నీలాసుందరీపరిణయము/తృతీయాశ్వాసము

తృతీయాశ్వాసము

క.

సిరిపెనిమిటియుం బలుకుల
గరితమగఁడుఁ బొగడ మెచ్చుగాంచినగట్టుం
దొరముద్దుఁబట్టిడెందపు
విరిదమ్ముకొలంకుఁదేటి! వేల్పులమేటీ!

1


వ.

విను మన్నిరాబారిరాబారులకుం గత యెఱిఁగించుజడదారి యిట్లని చెప్పందొడంగె నట్లు గొల్లరాకన్నియ వన్నియ దఱిఁగి యెన్నరానివగలం బొగులుచున్నంత.

2

సాయంకాలవర్ణనము

తే.

బొమ్మ యనుపేరియగసాలె పూఁటచెలిని
గోరి యలరించుటకుఁ జదల్గుదుటఁ గాఁచి
నీటముంచిన మేటివన్నియపసిండి
పూదెయనఁ గ్రుంకుఁగడలిలోఁ బ్రొద్దు వ్రాలె.

3


తే.

రేవెలందుకఁ బెండ్లాడ రిక్కరాయఁ
డేఁగుదేఁగలఁడని వేల్పుటిగురుఁబోండ్ల
గములు గట్టినక్రొత్తచెంగలువకోక
గములనఁగ సంజకెంజాయ లమరె మింట.

4


క.

బలితంపుసంజకెంజా
యలు నిద్దపుమావిచిగురులని చేరి తమిం
గలయంగాఁ బర్వినికో
యిలమూఁక లనంగఁ గడల నిరులు దనర్చెన్.

5

క.

మరుఁడు దెరువరుల నెల్ల
న్వెరపునఁ దీర్పంగఁ గోరి విరివిగఁ గఱిదే
వరంయడుగున నిడుమల్లియ
విరు లనఁగా రిక్క లెసఁగె వేలుపుఁద్రోవన్.

6


క.

తామరలు ముడిఁగె జక్కవ
చామలకు న్వెతలు పర్వెఁ జక్కగఁ బడుపుం
గోమలులకు బొజుఁగులకును
సేమం బొనగూడె నపుడు చెప్పఁగ నరుదై.

7

చంద్రికావర్ణనము

తే.

తనర మగమానికపువాలుదాల్పుజోదు
వేడుకలు మీఱ నాడుమేల్మేడమీఁద
గొనబుమీఱెడు నపరంజికుండ యనఁగఁ
దూర్పుగుబ్బలిపైఁ దోఁచెఁ దొగలఱేఁడు.

8


క.

మినుఁగొలకునఁ బూచినచ
క్కనిచెందొవ యనఁగఁ దనరెఁ గలువలదొరలోఁ
గననయ్యెఁ గప్పు మది క
త్తినవేడుక నుండుగండుఁదేఁటి యనంగన్.

9


వ.

అంతఁ గొఱంత యింత లేక జగం బంతయు నిండి పిండిచల్లినతెఱంగునఁ బొంగారుచు దెఱపి లేక తఱపివెన్నెలలు గాయఁదొడంగినం గడంగి నింగిముట్టిన సంతసపుటగ్గలికల డగ్గరించి యొక్కుమ్మడిఁ బొక్కుచు గ్రక్కునమెక్కియామెక్కి యక్కజంపుమక్కువలం జొక్కి చిక్కక చక్కెరవిలుదాల్పు బవరంబులం దవిలి చెన్నారు వెన్నెలపులుఁగులమొత్తంబులును వెన్నెలపులుఁగులమొత్తంబుల బిత్తరంపుంబనులకు

మెత్తఁబడి క్రొత్తవగఁ దత్తఱించుచుం దమతమవేడ్కకత్తెల నత్తుకొని పూవుటెత్తులవ్రేటులాడుచు విచ్చలవిడిం దిరుగు బొజుంగులును బొజుంగుల నొక్కెడకుం బనిచి వగలం దగిలి మగల నెదిరించి కొంచక మంచిగందంబు లలఁది వలిపంపుఁదెలివలువలు ముసుంగు లిడి దొసంగు లఱి వెసం గదలి యిక్కలకుం దాఱు చెడిపజవరాండ్రం గని తమజవరాండ్ర నెదలం దలంచి యొల్లన నుల్లంబులు దల్లడిల్ల నుస్సురని సొమ్మసిలం బాఱుతెరువరులును దెరువరుల గెలువం దరలు మరునకు దఱియసుకమ్మరీఁడు వెరవునం జేసి యునిచిన కఱకుటమ్ములగుంపుల సొంపునం బెంపాఱు కలువక్రొవ్విరులును గలువక్రొవ్విరులపయి ముసరి కొసరి తీఁగపసగలపూదేనె లాని పెల్లుగం ద్రుళ్ళు గండుఁదుమ్మెదలును గండుఁదుమ్మెదలరొదలు చెవుల నాట బీఁటలగుడెందంబులతోడ గాటంపుమరునాటలకుఁ దివురు కొమరుబాయంపుందుటారికత్తియలును తుటారికత్తియలసిబ్బెంపుగబ్బిగుబ్బల కెన యనందగి సొంపు గలిగి వెత లొనర్చుజక్కవపెంటి కూటువలను జక్కవపెంటి కూటువలపాటు గనుంగొని వెఱచి పొలయలుకలు మఱచి పఱచి మగల నిఱియం గౌఁగిలించికొనుముగుదపూఁబోఁడులును ముగుదపూఁబోఁడులనిద్దంపుముద్దుమొగంబులకు దొరగానిసిగ్గునంబోలె ముడుంగఁబాఱిననెత్తమ్ములును నెత్తమ్ములకొలంకులం దలంకక దుంపదూండ్లు మెసవి విసువక కూఁత లిడుకొదమరాయంచబారులునుం గలిగి పుడమియెల్ల మొల్లం బగుచల్లదనంబున నుల్లసిల్లుచుండె నప్పు డాగొల్లరాకన్నియ యెన్నరానివలవంతలఁ బొరలుచుండె నట్టియెడ.

10

నీలను మన్మథుఁ డేచుట

క.

ఇరువంకలఁ దన్నుఁ బొదవి
గొరవంకలుఁ దుమ్మెదలును గోయిలలుం డ
క్కరిచిలుకలుఁ బురిపులుఁగులు
గొరగొర రా మరుఁడు వెడలెఁ గొమ్మఁ గలంపన్.

