పద్మపురాణము/షష్ఠాశ్వాసము

పద్మపురాణము

ఉత్తరఖండము - షష్ఠాశ్వాసము

క.

శ్రీరామాచల[1]రాజ
శ్రీరమ్యారూఢ నయవిశేషణకృత్యా!
పారావారగభీర! ద
యారసహృదయారవింద! యబ్బయకందా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె;
నట్లు పరమధామమహత్త్వంబు విని గిరిరాజనందన శంకరుం
గనుంగొని యప్పరమేశ్వరుండు నిత్యవిభూతియగు పరమపదం
బున నుండి యేమి కతంబున ప్రకృతివిభూతిం బ్రవేశించు. శుద్ధ
సత్త్వసంపన్నుండై యుండి సత్త్వరజస్తమోగుణంబులం
బొందం గారణం బేమి? యింతయు వినవలతు నాన తిమ్మని
యడిగిన నమ్మహాదేవికి రుద్రుం డిట్లనియె.

2


ఆ.

పరమపదమునందుఁ బద్మాసమేతుని
నిత్యముక్తసేవ్యు నిగమవినుతు
విష్ణుఁ జూచి ప్రకృతి వినమితవదనయై
కరపుటంబు మౌళిఁ గదియఁజేసి.

3


సీ.

తుభ్యం నమో దేవ! దురితనివారణ!
         విశ్వరూపాత్మక! విశ్వధామ!
పురుషోత్త మాచ్యుత! భువనైకరక్షణ!
         సర్వదేవాత్మక! శార్జ్గపాణి!
శ్రీశ! నీలాధిప! యీశాన! వేదాంత
        వేద్య! జగన్నాథ! విబుధవంద్య!
కృష్ణ! నారాయణ! కేశవ! గోవింద!
       యవ్యయ! మురవైరి! హరి! ముకుంద!

తే.

పంకజోదర! బలరామ! పద్మనాభ!
వాసుదేవ! సంకర్షణ! వారిజాక్ష!
యాదిమధ్యాంతరహిత! యనాదిపురుష!
[2]నిర్గుణాత్మక! భవ! యపవర్గఫలద!

4


క.

సుజ్ఞానరూప! నిరుపమ
యజ్ఞపురుష! యజ్ఞభోక్త! యజ్ఞాంగ! మహా
ప్రజ్ఞానురక్త! జయస
ర్వజ్ఞ! జగన్నాథ! విబుధవంద్య! మురారీ!

5


తే.

నీకు మ్రొక్కెద హరి! కృష్ణ! నీలవర్ణ!
నీకు మ్రొక్కెద నత్యంతనిర్గుణాత్మ!
నీకు మ్రొక్కెద భువనైకనిబిడరూప!
నీకు మ్రొక్కెద లోకేంద్ర! నీరజాక్ష!

6


క.

పంచనవవ్యూహంబులు
సంచితవేదములు నీవ! యనిశము నిను సే
వించెద! నన్నుఁ బ్రసన్నో
దంచితమతిఁ జూడు మురుదయారసమూర్తీ!

7


వ.

దేవా! సర్వలోకోపకారార్థంబుగా నావిన్నపం బవధరింపుము.

8


శా.

నాయందున్న సమస్తజంతుతతి దైన్యంబొంది[3]పెంపేది తా
నాయుశ్శ్రీవిముఖాత్మమై విగతకర్మారంభమై శూన్యమై
యేయాధారము లేకయున్నయది దా నివ్వేళ నాకై తగన్
నీయారూఢదయార్ద్రదృష్టి యిచటన్ నెక్కొల్పవే కేశవా!

9


వ.

[4]ఈ ప్రకారంబున నాభువనంబు సృజియించి స్థావరజంగమం
బులకుఁ జేతనంబు గలిగింపుము. ధర్మాధర్మంబులును సుఖక్లేశం
బులును నీకటాక్షంబునన సంభూతంబు లగు నట్లగుటం జేసి నా
యందుఁ బొంది యింతయు నుద్దరింపుము.

10

క.

అని విన్నవించు మాటలు
విని కరుణ దలిర్ప మోము వికసిల్లఁగ న
న్వనరుహనేత్రుఁడు ప్రకృతిం
గనుఁగొని వెస నందుఁ బొందెఁ గడునెయ్యమునన్.

11


తే.

అఖిలజగదీశ్వరుండగు నచ్యుతుండు
ప్రకృతితోఁ గూడి కేవలప్రకృతిపురుషుఁ
డనఁగ లీలావిభూతిఁ బెం పగ్గలించి
[5]ప్రకటమగు సృష్ టిసేయ నుపక్రమించె.

12


వ.

అపుడు బ్రహ్మాదిభూతంబులకు నాదియైన మహత్తును నమ్మహ
త్తునకు నహంకారంబును నయ్యహంకారంబునకుఁ బంచతన్మా
త్రలునుం బంచతన్మాత్రలకుఁ బంచభూతంబులునుం జనియించె
నందుఁ బ్రథమభూతంబైన యాకాశంబునకు వాయువును వాయు
వునకు నగ్నియును నగ్నికి నుదకంబును నుదకంబునకుం
బృథివియుం బుట్టె. ఆయాకాశాదిభూతంబు లేకోత్తరగుణకంబులై
యుండు నందు శబ్దస్పర్శరూపరసగంధంబులు పుట్టె. తద్గుణ
మిశ్రంబున బ్రహ్మాండంబు పుట్టె. దానివలనఁ జతుర్దశభువనం
బులు పుట్టె. అందు బ్రహ్మాదిదేవతలును దేవమనుష్యస్థావర
[6]తిర్యగ్విధంబులై చతుర్విదభూతంబులును బుట్టె. అవియును
దత్తత్కర్మానురూపంబుల దేవాదియోనులం బ్రవేశించి ప్రకృతి
యందుఁ బొంది యాత్మం జనియించుచు నింతకుఁ గారణభూతం
బైన నారాయణుచేత నియమితంబయిన యిది మహాసర్గంబునాఁ
బడునని చెప్పిన విని పార్వతి యి ట్లనియె.

13

బ్రహ్మాదిసంభవప్రకారము :

చ.

పురహరసృష్టియం దఖిలభూతములున్ జలజాసనాద్యమౌ
సురనికరంబు నేగతిఁ బ్రసూతి వహించెను సర్వలోకసుం
దరుఁ డగు విష్ణుదేవుఁ డవతారము లేగతిఁ [7]దాల్చె నంతయున్
బరువడి విస్తరింపు మని పల్కిన గౌరికి శంభుఁ డిట్లనున్.

14

తే.

పొనర గగనంబు మొదలైన భూతసమితి
జనన మొనరించి తన్మధ్యమునఁ బయోధి
నుదయ మొందించెఁ బెంపున నొదవ నట్టి
వనధిమధ్యంబున దొకవటము పుట్టె.

15


సీ.

ఆవటవర్ణంబునందుండి యచ్యుతుం
         డఖిలభూతములందు నధిగమించి
భువనప్రపంచంబుఁ బుట్టింప మదిఁ గోరి
         యోగనిద్రాసక్తి నొంది పెక్కు
గాలంబు గ్రీడింప లీలఁ గళాకాష్ఠ
        ముల నొప్పుకాలంబు మొగి జనించె
నప్పు డవ్విభునాభి ననుపమం బగు పద్మ
        ముకుళంబు మెల్లన మొగడ విరియ


తే.

నందుఁ బ్రద్యుమ్ను నంశంబునందుఁ బుట్టి
యజుఁడు సర్వంబుఁ బుట్టింప నాత్మఁ గోరి
యోగమాయాసమేతుఁడై యున్న యతని
చతురలీలల నిట్లని సంస్తుతించె.

16


సీ.

జయ జయ యుత్పత్తిసంహారకారణ!
        విశ్వరూపాత్మక! విపులగాత్ర!
లీలామనోహర ! కాలాత్మ ! శ్రీనాథ !
        పరమాత్మ! శివ! పరబ్రహ్మరూప!
వాసుదేవాచ్యుత! వరద! నారాయణ!
        శార్జ్గి! యథోక్షజ! చక్రపాణి!
వేదస్వరూప! దామోదర! హరి! కృష్ణ!
        కల్యాణగుణపూర్ణ! కమలనయన!


తే.

నీకు మ్రొక్కెద! నత్యంతనియమ మెసఁగ
నోలి నీయందు సర్వంబు నునికిఁ జేసి
నీవు నిద్రింప మేల్కన నిఖిలమునకు
లయముఁ బుట్టువు నగుఁ బద్మనయన! కృష్ణ!

17

క.

కారణము కార్యకర్తలు
సారాంశము శుద్ధసత్త్వసంపన్నతఁ బెం
పారెడు నీ కీనిద్రకుఁ
గారణ మిది యేమి మేలుకను మఖిలేశా!

18


తే.

దేవ! సర్వేశ! ననుఁ గృపాదృష్టిఁ జూచి
నీ శరీరమునందున్న నిఖిలజగము
నుదయమయ్యెడువిధమెల్ల నొనరఁ జెప్పి
నాకుఁ గృపసేయు మిప్పుడు లోకనాథ!

19


వ.

అనినం బరమేష్ఠి పలుకు లాకర్ణించి యప్పరమేశ్వరుండు యోగ
నిద్రవలన మేల్కని తచ్ఛయనంబునం గూర్చుండి లోకంబులు
పుట్టింప నుపక్రమించి కొంతసేపు నిమిలీతాక్షుండై [8]చింతించు
చుండ నుదకమధ్యంబున జగదద్భుతాకారంబై హిరణ్మయం బగు
నొక్కయండం బుదయించెఁ దత్కటాహమధ్యంబునందుఁ
జతుర్దశభువనంబులును సప్తసాగరకులపర్వతసమేతంబుగా
భూతధాత్రియు నుదయించెఁ దద్బ్రహ్మాండమధ్యంబున కెల్ల
నధిపతిగా బ్రహ్మ నాజ్ఞాపించి తదనంతరంబ.

20


సీ.

శ్రీనాథుఁ డొకకొంత చింతింప నలికభా
        గమునందు సన్నంపుఁజెమట [9]పుట్టె
నది [10]బుద్బుదాకారమై భువిం బడుటయు
        నందు మహాశూలహస్త మమర
[11]మేలికెంజడలతో ఫాలలోచనముతో
        నపు డేను జనియించి యతనిమ్రోలఁ
బని యేమి నా కని వినమితాంగుఁడనైన
        ననుఁ జూచి నవ్వుచు నగధరుండు

తే.

సకలలోకంబు లెల్లను సంహరింపు
రుద్రభీమాహ్వయంబుల రూఢికెక్కు
మనిన నద్దేవు నానతి నర్థిఁ జేసి
లీలఁ బొలియింతు నాయాయివేళ[12]లందు.

21


వ.

మఱియు నద్దేవుండు తనదు నేత్రయుగళంబునం జంద్రసూర్యు
లను, శ్రోత్రంబులయందు వాయువును దిక్కులను, ముఖంబున
నింద్రాగ్నులను, నాసికను మైత్రావరుణులను, బాహుయుగ
ళంబున నశ్వినులను సంధ్యామరుద్గణంబులను, రోమకూపంబుల
నోషధులను వనంబులను, త్వక్కున శైలసముద్రంబులను
గవాదిపశుపక్షిజాతంబును, వదనంబున బ్రాహ్మణులను, భుజం
బుల క్షత్రియులను, ఊరువుల వైశ్యులను, పాదంబుల శూద్రులను
బుట్టించి తాను సకలభూతంబులం బ్రవేశించి సచేతనులం గావించె
నట్లు గావున సనాతనుండగు విష్ణుండు జగత్ప్రాణుండై జగదుత్పత్తి
స్థితిలయకార్యంబులు గావించుచుఁ ద్రిగుణాత్మకుండై త్రివిధ
నామంబుల విహరించుచుండు నది యెట్లనిన.

22


తే.

బ్రహ్మయును దానె మఱి ప్రజాపతులయందు
నంతరాత్మయుఁ దానెయై యఖిలజగము
నురుతరంబుగఁ బుట్టించుచుండు నెపుడు
నున్నతస్థితితోడఁ బ్రద్యుమ్నుఁ డనఁగ

23


క.

మనువులయందును ఘనులగు
జననాథులయందుఁ దాన సంప్రాప్తుండై
యనుపమముగ రక్షించుచు
ననిరుద్ధుఁ డనంగ నెగడు నచ్యుతుఁ డెపుడున్.

24


వ.

