నేటి కాలపు కవిత్వం/శృంగారాధికరణం

శ్రీ గణేశాయ నమః

వాఙ్మయ పరిశిష్టభాష్యం

శృంగారాధికరణం

అవునయ్యా. కొత్తగాకుంటే గాకపోనీయండి, సాధారణప్రజలు కాపులు నాయకులుగావున్న మాకావ్యాలకవిత్వం మంచిదంటారా?

వినిపిస్తున్నాను. ఈకవిత్వాన్ని యిక విచారణచేస్తాను. యెంకిపాటల నీచిన్నకావ్యాలకు మచ్చుగా దీసుకొని విచారిస్తాను. ఈ కాలపు కావ్యాలను చాలావాటిని పరిశీలించాను. వీటిలో శృంగారం ప్రధానంగా వున్నది. కనుక శృంగారవిచారణే యిక్కడ చేస్తాను. ఈ విచారణనే వీర్యానికి రౌద్రానికి అద్భుతానికి అట్లానే అన్వయించుకోవలెను. హాస్యం, భయం, భీభత్సం, కరుణం వీటికి యెటువంటి పాత్రలున్నా విరోధం లేదు గనుకను మామూలుమనుషులు సయితం యీ రసాదుల కావ్యాల్లో ప్రధానపాత్రలుగా వుండవచ్చును గనుకను వీటీని చర్చించడం మాని తక్కిన ఉదాత్తరసాలకు ప్రతినిధిగా శృంగారం తీసుకొని చర్చిస్తాను. ఆదిగాక యీకాలపు వనకుమారి, యెంకిపాటలు, ప్రణయాంజలి మొదలైనవాటిలో శృంగారమే వున్నది. వీటిని గురించి

"యెంకిపాట లనెడి ... కవితాకల్పప్రసూనముల విషయమునందు గూడ...

యెంకిపాటలు ఈ ఇరువదవశతాబ్దిని మన యీ ఆంధ్రవాఙ్మయ కల్పశాఖికను ప్రసవించిన సర్వాంగపరిపూర్ణ పరిణతీవిలసితంబు లగు దివ్యప్రనూనరాజములుగాని పూపబెడంగులపచరించు పసరుమొగ్గలు గావు... దివ్యతాపూర్ణములగు భావసీమలందు ప్రయత్న విశేషమును ప్రోదిచేయబడిన ప్రాభవసంపదల చెన్నలరారు పుష్పరాజములుగాని అంతంతమాత్రపు 'అరవిరు లెన్నటికిని గావు.. ఇంతయేలప్రియపాఠకులు ఈపూజాకుసుమములో నేయొకదానిని చిత్తగించి నను ఈనామాటలు అతిశయోక్తులు ఎంతమాత్రమునుగావని యెరుంగ గల్గుటయేగాక" అని యెంకిపాటల పీఠికాకర్త వ్రాశాడు.

"పాటలు అప్రయత్నంగావచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహముచేసి వీపుతట్టిన అధికార్లవారికా? కవితా కళా రహస్యాలు తెలియజెప్పిన మాబసవరాజు అప్పారాయనికా? మువ్వురకును.".

అని యెంకిపాటలకర్త యీయెంకిపాటల రచనవల్లకలిగిన సంతోషంలో కృతజ్ఞత యెవరికి చూపవలసినదీ తోచక కొంతసేపు అనిశ్చయంతో వున్నాడు.

"యెంకిపాటలు పదిమందికీ వినుపించినవారు, దేశోద్ధారకులు శ్రీయుత కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు...యీ పుస్తకం అచ్చులో యెంతో అభిమానంచూపి రెండుమాసములు తమ మూడుపత్రికలలోను ఉచితముగా అడ్వరుటైజుచేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారి కెంతో కృతజ్ఞుడను ." " శ్రీశ్రీశ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహద్దరుగారు యీపాటలు విని ఆనందించేవారు.

"ఆంధ్రపండిత మండలివారు నన్ను ఆహ్వానించి గౌరవించారు." "తర్కవ్యాకర్ణశాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణ శాస్త్రులుగారు తమకు తామే కోరి యీపాటలు చక్కగా అచ్చువేయించి నందుకు.. కృతజ్ఞుడను."

అని వారివారిపొగడ్తలను యెంకిపాటలకర్త వ్రాశాడు. శృంగారమనే ఒకపుస్తకం అచ్చువేయించిన జీ, యన్. శాస్త్రీ అండుకంపెనీ, తపాల పెట్టె 11(). చిరునామాగల శ్రీగంటి సూర్యనారాయణశాస్త్రివారు. "ప్రథమమునుండి నాకెన్నో విధాల సహాయముచేయుచున్న శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వర్రావుపంతులుగారికి నాప్రణామాంజలి. నా కనేకవిధముల సహాయసంపత్తి నొసగుచున్న ప్రాణమిత్రులగు బసవరాజు వెంకటప్పారావు, దువ్వూరిసాంబమూర్తి, యేడిద సూర్యనారాయణగార్లకు శతహస్రవందన కుసుమార్పణములకన్న నేనేమి యుపకరింపగలను."

అనిప్రకటించారు. ఈ తీరుగా వీరందరు ఈశృంగారాన్ని యెంకిపాటలను మెచ్చుకోవడమేగాకుండా భారతి పత్రికనిండా ప్రణయజానకి అని ప్రణయినీగీతాలని ప్రణయగీతాలని ప్రణయసౌధమని విరివిగా కనబడుతున్నవి. వీరిట్లా ప్రీతి జూపిన వీటితత్వమేమిటి అని వీటినన్నిటిని శ్రద్దతో పరిశీలించాను. ఇక వీటివిచారణ ఆరంభిస్తాను.

యెంకిపాటలకథ.

యెంకినినాయుడు వరిస్తాడు. ఆమె మొట్టమొదట బెట్టుచూపి తరవాత అతడికి వశమవుతుంది. రాత్రుల్లో చేలో నాయుడుంటే యెవరికీ తెలియకుండా అతడికొరకు నీటుగా వస్తుంది. మంచెకింద గోనెపట్ట వేసుకొని యిద్దరు కలుస్తారు. ఆమె కులుకుచూపులు చూపిస్తుంది. తెల్లవారబొయ్యేవేళ యింటికిబోయి యేమీ యెరగన ట్లుంటుంది. కొన్నాళ్లకు యిద్దరూ పెండ్లాడుతారు. తరువాత యిద్దరికి వియోగం సంభవిస్తుంది. యెంకినాయుడికోసం రాత్రులయందు యేటి వొడ్డుకుపోయి అతణ్ని తలుచుకుంటుంది. తరువాత మళ్లీ కలుస్తారు. తిరుపతికి పోతారు. మళ్లీ వియోగం. ఇద్దరూ ఒకరికోసం వొకరు తాపపడతారు. తిరిగి కలుస్తారు. కొద్దిరోజుల్లో కడుపుతో వుంటావని నాయు డంటాడు. అందుకు నాకు యినాము లియ్య మంటాడు. పుస్తకంలో కథ ముగుస్తుంది.

గాక శృంగారం అనే గ్రంథంలో ఒక్కొక్కరు కొన్ని కొన్ని పద్యాలు రచించారు." రజస్వలకాకముందే చన్నులువచ్చినవి."

"జోడుగుండ్లబారననెద దోచె గొత్తచనులు" అని.
"పొదరు గుబ్బలరైక నెగదన్ని పయ్యంట." అని.

"నాచన్నులు, నా వెండ్రుకలు, నాముఖం, నాపెదవి నీవే నని బాసజేసి ఆమాటతీర్చకపోవడం మంచిదేనా" అని.

"సావిట్లొగాజులుసప్పుడయినట్లు, సిటి కేసిరమ్మని చెయ్యూపినట్లు"

అని యిట్టాటివి కనబడుతున్నవి. ఇక భారతిలో ప్రణయగీతాలు, ప్రణయసౌధాలు, ప్రణయజానకి. మూగినోములు మొదలైనవాటిలో

"అది నడిచేటపుడు జీరాడుకుచ్చెళ్లు రేపే దుమ్ములో ఒకరేణువు నయితాను."

(నాయని సుబ్బారావు, భారతి. 1-7-61.)

"ఏమి చేయుచు నుండునో యింటిలోన, నాదుజానకి నా రతనాల బొమ్మ".

(అధికార్ల సూర్యనారాయణ, భారతి. 1-2)

"ఎప్పుడు ప్రియుడువస్తాడా, ఎప్పుడాముద్దుమొగంచూస్తానా అని ఆతురపడుతున్నాను."

(సౌదామిని భారతి. 1-1.)

"ఓకాంతా నన్నొక్కసారి చూడు. నీకటాక్షామృతంలో రాలే చినుకులను తాగనియ్యి, నీచూపుభిక్షపెట్టు".

(ప్రణయసౌధం, మామునూరు నాగభూషణరావు. భారతి 3-3.)

ఓప్రియురాలా!

"నీవు నన్నుచూడవచ్చేటపుడు ప్రణయరసంతో నీపాదాలు కడుగుతాను, నామనఃపుష్పహారం నీమెడలో వేస్తాను. నా హృదయదీపకళికతో హారతిస్తాను. ప్రణయగీతాలు పాడుతాను. నీపాదాలదగ్గరవాలే పూజాపుష్పాన్నౌ తాను. నాకు స్వర్గంవద్దు. నీనీడలోవుంటే చాలు. నాకు గంగాజలం వద్దు. నీ మధురామృతంలో అమృతపు చినుకునైతా, నాకింద్రపదవి వద్దు. నీకంటిలో పాపనైతా."

              

(ప్రణయగీతాలు, భండారు రాజేశ్వరావు. భారతి. 2-2.)


"నాకు రెక్కలుంటే నీవద్దవ్రాలి నిన్ను ముద్దు పెట్టుకుంటాను."

              

(నాదెండ్ల వెంకట్రావు, భారతి. -2-2.)


"ఓతరుణీ నీకౌగిట్లో జేరి తనువుమరుస్తాను. నామీద ఆకాశం

 పడ్డా భయంలేదు.

(ప్రణయోన్మాదం. పాణిని. భారతి. 1.3.)


"నాప్రణయగాన శబ్దాలకు విశ్వమంతా చలించి నిట్టూర్పు

 విడిచింది."

(వేదుల సత్యనారాయణ శాస్త్రి, భారతి. 1-3.)


"గువ్వజంట చింతచెట్టుమీద సరసమాడుతున్నవి.
 చప్పుడైనపుడెల్లా నీవే వస్తున్నావని చూస్తు న్నాను."

                   

(సౌదామిని, భారతి. 1-10.)


"కలికి ఒండొండుకోరనీ వలపుదక్క."

        

(పువ్వాడ శేషగిర్రావు, చోడవరపు జానకిరామయ్య, భారతి.)


"దానిచీరె కొంగు రాచుకున్నది. నిద్రపట్టదు. దానిచూపులు
 దానికులుకులు ఎదురుకొంటున్నవి."

        

(కవికొండల వెంకటరావు, భారతి. 2-10.)


"నన్ను విబుధులువిడిచినా, నామిత్రులువిడిచినా నాప్రేమభాగ్యఁ
 వుంటే నా కేమిభయం."

        

(గరిగిపాటి రామమూర్తి, భారతి. 2-11.)


"ముద్దులొలుకు నీరూపుపిల్లా, మూర్ఛదెచ్చెనేమో పిల్లా."

                                                     

(భారతి. 1-12)


"నిన్ను వలచుట జానకీ నేను నేను." (భారతి, 1-11.)

అని అంటున్నారు. పైవాటిలో అక్కడక్కడ మూలపద్యాలను నేను గద్యంలో ఉదాహరించను. యెంకిపాటలు, శృంగారమనే గ్రంథం భారతిలో ప్రణయగీత, ప్రణయసౌధ, ప్రణయోన్మాద ప్రభృతులు వెలువరించిన శృంగారం యిది. మంచిదీ దీనితత్వమేమిటి? ఇది హేయమా? ఉపాదేయమా? అని యిక విచారిస్తాను.

శృంగారం.

కుమారస్వామి అన్నట్లు సర్వప్రాణులకు ఆనందజనకమైన మాన్మధానురాగంమీద ఆధారపడివున్నది గనుక శృంగారం మనకు ఉపాదేయ మవుతున్నది.

"స్త్రీతి నామాపి మధురం" అని అభినవగుప్తపాదులంటున్నారు.
"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః" (ధ్వన్యా.)

అని ఆనందవర్ధనుడు. వాల్మీకి కాళిదాసాదులు ఆశృంగారాన్ని ప్రతిపాదించి ఉత్తమకావ్యాలను మనకు ప్రసాదించారు. కనుక శృంగారం ఉపాధ్యం .

తటస్థాక్షేపం.

శృంగారం గ్రాహ్యంకాదు. అది ఆనందజనకం గనుక గ్రాహ్య మంటారా! భోజనాదులు సయితం ఆనందజనకమే. భోజనాన్ని ఆధారంచేసి యెందుకు కావ్యం రచించరాదు.?

        
1. "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్" (తైత్తి. భృ)
        
2. "అన్నేన జాతాని జీవంతి" (తైత్తి. భృ.)
        
3 "ఆదిత్యో హ వై ప్రాణోరయిరేవ చంద్రమా!" (ప్రశ్నో)
    
4. తస్తై సహోవాచ ప్రజాకామోవై ప్రజాపతిః స తపోతప్యత
   సతపస్తప్త్వాస మిధున ముత్పాదయతే రయిం చ.(అన్నం)
   ప్రాణం చేత్యేతౌమే బహుధాప్రజాః కరిష్యత ఇతి. (ప్రశ్నో)
        
5. "యోయో హ్యన్నమత్తి యోరేతః సిగ్బవతి తద్భూయ ఏవ భవతి" (ఛాందో)
        
6. సోపోభ్యతపత్ తాభ్యోభితప్త భ్యో మూర్తి రజాయత యావై
   సామూర్తి రజాయతాన్నంవైతత్. (ఔతరే)

7. అన్నంననింద్యాత్ తద్ర్వతం ప్రాణోవా అన్నం శరీర
   మన్నా దం..అన్న వానన్నాదో భవతి మహాన్ భవతి.
   ప్రజయాపశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్‌కీర్త్యా (తైత్తి. భృ)
       
8. అన్నం న పరిచక్షీత తద్ర్వతం ఆపోవా అన్నం జ్యోతి
   రన్నాదం. (తైత్తి భృ)
       
9. అన్నం బహుకుర్వీత తద్ర్వతం పృథివీవా ఆన్నం ఆకా
   శోన్నాదః. (తైత్తి. భృ.)
     
10. తస్మాద్యయా కయాచవిధయా బహ్వన్నం ప్రాప్నుయాత్. (తైత్తి.భృ)
     
11. అహమన్న మహమన్న మహమన్నం అహమన్నాదో
    హమన్నాదో హమన్నాదః (తైత్తి .భృ.)

1. అన్నం బ్రహ్మమని తెలుసుకోవలెను.

2. అన్నం వల్లనే భూతాలు జీవిస్తూవున్నవి.

3. ఆదిత్యుడు ప్రాణం అన్న చంద్రుడు.

4. ప్రజా కాముడై ప్రజాపతి తపస్సుచేశాడు. తపస్సజేసి ఒక జంటను ఉత్పాదించాడు. అన్నమూ ప్రాణమూ అనేవి నాకు ప్రజను కలిగిస్తవి అని కబంధికి విప్పలాదుడు చెప్పినాడు.

5. యెవడు అన్నం తింటున్నాడో యెవడు రేతస్సేకం చేస్తున్నాడో వాడు విస్తరిస్తున్నాడు.