11


వ.

అట్లు వెడలి.

12


మ.

కడిమిం జిల్కపిసాళిజక్కి నెదురెక్కం జివ్వునం దోలి బ
ల్వెడవింట న్నునువాఁడిపూములుకు లోలిం గూర్చి బిట్టార్చి నె
వ్వడిఁ జేకొల్దిగఁ దీసి డాసి మరుఁ డవ్వాల్గంటిచన్దోయి నె
న్నడుచక్కిన్ గుఱిచేసి యేసెనదరంటం గాఁడి మై సోలఁగన్,

13


చ.

తలిరుజిరావజీరుబలుదాడికి నోడి కడంక దక్కి య
క్కులుకుమిటారి డెందమునఁ గొందలమందుచు నప్పు డెంతయున్
వలపులవెచ్చ హెచ్చఁ జెలువం బగునమ్మెయిఁగ్రాల సోలుచున్
గళవళపాటుతోఁ జెలిమికత్తెల దూఱుచునుండి వెండియున్.

14


సీ.

తులువరాచిలుకమూఁకలహళాహళులకుఁ
            బాఁపమేపుడుఁబుల్గుబారురొదకు
జమిలిముక్కాలిపిసాళిబల్మ్రోఁతకుఁ
            గొదమకోయిలచాలుగొలగొలలకు
గద్దఱిగొరవంకగములుచప్పుడులకుఁ
            బొగరుటంచలపల్కువెగటులకును
వలినాలిగాడ్పుబోదలహెచ్చరికలకుఁ
            జలివెల్గునుదుటువెన్నెలలసెగకుఁ


తే.

దొడరి బడిబడి వెడవింటఁ గుడియెడమల
నడరి వడినేయుకఱివేల్పుఁగొడుకుదుడుకు

టంపజడివానసోనల యలజడికిని
మిగుల నెద నోడి యాడు నమ్మించుఁబోఁడి.

15

మన్మథదూషణము

తే.

అలరువిలుకాఁడ! బలుసిరి గలిగినట్టి
దొరకొడుకునంచుఁ బొగరునఁ ద్రుళ్ళుకొనుచుఁ
దెఱఁ గెఱుంగక ముగుదలఁ దెరువరులను
బూని యేతువె నీపూన్కి బుగ్గిగాను.

16


క.

పొరపొచ్చెంబునఁ బలుమఱు
విరిఁబోఁడుల నెల్ల మిగుల వెతవెట్టుదు నీ
దొరతనము ద్రుంగిపోవను
మరుఁడా! నీచేతివిల్లు మంటం గలియన్.

17


చ.

తలఁపఁగ ముజ్జగంబులకుఁ దల్లియుఁ దండ్రియు నైనలచ్చికిం
బులుఁగుహుమావజీరునకుఁ బుట్టినదిట్టవు నీకు నెల్లరుం
గలయఁగఁ దోడఁబుట్టువులుగారె? యయో! నెవరింతలేకలేఁ
జిలుకలకొల్కులం గలఁపఁ జెల్లున వెల్లుగఁ బచ్చవిల్తుఁడా!

18


ఉ.

కన్నులవింటివాఁడ! తిగకన్నులదేవరతోడఁ బోరి ము
న్బన్నమునొంది మేఁ దొఱఁగుపట్టున నెక్కడ డాఁగిపోయె నీ
మన్నెఱికంబు నేఁడు కొఱమాలినకోయిలచిల్కమూఁకలం
బన్నుగఁ గూడి చేడియల బాములఁ బెట్టెదు పోటుబంటవై.

19

చంద్రదూషణము

చ.

బలితపుటామునం దమియుఁ బర్వగఁ గైకొని యొజ్జముద్దియం
గలసిన దోసకారి వని కాదె నినుం గని తమ్మికొమ్మ ని

చ్చలుఁ దలవంచుచుండు? నది చాలదొ యాఱడి నీకు నెంతకుం
జలువలఱేఁడ! నీసవురు సన్నము గా నిఁక నిందు రాకుమీ.

20


ఆ.

కొంకులేనివెతలఁ గుందెడిముగుదల
డంకతనము మీఱ జంకు లేక
బింకమునఁ గలంచె దింక నెన్నఁడు నీకు
వంక గల్గదోటు జింకతాల్ప?

21


తే.

కటకటా! మున్ను ముక్కంటికంటిమంట
చేత బూదైన మరునకుఁ జెల్లుఁగాని
తడవు మనియెద ననుకోర్కి నడరు నీకు
జాడయే చేడియల నేఁచఁ జందమామ!

22

వసంతాదులదూషణము

క.

చెలువుగలవాఁడ వంచును
జెలువల నలయింప నీకుఁ జెల్ల దయో నీ
చెలువెల్లఁ జెట్లపాలుగ
నలరుజిరాజోదుతోడ! యామనిఱేఁడా!

23


క.

జత లేనిపూవు గల్గుట
కతివలపైఁ బెల్లు రేఁగి యలజడి మీఱ
న్వెత పెట్టుదువే యిఁక నీ
బ్రతుకు బయ ల్గాను నాలిపయ్యరకుఱ్ఱా!

24


తే.

మున్ను కొన్నాళ్ళు పలుగాకిమూఁకలోనఁ
గలసిమెలఁగినతెఱఁగెల్లఁ గానిపింపఁ
జేడియలమీఁద గ్రుడ్లెఱ్ఱ సేయరాకు
కోయిలా! యింక నీయిల్లు కూలిపోను.

25

క.

నేటుగొని పండ్లు గొఱుకుచుఁ
జీటికిమాటికిని గసరు చిలుకం జిలుకా!
బోటుల నలయించెదు నీ
గోటాపన యెన్నఁ డింక గూఁటం బడునో.

26


తే.

తలిరుఁబోఁడులడెందము ల్దల్లడిల్లఁ
గూఁక లిడుకొంచు నెంతయుఁ గొఱఁతలేక
యాగడంబునఁ బురివిచ్చి యాడెదేమి
యక్కటా! నెమ్మి! నీయాట యడవిఁగలయ.

27


క.

నెమ్మదిఁ బలుమఱు మొరయుచుఁ
గమ్మనిపూఁదేనె లాని కడుఁ గ్రొవ్వి యహా
గొమ్ములఁ గలఁపగఁ జూచెదు
తుమ్మెద! నీత్రుళ్ళు పెద్దతుప్పలఁ బట్టన్.

