పదబంధ పారిజాతము/చిత్తం
చిట్లుకొఱవి
- పీడాకారి, సంతాపకారి.
- "పంచశరుం డొక ప్రళయకాలయ ముండు, చిన్న పెంపుడు చిల్క చిట్లు కొఱవి." కలు. శ. 55.
చిట్లుగొను
- చిటపట చిట్లు.
- పేలాలు వేయించగా చిట్లుతాయి. గింజలు చిట్లిన వని నేటి వాడుకలోనూ ఉంది.
- "మంగలమున బ్రేలలు సిట్లుగొన్న పొలుపున." బస. 7. 199. పు.
చిఠాను చెల్లు వ్రాయు
- లెక్కలో జమకట్టు.
- "...అయ్య దన రాక యున్న లోపంబు దీరె నేఁడో నృపాల !, యెలమిఁ జిఠాను జెల్లు వ్రాయింపు మయ్య !" నానా. 244.
- నేటి రూపం చిఠ్ఠా.
చిడిముడి పడు
- చీకాకు పడు, కోపించు.
- "చిత్తంబు జల్లనఁ జిడిముడి పడుచు." గౌ. హరి. ద్వితీ. పం. 1079.
- రూ. చిడిముడి వడు.
చిడిముడిపాటు
- తొట్రుపాటు; కలత; కోపము.
చిడిముడి వడు
- 1. ముఖము మటమట లాడించు; అసంతృప్తి వెలిబుచ్చు.
- "చెదరక యుదరక చిడిముడి వడక." పండితా. ప్రథ. దీక్షా. పు. 178.
- 2. కుతూహలము చెందు.
- "చిత్తము లనిఁ జూచువేడ్కఁ జిడిముడి వడఁగా." భార. భీష్మ. 1. 151.
చిడుగుడు పరువులు
- ఒక ఆట; చెడుగుడు, చిడుగుడు.
చిత్తం !
- ఎవరైనా పెద్దవారు, గౌరవనీయులు చెప్తున్నప్పుడు వినుటలో అను ఉపస్కారక పదం.
- "వెళ్ళి రామయ్యను పిల్చుక రారా !" "చిత్తం." వా.
- అలాగే 'ఔను' అనుటలోనూ కలదు.
- "నిన్ననే వచ్చారా?" "చిత్తం." వా.
- ఇత్యాదు లూహ్యములు.
చిత్తకార్తిలో కుక్కలలాగా
- కామోద్రేకంతో.
- ఆకార్తిలో కుక్కలకు కామోద్రేకం ఎక్కు వనుటపై ఏర్పడినది.
చిత్తగించు
- 1. తలచు.
- "శ్రీహర్షు నాత్మలోఁ జిత్తగించి." రుక్మాంగ. 1. 13.
- వాడుకలో -
- "నా మనవి చిత్తగించండి." వా.
- 2. ఏకాగ్రతతో.
- "చిత్తగించి వినుము." భాగ. 5. స్కం. 7. 16.
- 3. దయచేసి.
- "చెప్పవే వ్యాసనందన చిత్తగించి." భాగ. స్కం. 9.
- 4. విను.
- "విన్నవించినార మిన్ని యాకర్ణించి, కొంచె మనక చిత్తగించవలయు." కృష్ణ. 2. 139.
- 5. ఆలోచించు.
- "స్త్రీలకు బుద్ధులు ప్రళయముల్ చిత్తగింప." కుచేల. 1. 115.
చిత్తజల్లుగ
- అధికముగా; అత్యుద్ధ్రుతంతో.
- చిత్తకార్తిలోని వానవలె.
- చిత్తకార్తివాన గబగబా వచ్చి ఆగుతుంది.
- "పాండుతనూజుఁడు చిత్తజల్లుగాఁ, గురియుపయోధరంబుక్రియ." జైమి. 7. 39.
- "ఇనుప గునపంబులో యనఁ దనరి కురిసె, నెంతయును జిత్తజల్లుగ నేదు ముండ్లు." కళా. 5. 8.
చిత్తపరితాపము సేయు
- మన:ఖేదము కల్గించు.
- "నీవు దపంబు సేయఁ బోఁ దలఁపకు మమ్మ, చిత్తపరితాపము సేయకు మమ్మ." కుమా. 6. 7.
చిత్తము కరగు
- హృదయము ద్రవీభూత మగు
- "ఆ వైకుంఠము....సభామండప, శ్రీవిస్ఫూర్తికతంబున న్మిగుల నాచిత్తంబు నానందము, ద్రావైచిత్రి గరంచు చున్నయది...." కళా. 2. 12.
- "భామ తనమీఁద నెన రైన బాగుఁ జూచి, చిత్తము గరంగి శుభభద్రశేఖరుండు." హంస. 2. 65.
చిత్తము కైపు
- మానసోద్రేకము, ఆవేశము.
- "పడం బొడిచి చంపక చిత్తము కైఁపు వోవునే." కుమా. 11. 49.
చిత్తము చీకటి గొల్పు
- కలత పఱుచు.
- "చీఁకటి గొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెఱి సోగవెండ్రుకల్." శివ. 3. 44.
చిత్తము తప్ప జేసికొను
- అయిష్టమునకు పాల్పడు.
- "హరియుధిష్ఠిరుల చిత్తము తప్పఁ జేసి కొంటి." జైమి. 7. 34.
చిత్తము తెలియు
- అభిప్రాయ మెఱుగు.
- "దేవర చిత్తంబు దెలియమి నట్లు సే,యఁగ నేమి దోఁచునో యనుచు వెఱతు...." కళా. 1. 192.
చిత్తమునకు వచ్చు
- ఇష్టపడు; మనసుపడు; నచ్చు.
- "నీ చిత్తమునకు వచ్చినవానిం గారుణ్యంబునఁ గైకొని." భార. కర్ణ. 1. 285.
- "వనిత ! నీ చిత్తమున కేను వత్తు నేని." శివ. 3. 68. చిత్తమున కెక్కు
- మనసునకు వచ్చు, నచ్చు.
- "అకట ! యొరు చిత్తమున కెక్కునట్లు గాఁగ, మెలఁగి యేమివిధంబునఁ గొలుచువాడు." భార. విరా. 1. 74.
చిత్తము నీరగు
- గుండె నీరగు; భయభ్రాంతి జనించు.
- "అక్కటా !, నిక్కము మాకుఁ జిత్తములు నీ రగుచున్నవి." ఉ. హరి. 2. 132.
చిత్తము వచ్చినట్లు
- స్వేచ్ఛగా, యథేచ్ఛగా.
- "నీచిత్తం వచ్చినట్టు నీవు తిరుగుతుంటే ఇంటిసంగ తెవరు చూస్తారు?" వా.
చిత్తము వచ్చు
- ఇష్టపడు.
- "చిత్తంబు వ,చ్చినచో మానుదు గాని ని న్నిపుడు కస్తిం బెట్ట నా కేటికిన్." కాళ. 3. 72.
చిత్తము విడుచు
- మన సొప్పకుండు.
- "చేరి యచ్చట నిల్వఁ జిత్తంబు విడిచి." పల. పు. 8.
చిత్తయి పోవు
- బాగా దెబ్బ తిను, నిర్వీర్యుడగు.
- "అయిపోయా డయ్యా! ఈ దెబ్బతో చిత్తయి పోయాడు." కొత్త. 180.
చిత్తరించు
- చిత్రించు.
- "పండితమల్లుచక్షులను, చిత్తరించిన మాడ్కి." పండితా. ప్రథ. దీక్షా. పు. 175.
చిత్తరువులోని ప్రతిమవలె
- కదలక మెదలక, నిశ్చలంగా. వాడుకలో - 'వాడు అప్పుడు రాసిన బొమ్మలాగా నిల్చుండి పోయాడు.'
- "అచట నున్నవార లెల్లఁ జిత్తరువున వ్రాసినట్టి.....తడవుగను." కళా. 5. 6.
చిత్తరు వొత్తు
- ముద్రిత మగు.
- "చిత్తంబులో నీదు చెలు వైనమూర్తి, చిత్తరు వొత్తినచెలువంబు దోఁప." ద్విప. కల్యా. పు. 66.
చిత్తవాన
- చిత్తజల్లు.
- చిత్తకార్తిలో వాన ఉద్ధ్రుతంగా గబగబా వస్తుంది.
- "చిత్తవాన గురియ." విప్ర. 4. 19.
