన్ ఆరబ్బుల పట్ల నమ్మకద్రోహం చేసినదనడంలో ఏమీ సందేహం అవసరం లేదు. ఈ విషయాన్ని ఒక బ్రిటీష్ ప్రముఖుడే కింది విధంగా అంగీకరించాడు:

"ఈ ప్రాంతంలో మన మార్గం ఉల్లంఘించిన వాగ్దానంతో నిండివుంది... 1915లో మనం పాలస్తీనాను హెడజాజ్ రాజైన హుస్సేన్​కు ఇస్తామన్నాము; 1916లో సైక్స్-పికాట్ ఒడంబడిక కింద దాన్నిమనమే అట్టెపెట్టుకోవాలనుకున్నాము; 1917లో బాల్ఫర్ ప్రకటన ద్వారా యూదులకు వాగ్దానం చేశాము; 1918లో తిరిగి హుస్సేన్ రాజుకు ఆశపెట్టాము; యుద్ధ విరామం జరిగిన రోజులలో స్థానిక ప్రజలకు పట్టం కడతామన్నాము; సంధి సభ (ప్రెస్ కాన్ఫరెన్స్) జరిగిన తర్వాత యూదీయుల వైపు మొగ్గాము".

పాలస్తీనా విషయంలో బ్రిటన్ ఇంత దగాకోరుగా నడచుకోడానికి—ఇంతకు ముందు సందర్భానుసారంగా అక్కడక్కడ సూచించినట్టు—అనేక బలీయమైన కారణాలున్నాయి. అవి ఏమంటే, సూయజ్​కాల్వ రక్షణకు ఈజిప్టుపై పెత్తనం ఎంత అవసరమో, పాలస్తీనాపై ఆధిపత్యం కూడా అంత అవసరం.

తూర్పు మెడిటరేనియన్​లో బ్రిటీష్ నౌకాశక్తి అకుంఠితంగా ఉండాలంటే, హైఫాను గుప్పిటిలో పెట్టుకోవాలి.

బ్రిటన్​కు కావలసిన పెట్రోల్ విశేషంగా ఇరాక్​లోని మోసుల్ నుంచి వస్తుంది. మోసుల్ గనులలో నుంచి తీసిన పెట్రోల్​ను ఎగుమతి కోసం మెడిటరేనియన్ సముద్ర తీరానికి చేర్చడానికి సిరియా ఎడారుల గుండా హైఫా వరకు గొట్టాల్ని (పైప్ లైన్) వేశారు. పాలస్తీనా మీద ఆధిపత్యం లేకపోతే ఇరాక్ పెట్రోల్ సప్లయి విషయంలో చిక్కులు ఏర్పడుతాయి.

బ్రిటన్ నుంచి ఆసియాకూ, ఆఫ్రికాకూ వెళ్ళే విమానాలకు కావలసిన వైమానికాశ్రయాల్ని కట్టుకోడానికి పాలస్తీనా చక్కగా ఉపకరిస్తుంది.

ఈ విధంగా బ్రిటీష్ సామ్రాజ్య రక్షణకు పాలస్తీనా ఎంతైనా అవసరం. ఈ విషయాన్ని స్పష్టంగా అంగీకరిస్తూ ఇటీవలనే (1936 జూన్) యామెరీ అనే ఆయన కామన్సు సభలో ఇలా ఉపన్యసించాడు:

"అది (పాలస్తీనా) ఈ దేశానికీ, ఆఫ్రికాకూ, ఆసియాకూ మధ్య ఉన్న వైమానిక మార్గాలకు క్లాప్​హామ్ జంక్షన్. మెడిటరేనియన్​లో ఏర్పడ్డ కొత్త పరిస్థితుల్ని బట్టి (ఇది ఇటలీ విజృంభణను మనస్సులో పెట్టుకుని అన్నమాట) సూయజ్ కాల్వ రక్షణ విషయంలో దాని ప్రాముఖ్యత అపారం. మాండేట్ షరతుల ప్రకారం పాలస్తీనాలో మనం యుద్ధ నౌకాశ్రయాల్ని నిర్మించుకోడానికి వీలులేని మాట నిజం. కాని, మెడిటరేనియన్​లోని పెద్ద ఓడరేవులలో ఒకదానిగా గాని, పారిశ్రామిక కేంద్రాలలో ఒకదానిగా గాని హైఫాను వృద్ధి పరిస్తే, యుద్ధ సమయాలలో ఇతరచోట్ల నుంచి మనం తెప్పించుకోలేని వస్తువుల్ని సప్లయ్ చెయ్యడానికి అది ఎంతైనా ఉపకరిస్తుంది."

8

పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రంగా చేస్తానని బ్రిటన్ రహస్యంగా వాగ్దానం చేసిందేగాని, బహిరంగ ప్రకటన చెయ్యలేదు. రహస్యంగా చేసిన వాగ్దానాన్ని కాదంటే, మళ్ళీ నోరెత్తడానికైనా వీలుండదు. అంచేత, బహిరంగ ప్రకటన చెయ్యవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వాన్ని డాక్టర్ వైజ్​మన్ మొదలైన యూదు నాయకులు ఒత్తిడి పెట్టారు. సరిగా ఈ సమయంలో అమెరికాలోని యూదీయుల సదభిప్రాయాన్ని సంపాయించుకోవడం బ్రిటన్​కు అవసరంగా కూడా కనబడింది. అంచేత 1917 నవబర్​లో బ్రిటీష్ ప్రభుత్వం తరఫున బాల్ఫర్ (విదేశాంగ మంత్రి) ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ముఖ్య భాగం ఇది: "పాలస్తీనాలో యూదీయలకు ఒక జాతీయ కేంద్రాన్ని ఏర్పరచడానికి బ్రిటీష్ ప్రభుత్వం వారు అనుకూలంగా ఉన్నారు. ఈ ఆశయసిద్ధికి వారు శక్తివంచన లేకుండా పాటుపడతారు. ఈ సందర్భంలో పాలస్తీనాలో ప్రస్తుతం వున్న యూదేతర సంఘాల హక్కులకు గాని ఇతర దేశాలలో వున్న యూదుల హక్కులకుగాని భంగం కలిగించే కార్యాన్ని దేన్నీ చెయ్యరు."

సైక్స్-పికాట్ ఒడంబడిక సంగతి తెలుసుకునే నిస్పృహ చెందివున్న ఆరబ్బులకు ఈ బాల్ఫర్ ప్రకటన మరెంత ఆశాభంగాన్నీ, అసహ్యభావాన్నీ కలిగించిందో వేరుగా చెప్పనక్కరలేదు.

1917 అంతం నాటికి పూర్తిగా హతాశులై ఉన్న ఆరబ్బులకు 1918లో యుద్ధ విరామం జరిగిన నాటికి తిరిగి ఆశలు పెట్టుకోడానికి కొంత అవకాశం కలిగింది. యుద్ధంలో పాల్గొన్న వివిధ రాజ్యాల మధ్య జరగవలసిన సంధికి ప్రాతిపదికగా అమెరికా అధ్యక్షుడు విల్సన్ పధ్నాలుగు సూత్రాల్ని ప్రతిపాదించాడు. వీటిలో మూడో సూత్రం ఇది:

"ఈ యుద్ధంతో సంబంధం ఉన్న ప్రతి దేశం భవిష్యత్తును, అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలిగాని, విభిన్నరాజ్యాలు స్వలాభం కోసం చేసుకునే పెంపకంలో ఇది కేవల మొక భాగం అనే పద్ధతిని చేయ్యరాదు".

ఈ సూత్రం ప్రత్యేకంగా సైక్స్-పికాట్ ఒడంబడికను రద్దుపరచడానికే ప్రతిపాదించినట్టు ఆరబ్బలకు తోచింది. ఇక, పన్నెండో సూత్రం వారికి మరింత ఆశను పోసింది. ఆ సూత్రం ఇది:

"ఇప్పుడు టర్కీ పరిపాలన కిందవున్న వివిధ జాతుల వారికి పరిపూర్ణమైన రక్షణ నిస్తూ, ఇతరుల జోక్యమేమీ లేకుండా స్వపరిపాలనను సాగించుకోడానికి అవకాశమివ్వాలి".

