పండ్రెండు రాజుల కథలు/మీనకేతనమహారాజు కథ

రెండవరాత్రి కథ.

మఱుసటి దినంబున సయితము కృష్ణ పార్థులిరువును సాయంకాలమే సుఖభోజనంబొనరించి యమునా సైకతస్థలములంజేరి తాంబూల చర్వణం బొనరించు నవసరంబున, నర్జునుండు గోవిందుందిలకించి, “యో పురాణపురుషా ! తాము చెప్పిన ద్వాదశ మార్గంబులలో మొదటిదియగు, సాంఖ్యంబు నాకర్ణించి ధన్యుండ నైతిని. నేటి రాత్రి ఛాయాపురుషలక్షణ లక్షితంబగు మఱియొక పుణ్య చరిత్రము నానతీయవే"యని వేడిన నారాయణుండు మీన కేతన మహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు చెప్పఁదొడంగెను.

3. మీన కేతన మహారాజు కథ.

శ్వేతవాహనా ! తోల్లి ——భోజమహారాజు ధారానగరముంబరి పాలించు కాలంబున, నప్పురంబున దేవశర్మాభిధానుండగు విప్రోత్తముం డొక్కఁడు విధ్యుక్తవిప్రాచార పరతంత్రుఁడై సదాహ్మణుండనం బ్రసిద్ధి కెక్కి యుండియు నొక్కనాడు నిజజనకుని యాబ్దికంబునకై సర్వశ్రేష్ఠుఁడగు బ్రాహ్మణుని భోక్తగాఁగోరి మహాకవియగు కాళిదాసుని భోక్తగా నిమంత్రించెను. తత్కారణంబున కాళిదాసుని మహిమ నెఱుంగని పామరజను లాతఁడు మత్స్యమాంసభోజియనియు, మధుపాయియనియు,వేశ్యాలోలుఁడనియు, సద్రాహ్మణుంచుగాఁడనియు, నట్టివానిని భోక్తగాఁబిలిచిన దేవశర్మ కులభ్రష్టుఁడయ్యె ననియు నిందించి, వెలివేసిరి. అప్పటికీ దేవశర్మకు, సుమతి, దీమతి యను నిర్వుఱు కుమారులును, సౌందర్యమున రతీదేవి కెనయగు, ననసూయ యనుపుత్రిక యుం గల్లియుండిరి. కులంబున వెలివేయంబడిన కారణంబున, దేవశర్మయే పుత్రులకుం బుత్రికకును సమస్తవిద్యలను నేర్పి——ప్రవీణులంజేసెను. అనంతరము కొన్ని దినంబుల కావల కాలవశంబున దేవశర్మ మృతి నొంద, దత్సతి యాతనితో, సహగమనం బొనరించి పురంబున వెలి వేయఁబడిన బిడ్డలను మువ్వుఱను దిక్కు లేనిపక్షులనుగా విడిచిపోయిరి. మాతాపితృహీనులై నను మతిధీమతు లిర్వుఱును నన్యసహాయంబు నపేక్షింపక నెట్లో దినంబులు గడుపుచుండ ననసూయ దినదిన ప్రవర్ధమానయై క్రోక్కారు మెఱుఁగు తెఱంగున నభినవయౌవనప్రాతుర్భావయై సహోదరులకు తీరనిమనోవ్యధం గలిగించెను. ధారానగర విప్రులు తాము వెలివేయుటే కాక, తామెఱింగినంతవఱకుఁ బ్రతియూరఁగల విప్రులకును దేవశర్మ చరిత్రముం బ్రకటపఱచి యనసూయ నేవిప్రకుమారుండును వివాహమొనర్చుకకొనకుండఁ గట్టడ చేసిరి. ఈ విధమైన సంకటంబునం బొగులు సహోదరుల విచారంబు నెఱింగిన యనసూయ “సోదరులారా! నన్నుఁదలంచి మీరు చింతింపవలదు. నా ప్రారబ్ధకర్మ మిట్లేయున్నచో నే నామరణాంత మవివాహితనై యుండ నేఱ్తును. మీకప కీర్తిఁదేను." అని పలుక, నామె మాటలను విని యేమియుం, బలుక నేరక సోదరులు దుఃఖించిరి. అనసూయ తనకుఁ దోడుగా సుశీలయగు నొక వృద్ధదాసీం దోడుగా నుంచుకొని, దినమున కొక్కమాఱు మాత్రము తెల్లవాఱుజూముననే తటాకంబున కరిగి జలముంగొని వచ్చి సోదరులకు