పరమయోగి విలాసము/తృతీయాశ్వాసము

పరమయోగివిలాసము

తృతీయాశ్వాసము.

హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూత సంకాశ! శ్రీవేంకటేశ!
మునిశాలికాసారముఖ్యభక్తాళి!
వనమాలి! యవధారు వరదానశీలి!
కడుచిత్రమై తూర్పుకడలికిం జక్కఁ
బడమటి దెసజగత్పావనం బగుచు
ధాత్రీసతీమణి ధరియించు రత్న
చిత్రకం బోయనఁ జెన్నగ్గ లించి
మండితం బగు పాండ్యమండలి సరసఁ
[1]బుండరీకంబునాఁ బురియొండు వెలయు
నాపట్టణము కురువను రాజుచేత
ద్వాపరంబునఁ బాలితం బైనకతనఁ
గురుకాభిధాన మై కొమరుదీపించు
నిరుపమతామ్రపణీ౯సమీపమున

నల పట్టణమునకు న మ్మహాతటిని
యెలమిఁ బుష్పాంజలు లిచ్చెనోయనఁగఁ
గడలతా కుల మౌక్తికములు బిట్టెగసి
వడిదదంగణభూమి వర్షించుచుండు
మందాకినీనదీమహితకల్లోల
[2]మందానిలాలోల మంజుకేతువులు
గోపురాన్వితము లై గోపురాగ్రములఁ
బ్రాపించి రతిపరిశ్రాంతి నున్నట్టి
యమరదంపతుల మై నందందవొడము
చెమరులోర్పుచునుండుఁ జిత్రవైఖరుల
వరహేమవర్ణలు వసియించినట్టి
హరినీలమణిమయ హర్మ్యవాటికలు
అసమయశంపాన్వితాంబు దోదయము
పసలుపుట్టించు నప్పసము నచ్చటను
శ్రీద్యోతితుఁడు మునిసిద్ధసేవ్యుండు
నాద్యుండు నైన శ్రీహరియుండు నందు
నత్యంతశుభశీలు రమలమానసులు
శ్రుత్యంతవేదు లచ్చోటి భూసురులు
వీరు వారనక య వ్వీటిలోనున్న
పౌరులు పరమప్రసన్నులే తలఁప

నందులో నొక్కమహాభాగవతుని
నందనుం డిందిరానాథతత్పరుఁడు
వనధిగంభీరుండు వళిధినాటేంద్రుఁ
డనుపేరఁ బ్రఖ్యాతి నంది యాఘనుఁడు
ధర్మధరుం డను తనుజాతుఁ గాంచె
ధర్మజ్ఞుఁ డైన శ్రీధవభక్తుఁ డతఁడు
చక్రిపాణిధ్యానసంసక్తుఁ డైన
చక్రపాణిని గాంచె సంతోష మెసఁగ
నతఁ డంత రక్తధారాహ్వయుఁ గాంచె
నతఁడు పాటల మోచనాఖ్యుని గనియె
నతనికి భోక్తాళి యనుపేరు గలుగు
సుతుఁ డుదయించె నాసుజ్ఞాననిధికి
విపులార్థసత్కారి విభవానుకారి
యపగతాహంకారి యఖిలోపకారి
యనుపమాలంకారి యవికారి కారి
జనియించె నాకారి[3] జనకుఁడు నంత
వరుస నవీనయౌవనుఁ డైనతనుజ
వరునకు నత్యంతవైభవశ్రీలఁ
గువలయాంగనకూర్మి కుఱుకైనకురుక
యవుల శోభిల్లు గ్రామాంతరసీమ

ఘనతపోనిధి యైన కమలాప్తవక్షుఁ
డనుభాగవతునకు నాత్మజ యైన
పాథోధికన్యకాపతిభక్తినిరత
నాథనాయిక యనునలినాయతాక్షిఁ
బరిణయం బొనరించి పరమానురక్తిఁ
గురుకాధివాసుఁ డై కొమ రొప్పుచుండె
నంత నాచెలువప్రాయమునఁ జెన్నొంది
కొంతకాలము కాంతుఁ గూడి వర్తించి
జననగేహమునకుఁ జనుదెంచి కొన్ని
దినము లచ్చట నుండి తిరిగి వెండియును
నత్తవారింటికి నరుగుచోఁ ద్రోవఁ
గ్రొ త్తైనమించులు గులుకుమేడలును
బసిఁడిమొల్లాము గుబ్బలకవాటములుఁ
బొసఁగి చూపట్టుగోపురమంటపములుఁ
జెలఁగుచు వేల్పునెచ్చెలులపాలిండ్లఁ
గలకల నవ్వుబంగారుకుండలను
నెలచట్టుకోటల నిద్దంపుమణుల
నలరెడు నగరంబునందుఁ జూపట్టు
నాకు రంగేశు దైవాధీశవంద్యు
లోకాధినాథు నాలోకించి భక్తి

వినత యై వినుతి గావించి “యోనంద
తనుజన్మ ! నా కొక్కతనుజన్ము [4]నొసఁగు”
మన విని యప్పు డయ్యరవిందనాభుఁ
డనురాగ మెలరార నాత్మ నుప్పొంగి
వదనంబుఁ దెఱచి దైవాఱెడుకరుణ
నెదుట నున్నట్టి య య్యింతి నీక్షించి
పుత్త్రి! యేనే నీకు భువనంబు లెఱుఁగఁ
బుత్త్రుండ నయ్యెదఁ బోయి ర మ్మనిన
మతి సంతసిలి ప్రణామము సేసి తనదు
పతిగేహమునకు నప్పడఁతి యేతెంచి
కాంతానురక్తయై కడువేడ్క నుండె
నంతట నాకురంగాధినాయఁ కుడు
తననిజరూప మై తనరుసే నేశుఁ
బనిచెఁ దద్గర్భసంభవుని గమ్మనుచుఁ
బనిచిన నారమాపతిసైన్యపతియుఁ
జని ప్రవేశించెఁ దజ్జఠరంబునందు
ననబోఁడి యగు నాథనాయిక కపుడు
కనుపట్టె నొయ్యన గర్భచిహ్నములు
సూత్రవతీశుచేఁ జొప్పడుచున్న
వేత్రంబు మైకాంతి వెలిమించినట్లు

సవరైననల్లపూసలపేరు వోలె
నవిరళం బగుచు రోమాళి చూపట్టె
ననవిల్తునునుగుందనపుబొమ్మరముల
కొనల నీలపుములుకులు దాచినట్లు
వలుద లై తళుకెక్కి వట్రువ లైన
ములుగుబ్బపాలిండ్లమొనలకప్పొద వెఁ
గలికిచూపులఁ జంద్రికలు పర్వె ననఁగఁ
బలుకబారెను గండపాళికాయుగము
నలివేణి ముఖచంద్రుఁ డమృతంపురసముఁ
జిలుకుచందంబునఁ జిట్టము లెసఁగె
గగనభాగంబు సాకార మై యొప్పు
పగిదిఁ గౌఁదీఁగ చూపట్టె నానాఁటఁ
బొలఁతికి నవమాసములు నిండువేళఁ
గలలోన గజముఖగణముఖు ల్గొలువ
వేత్రహస్తునికూర్మివెలఁది యైనట్టి
సూత్రవతీదేవి చూపట్టె నంతఁ
గలియుగం బిలమీఁదఁ గలిగినమీఁదఁ
దెలియఁ దొంబదిరెండుదినములు చనఁగ
సవరనివేళ వైశాఖవిశాఖఁ
గవివాసరమునఁ గర్కటకలగ్నమునఁ

గనియెఁ బుత్త్రుని జగత్కల్యాణమూర్తి
వనజాక్షుఁ గన్నదేవకిరీతి నంతఁ
గావిరి విరిసె దిక్తటుల మహాను
భావభావముల సంభ్రమము రెట్టించెఁ
గురిసెఁ బువ్వులవాన ఘుమఘుమ మింట
మొరసె దుందుభులు ప్రమోదంబుతోడఁ
బొంగె వైష్ణవకులాఁభోరాశి మిగులఁ
గ్రుంగెను పాషండకులభూధరములు
విందు లై మకుటాగ్రవిహితక రార
విందు లై యింద్రాదివిబుధులు బుధులు
జయ జయ శబ్దముల్ సవరించి రెలమి
నయముగా వీచెఁ గ్రొన్ననతావిగాలి
యలయుచు యాయజూకాగ్నిహోత్రములు
వలగొనుశిఖలఁబావకుఁ డొప్పుమిగిలె
ధరణివరాహావతారుఁ డై నట్టి
హరి సూతికాగృహ మపుడు సొత్తెంచి
కరుణ దైవాఱంగఁ గారిసూనునకుఁ
దిరముగా జ్ఞానోపదేశంబు చేసె
నప్పు డానాథనాయకి పుత్త్రుఁ గాంచి
నప్పు డాశౌరి గేహాంతరసీమ

శేషుండు నిర్ణిద్రచించామహీజ
వేషుఁ డై యెంతయు విలసిల్లుచుండె
హరికృపాలబ్ధవిద్యామృతాహార
పరితృప్తుఁ డై తల్లిపాలిండ్లపాలు
కుడువఁ డేడువఁడు కన్గొనఁ డొండుదిక్కు
బడలఁ డీగతి నున్న బాలు నీక్షించి
యడియాసఁ దలిదండ్రు లదెయిదె యనుచుఁ
బొడిబడుకొనుచు నప్పురుడెల్లఁ గడపి
యిలఁ బుట్టి చనుగ్రోలఁ డీబాలుఁ డనుచు
నెలమి మారున్నామ మిడి యటమీఁద
మఱియుఁ దొల్లింటియమ్మాడ్కి నే యుండ
గిఱికొన్నవగల మిక్కిలి వెఱఁ గంది
యిది యేమిచోద్యమో యిన్నినా ళ్ళాయె
నుదయాస్తమయములం దొక్కమా ఱైనఁ
జను నోటఁ బెట్టఁడు చను గ్రోలకున్నఁ
గను విచ్చి చూడండు కను విప్పకున్న
నెలుఁ గెత్తి కా వని యేడువం డెపుడు
నలకువ మేన నింతయుఁ గానఁబడదు
కడుఁ బెద్దకాల మీగతి గొడ్డువీఁగి
కొడుకుఁ గాంచిన నెట్టికొడుకు సిద్ధించె

దేఁకువఁ గనిపించుతెఱవలఁ జూచి
యేఁకటఁ బడఁజేసె నిట్లు దైవంబు
మఱియును నేము నిమ్మహిఁ బుట్టి బుద్ధి
యెఱిఁగితి మీరీతి యెఱుఁగ మెన్నండు
కరమునం గని పెంచువారలు లేరె
వర మైన నిటువంటివర మెందుఁ గలదు
కురుకాధినాథు మక్కువఁ గోరి వేఁడఁ
గరుణించి వర మిచ్చెఁ గడు[5] సీగరముగ
నిచ్చెఁ బో యిందఱ కిచ్చినరీతి
నిచ్చెనా తుది వచ్చి యిది కొంత సేసెఁ
దలఁపఁ బిడ్డఁడె వీఁడు దయ్యంబు గాక
పలుమాఱు నీరీతి[6] బలుపుకో నేల
నని పుత్త్రవాత్సల్య మంతంతఁ బొదలఁ
దనవారిదెసఁ గాంచి తనయునింజూచి
యేను నీకై నోము లెన్నేని నోఁచి
[7]పైనాఁకపాటులఁ బడి గొడ్డువీఁగి
కంటి నీవంటి చక్కనిముద్దుగుఱ్ఱ
నంటు సేయవు కేరి నవ్వ వేమిటికి
నీసున మీతండ్రి యేనును నీకుఁ
జేసిన యెగ్గేమి చెప్పుమా తండ్రి !

యోయన్న! యిట్లూరకున్నాఁడ వేలఁ
బూయంగఁ జేఁపి యేర్పులు దట్టుతనదు
చన్నులపా లేల చవిగొన విపుడు
కన్నుల ముత్యాలు గాఱ నేడువవు
తనయ! నీ వేల మీతండ్రి “నన్న” నవు
నను “నమ్మ” యని యొక్కనాఁడుఁ బేర్కొనవు
సుద్దులు చెప్పవు చూడవు నీదు
ముద్దులు సూపవు మురియ వే నునుచు
నాఁపిన బాష్పంబు లడరి నిండారఁ
జేఁపినపాలిండ్లు చేతఁ గుల్కుచును
గన్నవారలకుఁ జెంగట నింత నంత
నున్నవారికి దైన్య మొదవ ని ట్లనియెఁ
బలుమాఱు పిలచినఁ బలుకవు తాము
తొలుజన్మమున నెంతదోసకారులమొ
చిట్టినీబంగారుచేతుల హరికిఁ
బెట్టుమా జోతాలు ప్రియము రెట్టింప
మొలకనవ్వులు దేఱ ముద్దులు గాఱఁ
గిలకిల వాయెత్తి కేరు నాతోడఁ
గురుకాధివిభుఁడు మక్కువ నిచ్చినట్టి
వరమునఁ బుట్టి దేవరవలె నున్న

నినుఁ జూచి మాటాడ నేరనివాఁడ
వనుచు నీబావ లంతంత నవ్వెదరు
బడిసె మిక్కిలిసిగ్గు వడఁగ నీయెడమ
యడుగునఁ జె ప్పిడుమయ్య! నాకోడె!
కడువేడ్క మీతాత గావించుబాల
తొడవులు దొడుగఁ జేతులు సాఁచు మయ్య!
మనమున నినువంటిమనుమండు గలిగె
నని సంతసించి మీయవ్వ తాతయును
బొదలుచు వచ్చి మూఁపులు మూడు గాఁగ
నదె పిల్చెదరు మాట లాడవే తండ్రి!
మును వరంబిచ్చినమురసూదనుండు
తనుఁ బోలుపుత్త్రరత్నముఁ బ్రసాదింతు
ననఁగ నమ్మితిఁ గాని యన్న! యీ పుట్టు
ముని వైన నిన్ను నిమ్ముల నిచ్చుటెఱుఁగఁ
బ్రాకృతక్రియకు లోఁబడకున్న నిన్నుఁ
బ్రాకృతనిజపుత్త్రభావంబుఁ జేయ
నలిగితో తలఁపు శ్రీహరియందుఁ దగిలి
యిల నొండు సైఁపదో యీవేళ నీకు
నుడుగక మావంశ ముద్ధరింపంగఁ
బొడమిన కురుకాధిపుఁడవె నీ వనుచుఁ

దమకంబుఁ బ్రియమును దైన్యంబు వగపు
సమకొనం బలుకుభాషణము లాలించి
యనిశంబు సంసార మనుపయోరాశి
మునిఁగి తేలుచు నున్నమూఢకామినులు
కొందఱు బాలుదిక్కును బాలుతల్లి
చందంబుఁ జూచి లోఁ జర్చించి యనిరి
కట్టిఁడి వీరి కెక్కడిబిడ్డఁ డమ్మ
పుట్టి యిన్నాళ్ళాయెఁ బులుకునఁ గన్ను
దెఱవక చనుద్రోవఁ దివురనిబిడ్డఁ
బరికించి యింత నిబ్బరికంబు లేదు
వొది గల్గి భూమిఁ గాఁపురములు చేసి
బ్రదికి బాళెదమునఁ బరఁగువారలకు
వలవంతవేళ దేవర దయ్య మనఁగఁ
గలదు వారలరీతి గాదు వీరలకు
దేవుఁడో దయ్యమో తిరిగియు మగుడి
దేవుఁడు మాకు శ్రీదేవుఁడే యనుచుఁ
బిలిచి యంతయుఁ జెప్పఁ బెరుమాళ్లె మాకుఁ
గలఁ డంచునొల్లరు కలిగె వీరలకు
వజ్జంబో వారంబొ వారిసాజంబొ
వెజ్జుఁ జూపించరు వేల్పు లకిడరు

ఇప్పుడు బుడిబుడియేడ్పు లేడ్చినను
దప్పునే యిది పెద్దదయ్యంబుపట్టు
మనము చెప్పినమాట మనమున నిడరు
వినరన్నవారినే వెఱ్ఱులఁ జేసి
దాయలగాఁ జూడఁ దలఁతురు తాము
పోయినదేపోక పొసఁగ నౌ ననరు
అని కొంద ఱనుచుండ నతఁడు యోగీంద్రుఁ
డని కొంద ఱవల నున్నట్టిసన్మతులు
నాయాయివాక్యంబు లాలించి నాథ
నాయిక పరమవైష్ణవశీ లయనియెఁ
బ్రకృతివాసన నిట్లు పలుక వేమిటికి
సకలజీవులఁ జరాచరవస్తుతతులఁ
బొడమింప నుడిగింపఁ బోషింపఁగలిగి
కడ యాది మధ్యముల్ కన్పింపరాక
జగదేకవిభుఁడును సర్వస్వతంత్రుఁ
డగురమావిభుఁడు సేయఁగ లేనిపనులు
తనుదేహులును నస్వతంత్రు లస్థిరులు
ననధికారులుఁ గ్రూరు లల్పజ్ఞు లైన
యితరులచే సాధ్య మెట్లగు నైన
నతనిచేతనె యగు నఖిలకృత్యములుఁ

బుడమి దేవార్హ మై పొలుచుహవ్యంబు
కడు మొక్కలమునఁ గుక్కల కిచ్చినట్లు
నతనికి శేష మైనట్టి యీయాత్మ
నితరశేషము సేయు టెట్లు చింతింపఁ
దలఁపఁ బాతివ్రత్య ధర్మంబువంటి
నలినాక్షుదాస్య మెన్నక యిట్లు మీఱి
పలుకుదు రే మీరు? పామరు ల్గానఁ
బలికితి రిఁకనాడఁ బని లేదు మిమ్ముఁ
బరమబాంధవుఁ డైనపంకజోదరుని
నరిమీఱి యేమునిందనక దూఱితిమి
అతని దూఱఁగ నేల యతఁడిచ్చినట్టి
సుతుని మే మతఁ డున్నచోటనే నిలుప
వెత లేదు పద మంచు విభుఁడుఁ గాంతయును
నతివేగమునఁ బుత్త్రు నక్కుమారకుని
గొని యేగుదెంచి యాకురుకేశుఁ డైన
ననవిల్తుజనకునినగరిలోఁ జొచ్చి
యలవేల్పురాయని యగ్రభాగమునఁ
బొలుపొందుతింత్రిణిభూజంబు మొదలఁ
బసిఁడితొట్టెలలోనఁ బరఫును బోలెఁ
బొసఁగంగ మెత్తనిపొత్తులు పఱచి