28


తే.

తవిలి పలుమఱుఁ జెవులు చీఁదఱఁ గొనంగ
బిట్టు మొరసెదు వసత్రాగినట్టు లిట్టి
గట్టివాజాడ లెట్టుగాఁ బట్టువడియె
బెట్టుగా నిన్ను వెసఁ జెఱఁ బెట్టి యిడను.

29


వ.

అని మఱియు మఱియుఁ బరికించి చెఱకువిలుకానికఱకుచుఱుకుటలరుములికి మొత్తంబులకు నంతకంతకు నగ్గలం బగు వలవంతసెకలఁ గ్రాఁగి వేఁగి సైఁప రాకున్న డిల్లపడి మెల్లన సొమ్మసిల్లిన.

30

చెలికత్తెలు నీలకు శైత్యోపచారంబులు సేయుట

క.

చెలు లెల్లఁ దల్లడిల్లుచు
వలగొని దరి నిలిచి యకట వలవంతసెకల్

బలు వయ్యెఁ దలిరుఁబోఁడికి
వలిపను లిఁక సరగఁ జేయవలె నని మఱియున్.

31


ఆ.

కప్ర మూఁది మంచిగందంబు మెత్తి ప
న్నీరు చిలికి తూండ్లు నించి వలపు
గ్రమ్ముపూలవిసనకఱ్ఱచే వీచుచుఁ
జివురసెజ్జమీఁదఁ జేర్చి మఱియు.

32


తే.

ఎన్న రానట్టిచలిపను లెన్ని యేనిఁ
జేయ మే లందులను లేక సేఁగిఁ బొందు
చున్న కన్నియ మెల్లన నుస్సు రనుచుఁ
బొరలి యి ట్లని పలికె నబ్బురము మీఱ.

33


సీ.

నిద్దంపుఁబాన్పుపై నిప్పులతునియలు
            నింపఁ జెల్లునె మీకు నెలఁతలార!
యెడనెడ విసము గ్రక్కెడుపాములనునొడఁ
            గూర్పఁ జెల్లునె మీకుఁ గొమ్మలార!
కళపెళనుడుకుచక్కనినూనియల్ మీఁదఁ
            జిల్కఁ జెల్లునె మీకుఁ జెలియలార!
మేనఁ బొక్కులు పొక్క మెదియించి సున్నంబు
            మెత్తఁ జెల్లునె మీకు మెలఁతలార!


తే.

కటకటా! నేఁడు పగ దీఱ నిటులు గలఁప
వలయునే యంచుఁ బలుమఱుఁ గలవరించు
నలరులును దూండ్లుఁ బన్నీరు వలపు గలుగు
చలువసిరిగందమును గాంచి చెలువకంటి.

34


ఆ.

చానలార! యిపుడు జంటారుమేనులు
దాల్చి మిగుల సెగలఁ దరల నెండ

గాయ సాగె నేమి గాములఱేఁ డని
చెలువ మిగుల నలుకుఁ దలఁకి పలుకు.

35

నెలఁతలు మన్మథపూజ సేయుట

ఆ.

అట్లు గళవళించు నతివను గనుఁగొని
యనుఁగుఁజెలులు వెఱచి యహహ! వలపుఁ
గాఁక బలిత మయ్యెఁ గ్రాల్గంటి కిఁక మరుఁ
గొలువకున్న మేలు గూడ దనుచు.

36


సీ.

నునుఁగ్రొత్తసిరిగందమునఁ దిన్నె యొనరించి
            చెలువుగొజ్జెఁగనీటఁ గలయ నలికి
పలువన్నె లలరఁ గప్రపుముగ్గులను బెట్టి
            పసమించు చెఱకుఁగంబములు నిలిపి
పరువంపుమల్లెక్రొవ్విరులపందిరి వ్రేసి
            తళుకుగేదఁగిఱేకు దళ్ళు గట్టి
తొగలఁ జెంగల్వలఁ దోరణంబులు గట్టి
            మేలుముత్యాలజాలీల నుంచి


తే.

తమ్మిపూమిద్దెగద్దెపైఁ గమ్మవిల్తు
నిమ్ముగా నిల్పి యెమ్మెను గొమ్మలెల్లఁ
గ్రమ్ముకొని పెక్కులాగుల దొమ్మిగూడి
పూజ లొనరించి యి ట్లని పొగడి రపుడు.

37


తే.

మ్రొక్కెదము నీకుఁ జక్కెర లుక్కెఱలును
మెక్కి నిక్కుచు మిక్కిలి చొక్కుతొగరు
ముక్కు బల్పక్కిజక్కిపై నెక్కి జగము
లుక్కు మెఱయంగ గెలుచుచు నుండుజోద.

38

లయ.

తుమ్మెదలు నాలివతితెమ్మెరలుఁ గోయిలల
            దిమ్ములును జిల్కలును నెమ్మిగములు న్గా
టమ్ముగఁ బొరింబొరిని గ్రమ్ముకొని గొల్వఁ జెలు
            వమ్ముగ బయల్వెడలి కమ్మనగువింటం
దమ్మివిరిముల్కి బెడిదమ్ముగ నమర్చి వడిఁ
            జిమ్మి కడిమిన్మగల నిమ్ముగను ఱొమ్ముల్
గ్రమ్మి కరఁగించుచును గొమ్మలను గూర్చు నిను
            నెమ్మదిని గొల్తుము తిరమ్మయినబత్తిన్.

39


క.

వలరాయఁడ! నీ బెడిదపు
టలరుందూపులకు వెఱతు రఁట నల్వయుఁ గ్రొ
న్నెలతాల్పును నిఁకఁ బెఱవా
రలఁ గలఁచుట యేమి యబ్బురం బరయంగన్?

40


క.

గోలపయి న్వాలారుం
గోలలఁ బరఁగించి మరులు గొల్పుచు మిగులం
దూలించుట కిఁకఁ దాళం
జాలము నీయాన యో మొసలిడాల్వేల్పా.

41


క.

అని యనుఁగు లెల్ల నిత్తెఱఁ
గున వెడవిల్కాని వేఁడుకొన నపు డా క్రొ
న్ననఁబోఁడి కొంత డెందం
బున వెత చల్లారఁ దాల్మి పొరయుచు నుండెన్.

