నిర్వచనోత్తరరామాయణము/షష్ఠాశ్వాసము

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

షష్ఠాశ్వాసము



యుతునకుఁ గాంతిప్రా
లేయరుచికి ధర్మమతికి లీలాసుమన
స్సాయకునకుఁ బుణ్యాధి
ష్ఠాయకునకు మనుమసిద్ధి జనపాలునకున్.

1


క.

దనుజాధీశ్వరునకు మును, మును పుట్టినకొడుకు ధర్మమున నీశ్వరుఁ దృ
ప్తునిఁ గావించి వరంబులు, గనిన సుహృద్బంధుపౌరగణము లెలర్చెన్.

2


చ.

మన మలరంగ సద్భటసమాజము నూరెల నిల్వ నెంతయుం
బెనుపున మేఘనాదుఁడు విభీషణుఁడుం దనతోడ రా మదిం
చినకరివోలెఁ బుష్పకముఁ జేరి మృణాళలతాలివోనియ
వ్వనితలపిండు దైత్యకులవల్లభుఁ డల్లన డించి తెచ్చినన్.

3


మ.

తరుణీబృందముఁ జూచి సారకరుణోదారుండు దైత్యేశ్వరా
వరజుం డావలిమోము సేసికొని యేవం బిచ్చరిత్రంబు ని
ష్ఠుర మోహో యని సంచలద్వదనుఁ డై శుంభద్భుజాగర్వవి
స్ఫురితుం డైననిజాగ్రజన్ముమొగముల్ సూచెన్ విషాదంబుతోన్.

4


ఆ.

తన్నుఁ జూచుననుఁగుఁదమ్ముని భావించి, నగుచు దైత్యవంశనాయకుండు
పగఱవారిఁ జెఱలఁ బట్టక ముద్దాడి, వత్తు రయ్య శౌర్యవంతు లనిన.

5


చ.

గుణ మిది దోష మిట్టి దని కొంత యెఱింగినఁ గాక యిట్లు ని
ర్గుణతయ పట్టి క్రాలుతమకుం దగువారలు సెప్పు సౌమ్యభా
షణము నిరర్థకం బనువిచారము నెమ్మదిఁ బుట్టి యవ్విభీ
షణుఁ డుచితంపుమాటలఁ బ్రసంగము డిగ్గఁగఁ ద్రావి యిట్లనున్.

6

విభీషణుఁడు కుంభీనసను మధుఁ డపహరించె నని యన్నతోఁ జెప్పుట

క.

నీ వరిగినదిగ్జయమున, కీవల మధుదానవేంద్రుఁ డేతెంచి పురిం
గావలి యున్నదనుజసుభ, టావలిఁ బొరిపుచ్చి భుజబలాటోపమునన్.

7


తే.

ఉవిద లాక్రందనము సేయుచుండ నొక్క
రమణిఁ గొనిపోయె నంతఃపురంబుఁ జొచ్చి

యదియు మనమాల్యవంతుని యనుఁగుఁగూఁతు
ననుఁగుఁగూఁతురు కుంభీనసాభిధాన.

8


ఉ.

యజ్ఞరసప్రమత్తుఁ డగునాత్మజుపై సడి పెట్ట లేదు నా
యజ్ఞత నప్పు డేఁ జని సమాధినిమగ్నమనః ప్రవృత్తిఁ గా
లజ్ఞుఁడఁ గాక వారిధిజలంబులలోన మునింగి యుండి య
ప్రాజ్ఞులచేత నాలిఁబడుపాటికి వచ్చితి నేమి సెప్పుదున్.

9


క.

అనుడు బొమలు ముడివడునా, ననములఁ గెం పడర నసురనాథుం డేమీ
మనవీ డొకరుఁడు సొచ్చెనె, యనుమానము దక్కి గుండె లదరక చక్కన్.

10


క.

రాసొబగున నున్మత్తుం, డై సెంకింపక కడంగి యాతం డింతల్
నేనెఁ గదె చెడితి రిప్పులి, మీసల నుయ్యాల లూగి మెయి మెయిఁ బోయెన్.

11


చ.

చెలియలిఁ గోలుపోయి యెడ సేసినఁ జాలమి వెట్టి నవ్వరే
కెలనను గాన నమ్మధువు గీటడఁగించెద దాడి వెట్టి నా
బలిమి దఱుంగ నీనడిమి బన్నము విన్న నమర్త్యు లెంతయుం
జెలఁగక తక్క రందుఁ జని చేతులతీఁటకు మందు సేసెదన్.

12

మధునిపై దండెత్తినరావణుఁడు కుంభీనసప్రార్థనచే వానితోఁ జేలిమి సేయుట

మ.

అని వీటం దనపిన్నతమ్ము నిడి నిద్రాసక్తుఁ డై యున్నత
మ్ముని బోధింపఁగఁ బంపి తోడ్కొనుచు నేము న్నేన ము న్నంచు నీ
సున నాతండును మేఘనాదుఁడును రక్షోవంశవీరోత్సవం
బొనరింపన్ మధుమానమర్దనవిదగ్ధోత్సాహసన్నాహుఁ డై.

13


క.

చని మధురాపురి ముట్టిన, విని కుంభీనస భయంబు వినయంబు జనిం
ప నరుగుదెంచి ధరాలిం, గనముగఁ గృప పుట్ట నన్న కాళ్లం బడియెన్.

14


తే.

అతఁడు కరుణాసమేతుఁడై యతివ నెత్తి, నిన్నుఁ దెచ్చిన పాపాత్ముఁ డున్నచోటు
సెప్పు మిప్పుడ వాని నిర్జించి నీకు, హర్ష మొనరింతు ననిన నయ్యంబుజాక్షి.

15


మ.

తగునే నీయిలు సొచ్చి నన్నుఁ గొని రా దైతేయవంశాధముం
డు గరం బెగ్గొనరించె నైనను భుజాటోపంబు సూపంగ లో
కగరిష్ఠుం డగునీకు వాఁడు దొరయే కన్యాత్వమే నాకు లే
దు గదా పడ్డది కార్య మింకఁ జన దాదుష్టాత్ము నిర్జింపఁగన్.

16


క.

మధువున కలుగుట యది నను, విధవంగాఁ జేత గానవే యేటికి వాఁ
డధముం డనలే నెమ్మెయి, వధియించుట పాడి గా దవద్యవిహీనా.

17


తే.

అదియుఁ గాక రాక్షస మన మొదలఁ బరిణ
యప్రపంచంబునం దొకయధమవిధము
గలదు గావున నది గాఁగఁ దలఁచి యైనఁ
దప్పు సైరింపు నాకుఁ గా దళితవైరి.

18

క.