సంకర్షణరూపంబు దాల్చి విద్యాబలసమన్వితుండై కాలస్వరూ
పంబున రుద్రయమహృదయంబులం బ్రవేశించి జగత్సంహా
రంబు గావించును అవి యద్దేవుని యంతర్యామ్యవస్థ లనంబడు
మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ దశరథరామ

బలరామకృష్ణ కల్క్యాద్యవతారంబులు, విభవావస్థ లనంబడు అందు
నృసింహరామకృష్ణాద్యవతారంబులు షాడ్గుణ్యయుక్తంబులు.
తక్కిన యవతారంబులు దీపంబువలన నుదయించిన దీపంబులుం
బోలె నమ్మహామూర్తివలన నుదయించి యంద యణంగు నని
చెప్పి శంకరుండు వ్యూహభేదంబులు చెప్పెద విను మని గిరిజకు
నిట్లనియె.

25

శంకరుండు పార్వతికి చతుర్విధవ్యూహప్రకారంబు నెఱింగించుట :

సీ.

వైకుంఠపురమన వైష్ణవం బన సిత
         ద్వీపంబు నా మఱి వెలయు దుగ్ధ
వారాశి యను పేళ్ల వరుసను నాలుగు
         వ్యూహంబులును ధాత్రి నొప్పు నందు
వైకుంఠపుర మన వారిమధ్యంబున
         నా పరమపదంబు నట్ల యెసఁగు
కోటివహ్నిప్రభఁ గొమరారు సంతాన
         తరువనావలిచేత ధన్య మగుచు


తే.

మణిమయం బైన దివ్యవిమానకోటి
చుట్టురా నొప్పి బహురత్నశోభి యగుచు
నిఖిలసౌభాగ్యరమ్యమై నెగడుచుండు
దివ్యసేవ్యంబు వేదవతీపురంబు.

26


వ.

మఱియుఁ బంచపద్మయోజనాయతవిస్తృతంబై కనకమయ
ప్రాకారతోరణంబులును చండకుముదాదిసురక్షితచతుర్ద్వారంబు
లును బహురత్నప్రభావిభాసమానశాతకుంభ[13]సమూహ
గేహంబులును, సహస్రయోజనోత్తుంగశృంగమంగళసౌధంబు
లును సర్వలక్షణయౌవనసంపన్నులగు దంపతులును శ్రీమదష్టా
క్షరమంత్రసిద్ధులును షోడశవిధభక్తిప్రవీణులును నానారత్న

విభూషణదివ్యమాల్యాంబరానులేపనవిరాజమానులును విష్ణు
ప్రతిమానరూపులగు దివ్యపురుషులును గలిగి విలసిల్లు నందు.

27


సీ.

పొంది క్రమ్మఱి రాక భోగసంపన్నులై
       హరిమ్రోలఁ [14]బాడుచు నాడువారు
విష్ణుసన్నిధి నిల్చి వెలయు నవ్విభునట్ల
       నిత్యసౌఖ్యంబుల నెగడువారు
స్వర్గవైభవములు సరుకుగాఁ గొనకయు
       నవ్యయానందంబు లందువారు
కర్మబంధంబులఁ గడతేర్చి [15]గోవింద
       భక్తినిత్యాత్ములై పరఁగువారు


ఆ.

గలిగి సకలలోకఫలభోగనిలయమై
యజభవామరులకు నందరాక
శ్రీవిహారలీలఁ జెన్నొంది మిన్నందు
ధన్యసౌఖ్యకరము తత్పురంబు.

28


వ.

తన్మధ్యప్రదేశంబున సూర్యకోటిప్రకాశంబై వివిధమణిస్తంభం
బులు గలిగి చెలువొందు దివ్యవిమానంబు నందు నాధారశక్తి
యుక్తంబగు హిరణ్మయపీఠంబునం దష్టదళకమలంబు మంత్ర
బీజాక్షరరమ్యంబై పొలుచుఁ; దత్కర్ణికను లక్ష్మి నీలాయుక్తయై
యుండు; నందు శంఖచక్రగదాపద్మహస్తారవిందుండును
గేయూరకటకాంగుళీయక కుండలకిరీటాలంకారుండును దివ్య
మాల్యానులేపనవిరాజితుండును కోటికోట్యర్కదేదీప్యమానుం
డును నగు నారాయణుండు సుఖాసీనుండై యుండు నద్దేవు
దక్షిణభాగంబున నఖిలరత్నకిరణపరికరపరివృతాలంకారయు
దివ్యచందనమాల్యాంబరధారిణియుఁ గనకకమలమాతులుంగ
సువర్ణపాత్రాభయహస్తాంబుజయునగు మహాలక్ష్మి సుఖాసీనయై
యుండు మఱియును.

29

చ.

చిలుకయు ధాన్యపాత్రికయుఁ జేతుల రెంట ధరించి రెంటఁ జెం
గలువలు గ్రాల దివ్యమణికాంచనభూషణచందనాంబరం
బులు దగఁ బూని నీలమణిపుత్రికయో యన నాథుఁ జేరి పెం
పలరు వసుంధరారమణి యవ్విభు[16]చూడ్కికి నక్కజంబుగన్.

30


క.

విమలాదులైన శక్తులు
సమధికవిభవమునఁ జేరి చామర లిడఁగాఁ
గమలాక్షుఁ డొప్పు మెఱుఁగుల
గమినడుమఁ జెలంగు నీలకంధర మనఁగన్.

31


ఆ.

నిత్యముక్తు లధికనిరతు లష్టాక్షర
మంత్రసిద్దు లెలమి మరగి కొలుతు
రిన్ని చెప్పనేల? యెపుడుఁ బరమపద
మందుఁ గలుగువార లెందుఁ గలరు.

32


వ.

అని ప్రథమవ్యూహవిశేషంబుఁ జెప్పి మఱి ద్వితీయవ్యూహంబు
చెప్పెద నాకర్ణింపుమని ప్రమథనాథుండు పార్వతి కిట్లనియె.

33


సీ.

నిఖిలలోకంబుల నిత్యమై వైష్ణవం
        బనుపేర నొప్పారు నచట వినుము
శుద్ధసత్త్వంబును శుభదంబు దివ్యంబు
       నమృతమయంబును నై వెలుంగు
దిననాథశతకోటిదీప్తమై పొలుపారు
       నజభవాదుల కంద నలవిగాదు
కనకమయంబైన కల్పవృక్షంబుల
      నమృతంపునదులను నమరియుండు.


తే.

కొమరు మిగిలిన వైడూర్యకుట్టిమముల
మణివిరాజితమగు హేమమందిరములఁ
బసిఁడికోటల గోపురప్రాంగణముల
నమరు నచ్చటు వర్ణింప నలవి యగునె?

34

క.

కోయిలలు సామగానము
సేయుచు నేప్రొద్దు నచటఁ జెలఁగుచునుండుం
బాయక శుకచయము సహా
ధ్యాయిగ నచ్చోటఁ గలుగు [17]నారామములన్.

35


తే.

అట్టి లోకంబు నడుమఁ బెం పగ్గలించి
ద్వారవతినాఁగ నొప్పారు తోరణముల
[18]మడుఁగులఁ బసిండిమేడల మందిరముల
[19]వప్రములచేత నప్పురవరము వొలుచు.

36


సీ.

యౌవనంబునఁ బదియాఱేండ్లప్రాయంబు
        వారయా పురిగల వనిత లెల్లఁ
బంచబాణునికంటె మించినరూపులఁ
        బొల్తు రచ్చటఁ గల పురుషు లెల్లఁ
జెలి లచ్చితో నాడు చెలికత్తియలయందు
        బెనుపొంద వర్తించు పేరటాండ్రు
దైత్యారివెంటఁ దద్ధామంబునందుండి
       చనుదెంచినార యచ్చటి గృహస్థు


ఆ.

లనఁగ నిత్యలక్ష్మి కాధారభూతమై
వగయు వగయులేక నిగమవితతి
మ్రోయుచుండ సిద్ధమునినాథసేవ్యమై
యొప్పు మిగులుచుండు నప్పురంబు.

37


వ.

మఱియు ననేకమణిమయాలంకారులును దివ్యాంబర[20]స్రగ్గం
ధాదివిరాజితులును శంఖచక్రఖడ్గగదాహస్తులును హరిభక్తి
పరాయణులును నగు పురుషు లతిమనోహరాకృతులును లక్ష్మీ
సమానలావణ్యవతులును గనకకమలపాణులు నగు సుందరులతోఁ

గూడి యింపులు పొంపిరివోవఁ గృష్ణలీలలను బాడుచు నాడుచు
నిరంతరసుఖానుభవులై క్రీడించు నెడలును గలిగి విలసిల్లు నగర
మధ్యంబున వివిధమణివిచిత్రరచితంబులగు ప్రాకారంబులును
బహుద్వారగోపురంబులును దివ్యగంధకుసుమామోదబహుళం
బులును నగు వాసుదేవమందిరంబుల సుందరంబై యుండు
నందుఁ బారిజాతంబుక్రిందం గనకమణివిచిత్రపర్యంకంబున.

38


సీ.

శశిశంఖసన్నిభసౌమ్యదివ్యాంగంబు
         దివ్యభూషణరాజిఁ దేజరిల్లఁ
గైలాసగిరిమీఁద బాలాతపము మాడ్కిఁ
         జెలువారు పీతకౌశేయ మెసఁగఁ
గటకమణిస్ఫూర్తిఁ గనుపట్టు కరముల
         దివ్యాయుధంబులు దేజరిల్ల
మందస్మితోపేతసుందరాననమున
         మకరకుండలరశ్మి మారుమలయ


తే.

వక్షమునఁ గౌస్తుభద్యుతు లక్షయముగ
సతతయౌవనయుక్తుఁడై చతురలీల
వాసుదేవుండు దివ్యసింహాసనమున
నఖిలయోగీంద్రసేవ్యుఁడై యలరుచుండు.

39


వ.

మఱియును.

40


తే.

[21]అరయ నవ్వాసుదేవుని యురమునందు
నిత్యశృంగారత్రిభువనస్తుత్యలక్ష్మి
మేఘమునఁ జెంది వికసించు మెఱుఁగుమాడ్కి
సంతసంబునఁ గాపుండు సంతతంబు.

41


వ.

మఱియు నద్దేవియంశంబులు దాల్చి సతియు రుక్మిణియు
సీతయు పద్మాలయయు శివయు లక్షణయు నీలయు రతియు

నను నామంబులం గలిగిన యష్టశక్తులు నద్దేవిం గొలిచి
యుండ్రు శంఖచక్ర[22]శార్జ్గంబులు పురుషరూపంబులు వహించి
యాలోకంబు రక్షించుచుండు నది ద్వితీయవ్యూహం బని చెప్పి
వెండియు.

42


క.

వ్రతముల నుపవాసంబులఁ
గ్రతువుల నధ్యయనములను గలుగదు లక్ష్మీ
పతిపురము ద్వాదశాక్షర
యుతమంత్రప్రవణులైన నొదవుం దరుణీ!

43


క.

హరిమంత్రము జపియించుచు
హరిభక్తిరసాబ్ది నోలలాడుచు నెపుడున్
హరిదాసులైన పుణ్యులు
హరిపదమునఁ జెంది మరల రంబుజనయనా!

44


వ.

మఱియు ద్వితీయవ్యూహంబు చెప్పెదఁ జిత్తగింపు మని సర్వ
మంగళకు సర్వజ్ఞుం డిట్లనియె.

45


శా.

శీతాద్రీంద్రతనూభవా! విను మహాశ్రేయస్కరంబై జగ
త్ఖ్యాతంబైన జలాబ్ధి యుత్తరమునం దారూఢమై నిత్యమై
పూతంబై హరిభక్తియోగజనితాభోగాఢ్యమై రమ్యమై
శ్వేతద్వీపము శుద్ధసత్త్వమయమై చెన్నారు నత్యున్నతిన్.

46


వ.

అందు బ్రహ్మమానసపుత్త్రులైన సనక సనందన సనాతన సనతు
జాత సనత్కుమార వంశశిఖాదులగు పరమయోగీశ్వరులును పరమ
విరక్తులును భగవద్భక్తిరసామృతసేవకులును నరనారాయణు
లును హరిసన్నిధి ననవరతంబును సేవింతురు ధవళాంశుకోటి
సంకాశంబును నానారత్నమయంబును నంతానతరులతాకీర్ణంబును
వికచకమలకుముదగంధబంధురజలాశయయుతంబును నై
పొలుపు మిగిలిన యద్దీవిమధ్యంబున నమరావతిపురంబు గల
దది యెట్టిదనిన.

