పరమయోగి విలాసము/సప్తమాశ్వాసము
పరమయోగివిలాసము.
సప్తమాశ్వాసము.
హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశారికాసారముఖ్యభక్తాళి
వనమాలి! యవధారు వరదానశీలి!
ఆసేయు భాగవతార్చనంబునకు
శ్రీసతీవిభుఁ డైన శ్రీరంగశాయి
మెచ్చి రిక్కలతేజిమీఁద సొంపారు
లచ్చితోఁ గూడ నుల్లము పల్లవింప
నారూఢుఁ డగుచుఁ దా నలపూజ చూడఁ
గోరి నిత్యులుఁ బరాంకుశయోగిముఖులు
జలజసంభవపాకశాసనాదులును
గొలువ నభోవీథిఁ గొని యేగుదెంచి
సరభసగతితోడ శరధిచెంగటికి
నరుదెంచి గరుడవాహన మంత నిలిపి
కలిమిపూబోఁడిమొగంబు నెత్తమ్మి
మెలపునం జూపుతుమ్మెద లెదుర్కొనఁగఁ
దనభక్తవరుఁ బరాంతకుఁ గేలఁ జూపి
యనియె నెయ్యమును దియ్యమును రెట్టింప
నాచెంత నొప్పు మహాటవిలోనఁ
గాచి పాంథులచేతఁ గలవెల్ల దోచి
సతతంబు వైష్ణవసాహస్రమునకుఁ
గృతనిష్ఠతో నారగింపంగఁ జేసి
మరికానితనకూర్శి మగువయుం దాను
దెరవ భుజింపఁ డేతెఱఁగుననైనఁ
పరకాలుఁ డనుపేరి పరమభాగవతుఁ
డరయ మిక్కిలి నాకు నాత్మభక్తుండు
ఎడపక యిట్లు పెక్కేండ్లనుండియును
నడుపుచునుండు వైష్ణవపూజనంబు
వాఁడువో కంటె? యెవ్వరు తెరువరులు
నేఁడు రాకున్న నూనినచింతతోడ
మదిలోన నెప్పుడు మద్భక్తపూజ
వదలంగ లేక యవ్వల ఖిన్నుఁ డగుచుఁ
గొమ్మ యాపెనురావికొమ్మలమీఁది
కిమ్ముల భటుల నెక్కించి యామీఁదఁ
గడుగోపమున మోవి గంపింప హరిగె
పుడమిపై నూఁది మూఁపున వాలు సేర్చి
తెరువున నెవ్వ రేతెంతురో యనుచు
సురగక నెదురుచూచుచు నున్నవాఁడు
కనుఁగొన మత్పూజకంటె మద్భక్త
జనులకుఁ జేయుపూజనలే ప్రియంబు
లటుగాన నీవైష్ణవాగ్రణి నిత్య
మిటు సేయుపూజకు నేను మెచ్చితిని
అతనిమనోరథం బంతయు మనము
హితమతితోడ నేఁ డీడేర్పవలయు
నని వైనతేయుని హయముఁ గావించి
యెనయ నిత్యుల నరాకృతులఁ గావించి
తనదైనయాజ్ఞచేఁ దక్కినవారు
మనుజభావము నొంది మహిఁ గొల్చి నడువ
హేమగర్భునిఁ బురోహితునిఁ గావించి
తామిరువురు మర్త్యదంపతు లగుచు
నగణితసకలభూషాన్వితమూర్తు
లగుచుఁ దత్కపటహయంబుపై నెక్కి
పసిఁడివింజామరల్ బంగారుగొడుగు
లసమానమణిమయహైమపాత్రములు
మొదలైనసిరులచే మొనసి యెంతయును
బదియాఱువన్నెలం బరఁగుతామరలు
గలిగి యేతెంచుగంగాప్రవాహంబు
చెలువునఁ దనదైనసేన యేతేర
నాచేర్వ భటులతో నలపరాంతకుఁడు
గాచినత్రోవచక్కటి కేగునపుడు
మును రావి నెక్కి యిమ్ములనుండి యనువు
గనుఁగొను నలపరకాలకింకరులు
పొలయుకంజాప్తదీప్తుల కెంతె మాఱు
మలయుతేజములఁ బల్మరుఁ దళ్లుకొనుచు
ననతిదూరంబున నావచ్చుసేనఁ
గనుఁగొని పరకాలుఁ గాంచి యిట్లనిరి
మునుకొని యొకపెనుమూఁక యేతెంచె
వెనుక నెన్నడు కన్న విన్నది కాదు
మదిఁ గొంకు లేకయే మఱి చాలు గట్టి
యదె చేరవచ్చుచున్నది మహాసేన
యననేల పలుమాట లంతయు నెంత
ధనముకుప్పది యొకింతయుఁ బొల్లులేదు
మనము భాగవతసమర్చనం బనిశ
మొనరింప నందులో నొకసొమ్మె చాలు
నన విని మోదించి యరిదండధరుఁడు
తనలోన నలరుసంతస మిగురొత్త
ఘనత భాగవతకైంకర్య మీడేరె
నని వాలు జళిపించి యందంద యాడి
తనయొద్దిభటులనందఱ మూఁడుమూఁక
లొనరించి చనుదెంచుచున్నట్టివారి
వెనుక ముందర నెడవేచి లావేచి
గొనకొని తుండించుకొని కొట్టుఁ డనుచు
బనిచి కొందఱువీరభటులునుం దాను
ననిమొనగా నిల్చి యాయత్తపడుచుఁ
దుదలేని తమిఁ ద్రోవఁ దొలఁగి లోఁగడఁక
పొదలఁ బెన్పొదలచాడ్పునఁ బొంచియుండి
చక్కుల నున్నభూజము లెక్కి కొంద
ఱిక్కువ చూపట్ట నీలలు వెట్టఁ
దవిలి కొందఱు వచ్చుదళముల దళము
చెవిసోఁకఁ గడనుండి చేబుఱ్ఱ లిడఁగ
నటవచ్చువారు డాయఁగవచ్చి రనుచు
దటముల రాలు కొందఱు పోటు కిడఁగ
పరకాలుఁ డప్పు డాపరసేన కనుమ
సొరిది నొక్కట వడిం జొచ్చి రానిచ్చి
తోరమై చీమకు దూరంగరాక
కారుక్రమ్ముచుఁ జీండ్రుగలమొరపముల
జీబుకొల్పుచుఁ దమ్మచిట్టంబు గట్టి
గాబకోరిందలఁ గడుదట్టమైన
యొడిపికట్టకు వంక నొకవంక డిగ్గి
కడు నేమరిల సందుకట్టుగాఁ జూచి
యరియు నందకమును నంది యేతెంచు
హరినాఁగ హరిగేయు నడిదంబు వూని
పిడుగు వ్రాలినమాడ్కి పెళపెళ నార్చి
పొడు పొడు పొడుఁ డంచు పోనీకుఁ డనుచు
విడు విడు విడుఁ డండు వ్రేయుండ యనుచు
గడ గడ గడ దిశల్ కంపింపఁ బలికి
బలువైన పెనుముచ్చుబంటులు దానుఁ
బిలపిలం జనుదెంచి భీషణాకృతిని
యలమి కుయ్యకుఁడు కుయ్యకుఁ డంచుఁ బట్టి
బలువిడి గద్దించి పటుతరలీలఁ
బట్టుపుట్టంబులుఁ బసిఁడిజాళియలుఁ
బెట్టెలుఁ బసిఁడికొప్పెరలు సొమ్ములును
బరిమళంబులుఁ బట్టుబట్టలు మంచి
హరులు జల్లెడలును నాదిగాఁ గలుగు
తగువస్తువులఁ గన్ను దనియంగదోచి
తెగడుచుం గడఁ దెప్పదేలి యామీఁదఁ
బరకాలుఁ డప్పు డుద్భటవృత్తి నెదుట
హరి నెక్కి వచ్చు నయ్యాదిదంపతులఁ
గని చేరఁ జని తదంగంబుల నున్న
కనకభూషలనెల్లఁ గైకొని యపుడు
పోలించి చూచి యాపుండరీకాక్షు
వ్రేలనున్నట్టి పవిత్రంబుఁ గాంచి
యిది నాకుఁ బోవిడనేటికి నేఁడు
తుది నొకభాగవతునకైన వచ్చు
నని వ్రేలియంగుళీయకము రాఁదిగియఁ
బెనఁగి రాకుండినఁ బెద్దయుం గనలి
యరిమురి గద్దించి యాయుంగరంబు
కరచి రాఁదిగిచిన కలియనో యనుచు
హరి యానతిచ్చిన నది కారణమున
నరి యమునకుఁ గలి యనునామ మలరె
అప్పు డాసొమ్ములు నయ్యుంగరంబు
నొప్పారుచుండెడు నొకపెట్టెఁ బెట్టి
యెత్తఁబోయిన నిందిరేశుని యాజ్ఞ
నెత్తరాకున్నఁ బెల్లెసఁగుకోపమున
నత్తఱి మఱియు భృత్యాళితోఁ గూడి
యెత్తిన నెంతైన నెత్తరాకున్నఁ
గాలునిగతిఁ బరకాలుండు కినుక
నూలుకొనంగఁ గన్నులు జేవుఱింప
నద్దిరా యెంతమాయావి వీఁ డనుచు
గద్దించి కదిసి ముంగలనున్నయట్టి
భూసురవేషి నంభోజసంభవుని
డాసికంఠమున ఖడ్గంబు [1]దొక్కించి
యిటుచూచి యాపెట్టె యెత్తరాకుండ
మటమాయలాడ నీమంత్రించినట్టి
మంత్రంబు మాని క్రమ్మఱ నెత్తవచ్చు
మంత్రంబు చెప్పెదో మడియఁ గొట్టుదునొ
యన విని బెగడొంది యా పెండ్లి యొజ్జ
యనియె నేర్పున నసహాయశూరునకుఁ
దా నేమి యెఱుఁగ నోతండ్రి! గుఱ్ఱంబు
మైనున్న యామహామాయావికాని
యన విని యతని డాయగ నేగి యట్ల
యనిన రంగేశ్యరుం డలఁతినవ్వుచును
ఇప్పుడు నీకోరు నీమంత్రవరముఁ
జెప్పెద వేవేగఁ జేరర మ్మనుచుఁ
బరకాలు మస్తంబుపైఁ గేలు సాఁచి
కరమర్థి దక్షిణకర్ణంబులోన
భావింప సంసారభవవార్ధి మునుఁగు
జీవుల నొకదరిఁ జేర్చునావనుచు
ననఘసన్నుత మైన యష్టాక్షరంబు
నొనర సాంగంబుగా నుపదేశ మొసఁగి
యకలంకకంకణహారకేయూర
మకరకుండలయుతమహితవిగ్రహము
పంచాయుధోజ్జ్వలబాహుదండములఁ
బంచాస్త్రు మించినభావంబు గలిగి
తగరమాగోదానితంబినీసహితుఁ
డగుచు నండజనాయకారూఢుఁ డగుచు
నిజరూపధరులైన నిత్యులు ముక్తు
లజశంకరాదులు నందంద కొలువ
నరుదారఁ బ్రత్యక్ష మగుచుఁ దన్మంత్ర
వరవాచ్యమైన దివ్యస్వరూపంబు
నతనికిఁ బొడచూప నాదివ్యమూర్తిఁ
బ్రతిలేనివేడుకం బరకాలయోగి
సేవించి యందునం జిక్కి సన్నుతులు
గావించి భావించి కడుసంతసించి
కన్నులవేడుకఁ గన్నీరు జాఱఁ
గ్రన్నన మైదీఁగ గఱుపారఁ జెలఁగి
ధరజాలెతోఁగూడ ధన మిచ్చినట్లె
యరవిందనాభుఁ డీయష్టాక్షరమున
సవిభూతికముగ నిజస్వరూపంబుఁ
బ్రవిమలగతి నాకుఁ బ్రకటించె ననుచుఁ
బదిపద్యములఁ జెప్పి ప్రమదంబుతోడఁ
జదురుఁడై మఱి సాష్టశతధామపతులఁ
బంకజోదరులఁ దొంబదినూఱుపాట
నంకించి మఱి నూటయఱువదిపాట
నర్ణవశయను దశావతారముల
వర్ణించి యాతరువాతఁ బదింట
ఘనవిషజ్వాలలు గ్రక్కు సర్పంబు
నొనఁగూడి యొకయింట నుండుచందమునఁ
గడలినెన్నడుమ భగ్నం బైనయోడ
వడఁకుచుండెడి యోడవానిచందమున
పడిఁ గోసి పాఱుప్రవాహంబుచెంతఁ
బుడమినుండెడు మహాభూజంబుసరణి
నిడియంగఁ దుదమొద లేర్చు కాష్టంబు
నడుమఁ జీమలపంక్తి నడికెడుకరణి
నెడపకపాఱు నట్టేటిలోఁ జిక్కి
కడుభీతి నొందు సృగాలంబుభాతి
తాపత్రయోర్మిసంతతుల నేపారు
నాపూర్ణసంసార మనుపయోరాశి
లోలత మునిఁగి తేలుచు నున్న నన్నుఁ
బాలించి దరిఁజేర్చు పరమేశ! యనుచు
నీలీల నొప్పు వేయి న్నెనుబదియు
నాలుగుపాటల నవరసస్ఫూర్తి
నెక్కొని తనలోన నిండారి పొంగి
వెక్కసం బగుభక్తి వెలిమించె ననఁగ
సిరివరునకు మహాశ్రీవచనాఖ్యఁ
బరఁగుప్రబంధ మర్పణముఁ గావించి
మున్ను గైకొనినసొమ్ములు నంబరములు
నన్నియుఁ దెచ్చి శ్రీహరికి నిందిరకు
నతనిభక్తులకు సమర్పించి పెక్కు
నుతులు గావింప సన్మునిలోకవిభుని?
