నేటి కాలపు కవిత్వం/వ్యతిక్రమాధికరణం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

వ్యతిక్రమాధికరణం.

వ్యతిక్రమం.

ఛందోవ్యతిక్రమం. భాషావ్యత్రిక్రమం అనే దోషా లీకృతుల్లో కనబడుతున్నవి. వీటిని వివరిస్తాను. సంస్కృతంనుండి తర్జుమాతో ఆరబ్దమైన ఆంధ్రగ్రంధపఠనంలో సంస్కృతం ప్రవేశించడం సంభవమే గనుకను, అదిగాక ఆంధ్రులభాష సంస్కృతంతో మిళితమై వున్నది గనుకను, సంస్కృతం ఆంధ్రులకృతుల్లో కనబడడం స్వభావవిరుద్ధం గాదు. తెలుగు సంస్కృతంతో మిళితమైన భాష గనుక తర్జుమా చేసేటప్పుడు మూలగ్రంథకారుడి అభిప్రాయం యథాస్థితంగా వచ్చేటట్లు పద్యంలో వ్రాయడానికి ఒక్కొకచోటసంస్కృతం వాడడం వుచితంగానే వుండవచ్చును. యెందుకంటారా? పద్యానికిగల నియతస్థలంలో నియతగతిలో ఆమాట లక్కడ యిమిడి ప్రసన్నంగా వుండడం ఒక్కొక్కప్పుడు సంభవిస్తుంది. అయితే ఆంధ్రులభాష ప్రధానంగా తెలుగు. తెలుగుభాషాతత్వానికి విరుద్ధంగాకుండా వుండేమటుకే సంస్కృతం తెలుగులో యిముడుతుందిగాని తక్కినది యిమడని పదార్ధంగానే అసంబద్దంగానే వుంటుంది. తెలుగుభాషయొక్క తత్వం సాధారణంగా వ్యప్తపదత్వం పదాలు రెండు మూడు, అంతగా యెక్కువైతే నాలుగుకంటె యెక్కువ సాధారణంగా చేరవు. అవి సయితం సంస్కృతంలో వలెవిభక్తిలోపంతో దగ్గరికిచేరి బిగిసినవికావు. తెలుగులో దగ్గరగా చేరేపదాలన్నీ చాలామటుకు వ్యప్తపదాలే అయివున్నవి. సంస్కృతంలో సయితం వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసుడు మొదలైనవారి కావ్యాల్లో మూడు నాలుగు అయిదుమాటలకంటె యెక్కువగా చేరిన ఈగుంపులు అరుదుగా కానవస్తవి. అయితే విభక్తిలోపంతో యెన్నిమాటలైనా చేరి యేకంగా బిగియడానికి అవకాశం వుడడంచేత

"రుధిరకుతూహలి కేసరికిశోరలిహ్యమానకఠోరధాతకీస్తబకే'

(హర్ష)


అని "సమరకండూలనిబిడభుజదండకుండలీకృతకోదండిశింజినీ
       టంకారోజ్జాగరితవైరి నగర" (సాహిత్య ఉ)

అని యిట్లా సంస్కృతగ్రంథాల్లో రచిస్తూవచ్చారు. ఇట్లాటిపదసమూహాలు తెలుగుభాషకు విరుధ్దమైనవి. సంస్కృతం తెలుగుభాషాతత్వాన్ని అనుసరించి యిమిడేటంతవరకే వుచితంగా వుంటుంది గాని తక్కినది యిమడని అసంబద్దపదార్ధంగా వుంటుందని యిదివరకే తెలిపినాను. కనుక సాధారణంగా మూడునాలుగు అంతగా అయితే అయిదు మాటలకంటె యెక్కువైన సంస్కృతశబ్దాల చేరికలు తెలుగులో యిమడక అసంబద్ధమై హేయమవుతున్నవి. ఇదే భాషావ్వతిక్రమం. ఇది భారతంలో ఆరబ్ధమైంది. దీనిని గురించి విపులంగా ప్రధమఖండలో నన్నయాధికరణంలో వివరించాను గనుక యిక్కడ విస్తరభీతిచేత వదలుతున్నాను.

ప్రథమఖండంలో వుదాహరించిన వాటినుండి కొన్ని ఉదాహరణాల నిక్కడ చూపుతున్నాను.

"హరిహరా జగజానననార్క షడాస్యమాతృసరస్వతీ
 గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి" (భా. స. ఆ)

"ఘోరసం, సారవికారసంతమస జాలవిజృంభముబాపి" (భా. న. ఆ)

"మనో హర సుచరిత్ర పావనపయః పరిపూర్ణములైన"

(భా. న.ఆ)



"మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం

పదలోలిన్" (భా. న.ఆ)

"పరమవివేకసౌరభవిభాసితసద్గుణపుంజవారిజో
 త్కరరుచిరంబులై" (భా. వ.ఆ)

"శశ్వదుపవాస మహావ్రతశీతపీడితా, చలమునిసౌఖ్యహేతు
 విలసత్ బడబాగ్ని శిఖాచయంబులన్" (భా. న. ఆ)

"దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకప్రతాపస్ఫుర
 ద్గర్వాంధప్రతివీరనిర్మధన విద్యాపారగుల్." (భా. తి. వి.)

