నీతిశతకము తరువాయి భాగం
దుర్జన పద్ధతి
మార్చుఅకరుణత్వమకారణ విగ్రహః
పరధనే పరయోషితి చ స్పృహా ।
సుజన బంధుజనేష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనామ్ ॥ 41
తాత్పర్యము: కనికరము లేకపోవడం, కారణము లేకుండా కలహములాడడం, పరుల ధనము మీద పరస్త్రీల మీద కోరిక కలిగియుండటం, సజ్జనులను బంధువులను సహించలేకపోవడం వంటివి దుర్జనుని లక్షణములు.
దుర్జనః పరిహర్తవ్యో విద్యయా-లంకృతో-పి సన్ ।
మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః ॥ 42
తాత్పర్యము: శిరస్సు నందు రత్నము కలదైనా దుష్టస్వభావము కలిగిన దగుట చేత సర్పమునూ, విద్యావంతుడైననూ దుర్జనుడూ విడువదగినవారు! కాదా?
జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతశుచౌ దంభః శుచౌ కైతవం
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని ।
తేజస్విన్యవలిప్తతా ముఖరతా వక్తవ్యశక్తిః స్థిరే
తత్కో నామ గుణో భవేత్స గుణినాం యో దుర్జనైర్నాంకితః ॥ 43
తాత్పర్యము: లజ్జగలవాని యందు మాంద్యము వ్రతములచే శుచియైన వాని యందు డంబము, ఆచారవంతుని యందు కపటము, శూరుని యందు నిర్దయ, మౌని యందు తెలివిలేమి, ప్రియ భాషణములు పలుకువాని యందు ప్రగల్భము దుర్గుణములుగా తలచెదరు. అందుచేత చెడ్డవారి చేత ఏది నిందింపబడదో దానినే గుణవంతులకు సద్గుణముగా భావించవలెను.
లోభశ్చేదగుణేన కిం పిశునతా యద్యస్తి కిం పాతకైః
సత్యం చేత్తపసా చ కిం శుచి మనో యద్యస్తి తీర్థేన కిమ్ ।
సౌజన్యం యది కిం బలేన మహిమా యద్యస్తి కిం మండనైః
సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా ॥ 44
తాత్పర్యము: పిసినారితనము కన్నా దుర్గుణమేది? చాడీ కోరుతనమును మించిన పాపమేది? సత్యము చెప్పుటను మించిన తపస్సు ఏది? పరిశుద్ధమైన మనస్సును మించిన బలము ఏది? గొప్పదనమున్న ఎడల తీర్థము లేల? మంచితనము కన్న అలంకారము లేల? సద్విద్యను మించిన ధనమేది? అపకీర్తిని మించిన మృత్యువేది?
శశీ దివసధూసరో గళితయౌవనా కామినీ
సరో విగతవారిజం ముఖమనక్షరం స్వాకృతేః ।
ప్రభు ర్ధనపరాయణః సతత దుర్గతిః సజ్జనో
నృపాంగణ గతః ఖలో మనసి సప్తశల్యాని మే ॥ 45
తాత్పర్యము: పగటిపూట వెలవెలబోవు చంద్రుడు, యవ్వనముడిగిన ప్రియురాలు, తామర పూలు లేని కొలను, రూపసియైనను విద్యా విహీనుడైన వాని ముఖము, ధనముపై మిక్కిలి ఆసక్తి గల ప్రభువు, నిత్య దరిద్రుడైన మంచివాడు, రాజు పంచన చేరిన దుర్జనుడు అను ఈ ఏడుగురూ మేకులు వలె మనస్సును గుచ్చుకొనుచూ దుఃఖమును కలుగజేయుదురు.
న కశ్చిచ్చండ కోపానామ్ ఆత్మీయో నామ భూభుజామ్ ।
హోతారమపి జుహ్వానం స్పృష్టో దహతి పావకః ॥ 46
తాత్పర్యము: తీవ్రమైన కోపము గల ప్రభువులకు సుస్థిరముగా ఆత్మీయతను అందించువాడు వుండడు గదా! యజ్ఞ గుండము నందు తన తృప్తి కోసం అజ్యాదులు హోమము చేయు వారిని సైతము అగ్ని కాల్చును గదా! అనగా కోపము అగ్ని వంటిదని, అది ప్రభువునైనా కాల్చునని భావము.