"బ్రిటన్ ద్రోహం చేసినా, విల్సన్ మన పక్షాన ఉన్నాడు; మన ఆశలు ఇక ఈడేరినట్టే! మనకు స్వాతంత్య్రం లభించినట్టే!" అని ఆరబ్బులు మహదానందం చెందారుగాని, అచిరకాలంలోనే తిరిగి వారు హతాశులు కావలసి వచ్చింది.

9

ముందు జర్మన్; ఆస్ట్రియన్ సామ్రాజ్యాన్ని తమలో తాము పంచుకున్న తర్వాత బ్రిటీష్, ఫ్రెంచి ప్రభుత్వాల వారు టర్కీ సామ్రాజ్యం వైపుకు దృష్టిని మరల్చారు. "టర్కీ పరిపాలన క్రింద వున్న అరేబియా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డానికి అంగీకరిస్తాను" అని 1915లో (సర్ హెన్రీ మాక్-మాహోన్ ద్వారా) బ్రిటన్ వాగ్దానం చేసినమాట నిజం. ఈ వాగ్దానాన్ని బ్రిటన్, ఫ్రాన్సులు రెండూ చేరి 1918 నవంబర్ 30వ తేదీనాడు "రిపీట్" చేసిన మాటకూడా నిజం. అయితే మాత్రమేమి? ఆపత్కాలంలో లక్ష వాగ్దానాలు చేస్తాము. వాటికి కట్టుపడి ఉండడం సామాన్య వ్యక్తులకు తగుతుందేమోగాని, సామ్రాజ్య నిర్మాతలకు తగునా? పైగా, ఆర్థికంగా నేమి, సైనికదృష్టిలో నేమి, చాలా ప్రయోజనకరంగా ఉండే అరేబియాను గుప్పిటిలో నుంచి వదలి వెయ్యడమే? పాలస్తీనా, సిరియా, ఇరాక్; ఈ మూడూ కూడా ఆసియా ఖండం భాగ్యరాసుల్ని చేరడానికి మార్గాలుగా ఉపకరిస్తవి. మోసుల్​లోనూ, పర్షియన్ గల్ఫ్​లోనూ, పెట్రోలు గనులున్నాయి. అబ్బే! అరేబియాను—దాదాపు ఇండియా అంతటి వైశాల్యం కలిగివున్న అరేబియాను—చేయిజారిపోనివ్వరాదు.

అయితే, దీన్ని పంచుకోవడం విషయంలో బ్రిటన్, ఫ్రాన్సులకు కొంత వివాదం వచ్చింది. కొంతకాలం కీచులాడుకున్న తర్వాత 1920 ప్రారంభం నాటికి అవి ఒక రాజీకి వచ్చాయి. ఈ రాజీ ప్రకారం ఇరాక్ బ్రిటన్​కు దక్కింది. పోతే, సిరియాను—టారస్ పర్వతాలకూ, సినాయి ఎడారికీ మధ్యవున్న ప్రదేశాన్ని—బ్రిటన్, ఫ్రాన్సులు చెరికొంత తీసుకున్నాయి. దీనిలో దక్షిణ భాగాన్ని—అంటే పాలస్తీనాను—బ్రిటన్ తీసుకుంది; ఉత్తర భాగాన్ని—ఈ భాగానికి సిరియా అనే పేరు ఖాయం చేశారు—ఫ్రాన్సు తీసుకుంది. అంటే, లెబ్​నాన్ సముద్ర తీరమూ, డమాస్కస్​ రాష్ట్రమూ ఫ్రాన్సుకు దక్కింది. పాలస్తీనాకు తూర్పుగావున్న ఒక యెడారికొన కూడా—దీనికి ట్రాన్స్​జోర్డాన్ అని పేరుపెట్టారు—బ్రిటన్ వంతుకు వచ్చింది.

ఈ విధంగా అరేబియాలో మంచి మంచి భాగాల్ని తాము తీసుకున్న తర్వాత, మిగతా ఎడారిని బ్రిటన్, ఫ్రాన్సులు హుస్సేనుకు కట్టబెట్టాయి. హెడ్​జాజ్​కు—మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలు. దీనిలోనే ఉన్నాయి—అవి హుస్సేన్​ను రాజుగా ప్రకటించాయి. ఇక, హుస్సేన్ కుమారుల్ని సంతృప్తి పెట్టడానికి అవి చక్కటి ఒక ఎత్తు వేశాయి. అది ఏమంటే, హుస్సేన్ జ్యేష్ఠపుత్రుడు (ఆలీ) తండ్రి తదనంతరం హెడ్ జాజ్​కు రాజు కావచ్చుననడం; అతడి రెండవ కుమారుని (అబ్దుల్లా) బ్రిటీష్ వారి అధీనంలో ఉండే ఇరాక్​కు రాజును చేస్తామనడం; అతడి మూడవ కుమారుని (ఫైజల్) ఫ్రెంచి వారి పరిపాలనలో ఉండే డమాస్కస్​కు—సిరియా తూర్పు భాగానికి—రాజుగా ఉంచుతామనడం. అసలైన రాజ్యాధికారం మన చేతిలో ఉన్నప్పుడు ఇంకొకడిని రాజు అని చెప్పి దిష్టిబొమ్మగా నిలబెట్టడంలో చాలా లాభం ఉంది. అప్పుడు జరిగిన మేలు అంతా మనదీ, కీడు అంతా ఆ దిష్టిబొమ్మదీ అని చాటుతూ ఉండవచ్చును. హుస్సేన్ కుమారుల్ని రాజులుగా[5] చేస్తామనడంలో బ్రిటన్, ఫ్రాన్సులు చేసిన ఆలోచన ఇదే!

ఈ విధంగా అరేబియాను—తమ వాగ్దానాలకు భిన్నంగా—భ్రిటన్, ఫ్రాన్సులు తమలో తాము పంచివేసుకున్నా, లోకానికి మాత్రం అధర్మం చెసినట్టు కనబడకుండా ఉండడానికి "మేండేటరీ విధానం" అని ఒక తంతు చేశాయి. కొందరు ప్రజలకు స్వరక్షణకుగాని, స్వపరిపాలనకు గాని తగిన శక్తి ఉండదట. అట్టివారిని ఊరికే వదలివేస్తే వారు కష్టాల పాలౌతారట. అంచేత వారికంటే ఎక్కువ శక్తి, ఎక్కువ ప్రజ్ఞ, ఎక్కువ అనుభవం ఉన్నవారు, వారి పరిపాలనా భారాన్ని స్వీకరించి, వారికి క్రమక్రమంగా స్వరక్షణశక్తినీ, స్వపరిపాలాదక్షతనూ కలిగించాలట. ఇలా చెయ్యడం ఆ ప్రజలకే కాకుండా, మానవజాతికి, సభ్యతకూ, సేవచెయ్యడమట. "మేండేటరీ విధానం" అంటే ఇదే! ఈ విధానం పేరు చెప్పే బ్రిటన్, ఫ్రాన్సు రాజ్యాలు ఇరాక్, పాలస్తీనా, ట్రాన్స్ జోర్డాన్, సిరియాలను కబళించారు.

10

"యూదులకు జాతీయ కేంద్రాన్ని స్థాపించడం, ఆరబ్బుల జాతీయ కేంద్రాన్ని కాపాడ్డం, మొత్తం జనాభా అంతటికీ స్వపరిపాలనా విధానంలో శిక్షణ ఇవ్వడం"- ఈ మూడు ఆశయాల్ని సాధిస్తానంటూ బ్రిటన్ పాలస్తీనాపై మేండేటరీ అధికారాన్ని స్వీకరించింది. కాని, అది ప్రారంభం నుంచీ కూడా యూదుల పట్ల పక్షపాతాన్ని చూపసాగింది. "ప్రారంభం నుంచీ కూడా యూదుల పట్ల పక్షపాతం" అని అనడానికి తిరుగులేని నిదర్శనం ఇది: ఆలెంబీ ప్రభువు జెరుసులంను జయించిన తర్వాత, పాలస్తీనా పరిపాలనకు మిలిటరీ గవర్నమెంట్​ను ఏర్పరిచారు. ఈ మిలిటరీ గవర్నమెంట్​ను తప్పించి, సివిల్ గవర్నమెంట్​ను ఏర్పాటు చెయ్యడానికి 1920లో బ్రిటన్ పంపించిన మొట్టమొదటి హైకమీషనర్ యూదు జాతికి చెందిన సర్ హెర్బర్ట్ శామ్యూల్!

