పదబంధ పారిజాతము/అయంపిండులు

అమ్మను పట్టి వసంతము చిమ్మినట్టు

  • వరుసాడ తగని వారితో సరసములకు దిగినట్లు.
  • వాడుకలో అవ్వను పట్టుకొని వసంతా లాడినట్లు అన్న రూపంలో కానవస్తుంది.

"కమ్మని తేనెలు జడిగొన
నమ్ముల నిటు నింతు రయ్య యబ్జాలయపై
నమ్మను బట్టి వసంతము
జిమ్ముద మనుపలుకునిజము చేసి మనోజా!"
                లక్ష్మీ వి. 4. 68.

అమ్మనే జెల్ల

  • ఆశ్చ ర్యార్థకం.
  • "అమ్మ నే జెల్ల నెవతయో యవల నొక్క, కొమ్మ నా ప్రాణవిభు నేలుకొనియె నేమొ. శుక. 1 ఆ. 396 ప.
  • చూ. అమ్మక చెల్ల.

అమ్మయ్య

  • ఏదో బరువు తీరినట్లు ఊరటతో అనుమాట.
  • "అమ్మయ్య! యిప్పటి కీపని ముగిసింది." వా.

అమ్మయ్య యను

  • ఆశ్చర్యము ప్రకటించు, ఊరటను తెలుపు.
  • "సతీపతుల జాతిరీతు లమ్మయ్య యని రతిప్రియుడు వొగడ." రాధి. 1. 67.
  • "అమ్మయ్య! అనుకోవచ్చు ఈపని అయిపోయింది." వా.

అమ్మలక్కలు

  • ఇరుగుపొరుగు స్త్రీలు.
  • "ఇరుగుపొరుగున అమ్మలక్కలు చేరి మొగమోటము పెట్టి అడిగిన తప్పించు కొన లేక ఆమె సర్వము వారలతో చెప్పి వైచెను."
  • కవిమాయ. అం. 4. పే. 65 పం. 7.

అమ్మలక్క లని తూలు

  • అమ్మా అక్కా అని ప్రాధేయ పడు.
  • "తొడిబడ నమ్మలక్క లని తూలుచు దీనత దోయి లొగ్గుచున్."
  • ఆము. 2. 59.

అమ్మవారు

  • మశూచికము.
  • "ఆ ఊళ్లో అమ్మవారు ప్రబలంగా ఉందట! అక్కయ్యపిల్లలను వెంటనే పిలిపించి వేస్తే బాగుండును." వా.

అమ్మశక్తిలాగా

  • భయంకరంగా.
  • దుర్గ, కాళి యిత్యాదులను అమ్మశక్తులు అంటారు.

అమ్మా ఆలీ అను

  • బూతులు తిట్టు.

అమ్మా ఆలీ ఎంచు

  • బూతులు తిట్టు.
  • చూ. అమ్మా ఆలీ అను.

అమ్మా ఆలీ తిట్టు

  • బూతులు తిట్టు.
  • చూ. అమ్మా ఆలీ ఎంచు.

అమ్ముడు గడచు

  • అమ్ముడు పోవు. వివాహమై అత్తవారింటికి పోవు. పూర్వపు రోజుల్లో కన్యను ఇన్ని గోవుల కని, ఇంత ధనాని కని ఓలి తీసుకొని యిచ్చు అలవాటుపై వచ్చిన పలుకుబడి.
  • "ఏ నమ్ముడు గడవగ." పాండు. 3. 35.

అమ్ముడు పోవు

  • ఒకరు చెప్పినట్లు ప్రవర్తించు.
  • నా. మా. 130.

అమ్ముడు వోవు

  • అమ్మబడు.
  • అనగా దాసు డగు, వశ మగు అనుట.
  • "మన మే మమ్ముడు వోతిమో యితనికిన్." వరా. 11. 37.
  • "వానికి వీడు అమ్ముడు పోయినాడు." వా.

అమ్ముల నూఱు

  • యుద్ధమునకు సిద్ధపడు. యుద్ధ సన్నాహము చేయు నప్పుడు బాణములకు పదును ఎక్కించుటకై నూఱుటపై యేర్పడినపలుకుబడి. కత్తులు నూఱుట వంటిది.
  • "మదను డమ్ముల నూఱె హిమంబు పేరె. జడిసి విరహిణి వగ గూరి జార చోర..." మను. 3. 23.
  • చూ. కత్తులు నూఱు.