యిందుమైఁ గప్పిన యెలమించుసోగ
కందువఁ జలి యెండ గాలిచాటుగను
నొరపుతోఁ గప్పినయుత్తరీయంబు
చెరఁ గింత చుబుకంబుచే [8]నోసరించి
పొదిగిటం జేర్చినపుత్త్రు నీక్షించి
ముదమునఁ జెక్కిలి ముద్దాడి యందు
నునిచి ముంగల నున్న యురగారివాహుఁ
గని యిరువురు నమస్కారము ల్సేసి
తమ కేమి తెలియు నంతయు నీకుఁ దెలియు
భ్రమరశోభనగాత్ర! పరమమాయావి!
యేము నీమహిమఁ దా మెఱుఁగ నోపుదుమె
యేమునీశ్వరులు ని న్నెఱుఁగంగలేరు
ఇటమీఁద నీచిత్త మెటువలెవచ్చె
నటువలెఁ జేసికొమ్మని విన్నవించి
యంతటఁ దమయింటి కరిగెద మంచుఁ
గొంతద వ్వరిగి యక్కువలయనేత్ర
పక్కఁ బాయని తనపట్టిరూపంబు
గ్రక్కునఁ గన్నులఁ గట్టిన ట్లైన
నెద జల్లు రసఁగఁ బాలిండ్లు సే చేఁప
మదిఁ బుత్త్రుమైఁ బ్రేమ మల్లిడిగొనఁగ

నలయుచుఁ బోవ [9]కాళ్ళాడకయుండఁ
గలఁగి మిక్కిలి కన్నకడుపుగావునను
గన్నీటిసెలయేటికాలువ లుబ్బి
చన్నుగొండలమీఁద జాలువారంగ
హా! కుమారక! యంచు నవనిపై వ్రాలె
నాకారియును నట్ల యవశుఁ డై తెలిసి
నెఱిఁ దక్కి తామరనెమ్మోము వాడ
నెఱిగొప్పు వీడఁ గన్నీరు బిట్టడరఁ
బదకింకిణులు గేరఁ బయ్యెద జాఱ
సదరుడెందముమీఁదిహారముల్ చెదర
మహితనందన శోకమగ్న యై మున్ను
మహి నున్న యలచంద్రమతియును బోలె
నిలఁ బొరలుచు నున్నయింతి లాలించి
తెలిపి కేలునఁ గేలు దెమలించుకొనుచు
నడలుచు సుతుఁ డున్నయటఁ జూచి కన్న
కడుపు గావున సాధ్వి క్రమ్మఱఁ బలికె
నేఁచి యింతఁగ బెంచి యెలమి నోవిడిచి
యేచింతయెఱుఁగని యీపసిబిడ్డ
నీచింతక్రిందట నిటు పాఱవైచి
యేచింత మఱలి నేనింటి కేగెదను

అని పోవఁదలఁచితి నకట! నోచెల్ల
తనగుండె ధాత ఱాతను జేయఁబోలు
నని కన్నులారంగ నాత్మజు మఱియు
గనుఁగొనం గోరి యక్కడకుఁ గ్రమ్మరను
బోవంగ నం దేమి పోయెద వనుచుఁ
జేపట్టి తిగిచినచెలువు నీక్షించి
నను నేల పట్టెదు నాచిట్టిపట్టి
మునివంటివాని కామునివంటివాని
జననిగర్భములోనె సర్వజ్ఞుఁ డైన
మునివంటివాని సోమునివంటివాని
నెనయ వేదములచి క్కెడలించినట్టి
మునివంటివాని రామునివంటివాని
జిగిమించు మోవికెంజిగురాకుమీఁద
నిగనిగ నగవువెన్నెల జల్లువానిఁ
గొదమతామరలబాగునవీనుసిరులఁ
గదిసిన నిడువాలుగన్నులవాని
బంగారుప్రతిమకుఁ బ్రతివచ్చునట్టి
సింగారములతోడఁ జెలువొందువాని
నీలంపుమొలకలనెఱులముంగురుల
చాలు గప్పినఫాలశశిరేఖవానిఁ

బొన్నపొక్కిలితోడఁ బొసఁగి బాగైన
తిన్ననిమెఱుఁగుచంద్రికబొజ్జవానిఁ
గ్రొన్నెలపులిగోరు గ్రుచ్చినమణుల
యన్నువకంటెలో నలవడువాని
గొరగల్గి కొదమనాగులబాగు లెసఁగు
మురువైన యపరంజిమురువులవానిఁ
బూని దేవుని సరిపోలుపవచ్చు
వానిఁ గన్నులఁ జూచి వచ్చెద ననుచు
నొడఁబడఁ జెప్పి యయ్యువిద కెంగేలు
విడిపించుకొనుచు నావృక్షంబుక్రింద
మలుకుటుంగరములు మణికంకణములు
నెలవంక పులిగోరు నెఱిగుండ్లదండ
నీలంబు లెడఁబెట్టి నిగుడించినట్టి
పాలపూసలు నొసపరిరావిరేక
రవలగజ్జియ లపరంజియందియలుఁ
బవడంపుమొలనూలు పసిఁడిగంటలును
గలిగి శ్రీకృష్ణుని గతి నొప్పుసుతుని
చెలువంబు గాంచి మచ్చికఁ జేర నరిగి
నెఱికురుల్ దిద్ది క్రొన్నెలబొట్టుఁ దీర్చి
చిఱుబొజ్జనిమురుచుఁ జెక్కిలినొక్కి

తద్దయుఁ బ్రేమ మస్తకము మూర్కొనుచు
ముద్దాడి మోముపై మోము డాయించి
నాపుత్త్రరత్నంబ నావెండికొండ
నాపాలిదైవంబ ననుఁ గన్నతండ్రి!
నాకులోద్ధారక నాతోడునీడ
నాకుందనపుఁబెట్టె నాకోడె యనుచు
నొసపరి చిగురాకుటొగరుశాకముల
కసరాటరిలిసరాగపునాద మెసఁగఁ
గోయిలజవరాలు క్రోల్చినరీతి
వాయెత్తి యాకీరవాణి యేడ్చుటయుఁ
గరుణించి శ్రీరమాకాంతుఁ డాకాంతఁ
బరికించి పలికె నోపరమకల్యాణి!
కృతకృత్యు లైన మీ కేల చింతింప
నతని మానవమాత్రుఁ డని తలంపకుము
ఏన యీరూపున నిలయెల్లఁ బ్రోవఁ
బూని మీకడుపునఁ బొడమినవాఁడ
నడలకుం డిఁకమీఁద నఖిలసౌఖ్యములు
నెడపక మిముఁ జెందు నిది నాదుమహిమ
సరగున నిజనివాసమునకు వేగ
నరుగుండు మీ రని యానతిచ్చుటయు

నాదంపతులు సొంపు లాత్మ రెట్టింప
మోదించి కరములు మోడ్చి నుతించి
వలచుట్టికొని నిజవసతి కేతెంచి
రలయోగిశీతాంశుఁ డలరి యవ్వేళఁ
బరపైనకొమ్మలు ఫణములు గాఁగ
సిరిమించులతికలు జిహ్వలు గాఁగ
మొగడగుత్తులు ఫణములమణుల్ గాఁగ
దగినశలాటువుల్ దంష్ట్రలు గాఁగఁ
బొది గల్గుమూలంబు భోగంబు గాఁగఁ
బదినూఱుశిరముల ఫణిరాజుకరణిఁ
దీ టయి యొప్పు నత్తంత్రిణీతరువు
కోటరవసతిఁ గైకొన నవ్వలించి
సరగున నపుడు శైశవ ముజ్జగించి
తరుణభావముఁ దాల్చి తద్వాసమునకు
ధరనుండి గిరిగుహాంతరమున కెగురు
కరివైరిపోతంబుకరణి లంఘించి
పద్మాసనస్థుఁ డై పద్మాక్షు పాద
పద్మముల్ తనదుహృత్పద్మసద్మమున
ధ్యానంబు సేయుచుఁ దనుబోలుజ్ఞానిఁ
గానమి నొండొరు కడఁజూడ కచట.

సంయమివరుఁడు వాచంయముం డగుచు
సంయుతవిద్యానుషక్తుఁ డై యుండె
నత్తఱి హరి యంబుజాలయఁ గూడి
క్రొత్తకుందనపురేకులనిగ్గు లొలయఁ
గలికిప్రామినుకుఱెక్కలతేజి నెక్కి
సలలితశశిబింబసహితహైమాద్రిఁ
బొలుచుశంపాన్వితభువనదం బనఁగ
నలపరమాభ్రంబునందుండి వచ్చి
భానుకోటిప్రభఁ బత్యక్ష మయ్యె
నైన విలోకించి యాకారిసుతుఁడు
శ్రుత్యంతదృష్టి కిశోద్యుఁ డైయుండి
శ్రుత్యంతదృష్టికిఁ జూపట్టె ననుచు
నాననకుముదాప్తుఁ డమృతంబు గురియఁ
బూనిన[10]క్రియ బాష్పపూరముల్ గురియఁ
గంతుతండ్రిని బొడఁగన్నసంతోష
మంతకంతకు హృదయమున నుప్పొంగ
తనువెల్ల గరుపార తామరసాక్షు
వినుతింపుచుండె వేవేలచందముల
నపుడు జగన్నాథుఁ డగురమానాథుఁ
డపరిమితంబు లైనట్టివేదముల

నఖిలశాస్త్రంబుల నయ్యోగిచంద్రు
ముఖమున ద్రావిడామోదవాక్యముల
రాజిల్ల వీక్షింప రమణమై భోగి
రాజపర్యంకువరప్రసాదమున
నమితాగమములు జిహ్వారంగసీమఁ
దముదామె చెలఁగి నర్తన మాడఁదొడఁగె
నాక్షణంబున వచ్చి యఖిలశాస్త్రములు
లక్షింప లాలాజలంబు లై తనరె
వెలయంగ శారదాన్వితజిహ్వుఁ డగుచు
నలయజుఁ బోలె నేకాననుం డయ్యు
నీరీతి నాసంయమీద్రుండు సహజ
సారస్వతోదారసంపన్నుఁ డయ్యు
ధవళాక్షుఁ డంత నంతర్హితుం డైన
వివరించి యానందవిహ్వలుం డగుచు
నాపోడశాబ్దంబు లంతరంగమున
శేషపర్యంకుని జింతించుకొనుచు
మౌని యై యుండె నమ్మౌనివల్లభుఁడు
సానందుఁ డై పదియాఱవయేఁట
నరవిందభవసపర్యాప్తగోవింద
చరణారవిందనిష్యందమరంద

వారిధారాకారవరవారిపూర
పూరితగంభీరభూరినిర్ఘోష
రంగదభంగసంభ్రమభరోత్తుంగ
గంగాతరంగవైఖరులు దీపింప
నిరవద్యములు యోగినికరవేద్యములు
హరిగుణహృద్యంబు లైనపద్యములు
మకరకుండలధారు మై ననేకంబు
లకలంకభావంబు లలరఁ గావింప
నవిరళతద్రసం బరయుచు నంద
తవిలి డెందమున నెంతయుఁ జిక్కి దొక్కి
యానందపరవశుఁ డై యాఱునెలలు
మౌని యై యుండి క్రమ్మఱ మేలుకాంచి
మకరకేతనుతండ్రిమై నంకితముగ
నొకకొన్నిపద్యంబు లొనరించి మఱియు
నందలిరసరీతు లరసి యానంద
మొంది యాకైవడి నుండె నన్నాళ్లు
వెండియుఁ దెలి వొంది విష్ణునిమీఁద
దండిమైఁ బెక్కుపద్యములు గావింపఁ
గారిసూనునికావ్యకన్యకామణికి
ధారుణి నర్చావతారరూపములఁ

జెలు వొందు విష్ణుని శ్రీమూర్తులెల్ల
వలచి వేగమె వచ్చి వలచుట్టుకొనుచు
నతులచించాకోటరావాసుయోగి
పతిని సత్కవిసార్వభౌము నీక్షించి
తెలియంగఁ దమతమ దివ్యనామములు
తలపించి [11]తముఁబాడు తముఁ బాడు మనుచుఁ
దోదోపు లాడుచుఁ దొలఁగక నంత
వేదశాఖలు వోలె వెలయుశాఖలను
నవలంబనము సేసి యామ్రానిచుట్టు
బవరిగాఁ జుట్టి శ్రీపతిమూర్తు లెల్ల
వినయభాషణముల వినుతి సేయుచును
మనములోపల మమ్ము మఱవకు మనుచు
నాకారివైరిసంతతి నుతి సేయ
నాకారినందనుం డానంద మంది
మౌనులవిందు లై మాధవాంశముల
వీనులవిందు లై వెలయుసూక్తులను
వారక యొకతరవాటు చేకొనుచు
నీరజోదరుల వర్ణించి వర్ణించి
శ్రీవేంకటేశు రాజీవాస్త్రగురుని
భావించి యతనినిం బలుమాఱు నెన్ని

వెండియు వారల వినుతి సేయుచును
గుండలీవతిశైలగురుని కీర్తించి
కలయ వారల నెన్ని క్రమ్మఱి మఱియు
నలమేలుమంగావిహారుచందములు
కొనియాడి యాడి తద్గుణసుధారసముఁ
దనివారఁ గ్రోలి యాతనియంద చిక్కి
యచరితభావంబు లడర వేదములు
పచరించి చేసెఁ బ్రబంధరత్నముల
నున్నతి వేదాంతయుక్తులఁ బేర్మి
నెన్నిన హరిమూర్తు లేకభావముల
నది యెఱింగియు మౌని యై యంజనాద్రి
మదనమన్మథుమీఁద మరు లేల కొనియె
నరయ నందఱకంటె. నహిరాజశైల
మురవైరి కిటువంటి మొగసిరి గలదొ
యరయంగ సర్వజ్ఞుఁ డతఁ డెఱుంగుటకు
నరుదు గా దెన్నిన నమ్మహామూర్తిఁ
గన్నవారలుఁ గడకడనుండి చెవుల
విన్నవారలు కడువేడ్క నుప్పొంగి
యక్కజపడి యాత్మ నందంద చొక్కి
చిక్కకపోరు చర్చింప నాకృతుల

నందలిరుచిఁ జిక్కి యన్నాళ్ళు తొంటి
చందాన నుండి క్రచ్చఱ మేలుకాంచి
యనిశంబు శౌరిదివ్యగుణానుభవము
లనుభవించుచు నుండె నంతటిమీఁద
ధారుణీస్థలి సంపదలచేత వేల్పు
టూరు గేలించు కోళూరునా [12]వెలయు
నవిరళశుభముల కాలవాలంబు
ఠవణింపఁ బాండ్యమండలమండనంబు
నళినాక్షుఁ డచట ననంతతల్పమున
నలువొందుచుండు ననంతభోగములఁ
దనరు సచ్చోటివైతానసంతాన
ఘనతరధూమ రేఖావితానంబు
గగనకల్లోలినీకల్లోలలోల
మగుచుండ నయ్యేఱు యముననా నొప్పు
మురవైరిపదభక్తిముదితమానసులు
కరుణాపయోనిధుల్ గాంభీర్యనిధులు
నగణితవేదవేదాంతపారగులు
నగుచుఁ బ్రాజ్ఞత నిర్ణరాచార్యు నగుచు
మెలఁగుదు రచ్చోటి మేదినివిబుధు
లలవిప్రవరులకు నాచార్యుఁ డగుచు

వాదికేసరియు నూర్ధ్వశిఖుండు సామ
వేదియుఁ బరతత్త్వవేదియు నైన
యొకభూసురేంద్రునియువిదగర్భమున
సకలేశుఁ డైన విష్వక్సేనమూర్తి
యమితగణంబుల కధినాథుఁ డైన
కుముదాహ్వయుఁడు నిత్యకుముదబాంధవుఁడు
ననుపమచైత్రచిత్రాహ్వయతార
జనియించె శుభవేళ జగము లుప్పొంగ
సొలపుల నిలఁ [13]బుట్టుచునె తావితోడ
మొలతెంచుమరువంపుమొలకచందమునఁ
బొడమినప్పుడె లోకములు గొనియాడఁ
కడఁక నొప్పెడుసదాగతిపట్టి వోలె
నుదయించినప్పుడ యోగసామ్రాజ్య
పదపట్టభద్రుఁ డై పరఁగి యమ్మౌని
యష్టాక్షరావృత్తి కనుగుణం బైన
యష్టాంగయోగంబు నలవరింపుచును
అలరెడు వెన్నునియడుగుదామరల
తలఁపుఁదేనియల డెందపుఁదేఁటి చొక్కుఁ
గవిసార్వభౌముఁడు కవిపురందరుఁడు
కవివనచైత్రుఁ డీఘనుఁ డంచుఁ బొగడఁ

బలికినపలు కెల్లఁ బన్నీరుచెంబు
గులికినచందానఁ గ్రొన్నెలసోఁగ
వొలసినరీతి కర్పూరంబులప్ప
లొలుకుకైవడి మించు లుడుగక మెఱయు
ననువునఁ జల్లఁగా నమృతంపుసోన
చినుకుసోయగమున జీవరత్నములు
మెలఁగెడుజాడఁ బ్రామినుకువజ్రములు
తులఁగింప జలజలఁ దూర్పెత్తినట్టి
మెలుపున వలుపుఁదెమ్మెరలు వేడించు
నలువునఁ గ్రొత్తకట్టాణిముత్యములు
డాలించుసరణి బిటారంబు లొకట
గీలించుకరణిఁ జక్కెర లుప్పతిలఁగ
మగనిమైఁ గూర్మి రమాదేవి చూపు
నిగుడించుభాతి దేనియ లుట్టిపడఁగఁ
గవిత మాధవుమీఁదఁ గావింప మధుర
కవిపేరు జనకుఁ డాఘనునకు నొసఁగె
నాయోగి యటమీఁద నచ్చోటనొప్పు
శ్రీయోగి యైన యా శేషపర్యంకుఁ
దనహృదయారవిందమున సేవించి
కొనుచు నాపురి నెలకొని చిరాబ్దములు

వసియించి యటమీద వసుధమైఁ గలుగు
నసమాస్త్రగురునిగేహములుఁ దీర్ఘములుఁ
గనుఁగొంచుఁ గ్రమమునం గదలి యమ్మౌని
వనరాశిమేఖల వలచుట్టికొనుచు
నరుదెంచి మనుజవాహనుదెస కరిగి
సరసిజోత్పలజలచరనికాయమున
దివిజాలయమున వర్తిలు నేటిజోటి
దివిరి గేలించి ధాత్రీవలయమున
భయమునం బొంది యేపాపమానసుఁడు
ప్రియమునం దను నోరఁ బేర్కొంచు భక్తి
నయమునం గని సవినయనుతు లెసఁగ
రయమునఁ జెంతఁ జేరఁగ వచ్చి మ్రొక్కి
జయమున నాభక్తజనుని దియ్యమున
నయమున నొందించు నట్టితోయమున
విలసిల్లు యమున సేవించి నెయ్యమున
సలిలావగాహంబు సలిపి తత్తటిని
ఘనయోగమార్గసంగతి నుండి కొన్ని
దినములు చన యామ్యదిశ విలోకించి
[14]రాజబింబము దినరాజబింబంబు
తేజంబు మించిన తేజంబుతోడఁ