47

సీ.

బహురత్నభూషణప్రభలఁ జెన్నమరెడు
         మానితదివ్యవిమానములను
నిత్యయౌవనముల నిత్యులై సంపదఁ
         బెంపారి వర్తించు దంపతులను
బటు[23]భద్రగోపురప్రాసాదతతులను
         మానైన యప్పురీమధ్యమునను
బాలార్కశతకోటిభాతి నక్కజమైన
         రత్నహాటకచిత్రరచన మెఱసి


తే.

లలితసౌగంధికామోదమిళిత మగుచు
దివ్యకాంతాసహస్రంబు తేజరిల్లు
సామగానంబు లులియంగ సౌమ్యలీల
రమణ నొప్పారు నంతఃపురంబు నడుమ.

48


వ.

దివ్యమణిస్తంభశోభితంబగు మండపంబున నుదయార్కసంకాశం
బగు సింహాసనంబునందు.

49


సీ.

సప్తకాంచనకాంతిఁ దనరు సౌమ్యాంగంబు
         వలుద ముత్యాలపేరులు దనర్పఁ
గటకకేయూరాదికలితహస్తంబులఁ
         జక్రాదిసాధనసమితి మెఱయఁ
గనకపంకజకాంతిఁ గనుపట్టు నడుగుల
         బహురత్ననూపురప్రభలు వెలుఁగ
నర్ధేందుగతి నొప్పు నలికంబు కుంకుమఁ
        గొమరారు నూర్ధ్వపుండ్రమున నొనరఁ


తే.

గర్ణకుండలమౌక్తికకమ్రరుచులు
గండమండలముల వింతకాంతిఁ జేయ
నమృతఫేనాంశురుచిరవస్త్రములు పూని
కనకపీఠంబుపై జనార్దనుఁడు వొలుచు.

50

వ.

ఇట్లు షోడశవర్షసమానవయస్కుండును నఖిలజగన్మోహనాకారుం
డును యోగిజనహృదయగమ్యుండునునై సుఖాసీనుండగు నద్దేవు
వామాంకంబున శీలరూపవయోగుణంబుల సమానయై కనక
చంపకప్రసూనప్రతిమానశరీరయు సర్వలక్షణసంపన్నయు
దివ్యాంబర[24]స్రగ్గంధభూషణాలంకారయు ముక్తాఫలకనక
[25]కమలమాలావిభూషితయు వసుపాత్రమాతులుంగదర్పణాం
బుజహస్తచతుష్టయము భక్తజనాభీష్టదాయినియు నగు కమ
లాలయ సుఖాసీనయై యుండు మఱియు నద్దేవియంశంబు
దాల్చి ముకుందునిం బరివేష్టించి.

51


తే.

వఱలు జాహ్నవి పద్మయవాచ్ఛయీశ
సరసిజాలయ సావిత్రి సర్వగమన
యన మహాదేవి యనఁ బేర్చి యష్టశక్తు
లై భజింతురు చామరహస్త లగుచు.

52


వ.

మఱియును శ్రద్దయు మేధయుఁ బ్రజ్ఞయు ధారుణియు శాంతియు
శ్రుతియు స్మృతియు ధన్యయు వృద్ధియు మనీషయు ననువీరలు
మొదలుగాఁ గల దాసీజనంబులును, అనంత గరుడ విష్వక్సేనాది
కింకరులును, సంధ్యా మరుద్గణాది దేవతులును, యోగివరులును
మూర్తిమంతులై యజ్జనార్దనుం గొలిచి నిత్యసుఖులై యుండు
దురు మఱియును.

53


ఆ.

విష్ణుభక్తిలేని వేదయజ్ఞవ్రత
దాననిరతులైన ధన్యులైనఁ
బొందలేరు విష్ణుభువనంబు హరిసేవ
గలుగువారి కచటఁ గలుగు నబల!

54


మ.

హరినామంబులు భక్తిమైఁ దలఁచి నిత్యంబు న్మహానిష్ఠతో
హరిపూజారతులై యనన్యహృదయవ్యాపారులై సర్వమున్
హరియాయత్తము చేసి సత్త్వమతులై యద్దేవుపాదాబ్జత
త్పరులై యుండెడువారు తత్పదమునం బ్రాపింతు రబ్జాననా!

55

వ.

అని తృతీయవ్యూహమహత్త్వంబు చెప్పి శంకరుండు చతుర్థ
వ్యూహంబు వినుమని గిరిజ కిట్లనియె.

56


క.

లోకులఁ దగ రక్షింపఁగ
నాకుల కగు బాధ లుడుప నారాయణుఁ డు
త్సేకమున దుగ్ధవారిధి
నాకల్పస్థితి వహించు ననుపమలీలన్.

57


శా.

ఆదుగ్ధాంబుధిపై సహస్రఫణివిన్యస్తాద్యరత్నప్రభా
శ్రీ దైవాఱఁగఁ గుందచందనసుధాశీతాంశుసంకాశమై
వేదాంతస్ఫుటదివ్యవాక్యములచే విష్ణుం బ్రశంసించుచున్
మోదంబార ననంతతల్ప మొనరున్ ముల్లోకము ల్గొల్వఁగాన్.

58


వ.

అమ్మహాతల్పంబునం బద్మనాభుండు నీలజీమూతసంకాశుండును
నానారత్నవిరాజితదివ్యభూషణాలంకృతుండును శంఖచక్రగదా
పద్మహస్తుండును కర్ణికారకుసుమవిలసితపీతాంబరుండును హరి
చందనానులిప్తశరీరుండును బారిజాతప్రసూనకలితనీలకేశుం
డును అనవరతయౌవనుండును సర్వశరణ్యుండును సకలజన
కామితఫలప్రదుండునునై పవ్వళించి యున్న యప్పరమేశ్వరు
నురస్స్థలంబునందు.

59


సీ.

దివ్యభూషణముల దివ్యమాల్యంబుల
         దివ్యగంధంబులఁ దేజరిల్లి
చంద్రికాధవళవస్త్రము పూని [26]యనురూప
         యౌవనసంపద నతిశయిల్లి
యూర్ధ్వబాహులయందు నురుపద్మయుగళంబు
         పొలుపార హరి యురస్స్థలము బిగియఁ
గౌఁగిలించిన యట్టి కరయుగ్మ మేపార
         నురుతరసౌభాగ్యయుక్త యగుచుఁ

తే.

దనదు కడగంటిచూపులు దనరి కమల
భవభవాదుల కున్నతపదవు లొసఁగఁ
బద్మవాసిని కనకంపుఁబ్రతిమ యసఁగ
దివ్యసుఖలీల నొంది వర్తించు నెపుడు.

60


తే.

మానితంబగు దివ్యవిమానవితతిఁ
జెలఁగి కిన్నరచారణసిద్ధవరులు
పరమతాత్పర్యమున లక్ష్మిఁ [27]బ్రస్తుతింతు
[28]రడరి సమ్మదబాష్పంబు లడరుకొనఁగ.

61


క.

అభవకమలాసనాదులు
విభవం బఱి దనుజబాధ వినిపించుచుఁ ద
న్నభినుతులు సేయ వారల
కభిమతముల నిచ్చు దానవాంతకుఁ డచటన్.

62


వ.

అని చతుర్విధవ్యూహప్రకారంబు లెఱింగించి శంభుండు.

63


క.

వనజభవాదులకై నను
వినిపింపఁగ నలవిగాని విష్ణుపదంబుల్
విను సంక్షేపంబున నే
వినిపించితి నెఱిఁగినంత విమలేందుముఖీ!

64


క.

ఈహరివిలాసనిలయ
వ్యూహాఖ్యానంబు వినిన యుత్తములకు న
వ్యాహతసౌఖ్యము లధిక
స్నేహంబున నిచ్చుచుండు శ్రీవిభుఁ డెపుడున్.

65


వ.

అని విష్ణులీలామందిరంబులగు చతుర్వ్యూహంబుల నెఱింగించి
పార్వతిం గనుంగొని యింక నేమి విన నిష్టంబుగల దడుగుమనిన
నమ్మహాదేవి పతికి నిట్లనియె.

66

చ.

అనఘచరిత్ర! విష్ణుకథయంతయు నీదయ వింటి [29]నెమ్మదిన్
దనివి యొకింతలేదు; హరి దానవకోటుల నేమి కార్యమై
తునిమె? దశావతారములు దూఁకొనఁ గారణమేమి? యంతయున్
వినఁగ నభీష్టమయ్యెడి సవిస్తరభంగి నెఱుంగఁ జెప్పవే.

67


వ.

అనిన గౌరికి శంభుం డిట్లనియె.

68

శ్రీవిష్ణుదేవుని మత్స్యావతారకథనము :

క.

విను! మత్స్యాద్యవతారము
లనఘచరిత్రములు వైభవావస్థలు నాఁ
జను నవి హరివంశములై
యొనరుం దీపమున దీప ముదయించు గతిన్.

69


వ.

[30]పరావస్థాసమర్థుండగు పరమపదనాథునకు వ్యూహాదులు నవతా
రంబులు విభవంబులగు; నప్పరమేశ్వరుం డయ్యైకాలంబుల
వలసినట్ల విహరించుం గావున నవతారంబులు [31]తాత్కాలికంబు
లనంబడు; నది యెట్లనిన నారాయణు నాభికమలంబున నుద
యించి శతానందుండు సృష్టికర్తలగు భృగు మరీచ్యత్రి దక్ష
కర్దమ పులస్త్య పులహ క్ర త్వంగిరసు లనఁగా నవబ్రహ్మలం
బుట్టించె. అందు మరీచికిం గశ్యపుం డుదయించె. అక్కశ్యపు
నకు నదితి దితి కద్రువ వినత యనంగా నలువురు భార్యలు గలి
గిరి. వారియం దదితికిం బృందారకు లుదయించిరి. దితికి
ఘోరాకారులైన సోమకుండు హయగ్రీవుండు హిరణ్యాక్షుండు
హిరణ్యకశిపుండు జంభుండు [32]మయుండు నన నార్వురు పిశితా

శను లుదయించి యధికతపోనిరతులై ప్రవర్తిల్లుచుండిరి. అందు
మహావీర్యపరాక్రముండైన సోమకుండు సకలలోకంబులుం దన
బాహుబలంబున నోర్చి బ్రహ్మలోకంబు నాక్రమించి.

70


తే.

కమలసంభవు మోహితుఁగా నొనర్చి
నిగమములు మంత్రములతోన పిగుల దివిచి
కొని మహావార్ధి చొచ్చిన ననిమిషులును
మునులు నతిభీతులుగ జగములు గలంగి.

71


మ.

క్రతుకర్మంబు లణంగె; మంత్రములు దూరంబయ్యె; నానావిధ
వ్రతముల్ శీర్ణములయ్యె; వర్ణ[33]యుగధర్మంబుల్ గతంబయ్యె; నా
తతసత్యంబు నశించె: లోకములకున్ దైన్యంబు వాటిల్లె; దు
ర్మతుఁ డవ్వేదము లెత్తికొంచు జనినన్ బంకేజపత్రేక్షణా!

72


వ.

ఇట్లు సకలభువనంబులు భయభ్రాంతంబులై యాచారక్రియా
విహీనంబులై యుండె; నట్టియెడ ననిమిషమునిసంఘంబులు
వనజభవు కడకుం జని యత్తెఱం గెఱింగించి వారును నన్నలు
వయుఁ గూడుకొని చనుదెంచి ముందట.

73


స్రగ్ధర.

కనిరా బ్రహ్మాదిదివ్యుల్ గగనఘనఘనాకర్షకల్లోలవీచీ
జనితప్రత్యగ్రఫేనోజ్జ్వలవరకుసుమస్రగ్విలాసప్రకాశున్
ఘనలీలాయత్తదర్వీకరలలితఫణాగ్రస్ఫురద్రత్ననీరా
జనరమ్యున్ విష్ణులీలాసదనమున నతిస్తంద్రు దుగ్ధాంబుధీంద్రున్.

74


వ.