అమ్మే దొకటి అసిమిలో దొకటి

  • సంచిలో ఒకటి పెట్టుకొని మరొక టని విక్రయింప జూచు. మోసగించు.
  • తాళ్ల. సం. 8. 176.

అయంపిండులు

  • తద్దినపుబ్రాహ్మలు. అలాంటి వారిని తక్కువ చూపు చూడడంపై నీచ జీవనం చేసేవారు అనే అర్థంలో ప్రయోగింప బడుతుంది.

అయ:పిండం

  • కొఱుకుడు పడనిది.
  • "కాశీఖండ మయ:పిండం."
  • చూ. ఇనుపగుగ్గిళ్లు.

అయగారితనము

  • "అక్కిలివడునె నీ యయగారితనము."
  • పండితా. ప్రథ. పురా. పుట. 30.

అయవారు

  • ఉపాధ్యాయుడు.
  • "అయ్యవారు నిద్రింపగా.... అయవారు మిడికి కూయ." హంస. 3. 144.

అయవా రై చరించు

  • గౌరవముతో బ్రతుకు.
  • కాళ. శత. 73.

అయిదారు రోజులలో

  • కొన్ని రోజులలో.
  • "ఆ, అన్నా ళ్లెందుకూ? అయిదారు రోజుల్లో వచ్చి వేస్తా గా." వా.

అయినకల

  • మంచికల.
  • "అవ్విధంబున బవళించి యైనకలయ గంటి భవదీయకారుణ్య గరిమవలన."
  • శుక. 4 ఆ. 126 ప.

అయిన నే మయ్యె

  • అయితే నేమి?
  • అయితే మాత్ర మేమి కొంప మునిగింది అని ఊతపదంగా అనడం వాడుక.
  • ".....తిరిగి పులిపులి నైతిన్..."
  • "విన నే మయ్యె నిచ్చోట నరయుచున్న దాన బులు లున్నవో యని కాన నింక."
  • శుక. 2. ఆ. 260 ప.

అయినవాళ్ళు కానివాళ్ళు

  • అందరూ అనుట.
  • "డీలా పడినప్పుడు అయినవాళ్లూ కాని వాళ్లూ అంతా అనేవాళ్లే." వా.

అయినదానికీ కానిదానికీ

  • ప్రతి చిన్న దానికీ, త ప్పున్నా లేక పోయినా.
  • "వాడు తన భార్యను ఊరికే అయిన దానికీ కానిదానికీ తప్పు పట్టుతుంటే ఆవిడ చెప్పకుండా పుట్టినింటికి పోయింది." వా.

అయిదు పది కావించు

  • ముక్కలు చేయు.
  • "కైదువ లైదు పది కావించియు గుత్తుక లుత్తరించియు." వరాహ. 2. 29.

అయిదు పది సేయు

  • నమస్కరించు.
  • చూ. ఐదు పది సేయు.

అయిదుమూళ్ళ నేల

  • చనిపోవు నప్పటికి అంతే కదా కావలసినది అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
  • సమాధి చేయుట కనుట.
  • "ఎన్ని ఎకరాలు సంపాదిస్తే నేం? కడకు మనకు కావలసిం దల్లా అయిదుమూళ్ల నేల." వా.
  • చూ. ఆరడుగుల నేల.

అయిదువ

  • ముత్తైదువ.
  • మాంగల్యసూచకంగా పంచ లక్షణాలను చెప్తారు.
  • పసుపు, కుంకుమ, గాజులు, తాళిబొట్టు, చెవాకు - మాంగల్యలక్షణాలు.

అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లు

  • కాస్త తినడానికి ఉండు.
  • కొత్త. 148.

అయినంతకు

  • చేత నయినంతవఱకు.
  • అయివకాడికి అని వ్యవహార రూపం.
  • రుద్రమ. 16 పు.

అయినకాడికి తెగ నమ్ము

  • వచ్చినంతకు అమ్మి వేయు.
  • కొత్త. 14.

అయిం దయింది

  • చూ. అయిం దవుతుంది.

అయిం దవుతుంది

  • ఏమైనా కానీ, చేసి తీరవలసిందే.
  • దీనినే 'అయిం దయింది' అని కూడా వ్యవహరిస్తారు.
  • "ఈ వ్యవహారంలో వేలకొద్దీ నష్ట మయింది. కడకు ఈ కోర్టులో మనకు క్షవర మయింది. అయిం దవుతుంది. హైకోర్టు సంగతీ చూద్దాం." వా.

అయిర కన్ను

  • ఱేగి నీరు కారుతూ ఉండే కన్ను. నేటికీ ఈ మాట 'అవిరయింది - అయిరయింది కన్ను' అని అలవాటులో ఉంది.*పండితా. ద్వితీ. మహి. పుట. 108.