6. ప్రజాపతి నీళ్లనుండి తపస్సుచేశాడు. అట్లా అభితప్తమైన నీళ్లనుండి మూర్తి పుట్టింది. పుట్టినమూర్తే అన్నం.

7. అన్నాన్ని నిందించవద్దు. అది బ్రహ్మవేత్తకు వ్రతం. ప్రాణం అన్నం శరీరం అన్నాదం. అన్నం గలవాడు అన్నాన్ని భక్షించే ప్రాణం గలవాడవుతున్నాడు. సంతానం చేత పశువులచేత బ్రహ్మతేజస్సు చేత గొప్పవాడవుతున్నాడు. కీర్తిచేతను గొప్పవాడవుతున్నాడు.

8. అన్నాన్ని పరిహరించగూడదు. అది బ్రహ్మవేత్తకు వ్రతం. వుదకాలే అన్నం. జ్యోతిస్సు అన్నాన్ని భక్షించేది.

9. అన్నాన్ని గౌరవించవలెను. అది బ్రహ్మవేత్తకు వ్రతం. భూమే అన్న స్వరూపం. ఆకాశం అన్నాన్ని భక్షించేది.

10.యేప్రకారం చేతనైనా విస్తారమయిన అన్నాన్ని పొందవలసినది.

11. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని. నేను అన్నాన్ని భక్షించేవాణ్ని. నేనుఅన్నాన్ని భక్షించే వాణ్ని. నేను అన్నాన్ని భక్షించే వాణ్ని.

అనియీతీరున ఉపనిషత్తులు అన్న మాహాత్మ్యాన్ని ప్రశంసిస్తున్నవి. ఛాందోగ్యంలో ఉషస్తి ప్రతిహర్త నడిగితే అన్న మే దేవత అంటాడు. వేదపురుషుడు తెల్లకుక్కరూపంతో అన్నమాహాత్మ్యం బకుడికి ఉపదేశిస్తాడు. ఇంకా ఉపనిషత్తుల్లో అన్న ప్రశంసవున్నది. ఇట్లా ప్రశస్తమైన భోజనాన్ని కావ్యంలో యెందుకు వర్ణించరాదు? కాని భోజనాన్ని ప్రధానవస్తువుగా తీసుకొని కావ్యాలను రచించడంలేదు అట్లా రచిస్తే జుగుప్సగా వుంటుంది. అట్లానే శృంగారాన్ని కూడా ప్రధానాంశంగా తీసుకొని కావ్యం రచించడం అప్రశస్తం.

"ఆహార నిద్రాభయమైధునాని."

అని అన్నట్లు భోజనం మైధునేచ్ఛాయివన్నీ పశుకృత్యాలు. ఈపశుగుణం యొక్క తృప్తికోసం యెవరికి లభించినరీతి వాండ్లు పాటుపడతారు. ఇది చెప్పుకోతగ్గ విషయంగాదు. అందుకే

          
"లాటీనేత్రపుటీపయోధరఘటీ రేవాతటీ నిష్కుటీ,
 పాటీరద్రుమవర్ణనేన కవిభిర్మూఢైర్దినం నీయతే."

(లాటస్తీ నేత్రపుటాలను కుండలవంటి స్తనాలను నర్మదానదీతీరానవున్న పొదరిండ్లను, చందనవృక్షాలను, వర్ణిస్తూ మూఢులు కవులు దినాలు గడుపుతారు) అని ఒకరు కావ్యకోటినే నిరసించారు.

"న చ సభ్యేతరవాదచుంచవః" (త్రిశతి)

(సభ్యేతరమైన వాక్కులను చెప్పడంలో నిపుణులంగాము) అని భర్తృహరి కవులమాటలను నిరసిస్తున్నాడు.

ఈ పశుకృత్యాలను ఆధారం జేసుకొని పరిణతబుద్దులు కావ్యంలో ప్రవృత్తులుకావడం అనుచితం. పశుత్వాన్ని అణగదొక్కడానికే భారతీయ విజ్ఞానమంతా సర్వశక్తిని వినియోగిస్తున్నది. యోగసాంఖ్య వేదాంత ప్రముఖశాస్త్రాలు ఈపనికే యత్నిస్తున్నవి. అట్లాటి స్థితిలో కవులు లోకాభ్యుదయ హేతువులైన ఆమహాప్రయత్నాలకు తోడ్పడడానికి బదులు పశుత్వాన్ని ప్రేరేపించే కామాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తించడం సర్వధా అప్రశస్తం. కనుక శృంగారం యెంతమాత్రం గ్రాహ్యంకాదు అని అంటే.

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను; భోజనాన్ని ఆధారంజేసుకొని కావ్యం వ్రాయనట్లే కామాన్ని ఆధారం చేసుకొని కావ్యం వ్రాయరాదనడం సరిగాదు. భోజనం. సంభోగేచ్ఛ. నిద్ర, భయం, ఇవన్నీ పశుకృత్యాలన్న మాట సత్యం. అయితే జగత్సంతతికి, అంటే, జగత్తుయొక్క అవిచ్ఛిన్నతకు, భోజనభోగేచ్ఛలు రెండూ ప్రధానమైనవిగా వున్నవి.

"బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్."

అని వాక్యాలతో జన్మపరంపరను ఆపి జగత్తును విచ్ఛిన్నంజేసే బ్రహ్మ మీమాంసా మార్గ మొకటి వున్నా,

"ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీః" (తైత్తి.) అనేశ్రుతివాక్యాల ఊతతో నిత్యనైమిత్తిక కామ్యకర్మలను ప్రేరేపించి జగత్తుయొక్క అవిచ్ఛిన్నతను ఆరాధించే ప్రవృత్తిమార్గం లోకంలో చిరప్రతిష్ఠితమై వున్నది.

"సా భావయిత్రీ భావయితవ్యా భవతి తం స్త్రీంగర్భంబిభర్తి
 సోగ్రఏవకుమారం జన్మనోగ్రేధిభావయతి సయత్ కుమారం
 జన్మనోగ్రేధిభావయతి ఆత్మానమేవ తద్భావయతి...ఏవం సంత
 తాహీ మే లోకాస్తదస్య ద్వితీయజన్మ." (ఐతరే)

అని ఐతరైయోపనిషత్తు ఆదేశించిన జగత్సంతతిని,(జగదవిచ్ఛిన్నతను)

"ధర్మం జైమినిరతఏవ." (బ్రహ్మ)

అని పూర్వపక్షవాదులు సయితం గౌరవార్థం ప్రస్తావించిన జైమిని, జ్ఞానానికి కర్మాంగత్వ మారోపించి ప్రవృత్తినే ప్రతిష్ఠించిన జైమిని. వాస్తవంగా ఆరాధించిన వాడవుతున్నాడు.

"సంతతిః శుద్ధవంశ్యా హి పరత్రేహ చ శర్మణే"

అన్న కాళిదాసవాక్యాలు ఈ జగదవిచ్ఛిన్నతయొక్క రూపాన్ని తెలుపుతున్నవి.

             
1. "స్వాద్వన్న భక్షకామేన వేషోయం యోగినాం ధృతః."
             
2. స్థితోసి యోషితాం గర్భే తాభిరేవ వివర్దితః
   అహో కృతఘ్నతా మూర్ఖ కథం? తా ఏవ నిందసి. (మండనః.)
          
3. యాసాంస్తన్యం త్వయా పీతం యాసాం జాతోసియోనితః
   తాసు మూర్ఖతమ స్త్రీషు పశువద్రమసే కథం.?
       
4. మన్యే మైధునకామేన వేషోయం కర్మిణాం ధృతః. (శంకరః.)

1. రుచిగల ఆహారం తినగోరినవాడిచేత యోగివేషం స్వీకృత మగుతున్నది.

2. స్త్రీలగర్భంలో వుండి స్త్రీలచేతనే వివర్ధితుడవై ఓమూర్ఖుడా వారినే యెట్లా నిందిస్తావు? అహోకృతఘ్నత

(మండనుడు)

3. యెవరిస్తన్యం తాగినావో యెవరి యోనిలోనుండి పుట్టినావో ఆస్త్రీలతోనే ఓమూర్ఖతముడా పశువువలె యెట్లా రమిస్తావు?

4. మైథునకాముడిచేత గృహస్థవేషం స్వీకృతమవుతున్న దనుకొంటాను. (శంకరుడు)

అని యీతీరున కర్మబ్రహ్మ మిమాంసలకు జరిగిన వివాదం జగత్సంతతికి ఆధారమైన స్త్రీపురుష సంయోగాన్ని కర్మమీమాంస యెట్లాపూజించేదీ తెలుపగలదు. ఇట్లాటి జగదవిచ్చిన్నతకు అవశ్యకమై ప్రాణధారణ సాధనమైన ఆహారం సంస్కృతి సాధనమైన సంయోగం రోతగాక, ఉపాదేయత్వాన్నే పొందుతున్నవి. ఆహారాన్ని గూడా విదూషకుడి సందర్భంలో కవులు స్వీకరిస్తూవచ్చారు. ఆహారాన్ని వాల్మీకి అయోధ్యాకాండంలో 91 వ సర్గంలో భరద్వాజుడు భరతుడికి ఆతిథ్యమిచ్చినఘట్టంలో మనోహరంగా వర్ణించాడు. అయితే తరతమ భావంచేత ఆహారంకంటె సంయోగమే జగత్సంతతికి (జగదవిచ్చిన్నతకు) సన్నిహిత కారణం ప్రధానకారణం అయివున్నది. జగస్థితి కారకుడైన శ్రీవిష్ణువును శృంగారానికి అధిదైవతంగా భావించడంలో యీఅభిప్రాయమే వ్యక్తమవుతున్నది. బుభుక్షకంటె సంభోగేచ్చ యెక్కువ ప్రధానంగా స్వీకృతం కావడం ఉచితమంటున్నాను. ఇంతటి మహిమగల శృంగారం కావ్యంలో ప్రధానమని భారతీయులు ఉత్కృష్టమైన ప్రవృత్తిధర్మానికి కావ్యాన్ని అనల్పసాధనంజేసి లోకాభ్యుదయానికి తోడ్పడడంలో వారి అమేయజ్ఞానాన్ని వెలయించారు. "క్రౌంచద్వంద్వవియోగోత్థః శోకః శ్లోకత్వమాగత:"

అని ఆనందవర్ధనుడు కీర్తించిన క్రౌంచద్వంద్వవియోగం అధారంగా సీతారామ సంయోగ వియోగాలను వెలయించిన వాల్మీకికృతిని లోకంలో వున్న సమస్తకావ్యజాతంలో మహోన్నతస్థానం పొందదగ్గ రామాయణాన్ని ప్రశంసిస్తూ

"యత్ర ప్రవృత్తికాస్త్రార్ధం సమ్యగేవ నిరూపితః"

(పారాశర్యోపపురాణం)

(యెక్కడ ప్రవృత్తిశాస్త్రార్ధం బాగా ప్రకాశితమయిందో)

అని అన్నారు సంయోగంతో వియోగం సంబద్ధమైనది గనుక వియోగం సంయోగ సంబంధి అయి సంయోగవియోగాలు రెండూ శృంగార మవుతున్నవి ఈ తీరుగా శృంగారం గ్రాహ్యంమాత్రమేగాకుండా సమస్త జగత్థ్సితికి హేతువుకావడంవల్ల ప్రధానమనిగూడా నిరూపించాను. ఇట్లా ప్రవృత్తిమార్గాన్ని చేపట్టిన కావ్యం ప్రవృత్తి హేతుభూత మయిన సంయోగాన్ని స్వీకరించడం అత్యంతం ఉచితమన్నాను. ఇందుకే భారతీయులు కవిత్వోన్నతికి ఆకరమైన నాటకంలో శృంగారం (వీరమైనా) ప్రధానమన్నారని వ్యాఖ్య చేస్తున్నాను. వీరాన్ని గురించి నాటకాధి కరణంలో వివరించాను గనుక యిక్కడ వదలుతున్నాను. వేదాంతజిజ్ఞాసలు సంపూర్ణంగా బలం ప్రాపించినతరువాత శాంతాన్ని గూడా రసకోటిలో సాహిత్య వేత్తలు స్థిరపరిచినట్లు కనబడుతున్నవి. భరతుడు శాంతరసం చెప్పకపోయినా

"నిర్వేదస్థాయిభావః శాంతోస్తి నవమో రసః" (కావ్య)

అనిమమ్మటాదులు శాంతాన్ని ప్రతిపాదించినవిధం

"నిర్వేదస్యామంగళప్రాయస్య ప్రథమమను పాదేయత్వే 7 పి ఉపాదానం వ్యభిచారిత్వే 7 పి స్ధాయిత్వాభిదానార్ధం" (కావ్య) అని దాన్ని సమర్ధి చిన విధం. శాంతం రసకోటిలో స్థిరపడ్డమార్గాన్ని చూపుతున్నవి.

ఈ సంగతి సంపూర్ణంగా వాఙ్మయదర్శనంలో మరియొకచోట మీమాంస చేశాను. గ్రంథవిస్తర భీతిచేత యిక్కడ వదలుతున్నాను. ఇది యింత ప్రధానమైనది గనుకనే.

"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః"

అనిధ్వనికారుడు కీర్తిస్తున్నాడు.

ఇక యెంకిపాటలు, శృంగారం, భారతిలో ప్రణయజానకి, ప్రణయగీతం, ప్రణయగానం, మొదలైనవాటిలోని శృంగారతత్వమేమిటి? అని విచారిస్తాను.

శృంగారే విచారణ

శృంగారం లోకసంతతికి (అవిచ్చిన్నతకు) ప్రేరకమని అందువల్ల మనకు గ్రాహ్యమని అన్నాను. ఇది ధర్మతత్పరులయందు నిష్ఠమైనప్పుడు లోకాభ్యుదయహేతువై ఉపాదేయ మవుతున్నది. ధర్మతత్పరమైన జగత్సంతతి అభీష్టంగాని అధర్మ తత్పరమైన జగత్తు యొక్క అవిచ్చిన్నత త్యాజ్యమెకదా. కనుక దర్మతత్పరులలో నిష్ఠమై శృంగారం ఉత్తమత్వం ఆరోహిస్తున్నది.

పూర్వపక్షం

శృంగారం లోకసంతతికి ప్రేరకం కావడంవల్ల గ్రాహ్యమంటే మేము వొప్పుకోము అది కుమారస్వామి రత్నాపణంలో అన్నట్లు సర్వప్రాణి హృదయంగమం గనుక గ్రాహ్యం. అందుకే

"శృంగార ఏవ మధురః పరః ప్రహ్లాదనో రసః" (ధ్వన్యా) (శృంగారమే మధురం; అత్యంతం ప్రహ్లాదనం అయిన రసం అని ఆనందవర్ధను డన్నాడు)

"స్త్రీతి నామాపి మదురం" (స్త్రీ అనేపేరే మధురమైనది.)

అని అభినవగుప్తపాదులు అన్నాడని మీరే ఉదాహరించారు.

"జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్ధః"(. మేఘ)

(ఇది వరకు రుచిచూచిన వాడెవడు వివృతజఘనను విడువ సమర్ధుడు?) అన్న కాళిదాసువచనం ప్రసిద్ధమేగదా! ఇక

1. "ఉరసి నిపతితానాం స్రస్త ధమ్మిల్లకానాం
    ముకుళితనయనానాం కించిదున్మీలితానాం
   ఉపరి సురతఖేదస్విన్న గండస్థలానాం
   అధరమధు వధూనాం భాగ్యవంతః పిబంతి.

2. ఆవాసఃక్రియతాం గాంగే పాపహారిణి వారిణి,
    స్తనద్వయే తరుణ్యా వా మనోహారిణి హారిణి.

3. మాతృర్య ముత్సార్య విచార్య కార్య
   మార్యాస్సమర్యాదమిదం వదంతు.
   సేవ్యా నితంబా కిము భూధరాణాం
   ఉత స్మరస్మేరవిలాసినీనాం.

4. ప్రణయమధురా: ప్రేమొదారా రస్యాశ్రయతాం గతాః
    ఫణితిమధురా ముగ్దప్రాయాః ప్రకాశితసమ్మదాః
   ప్రకృతిసుభగా విస్రంభార్ధాః స్మరోదయదాయినో
   రహసి కిమపి స్వైరాలాపా హరంతి మృగీదృశాం.

5. ఆదర్శనే దర్శనమాత్ర కామా
    దృష్ట్వా పరిష్వంగసుఖైకలోలా.

  ఆలింగితాయాం పునరాయతాక్ష్యాం
  ఆశాస్మహే విగ్రహయో రభేదం

1. వక్షస్సు మీదవాలి కొప్పు జారగా ముకుళితనయనలై కొద్దిగా ఉన్మీలితలై ఉపరిసురతంచేత చెమర్చిన గండస్థలాలతో వుండే వధువుల పెదవితేనెను భాగ్యవంతులు తాగుతారు.

2.పాపహారి అయిన గంగవారియందైనా వాసంచెయ్యి లేదా? మనోహరి. హారి అయిన తరుణీస్త నద్వయమందైనా వాసం చెయ్యి

3. మాత్సర్యంవదలి కార్యం విచారించి మర్యాదతో ఆర్యులారా! ఈ సంగతి చెప్పండి భూధరాల నితంబాలు సేవ్యమా? స్మరస్మేరవిలాసినుల నితంబాలు సేవ్యమా?

4. ప్రణయమధురం అనురాగరమ్యం రసాశ్రయం ఫణితి మధురం. సౌకుమార్య భరితం ప్రకాశితసమ్మదం స్వలావరుచిరం విస్రంభార్ధం స్మరోదయప్రదం అయిన మృగీనేత్రల స్వైరాలాపాలు యేకాంతంలో అనిర్వాచ్యంగా మనస్సును హరిస్తవి.

5. చూడనంతసేపు చూస్తే చాలునని వుంటుంది. చూసిన తర్వాత కౌగిలించుకొని సుఖ మనుభవించవలె నని వుంటుంది. ఆయతాక్షి కౌగిలిలోకి రాగానే విగ్రహాల అభేదాన్ని అపేక్షిస్తాము.

అని యిట్లా భర్తృహరి ప్రతిపాదించిన శృంగారమనోహరత్వం ఇంకా వివరించవలసిన పనిలేదు. ఈతీరుగా శృంగారంయొక్కగ్రాహ్యత్వం దాని మాధుర్యాన్ని బట్టేగాని ధర్మానుబంధిత్వాన్ని బట్టికాదు అని అంటారా?

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను, శృంగారం మాధుర్య హేతువుచేతనే గ్రాహ్యమైతే ఒకజారుడు పరకాంతతో కూడినప్పటి శృంగారం మనకు గ్రాహ్యంగా వుండవలెను. సీతాద్రౌపదీ విషయకమైన రావణకీచకుల రతి మనకు మనోహరంగా వుండవలెను. చోరులు ,దగాకోరులు, హంతకులు వీండ్ల శృంగారం మనకు గ్రాహ్యంగా వుండవలెను. కాని యీ శృంగారం హేయమనేసంగతి సహృదయుల కందరికీ విదితం. అవునయ్యా పరకాంతతో జారుడుకూడినప్పటిశృంగారంకూడా గ్రాహ్యమెందుకు కాదు? గ్రాహ్యమేను అని అంటారా? చెప్పుతున్నాను. అది లోకస్థితికి సంఘ క్షేమానికి హానికరం గనుక దాన్ని మనం ద్వేషిస్తాము. ఇది సాధారణవిషయం గనుక దీన్ని విస్తరించి మీమాంస చేయవలసిన పనిలేదు. దుష్టులశృంగారం సంస్కారవంతులకు గ్రాహ్యంగా వుండదు. జారులకు జారశృంగారం రుచించవచ్చును. కాని దుష్టుల ప్రీతితో మనకు పనిలేదు. కావ్యంలో సహృదయానందమే ప్రమాణం. సహృదయులకు దుష్టుల శృంగారం అగ్రాహ్యమని నిరూపించాను. కనుక శృంగారం మాధుర్య హేతువుచేతనె గ్రాహ్యంగాదంటున్నాను.

పూర్వపక్షం.

మీరు నాయకులను ప్రధానంగా విచారిస్తున్నారు. అక్కడ నాయకుడు దుష్టుడైనా శిష్టుడైనా దానితో మనకు పనిలేదు. రసాస్వాదసమయంలో వీడు రాముడు. వీడు వావణుడు. ఈమె తార, ఈమె సీత, ఈమె స్వీయ, ఈమె పరకీయ, అనే పరిచ్ఛేదమే వుండదు. స్త్రీపురుషసాధారణ్య ప్రతీతి తప్ప మరేమీవుండనేరదు. కనుకనే

"పరస్య న పరస్యేతి మమేతి న మమేతి చ.
 తదాస్వాదే విభావాదేః పరిచ్ఛేదో న విద్యతే (సాహి)


ఇది పరుడికి సంబంధించినది. ఇది పరుడికి సంబంధించినదిగాదు. ఇది నాకు సంబంధించినది. ఇది నాకు సంబంధించినది కాదు. అని కావ్యంలో విభావాదుల పరిచ్ఛేదమే వుండదు.

"సాధారణ్యేన రత్యాదిరపి తద్వత్ ప్రతీయతే" (సాహి)
   
"రత్యాదులు సాధారణ్యభావనవల్ల ప్రతీతమవుతున్నవి." అని సాహిత్యదర్పణకారుడన్నాడు. కనుక విభావాదులకు దుష్టాదుష్టత్వం మేమొప్పుకోము. ఆ విచారణే సాహిత్యంలో అసంబద్ధం. అది ధర్మ శాస్త్రంలో చేస్తే చేయండి అని అంటారా?

సిద్ధాంతం



వినిపిస్తున్నాను; మధువు ఆస్వాదితమయ్యేటప్పుడు తద్భావన తప్ప ఇది గిన్నె. ఈగిన్నె వెడల్పింత. దీన్ని యీలోహంతో చేశారు అనే విచారణ వుండదు. మధుమాధుర్యమే ఆనిమిషంలో మనో వ్యాప్తమై వుంటుంది. అని తెల్పడం యెట్లాటిదో రసాస్వాదనసమయంలో విభావాదులపరిచ్చేదం వుండదనడం అట్లాటిది. మధువు తియ్యగావున్నా దాన్ని కుష్ఠి పులినీళ్ల చేతితో తాకి విషలిప్తమైన గిన్నెలో బోశాడు అని తెలిసినప్పుడుగూడా, మధ్వాస్వాదనసమయంలో మధుమాధుర్య భావనతప్ప మరేమి వుండదనేమాటల ప్రేరణవల్ల అకుష్ఠి స్పృశించి విషపుగిన్నెలో పోసిన మధువును తాగము. మధువు మధురమవునుగాక దాన్ని ఆస్వాదించేటప్పుడు అన్యవిచారణవుండకపోవుటనుగాక కాని దాని వుపాదిదుష్టమని తెలిసినప్పుడు తప్పక అది అగ్రాహ్యమే అవుతున్నది. తెలియక అట్లాటిదుష్టశృంగారకావ్యం పఠిస్తామా? మనఃకాలుష్యం మొదలైన నాంతరీయకఫలాలు తప్పక సిద్ధిస్తున్నవి. ఇంతకూ

"తదాస్వాదే" (రసాస్వాదే)

అన్నప్పుడు దూష్యోపాధివిరహితమైన రసాసృవాద మని రసశబ్దానికి అర్ధం. యెందువల్లనంటే; దూష్యోపాధివున్నప్పుడు అది రసాభాస మవుతుందని ఆ కృతికర్తే.

"అనౌచిత్యప్రవృత్తత్వ ఆభాసో రసభావయో:" (సాహి)

అనిచెప్పుతున్నాడు. కనుక సాధారణ్యవాదంచేత దుష్టశృంగారం సమర్ధితంకాదు.

పూర్వపక్షం

అవునయ్యా దుష్టులశృంగారం అగ్రాహ్యమంటున్నారు శిల్పానికి కళకూ ధర్మాధర్మ విచారణ అనావశ్యకం. పాడేకోకిలకు పాడడమే వ్యాపార ఫలం అయినట్లు కవికూడా శిల్పాన్ని కళను ప్రవర్తింపజేసి అదేవ్యాపారంగా అదే ఫలంగా వర్తిస్తున్నాడు. అతినికి ధర్మంతో పనిలేదు. అని అంటారా? చెప్పుతున్నాను.

సిద్ధాన్తం

శిల్పానికీ కళకూ కూడా అనందమే పరమార్థమని వొప్పుకున్నా అట్లాటి ఆనందానికి వెనక ధర్మ గుప్తంగా వుంటూనేవున్నది. దేవాలయాలమీది అసభ్య ప్రతిమల అధర్మ విశిష్టమైన శిల్పం సంస్కారవంతులకు ఆ..........యకంగా నే సంగతి ఋజువు చేయవలసిన పనిలేదు. కనుకనే సామాజికుల ఆనందానుభవానికి వెనక ధర్మంగుప్తంగా వున్నదంటున్నాను. అవునయ్యా ధర్మంగాని అధర్మంగాని లేని సరశ్చంద్రోద యాదులవర్ణనలు సంస్కారవంతులైన సామాజికులకు ఆనందమియ్యవా అంటే అట్లాటివాటిలో గూడా సత్వసౌందర్యరక్తి విశుద్దప్రకృతి ప్రేమ. అనే పావనధర్మాలు లగ్నమయ్యేవున్నవి.

మనుష్యప్రకృతి

కాని; యిట్లాటి ధర్మా ధర్మప్రవృత్తిలేని స్థావరప్రకృతికంటె మనుష్య ప్రకృతి సంస్కారవంతుడైన కవి సమీపించేటప్పటికి, లోకస్థితికి హేతుభూతమైన ధర్మం. దానికి విఘాతం కలిగించే అధర్మం. తప్పించుకో వీలులేనంత అఖండాకృతిలో సర్వస్థలాల గోచరిస్తున్నవి. ప్రవృత్తి మార్గంలో వున్నంతవరకు సత్వరజస్తమనస్సుల ప్రవృత్తులతో శబళితమైన యీమనుష్యప్రకృతి నుండి దుష్టత్వాదుష్టత్వాదులను, సుగుణ దుర్గుణాలను ధర్మాధర్మాలను, అపహ్నవించలేము. అవి వెంటనంటి అగ్నికి ఉష్ణగుణం వలె వుంటునేవున్నవి కనుకనే వాటిని అపహ్నవించలేమంటున్నాము. అందువల్ల మనుష్యప్రకృతిని విషయంగాచేసిన కవి, శిల్పకళ ఆనందఫలకాలైనప్పటికీ మనుష్యప్రకృతినంటి వున్నధర్మాధర్మాదులను అపహ్నవించ లేడంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనంగాని వేరే ప్రయోజనం లేదంటారా? అది అసంబద్ధం యెవరికో ఒకరికి శిల్పసృష్టియే ప్రయోజనం అయితే కానియ్యండి ఆశిల్పసృష్టికి హేయత్వం ఉపాదేయత్వం ఆనాందాదిఫలాలవల్లనే సిద్ధిస్తున్నవి. కోకిలపాడుతున్నది. గదా అని యెవడూ వినడు. అది ఆనందజనకంగా వుండడం వల్లనే వింటాడు. అట్లానే కవి వ్రాశాడు గదా అని మొగమాటంచేత యెవడూ కావ్యాలను చదవడు, నాటకాలను చూడడం, ఆనందం కొరకు చదువుతాడు. శిల్పం ఆనంద ప్రదమైనప్పుడే ఉపాదేయమవుతుందంటున్నాను. శిల్పానికి శిల్పస్థితే ప్రయోజనమనేమాట అంగీకరించవీలులేదు. దాని గ్రాహ్యత్వాగ్రాహ్యాత్వాలు ఆనందప్రభృతి ప్రయోజనాంతరాలను ఆక్షేపించివున్నవి. ఆనందం ధర్మాధర్మవ్యవస్థితమని యిదివరకే విశదపరచాను. ఇంతకూ చెప్పదలచిందేమంటే శృంగారస్థితే శృంగారప్రయోజన మనేమాట అసంబద్ధమని, శృంగారం మధురం గనుకనే గ్రాహ్యం గాదని, అదిమధురమైనా వుపాధి దూష్యంగా నప్పుడే గ్రాహ్యమని, చెప్పుతున్నాను. కనుకనే చోరుల, హంతకుల జారుల శృంగారం హేయ మంటున్నాను.

జగత్సంతతి

శృంగారం జగత్సంతతికి సాధనమని అందుకే ప్రవృత్తిమార్గానికి ఉపోద్బలంగా వీరశృంగారాలు ప్రధానమైన బారతీయ కావ్యప్రస్థ నం వర్తిస్తున్నదని వ్యాఖ్యచేశానని చెప్పినాను. జగత్తులో మనుషులు సుఖంగోరుతారుగాని దుఃఖం పీడా గోరరు. హంతకులు చోరులు పరధనాపహర్తలు. మోసగాండ్లు ఇట్లాటివాండ్లస్థితి లోకానికి పీడాకరమని అందరికీ విదితం. ఇట్లాటివాండ్లుండేలోకం అవిచ్ఛిన్నంగా వుండడానికి బదులు విచ్ఛిన్నమైపోతేనే మంచిదని తోచక మానదు కనుకనే జగత్సంతతి సిద్ధాంతంలో ఇట్లాటి దుష్టులశృంగారం మిక్కిలి హేయమంటున్నాను. దయ. సత్యం, తేజస్సు, స్వాతంత్ర్య౦ ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసేలోకం స్వర్గతుల్యంగా వుంటుంది. సుఖ హేతువౌతుంది. సర్వప్రాణిస్పృహణీయమై స్వర్గ్యమైనదాన్ని యెవరు కోరడు? నిత్యనైమిత్తికకామ్యకర్మలచేత జైమిని లోకానికి ప్రాపింపజేయ యత్నించిన ఫలం యీదృశసుఖగర్భితమైయే వున్నది. దయ, సత్యం ప్రేమ, తేజస్సు స్వాతంత్ర్యం ఇట్లాటి కల్యాణగుణాలు వెలిసే స్థితి ధర్మం అర్ధకామాలను అతిక్రమించినపుడే లోకానికి సిద్ధిస్తున్నది. కనుకనే లోకసంతతికి పరమసాధనమైన శృంగారానికి ధర్మరక్షకులను, లోకరంజకులను తేజస్వంతులను ఆలంబనం చేశారని చెప్పుతున్నాను.

అదిగాక లోకానికి అంతటిశ్రేయస్సు సమకూర్చేవారి శృంగారం మనకు ఆనందప్రదంగా వుంటుంది. లోకసంగ్రహంకొరకు పాటుపడే మహాత్ములను మనం ఊరేగిస్తాము. అందుకే ధర్మరక్షకు లయిన రాజులు, మంత్రులు, ధర్మపరాయణులైన ఇతరులు భారతీయకావ్యంలో శృంగారనాయకులుగా వెలయగలిగినారు. అర్ధకామాలు ధర్మానికి అణగినప్పుడే ధర్మం స్థిరవికాసంతో ప్రకాశిస్తున్నది. ధర్మంతో సమస్త కల్యాణగుణాలూ వికాసం పొందుతున్నవి.

ముందు శృంగారాధిదేవతగా వెలయబోతూ అరణ్యస్థలిలో ప్రియసంయోగం కొరకు తపస్సాచరించే పార్వతియందు ప్రియుడైన పరమేశ్వరుడికి కామాన్ని తొక్కినిల్చున్న ధర్మమే గోచరించి.

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని,
 త్వయా మనో నిర్విషయార్ధకామయా
 యదేక ఏవ ప్రతిగృహ్య సేవ్యతే".

(ఓపార్వతీ! ఇందువల్ల ధర్మమే త్రివర్గసారమైనట్టు నాకు తోస్తున్నది. యెందువల్లనంటే; అర్థకామాలు తలపెట్టకుండానే ధర్మాన్ని ఒక్కదాన్నే ప్రతిగ్రహించి నీవు ఆరాధిస్తున్నావు) అని అంటాడు.

ఓ పార్వతీ! ధర్మార్ధకామాల్లో ధర్మసారత్వం నేడు నాకు కనబడుతున్నది. అర్ధకామాలను అధఃకరించిన నీవు దాన్ని (ధర్మాన్ని) ఒక్కదాన్నే అరాధిస్తున్నావు అని అభిప్రాయం తెలుపుతాడు. పశుత్వద్యోతకమైన కామం అడుగుకుపోయిన తరవాత ధర్మం ఆలంబనం అయిన సమయాన పార్వతీపరమేశ్వరుల సంయోగాన్ని కుమారసంభవంలో ఆరాధించిన కాళిదాసు

"అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మ ఏవ మనీషిణః" (రఘు)

ఆ దిలీపమహారాజుకు అర్ధకామాలుగూడా ధర్మమే అయినవి.

అని వేరొక చోట అంటాడు ఇట్లా అర్ధకామాలను సేవకులుగా జేసుకున్న ధర్మసారత్వాన్ని కాళిదాసు అనేకస్థలాలల్లో తన కవితాసర్గంలో ప్రకటిస్తాడు. కేవలం కామిని అగ్నివర్ణుణ్ని అంతఃపురంలోవుండి ప్రజలకు దర్శనం సయితం ఇయ్యక కాలుమాత్రం చూపి స్త్రీలోలుడై వున్నవాణ్ని చిత్రించి అతడు చివరకు క్షయపుట్టి చచ్చినాడని ముగించాడు. పడకటింటిలో ఆకస్మికంగా స్త్రీ కనబడగా నీకొంగురాచుకున్నది. నాకు నిద్రపట్టదని అనిపించక ధర్మదేవతను ఆరాధిస్తూ

"కా త్వం శుభే కన్య పరిగ్రహో వా
 కిం వా మదభ్యాగమకారణం తే.
 ఆచక్ష్వ మత్వా వశినాం రఘుణాం
 మనఃపరస్త్రీవిముఖప్రవృత్తి". (రఘు.)

(ఓకల్యాణీ నీవెవరు? నీ వెవరిభార్యవు? రఘువంశరాజులు పరస్త్రీవిముఖులైన విజితవిషయులని తెలిసిగూడా నీవెందుకు వచ్చావు?) అని కుశుడిచేత కాళిదా సనిపిస్తాడు.

కామాన్ని దహించిన పిమ్మట బ్రహ్మతేజస్సుతో వెలిగే పరమేశ్వరుడిచేత, సంయోగం కొరకు కామాన్ని అతిక్రమించి తపస్సు చేస్తున్న పార్వతిని, పవిత్రురాలిని కాళిదాసు చేయిస్తాడు. శాకుంతలంలో శృంగారనాయకుడైన దుష్యంతుడి ధర్మారాదనను.

"ధర్మ్యాః తపోధనానాం
 ప్రతిహతవిఘ్నాః క్రియాః సమాలోక్య
 జ్ఞాస్యసి కియద్భుజో మేరక్షతి మౌర్వీ కిణాంక ఇతి." |(శాకుం.)

(తపోధనులయొక్క ధర్మవిహితమైన క్రియలు ప్రతిహతవిఘ్నాలైవుండడం చూసి "నామౌర్వీకిణాంకమైన భుజ మెంతదూరం రక్షిస్తున్న దనే సంగతి తెలుసుకోగలవు.)

"సాఖలు విదిత భక్తిం మాం
 మహర్షేః కథయిష్యతి". (శాకుం.)

విదితభక్తిని నన్ను మహర్షికి ఆమె తెలుపుతుందిగదా.)

"తపోవన నివాసినాం ఉపరోధో మాభూత్"

(తపోవననివాసులకు ఉపరోధం కలుగకుండును గాక) అని యీతీరున వ్యక్తపరుస్తాడు. ఉత్తరరామచరిత్రలో భవభూతి విప్రలంభ శృంగార నాయకుడైన శ్రీరాముడి ధర్మతత్పరత్వాన్ని

"స్నేహం దయాంచ ప్రీతించ యదివా జానకిమపి
 ఆరాధనాయ లోకానాం ముంచతో నాస్తి మే వ్యధా." (ఉత్తర)

(ప్రజలను ఆరాధించడానికి స్నేహాన్నివిడిచినా దయనువిడిచినా ప్రీతిని విడిచినా, చివరకు జానకిని విడిచినాగూడా నాకు చింతలేదు.) అని వినిపిస్తాడు. కాదంబరిలో బాణుడు శృంగారసందర్భ లో అంగకథలో వచ్చే పుండరీకుడివిషయాన సయితం పవిత్రగుణధర్మాలను ప్రస్తావిస్తాడు.

మహోశ్వేతమీదివాంఛచేత పుండరీకుడు మృతుడుకాగా

"హాధర్మ! నిష్పరిగ్రహోసి, హాతపోనిరాశ్రయమసి, హాసర స్వతి. విధవాసి, హాసత్వం అనాథమసి." (కాదం)

(హాధర్మమా! నిష్పరిగ్రహమైనావు. హాతసస్సా! నిరాశ్రయ మైనావు. హాసరస్వతి! నీనాథుడు పోయినాడు. హాసత్యమా! అనాధ మయితివి" అనే కపింజలవిలాసంలో పుండరీకుడి సత్యధర్మ పరత్వాది గుణాలను విశదీకరిస్తాడు.

ధర్మం అనంతరూపమైనది తపస్సు, దయ, సత్యం, అహింస, పరదారవిముఖత్వం, పరధనపరాఙ్ముఖత్వం సత్కార్యదీక్ష మొదలయిన అనంతరూపాలతో ధర్మదేవత వెలసివున్నది. మాధవుడు చారుదత్తుడు అగ్నిమిత్రుడు చంద్రాపీడుడు అందరు ధర్మసంబంధంగల వారే అయివున్నారు. మృచ్ఛకటికలోని చారుదత్తుడి ధర్మపరతంత్రత్వం మొదలైనవి వివరించడం గ్రంథవిస్తరహేతువని వదలుతున్నాను. ప్రాచీనభారతవర్షంలో రాజత్వం ధర్మరక్షకత్వం సమానాధికరణాలుగా వుండేవి. అధర్మి అయినరాజును వేనుణ్నివలె పదచ్యుతుణ్ణి చేసేవారు. నాయకుడికి స్పుటధర్మరక్షకత్వం ప్రతిపాదితంగాక శాకుంతలాదుల కన్న తక్కువ కక్ష్యలో చేరుతున్న మేఘదూతలో సయితం.

"యక్షశ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
 స్నిగ్దచ్చాయాతరుషు వసతింరామ గిర్యాశ్రమేమ." (మేఘ)

అని జానకీ స్నానపావనమైన వుదకాలుగలచోట వసతిచేసుకున్నాడని అతడి జానకీపాతివ్రత్యంమీది ఆసక్తి రూపమైనధర్మాన్ని విశదపరుస్తాడు.

"యాచ్ఞామోఘా వరమధిగుణే నాధమే లబ్దకామా"

అని అనిపించి ఉత్తములైన గుణవంతులమీది ప్రేమరూపమైన ధర్మాన్ని స్పష్టపరుస్తున్నాడు. శృంగారానికి ధర్మసంబంధి నాయకుడి ఆవశ్యకత యింతటిది గనుకనే సాహిత్యవేత్తలు

"అనురక్తలోకః తేజోవైదగ్ధ్య.
        శీలవాన్ నేతా త్యాగీ కృతీ." (సాహి)

"ఉత్తమప్రకృతిపాయః
        రసః శృంగార ఇష్యతే" (సాహి)

"లోకోత్తర నాయకాశ్రయేణ
        శృంగారస్య పరిపోషాతిశయః" (సాహి)

అని నిరూపిస్తున్నారు శ్రీరాముడు. నలుడు, ఉదయనుడు యిట్టి ధర్మ పరతంత్రులు శృంగారనాయకులై భారతీయకావ్యంలో శృంగార తత్వాన్ని ప్రబోధిస్తునారు.

పూర్వపక్షం

అవునయ్యా; అనురాగమార్గాలు కట్టుబాట్లకు లోనయ్యేవిగావు ఒకధర్మరక్షకుణ్ని ఒక స్త్రీ ప్రేమించవలెనంటే సంభవించవచ్చును సంభవించకపోవచ్చును కనుక ధర్మరక్షకత్వంతో శృంగారానికి సంబంధఁ లేదు; హృదయమార్గాలు దుర్గ్రహాలు అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను ధర్మపరాయణ అయిన యేస్త్రీనైనా సరే దర్మ రక్షకుడైన పురుషుడు ప్రేమించి తీరవలెనని గాని ధర్మ రక్షకుడైన యేపురుషుణ్ణి అయినా ధర్మపరాయణ అయిన స్త్రీ ప్రేమించితీరవలెనని గాని నేను నియమం చెప్పలేదు. హృదయమార్గాలు దుర్లహా లన్నమాట సత్యం. అయితే చిత్తనైర్మల్య మొకటివున్న తరువాత యేదేవత నారాధించినా ఆ ఆరాధనం చరితార్ధమవుతున్నది. అట్లానే హృదయక్షాళనమైన తరువాత యెవరిని ప్రేమించినా అది ఉపాదేయమై ఆశృంగారం లోకశ్రేయస్సును బలపరుస్తున్నది. లేదా ఆశృంగారం కేవలం పశుకృత్యమై ఇంద్రియక్షోభం, ఆత్మవినాశం మొదలైన హేయఫలాలకు హేతువగుతున్నది అందుకే ధర్మక్షాళనం ఆవశ్యకమని విశదపరిచాను. హృదయం ధర్మక్షాళితమైన తరువారు యేస్త్రీ యేవిశుద్ధుణ్ని ఉద్యహిస్తుందో యేపురుషుడు డేవిశుద్ధను వరిస్తాడో యెవరు నిర్ణయించగలరు?

చిత్తనైర్మల్య మొకటివున్న తరువాత యేదేవత హృదయాన్ని అదిస్థిస్తుందో! హృదయమార్గాలు దుర్గ్రహమన్నాము.

"మహేశ్వరే నా జగతామధీశ్వరే
 జనార్దనే వా జగదంతరాత్మని
 న వస్తుభేదప్రతిపత్తిరస్తి మే
 తథాపి భక్తి స్తరుణేందుశేఖరే" (త్రిశతి)

"జగదధీశ్వరుడైన మహేశ్వరుడియందుగాని, జగదంతరాత్మ అయిన జనార్దనుడియందుగాని, నాకు వస్తుభేద ప్రతిపత్తి లేదు. అయినప్పటికీ తరుణేందు శేఖరుడియందే నాకు భక్తి" అని}}

"శైవా వయం నఖలు తత్ర విచారణీయం
 పంచాక్షరీజపపరా వితరాం తథాపి
 చేతో మదీయమతసీకుసుమావభాసం
 స్మేరాననం స్మరతి గోపనధూకిశోరం"

(మేము శైవులం అందులో విచారించవలసినది లేదు. మేము అధికంగా పంచాక్షరీజపరాయణులం అయినప్పటికీ నాచేతన్సు అతసీ కుసుమావభాసుడూ స్మేరాననుడూ అయిన గోపవధూకిశోరుణ్ని స్మరిస్తున్నది) అని భర్తృహరి లీలాశుకులూ అన్నట్లు వాస్తవంగా హృదయమార్గాలు దుర్గ్రహం.

"వ్యతిషజతి పదార్థాన్ అంతర: కోపి హేతు:" (మాలతీ)

(యేదో ఒక అనిర్వాచ్యమైన అంతరహేతువు పదార్ధాలను కలుపుతున్నది) అని భవభూతి ఈసత్యాన్నే ప్రకటిస్తున్నాడు. ఇంతకూ చెప్పదలచిన దేమంటే హృదయానికి ధర్మక్షాళనం హృదయమార్గాల దుర్గ్రహత్వంతో సంబద్ధమయ్యే వున్నదని శృంగారం ఉపాదేయం గావడానికి లక్షితం గావలె నని చెప్పుతున్నాను.

సాధారణులు - చిల్లర శృంగారం

ఇక సాధారణుల శృంగారాన్ని చర్చిస్తాను. ధర్మంగాని అధర్మంగాని యెరగక యెవరిపొట్టవాండ్లు పోసుకునేవాండ్లు సాధారణులు వీరు కాముకులైనప్పటి శృంగారాన్ని చర్చిస్తాను వీరిశృంగారం గ్రాహ్యమా అని విచారణచేస్తాను. లోకశ్రేయస్సుకు త్యాగంచూపే మహాత్ములను గౌరవించి ఊరేగించి వారిఆనందమే మనకు తృప్తిగా ప్రవర్తిస్తామని వారిశృంగారం మనకు గ్రాహ్యమై వర్తిస్తున్నదని విశదపరచాను.

"ఆరాధనాయ లోకస్య"

అన్న శ్రీరాముడు ఉత్తరరామచరిత్రలోను సర్వధర్మాలకు నిలయంగా

"అనేన ధర్మః సవిశేషమద్య మే
 త్రివర్గసారః ప్రతిభాతి భావిని"

అనేమాటలు వెలువరించజేసి వెలువరించగలిగిన లోకపితలు పార్వతీ పరమేశ్వరులు కుమార సంభవంలోను ఉత్తమశృంగార నాయకులై భారతీయకావ్యంయొక్క ఔత్కృష్ట్యాన్ని ప్రకటిస్తున్నారని తెలిపినాను. ఇక కేవలం సాధారణకాముకులు వారి పెండ్లాన్ని ముద్దుపెట్టుకొని బుజాలమీద యెక్కించుకుంటే యెక్కించుకో వచ్చును. అది మనకు విచార్యంగాదు ఇట్లాటికాముకుడు పూలదండలువేసుకొని కులుకుతుంటే పూల రంగడంటాము ఒకప్పుడు అట్లాటి కేవలకామేచ్ఛారూపమైన పశుభావాలే మనలోప్రేరితంకాగలవు. ధర్మతత్పరులైన ధీరుల శృంగారం మనకు ఇట్లాటి భావనలను కలిగించదు. పైగా నిర్మలదాంపత్యం మీద అభిలాష అవిర్భవింపజేస్తుంది. అందుకే పత్నులతోకూడిన ఋషులను పరమేశ్వరుడు చూచినపుడు.

"తద్దర్శనాదభూచ్చంభోః భుయాన్ దారార్థమాదరః"

(వారిని చూడడంవల్ల శివుడికి భార్యా స్వీకారంమీద ఆదరం హెచ్చుగా గలిగింది) అని కాళిదాసన్నాడు. యెందుకు? కామతృప్తికి గాదు.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం"

(ధర్మసహితమైన క్రియలకు సత్పత్నులేగదా మూలకారణం అని వెంటనే కాళిదాసంటాడు. కేవలకామరూపమైన వృత్తి ప్రేరితమైతే యేమంటారా? కేవల కామం విషయలోలత్వాన్ని విషయలోలత్వం బుద్ది నైర్యల్యానికి ఆచ్చాదనాన్ని ఆత్మవినాశాన్ని కలిస్తున్నవి అది కేవలం పశువృత్తి. అగ్ని పర్వతంనుండి పొంగే ప్రవాహంవలె లేచిన బిల్హణుడి అద్యాపి స్మరణాలు సర్వలోకంలో కాముకశృంగారకోటిలో ప్రథమ స్థానం ఆక్రమించదదివున్నా అవి బిల్హణుడికి కాళిదాసాదుల కీర్తివంటి ఉత్తమకవితాకీర్తినితేలేదు. చివరకు ఆతనిమనస్సు మోటుదనాన్ని తెలిపే కథనుగూడా లోకం అతనికి తగిలించింది.

"రాజుద్వారే భగాకారే విశన్తి ప్రవిశన్తి చ
 .....వత్ పండితాః సర్వే బిల్హణో వృషణాయతే"

అనేకథ ఆతని మోటుకామపు ప్రవృత్తికి తగేవున్నట్లు నాకు తోస్తున్నది. కేవల కాముకత్వం విషయలోలత్వాన్ని విషయలోలత్వం ఆత్మవినాశాన్ని కలిగిస్తవి గనుక అపేక్ష్యం గాదంటున్నాను. అది గాక శృంగారం మిక్కిలి సునిశితమైనది. అది యేమాత్రం హద్దుమీరినా మితిమీరినా క్షోభమేకలుగుతున్నది. లోకంలో అనేకమైన హింసలు పీడలు, హత్యలు అలజడులు దేహాత్మల నైర్మల్యవినాశాలు ఈశృంగార దుర్వినియోగంవల్ల గోచరిస్తున్నవి. ఇది ధర్మసంబంధి అయినప్పుడే లోక శ్రేయస్సుకు తోడ్పడుతున్నది. అర్ధకామప్రేరితమాయెనా అత్యంతం అనర్ధ హేతువగుతున్నది. ఇది ముడిదశలో మోటుపనులనే వెలువరిస్తున్నదిగాని ఉదాత్తస్వరూపాన్ని ప్రకటించజాలదు. ఈ ప్రాకృత ప్రవృత్తిలో మనకు విచార్యంగాదు. కోళ్లు కుక్కలుకూడా యీప్రవృత్తిలో వుంటున్నవి కనుకనే సాధారణుల శృంగారం గ్రాహ్యంకా దంటున్నాను. "చెన్నపట్టణంలో" అనే మొదలయిన యిప్పటినవల అనేకంలోను భారతిమొదలయిన పత్రికల్లోని "పరీక్ష" సర్వదర్శినిలోలక్కులు" మొదలైన కథలవంటి కథల్లోను వుండేది యీ అనుపాదేయమైన శృంగారమే అయివున్నది.

ఆనుషంగిక ఫలాలు

శృంగారం ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అది వుపాదేయం. అది అధారంగా కొన్ని పశువృత్తులు కలియడం మొదలైనవి మాత్రంబయట బడ్డప్పుడు క్షుద్రశృంగార మవుతున్నది.

"ఆరాధనాయ లోకస్య"

అని అనగలిగిన ధర్మతేజస్సుతో పరిణతులైన ఉత్తమనాయకులందు గాని ఉదాత్తబావోన్మీలనంగలదు ఇది లేని కేవలం కలియడం గిల్లడం గిచ్చడం చుంబించడం కౌగిలించడం మొదలైన వృత్తులు శృంగారానికి క్షుద్రఫలా లంటున్నాను. ఇవి వినదగ్గవి చెప్పుకో దగ్గవికావు. కనుకనే ఈకోటిలోచేరిన ఉదాత్తత్వం లేక

"రజస్వలకాకముందే చండ్లువచ్చినవి
 పొగరుగుబ్బలరైక నెగదన్ని
 నీచన్నులు నీవెండ్రుకలు నాకువశం చేస్తానని చేయలేదు
 సావిట్లోకి సిటి కేసి రమ్మని చెయ్యూపి నట్లు"

అని కేవల పశువృత్తులను రేపే. గంటి సూర్యనారాయాణశాస్త్రివారు ప్రకాశింపజేసిన శృంగారం అనే పుస్తకంలోను.

"అదినడిచేటప్పుడు కుచ్చెళ్లు రేపేదుమ్ములో రేణువునైతా"
 (నాయని సుబ్బరావు)
"జానకి నారత్నాలబొమ్మ యేంజేస్తున్నదో"
 (అధికార్ల సూర్యనారాయణ)
"యెప్పుడు ప్రియుడువస్తాడా! యెప్పుడుమొగం చూస్తానా,"
(సౌధామిని)

"ఓకాంతా నన్నుజూడూ

(మామునూరి నాగభూషణరావు)


"నన్నెవరేమంటేనేమి నీప్రేమబాగ్యంవుంటే నాకేమిభయం"

                                      

(గరిగిపాటి రామమూర్తి)


"నాకు రెక్కలుంటే నీవద్దవచ్చి వాలి ముద్దుపెట్టుకుంటాను"

                          

(నాదెండ్ల వెంకట్రావు)


"ఓతరుణీ నీకౌగిట్లోచేరి తనువుమరుస్తాను
 నామీద ఆకాశంపడ్డా భయంలేదు
 నా ప్రణయగాన శబ్ధాలకు విశ్వమంతాచలించి
 నిట్టూర్పు విడిచింది."

                          

(వేదుల సత్యనారాయణశాస్త్రి)


"చింతచెట్టుమీద గువ్వజంట సరస మాడుతున్నది
 చప్పుడైనప్పుడెల్ల నీవేవస్తున్నావని చూస్తున్నాను

                                    

(సౌదామిని)


"కలికీ నీవలపుదప్ప నాకు మరేమీవద్దు

               

(పువ్వాడ శేషగిరిరావు.చోడవరం జానకిరామయ్య.)


"దాని చీరకొంగు రాచుకున్నది నిద్రపట్టదు"

                                  

కవికొండల వెంకట్రావు


"ముద్దులొలుకు నీరూపు పిల్లా, మూర్చదెచ్చా వేమో పిల్లా"

అని యీతీరున భారతిలోని ప్రణయగీతం, ప్రణయసౌధం, ప్రణయోన్మాదం మొదలైనవాట్లో వ్యక్తమవుతున్నవి. కేవలం పశుత్వం వెల్లడించేవి అయిన యీమాటలన్నీ వినదగినది చెప్పుకోదగినది కాని క్షుద్రశృంగారమైవున్నవి. శాస్త్రగ్రంథాల్లో శబ్దవృత్తులు మొదలయినవాటికి లక్ష్యంగా ఉదాహరించే చాటుపద్యాలవంటివి యివంటారా? నాకు విప్రతిపత్తిలేదు. యివి వొక నూతనకవిత్వం ఉత్తమకవిత్వం అంటున్నందున విచారణ శృంగారం ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అది మనకు స్వీకార్యమన్నాను. విశ్వనాథు డన్నట్లు ఉత్తమప్రకృతులై అనురక్తలోకులై శీలవంతులై ధర్మతేజస్సుతో పరిణతులై ఉత్తమ సంస్కారప్రాప్తితో ఉదాత్తులైన నాయకులందే ఇట్లాటి దశసిద్ధిస్తున్నది. అప్పుడాశృంగారం శ్రోతవ్యమవుతున్నది. దానివల్ల ఆనందమేగాక నాయకనిష్ఠమైన వీరత్వ తేజశ్శాలిత్వ శీలవత్వాదులమీద అనురక్తీవాటివల్ల లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ నాంతరీయ కఫలాలుగా సిద్దిస్తున్నవి. యీసంగతి రఘువంశకుమారసంభవోత్తర రామచరిత్రాదులవల్ల విదితమవుతూనేవున్నది. వీట్లో వృత్తాంతం యొక్క శ్రవణం యిట్లాటి ఆనుషంగిక ఫలాల ప్రదానానికి సమర్థమయ్యే వున్నది. ఇట్లానే ఉదాత్తనాయికానిష్ఠమైన కల్యాణగుణాలపై అనురక్తిసయితం ఆనుషంగికంగా సిద్దిస్సున్నది.

ప్రాకృతులు--కామప్రేమ

కేవల కాముకులశృంగారం క్షుద్రమని నిరూపించాను. ఇక కేవలం ప్రాకృతదశలోవుండే మనుషులశృంగారం క్షుద్రమనిచెప్పవలసిన పనిలేదు. కేవల కాముకుల్లోను ప్రాకృతుల్లోను రూపప్రేమే ప్రధానమవుతున్నది. ఈరూపప్రేమ అవయవసన్ని వేశం మొదలైన బహిరాకారంమీద ఆధారపడి వుంటుంది. యీ ఆకారానికి వికృతిగలిగినప్పుడు ప్రేమకూడ వికృతి జెందవలసివస్తుంది. కారణగుణం కార్యంలో సంక్రమించడం ప్రసిద్దిమేగదా. యీప్రాకృతమైన కామప్రేమ పశుప్రేమ. వీటి నన్నిటిని దాటి ప్రేమ గుణాలమీద అధారపడ్డప్పుడే పవిత్రమైన లోకాభ్యుదయానికి హేతువగుతున్నది. రూపంమీద ఆధారపడ్డ ప్రేమ విషయలోలత్వానికి మాత్రం హేతువగుతున్నది. కనుకనే కవికుల గురువు కాళిదాసు

"అరూపహార్యం మదనస్య నిగ్రహాత్" (కుమార)

(రూపహార్యుడుకాని పినాకపాణిని పార్వతి పతిగా కోరుతున్నది)

అని రూప ప్రేమ యొక్క హేయత్వాన్ని వ్యక్తంచేస్తాడు

ధర్మసంబంధంగాని అధర్మ సంభంధంగాని యేమీ లేకుండా తినడం కనడం పరమప్రవృత్తిగా పెట్టుకున్న సాధారణుల శృంగారం సయితం అగ్రాహ్యమే అవుతున్నది. వీరులు సత్యవాదులు దయావంతులు పరదారవిముఖులు లోకానికి అపేక్ష్యులుగాని తినడం కనడం పరమవృత్తిగా, పెట్టుకున్న పశుతుల్యులు అపేక్ష్యులుగారు. యేదో విధంగా స్వార్ధాన్ని అణచి లోకశ్రేయస్సుకు ధర్మంకొరకు త్యాగం జూపగలిగినప్పుడే ధర్మరక్షకత్వం ధర్మ పరత్వం సిద్ధిస్తున్నవి. ధర్మం అనంతముఖాలతో వెలసివున్నదని యిదివరకే చెప్పినాను. అదిగాక ప్రాకృతుల్లో ఆశృంగారం ఆధారంగా కులకడం, కలియడం, తహతహపడడం ఇట్లాటివి మాత్రమే బయటబడతవి. ప్రాకృతులు నాయకులుగావున్న యెంకిపాటలు మొదలైనవీస్థితినే తెలుపుతున్నవి.,

"కామాతురాణాం న భయం నలజ్జా"
అన్నట్లు యెంకిపాటల్లో నాయుడు బావ
"పదిమందిలో యెంకిపాటనే పాడంగ"

అని తనకాంతను గురించిన పాటను లజ్జవిడిచి పదిమందిలో పాడేకేవల కామి;యింతేకాదు. ఇతడు పరకాంతతో వరసలాడే వెకిలిమనిషి.

"పొరుగమ్మతో నేను వరసలాడేవేళ"

అని అంటాడు. యితడు సంస్కారహీనుడైన ప్రాకృతుడని యింకా ముందునిర్ణయిస్తాను. ఈకోటిలోనివారు గనుకనే యీ యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట మొదలైనవాట్లో

"కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది."

నాసక్క నెంకీ, జాము రేతియేళ నీటుగా వొస్తుంటె
వొయ్యార మొలికిస్తుంది కులుకు సూపెడతాది
కులుకుతా నన్నేటో పలుకరించాలి
కనుబొమ్మ సూడాలి కమ్మగుండాలి" (యెంకిపాట)

"కడుపుకోసం మొక్కుకోవే చంద్రమ్మ"
                                        (వెంకయ్య చంద్రమ్మపాట)

"కొద్దిలో వరహాల కొడుకునేత్తేవంటి"

"(మంచెకింద)గోనెపట్టాయేసి గొంగడిపై నేసి
 కులాసగుంటాది" (యెంకిపాట)

"అంటింత చెట్లలో తంటాలుపడలేము
 పాతగొంగడి సింపి తేరో రెంకయ్య"
          (యెంకయ్య చంద్రమ్మపాట)

అని యిట్లాటి మనోవృత్తులు ప్రాకృతులు గనుకనే ప్రధానంగా బయటబడుతున్నవి. అనురక్త లోకత్వం తేజశ్శాలిత్వం సంస్కారప్రాప్తి యిట్లాటి స్పృహణీయగుణాలువున్న వ్యక్తియందు నిష్టమైతే ఆశృంగారవృత్తాంతం మనకు శ్రోతవ్యమై ఆనందమేగాక వీరత్వ తేజశ్శాలిత్వాలమీద అనురక్తి వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమై వుండే కల్యాణగుణాభిరతీ నాంతరీయకఫలాలుగా శృంగారంవల్ల సిద్ధిస్తున్నవని యిదివరకు విశదపరచాను. పొరుగుకాంతలతో వరసలాడడం పెండ్లాము యెదురు గావుంటే నాకు చాలుననడం నీవన్నెసిన్నియలు సూపేవా అనడం కులకడం సోకూ తిరణాలబోవడం మంచెకింద తిప్పలుపడడం (నా తిప్పతీశ్వరుడు లేడా అని) అంటింతచెట్లలో తంటాలుపడలే మనడం యివే యెంకిపాటలు మొదలైనవాటివంటి శృంగారంలో వ్యక్తమయ్యేవి. శాకుంతలంలో శకుంతలకు ఆశ్రమవాసమూలాన ప్రాప్తించిన సంస్కారం, అందువల్ల సిద్ధించిన ముగ్దప్రకృతిప్రేమ గురుజనరతి. యిట్లాటివాటి వల్ల కలిగే చిత్తవిశ్రాంతినైర్మల్యాదులు అనుభూతుమై అట్లాటి కల్యాణగుణాలమీది అభిరతి ఆనుషంగికంగా సిద్ధించేదే అయివున్నది. ఇట్లాటివి మనతోబుట్టువులకు కూతుండ్లకుసిద్దిస్తే మంచిదనుకుంటాము. కాని మనకూతుండ్లు మనతోబుట్టువులు రాత్రులయందు యింట్లో వాండ్ల కన్నుగప్పి చేలకుపోయి మంచెకిందా చెట్లల్లో రహస్య కార్యాలు చేయవలెనని కోరము. యిటువంటి శృంగారం క్షుద్రమని ప్రధానంగా స్వీకార్యం కాదని అంటున్నాను.

పూర్వపక్షం

అవునయ్యా;

"గుడికి చండమెడతావుంటె నాయెంకి" (యెంకిపాట)
"తీర్ధాల కెందుకూ యాత్రలెందుకూ
 దేవుడంతటమనకు లేడేచంద్రమ్మ"
                     (యెంకయ్య చందమ్మపాట)
"సొమ్ము లేలంటాది నాయెంకి" (యెంకిపాట)

అని యీపాటల్లో వున్నవి. యీతీరుగాదైవభక్తి, వేదాంతం, సొమ్ములకోసం భర్తను వేధించకపోవడం స్పృహణీయగుణాలు కదా. ఆనుషంగికఫలాలు యెంకయ్య చంద్రమ్మపాటలో యెంకిపాటలోగూడా ఆపేక్ష్యమైనవి వుంటున్నవి గనుక యివి స్వీకార్యమేనంటారా?

సమాధానం

చెపుతున్నాను;

అదిసరిగాదు, సొమ్ములకోసం వేధించకుండా తమకు లభించిన వాటితోటే అందాలు దిద్దుకొనడం గుడికి దంణం బెట్టడం మొదలైనవి సాధారణ కార్యాలు. అదిగాక గుడికి దంణంబెట్టడం సొమ్ములకోసం వేధించకుండావుండడం మొదలయినవి ఉత్తమనాయికల్లోను సిద్ధిస్తవి. ఇంతకంటే అధికంగా ఉదాత్తగుణోన్మీలనమూ సిద్ధిస్తుంది. అధమపాత్రల్లోవుండే సాధారణమైన స్వీకార్యగుణాలూ అంతకుపైగా ఉత్తములకు స్వతస్సిద్ధంగావుండే ఉత్తమగుణాలూ కలిసి ఉత్తముల యందే సిద్ధించేటప్పుడు ఉత్తములను వదలి అధములను స్వీకరించడం అనుచితకార్యం.

"నిన్నునమ్మివుంటాను నాయుడుబావా
 చింతచెట్టుపై నున్న నారాయణమ్మా
 చిగిరుకోస్తున్నావ నారాయణమ్మా
సన్నపన్నగాజులేవి నారాయణమ్మా
 నీచిన్ని చిన్ని చేతులాకు నారాయణమ్మా"

అనే యీపాట క్షుద్రశృంగారకోటినికూడా అతిక్రమించింది.

"ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే
 సామాన్యాస్తు పరార్థమద్యమభృతః స్వార్థా విరోధేనయే
 తేమీ మానుపరాక్షసాః పరహితం స్వార్థాయ విఘ్నంతి యే
 యేతుఘ్నంతినిరర్థకం పరహితం తే కే నజానీమహే". (భ.త్రి)

అని భర్తృహరి అధములను అతిక్రమించినవారికి పేరుకుదరక వదలినట్లు నేను శృంగారంయొక్క ఉత్తమత్వక్షుద్రత్వాలను నిరూపించి వీటినతిక్రమించిన యీనారాయణమ్మ నాయుడుబావల శృంగారం వంటి శృంగారానికి యిక్కడ పేరుపెట్టక వదులుతున్నాను. ముందు సందర్భంవచ్చినచోట దీన్ని దుష్టశృంగారమని వ్యవహరిస్తాను. కేతిగాడు బంగారక్కల శృంగారం వీండ్ల శృంగారానికి జత అయినది. అదిగాక నాయకులు ఉత్తములు పరిపాకవంతులు అయినప్పుడు వారిశృంగార సందర్భంలో

"వ్యతిషజతి పదార్థాన్ అంతరః కోపి హేతుః
 న ఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే"

(యేదో వొక అంతరకారణంవల్ల అనురాగం వుత్పన్న మవుతున్నది. అనురాగానికి బాహ్యోపాధులు సంశ్రయంగావు)

(మకరందుడు -మాలతీ.)

"సతాం హి సందేహపదేషు వస్తుషు

 ప్రమాణమంతః కరణప్రవృత్తయః"

(శా)


 

(సందేహపదమైన విషయాల్లో సాధువుల అంతఃకరణం ప్రమాణం)

"కమివహి మధురాణాం మండనం నాకృతీనాం
 రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శాబ్దాన్
 పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః
 తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం

 భావస్థిరాణి జననాంతసౌహృదాని"

(శాకుం)

(నిజంగా మధురాకృతుల కేది మండనంగాదు? సుఖితంగా వుండిగూడా ప్రాణి రమ్యపదార్ధాలనుజూచి మధురశబ్దాలనువిని పర్యుత్సుకం కావడమనేది అనంశయంగా భావస్థిరాలైన జననాంతర సౌహృదాలను చిత్తంతో అజ్ఞాతంగా స్మరించడేమేను.)అని యిట్లాటి. ఉదాత్త భావాలు ఉన్మీలితంకాగవలవు. యెంకిపాటలు మొదలైనవాటివంటి ప్రాకృతుల శృంగారంలో

"మెళ్లో పూసలపేరు. తల్లో పూవులసేరు
 కళ్లెత్తితే సాలు కనకాబిసేకాలు"
"రాసోరింటికైన రింగుతెచ్చేపిల్ల

అని మోటుమనఃప్రవృత్తే వ్యక్తం కాగలదు. యింతకూ చెప్పదలచిందేమంటే ప్రణయగీతాలు ప్రణయసౌధాలు మొదలయినవి. యెంకిపాటలు మొదలయినవి.భారతిలోని "పరీక్ష" "సర్ఫదర్శిలోలక్కులు" మొదలయిన కథలు "చెన్నపట్టణములో" మొదలయిన నవలలు ప్రకటించేది క్షుద్రఫలకమైన శృంగారం గనుక క్షుద్రమని. సంస్కారవంతులకు ప్రధానంగా ఉపాదేయంకాదని చెప్పుతున్నాను; శృంగారానికి ధర్మసంబంధంలేనప్పుడు తేజోహీనమవుతున్న దని అది యెంకయ్య చంద్రమ్మ పాట, యెంకిపాటలవంటి వాటిలో పశుకృత్యంగా వుంటున్నదని విశదపరిచాను.

అయితే ఇట్లాటి సాధారణకృత్యాలు, సాదారణశృంగారం లోకంలో వుంటున్నవే. వాటిసంగతి యేమంటే అవి ప్రశంసించతగ్గవి కావంటున్నాను. ముద్దు పెట్టుకొని పురుషుడూ. స్త్రీకలిసి పరుండడం విడిపోయి వొకరినొకరు వెతుక్కొనడం. యివే శృంగారస్వీకరణానికి ప్రధానంగాదు. అవి ధర్మ బద్ధుల్లో నిష్ఠమై, అవి ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడు శృంగారం స్వీకార్య మవుతున్నది. ఆకలికావడం అన్నంతినడం విశేషంకాదు. ఆ అన్నంతినేవాడు ధర్మపరతంత్రుడై ఆ ఆన్నంమూలాన బలంకలిగి అది లోకాభ్యుదయానికి హేతువైనప్పుడు ప్రశస్యమవుతున్నది. అందుకే ధర్మపరతంత్రుడియొక్క త్యాగియొక్క ఐశ్వర్యం ప్రశస్యమవుతున్నది.

"త్యాగాయ సంభృతార్థానాం"

అని యీసత్యాన్నే కాళిదాసు వినిపిస్తున్నాడు.

ముద్దుపెట్టుకుని స్త్రీ పురుషులు కలిసి పరుండడం, విడిపొయి ఒకరినొకరు వెతుక్కొనడం యివే శృంగారస్వీకరణానికి ప్రధానం గావన్నాను. ఇవి వుపేక్షించ దగ్గ సాధారనకృత్యా లంటున్నాను. ఈకృత్యాలు ఆధారంగా ఉదాత్తభావోన్మీలనం అయినప్పుడే అవి మనకు స్వీకార్యావుతున్నవి. శృంగారం పరిణతనాయకనిష్ఠమైనప్పుడే యిట్లాటిదశ సిద్ధిస్తున్న దని సాధారణుల్లో అది ముడిశృంగారం గానే వుంటున్నదని విశదంచేశాను. కనుక చిత్తసంస్కారంలేని సాధరణుల శృంగారం క్షుద్రమని మనకు ప్రధానంగా స్వీకార్యం గాదని అంటున్నాను.

తటస్థప్రశ్న

అవునయ్యా ధర్మరక్షకులశృంగారం లోకకల్యాణహేతువు గనుకనే స్వీకార్యమని మీరన్నారు. సాధారణదంపతుల్లో ధర్మసంబంధ మున్నది. అది యెట్లానంటారా? దాంపత్యమే ఒక ధర్మం అదిగాక వారిమనశ్శుద్దే ఒకధర్మం. చలించని ప్రేమ ధర్మంగాక మరేమిటి? అద్దాలు మనకెందు కని నాయుడికంట్లో మొగం జూసి బొట్టుపెట్టుకుంటుంది. యెంకి యిటువంటిప్రేమ ఒకధర్మం.

"యేన మూలహరో, ధర్మః సర్వనాశాయ కల్పతే"

(మను)

అని స్మృతికర్తలు నిందిస్తున్న వ్యభిచారాన్నీ దీన్ని పోల్చినప్పుడు ఈదాంపత్యం యెక్క గొప్పతనం వ్యక్తమవుతున్నది. సాధారణులైనా వారిదాంపత్యమే ఒకధర్మం గనుక అదిగూడా స్వీకార్యమే నంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; పాతివ్రత్యం ధర్మమంటే మేము వొప్పుకుంటాము. అయితే పాతివ్రత్యానికి ఆమహిమ గృహస్థా శ్రమ మహిమ వల్ల చేకూరింది. భారతీయుడి గృహస్థాశ్రమం. ఆ ఆశ్రమంలో నిర్వహించే ధర్మపరంపర సర్వలోకానికి ఆరాధ్యమైనవి.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం

 సత్పత్న్యో మూలకారణం "

(కుమార)

(ధర్మ్యాలయిన క్రియలకు సత్పత్నులే మూలకారణం)

అని కాళిదాసు ఈగృహస్థాశ్రమధర్మస్వరూపాన్ని తెలుపుతున్నాడు. లోకస్థితిహేతుభూతమయిన ధర్మంయొక్క ఆచరణం యీఆశ్రమానికి ప్రధానం కావడం వల్ల దాంపత్యానికి అధర్మమహిమ వచ్చింది. అందుకే

"సర్వేషామపి చైతేషాం వేదస్మృతివిధానతః
 గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠః సత్రీనేతాన్ బిభర్తిహి
 యథా నదీనదా స్సర్వే సాగరే యాంతి సంస్థితిం

 తదైవాశ్రమిణస్సర్వే గృహస్థే యాంతి సంస్థితిం"

(మను)

(వేదస్మృతి విధానంవల్ల యీ అన్ని ఆశ్రమాల్లో గృహస్థుడే శ్రేష్ఠుడని చెప్పబడుతున్నాడు. తక్కిన మూడు ఆశ్రమాలవారిని యితడే భరిస్తున్నాడు. నదీనదాలన్నీ సముద్రంలో యెట్లా సంస్థితిని పొందుతున్నవో అట్లానే తక్కిన ఆశ్రమాలవారు గృహస్థుడియందు సంస్థితిని పొందుతున్నారు) అని మనువు కీర్తిస్తున్నాడు.

"భవేద్ధర్మపరాయణ:"

(నీభర్త ధర్మపరాయణుడు కావలసినది) అని స్త్రీలను ఆశీర్వదిస్తున్నారు.

వివాహానికి ఫలం ధర్మం వీరసంతతి. అంటే వీరావిచ్చిన్నత.

"పనసదొనలవంటి బిడ్దలు కనడానికా నీనోము" అని మూగినోములో అధికార్ల సూర్యనారాయణవారు అన్నట్లు పనసదొనల వంటి శిశువులను కనమని భారతీయులు దీవించరు.

"వీరపసవినీ భవ"అని దీవిస్తున్నారు.

ధర్మావలంబనమైన వీరసంతతిని అవిచ్ఛిన్నంచేసేది గార్హస్థ్యమని బారతీయులభావం.

"క్రియాణాం ఖలు ధర్మ్యాణాం సత్పత్న్యో మూలకారణం."

అని యిదివరకు నేను వుదాహరించిన కాళిదాసువాక్యాలు గార్హస్థ్యంలోని యీధర్మోన్ముఖత్వాన్నే ప్రశంసిస్తున్నవి.

"కామాత్మతా న ప్రశస్తా నచైవేహాస్త్యకామతా" (మను) (కామాత్మతప్రశస్తంకాదు. అయితే కామాత్మత లేకుండా వుండడం లేదు) అని మను వన్నట్లు ధర్మ కామాలచేరికే గృహస్థాశ్రమానికి పూజ్యత్వాన్ని ఆపాదిస్తున్నది.

"ధర్మేణాపి పదం శర్వే కారితే పార్వతి ప్రతి

 పూర్వాపరాధభీతస్య కామస్యోచ్చ్వసితం మనః

(కుమా 6)

అని కామం ధర్మంచేత పవిత్రితమైన తరువాత పరమేశ్వర గార్హస్థ్యాన్ని ప్రతిపాదించిన కాళిదాసీసత్యాన్నే వినిపిస్తున్నాడు.

ఇంతేగాని కేవలకామంవల్ల ఒకపురుషుడు ఒకస్త్రీ కలిసివుండడమే విశేషంగాదు. కనుక ఉత్తమోత్తమమైన ఆశ్రమధర్మాల ఆనులేని కేవలకాముకులు కలయిక అచంచలంగానీ, చంచలంగానీ, గాఢంగానీ, అగాఢంగానీ, మాయికంగానీ, ఆమాయికంగానీ అది ప్రధానంగా స్వీకార్యంగాదు.

ఆక్షేపం

సరేగాని యిది మేమంగీకరించము మీరెన్ని చెప్పినా శృంగారానికి ధర్మసంబంధం మేమొప్పుకోము. యెందుకంటారా? కొందరన్నట్లు శృంగారంలో జరిగేది ఆత్మలసంయోగం. అదే అక్కడ ప్రధానంగాని దైహికసంయోగం గాదు. ఆత్మ సర్వపరిశుద్ధం. దానికి ప్రధానంగా స్వీకార్య మేనంటే

సమాధానం

చెప్పుతున్నాను ఆమాట సరిగాదు శృంగారంలో ఆత్మలసం యోగమే ప్రధానమైతే ఒకస్త్రీ, ఒక పురుషుడూ యెందుకు?ఆడ ఆత్మ మగ ఆత్మ వేరుగాలేవుగదా. ఇద్దరూ స్త్రీలే? యెందు కొకరినొకరు ప్రేమించుకొనగూడదు? ఇద్దరికీ ఆత్మ లున్నవి. ఆఆత్మలసంయోగ మెందుకు శృంగారంకాగూడదు? ఇద్దరూ పురుషులే యెందు కొకరినొకరు ప్రేమించుకొనగూడదు? ఇద్దరికీ ఆత్మలున్నవి. ఆఆత్మలసంయోగమెందుకు శృంగారం కాగూడదు? ఇవన్నీ అయోమయపు అసంబద్ద వచనాలు. అందుకే భారతీ సాహిత్యవేత్తలు ఆత్మలసంయోగం ప్రియులైన స్త్రీపురుషుల విషయంలో గాక జీవాత్మ పరమాత్మలవిషయంలో ప్రతిపాదించారు. అది భగవద్రతి స్త్రీపురుషుల రతినుండి వేరుగా నిర్వచించడానికి దాన్ని భావంలో చేర్చారు. "రతిర్దేవాది విషయా భావః ప్రోక్తః కాంతాది విషయాతువ్యక్తః శృంగారః? అని కావ్య ప్రకాశకారు డీ అంశం తెలుపుతున్నాడు. కనుక ఆత్మసంయోగమని సాధారణులశృంగారం స్వీకార్యమనడం అనుచితం.

ఆక్షేపం

అవునయ్యా శృంగారం ఆత్మలసంయోగానికి సంబంధించింది కాకుంటే కాకపోనియ్యండి పురుషుడు స్త్రీనిగాని స్త్రీ పురుషుణ్నిగాని ప్రేమించడం సౌందర్యాభిమానంచేత. అదే దాంట్లో ప్రధానం. సౌందర్యానికి ధర్మాధర్మవిచారన అనావశ్యకం అందువల్ల సాధారణుల శృంగారం కూడా ప్రధానంగా అంగీకార్యమేనంటారా?

