పంచతంత్రము (వచనం)/పంచతంత్రము
శ్రీరస్తు
పంచతంత్రము
పాటలీపురమను ప్రసిద్ధంబైన యొక పట్టణముగలదు . అది వేదశాస్త్రపురాణాది చతుర్దశవిద్యలు నేర్చిన బ్రాహ్మణోత్తములచేతనున్ను మిక్కిలిబలపరాక్రమశాలులయిన రాజశ్రేష్ఠులచేతనున్ను క్రయవిక్రయములయందు బ్రసిద్ధులైన వైశ్యులచేతనున్ను దేవబ్రాహ్మణవిశ్వాసము గలిగియుండెడు శూద్రులచేతనున్ను నానావిధములయిన ఆయుధవిద్యల నభ్యసించుటయందు నేర్పు గల వీరభటులచేతనున్ను అనేకదేవాలయములచేతనున్ను ప్రకాశింపుచుండును.
ఆపట్టణము సుదర్శనుండను రాజు యేలుచుండును. అతడు పరాక్రమమున కుమారామస్వామితోనున్ను బుద్ధియందు బృహస్పతితోనున్ను ధైర్యంబున హిమవంతునితోనున్ను దాతృత్వమునందు శిబికర్ణదధీచులతోనున్ను సమానుడై యిజ్జగంబున బ్రసిద్ధి కెక్కి యుండెను.
ఆరాజశ్రేష్ఠు డొక్కనాడు మంత్రులు పురోహితులు విద్వజ్జనంబులు సామంతరాజులు బంధువులు మిత్రులును పరివేష్టించియుండగా సభలో నిండుకొలువుండి దుర్మార్గులై నీతిశాస్త్రము తెలియని తన కొడుకులం జూచి మిక్కిలి చింతాక్రాంతుండై సభలోనున్నవారితో నిట్లనియె.
విద్వాంసుడున్ను ధార్మికుడున్ను కానికొడుకు పుట్టితే ఫల మేమి చూడిపాడి లేనిగోవును పెట్టుకొని యేమి చేయవచ్చును. బహుమంది కొడుకులు గలరని లెక్కపెట్టుకొనుటచేత కొంచమైనా ప్రయోజనము కద్దా. వంశమునకు కీర్తి తెచ్చినకుమారుడు ఒక్కడే చాలును రూపమున్ను ధనమున్ను బలమున్ను కలిగినా శాస్త్రజ్ఞానము లేని కొడు కెందుకు. అటువంటికొడుకును గనుటకంటే తల్లి గొడ్రాలైనా మేలు. కడుపు దిగబడినా మంచిదే. పుట్టినవాడు చచ్చినా బాగు. ఆడదిగా బుట్టినా వాసి. పూర్వజన్మములయందు తండ్రి చేసినపుణ్యకర్మముచేత ఉదారుండును ధర్మాత్ముండును తల్లిదండ్రులమాట జవదాటనివాడును మంచినడతగలవాడును సర్వజనహితుండును విద్వాంసుండును సమర్థుండును ఒకరు తనకు చేసినమేలు మరవనివాడును ఆడితప్పనివాడు నైనపుత్రుండు గలుగు నుపాసకర్మముచేత పాలసముద్రములో విషము పుట్టినట్లు మంచివంశములో దుర్మార్గుడు పుట్టి కులము చెరుచును. యావనము ధనము దొరతనము అవివేకము అను యీనాలుగింటిలో ఒకటొకటే అనర్ధమును పుట్టించును. ఈనాలుగున్ను కలిగినచోట చెప్పవలసినదేమి. కాబట్టి వివేకము లేనందున దుర్మార్గులైన నాకొడుకులకు నీతిశాస్త్రము చదివించి వివేకము కలుగజేసుటవలన వారిని పునర్జన్మసంభూతులుగా నేర్పరచగలపుణ్యాత్ము లెవరైనా యీసభయందు గలరా.
అని రాజు చెప్పగానే దేవగురువైనబృహస్పతివలె సమస్తనీతిశాస్త్రములు తెలిసిన విష్ణుశర్మయను బ్రాహ్మణుడు లేచి రాజుని జూచి ఓమహారాజా మీ రీలాగున చింత చేయవలసినది యేమి. మీరు తలచినపని చక్కచేయుట యెంతమాత్రము. నేను విూకొడుకులనందరిని ఆరునెలలలో సకలనీతిశాస్త్రము తెలిసినవారినిగా జేసి మీకు సమర్పించకపోతే ధనధాన్యములతో నాయిల్లు విడిచిపెట్టి మీరాజ్యమునకు దూరముగా బోగలవాడనని ప్రతిజ్ఞ చేసెను.
అందుకు రాజు చాలా సంతోషించి ఆవిష్ణుశర్మకు యేనుగులు గుఱ్ఱములు తేరులు పల్లకీలు గొప్పవెలగలిగినవస్త్రములు సొమ్ములు మొదలుగాగలవస్తువులు బహుప్రీతితో బహుమానము చేసి తనకొడుకులను పిలిపించి అయ్యా ఇదుగో వీండ్లు మీకొమాళ్లు గాని నాకొమాళ్లు గారు మీరు వీండ్లను చదివించి బుద్ధిమంతులను చేసేభారము మీది అని వారిని విష్ణుశర్మవశము చేసెను.
అంతట విష్ణుశర్మ రాజపుత్రులను పిలుచుకొని పోయి తనమనస్సులో ఆలోచన చేసి మిత్రభేదము, సుహృల్లాభము, సంధివిగ్రహము, లబ్దనాశము, అసంప్రేక్ష్యకారిత్వము అని అయిదుతంత్రములు గల పంచతంత్ర మనేగ్రంథము చేసి వారితో నిట్లనియె.
మిత్రభేద మనగా స్నేహితులకు విరోధము పుట్టించడము. సుహ్మల్లాభ మనగా స్నేహితులను సంపాదించుకోవడము. సంధివిగ్రహ మనగా ముందుగా స్నేహము చేసి తర్వాత నిరోధించడము. లబ్ధనాశన మనగా దొరికినధనమును పోగొట్టుకోవడము. అసంప్రేక్ష్యకారిత్వ మనగా ఏకార్యమునైనా చక్కగా విచారించక చేయడము.
పంచతంత్ర మనగా ఈఅయిదుతంత్రములు గల గ్రంథము.