అయిరేనికుండలు

  • చూ. అఱిమెన కుండలు.

అయివేజు

  • ఆదాయము.
  • కొత్త. 148.

అయిసక లడ్డు

  • ఐసర బొజ్జ వంటిది.

అయోమయం

  • గందరగోళం.
  • "ఆ ఊళ్లోకి వెళ్లాను. అంతా అయోమయం. దారీ తెన్నూ తెలియ లేదు." వా.

అయ్యా అప్పా అంటే వింటాడా?

  • నయముతో విన డనుట.
  • "వాడు మహా దుర్మార్గుడు. అయ్యా అప్పా అంటే వింటాడా?" వా.

అయ్యకు విద్యా లేదు అమ్మకు గర్వమూ లేదు

  • సత్త్వమూ లేదు ఆడంబరమూ లే దనుట.
  • మానినీ. 19.

అయ్యగారు

  • ఉపాధ్యాయుడు.
  • హంస. 3. 144.

అయ్య జియ్యలు వెట్టు

  • గౌరవించు.
  • "...ధరణీరమణు లయ్యజియ్యలు వెట్టుచు." సారం. 1. 62.

అయ్యవారి తలవాకిలి

  • చూ. అయ్యవార్లంగారి నట్టిల్లు.

అయ్యవారి సం సేవవేళ నమ్మగా రుగ్గడించిరో

  • ఏ కాంతంలో భార్య చెప్పిన మాటను భర్త వినును అన్న సత్యంపై ఏర్పడినపలుకుబడి. ఇది రకరకాలుగా ఉంటుంది. 'నను బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లి' అనేపాటలో యిదే ధ్వనిస్తుంది.
  • కళా. 5. 52.

అయ్యవారు

  • ఉపాధ్యాయుడు
  • హంస. 3. 144.
  • చూ. అయవారు.

అయ్యవారమ్మ

  • ఉపాధ్యాయిని.
  • "మా ఊళ్లోకి ఈమధ్యే ఒక అయ్యవారమ్మ వచ్చింది." వా.

అయ్యవారికి చాలు అయిదు వరహాలు

  • మహర్నవమి రోజుల్లో పిల్లలతో పాటలు పాడించు
  • కొంటూ అయ్యవార్లు బయలు దేరడం. గృహస్థు లేవో కొన్ని గింజలో, బహుమతులో యివ్వడం పరిపాటి. ఆ పాటలలోని భాగమే యిది. 'అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్ల వాండ్రకు చాలు పప్పు బెల్లాలు' గొప్ప ఆశలకు పోవడం లేదు. అనే సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "నే నేం మేడ లిమ్మంటానా? మిద్దె లిమ్మంటానా? ఏదో ఇంత మిగులో సగులో పడేస్తే చాలు. అయ్యవారికి చాలు అయిదువరహాలు." వా.

అయ్యవారిని చేయబోతే కోతి పిల్ల యింది.

  • ఒకటి చేయబోతే దానికి వ్యతిరేక మయింది. పని వికటించింది అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.

అయ్యవారిని చేయబోయి కోతిని చేసినట్లు

  • మంచి చేయ బోగా చెడు అగుపట్ల ఉపయోగించే పలుకుబడి.

అయ్యవార్లంగారి నట్టిల్లు

  • శూన్య మనుట.
  • అయ్యవార్లంగారు డబ్బు లేని వాడు కనుక అతడి నట్టిల్లు శూన్యంగా ఉంటుంది.
  • "అయ్యవార్లంగారి నట్టిల్లువలె మీ యలికము లిట్లు వట్టి వై యున్న వేమి?"
  • సాక్షి. 91 పు.

అయ్యసాము ఇంటిలోనే

  • అసమర్థునిపట్ల ఉపయోగించే పలుకుబడి. వాని పరాక్రమం ఇంటిలోనే కాని బయట కాదనుట.
  • సింహా. నార. 74.

అరకూళ్లు మెక్కు

  • కన్నకూళ్లు తిను.
  • "అక్కవాడల నరకూళ్లు మెక్కి మీద వీని శేఖర మొక తులార్త్వజ్యముకొని."
  • ఆము. 7. 5.

అరగంట గనుగొను

  • ఓరగా చూచు, కనులర మోడ్చి చూచు.
  • "అరగంటం గనుగొంట మందగతి బూర్ణాహంకృతిం బ్రార్థనాకర భుక్తిస్థితి..."
  • కా. మా. 1. 25.