సమాధానం

వివరిస్తాను. సౌందర్యాభిమానానికి శృంగారం సంబంధించినదైతే సుందరులైన తల్లి, కూతురు, చెల్లెలు, పినతల్లి, పినతల్లి కూతురు ఇట్లాటివాండ్ల నెందుకు ఆ అభిమానానికి విషయం చేసుకోగూడదు? వారి సౌందర్యాన్ని అభిమానిస్తూ తృప్తిపడుతూ వుండవ్చచ్చునుగదా పోనీయండి. పాణిగ్రహణం చేసిన నాయికవిషయంలోనైనా కేవల నేత్ర సమారాధనమే లక్ష్యమంటే నాయకుడికి వలెనే నాయికకుగూడా అదే పరమార్థంగా వుండవలె నని యేమి నియమం? ఇద్దరూ ఒకటే చిత్తవృత్తిగలవారై వారికి నేత్రసమారాధనమే లక్ష్యమైతే అసమగ్రమైన దైనప్పటికి కొంతవరకు సంయతమనస్పత్వమనే ధర్మం ధర్మాభావవాదికి అనిష్ఠమైనది సిద్దించనే సిద్ధిస్తున్నది. కనుక అట్లాటిచొట్ల నాకు విప్రతిపత్తి లేదంటున్నాను. కాని సాధారణంగా అన్యోన్యరక్తులైన తరుణస్త్రీ పురుషులవిషయంలో చక్షుఃప్రీతి అంతటితో అంతంగాదు మనస్సు సోపానపరంపరంను ఆరోహించడం సాధారణప్రవృత్తి.

"ఆదర్శనే దర్శనమత్రకామాః
 దృష్ట్వా పరిష్వంగసుఖైకలోలాః
 అలింగితాయాం పునరాయతాక్ష్యా
 ఆశాస్మహే విగ్రహయోరభేదం" (తిశ)

అని హరి జెప్పినమాట లీయాథార్ద్యాన్నే తెలుపుతున్నవి. ఇది సాధారణప్రవృత్తి అన్నాను సంయోగమే ఈప్సితఫలంగా గల వియోగశృంగారం సయితం సంయోగం యొక్క అన్యరూపమే గనుక దాన్ని వేరుగా విచారించవలసిన పనిలేదు. ఈసంయోగం పధానం గానీయండి అప్రదానం గానీయండి కామనంబంధే అవుతున్నది. కేవలకామంయొక్క దుఃస్వరూపాన్ని యిదివరకే విశదంచేశాను. కనుక సౌందర్యవాదంచేత సాధారణులశృంగార ప్రధానంగా స్వీకార్య మనడం అనుచితం

ఆక్షేపం

సౌందర్యాభిమానవాదం పొతే పోనీయండి.మీరు భగవద్రతి వొప్పుకున్నారుగదా? పురుషుణ్ని భగవంతుణ్ణిగా తలచి స్త్రీ సమీపిస్తున్నది. ఇది జీవాత్మపరమాత్మలసంయోగ మనుకోగూడదా? అప్పుడు సాధారణులశృంగారంగూడా ప్రధానంగా సీకార్యమవుతున్నది అని అంటారా?

సమాధానo

చెప్పుతున్నాను; మీరన్నమాట సరిగాదు. పురుషుణ్నే స్త్రీ యెందుకు దైవంగా భావించవలెను? ఒక రాయిని ఒక చెట్టును. ఒక గోడను కాదా ఒక స్త్రీని యెందుకు దైవంగా భావించరాదు? అది యెందుకు శృంగారం కాగూడదు? యెవరైతే నేమి పురుషుణ్నే భావించిందంటారా? అది వంచన సువర్ణమైతే నేమి సుద్ధమన్నైతేనేమి సువర్ణమే కావలెననేటటువంటి అప్రశస్తపుమాట. ప్రియులైన స్త్రీకి పురుషుడికి ప్రకృతిసిద్ధమైన బంధాన్ని ఆధారం చేసుకొని పురుషుడియందు పరమాత్మ దర్శనాన్ని స్త్రీ సాధిస్తున్నదంటారా? ఇట్లా పరమాత్మ దర్శనమే ప్రాప్యమై విషయసక్తతనుండి ముక్తులైతే ఇదివరకు చూపినట్లు ధర్మా భావవాదికి అంగీకార్యంగాని ఇంద్రియజయం.భగవత్సేవ అనే ధర్మాలు సిద్ధిస్తూనే వున్నవి. ఆసందర్భంలో ఆరతి శృంగారసంజ్ఞనువదలి బావసంజ్ఞను పొందుతున్నది. కనుక నాకు విప్రతిపత్తిలేదు.స్త్రీ పురుషుల శృంగారం యిక్కడ నాకు విచార్యవిషయంగాని భగవద్రతిగాదు. ప్రథమఖండంలో భక్తిమతవిచారణలో ఆభక్తిమతమందలి వల్లభసం బంధాన్ని దాని హేయోపాదేయతలను వివరించాను. ఇక్కడ ఆవిచారణ వదులుతున్నాను; భగవద్రతి అనే ఉదాత్తలక్ష్యం యెప్పుడు వెనక బడి హద్దుదాటి మనస్సు విషయసక్తమవుతున్నదో అప్పుడే కామ ప్రవృత్తి ఆరబ్దమవుతున్నది. ఈ కేవల కామప్రవృత్తియొక్క దుష్ఫలాల నిదివరకే విశదీకరించాను కనుక భగవత్త్వారోపవాదం చేత సాధారణుల కామప్రవృత్తి స్వీకార్యమనడం అప్రశస్తం.

ఆక్షేపం

అవును సరే; కొందరన్నవిధాన ప్రియతముడైన నాయకుణ్ని కవి స్వీకరిస్తాడు. కమలం ప్రియతమంగనుక గ్రహిస్తున్నాడు. బొగ్గులు ముండ్లు పెంటప్రియంగావు గనుక స్వీకరించడు. ప్రియతముడు సాధారణుడు కావచ్చును. ధర్మసంబంధి అయిన అసాధారణుడూ కావచ్చును. ఇక్కడ చేయవలసినది ప్రియాప్రియత్వవిచారణగాని ధర్మాధర్మవిచారణగాదు అని ఆంటారా?

సమాధానం

చెప్పుతున్నాను; ఆమాట అసంబద్ధం కవికి కేవలకాముకుల సాధారణుల ప్రవృత్తియొక్క అనుపాదేయత యిదివరకే నిరూపించాను. గనుక అట్లాటి ప్రవృత్తియందు ఆసక్తివుండడం కవియొక్క పరిపాకాభావాన్ని ప్రాకృతత్వాన్ని తెలుపుతుంది. అసాధారణులు శృంగారంలో కవికి ప్రియతములంటే విప్రతిపత్తేలేదు. నేను ప్రతిపాదిస్తున్న అంశమే అది. పరిణతచిత్తుడైన కవిదృష్టికి ఆనగల అసాధారణుల స్వరూపాన్ని పరామర్శించి వారిట్లాటివారని నేను తెలిపినాను. ధర్మసంబంధంలేని కేవల కాముకులు సాధారణులుపోగా శృంగరంలో మిగిలిన అసాధారణు లేవిధంగానైనా నేను తెలిపిన ధర్మసంబంధంగలవారే అవుతున్నారు ధర్మంయొక్క అనంతముఖత్వ మిదివరకే తెలిపినాను. కనుక యింతకూ చెప్పదలచిం దేమంటే. ఆత్మసంయోగమనడం, అభిమాన మనడం, ఆరోపమనడం, అట్లా ననడం,యిట్లా ననడం యివన్నీ విషయసక్తతకు కొత్తపేర్లు పెట్టడమయినా అవుతవి. లేదా యిదివరకు తెలిపినట్లు అయోమయపు అసంబద్ధవచనాలైనా అవుతవి. ఆత్మల సంయోగం వుండనీయండి? అబిమానం వుండనీయండి? ఆభిమానం వుండనీయండి? ఆరాధనం వుండనీయండి? యేమైనా వుండనీయండి? సాధారణంగా ప్రియులైన స్త్రీ పురుషుల కలయిక నుండి స్త్రీత్వపురుషత్వాలసత్తను వేరుచేయలేమంటున్నాను. సాహిత్య వేత్తల స్త్రీపురుషసాధారణ్య రూపమైన ఈ స్త్రీత్వపురుషత్వాలు నిర్మలోపాధితోకూడినప్పుడు వాటి కలయిక లోకాభ్యుదయ హేతువవుతున్నది. హేయోపాధులతో కూడినప్పుడు అనర్థహేతువవుతున్నది. ప్రాకృతుల శృంగారంయొక్క అనుపాదేయత తెలిపినాను. అనౌచిత్య ప్రవృత్తమైన పరకీయారత్యాది శృంగారాభాసానికి దుష్టశృంగారానికి ఇక్కడ ప్రసక్తి లేదు గనుక దాన్ని విచారించలేదు అశ్లీలసురతాదులు, గ్రామ్యవృత్తులు వెగటుగా ప్రధానంగా వర్ణించడం యెందైనా ఔచిత్య పరిపాలనానికి త్యాజ్యమనే సంగతి నైషధతత్వజిజ్ఞాసలో విశదం చేశాను. కనుక ఆమీమాంస వదలుతున్నాను.

శృంగారం సాధారణుల్లో కేవలకాముకుల్లో కలియడం కులకడం, తహతహ పడడం మొదలైన ముడిపనులనే వెలువరిస్తుందని తినడం, కనడం. పరమార్థంగా వుండే వృత్తి అనుపాదేయమని యిదివరకే విశదం చేశాను. శృంగారం ఆధారంగా ఆనందమేగాక ఉదాత్త భావోన్మిలనం వీరత్వతేజశ్శాలిత్వాదులమీద అనురక్తీ వాటివల్ల కలిగే లోకాభ్యుదయానికి అనుకూలమైన కల్యాణగుణాభిరతీ ఆనుషంగిక ఫలాలుగా సిద్ధించినప్పుడే అది గ్రాహ్యమని. పరిణత నాయకులందే ఆదశ సిద్ధిస్తున్నదని చెప్పినాను. ప్రకృతానికి వస్తాను.

సాధారణుల జానపదుల ధర్మసంబంధిగాని కామప్రేమ ఈతీరుగా ఉదాత్తప్రేమవలె ముఖ్యమైనది గాదు. అయితే అమాయికులయిన ప్రాకృతులప్రేమ కొంతవరకు మనోహరంగానే వుంటుంది. కనుకనే భారతీయులు దీనిని వదలక కావ్యంలో అప్రధానంగానైనా స్వీకరించాను. అంటే అంగంగా స్వీకరించి మధ్యమధ్యసందర్భంవచ్చినచోట ప్రస్తావిస్తూ వచ్చారు. అమాయికులైన సాధారణుల ముగ్ధప్రేమ మనోహరంగానే వుంటుందని, కనుకనే భారతీయులు దీన్ని కావ్యంలో అంగంగా గ్రహిస్తూ వచ్చారని విశదపరచాను. ఈసాధారణులు నీచులని భారతీయులు తిరస్కరింపలేదు.

"పుష్పాసవాఘూర్ణితనేత్రశోభి
 ప్రియాముఖం కింపురుషశ్చుచంబ" (కుమార)

(ప్రియురాలు పాటలుపాడుతూవుంటే పుష్పాసవంతాగడంవల్ల కైపెక్కిననేత్రాలతో వున్న ప్రియురాలి మొగాన్ని ఆపాటలమధ్యన కింపురుషుడు ముద్దుపెట్టుతున్నాడు)

1. కోశాతకీ పుష్పగుళుచ్ఛకాంతిభి
   ర్ముఖైర్వినిద్రోల్బణబాణచక్షుషః
   గ్రామీణ వధ్వస్తమలక్షితాజనై
   శ్చిరం వృతీనా ముపరి వ్యలోకయన్. (మాఘ)
   
2. పశ్యన్ కృతార్థై పరివిల్లవీజనో
    జనాదినాథం న యయౌవితృష్ణతాం
    ఏకాంతమౌగ్ధ్యా నవబుద్దవిభ్రమ
    ప్రసిద్ధ విస్తార గుణై ర్విలోచనైః (మాఘ)
   
3. స వ్రీహిణాం యావదపాసితుం గతాః
   శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం
   కైదారికాణా మభితః సమాకులాః
   సహాసమాలోకయతి స్మ గోపికాః (మాఘ)

1) వికసించి విపులమైన నల్లగోరంటపూవువంటి కండ్లుగల గ్రామీణవధువులు పొట్లపూలకాంతిగల ముఖాలతో జనులకు కానరాకుండా చాటునవుండి ఆవరణాలమీదుగా కృష్ణుణ్ణి చూశారు. 2. అతివిశాలాలై అత్యంతముగ్దతచేత విలాసా లెరుగని నేత్రాలు సకృద్ధర్శనంచేత కృతార్ధాలైనప్పటికీ ఆనేత్రాలతో కృష్ణుణ్ణి చూసి గోపాంగనాజనం తనియలేదు.

3. శుకాలను వారించబొయ్యేటప్పటికి జింకలు సస్యాన్ని చెడగొట్టుతుండగా వరిపొలాలవద్ద అటు ఇటు తొక్కులాటపడుతున్న గోప స్త్రీలను కృష్ణుడు చూశాడు అని

"వనేచరాణాం వనితాసఖానాం
 దరీగృహోత్సంగ నిషక్తభాసః
 భవంతి యత్రౌషధయో రజన్యాం
 అతైలపూరాః సురతప్రదీపాః" (కుమార)

గుహల్లో వెలుతురుకలుగజేస్తూవుండే ఓషధులు రాత్రుల్లో వనితాసఖులైన వనేచరులకు తైలంలేని సురతప్రదీపా లవుతుంటవి.

"స్త్రీభూషణం చేష్టిత మప్రగల్భం
 చారూణ్యవక్రాణ్యపి వీక్షితాని,
 ఋజాంశ్చ విశ్వాసకృతః స్వభావాన్
 గోపాంగనానాం ముముదే విలోక్య (భట్టి)

"వివృత్తపార్శ్వం రుచిరాంగహారం
 సముద్వహచ్చారు నితంబరమ్యం,
 ఆమంద్రమంథధ్వని దత్తతాళం
 గోపాంగనానృత్య మనందయత్తం " (భట్టి)

(గోపాంగనలయొక్క అప్రగల్భమైన చేష్టితాన్ని స్త్రీలకు భూషణ ప్రాయమైన దాన్ని చూసి రాముడు ఆనందించాడు. అవక్రాలు కాకపోయినప్పటికీ సుందరమైన చూపులను విశ్వాసాన్ని గలిగించే ఆగోపాంగనల ఋజుస్వబావాలను చూచి సంతొషించాడు. వివృత్తపార్శ్వమైనది సుందరమైన అంగహారం గలది పైకిలేస్తూవుండే నితంబంచేత రమ్యమైనది. కవ్వానికి అనుకూలమయిన తాళంగలది, అయిన గొల్లభామల నృత్యం శ్రీరాముణ్ని ఆనందపరచింది.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయంతి నః
 యథా స్వభావసిద్దాని వృత్తాని వనయోషితాం"

(నాగరస్త్రీలవిలాసాలు స్వభావసిద్ధమైన వనవనితలవృత్తాల వలెమమ్ము ఆనందపరచలేవు.) అని

యిట్లాటి అమాయికప్రేమ మనోజ్ఞత్వాన్ని భారతీయులు ఔచిత్యాన్ని పాటించి అనేకవిధాల దర్శించారు. జింకలు తుమ్మెదలు మొదలైన సాధుతిర్యక్కులు సయితం ఈప్రేమమాధుర్య విషయాన భారతీయుల ఉదారదృష్టికి నీఛంగా కనబడలేదు.