42


వ.

అంత.

43

ప్రభాతవర్ణనము

చ.

పులుఁగులు గూసె జక్కవలు పొందుగ డాసె బొజుంగుమూఁకకుం
బొలుపులు వాసె రిక్కగమి పోఁడిమి మానెఁ బిసాళితుమ్మెదల్

గొలఁకుల మ్రోసెఁ జీఁకటులు గొబ్బున మాసె హరుండు తుంటవిల్
బలువిడి నెక్కుఁ దీసెఁ దొగపైదలియుం గను మూసె నెంతయున్.

44


ఆ.

ఇరులగొంగ తమ్మివిరిఁబోఁడివగకాఁడు
చదలుమానికంబు జగముకన్ను
వేఁడివేలు పివము వేఁటాడుపోటరి
ప్రొద్దు తూర్పుమలను బొడమె నపుడు.

45


తే.

తెల్లవాఱుట గన్గొని యెల్లవారు
గొల్లవారింట వేడ్గ గన్గొనఁగ వలయు
నంచు మేల్కాంచి తఱిచెయ్వు లన్ని దీర్చి
గీము లలరించుకొనిరి కోర్కియుఁ జెలంగ.

46

గొల్లదొర తనపట్టుల నలంకరింప నియోగించుట

ఆ.

అపుడు గొల్లనాయఁ డందంబుగాఁ దన
నట్టు లలరఁజేయునట్టుగాను
నేర్పు గల్గువారి నేర్పరించినఁ జాల
నెలమితోడ వార లెల్లఁ గడఁగి.

47


సీ.

తెలిముత్తియపుఁబందిరుల నెల్లెడల నిల్పి
            నలువొపఁ దొగదోరణములు గట్టి
ముంగిళ్ళఁ గపురంపుమ్రుగ్గు లిమ్ముగఁ బెట్టి
            తనరుగోడలను జిత్తరువు దిద్ది
పసిఁడితిన్నియల సొంపెసఁగఁ గస్తురి యల్కి
            క్రంతలఁ బన్నీరు గలయఁ జల్లి
పట్టుఁబుట్టముల మేల్కట్టు లమర్చి ఠీ
            విని బయళులను గొల్లెనలు వన్ని

తే.

మఱియు దరి లేనిసొగసు లేమఱక చేసి
పలుదెఱంగులవాయిదమ్ములు సెలంగ
నిగురుఁబోఁడులు మగవాండ్రు నీడులేక
యరిది సింగారములు పూని యలరి రంత.

48

కుంభకునిపురికి గొల్లలు వచ్చుట

సీ.

కిఱ్ఱుచెప్పుల గొప్పగీఱునామంబులు
            మొలచెక్కుకత్తులు నిలువుసిగలు
కుడిముక్కుగ్రమ్ములు గురివెందపేరులు
            పిల్లగ్రోవులు మేటివల్లెతాళ్ళు
లొరుగట్టుపంచలు బెరసుఁబచ్చడములు
            గార్కొన్నలోవంక కఱియొడళ్ళు
గుండప్రోగులు చిప్పగొడ్డండ్లు సెలగోల
            లొప్పారుపలువంకయుంగరములు


తే.

గలిగి గాటంబుగా నెల్లకడలనుండి
పెల్లుమీఱఁగ గిబ్బల పీఁచ మడఁచి
కోర్కు లిగురొత్తఁ గన్నెఁ జేకొనెదమంచు
మొల్లముగఁ జేరి రచటికి గొల్ల లెల్ల.

49


వ.

అట్లు చేరినవారి కెల్ల గొల్లదొర యుల్లంబులు దనియ నోగిరంబులు వేగిరంబునం బెట్టించి వీడెంబులు గందంబులుఁ గోకలుం దొడవులు నిడి విడిదిపట్టుల నునిచె నంతకుమున్న పనిచినమానిసివలన నత్తెఱంగంతయు విని నందుండు యశోదయుఁ దాటిసిడంబుజోదును బుత్తడిదువ్వలువదాల్పును బయనం బయి గదలి ప్రోల్కడచక్కి న్వచ్చుచుండి రయ్యెడ.

50

నందాదులు కృష్ణునితో వచ్చుట

తే.

వీటఁ గల్గనినాఁడెంపుబోటు లెల్లఁ
గూటువలు గూడి జన్నంపుగూటిదొరల
మాటకయి మేనుపూనిన మేటివేల్పుఁ
దేటగాఁ జూచుకోర్కి నచ్చోటఁ జేరి.

51


సీ.

వీఁడెపో యేప్రొద్దు వ్రేపల్లెలో గొల్ల
            మగువల వలపించు సొగసుకాఁడు
వీఁడెపో చేలరేఁగి విసపుఁ బా లిడుఱాఁగ
            రక్కసిఁ దునిమిన యుక్కుఁదునియ
వీఁడెపో నందునివిరిఁబోఁడిముందర
            మొనసి చిందులుత్రొక్కుముద్దులాఁడు
వీఁడెపో బండితొల్పేలుపు సుంకించి
            పిండిగాఁ దన్నినదండిజోదు


తే.

వీఁడెపో వ్రేలగీముల వెన్నజున్ను
గములఁ గొల్లగ మెక్కినగండిదొంగ
యనుచు నుడువుచుఁ దెలిముత్తియంపుసేసఁ
బ్రాలు చల్లిరి వేడుక ల్బయలువడఁగ.

52


తే.

అపుడు కుంభకుఁ డెదురుగా నరుగుదెంచి
యక్కకును బావకును మ్రొక్కి తక్కువారిఁ
గౌఁగిటను గూర్చి వేడుక ల్గడలుకొనఁగఁ
దనమనికిపట్టునకుఁ దోడుకొనుచు నేఁగి.

53


క.

అందఱకును బోనమ్ములు
గందమ్ములుఁ దమ్ములములుఁ గడువడి నిడి తా

నందంబుగ డెందంబున
ముం దెన్నఁడు లేనియెలమి మురియుచు నుండెన్.

54

కృష్ణునిరాక నెఱిఁగి యాఁబోతులు విజృంభించుట

సీ.