ఒక వైపున బ్రిటన్ అభిమానం ఉంది; ఇంకో వైపున అంతర్జాతీయ యూదీయ సంఘాల ధన సహాయం ఉంది. ఇంకేమీ కావాలి? యూదులు పాలస్తీనాకు విరివిగా వలస రాసాగారు. వచ్చి, వారు ఆరబ్బుల భూముల్ని కట్టుకున్నారు; ముఖ్యమైన ప్రభుత్వోద్యోగాల్ని సంపాయించుకున్నారు; ఎన్నదగిన పరిశ్రమల నన్నింటినీ వశపరచుకున్నారు; పాలస్తీనా పరిపాలన టర్కీ నుంచి తమకు సంక్రమించినట్టే చేసివేశారు.

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం లండన్ నగరానికి వెళ్ళిన ఆరబ్బు డెలిగేషన్ వారు తమ దుస్థితిని ఈ విధంగా వర్ణించారు:

"హైకమీషనర్ యూదీయుడు; లీగల్ సెక్రటరీ, స్టోర్స్ కంట్రోలర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్, చివరికి, వలస శాఖాధికారి- అందరూ యూదీయులే! ప్రభుత్వపు ప్రతి శాఖనూ యూదీయులే వశపరచుకున్నారు.

"ఆరబ్బుల స్వాతంత్య్రాన్ని అరికట్టడానికీ, వారి అభివృద్ధిని ఆటంకపరచడానికీ, శాసనాలను చేస్తున్నారు. పత్రికలకు స్వాతంత్య్రం లేదు. దేశాభిమానులైన ఆరబ్బుల్ని వారు ప్రజా క్షేమానికి ముప్పు తెస్తున్నారనే నెపంతో అరేస్టు చేస్తున్నారు.

"పాలస్తీనాలోని భూములన్నీ కూడా ప్రభుత్వం వారి ఆస్తులట. తరతరాల నుంచి ఆరబ్బుల హక్కుభుక్తాలలో ఉన్న భూముల్ని సయితం వశపరచుకుని, ఇవి మీకే తిరిగి కావాలంటే మా పేర కౌలు వ్రాయవలసిందని ప్రభుత్వం వారు అంటున్నారు. ఇలా చెయ్యడంలోగల ఉద్దేశం ఇది. ముందు ఈ భూముల ఖామందులు ప్రభుత్వం వారని ఋజువు చెయ్యడం; ఆ తర్వాత వాటిని నెమ్మదిగా యూదీయులకు అమ్మి వెయ్యడం.

"జనాభాలో నూటికి ఒకరైనా హీబ్రూ (యూదీయుల భాష) మాట్లాడరు. అయినప్పటికీ దాన్ని ఒక రాజభాషగా అంగీకరించారు".

"వెల్లువలా వలసవచ్చి పడుతున్న యూదీయుల వల్ల, జనభారం హెచ్చిపోతున్నది. వలస వచ్చిన యూదు కూలీల కారణంగా ఆరబ్బు కూలీలకూడా పడిపోతున్నది. ఆరబ్బు కూలీ చేసే పనిలో యూదు జాతి కూలీ సగం పనైనా చెయ్యలేడు. కాని, అతడికే ఎక్కువ కూలి ముట్టచెబుతూ ఉన్నారు".

"గవర్నమెంటు కంట్రాక్టుల్ని చాలావరకు యూదీయులకే (వారు ఆరబ్బుల కంటే ఎక్కువ మొత్తానికి టెండరు పెట్టినా) ఇస్తున్నారు".

దాదాపు పదిహేను సంవత్సరాలనాడు ఆరబ్బు డెలిగేషన్ వారు చిత్రించిన ఈ స్థితికీ, నేటి స్థితికీ, భేదం ఏమైనా ఉన్నదంటే, అది నాటి స్థితికంటే నేటిది మరింత ఘోరంగా ఉండడమే! ఇందుకు నిదర్శనంగా జాఫాలోని ఆరబ్ లేబర్ ఫెడరేషన్​కు కొంతకాలం కార్యదర్శిగా వున్న జార్జ్ మన్​సూర్ ఇటీవల ప్రకటించిన ఒక వ్యాసాన్ని చూపించవచ్చును; ఆ వ్యాసంలోని కొన్ని భాగాలు ఇవి:

"దేశం ఎంత జనాభాలను భరించగలదు అనే విషయాన్ని గురించి విచారించవలసిందిగా ప్రభుత్వం వారు నియోగించిన సింప్సన్, ఫ్రెంచ్ మొదలైన వారేగాక, ఇదే పనికి జియోనిస్టు (యూదు) సంఘం వారు స్వయంగా నియమించిన కాంప్​బెల్ కూడా 1930లోనే యూదీయులు చిత్తం వచ్చినట్టు వలస రావడం వల్ల దేశానికి నష్టం కలిగిందని ప్రకటించారు. అయినప్పటికీ వారి సిఫార్సుల్ని ప్రభుత్వంవారు తోసివేశారు. ఇలా చెయ్యడానికిగల కారణాలు ఏమిటో వారికే తెలియాలి. అరబ్బులు ఇంకా నిద్రావస్థలో ఉండగానే, వలసవల్ల తమ సంఘాన్ని మెజారిటీ సంఘంగా చేసుకుందామనే యెత్తుతో యూదీయులు పెట్టిన ఒత్తిడికి ప్రభుత్వం వారు తలవొగ్గారు కాబోలు!

"1920-1930 సంవత్సరాల మధ్య సగటున సాలుకు 10,000 మంది చొప్పున యూదీయులు పాలస్తీనాకు వలస వచ్చారు. ఇంతమంది వలస రావడమే తగదని చెప్పినప్పటికీ, 1933-1935 సంవత్సరాల మధ్య 136,000 మందికి పైగా యూదీయులు ప్రభుత్వం వారి అంగీకారంతో వలసకు వచ్చారు. వీరుగాక దాదాపు 40,0000 మంది రహస్యంగా దేశంలో ప్రవేశించారు. 1919లో 50,000 మాత్రమే ఉన్న యూదు జనాభా 1935 నాటికి 4,20,000 వరకు ఎలా పెరిగిందో దీనివల్ల తెలుస్తుంది.

"గ్రామవాసులు చాలవరకు ఆరబ్బులు. పట్టణ వాసులలో అధిక సంఖ్యాకులు యూదు జాతివారు. అంచేత పట్టణ వాసులైన యూదీయలకు లాభకరంగా, పల్లెవ మీద ఎక్కువ పన్నులు వేస్తున్నారు. 1930లో పట్టణ వాసుల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నులు 1,31,000 పౌనులైతే, పల్లెలలో నుంచి రాబట్టింది 3,95,000 పౌనులు. ఈ సంవత్సరానికి ఆదాయానికి సంబంధించిన అంకెలు తెలియవుగాని, 1936లో బస్తీల వాళ్ళ ఆదాయం దాదాపు రెండు కోట్ల పౌనులు. ఇక, పల్లెటూరివారి ఆదాయం అరవై లక్షల పౌనులు మాత్రమే! ఆదాయం పన్ను వుంటే యూదీయులే దాన్ని అధికంగా చెల్లించవలసి ఉంటుంది గనుక, అది లేనేలేదు.