- "చిత్తవానలా వచ్చి పడ్డాయి రాళ్ళు." వా.
- చూ. చిత్తజల్లుగా.
చిత్తాన బెట్టు
- మనసులో పెట్టుకొను.
- "చిత్తానఁ బెట్టకు మీమాట శ్రీరమణ మరవకు." తాళ్ల. సం. 7. 103.
చిత్తారిపని
- బచ్చెన పని; కర్రతో బొమ్మలూ అవీ చేసి వానికి రంగు వేసే పని.
- ఈ వృత్తి చేయువారిని చిత్తారివాండ్రు అంటారు.
చిత్తుప్రతి
- సాపు వ్రాయక ముందు వ్రాసుకున్న ప్రతి.
చిత్తుళిపని
- చిత్తారిపని.
- కర్రబొమ్మలు మొదలగు వానిపై రంగులు వేయుపని. జీనిగర - చిత్తారి - వాండ్లు అని ఆ పని చేసేవారి నంటారు. కాశీయా. 304.
- చూ. చిత్తారిపని.
చిత్రరతి
- సంభోగములో భేదము. కుమా. 9. 152.
చిదంబరరహస్యము
- అగోచరము - అనవగతము. చిదంబరంలోని శివలింగాన్ని ఆకాశలింగం అంటారు. దర్శనానికి వచ్చిన భక్తాదులను, తెర తొలగించి, దర్శనం అయిందా అంటారు. వీరు అయింది అంటారు గానీ యెవరికీ యేమీ కనబడదు. ఆకాశలింగం కనుక కనబడదని ప్రతీతి. అందుపై యేర్పడిన పలుకుబడి.
- "అంత సరిపడనివాడు ఈ రోజు ఉద్యోగం యిస్తా నన్నా డంటే యిందులో యేదో చిదంబరరహస్యం ఉంది." వా.
చిదగొదలు
- గృహకలహము. బ్రౌన్.
- వ్యత్యాసాలు. వావిళ్ళ ని.
- "మొదల నుపాయం బెన్నుట, పిదప నుపాయంబు లెక్క పెట్టుట తగునీ, చిదగొదలఁ గాదె ము న్నొక, ముది కొక్కెర యనుఁగుసుతుల ముంగిస కిచ్చెన్." వేంక. పంచ. 1. 738.
చిదమిదగా
- నలుగునట్లుగా; కసిబిసిగా.
చిదిమి దీపము పెట్టవచ్చు
- ఎంతో ప్రకాశవంతంగా ఉన్న దనుపట్ల అనే పలుకుబడి.
- "ఆ పిల్లను చిదిమి దీపం పెట్టవచ్చు." వా.
చిదిమి పెట్టిన
- 1. సారము తీసిన. చిలికి తీసిన - ఆరితేరినగా మారినది.
- "ఆ, భీలశరాతనుల్ చిదిమిపెట్టిన బంటులు." విజయ.
- 2. రూ పొందించిన.
- "బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడి నున్న నిన్ను." శుక. 1. 527.
చిదిమి పెట్టు
- పంచు.
- "మృతు లైనవీరు లందఱు, నతివీరులు వీరి కెల్ల నడుగిడ నమరా, వతిఁ బట్టు లేదు వరసుర, సతు లందఱఁ జిదిమి పెట్టఁ జాలరు వరుసన్." కుమా. 11. 180.
- చూ. బుగ్గ చిదిమి దీపము పెట్టు.
చిదిమి వైచు
- ఛిన్నాభిన్నము చేయు.
- "చిచ్చఱయమ్ముల చిదిమి వై చెదవె?" వర. రా. అర. పు. 237. పం. 1.
చిన్న కన్నుపడు
- కను లఱమోడ్పు చెందు.
- "చిన్న కన్నువడి దుప్పులు చప్పుడు గాక యుండ." సాంబో. 2. 188.
చిన్నకారు
- బాల్యము. బ్రౌన్.
చిన్నకూతురు
- చిన్నది.
- "ఎన్ని నాళ్లైనఁ జిన్న కూఁ,తురవు గావు నీవె తొడఁగి పతికిఁ దగిన సేవ సేయ కగునె..." కళా. 4. 68.
చిన్నక్క పెద్దక్క చేయు
- మోసగించు.
- వర్తకంలో చిన్న శేరు పెద్ద శేరు వాడే అతను, చిన్నక్కా శేరు తేవే అంటే చిన్న శేరు తేవా లనీ, పెద్ద క్కా శేరు తేవే అంటే పెద్ద శేరు తెమ్మనీ గుర్తు పెట్టి వ్యాపారం నడిపేవా డట. ఆ మోసం పై వచ్చిన పలుకుబడి.
చిన్నగ బోవు
- చిన్నబోవు. శివ. 2. 19.
- చూ. చిన్నబోవు.
చిన్నచూపు చూచు
- చులకన చేయు.
- "మామీద అంత చిన్నచూపు చూస్తే ఎలాగు చెప్పండి." వా.
చిన్నటనాడు
- చిన్ననాడు. బాల్యం.
- "చిన్నటనాఁట నుండియును జెల్వకుఁ గూర్చినదాన వౌట." వసు. 4. 106.
చిన్నతన మగు
- అవమాన మగు.
- "తప్పు లెన్నును చిన్నతన మగు నాకు." పల. పు. 62.
- వాడుకలో - 'అందఱు సంపన్నులలో ఈ మాసినబట్టలతో తిరగడం నాకు చాలా చిన్నతనంగా ఉంది.'
చిన్ననవ్వు
- చిఱునవ్వు.
- "చిప్ప కూఁకటివానిఁ జిన్న నవ్వుల వాని." పాండు. 1. 213.
చిన్ననాటి కతలు
- గతచరిత్ర.
- "ఎలదోఁట తీఁగె యుయ్యెల, కలకంఠికిఁ జిన్ననాఁటి కత లై తోఁచెన్." శివరా. 2. 46.
చిన్న నాడు
- బాల్యం. చిన్న పడుచు
- బాలిక.
చిన్న బుచ్చు
- అవమానించు.
- "నన్ను చిన్నబుచ్చినకంబు పెద్ద సేయంగ." కవిక. 2. 164.
- "నడుమంత్రమున వచ్చి ననుఁ జిన్న బుచ్చి." వర. రా. అయో. 2. 533. పం. 2.
- చూ. మొగ మింత చేసికొను, మొగము చిన్న చేసికొను, మనసు చిన్న బుచ్చుకొను.
చిన్నబోవు
- 1. అవమానముతో మొగము చిన్న చేసికొను.
- "ఏఁగుదెంచిన నృపు లెల్ల నిండ్ల కరుగఁ, జేరి యధికారు లెల్లను జిన్నఁబోవ." శుక. 2. 12.
- 2. విఘాత మగు.
- "చేతనా హానికార్యంబు చిన్నబోయె." నైష. 4. 96.
- 3. కళావిహీన మగు.
- "సంపద లెన్ని గల్గిన నరేంద్రా యింద్ర సంకాశ నం,దనుఁ డొక్కండును లేమి నా నగరు చిన్నంబోయె." వరాహ. 2. 92.
- "పిల్ల లందరూ ఊరి కెళ్ళే సరికి ఇల్లు చిన్నబోయింది." వా.
చిన్న మంత మాట ఆడు
- ఏ కించిత్తైనా దండించు, ఒక మాట అను.
- చిన్నం పూర్వపు తూకపు రాళ్లలో అతిచిన్నది.
- "చిన్న నాఁడును బ్రియు నొక చిన్న మంత, మాట యాడిన విని తాపమగ్న వగుదు." కళా. 4. 128.
చిన్నమ్మవారు
- మశూచికములో ఒక భేదము.
- పెద్దమ్మ, చిన్నమ్మ, బొబ్బలమ్మ, ఆటలమ్మ, తట్టమ్మ ఇత్యాదులు మశూచికంలో భేదములు.
చిన్నమూ చిదరా జం.
- అల్ప మైనవి.
- "చిన్నముఁ జిదరయుఁ బుట్టక, మిన్నక రావలసె మగుడి మీ రున్నెడకున్." పంచ. మి. భే. 522.
- పూర్వం తూకంలో చిన్నము అతి చిన్నది.
చిన్న మెత్తు పని లేదు
- ఏ పనీ లేదు.
- ఇది వ్యతిరేకార్థంలోనే ఉపయోగిస్తారు.