గనుపట్టు శఠకోపఘనుకాంతిఁ గాంచి
మనమున వెఱఁ గంది మాటిమాటికిని
ఇన్నిభూములు గంటి నిటువంటికాంతి
కన్నది విన్నది కా దిట్టికాంతి
మార్తాండకుముదాప్తమండలమధ్య
వర్తికిఁ దక్క నెవ్వరి కిట్లు గలదు
అతనిమాఱటమూర్తి యైనట్టియోగి
పతియె కాఁబోలు నప్పరమయోగీంద్రు
సేవించి పాదరాజీవంబు లాత్మ
భావింతు నని కోరి పరమానురక్తి
నావరతేజంబు నవలోకనంబు
గావించుకొనుచు నక్కడి కేగఁ దలఁచి
కదల నమ్మధురాఖ్యకవిశేఖరునకు
నదులు శైలములు కాననసమూహములు
దిగ్గనఁ దముతామె తెరువిచ్చె నప్పు
డగ్గలం బైయొప్పు నాకాంతిచాయఁ
జేరంగఁ జనుదెంచి చించామహీజ
చారుకోటరనివాసమునందు నున్న
రవితేజుఁ డగుయోగిరమణుని మధుర
కవివరేణ్యుండు చక్కవిలోకనంబుఁ

జేసి కైవారము ల్చేసి పాదములు
డాసి నేత్రముల వేడ్కల నొత్తికొనుచు
నానందబాష్పంబు లాననాబ్జంబు
మైనుండి పులక లుమ్మడి [15]జాదుకొనఁగ
శఠమతరాద్ధాంతసంహారి యగుట
శఠకోపకపరాంకుశఖ్యాతు లొనరె
నేమహాత్మునకు యోగీంద్రవర్యునకు
నామహామహుని నే నాత్మ భావింతు
ననుఁడు బ్రసన్నుఁ డై యాపరాంకుశుఁడు
తనదివ్యదృష్టి నాతఁడు వచ్చు టెఱిఁగి
కను విచ్చి కరుణ యోగసమాధిఁ దెలిసి
మునుకొని తనదుసమ్ముఖమున నున్న
చిరతపోనిధిఁ గటాక్షించిచూచుటయుఁ
బరమయోగేంద్రకృపాదృష్టివలనఁ
బరమసుజ్ఞానసంపదఁ జెన్నుమిగిలి
కర మర్థి మధురాఖ్యకవి పరాంకుశుని
దనపాలిగురువును దైవంబు గాఁగ
మనమునఁ దలఁచి ప్రేమము దయివాఱ
నాగమసారంబు లగుశఠకోప
యోగిసూక్తులయందు నున్నయర్థంబు

తెలియంగఁ దలఁచి తద్దివ్యపాదాబ్ద
ముల వ్రాలి హస్తము ల్మోడ్చి యి ట్లనియె
వెలయ వేదములు ద్రావిడముగాఁ జేసి
వెలసిన యోగీశవిద్యాప్రకాశ
యీవేళ మీ రానతిచ్చినకృతుల
భావంబులందలి పదపదార్దములు
నానతీవలయు నీయంఘ్రిసేవకున
కోనిర్మలాచార! యోకృపాసార!
యని విన్నవించిన నమ్మహాయోగి
ఘనభక్తి శిష్య శేఖరు విలోకించి
యరయంగ నీవు న న్నడుగునర్థంబు
పరమరహస్యంబు పరికించి చూడ
మునుకొని యేఁ గ్రమమున నేర్పరింతు
ననఘాత్మ! నీ వివి సావధానముగ
విను పర్వతవ్యూహవిభవాంతరాత్మ
లన నొప్పు శౌరిపర్యాయమూర్తులను
భాసిల్ల నామ్నాయపంచరాత్రేతి
హాసముల్ శ్రుత్యాదు లనిశంబు నెన్నుఁ
దలపోయ నర్చావతారరూపములఁ
జెలు వొంద జగతిమై శ్రీపతిఁ బొగడు

స్తవము లై శ్రుతిగర్భితంబు లై యేను
ఠవణించు నీద్రావిడప్రబంధములు
కృతయుగాదుల మూట గిరికొనఁజేయు
నతులితధ్యానయోగార్చనావిధులఁ
గలుగునే ఫల మది కలియుగవేళ
నళినాక్షుసంకీర్తనంబుచేఁ గలుగు
ధర వ్యాసుఁ డై భారతముఁ జేసినట్లు
మరుగురుం డిపుడు మామకముఖంబునను
బృథివి జంతువులెల్ల నీడేరుకొఱకుఁ
బృథులవేదార్ధగర్భితములు గాఁగ
నిలలోని జనులెల్ల నీడేరుకొఱకు
సలలితవేదార్థసారసంతతులు
కృపసేయ ద్రావిడకృతులుగాఁ జేసె
నిపు డీరహస్యంబు లెఱిఁగింతు వినుమి
యివి మత్ప్రణీతంబు లివి నాల్గుకృతులు
వివరింపఁగాఁ జతుర్వేదార్థవతులు
కడలినీ రాని మేఘము లుర్వి గురియఁ
గడుమంచి వైనసంగతుల నీకృతుల
ననుపమకఠినాగమార్థము ల్గొనుచు
ననువదింపఁగ మార్దవాకృతు లయ్యె

నాదిప్రబంధంబు హరిగుణోదార
వేదనీయంబు ఋగ్వేదమయంబు
శతపత్త్రజాతవిస్మయకారి గాఁగ
శతపద్యములచేత సవరింపఁబడియె
రెండవకృతి యజుర్వేదాంగసప్త
కాండార్డవతి యేడుగాథల నొప్పు
నరయ మూడవకబ్బ మఖిలార్థవితతి
వరుసఁ దెల్పుచు నధర్వస్వరూపముగ
నెలయఁ దొంబదియేడువృత్తము ల్గలిగి
యలరు నాల్గవకావ్య మది యెట్టి దనిన
రూపింప సామనిరూపకం బగుచుఁ
బ్రాపితరసశబ్దబంధంబు గలిగి
ప్రఖ్యాత మగుపరబ్రహ్మపరత్వ
ముఖ్యనామములచే మొనసినయట్టి
యేనవస్థలచంద మెంతయుఁ దెలుపు
గానకర్మోచితాంగంబు శ్రావ్యంబు
నరయంగ ద్రివిధజీవాళి కామోద
కరము భవ్యము వేయుగాథల నొప్పు
దాకొని యెల్లవేదముల [16]గాండాను
వాకముఖ్యంబులు వఱలినరీతిఁ

దలఁప నిందును నేకదశశతసంఖ్య
నలవడియుండు సర్వాగమోత్పత్తి
కారణం బగుచు నక్షరములమూటఁ
జేరిక గల్గి హెచ్చినప్రణవంబు
పాదుగా నయ్యాదిపద్యంబునందుఁ
బాదత్రయమునఁ జొప్పడి యొప్పుచుండుఁ
దుదలేని యుపనిషత్తులు చెప్పుచున్న
మొదలికర్మబ్రహ్మముల నిరూపించి
వలగొని నిదురవోవనిచింతకొమ్మ
లలమియుండిన యంబుజాక్షమూర్తులను
ఎన్నుచు వేర్వేఱ నీప్రబంధంబు
లెన్నిచూచిన జగదేకపూజ్యములు
వినినఁ జెప్పినఁ జదివినయట్టివాఁడె
వనజాక్షుదాస్యంబు వలసినవాఁడు
నావుండుఁ దత్ప్రబంధములయర్థంబు
భావంబులోఁ బాదుపఱచి మోదమున
భువి సాగి ప్రణమిల్లి పొగడుచు మధుర
కవిరాజు యోగిపుంగవుని సేవించి
తామసాంభోరాశి తరియింపఁ జేసి
శ్రీమించ ననుఁ గటాక్షించినయట్టి

కురుకాధిపతి యైన గురుపదాబ్జముల
నిరతంబు వసియించి నిలిచె నాతలఁపు
వేదెఱంగులనైన [17]వేఱొం డెఱుంగ
వేదమంతయును ద్రావిడముగాఁ జేయు
పరమగురుండు నాపాలిదైవంబు
గురువును ననుచు నగ్గురువరేణ్యునకు
ననుపమరసరీతు లలవడి యొప్ప
నొనరించె నొకకృతి నురుతరసుకృతి
నాపరాంకుశయోగి యతనితోఁ గూడి
దీపితనిర్ణిద్రతింత్రిణీచ్ఛాయ
ననిశంబు శౌరిదివ్యగుణానుభవము
ననుభవింపుచును యోగైశ్వర్యతతులఁ
దా మించువైకుంఠధామాఖ్యముఖ్య
ధామావృతుం డైన తామరకంటి
నాకురంగాధీశు నాద్యనామకుని
జేకొని నుతులు చేసిన మెచ్చి యతఁడు
సొగసులు నిగుడ నాసురలెల్లఁ బొగడఁ
బొగడదం డిచ్చె నప్పుడు శఠారికిని
అదియాదిగా వకుళాభరణాఖ్య
విదితుఁ డై యయ్యోగివిభుఁడు చెన్నొందె

ననయంబు హరిపదధ్యానామృతంబు
ననుభవించుచు నమ్మహాతరుచ్చాయ
యునికిగా నుండి రయ్యోగిశేఖరులు
జననుతంబైన యీచరితంబు జగతి
వినినఁ జెప్పిన నుడివిన వ్రాయువారి
కెనలేనియట్టి యభీష్టంబు లొదవు
సిరులు నాయువులునుం జెడనిసంపదలుఁ
గరతలామలకంబు కైవల్యపదము
ధనధాన్యసంగతి తంగేటిజున్ను
గొనబైనప్రాయంబు కొంగుపసిండి
యెడపక యొక్కమా ఱెన్నినఁ జాలు
జడునకైనను గల్గు సారస్వతంబు

—♦ కులశేఖరాళ్వారు ♦—

పుడమిఁ గేరళదేశమున నొప్పుచుండుఁ
గడలిరాయనిపట్టి కల్యాణవేది
యమితసౌభాగ్యంబు లలవడి మిగులఁ
గొమరొప్పు కుక్కుటకూటం బనంగఁ
బ్రాపితదివ్యసంపద నీడు రాక
యాపురంబున కోడి యమరపట్టణము
విఱిగి భూస్థలి నుండవెఱచి దేవతల
మఱుగుఁ జొచ్చెనొ దానిమహిమ యెట్టిదియొ

యాపట్టణంబుసౌధాగ్రంబులందుఁ
బ్రాపించుమరకతప్రభలు వీక్షించి
పాయనికూర్మిచేఁ బచ్చిక లనుచు
మేయంగ గమకించు మిహిరుగుఱ్ఱములు
సరసికోటలరాసి జలరాశి యెపుడుఁ
బరిఘ యై యొప్పు నప్పట్టణంబునకు
ననుపమదివ్యరత్నాకరం బగుచు
ననిశంబు నవ్వు రత్నాకరస్ఫూర్తి
నాపురంబున గోపురాగ్రంబులందు
నేపు రెట్టింప ననేకబంధముల
సడలనియంగజసంగ్రామకేళి
బడలిన తరుణదంపతులమైఁ బొడము
చెమరు లార్చును దేవసింధువుమీఁది
కొమరుఁదెమ్మెర లెదుర్కొని సంతతంబు
వరదంతఘాతసత్త్వములనొక్కంత
హరిదంతదంతుల నడఁచుదంతులును
భువి సురంగముల నొప్పుచు గంధవాహు
నవకురంగముగతి నగుతురంగములు
నవకంబు లై యమానవవిమానములఁ
బవమాను నవమానపఱచు తేరులును

బటుతరనిటలాక్షపటుహంసరావ
పటలోగ్రనిరసనార్భటు లైనభటులు
బహుముఖంబులఁ బారుపత్తెంబె కాని
యహరహం బొకముఖ మైయుండఁ డెపుడు
రాజసుం డై యహంబ్రహ్మ నటంచు
వేజాడలను గర్వవివశుఁ డైయుండు
ననుచు నిచ్చలును దోయజసూతి లెక్క
గొనక నానాగమకోవిదు లగుచు
నాసురవైరిపాదాంభోజభక్తి
భాసురు లై పేర్మిఁ బరఁగుభూసురులుఁ
గలిమి గిన్నరరాజుఁ గలికిచెల్వముల
వలరాజు దానంబువలన రేరాజు
నిరతభోగంబుల నిర్జరరాజు
వరవిక్రమంబుల వనరాశిరాజు
తేజంబుకలిమిని దినరాజు నగుచు
రాజిల్లుచుండెడి రాజరాజులును
ధనదుఁ డై తిరిపె మెత్తఁగఁ జూచుజంగ
మును వేఁడికొని యొక్కమూలనె యొదిగి
పెలుచుచందమునఁ గుబేరుఁ డైయుండు
నలకాధిపతి యంచు సణఁకించుచుండు

ఘనులు సౌందర్య రేఖామహోదారు
లనుపమామితధను లగువైశ్యజనులుఁ
ద్రొక్కినచోటెల్ల దున్నక పండ
దిక్కులఁ బసిఁడి విత్తినపైరు గాఁగ
వివరింపఁగాఁ గొండ్ర వేలును బండ
నవనికి నేలిక లైనహాలికులుఁ
జుట్టైన దివి సోమసూర్యవీథులకు
నొట్టు దిద్దెడు సూర్యసోమవీథులును
నీలవర్ణునిమానినీశిరోమణికి
నాలయం బైన దేవాలయంబులును
గప్పు లై, యొప్పు లై కళుకులై తేఁటి
చొప్పు లై గొప్ప లై సొగయుగొప్పులును
గళుకు లై బెళుకు లై కలువపూసోగ
ములుకు లై తళుకు లై మొనయుకన్నులును
సోగ లై బాగు లై సొలపు లై సిరుల
ప్రోగులై వాగులై పొలుచుమోములును
గావులై తావులై కండచక్కెరల
ప్రోవులై ఠీవులై పొలుచుమోవులును
[18]గట్టులై గుట్టలై కామునిపసిఁడి
జెట్టులై చెట్టులై చెలఁగుపాలిండ్లు

జినుగులై చినుగులై సింహమధ్యముల
కనుఁగులై పెనగు లైనట్టికౌనులును
గెంపులై సొంపులై కెందమ్మిచాయ
నింపులై యింపులై నిగుడుహస్తములు
నినుపులై నునుపులై నెఱయుదిబ్బలకు
ననుపులై పెనుపులై యనువొందుకటులు
ననుకులై మినుకులై యపరంజిపసల
కునుకులై మనుకులై యొప్పునూరువులుఁ
బొలుపులై సొలపులై పూవిల్తువాలు
మెలుపులై వలపులై మించుపాదములుఁ
గలిగి మున్నెన్నఁడు గడివోకయున్న
జలజాస్త్రుమోహనాస్త్రంబులో యనఁగ
నలవిమీఱినయట్టి యంగనామణులు
నలరుదేనియల నోలాడి తుమ్మెదలు
కెలకుల మలయ రాగిల్లుచెంగల్వ
కొలఁకులు రత్నంపుఁగొమ్మలపసిఁడి
కోటలుఁ బూవాన గురియుచునుండు
తోఁటలు నమృతంబు దులఁదూఁగునీటి
బావులు పాంథులబడలికల్ దీర్చు
ఠావులుఁ గినిసి నెట్టనసురాచార్య

కవులు వచ్చిన వారికవు లెన్నుచుండు
కవులు నిచ్చలు భోరుకలఁగెడునాట్య
శాలలు వెన్నెలల్ చల్లెడుచంద్ర
శాలలు మొదలైన సకలసంపదలు
గలిగి యయ్యోధ్యసంగతి శుభస్ఫూర్తి
నలవిమీఱినయట్టి యాపట్టణమునఁ
బూర్ణరాజాన్వయములతోన మొదల
వర్ణింపఁదగు చేరవంశంబునందు
జనితుఁ డై భువనప్రశస్థుఁడై యర్థి
వనచైత్రుఁడును దృఢవ్రతుఁడును నగుచు
నపరరుక్మాంగదుఁ డని త్రిలోకముల
నుపమింపఁ దగువైష్ణవోర్వీశ్వరునకు
రవివంశుఁ డగుదశరథమహీవలయ
ధవునకు రాముఁ డుద్భవ మైనయట్లు
నలువొందు మాఘపునర్వసుతార
జలజాక్షుకౌస్తుభాంశం బుదయించి
కులశేఖరాఖ్య గైకొని దివ్యయోగి
కులశేఖరుండునాఁ గొమరు దీపించి
శ్రీరామపదభక్తిఁ జెంది నానాఁట
నారూఢయౌవనుం డై చెన్నుమిగిలి

కమఠేంద్రనాగనాగప్రభుల్గ్రావ
సముదయంబులమోపు సడల నింపెసఁగ
భండనప్రతిభటపరభటవీర
గండమండలకాండకాండవేదండ
దండధరోద్దండదండకోదండ
దండదండనబాహుదండంబుచేత
సర్వసర్వంసహాచక్రభారంబు
నిర్వహించె నఖర్వనిర్వాహశక్తిఁ
బరులకు నాసార్వభౌముని కేలి
కరవాలవల్లి యుగ్రము గాదు తలఁపఁ
గ్రతుదానముల నశక్యం బైన దేవ
సతులపొం దప్రయాసమున నెసంగుఁ
గావున నదియునుగాక యారాజు
దేవేంద్రుదానంబుతెఱఁ గెల్ల నెఱిఁగి
బలువేది తామ్రానుపడుచు గైవ్రాలి
వెలవెలఁబాఱె నావేలుపుమ్రాను
వేదవేదాంతాదివిద్యావినోది
భూదేవదేవతాపోషణపరుఁడు
రామకథాసుధారసలగ్నహృదయుఁ
డామోదభరవికచాననాంబుజుఁడు

నయవేది సత్వసంధాధురంధరుఁడు
జయశీలుఁ డధ్వరశతదీక్షితుండు
కరుణాసముద్రుండు గంభీరభావ
నిరతుండు పరకామినీసహోదరుఁడు
అభినవకందర్పుఁ డతులచారిత్రుఁ
డభిమతవరదాయి యమ్మహారాజు
సకలదిక్కుల జయస్తంభముల్ నిలిపి
యకలంకవిక్రముం డై ప్రతాపించి
యరయ సముద్రంబు లవధులు గాఁగ
ధరణి యేకాతపత్రముగ నేలుచును
మురవైరియవతారములయందు భక్తి
పరుఁ డయ్యు నాభూమిపతి సంతతంబు
సీతామనోహరశ్రీపదాబ్జాత
చేతోద్విరేఫుఁడై చెన్నొందు మఱియు
ధారుణి నర్చావతారంబులందు
నారయ సమభక్తుఁ డందులోపలను
సతతంబు నంజనాచలసార్వభౌమ
పతికి మిక్కిలి మేలుపడియుండునట్లు
శ్రీరంగపతిమీఁదఁ జేయుసద్భక్తి
గారవం బెసఁగ భాగవతులయందు