"పల్లెలలో పన్నులు ఎక్కువ వేస్తే ఆరబ్బు రైతులు దాన్ని చెల్లించుకోలేక, తమ భూముల్ని యూదీయులకు అమ్మివేస్తారు గదా అనే ఉద్దేశంతో పాలస్తీనాలోని బ్రిటీష్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆ విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందులకు నిదర్శనం బ్రిటీష్ వాడైన యన్. బార్బర్ 1936 జూలై నెలలో 'పాలస్టైన్ పోస్టు' పత్రికలో వ్రాసిన వ్యాసంలోని ఈ క్రింది వాక్యాలే: జెరుసలం సమీపంలో వున్న ఒక గ్రామంలోని భూమిశిస్తు ఎకరానికి మూడు షిల్లింగుల నాలుగు పెన్నీల దగ్గరి నుంచి (షుమారు రెండున్నర రూపాయలు), అయిదు పౌనుల నాలుగు షిల్లింగుల వరకు (షూమారు 78 రూపాయలు) పెరిగింది! కొన్ని కొన్ని భూములకు ఇది ఎకరానికి ఎనిమిది పౌనుల వరకు కూడా (షుమారు 120 రూపాయలు) పెరిగింది!! ఈ పెరుగుదలలోని విపరీతాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, మరి రెండు విషయాల్ని గమనించాలి. అవి ఏవంటే-గ్రామంలో ఎకరానికి రెండు పౌనులకు (30 రూపాయలకు) మించి ఆదాయం రాదు. ఆరబ్బు రైతు కుటుంబానికి సగటున వచ్చే మొత్తం ఆదాయం- సింప్సన్ రిపోర్టు ప్రకారం- 29 పౌనుల 9 షిల్లింగులు.

"ఈ పరిస్థితులలో ఆరబ్బులు తమ భూముల్ని యూదులకు అమ్మి వెయ్యడంలో ఆశ్చర్యం ఉన్నదా! ఆరబ్బు రైతుల దగ్గరి నుంచి యూదీయులు దాదాపు 8,00,000 డన్యూముల సేద్య యోగ్యమైన భూమిని కట్టుకున్నారు. ఈ భూమి ఖరీదు క్రింద 1918-1935 సంవత్సరాల మధ్య వారు చెల్లించిన 73,51,000 పౌనుల వల్ల ఆరబ్బు రైతులు పొందిన ప్రయోజనం దాదాపు శూన్యం ఎంచేతనంటే-ఈ మొత్తంలో అధిక భాగాన్ని మధ్య వాళ్ళు (బ్రోకర్లు, యూదుజాతి ఏజెంట్లు) కాజేశారు.

"యూదీయుల పరిశ్రమల్ని ప్రోత్సహించడం, వాటి ద్వారా ఆరబ్బుల పరిశ్రమల్ని అణగద్రొక్కడమూ బ్రిటీష్ నీతి. ఈ నీతి కారణంగా ఆరబ్బుల పరిశ్రమకు మొత్తం మీద దెబ్బ తగిలింది. ఇందుకు ఇక ఉదాహరణ (ఆరబ్బులకు చెందిన) సబ్బు పరిశ్రమ. 1925లో 2,54,087 పౌనుల విలువ గల సబ్బు ఎగుమతి అయింది. 1935 నాటికి ఈ ఎగుమతులు 77,897 పౌనులకు దిగజారినాయి.

"ఇంతటితోనైనా ఆగక ప్రభుత్వం వారు తాము చేయించే అన్ని పనులలోనూ యూదు కార్మికులు పట్ల అభిమానాన్ని చూపుతున్నారు. 1935లో వారు తమ కాంట్రాక్టులలో 2,97,099 పౌనుల విలువ గల కంట్రాక్టుల్ని యూదు జాతివారి కిచ్చారు. పోగా, మిగిలిన 2,55,367 పౌనులు విలువ గల వాటిని యూదేతరులకు అందరికీ కలిపి ఇచ్చారు. యూదేతరుల కిచ్చిన 2,55,367 పౌనుల కంట్రాక్టులలో అధికభాగం బ్రిటీష్ కంపెనీలకూ, ఇంకా ఇతర విదేశపు కంపెనీలకూ దక్కినాయి. (మిట్చెల్ అండ్ రోలిన్ అండ్ కంపెనీ లిమిటెడ్; మేజర్ కే అండ్ కంపెనీ; జె.యల్. మాడ్ అండ్ కంపెనీ మొదలైన వాటికి).

"ఇక, రైల్వేలలోనూ, హార్బర్లలోనూ, కస్టమ్సు ఆఫీసులలోనూ, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసులలోనూ ఆరబ్బుల పదవుల్ని యూదీయులు ఆక్రమించుకోడాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరలేదు". బ్రిటీష్ వారు పాలస్తీనాలో చేసిన ధర్మపరిపాలన ఇదే!

11

యూదు జాతి వారిపట్ల బ్రిటన్ ఇంత పక్షపాతాన్ని వహించడానికి కారణం,- నిరాశ్రయంగా వున్న ఆ జాతివారికి ఒక ఆశ్రయాన్ని కల్పించుదామనే సచ్చింతకాదు; కేవలం స్వార్థచింత. యూదీయుల పట్ల బ్రిటన్​కు నిజంగా సానుభూతి ఉంటే వారిని వలస పంపించడానికి కెనడా లేదా? ఆస్ట్రేలియా లేదా? దక్షిణాఫ్రికా లేదా? ఒక్క ఆస్ట్రేలియాలోనే ప్రపంచంలోని యూదు జాతి వారందరు వలస వెళ్ళడానికి తగిన సదుపాయంగా ఉండగా, ఇంతకు పూర్వమే జన సంకీర్ణంగా వున్న పాలస్తీనాలోనే వారికి తావు చూపించాలనే పట్టుదల దేనికి?

పాలస్తీనాలో సగటున చదురపు మైలుకు 143 మంది చొప్పున ఇప్పటికే ఉన్నారు. 1918-1919 సంవత్సరాల మధ్య దాని జనసంఖ్య 6,80,000 నుంచి 14,15,000 వరకు హెచ్చింది. ఆరబ్బుల సంఖ్య నూటికి 77 వంతులు పెరిగింది. ఒక, యూదీయుల సంఖ్య నూటికి 703 వంతులు పెరిగింది. ఇకముందు యూదీయుల వలసను పూర్తిగా ఆపివేసినా, మరి పాతిక సంవత్సరాలకు ఇప్పటి జనాభాయే సంతానోత్పత్తి వల్ల ఇరవై లక్షలకో పెరుగుతుంది. అప్పుడు సగటున చదరపు మైలుకు షుమారు 200 మంది ఉండవలసి వస్తుంది. ఇంత ఒత్తిడిని పాలస్తీనా భరించలేదు. అది అసలే చిన్నదేశం. దాని భూవైశాల్యంలో మూడో వంతు మాత్రమే సేవ్య యోగ్యమైంది. ఇక, సహజ సంపత్తి కూడా విశేషంగా లేదు. అంచేత అక్కడికి యూదుల్ని వలసకు పంపించడం-పైగా, మితం లేకుండా పంపించడం-తగనిపని.

ఈ తగనిపనికి బ్రిటన్ పూనుకోడానికి అమేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనట్టివి ఇవి.