వచనాదుల నొనరించుచు, సద్గ్రంధ కాల క్షేమంబున దినంబులం బుచ్చుచు నొరుల కంటఁబడక దినంబులు గడుపుచుండెను. ఇట్టి సత్ప్రవర్తనము గల్గిన యనసూయ పైఁ బురజను లెట్టి దుష్ప్ర వాదంబు లిడుటకును నవకాశము గల్గకపోయెను. ఇట్లుండఁ గొన్ని దినంబుల కాబాలికకు గర్బోత్పత్తియగు చిహ్నంబులు పొడసూప పరిచారిక దానిం గనిపెట్టి, విస్మయమునంది యేకాంతంబున నక్కోమలిం బిలిచి "యమ్మాయీ! నీకు గర్భోత్పన్న మైయున్న యది. నీవు గృహంబువిడిచి యెందునుం జనిన దానవు గావని నీకు ఛాయవలె వెంటనంటియుండు నేను బాగుగ నేఱుంగుదును. కాని యీస్థితికిఁ గారణమేమో నా కగోచరం బై యున్నది. నాకు వాస్తవంబు నెఱిఁగింపుము; భయము లే"దని పలుక నక్కుసుమ కోమలిగుండెలు ఝల్లుమన, వెలవెలంబోవుచు, “నోసీ! దాసీ! నీపై నానయిడివచింతు—— నే నేపాపం బెఱుంగను. గర్భంబన నేమి? అదియెట్లు గల్గును! నీవేమియో పల్కెదవుగాని, నాకొక్కటియుం దెలియ” దని పల్కి రోదనము సేయఁజొచ్చెను. దాసియు నిదమిద్ధమని నిర్ణయింపఁ జాలక, యూరకుండినఁ దనపైఁబడునని, సోదరులగు సుమతి, ధీమతులకు వేర్వేఱ నీవిశేషము నెఱిఁగించెను. అంత నాసోదరు లిరువుఱు నెవఱి యంతటవారు తమతమ యాత్మగతంబుల “ఛీ! ఛీ! యౌవనమెంత చెడ్డది! అనసూయ పరపురుషునిఁ గంటఁజూడనిదగుట ప్రత్యక్షానుభవ విషయంబు, అట్లైన గర్భోత్పత్తియగుట కేమి కారణము! నిప్పు లేక పొగరాజదుగదా! నాసోదరుఁడు యుక్తవయస్కయైన సోదరింగని కామపీడితుఁడై యకార్యంబొనరించెను. కాకున్న మఱియొక రెవ్వఱురాగలరు! కామపిశాచము సోదరియనియైనఁ దలంపనీయదు కాఁబోలును! ఈ యింట నుండుటకన్నఁ బాపకార్యంబింకొకటి" లేదని తలంచి, యొకఱు పాపంబొనరించిరని యింకొకఱుతలంచి "నీవిట్టి దుష్కార్యం బొనర్చితివి గాన నేను గృహ్య త్యాగినై పోవుచుంటి”నని యిరువుఱును నేక కాలంబున రెండుచీట్లను వ్రాసి, యింటనుంచి వేర్వేఱు త్రోవలంబట్టిపోయిరి. మఱునాడనసూయ సోదరుల నిర్వుఱను గృహంబునంగానక, వారి లేఖలంగాంచి పెద్దపెట్టున శోకించుచు, నాత్మహత్యకుఁ దెగించెను. పరిచారిక యామెను సాహసమునుండి వారించి, “బిడ్డా! నీవు చూలాలివై యున్నావు; యిట్టియెడ నీవాత్మహత్య యొనరించితివేని, యాత్మహత్యాపాపమేగాక, భ్రూణహత్యాపాపంబునుంగల్గును. నీవెట్లు గర్భిణి వైతివో చిత్రముగనున్నది. ఎద్దియేసి కలఁగంటి వేమో స్మృతికిఁ దెచ్చుకొను” మనియడుగ నాయెలనాగ పెద్దతడవు స్మృతికిఁ దెచ్చుకొని, "యౌనేదాసీ ! కొన్ని నెలలకుఁ బూర్వము నాస్వప్నంబున సెవ్వఱో రత్నకిరీట కేయూరహారధారియగు నొక దివ్యపురుషుండు గాన్పించి నాయురోజంబులనొత్తి కెమ్మోవిని మునిపంట నొక్కి, యధరామృతంబాని చెక్కిలి ముద్దిడి, నాకమితానందముం గూర్చుచేష్టల నేమేమియో కావించిపోయెను. ఇప్పుడు నీవడుగఁగా జ్ఞప్తికి వచ్చిన"దని చెప్పఁగా నావ్రుద్ధదాసి దరహసి తాననయై——"అమ్మక