- "వాడికి చిన్నమెత్తు పని లేదు."
- "పొద్దున్నుండీ చిన్నమెత్తు పని కాలేదు." వా.
చిన్నమెత్తు మాట అనకుండు
- ఒక్క మా టైనా వ్యతిరేకంగా అనక పోవు. పల్లెత్తుమాట అనకుండు.
- "నేను చిన్నమెత్తు మా టయినా అన లేదు. అయినా వాడికి కోపం వచ్చింది." వా.
- చూ. మాడెత్తు మాట. చిన్న మెత్తు పనిలేదు.
చిన్నవాడు
- బాలుడు.
- "ననుఁ జిన్నవాఁ డని గడుప కిపు డుపన్యసింపుము." చెన్న. 1. 32.
చిన్న వోవు
- అవమానముతో క్రుంగు.
- "పోయె బాలుండు యదువృష్ణిభోజబలముఁ, జిన్న వోయెను జూడ వచ్చిన జనంబు." ఉ. హరి. 2. 28.
- "చిన్ని మలయానిలంబులుఁ జిన్నవోయె." హర. 3. 89.
- వాడుకలో - 'నే నీమాట అనగానే వాడి మొహం చిన్నబోయింది' - అన్న విధంగా వినవస్తుంది.
- "వాడు ఈ రోజు చాలా చిన్నబోయి నట్టు కనబడుతున్నాడు." వా.
- చూ. చిన్న బోవు.
చిన్నా పెద్దా తారతమ్యం
- చిన్న పెద్ద అంతరువు.
- "వాడికి చిన్నా పెద్దా తారతమ్యం తెలియదు." వా.
చిన్నారి
- చిన్న దైన.
- "చిన్నారి మేనితోడ." రాధి. 1. 53.
చిన్నారి పొన్నారి
- ము ద్దయిన. జం.
- హర. 5. 56.
చిన్నారి పొన్నారి ప్రాయము
- బాల్యము.
- "కురులు కూఁకటితోడఁ గూడియుఁ గూడని, చిన్నారి పొన్నారి ప్రాయము..." రాజగో. 1. 13.
చిన్ని పువ్వు
- 1. తలలో ధరించు ఒకవిధమైన యాభరణము.
- "కుటిలాలకములమీఁదఁ జిన్ని పువు గుస్తరించు నచ్చుగ మణికర్ణిక." కాశీ. 6.
- "అలికలభములు పైఁ దులతెంచు తని రేకు. లలకలఁ జిన్నిపువ్వై వెలుంగ." కుమా. 9. 126.
- 2. నమస్కార విశేషం. హంస. 4. 213.
చిన్ని పూఱేకు
- భూషణవిశేషం.
చిన్నె లాడి
- విలాసిని.
చిన్నెలాడు
- విలాసి.
చిప్పంటు నీరంటు లేకుండు
- ఏమీ లేక పోవు.
- చిప్పలో ఏదయినా వేసినప్పుడు, కాస్తయినా తగులుకొని ఉండడం, నీరు కుమ్మరించినా కాస్త నీరయినా అంటుకొని ఉండడం మామూలు. అది కూడా లే దనుట. అంటూ సొంటూ లేకుండు.
చిప్ప ఎత్తుకొని పోవు
- ఉన్న దంతా పోగొట్టుకొని దిక్కు మాలినవా డగు. అడుక్కు తింటూ పోవు.
- "వా డిలాగే ఖర్చు పెట్టుతూ వస్తే ఆఖరుకు చిప్ప ఎత్తుకొని పోతాడు. అప్పుడు గాని తెలియదు." వా.
చిప్పకత్తి
- చెట్లకొమ్మలు నరికే మోటు కత్తి.
చిప్పకసవు
- చిప్పగడ్డి.
చిప్పకూకటి
- చిన్నతనమున పెట్టుకునే చిన్న జుట్టు.
- "చిప్ప కూఁకటుల నాశ్రీరామచంద్రుఁ, డొప్పనే పట్టి దైత్యులఁ గూలఁ ద్రోయ." వర. రా. బా. పు. 77. పం. 52.
చిప్పగడ్డి
- చిప్పకసవు.
చిప్పగుద్దలి
- ఒకరక మైన గొడ్డలి.
చిప్పగొడ్డలి
- చూ. చిప్పగుద్దలి.
చిప్ప చేతికి వచ్చు
- ఉన్నది పోగొట్టుకొని నిరాధారు డగు.
- "ఏదో పేరు రావాలని రెండుచేతులా ఖర్చు పెట్టాడు. చివరికి చిప్ప చేతికి వచ్చింది." వా.
చిప్పముత్తెము
- మాయముత్యము.
చిప్పమూతి
- చిప్పవలె ఉండే ముఖము. శ. ర.
చిప్పయమ్ము
- ఒకరక మైన చిప్పవంటి బాణము.
- "త్రుంచెఁ జిప్పయమ్ముల నది.... విజయుండు." భార. అశ్వ. 4. 8.
చిప్పలు వాఱ నొగ్గు
- ప్రాధేయపడు.
- "చిప్పలు వాఱ నొగ్గుటలుఁ జెల్లఁగ." భాస్క. యుద్ధ. 712.
చిప్పా దొప్పా సిద్ధము చేయు
- సన్యాసమునకు సిద్ధపడు.
- "ఆ పిల్ల కోడలుగా వస్తే నేను చిప్పా దొప్పా సిద్ధం చేసుకో వలసిందే." వా.
చిప్పెణక
- ఇంటిపార్శ్వముల కప్పు. బ్రౌన్.
చిప్పెవాడు
- దర్జీ. ఆం. భా. ద్వి. 282.
చిమచిమ అను
- పుండు, గాయములాంటివి మంటపెట్టు.
- "మొనపంట మొనసి నొక్కిన నొక్కుచేఁ గెంపు,టధరంబు చిమచిమ యనినయట్లు." అని. 2. 71.
- "ఏమిటో కట్టెచీమ కరిచిం దేమో? చిమచిమ లాడుతూ వుంది వ్రేలు." వా.
చిమచిమ లాడు
- గాయం పుండుమొదలైనవి మంటపెట్టు.
- చూ. చిమచిమ అను.
చిమడ బెట్టు
- 1. ఉడికించు; కలతపెట్టు.
- "చింతచే నీ మనసు చిమడఁ బెట్టేవు." తాళ్ల. సం. 3. 271.
- 2. అన్నం మెత్తబడిపోవు నట్లు చేయు.
- "ఏమిటే అన్న మిలా చిమడ బెట్టావు? దీనికంటే సంగటి నయం." వా.
చిమిడిపడు
- ఉడుకు, బాధపడు. ద్వా. 5. 142.
చిమ్మచీకటి
- కటిక చీకటి. కాశీ. 5. 101.
- "కమ్మ విల్తుని యల రమ్ములం జిమ్మ చీఁకట్లు గ్రమ్ముటం జేసి." కా. మా. 2. 25.
- "చిమ్మ జీఁకటిన్." నైష. 3. 150.
- రూ. చిమ్మజీకటి.
చిమ్మట జిఱ్ఱనగా
- ఏ మాత్రం శబ్దం అయినా.
- "చీమ చిటుక్కు మన్న విను జిన్నట జి ఱ్ఱన నేఁగునంతలో." హంస. 3. 40.
చిమ్మటతార
- ఒక సుషిరవాద్యం.
చిమ్మదిరుగు
- గిరగిర తిరుగు.
- "చిమ్మ దిరుగుచు నిలువక శిరము వ్రాల." భాగ. 10. పూ. 225.
చిమ్మనగ్రోవి
- 1. నీళ్ళు చిమ్ము గొట్టము. వసంతం అవీ ఆడుటలో ఉపయోగిస్తారు.
- పిచికారు.
- 2. ఒక పిల్లల ఆట.
చిమ్మన చిల్లలు
- పిల్లల ఆటలో ఆడే కర్ర ముక్కలు. చిల్ల, కట్టె ఆటల్లో నేటికీ వినిపించేమాటలు.
చిమ్మనపుగ్రోవి ప్రభా. 2. 81.
- చూ. చిమ్మనగ్రోవి.
చిమ్మి రేగు
- చెల రేగు, విజృంభించు ఇత్యాది భావచ్ఛాయలలో.
- "చిందు లాడుదు మని చిమ్మి రేఁగుటయు." వర. రా. సుం. పు. 87. పంక్తి. 15.
చిమ్మి రేచు
- చెలరేగునట్లు చేయు.
