పరమయోగి విలాసము/పంచమాశ్వాసము

పరమయోగివిలాసము

పంచమాశ్వాసము.

హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశాలికాసారముఖ్యభక్తాళి
వనమాలి! యవధారు వరదానశీలి!
యవిరళశ్రీలచే నమరుదేశంబు
ఠవణించు బాండ్యమండలమధ్యమమునఁ
బొగడొందు శ్రీవిల్లిపుత్తూరు నాఁగ
నగర మొక్కటి యొప్పు నవ్యవైఖరుల
నవ్వీటిసౌధచంద్రాననామణుల
నవ్వువెన్నెలసోగననల నిచ్చలును
విలసిల్లుతావుల విన్నేటిలోని
కలువలు వికసించుఁ గమలముల్ మోడ్చు
నలపురివీథుల ననిశంబు మెలఁగు
జలజనేత్రలకటాక్షంబులవలన

మట్టుమీఱినపుష్పమయతోరణములు
కట్టకకట్టినగతి నొప్పుచుండు
నట నొప్పు శేషపర్యంకంబునందు
వటపత్రశాయి నా వసుదేవసుతుఁడు
తనయపాంగామృతధారలచేత
వినుతతాపత్రయవిపులార్తి నార్చు
ననుపమం బైనట్టి యప్పట్టణమున
వనజలోచనముఖవనజవంశమున
సిరిమించుకళలతో జ్యేష్ఠమాసమున
వరలగ్నమున గంధవహతారయందు
నక్షీణవేదమయాంగుఁ డైనట్టి
పక్షీంద్రునంశంబు ప్రభవించి జగతి
నెట్టన సురగురు నిరసించుపేర్మి
భట్టనాథుం డనఁబరఁగి వెండియును
నరయంగ సకలకలాశ్రయుం డగుట
నిరుపమకారుణ్యనిధి యైనకతన
వైష్ణవపూజావివర్ధనుం డగుట
విష్ణుచిత్తుం డనవిఖ్యాతి నంది
యచ్చటివటధాము హరికోటిధాముఁ
బచ్చవిల్తునితండ్రి భక్తిఁ గొల్చుచును

ఈసరోజాక్షున కెట్టిపూజనము
సేసి చిత్తంబు రంజిల్లఁజేయుదునొ
యని రమావిభునిదశావతారములు
మనములోపలఁ బలుమాఱుఁ జింతించి
నందనందనుఁ డైన నందకపాణి
నందితకథలు నానందించుకొనుచు
మధురలోఁ దొలుత మన్మథవైరి కంసు
వధియించుకొఱకుఁ దీవుత నేగి యేగి
హరిపుష్పలావకుండగు వానియింటి
కరిగెఁ బువ్వులకునై యాత్మ నొండిడక
కావున ధవళపంకజలోచనునకుఁ
గావించు సకలయాగంబులకంటె
నరయంగఁ గడుమనోహరమైనపూజ
విరులపూజన మని వివరించి తెలిసి
భావించి వటధామభర్త కే నట్ల
కావింతు సుమదామకైంకర్య మనుచుఁ
జందన చాంపేయ శారద వకుళ
కుంద మాకంద ముకుంద మందార
కరవీర ఖర్జూర కరక జంబీర
కురువ కరంట కాకోల నారంగ

కేసరి కింశుక కేతకి నాగ
కేసరముఖవరక్షితిజవల్లికల
సురరాజువనము, నసురరాజువనము
నరపాలువనము, వానరపాలువనము
నగుచు గేలింపుచు నంటుసేయుచును
బొగడుచు జగతి కద్భుతము దీపింప
లలితసంతతచైత్రలక్ష్మిచే మిగుల
నలవడ నారామ మభిరామముగను
నొనరించి యమ్మహాయోగీంద్రచంద్రుఁ
డనయంబు భక్తితో నరవిరుల్ గోసి
దామము ల్గట్టి నిత్యము వటపత్ర
ధామమూర్తికి నర్పితంబు సేయుచును
సరవిధారకముఁ బోషకము భోగ్యంబుఁ
గరిరాజవరదుకైంకర్యంబు గాఁగఁ
దలఁపుచు నితరచింతలు గట్టిపెట్టి
యలఘువిద్యాసంగతాత్ముఁడై యుండె
నాకాలమున నొప్పు నగణితశ్రీలఁ
బ్రాకటం బగు మధురాపురం బనఁగ
నురుతరం బగుచు సర్వోత్తరం బగుట
నరయంగ రాజరాజాన్వితం బగుట

నలకాపురముఁ బోలె నమ్మహానగర
మలరు నచ్చటిమేడలందుఁ జరించు
నేణలోచనలముఖేందుబింబంబు
లేణాంకబింబంబు నెదురుతాకైనఁ
దమపతి యితఁ డంచుఁ దలఁపంగ లేక
భ్రమసి తారాళి యేర్పఱపరాకుండు
నాపట్టణాధీశుఁ డమరేంద్రుఁ దొడరి
యాపట్టణం బేలు నమృతాంశుకులుఁడు
దీపకవల్లభదేవుండు ఘనుఁడు
భూపచంద్రుఁడు పాండ్యభూవల్లభుండు
జనులెల్ల జయలిడ సకలరాజ్యంబు
బనుపడ నెంతయుఁ బాలించుచుండి
తనయేలుపురమునందలిసర్వజనుల
యునికియు వా రాడుచుండువాక్యములుఁ
గన వినం గోరి యొక్కఁడ యొక్కనాఁట
ననయంబుఁ గార్కమ్ము[1] నట్టిరేరేయి
భృంగకాంతుల జళిపించువన్నియల
గొంగడి ముసుఁ గిడుకొని యిల్లువెడలి
వీడులోపల వీథివీథులఁ బౌరు
లాడు వాక్యంబుల నాలకింపుచును

అరిగి పురంబెల్ల నంతయు నరసి
తిరిగి యింటికి నేగుదెంచుచునుండి
యొకపంచతిన్నెపై నొక్కండ యలసి
నికటభాగంబున నిద్రించుచున్న
భూసురవరుఁ జేరఁ బోయి యాచెంత
నాసీనుఁ డగుచు నొయ్యనమేలుకొలిపి.
యొక నేర్పుమైఁ బ్రసంగోచితోక్తులను
వికసింపఁ జేసి కైవీడియం బొసఁగి
యెందుండి వచ్చితి వీరీతి నొంటి
నిందేల నిద్రించె దీవు నావుఁడును
బనివడి దివ్యసంపద లొసఁగంగ
మునుమిడి ఘనదోషముల మెసఁగంగ
మహితవిజ్ఞానంబు మదిబొసఁగంగ
నిహపర సౌఖ్యంబు లెసగంగ, జడిసి
దుసికిలిలోనిశత్రులు విసుకంగ
వెస గంగ కరిగి వేవేగంబ మరలి
చనువాఁడ నగుచు నిచ్చట [2]నెండవడిని
వెనుకొన్న బడలిక విశ్రమించెదను
అన విని భూనాథుఁ డవనీసురేంద్రుఁ
గనుఁగొని పలికె.నక్కడఁ బెద్దలైన

సదమలజ్ఞానుల సంగడి మీరు
చదివివచ్చినవిశేషము గల్గెనేని
యానతి మ్మన విని యాత్మ నుప్పొంగి
భూనాథుతో విప్రుంగవుఁ గవుం డనియెఁ
గడునేర్పుమై వానకాలంబుకొఱకుఁ
గడమ యెన్మిదినెల ల్గడియింపవలయు
నగపడురాత్రికై యాత్మఁ జింతించి
పగలె వస్తువుల సంపాదింపవలయు
మునువచ్చువార్ధకమునకునై నరుఁడు
తనయౌవనమున యత్నము సేయవలయు
భాజనీయం బైనపరకారణంబు
నీజననమునందె యెఱుఁగంగవలయు
ననునర్దములు గల్గి యఘదూర మగుచుఁ
జనగ వర్షార్థ మస్టౌప్రయతేత
మాసాననెడుశ్లోకమహిమఁ దా నప్పు
డాసార్వభౌముతో ననువదించుటయు
నాలించి విభుఁడు తదర్థ మంతయును
జాల డెందంబులోఁ జర్చించి చూచి
కోరక కర్మానుగుణముగా నెపుడు
వారక సంపద ల్వచ్చుచున్నవియ

కలదె యదృష్టంబు గలిగించువెరవు
తెలియంగవలయు నింతియ యాత్మ కనుచు
నగరికి నంతఁ గ్రన్నననేగి కలువ
పగదాయ పొడుపుగుబ్బలిమీఁదఁ బొడమ
నుచితసంధ్యావిధు లొనరించి రత్న
రచిత సభామందిరమున కేతెంచి
యింపుమై భూనాథు లిరుమేలఁ గొలువ
సంపదుం డనుపేరఁ జనుపురోహితుని
రావించి తనయంతరంగంబులోని
భావమంతయుఁ దేటపడఁ జెప్పఁదొడఁగెఁ
గలయంగ ధర్మార్థకామసౌఖ్యములఁ
దెలిసి యవ్విధుల వర్తించి చూచితిని
బోలింప నంతిమపురుషార్ధసిద్ధి
యేలీలఁ దెలియుదు నెఱిఁగింపవలయు
ననిన రాజేంద్ర! నీ వడిగినసూక్ష్మ
మనిమిషులకు నైన నది యెన్నఁ దరమె
యైన మహాత్మ! శ్రీహరిపాదమతివి
కాన నీ వెఱుఁగంగఁగలవు చెప్పిదను
నిగమాంతవిధులచే నిశ్చతం బైన
నిగమార్థ మాత్మలో నిలిపి నమ్మినను

గానంగవచ్చు మోక్షముత్రోవయెల్ల
భూనాధ! యన మనంబున విచారించి
కనకముల్ పెక్కు శుల్కంబు గావించి
తనసభా స్తంభమధ్యమునఁ గట్టించి
యలయంగఁ దనలోనియనుమాన మెడయ
ధర నెవ్వరేఁ బరతత్త్వనిర్ణయముఁ
జేసి యీశుల్కంబుఁ జేకొనుం డనుచు
రాసికి నెక్కుమర్యాద గావించి
ప్రకటవివేక సంభరితులచేత
సకలదిక్కులయందుఁ జాటంగఁ బనిచెఁ
బనిచినఁ గపిలాక్షపాదభట్టాది
ఘనశాస్త్రవిదు లైనఘను లేగుదెంచి
యారాజుసన్నిధి నాసీను లగుచుఁ
జేరి యొండొరులు చర్చించి చర్చించి
యది మృష యిది మృష యనుచు గడ్డంబు
లదరంగ హస్తవిన్యాసంబు లెసఁగ
వినుఁడు పల్మాఱు గర్వించి మాయెదుట
వనర నేమిటికి సర్వము మిథ్య మీకు
ననయంబు నిశ్చయం బగునె మీచేత
ననుమానములదొంతియాకార మెల్లఁ

గారు లేటికిఁ బుట్టు కర్ము లైనట్టి
మీర లీయర్థ మెమ్మెయి నెఱుంగుదురు
పెలుచ మాటలరాసిఁ బెట్టనేకాని
తెలియునే మీకు నదృష్టకారణము?
ఆగమబాహ్యుల రయినట్టిమీకు
నాగమాంతార్ధంబు లవి యేల తెలియు
ననుచు నన్యోన్యమతాభిదూషణము
నొనరింపుచును జేరి యొండొరులకును
సారెకు నిగ్రహస్థానంబు లిడుచు
నీరీతి నిశ్చయం బెందును లేక
పెరుగు వడ్లును గలిపినరీతి నుండ
నరనాథుఁ డెంతె చింతాస్వాంతుఁ డయ్యె
నట ధన్వినగరవరావాసుఁ డైన
వటపత్రశయనుండు వాత్సల్యజలధి
తనకు నిచ్చలు పుష్పదామసంపదలఁ
గొనివచ్చి యొసఁగుభక్తుని విష్ణుచిత్తుఁ
గని వత్స! పాండ్యభూకాంతునిసభను
గనుపట్టుకనకశుల్కంబుఁ గైకొనుము
అన విని యరుదంది యయ్యోగివరుఁడు
వినయ మేర్పడ విన్నవించె శౌరికిని

వేదమో శాస్త్రమో వివరించిచూడ
వేదార్థసాధ్యమై వెలయుశుల్కంబు
పాయక గుద్దలిఁ బట్టినకేలి
కాయలు చూపి యేఁ గైకొను టెట్టు
లితరవిచారంబు లెవ్వియు నెఱుఁగ
మతి నీదుపాదపద్మము లెఱుంగుదును
అన విని కరుణా కటాక్షామృతంబుఁ
జనుకుచు నావిష్ణుచిత్తుని కనియె
నీకడ సుదియం బేటికి వలదు
నీ కేమిభార మిన్నిటికి నే నుండఁ
దలఁప నీహృదయపద్మములోన నేన
నెలకొని నిగమాంతనిశ్చితార్థంబు
పలికించువాఁడను బలికెడువాఁడ
నలమహాశుల్కంబు హరియించువాఁడ
నేన నీ వటఁ బోయి యిటకు రమ్మనుచు
నానతిచ్చిన యంత నాయోగివరుఁడు
పరమసంతోషసంభరితుఁడై యాది
గురునియోగమున మిక్కుటపువేగమునఁ
జని యాంజనేయుండు జానకీనాధు
ననుమతిఁ గడలిఁ జయ్యన దాఁటినట్టు

లతులగ్రహాదిసమంచిత, వేగ
వతి యనునొకమహావాహిని దాఁటి
మధువైరి కుమతుల మర్దించుకొఱకు
మధుర సొచ్చినరీతి మధుర సొత్తెంచి
వాటమై మిగుల విద్వత్కదంబముల
బేటాడు నారాజు పేరోలగంబు
నల్లంత వీక్షించి యటకు నేతేర
వల్లభదేవుఁ డావనజాక్షుచిత్తు
నకలంకమతి యైనయభిమన్యుసూతి
శుకయోగి గనుగొన్న చెప్పునఁ గాంచి
గ్రక్కున సింగంపుగద్దియ డిగ్గి
యెక్కుడుభక్తిమై నెదు రేగుదెంచి
తనపురోహితుఁడును దానుఁ దత్పాద
వనజయుగంబు మైవ్రాలి యగ్గించి
తోకొనివచ్చి బంధురరత్నపీఠిఁ
జేకొని యాసీనుఁ జేసి సద్భక్తి
భ్రాజితంబుగ నర్ఘ్యపాద్యాదివిధులఁ
బూజింపఁ జూచి యప్పుడు చెంతనున్న
పరమతవాదులై పరఁగుపాషండ
ధరణీసురులు చూపుదాళ కి ట్లనిరి

బహువేదవేదాంతపఠ నాది విధుల
మహి నెన్నఁదగు మహామహు లైనవారి
సజ్ఞులుగాఁ జూచి యతఁడునుం దానుఁ
దజ్ఞులపోలె నీధారణీశ్వరుఁడు
బినుఁగుదాసరి నొకపెద్దగాఁ జేసి
కొనివచ్చి పొడవునం గూర్చుండఁబెట్టి
పలువిధంబులఁ బాలుషడి మాపుదసకఁ
జిలివిషంబులు గొన్ని సేయుచున్నాఁడు
పట్టెనామంబులు ఫాలభాగమునఁ
బెట్టిన వచ్చెనే పెద్దఱికంబు?
ఆ రాజుచేసినయది కొంతకాక
యీరీతి నేమిటి కీశుంఠకాయ
వైదికుఁడైయుండి వ్రాత్యుచందమున
నీదెసఁ దాఁ బురోహితుఁ డైనవాఁడు
వల్లభదేవుండు వందనం బిడినఁ
జెల్లఁబో! తా నేల సేసి వందనము
లంపటఁబడఁగఁ దాళ్ళకుఁ దలబంటి
యెంపటిచెట్లకు నిఁకనెంతబంటి?
యనునీతిశాస్త్రంబు లందలికొదవ
లొనర దిద్దెడునట్టియోగ్యులచేత