తోయజనాభమూర్తుల నెట్టిభక్తి
సేయు నాగతి భక్తి సేయుచునుండు
నన నేల వేయు శ్రీహరికంటె వారి
ఘనులుగాఁ జూచు హృత్కమలంబులోన
నొకట వంచన లేక యుడివోనికూర్మి
సకలసంపదలు వైష్ణవులసొమ్ముగను
నెన్నుచుఁ దను వార లిడువాని గాఁగ
నెన్నుచుం దత్పూజ యేకాగ్రబుద్ది
సేయుచు నానతిచ్చినవాక్యసరణిఁ
ద్రోయక భాగవతులయెడాటమున
దాకొన్నప్రేమ యెంతయు నడ్డమాఁక
లేకుండఁ జేసి యేలీల నాఘనుల
నీడయపోలె నన్నిట వశుం డగుచు
నాడుమన్నటువలె నాడుచునుండుఁ
బరికింపఁగా భక్తపరతంత్రుఁ డైన
హరియునుం బోలె నయ్యధిపరత్నంబు
ఈలీల భూచక్ర మింతయుఁ దాన
యేలుచు నుండ నయ్యెడ నొక్కనాఁడు
తిరముగా నిడు పట్టెతిరునామములును
దిరుమణివడములుఁ దిరుచూర్ణములును

బొసఁగఁ జుట్టినయట్టిపొత్తిపాగలును
గసటులేనట్టి నీర్కావిధోవతులు
వెలఁదిజన్నిదములు విచ్చక నడుము
బలసిన వెలిపట్టుపచ్చడంబులును
రవరవ తాంబూలరాగంబుతోడ
గవరనైయున్న చక్కనిదంతములును
గలిగి యాతెలిదీవిఁ గాపున్నవారు
కులశేఖరునిఁ గనుఁగొనవచ్చి రనఁగఁ
గడివోనిపన్నీటఁ గడుఁ బెక్కుమార్లు
వడులుదేరిచి మించ వాసనం గట్టి
నెలపొల్చుపస నవనీతంబుచాయ
గలిగి వెన్నెలసోగకణికలో యనఁగఁ
దెలివొందు నిడువాలుతిరుమణుల్ మిగులఁ
బొలుపొందు పెదపెద పువ్వారు [19]ఫళలు
వలకేలఁ గీలించి వైష్ణవోత్తములు
చలిమియు బలిమి నిచ్చలుఁ బెచ్చుపెరుగ
జంట లై యమహాజనపాలునగరు
తొంటికైవడిఁ దురఁదురఁ జొచ్చి పోవఁ
జేరువ మంత్రులచేసన్న గాంచి
వారలఁ జూచి తద్వారపాలకులు

కేలిదండములు వాకిలి నడ్డగించి
నేల గుప్పన సూఁది [20]నిలునిలుం డనుచుఁ
గుదిచి మూఁపుల అరుకోలలు పూన్చి
చెదర నూరక ఝళిపించి యిట్లనిరి
వరుఁడు లోపల నమ్మవారితో నంతి
పురమున నేకాంతమున నున్నవాఁడు
అవసరంబుల వారి సడుగక పతికి
నవసరం బిపు డెద్ది యని మనంబునను
అరయక యెపుడైన నపుడె లోఁజొచ్చి
యరిగెద రేమనియనవచ్చు మిమ్ము
భూపాలుఁ డతిసులభుండైన చెఱకు
తీపని వేళ్ళతోఁ దెరలింపఁ దగునె?
యాఁపితి మని యయ్యవారిచిత్తములఁ
గోపగించకుఁడు మాగొల్లమాటలకుఁ
బలుమాట లనకుఁ డుప్పవడమై రాజు
కొలువైనయపుడె క్రక్కున వేళఁ జూచి
విచ్చేయుదురు గాన వేగిరపడక
యిచ్చటఁ గూర్చుండు డించుకతడవు
అనవుఁడు వార లహా మంచి దయ్య
యనుచు మే మవసరం బనవసరంబు

నెఱుఁగకపోయితి మింతియె మతుల
మఱియొండు వలదు ముమ్మాటికి మాకుఁ
బరమభాగవతునిభవనంబు గాచు
టరయంగఁ బ్రార్థనీయము గాదె యెపుడు
నేవెఱవుననైన నిసుమంతతడవు
శ్రీవైష్ణవులపంచఁ జేరంగఁ గలుగు
నని యున్నవాఁడుగదా వైష్ణవుండు
కనుఁగొన నట్లును గాదు వెండియును
బాటించిఁ వైష్ణవుపంచ నున్నట్టి
కీటంబులును ముక్తికిం బోవు నండ్రు
ఈమహాయోగీంద్రు నింటిమోసాల
నేమందఱము వసియించియుండెదము
ఇంతకంటెను భాగ్య మెయ్యది యనుచు
సంతసం బొదవ హజారంబుమీఁద
విచ్చేసియుండి రావృత్తాంత మెల్ల
నచ్చట నవసరం బరయుచేడియలు
ఇరవొంద నీకార్య మెఱిఁగింపకున్న
వరునిచే వడి నాజ్ఞ వచ్చుఁ బొ మ్మనుచు
నుదిరి కొందలమంది యొక్కరిఁ బట్ట
పదుగురు నగరిలోపలి కేగుదెంచి

తొలుకారుమెఱుఁగులం దులఁదూఁగుపసిఁడి
గొలుసులతోడఁ గీల్కొని చెన్నుమిగిలి
బవరిగాఁ దరవణిం బట్టినమెఱుఁగు
బవడంపుఁగోళ్ళడాపల రువారముగ
ములుకుగొంపులవంకముక్కులపచ్చ
చిలుకలగములు రంజిలి చుట్టువార
నిగుడి వెన్నెలతేఁట నెఱపుముత్తియపు
మొగడల వైడూర్యముల వెలుగడలఁ
గ్రిక్కిఱియంగ మిక్కిలివింతవగలఁ
జెక్కినరత్నంపుచీర్ణంపుపనుల
నురుతరం బగుతూఁగుటుయ్యెలమీఁదఁ
బఱపుగల్గినపట్టుపఱపునిండార
మంచుతో సరిపోలుమణుఁ గచ్చళించి
మంచిపన్నీటికమ్మనివిరుల్ రాల్చి
నలినాస్త్రుసింహాసనంబుచందమునఁ
జెలువొందు నాపుప్వుసెజ్జమీఁదటను
రాజీవనాళసూత్రముచుట్టుకొన్న
రాజహంసముభాతి రాజసం బెసఁగ
విన్నేటికాలువ వింతగాఁ జుట్టు
కొన్న హేమాచలకూటమో యనఁగఁ

గొనబైన వెలితాళిగోణంబుతోడఁ
గనుపట్టి నవరత్నఖచిత మైనట్టి
మురువైన మొగపులమొలనూలివింత
మెఱుఁగులు నలుదెస మిసమిసల్ గొలుప
లీలఁ గ్రొంబచ్చతాళియుఁ బదకంబుఁ
[21]బీలి డెందముమీఁదఁ బేరెముల్వారఁ
దెలివొందు నొంటిముత్తియపు వెన్నెలలు
వెలఁదినవ్వులతోడ వీడుజోడాడ
మగతుమ్మెదల ఱెక్కమబ్బులనెఱులఁ
జిగురులు వెడలఁ గీల్చినకొప్పులోన
నరవిరిబాగుగా నరవిరు ల్దుఱిమి
యరచందురునికి విం దైననెన్నొసల
సన్నపు రేఖమంజలికాపుతోడఁ
దిన్నని [22]తెలిగీరుతిరునామ మలరఁ
దాకొన్న మించుపుత్తడిసరపణులు
డా కేలిమీఁద బిటారంబు నెఱప
మురువైన యపరంజిముద్దుటుంగరము
మెఱుఁగులు మోముదమ్మికి సరికొలుప
మదదంతికటముల మదధార లెసఁగు
చదురునం జెక్కులజవ్వాది జాఱ

నెరయఁ గుంకుమపువ్వు నించినమలగు
టొరగుపై నొయ్యార మొలయంగ నొరగి
కంకణధగధగల్ గడలుకొనంగఁ
గుంకుమగుబ్బలకువలయేక్షణలు
తావులకొండనెత్తావివీవలులు
వీవ వీవన లొయ్య వీవ నాచెంతఁ
బిన్నాణమైన ముప్పిడిహడపంబు
కన్నుల కల్కియొక్క తెదాల్చియొప్ప
నిలుకడయొరపువన్నియమీఱ నొక్క
చిలుకలకొలికి కుంచియ వైచుచుండఁ
దలచుట్టుగన్నులతళుకుసిబ్బెముల
కలికిగుబ్బెత లూడిగంబులు సేయ
జనక యోగీంద్రునిసరవిఁ జెన్నొందు
జననాథుఁ గాంచి యాజలజలోచనలు
దేవ! భాగవతు లేతేర మొగసాల
కావలివార లక్కడివారిఁ జూచి
భూవరుం డిపు డంతిపురములో నుండఁ
బోవరా దన ద్వారమున నిల్చినార
లీవార్త వేవేగ నెఱిఁగింపకున్న
దేవరచిత్త మేతెఱఁగో యటంచు

విన్నకన్నది గాన విన్నవించితిమి
యన్న రాజేంద్రుఁ డయ్యన్నులఁ జూచి
యనిరుద్ధు లైనట్టి యనిరుద్ధభక్త
జనులకు నడ్డ మెచ్చటనైనఁ గలదె
యడ్డ మెన్నఁడు లేని హరిదాసవరుల
నడ్డగించుట యెట్టు లని కోపగించి
యుంకించి యప్పు డయ్యొసపరిపువ్వు
కంకటిమీఁదు దిగ్గన డిగ్గనుఱికి
గోణంబుతోనె మిక్కుటపువేగమున
వీణముఁ గట్టక వెలఁదు లమర్చు
పావలు దొడుగక పదనూపురంబు
రావంబు లడర వారణరాజయాన
యెదవెడుకైదండ యొల్లక [23]జాతి
కొదమసింగంబుబాగున వడి మీఱి
బలిమి నొక్కతె కూడఁ జనుదెంచి చలువ
వలిపెంపుదుప్పటి వలెవాటు వైవ
నరుదెంచి మోసలయరుఁగుమై నున్న
పరమవైష్ణవుల శ్రీపాదపద్మముల
వ్రాలి యానందాశ్రువారిపూరములు
వాలుగన్నుల నిండి వడియ నందంద

సర్వాపరాధముల్ క్షమియింపుఁ డనుచుఁ
బర్వినభక్తిమైఁ బ్రణతు లొనర్పఁ
గులశేఖరుని నెత్తుకొని కౌఁగిలించి
పలుమఱుఁ బొగడి యాపరమపావనులు
సొలయక "శ్రీనివాసోరక్ష” తనుచు
నెలమిఁ జేకానుక లిచ్చి రిచ్చుటయుఁ
జేకొని యారాజసింహుఁ డవ్వేళ
వాకిట నున్న కావలివారిఁ జూచి
యెట్టురా వైష్ణువు లేతెర నడ్డ
పెట్టకుం డని మిమ్ముఁ బిల్చి చెప్పితిని
జెప్పిన నాయాజ్ఞ సేయక మీర
లిప్పు డీగతి సేయు టెట్లు భీతిలక
యిమ్మెయి నెవ్వరే నెసకొల్పి నేఁడు
మిమ్ముఁ జేయించిరో మీరె చేసితిరొ
యిచ్చలో నాయాజ్ఞ యెఱిఁగియు మీఱ
వచ్చునే కండగర్వమొ పొట్టక్రొవ్వొ
యని తిట్టి పట్టుకొమ్మని కోపగింపఁ
గని సర్వ మీశ్వరగాత్రంబు గాఁగ
నకలంకమతిఁ జూచుహరిభక్తవర్యు
లొకరియాపదఁ జూడ నోపరు గాన

సరగున నెడఁజొచ్చి జనకులోత్త సు
కరములు దెమలించి కరుణదైవాఱఁ
జేకొని మామాటఁజేసి యీవేళ
మాకుగా నీతప్పు మన్నింపవలయు
ననిన వారలకడ్డ మాడంగలేక
జననాథుఁ డాయనుచరుల మన్నించి
గురుభక్తి వారిఁ దో కొనిపోయి యంతి
పురములో మణిపీఠములయందు నునిచి
యతులవస్తువుల నాహరిపదాసక్త
మతులసమ్మతుల సమర్పించి యతఁడు
నానందజలధి నోలాడుచున్నంత
మానవాధీశ్వరుమంత్రివర్గంబు
మనుజాధినాథుసమ్మతి వేళ యరసి
చనవుమీఱంగ నచ్చటి కేగుదెంచి
కరములు మొగిచి చంకలఁ జేతు లిడుచు
వరుస నొండొరులు క్రేవల కేగుదెంచి
యొలయ రెంటెపుఁగొంగు లొకకేల నదిమి
వలకేలిదమ్ముల వాతెఱ లాపి
యాయెడం గదిసి చయ్యన విన్నపంబు
సేయంగఁ జెవిఁ జేరఁ జేరభూవిభుఁడు

నేల కొంకెదరు మీ రిప్పు డేకాంత
మేల యిచ్చటఁ బరు లెవ్వ రున్నారు
తప్పక యెఱిఁగింపఁదగినకార్యంబుఁ
జెప్పుడా యనవుడు క్షితిపాలుఁ జూచి
వెఱచి విన్నపముఁ గావింతుమో లేక
వెఱవ కిప్పుడు విన్నవింతుమో మీర
లైన నోడకుఁ డని యానతిచ్చితిరి
కానఁ దెల్పెదము తత్క్రమ మెట్టి దనిన
నేకొఱంతయు లేక యీధరాచక్ర
మేకచక్రంబుగా నేలుభూపతివి
బొక్కసభండారములు వానిలెక్క
పొక్కలు మఱియు యిన్పుగనగరికిని
నిలువ పూజ్యముగ మన్నీలు చెల్లింప
వలసిననిల్వ సల్వలు విరాడములు
సరవి గానుక [24]దేవసంబు ధాస్యంబు
వరసియు గాది[25]దిపావళు లందు
పగిదిఁ జెల్లించు నప్పగిది రాహుతుల
నగరిబంటులజీతనాతంబు లేలు
కరుల గుఱ్ఱముల దుర్గపుసవరణలఁ
బరివారముల భూమిపతుల పౌంజులను

నగపడి రాణువయందుఁ బాలింపఁ
దగునట్టి రాజకృత్యము లొక్కనాఁడు
నేవిధి సమకూడు నెట్లుండు ననుచు
దేవర పారుపత్తెము సేయవలదె
కడునెచ్చరిక గలకాలంబు పాటు
వడి సేయు తమదైనపారుపత్తెంబు
భూనాథ మీ రలవోకఁ గావించు
నానతిం బోల దెంతైనఁ జర్చింప
నిందుల కనుట గా దేపనికైన
నిందఱ ముండి తామేలని యాజ్ఞ
వదల మన్నియును దేవరప్రతాపమునఁ
గొదలేక తముదామె కొనసాగివచ్చు
రాజవై దేవర రాజచిహ్నముల
నోజమై క్రమమున నొకకొంతతడవు
నామతీర్థము రామనామసంస్మరణ
మామీఁద హరిపూజ యదికొంతతడవు
నంతట శ్రీవైష్ణవానుభాషణము
లంత నారోగణ మైనమీఁదటను
నకలంకరామాయణాదిసంశ్రవణ
మొకకొంతతడవుమై నుచితకృత్యములు

సలుపుచు సకలరాజ్యంబు పాలింప
వలయుఁ గా కిటు సదావైష్ణవు లనుచు
వారును మీరు నీవడువున నున్న
నీరసాతలచక్ర మీడేరు టెట్లు
రావయ్య తుదిని సర్వజ్ఞుండవైన
యీ వెఱుంగనికార్య మే మెఱుందుమె
చేసేత మా తెలిసినవిన్నపంబు
చేసేతి మింక మీచిత్తంబుకొలఁది
తరవాత నినుఁ గన్నతండ్రి యేమనునొ
గురిగా విచారించుకొమ్మని యనిన
సెలవిమైఁ జిఱునవ్వు చిగురొత్తుచుండఁ
బలికె శ్రీవైష్ణవపారిజాతంబు
వినుఁడు మీ రిటు పదివేలు చెప్పినను
వినఁగూడునే నాకు వివరించిచూడ
జనని జానకి రామచంద్రుండు జనకుఁ
డనుపమబంధువు లతనికింకరులు
ఘనరాజ్యభోగంబు కామితార్ధంబు
ధనము సర్వము నాకుఁ దత్పాదసేవ
యందుఁ జిక్కినహృదయం బితరంబు
నందుఁ జిక్కదు మీర లవివేకమతులు

పరమభాగవతసంభాషణరుచులు
మరగినవాఁ డేల మరగు నన్యంబు
లెంచిచూడక మీర లిఁక నింతనుండి
[26]మించిచెప్పిన మీకు మీ రెఱుంగుదురు
అనిన భీతలి “[27]హసా” దని మంత్రులెల్ల
వెనువెనుకకె వచ్చి వెలవెలంబారి
జననాథుకోపంబు సైరింపలేక
చనిరి గ్రక్కున మొగసాలవాకిటికి
నావసుఛేశ్వరుం డనిశంబు నిట్ల
శ్రీవైష్ణవులఁ గూడి చెన్నగలించి
యీరీతి మఱియు ననేకకాలంబు
వారక యలభాగవతు లిచ్చగించి
యడిగినవెల్ల లేదనక సంప్రీతి
నుడుగక యిచ్చుచునుండి యొక్కెడను
బిరుదమంజీరశోభితపదాబ్జుండు
సరసకుంకుమగంధచర్చితాంగుండు
వరహాలకంకణోజ్జ్వలభూషణుండు
పరిమళకుసుమసంభరితచూడుండు
మకరకుండలదీప్తిమండితాననుఁడు
సకలమాణిక్యచంచత్కిరీటుండు

ధవళోర్ధ్వపుండ్రనందల్లలాటుండు
నవిరళరత్నమయాంగుళీయకుఁడు
సురుచిరచిత్రకౌసుంభాంబరుండు
కరధృతశత్రుభీకరకృపాణుండు
నగణితపరిచారకౌఘసంవృతుఁడు
నగుచు సభామంటపాంతరస్థలికిఁ
జనుదెంచి రిపుమూర్తిసంవృతరాజ
దనుపమసింహాసనాసీనుఁ డగుచు
జలజాప్తుఁ డుదయాద్రిచక్కిఁ జూపట్టు
నలువున భద్రాసనమునఁ జూపట్టి
యొకచోట రాజన్యు లొకచక్కి మంత్రు
లొకదెస విద్వాంసు లొకయెడఁ గవులు
నొకవంక గాయకు లొకచాయ మిత్రు
లొకభాగమున నటు లొకపార్శ్వసీమ
సుకుమారు లగు చేరచోళపాండ్యులును
నొకదిక్కునను సాకసోత్సలేక్షణలు
సకలదేశాధీశజనము సేవింప
నకలంకవికచాననాంబుజ మలర
నమరేంద్రగురునయం బనయంబుఁ దెగడఁ
గమకించుమంత్రివర్గం బొకచాయఁ