ఆరంగపతి మెచ్చి యాళ్వారు నపుడు
చేరంగఁ బిలిచి మచ్చికఁ గౌఁగిలించి
యీవనజాత్మజుం డీశేంద్రముఖులుఁ
గావించుపూజలు గణుతించిచూడ
నీవు గావించు మన్నిజభక్తపూజ
కావగింజంతకు నవి యీడు గావు
కడపట యోగివర్గంబు నామీఁద
నుడుగక కావింపుచున్న యర్చనలు
యోజమై నీసేయుచున్న భాగవత
పూజతోడను సరిపోల్పంగఁ దగునె?
భాగవతోత్తమ! పరమప్రపన్న!
యోగికులోత్తంస! యురుభక్తినిరత!
యనుచు నిర్జరముఖ్యు లాశ్చర్య మంద
జనులెల్ల నన్ను నేసరవిఁ గొల్చెదరొ
యాలీల నినుఁ గొల్తు రఖిలవైష్ణవులు
నీలీల మీరల నీపదువురను
గొలువనివాఁడు భక్తుఁడు గాఁడు మిమ్ముఁ
గొలిచినవాఁడె భక్తుఁడు మాకు ననుచు
వరమిచ్చి కడు గారవంబు దైవాఱఁ
బరకాలు నీక్షించి పలికె వెండియును
గ్రమమున నీచేతఁ గరుణతో నింక
నమితకైంకర్యంబు లవధరించెదము
అనుచు నానతి యిచ్చి యతనిఁ దోకొనుచుఁ
దనపురంబునకు నత్తఱి నేగుదెంచి
సిరితోడ నెనలేని సిరితోడఁగూడ
నురగేంద్రశాయియై యుండె నుండుటయుఁ
గొన్నిదినంబు లాకుసుమాస్త్రుతండ్రి
చెన్నుఁ గన్నారంగ సేవింపుచుండె
నటుమీఁదఁ బరకాలుఁ డావేంకటాద్రి
కటకనివాసుని కథలుఁ జిత్రములు
సరసభావంబులుం జక్కందనములు
సిరులు నొయ్యారంబు చెలువంబు కలిమి
నటనలు నునికియు నయగారిపసలు
నటియింపు నీగి విన్నాణంపువగలు
ప్రాయంబు నెఱి ప్రతాపంబు రాజసము
సోయగంబునుఁ గడుఁ జోద్యంబు గాఁగఁ
గొనకొని యలశఠకోపాదికృతులు
విని విని క్రొత్తగా వేనోళ్ళఁ బొగడి
పలుమఱు విని నాగపతి శైలపతికి
వలచి యాతని జూడవలయు నటంచు
నలఘుమౌనీంద్రుల యనుమతిఁ గూడఁ
జెలఁగి శ్రీరంగ రాజీవాక్షుచేత
ననిపించుకొని తడయక మున్ను గొలిచి
చనుదెంచు తనభృత్యజనమునుం దాను
సేవించువారి కిచ్చినదుర్జయములు
కావేరి కన నొప్పు కావేరి దాఁటి
శ్రీనిధి లోకవశీకరదేహు
శ్రీనివాసుని భక్తి సేవించుతమిని
నగరశైలములుఁ గాననసమూహములు
నగసంతతులుఁ బెక్కునదులునుం గడచి
యయనంబు నందు జాగరి రెండు మూడు
పయనంబు లవి యొక్కపయనంబు గాఁగ
నరుగుచుఁ గాంచికి ననతిదూరమున
నరవిందకోకబకాకులం బగుచు
మేలిమి చల్లదెమ్మెరలతో మింటి
పాలేరు నవ్వెడి పాలేరు చేరి
యెడగువ్వ తలచూపనీకుండ నుట్టి
పడు నెండవడి బెట్టువడిఁ దట్టుపడుచు
శ్రమమార నానదీజలములఁ గ్రోలి
కొమరారునయ్యేటికురఁగట నొప్పు
పువ్వుల నెత్తావిఁ బొదలు తేనియల
తువ్వరవడునెల దోఁటలో నిలిచి
బడలి యాఁకటఁ జుట్టుపట్టులఁ బల్లె
[2]బడుసర గానక పరగెడిత్రోవ
మఱిచూడ మిట్టాడు మానిసి లేక
మెఱయువేఁడిమి మిటమిట నెండ గాయఁ
దనయుఁ డాకలిగొనఁ దాఁ జూడలేని
జననికైవడి లోకజననీవిభుండు
ఆవేళ శ్రీకాంచికాధీశుఁ డైన
భావజాతునితండ్రి భక్తవత్సలుఁడు
హరియష్టభుజకరుండును నృసింహుండు
కరుణించి భక్తునాఁకలిఁ దీర్పఁబూని
నరపగడ్డంబును నరములమెడయు
కరమువ్రేలెడు [3]పిడికడు జన్నిదములు
నొలయువెన్నెలనవ్వు నూర్ధ్వపుండ్రంబు
మలయునిగ్గుల తిరుమణివడంబులును
వ్రాలినబొమలు లోవంగినవీఁపు
వ్రేలాడుతోళ్లతో వెలయునెమ్మేను
నదరుడెందము లాలనసలారుచున్న
వదనంబు వడవడవడఁకునౌదలయు
వదలుపింజల నిడువాలుధోవతియు
నొదవిన వల కేలి యూతఁకోలయును
బోలఁగాఁ జుట్టిన పొత్తిపాగయును
దూలగట్టిన వెడతోపుపచ్చడము
నంకెడా కేలిపంచాంగంబు ముష్టి
చంక వ్రేలెడుతాళి చలిదిమూటయును
దగనలవడఁ జేరి తనుజూచువారు
మొగిద్వాపరమునాఁటి ముసలి వీఁ డనఁగఁ
దడబాటు నడల నత్తఱి వచ్చి వచ్చి
బడలినగతి గురుపదము లెన్నుచును
ఉరుభక్తి చెంతవా రొకయింత వినఁగ
సరవిలోద్వయ మనుసంధించుకొనుచు
నిద్ధానురాగుఁడై యిట్లు భాగవత
వృద్ధభావముఁ దాల్చి వేదవేద్యుండు
నాతోఁటలోనికి నరుదెంచి సుమిత
చూతంబుక్రింద నిల్చుట విలోకించి
పరకాలుఁ డప్పు డాపరమవైష్ణవుని
చరణాబ్జముల చక్కఁ జాగిలి వ్రాలి
యల కేలిముష్టి పంచాంగంబు గాఁగఁ
దెలిసి నా కిప్పుడు తిథివారసరణి
దినయోగములు తేటతెల్లంబు గాఁగ
ననయంబుఁ బరికించి యానతీవలయుఁ
గడుదవ్వు నడచి యాఁకలిగొని యెండ
వడఁ జెందినాఁడ దేవరదాసునకును
దిరిచి మీ రిప్పుడు తెచ్చినచంక
చరిదిలో నింత ప్రసాదింపవలయు
నన నవ్వి యావైష్ణవాగ్రణి కరుణ
దనరార నాపరాంతకున కిట్లనియె
శ్రీవిష్ణువారంబు శ్రీవిష్ణుతార
శ్రీవిష్ణుతిథియ సందేహింపవలదు
వాకొన నీకు సర్వగ్రహంబులును
నేకాదశమునందె యెసగియున్నారు
వాకొననేల సర్వము భద్ర మింక
నీకోర్కు లీడేరు నీకోరినట్ల
పనుపడ నీకు నీభటులకుఁ జలిది
పెనువొంద నేఁ బంచిపెట్టెద ననుచుఁ
దెలివెండిరేకుల తేటగీలించు
పొలుపారు నునుపోఁకపొత్తిలోపలను
సలలితదివ్యాతిసౌరభభూజ
ఫలచిత్రరుచులఁ జూపట్టి యెంతయును
నమృతాంశుమీఁది చాయల గేలికొనుచు
నమృతమయం బైనయట్టియాచలిది
పరికరములఁ బెనుపడునూరుగాయ
పరిమళంబుల వారిబడలిక ల్వాయ
నమరవర్గమునకు నమృతంబుఁ బెట్టు
కమలాక్షుగతి హస్తకమలంబుఁ [4]దొడికి
పరకాలునకు మున్ను భక్తి దైవాఱఁ
గరమున నొకపిడికడు ప్రసాదించి
కడమతద్భటులకుఁ గ్రమమేరుపడఁగఁ
పిడికెడు పిడికెడు పెట్టెఁ బెట్టుటయు
నలసుధారసపాను లైనదేవతల
తెలివి నందఱుఁ బరితృప్తులై రపుడు
పరకాలుఁ డలరి యా భక్తవత్సలుని
చరణపద్మములకుఁ జాగిలి మ్రొక్కి
యెయ్యది మీనామ మెందుండి యిటకు
నయ్య! వేంచేసితి రానతిం డనఁగ
ననిశంబు కాంచికి నపరభాగమున
నునికిగా నెలకొని యుండుదు నేను
ననుసాష్టభుజకర నరసింహుఁ డందు
రనుచు నంతర్హితుం డయ్యె నాకరణిఁ
గని పరకాలుఁ డక్కజ మంది యితఁడు
ననుఁ బ్రోవవచ్చిన నలినలోచనుఁడు
కాని వేఱొక్కఁడు గాఁ డంచుఁ బొగడి
యానందబాష్పాకులాక్షుఁడై [5]పొంగి
కరుణ నాదైనయాఁకలి చూడలేక
యరుదెంచి నా కమృతాన్నంబు వెట్టెఁ
దననామ మడిగిన దయతోడ నవ్వి
పునుగ కెప్పుడు సాష్టభుజకరుఁ డైన
హతహేమకసిపుండ ననియె నేవేలు
పతఁడె పంచేషు పంచాయుధాబ్జములు
ధరియించి యసురడెందము విదారించి
