పీఠిక.


శ్రీ పిఠాపురసంస్థానాధీశులగు శ్రీ శ్రీ శ్రీ మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావుబహద్దరువారు ప్రాచీనాంధ్రగ్రంథ సంపాదనమునకై నన్ను నియమించిన కాలమున (1917 సం॥ర॥ ) మైసూరులోని మహారాజకళాశాలాంధ్రోపాధ్యాయులగు బ్ర శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు నాకిచ్చిన గ్రంథములలో "పరమయోగివిలాసము" కూడఁ జేరియుండెను. ఆప్రతి కొంతశిథిలమైయుండెను. మద్రాసులోని గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రరీలోఁ గూడ మఱియొకప్రతి యుండఁగా రెండింటికి శ్రీమహారాజావారు ప్రతులను వ్రాయించి బ్ర॥ శ్రీ శతావధాని ఓలేటి వేంకటరామశాస్త్రిగారిచేఁ బాఠమును సరిచేయించి ముద్రింపించి జీర్ణోద్ధరణము గావించి యాంధ్రలోకమునకు మహోపకృతిం గావించిరి. ఈగ్రంథము ముద్రితమైన పిమ్మట "రెడ్డిరాణిపత్రిక" యొక్క సంపుటము 5 సంచిక 6 లో శ్రీ శేషాద్రిరమణకవులు హైదరాబాదులోని "రెడ్డిబోర్డింగులోను, ఆంధ్రపరిశోధకశాఖలోను" రెండు తాళపత్రప్రతు లుండినటులు వ్రాసియున్నారు. కాని సమయముమించుటచే నాప్రతులతో నీగ్రంథమును సవరించుటకు వీలుకలుగ లేదు.

గ్రంథకర్త.

ఈ గ్రంథమును రచించినయాతఁడు "తాళ్ళపాక తిరువేంగళనాథుఁడు." "అష్టమహిషీకల్యాణము" అను మరియొ కగ్రంథమునుగూడ నీతఁడు రచించెను. రెండును ద్విపదకావ్యములే. ఈతనికిఁ "జిన్నన్న" యను మాఱుపేరు కలదందురు. శ్రీ రావుబహద్దర్ కందుకూరి వీరేశలింగముపంతులు గారు కవులచరిత్రయందు "తాళ్ళపాక చిన్నన్న" యనునాతఁడు "అష్టమహిషీకల్యాణము" వ్రాసెననియుఁ దమకా గ్రంథము లభింపలేదనియు "తాళ్ళపాక తిరువేంగళనాథుఁడు" పరమయోగివిలాసము వ్రాసెననియు వేర్వేఱుకవులనుగా గ్రహించిరి. దీనిఁకిగారణ మప్పటి కష్టమహిషీకల్యాణము వారికి లభింపకపోవుటచేతనే యయియున్నది. అష్టమహిషీకల్యాణ మిపు డాంధ్రసాహిత్యపరిషత్కార్యస్థానమునం గలదు. దానిం జదివినచోఁ జిన్నన్న వేఱు తిరవేంగళనాథుఁడు వేఱుకాక రెండుగ్రంథములను రచించినవాఁ డొక్కరుఁడె యని మనకుఁ దెలియనగును. అష్టమహిషీకల్యాణ గ్రంథమునందు నీతని చరితము విపులముగాను, పరమయోగి విలాసమునం గౢప్తముగాను జెప్పఁబడెను. ఈతనితాత "అన్నయ్య" తండ్రి తిరుమలయ్య. (ఇతనికిఁ బెదతిరుమలయ్య యను నామాంతరము గలదు) అన్నలు 1 పినతిమ్మయ్య, 2 అన్నయాచారి, 3 తిరువేంగళయ్య. తమ్ముడు కోనేటి వేంకటనాథుఁడు. పినతండ్రి నరసింహుఁడు. (ఈతనికి నరసింగన్నయని పేరు కూడ కలదు.) పినతండ్రికుమారుఁడు 1 నారాయణుఁడు, 2 అన్నయ్య, 3 అప్పలార్యుఁడు వీరందఱు సంగీతసాహిత్యవిద్యలయందుఁ బండితులఁట. అశ్వలాయనసూత్రము, భారద్వాజసగోత్రము, నందవరీకశాఖ యని చెప్పియున్నాఁడు. తాతయగు నన్నయ్య పదకవిత్వవిశారదుఁ డఁట. ఆతని పదకవిత్వలక్షణములఁ బినతిమ్మయ్య "సంకీర్తలక్షణము" లను చిన్నపుస్తకముగా రచించెను. అది యాంధ్రసాహిత్యపరిషత్పత్రికలొ ముద్రింపఁబడెను. తండ్రియగు పెదతిరుమలయ్య 1. ఆంధ్రవేదాంతము, 2. ద్విపదహరివంశము, 3. చక్రవాళమంజరి, 4. రేఫరకారనిర్ణయము ననుగ్రంధములను రచించెను. 3, 4 గ్రంధములు పైపరిషత్పత్రికలోనే ప్రకటింపఁబడినవి. (పెదతిరుమలయ్య రచించిన యాంధ్ర భగవద్గీతావ్యాఖ్యాన మొండు గాన్పించుచున్నది. అదియే యాంధ్రవేదాంతమై యుండును.) హరివంశము మృగ్యము. తిరుమలయ్య "మండెము" కోటలోనుండువాఁడఁట. మండెముకోట కర్ణాటాంధ్రదేశమధ్యస్దమై యొక్కయెడ నుండినటులఁ జరిత్రమువలనఁ దెలియవచ్చుచున్నది. పితామహుడయిన యన్నయ్య కృష్ణదేవరాయుని కాలమునం దుండి కొన్నియగ్రహారములను సంపాదించెనని శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసియున్నారు. కాని యందుల కాధారము చూపలేదు. తిరుపతిలొని యొకశాసనము ననుసరించి యన్నయ్య శ్రీనాధునినాఁటివాఁడై యుండెనని బ్ర॥ శ్రీ వేటూరి ప్రబాకరశాస్త్రిగారు శృంగారశ్రీనాథములో వ్రాసి యున్నారు. అందువలన నన్నయ్య క్రైస్తవశకముయొక్క పదునేనవశతాబ్దమధ్యమునం దుండినవానినిగాఁ దలఁపవలసియున్నది. ఈతిరువేంగళనాధుఁడు పరమయోగివిలాసము యొక్క యాశ్వాసాంతములందు,