గొలువఁ [28]గట్టుకవారు కొమరుదీపింప
బలువిడి వడి బరాబరి సేయుచుండఁ
నెలమి భూనాథులు హిమధాముకళల
జళిపించు మించువింజామర లిడఁగఁ
బలు తెఱంగుల సార్వభౌములు చల్ల
వలుపులు చల్లువీవనలు వీవంగ
నిద్ధవైభవముల నిరుమేల పట్ట
బద్ధు లూడిగములు పట్టి కొల్వంగ
జలశేఖరాదు లాశ్చర్యంబు నొందఁ
గులశేఖరుం డిట్లు కొలువున్నతఱిని
శ్రీమదష్టాక్షర శ్రీరాజ్యసార్వ
భౌములు నధిగతపరమార్థు లర్ధ
కామానపేక్షులు గతదోషమతులు
ధీమంతులును గతదేవతాంతరులు
జగదేకబంధువుల్ సత్వసంపన్ను
లగణితకరుణాఢ్యు లమృతభాషణులు
నపగతమదమాను లచ్యుతధ్యాను
లపగతఖేదులు నగుభాగవతులు
అతిమోదమున ద్రావిడాగమజాత
చతురార్థముల ననుసంధించికొనుచుఁ

బారతంత్ర్యము స్వరూపము శేషతయును
గారవంబుగ నలంకారంబు గాఁగ
వేంచేసి రప్పుడు విభుఁ డున్నకడకు
వేంచేయ నప్పు డవ్విభువరేణ్యుఁడును
గద్దియ డిగి వేడ్కకడలి నోలాడి
తద్దయుం గూర్మి పాదంబుల కెరఁగి
యుచితాసనంబుల నునిచి సద్భక్తి
నుచితాసనస్థుఁడై యుండె నామీఁద
మానవేశ్వరుఁడు వే మధ్యాహ్నవేళ
యైన మజ్జనమున కాయత్త మనుచు
జలకము వార లెచ్చరికఁ గావింపఁ
గొలువువారలఁ గనుంగొని యాదరమున
దొరల మన్నీల నాప్తుల బంధు మంత్రి
వరులఁ దక్కినయట్టివారి వేర్వేఱఁ
గనుసన్నఁ గొందఱఁ గైసన్నఁ గొంద
ఱను శిరమునఁ గొందఱను ఠీవి మెఱయ
సరగున నిజనివాసములకు సనిచి
పరమవైష్ణవులతో భాషించుతమిని
నుడిగంబు వారిచేనొసఁగంగ మఱచి
తొడవులు సడలించి తోయంబు గాఁగ

నెట్టనం గొలువున్ననిజపీఠియందుఁ
బెట్టి వేఱొకహేమపీఠంబునందు
విమలమై నిండారువెన్నెలసోగ
కొమరుమించినతాళిగోణంబుతోడ
నాసీనుఁడై పిల్వు మనినంతలోనె
భాసురగైరికపర్వతాగ్రముల
గోడాడి యేతెంచుకుంజరయుగము
జాడ నొప్పుచు నున్నజగజెట్టు లొకట
నానతి నిజమూర్తు లై యేగుదెంచి
భూనాథుఁ డొసఁగెడుభుజశాఖ లంది
పెనువ్రేలిసంధులఁ బెనువ్రేలిసంధు
లెనయించి కేలిమై యింపుమై బిగిసి
నివురుచు సొగసుగా నెటుకలు విఱచి
సవరగాఁ జేపరుసనమించకుండ
జవ్వాది మెఱుఁగుహస్తముల డాలించి
యువ్వాబుగా నూర్పు లోసరింపుచును
భూమీశ్వరున కింపు పుట్ట నేర్పునను
మై మర్దనంబు వేమఱు నొనర్చుటయు
నచ్చటిశ్రీవైష్ణవాళి నీక్షించి
విచ్చేయుఁ డని విన్నవించి యారాజు

పాదుక లొసపరి బాగుగా మెట్టి
కైదండ యొకపద్మగంధి గావింప
సరవిమై మజ్జనశాలచెంగటికి
నరిగె నంతట మల్లు లరిగి [29]రిండులకు
నక్కడనున్నట్టియాభరణములు
బొక్కసంబులవారు పోలించి చూచి
యీయెడ భూనాథుఁ డేటికిం బెట్టి
పోయెనో యనుమతంబునఁ గాని తమకుఁ
బట్టరా దని భయపడి యేగి రతని
కట్టడ నెఱిఁగి యక్కడ నుండ వెఱచి
తదనంతరమున నద్దరణీశ్వరునకు
నొదవువేడుక నొకానొకవిన్నపంబుఁ
గావింతు మని దైవికంబున మంత్రు
లావేళ వచ్చుచు నచ్చోట నున్న
సొమ్ములు చూచి యాచుట్టు నొండొరుల
త్రిమ్మట లేనియత్తెఱఁగు వీక్షించి
యేకాంత మయ్యెఁ బో యీవేళ మనకు
భూకాంతు వేడబంబుల నోసరింప
వసుధేశునకు వైష్ణవభ్రాంతి వట్టి
వసుధరాజ్యంబు నెవ్వరి సడ్డఁ గొనఁడు

మన మెంతచెప్పిన మనమాట విభుఁడు
వినఁడు నిత్యంబు నీ వెఱ్ఱిదాసరులు
గడుసు లేమియు నెఱుంగనిరాజు చెవులఁ
బుడుకలు విఱచి రేపునుమాపు వచ్చి
బాధించి యింటిలోపలివెల్ల మరులు
బోధించి వెరఁజి కొంపోవుచున్నారు
వీరి నేమనినను విభుచిత్తమునకు
దూరమయ్యెదము కాంతుని నంటిమేని
యతనిచిత్తంబురా దైన నింకొక్క
గతియొప్పు మన మెఱుఁగనిరీతి నిచటఁ
దొడవులు డాఁచి యీధూర్తులమీఁద
సడివైచి విభునకు శఠముఁ బుట్టింప
వారికి ధారుణీశ్వరునకు మఱియుఁ
జేర దీచందంబు చేసినఁగాని
విఱుగదు వారిపై విభువ రేణ్యునకు
మఱి రారు వారు నమ్మనుజేశుకడకు
ననుచుఁ బ్రమాణంబు లన్యోన్య మప్పు
డొనరించి యచ్చోట నున్నభూషలను
గైకొని పోయి బొక్కసములవారి
కీకార్య మంతయు నెఱిఁగించి వారి

నాయెడఁ దమసేయునటువంటిబాస
సేయించుకొని వారిచే దాఁప నిచ్చి
యఱిమురి విభుఁ డెంతయడిగిన నేమ
యెఱిఁగింపు మనక మీ రెఱిఁగింపవలదు
అని సమకట్టి వా రటు వాసి చనిన
జననాథ [30]భాండికజనము చింతించి
జననాథునకు నెంతచనవరు లైనఁ
జన దమాత్యులవాక్యసరణులు మీఱఁ
గడఁగి మీఱిన నెన్నిగతులను లేని
సడి వైచి నృపునకుఁ జౌకపుట్టించి
గొనకొని వడి గుంట గూల్చివదనకఁ
గనుమూయ రెటొ దైవగతిఁ జూచికొనుట
యనుచుండి [31]రట మంత్రు లావాసమునకుఁ
జనిరి డెందముల నుత్సాహంబు లొదవ
జననాథుఁ డంత మజ్జనభోజనాదు
లొనరించి నగరిలో నొకకొంతతడవు
పవళించియుండి యుప్పవడమై చెంత
నవసరంబులవార లపుడు కొల్వునకు
వేళ యయ్యె నటంచు విన్నవించుటయు
నోలగం బొనరింప నుద్యుక్తుఁ డగుచుఁ

కొలఁది మీఱినయట్టి కొలువుకూటమునఁ
దొలుతఁ దా నిడినట్టితొడవులు దలఁచి
కవగూడి యపు డూడిగంబులు సేయఁ
దివురు [32]బ్రెద్దలప్రోడతెఱవులఁ జూచి
కొలువుకూటంబులో గొప్పసింగములు
దళుకొత్తుచంద్రకాంతంపుఁగంభంబు
చాటున మించుపచ్చలకాళ్ళపలక
పీఁటపై సొమ్ములు పెట్టి వచ్చితిని
తెమ్మన్న వార లేతెంచి వేవేగ
నమ్మహీపతి చెప్పినట్టిచందమున
నరయ నాభరణంబు లచట లేకున్నఁ
దిరిగి రాజునకు నత్తెఱఁ గెఱిఁగింప
వెఱఁగును గోపంబు వీడుజోడాడ
మఱియు వారలఁ జూచి మనుజేశుఁ డనియె
లేకుండు టెట్లు తాలిమితోడ నరిగి
వాకిటఁ గాపున్నవారల నరసి
యాచెంత నేఁ జెప్పినట్టిచోఁ జక్కఁ
జూచితిరో లేదొ చూడుఁ డీమాటు
కప్పినముదిమిచేఁ గన్నులపొరలు
గప్పెనో బ్రమసి యెక్కడఁ గానలేరు

యనుఁడు కట్టికవార లనయంబు బెగడి
చని పీఁటమీఁద నాసందుగొందులను
నరసి వాకిటివారి నచటిహెగ్గళ్ళఁ
బరిచారకులఁ బెక్కుభంగుల నడిగి
వెదకి కానక ధరావిభునిచెంగటికిఁ
గొదుకుచు నరిగి వాక్రువ్వ నోడుచును
జనపు నెయ్యంబు విశ్వాసంబు లొకటఁ
బెనఁగొనఁ బలికిరి పృథ్వీశ! యేము
నేవిధి మీ రానతిచ్చితి రట్ల
యావరపీఠంబునందు నాచెంతఁ
బదివేల తెఱఁగుల భావించి యేము
వెదకెడులాగుల వెదకిచూచితిమి
ఎడపక నచ్చోటిహెగ్గళ్ళఁ బరుల
నడిగెడుచందాన నడిగిచూచితిమి
దేవర తెలియు టింతియకాని తమకు
భావింప [33]వానిపోబడి కానఁబడదు
అవి తాము పొడఁగాన మని యెట్టిబాస
సవరింపు మనినను సవరింతు మనిన
నీవిధిఁ దనసొమ్ము లింటిలోపలివి
పోవు టెట్లని మనంబునఁ బలుమాఱుఁ

గనలుచుం బేరోలగమున కేతెంచి
తనమంత్రివరుల నందఱఁ బిలిపించి
జననాయకులుఁ బరిచరులు బాంధవులు
వినుచుండఁ బలికె సవిస్మయుం డగుచు
వింటిరే [34]యొకయింత వింత నాయాజ్ఞ
గెంటివోవక మెలఁగెడుమంత్రులార!
కొలువులోపల నిడిగొన్న నాతొడవు
లిల పచ్చగద్దియ నిడి లోని కరుగ
మనమున భయ మింత మాని చోరకులు
గొనిపోయిరఁట యిట్టిక్రొత్తలుం గలవె?
జానకీవిభు రామచంద్రునికృపను
మానితసామ్రాజ్యమండలం బెల్ల
జోకమై నొకచోటఁ జోరశబ్దంబు
లేకుండునట్టు లేలినయట్టితనదు
నట్టింట సింహాసనముమీఁద యేన
పెట్టినసొమ్ములు పెఱదొంగ వచ్చి
యిట్టెకైకొనిపోవు టేరీతి రచ్చ
కొట్టమె నాయున్నకొలువుకూటంబు
ఇక్కడ నాయింట నీరీతి యైన
దిక్కుల నెట్లు వర్తిలు మదీయాజ్ఞ

నయవేదు లని మిమ్ము నమ్మితిఁ గాని
భయమేది మీర లిప్పగిది దుర్నీతి
మొదల స్వామిద్రోహమున కొడిఁగట్టి
యెదురుమి మ్మెఱుఁగమి నెఱుఁగలేనైతిఁ
బదిలంబు గాఁగ లోపలను వెల్పలను
మెదలెడువారి నిమ్మెయి విచారించి
యీక్షణంబున దొంగ నిట పట్టితెచ్చి
శిక్షించి సొమ్ముఁ దెచ్చినఁ గాని మొగముఁ
జూడ రాఘవునాన సొరిది మీయాట
లాడింతుఁ దెలసికొం డంతరంగముల
మఱి యెవ్వ రిచటఁ ద్రిమ్మఱ రారు మీర
లెఱుఁగ కాసొమ్ము దా నెందుఁ బోవచ్చు
ననుచు నాగ్రహవృత్తి నాడువాక్యములు
విని యమాత్యులు ధైర్యవివశులై యనిరి
ఈవడువున నానతిచ్చిన నన్యు
లావల మఱి యడ్డ మాడంగఁ గలదె
యీయెడ మీ రానతీఁగ విన్నపము
సేయ కుండఁగరాదు చేసితిమేని
స్వామిచిత్తమున నేసరవిమై నుండు
నో మాకుఁ దెలియదు నుడివెద మైనఁ

దరతరంబులను బ్రాఁతరికంబు గలుగఁ
గర మర్ది హితవు నక్కఱయునుం బొదలఁ
బేరుపెంపులు పెట్టిబిడ్డలై నిన్నుఁ
జేరి సమంచితశ్రీలఁ బెంపొంది
తుదిని సమ్మాళిగెతొండ లైయుండి
బ్రదుకంగఁ గోరునీపరిచారజనులె
యీవిధంబుల ద్రోహ మేల సేసెదరు?
ఈవిధి మీ రానతిచ్చినయట్టి
యానతి కే మడ్డ మాడంగలేము
కాని నీలెంకలు కల్లరుల్ గారు
ము న్నింటనుండియు మొఱ పెట్టి పెట్టి
విన్నవింపమె నీకు వేయుభంగులను
జేసితి మాకుఁదోఁచినవిన్నపంబు
చేసినమీఁద నోక్షితినాథ యాజ్ఞ
వెట్టిన మేలు తప్పిదముగాఁ గొనక
నెట్టన మమ్ము మన్నించిన మేలు
నీకు లోకములోనినృపులకుఁ బోలె
వాకిటికావలివారికట్టడయొ
యొకమంత్రియాజ్ఞయో యొకయవసరమొ
యొకరాజసమొ యెద్దియును నొల్ల వెపుడు

నెట్టన నొసలిపై నెరయ నామంబు
వెట్టినవారెల్లఁ బెద్దల మనుచుఁ
బదివేవు రొకట లోపలికి వెల్పలికి
నుదయాస్తమయములం దొక్కచందమున
వచ్చువారలు పోవువారలు నగుచు
నిచ్చలు నగరిలోనికి నేగుదెంచి
యీరీతిఁ జరియింతు రీమూఁకలోన
నేరిఁ జోరకు లని యేర్చిపట్టెదము
వారుదక్కఁగ మనవారికి సొమ్ము
కోరి కైకొన నెన్నిగుండెలు గలవు?
వినుమయ్య యిఁకఁ బదివేలు నేమిటికి
జననాథవర్య! వైష్ణవులుదక్కంగఁ
బెఱవార లవి కనుపెట్టి కైకొనఁగ
వెఱతురు [35]తుదిఁ బదివేలు చెప్పినను
అని యమాత్యులు పల్కునట్టివాక్యములు
విని రాజు చెవులకు వేఁడియైయున్న
జానకీపతి! రామచంద్ర! యటంచు
వీనుల హస్తారవిందము ల్చేర్చి
యాచందమున వార లాడినతెఱఁగుఁ
జూచి పోనీక రాజుల చక్రవర్తి

కడుఘోర మైన యీకష్టవాక్యములు
నుడువంగ మాకు [36]నీనోళు లెట్లాడె
శ్రీవిహారుని నింద సేయుపాపంబు
శ్రీవైష్ణవుల నుతి సేసిన నుడుగు
శ్రీవైష్ణవుల నింద సేసినదోష
మేవిధిఁ బాయు మీ రేమిసేయుదురు
కలుషాలవాలసంగతలతాజహ్వ
లలవరించినబ్రహ్మ ననుటయెకాక
యనుచు నాగ్రహవృత్తి నంతటఁబోక
మనుజేశుఁ డనియె నమ్మంత్రివర్యులకు
శ్రీవైష్ణవుల నింద సేసినమిమ్ము
వేవేగ నాజ్ఞఁ గావించుటే నయము
పదరి యిప్పుడు మిమ్ముఁ బట్టి శిక్షింపఁ
దుదలేనియీజగత్తులు నన్నుఁ జూచి
తనకు నిష్టము సేయఁ దలఁచినయట్టి
తనవారిఁ జంపించె ధరణీశుఁ డండ్రు
తొడిఁబడ నిదియసందుగ వారిమీఁద
సడి వైవఁ జూతురు చపలమానసులు
కావున నారీతిఁ గాక లోకైక
పావను [37]ల్నిర్జితాపారకల్మషులు

నపగతమదమాను లంత్యమోపాయు
లపరిమితజ్ఞాను లమరసన్నుతులు
రామచంద్రాయత్తరతులు నన్నేలు
స్వాములు నైనవైష్ణవులు చోరకులు
గారని యే బాసఁ గావింతు నిపుడు
శ్రీరమావిభుఁడుసాక్షిగ నొండు నేల
జగదేకనాయక జానకీదేవి
జగదేకనాథుండు జానకీవిభుఁడు
పురుడింప నుభయవిభూతులు వార
లిరువురిగతి గడియించినా రరయ
వారినందనులు శ్రీవైష్ణవు లెల్ల
వారిపదార్థముల్ వారు గైకొనిన
వారిఁ జోరకు లనవచ్చునే మీకు
నూరక పలుమాఱు నుచితంబు దక్కి
యది విచారించిన నాగమాంతముల
విదితమై మునులచే వెలయునర్థంబు
ధీరత నొండుప్రతిజ్ఞ చేసెదను
పారమార్థము గనిపట్టిన వినుఁడు
పరవధూ పరధన పరనింద లొల్ల
కరయంగఁ గలలోన నైన వైష్ణవులు

పదివేలు మీతోడఁ బలుకంగ నేలఁ
ద్రిదశు లచ్చెరు వంద దివి భువి క్రిందఁ
గోరి వైష్ణవచోరకుండు లేఁ డనుచుఁ
గ్రూరసర్పంబు నారూఢిఁ బట్టెదను
లేనిసిగ్గెంబు లేలిక నాఁడబంటు
వానికిఁ దా నిచ్చి వారించు టొప్పు
స్వాములు తనకు శ్రీవైష్ణవులెల్ల
నామహాత్మునిబంట నైనట్టియేను
వారలమై సపవాద మింతయును
వారింతు నేనని వసుమతీవిభుఁడు
పన్ని నే వారలపై నిందఁ దీర్ప
కున్న స్వామిద్రోహ మొదవెడు ననుచుఁ
గుంభమధ్యమునఁ గర్కోటకనామ
కుంభీనసము నిడుకొని తెం డటంచు
నెట్టనం దెప్పించి నిశ్చలవృత్తిఁ
జుట్టాలు మంత్రులు సుతులు చౌరికులు
ననుచరు లినమృగాంకాన్వయుల్ పౌర
జనులు చూడఁగఁ గృతస్నానుఁడై వచ్చి,
వెనక వింటిమి మేము వినమని యనక
వినుఁడు నాప్రతిన భావించి కన్గొనుఁడు