అరగన్ను

  • మ్రాగన్ను.
  • "వాడు అరగన్ను పెట్టి నిద్ర పోతున్నాడు." వా.

అరగలిగొను

  • సంకోచించు.
  • "అరగలిగొన కిత్తు రల్ల భక్తులును." బస. 3. 56.

అరగూడు

  • గోడలో కట్టిన గూడు. దీనికి మూత ఉండదు. ఇందులో దీపం పెడతారు.
  • "సాయంత్రం అయింది. అరగూట్లో దీపం పెట్టవే." వా.

అరచేతిది

  • అందుబాటులోనిది.
  • "శ్రీవైకుంఠుని దాసుల మట యర చేతిది మోక్షము మా కిది వో."
  • తాళ్ల. సం. 9. 83.

అరచేతి మాణిక్యము

  • అందుబాటులో నున్న అమూల్యవస్తువు.
  • కరతలామలకము వంటిది.
  • "సమధిక బ్రహ్మవిజ్ఞానసంపద నీకు నరచేతిమాణిక్య మనఘచరిత." రాధా. 1. 54.

అరచేతిలో వై కుంఠము చూపు అరచేతిలో స్వర్గం చూపు.

  • చూ. అరచేతిలో స్వర్గం చూపు.

అరచేతిలో స్వర్గం చూపు

  • మాయ చేయు, మోసము చేయు, మాటలతోనే సంతృప్తిపఱచు.
  • "వాడు అరచేతిలో స్వర్గం చూపిస్తాడు." వా.
  • చూ. అరచేతిలో వైకుంఠము చూపు.

అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు

  • అతిసులభముగా, బాగా తెలిసేటట్లు.
  • "పలుక దలంప దవ్వు లగు భారతరామ కథార్థముల్ విభాసిలగ నరంటిపండొలిచి చేతికి నిచ్చినరీతి..."
  • కళా. 1. 6.
  • "ఆయన ఏ పుస్తకం పాఠం చెప్పినా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబుతారు." వా.

అరటి పండ్ల వేయు

  • అవమానించు.
  • "మును చెప్పినకథ ఱేపట వినిపించిన నరటిపండ్ల వేయుము చెలియా!"
  • శుక. 3 ఆ. 596 ప.

అరణ మిచ్చు

  • ఆడపడుచులను అత్తవారింటికి పంపేటప్పుడు అమూల్యవస్తువులను దాసదాసీలను ఇచ్చు.
  • యామున. 4. 232.

అరణ్యచంద్రిక

  • అడవి గాచినవెన్నెల.
  • చూ. అడవి గాచినవెన్నెల.

అరణ్యరోదనం

  • వ్యర్థము.

"తేరు హుటాహుటిం గదిమి దృష్టి
కగోచర మై యయోధ్యకుం, జేరి నరణ్య
రోదనము జేయుచు నమ్మిథిలేశుపుత్రి
మూ,ర్ఛారభసంబునన్ ధరణి వ్రాలె."
                         జైమి. 6. 77.
                         భోజ. 5. 56.

  • "నీ అరణ్యరోదనం వినేనాథు డెవడున్నాడు?" వా.
  • "నువ్వు ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తే నేం? ఏం చేస్తే నేం? అంతా అరణ్య రోదనం." వా.

అరదండాలు

  • బేడీలు.
  • "అరదండాలు వేసి వాణ్ణి కోర్టుకు తీసుకు వెళ్లారు." వా.

అరదళం పటాసు

  • పటాసు వంటివా డనుట.
  • హరిదళమే అరదళం.
  • "వాడా అరదళంపటాసు ఎక్కడా దాగడు." సా.

అరదేసి

  • పరదేసి.
  • తమి.

అరదేసి పరదేసి

  • అతిథి అభ్యాగతి
  • "అరదేసి పరదేసి వస్తే వాళ్ళింట్లో ఏ వేళప్పు డైనా ఆదరిస్తారు." వా.

అరనిద్దుర

  • సగమునిద్ర.
  • సారం. 3. 152.

అరపడకిల్లు

  • పడకగది. అర అంటే గది.
  • "చన ని ట్లరపడకింటిలోని కనిచి." రాధి. 1. 74.

అరపైకము చేయని

  • అరకాసు చేయని, విలువ లేని, పనికిమాలిన.
  • "అరపైకంబును జేయని హరివాసరమునకు నై నిజాత్మజు దునుమన్."
  • రుక్మాం. 5. 143.