- "సిగ్గరి కాంతల నింత చిమ్మి రేతురా." తాళ్ల. సం. 3. 110.
చిమ్ముబిల్లలు
- చూ. చిమ్మనబిల్లలు.
చిమ్ముఱాయి
- ఒక పిల్లల ఆట. చిమ్ములాట
- నీళ్ళు చల్లుకునే ఆట.
చిమ్ములాడు
- నీళ్ళు చల్లుకొను.
చిరంజీవి......
- పిల్లలయెడ, చిన్నవారియెడ పెద్ద లుపయోగించే మాట.
- "చిరంజీవి కుమారుడు." వా.
- ఉత్తరాల్లో చిన్నవారి పేరు ముందుకూడా వ్రాస్తారు.
- "చిరంజీవి సుబ్బారావుకు." వా.
చిరతవాలుగా
- చిఱుతప్రాయంలో వలె. కాశియా. 307.
చిరమరలు
- భేదాలు.
- "చెలిమి వేర్పా టను చిరమరలకుఁ జొరక." భార. శాంతి. 1. 58.
చిరాకుపడు
- విసుగుకొను.
చిరుతలు కవియు
- మిరుమిట్లు గొను.
చిరుతలు క్రమ్ము
- మిరుమిట్లు గొలుపు.
చిరుతలు వాఱు
- మిరుమిట్లు గొలుపు.
చిరునామా
- జాబులమీద వ్రాసే విలాసం.
- చూ. పై విలాసము.
చిరువడముల పాకము
- చిన్న చిన్న ఉండలుగా గోధుమపిండితో చేసి పాకంలో వేసిన పిండివంట. నైష. 6. 113.
చిర్నవ్వు
- చిఱునవ్వు.
చిర్రుబుర్రులు
- విసుగు వేసటలు; కోప తాపాలు. జం.
- "వినన్ రాదె యీ చిర్రుంబుర్రులిఁ కేల." గీర. 27.
చిర్రు ముర్రాడు
- ముందువెనుక లాడు.
- "అరిది సిగ్గులు చిర్రుముర్రాడు నోర, చూపుగొనలను...." రాధా. 4. 68.
చిఱచిఱలాడు
- కోపించు, మండిపడు. మృ. వి. 3. 53.
- "పొద్దున్నుంచీ ఆకోడలమ్మ చిఱచిఱ లాడుతూ ఉంది నాయనా." వా.
చిఱలు వొడుచు
- బుసకొట్టు.
- పశువులు మొదలగునవి చెలరేగి గంతులు వేయు.
- "చిఱుపెండ వెట్టుచుఁ జిఱలు వొడ్చుచును." బసవ. పు. 160.
చిఱిగినవిస్తరి
- నానాబీభత్స మై పోయినట్టిది.
- "వాళ్ళ అమ్మా నాన్నా పోయినప్పటి నుండీ ఆ పిల్లబ్రతుకు చిఱిగిన విస్తరి అయిపోయింది." వా. చిఱిగోరు
- ఒక రకమైన దుంప.
చిఱుగాలి
- మందమారుతము.
చిఱుగూబ
- పైడికంటి అనే పక్షి. శ. ర.
చిఱుతగండు
- చిఱుతపులి.
- మగ చిఱుత అని కొన్ని కోశాలన్నా వాడుకలో చిఱుతలను చిఱుతగం డ్లని సర్వసామాన్యంగా అంటారు.
చిఱుతనవ్వు
- చిన్న నవ్వు.
చిఱుతనాడు
- చిన్న నాడు.
చిఱుతపఱచు
- చిన్నవిగా చేయు.
- "అభ్రంకషము లైన యానశిరశ్శృంగ, శృంగాటకము లిట్లు చిఱుతపఱచి." కాశీ. 2. 163.
చిఱుతపోవు
- 1. చిన్నపోవు.
- "తఱి దప్పె నైన నిత్తఱి నన్ను నడిగి, చిఱుత పోవుదు వేని." వర. రా. అయో. పుట. 387. పం. 8.
- 2. మొక్క పోవు, చిన్నదగు.
- "చిఱుత వోయిన మూఁకుటి చెలువుఁ దాల్చి." కాశీ. 1. 138.
చిఱుతిండి
- తినుబండారము. పై తిండి.
చిఱుతొడ
- పిక్క.
చిఱునవ్వు
- చిన్న నవ్వు.
చిఱునాలుక
- కొండనాలుక.
చిఱుపాలు
- మీగడ.
- "చే సురు,క్కను నేయుం జిఱుపాలు వెల్లువుగ నాహారం బిడన్." ఆము. 1. 82.
చిఱుపులి
- చిఱుతపులి.
చిఱుబంతి పసుపు
- చాయపసుపు.
చిఱువాడు
- మిగిలిన చిల్లరడబ్బులు. శుక. 3. 117.
చిఱుసాన
- పదును పెట్టే సాన.
చిఱ్ఱగొట్టు
- కోపిష్ఠి.
చిఱ్ఱ చిఱ్ఱ
- తొందర.
చిఱ్ఱలు వొడుచు
- తొందరపడు.
చిఱ్ఱిపట్టె
- ఒక పిల్లల ఆట. చిఱ్ఱుది
- జత.
చిఱ్ఱు బుఱ్ఱు మను
- బుసకొట్టు, కోపించు.
- "కట్టిన పులితోలు కడకొంగు సోఁకి యాఁ, బోతుతత్తడి చిఱ్ఱు బుఱ్ఱు మనఁగ." హర. 5. 16.
చిఱ్ఱు బుస్సను
- కోపపడు - కసరుకొను.
- కోపపడుటలోని ధ్వన్యనుకరణము.
- "ఆ మండోదరి చిఱ్ఱు బుస్సను చసూయాక్రాంత యై పోయి యే,మేమో వేఁడెడు బిడ్డలం గదిసి..." శుక. 3. 274.
చిఱ్ఱు మను
- కోపించు.
చిఱ్ఱు ముఱ్ఱాడు
- 1. చిందఱ వందఱ చేయు.
- "క్రొవ్విరు లెక్కి చిఱ్ఱు ముఱ్ఱాడుచు." కుమా. 9. 102.
- 2. పెనగులాడు.
- "అనుచుఁ గొందలపడు కోర్కు లగ్గలించి, చిఱ్ఱు ముఱ్ఱాడుచుండ నచ్చెలువ చెలువు." భార. విరా. 2. 85.
- 3. చీల్చి చెండాడు.
- "చేకొని శవములఁ జిఱ్ఱు ముఱ్ఱాడు, కాకఘూకానేకకంకగృధ్రములు." రంగ. రామా. యుద్ధ.
చిఱ్ఱు ముఱ్ఱు మను
- కోపించు.
- "ఏ నటు చిఱ్ఱుము ఱ్ఱనుచు నించుక కోపము తాళ లేమి." విప్రనా. 2. 71.
- చూ. చిఱ్ఱు ముఱ్ఱాడు.
చిలచిల మను ధ్వన్యనుకరణము.
- గందపూత ఎండి పేట్లు రేగునప్పు డగు ధ్వని సూచిస్తూ - ఇక్కడ:
- "సిరి నందపు టస లొకింత చిల చిలా మని వే,గిరమ వఱువట్లుగొనఁ గడుఁ, బొరలెడి తరలాక్షి తాపముం గని కలఁకన్." కళా. 6. 255.
చిలవలు పలవలు చేయు
- ఒకటి ఉంటే నూరు కల్పించు.
- "కోడలు ఏదో అన్నదని చిలవలు పలవలు చేసి వాళ్ళత్త కొడుకుతో కొట్టించింది." వా.
చిలివిలివోవు
- 1. ఎక్కువగు, సుళ్ళుతిరుగు.
- "చిలివిలివోవు మచ్చికలు పిచ్చిల్ల." పండితా. ద్వితీ. మహి. పుట. 133.
- "చిలివిలివోవు కోరికలు చిత్తమునం దల లెత్త." విక్ర. 4. 224.
- 2. బలపడు; దట్ట మగు.
- "మానితభక్తి సామ్రాజ్యసంపదలు, సిలివిలి వోవ." బస. ప్రథ. పుట. 2.
- "శివభక్తి సంపదల్ సిలివిలి వోవ." బస. 7. 196.
చిలివిసము
- పనికిమాలిన పని.