కని యమ్మహోదధి విమలమహిమాతిశయంబు గొనియాడుచుం
జనుదెంచి యగ్రభాగంబునఁ దెల్లదామరవిరిమీఁది తేఁటిచందం
బునఁ బున్నమచందురుమీఁది లాంఛనంబు తెఱంగున వెండి
కొండమీఁది నీలమేఘంబు కైవడి నతిధవళంబగు భుజంగపర్యం
కమునఁ దలగడయై బెడగడరు పడగలమణులకెంజాయ రంజిల్లి
కౌస్తుభరుచులతోఁ గలసి వెలుంగ నఖిలభూషణాలంకృతుండై

పవ్వళించి చాఁచిన చరణంబులు సిరి తొడలపై నిడుకొని [34]మెత్తన
యొత్త నారదాదిమునుల దివ్యగానంబులు చెలంగ నిద్ర మేల్కని
యరవిరితమ్మిఱేకులం దెగడు గనుదమ్ముల [35]నద్దేవతలం జూచి
యల్లన నగుచున్న యన్నీలవర్ణుం గనుంగొని సాష్టాంగదండ
ప్రణామం బాచరించి నిటలతటఘటితాంజలులై [36]యిట్లని స్తుతి
యించిరి.

75


దండకము.

శ్రీనాథ! నీలామనోనాథ! భూనాథ! మూర్తిత్రయీనాథ!
చక్రాంక! శేషాహిపర్యంక! కాలత్రయాతీత[37]లోకైకవర్తీ!
మృగాధీశమందాకినీహారమందారనీహారధామాభ్రవేదండ
డిండీరకర్పూరకైలాసకాశస్ఫురత్కీర్తిదిక్చక్రపూర్తీ! హరీ!
వాసుదేవా! మురారీ! మహాశైలధారీ! యనంతాచ్యుతా!
మాధవా! కృష్ణ! గోవింద! పద్మోదరా! పద్మపత్రేక్షణా! దేవ
దేవా! భవత్పాదపంకేజసంసేవనం గోరి యున్నార మిన్నీరధి
న్నీవు [38]దేల్చున్న నీచంద మెవ్వారు వర్ణింపగా నేర్తురయ్యా!
జగజ్జాలము న్లీలఁ బుట్టింప రక్షింపఁగా నీవ శిక్షింపగా నీవ కా
కన్యుఁ డొక్కం డిలం గల్గునే సర్వలోకాత్మ! భూతాత్మలం దుండి
సూక్ష్మ[39]స్వరూపంబులై నీవ వర్తింతు. నీ మూర్తితో సర్వ
లోకంబులం బొంది యిచ్ఛాగతిం జెందియుండంగ లీలాగతి న్నీవు
మఱ్ఱాకుపై బాలలీల వ్వినోదింతు నీ యంతరం బింత యంతంత
నన్ రాక లోకంబులెల్ల న్భవన్మాయచేఁ జిక్కియుండంగ నేరూప
మేప్రాయ మేపాక మేరీతి యే భాతిగా నిన్ను రూపింప
వచ్చున్ బరంజ్యోతి! వీ వాదిమధ్యాంతహీనుండ వంచున్ మహా

యోగివర్యుల్ సదా ధ్యానసంపన్నులై మౌనులై వల్లవాహారులై
కామినీదూరులై సర్వభోగంబులున్ మాని రాగంబులు న్మాని
హృత్పద్మమధ్యంబునం జిన్మయాకారునిం జూచిరే గాక కామంబు
నేమంబుగాఁ గొన్న మాబోఁటు లెబ్భంగి ని న్నందగా నేర్తు
రంభోజనేత్రా! జగన్మిత్ర! నీసత్కృపాలోకనారూఢి లేకున్న
లోకంబులెల్లన్ నిరాకారతం బొంద నింద్రాదిబృందారకుల్‌ గూడి
నీపాదపంకేజసంసేవనోద్యుక్తులై [40]వచ్చినా; రిట్టిచో నిద్ర
మేల్కాంచి మాపాటు లాలించి మమ్ముం దయాపూర్ణదృష్టిం
గటాక్షించి! రక్షింపు! లక్ష్మీకుచాలింగనోద్భాసివక్షస్స్థలా!
కైటభారీ! నమస్తే! నమస్తే! నమః!

76


క.

తరుణాంబుజదళలోచన!
కరుణామృతపూర్ణహృదయ! ఘనదితిసుతసం
హరణా! సురమునిసేవిత
చరణా! రిపుకంఠదళన! చక్రాభరణా!

77


వ.

అని యి ట్లనేకప్రకారంబుల స్తుతించు పద్మాసనాదిబృందారకుల
వాక్యంబులు విని పద్మనాభుండు నాగపర్యంకతలంబునం
గూర్చుండి వారలం గరుణార్ద్రదృష్టిం గనుంగొని కుశలం బడిగి
యాగమనప్రయోజనం బెఱింగింపుం డనినం గమలభవుం డిట్ల
నియె.

78


ఉ.

ఏమని విన్నవింతు జగదీశ్వర యెన్నఁడు లేని మాట [41]కా
సోమకుఁ డెల్లలోకములఁ జూరలు వుచ్చియు నంతఁబోక యు
ద్దామబలాఢ్యుఁడై నను ముదంబఱ మూర్ఛితుఁ జేసి నాశ్రుతి
స్తోమముఁ [42]గొంచుఁబోయి కడుదుర్మతియై [43]మకరాకరంబునన్

79

ఆ.

అణఁగె నంతనుండి యఖిలలోకంబుల
సకలధర్మములును సంచలించె;
దిక్కు నీవకాక యిక్కార్యమంతయు
నరసి ప్రోవ నెవ్వ రంబుజాక్ష!

80


క.

జగములకు భూతరాశికి
నిగమంబులయూఁత గాన నిగమము లణఁగన్
జగమెల్ల నణఁగుఁ గావున
నిగమాత్మక! వానిఁ జంపి నిగమము లీవే.

81


వ.

అనిన నద్దివ్యపురుషుండు వారల కభయం బిచ్చి యాప్రొద్ద కదలి
యతిభీషణరోషావేశంబున మహామత్స్యరూపంబుఁ దాల్చి [44]వనధి
గలంగి పిండలి వండుగునట్లుగాఁ బఱతెంచి తాఁకిన నయ్యిరువుర
కుం బోరు ఘోరంబయ్యె నయ్యవసరంబున.

82


లయవిభాతి.

బెడిదమగు తుండముల వడిఁ బెనఁచి యొండొరుల
         నొడిసి వెసఁ బట్టుకొని పుడమి యద్రువంగా
వెడవెడను నార్చుచును దడఁబడఁగ వ్రేయుచును
         వెడలు రుధిరంబు దివిఁ గడలుకొనఁ బై పై
నుడుగణము డుల్లిపడ జడనిధి గలంగ జవ
         మెడల కసమానగతిఁ గడఁగు పెనుదై త్యుం
దొడరి వెసఁ బుట్టుకొని మిడికిపడనీ కడరి
         నడుము దెగఁబాఱి తొడిఁ బడనడిచి చంపెన్.

83


వ.

ఇవ్విధంబున నవ్విరోధిం బరిమార్చి వానియుదరంబునందు
నున్న యామ్నాయంబులు పుచ్చుకొని యమ్ముకుందుండు
చనుదెంచి బృందారకబృందంబు లందంద స్తుతియింప నన్నిగ
మంబు లంబుజాసనున కిచ్చె; నన్యోన్యమిశ్రితంబులగు వేద

వేదాంగంబులం బద్మగర్భుండు సంగ్రహించుకొనియుండెఁ; బదం
పడి నారాయణుండు వ్యాసరూపంబు వహించి యవ్వేదంబులఁ
దెఱఁగువడ బుగ్యజుస్సామాధర్వణంబులుగా నేర్పఱిచి తదం
గమ్ములు సూత్రంబులుం జేసి యుద్దరించెనని మత్స్యావతారంబు
సవిస్తరంబుగా నెఱింగించి శంభుండు గిరిసంభవ కిట్లనియె.

84

కూర్మావతారకథ :

క.

దివిజేంద్రవంద్యుఁడగు హరి
యవిరళమతిఁ గూర్మరూప మగువిధమెల్లన్
వివరించి నీకుఁ జెప్పెద
నవధానముతోడ విను నగాధిపతనయా!

85


క.

అత్రికి నా యంశంబున
బుత్త్రుండై పుట్టినట్టి పుణ్యుఁడు తేజో
మిత్రుఁడు లోకభయదచా
రిత్రుఁడు దుర్వాసుఁ డతిగరిష్ఠుఁడు శక్తిన్.

86


ఉ.

అమ్ముని యొక్కనాఁడు ప్రియమారఁ జరించుచువచ్చి మేరుపా
ర్శ్వమ్మునఁ గిన్నరాధిపు లజస్రము దన్ను భజించుచుండఁగా
నిమ్ముల నొక్కయేఁ డచట నెంతయు వేఁడుక నుండి యేగె నా
కమ్మునకున్ శచీరమణుఁ గన్గొనఁ జిత్తము పుట్టి చెచ్చెరన్.

87


సీ.

అప్పుడు దేవేంద్రుఁ డఖిలదేవతలును
         దనుగొల్చి చనుదేర ఘనవిభూతి
నైరావతారూఢుఁడై చనుదెంచుచోఁ
         గనుఁగొని యమ్ముని గారవమున
సన్నుతించుచుఁ బారిజాతమాలిక చేతి
         కిచ్చిన నింద్రుండు నేనుఁగఱుత
వై చి తా నందనవనమున కేగిన
         [45]మదమున నది దండ గుదిచి పాఱ

తే.

వైవ నమ్ముని కోపించి [46]దేవవిభుని
గ్రూరదృష్టిఁ గనుంగొని కోపవహ్ని
మండి[47]తా నింత సేయు నీమహిమ వొలిసి
లచ్చియడఁగెడు మని శాప మిచ్చె నపుడు.

88


వ.

అ ట్లతిభీషణంబగు [48]శాపం బిచ్చిన నింద్రుండును దేజం బెడలి
పురంబునకు నరుగుదెంచె; నంత నమ్మునిశాపంబున రాజ్యలక్ష్మి
తొలంగిన దీనుండై యుండె[49]నద్దేవికటాక్షంబు నాశ్రయించి
సకలస్థావరజంగమంబులుం బ్రవర్తిల్లు; నట్టి యింద్రుని కలిమి
యంతర్ధానంబు నొందుటం జేసి మూఁడులోకంబులు సంపత్తి
శూన్యంబులై యుండె; నయ్యవసరంబున.

89


సీ.

కమలజామరదైత్యగంధర్వకిన్నర
         యక్షపన్నగమనుష్యాధిపతులు
పశుపక్షికీటకప్రతతులు జంగమ
         స్థావరాత్మకమైన జగము లెల్ల
నతిదరిద్రత నొంది యాఁకటఁ గడు డస్సి
        కూడు చీరలు లేక కుంద దొణఁగె;
వానలు గురియక వట్టిజలాశయం
       బులు సర్వతరువనంబులును నెండె;


తే.

నఖిలజనమును నిర్వీర్య మయ్యెఁ గ్రతువు
లణఁగె సర్వంబు శూన్యమై యవని చెడియె
మునిమహత్త్వంబు పెంపున మూర్తి సడలి
యమ్మహాలక్ష్మిచూ పెడయైనకతన.

90

వ.

ఇట్టి జగదుత్పాతనిమిత్తంబునకు సకలజనంబులు భయభ్రాంత
చిత్తులై మునుల కెఱింగించిన వారలు దేవతల కత్తెఱంగు
చెప్పిన విని యింద్రాదిదేవతలును మునులునుం గమలసంభవు
పాలికి వచ్చి దైన్యంబు దోఁపం బ్రణమిల్లి యవ్విధం బంతయు
నెఱింగించి యిట్లనిరి.

91


ఉ.

ఈనిఖిలోర్వియుం దలఁప నిందిర[50]చూడ్కిన వృద్ధిఁ బొంది సొం
పూనుట నట్టి లచ్చి వెలివోవుటఁ జేసి జగంబు లాఁకటన్
దీనతమై నశించెఁ బితృదేవగణంబులు హవ్యకవ్యసం
తానము లేమిఁజేసి ప్రమదంబఱి చేష్టలు దక్కి రెంతయున్.

92


క.

ఆఁకటను నీరుపట్టున
వీఁక చెడి నశింపఁ జొచ్చె విశ్వం బెల్లన్
దేఁకువ చెడకుండఁగ నీ
వీకఱ వెడలించి కావు విమలవిచారా!

93


వ.

అని విన్నవించిన దేవసంఘంబులం గనుంగొని పితామహుం
డిట్లనియె.

94


క.