ఆరబ్బులకూ, బ్రిటీష్ వారికీ మత విషయంలో నేమి, విజ్ఞాన విషయంలో నేమి, ఆచార వ్యవహారాల విషయాంలో నేమి, రాజకీయల విషయంలో నేమీ-దేనిలోనూ లేశమైనా ఐక్యత లేదు. అంచేత, బ్రిటన్ ఈసారి ఏదైనా యూద్ధంలోకి దిగితే, పాలస్తీనా ఆరబ్బులు దాని పక్షాన ఉంటారనే ఆశకు అవకాశం తక్కువ, తమ సరిహద్దులలో ఉన్న స్వమతస్థులతో-వీరు బ్రిటన్​కు ప్రతికూలంగా యుద్ధ రంగంలో నిలిచేపక్షాన-పాలస్తీనా ఆరబ్బులు ముప్పాతిక మూడు వీసాలు చేరవచ్చును. అంచేత బ్రిటీష్ సామ్రాజ్య రక్షణకు ప్రాణప్రదమైన పాలస్తీనాలోని ఆరబ్బుల్ని తొక్కిపట్టి ఉంచాలంటే, వారిపైన అవసరమైనప్పుడు ఉసిగొల్పడానికి ఏదైనా కొత్త సంఘాన్ని సృష్టించాలి. యూదు జాతివారు ఈ పనికి చాలా చక్కగా పనికివస్తారు. ఆరబ్బులకు అంగబలం ఉంటే, యూదులకు అర్ధబలం ఉంది. అంచేత వారు తేలికగా అక్కడ కాలూనగలరు. ఇందుకు తోడు వారి భాష ఆరబిక్; వీరిది హీబ్రూ. వారి మతం ఇస్లాం; వీరిది జూడాయిజం. వారి ఆచార వ్యవహారాలు ప్రాచ్య ఖండానివి; వీరివి పాశ్చాత్య ఖండానివి, అంచేత వీరుభయులూ ఏకం కావడంగాని బ్రిటన్ మీద ఎదురు తిరగడం గాని కల్ల. మహమ్మదీయ ప్రపంచం మధ్య ఏకాకులమై ఉన్నామనే భయం కొద్దీ యూదీయులు శాశ్వతంగా బ్రిటన్ ప్రాపకం కోసం దేవులాడ వలసిందే!

విభిన్నమైన దృక్పథాలు, విరుద్ధమైన ఆశయాలు కలిగివున్న రెండు జాతుల వారు ఒకే దేశంలో ఉన్నప్పుడు వారిలో వారికి కలహాలు తప్పవు. ఈ అంతఃకలహాల గొడవలో దేశానికి స్వాతంత్య్రం కావాలనే ఆందోళన తప్పుతుంది. పైగా యూదులూ, ఆరబ్బులూ అనవతరం సంఘర్షిస్తూ ఉంటే వారుభయుల మధ్య తగవు తీర్చడానికి మూడవ పక్షం ఉండాలనే సాకుతో బ్రిటన్ శాశ్వతంగా దేశ పరిపాలాధికారాన్ని తన చేతిలోనే పెట్టుకోవచ్చును.

వైమానికాశ్రయాల పరిసర ప్రాంతంలో ఎప్పుడూ స్నేహపాత్రంగా ఉండే ప్రజలుండడం అవసరం. ఆరబ్బులు— ఇంతకుముందు వివరించినట్టు —ఎల్లకాలం స్నేహంగా ఉంటారని ఆశించడానికి వీలులేదు. అంచేత పాలస్తీనాలో యూదు జాతీ కేంద్రాలు ఏర్పడితే, వాటి మధ్య బ్రిటన్ నిస్సంకోచంగా తన వైమానికాశ్రయాల్ని నిర్మించుకోవచ్చును.

యూదుల పెట్టుబడి ద్వారా పాలస్తీనా వ్యావసాయికంగానూ, పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందడానికి వీలులేదు. అప్పుడక్కడ బ్రిటీష్ వ్యాపారానికి ఎక్కువ సదుపాయం ఉంటుంది.

ఇలాంటి అనేక కారణాల వల్లనే బ్రిటన్ యూదీయుల పట్ల పక్షపాతాన్ని చూపిందిగాని, వారిపై ప్రత్యేక ప్రేమతో కాదు. ఈ విషయాన్ని కెనడా గవర్నర్ జనరల్ టీడ్స్​మూర్ స్పష్టంగా అంగీకరించాడు. అతడి పలుకులివి:

"ప్రాచ్య, పాశ్చాత్య ఖండాల మధ్య వున్న రాజమార్గ రక్షణకు పాలస్తీనా పెట్టనికోట వంటిది. అబిసీనియా యుద్ధం తర్వాత ఈ రాజమార్గ రక్షణ విషయమై మనం కొంత ఆందోళన చెందవలసి వచ్చింది... ఈ దృష్టితో చూస్తే, జియోనిజం వల్ల (పాలస్తీనాను యూదు జాతీయ కేంద్రంగా చెయ్యడం వల్ల) గ్రేట్ బ్రిటన్​కు ప్రస్తుత సమయంలో ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవచ్చును".

నిరాశ్రయులై అల్లాడుతూ ఉన్న ఒక గొప్ప జాతి ప్రజలకు జాతీయ కేంద్రాన్ని ఏర్పరచాలనే మహదాశయంతో ప్రారంభమైన జేయోనిజం చివరికి బ్రిటీష్ ఇంపీరియలిజం నీచ స్వార్ధ సముపార్జనకు సాధనమైంది. అంచేతనే దాన్ని చూచి అసహ్యించుకోవలసి వస్తున్నది.

12

బ్రిటన్ పక్షపాతాన్ని అవకాశంగా చూచుకుని యూదీయులు అరబ్బులకు చేసిన— చేస్తున్న —అన్యాయాలు ఇన్నన్ని కావు. తాము వలస రావడం ప్రారంభించిన కొత్తలో భూములకు వారు పెద్ద పెద్ద ధరల్ని పెట్టసాగారు. దీనికి ఆశపడి ఆరబ్బు భూస్వాములు తమ భూముల్ని చక చక అమ్మివెయ్యనారంభించారు. ఇందుమూలంగా అంతకుముందు ఆ భూముల్ని కట్టుబడి చేసుకు బ్రతుకుతున్న చిన్న చిన్నరైతు కుటుంబాలకు — దాదాపు ఆరువేల కుటుంబాలకు — జీవనాధారం పడిపోయింది.

కట్టుబడిదారులు మట్టికొట్టుకుపోయినా, పెద్ద ఆసాములు మాత్రం యూదుల రాకవల్ల తమ భూములకు ధర పెరిగిందని చంక లెగరవేశారు. అయితే, త్వరలోనే వారికి కనువిప్పు అయింది. దేశంలో కొంత స్థావరం చిక్కగానే యూదీయులు ఒక్కమాట అనుకుని, భూముల ధరల్ని చప్పగా పడగొట్టించారు. దానితో పెద్ద ఆసాములకు కూడా దుస్థితి పట్టింది.

రైతులకూడు పడగొట్టినట్టే యూదు జాతివారు కూలీల కడుపు కూడా కొట్టారు. చౌకగా దొరుకుతున్నారు గదా అని ముందు రోజులలో వారు ఆరబ్బు కూలీలనే పనికి పిలిచారు. కాని, తమ జాతివారు తగినంత మంది వలసకు రాగానే ఎక్కువ కూలీనైనా పెట్టి వారిచేతనే పనిచేయించుకోసాగారు.

అయితే, యూదులలో కొందరు చౌకగా వస్తున్నారు గదా అని ఆశపడి, ఆరబ్బు కూలీలను పిలవడం మానలేదు. అలాటి సందర్భాలలో జియోనిస్టు సంఘాల వారు పికెటింగ్ చేయించారు. ఈ పికెటింగ్ అనేక చోట్ల సంఘర్షణలకు కూడా కారణమైంది.

ఇక, ప్రభుత్వోద్యోగాలలో, వర్తక వ్యాపారాలలో, ప్రతి ముఖ్య స్థానాన్ని యూదీయులు ఆక్రమించి వేసుకోవడమే!

దీన్ని అంతటిన్ని చూడగా, పాలస్తీనాలో నుంచి ఆరబ్బుల్ని తరిమివేసి, దేశాన్ని పూర్తిగా తామే భుక్తం చేసుకుందామా అని యూదీయులు కుట్రపన్నుతున్నట్టు కనబడింది. ఇది ఉత్తి భయం కాదు. పాలస్తీనా జియొనిస్టు కమీషన్ అధ్యక్షుడైన డాక్టర్ ఎడర్ ఈ విషయాన్ని తెగవేసి చెప్పాడు. అతడి మాటలివి.

"పాలస్తీనాలో ఒకే జాతీయ కేంద్రం ఉండాలి. అది యూదు జాతీయ కేంద్రం. యూదీయులు, ఆరబ్బులు సమాన భాగస్వాములనడానికి వీలులేదు. యూదీయుల జనాభా తగినంత హెచ్చుగానే వారిదే పై చెయ్యిగా ఉండాలి".