అని యిట్లా యీహేయమైన భాషావ్యతిక్రమం ఆరబ్దంకాగా
    
"అఖండ శశిమండలకుండలితకుసుమకోదండ కాండాసనహిండిత
 కరకుముదకాండ తాండవితపరాగమండలంబున"

అనే రీతి వసుచరిత్రాదుల్లో పెరిగి భాషకు వైరూప్యమాపాదించినవి ఈభాషావ్యతిక్రమం ఉపాదేయఫలాన్ని సాధిస్తే అంగీకరించ వచ్చును. గాని పులుముడు మొదలైనదోషాలనే ప్రతిపాదించడంవల్ల త్యాజ్యమంటున్నాను. ఈభాషావ్యతిక్రమంవల్ల కలిగిన అనర్ధాలు ఆంధ్రుల భాషాసంస్కారాలు పొందిన వైరూప్యం, క్షయా, ప్రధమఖండంలో తెలిపినాను ఈభాషావ్యతిక్రమం నేటికాలపుకృతుల్లో తరుచుగా కనబడుతూనే వున్నది.

"శారదశర్వరీమధుర చంద్రిక సూర్యసుతాస్రవంతికా
 చారు వినీల వీచికప్రశాంత నిశాపవనోర్మిమాలికా
 చారిత నీపశాఖినికృశాంగి" (కృష్ణపక్షం)

"నిజమాయావశీకృత సకల దేవ దానవ యక్ష గరుడ గంధర్వ
 విద్యాధరాదిసముదయుండై"
 (జనమంచి శేషాద్రిశర్మ విచిత్ర ఫాదుకాపట్టాభిషేకం)

"......శేఫాలికామాధవీ
 రేఖామంజులవాసనాలహరి పర్వెన్‌ప్రాతరానీతశో
 ఖాఖద్యోతవిలాసరాగలలితప్రంశుప్రభన్"

(భారతి అనార్కళి, విశ్వనాథ సత్యనారాయణ)



"పారావార ధరాధరోన్నతతరు వ్రాతాపగాఘోరకాం
 తారాకారములాసమస్తవనత్వప్రస్ఫుటన్మూర్తులా"

(భోగరాజు నారాయణమూర్తి, భారతి సం.4. సం.2)



"అక్షమాలికాదండకమండలు పుస్తకన్యస్తహస్తపం కేరుహుండును"

(మాతృమందిరము వేంకటపార్వతీశ్వరకవులు)



"సూనఫలభరిత తరుయుత కాననవల్లీమతల్లికా
 వాసకిరాతానీక నేతయై"

(కావ్యకుసుమావళి



"ఖలు డాత్మీయమహాట్టహాసనిబిడోగ్రద్వాన సమ్మూర్చితా
 బిలభూతప్రకరుండులోకభయదాక్షీణస్పులింగచ్చటా
 కులవీక్షాపరిభూతభీతక్రతుభుగ్వ్యాహుండు"

(కేసిరాజు వేంకటసుబ్బారాయకవి)



"నిఖిలరాజన్యమౌళికిరీటరత్న దినకరప్రభానీరాజిత
 నిజపాద పద్ముండును."

(తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"సుగుణప్రాభవచంద్రికాంచితయశః శోభాయమానాంగికిన్"

తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"ధరహాసామృతవీచికాపునరుదాత్తస్వాంతరంగ
 ప్రియోత్తరమున్" (సి.యస్. జయరావు పుష్పమాల. 1-3)

"లలితగ్రాసకిసాలచర్వణ సముల్లాసక్రియాజాతగం
 ధిలడిండీరకణచ్యుతిన్"

"చంచద్గరుద్భిన్న నిర్మలవీచీమృదుడోలికా
 పరినటద్రా జీవపత్రంబుగన్"

(దువ్వూరి రామిరెడ్డి. వనకుమారి.)