సురలార! వినుఁడు చెప్పెద
సురపతి దుర్వాసుపేర్మిఁ జూడ కవజ్ఞా
పరుఁడైన నతనికతమున
భరమై భువనముల కెల్లఁ బ్రళయము వచ్చెన్.

95


ఆ.

అగ్నికల్పుఁ డైన యమ్మహాముని నవ
మానితాత్ముఁ జేయ మండి యతఁడు
శాపమిచ్చె నంత నీపాటు వాటిల్లె
జగములెల్ల బెగడ సడలె లక్ష్మి.

96


మ.

ఆ కంజాలయ విష్ణువల్లభ నిజాపాంగేక్షణోద్భూతలీ
లాకారుణ్యమునన్ జగంబులకు నుల్లాసం బొనర్చున్ దదా
లోకం బిప్పుడు లేమిచే నతిభయాలోకంబులై యున్నవి
ట్టీకీడ్పా టుడుపంగ వెజ్జుగలఁడే యేభంగులం జూచినన్.

97

తే.

[51]ఇట్టి యుత్పాతముల మన కెల్లయెడల
నుడుప నారాయణుఁడె కాక యొక్కరుండు
గలఁడె యటుగాన దుగ్ధాబ్ధినిలయుఁడైన
యతని నర్చింత మచ్చటి కరిగి మనము.

98


క.

అతఁడు ప్రసన్నుం డగుటయు
నతిశయముగ జగము తొంటి యట్టుల సౌఖ్య
స్థితి నుండు నట్లు గావున
మతి నిది నిశ్చయము రండు మన కందఱకున్.

99


వ.

అని విచారించి బ్రహ్మయు నింద్రాదిదేవతలును భృగుభరద్వా
జాదిమహామునులును యక్షకిన్నరగంధర్వపన్నగాదులును
దేవయోనులును వసురుద్రాదిత్యులును జనుదెంచి సకలసౌభాగ్య
రమ్యంబగు నమృతపయోధి యుత్తరతటంబున నందఱు నయ్యై
విధంబులం బురుషసూక్తవిధానంబుల నర్చించి యష్టాక్షర
మంత్రజపంబులను నానావిధస్తోత్రంబుల ననన్యచిత్తులై నారా
యణదేవు ననవరతంబునుం గొలుచుచుండ నద్దేవతల ముందట.

100


సీ.

శ్రీవత్సకౌస్తుభచిహ్నితోరస్స్థలుం
        డతులితపుండరీకాయతాక్షుఁ
డిందీవరశ్యామసుందరగాత్రుండు
        హాటకరుచిరపీతాంబరుండు
కనకకుండలకాంతిగండస్థలుండును
       నురురత్నఘనకిరీటోజ్జ్వలుండు
సురుచిరకటకనూపురహారభూషితుం
       డనుపమరూపయౌవనవిలాసుఁ

తే.

డంచితస్మితకలితముఖాంబుజుండు
శంఖచక్రగదాభయచారుహస్తుఁ
డతిజవోన్నతి గరుడవాహనము నెక్కి
యంబుజోదరుఁ డపుడ ప్రత్యక్ష మయ్యె.

101


వ.

ఇవ్విధంబునం బ్రసన్నుండైన నారాయణదేవునకు నందఱు
సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి నిలిచి కేలుదమ్ము
లలికభాగమ్ములం గదియించి యానందాద్భుతరసపరవశాత్ములై
యప్పురుషోత్తము ననేకప్రకారంబుల సంస్తుతించిరి. అప్పరమ
పురుషుండు నందఱఁ గరుణార్ద్రదృష్టిం గటాక్షించి యభిమతం
బిచ్చెద వేఁడుం డనినఁ గమలసంభవాదిదివిజు లిట్లనిరి.

102


శా.

దుర్వాసుండను మౌని దేవతతిపై దోషంబు గల్పించి తా
దుర్వారంబగు శాప మిచ్చుటయుఁ దత్కోపంబునన్ లోకముల్
నిర్వాహంబులు దప్పియున్నకతనన్ నీపాదసంసేవకుల్
సర్వజ్ఞా! చనుదెంచినారము జగత్స్వామీ! కటాక్షింపవే.

103


క.

[52]అని విన్నవించు బ్రహ్మా
ద్యనిమిషులం జూచి విష్ణుఁ డల్లన నగి యి
ట్లను నత్రిపుత్త్రుశాపం
బున నంతర్ధాన మయ్యె మును లచ్చి యిలన్.

104

క్షీరార్ణవమథనకథ :

వ.

అట్లు గావున మీరందఱుం గూడుకొని దుగ్ధసముద్రంబున మందర
శైలంబు గవ్వంబుగాఁ జేసి వాసుకిం దరిత్రాడు గావించి మథనం
బొనర్పుం డందు మహాలక్ష్మి జనియించు నద్దేవికటాక్షనిరీక్ష
ణంబుల నఖిలజగంబులుం దొంటియట్ల సౌఖ్యంబు నొందు క్రింది
కాధారంబై యేను గూర్మరూపంబున నాపర్వతంబు వహించెద
మీయందు శక్తి నావహించెద దీనికి సంశయింపవల దనిన
బ్రహ్మాదిదేవతలును సంతుష్టాంతరంగులై యమ్మహానుభావున

నేక భంగుల వినుతించిరి. ఇ ట్లుపదేశించి నారాయణుం డంత
ర్ధానంబు నొందెనని చెప్పి శంకరుండు గిరిజ కిట్లనియె. అ ట్ల
మ్మహావిష్ణునియోగంబున దేవాసురానీకంబులు గూడి యమృత
జలధి మథనోద్యోగులై చని చని.

105


క.

ముందట దివిజులు గాంచిరి
మందరమును దివ్యగానమాధుర్యశ్రీ
సుందరము సిద్ధసేవిత
కందరమును గల్పవల్లికామందిరమున్.

106


వ.

కని యత్యంతబలసంపన్నులై యప్పురాణపురుషోత్తముం
దలంచి యమ్మహాశైలం బతిరభసంబునం బెఱికి మోసికొనివచ్చి
దుగ్ధపయోరాశియందు [53]మహాఘోరంబుగా వై చిన.

107


ఉ.

శ్రీవిభుఁ డవ్యయుం డమరసేవ్యుఁడు నిర్మలకూర్మరూపమై
దేవహితార్థమై పరఁగ దివ్యజవంబున మందరంబు క్రిం
దై వెస వీపుమీఁదను రయంబునఁ దాలిచె గెంటకుండఁగాఁ
దా వలచేత నూఁది బెడిదంబగు నగ్గిరి నద్భుతంబుగన్.

108


ఆ.

కణఁగి యమ్మహాద్రి కవ్వంబు [54]గాఁ జేసి
దందశూకవిభునిఁ ద్రాడు చేసి
తఱిమి పట్టి దేవదానవసంఘంబు
ద్రచ్చి రంబురాశిఁ బెచ్చువెఱిగి.

109


వ.

ఇట్లు కార్తిక శుద్ధ ఏకాదశి నొండొరులకు [55]నోరవోక శ్రీమంత్రంబు
జపించుచు ననంతజవసత్వంబుల మథించు నప్పుడు.

110


క.

ఘోరాగ్నికణము లురుల మ
హారవమున భగ్గుభగ్గుమని పెనుమంటల్
బోరున నల్గడ నెగయఁగ
దారుణముగ విషము పుట్టి దరికొనఁ జొచ్చెన్.

111

వ.

ఇట్లు ప్రళయకాలాగ్నితుల్యకరాళంబగు కాలకూటమహావిషం
[56]బుద్భవించి యఖిలజగంబులం జెఱుపం జొచ్చిన నద్దేవముని
దానవసంఘంబులు భయభ్రాంతచిత్తులై [57]కాకువడి నలుగడలఁ
బఱతెంచి నన్ను శరణంబు వేఁడినఁ గనుంగొని యిట్లంటి.

112


మత్తకోకిల.

ఏమి సేయఁగ నేమి పుట్టె నిదేల పాఱెద రార్తులై
యీమహానల మిట్లు [58]వెన్కొన నెందుఁ బోయినఁ బోవునే
నామహత్త్వము చూడుఁ డిందు మనంబుల న్భయ మేదియం
చామహావిష మేను మ్రింగితి నంబుజోదరు లావునన్.

113


వ.

ఇవ్విధంబున నఖిలమంగళస్వరూపుండగు పుండరీకాక్షు నాకా
రంబు మనంబున నిలిపి తన్నామత్రయమంత్రజపపరాయ
ణుండ నగుటయుఁ దన్మాహాత్మ్యంబున నఖిలజగత్సంహారకారణం
బగు నమ్మహావిషంబు నాయంద జీర్ణించె. అమ్మంత్రం బచ్యు
తానంతగోవింద యను నమ్మూడునామంబులునుం బ్రణవాద్యం
బును నమః పదాంత్యంబునుంగా యోజింప నామత్రయంబగు;
నిది నియతాత్ములై యెవ్వరు పఠియింతురు వారికి విషరోగకాల
మృత్యుభయాదులు వాసి శుభంబులు సెందునని యమ్మంత్ర
ప్రభావంబు గిరిజ కుపదేశించి మఱియు నిట్లనియె. అప్పుడు కాల
కూటవిషంబు శాంతం బగుటయు బ్రహ్మాదిదేవమునిసంఘంబు
లును యక్షరాక్షసగణంబులును నన్ను ననేకవిధంబులం బ్రశం
సించి ప్రణమిల్లి మఱియును.

114


సీ.

తఱిమి యంభోనిధిఁ దరువంగఁ దరువంగ
        రక్తమాల్యంబులు రక్తవస్త్ర
ములు దాల్చి జ్యేష్ఠనా ముదిత యొక్కతె పుట్టి
        యమరసంఘముఁ జూచి యల్ల నగుచు

నే నేమి సేయదు నెచట వర్తింపుదు
         ననిన నా సతిఁ జూచి యమరు లనిరి
కలహ మెవ్వరియింటఁ గలుగు నేమానవు
         లనృతముల్ పరుషంబు లాడుచుండ్రు


తే.

సంధ్యలందును నెవ్వఁడు సల్పు నిద్ర
బొగ్గులును బెంచులును గేశములును నుముక
యేరి వాకిండ్లఁ గన్పించు వారియిండ్ల
[59]నీవు వర్తించు దారిద్ర్యనిబిడనేత్ర!

115


ఆ.

పునుకచయము బూఁదిపూఁత వెండ్రుకత్రాళ్లు
పన్నుగా ధరించుచున్నవాని
యింటఁ గదలకుండు మేప్రొద్దు గెడగూడ
క్రీడ సల్పు మమ్మ! కీడు[60]చేసి.

116


ఆ.

ఒనరఁ గాళ్లు గడుగుకొనకము న్నెలమితో
వార్చునట్టి దుష్టవర్తి యింటఁ
గలియు నీవుఁ గూడి కాపుండి యా కాఁపుఁ
జెలఁగి లేమిపాలు సేయుమమ్మ!

117


ఆ.

కసవు బొగ్గు ఱాయి యిసుక చర్మము పెంచు
నినుము వీనఁజేసి యెవ్వఁ డేనిఁ
బల్లు దోమునట్టి పాపాత్మునిల్లు నీ
యిల్లుగా [61]వసింపు మెల్లనాడు.

118


ఆ.

ఉల్లి తెలికపిండి ముల్లంగి నేబీఱ
పుచ్చ దొండకాయ పుట్టకొక్కు
లూరుఁబిండి మునగ మారేడుగాయల
ట్లనుభవించువారి ననఁగి పెనఁగు

119

వ.

అని జ్యేష్ఠాదేవిని నియమించి కలిరాజున కిచ్చి మఱియునుం
దరుప నయ్యంభోనిధియందు వారుణీదేవి జన్మించిన శేషున
కిచ్చిరి మఱి తంద్ర యుదయించి వైనతేయునకు భార్య యయ్యె.
నంత నప్సరోగణంబును గంధర్వులును నైరావతంబును నుచ్చై
శ్శ్రవంబును ధన్వంతరియును బారిజాతంబును గామధేనువును
జన్మించిన దేవేంద్రున కిచ్చి రంతఁ బ్రభాతసమయంబున ద్వాదశీ
దివసంబున.

120


క.

కమలాప్తోదయవేళన్
గమలోదయ మగుట సార్థకంబగు ననఁగాఁ
గమలాదేవి జనించెను
గమలముతో సురలనేత్రకమలము లలరన్.

121


ఉ.

