వివరణము

3. దౌలతు - ప్రాభవము.

4. నరకము - పానపాత్ర

6. కైఖుస్రువు - కయానీ వంశీయుఁడైన ఒక సుప్రసిద్ధ పాదుషా.

8. మూసాస్వేతహస్త ప్రభల్ - మూసాప్రవక్త (Moses) చేతులకు తెల్లకుష్టువు పొడలుండెననియు, అవి చాల రమ్యముగ నుండినవనియు చెప్పుదురు. కొమ్మలలో మూసా చేతులవలె పూలు పూచెనని భావము.

మునాది - రేపుమాపులు మసీదునందు గొంతెత్తి దైవప్రార్థన చేయునతఁడు.

13. రాగవతి - ఇదియొక పూలమొక్క; దీనిని ఇంగ్లీషులో Tulip అని అందురు.

14. బహురాముగోరి - పూర్వ పారసీకరాజు; గోర్ అనఁగా అడవి గాడిద, అతఁడు అడవి గాడిదలను వేఁటాడుచుండినందువలన ఆ పేరు వచ్చినది. గోర్ ను పట్టినయతఁడు గోర్ లో పట్టుపడెను. అని చమత్కారము. ఇచ్చట గోర్ అను పదము శ్లేషింపఁబడినది గోర్ అనఁగా సమాధియనియు అర్థము గలదు.

15. వజీరు - మంత్రి.

19. నీలకాంత - ఇది యొక పూలమొక్క. పారసీలో `బనఫ్'షా' అనియు ఇంగ్లీషులో Vioulet అనియు పేర్కొందురు. 23. బుల్బులి - వసంత ఋతువున పాడుచుండు ఒక చిన్న పిట్ట. ఆకారమునందు కాకపోయినను కూతయందు, కవులచే వర్ణింపఁబడుటయందు అది మన కోయిలకు సరిపోవును.

నీరక్తాస్యముల్- నెత్తురులేక పాలిపోయిన మొగములు.

26. నమలు - సంవత్సరములు

27. సాఖి - పాత్రవాహిక

28. ద్రాక్షామణి ముద్దుకూఁతురు - ద్రాక్షాసవము

41. మహమ్మూదు - మహమ్మదుగజ్నవి. ఈతని రాజ్యకాలమున పారసీకదేశము సకల భోగభాగ్యముల నోలలాడుచుండినది. ఇతఁడు వాఙ్మయ పోషకుఁడు. సోమనాథ దేవాలయమును ఈతఁడే విధ్వంస మొనర్చెను.

దావీదు - ఈతఁడు యాకూబు పుత్రుఁడు. సుప్రసిద్ధుఁడైన గాయకుఁడు; బైబిలులోని (Psalms) కీర్తనలు రచించెను.

44. కౌసరు - స్వర్గమును ప్రవహించు తేనె వాఁక.

45. జంషీదు పాత్రము - ఈ పాత్రములో చూచిన భూత భవిష్య ద్వర్తమాన కాలములు దెలియవచ్చును. ఇది జంషీడను పూర్వపారసీక ప్రభువు వద్ద మండెనని ప్రతీతి.

46. నెలవంకయుచ్చులు - సాఖినొసలు నెలవంక. ముంగురులు అది పన్నిన ఉచ్చులు. ఆ ఉచ్చులలో (ఖయ్యాము) హృదయు పట్టుబడియున్నది. అక్కరలేనిదే ఎవడు గాని తమాషాకు ఉచ్చులలో చేయిపెట్టడు. నా హృదయము వానిలో చిక్కుపడి ఉన్నది. గావున దానిని ఓదార్చుటకు నేను చేయివేసితిని. నీవు బెదరించుట యెందుకు అని చమత్కారము.

53. చిత్రదీపము - మాజిక్ ల్యాంట్రన్. 56. అణుజు - డేగ.

68. ఉచ్చశని - ఇచ్చట ఉచ్చశనియనఁగా తులాశనికాఁడు గ్రహకక్ష్యావృత్తములలో శనికక్ష్యావృత్తము చాలయొత్తున నుండును. ఒక రాశిని చంద్రుఁడు షుమారు రెండున్నర దినములో దాఁటుచుండగా, ఆ రాశినే శని దాఁటుటకు రెండున్నర సంవత్సరము పట్టును. ఇందువల్లనే శశి కక్ష్యావృత్తము యొక్క వైశాల్యము మనకు బోధపడును.

69. బాగదాదు - బల్భ - ఇవి పారసీకములోని పట్టణములు. బాగదాదు ఉమయ్యద్ వంశీయ కలీఫాలకు ముఖ్యపట్టణము, బల్ఖయందు ఖయ్యాము తన బాల్యము గడపెను.

82. జుహిదీ - భక్తుఁడు

97. ఇరాముతోఁట - పారసీకుల నందనవనము.

103. అంగూరురసము - ద్రాక్షాసవము.

107. రుస్తుముజాలు - జాలుకుమారుఁడైన రుస్తుము - ఈతఁడు భీముని వంటి బలశాలి.

తాయి - హాతీంతాయి - ఇతఁడు గొప్పదాత; అతిథి సత్కారమునందు పేరుపడసినవాఁడు.

111. పావులు - ఆటకాయలు.

112. పటాలయము - డేరా.

119. ఫరీదూన్ - పూర్వ పారసీక ప్రభువు.

దరిబేసి - దరిద్రుఁడు. ఒక తెగ ఫకీరు.

122. ఇటికలు - సారాయి బుంగలపయి ఇటికరాళ్ళు మూతపెట్టు ఆచారము పారసీక దేశమున సామాన్యమై యుండినది.