"ఆశ్చర్యకృద్బహుళోద్గ్రంథనిబంధన ప్రచురితప్రాపంచికైశ్వర్య
 ధూర్వహులైనట్టి"
(పం. రామచంద్రరావు, జీవితాదర్శం -- భారతి)

"విశ్వమోహన సుధాంశునిసర్గమనోజ్ఞచంద్రికాస్పదమగు"
(ప్రణయరాధిక. శ్రీశేషాద్రిరమణకవులు." భారతి)

అని యీతీరున హేయమైన భాషావ్యతిక్రమం కనబడుతున్నది.అయితే యిట్లా అసంబద్ధవు సంస్కృతం కుక్కుతున్నారే గాని దాని వెంటనే సంస్కృతభాషానభిజ్ఞత సయితం కనబడుతున్నది. వ్యాకరణం యింకా స్ఫుటంగా యేర్పడని తెలుగువంటి జీవద్భాషలకు శిష్ఠలోకమే ప్రమాణమైనా. సంస్కృతం వంటి అప్రవాహిభాషల విషయంలో శిష్టలోకవ్యవహారాన్ని ప్రసాదించే పాణిన్యాదుల తంత్రాలను గాని వాటి సంగ్రహాలనుగాని దర్శించక వాటిస్వరూపం గోచరించదు. అట్లా గోచరించనిదశలో సంస్కృతం వ్రాయడం మొదలు పెట్టితే వుజ్జాయింపు చూపి వ్రాయవలసివస్తుంది. ఆవుజ్జాయింపులో శబ్దరూప వినాశం అర్ధవినాశం సంభవిస్తున్నవి. ఇట్లాటివ్రాతలకు హేతువైనదాన్నే భాషానభిజ్ఞత అని నేనంటున్నాను. దీన్నిగురించి పరిశిష్ట ద్వితీయాధ్యాయంలో మరికొంత వివరిస్తాను. మనదేశంలో నేటికాలపు కృతుల్లో భారతీయ సంస్కారం నశించి జీవంబోయి శరీరం మిగిలినట్లుగా ఈవుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతంమాత్రం మిగిలింది. నేటికాలపుకృతుల్లో భాషానభిజ్ఞత తరుచుగా కనబడుతున్నదన్నాను.

"వెలదీ యెవ్వతెవు నీప విటపీవనీలోన్" (కృష్ణపక్షం)
"వెదకెదు ఎవ్వతెవు నీప విటపీవనిలోన్" ..
"ఉపాధ్యాయిని" (సుజాత సం. 1. స. 3. కృష్ణపక్షం)
"ధనదారాపుత్ర" (వా.గోపాలకృష్ణయ్య. విద్యార్థిపత్రిక.1-1)
"మనోకేతకి" (భ.రాజేశ్వరరావు ప్రణయగీతములు-భారతి)
"తపోశక్తి...జిజ్ఞాసత్వము, తపోసంపత్తి"
            (వి.యన్.శర్మ.అవతారమూర్తులు.ఆంధ్రభారతి సం.1. సం.5.)
"అనుమానావతారముగఁ బరిగణింపబడెను”
            (సుసర్లఅనంతరావు, బేకనుపన్యాసములు.)
"పరిమళముల్ చెలంగఁగశుభస్కరమౌతను వల్లి యొప్ప"
          జ. శేషాద్రిశర్మ. విచిత్రపాదుకాపట్టాభిషేకం)
"మీయంగీకారము నాకపార సహాయము జేసెను"
           (జనమంచి శేషాద్రిశర్మ. విచిత్రపాదుకాపట్టాభిషేకం.)
"మత్పితృప్రతిష్ఠాపిత శైవలింగము గడంక భజించెదనాత్మవా రణాసీ పురి నేతభృంగిరిటశిష్యుని."
        (విశ్వనాథ సత్యనారాయణ, భారతి, ఆనార్కళి, సం.3. స. 3.)
"స్త్రీలే యుపాధ్యాయినులుగా, ఉపాధ్యాయినులు, ప్రబంధప్రణీ తృపంధను."
        (రావుబహదూరు కందుకూరు వీరేశలింగముపంతులు. స్వీయచరిత్రము II, 305, 292, 152)
"కొందరేపటిమయులేక బిరుదపద్దతిగొండ్రుయశోద్ధతిన్ గనన్"
            (భోగరాజు.నారాయణమూర్తి, భారతి,సం.4.సం.2.)
"వాల్గంటుల సత్సహాయములె కావలయుంగద పూరుషాళికిన్"
            (కావ్యకుసుమావళి 1. వేంకటపార్వతీశ్వరకవులు).
"శిరోపాళిన్"(ఆంధ్రభారతి, 1-6,పసుమర్తి, అనంతపద్మ నాభము)
"దారాపుత్రాభిమానులు భక్తిరసప్రాధాన్యత, నరసిహ్మావతారము"
            (ఎ.వి. నరసింహంపంతులు, శ్రీ గీతగోవిందము)
"అనుచున్ శంకరుడాభిడౌజముఖ......"
            (కేసిరాజు. వేంకటసుబ్బరాయకవి.)