సూరెలనుండి దేవతలు చూచుచు [62]మ్రొక్క పదాఱువన్నెబం
గారముతమ్మిమీఁద నవకంబగు క్రొత్తమెఱుంగుబొమ్మ నా
గారవమారు మేను వెలిగన్నులుఁ దిన్ననినవ్వుమోమునున్
దోరపుఁజన్నులుం గలిగి తోఁచెఁ బయోనిధిమీఁద రమ్యయై.

122


వ.

ఇవ్విధంబున సకలలోకమాతయగు నమ్మహాదేవి యుదయించె
నప్పుడు పుష్పవృష్టి గురిసె బ్రహ్మాదిమునులు యాశీర్వాదంబులు
నింద్రాదిదేవదైత్యదానవయక్షాదుల జయ జయ స్తోత్రంబు
లుం గిన్నరగంధర్వగాననినదంబులు నప్సరోగణనృత్య
వాద్యంబులు నొక్కటఁ జెలంగ దిక్కు లతినిర్మలంబు లయ్యె;
నగ్నులు ప్రసన్నార్చులై వెలింగె; పుణ్యవాయువులు వీచెఁ; దద
నంతరంబ చంద్రుం డుదయించి తారకాధిపతి యయ్యె; నతండు
లోకమాతతోఁ బుట్టుటం జేసి లోకమాతులుండనం బ్రసిద్దుండయ్యె;
మఱియు లోకపావనియును జగజ్జననియు నగు తులసి జన్మించి
విష్ణుపదపూజార్హ యయ్యె నయ్యవసరంబున.

123

సీ.

అమరదానవగణం బక్కొండఁ గొనిపోయి
        మొదలింటిచోటను బదిలపఱిచి;
రంత బ్రహ్మాదులు నత్యంతభక్తితో
       శ్రీసూక్తముల నుతిసేయుచుండ
నన్నీరజాక్షి ప్రసన్నాత్మయై వారి
       దయఁ జూచి యిట్లను నయముతోడ
నేమైన వరము మీ కిచ్చెద వేఁడుకొం
       డన విని వార లిట్ల నిరి ప్రీతి


ఆ.

లోకమాత! నీవు లోకముల్ రక్షింప
జననమైన కతన సర్వజగము
లధికమైన సమ్మదాబ్ధిఁ దేలుచునున్న
వింతకంటె వరము లెవ్వి మాకు.

124


వ.

అఖిలలోకాధీశ్వరుండైన నారాయణు వక్షస్స్థలంబున నిత్యాన
పాయినివై యుండు తొల్లింటియట్ల నీకటాక్షంబున సకలస్థావర
జంగమాత్మకం బగు జగంబులెల్ల రక్షింపుము. బ్రహ్మరుద్రాది
[63]దేవపదంబుల కాధారంబవై యని పలికిన నట్ల కాక యను న
ద్దేవికి నారాయణుండు ప్రత్యక్షం బగుటయు.

125


క.

ప్రణమిల్లి వార లందఱుఁ
[64]బ్రణతు లొనర్చిరి నవీనపంకజనేత్రున్
గుణయుక్తు నిత్యు నారా
యణు సర్వశరణ్యు పావనారాధ్యు హరిన్.

126


వ.

ఇట్లు వినుతించి బ్రహ్మాదిదేవత లప్పరమేశ్వరున కిట్లనిరి.

127

ఆ.

పుణ్యపురుష! నీవు భువనంబులకు నెల్ల
మాతయైన లక్ష్మిఁ బ్రీతితోడ
నవధరింపవలయు నద్దేవి కడగంట
[65]నఖిలజగము తొంటియట్ల బ్రతుకు.

128


సీ.

అని పల్కి యందఱు నధికసమ్మదమునఁ
         బెనుపారు నవరత్నపీఠియందు
నాదినారాయణు నమ్మహాలక్ష్మిని
         దివ్యభూషణరశ్మిఁ దేజరిల్ల
గూర్చుండఁగాఁ బెట్టి యర్చించి భక్తితో
         నమృతసంభవదివ్యమైన తులసి
నమ్మహాపురుషుని యడుగులు పూజించి
         యతులితధూపదీపాదివిధులఁ


తే.

దనిపి దండప్రణామంబు లొనరఁ జేసి
సంస్తుతింపంగ నప్పుడు [66]జలజనయనుఁ
డిష్టసౌభాగ్యసంపద లిచ్చి సకల
దేవతాకోటిఁ గరుణార్ద్రదృష్టిఁ జూచె.

129


ఉ.

దేవగణంబు దానవులు దేవి యపాంగనిరీక్షణంబులన్
నానిరి సర్వసంపదల వర్ధిలి [67]పొల్చిరి నిత్యసౌఖ్యమై
భూవలయంబు [68]సర్వమును బొంపిరివోయి చెలంగె నున్నత
శ్రీ విలసిల్లె నింద్రుఁడును జెన్ను వహించెఁ బయోరుహాననా!

130

వ.

అని చెప్పి భవుండు పార్వతి కిట్లనియె.

131


క.

సిరికడకన్నుల చూపులఁ
బరమానందమునఁ బొంది పద్మాక్షుఁడు సు
స్థిరకరుణాలోకనుఁడై
పరమమునీంద్రులకు ననియెఁ బరమప్రీతిన్.

132


మ.

వినుఁ డీ యిందఱు లక్ష్మిఁ జూచు తలఁ పువ్విళ్లూరఁగా నిందు నం
దును పోష్యస్థితి నున్నవా రెపుడు నెందు న్మీరు పోషాత్ములై
మునిసేవ్యంబగు ద్వాదశిం దగ నను న్బూజింప [69]నర్థిన్ సనా
తనసౌఖ్యంబులఁ జెంది మత్పదమునందం బాత్రు లెల్లప్పుడున్.

133


వ.

అట్లు గావున నెవ్వరేనియు నఖిలపుణ్యఫలద యగు నేకాదశి నుప
వసించి మత్ప్రియతమ యగు ద్వాదశి నరుణకిరణోదయంబున
సద్భక్తిపూర్వకంబుగా లక్ష్మీసమేతుండగు నన్నుం దులసీ
యుక్తంబుగఁ బూజ గావింతురు వారు సకలపాపనిర్ముక్తులై
మత్పదంబునం బొందుదు రిట్లు సేయని పాపాత్ములు నరకగాము
లగుదురు గావున నేకాదశీవ్రతం బవశ్యం బాచరింపుండని యాన
తిచ్చి వారలచేత నభినందితుండై యప్పరమేశ్వరుండు క్షీరాబ్ధి
కిం జని శేషపర్యంకంబున రమాసమేతుండై దివిజగణసంస్తూయ
మానుండై సుఖం బందుచుండె నంత.

134


చ.

వనజభవాదిదేవత లవారణభక్తిరసానుమోదులై
ఘనబలుఁ గూర్మమూర్తి నధికంబగు పూజలఁ జేసి రప్పు డ
య్యనఘుఁడు మెచ్చి వారిఁ గరుణార్ద్రసమంచితదృష్టిఁ జూచి మీ
మనములనున్న యర్థములు మానుగ నిచ్చెద వేఁడుఁ డిమ్ములన్.

135


ఉ.

నావుడు నమ్మునీంద్రులు మనంబున సమ్మద ముల్లసిల్లఁగా
నావిభుతోడ నిట్లని రనంతకులాచలదిగ్గజంబులు
న్మోవఁగలేక బెగ్గిలె నమోఘగుణోజ్జ్వల! మమ్ము నిందఱం
గావఁగ నీకు పోలు [70]నధికంబుగ నిద్ధర నుద్ధరింపవే.

136

వ.

అనిన విని కూర్మవల్లభుండు బ్రహ్మాదిదేవతలకుం బ్రియంబుగా
సప్తద్వీపసాగరశైలాధిక యగు వసుంధరారమణిం దనవీఁపున
ననూనబలపరాక్రమసంపన్నుండై వహించె. బ్రహ్మాదిదేవసమూ
హంబును దమ తమ నిజస్థానంబులకుం జని సుఖంబుండిరి. అది
యాదిగా నఖిలజగంబులును మధుసూదనాజ్ఞాపురస్కృతులై
యేకాదశీదివసంబున జనార్దనుని నారాధించుచుందు రని లక్ష్మీ
జన్మంబును గూర్మరూపవైభవంబును నుపన్యసించి.

137


క.

కమలాలయజన్మంబును
గమఠాహ్వయుఁడైన విష్ణుకథనంబును ని
త్యము వినిన పుణ్యపురుషుల
కమితైశ్వర్యములు నొందు సమములు [71]పాయున్.

138

ఏకాదశీవ్రతమాహాత్మ్యము :

వ.

అని యానతిచ్చి శంకరుండు గిరిజం గనుంగొని యింకనేమి విన
వలయు నడుగు మనిన నమ్మహాదేవి యి ట్లనియె.

139


ఉ.

ద్వాదశియందుఁ గైకొను వ్రతంబు మహత్త్వము వాసుదేవు శ్రీ
పాద సమర్చనక్రమముఁ బ్రస్తుతికెక్కెఁ బునీతయైన యే
కాదశిఁ జేయుకృత్యమునఁ గల్గెడునట్టిఫలంబు లన్నియు
న్మోదముతోడఁ జెప్పుము సముత్సకమయ్యెడుఁ జిత్త మెంతయున్.

140


క.

అని యడిగిన గిరిజాతకు
ననియె మహాదేవుఁ డిప్పు డడిగిన యర్థం
బనుపమపుణ్యావహమును
వినుతశుభాన్వితము దీని విను మేర్పడఁగన్.

141


క.

ఏకాదశి నుపవాసము
ప్రాకటముగ నున్ననరులు భవబంధములన్
గైకొనక [72]నిత్యముక్తి న
నాకులమతి విష్ణుపదము నందుదు రబలా!

142

ఆ.

ద్వాదశిని రమేశుఁ దగుభక్తి నెప్పుడుఁ
బూజసేయునట్టి పుణ్యమతుల
సప్తజన్మదోషసంచయం బంతయు
నణఁగుఁ దత్క్షణంబ యంబుజాక్షి!

143


తే.

రాజసూయశతంబుఁ దురంగమేధ
యాగశతకంబుఁ జేసినయట్టి ఫలము
నొక్కహరివాసరమునందు నుపవసించు
ఫలము పదియు నాఱవపాలి పాటికాదు.

144


వ.

అట్లు గావున సితాసితపక్షంబుల నుపవసింపని మూఢాత్ములకు విష్ణు
లోకంబు దూరంబగు; నేకాదశియందు భుక్తంబు సేయుమన్న
వానికి మహాపాపం బనఁ దద్భోక్తలకు నెంతపాపం బని చెప్ప
వచ్చు నట్లు గావున నఖిలవర్ణంబులజనంబులకును స్త్రీజనంబులకు
నేకాదశీవ్రతం బవశ్యకర్తవ్యంబు.

145


ఆ.

ఎనయ నేరికైన నేకాదశీతిథి
మిగిలి తల్లి తండ్రి మృతదినంబు
వచ్చెనేని నాఁడు వలవదా ద్వాదశిఁ
జేయు టర్హమండ్రు శిష్టజనులు.

146


వ.

అట్లు కానినాఁడు దేవతలునుం బితరులును నేకాదశిని హవ్య
కవ్యంబు లొల్లరు గావున నేకాదశి నుపవాసం బుంట పరమ
ధర్మంబు.

147


సీ.

దశమి [73]కలయకుండఁ దనరు నేకాదశి
నుపవసింపవలయు నుదయవేళ
దశమి కలిగెనేని ద్వాదశియందైన
[74]నుపవసించుటయును నుత్తమంబు.

148

వ.

మఱియుఁ ద్రయోదశియందు నర్కోదయంబునం గళామాత్రం
బైనను ద్వాదశి గలిగెనేని హరిసమారాధనంబు చేసి పారణసేయ
వలయు మఱియు ద్వాదశియందు సూర్యోదయంబునం గళా
మాత్రంబైన నేకాదశి గల్గెనేని [75]శుద్ధంబైన యేకాదశి విడిచి యం
దుపవసింపవలయు. ని వ్విధంబున నిశ్చయించి హరిదినంబు
దప్పక యుపవసింపవలయు. దశమీద్వాదశుల రాత్రుల నేకాదశిని
సాయంప్రాతఃకాలముల నన్నంబు వర్జింపవలయు. దశమియం
దేకభుక్తంబుండి స్త్రీసంగమంబును మాంససేవనంబును వర్జించి
భూశయానుండై యేకాదశి నుపవసించి ధాత్రీఫలాలేపితాంగుండై
పుణ్యజలావగాహనం బొనర్చి యారాత్రి నియతాత్ముండై షోడ
శోపచారంబుల విష్ణుసమారాధనంబు చేసి పతితపాషండపరాఙ్ము
ఖుండై [76]జాగరణంబు చేసి తత్ప్రభాతంబున.