అతఁడు నతిబహులనిద్రాయుతుఁ డై యున్నాఁడు గాచు టొప్పదె సంబో
ధితుఁ జేసి తెచ్చి సేవా, రతుఁ జేసెద ననిన దనుజరా జి ట్లనియెన్.

19


చ.

అలఁతులఁ బోవు తప్పె యిది యైనను నాతఁడు నేతికుండపై
యెలుక సలంబుఁ బోవిడిచి యేను భవత్పతిఁ గాచితిన్ మనం
బలరఁగఁ బోయి నిద్ర దెలియంగ సుపాయము సేయు నాకు నె
చ్చెలి యగుఁ దోడితె మ్మనినఁ జేడియ సమ్మద మంది క్రమ్మఱన్.

20


చ.

చని పతి నిద్ర దెల్పి దనుజప్రభురాకయుఁ దాను బోకయున్
మన మలరంగ బాంధవపుమాటలు సంధి దగంగఁ జేసి యా
తనిఁ దమయన్నపాలికి ముదంబునఁ దోకొనిపోవఁ బూని వ
చ్చినతన దైనపూనికయుఁ జెప్పిన గొండొక సమ్మతించుచున్.

21


క.

మీయన్నకుఁ దేజముగాఁ, బోయి యతనిఁ గంటి నన్ను బోధింపవ యే
నాయనకుఁ జాల నని యిఁకఁ, జేయునదియుఁ గలదె గడవఁ జేసితి తరుణీ.

22


క.

ఈచనవు సెల్ల నిచ్చితి, నీ చెప్పినయట్ల యతని నేఁ గనియెద మై
త్రీచాతుర్యసమగ్రుఁడ, నై చేసెదఁ బిదపఁ దగుసహాయం బెల్లన్.

23


ఆ.

అని యలంకరించుకొని తనసేన స, న్నాహసుందరముగ నడవఁ బనిచి
వారణేంద్రు నెక్కి వచ్చి బావకుఁ బొడ, సూపె మధువు పెంపుసొంపు మిగుల.

24

మధుఁడును రావణుఁడు నింద్రునిపై దండెత్తుట

ఉ.

ఆదశకంధరుం డుచిత మయ్యెడుభంగి మఱందికిన్ మహా
హ్లాద మొనర్చి పేర్చి యమరాధిపుపై నడవం దలంచు ట
త్యాదరలీలఁ జెప్పి తగ నప్పురి నాఁడు వసించి యాతఁడుం
గా దన కెత్తి తో నడవఁ గా మఱునాఁ డటఁ బోయె నుధ్ధతిన్.

25


ఉ.

రావణుఁ డిట్లు దేవనగరంబుపయిన్ బలపాదధూళివి
ద్రావితసర్వదిగ్వలయరాజకులుం డగుచుం గడంక మై
బోవునెడం బథంబున నభోవిభవంబుఁ దిరస్కరించుశృం
గావళి నుల్లసిల్లురజతాద్రిఁ గనుంగొని కౌతుకంబునన్.

26


ఉ.

శూలినివాస మై తెలుపుసొంపునఁ బొంపిరివోవు నమ్మహా
శైలముచక్కిఁ జక్కటికి సప్తతురంగముఁ డేగు దెంచి యు
త్తాలపుదేవగేహము సుధం జెలునొందఁగ నందుఁ బేర్మికిం
జాలి వెలుంగురత్నకలశంబువిధంబునఁ దేజరిల్లెడున్.

27


ఆ.

అనుచు నగముఁ జేర నరిగి రక్షోవంశ, కరుఁడు దానిసొంపు గలయఁజూచి
యనుఁగుఁదమ్మునికిఁ బ్రియమ్మునఁ జూపుచు, నిట్టు లనియె వేడ్క యెసక మెసఁగ.

28

కైలాసవర్ణనము

క.

సెలయేఱు వాఱఁ జెలు వగు, శిలపైఁ దజ్జలము దిగుచు సింధురపతి చూ
డ్కుల కొప్పెఁ బుండరీక, స్థలమున మకరంద మానుషట్పదముక్రియన్.

29


చ.

అరవిరిగుత్తులం బొలిచి యల్లనిగాడ్పులఁ దూలు నీలత
ల్దరహసితోదయంబు సవిలాసతనూవలనంబుఁ గల్గుసుం
దరులతెఱంగు గాఁ బతివిధంబున నున్నరసాలపోత మీ
గిరితటభూమికిన్ సరసశైలికి వచ్చినమాడ్కి నొప్పెడున్.

30


క.

మనరాక హర్మ్యతలమునఁ, గనుఁగొనియెడు కామినులమొగంబులు వాతా
యనమునఁ గానఁగ నగుచా, డ్పున నీతమ్మికొల నొప్పె భూధరముపయిన్.

31


క.

ఈవెండికొండశిఖరము, క్రేవఁ దమాలతతి దృష్టికిం బ్రియ మొసఁగం
గా వలఁతి యయ్యె నీల, గ్రీవునికంఠంబుకప్పుక్రియ నందం బై.

32


చ.

అని గిరి రామణీయకమునందు మనం బెలయించి యద్దశా
ననుఁడు బలంబుఁ దత్తటమునన్ విడియింపఁ దలంచి సన్నివే
శనవిధిసూచనార్థము దెసల్ సెలఁగన్ బటుభేరి వేయఁగాఁ
బనిచి మనోహరం బయినపట్టునఁ దా విడిసి బ్రియంబునన్.

33


ఆ.

ఇట్లు విడిసి దానవేంద్రుఁడు బహువినో, దములఁ దగిలి చతురసముచితాల్ప
పరిజనములతోడ గిరితటరమణీయ, తలమునందుఁ గేలి సలిపె నర్థి.

34


క.

మగుడఁ జనుదెంచి యర్హం, బగుగతి మజ్జనముఁ గుడుపు నైనపిదపఁ దాఁ
దగ లోపలికొలువున నిం, పుగ సుఖసత్కథలఁ బ్రొద్దు పుచ్చె సరసుఁ డై.

35


ఉ.

అంత సహస్రపాదుఁ డపరాచలశృంగతటంబు సేరె దు
ర్దాంతుఁడు దానవేంద్రుఁ డమరప్రకరంబు జయింపఁ బోవుచో
నెంతలు పుట్టునో యనుచు నే పడఁగంగఁ దొలంగి కాలుకొ
న్నంతయు దవ్వుగాఁ జని భయం బడరన్ గిరిదుర్గ మెక్కె నాన్.

36


క.

అరుణకరబింబ మస్తశి, ఖరిపైఁ గర మొప్ప బహులకస్తూరీలి
ప్తరుచిరకుచకాశ్మీర, స్ఫురితస్థాపకముచందమున నందం బై.

37


క.

మఱి కొంతవడికిఁ జీఁకటి, తఱ చై తోతెంచె దశవదనునుద్యోగం
బెఱిఁగి నిశాటబలము గ్రి, క్కిఱియం బలుదెసలనుండి యేతెంచె ననన్.

38

అంధకారవర్ణనము

సీ.

ఇది చూడ్కిఁ గప్పిన యంతటఁ బోక తక్కటియింద్రియంబులఁ గప్పకున్నె
యిది వెల్లి గైకొని యేచి యిండ్లులు సొచ్చి దీవియలఁ బొరిగొనఁఁ గవియకున్నె
యిది నేఁడు శశి గెల్చి యెల్లి యేతెంచు నన్నలినాప్తు మార్కొని నిలుపకున్నె
యిది వెలుం గనునామమెల్లను నడిపి యిజ్జగతి నింకెటుఁ దాన నెగడకున్నె

తే.

నిక్కముగ నిది చీఁకటియొక్కొ తలఁప, నేమి మాయయొ కాక ము న్నిట్టితిమిర
మెఱుఁగ మెన్నఁడు నా జనులెల్ల బెగ్గ, లించునట్లుగఁ గడు నగ్గలించెఁ దమము.

39

చంద్రోదయచంద్రికావర్ణనములు

తే.

యామినీకాంత మృగమద మలఁది మలయ, జమునఁ దిలకంబుఁ బెట్టినచంద మగుచు
నిఖిలదిక్కులఁ దిమిరంబు నిండియుండ, నలఁతియై ప్రాఙ్ముఖంబునఁ దెలుపు దోఁచె.

40


క.

రావణుఁ డమరులమీఁదం, బోవుట విని యతనితోడి పురుడునకుం బాం
థావలిపై వెస వచ్చెం, గావలయు ననంగ నమృతకరుఁ డుదయించెన్.

41


సీ.

చిత్తజుచిగురులం జిత్రంబుగా నిడ్డ లలితతమాలపల్లవ మనంగ
రతిపుమాణిక్యదర్పణమున నూనిన కమనీయమృగమదకణ మనంగ
వెడవిల్తులీలారవిందంబుమీఁదికిఁ దివుటమై నెరఁగినతేఁటి యనఁగ
వలరాజుసిందూరతిలకంబులోఁ జెలువొందు కాలాగరుబిందు వనఁగ


ఆ.

నుదయరాగమహిమ నుజ్జ్వలం బైనబిం, బంబునడుము లాంఛనంబు చెన్నుఁ
జేయఁ బూర్వశైలశిఖరదేశంబున, నిందుఁ డొప్పె భువన మెలమి మిగుల.

42


ఉ.

పంబినకెంపుఁ బాసి దివిఁ బ్రాఁకి దిశల్ వెలిఁగించి చంద్రకాం
తంబుల నీరు నేసి కుముదంబులఁ బండువు సేయఁ బంచి య
బ్జంబుల నిద్ర వుచ్చి మరుసాయకముల్ గరసానఁ బట్టి కో
కంబుల నేఁచి లోకముపొగడ్తలు సేకొని చంద్రుఁ డున్నెడన్.

43


క.

బడి చేసినచందంబునఁ, గడువేగం బొకటి నొకటిఁ గదిసి దివిని సం
దడి గా నెంతయు గుంపుగఁ, బడి వెన్నెలకుం జకోరపంక్తులు గవిసెన్.

44


క.

మును మును నెగడెడురశ్ముల, కొన లెల్లం బట్టికొని చకోరంబులు ద్రుం
చిన నచట నచటఁ దుఱఁగలి, గొని పెరిఁగెడుమాడ్కి దలముకొని ప్రభ లెసఁగెన్.

45


తే.

తివిచి నవకంబు దీప్తులు ద్రెంచి యలఁతి
తునియలుగఁ జంచుపుటములఁ ద్రుంచి తల్లు
లాదరంబున నంది యీనఱ్ఱు లెత్తి
ప్రీతిఁ గముచుఁ జకోరంబుఁబిల్లగములు.

46


క.

చంచులఁ గాంతులు వెన్నెలఁ, జించి యమృత ముట్ట నొసఁగు చెన్నునకును రా
గించుచుఁ జవిఁ జొక్కుచుఁ గబ, ళించుఁ జకోరికలు సమదలీలాలస లై.

47


సీ.

క్రమ్మి పైఁ దొరఁగెడు కౌముదితీయంబు సొంపునఁ దనుపునఁ జొక్కి చొక్కి
పచరించుచ ద్రాతపంబు కాలువలలో నడ్డంబుగా నిల్చి యాఁగి యాఁగి
వెల్లువ పెల్లు సూపెడుసాంద్రచంద్రికాపూరంబు గని మదిఁ బొంగి పొంగి
మిన్నులతో రాయు వెన్నెలకరడుల నెఱకలు సడలించి యీఁది యీఁది


ఆ.

చెలఁగి చెలఁగి మలఁగి మలఁగి యల్లల్లన, క్రాలి క్రాలి బిట్టు తూలి తూలి
సమదవృత్తిఁ గేలి సలిపెఁ జకోరచ, యంబు సదలు దమమయంబు గాఁగ.

48

క.

తడఁబడ నొండొంటికి ము, న్నెడఁ గముచుచు నొడిసికొనుచు నేపునఁ బైపైఁ
బడుచు నవు లవుల నీసునఁ, గడచుచు వెన్నెలఁ జకోరగణ మానునెడన్.

49


క.

తినుగమి నొల్లక యొకయెడఁ, దనయిచ్చకు వచ్చునిందుధామనికాయం
బున మవ్వ మెక్కి నిగిడెడి, కొనలు గమిచి మేసె నొకచకోరము దివుటన్.

50


ఉ.

సమ్మదవారి గన్గడలఁ జాలుగ మై గరుపార నిందుబిం
బమ్మున దృష్టి నిల్పి పయిఁబ్రాఁకుమరీచుల నూఁగునూఁగులేఁ
గొమ్మలు పట్ట చంచుపుటకోటిఁ గదల్చి తెమల్చికొంచు సౌ
ఖ్యమ్మ విహంగమ మ్మయిన యాకృతి నొందెఁ జకోర మొక్కెడన్.

51


చ.

కలయఁగ నూనునట్లుగ జగంబు సమస్తముఁ జాలఁ దోఁగెనో
జలజభవుండు గోరి పెఱచాయల నెల్లను మాన్చి యెందునుం
దెలుపు ఘటించెనో యమృతదీధితి వేడుక విశ్వరూపుఁ డై
నిలిచెనొ నాఁగ నెల్లెడల నిండఁగ వెన్నెల పర్వె సాంద్ర మై.

52


క.

వెన్నెలపోతపనులొ యన, వెన్నెలగండరువుపనులవిధమున మీఁదన్
వెన్నెలనీరు వఱపి రనఁ, గన్నుల కిం పొసఁగె నిల సకలరూపములున్.

53


చ.

అలసత యొప్ప నల్లన రతాంతమునం బ్రియునొద్దఁ బాసి నె
చ్చెలికడ కేగుదెంచు సరసీరుహనేత్రవిలోచనంబులం
దలఁకెడుమందహాసము విధంబున సౌంపున మీఱి యున్న చెం
గలువలలోన నింపడరుకౌముది వేడ్క లొనర్చెఁ జూడ్కికిన్.

54


సీ.

భరితసుధారసపాత్రంబు లనుకుముదోత్కరంబులు దళుకొత్త మెఱసి
చంద్రకాంతోపలజలములకాలువ లివి యవి యని యప్పు డేర్పరించి
దెసలు సూడఁగ గుండె దిగ్గనుచక్రసమూహంబునకుఁ దలమునుక లగుచు
నీఁదుచకోరంబు లెగుర వ్రేఁగై యీడిగిలఁబడునట్లుగా దలముకొనుచు


తే.

నంతకంతకుఁ బొంగి మిన్నంది వెల్లి, మిగిలి యెనిమిదిదిక్కులమీఁదఁ బొరలి
జనము లానందమునఁ దేల జగము లెల్లఁ, దొట్టి నిండారువెన్నెల నిట్టవొడిచె.

55


తే.

వివిధవర్ణ మై యసురేంద్రువీడు విడిసి
యుండఁ జంద్రిక పర్వ నక్కొండ యొప్పె
మెఱయుపులితోలు గట్టి మైఁ దఱచు గాఁగ
భూతి యలఁదినభూతేశుపొలుపు దాల్చి.

56

రంభారావణసంవాదము

ఉ.

అత్తఱిఁ జంద్రుఁ జూచు మలయానిలురాకకు స్రుక్కుఁ గామినీ
వృత్తము లాత్మ నెక్కొలుపు వెన్నెలఁ గోరి రమించుచున్న యు
న్మత్తచకోరదంపతుల మచ్చికకున్ మది మెచ్చు లోలుఁ డై
యెత్తినవేడ్కలన్ వెడలి యేకత మేగి దశాస్యుఁ డొక్కెడన్.

57

ఉ.

అప్పు డొకర్తు గొంచెమగునాభరణంబులు సన్నపూఁతయుం
గొప్పిడి త్రిప్పిలోఁ జెరివికొన్న నడంగినపూవులుం బయిం
గప్పినచేలకొంగు నునుఁగప్పును మెల్పున నేగు మెట్టెలేఁ
జప్పుడు చెన్నుఁ జేయుగతిచందము వింతగఁ బోవు నయ్యెడన్.

58


మ.

కని వేగంబున నడ్డ మేగి యతఁ డాకంపించునక్కాంతకే
లను రాగంబునఁ బట్టి యెవ్వతెవు నీ వత్యంతకౌతూహలం
బున నెచ్చోటికిఁ బోయె దన్న నది యంభోజంబుచందాన నా
నన ముజ్జృంభణ మందఁ బెంజెమట మేనం గ్రమ్మఁగా నిట్లనన్.

59


చ.

అతులితధైర్యసారకరుణాలయమానస యేను రంభ నా
పతి నలకూబరుం డతనిపాలికిఁ బోయెద నన్యచిత్త యై
యతివ సనంగ నెందు నిటు లడ్డము వత్తురె నాదు పేరుఁ బో
వు తలఁపు వింటి పాయు నగవుం దగుమాత్రయ కాక యొప్పునే.

60


క.

పొలఁతుక యిమ్మెయి నేర్పడఁ, బలుకఁగ వెండియును మరునిబాణంబులకుం
గొలఁ దై యొప్పనివేడుక, చులుకఁదనము సేయు నయ్యసుర యిట్లనియెన్.

61


చ.

పడఁతుక యేను రావణుఁడ బాహుబలంబున నింద్రువీటిపై
నడచుచు నుండి యిన్నగమునన్ విడియించితి సేన నిప్పు డి
య్యెడి కలవోక వచ్చి సొగయించువిధంబునఁ బోవుచున్న నిన్
బొడగని కాముబల్మతకముల్ నను నిమ్మెయి వెఱ్ఱిఁ జేసినన్.

62


ఉ.

చిక్కితి నిష్టభోగములు సేకుఱుఁ బెంపును దేజ మెక్కఁగా
డక్కినబంట నైతి నొకటం గొద లేక జగంబు లెల్ల నీ
వెక్కటి యేలు మన్న హరిణేక్షణ పంక్తిముఖుండ వేని నే
నక్కట నీకుఁ గోడలఁ గదయ్య తొలంగు తొలంగు నావుడున్.

63


ఆ.

కొడుకు పెండ్ల మైన గోడలు గాక పూఁ, బోఁడి యిట్లు దెరువె పోయిపోయి
నీవు మాట లాడ నేర్తు గదా యని, యెట్టు లేని నాడు టిది క్రమంబె.

64


క.

అనిన నసురేంద్రు పలుకులు, విని నవ్వుచు మీర లొక్కకవిశ్రవసునకున్
జనియించుట యెఱుఁగనె యా, ధనదుండును నీవు నన్నదమ్ములు గారే.

65


క.

అతనికొడుకు నీకును గొడు, కతనిసతిని నీకుఁ గోడ లని నైజము చె
ప్పితిఁ గాక తప్పు గలదే, యతఁడు నతఁడు నీకు మాన్యు లగుదుర కాదే.

66


క.

ఏ నీకు భక్తి సలుపం, గా నుపలాలనము సేయఁగలవాఁడవు నీ
వీనెఱితప్పినమాటలు, దానవకులనాథ యిట్లు దగునే యాడన్.

67


క.

అని రంభ సిగ్గుపడఁ బల్కిన దానికిఁ గొంకుకొసరు లేక దశముఖుం
డనుమానింపక యిట్లను, మనసిజదందహ్యమానమానసుఁ డగుచున్.

68

చ.

ధనపతి యన్న యే నతనితమ్ముఁడ నానలకూబరుండు నా
తనయుఁడ యింత నిక్కువము దానికిఁ గా దన నాకు నప్సరో
వనితలు వింత యైరె యనివారణ నె ట్లయినం జరించునీ
వును గులభామవోలెఁ దగవున్ ఘటియించెదు వైశికంబునన్.

69


క.

విచ్చలవిడియై యున్నెడ, మెచ్చక ననుఁ ద్రోచి పోవ మేలే తమకం
బచ్చువడునట్లుగా సిరి, వచ్చిన మోఁకాలు సూపువారుం గలరే.

70


క.

నాకంటె మిగులువిటు నీ, లోకమునన కాదు దిగువలోకంబులఁ బై
లోకముల వెదకఁ బోయిన, నీకుం బడయంగ వచ్చునే హరిణాక్షీ.

71


ఉ.

నావుడు నమ్మృగేక్షణ మనంబున రోయుచు నేను లంజియం
గావుడు వానితోడి తమకం బది లంజియ గాదు ప్రేమస
ద్భావ మెఱుంగ వైతి గుణభాగివి పో నినుఁ గోర్కి సెందునే
నీవచనంబు త ప్పకట నీళ్లు లపట్టున నేయి మందొకో.

72


క.

అని మొగమోడక విరసవ, చనముల భంగింప నాదశముఖుం డున్మ
త్తునిగతి నంతయు వినియును, విననిచెవులు సేసి లావు వెరవును మెఱయన్.

73


క.

అంగనఁ బొదివి సగాఢా, లింగనముగఁ దామ్రచూడలీలాచతురా
నంగక్రీడాసంగతి, నెంగిలి గావించె మదము నేడ్తెఱ మిగులన్.

74


సీ.

పగరాజు పైవచ్చి బలువిడిఁ బరిభవించినఁ దలంకినపురశ్రీవిధమున
సమదద్విపము కేళి సలిపినఁ జాల నలంగినయుద్యానలక్ష్మికరణి
ఘనలులాయము సొచ్చి తనయిచ్చ నాడినఁ గలఁగిననెత్తమమి కొలనిభంగిఁ
గడుబెట్టిదపుగాలి సుడిసిన నెఱి దప్పి తిరిగినమవ్వంపుఁదీఁగెమాడ్కి


తే.

మున్ను గైసేసి యలవడ్డ చెన్ను దప్పి, యెలమిఁ బ్రియుపాలి కేగెడులలి యడంగి
వేఱచంద మై యెంతయు విన్న నయ్యె, నసుకు గారించి విడిచిన నమ్మృగాక్షి.

75


క.

వెలవెలఁ బాఱుచుఁ గొంకుచుఁ, దలరుచు నడఁ దొట్రుపడుచు దలఁకుచుఁ దనలోఁ
బలుకుచు నెడనెడ నిలుచుచు, నలకూబరుకడకు నింతి నలఁగుచుఁ జనియెన్.

76

నలకూబరుఁడు రావణుని శపించుట

చ.

చని ధరఁ జాగి మ్రొక్కి తనచందముఁ జూచి విషణ్ణుఁ డైనయా
తని కఱ లేక చెప్పిన నతండు ప్రభావమునన్ సమస్తముం
గని కలుషించి యింక దశకంధరుఁ డెవ్వతె నైన నీక్రమం
బునఁ బయిఁ బడ్డ నప్డ మృతిఁ బొందఁ గలం డని శాప మిచ్చినన్.

77


ఆ.

తివిరె నంబరమున దేవతూర్యరవంబు, గురిసెఁ బుష్పవృష్టి సురగణంబు
సంతసిల్లె దీని నంతయు నేర్పడ, వినిన సతుల కెల్ల వెఱపు వాసె.

78


క.

నలకూబరుశాప మెఱిఁగి, యెలమి దఱిఁగి పంక్తివదనుఁ డిది మొదలుగఁ దా
బలిమిం బైపడ నెన్నఁడుఁ, జెలువల నని నిశ్చయించె జిత్తములోనన్.

79

ఉ.

కొందలపాటున మనము గుందినఁ గంటికి నిద్ర రాక సే
నం దెలిపించి యప్డఞ పయనం బయి దైత్యవిభుండు వోవ సం
క్రందనుఁ డంతయున్ విని సురప్రకరంబులఁ గూర్చి రాత్రి మైఁ
గ్రందుగ నానిశాచరులరాకకు నాకము సంచలింపఁగన్.

80

రావణుఁడు దండెత్తి వచ్చుట విని యింద్రుఁడు విష్ణునిఁ గాన నేగుట

క.

ఆదిత్య మరుద్వసురు, ద్రాదిదివిజగణము లెల్ల నప్పుడ భూభృ
ద్భేదికడ కేగుదెంచె ర, ణాదరదుర్దాంతభుజబలాటోపమునన్.

81


ఉ.

వారల మోహరింపుఁ డని వాసవుఁ డేగె నువేంద్రుఁ గాన నం
భోరుహనాభుఁడుం ద్రిదశపుంగవు సత్కృతుఁ జేసి రాకకుం
గారణ మేమి యన్న దశకంఠుఁడు మాపయి వచ్చె నీవునుం
బోరికి వచ్చి దేవగణముం గృపఁ గావుము దేవ నావుడున్.

82


చ.

హరి సనుదెంచె నాటికి దశానను నోర్వక రిత్త యెట్లొకో
మరలెను జాలఁ డొక్కొ యనుమాటపడం బనిలేదు బ్రహ్మచే
వరములు గన్నగర్వమున వచ్చె నలంతులఁ బోఁడు వానికిం
బరువము గాదు కాలపరిపాకము వచ్చిన నేన తీర్చెదన్.

83


క.

దేవఖచరాదిజాతుల, చే వానికిఁ జావు లేదు చెప్పెదఁ బిదపం
గేవలమును బోఁ డంతకు, నీవరుసకు నీవ చాలు దెల్లవిధములన్.

84

ఇంద్రుఁడు యుద్ధమునకు వెడలుట

చ.

బలరిపుతోడ నిట్లు హరి పల్కిన నాతఁడు నట్ల కాక యం
చలఘుపరాక్రమస్ఫురణ నాహవదోహలచిత్తయుక్తుఁ డై
తెలతెల వేగునంతఁ జనుదెంచి బలంబులు గూడఁ చేదేరు మా
తలి గొని వచ్చినన్ గిరికి దాఁటెడుకేసరిమాడ్కి నెక్కినన్.

85


క.

ఉడుపతి దోతెంచినఁ బొం, గెడుజలనిధికరణిఁ బోరికిన్ వజ్రి వడిం
గడఁగుట గనుఁగొని ఘోషం, బడరఁగ సురసైన్య మధికహర్షము నొందెన్.

86


ఉ.

అంత సరోరుహాప్తుఁ డుదయం బరుదెంచె నిశాచరు ల్పరా
క్రాంతి దగం గడంగి యమరావతి కేగిరి వారు రాత్రి మై
నెంతయు నగ్గలం బగుదురేఁ బొడసూపెదఁ గాక దేవతల్
సంతస మందఁగా ననుచు సత్వరుఁ డై చనుదెంచె నొక్క నాన్.

87


చ.

కమలవనంబు చేసినయగణ్యతపంబుఫలంబు చక్రయు
గ్మములముదంబుప్రోక త్రిజగంబుల కన్నలబ్రహ్మవిష్ణురు
ద్రమహిమ లొక్కటై కలయఁఁ గ్రాఁచినయుండ త్రివేదమూలకఁ
ద మని నుతింప నొప్పెసఁగెఁ , దామరసప్రియబింబ మత్తఱిన్.

88

సీ.

దళము లొండొంటిసందులను సమాలోలవలయంబు సడల మవ్వంబు గదిరి
యడరి కర్ణికలలో నంటినకేసరంబులు దల మెక్కుచుఁ బొదలఁ బొంగి
సుడిగొని వెడలంగ గడఁగుక్రొత్తావి యల్లన మీఁది కెగయఁగ మొనలు విచ్చి
యొండొండ మకరంద ముప్పొంగి నలుగడ నిండి పైఁ బొరలంగ నెఱయ విరిసి


ఆ.

మధుకరములఁ గలసిమలసియుఁ దమలోన, లలితగంధవహుఁడు సెలిమి సేయఁ
గమల సంతసమునఁ దమయంద వసియింపఁ జాల నుల్లసిల్లె జలరుహములు.

89


చ.

అరదము నెక్కి లోచనసహస్రము కాంతి వెలుంగఁ బొల్చు ని
ర్జరపతిఁ గన్నులారఁ గని సంతసమందెడువారితోడి మ
చ్చరమున నెక్కె నా నుదయశైలముమీఁద సహస్రదీధితి
స్ఫురణ దలిర్ప నొప్పురవిసొంపున జృంభణ మొందె నబ్జముల్.

90


తే.

అప్పు డసురేంద్రుసైన్యంబు లమరపురము, దవ్వులే దంచుఁ గట్టాయితంబు సేసి
కూడి నైరృతి యారణక్రీడ కమరఁ, బడగ లంతంతఁ గ్రాలంగ సిడము నొప్ప.

91


క.

పదపదఁ డంచు దిశలు గ్ర, క్కదలఁగ లేయెండచాయఁ గడునుగ్రము లై
యెదురం గొందఱు గల రని, మది నించుక సరకుగొనక మదమున నడచెన్.

92


ఉ.

చిత్రముఁ జూపిన ట్లసురసేనలు దుర్దమలీలఁ గిట్టినన్
వృత్రవిరోధిసైన్యమును విక్రమసంపద సొంపు మీఱ లో
కత్రయపూజ్యుఁ డవ్వసునికాయమునందుఁ బ్రసిద్ధుఁ డైనసా
విత్రుఁడు మున్నుగాఁ గడఁగి వీఁక నెదిర్చెఁ జెలంగి యార్చుచున్.

93

దేవదానవసేనలు పరస్పరము తలపడి పోరుట

క.

ఉభయబలముఁ దలపడి లో, కభయంకరభంగిఁ బోరఁగా రక్తనదుల్
ప్రభవించె నంబుచరస, న్నిభ మైనయమిత్రగాత్రనికరం బడరన్.

94


ఆ.

దనుజబలము నొచ్చి వెనుకకు జరగ న, కంపనప్రహస్తఖరనికుంభ
దూషణప్రచండధూమ్రాక్షశుకసార, ణాదిసుభటకోటి యార్చి తాఁకె.

95


శా.

ఆవీరావలి కీడఁ బోక మహనీయస్థైర్యసారంబునన్
దేవానీకము కుంతఖడ్గపరిఘాదిప్రౌఢి దుర్వార మై
సావిత్రోద్భటబాహువిక్రమకళాసాహాయ్యసంజాతశౌ
ర్యావేశంబునఁ బోరె రౌద్రరసదృప్తాకారఘోరంబుగాన్.

96


క.

అమరులు వోరుట దానవ, సమితికి భర మగుడు సరభసంబున నిజనా
మము ప్రకటించి యదల్చుచు, సుమాలి సావిత్రుఁ దాఁకె సురలు దలంకన్.

97


మ.

పటువేగంబున శాతభల్లచయసంపాతంబునన్ మింట మి
క్కుట మై సర్వధగద్ధగీయ మగుచుం గోపంబు రూపంబు లై
చటులక్రీడఁ జరించున ట్లిరువురున్ శౌర్యోన్నతిం బోరి రు
త్కటదర్పోద్ధతు లై పరస్పరజయాకాంక్షాప్రచండంబుగన్.

98

క.

ప్రదరంబుల సావిత్రుఁ డ, రదముం బొడి సేయఁగా విరథుఁ డైనయెడం
గదిసి గద యెత్తుకొని తల, చిదురుపలుగ వ్రేసె దైత్యసేనలు దలఁకన్.

99


క.

దైతేయవంశ వల్లభు, మాతామహుఁ డైనయాసుమాలి వడుటయున్
భీతిం దెరలిన దనుజ, వ్రాతముఁ గని కోపవేగరక్తాక్షుం డై.

100


శా.

అగ్నిచ్ఛాయముఁ గామగంబు నగుతే రత్యుగ్రుఁ డై యెక్కి యా
భుగ్నభ్రూలతికాసహోదర మనం బొ ల్పొందుచాపంబు ను
ద్విగ్నారంభత నెక్కుపెట్టి శరవార్థిన్ మేఘనాదుండు ని
ర్మగ్నాకారులఁ జేసె నిర్జరుల శౌర్యస్ఫూర్తి శోభిల్లఁగన్.

101


క.

పేర్చునరదంబు ప్రబలం, గార్చిచ్చువిధమున నతఁడు గడగినఁ బటుబా
ణార్చులు గవియుడు నిర్జరు, లేర్చినతరువులును బోలె నే పేది రనిన్.

102


మ.

అసురాధీశతనూజుకోల్తలకుఁ గా కత్యంతభీతిం గలం
గి సురానీకము సూరెగిల్లిన రణక్రీడాదరం బారఁగా
రసికుం డై రథ మెక్కి గోముఖుఁడు సారథ్యంబు సేయం గడున్
వెసఁ దాఁకెం ద్రిదశేంద్రనందనుఁడు దోర్వీర్యం బవార్యంబుగాన్.

103


క.

దైతేయు లదర ని ట్లని, కేతెంచినఁ గాంచి దానవేశ్వరుతనయుం
డాతనిసూతుం డగునా, మాతలిసుతు మేను బాణమయముగఁ జేసెన్.

104


క.

అతఁ డాతనిసారథిమై, శితశరములు నించుటయును జెలఁగుచు వడిఁ ద
చ్చతురంగంబులుఁ దాఁకెను, బ్రతిభటకథ తురగదంతిపంక్తులు సెదరన్.

105


ఉ.

అత్తఱి మేఘనాదుఁడు జయంతుశరావలిఁ ద్రుంచి వాని మై
నెత్తురువఱ్ఱు సేసి రథినిం బొడి సేసినయంతఁ బోక యు
ద్వృత్తిఁ గడంగినం దమము దీటుకొనం గవియించె దృష్టియుం
జిత్తము లావు మాలి సురసేనలు బెగ్గిల నగ్గలంబుగన్.

106


క.

చీఁకటి గవిసిన విబుధా, నీకం బోడి చన నైన నేరద హృదయ
వ్యాకులత మునింగి భయో, ద్రేకము పడి తెగువ దలరి త్రిప్పికొనంగన్.

107


క.

ఆమాయాతిమిరము పౌ, లోమీజనకుఁ డగునప్పులోముఁ డెఱిఁగి సు
త్త్రామతనూభవునకు నది, యేమిటఁ బో దంచు నచటి కేతెంచె వెసన్.

108


ఉ.

వచ్చి జయంతు నాఁగి యనివారణఁ బర్వెడు నీతమంబు ము
న్ని చ్చె జయార్థ మై యభవుఁ డీతని కీరిపుచేతఁ జచ్చినన్
వచ్చెడి దేమి సంగర మవశ్యముఁ జేయఁగ నీను వార్ధిలోఁ
జొచ్చుట చాలఁ గార్య మనుంచుం బలిమిం గొని పోయె డాఁగఁగాన్.

109


తే.

అమరపతినందనుఁడు పొడ వడఁగి చనిన, నసురమాయయు నుడివోయె నట్లకాదె
యడరి దరికొని మండుతీవ్రానలంబు, పుడుక లెడ గల్గవైచినఁ బొనుఁగువడదె.

110

క.

ఇవ్విధమున నింద్రుసుతుం, డెవ్వరు నెం దరుగుటయును నెఱుఁగక యుండం
గ్రొవ్వఱి తనసరివారలు, నవ్వుట కియ్యకొని పోయె నవిజృంభితుఁ డై.

111


క.

దనుజాధీశ్వరుతనయుం డనిమిషు లనుహంసముల రయంబునఁ బఱపం
దనయారుపుటెలుఁగున మే, ఘనాదుఁ డనుపేరు సార్థకంబుగఁ జేసెన్.

112


ఆ.

ఇట్లు దనతనూజుఁడే పేది సైన్యంబు, గాసి యగుడు నలిగి వాసవుండు
కెంపు గన్నులందు బెంపారుచుండఁ జెం, గలువకొలనిమాడ్కిఁ జెలువు మిగిలి.

113


ఉ.

మాతలిఁ జూచి దానవసమాజము దర్పము మీఱె నిత్తఱిన్
వాతజవంబునం గడఁగి వారక వీరికి సమ్ముఖంబుగా
వే తురగంబులం బఱపు విక్రమసంపద యుల్లసిల్లఁగాఁ
జేతులతీఁట వో నుఱుము సేసెద నెవ్వఁ డెదిర్చి వచ్చినన్.

114


క.

అనుచు నిజబలము నిలునిలు, మని కరతల మెత్తి నిలిపి యదలిచి సమరం
బునకు మగుడఁ బురికొల్పుచుఁ, దనచుట్టును నున్నదొరలు దానును గడఁగెన్.

115


చ.

ఎదురుగ వీచె నిష్ఠురసమీరము లుల్కము లుగ్రభంగి నె
ల్లదిశల డుల్లెఁ బెల్లుగ బలంబులపైఁ బెనుగ్రద్ద లాడె బె
ట్టిదముగ మ్రొగ్గి యభ్రకరి డిల్లపడెన్ వెస నందనంబు గ్ర
క్కదలఁగఁ గూసె నొక్కట సృగాలము లప్రియసూచకంబు లై.

116


క.

కలయంగ దుర్నిమిత్తం, బులు పుట్టినఁ గనియు వినియుఁ బొలివోవనియ
గ్గలిక మెయి నెమ్మనమ్మునఁ, దలఁ కొకయించుకయు లేక దర్పోద్ధతుఁ డై.

117


క.

సురపతి గడఁగుడు దనుజుల, బరవస మొక్కింత మట్టువడుటయు దశకం
ధరుఁడు సమరోత్సుకుం డయి, యరదము సన వసము గాక యత్యుగ్రముగన్.

118


క.

అమరవిభుం దలపడఁ జను, సమయంబున నడ్డపడియె సంభ్రమలీలన్
సమదుఁ డగు మేఘనాదుఁడు, దమతండ్రిరణంబు మాన్చి తాన కడంకన్.

119


చ.

తలపడి యింద్రుతోడ నతిదారుణయుద్ధము సేయఁ జొచ్చినన్
బలము బలంబుఁ దాఁకుటయు బాసటగా వడిఁ గుంభకర్ణుఁ డు
జ్వల మగుశూల మెత్తికొని వచ్చి యుగాంతపురుద్రుకైవడిం
జెలఁగుచు నార్చి మోహరము చెంగటఁ దాఁకె భయంకరంబుగన్.

120


క.

అడరి మొన లిక్కడక్కడ, వడిఁ దిరిగిన దిశలు బడలు వడ రౌద్రము చొ
ప్పడ బాహుశక్తి యేర్పడఁ, గడిమి పొగడ్తవడఁ గుంభకర్ణుఁడు పోరెన్.

121


క.

ప్రతివీరుఁ డొక్కరుఁడు లే, కతులబలుం డైనహీనుఁ డైనను నప్పా
ట తనకు గుఱిగా నురవడి,నతండు మునుకూడి సురల నందఱఁ దఱిమెన్.

122


ఆ.

ఎదిరి తేరినొగయు నిభముదంతంబును, దనకరంబుఁ బాదతలము లోను
గాఁగ నాయుధములు గానివి లే వయ్యె, నరివిమర్దనమున కతని కపుడు.

123

క.

అంతకు ముందఱ యీవృ, త్తాంతము విని తోడుపడుట కని సత్వరు లై
యంతకవరుణధనేశులు, దాంతిమెయిన్ వచ్చువారు తదవసరమునన్.

124


క.

తమతమబలములతో సం, భ్రమగతిఁ బఱతెంచి దివిజపతికిం బొడసూ
పి మనుజభోజనసైన్యము, సమయింపఁగఁ జొచ్చి రధికసంరంభమునన్.

125


క.