        
 "వేంకటసుబ్బరాయ ప్రణీతంబైన యేకాదశీ మహిమా సర్వస్వము"
             (కేసిరాజు వేంకటసుబ్బారాయ కవి.)
"మనో చ్ఛేదవృత్తి, తపోక్తల్ దాల్ప
          (రాయప్రోలు సుబ్బారావు. 1 స్నేహలత. 2 సుజాత సం.1.సం.4)
"మగుడన్ స్వచ్ఛేతరాంగికిని ప్రేమాపుష్పసద్భంగికిన్"
          (తేకుమళ్ల రాజగోపాలరావు, కనకవల్లి.)
"మునివృత్తిచాలించి శ్రీశైలపర్వతమువెడలి"
          (తేకుమళ్ల.రాజగోపాలరావు. కనకవల్లి.)
"సంభరమున్‌జూపి తదైక్యతాగతి”
           (సి. యస్. జయరావు, పుష్పమాల.1-3)
"మత్స్యిభంగి" (జానపాటి పట్టాభిరామశాస్త్రి. నాగరఖండము 6.ఆ.)
"తటిల్ల తా జనితకళా సహాయమున"
"ప్రేమామహితాంతరీపముమై సొగియన్
విహరించుచిట్లనున్" (వనకుమారి, దువ్వూరిరామ రెడ్డి.)
"దేశక్షేమ దరిద్రతాయయమనోద్వేగక్షుధాబాధలున్"
          (జీవితాదర్శము, పం, రామచంద్రరావు)
"దారాపుత్రదురీషణావృతదురంతక్రూరసంతాపచింతారంగస్థలి."
          (కవిజిజ్ఞాస శ్రీ శేషాద్రిరమణకవులు)

అని యిట్లాటి వుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతం నేటి కాలపుకృతుల్లో తరుచుగా గోచరిస్తున్నది. విటపివని, ఉపాధ్యాయి, ఉపాధ్యాయ, ఉపాధ్యాయాని, దారపుత్ర, మనఃకేతకి, తపశ్శక్తి, జిజ్ఞాస, జిజ్ఞాసుత్వము, తపస్సంపత్తి, సందేహావతారము, సంశయావతారము, శుభకర, శుభంకర. అపారసాహాయ్యము, వారాణసీ, వారణసి, ఉపాధ్యాయలు, ఉపాధ్యాయానులు, ప్రబంధప్రణీతృపథమును, యశుద్ధతి, సత్సాహాయములు, శిరఃపాళీ, దారపుత్ర, ప్రాధాన్యము. నరసింహావతారము, బిడౌజోముఖ, మహిమ సర్వస్వము, మనఉచ్ఛేదము, మనశ్ఛేదము, తపఉక్తుల్. ప్రేమపుష్ప, శ్రీశైలము, శ్రీపర్వతము, ఐక్యగతి, మత్సిభంగి, కళాసాహాయ్యమున, ప్రేమమహితాంతరీపమున దారపుత్ర, మనఉద్వేగ అని వుండవలెను. ఇంకా శిరచ్ఛేదం. ప్రభ్విణి, సరోజని మొదలైనవెన్నో అనేక గ్రంథాల్లో పత్రికల్లో వున్నవికాని విస్తరభీతిచేత వాటిని ఉదాహరించక వదలుతున్నాను. ఇక తెలుగులో అరసున్నలు గజడదబలు గసడదవలు, మొదలైనవికారాలు వెనకటివలెనే వున్నవి. పాతబడ్డ తుప్పుమాటలు మూలగొట్టుమాటలు మాత్రం లేక భాషయిప్పటికృతుల్లో ప్రసన్నత్వానికి వచ్చింది. ఈదశ శ్రీనాథాదుల కృతుల్లో. కృష్ణకర్ణామృతం, భర్తృహరిత్రిశతి, వేమనశతకం మొదలైన వాట్లో వున్నాయిప్పుడు సాధారణమైంది. ఇది సంతోషహేతువేగాని. పులుముడుమొదలైన దోషాలకాకరం కావడంవల్ల అది అచరితార్థమవుతున్నది.

ఛందోవ్యతిక్రమం.

గుర్వంతపాదాలూ, గుర్వక్షరబహుళాలూ, అయినా శార్దూలం మత్తేభం మొదలైన సంస్కృతవృత్తాలు తెలుగుభాషాతత్వాని కెంతమాత్రం అనుకూలమైనవి గావు. వీట్లో తెలుగుపద్యాలు వ్రాయడం ఛందోవ్యతిక్రమ మవుతున్నది. ఈఛందోవ్యతిక్రమమే భాషావ్యతిక్రమానికి హేతువు. ఛందోవ్యతిక్రమం భాషావ్యతిక్రమాన్ని భాషావ్యతిక్రమం ఛందోవ్యతిక్రమాన్ని పరస్పరం పెంచుకుంటూ వుండగా ఈ రెండూకలిసి తెలుగుభాషను ఛందస్సును వికృతంజేసి తద్వారా విజ్ఞానవికాసానికి అడ్డుపడుతూ ఆంధ్ర జాతిని వంచిస్తున్నది. భారతంలో యీ వ్యతిక్రమ మారంభమైనప్పటినుండి అడుగడుక్కూ వక్ష్యమాణాధికపదదోషంచేత దూషితమైన దీర్ఘవృత్తాలుశరణమై క్లుప్తంగా వ్యంగ్యవిభుత్వంతో రచించే ఉత్తమకవితామార్గానికి అంధులమై మనకు పద్యం వ్రాయడమే కవిత్వమయింది. ఇప్పటికి పద్యం వ్రాయడమే మనకు కవిత్వంగా వున్నది. గీతం, ద్విపద, రగడ, ఉత్కళిక మొదలైన వాటిని కొందరు వాడుతున్నా సంస్కృతవృత్తాల నింకా వదలలేదు. సంస్కృతంలో మందాక్రాంత, శార్దూలంవంటి వృత్తాల్లోనే కవితాశిల్పానికి భావం కొంత దీర్ఘంగా కనబడుతుంది.