మౌనాన్మూకః ప్రవచన పటుర్వాచకో జల్పకో వా
ధృష్టః పార్శ్వే భవతి చ వసన్ దూరతో-ప్యప్రగల్భః ।
క్షాంత్యా భీరుర్యది న సహతే ప్రాయశో నాభిజాతః
సేవాధర్మః పరమ గహనో యోగినామప్యగమ్యః ॥ 47
తాత్పర్యము: సేవకా వృత్తి యందున్నవాడు రాజును సేవించు సమయమున మౌనము దాల్చుట చేత మూగవాడగును! ప్రవచన పటుత్వము గలవాడు ప్రేలుడుగాడుగా లేక అసందర్భ ప్రేలాపిగా భావించబడును. రాజు వెంబడి వుండు సేవకుడు భయభక్తులు లేని వాడుగాను, దూరముగా నుండువాడు పిరికివాడు, చేతగానివాడు అగును. ఇట్టి అవమానములను భరించలేని వానిని సత్కులము నందు పుట్టినవాడు కాడని ప్రభువులు భావింతురు. ఇట్టి సేవాధర్మమునెరిగి చక్కగా చరించుట అతీంద్రియులైన యోగులకు సైతము తెలియరానిది. అనగా సేవకావృత్తి ధర్మము ఆచరించడం చాలా కష్టమైనదని భావము.
ఉద్భాసితాఖిల ఖలస్య విశృంఖలస్య
ప్రోద్గాఢ విస్తృత నిజాధమ కర్మవృత్తేః ।
దైవాదవాప్త విభవస్య గుణ ద్విషో-స్య
నీచస్య గోచర గతైః సుఖమాప్యతే కైః ॥ 48
తాత్పర్యము: దుర్జనుల అభివృద్ధికి తెచ్చినవాడు, విధి నిషేధములు పాటించనివాడు, తన పూర్వపు హీన స్థితిని మరచి, దైవాను గ్రహముచే లభించిన సంపద చేత పొగరెక్కి సుగుణములను నిందించువాడునగు నీచుని దర్శించినవారు యే సుఖమునూ పొందరు. కావున అట్టి నీచుల నాశ్రయించుట తగదు.
ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ
లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్ ।
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా
ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్॥ 49
తాత్పర్యము: దుర్జనులతో మైత్రి ప్రారంభమున ప్రాతః కాలపు నీడవలె విస్తారముగా నుండి క్రమక్రమముగా క్షీణించిపోవును. సజ్జన స్నేహము ఆరంభము నందు సాయంకాలపు నీడవలె చిన్నదిగా నుండి క్రమక్రమముగా వృద్ధి చెందును.
మృగ మీన సజ్జనానాం తృణ జల సంతోష విహిత వృత్తీనామ్ ।
లుబ్ధక ధీవర పిశునా నిష్కారణ మేవ వైరిణో జగతి ॥ 50
తాత్పర్యము: పచ్చికచే జీవించు లేళ్ళకు వేటగాండ్రు, నీటి యందు జీవించు మీనములకు జాలరులు, సజ్జనులకు చాడీలు చెప్పు కొండెగాండ్రునూ లోకము నందు కారణములేని విరోధులు వంటివారు.
సుజన పద్ధతి
మార్చువాంఛా సజ్జనసంగతౌ పరగుణే ప్రీతిర్గురౌ నమ్రతా
విద్యాయాం వ్యసనం స్వ యోషితి రతిర్లోకాపవాదాద్భయమ్ ।
భక్తిః శూలిని శక్తిరాత్మ దమనే సంసర్గ ముక్తిః ఖలైః
యేష్వేతే నివసంతి నిర్మల గుణాస్తేభ్యో నమః కుర్మహే ॥ 51
తాత్పర్యము: సత్సంగమము నందు ఆసక్తి, పరులగుణము నందు ప్రీతి, గురువుల యెడల నమ్రత, తన భార్యయందు సంభోగము, లోకనిందయనిన భయము, శివునియందు భక్తి, మనోనిగ్రహము నందు సామర్థ్యము, దుర్జన సాంగత్య విసర్జనము వంటి నిర్మల గుణములు గల సజ్జనులకు నమస్కారము.
విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః ।
యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనామ్ ॥ 52
తాత్పర్యము: ఆపదల యందు ధైర్యము, కలిమి కలిగినపుడు ఓర్పు, సదస్సుయందు వాక్చాతుర్యము, యుద్ధము నందు పరాక్రమము, కీర్తి యందు అనాసక్తి, వేదశాస్త్రాధ్యయనము నందు ఆసక్తి అనునవి మహాత్ములకు సహజ గుణములు.
కరే శ్లాఘ్యస్య్తాగః శిరసి గురుపాద ప్రణయితా
ముఖే సత్యా వాణీ విజయి భుజయోర్వీర్యమతులమ్ ।
హృది స్వచ్ఛా వృత్తిః శ్రుతిమధిగతం చ శ్రవణయోః
వినాప్యైశ్వర్యేణ ప్రకృతి మహతాం మండనమిదమ్ ॥ 53
తాత్పర్యము: మహాత్ములకు సువర్ణ ఆభరణములు లేకపోయిననూ - వారి చేతులకు సత్పాత్ర దానము, శిరస్సున గురుపాదనమస్కృతి, ముఖము నందు సత్యవాక్కు, భుజముల యందు జయకారకములైన పరాక్రమము, హృదయము నందు నిర్మలమైన చిత్తము, చెవులకు శాస్త్రశ్రవణములనునవి అసలైన అలంకారములుగా భాసిందురు.
ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం
కాలే శక్య్తా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్ ।
తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా
సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః ॥ 54
తాత్పర్యము: జీవహింసను వదులుట, పరద్రవ్యముపై మనసును బోనీయక నిగ్రహించుట, సత్యము పలుకుట, సందర్భానుసారం శక్తి కొలది దానము చేయుట, పరస్త్రీ ప్రసంగము చేయక మౌనము వహించుట, అత్యాశను వదులుట, గురువుల యెడల అణకువ, సర్వ ప్రాణుల యందు దయ, సమస్త శాస్త్రములందు సమభావము కలిగియుండుట యనునవియే సమస్త శ్రేయస్సులను పొందుటకు అనుసరించదగిన మార్గము. అనగా అహింస, మనోనిగ్రహం, సత్యవాక్కు, దానము, పరదారాగమనము నందు విముఖత, తృప్తి, అణుకువ, దయ, శాస్త్ర సమత్వములు మహాత్ముల లక్షణములని భావము.
సంపత్సు మహతాం చిత్తం భవే దుత్పలకోమలమ్ ।
ఆపత్సు చ మహాశైల శిలా సంఫూత కర్కశమ్ ॥ 55
తాత్పర్యము: ధనధాన్య వస్తు వాహనాది సంపదల యందు మహాత్ముల మనస్సు నల్ల కలువవలె మెత్తగా నుండును. అదే ఆపదల యందు పెద్ద కొండ యొక్క రోళ్ళ గుట్టవలె కఠినముగా నుండును. అనగా ధనము పట్ల అనాసక్తి, ఆపద సమయాల్లో నిబ్భరముగా నుండెడివారు మహాత్ములని భావము.
ప్రియా న్యాయ్యా వృత్తిర్మలినమసుభంగే-ప్యసుకరమ్
త్వసంతో నాభ్యర్య్థాః సుహృదపి న యాచ్యః కృశ ధనః ।
విపద్యుచ్చైః ధైర్యం పదమనువిధేయం చ మహతాం
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్॥ 56
తాత్పర్యము: న్యాయ సమ్మతమైన వృత్తిచేయుచూ, ప్రాణాపాయము ఏర్పడిననూ అకార్యము చేయకుండా, దుర్జనులను ఏస్థితిలోనూ ప్రార్థించకుండుట, ప్రాణ స్నేహితుడైననూ ధనహీనుడైనచో యాచించకుండుట, ఆపద్సమయములందు దైర్యమును, మహాత్ముల అడుగుజాడల ననుసరించుట యను యీ అసిధారావ్రతము సజ్జనులకు స్వభావ లక్షణమేగానీ ఎవని ఉపదేశము చేత రాలేదు.
ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధిః
ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతేః ।
అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారాః పరకథాః
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్ ॥ 57
తాత్పర్యము: దానము రహస్యముగా చేయుట, ఇంటికి వచ్చిన యాచకునికి ప్రియముగా ఆదరణ చూపుట, ఇతరులకు తాను చేసిన మేలు చెప్పకోకుండుట, ఇతరులు తనకి చేసిన ఉపకారములను సభల్లో ప్రస్తావించుట, సంపద వచ్చిననూ గర్వము లేకుండుట, పరులను ప్రశంసించుట అను ఈ అసిధారావ్రతము సజ్జనులకు స్వభావ లక్షణమేగానీ ఎవని ఉపదేశము చేత రాలేదు.
సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే ।
అంతస్సాగర శుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయే ణాధమమధ్యమోత్తమ జుషా మేవంవిధా వృత్తయః ॥ 58
తాత్పర్యము: బాగా కాల్చిన యినుముపై పడిన నీటి యొక్క పేరు సైతము వినపడదు. అదియే తామరాకుపై నుంటే ముత్యమువలె ప్రకాశించును, కానీ ముత్యము కాదు. ఈ నీటి బిందువులే సముద్రములోని ముత్యపుచిప్ప నడుమ పడితే ముత్యముగా పరిణమించును. అట్లే అధములు, మధ్యములు, ఉత్తములు అను పేరు ఆశ్రయించిన వారి ననుసరించివచ్చును. అధముల నాశ్రయించిన సర్వనాశనము, మధ్యముల వలన సౌఖ్యాభాసము, ఉత్తముల ఆశ్రయించిన వాస్తవ సౌఖ్యం కలుగును.
యః ప్రీణయే త్సుచరితైః పితరం స పుత్రో
యద్భర్తురేవ హితమిచ్ఛతి తత్కళత్రమ్ ।
తన్మిత్రమాపది సుఖే చ సమక్రియం య
దేతత్త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥ 59
తాత్పర్యము: ఎవడు సత్ప్రవర్తన చేత తండ్రిని సంతోషపెట్టునో వాడే కొడుకు. ఎవతె మగని క్షేమమునే కోరునో అదియే భార్య. ఎవడు ఆపదలయందు సుఖముల యందు సమానముగా చెలిమి చూపునో అతడే మిత్రుడు. ఇట్టి పుత్రుడు, భార్య, మిత్రులను భూలోకములో పుణ్యము చేసినవారు మాత్రమే పొందెదరు.