చూచి పొమ్మంటే దెయ్యమై పట్టుకున్నట్టున్నది — చూచి పొమ్మనకుండానే వచ్చిన — యూదీయుల ప్రవర్తన!

13

ఒక వైపున బ్రిటీష్ వారు, ఇంకోవైపున బ్రిటీష్ వారి అండతో యూదీయులు తమకు చేస్తున్న ఘోరాన్యాయాల్ని ప్రతిఘటించడానికి స్వదేశాభిమాన పూరితులైన ఆరబ్బులు మొదటి నుంచీ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి ఈ ఆందోళన కారణంగా అనేక పర్యాయాలు సంఘర్షణలు జరిగాయి. వీటిలో మొట్ట మొదటిది 1920 ఏప్రిల్ 4వ తేదీనీ, చిట్ట చివరిది 1936 ఏప్రిల్ 19వ తేదీనీ ప్రారంభమైనాయి. అన్నింటిలోనూ ఈ చిట్టచివరి సంఘర్షణే అతిభీకరమైంది. ఇది ఇంకా సాగుతూనే ఉంది.
ఆరబ్బుల స్వాతంత్ర్యోద్యమజ్వాలల్ని రుధిరధారలతో చల్లార్చాలని ప్రస్తుతం పాలస్తీనాలో బ్రిటిషువారు ఎంతటి రాక్షస కృత్యాలను చేస్తున్నారో చెప్పడానికి వీలులేదు. పంజాబ్లో జనరల్ డయ్యర్ ప్రదర్శించిన అమానుషత్వంగానీ, ఐర్లండ్ లో బ్లాక్ అండ్ ట్యూస్ సైనిక దళం ప్రదర్శించిన పశుత్వంగాని, ప్రస్తుతం పాలస్తీనాలో బ్రిటిష్వారు అమలు జరుపుతున్న దమననీతి ముందు చాలా సౌమ్యంగా కనబడతాయనడం అతిశయోక్తికాదు - ముమ్మాటికి!
ఇటీవలనే జవహర్లాల్ నెహ్రూ పండితుడు పాలస్తీనాను గురించి ఒక వ్యాసాన్ని వ్రాస్తూ, దానిలో బ్రిటిష్ వారు చేస్తున్న ఘోరకృత్యాల్ని తెలిపే ఒక లేఖను ఉదహరించాడు. ఈ లేఖను పాలస్తీనాలో ఉన్న ఒక ఇంగ్లీషులాయర్ ఇంగ్లండులో ఉన్న తన స్నేహితునికి వ్రాశాడట. ఉత్తరాన్ని వ్రాసిన వ్యక్తీ, దాన్ని అందుకున్న వ్యక్తి - ఇద్దరూ కూడా విద్యాధికులట; విశ్వాసనీయులట. ఆ లేఖలోని కొన్ని భాగాలు ఇవి:
“ఇక్కడి ప్రభుత్వాధికారులు దమననీతినే పూర్తిగా అవలంబించడానికి నిశ్చయించుకున్నట్టున్నారు. వారు చూపుతున్న పశుత్వాన్ని గురించి బ్రిటిష్ సివిలియన్ ఎవ్వడు కూడా అసహ్యభావంతో కంపించకుండా మాటాడ్డంగాని, వ్రాయడంగాని కష్టం.
"మోఫత్ హత్యానంతరం వారు (సైనికులు) జెనిన్ అనే చిన్న పట్టణాన్ని డైనమెట్తో పేల్చివేశారు. ఈ సందర్భంలో 150 ఇళ్ళు కూలిపోయినవని ప్రభుత్వ ప్రకటనలో ఉంది. ఈ అంచనాను మించికూడా నష్టం జరిగి ఉండవచ్చు.
"పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కొందరిని కాల్చి చంపివేశారు. హత్యా నేరాన్ని గురించి కూపీ తియ్యడానికి అవలంబించిన పద్ధతులలో కొన్ని వర్ణించనలవి కానట్టివి.
"ఈ ఘోరాల్ని చేసింది నేరస్థుల్ని శిక్షించడానికి కాదు; ప్రజల్ని హడలెత్తించడానికి మాత్రమే!
"కేవలం ఇళ్ళను నాశనం చెయ్యడమే కాకుండా ప్రజల ఆస్తిని కూడా అపహరించారు (రొక్కం, నగలు మొదలైనవి). చివరికి న్యూయార్క్ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వారి ఇనప పెట్టిలోని ద్రవ్యాన్ని కూడా సంగ్రహించారు. ఈ చర్యను అమెరికన్ కాన్సల్ (రాయబారి) తీవ్రంగా గర్హించాడు.
"ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల్నీ నీకు తెలియజెప్పడం దుస్సాధ్యం. విస్మయ విషాదాల్ని కలిగించే సంఘటనలు ఎన్నో నాకు తెలుసు. మచ్చుకు ఒకదాన్ని మాత్రం చెబుతాను విప్లవకారులు టెలిఫోన్ తీగల్ని తెగగొట్టి వేస్తున్నారు. వాటిని గవర్నమెంట్ నౌకర్లు ఎప్పటికప్పుడు రీపెయిర్ చేస్తూ ఉండాలి. ఇలా చేసే వారిలో కొందరు ఆరబ్బులు. వారు తీగల్ని బాగు చేస్తూ ఉండగా విప్లవకారులు చూడ్డం తటస్థిస్తే - స్వజాతీయులే అని దయతలచ కుండా తప్పక కాల్చివేస్తారు. అయినా, ధైర్యం చెడక, వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాణాలకు కూడా తెగించి ఇలా ప్రభుత్వానికి సేవ చేసి, సాయంత్రానికి కొంపను చేరుకోబోతే, ఒక్కొక్కప్పుడు ఆ కొంపను కాస్తా సోల్జర్లు కూలదోసి వెళ్ళడం తటస్థిస్తుంది. పడిపోయిన గోడల మధ్య బిక్కు బిక్కురుమంటూ కూర్చున్న పెళ్లాంబిడ్డల్ని చూచుకోగానే, వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ఇలాంటి ఘోరాలకు బలి అవుతున్న వారే ప్రస్తుతం విప్లవకారులలో చేరిపోతున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమంటే—క్రమక్రమాన విప్లవకారుల ధైర్య సాహసాలు పెరుగుతున్నవిగాని, తరగడం లేదు.

"శనివారంనాడు, ఇక్కడ జాఫాలో, సోల్జర్లు కంటబడిన ప్రతివాడినీ, కాల్చాలనీ బుద్ధి పుడితేచాలు, కాల్చివేస్తున్నారు. ఒక గవర్నమెంట్ సర్వేయర్—చదువుకున్నవాడు; ఇంగ్లీషు మాటాడ్డం నేర్చినవాడు—తన పనులు చూచుకుని ఇంటికి వస్తూ ఉంటే, అతడిని నడివీధిలో కాల్చి చంపారు. ఇలాగే ఏడేళ్ళ పిల్లనుకూడా హత్య చేశారు.

"నాకు పత్రికను తెచ్చియిచ్చే చిన్న కుర్రవాడు—బలే చలాకీ అయినవాడు—ఇవ్వాళ ఉదయం రాలేదు. ఏమైపోయాడు చెప్మా అని విచారిస్తే, కాల్చి చంపారని తెలిసింది.

"కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇంగ్లీషు జడ్జీని కలుసుకోగా, తాను మీన్​షై పేటలో చూచిన దృశ్యాల్ని గురించి చెబుతూ, ప్రభుత్వాన్ని పూర్తిగా దుయ్యబట్టాడు. హెబ్రాన్​లోని ఒక డాక్టర్ తమ పట్టణంలో పోలీసులూ, సోల్జర్లూ చేసిన దారుణ హత్యల్ని గురించి వొళ్లు జలదరించే కథల్ని చెప్పాడు. అక్కడ ఉన్న ఆరబ్బు షాపుల్నీ, హోటళ్ళనూ ఒక్కదాన్ని కూడా విడవకుండా దోచుకున్నారట."