- "చిలివిసంబులు కొన్ని చేయు చున్నాఁడు." ద్వి. పరమ. 5. 361. చిలుకకొట్టు
- చిలుక కొట్టిన, లోని సారము పీల్చి వేయబడిన కాయ.
- "ఈ చిలుకకొట్టు తట్టలను మండిగల వైచి యీతఁడు గాడి ప్రొయ్యిపై వేయించును." సాక్షి. 267. పు. 3. పం.
- "ఈసారి మాయింట్లో సగం కాయలు చిలుకకొట్టులే." వా.
చిలుకకొట్టుడు
- పిల్లలు తాము తింటున్నది మరొకరికి పంచి పెట్టేటప్పుడు, ఎంగిలి కాకూడ దని, ఏ బెల్లం ముక్కమీదనో బట్ట వేసి కొఱికి, ఆ ముక్క నిస్తారు. దానిని చిలుకకొట్టుడు, చిలుక కొఱుకుడు అంటారు.
- చూ. కాకియెంగిలి.
చిలుకకొయ్య
- బట్టలు తగిలించుట కైన కఱ్ఱ ముక్క.
చిలుకగోణము
- అతుకులగోచి. బ్రౌన్.
చిలుక, గోరువంకవలె నుండు
- అన్యోన్యంగా ఉండు. ముఖ్యంగా దంపతుల విషయంలో ఉపయోగిస్తారు.
- "వాళ్లిద్దరూ చిలకా గోరువంకల్లాగా కాపరం చేస్తుంటే చూడ ముచ్చ టవుతుంది." వా.
చిలుకచదువు
- చెప్పిన మాట మాత్రమే చెప్పుట. స్వబుద్ధి రాహిత్యమును తెలుపు పలుకుబడి.
- "చిలుకచదు వనుట చదివిన ములుచకు...." కళా. 6. 270.
- చూ. చిలుకపలుకలు.
చిలుకతాళి
- ఒకరక మైన పతకము.
చిలుక నక్కున బెట్ట చెక్కు సెమర్చు
- సుకుమార మయిన. చిలుకను కూడ మోయ లేని దనుట.
- "చిలుక నక్కునఁ బెట్టఁ జెక్కు సెమర్చు, నెలనాఁగ నందను నెట్లెత్తి తెచ్చె." గౌర. హరి. ప్ర. 1597-98.
చిలుకపలుకలు
- విన్న మాటలు.
- స్వాలోచనా రహితము లనుట.
- "వాడి వన్నీ వట్టి చిలక పలుకులు. వాళ్లమామ ఏది చెప్తే అదే." వా.
చిలుక పోయిన పంజరము
- వ్యర్థము.
- చిలుకే లేనప్పుడు పంజర మెందుకు అనుటపై వచ్చిన పలుకుబడి.
- "చిత్త మె,ల్లం జెడి యుండ రిత్తయొడలం జవి చేరునె చిల్క వోయినం, బంజర మేమి సేయ." ఉ. హరి. 1. 72. చిలుకముక్కు
- 1. చిలుకముక్కువంటి ముక్కు.
- 2. ధాన్యవిశేషం.
- 3. ఒక చెట్టు.
చిలుక మెట్టని ఫలములు
- చిలుక కొట్టని పండ్లు.
- "చిలుక మెట్టని ఫలంబులు కోసికొని వచ్చి, పరికించి యారగింపఁ బెట్ట.... వేడ్క యయ్యెడు." శివ. 3. 55.
చిలుకయారె
- చెప్పులు కుట్టే సూది.
చిలుకలకొలికి
- సుందరి. నైష. 8. 50.
చిలుకలకొల్కి
- అందగత్తె.
- "చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై." మను. 5. 63.
చిలుకుటమ్ము
- ఒకరక మైన బాణము
చిలుకుడు గుంజ
- పెరుగు చిలుకునప్పుడు కవ్వం కట్టే గుంజ.
చిలుప చిలుపను
- చిలచిల మను. ధ్వన్యనుకరణము.
- "చిలుప చిలుపని నేతులు జిడ్డు దేఱు, నేమి చెప్పుదుఁ గ్రొవ్విన యేకలములు." మను. 4. 17.
చిలుపచిలుపగా (నెత్తురులు)
- బొళబొళ మని. ధ్వన్యనుకరణము.
- "పంతంబులు వదలించియుఁ జిలుప చిలుప నెత్తురుల జొత్తిల్లిన నేలం గా లూఁద నేరక జీఱువాఱియు." ఉ. హరి. 43. 27.
చిలువానపుమిద్దె
- ఉగ్రాణంకొట్టిడీ, చిల్లర వంట సామా నుంచే గది.
- "వంటకొట్టము చిలువాన ముంచిన మిద్దె." శుక. 3. 48.
చిలువాయనము
- చిల్లర - క్షుద్రము. పాండు. 2. 85.
చిలువాల పాయసము
- పాల పరమాన్నం. చంద్ర. 4. 77.
చిల్కకు చక్కెర వెట్టు
- చిలుకకు ఆహార మిచ్చు.
- "లలనా! చక్కెర వెట్టవే యనుచుఁ జిల్కల్ సారెకుం బల్కఁగా." రాజగో. 2. 10.
చిల్కలకొల్కి
- అందగత్తె.
- "అనుచుం జిల్కలకొల్కి పల్క విని యత్యానంద మిం పొంద ని, ట్లనియెన్." శుక. 1. 493.
- చూ. చిలుకలకొల్కి.
చిల్కల చదువులు
- అర్థం తెలియని చదువులు.
- "చదువు లివి యెల్లఁ జిల్కల చదువు లనుచు." పాండు. 3. 36. చిల్లకట్టె
- ఒక పిల్లల ఆట. నేటి రూపం చిల్లాకట్టె.
చిల్లకోల
- ఒక ఆయుధం - బాణము.
చిల్ల తర్కములు
- చిల్లరవాదములు.
- కుతర్కములు, వ్యర్థవాగ్వాదములు. కుమా. 8. 136.
చిల్ల పెంకు మాత్రము
- విలువ లేనిది.
- "నా కనఁగాఁ గనకము భా,మా! కనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానిన్..." శుక. 1. 520.
- చూ. గవ్వ చేయనిది. గుడ్డిగవ్వ చేయనిది.
చిల్ల పెంచాదిగా
- పూర్తిగా.
- చిల్ల పెంకు కూడా వదల కుండా అనుట.
- "తన యింటి యావత్తు ధనమును మున్ను, సంచితం బగువస్తుసమితియుఁ జల్ల, పెంచాదిగా మట్టగించి తెప్పించి." బసవ. 3. 64.
చిల్ల మడ్డి
- ధూపద్రవ్యము.
చిల్లరకాడు
- సామాన్యుడు. శ. ర.
చిల్లరపబ్బములు
- చిన్న చిన్న శుభకార్యములు.
- "చెలియలి పెండ్లి చేసితిరి చిల్లర పబ్బము లెన్ని యైన శో,భిలె నను నెన్నఁ డైనఁ బిలిపించితిరే?" శుక. 2. 521.
చిల్లరవారు
- అల్పులు, తక్కువ కులాలవారని పూర్వం అలవాటు. భాస్కర. 75.
చిల్లరవెచ్చములు
- పప్పు బియ్యము మొదలయినవి.
- "చిల్లర సామాను అని రాయలసీమలో వాడుక.
- "ఎల్లుండి సమారాధన, చిల్లర వెచ్చములు గొనఁగ శీఘ్రమె యిదె యీ, పల్లియ సంతకు..." శుక. 2. 183.
చిల్లు పొల్లు సేయు
- ధ్వంస మొనర్చు. కృష్ణ. 3. 30.
చిల్లులు పుచ్చు
- బెజ్జాలు పెట్టు.
చిల్లులు వోవు
- రంధ్రములు పడు.
- "చిటిలిన విస్ఫులింగములఁ జిల్లులు వోయె నభ:స్థలంబు." శివ. 1. 90.
చివ చివగా
- గబగబా.
- "చివచివన్ రెం డడుగు లెదు రెక్కి." కళా. 8. 95. చివచివ లొదవు
- అరమరిక లేర్పడు. రాధి. 4. 102.
చివు కంతయు బోయిన చేవ చిక్కు సమ్మతి
- సారము మిగిలినట్లు.
- తాలు పోగా గట్టిగింజలు తేలునట్లు అనుటవంటిది. మానుమధ్యలో చేవ ఉంటుంది. పైభాగమును చివ్వి వేయగా పడు పొట్టు చివుకు. అది పోగా చేవే మిగులుతుంది.