నమ్రత్వేనోన్నమంతః పరగుణ కథనైః స్వాన్గుణాన్య్ఖాపయంతః
స్వార్థాన్సంపాదయంతో వితత పృథుతరారంభ యత్నాః పరార్థే ।
క్షాంత్యైవాక్షేప రూక్షాక్షర ముఖర ముఖా న్దుర్జనా న్దుఃఖయంతః
సంతః సాశ్చర్యచర్యా జగతి బహుమతాః కస్య నాభ్యర్చనీయాః ॥ 60
తాత్పర్యము: అణుకువ గల వారగుటచేత సత్పురుషులు ఔన్నత్యమును పొందుచున్నారు. ఇతరుల గుణములను కీర్తించుట చేతనే తమ సద్గుణములను వెల్లడించు చుందురు. పరుల కార్యముల సాఫల్యతకై ప్రయత్నము చేయుచూ తమ పనులను కూడా నెరవేర్చుకుందురు. దూషణలతో కఠినోక్తులతో తమని నిందించు దుర్జనులను తమ ఓర్పు చేతనే దుఃఖింపచేయుదురు. ఇట్టి ఆశ్చర్యకరమగు ప్రవర్తన గలవారగు సత్పురుషులు లోకము నందు గౌరవింపబడుదురేగానీ... ఎవరికి పూజనీయులు కారు?
పరోపకార పద్ధతి
మార్చుభవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః
నవాంబుభిర్దూరావలంబినో ఘనాః ।
అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః
స్వభావ ఏవైష పరోపకారిణమ్ ॥ 61
తాత్పర్యము: కాసిన పండ్లభారము చేత వృక్షములు వంగినట్లు, మేఘములు వర్షించుటకై కొత్తనీళ్ళ బరువుతో క్రిందుగా వ్రేలాడుచున్నట్లు, సత్పురుషులు సంపద చేత గర్వపడక, తలవంచుకొని వుందురు. యాచించనవసరంలేకనే పరులకు సహాయపడుట వారి స్వభావము కనుక దాని వలన కలుగు బాధలను బాధలుగా భావించరు.
శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన
దానేన పాణిర్న తు కంకణేన ।
విభాతి కాయః కరుణ పరాణాం
పరోపకారేణ న చందనేన ॥ 62
తాత్పర్యము: దయాపరులైన వారి చెవులు శాస్త్రముల వినికిడి చేతనే ప్రకాశించునేగాని బంగారు కుండలములతో కాదు. వారి చేతులు దానముచే శోభిల్లునేగాని కంకణముల అలంకారము చేతకాదు. పరోపకారమే వారి దేహమునకు ప్రకాశముగాని చందనపు అలంకారముకాదు.
పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ ।
నాభ్యర్థితో జలధరో-పి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభియోగాః ॥ 63
తాత్పర్యము: అభ్యర్థించనవసరం లేకనే సూర్యుడు తామర కొలనును వికసింపజేయుచున్నాడు. ప్రార్థన చేయనవసరంలేకనే చంద్రుడు తెల్లకలువను వికసిల్లజేయుచున్నాడు. మేఘుడు ప్రార్థించకుండకనే నీటిని యిచ్చుచున్నాడు. సత్పురుషులు తమంతట తామే పరులకు హితము చేయుటకు పూనిక వహింతురు.
ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్థముద్యమ భృతః స్వార్థావిరోధేన యే ।
తేఽమీ మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే
యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే ॥ 64
తాత్పర్యము: ఎవరు తమ ప్రయోజనములను వదిలి పరుల ప్రయోజనములకు పాటు బడుదురో వారు ఉత్తములు. ఎవరైతే తమ పనులకు భంగము లేకుండా పరుల ప్రయోజనములకై పాటు పడతారో వారు మధ్యములు. ఎవరు తమ ప్రయోజనముల కొరకు పరులకు నష్టము కలుగచేస్తారో వారు మానవరూపంలో వున్న రాక్షసులు. ఎవరు తమకి ఏ లాభం లేకపోయినా పరులకి నష్టం కలిగిస్తారో అట్టివారిని ఏ పేరుతో పిలువవచ్చునో నాకు తెలియదు. అనగా అకారణంగా ఇతరులకి నష్టం కలిగించువారు అధములకన్నా హీనులని భావము.
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి గుణాన్ప్రకటీకరోతి ।
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః ॥ 65
తాత్పర్యం: పాపములు చేయకుండా వారించుట, మంచిచేయుటకు ప్రోత్సహించుట, రహస్యములను దాచి వుంచుట, సద్గుణములను వెల్లడించుట, ఆపత్సమయములందు విడువకుండుట, సమయానికేది అవసరమో దానిని ఇచ్చుట అను లక్షణములు స్నేహితునికి ఉండునని పెద్దలు చెపుతారు.
క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తాః పురా తేఽఖిలా
క్షీరోత్తాపమవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః ।
గంతుం పావకమున్మనస్తదభవ ద్దృష్వ్టా తు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్వ్తీదృశీ ॥ 66
తాత్పర్యం: తనయందు చేరిన నీటికి పాలు తన గుణములన్నింటిని యిచ్చెను. పాలు నిప్పుల మీద కాగుట చూచి నీరు పొంగి అగ్నిలో పడెను. తన మిత్రుని కష్టము చూసి సహించలేక పాలు సైతము పొంగి అగ్నిలో పడుటకు వుద్యుక్తమయ్యెను. అంతట మరల నీళ్ళు చల్లుటచేత, నీరు తనలో చేరుటచే పాలు శాంతించెను. మంచివారి స్నేహము ఇటువంటిది కదా!
ఇతః స్వపితి కేశవః కులమితస్తదీయ ద్విషా
మితశ్చ శరణార్థినాం శిఖరిణాం గణాః శేరతే ।
ఇతోఽపి బడబానలః సహ సమస్త సంవర్తకై
రహో వితతమూర్జితం భర సహం చ సింధోర్వపుః ॥ 67
తాత్పర్యం: సముద్రమునందు ఒకచోట విష్ణువు యోగనిద్ర పోవుచున్నాడు. ఇంకొక చోట అతని వైరులయిన కాలకేయాది రాక్షస సమూహమున్నది. వేరొకచోట సముద్రుని రక్షణ కోరిన మైనకాది పర్వత సమూహములు పడుకొని వున్నవి. ఇచ్చటనే మరియొక చోట ప్రళయ కాలమేఘములతో కూడిన బడబాలనం వున్నది. సముద్రము సువిశాలమై బడబాగ్ని నీటినెంత త్రాగుచున్ననూ మిక్కిలి వృద్ధి చెందుచున్నది. అమ్మో! ఇన్ని బరువులు ఓర్చుచున్న సముద్రమువలె మహాత్ములు కూడా ఎందరెందరికో ఆధారభూతులుగా నుందురు గదా!
జాతః కూర్మః స ఏకః పృథుభువనభరా యార్పితం యేన పృష్ఠం
శ్లాఘ్యం జన్మధ్రువస్య భ్రమతి నియమితం యత్ర తేజస్విచక్రమ్ ।
సంజాతప్యర్థపక్షాః పరహితకరణే నోపరిష్టా న్న చాథో
బ్రహ్మాండోదుంబరాంత ర్మశకవ దపరే జంతవో జాతనష్టాః ॥ 68
తాత్పర్యం: ఎవనిచేత భువనముల యొక్క భారమంతయూ వీపుపై భరింపబడినదో ఆ మహాకూర్మరాజు జన్మమేజన్మము. ఎవని చుట్టూ మహాతేజస్సు గల శింశుమార చక్రము పరిభ్రమిస్తున్నదో ఆ ధ్రువుని యొక్క జన్మ శ్లాఘనీయం. వీరిద్దరు తప్ప ఇతరులందరూ పరోపకారము చేయుటయందు ఆశక్తి లేక నిష్ప్రయోజనములైన జన్మలెత్తినందున ధ్రువునివలె ఊర్ధ్వభాగముననూ లేక, ఆదికూర్మమువలె క్రిందనూలేక, అత్తిపండు వంటి బ్రహ్మాండములో దోమలవలె పుట్టి చచ్చువారు అవుచున్నారు.
తృష్ణాం ఛింధి భజ క్షమాం జహి మదం పాపే రతిం మా కృథాః
సత్యం బ్రూహ్యనుయాహి సాధుపదవీం సేవస్వ విద్వజ్జనమ్ ।
మాన్యాన్మానయ విద్విషోఽప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం
కీర్తిం పాలయ దుఃఖితే కురు దయా మేతత్సతాం చేష్టితమ్॥ 69
తాత్పర్యము: ఆశను త్యజింపుము. ఓర్పు వహించుము. విద్యాగర్వమును వదులుము. పాప కర్మములు చేయుటయందు ప్రీతి చెందకుము. సత్యం పలుకుము. పెద్దల మార్గమును అనుసరించుము. విద్వాంసులను సేవింపుము. పూజ్యులను పూజింపుము. శత్రువునైనా ఆదరించుము. కీర్తిని కాపాడుకొనుము. దుఃఖితులపట్ల కనికరము చూపుము. ఇదియే సత్పురుషుల నడవడి.
మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః
త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః ।
పరగుణ పరమాణూన్పర్వతీకృత్య నిత్యం
నిజహృది వికసంతః సంతి సంతః కియంతః ॥ 70
తాత్పర్యము: తలంపులోను, మాటలోను, ప్రవర్తనలోను పుణ్యము అనే అమృతము కలిగినవారు, త్రికరణశుద్ధిగా సత్కర్మాచరణ మందు ఆశక్తి గలవారు, ముల్లోకవాసులను ఉపకారబుద్ధితో సంతోషపెట్టువారు, పరుల సద్గుణములు స్వల్పమే అయినా కొండంతలుగా చేసి ఎల్లప్పుడూ తమ హృదయములో ఆనందించువారు అయిన సజ్జనులు కొందరు మాత్రమే కలరు.