ఆరేయి కల్లరియాలపోతులు పైఁడి
            వలువదా ల్పచటికి వచ్చు టెఱిఁగి
కినుకతో రెచ్చి దొడ్డిని గల్గుచూడ్పాఁడి
            మొదవుల లేఁగలఁ బొదివి చాలఁ
గొమ్ములఁ గ్రుమ్మి లేఁ గొడెల నెడ్లను
            దఱుపుల నెత్తురు నెఱయఁ బొడిచి
గోడలు గ్రోడాడి కోవెలల్ నుగ్గాడి
            పందిళ్ళు పడఁద్రోచి బండ్లు విఱచి


తే.

తలుపులు పగిల్చి గుడిసెలు దళ్ళుఁ గూల్చి
గొల్లవాడల నెల్ల గగ్గోలు పుట్ట
నాఁడువాండ్రను గుఱ్ఱల నంతమందిఁ
గడఁగి తఱుముచు నెనలేని కడిమిఁ జూపె.

55


వ.

అంతఁ దెల్లవాఱుటయు నయ్యిలుఱేఁ డెల్లగొల్లకొమరులఁ బిలిపించి తనముద్దుఁబట్టిని దద్దయు సింగారించి తెచ్చి ముందర నునిచి యందఱు విన ని ట్లనియె.

56

కోడెలఁ బట్టువానికి నీల నిచ్చెద నని గొల్లలతోఁ గుంభకుఁడు చెప్పుట

ఆ.

గొల్లలార! చెడుగుఁగోడెలఁ గంటిరె
జగము లెల్ల మ్రింగఁ జాలుకడిమి
నెసఁగుచున్న వెన్న నివి బొబ్బమెకములో
పులులొ యడవియేనుఁగులొ నిజంబు.

57

ఆ.

వీనివలనఁ జాల వెతఁ గుందితిమి నేల
ఱేఁడు కినుక చేసి వేఁడి సూపె
నింకఁ బెక్కుమాట లేటికి వినుఁ డిదె
నిక్క మైనదిట్ట లొక్కపలుకు.

58


క.

బలిమి దలిర్పఁగ నీగి
బ్బలఁ బట్టఁగఁ జాలునేరుపరి కిపు డిత్తుం
జెలువములప్రోక యగునీ
తలిరాకుంబోఁడి నెమ్మి దళుకొత్తంగన్.

59


క.

అనిన విని గొల్లకొమరులు
ననఁబోఁడులమిన్నఁ గైకొనఁగ వలసినబు
ల్పును గోడెల గెలువఁగ నో
పనిజడుపును గల్గి కాడుపడి యుండి రొగిన్.

60

ఘోషవంతుఁడు కోడెలచేఁ జిమ్మఁబడి సొమ్మసిల్లుట

వ.

ఆయెడ ఘోషవంతుం డనునొక్కగొల్లకొమరుండు.

61


క.

గిబ్బల గెల్చుట యిది యొక
యబ్బురమా! యనుచు బింక మాడుచు నపుడే
గొబ్బున లేచి బుజంబులు
దబ్బునఁ జఱచుకొని బల్లిదపుదిట మెసఁగన్.

62


తే.

తొడరి యమ్మేటియాలపోతులను డాసి
పట్టుకొనఁబోవుటయు నవి బిట్టి గినిసి
కన్నులను నిప్పు లొలుకంగఁ గడఁగి వానిఁ
బొదివె నన్నియుఁ జూపఱు బెదరి పఱువ.

63


క.

అటువలెఁ బొదివినఁ గనుఁగొని
దిట మింతయు విడక యతఁడు దీటుగఁ గడుముం

దటికిఁ జని యొక్కపోతును
దటుకునఁ బిడికిటను బొడిచెఁ దలనడుచక్కిన్.

64


క.

పొడిచిన నన్నియు నొక్కు
మ్మడిఁ గడిమి దలిర్ప నతని మార్కొని కిసుక
న్నిడుద మొనవాఁడికొమ్ములఁ
బుడమిం బడ వైచి పొడిచి పొరిఁబొరి మట్టెన్.

65


ఆ.

మట్టి మిగుల నలుగ రెట్టింప దవ్వుగాఁ
జిమ్ముటయును దూలి సొమ్మసిల్లి
పడియె నతఁడు గిబ్బపదు వంత గొల్లల
పైకి నుఱికి కడిమి బలిమిరాయ.

66


ఉ.

కొందఱఁ బూని కొమ్ములను గ్రుమ్ముచుఁ గొందఱ మ్రగ్గఁద్రొక్కుచుం
గొందఱఁ బెందొడల్ విఱిగి కోయని యార్వఁగఁ గూలఁదన్నుచుం
గొందఱ నేపుతోఁ దఱిమి గుట్టలమెట్టలపా లొనర్చుచుం
జిందఱవంద ఱై పఱవఁ జేయుచు గాటపులావుఁ జూపుచున్.

67

కృష్ణుఁడు బలరామునితో నక్కోడెలకతఁ దెల్పుట

క.

అప్పగిదిఁ బఱచువారలఁ
దప్పక చూచుచును మోముఁదమ్మిని జిఱున
వ్వొప్పార నపుడు వెన్నుఁడు
కప్పుంబుట్టంబువానిఁ గని యి ట్లనియెన్.

68


తే.

ఆలపోతులు గా వివి కాలనేమి
కొడుకు లేడ్వురుఁ దనచేత మడిసి తొంటి
సూడుఁ దీర్పఁగఁ బూని యిచ్చోటఁ బుట్టి
రిపుడు వీరి నడంచెద నేపుసూపి.

69

క.

పగతుర నడఁచుటయున్ బం
దుగులం గాపాడుటయును దోరం బరయం
దిగకంటికైన నిది కడుఁ
దగిలినమే ల్గాదె యిపు డెదం బరికింపన్?

70

కృష్ణుఁడు కోడెలఁ బైకొని చంపుట

క.

అని పలికి వాని కెదురుగఁ
జనియె నపుడ వేలుపులును జడదారులు నిం
గి నిలిచి కనుఁగొనుచుండం
దన కెంతయు మేలు గోరి తద్దయుఁ బొగడన్.

71


క.

చని యటఁ బసరపురక్కసు
లను బయికొని దోసకారులారా! కడుఁగ్రొ
వ్వునఁ గలఁచితి రిన్నాళ్ళును
బనివడి జగమెల్ల నింకఁ బఱవక నిలుఁడీ.

72


క.

కల్లరులై పె ల్లొదవఁగఁ
బొల్లఁగఁ గొల్లలను బాఱఁబొడుచుట గా దిం
కెల్ల తెఱంగుల మిమ్ముం
జెల్లించెద వేల్పుగములు చెలఁగుచు నుండన్.