- "అ,య్యతనుని చేతికత్తి చివుకంతయుఁ బోయినఁ జేవ చిక్కు స,మ్మతి..." హంస. 2. 138.
చివుక పిట్ట
- ఒక జాతి గబ్బిలం. శ. ర.
చివుకపిల్లి
- ఒక రకమైన పిల్లి. శ. ర.
చివుకు చివుక్కను
- మనసు చివు క్కను. రాధి. 4. 102.
చివుకు చెదార మైన
- బాగా శిథిల మైన.
- "చివుకు చెదారపుం ధనువుఁ జీల్చుట కింత మదింప నేటికిన్." చం. రా. 3. 146.
చివుక్కున దాటు
- దాటుటలోని ధ్వన్యనుకరణము.
- ".....దరిమి చివుక్కున దాటు హరులు." కవిక. 2. 70.
చివుక్కున నెక్కు ధ్వన్యనుకరణము.
- "నెక్కొను తమకంబున ముంగిసమ్రాని పైకిఁ జివుక్కున నెక్కి యబ్బక్క నక్క..." హంస. 1. 192.
చివ్వకు చే సాచు
- కయ్యానికి కాలు దువ్వు.
- "చివ్వకు చే సాఁప వలదు." కాశీ. 1. 109.
- కాశీ. 6. 180.
చీ అనే పనులు
- తప్పుడుపనులు.
- ఛీ కొట్టించుకొను స్థితికి తెచ్చే నీచపు పనులు. మదన. శత. 67.
చీకటికండ్లు
- వెలుతురు చూడగనే కుంచించుకొని పోవు కన్నులు.
- "ఆ చీకటికండ్లవాడికి పిల్ల నెవరిస్తారు?" వా.
చీకటి చెట్టు
- తమాలవృక్షం.
చీకటితప్పు
- వ్యభిచారము.
- "గౌతమఋషి కులాంగన నహల్యాదేవిఁ, జీఁకటితప్పు జేసిన దురాత్మ." వరాహ. 2. 156.
- "చీఁకటితప్పు చేసిన సరోరుహ నేత్ర, గూబ యై వసియించుఁ గోటరమున." కాశీ. 2. 80.
- "అమరవల్లభుఁడు గౌతముకూర్మి యిల్లాలిఁ, జీఁకటితప్పు సేసినవిధంబు." నైష. 7. 151.
చీకటి త్రవ్వు
- 1. వ్యర్ధప్రయత్నము చేయు. చీకటిలో వెదకుట అలాంటిదే కదా.
- "జీవులు ని న్నెఱుంగక చీఁకటి ద్వాఁగ నేల." తాళ్ల. సం. 6. 182.
- 2. వ్యర్థాలోచనలు చేయు.
- "చీఁకటి ద్రవ్వెద వేలె? చీఱినఁ బలుక వదేలె? తాళ్ల. సం. 4. 53.
చీకటిదొసగు
- చీకటితప్పు.
- "....చీకటిం దొసంగులె లలిఁ గౌరువా రయిన గొబ్బునఁ గాంత్రు విరక్తి ముక్తి..." భాగవతమాహాత్మ్యము.
- చూ. చీకటితప్పు.
చీకటి నెత్తిన వేసుకు వెళ్లు
- చీకటిలో వెళ్లు. కొత్త. 345.
చీకటి పడు
- 1. శూన్య మగు, నిస్తేజ మగు.
- "చిత్తము చీఁకటి వడెను." తాళ్ల. సం. 8. 50.
- 2. సాయంత్ర మగు.
- "అప్పుడే చీకటి పడింది. ఇంటికి వెళ్ళాలి." వా.
చీకటిపా లగు
- వ్యర్థ మగు, పా డగు.
- "చిందరాని నా బుద్ధి చీఁకటిపా లాయె." తాళ్ల. సం. 8. 30.
చీకటి మొటికళ్లు
- చీకటి మొట్టికాయలు. ఒక రకమైన పిల్లల ఆట.
- "చీకటిమొటికళ్లు చిమ్ముబిల్లలు." విష్ణు. 7. 202.
- చూ. చీకటి మొట్టికాయలు.
చీకటి మొట్టికాయలు
- ఒక పిల్లల ఆట. తలమీద బట్ట కప్పి మొట్టికాయ మొట్టి, ఎవరు మొట్టిరో తెలుసుకొను మను ఆట.
- చూ. చీకటి మొటికిళ్లు.
చీకటియీగ
- చిన్న యీగ.
- రూ. చీకటీగ.
చీకటులు త్రవ్వించు
- అనవసరముగా శ్రమపడ జేయు.
- "నే, నెవ్వాఁడం బరమాత్మ గాక పిస వెఱ్ఱీ! విప్ర! యీ చీఁకటుల్, ద్రవ్వింపం బని లేదు సుమ్ము మము బోంట్లన్ వీరి వారింబలెన్." వరాహ. 2. 18.
- చూ. చీకటి త్రవ్వు.
చీకట్లుకొను
- చీకటి పడు.
- "గరము భూనభోంతరము చీఁకట్లు గొనియె." కళా. 4. 89. చీకట్లు గొలుపు
- అంధకారబంధుర మగు.
- "కదన మంతయును జీఁకట్లు గొలుప." జైమి. 2. 70.
చీకాకు చేయు
- చిక్కు పెట్టు; కలత పెట్టు.
- "పై మిన్ను వ్రాలినఁ బదరని ధైర్యంబుఁ, గటకటా కలఁచి చీకాకు చేసె." చంద్రా. 4. 96.
- శుక. 1. 170.
చీకాకు పడు
- 1. గందరగోళ పడు.
- "ఆకు లే వంకఁ జీకాకు పడెనొ." విప్ర. 3. 67.
- 2. కలత చెందు. శివ. 1. 58.
చీకాకు పఱచు
- కలత పెట్టు; చిక్కు పెట్టు.
- "అహితసేనల నెల్లఁ జీకాకు పఱచి." జైమి. 2. 28.
చీకిరికండ్లు
- చూ. చీకటికండ్లు.
చీకిలిమాకిలిగా
- అడ్డదిడ్డముగా.
- "...మదిన్ విచారింపకు చీ,కిలి మాకిలిగా నల్లిన, చెలఁది తెరల్ సూచి సంతసించుట లేదే?" సారం. 1. 15.
చీకుకొక్కెర
- ఒక జాతి కొంగ. శ. ర.
చీకు పర్వు
- అంధకారబంధుర మగు.
- "నభ మంతయుఁ జేకొని చీఁకు పర్వ న,క్తందినచిహ్నముల్ మఱవఁగా." సింహా. 3. 98.
చీకుబండ
- జాఱుడు బండ. నిరం. 2. 69.
చీకురాయి
- ఒక జాతి గబ్బిలము; ఇలకోడి.
- చూ. చీకురువాయి.
చీకురువాయి
- చూ. చీకురాయి.
చీకు లావుకం ద్రొక్కినయట్లు
- కాకతాళీయముగా. గ్రుడ్డివాడు లావుకను తొక్కినట్లు. అనగా యాదృచ్ఛికంగా అనుట.
- అంధలావుకన్యాయం అని సంస్కృతంలోనికీ ఎక్కి న దిది.
- నేటికీ రాయలసీమలో వాడుకలో 'గుడ్డోడు యర్రెలకను దొక్కినట్టు వా డెట్లెట్లో ఈ ఒక్కసారీ గెల్చాడు పందెం' అను రీతిగా ఈ పలుకుబడి వినవస్తుంది.
- 'ఎర్రెలక' ను అన్నట్లే 'ఎర్లావుక' ను అనీ అంటారు. కన్నడంలో 'కురుడం లావుగెయం మెట్టి దంతె' అని సామెత.
- "అక్కజ మై మహార్థ నివహంబు సదుక్తులు మెచ్చఁ జూచినన్, గ్రుక్కిద మైన సత్కృతి యగు ర్పగుఁ గా కిలఁ జీకు లావుకం, ద్రొక్కిన యట్లు నోటి కొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ,క్కొక్కఁడు సక్క నైనఁ గృతియుం గృతి యందురె వాని మెత్తురే." కుమా. 1. 38.
చీకు వట్టిన కోల
- గ్రుడ్డివాని చేతికఱ్ఱ. ఒకరి సాయము లేనిది పనికి రానిది.
