పదబంధ పారిజాతము/ఎం
ఊసు____ఋణ 239 ఋణ____ఎం
ఊసులాడు
- కబుర్లు చెప్పుకొను.
- "నెలతల్ ముచ్చట కూసులాడెదరు." క్షేత్రలక్ష్మి. 74.
ఊహాగానము చేయు
- ఏదో ఒక విషయముపై ఊరికే ఊహించు.
ఊహాపోహలు కల...
- ఊహాపోహలు కలవా డంటే వివేకి, బుద్ధిమంతుడు.
ఋణము తీర్చుకొను
- ఎవ రైనా మేలు చేసినప్పుడు ఉపకారమునకు ప్రత్యుపకార మొనరించు. ఇది రకరకాలుగా ఉపయోగ పడుతుంది. 'నీ ఋణం తీర్చుకోలేను' 'నీకు నేను ఋణపడినాను' 'నీ కేదో చేసి యీ ఋణం తీర్చుకోవాలి' ఇత్యాదులు.
- "నీ ఋణము దీర్ప గలవాడనే యటంచు." హంస. 1. 255.
ఋణము తీరు
- సంబంధము తెగిపోవు.
- "...నీకు నాకును ఋణము దీరె." శ్రవ. 5.83.
ఋణము పణము
- అప్పూ సప్పూ. జం.
- "పాలు గాఱెడు నీదుకపోలఫలక, మందు గనుగొన నిమ్ము నాయకము నేడు, మొద్దు లద్దాలు గిద్దాలు మోటు గావె, ఋణమొ పణమో విచారింత మెప్పు డేని." కవిమాయ. అం. 2. పు. 28.
ఋణము వడ్డితో నీగు
- చేసినపనికి పూర్తిగా ప్రతీకారము చేయు; వడ్డీతోపాటు అప్పు తీర్చు.
- "ఆ సభలో గొన్నఋణ మంతయు నీగగ గంటి వడ్డితో." భార. కర్ణ. 3. 195.
ఋణానుబంధము తెగు
- ఋణము తీరు. 'ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా:' అన్న దానిపై వచ్చినది.
- "తప్ప రాదు ఋణాను బంధంబు దెగిన, బ్రాణపద మైనవలపును బాసి చనదె." మను. 3. 140.
- "వానికీ నాకూ ఆనాటితో ఋణాను బంధం తెగిపోయింది." వా.
ఋతుకాలము
- రజోదర్శన మయిన పది దినాలవరకూ ఋతుకాల మని కళాశాస్త్రం.
ఋతుమతి యగు
- రజస్స్వల యగు.
ఎం. ఆర్. ఆర్. వై.
- మహారాజరాజశ్రీ. ఈమాటకు ఇంగ్లీషు పొడి అక్షరాలు. మొన్న మొన్నటి ఎంగి____ఎంగి 240 ఎంఘి____ఎంగి
దాకా అడ్రెసుల్లో ఇలానే వ్రాసేవారు.
- "యమ్మారార్వైగారికి." పాణి. 6. 97.
ఎంగిలాకులు నాకు
- నీచమునకు పాల్పడు.
- "వాడు ఒట్టి ఎంగిలాకులు నాకేవాడు." వా.
ఎంగిలించు
- ఎంగిలి చేయు.
- "మొన లావులించి వాసన సల్ల బసి గొని, లేదేటిగము లెంగిలింపకుండ." కుమా. 3. 108.
- "వాడు అన్నం ఎంగిలి చేసినాడు." వా.
ఎంగిలి కాశించు
- ఉచ్ఛిష్టమునకు ఆశించు, నీచ కార్యమునకు పాల్పడు.
- "నీ విట్లా ఎంగిలి కాశిస్తా వని అనుకోలేదు." వా.
ఎంగిలికూటి కాశించు
- పరస్త్రీ కాశించు అనుపట్ల కూడ ఉపయోగిస్తారు.
- చూ. ఎంగిలి కాశించు.
ఎంగిలి గావించు
- ఎంగిలి చేయు. స్త్రీ విషయంలో అయినప్పుడు పరస్త్రీని కవయు అని అర్థము.
- "అనంగ క్రీడా సంగతి నెంగిలి గావించె." నిర్వ. 6. 74.
ఎంగిలి గుడుచు
- నీచపుతిండి తిను.
ఎంగిలిచేత కాకి వ్రేయనివాడు
- అతిలుబ్ధుడు. ఎంగిలిచేతితో కాకిని అదిలిస్తే ఆ మెతుకు ఎక్కడకింద రాలి అది తింటుందో అని భయపడే వాడు అనుట.