ఈ బ్రిటిష్ లాయర్ లేఖలోని విషయాల్ని చూచి "అబ్బ! ఇంతకంటె ఘోరకృత్యాలు ఉంటాయా?" అని కొందరు అనుకోవచ్చును. కాని అలాంటి సందేహం అవసరంలేదు. పాలస్తీనాలో బ్రిటిష్ అధికారులు ఇంతటికంటె రాక్షసమైన చర్యల్ని కూడా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కావాలంటే, "డక్కన్ టైమ్స్" (మద్రాసు) ప్రకటించిన ఈ వృత్తాంతాల్ని చూడవచ్చును:

"నసిరా సమీపంలో ఉన్న కాఫ్ర్​కామా గ్రామానికి 1937 డిసెంబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం కొందరు మిలిటరీ ఆఫీసర్లు వెళ్ళారు. ఆ ఆఫీసర్లు గ్రామంలోని ముఖ్యుల్ని అందర్నీ ఇళ్లలో నుంచి బైటికి రమ్మని, వారి పాగాల్ని తీయించి ఎర్రటి ఎండలో వరసగా నిలబెట్టించి, వీపుల మీద రక్తం కారేలా రాళ్ళతో బాదారు. తర్వాత వాళ్ళ ఇళ్ళనుకూడా సోదా చూచారు.

"మరి కొంతమంది మిలటరీ ఆఫీసర్లు ఆ గ్రామంలోనే మగవాళ్ళనందరినీ పొలాలలోకి తోలారు; ఆడవాళ్ళనందరినీ మసీదులోకి చేర్చారు. ఆ మీదట సోదా అనే వంకతో ఇళ్ళ మీద పడి దోచుకున్నారు. మగవాళ్ళ బట్టల్ని ఊడదీయించి, వారి మీద కాలుతూ ఉన్న నునెను, ఇసుకను పోశారు. ఇది మిలిటరీ ఆఫీసర్లకు చెడ్డ సరదాగా కనబడినట్టున్నది. తర్వాత ఆ దౌర్భాగ్యుల్ని చాలాదూరం నడిపించారు. నడవలేక పోయిన వారిని కొరడాలతో బాదారు. "ఒక చెవిటి గొర్రెలకాపరిని 'ఎవడురా' అని పలకరిస్తే, వాడు బదులు చెప్పాడుకాదు. వెంటనే వాణ్ణి కాల్చిచంపారు.

"సంహనా అనే గ్రామంలో ముఖ్యంమైన వారినందరినీ చెరువు గట్టు మీదికి చేర్చి, మంచులా జిమ్ముమంటూ ఉన్న నీళ్లలోకి తోశారు. మిలిటరీవారు వెళ్ళిపోయిన తర్వాతగాని వాళ్ళను వొడ్డుకు చేర్చడానికి వీలుపడలేదు. ఆడవాళ్ళను రాళ్ళగంపల్ని మొయ్యమన్నారు. సరిగా మొయ్యలేకపోయిన వారిని రాళ్ళతో కొట్టారు.

"ఒకచోట ఆహారపదార్ధాల్ని, వస్త్రాభరణాల్ని దోచుకోవడమే కాకుండా, అక్కడి స్త్రీ పురుషులనందరిని సిగ్గు మాలిన పనులకు లోనుజేశారు. తర్వాత ఇరవై మందిని తాడుతో ఒక కారుకు కట్టి, హైస్పీడ్​తో వారిని ఈడ్చుకు వెళ్లారు.

"తాలిపార్​లో 150 మందిని గ్రామం చుట్టూ లెఖ్ఖ లేకుండా ప్రదక్షిణాలు చేయించారు. అలుపు వచ్చి పడిపోయిన వారిని కొరడాలతో క్రూరంగా కొట్టారు. కొందరు పారిపోవాలని చూస్తే, వారి మీద తుపాకుల్ని కాల్చారు. ఒకడు గాయపడ్డాడు. ఇంకొకడు పరుగెత్త లేక పట్టుబడ్డాడు. అతడిని చావ చితకగొట్టారు."

"ఘాన్​డాన్​లో ఇళ్ళను సోదా చూశారు. 35 మందిని (నలుగురు స్త్రీలతో సహా) గాయ పరిచారు.

"చాలా మంది ఉలేమాలను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో వారిని చాలా అవమానపరిచారు. కొందరిని రోజుకు మూడుసార్లు పోలీసుస్టేషనులో హాజరువేసిపొమ్మని ఆజ్ఞాపించారు.

"మూడు చోట్ల కొరానును చించి పారవేశారు.

"సర్వ కార్మికసమ్మె (జనరల్ స్ట్రయిక్) సమయంలో షేక్ అర్సలాన్ మసీదును డైనమైట్​తో పడగొట్టివేశారు."

గుండెల్ని జలదరింపజేసే ఈ వృత్తాంతాల్ని ప్రకటిస్తూ, "డక్కన్ టైమ్స్" ఇలా వ్రాసింది. "వీటినన్నింటిని మించిన ఘోరసంఘటనల్ని మేము ప్రకటించడంలేదు. కారణం సువిదితమే!"

14

బ్రిటిష్ అధికారులతోబాటు యూదీయులు కూడా ఆరబ్బులపట్ల రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక ఆరబ్బీవాని ఇంటిని కూలదోస్తే, ఒక యూదీయునికి ఇల్లు కట్టుకోడానికి చోటు దొరుకుతుంది. పదిమంది ఆరబ్బుల కాలుచేతుల్ని విరిస్తే, పదిమంది యూదీయులకు కూలినాలి దొరుకుతుంది. వందమంది ఆరబ్బుల్ని చంపివేస్తే, వందమంది యూదీయులు వలస రావడానికి వీలుకలుగుతుంది. ఆరబ్బు జాతి ఎంత ఎక్కువగా నశిస్తే, దేశం అంత సులభంగా యూదుజాతి వశమౌతుంది. ఈ సూత్రం మీద వారు నడుచుకుంటున్నారు. వారు చేస్తున్న ఘోరకృత్యాల్ని గురించి ఒక జర్మన్ పత్రిక ఇలా వ్రాసింది: "డ్జాబా అనే ఆరబ్ గ్రామంలో నలుగురు యూదీయులు చాలా మంది ఆరబ్ స్త్రీలను మానభంగం చెయ్యబోయారు. రాళ్ళనూ, రప్పల్నీ పుచ్చుకుని ఆ స్త్రీలందరు తమను రక్షించుకోబోగా, ఈ మానవాధములు వారిలో ఒక సాధ్విని తుపాకితో కాల్చివేశారు.

"తమకు ఆయుధాలు లేకపోయినా, ఆరబ్ గ్రామస్థులు—జరిగిన దారుణ హత్యను చూచి భయపడిపోకుండా—ఆ రాక్షసుల్ని ఎదిరించారు. ఆ నలుగురిలోను ఇద్దరు యూదులు తప్పించుకుపోయారు. మిగిలిన ఇద్దరు పట్టుబడ్డారు. వారి చేతిలోని తుపాకుల్ని లాక్కుని, వారిని ఆరబ్బులు అక్కడక్కడే రాళ్ళతో కొట్టి చంపారు."

జర్మన్ నాజీ పత్రిక ఈ విషయాన్ని ప్రకటించింది గనక ఇది కల్పితమైనదేమో అనే సందేహం కలగవచ్చును. కాని, యూదులు చేస్తున్న దురంతాల్ని గురించి సందేహానికి ఎడమివ్వని కథలెన్నో ఉన్నాయి. వారు సరిగా శుక్రవారం నాడు మసీదుల ప్రాంతంలో బాంబుల్ని వేస్తున్నారు. శుక్రవారం నాడు మహమ్మదీయులందరు నమాజ్ కోసం మసీదులలో చేరతారు. అంచేత ఆనాడు ఆ ప్రాంతాలలో బాంబుల్ని విసిరితే, చాలా ఎక్కువమంది హతులౌతారని వారి ఉద్దేశం. నిజంగా చాలామంది ఇదే ప్రకారం హతులౌతున్నారు కూడా. జెరుసులం లోని ఒక పెద్ద మసీదులో 1938 జులై 15వ తేది శుక్రవారం నాడు ఆరబ్బులు ప్రార్థనలు చేసుకుని వస్తూవుండగా, వారి మీద బాంబు పడింది. అందుమూలంగా ముగ్గురు మగవాళ్ళు, ఆరుగురు ఆడవాళ్ళు, ఒక బిడ్డ చనిపోయారు; ఇరవై మంది మగవాళ్ళు, పదిమంది ఆడవాళ్ళు గాయపడ్డారు. వీరిలో కొందరికి ప్రాణాపాయకరమైన గాయాలు తగిలాయి. పగిలిన పుర్రెలతో, తెగిపడ్డ కాళ్ళ చేతులతో, కాల్వలు కట్టిన నెత్తురుతో ఆ ప్రదేశం ఎంత భీభత్సంగా కనబడిందో చెప్పతరంగాదు!