ద్వి. అనుపమ శ్రీవేంకటాద్రీశదత్త
     మకరకుండలయుగ్మ మండితకర్ణ
  
యనియు, అష్టమహిషీకల్యాణముయొక్క పీఠికలో
      
     ......కావ్యంబుఁ జెప్పి
     యెనలేని శ్రీవేంకటేశు మెప్పించి
     ......మకరకుండలము లిమ్మహి గొన్నవాఁడ
    
అనియు, నాశ్వాసాంతముల యందు
       
ద్వి. అనుపమ శ్రీవేంకటాధీశదత్త
     మకరకుండలయుగ్మ మండితకర్ణ

యనియుం జెప్పియున్నాఁడు. ఈతఁడు కావ్యముచెప్పి మెప్పించిన వేంకటాద్రి లేక వేంకటాధీశుఁ డెవఁడు? వీరేశలింగముపంతులుగారు పై వేంకటాద్రి వసుచరిత్రకృతిభర్తయగు తిరుమలదేవరాయని సోదరుడును బ్రసిద్దినొందిన "తాలికోట" యుద్ధములో విజయనగరసైన్యములకు సర్వసైన్యాధిపత్యము వహించి రణవిహతుఁడైన వేంకటాద్రి యని తలఁచి చంద్రగిరిలో రాజ్యముచేసిన తిరుమలదేవరాయుని చతుర్దపుత్రుడగు వేంకటపతిరాయుఁడేమో యనికూడ సందేహించియున్నారు. మఱికొందఱుకూడ తిరువేంగళనాథుని సత్కరించినయాతఁడు వేంకటపతిరాయఁడే యని తలఁచుచున్నారు. కాని వేంకటపతిరాయునికి "వేంకటాద్రి" యను నామము కాన్పింపదు. (1) వసుచరిత్ర (2) చంద్రభానుచరిత్ర అను నాంధ్రగ్రంథములును (1) కువలయానందము, (2) శృంగారమంజరీనాటకము,(అముద్రితము) అను సంస్కృత గ్రంథములును తిరుమలదేవరాయపుత్రుని వేంకటపతిరాయఁడే యని చెప్పినవి. కాన వేంకటపతిరాయుని వేంకటాద్రియని చెప్ప వీలులేదు. తిరుమలదేవరాయుని సోదరునికి "వేంకటాద్రి" యను నామమును చరిత్రకారులు వాడియున్నారు. వసుచరిత్రకారుఁడు కూడ నాతనిని "వేంకటాద్రి" యని చెప్పియున్నాడు. (చూడుఁడు వసుచరిత్ర 1-51) కాన తిరువేంగళనాధుని సత్కరించినయాతడు 1560 సం॥ర ప్రాంతమున నుండుటచేఁ గవియు నప్పటివాఁడె కాని 1600 స॥ర ప్రాంతపువాఁడు కాఁడు. ఈకాలము తిరువేంగళనాధుని తాత యన్నయ్య కృష్ణదేవరాయల కాలమున నుండెనను శ్రీపంతులుగారి యభిప్రాయమునకుఁ గాని యంతకుముందు ముప్పది నలువది వత్సరములకు ముందుండిన శ్రీనాథుని కాలమున నన్నయ్యయుండునను శ్రీప్రభాకరశాస్త్రిగారి తలఁపునకుగాని యంతవిరుద్ధముగా గాన్పింపదు. మఱియు బెదతిరుమలయ్య మండెముకోటలో నుండుట విజయ నగరసామ్రాజ్య ముచ్చస్థితిలోనుండినపుడై యుండును. ఆతనికుమారుఁడగు మనకవికూడ విజయనగరప్రాంతముననె యుండియుండును. వేంకటపతిరాయలు చంద్రగిరి వేలూరు ప్రాంతములలో నధికారమును వహించినేకాని మండెముప్రాంతము నేలలేదు. కాన సర్వవిధములఁ గవి 1560 సం॥ర ప్రాంతపువానినిగాఁ దలపోయవలసియున్నది. విజయనగర రాజ్యవిచ్చిత్తిననుసరించి తద్రాజవంశజులతోఁబా టీకవివంశజులును “చంద్రగిరి" ప్రాంతములకుఁ జేరి తమకులదైవతమగు తిరుపతివేంకటేశుని సేవింపఁ దిరుపతిలో స్థిరపడి తమపెద్దలు రచించిన యమూల్యములగు గ్రంథజాలమును రాగిరేకులపై వ్రాసి శ్రీవేంకటేశ్వరాలయమున కర్పించిరి. అవి నేఁటికిని గలవు. వానికిఁ బ్రతులను తిరుపతిమహంతుగారు వ్రాయింపఁబోవుచున్నారను సంతసవార్త వినిపించుచున్నది.

