నీతి చంద్రిక/మిత్రలాభము
"ధన సాధన సంపత్తి లేని వారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక, కూర్మ, మృగ, మూషికనుల వలె స్వకార్యములు సాధించుకొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక, కూర్మ, మృగ, మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగ వినిపింపు" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్ప దొడంగె.
లఘు పతనకము హిరణ్యకుని యొద్దకేగుట
మార్చుగోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘుపతనక మను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతుని జూచి, "వఱువాత లేచి వీని మొగము చూచితిని, నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువదగదు. జాగుసేయక యీచోటు విడచి పోవలె" నని యత్నము సేయుచుండగా వాడా వృక్షమునకు సమీప మందు నూకలు చల్లి, వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీది నూకలు చూచి, తన తోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలు రా నిమిత్తమేమి? మన మీ నూకల కాసపడరాదు. తొల్లి యొక తెరువతి కంకణమున కాశపడి పులి చేత దగులుకొని మృతిబొందెను. మీ కాకథ చెప్పెద వినుండు:
పులి - కంకణము - బాటసారి
మార్చు"ఒక ముసలి పులి స్నానము చేసి దర్భలు చేత బట్టుకొని కొలని గట్టున నుండి 'యోయి, తెరువరీ! ఈ పయిడి కంకణము వచ్చి పుచ్చుకొ' మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుడామాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె' నని చింతించి 'యేదీ కంకణము చూపు' మని యడిగెను పులి చేయిచాచి 'ఇదిగో హేమ కంకణము' - చూడుమని చెప్పెను. 'నీవు క్రూర జంతువువు. కాబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు' నని పాంథుడు పలికెను. ఆ మాట విని పులి యిట్లనియె. అనేకములగు గోవులను, మనుష్యులను వధించి మితి లేని పాపములను సంపాదించి భార్యా పుత్రులను బోగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతరమొక పుణ్యాత్ముడు నా యందు దయచేసి 'యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు. సత్కార్యములు చేయు'మని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాడను. వృద్ధుడను, బోసి నోరివాడను, గోళ్ళు పోయినవి, లేవ సత్తువ లేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుడవు కాబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానముచేసి వచ్చి పసిడి కంకణము పుచ్చుకొమ్ము" అనగానే వాడు పేరాస చేత దాని మాటలకు లోబడి కొలనిలో స్నానము చేయబోయి మొలబంటి బురదలో దిగబడెను. అప్పుడు పులి చూచి 'యయ్యయ్యో! పెను రొంపిలో దిగబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవనెత్తెదను. భయపడకు' మని తిన్న తిన్నగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈ లాగున వాడు తగులుకొని 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించిన దానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపబడియె.
"కాబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు." అని చెప్పగా విని యొక కపోతవృద్ధము నవ్వి యిట్లనియె; "ఆ! ఇవియేటి మాటలు? ఒక యిక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది. వినుండు స్థానా స్థానములు వివేకింపక సర్వత్ర యెట్టి విచారము పెట్టుకోరాదు. కొఱమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని యేలాగున బ్రదుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య శంకితుడు పరభోగ్యోజీవియు ననువారాఱుగురు దుఃఖభాగు లని నీతికోవిదులు చెప్పుదురు" అనగా కపోతము లన్నియు నేల వ్రాలెను.
గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికిడి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభమువల్ల వివేకము పోగొట్టుకొని క్లేశపడియెదరు. ఆహా! లోభ మెంత చెడుగుణము! అన్ని యిడుములకు లోభము కారణము.