ఈ ఒక్క శుక్రవారం నాడు మాత్రమే కాదు; వరసగా అనేక శుక్రవారాల నాడు మసీదుల వద్ద ఇదేవిధంగా బాంబులు పడ్డాయి; ఇంత ఎక్కువగానూ జననష్టం జరిగింది. ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటే, వీటిని గురించి యూదు పత్రికలు చేసిన వ్యాఖ్య ఇది: "యూదులకు ఈ పాపాన్ని అంటగట్టి వారి మీద లోకానికి అసహ్యం కలిగించాలనే దురద్దేశంతో ఆరబ్బులే ఈ విధంగా బాంబుల్ని విసరుతున్నారు". దీన్ని చూచినప్పుడు ఆరబ్బుల గుండె ఇంకెంతగా మండుతుందో ఎవరికివారు ఊహించుకోవలసిందే!

యూదులు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా, ఏమి దౌష్ట్యాలను చేసినా, బ్రిటీష్ అధికారులు చూచీచూడనట్టు ఊరుకుంటారు. తప్పనిసరి వచ్చి శిక్ష వెయ్యవలసి వచ్చిన పక్షంలో, చాలా తేలికగా వదిలివేస్తారు. ఒకే నేరానికి ఆరబ్బుకు మరణశిక్ష, యూదీయునికి కొద్దిపాటి జైలుశిక్ష పడిన ఉదాహరణలకు లెక్కలేదు.

షేక్ ఫరహాన్ సాదీ అనే ఆరబ్బు ముదుసలికి—వయస్సు 80 సంవత్సరాలు—అతడి ఇంటిని సోదా చూడగా, గోడలో ఒక రివాల్వర్ కనబడిందనే నేరం కింద మరణశిక్ష వేశారు. 1938 జనవరి 12వ తేదీని యూదీయుడైన ఒక పహరా జవాను దగ్గర ఒక రివాల్వర్, నాలుగు కణికల డైనమైట్ దొరికింది. ఇందుకు అతడికి వేసిన శిక్ష—ఐదేళ్ళ ఖైదు!

ఆల్ట్​మన్ అనే యూదు పోలీసువాడు 1938 ఫిబ్రవరి 4వ తేదీని ఆరబ్ లారీ మీద తుపాకిని కాల్చినందుకు మిలిటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. ఫిబ్రవరి 7వ తేదీని ఈ ఉరిశిక్షను ఆజన్మ కారాగార వాసానికి తగ్గించారు. ఇదే సమయంలో పదిహేడు సంవత్సరాల ఆరబ్బు బలుడికి అతడి దగ్గిర మిల్సు బాంబు పట్టుబడిందని పది సంవత్సరాల కఠిన ఖైదు వేశారు.

పాలస్తీనాలో బ్రిటీష్ కోర్టులు దయచేస్తున్న న్యాయం ఇదే! ఇంతకు మించిన ఒక ఘోరం ఏమంటే,—యూదు పోలీసులకు తుపాకుల్ని ఇస్తున్నారు; అరబ్బు పోలీసులకు లాఠీలను మాత్రమే సప్లయ్ చేస్తున్నారు.

15

బ్రిటిష్ అధికారులు, వారిని చాటుచేసుకుని యూదు జాతీయులు ఎంత దౌర్జన్యానికి దిగినా ఆరబ్బు జాతీయవాదులు చెదిరిపోవడంలేదు. తమ ప్రతికక్షులు ఎక్కువ దౌష్ట్యాలను చేసినకొద్దీస ఆరబ్బులు ఎక్కువ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఈసారితో ఈ దేశం మనది కావడమో, కాకపోవడమో తేలిపోవాలి అనే పట్టుదల వారు చూపుతున్నారు.

"ఆధునిక యుద్ధానికి కావలసిన సాధనాలు బొత్తిగా లేని ఈ చిన్ని తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వంవారు అణిచి వెయ్యలేరని అనుకోవడం హాస్యాస్పదం" అని పీల్​కమిషన్[6] తన నివేదికలో వ్రాసింది. ఈ వాక్యాన్ని వ్రాసిన తర్వాత సంవత్సరం పైగా గడచినా ఇప్పటికీ ఆరబ్బుల స్వాతంత్య్ర సమరం సాగుతూనే ఉంది. ఆరబ్బులకు ఆధునికమైన ఆయుధాలు లేకపోవచ్చును. కాని, వారి చేతులలో జాతీయత అనే వజ్రాయుధమున్నది. వారు చేస్తున్నది చిన్న తిరుగుబాటే కావచ్చును. కాని, బ్రిటన్ చేసే ప్రతి దౌర్జన్యంతోనూ ఆ తిరుగుబాటుకు కొత్తబలం వస్తున్నది.

ఆరబ్బు విప్లవకారులు చేసే సాహసకృత్యాలకు అంతులేదు; వారు ఎదుర్కొనే అపాయాలకు పారంలేదు.

తమకు కావలసిన డబ్బును వారు బ్రిటిష్ బ్యాంకుల నుంచి దోచుకుంటున్నారు; కావలసిన తుపాకుల్ని బ్రిటిష్ పోలీసు స్టేషన్ల నుంచి పట్టుకుపోతున్నారు. ఎక్కడి నుంచి ఎప్పుడు ఇచ్చి పడతారో తెలియదు. తిరిగి అంతలోనే ఎటు మాయమైపోతారో చెప్పలేము. కొన్ని చోట్ల పన్నుల్ని వసూలుచేసి, రసీదుల్ని ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల కోర్టుల్ని పెట్టి, తీర్పుల్ని చెబుతున్నారు.

ఈ సందర్భాలలో వారు దౌర్జన్యాల్ని చేస్తున్నమాట నిజం. అయితే, వారి దౌర్జన్యాలు బ్రిటన్ దౌర్జన్యాలకు కేవలం బదులు. వారు న్యాయాన్ని కోరారు. న్యాయం లభించలేదు. అశాంతిని పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/26 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/27 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/28 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/29 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/30 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/31 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/32 పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/33


Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.


  1. మొండి గోడ
  2. 1914-1916 సంవత్సరాల మధ్య టర్కీ సేనలు రెండు సార్లు సూయజ్ కాల్వ మీద దండెత్తినాయి.
  3. హెర్జల్ 1904లో మరణించాడు.
  4. అంటే, అప్పటిలో రష్యా పరిపాలన కిందవున్న పోలెండ్ రాజ్యభాగంలో.
  5. చివరికి ఈ ఏర్పాటులలో ఏదీ నిలవలేదు. డమాస్కస్​కురాజుగా ప్రకటించిన కొన్ని మాసాలకే ఫ్రెంచివారు ఫైజల్​ను అక్కడ నుంచి తరిమివేశారు. అంతట అతడు తన అన్న అబ్దుల్లా బదులు ఇరాక్​కు రాజు అయ్యాడు. వాహబీల నాయకుడైన ఇబిన్​సాద్, హెడ్ జాజ్ మీద దండెత్తి వెళ్ళి, హుస్సేన్​నూ, అతడి జ్యేష్ఠ పుత్రుడు ఆలీని తొలిగించి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు.
  6. దీన్ని గురించిన వివరాలు పై ప్రకరణలో