చెల్ల! ఇన్ని నాళ్లీ వార్తను నా కెఱింగింపక నీవేలఁదాచితివమ్మా ! వెఱ్ఱితల్లీ ! దుఃఖింపకుము. నీ కేమియుభయము లేదు; ఒకానొక దివ్యపురుషుఁడు స్వప్నంబున నీతో సంగమించెను. నీకు మహా తేజస్వియగు సుపుత్రుఁడు జన్మింపఁగలడు——నీకేవిచారము లే"దని యాశామృతముం బోయ నాబాలయప్పటికిఁ గొంతశాంతినందినను సహోదర వియోగమునకు నిరంతరము దుఃఖించుచుండునది. ఇట్లుండఁ గొన్నినాళ్లకనసూయ ప్రసవించి దివ్య కాంతులతోఁ దేజరిల్లు నొక సుపుత్రుంగనియెను. ఆబాలునకు దాసియే మీనకేతనుండను నామకరణం బొనరించి సాకుచు మాతసోకమును నివారింపం బాటుపడుచుండెను. క్రమంబున నీవార్త పురమం దెల్లవ్యాపించి బురజనుల నసూయను జారిణీనిఁగాఁ బరిగణించి బహిరంగముగ నిందించుచు, వ్రేళ్లుపెట్టి చూపసాగిరి. అనసూయ తద్దూషణంబులన్నింటిని, కుమారుని కొఱకై భరించుచు, నిజజనక నిక్షిప్తధనంబుతో నారేండ్ల కాలము గడిపెను.తదనంతరము భుక్తికి గూడ జఱుగక, ధారానగర నివాసంబు దుర్భరమగుటం జేసి, యట కతి దూరంబునంగల యుత్కళదేశంబునందలి కటకనగరంబునఁగల తన మాతామహుని గృహంబున కరుగ సంకల్పించి, దాసికి గృహంబునప్పగించి వేఁగుజామునంగుమారుని వెంటనిడుకొని ధారానగరముం బాసి చనదొడంగెను. ప్రకృతిసుకుమారులగు నమ్మాతాకుమారు లిరువుఱును, నత్యంత ప్రయాసంబున ననేకారణ్యంబుల నిర్గమించిచనుచు——కాళులు పొక్కు లెక్క——నాతపక్షుత్పిపాసల కోర్వంజాలక మార్గంబున నొక్క. విశాల వటచ్ఛాయను విశ్రమించిరి. అత్తరుణంబున, ననసూయ కత్యంత దుస్సహంబగు పిపాసయగుటయు, నయ్యను కుమారుందిలకించి, "నాయనా! దాహబాధచే నాప్రాణంబులు నిలుచునట్టులేదు. ఈ కాననంబున నెటనేని సరోవరంబొండుగలదేని యారసి తజలంబులం గొనివచ్చి నా దాహశాంతి యొనరింపు " మని హీనస్వరంబునం బల్కుటయు మీనకేతనుం డతిసాహసంబున బయల్వెడలి, జలాన్వేషణ తత్పరుండై బహుదూరం బరిగి, జలంబులంగానక తిరిగి తిరిగి వేసరి, యదృష్ట వశంబున నందొక్కచో శీతలవిమలజలపూరితంబగు నొక్క పద్మాకరముం బొడఁగాంచి, యొక కమలపత్రంబునఁ దన్నీ రంబును గొని రానుంకించు నంతలో నొక్క నీకుంజసమీపంబున నతిసుందరంబగు నొక కాలసర్పం బాతని పాదంబులకు జుట్టుకొనియెను. తన్నాగంబునుఁ గాంచి యా బాలకుఁడు భీతిల్లక, సాహాసంబున దాని నెత్తి యావలం బాఱవేసినను, మరల మరల నా సర్పంబతి ప్రీతితో వెఱచి పారక యాతని యొడిలోనికిం జేరుకొని శరీరమునందెల్లెడలఁ బ్రాకులాడుచు, కపోలంబులను చుంబించుచు లీలావినోదంబుల నొనరింపఁ దొడఁగెను. ఇంతలోఁ దత్సమీపముననేయున్న జటాశంకరమహర్షి యాశ్రమము నుండి, శిష్యుం డోక్కరుఁడు కుశపత్రాదులంగోని కాదు. సనిధ భూముల కరుదెంచి మీనకేతన సర్పంబుల సఖ్యము గాంచి మెఱగంది సమీపమునకు వచ్చి యా సర్పంబు వదలింప, నయ్యది కొంతదూరమువఱకుం బ్రాకి చని యట నొక సుందర స్రీరూపముందాల్చి యంతలో నదృశ్య