మన సీసపద్యపు నాలుగుపాదాలమటుకే మందాక్రాంతకుగాని శార్దూలానికిగానిసరిపోతవి ఇంకా సీసానికి గీతపాదాలు నాలుగుతగిలిస్తే భావం మిక్కిలి దీర్ఘమై అప్పుడు కవిత్వచ్ఛాయపోయి ఉపన్యాసధోరణిలోకి దిగుతుంది. ఒక్కొక్కప్పుడు పద్యమెక్కువై దండగమాటలు నింపవలసి వస్తున్నది. శార్దూలాదివృత్తాలతో నిండివున్న మన తెలుగుకృతుల్లో ఛందోవ్యతిక్రమం వుదాహరించడం అనావశ్యకం గనుక ఉదాహరణాలను చూపక వదలుతున్నాను.

యతిభంగం.

యతి అంటే విచ్చేదం. సీసంవంటి దీర్ఘపద్యపుపాదాల్లో శ్రోతకు శ్రవణసుఖాన్ని పఠయితకు యత్నసుఖాన్ని యతి ఆపాదించి పద్యం యొక్క శ్రావ్యతకు సుగ్రహతకు మిక్కిలి తోడ్పడుతున్నది. ఈసంగతి సీసం, శార్దూలం, మందాక్రాంత మొదలైనవాటిని పఠించి కనుక్కోవచ్చును. కనుకనే ఉచితస్థలాల్లో యతిని ఉపదేశించిన భారతీయచ్ఛందోవేత్తలు పద్యరమ్యతను ప్రతిష్ఠించారంటున్నాను.

ఇట్లాటి నియమంనుండి తెలుగుపద్యం భారతంలోనే చ్యుతమై యిప్పటికీ నియమహీనంగానే వుంటున్నది.

"త్రేతాద్వాపరసంధినుద్ధతమదాంధీభూతవిద్వేషిజీ,
 మూతవ్రాత " (భా-ఆ.)

భారతంలో ఆరంభించిన యతిభంగ దోషం యిట్లా నేటికీ దూరంగాక తెలుగుపద్యాన్ని వికృతంచేస్తున్నది.

పాదభంగం.

వృత్తాన్ని పదచ్ఛేదయుతమైన పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదం ఒక్కొక్క భాగంగా పింగళాదు లేర్పరచడంలో, పద్యంయొక్క గతివిశేషం, అర్థప్రదత్వం. శ్రావ్యత్వం మొదలైనగుణాలు పుష్టమవుతున్నవి. కనుకనే పాదాంతయతి నియతంగా భారతీయచ్ఛందోవేత్తలు పరిగణించారు. కాని యీపాదసౌందర్యం నన్న యభారతంలోనే లుప్తమైంది.

"విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండుకృ
 ష్ణద్వైపాయను డేగుదెంచె" (స.భా)

"విద్యుద్దండము నిల్చి పొల్చినగతి న్విల్లందమైయుండ న
 స్మద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింపదృ
 ష్టద్యుమ్నుoడు." (తి. భా)

అని యిట్లా భారతంలో ఆరబ్దమైన పాదభంగం.

               
"నాదేశంబున వేరుపాతుకొనె సంఘప్రస్పుటాచారర
 క్షాదీక్షాపరతంత్రబుద్ధిలత" (జీవితాదర్శం).
"రేఖామంజుల వాసనాలహరి పర్వెన్ ప్రాతరానీతశో
 భాఖద్యోత విలాసరాగలలితప్రాంశు"
                                      (అనార్కాళి. భారతి)
 

అని యిట్లా యిప్పటికీ గోచరిస్తున్నది. పద్యాలు పాదసౌందర్య హీనమైనవి. కొన్ని పొడుగైన వొంటికాలిమనిషివలె చాంతాడువంటి పొడుగైనఒక్క పాదంతో వున్నవి. ఇట్లా పాదభంగంచేత పాదసౌందర్యం లుప్తమయి పద్యం వికృతమైంది.