నెక్కడఁ దీరని యీబీరకాయ
చిక్కు దా నితనిచేఁ దీరుటయెట్లు
పన్ని యసూయయేర్పడఁ బలుమాఱు
నిన్నియు నన నేల యిందె చూచెదము
అనువారు కొందఱు నతఁడు మహాత్ముఁ
డనువారు కొందఱు నై యుండి రంత
హితవుమీఱఁగఁ బురోహితుఁడు భూధవుఁడు
నతు లొనర్పుచు భట్టనాథు నీక్షించి
యాదట మోహశాస్త్రావనీస్థలుల
భేదింపరాక యభేద్య మైనట్టి
యనుపమపరవస్తు వనువిధానంబుఁ
గనఁజేయువిద్యాప్రకాశాంజనమునఁ
బదపడి యెన్నేని బలుమాఱు నిచటఁ
దుద మొద లెఱుఁగక దుష్టవాక్యములు
నుడివెడువీరలనోళుల ముద్ర
లిడినట్లు వేవేగ నిఁక జాగుమాని
దాసవత్సల! పరతత్త్వనిర్ణయముఁ
జేసి మమ్మిటు దయసేసి రక్షింపు
మనవుఁడు మోదించి హరిచిత్తుఁ డపుడు
తనలోనివటపత్రధాముఁ బార్డింపఁ

బరమేష్ఠియనుమతిఁ బ్రాచేతసునకుఁ
బరిపూర్ణవిజ్ఞానపద మొందినట్లు
ఘనపాంచజన్యసంగంబున ధ్రువున
కనుపమసకలవిద్యలు వచ్చినట్టు
లఖిలేశుకృపను జిహ్వారంగసీమ
నఖిలశాస్త్రములు నృత్యములాడుచుండ
ననఘుఁ డాహరిచిత్తుఁ డనియె నవ్వేళ
జనపతి భూమినిర్జరులును వినఁగఁ
బ్రకృతిజీవులకు లోపలను వెల్పలను
సకలశాస్త్రముల నిశ్చలత దీపింప
నాది యంత్యము లేక యధికుండు సముఁడు
నేదెస లేక సర్వేశ్వరుం డగుచు
సర్వనియంతయై సర్వజ్ఞుఁ డగుచు
సర్వంబుఁ దనకు శేషంబుగా మెలఁగు
కాంతిఁ బాయనిమణికరణి నాదివస
కాంతుఁ బాయనిరుచిగతిఁ బద్మఁ గూడి
మిగులవేదములాడి మిథునం బటంచుఁ
బొగడఁ బెంపొందు శ్రీపురుషోత్తముండు
పరతత్త్వమని పల్కు పల్కులోపలనె
సరగునం దత్సభాస్తంభమధ్యమున

ఘనపాశములఁ గూడఁగట్టినముడుపు
తనుదానె యతనిపాదములపై వ్రాలెఁ
దోడనే మొఱసె దుందుభులు రంభాదు
లాడిరి కొనియాడి రఖిలభూసురులు
సురలు మోదించిరి సొరిది నందంద
విరివాన కురిసె కావిరియెల్ల విరిసె
నప్పు డారాజేంద్రుఁ డంతరంగమున
నుప్పొంగి పొంగి యయ్యోగినాయకుని
బదపద్మముల వ్రాలిలి పరమానురక్తిఁ
బదివేలతెఱఁగులఁ బ్రణుతిఁ గావించి
యోపావనాత్మ! యోయోగీంద్రచంద్ర!
నాపాలిదైవంబ ననుఁ గన్నతండ్రి!
యనుచు నానందబాష్పాంబుపూరములు
నినుపార నాయోగినీరజమిత్రుఁ
బ్రచురమాల్యాంబరాభరణుఁ గావించి
రుచిరదంతావళారూడుగాఁ జేసి
బహుతరచతురంగబలపుత్త్ర మిత్ర
సహితుఁడై యనుచరుచందానఁ గొలిచి
తనపురంబెల్లఁ బ్రదక్షిణగతుల
నెనలేనివేడుక నేగించుతఱిని

ఆబోకపావనునభినవోత్సవము
నాలోకనము సేయునట్టివేడుకను
గమలాసనుఁడు చండకరశీతకరులు
నమరేంద్రసిద్ధవిద్యాధరు ల్గొలువ
శ్రీహరి కలిమినెచ్చెలువతో గరుడ
వాహనారూఢుఁ డై వచ్చి యవ్వేళఁ
దనయుఁడు బ్రహ్మ రథంబుమై మెఱయ
జననియు జనకుండు సంతసం బొదవఁ
గనుఁగొనుగతి గజస్కంధంబుమీఁద
దనరారువిష్ణుచేతను గటాక్షింప
విష్ణుపదంబుమై వెలుఁగొందుచున్న
విష్ణు సేవించి యవ్విష్ణుచిత్తుండు
నరయ నకాలదేశాస్పదం బైన
పరవస్తు విపుడు చూపట్టెఁ గన్నులకు
ననిభక్తిపరవశుం డై శంబరారి
జనకునిఁ గాంచి యాజగదేకనాథు
సర్వజ్ఞుఁడును సర్వశక్తియుం దాన
సర్వంబు ననుచుఁ గ్రచ్చర భక్తిపరత
జలజాక్షులావణ్యసౌందర్యముఖ్య
ములకె మిక్కిలి చిక్కి మోహించి యప్పు

డీమోహనాంగున కీదృషిదోష
మేమియు లేక సొం పెసఁగుఁ గాకనుచు
జంటలై మొఱయు కుంజరముమై పసిఁడి
గంటలు తాళము ల్గాఁగఁ జేఁబూని
నవరసరాగవర్ణములఁ బెంపెసఁగ
సవరించి మంగళాశాసనం బపుడు
శ్రీమాల్యకారునిచే దివ్యపుష్ప
దామముల్ తాల్చి యుద్ధత రంగసీమ
జాణూరమల్లుని సమయించి మిగుల
రాణించుశౌరిదోర్దండంబులకును
వలపల రవికోటి వడఁకించుకాంతిఁ
దలుకొత్తుచుండుసుదర్శనంబునకు
నలచెంత ననిదైత్యు లగలునాదములు
సలుపుచుండెడు పాంచజన్యంబునకును
నపరంజిబొమ్మయో యన నొప్పు మేన
నుపమింపఁ దగి యెద నున్నయిందిరకుఁ
గెందామరలపస గిలుబాడుపసల
యందంబు గలుగు నీయడుగుఁదమ్ములకుఁ
బూనికతోడ నెప్పుడు బంట నైన
యేనును నీవును నెర వింత లేక

యొనఁగూడియుండెడియునికి కెంతయును
నెనసియుండుగఁ బెక్కేండ్లు మంగళము
మంగళం బని పలుమాఱు ననంతు
సంగతి మంగళాశాసనం బిట్లు
సవరించి మఱియు నాశౌరినందనుని
యవతారములయందు ననయంబుఁ జిక్కి
దామోదరుని యవతారాదిలీల
లామోదమాలిక లై యొప్పుచుండఁ
బ్రామాణికోక్తిగర్భంబు లైయొప్పు
ద్రామిణోక్తులఁ బ్రబంధంబుఁ గావింప
ననయంబు హర్షించి యూరమావిభుఁడు
తనదివ్యశక్తి యాతనియంద నిలిపి
శ్రీవల్లిపుత్తూరఁ జెన్నొందుచున్న
యావటదళధాముఁడై యనువొంద
నరుదెంచి యప్పు డాయవనీశతిలకుఁ
డిరవొందఁ బురమెల్ల నేగించి పిదప
ననురాగ మిగురొత్త నావిష్ణుచిత్తు
ననుపమసింహాసనాసీనుఁ జేసి
మండితకాంచనాంబరభూషణముల
వెండియుఁ బూజఁ గావింప నయ్యోగి

నరనాథుఁ బెక్కుచందముల లాలించి
కరివరారూఢుఁడై క్రమ్మఱ మరలి
తనపురి కేగునత్తఱిఁ బౌరజనులు
వినఁ గ్రొత్తయైన యవ్వృత్తాంత మెల్ల
విని పురిఁ గైసేసి వేవేగ నెదురు
చనుదెంచి ప్రణతు లర్చనలు గావింప
భూరిరత్నాంబరభూషణావళుల
వారి సంభావించి వారనివేడ్క
వారునుం దాము నావటధాముఁ డైన
నీరజనేత్రుసన్నిధికి నేతెంచి
యతనిపాదంబుల కందంద వ్రాలి
నుతి సేసి భక్తి కన్నుల నామతింప
నోతండ్రి! నాలోన నుండి వేదార్థ
జాతంబు భువిలోని జనులెల్ల వినఁగఁ
బలికించువాఁడను బల్కి శుల్కంబు
వలనొప్పఁ గైకొనువాఁడను నేన
యని యానతిచ్చితి రారీతి నయ్యె
ధన మిదే భద్రదంతావళం బిదియె
యని సమర్పించి నిజావాసమునకుఁ
జనుదెంచి యెప్పటిసరవి నిచ్చలును

నతులితం బగుభక్తి నారమాపతికి
నతనియుత్సవబేరమై ప్రకాశించు
నలఘువిద్యాపూర్ణుఁ డౌమురారికిని
నలరుదామంబుల నర్పించికొనుచుఁ
బరమవిరక్తిఁ బ్రబంధయుగ్మంబు
విరచించి లోకైకవిదితుఁ డైయుండె
నెన్న శక్యముగాక యిలలోన నున్న
తోన్నతం బైన యియ్యోగీంద్రుచరిత
ననలొత్తుకూర్మిమై నరు లెవ్వరేని
వినిన వ్రాసినఁ జదివిన నుతించినను
భయములు దార్చు శోభనములు చేర్చు
జయముల నిచ్చు దుర్జయము లడంచు
నట ధన్వినగరవరావాసుఁ డైన
పటధామపాదజీవనషట్పదంబు
చిరతపోనిధి విష్ణుచిత్తుఁడు హరికిఁ
గరమర్థి సుమధామకైంకర్యపరత
ననిశంబుఁ దనసేయు నారామమునకుఁ
జనుదెంచి యవ్వనస్థలిఁ బాదుకొన్న
పొన్నమ్రాకుల కెల్ల బోది గావించి
కన్నియమొగలిమోకల సేద్యపఱచి

గొజ్జంగిపొదలకుఁ గుదురు లమర్చి
గుజ్జుమొల్లల కాముకొన నీరుగట్టి
శరవీరములదండఁ గాలువల్ దీర్చి
విరవాదిపాదులు విరివి యొనర్చి
కలయంగ మరువంబుకల పేర్పరించి
యలవిమీఱినమల్లియల కంటులొత్తి
పారిజాతములకుఁ బాదు లమర్చి
యీరీతి మఱియు ననేకవైఖరుల
నారామసీమ సొంపారెడుపుష్ప
భూరుహవల్లికాభూరిసంతతికి
నవవసంతుఁడపోలె ననలొత్తఁజేసి
సవరగా నచట నేచక్కిఁ జూచినను
మిసిమిగా నల్లడ మిఱ్ఱు బల్లంబు
కసవుఁ గట్టెయు ఱాయుఁ గంప లేకుండఁ
బస మించు కన్నులపండువు గాఁగ
వసుమతీసతికన్నువలె నుండఁజేసి
పరిమళమిళితపుష్పంబులు గోసి
కరమర్థి నించిన కరఁడిచే బలసి
పనుపడ మనురాజపరనచే వెలసి
మనమున సంతోషమగ్నుఁడై తులసి

పొలుచు క్రొన్ననలతోఁ బొలుచునెత్తావిఁ
గలసి వన్నియమరకతముల సొలసి
వరపుష్పములసౌరభంబులఁ గలసి
సిరిమించు తులసి వేంచేయింపవలసి
తొఱఁగెడు బహుపుష్పధూళిమధూళి
బెరసి పంకముగఁ జప్పిలుచోట్ల దాఁటి
తవిలి యావనదేవతలు వనశ్రీకి
సవరించుదీపికాస్తంభంబు లనఁగ
మొగశిరోమాణిక్యముల పాపరేలు
తగిలి వేడించుచందనములు గడచి
ప్రవహించుచున్నమరందవాహినులఁ
దివుటమై దాఁటి యెంతే వేడ్కతోడఁ
గట్టిగాఁ బువ్వులకరఁడి యొక్కెడను
బెట్టి గుద్దలిఁ గేల బిగ్గ నమర్చి
ననుపారఁ దులసీవనంబు నల్లడలఁ
దనరఁ ద్రవ్వుచునుండి తన్మధ్యమునను
శుచిమాసమునఁ బుబ్బశుభముహూర్తమున
గుచిరగారుత్మతరుచిరేఖ వోలెఁ
దోరమౌ నొకమంచితులసిమూలమున
ధారుణియంశ ముద్భవమై చెలంగి

బాలయై యెదుటఁ జూపట్ట నయ్యోగి
చాల నక్కజమంది సంతసింపుచును
బ్రతిలేనిశృంగారరాశియో యనఁగ
రతిరాజు కేలికైరవబాణ మనఁగ
లలిమించు నవ్వనలక్ష్మియో యనఁగ
నెలకొన్న విదియక్రొన్నెలసోఁగ యనఁగఁ
గనుపట్టు నాకన్యకరపల్లవముల
నినుమడించినకూర్మి నెత్తి ముద్దాడి
తలపోయ నిచట నీతామరకంటి
తులసిమూలంబునఁ దోఁచు టద్భుతము
మానవబాలికామాత్రంబు గాదు
జానకిసరిఁ బోల్పఁ జను నీలతాంగి
యనుచు వెండియు వెఱఁగంద నందందఁ
బనుపడ నశరీరి పలికె నభ్రమమున
హరి పూర్వమున వరాహావతారమున
ధరణిఁ గొమ్మున సముద్ధరణంబు సేసి
యెనయఁ గౌఁగిటఁ జేర్చి యెలమిగావింపఁ
దనపతిఁ జూచి యాధాత్రి యిట్లనియె
ననిశంబు నీ కిష్టు లగువార లెవ్వ
రనిశంబు నీ కిష్ట మగుపూజ యెద్ది

యానతి మ్మనఁ బ్రియురాలి నీక్షించి
శ్రీనాథుఁ డనియె నోశీతాంశువదన!
పొలుపార ననుఁ గూర్మిఁ బొగడెడువారు
నలరులదామంబు నర్పించువారు
నిష్టులు మిగుల నాకీపూజనములె
యిష్టముల్ వారికి నెనలేనియట్టి
చెడనిసంపద లిచ్చి చేసేఁత నెపుడుఁ
గడువేడ్కఁ బ్రోతు నోకల్యాణి! యనిన
విని యదిమొదలు నవ్విపులావధూటి
తనపతిమాట యెంతయు మది నాట
నిలలోన జనియించి యీపూజనంబు
జలజోదరునకు నే సవరింపవలయు
నని యెన్ని నీవు మహాయోగివరుఁడ
వని నీకు నందన నయ్యెద ననుచు
నీతోఁటలో జనియించెఁ బూర్వమున
సీతాంతరంబున సీతావధూటి
జనియించి జనకునిసత్పుత్రి యైన
యనువున నీకు నీయరవిందనయన
నందన యయ్యె నీనాళీకవదనఁ
బొందుగాఁ గొనిపోయి పోషింపు మింక