149


క.

తులసీసమ్మిశ్రితమగు
జలమున మజ్జనము చేసి సమ్యగ్విధి ని
శ్చలమతితోఁ బితృతర్పణ
ములు సేసియుఁ బిదప హరినిఁ బూజింపఁ దగున్.

150


వ.

ఇట్లు లక్ష్మీసమేతుండైన జనార్దనుం గర్పూరసుగంధంబులను
దులసీపత్రంబులను పరిమళకుసుమంబులను శతపత్రంబులను
నర్చించి ధూపదీపనైవేద్యతాంబూలంబులు సమర్పించి ప్రదక్షిణ
నమస్కారంబు లాచరించి శ్రీసూక్త పురుషసూక్త మంత్రంబులం
బాయసాజ్యాహుతుల నష్టోత్తరశతంబు వేల్చి బ్రాహ్మణభోజనం
బులు గావించి తాను మౌనియై పారణాచరణంబు చేసి పురాణాది
పఠనతత్పరుండై దివంబునందు నిద్రింపక యుండి యా రాత్రి
భూశయనంబున స్త్రీపరాజ్ముఖుండై యుండవలయు.

151

క.

ఇవ్విధమున ద్వాదశియం
దెవ్వఁడు పూజించు నతని కీప్సితఫలముల్
నివ్వటిల నిచ్చు నెప్పుడు
నవ్విష్ణుఁడు కమలఁ గూడి యనవరతంబున్.

152

పాషండస్వరూపనిరూపణము :

వ.

అని యివ్విధంబున ద్వాదశీవ్రతమహత్వంబు చెప్పి శంకరుం
డద్రిజం గనుంగొని యింక నేమి విన నిష్టం [77]బడుగు మనిన
నమ్మహాదేవి యిట్లనియె.

153


క.

మును పాషండులఁ జూడం
జనదని చెప్పితిరి వారి చందం బెట్లే
యనువున నే [78]చిహ్నంబుల
తనువుల గలవారు వారిఁ దగఁ జెప్పు శివా!

154


వ.

అని యడిగిన ఫాలలోచనుం డిట్లనియె.

155


సీ.

హరికంటె నొకదైవ మన్యంబు గలదను
       వారలు హరిభక్తిదూరమతులు
బహుళకపాలాస్థిభస్మ[79]లింగాంకులు
       వైదికవిరహితవర్తనులును
ఘనవనప్రస్థితు ల్గాక జటావల్క
       ధారులై చరియించు తాపసులును
బొరిఁ జక్రశంఖోర్ధ్వపుండ్రాంకములు లేక
       హరికథావిముఖాత్ము లైనవారు


తే.

దైవముల విష్ణుసరి గాఁగఁ దలఁచువారు
విష్ణుధర్మంబు గాదని విడుచువారు
నఖిలధర్మంబులును హరియందుఁ జేర్ప
కుండువారలుఁ జువ్వె పాషండు లగజ!

156

వ.

అనుటయు విస్మయం బంది గిరిజ హరున కిట్లనియె.

157


ఆ.

అతిరహస్యమైన యర్థ మే నడిగెద
ననఘ! నన్నుఁ బ్రీతి నాదరించి
మనమునందుఁ గలుగు ననుమాన మంతయు
మానిపించి నాకు నానతిమ్ము.

158


ఉత్సాహ.

పొరిఁ గపాలభస్మచర్మములును నెముకపేరు లి
ట్లరయ నెల్లశ్రుతులు నింద్య మనుచుఁ జెప్పుచుండఁగా
నెరవు సేయ కవి ధరింప నేమి కారణంబు నీ
చరిత మెల్లఁ జెప్పవలయుఁ జంద్రఖండశేఖరా!

159


వ.

అనిన విని హరుండు గిరిజాతం గనుంగొని యేకాంతంబునం దన
చరిత్రం బంతయుం జెప్పఁదలంచి యిట్లనియె. నీ యడిగిన
యర్థంబు పరమరహస్యంబు గావున నన్యుల కెఱింగింపం దగదు
నీవ నే నగుటం జేసి సవిస్తరంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.

160


సీ.

స్వాయంభువాఖ్యమన్వంతరంబునఁ దొల్లి
      నముచిపురోగదానవులు బాహు
బలసమగ్రులు మహాబల[80]పరిపృతులు ధ
      ర్మాచారరతులు నుదాత్తతేజు
లఘువివర్జితులు శుద్దాంతరంగులు వేద
      శాస్త్రప్రవీణులు సత్యరతులు
తమశక్తి నఖిలలోకములును సాధించి
      నాకంబుపై కేగి నాకవిభునిఁ


తే.

బాఱఁదోలిన నిర్జరప్రభువుఁ గూడి
నిఖిలదివిజులు దుగ్ధాంబునిధికి నేగి
పగతుచేఁ దారు వొందిన పరిభవంబు
లార్తి దోఁపఁగఁ జెప్పిరి హరికి నెలమి.

161

వ.

ఇట్లు చెప్పి దేవా! దైత్యు లజేయులై సకలలోకంబులు సాధించిరి.
వారల గెలువ నెవ్వరికి నశక్యంబు. గావున నీవ యద్దానవులం
బరిమార్పవలయు నని విన్నవించిన హరి కరుణాయత్తచిత్తుండై
వారల నాదరించి దనుజు లెవ్వరికి నసాధ్యులని మనంబున నిశ్చ
యించి యీయర్థం బొరులచేతం గాదని నన్నుం దలంచిన
యా కషణంబ యచ్చటికిం జనినం గనుంగొని పద్మనాభుండు నా
కిట్లనియె.

162


ఉ.

సోమకళావతంస! సురసూదను [81]లెల్ల నధర్మమార్గులై
వేమఱు నిర్జరాదులకు [82]వేఁకర మొందఁ జరింపుచున్న వా
[83]రేమెయి నైన వారి భ్రమియించి యవిద్య భజించి యాత్మలన్
దామస మొందఁజేసి విదితంబుగ లోకము లుద్దరింపవే.

163


వ.

నీవు పాషండధర్మాచరణంబు నంగీకరించి వారి మోహాత్ములం
జేసి తామసపురాణ [84]శాస్త్రంబులు చేయింపుము. మద్భక్తివిర
హితులగు మునులు కణ్వాత్రిగౌతమశక్తిజైమిన్యుపమన్యు
కపిలదుర్వాసమృకండుబృహస్పతి[85]జమదగ్నులందు భవ
దీయశక్తి యావహించి [86]తత్ప్రభావంబునఁ దత్పురాణంబులు
తామసాఖ్యంబులై భవత్ప్రసాదంబున విస్తరిల్లి జగత్ప్రసిద్దంబు
లగు. నీవునుం గపాలచర్మభస్మాస్థిచిహ్నితుండవై పాశుపతా
స్త్రంబు గల్పించి మూఁడులోకమ్ముల మోహింపం జేయుము
కంకాళశైవపాషండమహాశైవాదిభేదంబులు గలిగి వేదబాహ్యం
బులగు మతంబులు తామసులగు విప్రు లవలంబించి భస్మధారులై

తచ్ఛాస్త్రంబులందుఁ బరమవస్తువు నిన్నె కా నిర్దేశింతు; రట్లగు
టం జేసి రాక్షసులు తన్మతంబులం దగిలి మద్భక్తివిరహితులై
నశియింతురు గావున.

164


ఆ.

ఎల్లయుగము లందు నేనును నవతార
భేదముల జనించి మోద మెసఁగఁ
దామసులకు మోహతమముగ నేప్రొద్దు
నిన్నుఁ గొల్చువాఁడ నీలకంఠ!

165


క.

ఈమతము సేయు మనవుడు
నామాటకు నంగమెల్ల ననుతాపింపన్
మోమున దైన్యం బొదవఁగ
దామోదరుమొగము చూచి తగ నిఁట్లంటిన్.

166


ఆ.

అంబుజాక్ష! నాకు నర్హంబు గాని యి
క్కార్య మేను జేసి కష్టదశకు
నోపఁజాలఁ జేయకున్న నీచిత్తంబు
రాదు వెఱతు నుత్తరంబు చెప్ప.

167


ఈ.

నావుడు నంబుజోదరుఁడు నన్నుఁ గనుంగొని చింత యేటికిన్
దేవహితార్థ మీపని మదీయ వచస్స్థితిఁ జేయు మెల్లెడన్
బావనమూర్తివైన నినుఁ బాపము సెందునె [87]వేఁడు నీకు సం
జీవనకారియై కడు విశేషతరంబగు మంత్ర మిచ్చెదన్.

168


వ.

అది యెట్లనిన నిత్యంబును మదీయంబగు సహస్రనామస్తవంబు
జపించుచు షడక్షరమంత్రధ్యానపరుండవగు; మమ్మంత్రంబు
తారకబ్రహ్మం బని చెప్పంబడు. మద్భక్తి గలిగి జపియించు నతనికి
భుక్తిముక్తులకు సంశయింపవలదు.

169


తే.

అంబుజేక్షణు చక్రశంఖాదిశార్జ్గ
హస్తు నిందీవరశ్యామలాంగుఁ బీత
వస్త్రవిలసితు జానకీవరునిఁ బుణ్య
తముని శ్రీరామమూర్తిఁ జిత్తమునఁ దలఁచి.

170

క.

శ్రీరామాయ నమో యన
నారూఢంబైన యీషడక్షరి భక్తిన్
గోరి జపియింపు మిది యఘ
తారకమును భోగమోక్షదము నగు ననఘా!

171


క.

ఉత్తమమగు నీ మంత్రముఁ
జిత్తంబులఁ దలఁపఁ బాపజీవులుఁ బుణ్యా
యత్తు లగుచుండుదురు దే
వోత్తమ! యీజపము సేయు మురుతరభక్తిన్.

172


వ.

అట్లు గావున నీమంత్రోచ్చారణంబున భస్మాస్థిధారణంబున సం
భూతంబగు నశుచిత్వంబు లేక సర్వమంగళంబులు నీకు సిద్ధించు.
నద్దైత్యులకు మద్భక్తి లేకుండువిధంబుగా బోధింపుము. మద్వా
క్యంబు సేయుమని నన్ను నియోగించి మరుద్గణంబుల వీడు
కొల్పిన వారు నన్ను ననేకప్రకారంబుల నభినందించి యీప్రకా
రంబున హరివాక్యంబు శీఘ్రంబ కావింపు మనిన దేవహితార్థం
బుగాఁ గపాలభస్మచర్మాస్థిధారణంబుచేసి గౌతమాదిమహామును
లకు నాశక్తి యొసంగి తామసపాషండశైవపురాణశాస్త్రంబులు
చేయించితి.

173


ఉ.

ఈగతి నున్ననన్నుఁ గని యెంతయు వేడుక దైత్యదానవుల్
రాగరసాబ్దిఁ దేలి చతురంబగుచున్న మదీయవాక్యలీ
లాగతిఁ దామసాదిగుణలాలసులై హంపాదసేవనో
ద్యోగము వేదశాస్త్రనిగమోక్తులధర్మముఁ దప్పి రందఱున్.

174


ఆ.

బహుకపాలచర్మభస్మసమేతులై
మాంసరక్తగంధమాల్యములను
నన్నుఁ బూజచేసి యున్మత్తవరములు
వడసి తపముపేర్మిఁ గడు మదించి.

175


వ.

ఇవ్విధంబున విషయసక్తులును కామక్రోధాదిగుణసమన్వితు
లును సాత్త్వికహీనులును నిర్వీర్యులునునై దేవగణంబుల కోటు
పడి పంచత్వంబు నొంది రట్లు గావున.

176

ఆ.

దేవహితము విష్ణుదేవు నానతియును
జేసి యివ్విధంబు చేయవలసె
దనుజబాధలకును దగిలి యీచిహ్నంబు
బాహ్యలీల యయ్యెఁ బంకజాక్షి!

177


క.

హరినామసహస్రముతో
సరియగు శ్రీరామమంత్రజప మతిభక్తిన్
బొరొబొరిఁ బఠియించుచు ని
ర్భరసౌఖ్యముఁ బొందుచుందుఁ బద్మదళాక్షి!