వళిప్రాసల అనర్థాలు.

వళిప్రాసలు శబ్దాలంకారాలకు చేరిన అస్థిరధర్మాలు. ఇవి పద్యానికి అవశ్యకంగావు. వీటిని నన్నయాధికరణంలో వివరించాను. వీటిని ఆవశ్యకనియమంగా స్వీకరించినప్పుడివి పద్యానికి పనికిమాలినవే గాకుండా అనర్ధహేతువులుగూడా అవుతున్నవి. యతిభంగం పాదభంగం అనేకస్థలాల్లో యీవళిప్రాసలవల్లనే సంభవించి దండగ్గణం. భూమిగణం, గుంపుగణం, ప్రకాశగణం, సంబోధనగణం అధికవిశేషణగణం ఆపతితమై పద్యం భ్రష్టమైంది. యతిభంగ పాదభంగా లిదివరకే వివరించాను.

గొనకొని. పన్నుగ, మానుగ, ఓలి, ఒగి, మదినెంచ, మతినూహించ మొదలైనవి దండగణం. అవలి, సమూహం, నికరం, పిండు. తతి, వ్రాతం మొదలైనవి గుంపుగణం. యెసగు, యెసకమెసగు, చెన్నలరారు, చెన్నుమీరు, విలసిల్లు, రాజిల్లు, విలసత్, రాజత్, భ్రాజత్, లసత్, ఉజ్వలత్ మొదలైనవి ప్రకాశగణం, ఇలన్, ఇమ్మహిన్. ఇద్దరన్, అవనిన్, మొదలైనవి భూమిగణం. అనఘా. ఇద్దతేజ మొదలైనవి సంబోధనగణం. ఉద్యత్, ప్రోద్యత్, అతుల, అమలిన, అనుపమ, సార. స్ఫార, అమల మొదలైనవి అధికవిశేషణగణం. వక్ష్యమాణమైన శబ్దవాచ్యతాదోషం సయితం యీ అధికవిశేషణగణంలో చేరుతున్నది. ఈ గణాలు కొన్నిచోట్ల ఛందోవ్యతిక్రమంవల్ల కొన్ని చోట్ల వళిప్రాసల నిర్బద్ధమె పాదం పూర్తిగాక, వళిప్రాసలు పైనబడవలసివుండి, అటునాలుగు యిటునాలుగు అధికవిశేషణాలు వేసి వ్యంగ్యసౌందర్యం రూపుమాపి పైగా దండగ్గణం, గుంపుగణం మొదలైన వాటినిదింపి పద్యాన్ని పెంటబుట్టనుచేశాము. ఇట్లా పద్యాలు వ్యంగ్యశూన్యమై పిచ్చిదండగ మాటలతో నిండడంవల్లను. వీటిని సవిచారణగా చదవడం అవసరం గాకపోవడంవల్లను, తెలిసిందిలే అని శబ్దార్థవిచారణలేకుండా దాటవేసికొనిపొయ్యే ధోరణి బుద్ధిలో పాతుకొని పఙ్త్కిమననమంటేఅదెట్లావుంటుందని అడిగేదశకు ఆంధ్రులం వచ్చాము.

1. జననాధ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్.

2. గొనకొని వీడునీకును శకుంతలకుం బ్రియనందనుండు.

3. పెట్టు నీవారాన్న పిండతతులు. (న.భా)

4. వర్జితకుసుమాక్షతావళులు (న.భా. దుష్యంతచరిత్రం)

5. సహకారములం గదళీతతులన్. ,,

6. తనరజనకుండు నన్న ప్రదాత. ,,

7. దుర్మతి కిహముం బరముఁ గలదె మదిఁబరికింపన్. ,,

8. ఇమ్ముగ సరస్వతీతీరమ్మున. ,,

9. దక్షిణ లిమ్ముగనిచ్చి. ,,

10. తగఁగవివాహంబెన్నం, డగునొకొయెన్నండు సంగమావాప్తి యుమా, కగునొకొ యనియెదం గోరుచు, నొగి నిటనుండిరి సుభద్రయును విజయుండున్. (న.భా)

11. మతిననురక్తయయివానిమానుగఁదనకుం, బతింజేసికొనియె..

12. తనునెరిగిన యర్థంబొరు, డనఘా యిది యెట్లు చెప్పుమన...

13. ఇమ్మహిం ద్రయోదశద్వీపమ్ములు దన శౌర్యశక్తి..

14.ఆలునుదాసియున్ సుతుడునన్నవి బాయనిధర్మముల్ మహిన్.."

15. మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల. ,, 16. ధర్మతనూభవు నందునాటిరే, యిమ్ములఁ జల్పి. ,,

17. మతినూహింపనశక్యమైసవనమున్ మర్ధింతు రెందున్.(తి.భా.)

