1 వానదేముడా

—అనాది యని పరిగణంపబడే వేదవాఙ్మయంలోనే ఎన్నో ఋక్కులు పంటలను కీర్తిస్తున్నవి. సుజలమూ సుఫలమూ సస్యశ్యామలమూ అయిన భారతావనిలో వ్యవసాయమే నిత్యపరిశ్రమా జీవనాధారమున్నూను. అందువల్లనే,

వానల్లు కురవాలి వానదేముడా
వరిచేలు పండాలి వానదేముడా
నల్లాని మేఘాలు వానదేముడా
చల్లంగ కురవాలి వానదేముడా
చేలన్ని నిండాలి వానదేముడా
మూనాలు యెదగాలి వానదేముడా
యెన్నులు వెయ్యాలి వానదేముడా
పన్నుగ సేలన్ని వానదేముడా
పంటల్లు పండాలి వానదేముడా
భాగ్యాలు నింపాలి వానదేముడా
పండుగలు సేత్తాము వానదేముడా
మావూరి చెరువైన వానదేముడా
ముంచెత్తి పోవాలి వానదేముడా
కప్పలకు పెళ్లి వానదేముడా
గొప్పగ సెయ్యాలి వానదేముడా

అని ప్రార్థిస్తారు. జనపదాలలోని జనులందరూ. చల్లగా కురవవాలెసట వానదేవుడు మొనలు యెదగాలి, వెన్నులు వెయ్యాలి. చండదిగ్వేదండతుండని భాఖండ వారి ధారలు కవులకువలె కర్షకులకు అక్కరకురావు. చెరువులు ముంచెత్తిననే, కప్పలకు పెళ్లిళ్లు భోరుకలంగిననే—భాగ్యాలు నిండగలవు.