పంచతంత్రము (బైచరాజు)/పంచమాశ్వాసము

శ్రీరస్తు

పంచతంత్రము

పంచమాశ్వాసము



హిమగుప్రియతనయా
మోహస్నేహావలోకముగ్ధభ్రమర
వ్యూహసముపాస్యసిద్ధ
వ్యాహృతిమధుముఖసరోజ హరిహరనాథా.

1


వ.

దేవా యసమీక్ష్యకారిత్వాభిధానం బగుపంచమతంత్ర మాకర్ణింపు మధీతనీతిశా
స్త్రమర్ముం డగువిష్ణుశర్ముండు సుదర్శనకుమారుల కిట్లనియె.

2


క.

అపరీక్షితం బకార్యము, సుపరీక్షిత మభిమతంబు సురి మ్మెవ్వరి క
య్యపరీక్షతవిధిఁ గాదా, యుపతాపము పుట్టె విప్రయువతికిఁ బతికిన్.

3


క.

నావిని రాజకుమారకు, లావిప్రునిఁ జూచి పలికి రది వీనులవిం
దై వెలయఁగ నీకథఁ జెపు, మా వినియెద మనిన వారి కతఁ డిట్లనియెన్.

4


సీ.

గౌడదేశంబునఁ గలఁ డాగమాభ్యాసజడుఁడు విప్రుఁడు దేవశర్మ యనఁగ
నతఁడు సోమసుధాత్మసుత యాజ్ఞసేని నాఁ బెంపొందుకులకన్యఁ బెండ్లియయ్యె
సంతులే కలశరజ్జలజలోచన ఱాయి గన్నఱాతికిఁగుండు గన్నగుంటి
కెఱఁగుచు మఱుగుచు నెవ్వరేవ్రతములఁ జెప్పి రావ్రతములఁ జేకొనుచును


తే.

సుతులఁ గనిపెంచుగరితలఁ జూచి యేచి, యిచ్చ ముచ్చట నొఁదుచు నిట్టులుండ
గొంతగాలంబు వోయిన గొడ్డువీగి, కాంతిజితహేమసుమగర్భ గర్భమయ్యె.

5


సీ.

ఓఁకర బలిసె జిట్టుములసందడి మించెఁ గలకవాఱెఁ గపోలఫలకయుగళి
బుద్ధి మృద్భక్షణంబునకు నువ్విళులూఱె రశ్మి చామనమేన ఱచ్చజేసెఁ
గాళిమ గురుకుచాగ్రములఁ బాళెము డిగ్గె గార్శ్యంబునకు బొమ్మగట్టె నడుము
నిద్రారతిప్రీతి క్షేత్రంబులకుఁ గల్గె మురిపంబు ముంగర మోసులెత్తె


తే.

నరుచి యాహారసుఖముల నడ్డగించె, మధురరుచులకు నెదురెక్కుమానసంబు
నిర్భరశ్రాంతి నడకల నెలవుకొనియె, నక్కురంగేక్షణకుఁ జీర చిక్కుటయును.

6

క.

ఈలక్షణములలీలన్, చూలాలై యున్నజాయ సుగుణనికాయన్
వేలాతీతప్రీతిం, బాలితనిజగోత్రసమితిపతి యిట్లనియెన్.

7


క.

దైవముకృప గలదానవు, గా వంధ్యాత్వంబు వీడెఁగా నీతికళా
కోవిదుఁ డగుసుతుఁ గనియెదు; గా వంశము వృద్ధిఁ బొందఁగా నా కనుచున్.

8


వ.

మనోరథంబునం బొట్టుపొఱలగుమగనిం గని నగుమొగంబున ఘటప్రతిభటస్తని
యిట్లనియె.

9


క.

బహుళమనోరథభీషణ, గహనంబునఁ జిక్కి వెడలఁ గాననినీచో
త్సహనుఁడు చనుసక్తురజః, పిహితుం డగుసోమశర్మపితచందమునన్.