శిరముఁ జీరిన నరసింహవిగ్రహుఁడు
నతఁడె శ్రీవామనుఁ డతఁడె విష్ణుండు
నతఁడె యాదిమకిటి యగువాఁడు నతఁడె
యతఁడె నాకులదైవ మనునర్థ మొదవఁ
బ్రతిలేని యొకపది పాటచేఁ బాడి
పయనంబుగతి కతిపయదినంబులకు
నయకరం బైన శేషాద్రిచెంగటికిఁ
జని సంతసించి యాశైలరాజంబుఁ
గని శ్రీనివాసునికరణిఁ జూపట్టి
నాయద్రిరాజంబు నారోహణంబు
సేయంగఁ జంకించి చిరభక్తిపరత
మొనయంగఁ దత్పాదమూలంబునందు
ననురక్తి దివసత్రయంబు వసింప
నాసర్వమయుఁడు శేషాచలేశ్వరుఁడు
దాసునిమదిలోనితాత్పర్య మెఱిఁగి
కనకాంఘ్రికింకిణీకనకజాలుండు
ఘనతరోజ్జ్వలదివ్యకనకచేలుండు
ధృతరత్నఝల్లరీదీపితహేతి
తతచిత్రమేఖలాధామాళిధారి
వరదానకటిదేశవర్ణితకరుఁడు
కరపల్లవాగ్రసంగతచక్రధరుఁడు
హారకేయూరభూషాదిధరుండు
చారుమౌక్తికకంఠసరసకంధరుఁడు
తులసికాదామకౌస్తుభవిభాసితుఁడు
వలితవిగ్రహుఁడు శ్రీవత్సలాంఛనుఁడు
ఘటితాలమేలుమంగా [6]వత్సతలుఁడు?
కుటిలనీలాయతకుంతలోజ్జ్వలుఁడు
సరసిజపత్రవిశాలలోచనుఁడు
నిరుపమసాంకవనీరసేచనుఁడు
వరదరస్మితశోభివదనమండలుఁడు
మరకతమాణిక్యమకరకుండలుఁడు
ధారితరత్నచిత్రకలలాటుండు
నీరజమిత్రసన్నిభకిరీటుండు
నగునట్టి శ్రీవేంకటాద్రినాయకుఁడు
జగదేకనాథుఁ డాశత్రుకాలుసకు
బొడకట్టి తనకరముల మేను నిమిరి
వడదేర్చి లాలించి వరదుఁడై పలుక
[7]నావేల్పువేల్పు రెప్పార్పక చూచి
భావించి సేవించి ప్రణుతి గావించి
యా దేవదేవుని యనుమతిఁ గూడ
నాదండ శోభిల్లు నతనిమూర్తులను
సేవించి యాపరజిత్తు క్రమ్మఱను
వేవేగ శ్రీరంగవిభుని సేవింప
నరుగుచు సకలదేశాధినాయకులుఁ
గరమర్థి నిచ్చలుం గానుక లొసఁగు
వరసువర్ణాదిసువస్తువు ల్గొనుచు
సరవి రంగమునకుఁ జనుదెంచె నప్పు
డావేల్పురాయని యడుగుదామరలు
సేవించి ప్రణమిల్లి చిరతరభక్తి
లలిమించువేల్పు నీలపుచందరాల
నలుపారు నల్లసేనపుజంగరాల
నలఘువైభవముల నట రెండుసాల
ములును వంటిల్లును మొదలుగాఁ గలుగు
కావేరినిలయకైంకర్యంబు లాఱు
గావింతు ననుచు సంకల్పంబు చేసి
గట్టిగా సాలయుగ్మము మహానసముఁ
గట్టించి నాల్గవకలుకోటఁ దీర్చ
సవరింప దొరఁకొనుసమయంబునందు
భువి నెన్నఁదగినశిల్పులు [8]ననిశంబు
[9]ఘనులైన మఱి తక్కుఁ గలిగినమేటి
పనులవారల బడి పనులవారలును
పరువడిఁ దమతమపనులకు నమరి
దొరఁకొని సేయంగఁ దొడరునత్తఱిని
బలువుకొండలు రేకబడ నింత మలఁచి
యులువకట్టులువోసి యులు లోలి నాటి
పసలుమించఁగ సూత్ర పట్టినపగిది
విసువక గసివోటు వేయువారలును
గూటంబు లులులుఁ జేకొని యవలీల
గాటంపుకొండ లొక్కట వ్రీలి వ్రాల
ననయంబు వెఱఁ గంది యనిమిషశిల్పి
గని యోటువడుచుండ గనివోటు వైవఁ
గప్పుల దూలముల్ కంబాలు వలుద
చప్పటిరాలు నచ్చంపుబోదియలు
[10]కదరికాద్వారశాఖలు కొణంగెలును
మొదలైన సంపాదములు చిత్రగతులఁ
బడి పనివాండ్రు నిబ్బరమున సన్న
బడియలుపూని సంభ్రమము రెట్టింప
లావునం గదిసి [11]హేలల్ల యటంచు
మేవీది వడి బండ్లమీఁది కెత్తుచును
ఆరీతిఁ బోవనియట్టిదూలములు
చేరి మూఁకలు గట్టి చిట్టెలు గట్టి
యెగదిగరవముల హేలల్ల యనుచు
నగపడి యవి మోచి యరుదెంచి వారు
ధర జలాంతము శిలాంతముగ శోధించి
వరుసలోపల [12]గుండ్రవక్త్రంబు సేసి
యిసుము జల్లియు వైచి యెనయ గట్టించి
వసిబారి మాకున వడిఁ గూరుకొనుచుఁ
జప్పటి గావించి చదురపానంబు
నొప్పుగావించి మై నొక్కొక్కరాయి
వరుస నిల్పుచు రసవర్గంబుతోడ
బెరయించి యిట్టికెపెట్టజల్లియును
సందడి బొక్కలో సందుసందులను
దందడిగొనఁగ బెందడివేయువారు
పొందికలగు రాయి పొందించి వెరుక
సందుదూరకయుండ సంతన సేసి
సూత్రంబులు నాయశుద్ధులు నెఱిఁగి
చిత్రంబుగాఁ బనిఁ జేయించువారు
నగుచు నీగతిఁ గోటయంతయుఁ గట్టి
తగనొక్క యెడ భూమిఁ ద్రవ్వి శోధింప
నందులో నొక్కగుహాంతరసీమ
నిందునిమైకాంతి నెల్లిదం బాడు
చెలువ మొందినయోగిశేఖరుండొప్పు
మలయంగ యోగసమాధితో నుండ
నాలోకలనము సేసి హరిదివ్యసాల
మీలీల యీతని యిరవుమై వచ్చె
నేమిసేయుదు నంచు నిచ్చఁ జింతించి
యామీఁద నొకయుపాయముఁ దలపోసి
యతనిఁ జేరఁగ నేగి యాపరకాలుఁ
డతిభక్తితోడ నిట్లనియె యోగీంద్ర!
పరిపూర్ణహృదయ! యెప్పగిది నిచ్చటికి
నరుగుదెంచితిరి నా కానతీవలయు
నన విని యయ్యోగి యాయోగినాథుఁ
గనుఁగొని ప్రణమిల్లి క్రమ్మఱం బలికె
నెనలేనికమలాలయేశ్వరు నూట
యెనుబదితిరుపతు లేను సేవించి
వచ్చి యిచ్చో నిల్చి వనజాక్షుమీఁది
మచ్చిక యోగసమాధి నున్నాఁడఁ
గ్రమమున నిన్ను నేఁ గనుఁగొంటిఁ గానఁ
గమలాక్షు నిప్పుడ కన్నయ ట్లయ్యె
నని యోగదృష్టిచే నాపరకాలు
నునికిఁ గన్గొని వెండియును జాఁగి మ్రొక్కె
మ్రొక్కినఁ బరకాలమునికులోత్తంసుఁ
డక్కజపడుచుండ నతని కిట్లనియెఁ
దుహినాద్రిపై వరదుని నరసింహు
మహితాష్టబాహు నిర్మలగుహావాసి
వేడుకనీవు సేవించితే యతఁడు
తోడ మాటాడు భక్తులఁ గూడి యెపుడు
నన విని వెఱఁగంది యాయోగి మగుడ
ననియెఁ బ్రేముడిమీఱ నరిశమనునకు
నతఁడు నాతో మాటలాడునా యనిన
నతఁడు నీతో మాటలాడ నాపూట
యని యోగి తుహినాద్రి కనిచిననతఁడుఁ
జని హైమశైలాగ్రసదను నృసింహుఁ
గని మ్రొక్క మానవకరివైరి యపుడు
తనభక్తుమాట తథ్యము సేయవలసి
యాయోగితో మాటలాడ నమ్మౌని
యాయిందిరేశుఁ బాయకయుండె నంతఁ
బరకాలుఁ డాకట్టు [13]ప్రాకార మెల్ల
నరుదారఁ గట్టించి యంతటిమీఁద
ముదము నఖిలమైన మూడవకోట
యదియునుంగట్టింప నాత్మఁదలంచి
యేమిసేయుదు నింక నీసాలమునకు
హేమంబు చాలంగ నెటనుండి వచ్చు
నని తనయొద్ద డాయఁగఁ గొల్చియున్న
యనుపములైన యేకాంగవీరులను
రాయదొంగలఁ చౌర్యరసికశేఖరుల
నాయెడం బిల్చి రహస్యంబునందుఁ
బన్ని యీమూడవ ప్రాసాదమింక
నెన్నిలాగులనైన నీడేర్పవలయు
నలవిమాలిన దీనికై యిటమీఁద
బలువైనధనము సంపాదింపవలయుఁ
గాచిదొంగిలితేరఁ గలరె వేవేగ
మీచేత నగునె యిమ్మెయి విచారంబు?