పావురములన్ని వలలో దగులుకొనుట
మార్చుఅనంతరము పావురములన్ని వలలో దగులుకొని కపోత వృద్ధమును జూచి 'నీవు వృద్ధుడవు-తెలిసినవాడవని భ్రాంతిపడి నీ మాటలను విని యీ విపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని, యేండ్లు మీఱినవాడా వృద్ధుడు?' అని కపోతములు నిందింపగా విని చిత్రగ్రీవుడిట్లనియ: "ఇది యీతని దోషము గాదు. ఆపదలు రాగ లప్పుడు మంచి సహితము చెడు యగుచున్నది. మన కాలము మంచిది గాదు. ఊరక యేల యీతని నిందించెదరు? ఈతడు తనకు దోచినది చెప్పినాడు. అప్పుడు మన బుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలెగాని, యీ మాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము, కాబట్టి యిప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుడు. ఇప్పటికి నాకొకటి తోచుచున్నది. మీరందఱు పరాకులేక వినుండు. ఒక్కసారిగా మనమందఱము వల యెత్తుకొని యెగిరిపోవుదము. మన మల్పులము-మన కీకార్యము సాధ్యమగునాయని విచారింపబనిలేదు. సంఘీభవించి యెంతటి కార్యమైన సాధింపవచ్చును. గడ్డి పరకలు సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుగుల బంధించుచున్నవి. మీరు విచారింపుడు! దీనికంటె మంచి సాధనము మీ బుద్ధికి దగిలెనా యది చేయుదము! అనిన విని 'మీరు చెప్పినదే సరి. ఇంతకంటె మంచి సాధనములే' దని చెప్పి పావురములన్ని విచిత్రముగా గగనమార్గమున కెగిరెను. అప్పుడా వ్యాధుడు వెఱగుపడి యీ పక్షులు గుంపుగూడి వలయెత్తుకొని పోవుచున్నవి. నేల వ్రాలగానే పోయి పట్టుకొనెదగాక' యని చింతించి మొగము మీది కెత్తుకొని ఱెప్పవేయక చూచుచు, నవిపోవు దిక్కునకయి క్రిందనే పోవుచుండెను. ఈ వింత చూడవలెనని లఘుపతనకము పావురములను వెంబడించి పోవుచుండెను.
అనంతర మా పక్షులు చూపుమేర దూరము మీఱిపోగానే వ్యాధుడు నిరాశ చేసుకొని మరలిపోయెను. అది చూచి యిప్పుడు మనము చేయవలసినది యేమియని పక్షులడిగెను. చిత్రగ్రీవు డిట్లనియె: "లోకమందు మాతాపితలు, మిత్రుడను వీరు మువ్వురే హితులు, తక్కిన వారందఱు ప్రయోజనము బట్టి హితులగుచున్నారు. కాబట్టి యిప్పుడు నాకు మిత్రుడొకడున్నాడు. ఆతడు హిరణ్యకుడను మూషికరాజు. గండకీ తీరమందు విచిత్రవన మాతని నివాస స్థానము. ఆతడు పండ్ల బలిమిచేత వల త్రాళ్ళు తెగగొఱికి మన యాపద బాపగలడు. అక్కడికి మనము పోయెదము." అని చెప్పగానే పావురములన్ని చిత్రగ్రీవుడు చెప్పిన గుఱుతు పట్టుకొని పోయి హిరణ్యకుని కలుగు దాపున వ్రాలెను. అప్పుడు హిరణ్యకుడు కపోతములు వ్రాలిన సద్దు విని భయపడి కలుగులో మెదలకుండెను. అనంతరము చిత్రగ్రీవుడు కలుగు దాపుచేరి యెలుగెత్తి యిట్లనియె: 'ఓ చెలికాడా ఏల మాతో మాటలాడవు?' అనగానే హిరణ్యకుడా మాట సవ్వడి పట్టి శీఘ్రముగా లాగ వెలుపలికి వచ్చి యిట్లనియ:
హిరణ్యకుడు పావురములను విడిపించుట