"మధు ద్విరేఫః కుసుమైకపాత్రే
 పపౌ ప్రియాం స్వా మనువర్తమానః
 శృంగేణ సంస్పర్శనిమీలితాక్షీం
  మృగీమకండూయత కృష్ణసారః

 దదౌ రసాత్ పంకజరేణుగంధి
 గజాయ గండూషజలం కరేణుః,
 అర్ధోపభుక్తేన బిసేన జాయాం
 సంభావయామాస రథాంగనామా (కుమా)

(తుమ్మెద ప్రియురాలితోగూడా ఒకే పువ్వులో మధువును తాగించి: ఆడజింక స్పర్శసుఖాన కండ్లుమూసుకుంటూ వుండగా మగజింకకొమ్ములతోరాచింది; ఆడయేనుగు పంకజరేణుగంధి అయిన గుండూషజలాన్ని మగయేనుగ కిచ్చింది; చక్రవాకం సగం కొరికిన తామర తూడును ప్రియురాలికి ఆదరంతో యిచ్చింది.)

అని కాళిదాసు యీసాధుతిర్యక్ ప్రకృతిప్రేమను చిత్రించాడు. క్రౌంచద్వంద్వంయొక్క నిరతిశయానందం వాల్మీకికి సంతోషం కలిగించింది గనుకనే దానికి విఘాతంకల్పించిన బోయ ప్రేమద్రోహిగా కనబడ్డాడు.

"అంతస్సంజ్ఞా భవన్త్యేతే సుఖదుఃఖసమన్వితాః" (మను)

(వృక్షాలు అంతస్సంజ్ఞగలవి అయి సుఖదుఃఖసమన్వితాలుగా వున్నవి) అని మనువు ప్రబోధించినట్లు వనప్రకృతిసుఖాదులను కనుగోగలిగిన భారతీయులు అమాయికమైన తరుగుల్మాదులయందు సైతం ఆమనోహరప్రేమ మాధుర్యాన్ని ఆనందానుభూతితో చూడగలిగినారు.

"లతా వధూభ్యస్తరవోప్యవాపుః
 వినమ్రశాఖా భుజబంధనాని"
 
 చెట్లుగూడా లతావధువులవలన వినమ్రశాఖాభుజాశ్లేషాలు పొందినవి (కుమా)

అని మధుమాసంలో ఆ ప్రకృతి వికాసాన్ని కాళిదాసు ప్రసంసించాడు.

ఈతీరుగా ఆర్ధ్రనేర్ద్రాలతో తరులతాదులవాద్ద నుండి ప్రకృతి శిఖరమైన ధర్మనాయకుడివరకూ అనుస్యూతమైన జీవసౌందర్యా విచ్ఛిన్నతను దర్శించి కావ్యప్రస్థానాన్ని ఔచిత్య విలసితంజేసి ఇక అవకాశం లేదోమో ననిపించేటంత మహావికసిత దశను ప్రాపింపజేసిన భారతీయుల విజ్ఞానపరిపాకం అమేయమై వున్నది. కేవలం ముగ్ధప్రకృతిని చిత్రించే ఖండకావ్యాలను సయితం ఋతుసంహారంవంటి వాటిని వెలయించి ఉదాత్తకావ్యాపేక్షచేత వాటికి ఉచితమైన స్ధాన మిచ్చారు. తిర్యగ్జడప్రాకృతుల శృంగారాన్ని కావ్యంలో అప్రధానంగా స్వీకరించిన భారతీయుల భావానికి ఈతీరుగా నేను వ్యాఖ్యజేశాను. అదిగాక చిల్లర మనుషుల్లో పశువుల్లో శృంగారవీరాదుల మహాభావాలు పరిపోషం పొందలేవు అదిమాద్యాంతలన్నీ కొద్దిలోనే సరిపుచ్చుకుంటవి. యేవో నాలుగు మాటలు మాట్లాడి దీపమార్పడంతో అంతవవుతుంది కనుకనే యిట్లాటిరతి రసాభాసమన్నారు.

పూర్వపక్షం

అవునయ్యా:

"స్వకాంతారమణోపాయే కోగురుర్మృగపక్షిణాం"

(స్వకాంతలను ఆనందపరచడంలో మృగపక్షులకు గురువెవరు?) అని కామసూత్రవ్యాఖ్యలో జయమంగళుడి వృద్దవాక్య మన్నట్లు పరస్పరం అనురాగంగల కామినీ కాముకుడూ సమావేశం అయినప్పుడు ఆశృంగారలీలలు అద్భుతంగా వాటంతట అవే ఆవిర్భవిస్తవి. అందుకే ప్రహణనాలను చెప్పుతూ

"ప్రవృత్తే రతిసంయోగే రాగ ఏవాత్రకారణం
 స్వప్నేప్వపి న దృశ్యంతే భావాస్తే తే చ విభ్రమాః
 సురతవ్యవహారేషు యే స్యుః తత్క్షణకల్పితాః" (వా. కా)

సురతవ్యవహారంలో తత్ క్షణకల్పితమై వెలువడే ఆభావాలూ విభ్రమాలూ స్వప్నంలోగూడా కనబడవు. రతిసంయోగం ప్రవృత్త మయ్యేటప్పుడు ప్రేమే ఆభావాలకూ విభ్రమాలకూ కారణం అని వాత్స్యాయను డన్నాడు.

ఇట్లాటి శృంగారలీలలు స్వాభావికమైవుండగా అవి తిర్యక్కులకు మ్లేచ్ఛులకు లేవనడం అనుచితం. వారికి అనుభావాదులు లేవనడం అక్రమం

"తిర్యజ్మ్ల చ్ఛగతోపి వా"

అని సాహిత్య వేత్తలు వాండ్లరతిని ఆభాసమనడానికి వేరే కారణమున్నది. వాండ్లు వారిదృష్టిలోనీచులు. వాండ్లపైన వారికిద్వేషం. అందువల్ల రసాభాసమన్నారు. మ్లేచ్ఛులు ఆర్యులకు పరమశత్రువులుగదా

"న మ్లేచ్చభాషాం శిక్షేత" (శ్రు)

"న మ్లేచ్చితవై" (శ్రు)

అని మ్లేచ్ఛులను ద్వేషించిన ఆర్యులు వారిశృగారాన్ని యెట్లా సహించగలరు? అందువల్ల మ్లేచ్ఛుల రతి రసాభాసమన్నారు అంతేగాని వాస్తవంగా వారికి అనుభావాదులు వికసితం గాకపోవడం వల్లకాదు. అని అంటారా?

సిద్ధాంతం

చెప్పుతున్నాను; వాండ్లకూ శృంగారలీలలు వుండవచ్చును. శృంగారలీలలు మీరన్నట్లు వున్నవనే వొప్పుకుందాము. అంతమాత్రాన ఆశృంగారం ఉపాదేయంగా దని అది పరిణతనాయకనిష్ఠమైనప్పుడు ఆనందమేగాక ఉదాత్తభావోన్మీలనాదిరూపమైన ఆనుషంగికఫల ప్రాప్తి కలుగుతున్న దని వివరించాను అసలింతకూ పశువుల్లో నీచుల్లో అనుభావాదిసామగ్రి వికసితంగాదు. రసాభావనిరూపణం ఆర్యులు, మ్లేచ్ఛులమీదికోపంవల్ల చేసిందికాదు. పరిణతులు ధర్మరక్షకత్వ ధర్మపరతంత్రత్వాలతో వెలసే బ్రాహ్మణులు కావచ్చును. వైశ్యులు కావచ్చును. శూద్రులు కావచ్చును. ఆర్యేతరులు కావచ్చును. దుష్యంతుడు క్షత్రియుడు మేఘదూతలో యక్షుడు బ్రాహ్మణుడుగాడు ఆర్యుడుగాడు. కుమారసంభవంలో పరమేశ్వరుడికి కులమే లేదు "వపు ర్విరూపాక్ష్య మలక్ష్యజన్మతా"

అని కాళీదాసీ అంశం ప్రస్తావిస్తాడు. కనుక ఆర్యులు అభినివేశంవల్ల చెప్పినా రనడం అక్రమం.

"తిర్యజ్మ్లే చ్ఛగతోపి వా"

అన్నప్పుడు మ్లేచ్ఛశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు. జగన్నాధపండితరాయలవంటివాడు

"యవనీ నవనీతకోమలాంగీ
 శయనీయే యది లభ్యతే కదాచిత
"అవనీతల మేవ సాధు మన్యే
 న వనీ మాఘవనీ విలాసహేతు:"

అని మ్లేచ్ఛస్త్రీరతిని శ్లాఘించాడు. ఆశబ్దం నీచత్వద్యోతకంగాని కులవాచిగాదు కనుకనే సాహిత్యదర్పణకారుడు

"అధమపాత్ర తిర్యగాదిగతే"

అని మ్లేచ్ఛశబ్దంచేత ఉద్దిష్టమైన అర్థాన్ని వ్యాఖ్యాతుల్యంగా వివరించాడు. మ్లేచ్ఛశబ్దం అధమత్వద్యోతకంగాని కులవాచిగాదు. అధములైన చిల్లరమనుష్యులకంటె ధర్మసంబంధంగల పరిణతులు కావ్యశృంగారానికి యెక్కువ వుచితులని జనప్రకృతి మనోజ్ఞత్వం సాధారణుల ప్రేమమౌగ్ధ్యం భారతీయకావ్యాల్లో అంగంగావుండి ఔచిత్యవిలసితా లవుతున్నవని సాహిత్యవేత్తల అభిప్రాయం. దీన్ని నిరూపించాను. పరిణతిలేని చిల్లరమనుషులు బ్రాహ్మణులైనా గూడా వారు అధములే నని వారిశృంగారం సాహిత్యజిజ్ఞాసల్లో రసాభాసనామాన్నే పొందుతున్నదని అంటున్నాను. చిల్లరబ్రాహ్మణులు తక్కిన చిల్లర మనుషుల శృంగారం వారికి భారతీయసంస్కారం లేని చిల్లరమనుష్యులకూ యింపుగానేవుంటే వుండవచ్చును గాని అది పరిణతబుద్ధులైన సాహిత్య వేత్తల జిజ్ఞాసల్లో రసాభాససంజ్ఞనే పొందుతున్నదంటున్నాను. మానవప్రకృతిలో శృంగారం కామసంబంధి. ఇది ధర్మంమీద నిల్వక పోయెనా విషయలోలత్వం యెదుర్కొనడంసహజం. ఇక వేరే మధ్య మార్గంలేదు. ఇక మధ్యమర్గం పరిపోషంలేక సాధారణ విషయలోలత్వపర్యవసాయి అయినప్పటిది ఇది కావ్యానికి అర్హమైంది గాదు. కామంవల్ల శ్రేయోవిఘాతం క్షోభం విదితమే అయివున్నవి. శృంగారం మిక్కిలి సునిశితమైన దని అది ప్రాకృతులచేతిలోదుర్వినియోగపడడానికి ఉన్ముఖమై వుంటుందని కనుకనే శృంగారనాయకుడికి అనురక్తలోకత్వలోకో త్తరగుణోత్తరత్వాదులు అవశ్యకమని అన్న బారతీయసాహిత్యవేత్తల మాటలో అఖండసత్యం గర్భితమైవున్నదని వ్యాఖ్య ఛేశాను. వీరరౌద్రాద్భుతశాంతాలకు గూడా ఉత్తమనాయకు డవసరమన్న సాహిత్యవేత్తల అభిప్రాయాన్ని వివరించడం అప్రసక్తం. దాన్ని నాటకాధికరణంలో పూర్తిగా వ్యాఖ్యచేశాను. కనుక ఇక్కడ వదలుతున్నాను. కరుణహాస్యభయానక భీభత్సాలకు ఈతీరుగా లోకోత్తరగుణోత్తరనాయకులు ఆవశ్యకులుకారు. యెంతటిక్రూరుడైనా క్లేశాలపాలయితే అప్రయత్నంగానే అయ్యోపాపమంటాము. యెంతటి దుష్టుడైనా చచ్చాడని వినగానే అయ్యో అని విచారం తెలుపుతాము. రావణుడివంటితుచ్ఛుణ్ని అనేకమైన ఆపదలకు కారణమైన వాణ్ని, రాముడు చంపేదాకా ఉత్సాహవంతుడైదీక్షతో వున్నాడు గాని చనిపోగానే విభీషణుడు

"శోకవేగపరీతాత్మా విలలాప విభీషణః" (వా. రా)

అని దు:ఖపడ్డట్లు వాల్మీకి ప్రాణిసాధారణస్వభావాన్ని చిత్రిస్తున్నాడు. దుష్టులవిపత్తే యిట్లా జాలిపుట్టిస్తే యిక సాధారణుల విపత్తు జాలిపుట్టిస్తుందని చెప్పవలసిన పనిలేదు. కనుకనే యెంకిపాటల్లోని

"దూరాన నారాజు కేరాయిడౌనో
 ఈ రోజు నారాత లేరాలపాలో
 సీమసిటు కనగానె సెదరిపోతదిమనసు
 కాకమ్మ సేతైన కబురంపడారాజు
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 కళ్లకేటో మబ్బు
 గమ్మిన ట్లుంటాది
 నిదరల్లె నావొల్లు నీరసిస్తున్నాది
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 ఆవు లంబాయంట అడలిపోతుండావి
 గుండెల్లొ వుండుండి గుబులుబిగులౌతాది
 దూరాన నారాజు కేరాయిడౌనొ
 తులిసెమ్మ వొరిగింది తొలిపూస పెరిగింది
 మనసులొ నాబొమ్మ మసకమసకేసింది
 దూరాన నారాజు కేరాయిడౌనొ (యెంకిపాటలు)

"ఏగుడికి పోయినా హీనజాతంటారు
 ఈశ్వరుడి కేజాలిరాదే చంద్రమ్మ
 యెంతపాపం జెసినానే చంద్రమ్మ
 యెండకొండాలేక నిండు సీకటిలేక

 ముండ్లలో నేడబోతావే చంద్రమ్మ
 ముందు గోదావరున్నాదే చంద్రమ్మ

 గోవింద యని నీవు గోదావరిలోబడి
 దేవతల్లో గలిసి నావా చంద్రమ్మ
 నే నింక బతికెవున్నానా చంద్రమ్మ
                                 (యెంకయ్య చంద్రమ్మపాట)

అనేమాటలు జాలిపుట్టిస్తున్నవి

"గోవుమా లచ్చిమికి కోటిదంణాలు
 మనిసికైనాలేని మంచిపోకిళ్లూ
 యెంకితోకూకుండి యింతసెపుతుంటే
 తనతోటి మనిసల్లె తలతిప్పుతాది
 గోవుమాలచ్చిమికి కోటిదణ్నాలు

అనేమాటలు అమాయిక తిర్యక్ప్రకృతిని గురించినవి బావావున్నవి. ఈకరుణాదులకుగూడా కొంతవరకైనా పరిణతిగల నాయకులున్నప్పుడు పరిణతభావోన్మీలనానికి కవికి అవకాశం యేర్పడుతుంది లేదా యెంకి పాటల్లోవలె యెంకయ్య చంద్రమ్మపాటలోవలె మామూలు యేడ్పే మామూలు తలపులే వ్యక్తమవుతవి. కరుణాదులకు ఉత్తమనాయకుల ఆవశ్యకతలేదు గనకనే లొకోత్తరగుణోత్తరనాయకులు లేకున్నా పాశ్చాత్యుల ట్రేజడీలనే కరుణభయానక భీభత్స విశిష్టమైన రూపకాలు శ్రోతవ్యంగా ద్రష్టవ్యంగా వుంటున్నవి. ఈచర్చ యింత కెక్కువ అప్రస్తుతం గనుక చాలిస్తున్నాను. ఉత్తమశృంగారానికి ఉత్తమనాయకులు ఆవశ్యకమని నిరూపించాను.

అని శ్రీ ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో శృంగారాధికరణం సమాప్తం.