అన విని యనుచరు లాపరాంతకున
కనిరి నేర్పులును సాహసములు మెఱయ
భావించిచూడ నీబంటులసత్త్వ
మీవెఱుంగవె విను మిన్నియు నేల
వదలక మండలేశ్వరునైనఁ గాఁచి
కొదుకక తెరువాటు గొట్టనోపుదుము
పగలు చూచినసొమ్ము పగలు తేఁగలము
మిగిలినకడిమినెమ్మెయిఁ దివ్వరాని
తాలముల్ గడియ లుధ్ధతి మోప వ్రీలి
వ్రాలించు పెక్కైనబదనిక ల్గలవు
పాతాళమున నున్న బలువిధినైన
జాతిగాఁ జూపునంజనములు గలవు
మహి నెరునైన రిమ్మల నిద్రపుచ్చు
మహిమలం గలచొక్కుమందులుం గలవు
ఇత్తఱి నిరుచేయి నెఱుఁగరాకుండఁ
గత్తెరసొమ్ములు గత్తిరింపుదుము
ఇలలోన నొండొరు నెఱుఁగరాకుండ
గలయ నామడయైనఁ గన్నపెట్టుదుము
అని యిట్లు తమదుసాహసములు చెప్పి
యనిరి వెండియు శాత్రవాంతకుతోడఁ
గడుచిత్రమై తూర్పుకడలికి చక్కఁ
బడమటి యీనాగపట్టణంబునను
అసమాన మగు పదియాఱువన్నియల
పసిఁడిచే జైనులు ప్రమదంబుతోడ
గొప్పగాఁ దమకులగురునిఁ జేయించి
యొప్పుగా నొకగుడియును నభేద్యముగఁ
గట్టించి యందు నాకనకంపుబ్రతిమఁ
బెట్టినా రేమి చెప్పెడిది! యాప్రతిమ
యబ్బెనా మన పనులన్నియుఁ దామె
గొబ్బున నీడేరుఁ గొదలేక యనినఁ
గడు సంతసిలి పరకాలుఁ డాభటుల
నెడపక కౌఁగిట నిరియంగఁ జేర్చి
తాను వారలు సౌగతప్రకారములు
పూని వేవేగఁ దత్పురమున కరిగి
యచ్చట నున్న బౌద్ధాచార్యవసతిఁ
జొచ్చి యంతయుఁ బారఁజూచి యెల్లెడను
దలుపు వాకిలియును ద్వారబంధమును
దెలియరాకుండ నెంతే చిత్రగతుల
నదుకు లేకుండ నేకాండంబు గాఁగ
నొదవ సంతనసేసి యున్న యాగుడికి
నచ్చుగా లోని హేమాకృతిఁ జూడ
వచ్చువారికిఁ గనవచ్చుమాత్రంబె
కడుఁ జిన్నసోరణ కంతగావించి
యడరంగఁ బరకాలుఁ డచ్చోటి కరిగి
యాలోనిబింబంబు నాక్రంతగుండ
నాలోకనము సేసి యాత్మఁ జింతించి
తనబంటులును దానుఁ దడయక వెడలి
చనుదెంచి యాపురస్థలి టెంకిఁ జేసి
యనుచరవర్గంబు ననురక్తిఁ బిలిచి
యనియె నేకాంతంబునం దొక్కనాఁడు
పోలింపఁ గుచ్చితములకెల్ల మిగుల
నాలయం బైన యీయాలయంబిప్పు
డేదెసఁ దుదమొద లెఱుఁగంగరాక
భేదింపరాక యభేద్యమైనదియుఁ
గటకటా! భూమిలోఁ గంటిమి కాని
యిటువంటిసదనంబు లెందైనఁ గలవె
యేపాపజాతి దా నిది చేసె నొక్కొ
చూపట్ట దింతయుఁ జొరవచ్చుత్రోవ
పనుపడునట్టి యుపాయ మింకేది
యనుచుఁ గొండొకతడ వాత్మఁ జింతించి
క్రచ్చఱదీపాంతరంబున నుండి
వచ్చినయట్టి కువాడివడ్రంగి
యవగడం బైన యీయాలయం బిట్లు
సవరించె నని సవసవ గాఁగ వింటి
నే నెదురఁగఁగల నీసూత్రమహిమ
మానుగా నెఱిఁగి క్రమ్మఱ వత్తు ననుచు
నేవచ్చునందాఁక నిచ్చోట మీర
లేవయావంతయే యెడవీడకుఁడని
ముదమునం దద్వీపమున కేగి యందుఁ
జదురులై పెనుసాధుచందంబుఁ బూని
సారెకు నచటి పంచాణంబువారిఁ
జేరి యయ్యో యని శిర మింత యూఁచి
కడుపెద్ద యైన సౌగతహేమగురుని
గుడి చొచ్చి చోరులు గొంపోయి రకట!
యనుచుఁ గంసాలివా రనిశంబు వినఁగ
ననుచుండుసమయంబునం దొక్కనాఁడు
ఆమేటిగుడిఁ గట్టినట్టి యాశిల్చి
యామాట విని వెఱఁ గంది పొక్కుచును
జిత్రమైనట్టి యాశిఖరంబుమీఁద
సూత్ర మేగతిఁ గాంచి చొచ్చెనో దొంగ
యన విని పరకాలుఁ డరయనివాని
యనువున నతని కిట్లనియె నవ్వుచును
జెలువార గుళ్ళకు శిఖరంబులందుఁ
గలవె సూత్రంబు లాగడములు గాక
యన విని శిల్పి లేదనుటెట్లు శిఖర
మున యేనపో సూత్రమును నిల్పినాఁడ
నిరుచుట్లు శిఖరంబు నేడేడుమార్లు
తిర మొందఁ ద్రిప్పినఁ దివియంగవచ్చు
నన విని మోదించి యరిదండధరుఁడు
చని నిజభటుల కీచందంబు దెలిపి
పనివడి యాయత్తపడి వారుఁ దాను
నొనఁగూడికా క్రమ్ము నొకనాఁటిరాత్రి
గ్రక్కున నరిగి సౌగతగురునిలయ
మెక్కి యాశిఖరంబు నేడేడుమార్లు
త్రిప్పినంతనె యది తెరలినం బట్టి
చప్పుడు సేయక జగతిమై డించి
యాలోనఁ దనచెలి యలిప్రాణనాథు
నాలోని కనిచిన నతఁ డేగి మఱియుఁ
దడయక నంతరాంతరముల నిడిన
గడియలు బీగము ల్గదలింపలేక
యావిధం బెఱిఁగింప నరిదండధరుఁడు
శ్రీవరుఁ దలఁపులోఁ జేర్చి నుతించి
యరుదుమీఱంగ దశావతారములఁ
బరఁగిన శ్రీరంగభర్తపై యాన
నిడినంతలోన నయ్యినుపబీగములు
తడయక గడియలు తముదామె తెఱచెఁ
దెఱచి నమిగు లమోదించి యాబావ
మఱఁది నెన్న డుమ నుమ్మలిక రెట్టింప
నలఁతి నవ్వుచు నిడుపగు పెద్దయినుప
గొలుసు గీల్కొలిపి యాకుహరంబు వెంట
డించినఁ జక్కఁగా డిగ్గి యామేటి
కాంచనరచితసౌగతమూర్తిఁ జూడ
నాసరి మఱియు లోహంబున రాగి
సీసబిచ్చడములఁ జేసియున్నట్టి
సుగతబింబంబు లాశూరు నీక్షించి
బెగడొంది పలికె నభేద్యవిక్రముఁడ!