- "కసరి యెంగిలిచేత గాకి వ్రేయని వాడు, సత తాన్న దాన ప్రశస్తుడయ్యె." పాండు. 4. 210.
ఎంగిలిచేయి విసరని
- అతిలోభి యైన.
- "వాడు ఎంగిలిచేత్తో విసరేవాడు కాదు." వా.
ఎంగిలి చేయు
- చూ. ఎంగిలించు.
ఎంగిలిపడు
- కొద్దిగా భోజనము చేయు. నాలుగుమెతుకులు తిను.
- "నా కేం ఒంట్లో బాగు లేదు. కాస్త ఎంగిలిపడి లేచాను." వా.
ఎంగిలిమంగలం
- అనాచారభరిత మనుట.
- "వా ళ్లిల్లు అంతా ఎంగిలిమంగలంగా ఉంది." వా.
ఎంగిలిమందు
- తేనె. భస్మాదులు తేనెతో రంగరించి నాకించడం అలవాటు. అందుకై యేర్పడినది.
ఎంగిలిమాట
- ఎవరో అన్న మాట. మాటా. 26. ఎంగి____ఎండ 241 ఎండ____ఎండ
ఎంగిళ్ళెత్తు
- నీచపుపనులకు పాల్పడు.
- "ఆ వెధవ వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎంగిళ్లెత్తుకుంటూ బతుకుతున్నాడు." వా.
ఎంచులు పెట్టు
- తప్పులు పట్టు.
ఎండకన్ను ఎఱుగని
- అ సూర్యంపశ్య యైన, ఏమాత్రం కష్టమూ ఎఱుగని ఇలు వెడలని.
- "ఎండక న్నెఱుగనియీ రాజచంద్రు, డవని శాత్రవులకు నర్పించి పెక్కు, గానల ద్రిమ్మరి కాయంబు డస్సి." పల్నాటి. 92 పే.
- "ఎండక న్నెఱుగని యింద్రుని యిల్లాలు, పలుపంచలను జాలి బడియె నేడు." భాగ. 8. 469.
- "ఎండక న్నెఱుగక యేప్రొద్దు నన్ను, నండ బాయనివాడ వయ్యయో నేడు, ఇంతి యింటికి బోయి యేమంటి వన్న?" సారం. 2. 531.
- చూ. ఎండకన్ను నీడకన్ను ఎఱుగని.
ఎండకన్ను నీడకన్ను ఎఱుగని
- ఎండమొగం చూడని; కష్ట మెరుగని.
- "క్రీడమై నెండకన్నును నీడకన్ను, నెఱుగ కన్నల దమ్ముల హితుల సుతుల, గూడి సుఖ మున్న వారము కోర్కు లొదవ, సత్య సల్లాప! యో హరిశ్చంద్రభూప!" హరిశ్చ. 1. 212.
- చూ. ఎండకన్ను ఎఱుగని.
ఎండకన్నును వానకన్నును ఎఱుగని
- కష్ట మెరుగని; ఇలు వెడలని.
- "వచ్చి రెండకన్ను నీడకన్నును నెఱుంగని పురంధ్రులు..." భార. ఆశ్ర. 1. 113.
- చూ. ఎండకన్ను నీడకన్ను ఎఱుగని.
ఎండ కెండి వానకు తడియు
- అన్ని కష్టాలకూ ఓర్చు. తె. జా.
ఎండగట్టు
- ఎండలో ఆరవేయు.
- "తడిబట్టలు ఎండగట్టుదా మంటే దండెమైనా లేదు." వా.
ఎండగొట్టు
- వడ దెబ్బ తగులు. రా. వి. 269.
ఎండతాకు
- వడ దెబ్బ తగులు.
- "బెడిద మగునెండతాకున, దొడిమలు వసివాడి." పారి. 4. 19.
ఎండ నుండగ నీడ యెదురు వచ్చు
- ఎంతో బాధపడుతుండగా, తనంతట ఏదో ఒక ఆశ్వాసము సమకూరు.
- "ఎండ నుండగ నీడ యెదురు వచ్చుట గదా, సుదతి చల్లనిచూపు జూచె నేని." ఉషా. 3. 49.
ఎండపసుపు
- అశాశ్వతము. నీరెండ పడి యేర్పడే పసుపు రంగు. పసుపు ఎండలో పెడితే రంగు మారుతుంది అనుటపై ఎండ____ఎండ 242 ఎండ____ఎండ
యేర్పడినా ఏర్పడి ఉండవచ్చును.
- "ఊతనీరు చెలదినేత మూటాయిటి, దూది యెండపసుపు దొఱ్ఱి యక్క, రంబు....మేను." ఆము. 6. 62.
ఎండబడు
- ప్రొద్దెక్కు.
- చూ. ఎండవడు.
ఎండబాఱు
- ఎండిపోవు.
- "పండబాఱినపొల మెండబాఱె." మను. 3. 129.
ఎండబెట్టు
- ఎండలో ఉంచు.
- "గోధుమలు ఎండబెట్టుదా మనుకుంటుంటే యింతలో వర్షం ముంచుకొని వచ్చింది." వా.
ఎండమఱువు
- గొడుగు. సాంబ.
ఎండమావుల నీళ్లు
- లేనివి. ఎండమావులు నీళ్లుగా కనిపించినా అందులో నీళ్లుండవు. తాళ్ల. సం. 7. 34.
ఎండమావులను పట్టగల
- అసాధ్యకార్యము లొనర్ప గల, ఏమైనా చేయగల. నిరసనార్థద్యోతకంగా అనుమాట. కుమా. 8. 135,
ఎండమావులు
- మృగతృష్ణ.
- "ఎండమావులట్టుల సంపత్ప్రతతులు." భార. ఆది. 5. 159.
- "ఎండమావులను దప్పు లేల దీరునోయమ్మ." తాళ్ల. సం. 4. 54.
ఎండమావుల కడగాళ్లు గట్టనేర్చు
- అసాధ్య కార్యములను చేయ గలవా రనుటలో నిరసన సూచిస్తూ అనేమాట. ఎండమావులను కాళ్లు కట్టి వేయడం అసాధ్యం కదా!
- పండిత. ప్రథ. పురా. పుట. 359.
ఎండలు నీడ లగు
- సౌభాగ్యము చెడు.
- "వండ వండ నట్లుగా వారి జూచి నవ్వేవు, యెండ లెల్లా నీడ లాయె నింక నేటిమాటలు." తాళ్ల. సం. 3. 557.
- ఇక్కడ ఎండ ఆనందసూచకం. తద్విరుద్ధము నీడ.
ఎండలు నీడలు కాయు
- మంచిరోజులు పోయి చెడు రోజులు వచ్చు.
- "ఉండం బాసె నడవిలో నొకతె నేను, ఎండలు నీడలు కాసె నేమి సేతురా!" తాళ్ల. సం. 3. 663.
- చూ. ఎండలు నీడ లగు.
ఎండ లేనినాటి నీడ
- ఉండ దనుట.
- తాళ్ల. సం. 12. 55. ఎండ____ఎండు 243 ఎండు___ఎంత
ఎండలోని నీడ
- శ్రమాపనోదకము.
- తాళ్ల. సం. 11. 3 భా. 125.
ఎండవడు
- 1. ఎండలో ప్రయాణము చేయు.
- 2. ఎండ బాగా ఎక్కు.
- "ఓ, తెరువరి యింత యెండవడి తేగల యట్టి వి కేమిభాగ్యముల్." గంధ. 66.
- "దూరము వోయి యెండవడి దూపిలి వచ్చినప్రాణనాథునిన్, ద్వారకవాట గేహళులదాక నెదుర్కొని..." కాశీ. 2. 81.
- "బాగా ఎండవడి పోయింది. చల్లబడి తర్వాత బయలుదేరొచ్చు." వా.
- చూ. ఎండపడు.
ఎండవాలారునందాక
- పొద్దు వాటాలేవరకూ అని నేటిరూపం. చల్లబడేవరకూ అనుట.
- "ఎండ వాలారునందాక నిండుకొలని, తీరమున మఱ్ఱినీడ నిద్రించె నతడు." శివ. 3. 27.
- చూ. పొద్దు వాటాలు.
ఎండుగులు
- ఎండబోసిన ధాన్యము.
- "కలనుపుటెండుగుల్ ద్రవిడకన్యలు ముంగిట గాచి." ఆము. 1. 75.
- రూ. ఎండువులు.
ఎండుతెవులు
- క్షయలాంటి వ్యాధి. శ. ర.
ఎండువులు
- ఎండబోసిన ధాన్యము.
- "ముంగిళ్ళ నెండువులు గానం బడవు." కేయూ. 3. 84.
- రూ. ఎండుగులు.
ఎంత కాదు!
- ఎం తైనా అగు ననుట.
- "కాకతోడ జిత్తమెల్ల గరగి నీరై మించె, ఏకట నెవ్వరి కైన నెంత గాదు ప్రియము." తాళ్ల. సం. 12. 335.
ఎంతకు దెచ్చెను?
- దీనివల్ల ఎంత అనర్థం కలిగింది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఎంతకు దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దములు?" ఆము. 5. 77.
- "నువ్వు ఆ రోజు ఏదో తమాషాకు అంటే ఆ మాట ఎంతకు తెచ్చిందో చూడు. అతనికీ నాకూ బద్ధ ద్వేషం యేర్పడింది." వా.
ఎంతకు నెత్తుకొంటివి ?
- 1. ఎంతకు ఎక్కు పెట్టితివి, ఎంతకు దిగితివి. ఎంతకు తెగించావు ? ఎంతకు సిద్ధ మయ్యావు ? అన్న అర్థంలో ప్రయుక్త మవుతుంది.
- "నా కొప్పనిబాస నిచ్చితి వహో యిటు లెంతకు నెత్తుకొంటి విం, కెప్పని కైన నమ్మదగునే." శుక. 1. 540.
- "దయ యింత లేక యెంతకు నెత్తుకొంటి ర,క్కట మిమ్ము గన్నది గాక తల్లి." శుక. 4. 42. ఎంత____ఎంత 244 ఎంత____ఎంత
ఎంతకు దిగితిని అనే నేటి వాడుక. రాయలసీమలో ఎంతకు వగదెగితివి అని ఇదేచోట అంటారు. ఎంతకు నేరరు ?
- ఎంత కైనా సిద్ధపడతారు అని తాత్పర్యం.
- "ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదే కదా." శుక. 4. 28.
- వీడు ఎంత కైనా తగును, ఎంత కైనా మనిషి మొదలయినవాట్లో ఈ పలుకుబడి వినవస్తుంది.
ఎంతకు లేడు ?
- ఎంతపనికి సిద్ధపడడు? ఎంత పని కై నను సిద్ధపడు ననుట.
- "ఎంతకు లేడు నారదమునీంద్రుడు శౌరి వినంగ నేను వినగా." పారి. 1. 80
ఎంత కెంత
- ఎక్కడి కెక్కడ ?
- "ఏమి చెప్పవలయు నెంత కెంత ?" వీర. 2. 81.
ఎంత కైనా మనిషి
- ఎంత దుష్కార్యం చేయనైనా సమర్థత గలమనిషి.
- "వా డెంత కైనా సమర్థుడు. పొగడ గలడు, తెగడగలడు. వాణ్ణెవడు నమ్ముతాడు?" వా.
ఎంత కైనా తగును
- ఏ చెడుగు కైనా సిద్ధపడును.
- "నిన్న తప్పక సాయపడతా నని ఈ రోజు తానే వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. అత నెంత కైనా తగును." వా.
ఎంత గింజుకున్నా
- చూ ఎంత తన్నుకున్నా.
ఎంత చెప్పితే అంత
- ఆ మాటకు తిరుగు లే దనుట.
- "ఆ పెళ్లాం ఎంత చెప్పితే అంత. ఆడికి ఏమాత్రం విచక్షణ లేదు." వా.
ఎంతటిదవ్వు ?
- చాలా దూరము, మాకూ వానికీ చాలా దూరము - అనుట వంటిది.
- "ఈ పరిపాటి సేవ రచియించుటకే తగినట్టివార మో, భూపవరేణ్య! యేము పెఱపోడుము లెంతటి దవ్వు మా కికిన్." కళా. 7. 229.
ఎంత తన్నుకున్నా
- ఎంత అవస్థ పడినా, ఏం చేసినా అనే సందర్భంలో ఉపయోగిస్తారు.
- "ను వ్వెంత గింజుకున్నా ఎంత తన్నుకున్నా వాడిదగ్గర దమ్మిడీ రాలదు." వా.
- "ఎంత తన్నుకున్నా వాని కా పద్యంలో ఒక్క పాదం అర్థం కాదు." వా.
ఎంత తల బద్దలు కొట్టుకొన్నా
- ఎంత విడమరచి చెప్పినా. కొత్త. 78. ఎంత____ఎంత 245 ఎంత___ఎంత
ఎంత తీపు!
- ఎంత ఆసక్తి; ఎంత ఆశ !
- "భూమికి గాగ... ఘోర సంద్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు నెంత దీ పొకో." భార. భీష్మ. 1. 15.
ఎంత దఱిగిన మిరియాలు జొన్నల సరిపోవా ?
- ఎంత చెడ్డా సత్త్వమున్న వాడు సత్త్వ మున్నవాడే అనుట. ఇదే అర్థంలోనే పడుకున్నా ఏనుగు గుఱ్ఱం ఎత్తుంటుంది అన్న లాంటి పలుకుబడు లున్నవి. మిరియాలు విలువ గలవి. జొన్నలు చాలా చౌక, ఎంత చెడ్డా మిరియాలు జొన్నల వెల చేయవా అనుట.
- "ఎంత దఱిగిన మిరియా, లుం జొన్నల సరిపోవే, లంజెతనములందు గొమిరెలన్ గెలువవటే!" ఉ. హరి. 1. 75.
ఎంతదనుకా
- చూ. ఎంతదాకా.
ఎంతదాకా
- ఎంత సేపూ.
- "ఎంత దాకా వాడిమాట వాడి గానీఒకడు చెప్పేది కించిత్తైనా గ్రహించడు." వా.
- చూ. ఎంతసేపూ.
ఎంతపని వచ్చినను
- ఎంత అవసరము ఏర్పడినను.
- "ఎంతపని వచ్చినను నిదె, చెంతనె యున్నాడ భీతి జెందకు మనినన్." హంస. 3. 222.
- "ఎంతపని వచ్చినా నే నున్నాను గదా. నీ వలా కూచో బావా! ఎందుకు దిగులు పడతావు?" వా.
ఎంతమా టంటే అంతమాట అను
- నోటికి వచ్చినట్లు దుర్భాష లాడు.
- "నీవు సంపన్నుడ వైతే కావచ్చు, అంతమాత్రాన నీవు ఎంతమా టంటే అంత మాట అంటూంటే ఊరుకుంటానా ఏమిటీ?" వా.
- "అ దేం కోడలో నమ్మా ! వాళ్ళత్తను పట్టుకొని ఎంతమా టంటే అంతమాట అంటుంది." వా.
ఎంత మీను వచ్చి యెంత మీనును మ్రింగె ?
- ఎంత చిన్నవాడు ఎంత పెద్దపనికి ఒడబడెను అనుపట్ల ఉపయోగించేపలుకుబడి. పెద్ద చేప చిన్న చేపను మ్రింగుట అలవాటు. తద్విరుద్ధస్థితి నిది సూచించును.
- "తగరు కొండమీద దాక గోరిన దారి, నెదురు దన్ను దెలియ కింత పలికె, నెంత మీను వచ్చి యెంత మీనును మ్రింగె, గాన త్రుళ్లి నెద్దె గంతమోయు." రాధి. 3 ఆ.
ఎంత మీ లెంత మీల ద్రాగు
- ఎంత చేపలు ఎంత చేపలను ంరింగ సాగెను ? పెద్దవి చిన్న వానిని మ్రింగును కాని ఎంత____ఎంత 246 ఎంత____ఎంత
చిన్నవే పెద్దవానిపై తిరుగ బడెనే అనుట.
- "ఉగ్రుపై నట వోయె దకట లగ్గ మేలు మే, లెంత మీ లెంత మీల ద్రాగు." కుమా. 4. 66.
ఎంతయిన
- 1. చాలా.
- "మానవిఖ్యాతి లాభసంపన్ను డగుట, యెంతయిన నొప్పు నట్టు గాదేని హాని." శుక. 1. 367 పు.
- వాడుకలో అ దెంతైనా బాగున్నది అనడం కద్దు.
- 2. ఏమయినా.
- "ఎంతయినా పెద్దవాడుకదా ! నీ విలా ఎదిరించ వచ్చునా ?" వా.
ఎంత లే దన్నా
- కనీసం.
- "ఇప్పటి కెంత లే దనిన నిర్వదికిన్ బయి నుండు." పాణి. 1. 39.
- "ఎంత లేదన్నా ఈ పెండ్లికి పదివేలు ఖర్చు పెట్టి ఉంటాడు. వాని కేం ? కలవాడు." వా.
ఎంత లే దింతె కద!
- అయితే అయింది లే అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
- "అనుడు నాతండు తత్సంగమాస జేసి, యెంత లేదింతె కద దీని కేల వగవ ?" శుక. 3. 195.
ఎంత లేదు ?
- ఎంతో ఉన్నది. ఇది పోయిన దని దు:ఖ మేల అనుట.