పంచాస్త్రగురుపాదభక్తు లీసొమ్ము
వంచించి కైకొన్నవారలు గారు
శౌరిసాక్షిగను వైష్ణవులు చోరకులు
కారు ముమ్మాటికిం గారు కా రనుచుఁ
ద్రిజగంబు లెఱుఁగఁ దద్దివ్యకుంభమున
భుజగంబుతోడ మున్పుగఁ బెట్టియున్న
హేమపుఘుటికఁ దా నెత్తె నెత్తుటయు
శ్రీమనోహారి యాశ్రితవత్సలుండు
రంగనాయకుఁడు శ్రీరఘుకులాన్వయుని
సంగతి మరకతశ్యామవిగ్రహము
నేర్చినయమ్మును నెడవెన్నుచాయఁ
జేర్చినపసిఁడిపింజియయంపపొదలు
వేదండశుండంబువిరసంబులాడు
కోదండ మూఁతగాఁ గొన్న కెంగేలు
చుట్టినగోణంబుచుంగులోఁ బెనఁచి
కట్టినతళుకుబంగరుపట్టుదట్టి
కటియోర మించుబంగరుకుప్పెతోడ
నటనఁ జూపట్ట సొన్నాళంపుసురియ
వెలిదామరల వికవికనవ్వువాలు
తెలిగన్నులును నెలతీరునామంబు

వెలఁదినవ్వులు నరవిరిమోముమీఁద
విలసిల్లుసన్నంపువిడియంపు రేఖ
వెడదయురంబుమై వెన్నెలసోగ
యొడికంబు చూపినయుపవీతలతిక
కంబుకంఠంబు చక్కనిముద్దుమోము
బింబాధరంబుమై బెరయులేనగవు
మకరకుండలములు మణికిరీటంబు
నకలంక కేయూరహారజాలములు
నొనరికలై యొప్పునొకపాద మూఁది
యినకోటికోటులహెచ్చుతేజమున
వలపలికడపంటవలఁతినెచ్చూలి
వలనొప్ప తమ్ముఁ డవ్వలనొప్ప దెసల
దళు కెత్త నపుడు సీతాప్రాణనాథుఁ
డలభూమిపతికిఁ బ్రత్యక్షమై నిలిచి
కరమునం దనభక్తుకరముఁ దెమల్చి
కరము దైవాఱంగఁ గౌఁగిటం జేర్చి
భాగవతోత్తంస! పరిపూర్ణహృదయ!
యోగికైరవచంద్ర! యుర్వీశచంద్ర!
భూవర నాకంటెఁ బొడవుగాఁ దనదు
సేవకులందు నీ సేయుభక్తికిని

మెచ్చితి నీవు కామించినవరము
లిచ్చెద నన విని యింపు రెట్టింపు
గులశేఖరుఁడు రఘుకులనాథపాద
జలజాతములఁ జక్కఁ జాగిలివ్రాలి
దశరథనందన! తాటకాజైత్ర!
దశరధకౌశికాధ్వరవిఘ్న హరణ!
హరచాపభంజన! యవనిజారమణ!
పరశురామాభంగ పటుతపోహారి
గురువాక్యపాలన గుహవంద్య మౌని
వరదాయి దండకావనభూవిహారి
కుటజసన్నుత మౌనికులనత పంచ
వటవాస రాక్షసవరగర్వహారి
ఖరదూషణాదిరాక్షసకంఠదళన
శరభిన్న మారీచ శబరిప్రసన్న
వాలిశాత్రవ మాల్యవద్గిరివాస
పాలితసుగ్రీవ పౌలస్త్యవరద
కంధిబంధన దశకంఠసంహారి
బంధురనిర్జరపతిముఖప్రణుత
భూమిజాసంయుత పుష్పకారూఢ
స్వామి రాఘవ భరద్వాజపూజార్హ

సాకేతపురనాథ జగదేకనాధ
నాకులస్వామి వై నాకులస్వామి
మొదలైనదివిజులు మునులు వేదములు
ముదలకింపఁగరానిమూర్తివి నాకుఁ
బ్రత్యక్ష మైతివి పరమకల్యాణ
యత్యంతసంతోషితాత్ముండ నైతి
నని సన్నుతింపుచు నానందబాష్ప
వనధార లుప్పొంగ వడియు నవ్వేళఁ
దదనుగ్రహంబుచేతను దానె వచ్చు
విదితవిద్యోదయవిభవంబు గలిగి
యపగతవక్త్రంబు లై హరివోలె
సపరిమితంబు లై యమృతంబుఁ గురియ
నుపనిషదర్థంబు లొదవు నిచ్చలును
విపులాఘలతికాలవిత్రముల్ గాఁగఁ
జాటుపేశలవాక్యచాతురి నారు
పాటచే నొక్కప్రబంధ మర్పించి
దేవ నే నేమిప్రార్ధించెద? మున్న
యీవ యీఁగలవెల్ల నిచ్చితి వరయ
నైన దేవరయాజ్ఞ యది మీఱరాదు
గాన నీపదభక్తి గలవారిమీఁద

నీమీఁద ననిశంబు నిశ్చలభక్తి
మామకబుద్ధి నేమఱకుండనిమ్ము
అనిన రంగేశ్వరుం డావరం బొసఁగి
మనుజేంద్రచంద్రుతో మఱియు నిట్లనియె
నీకన్యకామణి నీళాంశజాత
నాకు నిమ్మనిన నన్నరనాధవరుఁడు
ధవళాక్ష! కందర్పుతండ్రి! లోకైక
ధవ! కృతార్థుఁడ నైతి ధన్యుఁడ నైతి
నని డెందమునఁ గూర్మి యందంద బొదలి
మునులు నిర్జరులు నిమ్ములఁ జేరి కొలువ
జమళిక్రొమ్మొనలఁ జంచలపెట్టుకొప్పు
కమలారిమై కళంకము లెన్నుమోము
చెఱకువిండ్లను బిప్పి సేయుభ్రూలతలు
మురువుదమ్ముల నీట ముంచుకన్నులును
గొదమచందురులోనఁ గొఱ యెన్నునొసలుఁ
బదరిశంఖము గుల్లపఱచుకంఠంబు
గెలిచి సంపఁగి నుడికించునాసయును
వలిజక్కవల గూటవైచుపాలిండ్లు
సింగంబునడుము కొంచెముసేయుకౌను
భృంగాళి మిగుల గీపెట్టించునారు

తరగమొత్తంబులఁ దలగించువళులు
సురుచిరావర్తంబు సుడికొల్పునాభి
గురుచక్రములఁ దిరుగుడుపెట్టుపిఱుఁదు
నరఁటుల పొరపొచ్చ మాడునూరువులు
గొనకొని మెఱుఁగులు కొలుపుజానువులు
దొనలశూరుల వెన్నుద్రోయులేఁదొడలు
తరలించుతాఁబేళ్ళఁ దలచూపనీని
చరణము ల్గలిగిన జగదేకమాతఁ
దనకూర్మికూఁతు నత్తఱి మాధవునకు
ననుపమలగ్నంబునందుఁ గైసేసి
సురగురుఁ డరుదేఱ సురరాజు, రాజుఁ
దెరబట్టి రంత నాదేవేంద్రమంత్రి
సుముహూర్త మొసఁగ నాసుమకోమలాంగిఁ
గమలాక్షునకుఁ జేరకాంతుఁ డర్పించె
నపుడు వధూవరు లాననాబ్జముల
నపరిమితోత్సాహ మడర వీక్షించి
సగుడ జీరకము మస్తములఁ దోడ్తోన
నిగురొత్తువేడ్కల నిడి రొప్పుమిగుల
రాయంచపై నెక్కు రాకేందువదన
యాయంచ నారదుం డలరంగ వీణ

వాయించ, వడఁకుచల్వలకొండచూలి
పాయకకూడి సోభానపాడంగ
నరవిందనేత్రున కాత్మసంజాత
వరవైభవముల వివాహంబు సేసి
జనకుండు మును రామచంద్రున కొసఁగు
ననువున మితిలేనియట్టిసంపదల
నరణంబుగా నిచ్చె నప్పు డమ్మంత్రి
వరు లరుదంది యవ్వసుమతీశునకుఁ
దమసేయునేర మంతయు విన్నవించి
యమితాపరాధుల మని దైన్యపడుచు
మును దాఁచినట్టిసొమ్ములు భయపడుచుఁ
గొనివచ్చి యెదుటఁ గ్రక్కునఁ బెట్టి సొరిది
నిల వ్రాలి నీదైన యీమహామహిమఁ
దెలియ కీగతిఁ జేసితిమి దము నింకఁ
జేకొని నీ వాజ్ఞచేసిన మేలు
కాక పెదలఁ జూచికాచిన మేలు
నీచిత్తమునఁ గరుణించి వారలను
జూచి లెమ్మనుచు నాసుగుణాంబురాశి
యేల కొంకెదరు మీ రేమి సేసెదరు
శ్రీలలనాధీశుచిత్త మట్లుండె

వెఱవకుఁ డని గారవింప దుందుడుకు
మఱచి సంతోషాబ్ధిమగ్ను లై రంత
నాయాదిదంపతు లారాజయోగిఁ
బాయకుండిరి భక్తపరతంత్రు లగుచు
నటుమీఁదఁ దనుఁ బోలునట్టికుమారుఁ
బటుగుణోదారుని బట్టంబు గట్టి
సరవిమై వైష్ణవజాలంబుఁ గూడి
హరిభజనాసక్తుఁ డైయుండె నంతఁ
బ్రతిలేనియట్టి శ్రీరామాయణంబు
హితుఁడైన నిజపురోహితునిచే విరుచు
నతిశయిల్లుచు నుండె నమ్మహాకథకుఁ
డతిభక్తిపరవశుఁ డైనభూపతికి
ననిశంబు సీతాపహరణంబుపట్టు
కనుమాటి వినుపింపఁగా నొక్కనాఁడు
పనివడి నా కొక్కపయనంబు గలుగఁ
దనయుని రావించి ధరణీశ్వరునకు
వాణీవిలాసవాగ్వైఖరుల్ మెఱసి
రాణింప నీవు పురాణంబు నేఁడు
వినిపిుపు మనిచెప్పి వీడ్కొల్పఁ దండ్రి
యనుమతిం బౌరాణికాత్మసంభవుఁడు

సావిగన్నెరపూవుచాయనీర్కావి
ధోవతి మీగాళ్లతో నొఱయంగ
ధౌతమై పురిగొని తనరుయజ్ఞోప
వీతజాతం బురోవీథి నర్తింప
మడతవిప్పక నడుమనుగట్టుచాయ
జడిసినతోపుపచ్చడ మింత జాఱఁ
దాలికెవెల్లపుత్తడి నై నదర్భ
వ్రేలిపవిత్రంబు వెడవెడఁ దిరుగ
నవిరళంబుగ జాతినట్టినెన్నొసలి
ధవళోర్ధ్వపుండ్రంబు తనరారుచుండఁ
బెడతటిమై జాఱ పెట్టినచింపి
ముడుతకుళ్లాయి కిమ్ముల మిట్టిపడఁగ
దట్టమై పొదిగల్గి తరవాయి బెట్టి
కట్టినపెనుపుస్తకము చంక నలరఁ
జనుదేఱఁ గువలయేశ్వరుఁ డారగించి
యనుపమమణిమంటపాసీనుఁ డగుచు
హితులు మంత్రులుఁ బురోహితులు బాంధవులు
సుతులు వైష్ణవులు రాజులుఁ గొల్వు సేయ
శ్రీరామకథ వినఁ జెలు వగ్గలింపఁ
బౌరాణికుని బిల్వఁ బాఱుఁ డటంచు

నుడిగంబు సేయుచు నున్నసేవకుల
బడిబడి తనుబిల్వఁ బంపునయ్యెడకు
నరుదెంచి సంతతహరిభక్తిరస్తు
ధరణీశ! యని యక్షతము లిచ్చి యతని
యనుమతి నుచితాసనాసీనుఁ డగుచు
వినయ మేర్పడఁగ నవ్విప్రపుంగవుఁడు
తరవాయిఁ గైకొని ధవళాక్షుఁ దలఁచి
నెరిదపస్వాధ్యాయ నిరతప్రమోద
ధరఁ దపస్వీవాగ్విదాంవరభక్తి
పరనారదంపరిపప్రచ్ఛభవ్య
వాల్మీకిమునిపుంగవువా యని నుడివి
కేల్మోగిడించి భక్తి నమస్కరించి
యనిశంబు శ్రీరామ యని మధురముగఁ
దనరుచుండెడుకవితాశాఖ యెక్కి
పలుకుచుండెడు నాకు భవకోకిలంబుఁ
దలఁచి యంజలిఁ జేసి తదనంతరమునఁ
బదపదార్థంబు లేర్పడఁ జౌల కింపు
లుదయింప రసరీతు లుప్పొంగుచుండ
నగపడి కత చెప్పినటువలెఁ గాక
సొగయఁ బ్రత్యక్షంబు చూచినట్లుండ

వెనుకఁ ద్రొక్కక రసావేశంబు పతికిఁ
గనుపట్ట మారీచుకథఁ జెప్పి చెప్పి
చొప్పుగా విభుని కచ్చోటు నీ వెపుడుఁ
జెప్పకు మని తండ్రి చెప్పినకతన
సతతంబు సురల నాశ్చర్యమొందించు
నతనితుర్యపుభక్తి నరయనికతన
వరుసతో ముందరవచ్చుకార్యంబు
నరయక సీతాపహరణంబుపట్టు
చెప్పెఁ జెప్పినఁ గుల శేఖరాధీశుఁ
డప్పుడు ప్రత్యక్ష మైనయట్లుండఁ
బటుతరనిజభక్తిపరవశుఁ డగుచుఁ
గటము లుత్కటములై కంపింపఁ గనలి
మున్నింటి నరసింహమూర్తియో యనఁగఁ
గన్నుల విస్ఫులింగము లుప్పతిలఁగ
నడుగక సింహాసనము డిగ్గనుఱికి
తడయక రామచంద్రద్రోహిఁ బట్టి
యీక్షణంబున సుర లెడఁ జొచ్చిరేని
శిక్షింతు నెందుఁ జొచ్చినఁ బోవనీను
మునుకొని యరకాలములుగాడకుండ
ననుఁగన్నతల్లిఁ గ్రన్నన రాముఁ గూర్తు

నని యుద్ధసన్నద్ధుఁడై పరిచరులఁ
గనుఁగొని వాజి వేగమతెం డటన్నఁ
జెవితీరు నెరిగందసిరియును వెన్ను
సవరనమించుపంచారంబుబటువు
నున్ననిమేనికన్నులచక్కఁదనముఁ
దిన్ననినెమ్మోముఁ దెలివైనగొరజ
బాగును నురములోపలియాయితంబు
సోగైనవాలంబు సొబగునెన్నడిమి
సైకంబు నడలోనిసరసత పరువు
జోకయుఁ గల్గి యించుకవెల్తి లేక
మదమును గమనంబు మనువు నిబ్బరము
నుదుటును నదుటును నొఱపును జుఱుకుఁ
బూని చిత్తరువునఁ బొసఁగంగ వ్రాయ
రానిబిత్తరపుసామ్రాణి తేజీగి
పురుడింప నిల నల్లపూసలు నెఱయు
వెరఫున బొలియంబు విఱిచిన గచ్చు
పల్లంబు నింద్రగోపంబు టుల్లారు
బల్లెంబు కపిలోకభర్తవాలంబు
కలికిచిల్కలకొల్కి కఱివంకబొమలు
దలపించి సింగిణీతరకసంబులను

జుట్టుకేవడముమించులకరాచూరి
పట్టుపట్టియ గనుపట్టుపట్టెంబు
పసిఁడిజంగులు నెడపలకవజ్రములు
పొసఁగి చూపట్టుకెంపులమోగముట్టు
వరరత్నహారంబు వలుదైనమెఱుఁగు
బిరుదుతలాటంబు పెట్టుపక్కెరయు
నొనరంగ సంజోగ మొసరించి మిగుల
ననువొందుబిరుదుసోయగము దీపింపఁ
గమలనాళంబులఁ గబళించునంచ
రమణఁ గళ్ళెము బాగురాగమంకించి
హరిగిరిచుట్టు తారాళిచందమున
వరరత్నహారంబు వలమెప్పుచుండ
బాగొప్పు నుదయాద్రిభానుబింబంబు
లాగునం బట్టుతలాటంబు చెలఁగ
వనజారిఁ బొదివినవనదంబుకరణి
ఘనతరం బగుకంచుకము తేజరిలఁగఁ
బట్టంపుసాహిణి బాగుగా నెదుటఁ
బట్టిన చూచి భూపాల శేఖరుఁడు
ఖగపతిస్కంధంబుఁ గైకొన్నశౌరి
పగిది నత్తురగంబుపైకి లంఘించి

రాగెలు బిగియించి రభసంబుతోడ
వాగియ సడలి చువ్వన రెండుగడల
దాఁటించి, ధేయని తరులు గావించి
యాటోపకోపంబు లడరఁ దోడ్తోన
నుడువీథి నెఱమంట లుమియంగఁ జికిలి
యడిదంబు జళిపించి యార్చె నార్చుటయుఁ
జెవులు నిక్కించి గొజ్జిగితోఁక నిగుడఁ
బవనవేగముఁ గ్రిందుపఱచువేగమునఁ
బనుపడ నోరిలోపలఁ గాళ్లు వెడలె
ననఁగఁ జెచ్చెరఁ గోలయనువున డేగ
వడువునఁ బెనుసాళువమురీతి లగడు
వడి పెటల్ గుండుకైవడి వడి మీఱి
కెరలుచుఁ గదలి సింగిణివింటికోల
కరణి ధురీన చక్కఁగఁ దీఁగెసాగి
దిరదిర దశదిశల్ దిరిగి ఘూర్ణిలఁగ
ధరణి యభ్రఘు రసాతలముఁ గంపింపఁ
బదఘట్టనోద్ధూతపాంసువుల్ విష్ణు
పదమెల్లఁ బొదువ నిబ్బరము నబ్బురము
గదుర మనోవాయుగతులఁ గీడ్పఱచి
కదలించు తనపతికదలిక యెఱిఁగి

కదలె లంకాభిముఖంబుగా నపుడు
త్రిదశులు గురిసిరి దివిఁ బుష్పవృష్టి
నాతటి గోవిందుఁ డతనిభక్తికిని
బ్రీతుఁడై ఘననిత్యబృందంబు గొలువ
నరుదార నైనతేయారూఢుఁ డగుచు
నరుదెంచి యయ్యోగి హయముతోఁగూడ
జనులు నిర్జరులు వాసవముఖ్యు లెల్లఁ
గనుఁగొని వెఱఁ గందఁ గరుణ దైవాఱ
ననుపమమణివిమానారూఢుఁ జేసి
కొని యేగె నిత్యవైకుంఠంబుకడకుఁ
దొలుత నయ్యోగిచంద్రుఁడు నూఱువాట
దలుకొత్త నేప్రబంధంబుఁ గావించె
నందు ముప్పదివాట నారంగనిలయు
వందితామరునిఁ గైవారంబు సేయు
కడమడెబ్బదివాట క్రమ మేరుపడఁగఁ
జెడనిసంపద లిచ్చు శ్రీవేంకటేశు
శ్రీరామసోదర శ్రీరాము తొంటి
శ్రీరాము నభినుతుల్ సేయుచు నుండు
పదిలుఁడై యయ్యోగిభర్తచారిత్ర
మెదిరెడువేడ్కతో నిల నెవ్వఁడేని