- "భావదేవర ! చీఁకు వట్టిన కోల, ఏ వచ్చువిధ మెట్టు లింక ముందఱికి." పండితా. ద్వితీ. మహి. పుట. 112.
చీకువాలు
- చీకటి.
- "నీలి గుడిపినక్రియఁ జీకువాలు గవిసె." కుమా. 8, 94.
చీకొట్టు
- చీచీ యని దండించు, తిట్టు.
- "చీకొట్టుదు రందఱును గుచేలుం డైనన్." కుచే. 2. 32.
చీటికి మాటికి
- 1. మాటిమాటికి.
- చీటికి మాటికిన్ నిఖిలజీవులునుం బొనరించుపాపముల్." శృం. నైష. 7. 76.
- 2. ప్రతి చిన్నదానికి, అల్ప విషయాలకు.
- "అత్తల మామలన్ మగల నన్నలఁ దమ్ములఁ దల్లిదండ్రులన్, జిత్తుల దుద్దు బెట్టుచును జీటికి మాటికి నన్నె చేరఁగా, వత్తురు మేలు కర్జములు వంతుల కిత్తురు నిండుకౌఁగిటం, గ్రుత్తురు మారుకేళి ననుఁ గూడుచు మెత్తురు మత్తచిత్తలై." దశావ. బల. 328. పు.
- "చీటికి మాటికిఁ జెడుదురే బుధులు." రంగ. రామా. అర. 155. పు.
- "ఆవిడ చీటికి మాటికి తగువుకు వస్తుంది." వా.
- "వాడు చీటికి మాటికి అమ్మదగ్గిరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు." వా.
చీటి వ్రాయు
- ఎదుటివానికంటె ఉన్నతుడగు; మించు.
- ఉత్తర ప్రత్యుత్తరములు నడుపు అనే వాచ్యార్థంపై ఉత్తరువు లివ్వగలుగుగా సాగినమాట.
- "సంభ్రమంబున నాకారసౌష్ఠవమున, వాఁడు కందర్పునకుఁ జీటి వ్రాయఁ గలఁడు." హంస. 5. 204.
- "హత్తుకో వచ్చు నీ వంటి యందగాని, కున్న దొకచోట నొక మంచి యొఱపులాఁడి, దాని కిలికించితమ్మునఁ దగిలినట్టి, వాఁడు దేవేంద్రునకుఁ జీటివ్రాయఁ గలఁడు." శుక. 4. 179.
చీడకు చింత గోడకు కోపము
- ఇరువైపులా బాధే అనుట. కృష్ణనీ. 74.
చీడపురుగు
- 1. పంటను పాడుచేసే పురుగు.
- "ఈసారి చీడపట్టి పంట పాడయినది." వా.
- 2. వేరుపురుగు వంటివాడు.
- "ఆ చీడపురుగును నీ వ్యాపారంలో చేర్చుకున్నావా పాడయి పోతావు." వా. చీడుదబ్బ
- వెదురుబద్దలతో గుమ్మటంలా కట్టిన నేసేవారి పనిముట్టు. హంస. 2. 10.
చీదక న్నిడు
- శీతకన్ను వేయు, నిర్లక్ష్యము చేయు.
- "బహువిధంబులఁ బలుకు నా పలుకు లెల్లఁ, జీఁదక న్నిడి తన పెడచెవులఁ బెట్టి." భార. ఉద్యో. 4. 76.
చీదర చెందు
- చికాకుపడు.
- "ఇందీవరభ్రాంతిచే, మెలఁగం జేరలఁ గప్పుకో నలవి గామిం జీదరం జెంది." పారి. 4. 14.
చీదఱలు గొలుపు
- చీకాకు పెట్టు.
- "శంఖభేరిరావములు దిగ్దంతుల చెవులు చీఁదఱలు గొలుప." జైమి. 5. 3.
చీదఱ వాపు
- దు:ఖము తీర్చు; చికాకు, కలత తొలగించు. కుమా. 8. 159.
చీది వేయు
- ఏడ్చు.
- "ఏమిట్రా ! మీ అక్క చీది వేస్తూ కూర్చుంది?" వా.
చీనకర్పూరము
- ఒక విధమైన కర్పూరం.
చీనాచక్కెర
- ఒక రకమైన చక్కెర.
చీనాపంచదార
- ఒక రకమైన చక్కెర.
చీనిచక్కెర
- ఒక రకమైన పంచదార.
- "ఒక్కొక్కయెడఁ జీని చక్కె పానకం, బానిన ట్లాహ్లాద మావహిల్ల." రాజగో. 1. 18.
- రూ. చీనాచక్కెర.
చీనిపావడా
- మంచి పావడా. చీనాంబరం లాంటిదే. చీనా దేశంనుండి వచ్చే బట్ట ఆనాడు సున్నిత మై వచ్చిన మాటలివి.
- "తొడవులు పుచ్చి నిర్జరవధూటుల వేలుపు మాని చీని పా,వడల ధరించి." పారి. 4. 24.
చీనిపిష్టము
- సిందూరము.
చీనీలు
- ఒక రకమైన బట్టలు. ప్రబంధ. 615.
చీపురుకట్ట తిరుగ వేయు
- దండించు; అవమానించు ముఖ్యంగా స్త్రీ.
- "ఆ పిల్లను అదీ యిదీ అన్నా వంటే చీపురుకట్ట తిరగ వేస్తుంది." వా.
చీపురుకట్ట సరసం
- మోటుసరసం.
- "వాళ్ల దంతా చీపురుకట్ట సరసం లే." వా. చీమంత
- కొంచెము, కాసంత. చీమ అన్నిటికన్న చిన్నది కదా - అంత అనుట.
- "చీమంత యైన వంచింపని బాస." బస. 2. 28. పు.
- చూ. కాసంత, చింతాకంత.
చీమంతకు (కైకొనడు)
- కొంచెం కూడా (లెక్క పెట్టడు.)
- "చీమంతకుఁ గైకొనఁ డసుర, భటాంతకవిశ్రాంతి." కుమా. 11, 89.
చీమ కండ్లు
- చిన్న కండ్లు
చీమ కుట్టినట్టు లైన లేదు
- ఏకొంచెం బాధ కూడ లేదు.
- ఏ కొంచెం లెక్క లే దనుట.
- "దీని గూర్చి మనము నిర్లక్ష్యముగఁ జూచుచున్నారము. మన కేమో చీమ కుట్టినట్టు లైన లేకుండ నున్నది." సాక్షి. 60. పు.
- వాడుకలో రూపం - చీమ కుట్టిన ట్టైనా లేదు.
- "వాడికి ఇంతమంది యిన్ని మాటలంటుంటే చీమ కుట్టిన ట్టయినా లేదు." వా.
చీమగంగాయాత్ర
- అసంభవము. తెగనిది, నెఱవేఱనిది.
చీమచింత
- ఒక రకమైన చెట్టు.
చీమ చిటు కనకుండ
- ఏమాత్రం శబ్దము కాకుండ.
- "చీమ చిటు కనకుండంగఁ జిత్రపటము, వెంటఁ గళ దేల్పుకైవడి......" సుదక్షి. 4. 117.
చీమ చిటు కన్నను
- ఏమాత్రం అలికిడి అయినా.
- "ఆలు బిడ్డ లే, కరయని రేలుఁ జీమ చిటు కన్నను విప్పనిమూఁకలున్." ఉ. హరి. 1. 131.
- వాడుకలో కూడా ఉంది.
- "చీమ చిటుక్కు మన్నప్పుడల్లా వాడు వస్తున్నా డేమో నని చూచాను." వా.
చీమ చిటుక్కు మాన్న, చిమ్మట జిఱ్ఱన్న
- ఏమాత్రం అలికిడి అయినా.
- "చీమ చిటుక్కు మన్న వినుఁ జిమ్మట జిఱ్ఱన నేఁగునంతలో." హంస. 3. 40.
చీమ చిటుక్కు మన్న చిమ్మట బుఱ్ఱన్న
- ఏమాత్రం అలికిడి అయినా.
- "చీమ చిటుకు మన్న చిమ్మెట బుఱ్ఱన్న, నెదుర మూషికములు మొదలుకొనిన." పంచ. వేం. 4. 168. పు.
చీమచిప్పర
- ఒక రకమైన గడ్డి.
చీమపరి లాగా
- చీమలబారువలె (చుట్టు ముట్టు.)