73


వ.

అని యదలించి పలికిన నులికి యలుక రెట్టింప నద్దబ్బఱగిబ్బరక్కసు లేడ్వురునుం దొంటియొంటమి మేటిపెనంకువం జెంగున నెగసి యుక్కున నొక్కుమ్మడి నతనిం దాఁకిన నబ్బలుమగండు గండుమీఱి లేగున్నయేనుఁగులపయి దాఁటుసింగంబు తెఱంగునం గదిసి యఱచేత మోరలు చఱచియుం దఱిమి యురవడిఁగొమ్ముల మెడల నులిమియుఁ దొడలు విఱి

చియు నడుము లవియం బిడికిళ్ళం బొడిచియు వీఁపులు మూఁపురంబులు నడచియు నెత్తురులు జొత్తిల్లం జేసియు మఱియుం బెక్కులాగుల నొప్పించియుఁ జూపఱచూడ్కికి వేడ్కగాఁ గొంతదడవు గడిపి యంత.

74


క.

పిడుగున కెన యనఁ దగుతన
పిడికిట నొక్కొక్కదాని బెడిదంబుగ నె
న్నడినెత్తు లవియఁ బొడిచిన
వడి నొక్కొక్కటియు నేల వ్రాలె గోడెల్.

75


తే.

అట్టు లొక్కొక్క పోటున నాలపోతు
లన్నియును వాత ముక్కునఁ గన్నుఁగవల
నెత్తురులు గార నీలిగి నేలఁ బడిన
నెల్లవారలు వెఱఁగంది రుల్లములను.

76

దేవాదులు మెచ్చి తత్సూచనల నెఱపుట

సీ.

అత్తఱి వేలుపు లాకసంబున నుండి
            వెన్నునిపయిఁ జాల విరులవాన
గురియింప నచ్చర ల్గొమరొప్ప నాడిరి
            గొల్లఱేండ్లందఱు నుల్లసిలిరి
నందుండు గొమరునిఁ బొందుగాఁ గౌఁగిటఁ
            బెనఁచి తద్దయును దీవన లొసంగెఁ
గుంభకుండును దనకోరిక యీడేఱె
            నని చూచి సంతసంబునఁ జెలంగె


తే.

నీలయును జాల వ్రేతలమేలువాఁడు
తనకు మగఁడయ్యె ననుచు డెందమున నుబ్బె

మఱియుఁ జూపరులెల్ల వేమఱును మెచ్చి
పొగడుచుండిరి వెన్నునిమగతనంబు.

77

నీలకుఁ గృష్ణునకుఁ బెండ్లి వర్తిల్లుట

ఆ.

అంత గొల్లపెద్దలందఱు నీలకు
వెన్నునకును బెండ్లి వెస నొనర్ప
వలయునంచుఁ బూని వలనొప్ప మూరుత
మొజ్జబాఁపనయ్యనొయ్య నడిగి.

78


ఆ.

కాళ్ళగోళ్ళు దీసి కన్నియకును బెండ్లి
కొమరునకును దలలఁ జమురు రాచి
నలుఁగు లిడఁగఁజేసి నలువొప్ప నయిరేని
నీరువోసి రపుడు పేరఁటాండ్రు.

79


క.

తొగసూడు గ్రుంకె దట్టం
బుగఁ జీఁకటు లొదవె రిక్కమొత్తము వొడమెన్
లగనమును డాసె నియ్యెడఁ
దగఁ బెద్దలు నైదువలును దద్దయు నెలమిన్.

80


తే.

పలుతెఱంగులవాయిదంబులు సెలంగ
ఠీవితో నల్గడల దివ్వటీ ల్వెలుంగఁ
గన్నియను బెండ్లికొమరునిఁ గడఁగఁ బెండ్లి
తిన్నెమీఁదికి మెల్లనఁ దెచ్చి నిలిపి.

81


తే.

పుడమివేల్పులు దొలిపల్కునుడువులెలమిఁ
జదువుకొంచును దీవనల్ చాలనొసఁగి
సేసఁబ్రాల్ చల్ల వలిపంపుఁజీర యొకటి
చెలఁగి తెరవట్టి కాల్ద్రొక్కఁజేసిరపుడు.

82

ఆ.

చాల వేడ్కలొదవఁ గేలుఁదమ్ముల నంటి
యైదువలు కడంగ నంది యిడఁగ
నెన్నరానికూర్మిఁ గన్నియయఱుతను
గట్టుతాల్పు తాలిబొట్టుఁ గట్టె.

83


క.

వెన్నునితలపైఁ గన్నియ
కన్నియతలమీఁదఁ జుట్టుఁగైదువుజోదున్
సన్నపుముత్తెము లెలమిని
మిన్నక చేదూండ్ల నించి మించిరి మిగులన్.

84


క.

చీరచెఱంగులు ముడి యిడి
కూరిమిఁ జిటికెనలు వట్టికొనఁ గూరిచి తా
రారంజోతిని గడు నిం
పారఁగ మ్రొక్కించి రప్పు డాలిన్ మగనిన్.

85

కృష్ణాదులకుఁ గుంభకుఁడు కట్నంబు లొసంగుట

సీ.

అయ్యెడ గొల్లఱేఁ డల్లున కెలమితో
            ముత్తెంపుఁజౌకట్లు మురువు లుంగ
రములు నేవడములు రతనంపుఁబావలు
            గొలుసులు పదకముల్ జిలుగుఁజేల
లందలా లడపంబు లపరంజిగిండులు
            జాలవల్లికలును జందువాలుఁ
బట్టెమంచంబును బఱపును బాలీసుఁ
            జందుగుపెట్టెలు మందసములు


తే.

గద్దెపీఁటలుఁ గపురంబుఁ గస్తురియును
బాఁడిమొదవులు మేలైన బఱ్ఱియలును

నూడిగీలును వరవుళ్ళు నాఁడె మైన
మంచిగందంపుఁదున్కలు మించ నొసఁగి.

86


తే.

కూరిమిని వీరకానికి వీరకత్తి
యకును దొలువేల్పుగొంగయన్నకును మఱియుఁ
జుట్టములకెల్ల దొడవులుఁ బుట్టములను
గట్నము లొసంగెఁ గట్టలుగాఁగ నపుడు.