ధైర్య పద్ధతి
మార్చురత్నైర్మహాబ్ధే స్తుతుషుర్న దేవా
న భేజిరే భీమ విషేణ భీతిమ్ ।
సుధాం వినా న ప్రరయుర్విరామం
న నిశ్చితార్థాద్విరమంతి ధీరాః ॥ 71
తాత్పర్యము: దేవతలు సముద్రమధనము నందుండి ఉద్భవించిన కౌస్తుబాది మణిరత్నముల చేత సంతోషించలేదు. భయంకరమైన కాలకూటమును చూసి భయము పొందలేదు. అమృతము పొందు వరకూ తమ ప్రయత్నమును మానలేదు. ధీరులైన వారు తాము తలంచిన కార్యము నెరవేరునంత వరకూ ప్రయత్నము విరమించరు.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః ।
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి ॥ 72
తాత్పర్యము: విఘ్నములు సంభవిస్తాయన్న భయముతో అధములు కార్యములు ఆరంభించరు. మధ్యములు కార్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినప్పుడు వదిలివేస్తారు. సత్పురుషులు ఎన్ని విఘ్నములు వచ్చినా తాము ఆరంభించిన కార్యమును వదిలిపెట్టరు. నెరవేరుస్తారు.
క్వచిత్పృథ్వీశయ్యః క్వచిదపి చ పర్యంకశయనః
క్వచిచ్ఛాకాహారః క్వచిదపి చ శాల్యోదన రుచిః ।
క్వచిత్కంథాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో
మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖమ్॥ 73
తాత్పర్యము: ఒక చోట కటికనేలపై పరుండవచ్చును. మరియొకచోట పట్టుపరుపుపై శయనించవచ్చును. ఒకచోట కాయగూరలు ఆరగించవచ్చు. వేరొకచోట వరియన్నము భుజించవచ్చు. ఒకచోట నార వస్త్రములు ధరించవచ్చు. వేరొకచోట పట్టుపీతాంభరములు ధరించవచ్చు. కార్యార్థి అయినవాడు కష్టమువచ్చినప్పడు దుఃఖించడు. సుఖము కలిగినప్పుడు సంతోషించడు. కష్టసుఖములు కార్యసిద్ధికి సరిసమానములు.
నిందంతు నీతి నిపుణా యది వా స్తువంతు
లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యథేష్టమ్ ।
అద్యైవ వా మరణమస్తు యుగాంతరే వా
న్యాయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః ॥ 74
తాత్పర్యము: నీతిపరులు నిందింతురుగాక, లేదా పొగడుదురు గాక! సంపదలు వచ్చి పోవును గాక! మరణము ఇప్పుడే కానీ లేదా వేరొక యుగము నందు కలుగును గాక! ధీరోదాత్తులు న్యాయమార్గము నుండి అడుగైనా తొలగరు.
కాంతాకటాక్ష విశిఖా న ఖనంతి యస్య
చిత్తం న నిర్దహతి కోప కృశానుతాపః ।
కర్షంతి భూరి విషయాశ్చ న లోభ పాశైః
లోక త్రయం జయతి కృత్స్నమిదం స ధీరః ॥ 75
తాత్పర్యము: ఎవని మనస్సును ప్రియురాలి క్రీగంటి చూపులనెడి బాణములు గాయపర్చలేవో, కోపమనెడి అగ్ని ఎవని హృదయమును దహించలేదో, ఆశాపాశములతో ఎవని హృదయము లాగబడదో, ఆధీరుడు ముల్లోకములను జయించును.
కదర్థితస్యాపి హి ధైర్య వృత్తేః
న శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్టుమ్ ।
అధోముఖస్యాపి కృతస్య వహ్నేః
నాధః శిఖా యాతి కదాచి దేవ ॥ 76
తాత్పర్యము: ఎటువంటి దుఃఖము సంభవించిననూ ధైర్యవంతుని యొక్క ధైర్యమును గుణమును తుడిచివేయుట శక్యముకాదు. నిప్పును తల్లక్రిందుగా చేసిననూ దాని జ్వాల పైకే ప్రసరించును.
వరం తుంగా చ్ఛృంగా ద్గురుశిఖరిణః క్వాపి విషమే
పతిత్వా-యం కాయః కఠినదృషదంతే విదళితః ।
వరం న్యస్తో హస్తః ఫణిపతిముఖే తీక్ష్ణదశనే
వరం వహ్నౌ పాతస్త దపి న కృతః శీలవిలయః । 77
తాత్పర్యము: పెద్దకొండ శిఖరముపై నుండి కఠిన శిల మీదపడి నుజ్జునుజ్జు అగుట కొంత మేలు. భయంకర విషజ్వాలలు వెళ్ళగ్రక్కు కోరలు గల ఆదిశేషుని నోటిలో చేయి పెట్టుటయూ, అగ్నియందు పడుటయూ మేలనవచ్చు గానీ, శీలము నాశనము అవుట ఎంత మాత్రం మంచిదికాదు.
వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్క్షణాన్
మేరుః స్వల్ప శిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే ।
వ్యాలో మాల్య గుణాయతే విషరసః పీయూష వర్షాయతే
యస్యాంఙ్గే-ఖిల లోక వల్లభతమం శీలం సమున్మీలతి ॥ 78
తాత్పర్యము: ఎవని శరీరమందు సమస్త జనులకు మిక్కిలి యిష్టమైన సత్సీలము ప్రకాశించునో వానికి దహన స్వభావం గల అగ్ని నీరువలె చల్లగాను, దాటరాని సముద్రము చిన్న కాలువవలె నగును. మేరు పర్వతము చిన్న రాయివలెనూ, సింహము లేడివలెనూ, విషసర్పము పూల హారము వలెనూ, కాలకూట విషము అమృతము వలెనగును. దుఃఖమునకు హేతువులైనవన్నీ శీలవంతునికి సుఖప్రదములే అగును.
ఛిన్నో-పి రోహతి తరుః క్షీణో-ప్యుపచీయతే పునశ్చంద్రః ।
ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతా లోకే ॥ 79
తాత్పర్యము: నరకబడి వృక్షము మరల చిగురించుననియూ, క్షీణించిన చంద్రుడు మరల వృద్ధి చెందుననియూ విమర్శించుచూ శీలవంతులు లోకము నందు కష్టములపాలై పరితాపము చెందెదరు. వృక్షాదుల మాదిరి మరలతాము వృద్ధి చెందెదమని తలంచెదరు.
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమో
జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః ।
అక్రోధ స్తపసః క్షమా ప్రభవితుర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వేషామపి సర్వ కారణమిదం శీలం పరం భూషణమ్ ॥ 80
తాత్పర్యము: పెద్దరికానికి మంచితనం అలంకారము. శౌర్యమునకు మితభాషణ ఆభరణం. జ్ఞానమునకు శాంతి, శాస్త్రమునకు వినయము, ద్రవ్యమునకు పాత్రోచితవ్యయము, తపస్సునకు క్రోధరహితము, సమర్థునకు క్షమ అలంకారములు. ధర్మమునకు డంబము లేకుండుట ఆభరణం. అన్నింటికీ మూలమగు సత్సీలము అన్నింటికంటే ఉత్కృష్టమైన అలంకారము.
దైవ పద్ధతి
మార్చునేతా యస్య బృహస్పతిః ప్రహరణం వజ్రం సురాః సైనికాః
స్వర్గో దుర్గమనుగ్రహః ఖలు హరే రైరావణో వారణః ।
ఇత్యాశ్చర్య బలాన్వితో-పి బలభిద్భగ్నః పరైః సంగరే
తద్వ్యక్తం నను దైవమేవ శరణం ధిగ్ధిగ్వృథా పౌరుషమ్ ॥ 81
భగ్నాశస్య కరండ పిండిత తనోర్ల్మానేంద్రియస్య క్షుధా
కృత్వాఖుర్వివరం స్వయం నిపతితో నక్తం ముఖే భోగినః ।
తృప్తస్తత్పిశితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా
స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్ధౌ క్షయే కారణమ్॥ 82
యథా కందుకపాతే నో త్పత త్యార్యః పత న్నపి ।
తథా త్వనార్యః పతతి మృత్పిండపతనం యథా ॥ 83
ఖర్వాటో దివసేశ్వరస్య కిరణైః సంతాడితో మస్తకే
వాంఛన్దేశమనాతపం విధి వశాత్తాలస్య మూలం గతః ।
తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః
ప్రాయో గచ్ఛతి యత్ర దైవహతక స్తత్రైవ యాంత్యాపదః ॥ 84
తాత్పర్యం: సూర్య కిరణములచే (ఎండ తీవ్రత) బాధింపబడిన ఒక బట్టతలవాడు నీడకొరకై పరుగెత్తి ఒక తాడి చెట్టు క్రింద నిలుబడగా, ఆ చెట్టు యొక్క పండు వేగంగా వ్రాలి పడి అతని తల పగిలిందట. దైవోపహతుదు, దురదృష్టవంతుడు వెళ్ళినచోటుకే ఆపదలు కూడా వెళుతాయి అని భావము.