మయ్యెను. తచ్చిత్ర ప్రదర్శనముంగని విస్మితుండై యున్న మీనకేతనుఁ గాంచి, యబ్బాలవిప్రుండు——“వత్సా! విస్మితుండవు గాకుము. ఇదియొక నాగకన్యకయై యుండును. నీపై మరలుగొని యున్నది. నీవత్యంతధన్యుఁడవు! నీ చరిత్రం బేమి? ఇట్లు రాగతం బేమి"యని ప్రశ్నింప నా బాలుఁడు తన వ్రుత్తాంతం బెల్ల నెఱిఁగింప నాతఁడును జాలింగోని తన కమండలముతో నదకముం గైకొని మీనకేతనుని వెంట నిడుకొని యరణ్య మంతయు వెదకినను, అనసూయ వారికెందునుఁ గాన్పింపదయ్యెను. తల్లినిఁ గానక మీనకేతనుం డెలుగెత్తి యరణ్యము మాఱు మ్రోగఁ బిలుచుచు నేడ్చుచుండ మునికుమారుం డాతనికి ధైర్యముం జెప్పి తనగురుండగు జటాశంకరు నాశ్రమంబునకుం గొనిచని గురున కాబాలుని యుదంతం బెల్ల నెఱిఁగించెను. అంత నాజటాశంకర యోగీంద్రుఁ" డబ్బాయీ! విచారింపకుము; మీయమ్మ సజీవయైయుండును. శరీరభంగంబును, మరణంబునుఁ దెలిసికొను ఛాయాపురుషమను దేవరహస్య మొండుగలదు. అద్దానిని నీ కుపదేశించెదను. నే నియమించిన భాతి దృక్కునిల్ఫీ దృశ్యంబగు పురుషునింగాంచి, యాపురుషునియందుఁదోచు, లక్షణములం జెప్పుము. సకార ఓంకారంబును, బిందుసహీత అకారంబునునగు “హంస" యను రెండక్షరములను జపించుచు, హంసునకు విముఖముగా, నిలిచి, నీశరీర చ్ఛాయనుగాంచి, జీవాక్షరస్థానమున దృష్టి నిలిపి, యాదృష్టిం జెదర నీయక—— మేఘంబులయందుఁగాంచుము. అందవయవసహితమగు నొక ఛాయాపురుషాకృతి నీకుగాన్పించును. ఆపురుషునకు శిరోహీనమైనచో, నారు నెలలకును, కరహీనమైనచో మూడు నెలలకును, చరణహీనమైచో నొక్క నెలకును మరణంబుగల్గును. ఆఛాయ యెఱుపుగ నున్నచో, రాజ్యప్రాప్తియు, పసుపుగ నుండినఁ జక్రవర్తిత్వమును తెల్లగా నుండిన శరీర సౌఖ్యమును, నల్లగానుండిన రోగగ్రస్తతయు, మచ్చలుగానుండిన నొడలికి మాఱ్పునుఁ గల్గునని యెఱుంగవలయును. చక్కఁగా బరీక్షించి వచింపుము" నావుడు, మీనకేతనుఁడు తదుపదేశానుసారంబుగఁజూచి, "మునీంద్రా ! తెలుపురంగు పైఁ బసుఫుకలిసినట్లు కాన్పించుచున్న ”దని పలికెను. అందుల కాఋషి యానందించి “కుమారా ! నీకే కోఱంతయునుఁగలుగదనిపలికి యమ్ముని యనసూయన్వేషణార్థమై తన శిష్యులను సలుదిశలకుం బంపి యాకునూరునిచే శుశ్రూషలఁగాంచుచు నాతని కనేక మహద్విషయంబునుగఱపి యాతని మహత్త్వసంపన్నునిఁగా నొనరించె"నని శ్రీకృష్ణుంబలుక నర్జునుడాశ్చర్యప్రముదితాత్ముఁడై "దేవా! ఛాయాపురుష లక్షణంబు నెఱిఁగించి నన్ను ధన్యునిఁ జేసితివి. తదనంతరంబు మీనకేతనుని కథ యేమయ్యె——అనసూయ వృత్తాతం బేమయ్యె; నెఱిగింపవే! " యనిన నాగోవిందుఁడిట్లని చెప్పదొడంగె—— కుంతీసుత మధ్యయా ! ఆయడవిలో ననసూయ యట్లుదాహ బాధచే మూర్ఛిలియుండ, ధారానగరవాసియు, ననసూయా వృత్తాంతంబును నెఱింగినవాడును, నామెపై మరుల్గొన్న వాఁడును నగుకౌశికుండను నొక విప్రయువకధూర్తుం డొక్కఁడనసూయ వెన్వెంటనేవచ్చి యామె