మార్చు"ఆహా! ఏమి నా భాగ్యము! నా ప్రియ మిత్రుడు చిత్రగ్రీవుఁడు నాకు నేత్రోత్సవము చేయుచున్నాఁడు." అని పలుకుచు వలలోఁ దగులుకొన్న పావురములను జూచి వెఱఁగుపడి క్షణ మూరకుండి "చెలికాడా! ఇది యే" మని యడిగెను. చిత్రగ్రీవుడిట్లనియె: "ఇది మా పూర్వజన్మ కర్మమునకు ఫలము, చేసిన కర్మమనుభవింపక తీఱునా? అనఁగానే చిత్రగ్రీవుని బంధము చేదించుటకయి సమీపింపఁగాఁ చిత్రగ్రీవుఁ డిటులనియె: "చెలికాఁడా! చేయవలసిన దీలాగునఁగాదు. ముందుగా నా యాశ్రితుల బంధము వదిలింపుము. తరువాత నాకుఁగానిమ్ము. "అనిన హిరణ్యకుఁడు విని యిట్లనియె: "నా దంతములు మిక్కిలి కోమలములు. అన్నిఁటి బంధములు కఱచి త్రెంపజాలను. పండ్ల బలిమి కలిగినంతదాఁక నీ బంధము చేదించెదను. తరువాత శక్తి కలిగిన పక్షమున మిగిలిన వారి కార్యము చూచుకొందము" అనిన విని చిత్రగ్రీవుఁడిట్లనియ. ఆలాగుననే కానిమ్ము. శక్తికి మీఱి యేమి చేయవచ్చును? ముందు యథాశక్తి వీరి నిర్బంధము మానుపుము. ఆ వల నా వని యప్పటికయిన యట్లు విచారించుకొందము." అనిన హిరణ్యకుఁడిట్లనియె: "తన్నుమాలి పరుల రక్షింపవలె ననుట నీతిగాదు, 'తన్నుమాలిన ధర్మము, మొదలు చెడ్డ బేరము గలదా?' యను లోకోక్తి విన్నాఁడవు గావా? తాను బ్రతికి కదా సమస్త పురుషార్థములు సాధించుకోవలె? తాను బోయిన తరువాత దేనితో నయినఁ బనియేమి? అన విని చిత్రగ్రీవుఁ డిట్లనియె. "చెలికాడా! నీవు చెప్పినది నీతి కాదనను. అయినను నావారి దుఃఖము చూచి సహింపజాలను కాబట్టి యింత నొక్కి చెప్పితిని. ప్రాఙౌండు తన జీవితమునయిన మానుకొని మంచివారికి వచ్చిన కీడు తొలగింపవలె నని నీతికోవిదులు చెప్పుదురు. అది యటుండనిమ్ము. నావంటి వారు వీరు. వీరి వంటివాఁడను నేను. ఇప్పటి కొదవని నా ప్రభుత్వము వలన వీరికి రాఁగల ఫలమేమి? చెలికాఁడా! హేయమై వినశ్వరమైన యీ కళేబరమం దాస్థమాని నాకు యశము సంపాదింపుము. నా వలన జీతమా, బత్తెమా? యేదియు లేదు. అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు. నేను ఋణమెప్పుడు తీర్చుకోగలనీ యెఱుంగను. నా బ్రతుకు ముఖ్యముగా జూడకు, వీరి ప్రాణములు రక్షించితే జాలును. అనిత్యమైన మలినమైన కాయముచేత, నిత్యమై నిర్మలమైన యశము లభించెనా దానికంటె లాభము గలదా? శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము. శరీరము క్షణభంగురము. గుణములు కల్పాంతస్థాయులు, ఇట్టి శరీరము నపేక్షించి కీర్తి పోగొట్టుకొనవచ్చునా?" అనిన విని హిరణ్యకుడు సంతోషపడి పులకితుడై యిట్లనియె. చెలికాడా! మేలు మేలు, నీ యాశ్రితవాత్సల్యము గొనియాడ నేనేపాటివాడను? ఈ గుణముచే ద్రిలోకాధిపత్యమునకు దగి యున్నాడవు." అని పలికి యన్నింటి బంధములు తెగ గొఱికి వానినన్నింటిని సాదరముగా స్ంపూజించి "చిత్రగ్రీవా, చెలికాడా! యెంత వారికి గాని పుర్వ కర్మమనుభవింపక తీఱదు. వల దగులుకోలునకు నొచ్చుకోకు, సమస్తము తెలిసినవాడవు. నీకు నాబోటులు చెప్పెడుపాటివారు గారు. "అని యూరడించి బలగంబుతో జిత్రగ్రీవున కాతిథ్యము చేసి కౌగిలించుకొని వీడు కొలిపెను. అనంతరము చిత్రగ్రీవుడు తన పరిజనములతో హిరణ్యకుని గుణములు కొనియాడుచు నిజేచ్చంజనియె, మిత్రలాభము కంటె మించిన లాభము లోకమందేదియు గానము. కాబట్టి బుద్ధిమంతుడు పెక్కండ్రు మిత్రులను సంపాదించుకోవలెను. ఒక్క మూషికముతోడి మైత్రి కపోతముల కెంతకార్యము చేసినది! చూడుడు. అని చెప్పి మఱియు విష్ణుశర్మ యిట్లనియె: