పదబంధ పారిజాతము/అవకతవక
అల్లా____అల్లి 96 అల్లి_____అల్లు
అల్లాడి ఆకులు మేయు
- నానాకష్టాలు పడు.
- "అల్లాడి ఆకులు మేసి ఆ ఊరు వెడితే తీరా వాడు ఇంట్లో లే డన్నారు." వా.
అల్లాడు
- రోదించు, కొట్టుకొను.
- అలుగురాజు. 65 పు.
అల్లారుబెల్లం
- ప్రియ మైనది.
- "ఎల్లబంధువులకు నల్లారుబెల్ల మై." కళా. 6. 19.
అల్లారుముద్దుగా
- గారాబంగా.
- "అనుగుంగ్రీడల నెల్లవారలకు నిట్లల్లారుము ద్దైనకూతునకున్." వసు. 3. 32.
- "వాళ్లు ఆ పిల్ల నెంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు." వా.
అల్లిందామరయునుబోలె
- అవినాభావముగా.
- "నీరజవదనా!, యేమిటికి దలకె దల్లిం, దామరయునుబోలె నుండి తగవు విడుతురే." ఉ. హరి. 5. 20.
అల్లి బిల్లి కొను
- వ్యాపించు.
- "మావుల్ క్రోవులు నల్లి బిల్లి కొను కాంతారంబులందు." మను. 2. 22.
అల్లి బిల్లిగ నల్లుకొను
- చిక్కగా అల్లుకొను.
- "వాసంతిక లుద్యల్లీల నల్లిబిల్లిగ నల్లి కొనిన యొక లతా గృహాంతర సీమన్." మను. 3. 113.
అల్లిబిల్లిగా
- చిక్కగా.
- "అల్లిబిల్లిగా నల్లుకొను బొండు మల్లి యల." రాధి. 1. 115.
అల్లిబిల్లి యగు
- కలసిమెలసి యుండు, కూడి మాడి అన్నట్లు.
- "అరిగి తనకూర్మిచెలువతో నల్లిబిల్లి, యగుచు నెప్పటియట్ల నెయ్యమున నుండె." పరమ. 3. 274.
అల్లివి ల్లై యుండు
- ఆనందముతో నుండు.
- "బల్లిదుం డలమేల్మంగపతి అల్లి బి ల్లై యున్నా డమ్మా యశోదమ్మా." తాళ్ల. సం. 10. 161.
అల్లి బెల్లి మాటలు
- కల్లబొల్లి మాటలు.
- వెంకటే. 3. 161.
అల్లి రము లాఱగించు
- అల్లెము తిను.
- "అల్లిరము లారగించ వెన్నుడ వై వేడుకతో విచ్చేసినట్లు." తాళ్ల. సం. 9. 144.
అల్లుకొను
- 1. వ్యాపించు.
- "జలశీకరంబులు చద లెల్ల నిండి... చుక్కల నల్లుకొనగ." వర. రా. యు. పు. 16 పంక్త్ల్ 25.
- 2. వృద్ధిచెందు.
- "అల్లుకొనె గర్మములు అక్కడికి నక్కడికి." తాళ్ళ. సం. 7. 256. అల్లు_____అల్లు 97 అల్లు_____అవ
అల్లుగుఱ్ఱ
- అల్లుడు.
- "నీ యల్లుగుఱ్ఱ తనయుడు పుట్టెన్." భార. అశ్వ. 3. 169.
అల్లుడుకొమాళ్ళు
- దొరతోపాటుగా ఉండే అంగ రక్షకులు.
- బ్రౌను.
అల్లుతండము
- విటుల మొత్తము.
- వేశ్యామాతకు విటు లందరూ అల్లుళ్లే. దానిపై వచ్చిన పలుకుబడి.
- "అల్లుతండంబుచే ధన మెల్ల గొనుచు." దశ. 5. 17.
అల్లుని మంచితనము
- అరు దనుట.
- "అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య......లేవు." సుమతి.
అల్లునేరేళ్లు
- పిల్ల ల ఆటలు
- "అవల వెన్నెలలో అల్లునేరే ళ్లింతె నివలి నిన్నటియునికి నేటికి గలదా?" తాళ్ల. సం. 5. 274.
- చూ. అల్లోనేరేళ్లు.
అల్లుండ్రబూచి
- వేశ్యామాత.
- అల్లుండ్రపాలిటి దయ్యము.
- "లోకముల కెల్ల నూచి యల్లుండ్ర బూచి." శుక. 3. 18.
అల్లు పొ ల్లెఱుగని
- ఏమాత్రం కళంకం లేని.
- "అల్లుపొ ల్లెఱుగని నా కులం బను మంచి, మడుగు జీరకు జాల మైల సోకె." ఉత్త. హరి. 5. 92.
అల్లెము తిను
- మనుగుడుపులు గుడుచు.
- "మా అల్లుడు అల్లెం తినడానికి వచ్చి ఉన్నాడు." వా.
- "నీకేం రా అల్లెం తిన్న అల్లుడు లాగా ఉన్నావు." వా.
- "వాడు అల్లెము తింటున్న అల్లుడు లాగా వాళ్లింట్లో మసులుతున్నాడు." వా.
అల్లోనేరేళ్లు
- వెన్నెలలో ఆడుఆట.
- ".....వెన్నెల దినమున నల్లోనేరేళ్ళు గాక యావల గలవే." రా. సుం. కాం. 181.
- చూ. అల్లునేరేళ్లు.
అల్పాచమానం
- మూత్రవిసర్జనం.
- వైదిక పరిభాష.
- "అల్పాచమానం చేసివస్తాను. కాసేపు క్షమించండి." వా.
అవకతవక
- అస్తవ్యస్తపు - అర్థం లేని.
- "ఇలాంటి అవకతవకపనులు చేస్తే గొంతుమీదికి వస్తుంది. జాగర్త." వా.
అవకతవక పని
- తెలివితక్కువపని.
- చూ. అవకతవకమనిషి. అవ_____అవ 98 అవ_____అవ
అవకతవక మనిషి
- తెలివితక్కువ వాడు.
'*చూ. అవకతవక పని. అవఘళించు
- ధిక్కరించు.
- ఇది సామ్యమును దెలుపు మాట.
- నైష. 1. 37.
అవతల చెంబు ఇవతల పెట్టదు (డు)
- ఏపనీ చేయదు (డు).
- "ఇవతల చెంబు అవతల పెట్టకుండా సంసారం ఎలా నడుస్తుంది." వా.
అవతల పుల్ల ఇవతల పెట్టదు (డు)
- ఏపనీ చేయదు (డు) అనుట.
- చూ. అవతల చెంబు....
అవతారం
- వేషం.
- నిరసనలో అనుమాట.
- "ఏమిట్రా ఆ అవతారం. కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని రా." వా.
- "వాడూ వాడి అవతారం చూస్తే వాంతి కొస్తుంది." వా.
అవతార మగు
- పుట్టు.
- "క్షీరవారాశిలో నవతార మయ్యెం, దార (యనుకన్యక)." హర. 6. 86.
అవతార మెత్తు
- అవతరించు.
- "ఎత్తితే యవతార మీ యుగమందు." పల. పు. 13.
అవదకాకి
- పలుగాకి.
- "కూర్చి చెట్ట బట్టుకొని తెచ్చె లోపలి కవదకాకి నారి యత్తలారి." పంచ. వేం. 1. 595.
అవదూఱు
- చూ. అపదూఱు.
అవధారు
- అవధరించు; విను డని పెద్దలతో చెప్పునప్పుడు అను మాట.
- "తర్జిత భవ యవధా రవధారు." పండితా. ప్రథ. పురా. పుట. 376.
అవని దూరు
- భయపడి పాఱిపోవు.
- "కొండతో నెనవచ్చు ననవచ్చు నత డైన నవని దూరు." పాండు. 1. 74.
అవపథ్యము
- ఔపథ్యము అన్నట్లు వాడుకలో వినబడుతుంది.
- "అవపథ్యం చేయడంతో రోగం తిరగ బెట్టింది." వా.
- చూ. అపథ్యము చేయు.
అవపాడి
- అన్యాయము.
- "అధికారిచయము దత్త, ద్విధముల నవపాడి చేసి వివిధనంబుల్..... అంతకంతకు జెఱిచెన్."
- దశ. 11. 116.
- చూ. అపపాడి. అవ_____అవ 99 అవ_____అవి
అవమానపడు
- అవమానము పొందు.
- "అంత అవమానపడి వానింటికి మఱీ వెళ్ళడ మెందుకు?" వా.
అవమానపఱచు
- అవమానించు.
- "ఒకరిని అవమానపఱచడంవల్ల వచ్చే లాభం?" వా.
అవమాన పెట్టు
- అవమానించు.
అవల నే నున్నాను
- మిగత పని అంతా నేను చూచుకుంటాను లెమ్మని అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఇందులకై యే యడ్డము వలవ దవల నే నున్నాడన్." ఆము. 2. 98.
- "అవతల నే నున్నానుగా. అదంతా నేను చూచుకుంటాను." వా.
అవశాత్తుగా
- అకస్మాత్తుగా.
- కాశీయా. 322.
అవసరనై వేద్యం
- ఏదో కాస్త కడుపునకు వేయుట కగునది.
- నై వేద్యం స్థానే అది లేనప్పుడు ఏదో ఒకటి పెట్టుటపై వచ్చినపలుకుబడి.
- "ఇప్పటికి ఈ అవసర నై వేద్యం కానివ్వండి. ఊరికి వెళ్లేటప్పటికి పొద్దు పోతుంది." వా.
అవసర మిచ్చు
- దర్శన మొసగు.
- "అవసరం బిచ్చి శివుడు బ్రహ్మాచ్యు తాదిదేవతల గారవించె." కాశీ. 7. 222.
- భాగ. అష్టమ. 220. ప.
అవసరములవారు
- ప్రతీహారులు.
- "మాఱాక దెల్పు డేమఱక రాజునకు, జను డన్న విని యవసరములవారు."
- వర. రా. బా. పు. 203. పంక్తి 11.
అవసర వేళ
- పూజావేళ.
- పండితా. ప్రథ. దీక్షా. పుట. 236.
అవాకుచవాకులు
- అస్తవ్యస్తపు మాటలు. పనికిమాలిన మాటలు. జం.
- "వదరుచు నున్నవా రుఱ కవాకు చవాకులు." గీర. లోకా. 12.
- చూ. అవాకులు చవాకులు.
అవాకులు చవాకులు
- "ఏవేవో అవాకులూ చవాకులూ నాలుగు వాగి పోయినాడు." వా.
- చూ. అవాకుచవాకులు.
అవాఙ్మానసగోచరుడు
- మాటకూ, మనసుకూ అందని వాడు-భగవంతుడు.
- "యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ." అన్న వైదిక సూక్తిపై వచ్చినపలుకుబడి.
అవిచారితరమణీయము
- చూ. ఆపాతరమణీయము. అవి_____అవు 100 అవు_____అవ్వ
అవినాభావసంబంధం
- ఎల్ల ప్పుడూ కలిసి యుండుట, విడదీయరాని సంబంధ మనుట.
- "కావ్యానికీ, రసానికీ యెప్పుడూ అవినాభావసంబంధం ఉంటుంది." వా.
అవును కాదు అను
- ఎదురు చెప్పు.
- "కలలో నైనను నీదు మాటలకు నౌగా దంచు మాఱాడుటల్, గలవో?" రాజగో. 1. 99.
- "నీ మాట కెప్పు డైనా అవును కాదు అన్నానా?"
- ""వాడు నీ వేం చెప్పినా అవును కాదు అనకుండా చేస్తాడు." వా.
అవు గాక
- కానీ అనుట.
- హర. 4. 39.
అవు గా దను
- తిరస్కరించు, బదులు చెప్పు.
- "హరివార మైతిమి మ మ్మవు గా ధనగ రాదు." తాళ్ల. సం. 6. 40.
అవుగాములు
- మంచిచెడ్డలు. జం.
- "నీవు చని యవుగాములు నిశ్చయించి, యాశ దెగ గోయు మదియ మత్ప్రాణరక్ష." ప్రభా. 3. 107.
- చూ. ఔ గాములు.
అవుడుకఱచు
- పెదవి కొఱుకు.
- "గురివెంద జైత్రు డొందగ, గర మలుక న్మోవి యవుడు కఱచిన నును వా, తెరమీద గాననగు పలువరుస."
- పారి. 3. 48.
అవురు దర్భ యగునె?
- ఆకారసామ్య మున్న ప్పటికీ పవిత్రత అన్ని టా ఉండ దనుట.
- వేమన. 80.
అవురుసవు రగు
- మిక్కిలి శ్రమపడు.
- "అవురుసవు రైరి గుజగుజ యైరి డస్సి రొల్ల బోయిరి వెగ్గిరి తల్ల డిలిరి." హరవి. 3. 10.
అవుల బుచ్చు
- త్రోసిపుచ్చు, పోనాడు.
- పండితా. ద్వితీ. మహి. పుట. 214.
అవులెమ్ము
- ఔ లే.
- "అవులెమ్మని యూఱడిలెన్ సుదంత." పారి. 1. 69.
- చూ. అగు లెమ్ము.
అవ్వను పట్టుకొని వసంతా లాడు
- అసమానులతో సరసాలకు దిగు.
- "అత నేదో పురాణం చెప్పుకొనే ముసలాయన, ఆయనదగ్గర నీ పాండిత్యం వెలగ బెడతా వేమిటిరా? అవ్వను పట్టుకొని వసంతా లాడినట్లు!" వా.
- చూ. అమ్మను పట్టి వసంతము చిమ్మి నట్టు. అవ్వ____అశ్రు 101 అశ్మా_____అష్ట
అవ్వల నడుగు వెట్టు
- నిర్బంధించుటలో ఉపయోగించుపలుకుబడి.
- ఈ పని చేసి కానీ కదల వీలు లే దనుట.
- "అర్థమిప్పించి యవ్వల నడుగు వెట్టు." శుక. 3 ఆ. 40 ప.
- "ఆ డబ్బు అక్కడ పెట్టి అవతలికి అడుగుపెట్టు." వా.
- "ఇందులో సంతకం పెట్టి కాని అవతలికి అడుగు పెట్టడానికి వీలు లేదు." వా.
అవ్వలికించుకొను
- తొలగించు, అవ్వలికి త్రోయు.
- ".....యుముక నవ్వలికించికొని." దశకు. 10. 105.
అవ్వలిమో మగు
- మాఱుమో మగు.
- "నివ్వెఱ గందుచు మదిలో, నవ్వలిమో మయ్యె నప్పు డనిరుద్ధుండన్." ఉషా. 3. 41.
అవ్వలిమో మివ్వల యగు
- అటునుండి యిటు తిరుగు.
- "తెర దీసి యాసలతో దృష్టుంచి చూచిన చూపు వరుస నవ్వలిమో మివ్వ లైన నవ్వు."
- తాళ్ల. సం. 3. 182.
అశక్తదౌర్జన్యం
- చూ. అసమర్థదుర్జనత్వం.
అశ్రులు మీటు
- గోటితో కన్నీరు తుడుచు.
- "వదన మక్కున గృపతో, నొత్తి మొగ మెత్తి యశ్రులు, మెత్తన గొన గోర బాఱ మీటుచు నుండెన్."
- మను. 3. 137.
అశ్మా చ మే....
- వాడిదగ్గర ఏమున్నది మన్ను - దుమ్ము అనే అర్థంలో ఉపయోగించే వైదిక పరిభాష.
- 'అశ్మాచ మే మృత్తికాచమే' అన్న చమకంలోని మంత్రంపై వచ్చినపలుకుబడి.
- "వాడిదగ్గర యేముంది? అశ్మాచమే." వా.
- "అశ్మాచమే మృత్తికాచమే." చమకం.
అశ్రుతర్పణం
- జలాంజలి.
- తిలజలతర్పణము కాక అశ్రు తర్పణము కూడా యిటీవల వాడుకలోనికి వచ్చినది.
అష్టకష్టాలు పడు
- అన్నివిధము లయినబాధలు పడు.
- దాస్యం, పేదతనం, భార్యా హీనత, ఆదరవు లేకపోవడం, అడుక్కోవడం, ఇవ్వలేక పోవుట, అప్పుల పాలు గావడం, దేశాటనం అన్నవి అష్టకష్టాలుగా పరిగణితము లయినవి. అందుపై వచ్చిన పలుకుబడి.
- "నేను అష్ట కష్టాలు పడి ఆ పిల్లను సాకాను." వా. అష్ట_____అష్టా 102 అష్టా_____అష్టా
అష్టనీరాంజనములు
- ఎనిమిది అర్చనలు.
- దర్శన, అవసర, మజ్జన, మాంగల్య, శృంగార, మహా, ఆనంద, అసంఖ్యాత నీరాంజనములు.
- పండితా. ప్రథ. దీక్షా. పుట. 189.
అష్టవిధవధలు
- ఎనిమిదిరకా లైన చంపుటలు.
అష్ట శోభనములు
- అష్టవిధములయిన మంగళ కార్యములు; అలంకారాదులు.
- "తన పురంబునం దష్ట శోభనంబులు దేవగృహంబులయందు విశేష పూజలు సేయించె."
- భార. అర. 2. 221.
అష్టాంగ మెఱగి
- అష్టాంగములు తాకునట్లు నేలపై సాగిలపడి, సాష్టాంగ పడి.
- "ఆ లలనకు నత డష్టాంగ మెఱగి." బస. 6. ఆ. 150. పుట.
అష్టాదశ పురాణాలు
- పదు నెనిమిది పురాణాలు.
- మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మవైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు.
"మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని
పురాణాని పృథక్ పృథక్." చా.
అష్టాదశవర్ణనలు
- నగరము, సముద్రము, ఋతువు, చంద్రోదయము, సూర్యోదయము, ఉద్యానము, సలిలక్రీడ, మధుపానము, రతోత్సవము, విప్రలంభము, వివాహము, పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతము, ప్రయాణము, నాయకాభ్యుదయము, శైలము, యుద్ధము - వీని వర్ణనలు.
అష్టాదశవర్ణాలు
- పదు నెన్మిది కులాలు.
- బస. 7 ఆ. 180 పుట.
అష్టాదశవిద్యలు
- పదునెనిమిది విద్యలు.
- చతుర్దశవిద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, అర్థ శాస్త్రము కలిసి పదునెనిమిది.
అష్టావక్రుడు
- వట్టి వక్రబుద్ధి అనే అర్థంలో ఉపయోగిస్తారు. అష్టా____అస 103 అస____అస
- ఇది ఆసలు ఒక ఋషి పేరే అయినా తరువాత ఈ యర్థంలోనే వాడుకలో నిలిచింది.
- "వాడు వట్టి అష్టావక్రుడు." వా.
అష్టావక్రంగా.
- పాడుగా.
- "వా డే పని చేసినా అష్టావక్రంగా ఉంటుంది." వా.
అష్టోత్తరశతనామావళి జపించు
- స్తోత్రపాఠంచేయు
- నూట యెనిమిది పేర్లతో దేవతలను పూజించడం అలవాటు.
- "వాడు రోజూ వెళ్లి వాడిదగ్గఱ అష్టోత్తరశతనామావళి జపిస్తుంటాడు." వా.
అసంబద్ధ ప్రలాపం.
- అప్రస్తుతప్రసంగం.
- "వాని వన్నీ అసంబద్ధ ప్రలాపాలు." వా.
- చూ. అప్రస్తుతప్రసంగం.
అసడ్డమాటలు
- అడ్డుమాటలు.
- నేటికీ రాయలసీమలో 'ఏ పని చేస్తా మన్నా అన్నీ అసడ్డాలే. ఏదైనా మంచిపని చేస్తా మంటే లక్ష అసడ్డాలు' అని ప్రచురంగా వినబడుతుంది.
- నిరసనవాక్యము అని వావిళ్ల లోనూ, అశ్రద్ధ, ఉపేక్ష,, తృణీకారము, తిరస్కారము అని సూ. ని. లోనూ, అసడ్డ అనేమాట కిచ్చిన అర్థాలు సరి కావు.
- "సరకు సేయ వను చసడ్డ మాటలు గొన్ని యాడినంత నేమి."
- భార. శాంతి. 4. 426.
అసమర్థ దుర్జనత్వం
- చేత గాని దుష్టత.
- వాడు చెడ్డవాడే కాని చెడుగు చేసే శక్తి లేదు అనేపట్ల ఉపయోగిస్తారు.
- "వా డేదో న నీపుస్తకం రాయ మన్నారని ఊరికే యెత్తిపోసుకుంటున్నా డట. పోనీ అది ఆపగలడా? అదీ చేతకాదు. ఇదే అసమర్థ దుర్జనత్వం అంటే." వా.
అసమీక్ష్యకారి
- ఆలోచింపక పని చేయు వాడు, దూరదృష్టి లేనివాడు.
అసలార
- ఎసలార - బాగుగా ఒప్పిదముగా.
- "అసలార మాయింట నారగించినను బసవనమంత్రి ఏ బ్రదుకుదు ననిన."
- బస. 7 ఆ. 204 పుట.
అసలుకొను
- అలముకొను.
- "ఒడల నసలుకొనునెత్తురు గడిగి." జైమి. 6. 128.
అసలుకొల్పు
- అలంకరించు.
- "మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను." క్రీడా. పు. 45. అస______అసా 104 అసి______అసి
అసలు చొచ్చి అలయు
- తెలిసి తెలిసి బాధలో పడు.
- తాళ్ళ. సం. 11. 3 భా.74.
అసలు మసలు
- సమాన మగు, ఎసక మెసగు లాంటిది.
- "కిసలయచ్ఛవి పునరుక్తి నసలు మసలు." పాండు. 1. 131.
అసవు సవు లగు
- అదవదలగు. హర. 3. 10.
అసహాయశూరుడు
- ఏ సహాయమూ లేకనే పోరాడగలవాడు అనుట.
- పోరులోనే కాక దేనిలో సమర్థు డైనా దీనిని ఉపయోగిస్తారు.
- "వాడు ఏ దేశానికి పోతే నేం? ఏ ఊరికి పోతే నేం? జయించికొని రాగలడు. అసహాయశూరుడు మఱి," వా.
అసావాదిత్యో బ్రహ్మ గా
- ఏదో సూటిగా చెప్పక తిరుగుళ్లుగా చెప్పు.
- సంధ్యావందనంలో 'అసా వాదిత్యో బ్రహ్మ' అంటూ తలచుట్టూ చెయ్యి తిప్పుతూ నీళ్లను చల్లుటపై వచ్చిన పలుకుబడి.
- "ఈ అసావాదిత్యో బ్రహ్మ అంతా నాకు సరిపడదు. ఇస్తే ఇస్తా నను, లేకుంటే లే దను." వా.
అసికోతలు కోయు
- కడికండలుగా చేయు.
- చిన్న చిన్న ముక్కలుగా నఱుకు.
"నెట్టన మొల నున్న నెఱికత్తి దిగిచి,
కొన్నింటి ముక్కులు కొన్నింటీ
చెవులు, గొన్నింటి చెక్కులు గోతలు
వెట్టి, యసికోతలుగ గోయ."
ద్వి. హరిశ్చ. పూ. 2040.
అసిధారావ్రతము
- అతికష్ట మైనది.
- కత్తివాదరపై నడచుటవంటి దనుట.
- "వానితో వ్యవహరించడ మంటే అసిధారావ్రతమే." వా.
అసిమిలోని దొకటి, అమ్మెడి దొకటి
- ఒకటి ఉంటే ఒకటి పైకి చెప్పు.
- "అసిమిలోని దొకటి యమ్మెడిదొక్కటి, నీ చరిత్ర మెల్ల నేడు తెలియ." హరి. 2. 151.
- చూ. అమ్మే దొకటి అసిమిలో దొకటి.
అసియాడు
- అటూ ఇటూ తీగవలె వంగు, ఊగు, అసి = కత్తి - కూడా అలా కదిలించినప్పుడు అసియాడుతుంది. అందుపై వచ్చినమాట కావచ్చును.
- "కానుదీగ లసియాడ." భీమ. 5. 5. 15.
- పాండు. 3. 77.
- వుజయ. 1. 126. అసి_____అస్త 105 అస్త_____అస్తో
అసివోవు
- వ్యర్థ మగు.
- "అసి వోవ వచ్చునా యసివోక యనుచు." గౌర. హరి. ద్వి. 2608.
అసురుసు రగు
- "ముసురుకొను జరభరంబున, నసురుసు రై యున్న మమ్ము నడికించితిని..." మను. 4.
- చూ. అవురుసవు రగు.
అసూర్యంపశ్య
- ఎండక న్నె ఱుగనిది.
- చాలా సుకుమారి అనుటకు దీనిని విరివిగా ఉపయోగిస్తారు. రాజస్త్రీలను అసూర్యంపశ్య లని అనేవారు.
అస్థలిత బ్రహ్మచారి
- బ్రహ్మచర్య వ్రతమును అక్షరాలా అనుష్ఠించేవాడు.
అస్తమానం
- ఎల్లప్పుడూ.
- సూర్యాస్తమాన మ య్యే వరకూ అనుటలో మిగిలి అదే అర్థాన్ని సూచించేమాట.
- "అస్తమానం ఇదే గొడవ పెట్టుకొని కూర్చుంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారనుకున్నావు?" వా.
అస్తమానూ
- ఎల్ల ప్పుడూ.
- "అస్తమానూ ఈ వెధవ గొడ వేమిటి?" వా.
- చూ. అస్తమానం.
అస్తవ్యస్తపు మాటలు
- అందిక పొందిక లేనిమాటలు.
- "అస్తవ్యస్తపుమాటలాడ గొందఱు." భార. సౌప్తి. 1. 197.
అస్తవ్యస్త మగు
- తలక్రిందు లగు.
- "దు స్తరమును నగు నస్త, వ్యస్తంబగు నేని నాకు వగపు గదిరెడున్."
- భార. ద్రోణ. 2. 303.
అస్తుబిస్తుగా
- చాలి చాలక.
- కొత్త. 276.
అస్తువి స్తగు
- సతమత మగు, బాగా అలసి పోవు.
- త్రివేణి. 68 పు.
అస్త్రశస్త్రా లుడుగు
- బల ముడుగు.
- "అక్కడికి పోయివచ్చేటప్పటికి అస్త్రశస్త్రాలు ఉడిగి పోయాయి." వా.
అస్త్రసన్యాసము చేయు
- పని మానివేయు
- భీష్ముడు శిఖండిముఖం చూచి అస్త్రసన్యాసం చేయుటపై యేర్పడినపలుకుబడి.
- "ఈ వయసులోనే అస్త్రసన్యాసం చేస్తే ఎట్లానోయ్!" వా.
అసాధ్యపు పిండం
- గడసరి.
- "వాడు చాలా అసాధ్యపుపిండం." వా.
అస్తాబిస్తం
- అర్లుమర్లు.