10


క.

నావిని దేవికి విపులా, దేవుం డిట్లనియె గుణవతీ యెట్టెట్టూ
నీ వీకథ నాతోఁ జెపు, మా వినియెద ననినఁ బతికి మానిని పలికెన్.

11


సీ.

కలఁడు దాశార్ణభూతలమున నత్యర్థసారశర్ముఁడు సోమశర్మ యనఁగ
నతనికి నెనమండ్రుసుతు లందులో నగ్రపుత్రుండు పిత్రన్నభోక్త వాఁడు
కడుపారఁ గృష్ణపక్షశ్రాద్ధమున నొక్కభూమినిర్జరుగృహంబున భుజించి
యొకసక్తుఘటము పైతృకకర్తచేఁ గొని చని విజనప్రదేశమున నిలిచి


తే.

ఘటము గలయంపిగా నీరుగావిపంచెఁ, బఱిచి శయనించి యొఱుగు గాఁ బాణి నిలిపి
యక్షు లరమోడ్చి ధనవృద్ధనై చరింతు, నని దురంతోద్యమంబున నతఁడు కలఁచి.

12


సీ.

అదన నీసక్తు నమ్మెద నమ్మి యొకమేఁక గొనియెదఁ గొనకొని కొనిన మంద
నేటేట నొకరెంటి నీనెడు నవియును నవియు వానికిఁ బుట్టినవియు నీన
బహువత్సరములకు బహుసహస్రంబులై నెగడెడువాని నన్నింటి విలిచి
సంతరించెద ధేనుశత మది పెట్టినకోడెలచే ధారఁ గొనిన చేల


తే.

విరివిగా బైరు విత్తింతు వేళ్ళు గొలుచు, గాఁగ మామకసస్యము ల్గడుఫలించు
పంటకొలు చమ్మి కూర్తు నపారధనము, ధనికుఁ డని నాకు నొకఁ డిచ్చుఁ దనకుమారి.

13


క.

దొడ్డతన మరసి యీక్రియ, గడ్డాయం బనిన విప్రకన్యకవలనన్
గొడ్డ కొకసుతునిఁ గని యా, బిడ్డని మాసోమశర్మ పేరే యిడుదున్.

14


క.

ఆయర్భకుఁ డూర్జితగతి, హాయనపరిమితవయస్కుఁ డగుఁ బోషింపన్
సాయంతనమున గృహకా, ర్యాయత్తమనీషభామ యబ్బాలకునిన్.

15


క.

కరుణఁ దనచంక నిడుకొని, యరుగక యటువైచి పోవు ననునాలో
సురుఁ డీషన్నిద్రాసం, భరముద్రితనయనుఁ డగుచు మఱియాలోనన్.

16


క.

ధేనువు లేతెంచిన నటు, లైన న్వడిఁ ద్రొక్కు నాత్మజునిఁ దేవోసీ
వీని నిటువైచి పోఁదగు, నే నీచంకకు భరంబె నిసువానుకొనన్.

17


క.

అని కలవరించి లగుడముఁ, గొని త్రిప్పుచు నిక్కువంబు కులసతి యనుచున్
జెనఁటి ధరాసురుఁ డాగ్రహ, మన సక్తుఘటంబు భిన్నములుగా వైచెన్.

18

వ.

సక్తుచూర్ణపాండూకృతుండును విషాదవిహ్వలుండును నయ్యె నిది మనోరథరాజ్య
పాలనఫలం బనిచెప్పి యప్పల్లవాధర సుముహూర్తంబునఁ గుమారు గాంచి
పంచమదివసంబున.

19


క.

అత్తులలేనికుమారునిఁ, బొత్తులలో మనిచి గూర్మిఁ బురుషుని రక్షా
వృత్తికి నియమించి ధరా, భృత్తులతోరోజ జననిగృహమున కరిగెన్.

20


క.

ఆలోఁ బెంపుడునకులము, బాలునకుం గాపువెట్టి బ్రాహ్మణుఁడు నికే
తాళిందమునకుఁ జనియెం, గాలోరగ మపుడు బిలముఖము వెలువడుచున్.

21


క.

అలభూమిసురతనూభవు, తలిమంబునఁ బఱవ నూర్జితక్రోధసమా
కులమై నకులము చిలువన్, బలువాతన్ గఱచి ద్రుంచి పాఱగవైచెన్.

22


ఉ.

ఆసమయంబున న్మహిసురాగ్రణి పుత్రుఁ దలంచి గాఢసం
త్రాసము పేర్మి లోఁగిటికి గ్రమ్మర వచ్చుచు నుండఁ జూచి యు
ల్లాసరసం బెలర్ప నకులంబు ఫణిస్రవదప్రపంకసం
భాసితవక్త్రమై యెదురఁ బర్వి పదాబ్జములం బెనంగినన్.

23


చ.

ప్రకటభుజంగమక్షతజపంకవిలిప్తముఖంబు నమ్మహా
నకులముఁ జూచి భూమిసురుఁ డాహతభీతపరీతచిత్తుఁడై
యొకగడెసేపు రిమ్మగొని యుండి పదంపడి తేఱి నిష్పరీ
క్షకుఁ డసమీక్ష్యకారియును గావున రోషవశుండు గావునన్.

24


క.

తప్పదు చంపె న్వదనము, చెప్పక చెప్పెడును రక్తసిక్తంబయి నా
కుప్పుకలువోలెఁ గలిగిన, యిప్పాపని దీనికేన యిచ్చితి మెసవన్.

25


క.

సతిమాట మీర కస్మ, త్సుతుదగ్గఱఁ గాచియుండఁజూచిన నీదు
స్స్థితి వచ్చునె నాకుత్సిత, మతిగూల న్నకుల ముచితమా కావలికిన్.

26


క.

అని కన్నుల జేవుఱుగీ; ల్కొన లగుడం బెత్తి విసరికొట్టిన వెలికిన్
గనుగ్రుడ్లు వెడల నొప్పిం, బనివి యహో నకుల మపుడు ప్రాణము విడిచెన్.

27


చ.

నకులముఁ జంపి పోయి సదనంబున భూమిసురుండు గన్గొనం
జికిలిమడుంగుపానుపునఁ జెక్కుచెమర్పక యున్నపుత్రకున్
బ్రకటభుజంగభంగములఁ బ్రాంతమునం గని ఱిచ్చఁబోయి యే
టికి నిటుసేసితిం గలువరించి యయో నను రోయ నుత్తముల్.

28


వ.

అని యుదరతాడనంబుఁ జేసికొనుచు బ్రాహ్మణుం డుచ్చైస్వనంబున రోదనంబు
సేయఁదొడంగె నక్కలకలంబు చేరువఁ బుట్టినింట నునికింజేసి యాకర్ణించి యాజ్ఞసే
ని గృహంబునకు వచ్చి బ్రాణేశ్వరు నాలోకించి.

29


క.

కడిఖండ లైనపామె, క్కడిది కడుంబ్రేమఁ బెంపఁగా రాజిలుపెం
పుడునకుల మేల పొలిసెం, దడయక నీ వేటి కేడ్చెదవు చెపు మనఘా.

30

ఉ.

నావిని బ్రాహ్మణుం డనియె నన్నుఁ బ్రయత్న మెలర్సఁ బట్టికిన్
గావలిఁబెట్టి పుట్టినిలు గాల్పఁగ నీ వటుబోవ నేను నా
లో వివరంబు మాలి మృగలోచన ముంగిసనే కిశోకర
క్షావిధి కొప్ప జేనేర్పఱిచి జాఱితి మందిరబాహ్యభూమికిన్.

31


క.

ముంగియును మన్నియోగము, నం గదలక కాచియుండ నందుకు నాలో
నం గాలసర్ప మరుదే, రం గని భవదీయపుత్రరక్షాబుద్ధిన్.

32


క.

తలఁ గొఱికి నఱికి భుజగ, జ్వలదస్రరసాతిరక్తవదనముతో ద
వ్వుల కెదురువచ్చి నకులము, కలకంఠీ పెనఁగదొణఁగెఁ గాళ్ళన్ వ్రేళ్ళన్.

33


తే.

అపుడు పన్నగరక్తసిక్తాననంబు, బభ్రునేత్రంబుఁ గని గుండె పగిలి నొగిలి
తనయు నిర్జించె నిఁక నేటితాళి మనుచు, నువిద లగుడాభిహతి దీనియుసురుఁ గొంటి.

34


క.

ఈయుగ్రాఘం బేమిటఁ, బాయు నిశాచరుడఁ గాక బ్రాహ్మణుఁడనె యం
చాయన యేడ్చుచుఁ జెప్పిన, నాయిభనిభయాన ఖిన్నయై మూర్ఛిల్లెన్.

35


వ.

మూర్ఛిల్లి యెట్టకేలకుం దేఱి కన్నీరు కరతలంబునం దుడిచికొనుచు సతి పతికి
గద్దదస్వరయై యిట్లనియె.

36


క.

కుపరీక్షితము కుదృష్టము, కుపరామృష్టంబు మఱియుఁ గుశ్రుతముం గో
రుపురుషుఁడు నాపితునిక్రియ, నషపరిమితాపత్పరీతుఁడై చెడినోవున్.

37


క.

అనిన విని భూసురుఁడు సతిఁ, గనుగొని యోవంశపాలికా! మంగలి యే
పనిఁ జేసి చచ్చె నీకథ, విన నిష్టం బయ్యెఁ జెప్పవే నా కనుడున్.

38


వ.

యాజ్ఞసేని యిట్లని చెప్పందొణంగె.

39


చ.

జడమతిభార్య యొక్కసెటిసాని విదర్భునివీటనుండి సొం
పడరఁగఁ గర్మలబ్ధిఁ గడుపై కడుఁ బైకొనుదండినొప్పులం
బడి యది పుత్రుఁ గాంచి పిదపం బరలోకముఁ జేరె నంతలో
నడల దొడంగె నాకటికి నారసి చన్నిడలేమి బాలుఁడున్.

40


క.

చుట్టంబులు పక్కంబులు, కట్టడియై వీఁడు తల్లిగండము తలగా
బుట్టె నవలక్షణుం డికఁ, గట్టా యెవ్వారి జెఱుపఁగా నున్నాడో.

41


ఆ.

ఇంట నుండగూడ దిప్పుడు గొని చని, గుంటనైనఁ బెద్దకుంటనైనఁ
బెంటనైన వైచి యింటికీ నరుదెం డ, నంగ నద్దురుక్తు లాలకించి.

42


క.

ఆయిండ్లఁ గూలి కుప్పట, లాయముగా నిరవధీనయై మనునొకన
ర్షీయసి వేఁగినమదిలో, బాయనితమి మ్రొక్కి నిలువఁబడి యిట్లనియెన్.

43


ఉత్సాహ.

కన్నవారివంకవారిఁ గానఁ బ్రాణనాథుఁడున్
మున్నె చచ్చె యేను గుంకముండ నెట్టు లేగుదున్
మున్ను వెన్క లేదు నేఁడు మూఁడుగాళ్ళవృద్ధ నా
యన్నలార వీని నీరె యంచు వేఁడి మ్రొక్కినన్.

44

మ.

అరసాన్నగ్రహణాస్థిశేషనతదేహన్ సౌఖ్యకృత్తైలసం
స్కరణాభావజటీకృతాలకననీష ద్దైన్యతామ్యన్ముఖం
బరుషప్రాక్పరిధానసంసృతనితంబ న్నిర్గతాలంబనా
జరఠం గన్గొని యొండునాక నగరస్వాముల్ ప్రసాదించినన్.

45


క.

వనిత పనిఁబూని వానిన్, దనయునిగా బెనుచుకొనిన దక్సుకృతం బే
మని చెప్పవచ్చు విద్యా, ధనుఁడు గుణాకరుఁడు ధీరతరుఁ డితఁ డయ్యెన్.

46


క.

అతఁ డొకనాఁడు దారి, ద్ర్యాతురుఁడై ధాత వొలసి యలసి ముహీశ
య్యాతలమున నిదురించి య, హో తేజలాభమూల మొక్కటఁ గనియెన్.

47


ఉ.

చేరి తృతీయయామమున సెట్టి గలంగి సదుల్లసన్మరు
ద్భూరుహభంగిఁ గెంజడలు భూతివళక్షితమైన మేన నిం
డారగఁ గావికావు మసినంటినమోము సలక్ష్మశుభ్రరో
చీరుచి నేవగింప నొకసిద్ధుఁడు వచ్చి సదాదరాయతిన్.

48


చ.

అనియె నహా కిరాటతనయా వినయాదిగుణంబులందు నే
మనుజుఁడు నీకు సాటి యలమాట లటుండెఁ బ్రభాతమైన నీ
కనుఁగవకు న్ఘనక్షపణకత్రయము న్గనుపట్టు ముంగిటం
బనివడి దానిఁ జంపు మది భర్మనిధిత్రయమూర్తి నుండెడున్.

49


క.

ఆనిధులఁ బుచ్చుకొని ధని, వై నీతిఖ్యాతిరీతు లమరఁగ మనుమం
చానిత్యసత్యుఁ డరిగిన, మానస మలరం గిరాటమణి మేల్కనియెన్.

50


తే.

మేలుకని భక్తిఁ బ్రణమిల్లి మేననిలిచి, తల్లి యూరుజమహిళామతల్లి కనియె
నమ్మ యిమ్మందిరంబున నలికి మ్రుగ్గుఁ, బెట్టు మిపుడు శుభంబు లభించు మనకు.

51


క.

వలదు విలంబన మన న, ప్పలితగృహం బలికి పూసి పసపొసంగం గు
గ్గులు మృగ్గులు నిడి యక్కథ, నలఘుమతిం దెలిపె సనయుఁ డగుతనయునకున్.

52


క.

క్షౌరమునకు సమయంబగు, టారసి నాపితుఁడు వచ్చె నాలో దైవ
ప్రారంభమున నపూర్వవి, భారూఢక్షపణకత్రయంబును వచ్చెన్.

53


వ.

వచ్చిన.

54


క.

మే నుప్పొంగఁగఁ బెంజెర, కూన న్నగు లగుడ మెత్తికొని ప్రాణంబుల్
పోవడఁచె సెట్టి యాలో, దీనత్రితిమం బహో నిధిత్రయ మయ్యెన్.

55


వ.

అయిన.

56


క.

ఆనిధులఁ బుచ్చుకొని ధని, యై నాపితుఁ జూచి వణిజుఁ దాదృతి మెఱయన్
దీనారశతక మిడి మదిఁ, బూసినకౌతూహలమునఁ బొమ్మని పల్కెన్.

57


చ.

వెఱగు జనింప నత్తెఱఁగు వెంగలిమంగలి సూచి కన్నుమి
న్నెఱుఁగక యింటికే గి యటు లేనును భూరినిధు ల్గడింతు నం
చఱిముఱి గొంకులేక లగుడాగ్రముఁ గైకొని యత్న మేమియున్
గరిపడకుండ నాక్షపణకత్రితయాగమనంబుఁ గోరఁగన్.

58

క.

ఒకముగురు నిగురుగప్పిన, ప్రకటాంగారము లనంగ భస్మవిలిప్తాం
గకులు చనుదేర నారసి, తుకతుకపో నడచె నాపితుఁడు చేసేతన్.