87


తే.

జన్నిగట్లకు బట్లకు నెన్నరాని
పైఁడికట్నంబు లొసఁగి కబ్బంపుఁగూరు
పరులకును గాణలకుఁ బెద్దబాఁపలకును
లెక్కసేయక చీరలు రొక్కమిడియె.

88

నీలాకృష్ణుల నొక్కటి సేయుట

వ.

ఇత్తెఱంగున నెల్లవారలు నలరునట్లుగాఁ బెండ్లి యొనర్చి యంత నొక్క మంచిమూరుతమున నాల్మగల నొక్కటి సేయఁ దలంచి ప్రోడ లగునైదువరాండ్రఁ బనిగొల్ప వారు నయ్యెడ.

89


సీ.

పగడంపుసకినలపట్టెమంచము దోమ
            తెర విరవాదిక్రొవ్విరులపాన్పు
సురమాలిబాలీసుసూతినిగవుసెన
            జరబాజుచందువాసాన పీఁట
కపురంపుబరణి చిల్కలదివ్వెకంబంబు
            నిల్వుటద్దంబు పన్నీటిక్రోవి
జవ్వాదిపక్కణీజాలవల్లిక పైఁడి
            వీణె దువ్వెన వట్టివేళ్ళసురఁటి

తే.

తమ్మపడిగము మంచిగందంపుఁగోర
పచ్చికస్తురిపెట్టె సంపంగెనూనె
గిండులను గల్గి కన్నులపండుగైన
పచ్చిరాకట్టుగొనబుటుప్పరిగలోన.

90


ఆ.

పెండ్లికొడుకు నిలిపి బిఱబిఱం గన్నెకు
సొగసు దిద్ది వేడ్క లిగురులొత్తఁ
బడకయింటికడకుఁ బరుగునఁ దోడ్కొని
చనుచుఁ బల్కిరపుడు సకియ లెల్ల.

91


తే.

చెలియ! మును నీవు గోరినచెలువుఁ డిప్పు
డించువిల్కానిపని కెప్పుడెప్పుడంచుఁ
దివురుచున్నాఁడు పడకింటఁ దవిలి తమిని
బ్రొద్దు జరుపకు మిఁకఁ జాల ముద్దరాల!

92


క.

అగ్గలపువలపునను మును
బెగ్గడిలుచు నుండి యిపుడు పెనిమిటితోడన్
డగ్గఱఁ బోయినయప్పుడు
సిగ్గేటికిఁ బొడమెనమ్మ చిత్తరుబొమ్మా!

93


సీ.

ముగుద! రమ్మని డాయ మగఁడు చీరినయప్డు
            కదియక మార్మలంగెదవు సుమ్ము
వగకాఁడు మొరకొంగు దిగిచి సెజ్జకుఁ దార్ప
            సడిగొట్టి వెనుకకుఁ జనెదు సుమ్ము
వెన్నుఁడు కపురంపువిడియం బొసంగిన
            నొదిఁగి కైకొనక యుండెదవు సుమ్ము
చెలువుండు పయ్యెదఁ దొలఁగింప గమకింపఁ
            గేలు మాడిటి పెనంగెదవు సుమ్ము

తే.

సొగసుకాఁ డెదఁ గదియించి జుంటిమోవి
గంటియొనరించి యిక్కువలంటి తుంట
వింటిబలుదంటపనులు గావించినపుడు
కడఁగి మెలఁగంగవలెఁ జుమ్ము కలువకంటి!

94


క.

డేగతెఱంగున బిఱబిఱ
సాగవలదె చెలియ వలపు సడిలేని దహా!
బాగాయెఁ గాఁపురం బిటు
జా గేటికిఁ బొదగదమ్మ చక్కెరబొమ్మా!

95


సీ.

తడవయ్యె బిఱబిఱ నడవరాదె యటన్నఁ
            జెలిమీఁదఁ గన్నెఱ్ఱ చేసెదేమి?
నెనరొప్పఁ జెంగట నిలిచి వీడినకొప్పు
            దిద్దుక్రొన్ననఁబోఁడి దిట్టెదేమి?
పడఁకతో వెలియాకుమడుపులెమ్మెను జేతి
            కొసఁగెడితొయ్యలిఁ గసరెదేమి?
నగుచు గందముదెచ్చి మగని కలందు మ
            న్నను బండ్లు గొఱుకుచుఁ గినిసెదేమి?


తే.

వాలుగంటిరొ! యిటువంటివారెకారె
చొక్కి పెనిమిటికౌఁగిట దక్కి పెసఁగి
పెక్కుదెఱఁగుల రాచిల్కజక్కిజోదు
పనుల గడిదేఱి ప్రోడలై తనరువారు.

96


క.

ఓకలువకంటి! మును మనుఁ
బైకొని బతిమాలి మగనిపజ్జ కిపుడు దే
రాకుండెదు సిరి వచ్చిన
మోఁకా లడ్డం బిడియెదు మురువు దలిర్పన్.

97

ఆ.

అనుచుఁ బలికి కలికి నర్మిలిఁ దోడ్కొని
పడకయింటి కరిగి పడఁతు లపుడు
ముగుదచేతి విడెము మగనికి మగనిచే
విడెము ముద్దుఁజెలికి నిడఁగఁ జేసి.

98


క.

చెలువుగ నీ కిపు డబ్బె
న్నలువుగ నీతళ్కుఁగుందనపుబొమ్మ యిఁకం
దలఁపునఁ గలిగినతెఱఁగున
మెలఁగుడు వలపులు తలిర్ప మెలఁతయు నీవున్.

99


ఆ.

గోల గాని మిగుల గాళకురాలు గా
దింతి నీకుఁ దక్కె నంత వేగి
రంపుఁబనులవలనిరాయిడి వెట్టక
ముద్దుగుమ్మ నెమ్మి దిద్దుకొమ్మ.

100


తే.

చెప్పవలసినలాగునఁ జెప్పినార
మింతె కా కిపు డెన్న మీ కిరువురకును
గలుగుకూర్ములు గనుఁగొన్నఁ దెలిపినట్లు
మెలఁగుదురె యంచు మగుచు నమ్మెలఁత లరుగ.

101102


క.

వెన్నుఁడు చిఱునవ్వునఁ దగఁ
గన్నియఁ జేపట్టి వలపు గ్రమ్మగ సొగసుం
గ్రొన్ననసెజ్జకుఁ దారిచి
వన్నియ దిద్దుచును మిగుల వలపు దలిర్పన్.

