డాక్టర్ ఆనంద్ (1966) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి :

నీల మోహనా ! రారా !

నిన్ను పిలిచె నెమలి నెరజాణ

జారువలపు జడివాన కురిసెరా !

జాజిలత మేను తడిసెరా

లతలాగే నా మనసు తడిసెరా ! ||| నీల మోహనా |||


చరణం 1 :

ఏలాగె మతిమాలి ?

ఏడే నీ వనమాలి ?

అతడేనేమో అనుకున్నానే

అంతదవుల శ్రావణ మేఘములగనీ || అతడేనేమో ||

ప్రతిమబ్బూ ప్రభువైతే,

ప్రతికొమ్మా మురళైతే,

ఏలాగే ?


చరణం 2 :

సారెకు దాగెద వేమీ ?

నీ రూపము దాచిదాచి

ఊరించుటకా స్వామీ ?

నీ కన్నులతోడు నీ కలికి నవ్వులతోడు

నీ కోసం ఎంత వేగిపోయానో కృష్ణా...


చరణం 3 :

అటు... అటు... ఇటు... ఇటు...

ఆ పొగడ కొమ్మవైపు !

ఈ మొగలి గుబురువైపు !

కార్తీక రాతిరిలో కరిమబ్బుంటుందా ?

నీలమేఘ మాకాశము విడిచి నేల నడుస్తుందా ?

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా ?

నవ్వే పెదవులకు మువ్వల మురళుందా ?

పెదవి నందితే పేద వెదుళ్లు - కదలి పాడతాయా ?

నడిచే మబ్బులకు నవ్వే పెదవులు

నవ్వే పెదవులకు మువ్వల వేణువులు !