59


క.

లగుడంబున మస్తకముల్, పగిలి పడ న్వ్రేయఁ జచ్చిపడి రెన్నఁగ న
మ్ముగురును ముగురు నిధిత్రయ, మగుటయు లే దవని మెఱసె నస్త్రము మెదడున్.

60


వ.

అట్టి యకృత్యంబునకుఁ బౌరు లాహాకారంబు లొనర్చి రాక్షణంబ నగరరక్షకులు.

61


చ.

పటురభసంబున న్బొదివిపట్టి దురాత్మక యిట్టివారి నేఁ
డిటువలె జేసి చంపుటకు నెవ్విధి నీమన సోర్చె వీరు ని
ష్కుటిలచరిత్రు లన్యులకుఁ గోర రొకింతయు గీడు వీరిపైఁ
గటకట మచ్చరం బెటులఁ గల్గె వృథా యిది పోల వెదెయ్యెడన్.

62


క.

నిటలలిఖితాక్షరంబులు, కుటిలాత్మా మసలదెసల గొనబగుజటులం
జటులగతిఁ జంపి తీ నవని, కటములు బొంగారఁ గ్రూరగతి వా రంతన్.

63


క.

ఆక్షురకుఁ డోడిపడ న, బ్భిక్షులపాదముల సరసఁబెట్టి భుజాహే
తిక్షతి దునిమిరి ధర నప, రీక్షితకార్యులు భజింపరే యాపదలన్.

64


చ.

ప్రశమనరేఖఁ బాదమునఁ బ్రామి యహో యవిశేషరోషసం
వశుఁ డగుచున్ ధరాస్థలి నవారణ నెవ్వఁడు వేగిరించి సం
భృశతరకార్యము ల్సలుపుఁ బెద్దయు వేయును నేల సర్వదు
ర్దశలు గలంచు వానిఁ దము దా గుణలుబ్ధులఁ బొందు సంపదల్.

65


వ.

కావున నీవును నాపితునకు దోడుబోయినవాడ వఐని ప్రాణేశ్వరుం దూఱె వారు
సుఖస్థితి నుండి రని విష్ణుశర్ముండు సెప్పిన విని నీతికథావర్ణనంబున సుదర్శనకుమా
రులు లబ్ధవర్ణులై పూర్ణులై తండ్రి నలరింపుచుండిరి.

66


మ.

సతతశ్రీభృతరాగదేహకృతయోషాభాగరత్నాస్థిదా
మతటిత్తారకయుక్తవారిధరసమ్యక్కాయచిద్గేయ ష
ణ్మతమోహావృతికర్తృకామహితగానప్రేమ గోపాంగనా
శతచామీకరచామరానిలచరాంచత్ఫాలలోలాలకా.

67


క.

హాటకమణినూపురనృక, రోటీకమలాప్తచరణరుచిరాగ్నిశిఖా
పాటీరభసితపల్లవ, పాటలమందారపాదపప్రతిమానా.

68


మాలిని.

త్రిపురరిపువరస్త్రీతీవ్రమానచ్ఛిదాధీ, నిపుణతరవిహారా నిత్యసంతోషపూరా
జపకరణచణార్యాసక్తముక్తాభిగమ్యా, త్రిపటుతనువిలాసా దివ్యధామైకవాసా.

69


గద్య.

ఇది శ్రీవేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవి
స్తుతిభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గపరిశ్రమణ
ధైర్యపర్యాయ ధిక్కృతనీహారపర్వత పర్వతరాజకుమార నిస్సహాయప్రబంధనిర్మాణ
భోజభూదారసుధామధుర భారతీసనాథ వేంకటనాథ ప్రణీతం బయిన పంచతం
త్రంబున నసమీక్ష్యకారిత్వ మన్నది సర్వంబును పంచమాశ్వాసము.