యొంటరిగనున్న తరి నెఱింగి యది తనయుద్యమంబు నెరవేర్చుకొనఁదగు తరుణమని యామె దాహబాధందనకడనున్న జలంబులం దీర్చి—— సజ్జనుని వోలెనటించుచు, నామెనోదార్చి, యామెను దుప్పధంబునుబట్టించి మినకేతుని వెదకినట్లునటించి, పుత్రునికొఱకై శోకించు నామె నూరార్చుచు, “నేనును కటకపురికేవత్తును. నీకు సహాయముగ నుందు"నని నమ్మఁ బలికి మార్గమధ్యమునందలి ప్రతి గ్రామంబునందును నామెతోఁగలసి బసచేయుచు, నచ్చటివారితో నామె తన భార్యయని చెప్పుటకారంభించెను. అనసూయ యక్కపటబ్రువుని దుష్ప్రవర్తనంబునుగుఱుతించి, యాతనిందీవ్రముగ నిందించెను. కాని యంతతో నాతఁడు తన దురుద్యమంబును విరమింపక, మొండికిఁ దెగించి గ్రామంబుల ప్రజలతో నెల్ల, బంచాయితి వెట్టి యామె తన భార్యయనియుఁ డన్నొల్ల కున్నదనియు, నిట్లే దేశదేశంబులనం దిరుగుచుండుననియుఁ బెద్దగాఁ జెప్పుకొని యేడ్చెను. విన్న వారందరును నయ్యది నిజంబని నమ్మి యామెంగని నీకిది బుద్ధిగాదని మందలింపఁ జోచ్చిరి. అనసూయ చేయునది లేక యీతఁడు నాభర్త గాడని యెంత చెప్పుకొనినను నమ్మువారు లేకపోఁగా యీతఁడు నీభర్త గానిచో నీభర్త యెవ్వఁడని ప్రశ్న చేయ నామె నోరాడదయ్యె. ఇట్టి రాద్ధాంతసిద్ధాంతముల తోడనే క్రమంబుగ వారు కటకపురింజేరి వెదకు కొనుచు ననసూయా మాతామహుని గృహముం జేరిరి. వెంటనే యనసూయ తాతంజూచి తన యుదంతమునుఁ జెప్పుకొని బాంధవ్యము నెఱిఁగింప నాతఁడు విశ్వసించి, కౌశిక నామధేయుఁడగు నక్కపటిని దూషించి యటనుండి సాగనంపెను. అంత నాతఁడు, రాజసన్నిధికరిగి యీసంగతినంతను మొఱవెట్టుకొన నాభూపాలుఁడు కొండొక దినంబున విమర్శింతునని యాజ్ఞ సేసెను. ఈలోపల అనసూయను వెదుకఁబోయిన జటాశంకరమహర్షి శిష్యులు కటకపురంబున జఱిగిన యీకథను విని పోయి గురునకు నివేదింప, మీనకేతనుఁ “డార్యా! ఆమెయే నాతల్లియై యుండును. ఈ తరుణంబున నేనటకుఁజని నాతల్లిని రక్షింతు; నాజ్జ దయసేయవే!" యని ప్రార్థింప, నాతఁడు కుమారుని దీవించి, యతఁడు కోరినట్లెల్ల జఱుగునట్లు వరంబు నొసంగి పంపెను. గడువునాటికి, కటకరాజగు భూపేంద్రుని పాముకఱవ నాతఁడు విగత ప్రాణుండయ్యెను. మరణించిన రాజును ప్రేతభూమికిం గొనిపోవుచుండ నెటనుండియో యొక విష వైద్యుఁడు దారికడ్డమై——తన విఔషధులవలన రాజును బ్రదికింతునని పలుక నాశవంబునట మార్గంబుననుంచిరి. అంత నావైద్యుఁడు రాజును విషమంత్రశక్తిచే బ్రదికింప, నారాజు పునర్జీవియై, తన్ను బ్రదికించిన వైద్యునియెడ ప్రీతుండై యాతనికి మంత్రిపదంబు నొసంగెను. ఇది జఱిగిన మరునాడే కౌశికుఁడు తన యభియోగముం దీర్మానింప రాజేంద్రునిఁ బ్రార్ధింప నారా జనసూయంగని యేలనో పొంగిపొరలి వచ్చిన దుఃఖంబు నాపుకొని, యాబాలను విశేషముగ గౌరవించి యామె వలనఁ దచ్చరిత్రంబు నెఱింగియు నీభర్త యెవ్వఁడని యడిగెను. ఆమె నిజవ్రుత్తాంతముం దెల్ప