సీ.

తెలిముత్తియపుసరుల్ దిద్దునెపంబున
            గిబ్బచన్బొగడలఁ గేలఁ జెనకి
చెవులకమ్మలు చక్కఁ జేయుజాడల ముద్దు
            చిప్పిల నిద్దంపుఁ జెక్కులంటి
మొలనూలు సవరించు వలనుగఁ గన్పట్టి
            వలుఁదపిఱుందుఁ బొక్కిలియు నిమిరి
కపురంపువిడె మొసంగఁగఁ బోవులాగున
            మొనసి చక్కెరమోవి ముద్దులాడి


తే.

పువ్వుటెత్తులు దుఱిమెడి పొలుపెలర్పఁ
గప్పు మీఱినబలితంపుఁ గొప్పు ముట్టి
మెల్లమెల్లనె యొక్కింత మెలఁగ డెంద
మించువిలుదాల్పుచెయ్వుల కియ్యకొల్పి.

103


చ.

కులుకుచుఁ దద్దయున్మదిని గూర్మి తలిర్పఁగ ముద్దుచిల్కుచుం
బలుక వదేమి? యెమ్మెయిని బాగుగ గంద మలందవేమి? కో
ర్కులు వెలయంగఁ గొఁగిటను గూర్ప వదేమి? చలంబొ నానయో
చిలుకలకొల్కి! యి ట్టెరవు సేయఁగ నే నొకలాఁతివాఁడనే?

104


ఆ.

పిన్ననాఁటనుండి పెనఁగుచు నాపయిం
గన్నె నీకు వలపు గలదు కదవె
చేరి వేఁడుకొనినఁ జిక్కులు పెట్టెదు
తాళరాదె యింకఁ దలిరుఁబోఁడి!

105

సీ.

పరువంపుమారేటిపండు లెచ్చటఁ గన్నఁ
            జెలి! నీదుకులుకుగుబ్బలె తలంచి
డంబారునెమ్మిపించెంబు లెచ్చటఁ గన్న
            ననబోఁడి! నీదువేనలియె తలఁచి
తిరమొందఁ దేనియపెర లెచ్చటను గన్నఁ
            దెఱవ! నీతొగరువాతెఱయ తలఁచి
బెదరి పాఱెడులేటికదువు లెచ్చటఁ గన్నఁ
            గలికి! నీసొగసుఁగన్గవయె తలఁచి


తే.

నిచ్చనిచ్చలుఁ గానలోఁ జొచ్చి మిగుల
నెచ్చరికల మెలంగుచు నిచ్చలోనఁ
గలఁగుచుండెదనెనలేని వలపు మీఱ
నింతి యిఁక జాగువలదు నన్నేలుకొనుము.

106


వ.

అని నేర్పుం దలిర్పం బలికి.

107


చ.

జిలుఁగుఁబయంట నూడ్చి నునుఁజెన్ను టొయారపుఁజన్నుదోయిపైఁ
గలప మలంది వాల్బెళుకుఁగన్నులు మూసిన నవ్వుకొంచుఁ బొ
క్కిలి వలకేల నంటి గిలిగింతలు గొల్పుచు మోవి యానుచుం
గలికిఁ గరంగఁజేసి బిగికౌఁగిటఁ జేర్చెను వెన్నుఁ డత్తఱిన్.

108


తే.

మఱియు వెఱగొప్పు చెలువంపుదెఱఁగుపనులఁ
గరఁగఁ జేయుచు నమ్ముద్దుఁగలువకంటిఁ
గలసి యెనలేని నెమ్మదిఁ జెలఁగుచుండి
గుడుసువాల్దాల్పు రేయెల్లఁ గడపి యంత.

109

నందాదిపహితుఁ డై కృష్ణుఁడు నీలతోఁ దనపల్లె చేరి సుఖించుట

తే.

అత్తమామలయానతి యంది తోడఁ
దల్లిదండ్రులు నన్నయుఁ దవిలి రాఁగఁ
గుందనపుటందలములోనఁ గొమ్మ నిలిపి
యుల్లమునఁ బొంగుచును దనపల్లె కరిగె.

110


క.

అరిగి తననగరిలోనికి
సరగునఁ జొత్తెంచి యపుడు సంగడికాండ్రం
బెరిమె గలపెద్దలను గని
యిరవుగ మన్నించి చాల నెమ్మెదలిర్పన్.

111


ఆ.

అంత నీలఁ గూడి యింతంత యనరాని
సంతసంబు మీఱ జగము లెల్లఁ
బ్రోచుకొనుచు నెపుడుఁ బులుఁగుడాల్వేలుపు
తలఁకులేని సిరులఁ దనరుచుండె.

112


వ.

అని నిరాబారిసింగంబులకెల్లఁ దత యెఱింగించిన వారలు కొలందిలేనివేడుకలం దనరు చుండిరి.

113


ఉ.

రిక్కలు మంచు నద్దమును రేదొరయుం గపురంబుఁ బాలునుం
జక్కెరరాచపు ల్చిలువసామియుఁ జిందముఁ దూఁడు మేపుడుం
బక్కిగముల్ జగా నలువపట్టియు బొబ్బమెకంబువేల్పురా
జక్కియు నీడువోలినయసంబునఁ బాటిలు మేటిదయ్యమా!

114


క.

పుత్తడిమలవిలుకాఁడా!
గిత్తహుమా నెక్కి హొయలఁ గేరెడు ఱేఁడా!

మత్తిల్లుమిత్తిసూడా!
బత్తిమిగులఁ గలుగువారి పాలిటివాఁడా!

115


తరళము.

చిలువపేరులు ఱొమ్మునం దలఁ
            జిన్నిక్రొన్నెలపువ్వునున్
మొలను బెబ్బులితోలుఁ గేలను
            ముద్దుగుల్కెడి జింకయున్
నలువయౌదలపున్కపళ్ళెము
            నల్లగుత్తుకయు న్మెయి
న్వలపునున్వెలిబూదిపూఁతయు
            వావిరిం గలవేలుపా!

116


గద్యము.

ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగానామాత్యపుత్త్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయప్రణీతం బైననీలాసుందరీపరిణయంబను నచ్చతెనుఁగుఁగబ్బంబునందు సర్వంబును దృతీయాశ్వాసము.