వినిన వ్రాసినఁ జదివిన నుతిసేయ
నెనలేనిసంపద నెనసియుండుదురు
కావేరిదక్షిణాంగణసీమ నిచుళ
నా విలసిలు నొక్కనగరరత్నంబు
అందలిమణిమయహర్మ్యమయూఖ
బృందముల్ నిచ్చలు బీఱెండ గాయఁ
జదలేట మెలఁగెడు చక్రదంపతులు
పొదలెడువేడ్క నెప్పుడుఁ బాయకుండు
నిరుపమగురుకళా నిధులును భోగి
వరకవికేతు భాస్వద్బుధముఖులు
గలిగి యయ్యమరలోకము చెలువెల్ల
గిలిమి యాపురము మిక్కిలి నొప్పుచుండు
జనవినుతుఁడు రాయచౌహత్తమల్లుఁ
డననొప్పురాజేంద్రుఁ డాపురం బేలు[38]
నారాజదేవేంద్రుఁ డట నొక్కనాఁడు
శ్రీరంగధాముని సేవించి మగుడి
తనపురంబునకు నెంతయు సంభ్రమమునఁ
జనుచుండి వేఱొక్కజాడగా నరిగి
కలువల మించు చెంగలువల మెలఁగు
నలుల రాయంచతొయ్వలులఁ గొక్కెరల

కవలఁ బిసాళిజక్కవల నొప్పారు
తొవల నెత్తావిచెందొవల బంగారు
తమ్ముల మీలమొత్తముల శైవ
లమ్ములఁ గ్రౌంచజాలమ్ములఁ బొలిచి
యల్లన నెత్తావు లడరుదెమ్మెరల
జల్లుబోరాడుకాసారంబుఁ గాంచి
యందుఁ దోయములోన నరిగి మధ్యంబు
నందుఁ గాంచనతోయజాంతరసీమఁ
గమలాంశజాత యై కమలయుం బోలెఁ
గొమరారు నొకరాచకొమరితెఁ గాంచి
నెలపొల్పుఁ గన్న వెన్నెలపుల్గుకరణి
బలువైననిధిఁ గన్నబడుగుచందమున
సంతసింపుచుఁ జేరఁ జని నిచుళేంద్రుఁ
డంతరంగము ప్రేమ నంతంతఁ బొదలఁ
దళుకునెత్తమ్మిపుత్తడిబొమ్మరింటఁ
బొలుపొందురత్నంపుబొమ్మచందమునఁ
జెలువారుబాలికం జేకొనిపుత్త్రి
చెలువున భావించి చెలఁగి యారాజు
తనపురంబునకు నెంతయువేడ్కతోడఁ
జనుదెంచి నిజనివాసముఁ బ్రవేశించి

తనయులు లేమిఁ దద్దయుఁ బొక్కుచున్న
తనపట్టమహిషి కాదరము రెట్టింపఁ
బద్మిని యనుపేరఁ బాటింపుఁ డనుచుఁ
బద్మజ యైన యాపసిబిడ్డ నొసఁగఁ
నాబాలఁ గైకొని యాత్మ నుప్పొంగి
యాబాల శశిఫాల యనురక్తి మీఱఁ
గొదలేనినెమ్మది గొనకొన్నకూర్మి
పొదలుగారామునఁ బోషింపఁదొడఁగె
నాళీకసంభవ నవచంద్రరేఖ
వోలె నానాట సొంపులు మించి ప్రబలి
మొగినీలములరంధ్రముల నెన్నుకురులు
నిగురుజందురువంక లెన్ను నెన్నొసలు
డిగనివిండ్లకు నెక్కుడించు భ్రూలతలుఁ
దొగమొత్తముల నీళ్లఁ ద్రొక్కుకన్నులును
బెలుచశంఖము మొఱపెట్టించుగళముఁ
గెలసిచక్కెర నుడికించుపల్కులును
గిసలయంబుల వణఁకించుకెమ్మోవి
బిసముల నీరాఁకఁ బెట్టుబాహువులు
వనజాతములఁ దలవంపించునడుగు
లొనరికయైయొప్ప నొప్పునాతన్వి

ధగధగందళుకొత్తు తలిరంపకాని
చిగురుకరాచూలిజీవరత్నంపు
చక్కనిగుమ్మవాసనలపూరెమ్మ
చక్కెరకవణాలసాంబ్రాణితేజి
యపరంజినక్కు మోహనములచొక్కు
కపురంపులప్ప సింగారంపుకుప్ప
చిలుకలకొలికి గొజ్జగిపువ్వుములికి
తొలుకరిమించు కంతుని కేలియించు
ఇంచువేలుపుతీఁగ యెలమించుసోగ
చంచరీకాలక శశిఫాలఫలక
పలకవజ్రపుఁదళ్కు బంగారుకళుకు
కలుకులనెఱివేణి గలకీరవాణి
వాణీశనుతపాణి వనజాక్షురాణి
రాణించుకలువ వారనిముద్దుజెలువ
యన నిండుజవ్వని యై రంగవిభుని
ననుఁగులోగూర్మి యొయ్యనలాకలొత్త
నిలకు మింటికి సూత్ర మెసఁగించి మంచి
వెలఁది చల్లనియేటివెలదిని గాంచి
సొలపుకెంజెడలగొల్సులబాదు గలిగి
తళుకొత్తుచంద్రకాంతంపుదొట్టులను

వేడుక నిడి చేసి వీవనిజోలఁ
బాడుచు రాతికిఁ బ్రాణంబుఁ దెచ్చి
మునులడెందంపుఁదమ్ములనిల్చి సిరుల
మొనసిన యడుగుదమ్ముల నొప్పువాని
పదియాఱువన్నియపచ్చ [39]రింటెంబు
గదియ రింగులువారఁ గట్టినవాని
బుట్టుచు జగములు పుట్టించువాని
బుట్టినిల్లగు తమ్మిపొక్కిలివాని
నలదేవమణియు ఘంటాభరణంబు
గలిగి ఘల్లనిమ్రోయు కాలియందియల
కంచుమించుగ నేలఁ గా లొందనీక
మించి మేఘంబులమీఁదఁ బాఱుచును
జాలువారుదొలుబల్కు సెకళింపు లెసఁగఁ
బొలుచుపుల్గులరాయబొల్లని నెక్కి
చొప్పడం ద్రొక్కనిచోట్ల ద్రొక్కించి
యొప్పెడు దేవరాహుత్తరాయనిని
నెఱి నెండకన్నును నీడక న్నెపుడు
నెఱుఁగనివాఁ డయ్యు నెలరార నెండ
కన్నును నలనీడకన్నును గలిగి
క్రొన్ననవిలుకానిగురుఁడైనవానిఁ

గడపటఁ గడుపులోఁ గాళ్లుండఁగాను
పుడమిపైఁ బుట్టక పుట్టెఁబొ మ్మనుచు
వేయినోళులతోడ వినుతులు మునులు
సేయంగఁ గన్నులే చెవులుగా వినుచుఁ
బలుకులు గురువునాఁ బ్రబలి నమలక
మలకలపెనుబాన్పుమై నొప్పువాని
పొట్టెంపు నెట్టెంపు పొందు నీరెండ
చుట్టుదారల కరాచూలిమీఁదటను
బంచెవన్నెల తేజిపై వానిమామ
మించుల నదలించుమించుల గలిగి
కడిఁదిరాకాసిమూఁకలఁగన్నబొబ్బ
లిడుపోటుముట్టుమై నెనయించువాని
రంగనాథుని రమారమణు రాజసము
శృంగారమును రూపు చెలువంబు సిరులు
నెఱితనంబును గల్గునేర్పరి యనుచు
గుఱుతుగ నలపరాంకుశముఖ్యమునులు
పలికిన దివ్యప్రబంధరత్నముల
వలన నిచ్చలు విని వరునిగాఁ గోరి
తనమది నతనిమైఁ దలకొన్నకూర్మి
నినుపాఱ నాపద్మినీరాజవదన

చింతించి వలపులఁ జిక్కి లోఁజిక్కి
యెంతయుం దమిఁ జిక్కియే పెల్లఁ దక్కి
పన్నుగా నరజాఱుపయ్యెదం జేర్చుఁ
బన్నినతమి నాథుపయ్యెదం జేర్చు
నుడుగక నీరు కన్నుల నాన నిలుపు
నుడివిన సైప కన్నులనాన నిలుపుఁ
గలసెద నని కోరికలలోనఁ గాంచుఁ
గలసి మేల్కని కోరికలలోనఁ గాంచుఁ
గాంతు నెన్నును వినుకలితనంబునను
గాంతుఁ జెప్పిన వినుఁ గలితనంబునను
ఈరీతిఁ దనలోన నిగురొత్తుకోర్కె
సారెసారెకు దీఁగసాఁగ గంగేశు
దాయక పాయక తలఁపు లేకములు
సేయక రాయక చికిలిచన్మొనలు
కుచ్చక మెచ్చక కొనసాఁగి వలపు
లెచ్చక యిచ్చక మిటుసేయకున్న
నేరీతి వేఁగింతు నే నంచు చింతఁ
గూరిన యారాచకూఁతురిఁ జూచి
చెలులెల్ల మతులఁ జర్చించి యీచెలువ
చెలువ మి ట్లేలొకో చెలువంబుఁ దక్కి

చెలులఁ జేరదు వింతచెలువంబుఁ దాల్చి
చెలువార నెటువంటిచెలువునిమీఁదఁ
దలఁపు చేకూరెనో తరళాక్షి కిపుడు
       ... ... ...
తఱివేచి చుట్టమై దాయచందమునఁ
దరితీపు సేయుచు దరితీపువింట
నీనారిపై మారుఁ డెలదేఁటినారిఁ
బూని నెత్తావితూపుల నేయఁబోలు
రామాభిరామ నీరామ నారామ
సీమం బరాకు సేసినఁగానియింక
బలవంత మగువంతఁ బాయ దటంచుఁ
జెలు లంతఁ దమపొంత చెలువదోకొనుచు
మందారమాధవీమాలతీతిలక
చందనశారదసా కారసరళ
పూగపున్నాగజంబూభూజదూప
నాగకేసరనీపనారంగవకుళ
పనసపాటలపారిభద్రబంధూక
ఘనసారతింత్రిణీక్రముకజంబీర
తరులతాముఖములఁ దనరు నుద్యాన
మరుదార సొత్తెంచునపు డేపు మీఱి

వృద్ధభావము మాన్చి వృక్షాళిఁ గాయ
సిద్ధిఁబొందఁగఁ జేయుసిద్ధముఖ్యుండు
కంతునెచ్చెలి వేల్పుగములవిందులకు
సంతసం బొదవ వసంతుఁ డేతేరఁ
దోయజబాణుకత్తులనారు వోలె
నాయెడం దలిరించె నవనీజతతులు
విరహులడెందముల్ విదళింప బిట్టు
దొరిగెడురక్తంబుతోఁ దొప్పదోఁగి
రాగిల్లుమరునఖరంబులో యనఁగ
బాగొప్పెఁ గింశుకప్రసవాంకురంబు
లీయింతిచనుగవయెడ రంగవిభుఁడు
పాయకయుండుఁ జొప్పడు మీఁద ననుచుఁ
దెలిపెడిగతి మిండతేఁటిమొత్తంబు
లలరుగుత్తులయెడ నలరి చూపట్టె
నప్పు డారాజకన్యకచెలుల్ చెలిమి
చొప్పడఁ దనుఁగూడి జోడుగా నడువ
జొబ్బిలుకమ్మకస్తురిగబ్బు లొరయ
గుబ్బచన్నులతళుకులు బిత్తరింప
మరుని సామ్రాజ్యరమాదేవికరణిఁ
దరుణులతోడ నెంతయు నొప్పు మిగిలి



వలపలిచలిగాలివలన నల్లాడు
వెలఁది హుుంబాళెలె వీచోపులుగను
దళుకొత్తుతలిరుబద్దలు సవరించి
బలువిడి గోయిల పడవాళ్ళు నడువఁ
దనరారు చిలుక మొత్తపువందిజనము
తనదుముంగల బిరుదము లుగ్గడింపఁ
బొదలఁ దుమ్మిదనకీపులు బిట్టుమొఱయఁ
బొదలుచుఁ జదలఁ బుప్పొడిదుమ్ము తెగయ
వడి వసంతుఁడు దళవాయియై నడువఁ
గడుసొంపు మిగిలి చక్కదనంబు లెసఁగు
పంచవన్నెలతేజి పడివాగె నడువఁ
బంచబాణుఁడు విజృంభణవృత్తిమెఱసి
మిసమిస మనుచుఁ గ్రొమ్మించులు గలుగు
పసనికర్ణికలును బసిఁడిఘంటలును
గ్రొమ్మించుచెంగల్వకుచ్చులవెలఁది
తమ్మిలేఁదూడుదంతపు గోడియలను
దిలకించు పవడంపుఁ దీఁగెత్రాడులను
బలువన్నె విరుల కుప్పడ మైనపడము
నలరు మొల్లలవెండి యనుసులతోడఁ
జెలువొందు పూదీవెసెల గొమ్ముకొమ్ము

గొనబుచూపట్టు కుంకుమపువ్వు వఱపు
నొనరిక చిగురాకు టొరఁగును గలిగి
యలరారు చిన్నాణ మైన యందలము
పొలుపొంద రాయంచబోయలుమోవ
నంచలవలరాయఁ డావేళ నేగు
దెంచి యచ్చోట వర్తింపుచునుండె
నత్తఱిఁ జెలరేగి యాకన్యపొత్తు
కత్తియల్ వనకేళిఁ గావింపఁదలఁచి
కెరలి గేదంగుల గిల్లి రాగిల్లి
పరిమళోత్పలములు బట్టి చూపట్టి
కదిసి గొజ్జంగులఁ గామించి మించి
తుదలేని పుష్పజాతుల రాసిరాసి
పోదఁడు రండని పొదరిండ్లు దూరి
కదియుచు సుమవారిఁ గైకొన్నవారిఁ
జేరి చేముంచి గొజ్జెగి నీటముంచి
సారెకు నీరీతి సరసంపురీతి
విలసిల్లుచుండెడువేళ నామెఱుఁగు
తలిరుబోణులఁ జూచి తము దామె చొక్కి
విటపులు గొన్ని పర్విన ప్రేమతోడఁ
జిటపొటలాడ రంజిలి విఱ్ఱవీఁగి

తముఁజూడఁ గాన చేతనమూర్తులయ్యు
భ్రమసి చొక్కుచు నెంతె పల్లవింపుచును
నేలీల నను గూడి యీముద్దులాడి
కేలిమై బిగ్గగౌఁగిటఁజేర్చు నొక్కొ
యరయంగ నిదియేల యాకలకంఠి
పరికించి యొకపాటఁ బాడినఁ జాలు
నంతయేమిటికి నయ్యమృతాంశువదన
వింతగాఁ దన్ను నవ్వినఁ జాలుఁ దుదిని
అదియేలఁ దనతోడ నాకీరవాణి
యదనెన్ని యొక్క మాటాడినఁజాలుఁ
దలఁప నాగతియేల తరుణి నామీఁదఁ
జలువవాతెర తేనె చల్లినఁజాలు
నదియేల తుదిని తోయజపాదపదము
ముదమున నామీఁద మోపినఁజూలు
నని కోరుచుండెడు నమ్మహీజముల
యనురాగ మెఱిఁగి యయ్యంబుజాననలు
నకలంక నిజరూపహావభావముల
వికసింపఁజేసి రవ్వేళ నాచెంత
రంగభూవిభుఁ డొనరంగ భుజంగ
పుంగవముఖు లెల్ల బొలమరు లగుచు

జగడించు నిగమంపు సారమేయము ల
డిగిన సూత్రంపు బట్టెడలచేఁ బూని
కడువింత లైన శాఖలవలల్ పూని
పొడ వైనయంగంపు బోనులు దాల్చి
తన రెండుగడలనెంతయుఁ జిత్రగతులఁ
జనుదేర నవదాత జలజలోచనుఁడు
ప్రొద్దువంగడమునఁ బొడమినయట్టి
ముద్దులరాచూలి మురువుదీపింప
మలయుచు నడుగు దామరల లేగొనల
సొలయు వజ్రంపు మించుల మించు లెసఁగ
దళుకొత్తువెడఁద డెందముమీఁదఁ జినుగు
వెలఁది జన్నిదములు విలసిల్లుచుండ
సోగైనవలకేలి సొంపుడుగోల
బాగైన ముంగేలిపై జాలి డీగ
కరమొప్పు రవలడాకాలి నూపురము
సిరిమించుతళుకుల చెంగావిదట్టి
తులగించు నొసలి కస్తూరినామంబు
తెలిమించు నొంటి ముత్తియపుఁ బోగులును
జాతికిరీటిపచ్చలబణ్ణరసము
ఛాతిన వింతవాసనతట్టు పునుఁగు

కూడిన మొగలిరేకులు నెరివుట్టు
వీడియువీడని వెడజారుకొప్పు
నలవడరంగేశుఁ డమరేంద్రముఖులు
వలచి వెన్వెంట వేవచ్చుచునుండ
వలనొప్పు పసిఁడిమువ్వలు నందియలును
గిలగిలరవళింప గెరలి జాడించి
యక్కజం బగు పైఁడియత్తెంబుమీఁద
ముక్కుదీటుచునున్న ముద్దులడేఁగ
లావులు దువ్వి యల్లన ముష్టిఁబట్టి
కైవంచి సరసంబుగా గువ్వఁజూపి
వైవఁ జక్రము దానవశ్రేణిఁ గదియు
ఠేవచే వెడలి వాడిమినేగి యంతఁ
గలుషంపుఁ బులుగుల కసిమసఁజేసి
మలసి పిల్చినఁ గేలిమైవచ్చి వ్రాల
నీరీతి మఱియు ననేకచిత్రముల
నారామవీధి వేఁటాడు చున్నంత
నాపద్మినీకన్య యారంగవిభుని
రూపకోమలవైఖరులు విలోకించె
నలతలంపెఱిఁగి రంగప్పఁ డాచెలువ
పులకించి సొలపుఁజూపులను గీలింప

మానినీమణి చొక్కి మరుబారిఁ జిక్కి
మానంబుపేటెత్త మమతలో హత్తి
పులకించి తిలకించి పొదిగొన్నప్రేమ
తలిరింప నంత నాతలిరంపకాఁడు
చెలరేగి విరహులసెలను వి ల్వంచి
తొలఁగక నెలవంక తూపు సంధించి
యావధూమణి డెంద మదరంటనేసి
కావననార్చి యొక్కట బేరువార
నాలోనఁ గనుమూసి యంతలోఁదెలిసి
యాలలనామణి యతనుతాపంబు
సైరింపలేక యచ్చనలాడు తమిని
గూరినచింతఁ గూర్కొనుచుండు తఱిని
అలరంగ విభుఁడు మోహనరూపురేఖ
నెలయించి యెలయించి యింపు పుట్టించి
యరుదెంచె తనదుగేహమున కవ్వేళ
మరుబారిఁ జిక్కి వేమరుఁ జొక్కుచున్న
చెలువచందముఁ జూచి చెలులెల్లఁ గదిసి
సొలవకొం డొరుమోముఁ జూచి యిట్లనిరి
డాయదు మనలతోడను జారువలువ
మూయదు చనుదోయి మోహనం బొదవఁ

జేయదుగానంబు చెలువారు మేనఁ
బూయదుకస్తూరి పొలుపొందునొసలఁ
దీర్పదు తిలకంబు తిన్నఁగా వీణఁ
గూర్పదు గేదంగి క్రొమ్ముడిచెంతఁ
జేర్పదు ముద్దురాచిలుకకు చదువు
నేర్పదు కంటిరే నే డెంతవింత
యలరంగపతిఁ జూచినప్పటినుండి
చెలువమారునిబారిఁ జిక్కి సొక్కెడిని
అలివేణి నింతసేయఁగవల దనుచుఁ
బిలిచి యెవ్వరికని ప్రియముసెప్పుదము
కెలయుగీరంబు మిక్కిలి వాఁతరట్టు
పొలుచుగోయిల నన్న పొంపుడుచేయ
మలయు దుమ్మెదలు దిమ్మరిదిప్పకాయ
లిలఁ జందమామయెయ్యెడ బక్షపాతి
సొలయు నీచలిగాలి సోమరిపోతు
ఎలయిOచు విలుఁ డన్న నెగపోఁతకాఁడు
కావున సురభి సాంకవలిప్తదేహు
శ్రీవేంకటేశ్వరుఁ జింతింపరమ్మ
రామనామముఁ బదరక యెన్నరమ్మ
రామపైఁ గనకాంబరముఁ గప్పరమ్మ

వేగ నాగశయాను వేడికోరమ్మ
యోగీంద్రబృందవంద్యుని గొల్వరమ్మ
యనుచు శైత్యోపచారాదులుసేయ
మనసిజతాపంబు మఱియు రెట్టింప
నొకవిధంబునఁ జెలు లొకకొంతతడవు
నకుఁ దేల్చి రాజకన్యక బుజ్జగించి
రాకుమారిక యంతరంగంబుఁ దెలిసి
తోకొని చెలులు తోడ్తో నగరికిని
జనుదెంచి రంత నా జనవరేణ్యుండు
తనుజాతయున్న చందము విలోకించి
కడుఁ గూర్మివొదల సంగడిసెజ్జమీఁద
నిడికొని యొక్కమా టెలమి వాటిలఁగఁ
బరికింప నిన్నాళ్ళ భావంబులేదు
పరచింతనొందె నీభామాలలామ
యని నిండుజవ్వనియగుట భావించి
తనలోనఁ దానె యెంతయు విచారించి
మాయమ్మ నీకెట్టిమగఁడు గావలయు
నీయెడ భయము లే కెఱిఁగింపు మనిన
ముసిముసినగవు కెమ్మోవిపై నిగుడ
నొ స పరిముద్దుమో మొక యింతయెత్తి

పరునొల్ల నల పరాత్పరుఁ డైన రంగ
వరుని నావరునిగా వరియింపవలయు
నన విని కడు వెఱఁగంది యారాజు
తనుజాతఁజూచి పద్మజభవాదులకుఁ
జర్చింపఁగా నగోచరుఁడైన విష్ణు
నర్చావతారుని నారంగధాముఁ
గోరుటయెట్లు నీకోరినయట్ల
కూరిమితోడఁ జేకూర్చుటయెట్టు
లిలలోనఁ బసిబిడ్డ లెఱుఁగమిఁ బిలిచి
యల చందమామ వెన్నడిగిన ట్లయ్యె
నని విచారముసేయునపుడు విన్వీధిఁ
గనకాద్రి నీలశృంగము వొల్చినట్లు
పసిఁడిరెక్కల తేజిపై నెక్కి రంగ
వసుధేశుఁ డఖిలదేవత లెల్లఁ గొలువ
నరుదెంచి ప్రత్యక్షమై రాజుఁ బిలిచి
కరమర్థిఁ బద్మినీకన్య నిమ్మనిన
జననాథుఁడెంతె విస్మయమంది రంగ
జననాధుపాదకంజముల మైవ్రాలి
రంగ! పక్షీంద్రతురంగ! వేదాంత
రంగ! సత్కరుణాంతరంగ! యభంగ!

కౌతుకంబున నేఁడుగాఁ గృతార్థుండ
నైతి ధన్యుఁడ నైతి ననఘుండ నైతి
ననుచు సంతోషబాష్పాంబుపూరములు
కనుదోయి నుప్పొంగి కడలుకొనంగ
వినుతులు మఱియు వేవేలు గావించి
ఘనతమైనీడెల్లఁ గైసేయఁ బనిచి
నరసురాసుర యక్షనాగకిన్నరులు
వెఱఁగంద శ్రీరంగవిభునకుఁ బ్రేమ
ననుపమలగ్నంబు నందులో కైక
జనని నాపద్మినీ జలజాతనేత్ర
వరవైభవముల నుద్వాహంబుసేసి
యరణంబుగా నప్పు డాసతీమణికి
సిరిమించు పసిఁడిఁ జేసినతండులములు
వరుసమున్నూట యర్వదిగలంబులును
అనిశంబు నారతు లర్పించి పెక్కు
ననజేక్షణలఁ బెక్కు వాహనంబులను
అసదృశరత్నధనాదివస్తువులు
నొసఁగి తక్కినయట్టి యుచితము ల్సలిపి
రమణీయగోపురప్రాసాదమంట
పము లనేకములు చొప్పడమానికములఁ

గట్టించి శ్రీరంగఘనునకుఁ దనదు
పట్టికి సకలసంపదలు నర్చించి
పరమవిజ్ఞానసంపదఁ జెంది భక్తి
పరతం ద త్పాదతాత్పర్యుఁ డైయుండెఁ
బరమమైయొప్పు నీపద్మినీకన్య
చరితంబు ధరలోన జను లెవ్వరేని
వినిన వ్రాసినఁ జదివినఁ బేరుకొన్న
నెనలేనివేడ్క నభీష్టంబు లొదవు
ననుపమం బగు సమ్మహానగరమున
వనజాతనేత్రు శ్రీవత్సాంశ మెంతె
ప్రచురవైష్ణవకులపాధోధిశీత
రుచినాఁగ కార్తికరోహిణీతార
జనియించి కవియోగి సన్నుతుం డగుచు
ననఘుఁడై తిరుపాణుఁ డనుపేరుగలిగి
యుదయ మొందిననాఁటనుండి రంగేశు
పదచింతనామృతపానంబు సేసి
తలఁపులోఁ బ్రకృతిరోదనము నోదనము
సలుపక కొలుపక జలజాక్షుభక్తి
సరవిధారకముఁ బోషకమునుగాఁగఁ
బరమయోగానంద భరితుఁ డైయుండె

లాలితసకలకళావేత్తయయ్యు
నాళీకకుక్షిగానవిలోలుఁ డగుచు
వేణునాదముసల్పు వెన్నుఁడోయనఁగ
వీణాప్రవీణుఁ డై వీణచేఁబూని
యరుదెంచి నిచ్చలునారంగభూమి
హరిదివ్యమూర్తిగా నాత్మభావించి
యావీడు ద్రొక్కరాదని తలపోసి
కావేరిదక్షిణాంగణసీమయందు
నలరంగ విభునకు నభిముఖంబుగను
నిలిచి తత్పదభక్తి నిరతిఁబెంపొంది
తలఁపు నెత్తమ్మిలోఁ ద ద్దివ్యమూర్తి
బలుకుఁ దద్గుణదివ్యభవ్యకీర్తనము
నిలిపి హస్తముల వీణియఁ గీలుకొలిపి
కలయంగఁ దంత్రులొక్కటఁ బాదుపఱచి
కొనవేల శ్రుతి తంత్రి గూడంగ మీటి
మునుమంద్రమధ్యమము లుదారకమును
నిరవొందఁ జూపి యాయిత మొనరించి
స్వరలయగ్రామమూర్ఛల సంచు లెఱిఁగి
స్ఫురితకంపిత ముఖ్యముల బాగులెసఁగ
వరరసరీతి భావములు చొప్పడఁగ

ఘనశుద్దమును సాళగమును సంకీణ౯
మును తేటపడ జగన్మోహనం బొదవ
వీనులవిందుగా వింతగా సామ
గానలోలున కెంతె కర్ణామృతముగ
సతతంబు నీగతి సవరేయిదనుకఁ
బ్రతిలేనికూర్శి విపంచిమీటుచును
ఎడపడకుండఁ బెక్కేడు లీగతిని
గడివోనికూర్మి గైంకర్యంబుసేయ
నామహాయోగిగానామృతంబునకు
శ్రీమానినీయోగి శ్రీరంగవిభుఁడు
చిత్తంబులోన రంజిలి పద్మమోము
నెత్తమ్మి మిగులనూనిన ప్రేమఁ జూచి
నంటున నయ్యోగినాథుగానంబు
వింటివే వీనులవిందు లయ్యెడిని
అమితమై నాకు న య్యమరులుగ్రోలు
నమృతంబుకంటె మోహనము చూపెడును
అన విని శ్రీదేవి యంబుజోదరుని
గనుఁగొని హస్తపంకజములు మోడ్చి
దేవ! తావకదయాదృష్టిఁ జెన్నొంది
భావింప నీప్రాణపద మైనవాని

బరిపూర్ణమైననీ పదపద్మభక్తిఁ
బెరసిదేవరకింత ప్రియమైనవాని
బరునిసంగతి వెలుపలనుంప? దగునె
పరమాపుగాఁగఁ జేపట్టి నీకరుణఁ
దిలకింప నికటవర్తిని జేసికొనఁగ
వలయునావుఁడు రమావరుఁడు మోదించి
యనిశంబుఁ దనకుఁ దోయంబు లర్పించు
జననుతుం డగులోకసారంగమౌని
కలితగంగాతరంగముల నెన్నడుమఁ
బొలుపొందుచున్న పుప్పొడిచాళు లనఁగ
ధవళోర్థ్వపుండ్ర మధ్యముల శ్రీచూర్ణ
మవిదలరేఖ లై యనువొందుచుండ
నిగనిగ మనుచు వెన్నెలసోగ చెలువుఁ
దెగడు ధోవతులెంతె తేజరిల్లఁగను
జిలుగు వెన్నెలలమించిన జన్నిదములు
వలనొప్పుతిరుమణి వడము లింపొంద
రాజిల్లు శంఖచక్రములు నామంబు
తేజరిల్లఁగ యోరదిద్దినయట్టి
పుత్తడిబిందె మూఁపునఁ జేర్చికొనుచు
నత్తఱిఁ గావేరి కరుదెంచి డిగ్గి

తొలకించి యొక కొన్నితోయము ల్నించి
వలిపెంపుఁబావడ వాసెనంగట్టి
పొలుపొందఁగా శిరమునఁ బొందుపఱచి
పలుమరులోగుచుఁ బదములెన్నుచును
గరమువేడుక సుధాకలశంబుఁ దెచ్చు
గరుడుఁడోయనఁగఁ బ్రకాశించిచెంత
ధవళాతపత్ర సంతతి సందడింప
వివిధవాద్యములు వేర్వేర ఘూర్ణిలఁగ
మదకరు ల్గొలువఁ జామరములు వీవఁ
ద్రిదశేంద్రముఖ్యు లెంతే సన్నుతింప
నెమ్మిమై నగరిలోనికి నేగుదెంచి
క్రొమ్మించు లన హేమకుంభంబుఁదెచ్చి
తనదుముంగలినిడఁ దద్దయుఁ బ్రీతిఁ
గనుఁగొని శ్రీరంగకాంతుఁ డిట్లనియె
నాసద్గుణములు వీణను దెల్పికొనుచు
నాసీనుఁ డైన గాయకసార్వభౌము
నలవాని వేగ నీయంసంబునందు
నెలమిమై నిడికొని యిటకుఁ దెమ్మనిన
శ్రీరంగవిభుమాట చెవిసోక లోక
సారంగముని మానసమున నుప్పొంగి

కమలజాదులకునుం గనరానియట్టి
కమలలోచనుఁ డెంత కరుణించె నితని
జెదర కమ్మౌనీంద్రుఁ జెందుభాగ్యంబు
తుదినెన్న నారదాదులకైనఁ గలదె?
యనుచుఁ గవేరకన్యక దాఁటిచేరఁ
జనుదెంచి యాలోకసారంగమౌని
తనుబట్టఁ గమకించు తలఁపు డెందమునఁ
గనియుఁ గాననివానిగతిఁ జక్కనిలిచి
గ్రక్కునం దనుబట్టఁ గదిసినం జూచి
యెక్కడ వచ్చెద వెఱుగవే నన్ను
రాకు రాకు మటంచు రయమునఁ గదలఁ
బోకు పోకు మటంచుఁ బొంచిపోనీక
బలువిడివడిఁ గూడ బరతెంచి యతని
జల పట్టిపట్టి భుజంబుమీఁదటను
ఎక్కించుకొనుచు రంగేశు సన్నిధికి
మక్కువఁ దో తేర మౌనివాహుండు
చేరంగ నేగి రాజీవాస్త్రగురుని
శ్రీరంగనాథుని సేవించి పొంగి
యమలుఁ డై యాదినాయకుఁ డైన నన్నుఁ
దమదాసులకు దాసుఁ దగఁజేసి రంగ

రమణుఁ డౌ వేంకటగ్రావేశుపాద
కమలముల్ నాకన్నుగవ నెలకొనియె
నలఘుప్రసన్నుఁ డై యఖిలలోకములు
గొలిచి దైత్యుల గాడకులముల నఱకి
కౌతుకంబున నొప్పు కాకుస్థతిలకుఁ
బీతాంబరంబునం బెరసె నాతలఁపు
చక్కని వేంకటేశ్వరు బ్రహ్మఁ గన్న
పొక్కిలి యరసంజపొలుపు లల్లార్చి
సిరిమించు నొయ్యారి చెంగావివలువఁ
బరికింప నాప్రాణపద మై తనర్చె
బవరాన లంకాధిపతిపదితలలు
తివుట నొక్కమ్మునఁ ద్రెళ్ళంగసేసి
మధుపానమధుమత్తమధుకరజాల
మధురనాదంబుల మా నగ్గలించి
మొనసిన పెనుదేఁటిమూఁకల మొగలు
లనియాడునమ్ముల యలరంగ భూమి
నుల్లసించిన దేవు నుదరబంధంబు
నుల్లంబులోన నా కుల్లసిల్లెడిని
మున్నింటిఘోరాఘములవేరుఁ ద్రెవ్వ
నన్నింటిఁ దనకృపయనుకత్తిఁ దఱగి

తనవానిఁ జేసి నాతలఁపులో నిలిచి
తనరారు శ్రీరంగధారుణీనాథు
సిరులు దేరుచునున్న శ్రీవత్సతలము
కరమర్థి నను బంటుగాఁగఁ గైకొనియె
హరు బ్రహ్మహత్యవాయఁగఁ జేయురంగ
వరు నజాడంబులు వడిమ్రింగుచుండు
కమనీయకరమైన గళము నన్నిపుడు
ప్రమద మెలర్పంగ బంటుగా నేలె
ధగధగం దళుకొత్తుదరము చక్రంబు
నొగిఁబూనిశేషుపై నొప్పురంగేశు
నిగనిగ మనుచుఁ దేనియసోనఁ గురియు
చిగురుకొమ్మోవికిఁ జిక్కె నాతలఁపు
గండుదుమ్మెదలతోఁ గనుపట్టు వికచ
పుండరీకములసొంపులు దువాళింపఁ
దెలుపులై నలుపులై తేట కెంజాయ
లొలయంగ నొప్పు నీయురగేంద్రశాయి
కన్ను దామరలవికాస మెంతయును
నన్ను నీవేళ మిన్నక డక్కఁగొనియె
ఘనజగత్త్రయమును గడుపులో నునిచి
తనర నొక్కట వటదళ శాయియైన

యీరంగనాథుని నిందిరతోడ
హారజాలంబుల నలరు నెమ్మేను
ఎట్టిచిత్రమొ కాని యిట్టె నాతలఁపు
గట్టిగాఁ దనసొమ్ముగాఁ జేసికొనియె
నవనీతచోరుండు నామనోహరుఁడు
నవిరళశుభమూర్తి యగురంగశాయిఁ
గనుఁగొన్న యీతనకనుదోయియొండు
గనకుండుఁ గా కనుక్రమము దీపింప
దానవారాతిడెందముఁ బ్రవేశించి
లీనమై తొంటిపోలిక నుండె నతఁడు
హితమతి మునియంస మెక్కినకతన
నుతికెక్కె మునివాహనుం డనుపేర
ఘనభక్తి నీయోగికథ యెవ్వరేని
వినిన వ్రాసినఁ జదివిన నుతించినను
నిచ్చ బొంగుచు నిందిరేశుండు సిరికి
నిచ్చిన చన విచ్చు నెడపక యనుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి

నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళపాకాన్వయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాధ
కృతమైన పరమయోగివిలాసకృతిని
యతులితం బగు తృతీయాశ్వాస మయ్యె.



  1. కలదు.
  2. మందాకినీలోల.
  3. జనకుఁ డంతటను.
  4. నిమ్ము.
  5. శేఖరముగ
  6. బలుముకో.
  7. పానాకపాటుల.
  8. నొనరించి.
  9. కాళ్ళాడక దండ.
  10. ప్రియ.
  11. మముఁబాడు తముఁబాడు.
  12. గలదు.
  13. బుట్టుచును దావి.
  14. రాజబృందము దీనరాజబృందంబు.
  15. జారుకొనఁగ.
  16. గాదాన.
  17. వేఱొండు నెఱుఁగ.
  18. గట్లయి గట్లయి కామునిపసిఁడి, జట్లయి జట్లయి చలఁగుపాలిండ్లు
  19. ఘళలు.
  20. నిలనీలుఁ డగుచు
  21. పేలి
  22. తెలినీరు
  23. జాలి
  24. దవసంబు
  25. దీపావళులందు
  26. మిన్నకచెప్పిన
  27. యసా
  28. గట్టిక.
  29. రింటికిని
  30. భారిక, పౌరిక
  31. రిట
  32. బ్రద్దల.
  33. దమినిబో
  34. యొకయంత
  35. వింబది
  36. దా నో రెటులాడె
  37. నిర్జితపాపకల్మషులు

  38. గగనంబు కలశాబ్దిఁ గనుపట్టు విష్ణు
    పగిదిఁ జూపట్టె నెప్పాటఁ జింతింప—ప్రత్యంతరము.
  39. గింటెంబు