గ్రంథవిశేషములు.

ఈగ్రంథము వైష్ణవభక్తాగ్రేసరులగు “పన్నిద్దతాళ్వారుల” చరిత్రమైయున్నది. “తిమ్మభూపాలుఁ" డను మఱియొకకవి పైయాళ్వారులచరిత్రమునె పరమయోగివిలాస మనుపేరుననె పద్యకావ్యముగా రచించెను. ఇద్దఱు నించుమిం చొకకాలపువారె. వీరిరువుర కవిత్వములలో నెవరికవిత్వము శ్రేష్ఠమైన దనుటలో నభిప్రాయభేదము కలదుగాని కవులనందఱ నేదియోయొకవిధముగా హేళనముఁ జేయువాఁడను ప్రథ గల తెనాలిరామలింగకవియె యీతనిఁ బొగడె నను నీపద్య మొకటి లోకములో వ్యాపించియున్నది.

క. చిన్నన్న ద్విపద కెరఁగును
   బన్నుగఁ బెదతిరుమలయ్య పదమున కెరఁగు౯
   మిన్నంది మొరసె నరసిం
   గన్నకవిత్వంబు పద్యగద్య శ్రేణి౯.

పదలాలిత్యము, అర్థగాంభీర్యము, శబ్దాలంకారాదివిశేషములు నీతనికవిత్వమునఁ బ్రకాశించును. ఈతనిద్విపద రచనాచమత్కృతి పిమ్మటనుండిన ద్విపదకవులకు మార్గదర్శకమైనది. కవిత్వవిశేషము లీగ్రంథపాఠకులకే విశదమగునని విడచి, కవి తననుగూర్చి చెప్పుకొనినవిశేషముల “నష్టమహిషీకల్యాణము”నుండి దిజ్మాత్రముగ వ్రాయుచున్నాఁడను,

ద్వి. .......... కావ్యంబుఁ జెప్పి
     యెనలేని శ్రీవెంకటేశు మెప్పించి
     సకలంబు నెఱుఁగ నసాధారణాంక
     మకరకుండలము లిమ్మహిఁ గొన్నవాఁడ
     దినములోననె వేయి ద్విపద లింపొంద
     వినుతవర్ణనలతో విరచించువాఁడ
     గవిశిరఃకంప యోగ్యప్రతిద్విపద
     నవబిరుదాంకుండ.... .......

కొంకక తమనోరికొలదులఁ బలుకు
మంకుఁబోతులకు గ్రామ్యంబుసామ్యంబు
ఆరీతి నుడువక యలఘుశబ్దార్థ
సారసరీతి రసప్రభావముగఁ
గులికి కస్తురివీణెఁ గోసినకరణిఁ
దెలికప్పురపుఁగ్రోవిఁ దెఱచినసరణి
విరవాదిపొట్లంబు విడిచినమాడ్కిఁ
బరిమళించుచుఁ గవుల్ బళిబళి యనఁగఁ
గవితచెప్పినసులక్షణుని గవీంద్రుఁ
డవునందు రేనేర్చినట్లు చెప్పెదను"

ఈతఁడు చెప్పుకొనినది యతిశయోక్తిగాక స్వభావోక్తియే యని గ్రంథపాఠకులకు విశదము కాఁగలదు. ఇట్టి యుద్గ్రంథమును ముద్రింపించి లోకోపకృతి గావించిన శ్రీశ్రీశ్రీ మహారాజావారికిఁ బరమేశ్వరుఁడు పుత్రపౌత్రాభివృద్ధియు నాయురారోగ్యైశ్వర్యాభివృద్ధియు నొసఁగుఁగాక.