నకలంకశుభములు నభిమతార్ధములు
సకలసిద్ధులు నీకు సమకూరు ననిన
నుప్పొంగి యప్పు డయ్యోగీంద్రచంద్రుఁ
డప్పయోరుహనేత్ర నక్కునం జేర్చి
కొని యింటి కేగి మక్కువతోడఁ బిలిచి
తనభామచేతి కాతన్వంగి నొసఁగి
యలకన్య వొడమినయట్టిచందంబు
నెలయంగ నశరీరి వివరించుపలుకుఁ
దెలిపినప్పుడు మ్రోసె దేవదుందుభులు
వెలువక జడివట్టె విరివాన మింటఁ
గీర్తింపఁ దొడఁగిరి కిన్నరాంగనలు
నర్తించి రప్సరోనలినలోచనలు
నయమార నింద్రాదినాకలోకంబు
జయజయశబ్దముల్ సవరింపఁ దొడఁగె
సనకసనందనసన్మౌనిముఖ్యు
లొనరించి రభిమతు లుపనిషత్తులను
ఆవిష్ణుమానసుం డాబాలఁ గన్న
యావార్త విని వెఱఁగంది యంతటను
సకలశోభనవస్తుసంతతితోడ
సకలబాంధవులు నచ్చటి కేగుదెంచి

భట్టనాథునిఁ బ్రేమఁ బ్రణుతించి యతని
పట్టి నీక్షించి సంబరము రెట్టింప
నీవాలుఁగంటి నీవిటఁ గన్నయపుడె
యీవు ధన్యుఁడ వైతి విదికారణమున
నేము ధన్యుల మైతి మిందఱ మిప్పు
డోమహాభాగవతోత్తంస! యనుచు
నాడుచు నయ్యోగి నందంద పొగడి
పాడుచు నేతులం బసపుమానియలఁ
గపురంపుధూళులఁ గమ్మపన్నీట
గపురమించిన యరగనువిచ్చువిరుల
నాడుచు సరసంబు లాడుచుం జల్లు
లాడుచు వడివ్రేటు లాడుచుఁ జెలఁగి
యొండొరుం దమలోన నుప్పొంగి యిట్లు
దండిమై నందనోత్సవముఁ గావింప
సిరితోడునీడనెచ్చెలి తనయింటి
కరుదెంచినప్పుడే యఖిలసంపదలు
తముదామె వచ్చి నర్తనమాడుకతనఁ
బ్రమదంబుతోడ నా భట్టనాథుండు
బంధురభూషణాంబర కాంచనముల
బంధుమిత్రాళి సంభావించె నంత

భట్టనాథునిదేవి పరమానురక్తిఁ
బట్టి హస్తంబులఁ బట్టి నేరుపున
జగములఁ బొడమించు జలజసంభవుల
నగణితంబుగ బోరుకాడింపుచున్న
జగదేకమాతహస్తపుటంబునీటఁ
దగబోరు కాడించి తడివాయ నొ త్తి
జడియక బ్రహ్మాండజాలంబు లెపుడుఁ
గడుపులో నిడునట్టు గరిత నొక్కరిత
విలసిల్లుసేవంతివిరులచందమునఁ
దుళగించుచిన్నిపొత్తులలోన నుంచి
ప్రియమునఁ జన్నిచ్చి పెంచి లోకములు
నయమారఁ బోషించు ననుఁ గన్నతల్లిఁ
జన్నిచ్చి పెనిచె నీసరవి నయ్యోగి
కన్నియ కట జాతకర్మముల్ దీర్చి
యీదేవి హరి నెన్ను నిటమీఁద ననుచు
గోదాభిధాన మాకొమరితె కొసఁగి
యాకస్య నిజసవ్యహస్తంబు చూచి
యీకొమరిత జగదీశ్వరుం డైన
రమణుని పట్టంపురాణియై యుండు
క్రమమున ననుచు నాకలకంఠకంఠి

పల్లవాంబుజరాగపాటలపాద
పల్లవంబుల నున్నభాగ్యచిహ్నములు
గని సర్వగీర్వాణకామినీమణుల
మినుకారునెరుల తుమ్మెదలవేడించు
పదపంకజములఁ జొప్పడ నంచుమిగుల
మది సంతసించి ప్రేమమున నా బాల
బాలకైరవమిత్రఫాల, గోపాల
బాల వక్షోగంధ పటలజం బాల
జనకుండు వైదేహి, శరధి యిందిరను
బెనుపుచందంబునఁ బ్రేమ దైవాఱఁ
బెనుప రాగాములం బెరుఁగుచుఁ దమ్మి
ననబోఁడి కిలకిల నవ్వంగనేర్చి
యొయ్యన నుయ్యాల లూఁగుచున్నెడను
నెయ్యంబుమైఁ దల్లి నిదురబొమ్మనుచుఁ
బాటించి వేఱొకపాట వాడినను
బాటించి వినక యెప్పాటఁ బోరిడుచు
బలసోదరునిమీఁదిపాటఁ బాడినను
గిలకిల వాయెత్తి కేరినవ్వుచును
అంత నొయ్యన డొంగి యాడంగనేర్చి
నంత బంగరుగజ్జియలు నందియలును

గలకల రవణింపఁ గారుమెఱుంగు
పిలుప నానింటిలోఁ బిలిపిలినడల
మెలఁగుచు మోముదమ్మికి మూఁగుకొన్న
యలకభృంగముల నొయ్యన కరాబ్జమునఁ
జక్కనొత్తుచు డాలు జళిపించుమణుల
నక్కులమించు సన్నపురావిరేక
నునుపారువేల్పు టేనుఁగుపిల్లకొమ్ము
లను గట్టులొనరించులాగున నొప్పు
పుత్తడిబొద్దులుఁ బువ్వుదండలును
గుత్తంబుగా వలగొనుతేఁటిజాలు
లాగైనయింద్రనీలంపుగాజులును
బాగైనతరపనిపవడంపుసరులు
విలసిల్లు తేనియవిరిదమ్మి దొరఁగు
చెలువున లాలగెంజిగిమోవి జార
నల్లన లోకసంహతిఁ గన్నతల్లి
తల్లిదండ్రులపేరు తాఁ జెప్పఁదొడఁగెఁ
గరమర్ధి దాదిచెంగట చేరఁ బిలిచి
కరతాళగట్టనల్ గావించుగతుల
విన నవ్వుకొనుచు గోవింద! ముకుంద!
యనుచు వేడుక నృత్యమాడు నీరీతి

నింతయై యంతయై యెదిగి నానాఁటఁ
గుంతలంబులగురుల్ గూడుప్రాయమునఁ
దనయీడుచెలులును దాను బ్రేమమున
నెనసి యొక్కెడ బొమ్మరిండ్లాట లనుచు
జగములు నందుల సాగరగహన
నగనగరాదు లున్నతి లిఖంపుచును
నంతంతఁ జిత్రంబులగు నజాండములు
దొంతు లటంచు సంతోషించుకొనుచు
వరుస గుబ్జనగూళ్ళు వండుద మనుచు
నరవిరిదాసనం బనలంబు గాఁగఁ
బూనిక నొకకల్వప్రోయి యమర్చి
పూనీటి యెసరునం బొలుపారుచున్న
యొకతమ్మిపూగుండ యునిచి సన్నంపు
టకరువు లనుబియ్య మందులో నునిచి
కన్నెగేదంగిని గలయఁబెట్టుచును
గన్నియల్ వొగడ నిక్కరణి నాడుచును
బురుడింపఁదగు రెండుబొమ్మలు దెచ్చి
హరియును వైదర్భి యని సమకట్టి
కూరిమి నేఁ బెండ్లికూఁతురిదానఁ
గోరి మీరలు పెండ్లికొడుకువా రనుచు

సారచంద్రికల మైచాయలం దెగడు
చారుపటీరంపుఁజవికెమీఁదటను
పవడంపుటనలుదీపై క్రమంబునను
సవరనిగందంపుసమిధ లమర్చి
జాతిముత్తియపులాజలు వేలుపించి
జాతిగా హోమంబు సవరించి మఱియు
మనము పన్నిదపుటమ్మనము లాడుదము
మనమునఁ గపటంబు మాని రమ్మనుచు
నోడక చెలు లాడుచున్న చందమున
నాడలేకున్ననా రద్దిరా యింకఁ
జిక్కితి పతిపేరు సెప్పుమటన్నఁ
జక్కనివటపత్రశాయి నామగఁడు
అనిచెప్పి వారల నారీతి గెలిచి
యనయంబు మగలపే రడిగి చెప్పించి
యీలీల మఱియు ననేకమార్గముల
బాలికాలీలలం బ్రబలుచునుండి
యెలజవ్వనము మేన నిగురించుతఱిని
నలినాక్షి యాభట్టనాథతనూజ
తనతండ్రి వరసుమదామంబు లచటి
వనమాలి కర్పింపవలసి నిచ్చలును

గట్టిగా మాలిక ల్గట్టి పూసజ్జఁ
బెట్టి యావేళ నర్పించెద ననుచుఁ
జనినపిమ్మట నలసౌమదామములు
తనకొప్పునం బూని తనకొప్పుతోడ
మించులు జలదంబుమీఁద వేడించు
సంచున నొసపరి సవతుగాఁ జుట్టి
యెడసావిగాఁ జూచి యింటిలోనున్న
నడబావిలోనఁ గ్రన్నన నీడఁ జూచి
చూడ నొప్పెడు తనచూడ నున్నట్టి
జాడయంతయుఁ గని సంతసింపుచును
వెండియుఁ దొల్లింటివిధమునం బువ్వు
దండ లాకరఁడిలోఁ దనరార నునిచి
యాడుచుండెడుసమయమున నేతెంచి
వేడుక నవి తెచ్చి విష్ణుచిత్తుండు
నేర్పున వటధామనీరజోదరుని
కర్పింప నిరతిశయానందుఁ డగుచుఁ
గల్పసూనంబులకంటె మౌనీంద్ర
కల్పితవినుతులకంటె దేవతలు
నెడపకయుపహార మిచ్చుటకంటెఁ
గడపట నేమిటికంటె భోగ్యముగఁ

దలఁపుచు వటపత్రధాముఁ డుప్పొంగి
తలఁపులోపలఁ గొండఁ దాఁకుచునుండె
నీలీల మఱియు ననేక కాలంబు
బాలిక ముడిచినప్రసవమాలికలు
హరిచిత్తుఁ డనిశంబు నాబాల ముడుచు
టరయక శౌరికి నర్పింపుచుండె
ననయంబు దాను నయ్యరవిందనేత్ర
జనకునితోఁగూడఁ జని తోఁటలోన
విరులుగోయుచు నవి మితవింతలుగ
సరులుగా సవరించుఁ జాటున కరిగి
తా మున్ను ముడిచినదామముల్ పిదపఁ
బ్రేమమైఁ దండ్రిచేఁ బ్రియుని కంపించు
నీరీతినటియించునెడ నొక్కనాఁడు
కూరిమితోడ నాగోదావధూటి
జనకుండు వటపత్రశాయికై యిడిన
ననగూడలోనిక్రొన్ననదఁడ లెత్తి
యొవఁగూడుకొప్పున నొప్పుగాఁ జుట్టి
నినుపారుబావిలో నీడ చూడంగ
నేమరిపాటుగా నేతెంచి తండ్రి
కోమలిదిక్కుఁ గన్గొని తల్లి! యిట్లు

హరిసమర్పణమున కమరించుపుష్ప
సరములు నీకు శేషముఁ జేయఁ దగునె
యనుచు వేఱొకకొన్నియలరులు గోసి
చని నాఁటి కావటశాయి కర్పింప
నప్పు డాగోవిందుఁ డాతెచ్చువిరుల
నొప్పక యంతయు నొల్లంబు సేసి
కడుఁబ్రేమ నీచిన్నికన్నెక్రొమ్ముడిని
ముడువనివిరుల నే ముడువ నెంతైన
నీకన్యకామణి నెరితావి లేని
యీకుసుమములు నా కితవుగా విపుడు
కువలయనేత్ర కైకొని [3]చేతఁ గొన్న
యవియె తెచ్చితివేని యంగీకరింతు
నన విని వెఱఁగంది యనురక్తి నరిగి
తనుజాత ముడిచినదామము ల్గొనుచుఁ
దనయఁ దోకొనుచు శ్రీధవునిసన్నిధికిఁ
జనుదెంచి కరజలజాతయుగ్మంబు
మొగిచి దేవరచిత్తమున కింతయిష్ట
మగుట నేనెఱుఁగ నయ్యబ్జాక్షి యిదియె
యీలేమ కొప్పున నెనయించినట్టి
మాలిక లివె గోపమానినీవరద!

యన విని గోవిందుఁ డాదండ లంది
యెనలేనివేడ్కతో నెదమీఁదఁ జేర్చి
నుదుటఁ గీలించి కన్నుల నొత్తుకొనుచు
ముద ముప్పతిల శిరమునఁ జుట్టికొనుచుఁ
నీమానినీనుణి నిటమీఁద నేన
ప్రేమ దైవాఱంగఁ బెండ్లియాడెదను
ఈకోమలాంగి నీ వెప్పటియట్ల
తోకొనిపొమ్ము నీతోఁగూడ ననిన
సంతసింపుచుఁ దనుజాతయుం దాను
నంతట హరిచిత్తుఁ డరిగె నింటికిని
ఆచెల్వ కది మొదలై చూడికుడుత
నాచారి యనియెడునామంబు గలిగె
నానాఁట నాభట్టనాథతనూజ
మేనఁ దారుణ్యంబు మించి రా నంత
నెలనాఁగ చెలువంపుటేటిలో మెలఁగు
వలుదజక్కవ లన వలిగుబ్బ లమరె
వనిత జవ్వన మనువనములోఁ బొడము
ననటులగతి నూరు లమరె నెంతయును
హరిని మోహించుచు హరమనోధైర్య
హరుమోహనాస్త్రంబు లనఁ గన్ను లమరెఁ

గలకంఠికనుదమ్మి కవఁజేరియున్న
యలిపంక్తు లనఁగఁ జెన్నారెభ్రూయుగము
ప్రాయంపుఁగడలిఁ జొప్పడుతరంగముల
చాయల బాహుపాశములసొం పెసఁగె
వలరాజురాచిల్క వయ్యాళిబయలు
తెలివిమైనసదుఁ గౌదీవ చూపట్టెఁ
గారుమెఱుంగుపైఁ గనుపట్టునీల
ధారాధరం బనం దనరారెఁ దుఱుము
మరునిపట్టపుదంతిమస్తంబుకరణిఁ
గర మొప్పు జఘనచక్రము తేటపడియె
లాలితరోమాళిలతికజనించు
నాలవాలం బన నసలారె నాభి
తగముఖపద్మయంత్రం బిరుగడలఁ
బొగడొందు శ్రీలునాఁ బొలుపారె శ్రుతులు
కాముకుం డగుసోము గాడి చూపట్టు
కాముసంపఁగితూపుగతి నాస యమరెఁ
బంకజోదరునిశోభనపల్లవముల
పొంకంబునను బదంబులు చెన్నుమీఱె
ననబోఁడి కిట్లు నానాఁట నమ్మేన
ననలొత్తు నెరజవ్వనము [4]దయివాఱ