కౌశికుం డడ్డమువచ్చి రాజేంద్రా! దివ్యపురుషు లేమానవ కాంతలతోనైన స్వప్నంబున భోగించుటయు పుత్రుఁడు గల్గుటయు సంభవించునా? ఇది విశ్వాసార్హమేనా? ఈకులట కట్టుకధ నొకదానిని గల్పించినంతనే మీరును విశ్వసింతురా! ఇది తప్పక నా భార్యయే! న్యాయము దయచేయుఁ"డని పలుక నాతఁడేమియుఁ బలుకనేఱక యోచించుచుండెను. ఇంతలో నాసభలోనికి స్ఫురద్రూపంబున మీన కేతనుం డరుదెంచి "రాజేంద్రా! ఈమె నాతల్లి యనసూయ. తండ్రిని నేనెఱుంగను. ఒక దివ్య పురుషుఁడని మాయమ్మ వచించేను. ఇతఁడు మాత్రము నాతండ్రిగాఁడు. న్యాయము దయచేయు! ” మనియెను. అది విని యాభూపతీ మఱింత యాందోళితమనస్కుఁడై తుదకు “కుమారా! నీతండ్రి యీతఁడు కాఁడంటివి. సరే! నీతండ్రి దివ్యపురుషుఁడై నట్లు ఋజువు చేసినచో, నీకు న్యాయముగల్గు " ననెను. అంత నామీనకేతనుఁడు జటాశంకరమునీంద్ర దత్తంబులగు, సర్వమహత్త్వ శక్తులనుఁ గేంద్రీకరించి, నిమీలిత లోచనుఁడై చతుర్దశ భువనంబులయందలి, సమస్తదేవతలను యక్ష నాగ గరుడ కిన్నెర కింపురుష, పిశాచ రాక్షస శాకినీ ఢాకినీ సందోషములం దనమనంబునఁ బ్రార్ధించి, "ఓ దేవాధీశులారా! నాతల్లి మహాపతి వ్రతయగు విశ్వాసంబు నాకుఁగలదు. మీలో నీమెవలన నన్ను గన్న మహాత్ముఁ డెవ్వఁడో యాతఁ డీసభామధ్యంబున కరుగుదెంచి, దర్శనంబిచ్చి, మాయిరువుఱను నిష్కళంక చరిత్రులనుఁగా నొనరింపుఁడని ప్రార్ధింప, నత్యంతాశ్చర్యకరంబుగ నాసభామధ్యంబున భూ నభోంతరాళంబులు నిండు నట్లగ్ని జ్వాలలు వొడమి కన్నులు మిఱుమిట్లుఁ గొల్పుకరణి బ్రహ్మాండంబులగు మహా తేజస్సలు జన్మించి, తత్తేజోరాసుల మధ్యంబుల, సహస్రఫణంబుల తోడను, సహస్రఫణాగ్రముల యందును సహస్రమణులతోడనుఁ బ్రకాశించు నొక్క. నాగరాజు దృద్దర్శితుండయ్యెను. అతని మహత్తమ తేజోరాశిం గాంచ నేఱక, సభ్యులఁదఱుఁ గన్ను లుండియు నంధప్రాయులైరి. తదీయ దిగ్భ్రాంతి నుండి కొండొకవడికిం దెప్పఱిల్లి యారాజు ఫణిరాజుంగాంచి, “యోమహాత్మా! తమరెవ్వ" ఱని ప్రశ్నింప నా నాగేంద్రుఁడు గంభీస్వరంబున, “నో రాజా! నేను వాసుకియను నాగరాజును; నన్నెవ్వఱో మంత్రిబద్ధుం జేసి యిటకీడ్చి తెచ్చిరి. అట్టి సమర్ధతగలవాఁ డెవ్వఁడు? నన్నిందులకుఁ బిలువ గతంబేమి? నాపుడు మీనకేతనుండా వాసుకింగని, “మహాత్మా! నిన్ను మంత్రబద్ధుం జేసి పిలిచినవాఁడను నేనె——ఇచ్చట మాకొక గొప్ప వివాదము పొసంగి యున్నది. దానిం దీర్చఁ బిలిచితి" నని, యనసూయావృత్తాంతమును, తన జన్మప్రకారంబును లోకంబునఁగల యపనిందయు, కౌశికుని వివాదంబును నెఱింగించి" యిందలి వాస్తవంబును దయతో బ్రకటపఱచి యీయపనిందను, కౌశి

కుని వివాదంబును నీడేర్పుండని పలుక, వాసుని యాయనసూయం గాంచి స్మృతి నభినయించి—— “బాలకా! ఇప్పటికిఁ బదునెనిమిది వత్సరములకు బూర్వమొక్కనాడు 'నేను వేఁగుజామున విహారార్థినై ధారానగర పరిసర సరోవర సమిపంబున సంచరించుచుండ మీయమ్మ యటకు జలార్ధియైచనుఁ దెంచె——అంత నేనీకాంతఁగని మరుల్కొని యారేయి స్వప్నంబునఁ గలసికొని, భ్రమవాపుకొంటిని. తదనంతరం బీకాంతవృత్తాంతము 'నేమఱచితిని. నాటికి నేడు సపుత్రకంబుగా నీ వెలఁదింగాంచితి; ఈ కౌశికుఁడు ధూర్తుఁడై వివాదంబుసల్పి మిమ్ము రచ్చకీడ్చిన పాపఫలంబునకు వీనిపై నా విషజ్వలలం బఱపి సంహరించెద! "నని భీకరాకారుఁఁడై విషజ్యాలలంగక్కఁ దొడందె——కౌశికుఁడు భీతిల్లె——మీన కేతనుఁడు వాసుని పాదములంబడి “తండ్రీ! అజ్ఞుఁడగు నీతుచ్ఛవిప్రున కింతటి ఘోరశిక్ష విధింపఁబని లేదు. రాజశిక్షయే చాలును. మమ్ముఁగాంచి వీనిని క్షమియింపు"మనిన నాతఁడు శాంతించె—— అంతరాజు కౌశికునకు జన్మాంతర కారాగార శిక్ష విధించి వాసుకింగాంచి, " మహాత్మా ! మీరు పూజ్యులు; మీకు తాత్కాలికంబుగఁగల్గిన భ్రమవాపుకొనగోరి యిట్లు స్వప్నంబులందు సమావేశమైనచో నక్కాంత లపనిందల పాలుగారా? ఇది తమకుఁదగిన పనియా? యని మందలింప వాసుకి పశ్చాత్తప్తుఁడై — “రాజా ! నీవనినట్లు నాకార్యంబపరాధంబయగు. తద్దోషమును వాపుకొన నీ బాలుని తల్లితోఁగూడ నాలోకంబునకుఁగొనిపోయి నాసామ్రాజ్యమునందభిషిత్తు నొనరింతును——అదిగాక——నా చెల్లెలు కుమారైయగు, మలయవతియను బాలిక యొకనాడు జటాశంకర మున్యాశ్రమోప్రాంతంబున నీ మీనకేతునుంగని, మోహవేశమునొంది నవయుచున్నయది. దానిని నాకుమారుండగు నీ మీనకేతునకుమారునకిచ్చి వివాహమొనరించెద! దేవీ! అనసూయా! నిన్ను విశేషముగ నపకీర్తిపాలొనరించిన బుద్ధిహీనుఁడ ! నన్ను క్షమింపు"'మని పలుక ననసూయ భర్తృపాదంబున కెఱగి——"దేవా! ఇదినాపురాకృత పాపఫలము; అది నేటికిగతించె; ఇప్పటికి ధన్యాత్మనై తి" నని పలికెను. అంత నాదేశపు రాజు సర్వజనులంగాంచి——"విధివిధానం బత్యద్భుతము! నే నీయనసూయ సోదరుండనగు సుమతిని. ఇప్పుడు నాకు మంత్రిగానున్న వాఁడు నాతమ్ముఁడగు ధీమతి. అనసూయ గర్భిణియైయుండుటెఱింగి మేమొకరిపై నొకరమనుమానమునంది, గృహత్యాగులమైపోయితిమి. అట్లుచనిన నేను కాశీపురంబున నోకమునీంద్రు నాశ్రయించి పరకాయప్రవేశవిద్య నెఱింగి, యాపురంబుననే నా కకస్మాత్తుగఁదారసిల్లిన ధీమతింవలన వాని నిర్ద్వేషిత్వము నెఱింగి నానిర్దోషిత్వమును వాని కెఱిఁగించి యీపురంబునకురాగా నీరాజు మరణించెను. అంతట ధీమతి విషవైద్యునివలెవచ్చి మంత్రింప, నాయాత్మ యీరోజున శరీరంబునఁ బ్రవేశించెను. అంత నీరాజు జీవించేనని ప్రజలానందించిరి 'నేను నాసోదరునే సచివునిగా నేర్పఱచుకొంటిని. కొండొకచోనాశరీరము భద్రముగనున్నది. ఈరాజ్యమును విప్రుండనగు నే నపేక్షింపనోవ——నామేనల్లునకే దీని నొసంగ సంకల్పించితిని. ఇతఁడు కొన్ని నాళ్లు నాగలోకంబునను, కొన్ని నాళ్లు కటకంబుననునుండి, యుభయ రాజ్యంబులం బరిపాలించుకోను నట్లాజ్జాపింపుమని వాసుకిని వేసుకొనియెను.