- "రయ సముద్ధూతధూళి ధూసరిత ధారాధర పథం బగుచు నొక్క పరియ చీమపరి యనన్ గవిసె నందు." మను. 4. 110.
చీమల గామల వలె
- ఇంటినిండుగా.
- చీమలు గామలు. జం.
- "మా యింటి ముందటను, గలగొని చీమల గామలవలెను, జెలఁగుచు ముందర శిశువు లాడఁగను." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1890-91.
చీమలచాలు వలె
- అల్పముగా.
- "అ,తని మదికిన్ భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నై, కనఁబడు." శుక. 3. 387.
చీమలు దూరని
- దట్ట మైన.
- అతి చిన్న దైన.
- చీమ పట్టుట కైనా వీలు లేనంత దట్ట మైన దనుట.
- చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి - జానపదగాథలలో సామాన్యంగా వచ్చే పలుకుబడి.
- "చీమలు దూఱని చీఁకటి కాన, సరగునఁ గొనిపోయి సారంగధరుని." సారం. ద్వి. 2. 88.
చీమవలె కూడబెట్టు
- మిక్కిలి జాగ్రత్తగా దమ్మిడీ దమ్మిడీ కూడబెట్టు. ప్రతి చిన్నదానినీ సంపాదించి చీమ కూడబెట్టు ననుటపై వచ్చినది.
- "బిడ్డల కొసఁగక పెండ్లాము కిడక వడ్డి కిచ్చుచుఁ జీమవలెఁ గూడఁ బెట్టి." గౌర. హరి. 2. 166.
చీము నెత్తురు ఉంటే
- పౌరుషం ఉంటే - స్వామానం ఉంటే.
- "వా డన్నిమాట లంటూ ఉంటే చీమూ నెత్తురూ ఉన్నవా డయితే బయిటికి రాకుండా యింట్లో దూరుకొంటాడా?" వా.
చీము నెత్తురు ధారపోయు
- త్యాగము చేయు, ఎన్ని శ్రమల కైనా ఓర్చు.
- "ఆ సంస్థకోసం వాడు తన చీము నెత్తురూ ధారపోశా డంటే నమ్ము." వా.
చీము నెత్తురు లేని...
- ఏమాత్రం స్వాభిమానం, ఆత్మగౌరవం లేని.
- "వా ణ్ణెన్ననీ ఏం లాభం? చీము నెత్తురు లేని వాడు. ఏ మన్నా పడతాడు." వా.
చీము పట్టు
- కురుపులు మొదలైనవానిలో చీము చేరు.
- "కొబ్బెరా పప్పూ తినకురా. చీము పడుతుంది." వా.
చీము పోయు
- చీము పట్టు.
- "చీము పోసి కురుపు నొప్పి చేసింది." వా.
చీములు గట్టు
- బాధ చెందు. ముఖ్యంగా వినగూడనివి వినుటవల్ల.
- "పుడమి జనంబు లెల్ల నినుఁ బ్రువ్వఁగఁ దిట్టఁగ వించు నున్కి నొ,చ్చెడు మది యెప్పుడున్ చెవులు చీములు గట్టెడు." భార. ద్రో. 2. 10.
చీమూ నెత్తురు ఉన్న శరీరం
- కామక్రోధాదు లుండుట మానవమాత్రులకు తప్పదను పట్ల అనే మాట.
- "పాపం సమర్త కాక ముందు ముండమోసిన పిల్ల. అది మాత్రం ఏం చేస్తుంది? చీమూ నెత్తురూ ఉన్న శరీరం..." వా.
చీరఛాప
- తెరచాప. బ్రౌన్.
చీరచింపు
- ఒక రకం చేప.
చీర చిక్కు
- గర్భము ధరించు.
- నెలలు అయినకొలదీ కడుపు పెరగడం, తన్మూలంగా చీర తక్కువపడడం మీద ఏర్పడిన పలుకుబడి.
- "చిట్టుముల్, రామకు సంభవించె నభిరామతరంబుగఁ జీర చిక్కినన్." హంస. 2. 93.
- "పాయనిమంద నుండి యడపా దడపా చనుదెంచు బోయనిం, బోయినఁ జీర చిక్క దఁట పుణ్యము లేదని మానసంబునన్." పంచ. (వేం.) 1. 56. పు.
- "నెల రెణ్ణెల్లకుఁ జీర చిక్కెఁ ద్రిజగ న్ని ర్మాత యిల్లాలికిన్." కా. మా. 2. 80.
చీరపిట్ట '*చీర పేను. బ్రౌన్. చీర పెట్టు
- ఒక చీరను కానుకగా ఇచ్చు.
- "తన భార్య తద్దినానికి ఏటా ఎవరో ఒక ముత్తైదువకు చీర పెట్టడం అతనికి అలవాటు." వా.
చీరపేను
- తెల్లనిపేను.
- ఈ పేలు పడ్డం దరిద్ర మని అంటారు. భార. ఆను. 5. 54.
- "ఆ చీరపేలు పడిన వెధవను లోపలి కెందుకు రానిచ్చార్రా." వా.
- చూ. చీరపోతు.
చీరపోతు
- చీరపేను.
- వాడుకలో - చీరపోతు అనే రూపం ఎక్కువగా వినవస్తుంది. బ్రౌన్.
- చూ. చీరపేను.
చీర వేయు
- మగడు చనిపోయినప్పుడు పుట్టింటివారు రేవులో విధవకు కొత్తచీరను ఇచ్చు.
- "అంతమంది అన్నదమ్ము లుండీ ఆ విడకు చీర వేసే దిక్కయినా లేక పోయారు." వా. చీరా రవికా పెట్టు
- చీర, రవిక కానుకగా ఇచ్చు.
- "పెండ్లికి వచ్చిన ముత్తైదువ లందరికీ చీరా రవికా పెట్టారు." వా.
చీ రావిగొను
- కంటికి దెబ్బ తగులగా బట్టను మడిచి నోటిలో ఆవిరిపట్టి కంటిని కాపు.
- "చీ రావిగొని కంటఁ జేర్చి హత్తించి." బస. 3. 84. పు.
చీరికి గైకొను
- లక్ష్యపెట్టు. శివ. 4. 61.
చీరికి గొను
- లెక్కించు, లక్ష్యపెట్టు.
- "నృపాలుండు భటేతరుం డయిన శత్రుల్ చీరికిం గొందురే." ఉత్త. రా. 7. 69.
- "కాముం జీరికిఁ గోక." హర. 5. 33.
- చూ. చీరికి గైకొను.
చీరువాఱు
- పిలుచు; జీరాడు. అర్థ మింకనూ విచార్యము.
- "సిగ్గుమఱుంగునఁ జీరువాఱ." శ్రీరాధా. 5. 147.
చీలమండ
- పాదంపైన పిక్కక్రింద ఉండే గుల్ఫము.
చీలమన్ను పూయు
- పుటం పెట్టేటప్పుడు రెండు మూకుళ్ళు మూసి నడుమ మందు ఉంచి గుడ్డచుట్టి మన్ను పూయు.
- ఆ యుర్వేద రీత్యా భస్మసిందూరాదులు చేయుటలో దీనిని ఉపయోగిస్తారు.
చీలిగాడు
- పిల్లి.
చీవాట్లమారి
- చీవాట్లు తినువాడు. శుంఠ.
- "ధర్మవిదుఁ డైనరాజు నాస్థానమునను జేరు నొక్కొక్క చీవాట్లమారి శుంఠ." హ్జంస. 5. 113.
చీవాట్లు తిను
- తిట్లు తిను.
చీవాట్లు పడు
- తిట్లు తిను.
చీవాట్లు పెట్టు
- తిట్టు, దండించు.
- "ఆయనదగ్గరికి వెడితే నాలుగు చీవాట్లు పెట్టి పంపిస్తాడు. వెళ్ళు. వా.
చీళితవెట్టు
- తొలగించు, రాల్చు.
- "వాలుగడాలు వాని దళవాయి వసంతుఁడు జైత్రయాత్రకై, సాలములందు జీర్ణదళసంఘము చీళితపెట్టి క్రొత్తగా, మేలిదళంబులన్ నిలిపి." తారా. శ. 2. 112.
చుంగులువాఱు
- కొంగులు, అంచులు వ్రేలాడు.
- "కుందనపు టంచు దుప్పటి, సుందరి యొక్కర్తు గట్టి చుంగులువాఱన్." చంద్రా. 6. 15.