తముఁ జూడఁగా లోహతనువుల మరయఁ
దమవంకవచ్చు నాదాయంబు గలదె
యదివొ కాంచనమయం బైనట్టిరూప
మదయతం దమ కిడినట్టియన్నంబు
కొమరార జైనులగురువు దా ననుచుఁ
దమనోరు గట్టి యంతయుఁ దానె తినును
దానినే గైకొమ్ము తడయక రత్న
మానితభూషణమయ మైనదాని
ననినఁ దత్కనకబింబాప్త మైనట్టి
ఘనశక్తి బెగడి దిగ్గన మింటి కరిగె
పరకాలు సోదరిపతి యంత బౌద్ధ
గురుహేమబింబంబుఁ గొలుసునం గట్టి
కదలింప నాసన్నఁ గని మీఁదివార
లది యందుకొని యంత నతని గ్రమ్మఱను
అలగొలుసునఁ దొంటియట్ల నెన్నడుమ
బలసి చేఁదుకొనంగఁ బరకాలుమఱఁది
తలదాఁటి చిక్కినఁ దనువు తచ్చిఖర
బిలము పట్టకయున్న బెనఁకువసేయఁ
బరమభాగవతుఁ డాపరకాలుమఱఁది
యరిదండధరున కిట్లనియె నవ్వేళఁ
గనకచేలాంకుకైంకర్య మీడేరె
ననుసంతసమునఁ గాయము పొంగెఁ దనకుఁ
బలుమరు నింత నిర్భంధంబు సేయ
వలవదు శ్రీరంగవరదునిసేవ
యెన్ని చందంబుల నీడేరవలయు
నున్నవిచారంబు లొండేమి వలదు
తను మీర లిచట నిత్తఱి డించిపోవఁ
గనిన బౌద్ధులు మిమ్ముఁ గదిమి చెండాడి
కైంకర్యమునకు విఘ్నము సేయఁదలఁతు
రింకఁ గొంకఁగ నేల నిదె వేగ వచ్చె
నరయ నర్థంబుఁ బ్రాణాభిమానములు
వరుసతో నేలినవారివి గానఁ
బతి నాకు శ్రీరంగఫణిరాజశాయి
యతనివే తనదుప్రాణాభిమానములు
పతికార్యమునకు నై ప్రాణంబు లొసఁగు
నతఁడు సద్గతిఁ గాంచు నని యండ్రు బుధులు
ఒకగువ్వకై తను వొసఁగి రాసుతుఁడు
సకలలోకంబుల సన్నుతిఁ బడసెఁ
బరతత్త్వమునకుఁ గాఁ బ్రాణంబు లొసఁగ
నరయ నందుల భాగ్య మది చెప్ప నేల
తనతలఁ గొట్టి యిత్తఱి నుండనీక
కొనిపొండు వట్టిజాగులు మాని మీరు
అన విని పరకాలుఁ డౌరౌర యనుచు
ననుజాతపతిమాట కందంద మెచ్చి
యోలి నోభాగవతోత్తంస! నీవు
పోలింప నిహపరంబులు చూఱఁగొంటి
వని వాలు గైకొని యతనికంఠంబుఁ
దునిమి యాశిరముఁ బొందుగ గేలఁ బూని
బలువైన యాజైనభర్మరూపంబు
బలువిడి నాగుడిపై నొయ్య డించి
పట్టిమంచపుఁ బెనుపల్లకిమీఁదఁ
బెట్టి ముసుం గిడి పెద్దయు వగచి
శవముఁ గైకొనిపోవుసరవి నామంచ
మవిరలబలవంతు లగువారు మోవఁ
దలలు వీడంగఁ గొందఱు రెండుగడలఁ
బలుదెఱుంగులఁ బాడి పాడి శోకింపఁ
గొందఱు కాష్టము ల్గొని యేగుచుండఁ
గొంద ఱింగలము గైకొని చనుచుండ
నీరీతి భృత్యు లాహేమబింబంబు
దూరంబు గొనిపోవఁ దొఱఁగురక్తమున
మలయుచుఁ జేనున్న మఱఁదిమస్తకము
కలయంగఁ జూచి రక్తముజాడవట్టి
వత్తురో యనుచు నవ్వలఁ బరకాలుఁ
డత్తఱిం గడుదట్ట మగుపొదలోన
నాతల డాఁచి హేమాకృతిఁ గొనుచు
నాతలఁ గడచి తా నరుగు నత్తఱిని
శ్రీరంగనాథుఁ డాశ్రితవత్సలుండు
కూరిమితోఁ దనకొఱకుఁ గా వచ్చి
భక్తుఁ డీకైవడిఁ బ్రాణంబు లొసఁగు
భక్తికి నాశ్చర్యపడి సంతసించి
కంటిరే నాభక్తు ఘనతరభక్తి
వింటిరే యెందైన వివరించి మున్ను
అని నిత్యవరులతో నందంద బొగడి
వినతాతనూభవు వీక్షించి పలికె
నాకొఱ కిపుడు ప్రాణము లిచ్చినట్టి
నా కేశనుతుని వైష్ణవశిరోమణిని
బొందితో మస్తంబుఁ బొందుగా మగుడ
బొందించి నీముఖాంబుజసుధాధార
నెనయించి ప్రాణంబు లెసఁగింపతోడి
కొనిరమ్ము వేగ నగ్గురుభక్తినిరతు
ననఁ జని విహగేంద్రుఁ డరియముమఱఁది
తనువున మస్త మత్తఱిఁ బొందుపఱచి
తనమహత్త్వము మహీస్థలిఁ గానుపింప
ఘనతరామృతమూర్తి గాఁగ నెంతయును
బొలుపారు నిజముఖాంబుజసుధారసముఁ
జిలికించి బ్రతికించి చెలఁగించి యతని
గురుభక్తి వేగఁ దోకొనివచ్చి రంగ
వరునిపాదములక్రేవల నిల్పెఁ బ్రేమ
నరిదండధరుఁ డంత నాహేమబౌద్ధ
గురుబింబ మీరీతిఁ గొనిపోయి పోయి
కడుదూర మరిగి చీఁకటివిరిచుక్క
వొడుచువేళకుఁ గృష్ణపురిఁ జేరవచ్చి
యనుచరముఖులకు ననియె దూరంబు
సనుదెంచితిమి ప్రజ చాల నాకొనియె
బలువైన రేపటిపయనంబు సాగ
వలయు నేఁ డిచ్చోట వసియించు టొప్పు
దీనికై యందఱు దిట్టగాఁ గట్టి
పూని యొక్కెడ నిల్వఁ బోల దిచ్చోట
నుండరా దిఁకఁ దలాయొకదిక్కు చెదరి
యుండంగవలయు సూర్యుఁడు గ్రుంకుదనుక
నని వేదబాహ్యమతాసక్తు డగుట
కనయంబుఁ గోపించి యాజ్ఞఁ గావించు
వడువున సౌగతవరమూర్తి రొంపి
మడియుండ నందు నుమ్మలి లోనఁ ద్రొక్కి
యనుచరవర్గంబు నాయూరిలోని
కనిచి తా నట నుండె నది చూచికొనుచు
నప్పు డామడి సేయు నాయూరికాఁపు
ముప్పిరిగొను పగ్గములచుట్టతోడ
గ్రుచ్చిన మునికోల గొంగడిముసుఁగు
మచ్చల మచ్చల మట్టికాశయును
బలువైన కేలియంబటికుండ తనకు
నలవడ నడగొండ లననొప్పుచున్న
మీటైనయెద్దుల మెడికాడిమీఁద
గోటేరు వైచి నెక్కొని రొప్పికొనుచుఁ
జనుదెంచి యామడిచక్కి నాగేలు
పనుపడఁ గట్టి చొప్పడ దున్ననరుగ
నది గని పరకాలుఁ డాత్మఁ జితించి
యిది గానఁబడు దున్ననిచ్చిన వీని
నని యంత నొక్కఁడుపాయ మూహించి
యెనయ దున్నుచు నెదు రేతెంచువాని
నెడపక తిట్టుచు నెద్దులమెడలు
విడిచి లో శంకలు విడిచి యిట్లనియె
దున్నినఁ జోళనాథునియాన నీకు
నిన్నాళ్ళు తేరసొ మ్మిటు తినందగునె
పుడమి వారలనెల్లఁ బ్రోచి మాతాత
గడియించినట్టి దీకాణాచి నేల
యన్యాయ మేటికి నడుగుము నాదు
మాన్యంబు గాని సామాన్యంబు గాదు
తుదిని యీ యూ[14]రను దొరరెడ్డి వేరె
మదిఁ గొంక కొండొరుమాన్య మీరీతి
దున్నెడిలా గెట్లు తొలఁగు నీపనులు
విన్నార మేల క్రొవ్వితి కాఁపువాఁడ
కేనమేటికిఁ గందిగింజను గాఁపు
వానిని వేచకెవ్వలఁ జవి గాద
యనుమాట నిజమయ్యె నని వాఁడుఁ దాను
ననయంబు గినిసి వా దడచి యామీదఁ
దగవున కొప్పి యిద్దఱు నేగుదెంచి
తగవువారలతోడఁ దమపను ల్నొడివి
కట్టకానుక లిడి కడపట నిలువ
గట్టిగా నాకార్యగతి విచారించి
యలయున్న సభవార లాయిరువురను
బిలిచి పరాంతకుఁ బిలిచి యిట్లనిరి
యరయంగ నీమాన్య మైనయందులకుఁ
బరగంగ సాక్షిసంబంధంబు గలదె
యనిన నెక్కడిసాక్షు లలనాఁడె పోయి
రనినఁ బత్రము గలదా యని యనిన
నడర మాతోటి యేడవపెద్దతాత
కిడినపత్రము చెడ కిన్నాళ్ళదాఁక
దరుచు నుండంగఁ దామ్రశాసనమె
యనిన సత్యము సేయు మనఁ బరాంతకుఁడు
తావిష్ణునకు నేఁడుతరములనాఁటి
సేవకుఁ డనబుద్దిఁ జింతించి యపుడు
తలఁప మాయేడవతాత యైనట్టి
కులకర్త వామనాఖ్యుఁడు చెన్నుమిగులఁ
బుడమి తాఁ గొలుచునప్పుడు నేర్పుతోడ
గడియించి కైకొన్న కాణాచి నేల
తలఁపఁ దచ్చరణగోత్రమువాఁడ నేను
పలుమాట లేల తప్పదు శౌరిపాక్షి
యని సత్యమొనరించి యలవాని గెలిచి
జనులెల్లఁ దను వేయుసరణులఁ బొగడ
మునుపు దానున్న సమున్నతస్థలికిఁ
జనుదెంచె రవి యస్తశైలంబు డిగ్గె
నప్పు డాపురనాథుఁడగు నందసూనుఁ
డప్పాలుఁ బాలుఁ బాయస మారగించి
నంబిడగ్గరఁ బిల్చి నాదుభక్తుండు
పంబినయాఁకట బడలియున్నాఁడు
అతనికిఁ బాలుఁ బాయస మప్పములును
హితమతితోడ నీవిచ్చి రమ్మనిన
జానుగా వాని నర్చకుఁడు మస్తమునఁ
బూని తత్ప్రేరణంబునఁ గొనిపోయి
కేదారభూమిచక్కిన గాచియున్న
యాదేవనుతునకు నది యిచ్చుటయను
బరివారమును దానుఁ బరకాలుఁ డెంతె
పరిపూర్ణముగఁ బసాపడి సంతసించి
త్రిదశేంద్రవంద్యుని దేవదేవేశుఁ
బదిపద్యములచేతఁ బ్రణుతిఁ గావించె
మడిలోని యల హేమమయవిగ్రహంబు
వెడలంగఁ దిగిచి వేవేగంబ కడిగి
మునురాత్రిఁ గొనివచ్చుమురువున మఱియుఁ