178


క.

అని పరమరహస్యం బగు
ననుపమవర్తనము చెప్పి హరుఁ డాగిరిజం
గనుఁగొని యిఁక నే కథనము
వినిపింపుదు ననిన నగజవిభునకు ననియెన్.

179


క.

శ్రీమంతుఁడైన విష్ణుని
నేమఱి చరియించు విప్రు లెవ్వరు మఱి యా
తామసశాస్త్రంబులకును
నామము లేవేవి చెప్పు నాగాభరణా!

180


వ.

అనిన విని శివుండు కాత్యాయని కిట్లనియె.

181


క.

తామస రాజస సాత్త్విక
నామములౌ పరమదర్శనంబులు వానిన్
బ్రేమంబున వివరించెద
నామహిమలు చిత్తగింపు మంబుజనయనా!

182


సీ.

ప్రథమంబు శైవంబు పాశుపతంబును
        బరఁగ నాచేఁ జెప్పఁబడి వెలుంగు
[88]మొగిఁ గణాదుండను మునిచేత వైశేషి
        కము నాఁగ నొప్పు గౌతమునిచేత

న్యాయశాస్త్రం బయ్యెఁ బాయక కపిలుచే
        సాంఖ్యంబు దగ బృహస్పతి మతంబు
చార్వాక మన నొప్పు సరసిజాక్షుఁడు బుద్ధు
        రూపుదాల్చిననాఁడు రూఢికెక్కు.


తే.

బౌద్దమునఁ జేసి యది పెక్కుభంగులు మఱి
మఱియు నద్వైతమతములు మలయుచుండు
శాస్త్రములు గల్గు ద్రిగుణసంశ్రయము లగుచు
వాని నెల్లను జెప్పెదఁ బూని వినుము.

183


వ.

మఱియుఁ బురాణంబులు బ్రాహ్మ్యంబు పాద్మ్యంబు వైష్ణవంబు
భాగవతంబు నారదీయంబు మార్కండేయంబు ఆగ్నేయంబు
బ్రహ్మకైవర్తంబు భవిష్యత్పురాణంబు లైంగంబు వామనంబు
వారాహంబు మాత్స్యంబు కౌర్మంబు గారుడంబు స్కాందంబు
శైవంబు బ్రహ్మాండపురాణంబు నాఁ బదునెనిమిదియగు; నందు
మాత్స్యకౌర్మలైంగశైవస్కాందాగ్నేయంబులు తామసంబు
లనంబడు. వైష్ణవనారదీయభాగవతపాద్మ్యవారాహగారుడం
బులు సాత్త్వికంబులు. బ్రహ్మాండబ్రహ్మకైవర్తమార్కండేయ
భవిష్యద్వామనబ్రాహ్మ్యంబులు రాజసంబు లనంబరఁగు; నందు
సాత్త్వికంబులు మోక్షప్రదంబులు. రాజసంబులు స్వర్గప్రదంబులు;
తామసంబులు నిరయహేతువు లనంబడు; నట్లగుటం బురాణం
బులు త్రిగుణాత్మకంబులు మఱియును.

184


సీ.

వ్యాస భారద్వాజ వాసిష్ఠ కాశ్యప
       హారీత పారాశరాదికములు
సాత్త్వికంబులు ముక్తిసౌఖ్యదంబులు నగు;
       నాగ్నేయ మానవ యాజ్ఞవల్క్య
దాక్ష వైష్ణవ్య కాత్యాయనంబులు నివి
       రాజసాఖ్యములు స్వర్గప్రదములు;
లైంగ సాంవర్త బార్హస్పత్య గౌతమం
       బులు సాంబ భార్గవంబులును దామ

తే.

సంబు; లవి విన్న నరకసంశ్రయము వొందు
నట్లు గావునఁ దామసాఖ్యంబు లెల్ల
నిరయహేతువు లని చెప్పుదురు మహాత్ము;
లట్లు గావున విడువంగ నగు మృగాక్షి!

185


ఆ.

ఇవి ప్రసంగరీతి నెఱుఁగ జెప్పితి విష్ణు
విభనరూపలీల విలసనంబు
విస్తరించి నీకు వినిపింతు నేర్పడ
వినుము చిత్తగించి వనజనయన!

186


వ.

అని వాసుదేవ వరాహవైభవకథనంబు చెప్పం దొణంగెనని చెప్పు
టయు నటమీఁది వృత్తాంతం బెట్లయ్యె నని యడిగిన.

187


భూతిలకము

భాసురకావ్యకళావిశారద! భామినీజనమన్మథా!
భూసురరక్షణ! సౌమ్యమానస! భూరిభోగపురందరా!
వాసవధేనుసమానదాన! దివాకరప్రతిమప్రభా!
శ్రీసుదతీప్రియ! దండనాయకశేఖరా! కులశేఖరా!

188


క.

గోత్రరిపుసదృశవైభవ!
శాత్రవబలహరణ! నీతిచతురానన! ధా
త్రీత్రిదశమానసాంబుజ
మిత్రా! జగదేకదాన! మిత్రనిధానా!

189


మాలిని.

శుభసముదయలోలా! సూనృతాచారలీలా!
విభవదివిజవర్యా! విష్ణుతాత్పర్యధుర్యా!
సుభగతరమనోజా! సూర్యసంకాశతేజా!
యభినుతగుణబృందా! యౌభళామాత్యకందా!

190


గద్య.

ఇది శ్రీనృసింహప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్రపవి త్రా
య్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య ప్రణీతంబైన
పద్మపురాణోత్తరఖండంబునందు సర్వభూతాంతర్యామియగు

విష్ణుండు ప్రకృతియందుఁ బొందుటయు మహదాది సర్గ ప్రతిసర్గ
మహత్త్వంబును సకలభూతసంభవకథనంబును చతుర్వ్యూహ
మాహాత్మ్యంబును మత్స్యావతారంబును దుర్వాసుశాపంబున న
మ్మహాలక్ష్మి యణంగుటయును సముద్రమథనంబును గూర్మవిభ
వంబును లక్ష్మీసముద్భవంబును ద్వాదశీవ్రతమాహాత్మ్యంబును
బాషండకథనంబును త్రిగుణస్వరూప స్మృతిపురాణ [89]విశేషం
బును నన్నది షష్ఠాశ్వాసము.


  1. రాజ్య (తి-హై)
  2. నిర్గుణాకార (మ-తి-హై)
  3. పెంపొంది (ము)
  4. పూర్వప్రకారంబు భువనంబు లన్నియు (తి-హై)
  5. ప్రకటముగ (హై)
  6. తిర్యగ్విభవంబులై (ము)
  7. దాల్చు (ము)
  8. నిద్రించుచుండ (ము)
  9. వొడమె (మ-తి-హై)
  10. యద్భుతాకారమై (ము)
  11. మేలికజడలతో (ము)
  12. నేను (మ-తి-హై)
  13. సమాన (హై)
  14. నాడుచుఁ బాడువారు (ము-యతిభంగము)
  15. బోధింప (ము)
  16. మాడ్కికి (ము)
  17. నారామమునుల్ (ము)
  18. మాడుగుల (తి-హై)
  19. పత్రములచేత (ము)
  20. స్రద్గంధాది (ము)
  21. ఒనర (మ-తి)
  22. గదాఖడ్గ శార్జ్గంబులు (తి-హై)
  23. వప్ర (హై), వజ్ర (తి)
  24. సద్గంధ (తి)
  25. కమలావిభూతియు (ము)
  26. యనుపమ (హై)
  27. పాడుచుంద్రు (తి)
  28. కడగి సమ్మదబాష్పముల్ గడలుకొనఁగ (తి-హై)
  29. నా మదిన్, తనివొక యింతలేదు (హై)
  30. విను మవ్యక్తుం డనంతుం డచ్యుతుం డనంబరగు పరబ్రహ్మ యందు పుట్టిన పరమపదనాథునకు వ్యూహాదులు నర్చావతారంబులు విభవంబులగు (హై)
  31. దత్కలితంబు లనంబడు (ము), తత్కార్యంబు లనంబడు (హై)
  32. మలయుండు (ము)
  33. యుత (తి-హై)
  34. మెల్లన (హై)
  35. నద్దేవిం (మ-హై)
  36. యిట్లనిరి (ము)
  37. త్రైలోక్యవర్తీ సదానందమూర్తీ (హై)
  38. దేలున్న చందంబు లెవ్వారు (మ-హై)
  39. స్వరూపంబవై విశ్వచైతన్యమై (హై)
  40. వచ్చి యున్నారు నీ నిద్ర (మ-హై)
  41. లా (తి-హై)
  42. గొంచుబోయె (తి-హై)
  43. యిక యేమి చెప్పుదున్ (హై)
  44. మహానక్రఝషశింశుమారప్రముఖో .... ....ల బహుళంబగు నంబురాశి ప్రవేశించి మందరాద్రిచందంబున గలచి యాడ నంత నద్దురాత్ముండును మహామకరరూపంబును దాల్చి వనధి (తి-హై)
  45. ముదమున (ము)
  46. వాసవునిని (ము)
  47. నన్నింత (మ-తి), నిన్నింత (హై)
  48. శాపం బిచ్చి కదలిన న య్యింద్రుండును (హై)
  49. నెద్దేవుని (ము)
  50. చూడ్కి సమృద్ధి బొంది (హై)
  51. ఇట్టి యుత్పాతమణగంగ నేది మనకు, దిక్కు నారాయణుడ కాక యొక్కరుండు (మ-హై)
  52. లని పలికిన విని బ్రహ్మా (తి)
  53. మహాఘోషంబుగా (మ-హై)
  54. గావించి (మ-తి-హై)
  55. మేర (హై)
  56. వించిన నఖిలజగంబులు తల్లడిల్లం జొచ్చిన (హై)
  57. చికాకు (తి-హై)
  58. నెక్కొన (హై)
  59. నెపుడు వర్తింపు దారిద్ర్యనిబిడకాంత (ము-యతిభంగము)
  60. దలచి (హై)
  61. భజింపు (ము)
  62. మ్రొక్కి (ము)
  63. దేవగణంబులకెల్ల నాధారంబ వని (హై)
  64. ప్రణతులు గావించి ధవళపంకజనయనా, గుణముక్తనిత్య నారా, యణ సర్వశరణ్య భావనారాధ్య హరీ (ము)
  65. చూచినంతలోన సుఖము నొందు (హై)
    దీని తరువాత "వ॥ తొల్లింటి యట్ల సంతసింపుచు నుండు ని జ్జగంబు లని కరంబులు ఫాలంబుననిల్పి రక్షింపు రక్షింపు
    మనిన" అను అధికపాఠ మున్నది (హై)
  66. జలజనయన, దృష్టిసౌభాగ్యసంపద లిచ్చె నఖిలదేవతాకోటి కరుణార్ద్రదృష్టిఁ జూచి (ము)
  67. రప్పుడు (హై)
  68. సంతసము (మ-తి-హై)
  69. నర్థింపనూ, తన సౌఖ్యంబుల (మ)
  70. నధికంబగు (హై)
  71. పొలియున్ (మ-తి-హై)
  72. నిత్యులగుచు (హై)
  73. గలుగకుండ (హై)
  74. నుపవసింపు టదియె యుత్తమంబు (హై)
  75. శుద్దంబై యాద్వాదశి విడిచి (ము)
  76. హరిం దలంచుచు జాగరణంబు చేసి (హై)
  77. బయ్యెడి నడుగు మనిన (హై)
  78. చిహ్నంబులు, తనువున గలవారు వారిదయ జెప్పు శివా (తి-హై)
  79. లింగాంగులు (తి-హై)
  80. పరిపృతులును, ధర్మచారిత్రు లుదాత్తతేజు (మ-తి)
  81. లున్నతధర్మమార్గులై (మ-తి-హై)
  82. వేకట (హై)
  83. రేమియునై న (ము)
  84. శాస్త్రంబు లుపదేశింపుము వారలు భగవద్భక్తి విరహితు లగుదురు, మరియు కణ్వాత్రి (తి-హై)
  85. కౌశికమతంగజమదగ్నులందు (హై)
  86. తామసశాస్త్రంబులు చేయింపుము తత్ప్రభావంబున (హై)
  87. వత్స (తి-హై)
  88. నొగి (ము-యతిభంగము)
  89. విశేషంబుల తెరం గెరింగించుటయు పద్దెనిమిది పురాణంబులు సంక్షేపంబుగా నెరిగించుటయు నన్నది (హై)