అత్యద్భుతంబగు నా సమావేశంబున కెల్లఱు బ్రమోదావహులైరి—— అన్న లంగని యనసూయ యానంద బాష్పంబులను రాల్చెను, మీన కేతనుండు మేనమామలకు నమస్కరించి వారి కోరిక ప్రకారము వర్తింతునని పలికెను. అనంతరము వాసుకి దారాసుతులను నాగలోకంబునకుఁ గోనిచని, మలయవతినొసంగి మీనకేతనుని వివాహంబు నతి వైభవంబుగ నొనరించెను. సుమతి నిజశరీరమును ధరించి సోదరునితో గలసి నిజపురంబగు ధారానగరంబున కరిగెను. అనసూయా వృత్తాంతము జగద్వ్యాప్తమైన కతన ధారానగరవిప్రులు సుమతి ధీమతులను క్షమింప వేడుకొని కులంబునఁ జేర్చుకొనిరి. మీనకేతనుండు కొన్ని నాళ్లు భూలోకంబునను, కొన్ని నాళ్లు నాగలోకంబునను వసించుచు, మలయవతి, గూడి యిష్తభోగంబుల ననుభవించుచు, సుఖంబుగా నుండెను.


మూఁడవ రాత్రి కథ.

మూఁడవనాటిరాత్రి యధా పూర్వంబుగఁ గృష్ణార్జును లిరువుఱును యమునాసిక తాతలంబునం దాసీనులై నాగవల్లీ దళ చర్వణ బొనరించుతరి, పార్టుండు కేశవుం దిలకించి——"స్వామి! గతరాత్రి వచించిన కథ యద్బుతంబై యోప్పారె! నేటి రేయి మూఁడవదియగు నాదానందతత్వముతో గూడిన పుణ్యకధ నెఱిగించి ధన్యుం జేయవే!" యని ప్రార్థింప సధోక్షజుండు భీభత్సుం గాంచి——"విజయా! చిరకారి మహారాజు చరితంబు జెప్పెద నాకర్ణింపుము. దీనివలన నీయభీష్టం బీడేరెడు" నని పలికి యిట్లు వచింపఁ దోడంగె——

చిరకారి మహారాజు కథ.

తోల్లి మిధిలాపురంబును మేధానిధియను రాజోత్తముండు ధర్మజ్జుఁడై పరిపాలించుచుండెను. అతనికి చంద్రరేఖ యను సతీతిలకంబు వలన గళానిధియను పుత్రరత్నం బుదయించెను. ఆబాలునకు షడ్వత్సర ప్రాయంబు గల్గియున్న తరుణంబున, యొక సిద్ధుం డాతనికడ కరుదెంచి, యాతని మానసంబును వైరాగ్యమార్గంబునకు మరల్ప నారాజు కాయ సిద్ధికై——యమ్ముని వెంట హిమాలయంబున కరుగుచు, నప్పటికి, గర్బవతియైయున్న పత్ని నింటవిడిచి, తన సోదరుఁడగు శ్వేతకేతునకు రాజ్యం బప్పగించెను. మేధానిధిరా జరిగినయనంతరంబున శ్వేతకేతుఁడు దుర్మార్గుఁడై వధూనికను నిరాదరణం బోనరింప నాసాధ్వి యట నుండనోపక , విశ్వాసపాత్రురాలగు తన సఖియగు తిలకతోఁ గూడి పాదచారిణియై గర్భ భారంబున నత్యంత శ్రమను సహించుచు, నాఱేండ్ల పుత్రుని