బనుపడ మంచపుఁబల్లకిలోన
నిరవొందఁ బెట్టి మిన్నేర నేటేరి
దరిత్రోవ నరుగుచుం దన్మార్గమునకు
సరస నొప్పెడు శౌరిసదనంబులందు
నిరవొందఁ బగలెల్ల నీరీతి నిలిచి
యాయాయిమూర్తుల ననువొంద నుతులు
సేయుచు వెండియుఁ జీఁకటిపడిన
మునుబోలె పుత్తడి ముదిరూపు వేగఁ
గొనిపోవుచును దవ్వుగొని యేగుదెంచి
ఘనతరం బైన సంగమపురంబునకుఁ
జని ప్రొద్దుగ్రుంకెడిసమయంబునందు
నాపురవరనాథుఁ డై యొప్పుచున్న
శ్రీపతి యారగించినప్రసాదంబు
ననుచరసంయుతుం డై యారగించి
ననయంబు గార్క్రమ్ము నయ్యూరిత్రోవఁ
దెలియక యాయూరితీర్పరిం గూర్మిఁ
బిలిపించి త్రోవఁ దెల్పడువాని నొకని
ననుపుము సూర్యోదయం బైనదనక
ననిన వాఁ డారీతి ననిపెద ననుచు
నరిగి మదోన్మత్తుఁ డై మఱచుటయు
నరిదండధరుఁ డంత నచ్చోటఁ గదలి
చనుచుండఁ దత్పురీశ్వరుఁ డైనయట్టి
వనజోదరుఁడు భక్తవత్సలుఁ డపుడు
బాణకృపాణచాపంబులు నుభయ
తూణీరములుఁ దాల్చి తోడనే నడువఁ
దెలతెలవార నేతేర నామేటి
విలుకానిఁ బరకాలవిభుఁడు వీక్షించి
యెయ్యది నీనామ మెద్ది నీయునికి
యియ్యెడ నాతోడ నెఱిఁగింపు మనిన
నరయంగ నను జగదభిరక్ష యండ్రు
పురుడింప సంగమపురితలవరిని
బూనిక మీ రొంటిఁ బోయెద రనుచుఁ
దోన యేనును మీకుఁ దోడువచ్చితిని
అనుచు నంతర్హితుం డైన డెందమున
ననయంబు వెఱఁగంది యాపరాంతకుఁడు
ఆనందబాష్పంబు లడరంగఁ బొగడి
శ్రీనాథుఁ డని యిచ్చఁ జింతించి యెఱిఁగి
దశరథసుతుని నాతని హృద్యపద్య
దశకంబుచేత నెంతయు సన్నుతించి
మునుకొని శ్రీరంగమున కేగుదెంచి
కొనివచ్చు నలబౌద్ధగురుమూర్తిలోన
గొనవ్రేలిమాత్రంబు గొట్టించి డాఁచి
ఘనమైన కాంచనగాత్ర మంతయును
నఱకించి కరఁగించి నాణెంబు సేసి
కొఱదీర మూడవకోటఁ గట్టింప
నాకాలమునను భక్తాంఘ్రిరేణుండు
శ్రీకాంతుఁ డైన యాశ్రీరంగపతికిఁ
దనరుప్రేముడి సుమదామకైంకర్య
మొనరింపుచుండెడి యొకమందిరంబు
చాయం [15]బ్రహారంబు చనుదేరఁ జూచి
యాయెడఁ బరకాలుఁ డాత్మభావించి
కడిఁది సూత్రంబుసంగతి సాల మీపుడు
నడిచాయ వచ్చె వైష్ణవగృహంబునకు
వివరింప నితనినివేశ మిందులకుఁ
దివియకుండఁగరాదు తివియంగరాదు
కమలలోచనుని కైంకర్యంబుకంటెఁ
గమలేశుభక్తుకైంకర్యంబు ఘనము
వేసర కఱువదివేలేండ్లు భక్తి
సేసేత హరిపూజ సేయుటకంటె
నొకభాగవతునకు నొకమాఱు పూజ
యకలంకమతిఁ జేయ నదియ మిక్కుటము
అనుచు నేకతమున హరుఁడు పార్వతికి
నొనరఁ బద్మంబున నుపదేశ మొసఁగెఁ
గావునఁ బరమభాగవతగేహమున
కీవలఁ జుట్టిరానిత్తు నీకోట
యనుచు నావరణంబు నాగేహమునకు
ఘనతరావణంబు గాఁగఁ గట్టించె
నావిధం బెల్ల భక్తాంఘ్రిరేణుండు
భావించి వైష్ణవభక్తికి మెచ్చి
యిప్పు డీపరకాలుఁ డిట చేయునట్టి
యుపకారమునకుఁ బ్రత్యుపకారముగను
బెనుపొందఁగాఁ బిడ్డ పేరిడవలయు
ననిమౌని మది నెంచి యాత్మజుభాతి
యనిశంబు దామంబు లర్పించునట్టి
తనదుపువ్వులనారఁ దరగుకత్తికిని
అరిదండధరునామ మనువొందఁ బెట్టి
పరమానురక్తుఁడై పరకాలుఁ డంత
వరగోపురంబును వంటసాలయును
గరమర్థి గణజంబుఁ గట్టింపఁ దలఁచి
కలయ నాచార్యులఁ గాసీల నపుడు
బిలిపింప వారలు పెనుజన్నిదములు
చంకల శిల్పశాస్త్రములపుస్తములు
వంకవోఁ జుట్టిన వలుదపాగలును
గొలదిరేఖలు వడిఁ గోసినయట్టి
యెలమించి వలకేలి యినుపకమ్ములును
నలవడ శిల్పశాస్త్రాగమవేత్త
లలపరాంతకునకు హస్తము ల్మొగిచి
చేరువ నిలువ నీక్షించి భాగవత
పారిజాతంబు చొప్పడఁగ నిట్లనియె
నడుఁగక మీర లిన్నాళ్ళు ప్రయాస
పడితిరి శ్రీరంగఫణిశాయికొఱకుఁ
బడిన నేమయ్యె మీపడుపాటులెల్ల
నెడపక రంగేశుఁ డీడేర్పగలఁడు
ఒప్పుగా మీధనం బొప్పింతు మీఁద
నప్పుగా గణజంబు నాగోపురంబు
ననువొంద రెండవయమ్మహానసము
నొనరించుఁ డని పల్కి యుడుగర లొసఁగ
వేవేగ వారు నవ్విధి నన్నిపనులుఁ
గావింతు మని యొప్పి క్రమ్మఱ వచ్చి
తమకు నీవలయునర్థము వేఁడునపుడు
తమకించి యందుఁ గొందఱు తమ్ముఁ జూచి
తమచేతికాసు లిందనుకను మెసవి
క్రమమున నీయూడిగములు సేసితిమి
అలవడఁ దముసేయునట్టియాపనులు
కొలుపలే వనియొప్పుగొనుటయు లేదు
విదితంబుగా మాకు వెనకకు మీరు
ముదలవెట్టెడు లెక్క ముదలవెట్టించు
చేకొని యేముసేసినయందుఁ గడమ
లేకుండఁ జూచి పాలించు మోసామి
చప్పటికుముదంబు చదరపానంబు
కప్పుచూరులు కంబకాళ్ళు పద్మకము
నొగి మహాజగతియు నుపజగతియును
దగినగట్టను గపోతము సంతనయును
మొదలైన తమపని మొగములలోను
గొదవ చీమంత చేకూరకయుండ
నీసునం దవిలి దా రీరీతిఁ బనులు
చేసేతఁ దమచేతఁ జేయింపుచున్న
కాసిడు తమకొక్క కాసిడు సరికి
బేసికి గొట్లాడి పెనఁగిచూచితిమి
అన విని పరకాలుఁ డాశిల్పివరులఁ
గనుఁగొని యెంతయుఁ గరుణ వాటించి
సారసభవముఖుల్ సపరింపలేని
శ్రీరంగవిభుసేవఁ జేయువీరలకు
వ్యర్థంబు మిగుల ననర్థంబు నైన
యర్థమిచ్చుట కొంత యని విచారించి
పరమార్థముగనింకఁ బరమార్థ మిచ్చు
టరయఁ బ్రత్యుపకార మనుచుఁ గావేరి
ఘనవేగమున రెండుగడ్డలుం జమరు
కొని పొర నొకనావికుని రహస్యముగఁ
బిలిచి కాంచనములు పెక్కుగా నొసఁగి
యలవిమీఱినధనం బది తెమ్మటంచుఁ
గాసింపు చున్నయాకాసీలనెల్ల
నాసమ్మతమున నీనావ యెక్కించి
కొంచక నట్టేటఁ గొనిపోయి పుట్టి
ముంచి నీవిందిచే ముంచిరమ్మనుచు
సమకట్టి తత్క్షకజనము వీక్షించి
క్రమమున మీకు నీఁగలధనం బెల్ల
సవరింతు లెక్కతో సవరి నయ్యేటి
యవల శ్రీనీపతీర్థాంతరంబునను
ఉరుతరనిక్షేప మున్నది తనది
వరుసతో నావెంట వచ్చెద రేని
యని వారి నందఱ నాపుట్టిమీద
ఘనమైన యొక మూఁక గాఁగ నెక్కించి
తామున్న యవలికి దాఁటి కాసీల
నామహాసింధుమధ్యమున ముంపించి
ముకుళితహస్తుఁడై మురవైరిఁ దలఁచి
సకలలోకేశ! కంజదళాయతాక్ష!
భవదీయకైంకర్యపరు లైన వీరి
భవముక్తులుగఁ జేసి పరమపదంబు
చేరునట్లుగఁ గృపసేయు మటంచుఁ
బారమార్థముగఁ బ్రపత్తిఁ గావింప
లోకంబులెల్ల నాలోకించుచుండ
నాకసంబున వచ్చి యాదివాహనులు
మక్కువ వారి విమానంబులందు
నెక్కించుకొని ముక్తి కేగి రంతటను
బరకాలయోగి యెప్పటియట్ల మగుడ
నరిగి తా రంగవిహారి యైయుండె
నట నాగపురిబౌద్ధు లాగుడిలోనఁ
బటుతరహేమబింబము లేకయున్నఁ
బొగులుచు నాశ్చర్యమును జెంది సదన
మెగువ బంగరుకుండ యెడయుటఁ జూచి
వడిసినరక్తంబువడువు నచ్చోటి
యడుగులుఁ బొడఁగాంచి [16]యావీట నున్న
ఇల నీటిలో జాడ లెత్తంగఁ జాలు
తలవరులను బిల్చి తచ్ఛాయఁ జూప
జలజ తోమర శంఖ చక్ర దంభోళి
హలచిహ్నితము లైన యరిదండధరుని
యడుగులఁ బొడ గాంచి యచ్చట కడమ
యడుగులు గని కడు నాశ్చర్య మంది
యలవి నల్పుఁడె యట నలవెన్నదొంగ
బలిమి వాటించిన బలుదొంగ యనుచుఁ
గొలఁది కనుంగొని గుఱి వ్రాసి మఱియుఁ
గొలిచి చూచుచు జాడగూడ నెత్తుచును
గుడిపడమటఁ జోరకులు డిగినట్టి
వడువుఁ జూపుచు బౌద్దవారంబు మునుపు
చోరులు సనినట్టిచొప్పుఁ జూచుచును
బోరున నటు పోయి పోయి యొక్కెడను
సుడిగాలి వాని నించుక మాసి మడుసు
పడియున్న నొండొరుఁ బరికించి కాంచి
గురులు వ్రాయుచు నడుగులు గొల్చుకొనుచుఁ
బెరచోటఁ జొప్పు దీపింప నెత్తుచును
ఘనమైనచట్టునం గానరాకున్న
బునుకగ వీపునఁ బొరలియెత్తుచును
అలపరకాలుని యడుగని తెలిసి
బలువిడి శ్రీరంగపట్టణంబునకుఁ
జనుదెంచి యటనున్న శాత్రవాంతకుని
గని కోపమునను సౌగతు లిట్టు లనిరి
తెచ్చినతమవంశదేశికు మరల
నిచ్చెదో నొచ్చెదో యేమికావలయు
ననినఁ బరాంతకుఁ డాశ్చర్యపడుచుఁ
దనుగానివానిచందమున నిట్లనియె
నెచ్చటిమీగురుం డేటివాఁ డాతఁ
డెచ్చట నుండు నా కెఱిఁగింపుఁ డనిన
నలనాగపురి నున్న హైమబింబంబుఁ
దెలియవే చేచేతఁ దెచ్చిన దొంగ
అలవిరివారల నణఁకించినట్లు
పులిమిపుచ్చిన నిన్నుఁ బోనీము నేఁడు
నడుగక మాసొమ్మునకు నొప్పఁజెప్పు
వెడఁగ! రాజ్యమువారు విన్న మాటొదవు
వలవదు చెడిపోవవలదు నీమనసు
కొలఁదిఁ జెప్పితిమి యీగొంటుబాగేల
యెడపక తమమూర్తి నిచ్చితివేని
తడవము నిను దాఁకి తలఁపము తుదిని
ఈవ తెచ్చితి వని యేబాసయైనఁ
గావించెదము నెంత కఱ్ఱుమడ్డునను
కితవ! నీవిటకు దొంగిలితెచ్చి తనుచు
నతివెతలకు నిల్చి యాడెద మిపుడు
అని తనకొంగు చయ్యనఁ జుట్టుపట్టి
కొని పోకు మని కుసిగుంపుఁ గావింపఁ
దనతెచ్చు టెఱిఁగి రిత్తఱి నంచుఁ దెలిసి
యనియె వారలతోడ నాపరాంతకుఁడు
పదర నేటికిఁ గొంగు పట్టంగవలదు
వదలుండ యది దొడ్డవారిచేఁ బడియె
నాసొమ్ముఁ దెచ్చు టే నరయుదుం గాని
చేసేత నేను దెచ్చినవాఁడ గాను
ఎఱుఁగను నను మీర లీరీతిఁ బఱచు
టెఱిఁగిన యది గని యిట తెచ్చువారు
గ్రన్ననఁ బ్రతిమ భంగముసేయఁ జూతు
రెన్నిచందంబుల నీరంతు వలదు
ఫలమువారలొ కాక పనిమాలినట్టి
చలమువారలొ వట్టి జగజోలి యేల
పిసిఁడి బాగేదిచెప్పిన బులుఁగునకుఁ
బసిఁడి నాచెప్పినపగిది నిచ్చినను
గైకొని యేఁ జిటుకనవ్రేలు గడమ
కాకుండ మీకొప్పు గావింతు ననిన
జైను లామాటసూక్ష్మము గానలేక
యూనినగురుభక్తి యొదవ నిట్లనిరి
ఈవడిగినవెల్ల నిచ్చెద మిప్పు
డివతలం బత్ర మిచ్చెదవేని జెప్పు
మన సమ్మతించెఁ బరాంతకుం డపుడు
ఘనులఁ గొందఱ సభగాఁ గూడఁబెట్టి
తనవారిపనులచందముఁ జెప్పి కొన్ని
దినములు గడు విడి తేటతెల్లముగ
సమమాసతిథివారసరణు లేర్పఱచి
ప్రమదంబుతోడ శ్రీపరదండధరుఁడు
అమరజైనుల కిచ్చినట్టి పత్రంబు
క్రమమెట్టిదనిన మీగడువు నాఁటికిని
పిసిఁడి బాగేదిచెప్పిన పులుఁగునకుఁ
బసిఁడి నేఁ జెప్పినపగిది మీరొసఁగఁ
గైకొని తుదిఁ జిటుకనవ్రేలు గడమ
గాకుండ మీకొప్పుగావింతుననుచు
స్వరుచిమ యొడఁబడి సవరించు పత్ర
మరయ నిందుల పత్రహస్తునొప్పంబు
ఆరంగపతి సాక్షులగువారియొప్ప
మారంగపతి యంచు నపుడు వ్రాయించి
యలపత్రమంది తానాసౌగతులకుఁ
జెలరేగియిచ్చె నిచ్చిన బౌద్ధు లపుడు
తమపురి కరిగి యాధనము గైకొనుచుఁ
గ్రమ మొప్ప మగిడి యాగడువునాఁటికిని
అరుదెంచి యీఁదగు నర్థంబు లొసఁగి
పరకాలు నిజగురుప్రతిమ వేఁడినను
మునుపు దాఁచినబౌద్దముఖ్యుని బొందిఁ
గనుపట్టు నలచిటికెనవ్రేలు గొనుచు
నేతెంచి వారల కీవచ్చునంత
నాతతశోకార్తు లగుచు నెంతయును
గనలిజైనులు పరకాలునిం జూచి
యనిరి నీమాట సత్యం బని నమ్మి
మునుప దొంగిలినసొమ్మును నీకు నుండ
ధన మిచ్చితిమి మంచితనమున మఱియు
నిచ్చిన తమగురు నీక యీవ్రేలు
దెచ్చి యీవచ్చె దేతెఱఁగునం దమకు
నిదె మున్ను నీవు మాకిచ్చినపత్ర
మదె సాక్షు లున్నార లౌగాములకును
అనినఁ బరాంతకుడనియె వారలకుఁ
బనిలేని యీ వట్టిపలుమాట లేల
పన్ని నేనిచ్చిన పత్రంబులోన
నున్న చందంబున నొప్పింతు మీకుఁ
బదర కాపత్ర మీప్రజలముందరను
జదివించు డందు నేసరవినున్నదియు
నందు నున్నందుల కావగింజంత
చిందుసేసిన నోరసేసిన నైన
నినుమడిగా నిత్తు నిపుడు నీసొమ్ము
కినియక తగవునం గెలిచి కైకొనుఁడు
అనిన వా రాపత్ర మాసాక్షి వారు
వినుచుండ వడిఁ జదివింప వారలును
గైకొని తుదిఁ జిటికెనవ్రేలు కడమ
గాకుండ మీ కొప్పు గావింతు ననుచు
నాకులో నున్నది యంతియేకాని
యాకాంచనాకృతియంతయు మీకు
నొప్పింతు ననుట లేకుండుటం జేసి
తప్పు గైకొని పట్ట తగ వేది మీకు
నన విని తగవున హైన్యంబు నంది
చని సౌగతులు చోళజననాథుఁ గాంచి
తమ హేమగురుఁ బరాంతకుఁడు గైకొన్న
క్రమ మెఱింగించి వెగ్గలముగా లోనఁ
బరిధాన మీ నొడంబడిన భూవిభుఁడు
కర ముగ్రమునఁ బరకాలు రావించి
యేమోయి పరకాల! యింతయధర్మ
మీమెయిం గావింప నిది నీకుఁ దగునె
యే నెంతచెప్పిన నిట్టి నీయోజ
మానకపోయితి మాటిమాటికిని
గుఱుతైన సౌగతగురుముఖ్యు నీతి
దొఱఁగి తెచ్చుట మహాద్రోహంబు గాదె
యన విని పరకాలుఁ డవనీశుతోడ
ననియె రాజని నిన్ను ననరాదుగాక
యాగమబాహ్యులరై యున్నయట్టి
సౌగతముఖుల నెక్కడఁ బొడఁగన్న
గతము సేయఁగఁ దగుఁ గాక భూపతికిఁ
బ్రతిఁ బెట్టి యవి తుదిం బాలింపఁ దగునె
మును త్రిపురాసురమోహార్థముగను
దనుజారి యట్టిమతంబుఁ గల్పించి
తుదిఁ దానె తన్మతస్థుల నెచ్చనీక
పదివేలవిధముల భంజింపవలయు
నని యానతిచ్చినాఁ డటుగాన బౌద్ధ
జనగురుహరణంబు సలిపితి నేను
దొడరి యందులకు నాతోడ వాదింప
విడువుము బౌద్ధుల వెస నిందులోన
జాడతో నాగమసరణి వాదించి
యోడినవారల నొనరింపు మాజ్ఞ
యనిన భూవిభుఁడు పరాంతకు బౌద్ధ
జనులతో వాదింప సమకట్టుటయును
బరకాలుఁ డప్పు డాపరవాదిబలము
నురుతరానంతవేదోక్తఖడ్గముల
నలినలిఁ జేసి యెంతయు వీఁగఁదోలి
గెలిచిన నరుదంది క్షితినాథుఁ డప్పు
డరిదండధరునకు నవవతుం డగుచుఁ
బరమవస్తువుల సంభావించి యపుడు
హీనవాదులఁ జేసి యెదిరించి నట్టి
జైనుల దండించి జగములు వొగడ
మక్కువ బరకాలు మదదంతిరాజు
నెక్కించి పురమెల్ల నేగించి పొగడి
యిల పట్టభద్రున కెన్ని చిహ్నములు
గల వన్నిచిహ్నముల్ కడఁకమై నొసఁగి
యనిచినఁ బరకాలుఁ డారాజు వీడు
కొని రంగపురికి నేగుచునున్నతఱిని
ధరలోనఁ ద్రికవినా దనరినయట్టి
హరభక్తుఁ డగు షణ్ముఖాంశసంభవుఁడు
సమ్మదుం డనుపేరి శైవమతార్యుఁ
డమ్మహాత్మున కెదురై డాయవచ్చి
ధర నాశుమధురవిస్తారచిత్రముల
నిరవొందుకవిత కధీశ్వరుం డనుచు
గరమర్థి వాయిదకాండ్రముంగలిని
బిరుదుకాళియలచేఁ బెల్లునాదింపఁ
బలుదెఱంగులవానిపజ్జనె ఠవణి
మలహరిఢక్కాదిమహితవాద్యములు
వాయింప సమదంతివాహనారూడుఁ
డైయేగుదెంచు నయ్యరిదండధరుని
గనుఁగొని తనయున్నఘనపురంబునకుఁ
జనుదేరవలయు నోసర్వజ్ఞ యిప్పు
డన విని పరకాలుఁ డనియె నాతనికి
వనజాతనేత్రునివాసంబు లేని
గ్రామంబుఁ జొర నని కల దొకప్రతిన
యే మెట్లువచ్చెద మీపురంబునకు
నన విని త్రికవి యయ్యరిశమనునకు
ననియె ముందర మదీయం బైనవీటఁ
గలదు నారాయణాగార మీవేళఁ
గలియుగంబున నది కనుపట్టలేదు
రవివంశతిలకుండు రాముండు తొల్లి
యవనిరక్కసుల వేఁటాడుచు నచట
నెలకొన్నకతమున నిఖిలలోకముల
నలవీడు రామవియత్పురం బనఁగఁ
బరగె నావుడు విని పరకాలుఁ డటకుఁ
గరమర్థి నడుగ వేడ్కల శైవగురుఁడు
సకలోపచారము ల్సవరించి యతని
యకలంకసామర్థ్య మరయంగఁ దలఁచి
ఘనతమై భువి సర్వకవితావిభుండ
ననిపించుకొను టెట్టు లైన నీ విపుడు
కడలిశంఖంబు లిక్కడకు రాఁ గవిత
యొడఁగూర్చితేని నీకొప్పు నాబిరుద
మన విని పరకాలుఁ డాశైవగురుని
గనుఁగొన లేనవ్వు గనుగోర గదుర
నన్నేలినట్టి క్రొన్ననవిల్తు తండ్రి
సన్నిధిఁ గాని యే సవరింపఁ గవిత
నావుఁడుఁ బరకాలు నంచిన శిష్యుఁ
డీవేళ దేవరకే మింద రుండ
శ్రీపతికృపను నీశిష్యప్రశిష్యుఁ
డోపఁడే యీమందు నోడించుపనికిఁ
దుది వీని నేలినధూర్జటి వచ్చి
యెదిరిన నీ వేల యేమె చాలుదుము
కొండతోఁ దగరు డీకొనినచందమున
నండజాధిపుతోడ నహి పోరునట్లు
మఱి నభోమణిఁ గీటమణిఁ జంకసేయు
తెఱఁగున నీదైనతెఱఁ గెఱుంగమిని
గడుతామసుం డైన కతన మీతోడఁ
దొడరె నింతియకాని తుది నెన్నిచూడ
నతనికి మీకును నంతరాంతరము
మతి నెన్నుచో హస్తిమశకాంతరంబ
యనిన శిష్యులఁ జూచి యాపరకాలుఁ
డనియె నెన్నిన మీర లంతటివార
లైన నీతనిగర్వ మడఁచుట కిప్పు
డే నేమి మీరేమి యీపురిలోన
వేచని యిందిరావిభునియావాస
మేచక్కి నుండునో యెఱిఁగిరండనినఁ
బూనిక శిష్యు లాపురమెల్ల వెదకి
కానక పరకాలుఁ గాంచి యిట్లనిరి
వెదకితిమయ్య యీవీటమందునకు
వెదకిన లేదయ్య విష్ణుమందిరము
అన విని పరకాలుఁ డాపురం బెల్లఁ
దనదివ్యయోగవిద్యాదృష్టిఁ జూచి
ముదుకగుల్లలలోన ముత్తియం బున్న
చదురునం బెక్కు పాషండులలోన
మకరకుండలధారు మదిఁబాదుకొలిపి
యొకవైష్ణవీమణి యుడివోనికూర్మి
ననయంబు పాషండు లగు తమవారు
గనకుండ దొంతులకడ నుట్టికుండ
ముద్దుగారెడు [17]వెన్నముద్ద కృష్ణయ్యఁ
దద్దయభక్తి వస్త్రముచుట్టి దాఁచి
పగలెల్ల వారిలోపలఁ దాను నొకతె
యగుచు వారాడినయట్ల యాడుచును
దమవారు నిద్రించుతఱిఁ బుండరీక
విమలాక్షు మౌనులవిందు గోవిందు
సలలితాంబువుల మజ్జనము నొనర్చి
ఫలపుష్పధూపదీపముల నర్పించి
తొంటిచందమున నందునిజవరాలి
చంటిపాపని నిడి సతతంబు నిట్లు
హరిభక్తిపరమతి యైన యాసాధ్వి
సరవి యంతయు మానసంబునఁ దెలిసి
వెలయంగఁ దనకన్నవిధము శిష్యులకుఁ
దెలిపి మీ రిపుడు సందేహింప కరిగి
యలకృష్ణుతోఁగూడ నాకాంత నేను
బిలిచెద నని చెప్పి పిలిచి తోతెండు
అన విని [18]పరిజను లట్ల కా కనుచుఁ
జని యటనున్న వైష్ణవిఁ జేరవచ్చి
కనుఁగొని యాపరకాలు వాక్యములు
వినుపించి రమ్మన వెఱఁ గందికొనుచు
సతతంబు నీకలశములోనినంద
సుతు నర్చనముసేయుచొప్పు నాతలఁపు
నేనెఱుంగుదు గాని యింటిలోవారు
గాన రీగతి యెట్లు కనియెనో ఘనుఁడు
మానుగా నతఁడు నిర్మలుఁ డైనయోగి
కాని సామాన్యుండు గాఁడు భావింప
నావైష్ణవోత్తము నంఘ్రిపద్మములు
సేవించి యభిమతసిద్ధిఁ బొందెదను
అని కుండలో నున్న యావాసుదేవుఁ
గొని కూర్మితోడ నక్కునఁ జేర్చికొనుచుఁ
గరమర్థితోఁ బరకాలుసన్నిధికి
నరుదెంచి శ్రీకృష్ణు నతని చే నొసఁగి
ముదమున నడుగుదమ్ములమీద వ్రాలి
పదివేలతెఱఁగులఁ బ్రస్తుతింపుచును
ఆలోలసంసారమనుపయోరాశి
లోలత మునిఁగి తేలుచు నున్నదానఁ
బరకాల! తావకపదపద్మభక్తి
తరణిచేతను నొక్క దరిఁ జేర్పు మనుఁడుఁ
బరమసంతుష్టుఁడై పరకాలుఁ డంతఁ
బరమకృపారసభరితగాఁ జేసి
చలము ముప్పిరిఁ గొన్న సంబంధుఁ జేరఁ
బిలిచి యప్పుడు ప్రతాపించి యిట్లనియెఁ
దలపోయ నాకవిత్వములోని మేలు
దలపోయ నీరమాధవుఁ డొండు దక్క
నెఱుఁగంగలేరు బ్రహ్మేంద్రాదులైన
నెఱిఁగిన నీమూర్తి యెఱుఁగంగ వలయు
ననుచుఁ గాళియభేది కభిముఖుం డగుచుఁ
దననేర్పు మెఱసి యెంతయుఁ జిత్రగతుల
నలశౌరిమీఁదట నంకితంబుగను
జలధిశంఖంబు లచ్చటికి నేతేరఁ
బదిపాట నొక్కప్రబంధంబుఁ జేసి
హృదయంబులోఁ గన్న యీశార్ఙ్గపాణి
ననువొంద నేఁడు ప్రత్యక్షంబు గంటి
ననునర్థములతోడ నలవడి యొప్పఁ
దగ ముకుటాఖ్యబంధంబుచే భేద్య
మగునట్టి చిత్రకావ్యముఁ బ్రకటింప
విని శైవగురు డంత వెఱగంది పొగడి
కనుఁగవ బాష్పము ల్గడలుకొనంగ
నరిదండధరునిపాదాంబుజాతములఁ
గరమర్థి వ్రాలి మై గరుపాఱ నిలిచి
మురవైరి యవతారమూర్తిని నిన్నుఁ
బరుఁ డని తలపోసి పామరబుద్ధిఁ
దొడరిన యిమ్మహాద్రోహంబు నీవ
కడతేర్చి క్షమియించి కావవే తండ్రి!
యని పెక్కుభంగుల నభినుతి సేసి
పెనుపొందఁ బరకాలుబిరుదుకాహళికఁ
గొని భూమిఁ ద్రికవులకును జతుష్కవుల
కును రాజ వనుచు నెక్కొఁనగఁ బూజింపఁ
గరము వేడుక బరకాలుఁ డావేళఁ
గరమర్థి నతఁ డిచ్చు కనకాంబరముల
నలనందసుతునకు నర్పించి యచటి
కలధౌతమణిమయాగారంబునందు
వరవైభవముల నవ్వసుదేవతనయుఁ
దిర మొందుప్రేమఁ బ్రతిష్ఠఁ గావించి
జనులెల్ల వినుతింప సంబంధు వీడు
కొని కవి శేఖరు ల్గొలిచి యేతేర
పరకాలు మిగుల సంభావించి రంగ
పురమున కనిచె నప్పుడు పరాంతకుఁడు
శ్రీరంగమున కేగి శ్రితకల్పతరువు
శ్రీరంగనాథుని సేవించి యంత
గట్టిగాఁ దా మున్ను గరశానములను
గట్టించినట్టిప్రాకారముల్ చూచి
నలువార నల్లసేనపుజంగరాల
నెలమి నీసాలంబు లేను గట్టింతు
నని విన్నవించి యే నట్ల యీడేర్చి
తనయంబుఁ గరుణించి యప్పుడ యేను
గట్టిగా మంచిబంగరునీలమణులఁ
గట్టింతు ననిన యాగతిన యీడేర్తు
నీరీతి విన్నపం బేలకో యపుడె
శ్రీరంగనాయక సేయలేనైతి
నని భక్తిపరవశుం డగుచు శోకింప
ననయంబు మెచ్చి శ్రీహరిరంగవిభుఁడు
పరకాలునకు వేగఁ బ్రత్యక్ష మగుచుఁ
బరమానురక్తితోఁ బలికె యోగీంద్ర!
పాటిమీఱిన భక్తిపరత నీకట్టు
కోట లెన్నినరాతికోట లేవయ్య!
వనజభవాదులు వాసవాదులును
దినకరచంద్రాదిదివిజులుం గూడి
నెట్టన జాతిమానికములు చరులఁ
గట్టిరాళులనెన్ని గట్టి రన్నియును
నీవు గట్టించు మన్నియలసాలముల
కావగింజంతకు నవి యీడు రావు
అనుచుఁ గౌఁగిటఁ జేర్ప నరిదండధరుఁడు
వినతుఁడై వేవేలవిధములఁ బొగడి
తనసేయువిజయమంతయు నేర్పుతోడఁ
దనదేవి కెఱిఁగించి తదనంతరంబ
పరమేశుఁ డగురంగపతియనుమతిని
బరమవిరక్తుఁడై పత్నియుం దాను
నరిగి కురంగేశు నావాస మగుచుఁ
బరమపావన మైన భద్రాశ్రమ్రమునఁ
దనడెందమున రంగధవుఁ బాదుకొల్పి
యనుపమయోగవిద్యాసక్తి నుండెఁ
గావున నెన్నిసంగతుల భాగవత
సేవ సేసినవాఁడె శ్రీవైష్ణవుండు
హరిపూజకంటె శ్రీహరిభక్తపూజ
పరికింప నధిక మెప్పాటున నైనఁ
బరకాలయోగి యాభద్రాశ్రమమున
నురుయోగసక్తుఁడై యుండె నేఁటికిని
మీఱి లోకములెల్ల మెచ్చఁజేసినవి
యాఱుకైంకర్యంబు లాఱుకబ్బములు
నలమహాశ్రీవచనాభిధానమున
నలవడఁ గృతియందు నాదికావ్యంబు
తిరుపతులందు వర్తిలు భాగవతులె
యరయఁగాఁ గృతకృత్యు లనునర్థ మొదవ
నెనసి రెండవకృతి యిరువది పాట
[19]దనరార ఘటియించె దండకం బనఁగ
ఘనచిత్రకావ్యభాగస్థితి యనఁగ
ననువొందుచుండ మూడవప్రబంధంబు
తలఁప మహాతనుదళము లనంగ
నలరు నాలవకృతి యైదవకృతియు
ధరణి నెన్నఁగ నీదుదండకం బనఁగ
గరమొప్ప నాల్గవకావ్యంబు చేసెఁ
బరమపావనమైన పరకాలుచరిత
ధర నెవ్వరేని తద్భక్తిపూర్వముగ
వినిన వ్రాసినఁ జదివిన నుతించినను
దనర వారలకుఁ బ్రత్యక్షమౌ శౌరి
యకలంకసిద్ధులు నభిమతార్థములు
సకలసిద్ధులుఁ గరస్థలి నుండు ననుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి
నంకింతంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళపాకన్నయార్య
తనయ తిమ్యార్యనందనరత్నశుంభ
దనుపమ శ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృతమైన పరమయోగివిలాసకృతిని
నతులితంబుగ సప్తమాశ్వాస మయ్యె.
- _____________