నందంద గోవిందుఁ డగుచిదానందు
నందు మిక్కిలి చిక్కి యాసక్త యగుచుఁ
గమ్మనితావులు గలుగుమాలికలు
నెమ్మితో వటధామునికి సమర్పించి
చనుదెంచుతండ్రి కిచ్చలు నుపచార
మొనరించి యాతనియొద్దఁ గూర్చుండి
మురిపంబు నొయ్యారమును దళ్ళుకొనఁగ
నొరయుముద్దులు గురియుచు నొక్కనాఁడు
కడుమనోహరము లౌ కమలాక్షుకథలు
కడపట నీ వెఱుఁగని వెవ్వి లేవు
ధరలోన నర్చావతారరూపముల
హరి యున్ననిలయంబు లవి యెన్ని కలవు
అపరిమితంబు లౌ నందులో జగతి
నిపు డెఱింగినవి నీ వెన్ని? తెల్లముగ
వెన్నునికథవిన వేడు కయ్యెడిని
యన్న నా కెఱిఁగింపు మనిన నుప్పొంగి
కన్నియఁ జూచి క్రేగంట నవ్వుచును
మన్నన నెమ్మేనిమై కేల నిమిరి
కురులు గూడఁగదువ్వి క్రొన్నెలసరుల
వరుస దిద్దుచు గారపంబు దైవాఱ

నమ్మ! చెప్పెద వినవమ్మ యింపార
నమ్మాధవునినిలయములుఁ దత్కథలు
ననయంబు మౌనివేద్యము లైననూట
యెనిమిదితిరుపతు లిలలోనఁ గలవి
యీయెడలందు నయ్యిందిరావిభుఁడు
పాయక యుండు నభంగవైఖరుల
నరయ నీకథ వినునట్టివారలకుఁ
గరతలామలకంబు కైవల్యపదము
అనుచు వేంకటపతియాదిగా నూట
యెనిమిదినెలవుల నెసఁగుమూర్తులను
వినుపింప దొడఁగె వేర్వేఱ చిత్రముగ
జవనుతవైభవసంయుతం బగుచు
నిచుళలో శ్రీధరానీళలం గూడి
యచలుఁడై యుండుఁ దోయజసూతితండి
తంచాపురంబున తంచదైత్యారి
యంచితమనుజపంచాస్యుం డైయొప్పుఁ
గటిగదాదరచక్రకలితహస్తుండు
కిటిమూర్తిదండకు గెడపినవాఁడు
శ్రీమణిమౌక్తికసింధుశోభితుఁడు
శ్రీముష్ణపురమునం జెన్నొందియుండుఁ

దొలుతఁ దాఁ దన్నినదోషంబు వాయ
సలమౌని తపము సేయఁగ మెచ్చినట్టి
ప్రేమాలయాఖ్యుండు పృథుభోగశాయి
కాముని గన్నచక్కనితండ్రియొకఁడు
హరిపితామహసేవ్యుఁ డగుచుఁ గదంబ
పురమున శేషతల్పుఁడు చెన్నుమిగులు
దేవియాజ్ఞలకు విధేయుఁ డైయుండు
డేవుండు విశదాద్రిధీరుఁ డొక్కరుఁడు
శ్రీపక్షిభూతపురీపతి గాఢ
చాపాఖ్యుఁ డగురామచంద్రుఁ డొక్కరుఁడు
అప్పాలకుండలో హస్తంబు చాఁచి
యప్పాలవెల్లికన్యకఁ గూడియుండు
ననిలాశనేంద్రపర్యంకపలాశ
వనగుహపురవాసి వనజోదరుండు
అండజనాధవాహనుఁ డారునూర
నుండు వేడుకతోడ నురగేంద్రుమీఁద
భాసిల్లు రథమగ్నపట్టణంబందు
గోసహాయుం డనుకుసుమాస్త్రుతండ్రి
పొలఁతుక యలవ్యాఘ్రపురిని యపూర్వ
జలధినామంబున శౌరి చెన్నొందు

గంగ మించినశక్తి గలుగంగ వనము
చెంగటం దప మొనర్చినకవేరజకుఁ
బొడకట్టి శ్రీసారభూపురిసొంపు
లడరంగ శిశునాథుఁ డన నుండుశౌరి
సవరణైయొప్పుమస్తకశంఖపురిని
నవచంద్రుఁ డనురమానాథుఁ డింపొందుఁ
గోమలవల్లి చన్గొనలపాదంబు
లామతి కొల్పి హేమాబ్జినిచెంత
నగధారి కుంభఘోణమ్మునఁ జంద్రు
నగు నతృప్తామృతనాథుండు వెలయు
హరు బ్రహ్మ హత్య వాయఁగఁ జేసి జగతి
హరశాపమోచకనుం డనుపేరఁ బరఁగి
నగరాజుకుచ! ఖండనగరంబునందు
నగణితభుజమూర్తి యచ్యతుం డొప్పు
జపితలైరోమశాష్టావక్రమునులు
తపము సేయంగఁ బ్రత్యక్షమైనట్టి
శ్రీమించి యపు డంతరిక్షాఖ్యపురిని
వామనుం డనుపేర వనమాలి యుండు
నరుదార[5]శబరి రాజనఁగ శ్రీకృష్ణ
పురమున నెంతయుం బొలుపొందుచుండుఁ

బరిరంభపురమునఁ బద్మాయతాక్షి!
మురవైరి కేదారమూర్తినాఁ బరఁగు
ఘననాగపురమున కడలిచెంగటను
దనరు సుందరుఁ డనుదనుజమర్దనుఁడు
మణిమౌక్తికానదీమణిసమీపమునఁ
బ్రణుతింపఁదగు గంధపట్టణంబునను
అనురక్తి మేధావి యనుమౌనివరుని
తనయఁ గైకొన్నశ్రీధరుఁడు శ్రీమించు
నందిపురాంబరనగరంబునందుఁ
గందర్పగురుఁ డుండుఁ గడుచిత్రగతుల
వనజాక్షి సచ్ఛీలవల్లభాఖ్యునకుఁ
దనయుఁడై శశికిఁ బ్రత్యక్ష మైనట్టి
భువనసన్నుతుఁ డిందుపురమున నెప్పు
డవిరళశ్రీలచే ననువొందియుండు
గురుతిల్వవనచిత్రకూటంబునందు
హరుఁడు నర్తించు నృత్యము చూచికొనుచు
నురగేంద్రశాయియై యుండు గోవిందుఁ
డరయ నాతఁడు నందు నాత్మసంభవుఁడు
రవితేజుఁ డగుచు శ్రీరామాభ్రపురిని
నవనీతచోరుండునా వెన్నుఁ డొకఁడు

కమనీయమూర్తి సంగమపురి, లోక
రమణుండు లోకాభిరక్షణం బ్రబలు
సర్జికల్పకము శ్రీహరి కృష్ణపురిని
బార్థసారథి యనం బరఁగు నబ్జాక్షి
శ్రీపార్థసఖిమహిషీపట్టణమున
శ్రీపరతంత్రుఁడై సిరులు పైపైని
దనరంగ సకలభక్తప్రాణనాథుఁ
డనియెడు గరుడవాహనుఁడు సొంపొందు
జననుతం బగుకపిస్థలపట్టణమున
వనజాక్షి యొప్పు దేవకికూర్మిపట్టి
పాదుగా నిల రౌప్యపట్టణంబునను
గోదండరాముఁడై కొమరుదీపించు
శ్రీనాగపురమునఁ జిగురాకుఁబోఁడి
శ్రీనాథుఁ డెసఁగు నాశ్రితకల్పతరువు
ఆపట్టణమునకు ననతిదూరమున
నేపారుసిరులతో నెనసియున్నట్టి
మణిధామపురమున మధువైరి చెలఁగు
నణిమాదిసిద్ధినాయకుఁడు బింబోష్ఠి!
ప్రసవసాయకపుంఖపట్టణంబునను
బ్రసవాస్త్రగురుఁడు చూపట్టును జెలువ!

యోతలోదరి! పురుషోత్తమనగరి
నేతయై వెలుఁగొందునిగమవేద్యుండు
హైమధామపురంబునందుఁ జెన్నొందు
హేమాంబరుఁడు కాంచనామలదేహ
బలుఁడు శ్రీసక్తసభాపురినాథుఁ
డలరువిల్తునితండ్రి యలరు తన్వంగి!
యనవాప్యగగనపురాంతరసీమఁ
గనుపట్టువిష్ణుండు కలకంఠకంఠి!
కలికి వైకుంఠపుష్కరమనువీట
నెలకొని యుండుఁ గ్రొన్నెల ప్రొద్దుకంటి
ధవళపుష్కరిణినాఁ దనరుగ్రామమున
ధవళాక్షుఁ డరుదారు ధవళాయతాక్షి!
యలనూపురాపగాప్రాంతంబునందుఁ
జెలఁగువనాద్రిమైఁ జెన్నొంచు నంద
సూనుండు మలయధ్వజునకుఁ బ్రత్యక్ష
మైనట్టివాఁడు భక్తామరతరువు
సుందరవల్లి వక్షోవీథి నొప్ప
సుందరుఁ డనుపేరఁ జూపట్టు నమ్మ!
శ్రీగోష్ఠిపురమున శేషపర్యంకు
డాగమేశుఁడు నైన హరి గలం డబల!

సత్యపట్టణమున శారద మామ
సత్యనాథుండునాఁ జను గీరవాణి!
జలధిఁ గట్టగ దర్భశయనంబు నందు
వెలయుఫుల్లాటవీవిభుఁ డిందువదన!
కనకాంబరుఁడు సితకాసారతిలకుఁ
డననొప్పు మున్నీటియల్లుండు తల్లి!
యాలోలనేత్ర! మోహనపట్టణమునఁ
గాలమేఘుండునాఁ గంసారి ప్రబలు
మనసిజజనకుండు మధురాపురమునఁ
దనదేవితోడఁ బ్రత్యక్షమై మున్ను
చేడియ కూర్మి నాచేతఁ బల్లాండ్లు
పాడించుకొన్న శ్రీపతి సొంపుమీఱు
వటపత్రశాయినా వాసుదేవుండు
వటఫలాధరి! యిందు వలనొప్పుచుండు
నలవడుం గురుకసౌమ్యస్థితాధీశుఁ
డలివేణి! మీతండ్రి యలపరాంకుశుని
యతులకావ్యామృతం బనిశంబుఁ గ్రోలుఁ
చతురుఁ డందఱలోనఁ జక్కనివాఁడు
అరవిందలోచనుఁ డనుపేరఁ బరఁగి
యరవిందభవుని గన్నట్టి దైత్యారి

మఱి తిరుత్తుల వెల్లిమంగళపురిని
దెఱవ! సోయగములఁ దెఱఁగొప్పుచుండుఁ
గలికి! నక్రాయతకర్ణపాశాఖ్యుఁ
డలఘుదక్షిణపురి ననువొందుచుండు
వైకుంఠపురిఁ జోరవరుఁ డనుపేరి
శ్రీకామినీపతి సిరిఁ దేలుచుండు
ధర చక్రధరుఁడు కైతవనటాహ్వయుఁడు
తరుణి దక్షిణకుళిందపురిరాజిల్లు
నమరనాయకుఁడు వారాంగనాపురిని
గొమరారుచుండు నెక్కొనిపువ్వుబోఁడి
నాతి చించాపురినాధుండు నిత్య
మాతతశుభమూర్తి యై ప్రతాపించుఁ
దగుగుణవతి సతీధవుఁడు మాధవుఁడు
మృగశాబనేత్ర శ్రీమెఱయుచునుండు
నెలకొని విత్తమానిధియును విధుఁడు
పొలఁతుక! సూచకపురి యేలుచుండు
వీరలు కురుకాధినిభునిసమీప
ధారుణీస్ధలి నున్న ధవళలోచనులు
వనిత! వామనపురీశ్వరుఁ డైనదీర్ఘ
కనకవర్ణాఖ్యుండు కంససంహారి

తనచెంతఁ బార్వతీధవశాపమోక్ష
మొనరించి పెక్కేడు లుర్విభాగమునఁ
బన్ని డెబ్బదిపద్మభవులచేఁ బూజ
గొన్నవాఁ డెంతయుఁ గోమలగాత్రి!
యతివ యనంతపురావాసుఁ డురగ
పతిశాయి యొప్పు శ్రీపద్మనాభుండు
వరదుండె యలతిరువణ్వూరశార
పురమునఁ గృష్ణుండు పొలఁతుక చెలఁగుఁ
దవిలి దక్షిణమరుత్తటపురి [6]లోక
ధవుఁ డైనయప్పుడు తనుమధ్య! యొప్పు
శ్రీమూళిధామపురీ సీమశౌరి
కోమలి! విఘటవర్తకుఁడునా నుండుఁ
బ్రోదిమై శార్దూలపురిరమానాధుఁ
డాదిమాహ్వయుఁడునా నలివేణి వెలయు
నారాయణాఖ్యుండు నౌ పురస్టలిని
నీరజోదరుఁ డొప్పు నీరజగంధి
లలన! శ్రీవళ్ళనాళపురంబునందు
బలిచిరశ్రయమాణపతి యనం గలఁడు
శ్రీసారభృంగపురీవాసుఁ డైన
యాసారసాక్షుఁ డోయమ్మ భాసిల్లుఁ

బ్రతిలేనినిద్రాణపట్టణేశ్వరుఁడు
చతురుఁ డోపడఁతి! కేశవుఁ డనఁ దగును
సకియ పరుష్ణిహేశ్వరనగరమున
సకలాధిపతి దనుజద్వేషి మెఱయు
నాతి విద్వద్రధనగరంబునందు
మాతలుం డనుపేరి మరుతండ్రి యొప్పు
శ్రీ కపిస్థానపురవాసుఁ డగుచు
నోకొమ్మ! తాతనా నొప్పు శ్రీవిభుఁడు
మాయమ్మ సద్వృష్టి మత్పురం బేలు
నాయార్తసంహారుఁ డసురజనారి
యతివ శ్రీదేవనాయకుఁ డైంద్రనగర
పతి యైనవాఁడు గోపాలపాలకుఁడు
తలపోయ మీపెదతండ్రు లైనట్టి
యల రోభూతమహాయోగులకును
బ్రత్యక్ష మైన గోపాలశేఖరుఁడు
సత్యసంధుఁడు జగజ్జనవశ్యకరుఁడు
శ్రీవామనుండు దక్షిణశంఖధరుఁడు
భూవినుతుఁడు గోపపురవల్లభుండు
శ్రీమంతుఁ డైన హస్తిగిరీశుఁ డజుని
హోమగుండంబులో నుదయించినట్టి