గజ భుజంగవిహంగమ బంధనమ్
శశి దివాకరయోర్గ్రహ పీడనం ।
మతిమతాం చ విలోక్య దరిద్రతాం
విధిరహో బలవానితి మే మతిః ॥ 85
సృజతి తావదశేష గుణాకరం
పురుష రత్నమలంకరణం భువః ।
తదపి తత్క్షణ భంగి కరోతి చే
దహహ కష్టమపండితతా విధేః ॥ 86
అయ మమృతనిధానం నాయకో-ప్యోషధీనాం
శతభిషగనుయాతః శంభుమూర్న్ధో-వతంసః ।
విరహయతి న చైవం రాజయక్ష్మా శశాంకం
హతవిధిపరిపాకః కేన వా లంఘనీయః ॥ 87
ప్రియసఖ విపద్దండాఫూత ప్రపాతపరంపరా
పరిచయబలే చింతాచక్రే నిధాయ విధిః ఖలః ।
మృదమివ బలాత్పిండీకృత్య ప్రగల్భకులాలవ
ద్భ్రమయతి మనో నో జానీమః కి మత్ర విధాస్యతి ॥ 88
విరమ విర మాయాసా దస్మా ద్దురధ్యవసాయతో
విపది మహతాం ధైర్యధ్వంసం య దీక్షితు మీహసే ।
అయి జడవిధే కల్పాపాయే-ప్యపేత నిజక్రమాః
కులశిఖరిణః క్షుద్రా నైతే న వా జలరాశయః ॥ 89
దైవేన ప్రభుణా స్వయం జగతి యద్యస్య ప్రమాణీకృతం
తత్త స్యోపనమే న్మనా గపి మహా న్నైవాశ్రయః కారణమ్ ।
సర్వాశాపరిపూరకే జలధరే వర్ష త్యపి ప్రత్యహం
సూక్ష్మా ఏవ పతంతి చాతకముఖే ద్విత్రాః పయోబిందవః ॥ 90
కర్మ పద్ధతి
మార్చునమస్యామో దేవా న్నను హతవిధేస్తే-పి వశగా
విధిర్వంద్యః సో-పి ప్రతినియత కర్మైక ఫలదః ।
ఫలం కర్మాయత్తం యది కిమమరైః కిం చ విధినా
నమస్తత్కర్మేభ్యో విధిరపి న యేభ్యః ప్రభవతి ॥ 91
బ్రహ్మా యేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే
విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహా సంకటే ।
రుద్రో యేన కపాల పాణి పుటకే భిక్షాటనం సేవతే
సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే ॥ 92
యా సాధూంశ్చ ఖలాన్ కరోతి విదుషో మూర్ఖాన్ హితాన్ ద్వేషిణః
ప్రత్యక్షం కురుతే పరోక్షమమృతం హాలాహలం తత్క్షణాత్ ।
తామారాధయ సత్క్రియాం భగవతీం భోక్తుం ఫలం వాంఛితం
హే సాధో వ్యసనైర్గుణేషు విపులేష్వాస్థాం వృథా మా కృథాః ॥ 93
శుభ్రం సద్మ సవిభ్రమా యువతయః శ్వేతాతపత్రోజ్వ్జలా
లక్ష్మీ రిత్యనుభూయతే చిర మనుస్యూతే శుభే కర్మణి ।
విచ్ఛిన్నే నితరా మనంగకలహక్రీడాత్రుట త్తంతుకం
ముక్తాజాల మివ ప్రయాతి ఝడితి భ్రశ్య ద్దిశో-దృశ్యతామ్ ॥ 94
గుణవదగుణవద్వా కుర్వతా కార్య మాదౌ
పరిణతిరవధార్యా యత్నతః పండితేన ।
అతిరభస కృతానాం కర్మణామావిపత్తే
ర్భవతి హృదయ దాహీ శల్య తుల్యో విపాకః ॥ 95
స్థాల్యాం వైడూర్యమయ్యాం పచతి తిలకణాంశ్చందనైరింధనౌఘైః
సౌవర్ణైర్లాంగలాగ్రైర్విలిఖతి వసుధా మర్కతూలస్య హేతోః ।
ఛిత్వ్తా కర్పూర ఖండాన్ వృతిమిహ కురుతే కోద్రవాణాం సమంతాత్
ప్రాప్యేమాం కర్మభూమిం న భజతి మనుజో యస్తోప మందభాగ్యః ॥ 96
నైవాకృతిః ఫలతి నైవ కులం న శీలం
విద్యాపి నైవ న చ యత్న కృతాపి సేవా ।
భాగ్యాని పూర్వతపసా ఖలు సంచితాని
కాలే ఫలంతి పురుషస్య యథైవ వృక్షాః ॥ 97
మజ్జత్వంభసి యాతు మేరుశిఖరం శత్రూన్ జయత్వాహవే
వాణిజ్యం కృషి సేవనాది సకలా విద్యాః కలాః శిక్షతామ్ ।
ఆకాశం విపులం ప్రయాతు ఖగవత్కృత్వా ప్రయత్నం పరం
నాభావ్యం భవతీహ కర్మ వశతో భావ్యస్య నాశః కుతః ॥ 98
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే
మహార్ణవే పర్వత మస్తకే వా ।
సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని ॥ 99
భీమం వనం భవతి తస్య పురం ప్రధానం
సర్వో జనః సుజనతా ముపయాతి తస్య ।
కృత్స్నా చ భూర్భవతి సన్నిధి రత్నపూర్ణా
యస్యాస్తి పూర్వ సుకృతం విపులం నరస్య ॥ 100