- "అని పల్క నత్త కనికర, మున రావే యెంత లేదు..." శుక. 2. 581.
ఎంతవారును...
- ఎంతవా రైనా అని వాడుక రూపం. ఎంత గొప్పవారైనా అని అర్థం.
- "ఎంతవారును దెలియంగ నెంతవారు." కాశీ. 1. 104.
- "ఎంతవార లైన కాంతదాసులే." త్యాగరాజ కీర్తనలు.
- పై ప్రయోగంలోని రెండవ 'ఎంతవారు' ఈ అర్థాన్నే సూచిస్తుంది.
- 'ఎంతవాడికి ఆ పని సాధించడం సాధ్యం కాదు' అని ఏకవచనంలో కూడా ఇది ఉంది. ఈ ఉచ్చారణలోని కాకువును పురస్కరించుకొని ఈ 'ఎంత' అది అతి సులభము, కించిన్మాత్రము అనే అర్థాలను కూడా స్ఫురింప జేస్తుంది.
- "ఇంత పెద్దపని చేయడానికి వా డెంతవాడు ?
- "వాడికి ఈ పని యెంత ? ఒక్క నిమిషంలో చేసి పారేస్తాడు."
ఎంతవాలు ?
- ఏం గొప్ప ? ఏమి నేర్పు ? వాలూ చాలూ తెలిసినవాడు అన్నప్పుడు నేర్పు, కిటుకు అన్న లక్షణార్థం వాలు కున్న దే. ఎంత____ఎందు 247 ఎందు____ఎక
- "మార్పెట్టు నోపనిమ్రాకు లేర్చుట యెంత, వా లగు నని వనవహ్ని నవ్వు." కుమా. 10. 159.
ఎంతసేపూ
- ఎల్లప్పుడూ అనుట.
- "ఎంతసేపూ వాడికి ఆత్మస్తుతీ, పరనిందా తప్పితే మరొకటి లేదు కదా !" వా.
- చూ. ఎంతదాకా.
ఎందాక ? (ఎంతదనుక)
- ఎక్కడికి పోతున్నారు అనుట. ఎక్కడికి అని అడగడం అపశకున మని ఎంతదాక అని అడుగుట అలవాటు.
- "పొద్దున్నే బయలు దేరారు. ఎందాకా ?" వా.
ఎందు కైనా మంచిది
- అంత ప్రయోజనం లేక పోయినా ఎంతో కొంత మేలు ఉండక పోదు.
- కామేశ్వరి. శత. 85.
- "ఆయనను వెళ్లి ఒకసారి చూడు. ఎందు కైనా మంచిది." వా.
ఎందు పెరటిచెట్టు మందు కాదు.
- సన్నిహితులు చెప్పే హితవు తల కెక్కదు.
- 'అతిపరిచయా దవజ్ఞా' అన్న సంస్కృతసూక్తిని తెలిపే పలుకుబడి.
- పెరటిచెట్టును తేలికగా చూస్తారు కదా !
- "తమకు సులభ మైన నమృతంబు గైకొన, రెందు బెరటిచెట్టు మందు గాదు." కళా. 7. 39.
ఎందు లేని
- ఎక్కడ లేని.
- "ఎందు లేనిపలుపోకల మాయలు నీకు వెన్నతో బెట్టినవి." పారి. 1. 127.
- ఇది వాడుకలో 'ఎక్కడ లేని' అనేరూపంతోనే కనబడుతుంది.
- చూ. ఎక్కడ లేని.
ఎంబెన్న
- యంబ్రహ్మ.
- "ఓ అంటే నా రాని యెంబెన్నలదే యీ రోజులలో అధికారంగా ఉంది." వా.
- చూ. యంబ్రహ్మ.
ఎకసక్కె మాడు
- వేళాకోళము చేయు.
- "ఎవ్వారి బొడ గన్న నెకసక్కెమాడుచు." విప్ర. 5. 26.
- చూ. ఎకసక్కెము లాడు.
ఎకసక్కెము చేయు
- హాస్యము చేయు.
- "నీ విట వచ్చుట పారిజాతవా,సన బ్రకటించి నాకు నెకసక్కెము సేయన కాదె చెప్పుమా!" పారి. 1. 128.
ఎకసక్కెము లాడు
- పరిహాస మాడు.
- "చక్కెర వింటి వాని నెకసక్కెము లాడడె." నిరంకు. 2. 12. కాశీ. 4. 123.
- చూ. ఎకసక్కెము చేయు.