18. అతులోర్వీసురముఖ్యమంత్రహుతమాహాత్మ్యంబునన్. (న:భా)

19. అమల సువర్ణశృంగఖురమై. ,,

20. అమలిన తారకాసముదయంబుల నేన్న ను. ,,

21. నిరుపమ ధర్మమార్గ పరినిష్ఠితు లై . ,,

22. మా. తంగస్ఫూర్జిత యూధదర్శనసముద్యత్ క్రోధమై.(తి.భా.)

23. కాన తగం బొందుట కార్య మియుభయమున్. ,,

యీతీరుగా భారతంలో ఆరబ్దమైన యీదండగమాటలు యెర్రాప్రెగడ హరివంశంలో అంతకంటె అధికంగా విస్తరించినవి ఆముక్తమాల్యద నిండా గుంపుగణం మూలుగుతున్నది. కొన్నిచోట్ల ఒక్కొకపద్యానికే మూడునాలుగు గుంపులున్నవి. ప్రథమాశ్వాసంలో ఒక్క శుకకదంబము అనేపద్యంలో రెండుగుంపులు "తలపక్షచ్చట" అనేపద్యంలో మూడుగుంపులు "నిర్ఘరప్ర" అనేపద్యంలో నాలుగు గుంపులు నిండినవి

1. లలితోద్యానపరంపరా.

2. పెరపురాళి.

3. తలపక్షచ్ఛట గ్రుక్కి బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపఁగం జూచి యారెకులుషః స్నాతప్రయాత ద్విజావలి పిండీకృతశాటులన్ సవి తదావాసంబు చేరంగ రేవులడిగ్గన్ వెసబారువానిం గని నవ్వున్ శాలిగోప్యోఘముల్. 4. వాలుగుమొత్తము.

5. అందుండున్ ద్వయుసద్మపద్మవదనుం డద్వంద్వు డశ్రాంతయో
   గాందూ బద్ధమధుద్విషద్ది బద్ధమధుద్విషద్ద్విరదు డన్వర్థాభిధానుండురు
   చ్ఛందో బృంద...

6. క్రుంకు మెడగుంపులు.

7. భాషితంబులుగాం దోడిబ్రాహ్మణౌఘ.

8. శుకకదంబముగొలుసులచే నిబద్దమై వారాంగనాగారకారబడఁగ
   గిరికానికాయంబు లరిశూన్యబహుపురహర్మ్యవాటికలఁ జెండాడుచుండ
   సురగాలిదవదగ్ధతరుపర్ణతతిరేఁపఁ బావురాలని డేగపదుపుదూరె
   నిద్రితద్రుచ్చాయనిలువకజరుగవెంబడిగనధ్వగపంక్తి పొరలువెట్టె
      
   క్షేత్రరపాలునకుదికినచీరలాఱు
   చాకిరేవు లగములయ్యి సకలదిశలు.

9. గోస్తనీమృదు గుళుచ్ఛస్తోమములతోడ.

10. నాదారని కూరగుంపు.

యీతీరుగా దండగమాటలు రోతలోకిదిగినవి. ఇవి విచిత్ర పాదుకాపట్టాభిషేకంవంటి యీకాలపుకృతుల్లో

     
"ఘనుడు వసిష్ఠమౌని నృపకాంతుని యింట పురోహితుండుగా
 ననిశము మంత్రిగాగఁ జెలువందుచు నుండుట కేమి హేతువో
 యనుపమ సత్కులంబు వెలయన్ జనియించు నటంచు నెంచిచే

కొనియేఁ బురోహితత్వమును గొంకక శ్రీశుని జూచుకోరికన్,"

"ఘోరరణోత్సుకుం గాంచినాడఁ- జూ,"

నిరతము సత్యవాక్కులననె నెమ్మి వచింపుచు శాస్త్రరీతులం

గరము నెఱింగి."
 
"ధరణీపాలక చంద్రుఁడీతఁడు, కృపం దాఁబూని యుర్వీజనో

త్కరమున్, రంజిలంజేయుచున్ జగతి జక్కంగాంచె.

"గనియెడు దృష్టిపాటవము. కన్నన దగ్గెను"
 
"యన్నరో వెన్నకన్నననయంబు మృదుత్వము గాంచుగాన నే

మన్నన గాంచెలోకమున మానిత పండితపొలిచే 'దరస్."
 
వీరకానన సముదయ నీతి: హోత్రు

డానతామర్త్యసముదయుం డట్టి పరశు."

"జనిఫలియించునంచెపుడు స్వాంతమునన్ దలపోయుదానఁజూ"

(జనమంచి శేషాద్రిశర్మకృతి, విచిత్రపాదుకాపట్టాభికే కం).

అని యిట్లావ్యాపించి వికృతరూపం చూపుతున్నవి

"వనరాజిపల్వలం "సపల్వలో త్తీర్ణవరాహ యూధాన్యావాస
 వృక్షోన్ముఖబర్హిణాని" "ప్రసీదశశ్వన్మలయస్థలిషు"

అని ప్రసక్తంగా వుచితమైనచోట్ల యివివుంటే రోతగాదుగాని అయినచోటా కానిచోటా దండగ్గా సమయాన అసమయాన వీటిని గుప్పించడం జుగుప్సకు హేతువగుతున్నది. ఇట్లాటి దండగమాటలు అ ప్రసక్తంగా యెక్కడవున్నా నింద్యమే అవుతున్నవి. అధిక విశేషణగణం తప్ప తక్కినదండగమాటలు కృష్ణకర్ణామృతం, శ్రీనాథాదులకృతులు మొదలైనవాటిలోవలె నేటికాలపు అనేక కృతుల్లో తగ్గడం సంతోషహేతువేగాని వీటి అన్నిటిబదులు అధికవి శేషణగణం ప్రబలింది.

"దివ్యనిర్మలరత్న దీపంబనైపుట్టి,
 లలిత మోహనకలాలాపంబనై పుట్టి"
           (నిర్వేదం. వేంకట పార్వతీశ్వరకవులు.. భారతి)

"ఉద్యద్యశః ప్రాదుర్యాచ్చసుధా" (భారతి)

"ఉరువై సృత్యతమిస్రపుంజ రచనో ద్యుక్తంబులౌ "

"సుస్థిరకాంతి స్థగితంబుగా"
           (పెమ్మరాజు లక్ష్మీపతి. భారతి. 2-9)

"క్రౌర్యకౌటిల్యకలుష పంకంబువలన" (కృష్ణపక్షం.)

"హృదయదళనదారుణ మహోగ్రకార్యంబుదలచిపోవు."(కృష్ణపక్షం)
 
"ఇంపుదళ్కొత్తపాటల సొంపుమీరె."
               (పెద్దిబొట్ల రామచంద్రరావు. బియల్ క్లాసు. ఆంధ్రహెరాల్డు.)
 
"రేఖామంజులవాసనాలహరి"
              (విశ్వనాధ సత్యనారాయణ, అనార్కళి. భారతి.)

యిట్లా యీకాలపుకృతులను అధికవిశేషణగణం కలుషితం చేస్తున్నది. వక్ష్యమాణమైన శబ్దవాచ్యత దండగమాటల కిందికి గూడా వస్తున్నదని యిదివరకే తెలిపినాను. అధికవిశేషణ రూపమైన దండగమాటలతో పాటు యతిభంగం. పాదభంగం, భాషావ్యతిక్రమం, ఛందోవ్యతిక్రమం ఈకాలపుకృతుల్లో అట్లానేనిల్చినవి. యతిభంగాన్ని, పాదభంగాన్ని ఛందోవ్యతిక్రమంలోనే చేర్చి యీమూటినీ నేనిందు ఛందోవ్యతిక్రమ మనివ్యవహరిస్తున్నాను. ఇవి కాలపుకృతులను మలినపరుస్తున్న సంగతిని విశదంచేశాను. ఈ ఛందోవ్యతిక్రమంయేతీరుగా దోషమై ఆంధ్రుల భాషాసంస్కారాలకు అడ్డుపడినదీ, నన్నయ ఆరంభించిన భాషావ్యతిక్రమాన్ని దండగ్గణాలను నిరోధించదలచి తిక్కన యెట్లా ప్రతిక్రియనడిపిందీ, ఆప్రక్రియలో అత డెట్లా పాదభంగఁ యతిభంగం విరివిగాచేసిందీ, చివరకు రేక్కంపమీద నడిచేమనిసి ముండ్డుతప్పించుకో లేనట్లు ఆదోషాల కెట్లా పాలుపడ్డదీ ప్రథమఖండంలో విపులంగా మీమాంసచేశాను గనుక యింతటితో వ్యతిక్రమదోష విచారణ చాలిస్తాను. అనుప్రాసాది శబ్దాలంకారాలవలె స్వయంగా ఆపతితమైన స్థలాల్లో తప్ప తక్కినచోట్ల వళిప్రాసల నిర్బద్ధమైత్రులు పాదభంగ యతిభంగాలు, దండగ్గణాలు మొదలైన క్షుద్రలక్షణాలకు హేతువలై పద్యాన్ని కలుషితంచేశేవి గనుక అవి అట్లాటి చోట్ల అత్యంతం హేయమని ఛందోవ్యతిక్రమం దూష్యమని దీనివల్ల పద్యం భ్రష్ట మయిందని యిప్పటికావ్యాల్లో మీ రనుకొన్న కొత్త లేక పొయినా యీదోషాలు కావ్యాలను వికృతంచేస్తున్నవని మరల చెప్పి యిక కావ్యజీవవిచారణ ప్రారంభిస్తాను.


అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో వ్యతిక్రమాధికరణం సమాప్తం.