అరమర

  • సంకోచం, పొరపొచ్చెములు.
  • "ఈ యరమరంబున బోమన నీదు నాకు."నై. 8. 75.
  • చూ. అరమరము.

అరమరపుల జొక్కు

  • పరవశప్రాయత నొందు.
  • "అరమరపుల నే జొక్కితి తనిసే దిక నెన్న డొకో."
  • తాళ్ల. సం. 6. 127.

అరమరము

  • పొరపొచ్చెములు.
  • చూ. అరమరికలు.

అరమరిక

  • పొరపొచ్చెము.
  • "అరమరిక లేనిచుట్టలు." క్షేత్రయ్య.

అరమోడ్పు కనులు

  • అర్ధ నిమీలితనేత్రములు.

అరవగోల

  • అర్థముకాని అల్లరి.
  • "అరవగోల యనెడి యార్యుల మాట యత్తఱిని..." గీర. 64.

అరవము మొత్తుకోళ్ళు

  • అర్థం కానిది.
  • "ఏమిటో! ఆయన ఉపన్యాసం అంతా అరవం మొత్తుకోళ్లు చింత గుగ్గిళ్లుగా ఉన్నది." వా.
  • "అరవం మొత్తుకోళ్లు చింతగుగ్గిళ్లు." సా.

అరవమేకు

  • తగులుకొంటే వదలనిది. గీర. లోకా. 20.

అరవయేడుపు

  • దొంగ యేడుపు, కూలి యేడుపు.
  • "అవన్నీ అరవ యేడుపులే. అత డున్నంత దాకా ఏడ్పించి బొక్క లాడిందిగా."

అరవర లగు

  • చిందరవందర యగు, ఎండి వరు గగు, వాడివత్త లగు.
  • "అంతంత విచ్చి యరవరలై పాఱలేక పలపల నై." ఉ. హరి. 1. 148.

"విరహాగ్ని వలన దేహము, లరవర లై హస్త భూషణావళు లెల్లన్, హరి గోరి జాఱి పడంగా, నరుదుగ నొక
చోట గూడి యందఱు దమలోన్."
                       విష్ణువు. 7. 352.

అరవాయి

  • సంకోచము.
  • "అరవాయి గొనక నడపుము." భార. ఉద్యో. 4. 101.
  • చూ. అరవాయిగొను.

అరవాయిగొను

  • సంకోచించు.
  • "వృష్టి కుమారవరు లనేకు లట్టి యోధులు పోర నరవాయి గొందురే?" భార. ఉద్యో. 1. 268.
  • "కురుసైన్యము నిస్సారం, బరయగ మన బలము లెల్ల నతిదృఢములు నీ, వరవాయి గొనక నడపుము."
  • భార. ఉద్యో. 4. 101.
  • "చుట్టం బని యరవాయి గొనుట కర్జంబు గాదు." భార. కర్ణ. 3 ఆ. 122.
  • "అరవాయి గొనక." భీమ. 2. 140.

అరవై మందైనా సరా?

  • ఎంతమం దైనా సరికారు అనుట.
  • "అరువదిమంది యైన సరియా మరి యా కరియాన యానకున్." శ్రవ. 5. 39.

అరవై యారు దేశాలు

  • అన్ని దేశాలూ అనుట.
  • ఆకాలంలో భరతఖండాన్ని అరవైయారు దేశాలుగా విభజించుకొన్నారు.
  • "అరవైయారు దేశాలలో వాణ్ణి జయించినపండితులు లేరు."
  • చూ. ఛప్పన్నారు దేశాలు.

అరసావు

  • మూర్ఛ.
  • "అతండు నీమ ఱందికి నరసా వొనర్చె." ద్రోణ. 5. 173.

అరసేయక

  • సంకోచము లేక.
  • "అరసేయ కొక మాట యానతి యిండు."
  • వర. రా. కిష్కిం. పు 290. పంక్తి 16.

అరికట్టు

  • అట కాయించు.
  • "తాల్మి యరికట్ట లేక జననాయకుడు."
  • వర. రా. అయో. పు. 332. పంక్తి 7.

అరికట్టుకొని

  • అడ్డుపడి.
  • "ఎలుగుల్ హరిణంబులు గోట్ల సంఖ్య భీకరరవముల్ చెలంగ నరికట్టుక యున్నవి." రుక్మాం. 3. 9.

అరికాలిమంట నడినెత్తి కెక్కు

  • అతికోపము కలుగు.
  • "వాడు ఆ మాట అనేసరికి నా కరికాలి మంట నడినెత్తి కెక్కింది." వా.