వరదుండునా నొప్పు వనమాలి కాంచి
నరుణపల్లవపాద! యఖిలైకవిభుఁడు
ధీరుఁడు వేగవతీతటాహ్వయుఁడు
సారసాక్షుఁడు శేషశాయి భూవిభుఁడు
పడఁతి మీపెదతండి భక్తిసారుండు
చిడిముడిఁ దనుఁ బిల్చి చెప్పినయట్ల
యొనరించినట్టి యథో క్తకారీశుఁ
డనుపమకరుణాకటాక్షుఁడై యుండు
నిరవొందఁగాఁ బరమేశ్వరవిణ్న
గరమునంగలఁ డబ్జకరుఁ డెలనాఁగ!
చూపట్టు హాటకేశుండునాఁ బడఁతి!
యాపాండవులదూత యై కృష్ణసఖుఁడు
శిశిరోపవనపురిఁ జెన్నొందుచుండు
శిశిరాంశుబింబాస్య! శిశుపాలవైరి
కామపురంబునం గనుపట్టుచుండు
శ్రీమంతుఁ డనిశంబుఁ జిలుకలకొలికి
సురవంద్యుఁ డెలమితో జ్యోత్స్నేందుఖండ
పురమున నొప్పుఁ గప్పురములచాయ
నీరధిశయనుండు నీరఘుపురిని
నోరామ! పాయకయుండుఁ బెంపెసఁగఁ

బడఁతి వర్షాకాశపతినాఁగ నందు
కొడుకు సంపదలమైకొని బిత్తరించుఁ
గామపురంబునం [7]గల్పరయనఁగఁ
గామిని విలసిల్లుఁ గామునితండ్రి
కలకంఠిరో! త్రివిక్రముఁ డూరఖంబు
నెలకొని పాలించు నిగమ వేద్యుండు
పురవైరినుతుఁ డష్టభుజకరుం డనఁగ
నరభోజనారి యెంతయు నొప్పు బాల
తిరునిన్నయూర వర్తిలుచక్రవర్తి
కరమర్థితోడ సైకతనిభశ్రోణి!
కూరిమి శ్రీపక్షికుండంబునందు
వారిదవర్ణుండు వామాక్షి మెలఁగు
[8]తో యమహీధ్రనాథుండునా జగతి
వేయుభంగుల నొప్పు వీణావినోద
మానినీ! వినుము శ్రీమస్థలేశుండు
నానొప్పు నవదాత నలినలోచనుఁడు
కనకాంబరుండు సాగరమల్లనాథుఁ
డనువాఁడు విలసిల్లు హరిరాజమధ్య!
మనుజసింహుఁడు మున్ను మహిసప్తమునులు
పనిబూని గడియ దపంబు గావింప

నటవచ్చి ప్రత్యక్ష మైనట్టివాఁడు
ఘటికాచలేశుండు కలహంసగమన!
వీరలు తుండీరవిభులు కల్యాణి
చారుగుణోదారసౌభాగ్యయుతులు
కోమలీ! భక్తులం గూడి మాటాడు
స్వామి పుష్కరిణిపజ్జనె చెన్నుమిగిలి
యానందనిలయమై యనువొందుచుండు
యానందనిలయాఖ్య మగుమేడ నుండు
భూలోకవైకుంఠమున వేంకటాద్రి
నీలోకములనెల్ల నీడేర్చుకొఱకు
నలమేలుమంగ బాహాంతరసీమ
నెలకొల్పి నిఖిలావనీస్థలిలోన
శరణని వచ్చినజనులకు నిష్ట
వరము లిచ్చుచు గారవమున వెండియును
బంధురకరుణతోఁ బంగున పంగు
నంధున నంధుగా నలవరింపుచును
ననయంబు ననపత్యు సాపత్యు గాఁగ
ధనహీను ధనదుగా దయసేయుచుండుఁ
దరుణులు వలచు టందఱకునుం గలదె
పురుషులు వలతు రప్పురుషోత్తమునకుఁ

దెలియంగ నిచట ముక్తిని గడుఁ జూడఁ
గలవారిలోఁ జూడఁ గలవాఁడు వాఁడె
గోదాసతీ! వాఁడెగో! దానవారి
వేదగోచరుఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
లతికాహ్రదంబున లావణ్యమూర్తి
లతికాంగి! యొప్పు నీలామనోహరుఁడు
అలగండకీ నదీప్రాంతంబునందు
లలన! యింపొందు సాలగ్రామవిభుఁడు
ఘనభుక్తి ముక్తులం గడిబెట్టి యమ్ము
ననవిల్తుతండ్రి మానారాయణుండు
తొయ్యలి ఘనవియత్పురి సేంద్రుఁడనఁగ
నయ్యచ్యుతుం డసురారి యొప్పారుఁ
దొలుత ధర్మములు సూతునికి సర్వంబు
దెలిపిన నైమిశాధిపుఁ డైనవాఁడు
యోగముద్రాకరుం డుత్పలనేత్ర!
నాగారిగమనుండు నలువొందుచుండు
[9]గంగాతటాక్రాంతఖండపురీశుఁ
డంగన! కలిదోషహారి యైయుండు
నరయంగఁ బురుషోత్తమాధీశుఁ డనఁగఁ
గరమొప్పు ముద్దియ! కాళియభేది

రాజాస్య ! యష్టాక్షరము మౌనివరుల
కోజమై నుపదేశ మొసఁగినగురుఁడు
శౌరి శ్రీబదరికాశ్రమవాసుఁ డైన
నారాయణు డు జగన్నాథుండు చెలఁగు
గరుడాద్రివాసుండు కాంచనకశిపు
హరణుండు యోగముద్రాసనాయతుఁడు
నరసింహుఁ డనయమానవభక్తవరదుఁ
డిరవొందు నెంతయు నిభరాజగమన
కీరవాణిరొ! విను కేరళపురిని
వీర రాఘవుఁ డన వెలయుచునుండుఁ
బొరిఁబొరి శ్రీపతిపురమధ్యమునను
నరసింహుఁ డనువొందు నరసఖుఁ డబల!
త్రిదశులు వెఱఁగందఁ దృణగుల్మలతలు
మొదలైనవానికి ముక్తి యొనర్చె
దానవాంతకుఁ డయోధ్యావల్లభుండు
జానకీపతి రామచంద్రుఁ డేపారు
మధురలో నెపు డష్టమహిషులంగూడి
మధువైరి కనుపట్టు మధుకరచికుర!
వ్రేతలతోఁగూడ వ్రేపల్లెశకట
పూతనాదుల నెల్లఁ బొరిగొన్నవాఁడు



నలచింతయంతికి నపవర్గ మొసఁగి
నెలకొన్నసిరులకన్నియ బిటారించు
షోడశసాహస్రసుందరీమణులఁ
గూడి ద్వారక నెలకొనియుండు నెపుడు
కందర్పకోటిసంకాశమోహనతఁ
జందనగంధి! వాసవవంద్యుఁ డొప్పు
బలసోదరుఁడు నిచ్చ బాయకయుండుఁ
గలశాబ్ధిలో హేమకలశవక్షోజ!
వైకుంఠపతి పరవాసుదేవాఖ్యఁ
జేకొని వరముక్తిసీమఁ బాలించు
వ్యూహాదు లైన పద్మోదరమూర్తు
లాహరితనువున నవతారమొందు
మానుగా నలమేలుమంగావిభుండు
తానయై శ్రీరంగధామంబునందు
నజునకుఁ బ్రత్యక్ష మైనట్టివాఁడు
భుజగపుంగవతల్పమునఁ బవ్వళించి
వెలుఁగొందుచుండుఁ గావేరినెన్నడుమ
సలలితచంద్రపుష్కరిణి చెంగటను
మగువ కల్హారదామకశోభిభుజుఁడు
మృగమదపుండ్రముఖేందుచిహ్నుండు

కంతుకంతుఁడు జగత్కల్యాణమూర్తి
కాంతోపయంతనాఁ గరమొప్పు ననుచు
వినుపింప వారల విభవచరిత్ర
మనువొంద విని విని హర్షించి మిగుల
నభిరామనాయకుం డగుశౌరి సిరుల
కభినవోత్సవలీల నలరి యుప్పొంగి
సుందరనాథునిసోయగంబునకు
నందంద వెఱఁగంది యతనికిఁ జిక్కి
శ్రీవేంకటశ్వరుచెలువంబుకలిమి
భావించి పులకించి భావంబు కరఁగి
యంగన నయనమోదాశ్రుపూరములు
తొంగలి రెప్పలతుది నాటుకొనుచు
నరుదందితన్మయయై పెద్దతడవు
పరమమౌనియుఁ బోలెఁ బరచింత లుడిగె
సర్వంబు నెఱుఁగు నాజగదేకమాత
సర్వేశుఁ దగులు టాశ్చర్యమే తలఁప
నావంటిపామరునకు నైన నతని
సేవింప నతనికిఁ జిక్కు డెందంబు
అంత నాలలితాంగి యంతరంగమునఁ
గొంతధైర్యము దెచ్చుకొన్నది యగుచు



రంగేశువైభవరాజసంబులకుఁ
బొంగి యాతనికి సబ్బురమంది చిక్కి
ముదమునఁ దనతండ్రిమోము వీక్షించి
విదితంబుగా రంగవిభు చరిత్రములు
విన విన వీనులవిందు లయ్యెడిని
వినుపింపు నాకు సవిస్తరంబుగను
అన విని భట్టనాథార్యుఁ డాతనయఁ
గనుఁగొని పలికె నగ్గలమైన కూర్మిఁ
బద్మాసనుఁడు మున్ను పాలమున్నీటి
పద్మాక్షు గుఱిచి తపంబు గావించి
బహువేదశృగంబు ప్రణవాత్మకంబు
మహితంబు నైన విమానంబుతోడఁ
బంకజాక్షుఁడు శేషపర్యంకుఁ డగుచుఁ
బంకజాసనునకుఁ బ్రత్యక్ష మయ్యె
నైన నయ్యసమాన మగువిమానంబు
తోనఁ గైకొని వేగ తోయజసూతి
సత్యలోకమునకుఁ జని నిజవసతి
నత్యంతసంకలితాత్ముఁ డై నిలిపి
యోజ దప్పక వివిధోపచారములఁ
బూజ సేయుచు నుండి వుష్కరాత్మజుఁడు



సత్రంబు సలుప నచ్చటికి దేవతలు
ధాత్రిఁ గల్గినయట్టితపసులు సనఁగ
వారితోఁగూడ నిక్ష్వాకుండు నేగి
సారసాసనుమేటిజన్నంబుఁ జూచి
యతనియింటను విమానాంతరసీమఁ
బ్రతిలేని యారమాపతిని సేవించి
చలపట్టి యతనిఁ బ్రసన్నుఁ గావించి
యిలువేల్పుగాఁ గొల్తు నిలలోన ననుచుఁ
గనకగర్భునిచెంతఁ గ్రమ్మఱ నిలకు
ననిపించుకొని వచ్చి యతిఘోరతపము
నొనరించి యారమాయుతునిఁ బ్రత్యక్ష
మొనరించికొని యంత నుల్లసింపుచును
దనయేలు నాయయోధ్యాపురంబునకుఁ
గొనివచ్చి నిజభక్తిఁ గొలిచె నంతటను
గ్రమమున నలదశరధునిపర్యంత
మమితభక్తిని గొల్చి రతనివంశజులు
ఆవిష్ణునిజరూప మగు రామవిభుఁడు
రావణుఁ జంపి వారనివేడ్కతోడ
ధరణిజతో నయోధ్యకు నేగుదెంచి
సరసాత్ముఁడై విభీషణుని మన్నించి

తానైన యాశేషతల్పుని నొసఁగి
మానుగాలంకకు మగుడఁబంపుటయుఁ
గోరియాదేవుఁ గైకొని విభీషణుఁడు
బోరన నిజపురంబునకు నేగుచును
బగలింటిసంధ్యఁ దీర్పఁగఁ బూని యమల
యగునట్టి సహ్యకన్యకతటంబునను
సైకతభూమి నాజగదీశు నునిచి
యాకవేరజను సంధ్యావిధుల్ దీర్చి
యత్తటంబున నున్న యాదేవు మగుడ
నెత్తిన నెంతైన నెత్తరాకున్న
ననయంబు శోకించు నాభక్తుఁ జూచి
యనియె శ్రీహరి మింట నశరీరివోలె
నీయెడ శోకింప నేటికి వలన
దియ్యేటినడుమ నా కింపుఫుట్టెడిని
జటులవైఖరుల నీచంద్రపుష్కరిణి
తటమున ననుగూర్చి తప మాచరించు
వరగుణోన్నతు ధర్మవర్మఁ బ్రోచుటకుఁ
బరమపావనము లై పరఁగు నిచ్చోటి
నవతీర్థములనుండి ననుఁ గూడి మౌని
నివహంబునెల్ల మన్నించుట కిచట

ముదమున లంకాభిముఖుఁడనై శేష
మృదులభోగమున నర్మిలి యోగనిద్ర
నుండెద నీలోన నుడివోనికరుణ
నుండెద వెఱవకు మోవిభీషణుఁడ!
యని యమ్మహాత్మునిజావాసమునకు
సనిచి యచ్చో నిల్చి యారంగవిభుఁడు
కరమర్థిఁ జంద్రపుష్కరిణి చెంగటను
సొరిది లోకములఁ బ్రోచుచు నున్నవాఁడు
ఆతఁడు చోళకన్యకరమాంశజను
బ్రీతిమై నిచుళలోఁ బెండ్లియై జనులు
జగతిమైఁ దను సౌమ్యజామాత యనుచుఁ
బొగడంగ మిక్కిలిఁ బొలుపొందువాఁడు
సరవి నవగ్రహచక్రంబులోన
నరుణకైరవమిత్రులను వొందుపగిదిఁ
బ్రతిలేని యీతిరుపతులలో నాగ
పతిశైలరంగముల్ భాసిల్లుచుండు
మెలఁగెడు నూటయెన్మిదితిరుపతులు
నలరంగ విభునివిహారసౌధములు
వెఱఁగైన యారంగవిభుమహామహిమ
మఱి వేల్పులకు నవాఙ్మనసగోచరము

అని తండ్రి రంగనాయకునివైభవము
వినుపింపఁగా నీలవేణి మోదంచి
రవికాంతి గనినసారసముచందమున
నవిరళానందమయాంగయై పొగడి
యంతరంగంబున నారంగవిభుని
జింతించి ధ్యానంబు సేసి వేమరును
నఖిలంబు తన్మయం బనుచు భావించి
యఖిలైకమాత తదాసక్త యగుచు
జనకునిఁ గాంచి హస్తంబులు మోడ్చి
యనియె నీయిలఁ బుట్టినట్టికన్యలకుఁ
బ్రతిలేనిశ్రీపతిఁ బతిగా వరించు
గతి యెద్ది యనుఁడు నాకల్యాణిఁ జుచి
యక్కంతుజనకునకై కంతుబారిఁ
జిక్కి వ్రేతలు మార్గశీర్షవ్రతంబుఁ
గావించి కృష్ణునికాంతలై రీవుఁ
గావించితేని నిక్కంబుగా నిపుడ
శ్రీవధూనాయకుఁ జెట్టఁబట్టెదవు
నావుఁడు జనకునానతిఁ బూని గోద
తనలోన నెంతయుఁ దద్ర్వతాచరణ
మున కుపాయము గ్రమమున వితర్కించి

మానసంబున రంగమందిరుం జేరి
యానోము తానోమి యానోముకరణిఁ
బనుపడ గోపికాభామను దానె
యని తలంచుట యది యాచరించుటయు
వెలయ ముప్పదివాట విశదమై మిగులఁ
దళుకొత్త నొకప్రబంధంబుఁ గావించె
మఱియు నాతనిమీఁదిమమత పెల్లొదవఁ
జెఱకువిల్తునితూపుచెరకు లోఁగాక
నలినాక్షుమై నూటనలువదిపాట
వలనొక్క కావ్యంబు వరుసఁ గావించి
వెండియు శ్రీరంగవిభునిపైఁ బ్రేమ
కొండలై కొల్లలై కొలఁదికి మీఱఁ
దలిదండ్రు లెలమిమైఁ దనుఁ బిల్వ మాఱు
పలుక నత్తఱి రంగపతి యంచు గ్రుక్కుఁ
గనుఁగొన్నయదియెల్లఁ గావేరి యనుచుఁ
గనుగొలనబ్జపుష్కరిణియటంచుఁ
గనకచేలాంకువిగ్రహముల వేనిఁ
గనుఁగొన్న శ్రీరంగకాంతుఁడ యనుచుఁ
గనుగొల నేయిల్లు గన్న విమాన
మనుచు నెక్కడఁ గన్న యది రంగ మనుచుఁ



దలఁపుచు మది నన్యథాబుద్దితోడ
నలరంగధామునియందునే తవిలి.
శ్రీరంగనిలయుండు చెలిమిమై నన్నుఁ
జేరంగవచ్చి మచ్చికతోడ ముద్దు
గారంగఁ దనుఁ దనకరముల నింపు
గూరంగ నెలమి పైకొనునొక్కొ నన్ను
హత్తి నాజవ్వన మనునిధానంబు
రిత్తపుచ్చక తనరించి కైకొనునె
యని తదాసక్తయై యలరులసెజ్జఁ
గనుమూసి నిద్రింపఁగా నొక్కనాఁడు
శ్రీరంగపతి కృపాసింధుఁ డేతెంచి
సారంగనయన ముచ్చటవాయఁ గదిసి
సరసకళావిలాసములఁ బెంపెసఁగ
మరుకేళిఁ దేల్ప నమ్మానినీమణియు
ననఁగి పెనంగి ప్రత్యక్ష మాదేవు
నొనగూడినటువలె నుండి మేల్కాంచి
కలగా నెఱింగి వెగ్గలమైనరంగ
జలజాక్షువిరహుబు సైరింపలేక
దారుణకందర్పతరవారిదారి
బారికి నోడి నిబ్బరమైన తమిని



హారంబుమీఁద నాహారంబుమీఁద
నారామకేళీవిహారంబుమీఁదఁ
బ్రియ మోసరించి పొంపిరివోవుమేని
భయదకందర్పతాపము నీఁదికొనుచు
సవరనిమందారశాఖయందమున
నవచంద్ర రేఖచందమున దీపించి
యిజ్జాడఁ బెరవార లెఱిఁగెద రనుచు
లజ్జించి తలిదండ్రులకుఁ జెప్ప నోడి
కమలాక్షు చామరగ్రాహిణియైన
కమలకోమలి యనుగ్రహపేరి తనదు
నెచ్చెలి తనతోడ నెఱి నేగుదెంచి
యచ్చట మనుజకన్యావేష మంది
యున్నట్టిచెలియు నెయ్యరులైనయట్టి
కన్నియ ల్గొలువ నా కాకకోర్వమిని
మాకందతరుసుషమాకందకుంద
శాకోటతటవికస్వరపికస్వరము
పూగపున్నాగకర్పూరనారంగ
నాగరంగోత్తుంగనాగ కేసరము
రాజితచంపకారామంబుఁ జొచ్చి
రాజీవలోచనారాజితోఁగూడ

మెలఁగుచు వనములో మెలఁగుచునుండి
కలకంఠమధుకరకలకంఠసమితి
కోలాహలంబు దాకొన్న సైపమిని
హాలాహాలం బని యాలింప నోడి
చెలులు గానుక లిచ్చు చెంగల్వతావి
యలగులు మరుతూపు లని యంట నెఱచు
విరిదేనియలఁ జూచి వికచాంబుజాస్త్ర
కరహతవిరహిరక్తము లని యలికి
కాళింది మును గోపకాంతల శౌరి
పాలించుచందంబుఁ బడఁతి భావించి
తాను నాగోపకాంతాభావ మంది
పూని తదంబరంబులు మ్రుచ్చలించి
మును కుందతరుశృంగమున యున్నయతని
గనుఁగొని శిరముపైఁ గరములు మోడ్చి
యియ్యెడ మాచీర లిమ్ము వేవేగ
నెయ్యమారఁగ నని నిక్కి మ్రొక్కుచును
జెలిమిమై నెపుడువచ్చెదవు నీ వనుచు
నెలనాఁగ హరిరాక కెదురుచూచుచును
గోరికి ముత్తెంపు కొలుచుమీఁదటను
సారెకు జానకీచక్రంబు చూచి



వెండియుఁ దనవనవీథిలోనుండు
గండుగోయిలఁ బెక్కుగతుల నంకించి
తనపతియగు రంగధాముఁ డెచ్చటికిఁ
జనుదేరఁ గొల్చినజాడతో నుండు
కాకున్న నీకన్నగతిని వేవేగ
నేకానకైన నీ విపుడు పొమ్మనుచుఁ
బలుమఱు హరిబాళిఁ బడి తాప మొంది
యలయుచు నిదురించు నలకలలోనఁ
బంబినతమి వేయుభంగులతోడ
నంబుజోదరుఁ బెండ్లియాడు మేల్కాంచి
తలఁపులో వెండియుఁ దన్మూర్తిఁ దలఁచి
బలసోదరునికేలి పాంచజన్యంబుఁ
గనుఁగొని శ్రీరంగకాంతునిమోని
యనిశంబుఁ జవిచూతు వాయధరంబు
కపురంబుతావియో కమలవాసనయొ
యుపమింపఁ దియ్యనై యుండునో చెపుమ
యని యెన్ని యతనిబింబాధరామృతము
మనమునం గ్రోలి నెమ్మదినుండు మఱియు
ముంగలి తొలుకారుమొగులు నీక్షించి
యంగన తను నేలు మని చెప్పు మనుచు



నావేంకటాద్రీశుఁ డగుశౌరికడకు
వేవేగ దూత గావించి తా ననుపుఁ
జిగిరించుకోర్కి నెచ్చెలుల వీక్షించి
యొగి నన్ను మరుబారి కొప్పింప నేల
ఖగరాజశైలరంగద్ద్వార కాదు
లగునట్టితిరుపతులందు నింపొంద
భావజాలము తాపముఁ జెందకుండ
వేవేగ నను మీరు విడిచిరం డనుచు
గట్టిగా హరి తనకరపల్లవంబు
పట్టి కంకణమందు పతిగాఁ దలంచి
తన కేల మిగుల నిద్దపుశంఖ మలర
తన కేలిశంఖంబు తన కేల యనుచుఁ
గేలిమై బలిదైత్యు కేలికంకణము
చాలక నాదుహస్తంబుకంకణము
నడిగెడి నితఁ డేమి యని చాల నవ్వి
నుడివి బాష్పములు కన్నుల నిగిడించు
రాముఁడైనట్టి శ్రీరంగనాయకుఁడు
రామకై పూని వారాశి బంధించి
ప్రళయకాలమునఁ గోల్పడిపోవు భూమి
నలమహాకిటిమూర్తి యై యుద్ధరించి



తనుఁ గోరియున్నవైదర్భికై మున్ను
మొనసిన శిశుపాలముఖుల దండించి
పరచింత లుడిగి నిర్బరవృత్తిఁ దనదు
చరణపద్మంబులు శరణొందునట్టి
దంతిపౌలస్త్యగౌతమసతీవిహగ
కౌంతేయసుతులాదిగాఁ గలవారిఁ
బాలించినట్టి శ్రీపతి రంగనాథుఁ
డేలకొ నను నింత యెరపుగాఁ జూచె
నలకలలోన న న్నంగజకేళి
నలుకలు దీర్చి నాయలుకలు దీర్చి
యెనసి నిమేషంబు నెడఁబాయ నిన్ను
నని బాస యిచ్చి తా నరిగి రాఁడయ్యె
డక్కుల రేనిమాటలు పల్కు వార
లెక్కడఁ గల రతం డేమికావించుఁ
దహతహ లేల యాతనిసద్విజిహ్వ
సహవాస మీరీతి సవరించెఁ గాక
యని యిట్లు దూరుచు నాకోమలాంగి
మనసిజువేడిఁ గ్రుమ్మరుచున్నయపుడు
వెడవిలునెరప్రొద్దువిరహంపుటెండ
వడదాఁకి యున్న చెల్వను విలోకించి

చెలువెల్ల వెఱఁగంది చేర నేతెంచి
పలుమఱు నాయింతిభావంబుఁ జూచి
యేమొకో యీచంద మేటికి మున్ను
రామొకో వచ్చి యారామకోణముల
రామకోరికలు వారకతీర్చి మగుడఁ
బోమొకో యేటి కీపొలఁతి కీవేళ
నాటలు మనతోడ నాత్మ వేఱొకటి
మాటలు మనవంక మన సొకవంక
దగిలియున్నది యెట్టిధవునిపై మనసు
దగిలియున్నదియొ యీతరుణికి ననుచుఁ
గొమరొందు చెంగల్వకొలనిచెంగటను
సమకొన్నగొజ్జంగిచవికెనెన్నడుమఁ
బన్నీటికాల్వడాపలఁ గప్పురంపుఁ
దిన్నెమై నెలచుట్టుతిన్నెమీఁదటను
బలుచగాఁ బుప్పొడిపరు పొనరించి
చలువగాఁ దలికుపచ్చడ మప్పళించి
చెలగెడు నాపూవుసెజ్జమైఁ జెలువఁ
జెలువార నునిచి నెచ్చెలులెల్లఁ గూడి
పన్నీటికేల రెప్పలమీఁదఁ దుడిచి
చెన్నారు వలిపంపుఁజెంగావి గట్టి



కలయంగఁ బన్నీటఁ గపురంబుతోడఁ
గలపనసేసిన కలపంబు మెత్తి
తుళకింప నుదుటఁ గస్తురిబొట్టు దీర్చి
వెలిదమ్మవీవన వీవ నావేళఁ
జిలుకవారువముకెంజిగురునారంజి
తళుకుగల్వలజోడుతమ్మిబొమ్మికము
చెఱకుసింగిణియు గొజ్జంగి కేవడము
దరమైనవిరియంపతరకసంబులును
నలవడ నంగజుం డరుదెంచి పొంచి
నిలువుగన్నులవిల్లు నెరినెక్కుద్రోచి
చిమ్మచీఁకటినింపు శింజిణిదండి
తుమ్మెదగరిపూవుతూపు సంధించి
నెలవులనైదింట నిలిచి నేరుపున
లలిమించి కదిసి వోలము ముంచి పొంచి
తీరుగాఁ దెగనిండ దిగిచి డెందంబు
దూరి పారఁగనేసి తోన యార్చుటయు
సకియపాలిండ్లపైఁ జందనచర్చ
తుకతుక నుడుకంగఁదొడఁగెఁ దాపమున
నువిదకుఁ గనుదోయి యొప్పె నావేళ
రవి దేరకొన్న కైరవముల భాతి



సురుగులై చూపట్టె సూనంబులెల్ల
సరులెల్ల నీలంపుసరులజాడయ్యె
నప్పు డాసఖులెల్ల నాపువ్వుబోఁడి
తప్పక చూచి యెంతయు విన్నఁబోయి
కనుఁగొంటిరే కల్వకంటి యున్నట్టి
యునికి యిందఱుఁగూడి యొనరించినట్టి
యుపచారవిధుల నెయ్యురు బగసేయ
నిపుడు క్రమ్మఱ మన మేమిసేయుదము
వెడవింటివాఁడు గర్వించి యిప్పాట
నొడ లెఱుఁగక మెఱయుచునున్న వాఁడు
పెలుచఁ గోవెల యన్నఁ బెంపుడుఁబేయ
కెలయు గీరంబు మిక్కిలి వాతరట్టు
తలపోయ నీతుమ్మెదలుగూడ గొట్లు
మలయమారుతము ద్రిమ్మరిదిప్ప కాయ
యెవ్వరి మన మింక నిట వేఁడుకొంద
మివ్వాలుగంటికై యేమిసేయుదము
అని శీతలక్రియ లాచరింపుచును
గనకవిగ్రహ యనుగ్రహ చేరవచ్చి
కన్నియ లాలించి కరషంకజమునఁ
గన్నీరు డించి యంగములెల్ల నివిరి

జాఱినపయ్యెదఁ జక్కఁగా నొత్తి
మీఱినతాపంబు మెల్లంబుసేసి
యీతఱి నీమది నెసఁగినకోర్కి
నాతోడఁ జెప్పవే నాతోడ! నీవు
ఎక్కడఁబొడమింప నేల కొంకెదవు
నిక్కంబు చెప్పవే నీయానయట్ల
కాక బొందులు వేఱె కాని ప్రాణంబు
లేకంబు లైయుండు నిద్దఱి కెపుడు
నని కూర్మిఁ గొసరి యొయ్యన నొత్తియడుగ
నునుసిగ్గు వాలుగన్నుల నామతింపఁ
జెప్పనుంకించు లోఁ జిప్పిలునానఁ
జెప్పనోడుచు నరచెప్పి గ్రుక్కుచును
దనుదానె యొకకొంతతడవున కిందు
కొని ప్రియసఖి దేరకొని యేకతమున
నీతోడునీడనై నీమాట మీఱ
[10]నేతఱి నేర నే నెంతగానైన
వినవె నాకలలోన వెన్నుఁ డేతెంచి
ననుఁ గూర్మి నాలింగనమున లాలించి
మరుకేళిఁ దేల్చి వేమఱుఁ జెప్పరాని
సరవులు నీగానిచనవులు నొసఁగి

యనిశంబు నన్నుఁ బాయ నని తలం జేయి
యొనరింపఁ గడునమ్మియుండి మేల్కాంచి
యడపక యదిమొదలై వానిబాళిఁ
బడి చిత్తజునిబారిఁ బడి యింటిలోన
నెక్కడ నింటివా రెఱిఁగెద రనుచుఁ
గ్రుక్కుచు లోలోన గుబ్బతిల్లుచును
నుండితి నిన్నాళ్ళు నొకరీతి నింక
నుండు టేగతి వాని నొనగూడ కింతి
యని చకోరములు నీరాడి జాడించు
ననువునం గన్నుల నాను బాష్పములు
తొంగలి రెప్పలతుద జాఱి మీఱి
పొంగారుకుచకుంభములమీఁదఁ దొరుఁగ
నున్నకోమలిఁ జూచి యూరార్చి పిదపఁ
దిన్ననిపలుకులం దెలివి నొందించి
యింతమాత్రమునకు నేటికి నీకు
వంతలఁ బొంద నోవనజాయతాక్షి!
నీవునోమిననోము నిక్కమై నీకు
భావింప శ్రీరంగపతి పతి యగును
ననుచు నూరార్చి యయ్యతివఁ దోకొనచు
ననుఁగుఁజేడియలతో నరిగె నింటికిని

యంతట నొకనాఁడు హరిచిత్తుఁ డాత్మ
జింతించి రంగేశు సేవింపఁ గోరి
ఆసతిఁ జతురంతయానాధిరూఢఁ
జేసి యెంతయువేడ్క శ్రీరంగమునకుఁ
జనువేళ నాకన్య జనకునిం బిలిచి
యనియె శ్రీరంగనాయకునిగోపురము
నెచటికిం గనవచ్చు నేవేళ నప్పు
డచటఁ బల్లకి డించు మన సమ్మతించి
ఘననదీశైలసంఘంబులు గడచి
చనుదెంచి నిజశిష్యసహితుఁడై యంతఁ
దుదలువిప్పక విప్పఁదొడరుచు గడలు
మృదులకోరకముల మెదలుతుమ్మెదలు
నించువిల్తునికేళి నెలదమ్మియిండ్ల
నించువేడుక రమియించి చంచువులఁ
జించి కొమ్మలకుఁ గొంచెపుమృణాళములు
కొంచక యొసఁగెడుకొంచలంచలుమ
లోలంబు లైన కల్లోల డోలికల
నోలి నూఁగుచుఁ గేలి నొలయుచోటులకు
నవలచెందొవలలో నలరుతేనియలఁ
దవిలి యందిచ్చు నిద్దంపుజక్కవల



వలగొన్న నల్లగల్వల వాలుమీలు
పొలయంగ వెలయు పుప్పొళ్ళ తెట్టువలు
పలుమఱుం దరులఁ జొప్పడు నాగపూగ
మలయజంబులతావి మలయుతెమ్మెరలు
కాకమైఁ బోకమోఁకల నూఁకి దరుల
వీఁకమై గోరాడు ద్విరదదంతములు
తాఁకుల నంతరాంతరము లైనట్టి
వేఁకంపునెలచల్వవెడదనిచ్చెనల
జలకేళి సవరించి సఖులతోఁగూడ
విలసిల్లి యేగెడువేల్పుబైదలులు
కలకలమను పాదకమలమూలముల
మలకలసొమ్ము లుమ్మడి నొప్పుమిగుల
వలవెలువడుజక్కవలరీతిఁ బయ్యె
దలఁ బాసి కుచపర్వతములు గీఁటాడ
నాలోలకర్ణభూషావళుల్ గండ
పాలికాతటములఁ బంజళ్ళు ద్రొక్కఁ
దరణిబింబము లభ్రతలముల నొప్పు
కరణి గ్రొమ్ముళ్ళు బంగరుబొట్టులమరఁ
బసవైన తమమించుపాలిండ్లఁబోలు
పసిఁడికుండలు వట్టి పరతెంచుచున్న



ద్రావిడాంగనల నెంతయు నొప్పనొప్పు
కావేరి దాఁటి రంగపురంబుఁ జేరి
తఱచైనద్రవిడ వేదముల వేదములఁ
బెఱమాట వినరాని పెనువీధిఁ గడచి
మలయజయుతమైన మంచిపన్నీటి
కలయంపి గలగృహాంగణములు దాఁటి
యారయ దామోదరాహ్వయం బగుచు
శ్రీరమాయౌవనశ్రీలఁ జొప్పడుచు
నుడురాజకలశమై యొప్పారుచున్న
పొడవైన తూర్పుగోపురము సొత్తేర
నంతకుమున్న యయ్యలివేణి రంగ
కాంతునిచెంతకు గగనమార్గమున
నరిగియుండుటఁ దెలియక భట్టనాథుఁ
డరుదారఁ దనపట్టి యనుమాటఁ దలఁచి
పల్లకి డింపించి పరమానురక్తి
నల్లనఁ దనుజాత నంకించి పిలిచి
పంజరం బెత్తి లోపలఁ జిల్క లేని
పంజరంబునుబోలె పట్టి లేకున్న
యానంబుఁ గనుఁగొని హా యంచుమూర్ఛ
నూని తెప్పిరి మఱియును విచారించి

మదిలోన రంగేశుమాయగా నెఱిఁగి
గుదిగొన్ననెవ్వగం గుమ్మరిల్లుచును
పొయనికూర్మిచే బాష్పంబు లురులఁ
దోయజోదరు నాత్మ దూరి యిట్లనియె
సకలంకనిజకీర్తివై నీతి దొరఁగి
యకట! నీకిటు తగునయ్య రంగేశ!
యీరీతిఁ దొంగిల నీకొమ్మ గోప
నీరజాక్షులనవనీతమే తలఁప?
బలిమిఁ గైకొన రాజబాలికామణులె?
తలపోయ కిటు సేయఁ దగునె? గోపాల!
మున్నుగా జనని యీమ్రుచ్చిలువిద్య
వెన్నతో నిడినదే వివరించి చూడ
వనజాక్షివలసినవాఁడ వైతేని
ఘనతమై మాయింటికడ కేగుదెంచి
యడగి చుట్టఱిక మేపారంగ సేస
యిడి నీవు గొనిపోవు టింతియకాక
జగదేకసాక్షివై సర్వనాయకుఁడ
వగునట్టి నీవ యన్యాయంబు సేయ
మితిలేని మున్నీరు మేరమీఱంగ
నితరులు వారింప నెట్టు లోపుదురు?



అనుచు శ్రీరంగనాయకుని సన్నిధికి
జనుదెంచి పాదాంబుజములమై వ్రాలి
తొరఁగెడి కన్నులతో యపూరములు
చరణాంబుజముల మజ్జన మాచరింప
వనజాక్షునాజ్ఞ శ్రీవరచిత్తకన్య
తనతండ్రిశోకంబుఁ దరియింపఁ దలఁచి
యమలనాగేంద్రశయానుఁడై యున్న
కమలాక్షు వామభాగమునందు నుండి
కడునొప్పు నీలమేఘములోననుండి
వెడలుశంపాలతవిధమున వెడలి
కంకణమణేరుచు ల్గడలుకొనంగఁ
బంకజానన పాణిపల్లవం బెత్తి
యన్న! నీ కేటికి నడల నిచ్చోట
నున్న నన్నిటు చూడు; మోతండ్రి!యనినఁ
దోన శ్రీరంగనాథుఁడు తెలిగన్ను
గోనల నమృతంబు గులుక నిట్లనియె
నడలకు నీవన్న యట్ల నీయింతి
కడకుఁ బసిఁడిఱెక్కలతేజి నెక్కి
ననుపార సకలసన్నాహంబు మెఱసి
చనుదెంచి నీకూఁతు జలజాతనేత్ర

సురలు నచ్చరలును జోద్యంబునంద
వరియింతు నీచెలువను సొంపు మీఱ
నలవనిశోకంబు వలదు క్రమ్మఱను
బొలఁతుకఁ దోకొనిపోయి రమ్మనిన
నలరి శ్రీరనిగనాయకుపాదపద్మ
ములకు సద్భక్తిని మ్రొక్కి యగ్గించి
కూరిమితోఁ దనకూఁతుఁ దోకొనుచు
భోరున నిజపురంబున కేగుదెంచి
యనఘు భూమీశు లోకైకపంకేజ
దినమణివల్లభదేవు రావించి
యరవిందలోచనుం డాత్మసంజాత
వరియింతు ననుటయు వరుసతోఁ దెలిపి
యెన్నిక మఱియు నేమేమి గావలయు
నన్నియు సమకూర్పు మని సమకట్టి
పనిచిన నరిగి యాపాండ్యభూనాథుఁ
డనుపమకనకరత్నాదివస్తువుల
రమణీయమౌక్తికరంగవల్లికలఁ
గమనీయకాంచనకదలికాతతుల
సిరిమించుపురముఁ గైసేయించి మగుడి
యరుదెంచి యెఱింగింప హరిచిత్తయోగి



పనిఁబూని సకలశోభనవస్తువులును
నొనర నాయితపడుచుండె నున్నంతఁ
జక్కనివేంకటశైలనాయకుఁడు
చొక్కించుచూపులసుందరేశ్వరుఁడు
యెపుడు గోదాసతియెద నుండు ననుచుఁ
దప మొనర్చినవటధామమూర్తియును
నొకటియై యెంతయు నొప్పారుచుండఁ
జికిలిలేనగవుల శ్రీరంగవిభుఁడు
తెలిపాపసమకట్టతేజిమై నెక్కి
తొలఁగక నిత్యముక్తులు చేరి కొల్వ
ఫణమణిద్యుతులు దిక్పటలంబుఁ బొదువ
ఫణిపతి ముక్తాతపత్రంబుఁ దాల్ప
మఱి గంధవాహుండు మకరవాహుండు
ముఱువైన చామరములు పూని వీవ
చెలరేఁగి భానుండు శీతభానుండుఁ
దళుకొత్తు తాళవృత్తంబుల వీవ
హరుఁడు శచీమనోహరుఁడు ముంగలిని
దరమిడి తోత్రవేత్రములంది నడువఁ
గేలి నాసురరాజు కిన్నరరాజుఁ
గాళాంజిహడపంబుఁ గైకొనినడవఁ



బెక్కు చందంబులఁ బెక్కు చందములు
గ్రక్కున వందిమాగధ[11]వృత్తి గొలువ
నరసురాసురయక్షనాగగంధర్వ
వరులు సేవింప నావనజలోచనుఁడు
నేతేర నపు డెదురేగి యాయోగి
యాతతభక్తిమై నడుగుల కెరఁగి
సకలోపచారము ల్సవరించి భక్త
నికరంబుతోఁగూడ నిజగేహమునకు
నాకంజలోచను నతిసంభ్రమమునఁ
దోకొనిపోయి బంధురపీఠి నునిచి
యలవడ సోపానలయిదువల్వాడఁ
జెలు లంత నాహరిచిత్తపుత్త్రికిని
గుంకుమ నలుగిడి గొజ్జంగినీరు
పొంకంపుఁబసిఁడితంబుగలచే ముంచి
సరగున మంగళస్నానమాడించి
తరుణికి జిలుగారుదడిసుడు లిచ్చి
వెలఁది చుక్కల వికవిక నవ్వుచుండఁ
దెలిమించు మెఱుగుముత్తియపు గొండెముల
గనకంపుఁజెరఁగులఁ గనుపట్టుపట్టు
జినుగుదువ్వలువ కుచ్చెలవట్టికట్టి

మొగముగబ్బునగూర్చి మొగిసినదిశల
భుగభుగమను గందవొడి మేన నలఁది
నొగినల్ల మొగులులో నొదిగి తారకల
పగిది క్రొవ్విరులు లోఁబడ బిటారముగ
మినుకారుగండుతుమ్మెద ఱెక్కమబ్బుఁ
దనికెడుకురుల బిత్తరముగాఁ దురిమి
వెన్నుపై నెడమించు వేడించుకరణిఁ
గ్రొన్ననవిరిదండి గ్రొమ్మిడిం జుట్టి
పొగరారు నెరనమ్మిపురివిచ్చుపగిది
మొగలి రేకులు వింతమురువుగాఁ జెరివి
యసమానవదన చంద్రాంకురం బనఁగఁ
బసనిముత్తియపుఁ బాపటచేరుగీల్చి
సారెకుఁ దనుమించి చనుకాంతిఁ బొదలు
నీరసంబును వదనేందుబింబమును
గచభారరాహువు గబళింపకుండ
రచనఁగాఁపిడినచక్రంబులో యనఁగ
మూలలెన్మిదియైన మొగమానికముల
డాలించువిమలతాటంకముల్ పూని
తెలిదమ్మికొనలను దేఁటినూగెసఁగు
కలికిబాగులసన్న కాటుకఁ దీర్చి



మదనుండు ముక్కు సంపంగిలాలమున
నొదవించుకపురంపుటుండయో యనఁగఁ
గరిరాజవరదుని ఘనకీర్తిఫలము
కరణి నింపొందుముంగరఁ గీలుకొలిపి
యలసయానముల రాయంచలం గెలిచి
పెలుచఁబెట్టినవాదుపెండేర మనఁగఁ
గమలాప్తబింబంబుగతి నొప్పుమణుల
రమణీయ మగునూపురముఁ బొందుపఱచి
కమలమూలములఁ గంకణగణం బమరు
క్రమమున రత్నకంకణములు దొడిగి
ఘనతరశైలశృంగంబులమీఁదఁ
గనుపట్టు సెలయేటికాలువ లనఁగ
ననుకుగాఁ గస్తూరి యలఁదినగుబ్బ
చనుదోయిమై [12]బన్నసరములు వైచి
నలినారిమైతారనకరాంక మొప్పు
నలువునం గస్తూరినామంబు దిద్ది
చెలులు నేరుపునఁ జూచినకల్వలతిక
చెలువున నిట్లు గైసేసి తోతేర
దినకరచంద్రులు తెరపట్టిరపుడు
తనుజాత నయ్యోగిధవుఁడు తోతెంచి



మకరకుండలునకు మధుపర్క మొసఁగి
సుకుమారి నిచ్చె కృష్ణునకు నవ్వేళ
సురలోకవరుమంత్రి సుముహూర్త మనిన
నిరువు రొండొరుమోము వీక్షించుతఱిని
జలజాక్షి మున్నుగా సగుడజీరకము
చెలఁగి రంగేశ్వరుశిరమున నిడియెఁ
గవమొగుళ్ళను జంద్రికలు పర్వినట్లు
తవిలి యొండొరులమైఁ దలఁబ్రాలు నించి
కరకల్పశాఖలం గనుపట్టువిరుల
సరవిముత్తియపుసేసలు దోయిలించి
గట్టిగా నాగమోక్తప్రకారమున
గట్టిరి హస్తకంకణము లొండొరులు
నలవధూవరులఁ జయ్యన దివ్యరత్న
సలలితం బగుపెండ్లిచవికెమీఁదటను
బనుపడ గొనబు చూపట్టునుత్తరపు
కొనలుగా వేయుచుంగులచేలవఱచి
చెలువొందుపీఁట నాసీనులం జేసి
జలజసంభవుఁడు శాస్త్రప్రకారమున
ననలుని నెలకొల్పి సాంగంబు గాఁగ
మనమార లాజహోమములు సేయించి



యలవధూవరులు హోమాగ్నికిం బ్రేమ
వలచుట్టిరాఁగ నవ్వనమాలిఁ జూచి
పనుపడ నిదె సప్తపదులు మెట్టింపు
మనిన గంగాధరుం డమరనాయకుఁడు
నలఁతినవ్వొలయ నేమయ్య యీవేళ
వలవనిసి గ్గేల వనజాక్షిపదము
గట్టిగా నీనాల్గుకరములఁ బట్టి
మెట్టింపరాదె యర్మిలి నన్న నగుచు
భామినిచే సప్తపదులు మెట్టించి
హేమాంబరుఁడు తొంటియిరవున నున్నఁ
గలికిలాగులయక్షగంధర్వసతులు
సొలపులు మీఱంగ సోబానవాడ
ముత్తెంపుబొగడల మొనయుబాసికము
నత్తఱి నజుఁడు గాయజుఁడు గట్టంగ
వాణి శర్వాణి సౌవర్ణపాత్రికల
రాణించురత్ననీరాజన లొసఁగ
హరిదీశముఖులును హరిచిత్తముఖులు
విరివిగాఁ దమలోన వీడులు జదువఁ
ద్రిదశార్యముఖ్యులు దివ్యసంయములు
పొదవి యాశీర్వాదపూర్వంబు గాఁగ



నక్షతులైన యయ్యాదిదంపతుల
కక్షతంబులు వెట్టి రాగమోక్తముగ
హరియాజ్ఞ నవనిధు లట కేగుదెంచి
కర మర్థితో నూడిగంబులు సలుప
శ్రీరంగనాథునిసేనావిభుండు
కారినందనుఁడాదిగాఁ గలవారిఁ
గమలసంభవుఁ డాదిగాఁ గలవారి
బ్రమదంబుతోడ సంభావించె నపుడు
వల్లభదేవుండు వరుసతో భూమి
వల్లభులను గారవమునఁ గావించె
నీవిధి రంగమహీనాయకుండు
విమై నలవధూటిని వరియించి
మోదించి కాసారముఖ్యయోగులకు
గోదనెచ్చెలులకుం గురుకాధిపతికి
వలయువారికి నిష్టవరముల నొసఁగి
యలరుచు నుండి నాలవనాఁటిరాత్రి
యురగతల్పమున నయ్యుడురాజనదనఁ
దిరమొంద మరుకేళిఁ దేలిచి తేలి
యోగనిద్రాసక్తి నుండఁ బూర్వాద్రి
జేగురునెరసినచెలువు దీపింపఁ



ప్రొద్దుసారథిపొడుపులచాయ లెసఁగఁ
దద్దయుఁ బ్రేమ నత్తఱి నేగుదెంచి
యలపరాంకుశముఖ్యు లగుయోగివర్యు
లలరి గోదాయుక్తుఁ డగురంగవిభుని
సొరిదిఁ బ్రాబోధకీస్తుతిఁ బాడఁదొడఁగి
రరుణబింబం బుదయాద్రిమై నిలిచెఁ
బలపల వేగి వీడ్వడ మబ్బు లడఁగె
నలరుచుఁ బూదేనియలసోన గురిసెఁ
బాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
ములముల వికసించుమొల్లక్రొన్ననల
వలపులఁ దూర్పువీవలు లెచ్చరింప
మంచుగుబ్బలుల వేమరును గేలించు
నించురెక్కల మించులెసఁగ జూడించి
నెత్తావియిండ్లలో నిదురించుచున్న
మత్తహంసలు నంచమగలు మేల్కనిరి
పాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
చుక్కలరుచి డొంకె సోముండు గ్రుంకె
దిక్కులరవికాంతి దీండ్రింపఁ దొడఁగెఁ

బోఁకపూబాళల బొదిగొన్నతావి
సోఁకులవలిగాలి సొలయంగఁ దొడఁగెఁ
బాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి మేల్కనవె
వ్రేపల్లె గోవుల వేణునాదంబు
లేపారె రవళించి వృషభసంతతుల
గాటంపుమేతల గబ్బలు మీఁఱెఁ
దేఁటిదాఁటులమ్రోత దెసలఁ బెల్లొదవెఁ
బాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
రాత్రి దొలంగె నారామభూజములఁ
బత్రులు వికసితపత్రంబు లయ్యె
నలరె నంబుధిఘోష మమరబృందంబు
దళుకొత్తు పెక్కుపూదండకానుకలు
పూని నీపదపద్మములసేవఁ గోరి
యూనినవేడ్కతో నున్నారు వీరిఁ
బాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
తేరులనిలిచి యాదిత్యవర్గంబు
లారూఢవృషభేంద్రు లై పశుపతులు



కమనీయశిఖి నెక్కి కార్తికేయుండు
నమరులఁగూడి నృత్యములు సేయుచును
వినుతించి నిన్ను సేవింప నీవేళఁ
జనుదెంచి నీదుమోసలనున్నవారు
పాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
యమర గంధర్వ విద్యాధర దైత్య
సముదయయుక్తుఁడై సంక్రందనుండు
కరి నెక్కి ఘనమునిగణమును దాను
దొరసి ద్వారమునఁ గోదోపులాడెదరు
పాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి మేల్కనవె
నిధులు నంబుధులును నిర్జర కపిల
బుధులు నచ్చరలుఁ దుంబురునారదులును
మునులు నీముందర మొనసియున్నారు
వనజాప్తుకాంతి తీవలువాఱె దెసలఁ
చాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
కరమర్థిఁ గిన్నర గరుడ సిద్ధాదు
లరిది మృదంగవీణాదివాద్యముల

సరవిమై నీమీఁది సంకీర్తనములు
పరిపరిలాగులఁ బాడుచున్నారు
పాలించి కరుణచొప్పడ యోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి మేల్కనవె
తమ్ములు వికసించెఁ దరణియుం బొడమెఁ
గొమ్మలు పసపాడి కోరి నీరాడి
కట్టిరి పుట్టమల్ కావేరినడుమఁ
బుట్టక పుట్టిన పూసెజ్జ నున్న
నీలనీరదవర్ణ! నీయోగనిద్రఁ
జాలించి శ్రీరంగశాయి! మేల్కనవె
శ్రీరంగనాథుఁ బూజింపంగవలసి
పూరించియున్న యీపూవులకరఁడి
నందంబుగాఁగ భుజాంతరసీమ
యందుఁ గైకొన్నభక్తాంఘ్రిరేణుండు
గావించె నీదశగాథలచేత
భూవినుతముగఁ బ్రాబోధకీకృతిని
అనునర్థముల నొప్పు నలభక్తపాద
వనజాతరేణు కావ్యంబుఁ జొప్పడఁగ
గురుభక్తి నలపరాంకుశముఖ్యులెల్లఁ
గరమర్ధి మంగళగానంబు సేయ

 

నురగేంద్రశాయియై యున్న శ్రీరంగ
వరుఁడు మేల్కాంచి యవ్వనితయుఁ దాను
గనువిచ్చుపుండరీకములచందమునఁ
గనువిచ్చి యెంతయుఁ గ్రమము దీపింప
నుచితసత్క్రియలెల్ల నొనరించి భక్త
నిచయంబు దేవతానికరంబు మునులఁ
గరుణాకటాక్షవీక్షణసుధాధార
బెరయించి యెంతొ సంప్రీతి రెట్టింప
నారామతోఁగూడ నభినవలీల
శ్రీరంగమునకు వేంచేయంగఁ దలఁప
ననుగు రెట్టింపంగ హరిచిత్తుదేవి
తనపట్టిఁ జేరి యెంతయు బుజ్జగించి
యమృతంపు బెల్లంపు టచ్చులు మంచి
యమరేంద్రునెలదోఁటయరఁటిపండులును
గడుమించు నపరంజికమ్మదోపులును
నొడి బియ్య మిడి కూర్మిమొలయఁ గౌఁగింట
నలమి యానందబాష్పాంబుపూరములు
తళుకుజెక్కులజార తనయ నీక్షించి
ననబోఁడితో రఘునాథునివంటి
పెనిమిటి నీకు నబ్బెను నోఁచినట్లు



మనమార విను పిల్చి మగఁడు నెయ్యమున
ననయంబుఁ జేరరమ్మని చన వొసఁగి
మేలమిచ్చిన మందెమేలంబు మాని
తాలిమితోడ నాతనిచిత్త మెఱిఁగి
సవతుగా నీతోడిసవతులు చూచి
యవునౌనె యని కొనియాడ నెల్లపుడుఁ
గనలక భూదేవిగతి నుండుమమ్మ
మనసిచ్చి మీలోన మగఁ డేరినైన
దలమీఁద నిడికొనఁదలఁచిన నిన్నుఁ
దలమీఁద నిడికొన్నదానిగాఁ జూడు
మిరవొంది నురముపై నిడికొన్న భక్తి
నరసి నీవున్నట్ల యాత్మ భావింపు
తరలకు మఱికొక దాక పోకాకు?
తరవాత మది నెల్లిదము వలదమ్మ
తనయను మగనిడెందములోన నుండు
మని బుద్ధిచెప్పుచో హరిచిత్తయోగి
యాకన్నె రంగనాయకునిచెంగటికిఁ
దోకొనివచ్చి సంతోషంబుతోడ
నురుతరపీఠిపై నునిచి కట్టణము
లిరువుర కొసఁగి యోగీశుఁ డావేళ



మఱియు నావంటిపామరుల నీడేర్చి
గురుగాఁగఁ జేపట్టికొనఁగఁ దలంచి
   * * * * *
యలవడ నిత్యముక్తాళి సేవింప
నలవిష్ణుచిత్తకన్యకతోడఁగూడఁ
జిక్కనితొలుబల్కు సెకలింపు తేజి
నెక్కి సొంపెక్కి యాఋక్షమార్గమున
రాజిల్లుశితచామరముల వారముల
భ్రాజితరత్నదీపముల ధూపములఁ
గొసబుముత్తియపుమ్రుగ్గులను నిగ్గులను
దనరారువివిధనేత్రముల ఛత్రములఁ
గనకంపుటనఁటిమోఁకలను బోఁకలను
ననుపారుపుష్పగంధముల గంధముల
విలసిల్లు నారాజవీధి నేతేం
నలవధూవరులసోయగము సేవింపఁ
బరువడివచ్చు సంభ్రమమునఁ బౌర
తరళాయతాక్షు లెంతయు వేగపడుచు
సందడిపడుచు లో సంతోషపడుచు
నందంద వీక్షించి యాశ్చర్యపడుచుఁ
గడునాసపడుచు వేడ్కలఁ దడఁబడుచు
నడరుమేడలమీఁద నాయత్తపడుచుఁ



దిలకంబు కామినీతిలకంబునొసలఁ
దెలివిమీఱఁగఁ దీర్చి తీర్చి యేతెంచి
తివిరి కాటుక కంటఁ దీర్పంగఁ బోయి
శ్రవణావతంసకైరవమునం దీర్చి
చనుదెంచె నొక్కర్తు, చంద్రాస్యయోర్తు
తన కేలినులివుమధ్యమునఁ బొంకించి
యరుదెంచి యొడ్డాణ మఱుతఁ గేల్కొలిపి
పరువడి నేతెంచె; భామయొక్కర్తు
చేచేతఁ దా ముడిచినదండ లొసఁగ
నీచెలిఁ గరుణించె నీరంగవిభుఁడు
సరగున నే నట్ల సవరించి యతని
వరియింతు నని వచ్చువడువున నోర్తు
సిరిమించుకొప్పు గొజ్జెఁగదండ రంగ
వరునిచెంగట వీడివ్రాల నేతెంచె
నీరీతి వచ్చి యయ్యింతు లాచెలువ
శ్రీరంగనాథుని సేవించి పొంగి
కొమరార నిటువంటి కొమరితె గాంచి
కమలభవాదులుం గనలేనియట్టి
ధవళాక్షు నీరంగధవుని నల్లునిగ
సవరించికొన్న యాజగదేకనుతులు



వారెపో మహి భాగ్యవంతులయైన
నారయఁ గన్యకయైన నిట్టిదియె
తోయజాలయసయిదోడు దా నగుచుఁ
దోయజనాభుపొందులు సందుకొనియె
ధరలోననర్చావతారులైనట్టి
మురసూదనునిదివ్యమూర్తులలోన
నిట్టిబంగరుకుండ నిల్లాలి గాఁగఁ
జెట్టవట్టినయట్టి శ్రీరంగవిభుఁడు
వీఁడెపో ధన్యుండు వివరించిచూడఁ
బోడిమిగా నిట్లు పొగడి వెండియును
గన్నియకన్నుల కలికిబాగులను
జిన్నారివదనంబు జగితావిమోవి
తిన్నదనంబుఁ గౌఁదీఁగబిత్తరముఁ
బ్రన్ననిమెఱుఁగుగుబ్బలమిటారంబు
గురులసోయగముఁ జెక్కులమీఁదిమిసిమి
కరములయొప్పును గచముబెడంగు
నొసలియొప్పిదము నీనులచక్కఁదనముఁ
బసమించునారు లోపలిసైకదనము
నడుగులవిన్నాణ ముదంద చూచి
యుడివోనికూర్మిమై నొండొరుఁ జూచి



కలకంఠి జఘనంబుకలిమి యందఱకుఁ
గలుగుసంగడిబారగనుబండికట్లె
హరిమధ్యగళముసోయగ మందఱకును
దొరక నేమేనిపొత్తులఁ బెట్టినదియొ
కుందకుట్మలందంత కొప్పువిన్నాణ
మందఱకును గల్గ నల్లాడనిడిరె
యిందుబింబానన యెలగౌనుచంద
మిందఱకును గల్గ నింతయల్పంబె
యన్నియు నేల? యీయలివేణిచెలువ
మెన్నిన జగతి నహిప్రతి యనఁగ
వినుచు నాశ్రీరంగవిభుఁడు వారలను
గని కరుణాకటాక్షముల ముంపుచును
నత్యంతసంతోషితాత్ములై యెదుట
నిత్యులు ముక్తులు నెలకొనికొలువ
నమరులు నిజవాహనారూఢు లగుచుఁ.
గ్రమమునం దమయూడిగములు గావింప
నంచ తేజీ నెక్కి యరవిందసూతి
యంచబాయక వేత్రహస్తుఁడై నడవ
నీరీతి విలసిల్లి యెతంయు మగిడి
భోరునం దనపురంబున కేగుచుండి



శ్రీరంగచంద్రుఁ డాశీతాంశువదన
గారవం బెలరారఁ గనుఁగొని పలికెఁ
దెరవ నీవంటిపుత్రీమణీతతుల
నెరయంగఁ దా గాంచు నిచ్చ నిచ్చలును
లలితకల్లోలలోలన్ముక్తయైన
నెలఁత యీతామ్రపర్ణీనదిఁ గంటె
మంజుబంభరచక్రమంజీరయైన
మంజీరనదిచెంత మానైనయట్టి
యారామగిరిరాజ మది గనుఁగొంటె
యోరామ! నేఁ బాయకుండెడునెలవు
లదె చోళ పాండ్య మధ్యస్థితం బగుచు
విదితమై యొప్పెడువిపినంబు గంటె
యిన కాంతి కొకయింతయెడమీక యలరి
కనిన కన్నులకుఁ జీఁకట్లు క్రమ్మెడిని
యలచోటిచెంచత లహిశిరోమణుల
బలపొదరిండ్ల దీపంబు లెత్తెదరు
శ్రీలిచ్ఛుకావేరిచెంగట నొప్పు
చోళదేశం బదే శుకవాణి! కంటె
కంటివే యోతమ్మికంటి! ముక్కంటి
వంటిల్లు సురనాగవరు పుట్టినిల్లు



మామకశయనసద్మంబును జంద
మామగన్నతఁడు మామానినీగురుని
మామామ నీక్షింపు మామహాంబుధిని
సీమంతినీమణి చిగురాకుబోఁడి!
యనుచు నానతి యిచ్చి యతిసంభ్రమమునఁ
దనపురంబునకు నత్తఱి నేగుదెంచి
శ్రీవిలసిల్ల నచ్చెలువలతోడ
వేవేగ సదనప్రవేశంబు సేసి
ఫాలకీలితహస్తపద్ము లైనట్టి
నాళీకసంభవనా కేశముఖుల
మునులఁ గృపారసంబునఁ దెప్పఁదేల్చి
కనకాంబరాదులు గట్టంగ నిచ్చి
కరమర్థి వేర్వేఱఁ గరుణదైవాఱ
సరగున నిజనివాసములకు ననిచి
నెలకొని శ్రీభూమినీళలతోడ
నలవిష్ణుచిత్తకన్యకతోడఁగూడ
సరస కేళీలోలసంపత్తికలిమి
సిరులు దైవాఱంగ శేషతల్పమునఁ
బవళించి నిజభక్తిఁ బరిజను ల్గొలువ
నవిరళశ్రీమంతుఁ డైయుండె ననుచు



నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళపాకన్నయార్య
తనయతిమ్మార్యనందనరత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్దసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృతమైన పరమయోగివిలాసకృతిని
నతులితంబుగఁ బంచమాశ్వాసమయ్యె.


____________
  1. నట్టినడురేయి
  2. నెంతవడిని
  3. చాతి
  4. కైలువార
  5. శౌరి
  6. లోన
  7. గల్పితనంగ
  8. తోయమహీంద్ర
  9. గంగాపుర
  10. సేతు నేయెంతైన నీలాహివేణి.
  11. వరుల్
  12. పంచ