చిచ్చునకుఁ దోడు గరువలి, వచ్చినక్రియఁ బోర నమరవరుల మొనలకున్
హెచ్చుగ దిక్పతిసేనలు, వచ్చుటయును మ్రొగ్గె నసురవర్గము గలయన్.

126


ఉ.

సన్నబలంబు లైననిజసైన్యములం గని రావణుండు శౌ
ర్యోన్నతుఁ డైననందనుని నొప్పరికించితిఁ గుంభకర్ణుఁడుం
గన్నది లేదు మెల్ల మురికాఱు దిగీశులు వచ్చి రేను బో
కున్న భరంబు గాదె యని యుధ్ధతిఁ బేర్చి రథాధిరూఢుఁ డై.

127


శా.

సొంపారంగఁ బసిండి పైఁ బఱపినన్ శోభిల్లువి ల్లంద మై
శంపావల్లిక నిల్చి పొల్చుగతి భాస్వత్కాంతిఁ జెల్వొంద మై
పెంపుం జాయయుఁ గాలమేఘ మన నాభీలంబుగా దిక్కు లా
కంపింపం బటు బాణవర్షమున నాకాశం బడంగించుచున్.

128


క.

అరదంబున యురవడికిం, దెరలి తెఱపి యిచ్చి సురలు దిరుగుడువడ ని
ర్జరపతిరథంబునకు భీ, కరగతి సమ్ముఖముగాఁ దగం బఱపుటయున్.

129


చ.

వదనసరోజపంక్తి శరవర్షమునన్ మొగిడింపఁ గాన న
య్యెద దశకంధరుం డిచట నెచ్చట లేఁడు తనూజుఁ జూపి తా
ను దొలఁగి యున్నవాఁ డతని నొంపక గె ల్పన రాదు రాఁడె దు
ర్మదమున నంచు నున్న బలమర్దనుఁ డాహవదోహలంబునన్.

130


తే.

ఏచి మాతలిఁ గనుఁగొని యిటులు వచ్చు, దనుజుతేరికి నెదురుగా మనరథంబు
శీఘ్రగతిఁ బోవనిమ్మని చెప్పి మౌర్వి, భీకరధ్వని దిక్కులు పిక్కటిల్ల.

131


శా.

రుద్రాదిత్యమరుద్వసుప్రభృతు లార్పుల్ నింగి ముట్టంగ వీ
రోద్రేకంబున దాపలన్ వలపలన్ హోరాట మై ముంచి స
ర్వద్రోహిం బరిమార్త మంచు వికటుభ్రామ్యద్భుజామండలీ
రౌద్రాకారతఁ దాఁకఁ దాఁకె రిపుధైర్యస్రావణున్ రావణున్.

132


తే.

ఇట్లు దాఁకుడు దశకంఠుఁ డేపు మిగిలి, యందఱకు నన్నిరూపంబు లైనయట్లు
వివిధశస్త్రాస్త్రకేలీప్రవీణబాహు, దండనికురుంబదుస్సహోత్సాహుఁ డగుచు.

133


క.

వడి నడరుచుఁ దెరలుచుఁ బై, పడి పోక పెనంగునమరబలమునకుం గీ
డ్పడక నిలిచి మెఱసెను బలు, కడళ్ల కెదు రైనఱాతికరణిం దిర మై.

134


ఉ.

ముందటఁ దాఁకి పోరుతనమోహరమున్ వెసఁ బో నదల్చికొం
చుం దఱియంగఁ జొచ్చి బలసూదనుఁ డాదశకంఠు నస్త్రపం

క్తిం దునుమాడి బాణమయదేహునిఁగా నొనరించె వాఁడు సం
క్రందనుపై నిశాతవిశిఖంబులు నించె సురల్ దలంకఁగన్.

135


శా.

వ్యగ్రాటోపత నొండొరున్ మిగుల బారహశక్తి సూపక్ మహో
దగ్రం బయ్యె సురాసురేంద్రరణ మన్యోన్యధ్వజచ్ఛేదనా
త్యుగ్రం బై యితరేతరవ్యథితరథ్యోదాత్త మై శౌర్యసా
మగ్రీగాఢపరస్పరాంగదళనోన్మాదోద్భటాకార మై.

136


క.

ఈసున నాసురపతి జంభాసురున ట్లెసరి రావణాసురు శీఘ్రం
బేసియు వ్రేసియు బొడిచియు, వేసరి దిక్పాలకోటి విన ని ట్లనియెన్.

137


ఉ.

ఎద్దెస నైన శంక చెడి యేగు విరించి వరంబు నెమ్మదిం
బెద్దయు నమ్మి వీఁ డిటు లభేద్యతఁ గ్రుమ్మరుచున్న లోక మా
పద్దశఁ బొందు మానుపునుపాయము నారసి చూడ నొండు లే
దిద్దనుజాధముం బొదివియే పఱఁ బైపడి పట్టుకొందమే.

138


చ.

అనవుడుఁ జాల మే లని దిశాధిపు లందఱుఁ జేరి చుట్టు ము
ట్ట నమరవల్లభుండును గడంక దశాననుతేర రాక క
ల్కినగతి మాతలిం గెలనికిన్ రథ మల్లఁ దొలంగి పోవ ని
మ్మని వెసఁ జొచ్చి పట్టుకొన నాయిత మై యతిసాహసంబునన్.

139

మేఘనాదుఁ డింద్రుని మాయాతిమిరమున ముంచి పట్టుకొనుట

క.

ఒరసికొనిపోవ నత్తఱి, సురసైన్యం బార్చుటయును జూచి తిమిరముం
గర మచ్చెరువుగ గ్రక్కునఁ, బరఁగించుచు నసురకొడుకు పఱతెంచె వడిన్.

140


క.

మాయాతమమున మునిఁగిన, దాయల దివ్యాస్త్రజాలదళితాంగులఁ గాఁ
జేయుచు నాబృందారక, నాయకు డగ్గఱియె మేఘనాదుఁడు గడిమిన్.

141


క.

తుహినంబునఁ బడినపయో, రుహషండముమాడ్కి నమ్మరుత్పతి మాయా
పిహితతమోవృతలోచన, సహస్రుఁ డై యున్న నతనిసారథి నేసెన్.

142


ఉ.

మాతలి మూర్ఛవోయిన నమర్త్యవిభుండు రథంబు డిగ్గి జీ
మూతగజంబు నెక్కి బలముం జలముం జెడి యాత్మసైనికా
రాతిభటప్రభేదవిదురస్థితి దీనతఁ బొంది యుండియున్
భీతి యెఱుంగకుండ వెడబీరము సేయుచు నుండె వెండియున్.

143


చ.

నిలువులు పడ్డయట్లు తననేత్రము లేమియుఁ గానలేమి న
గ్గలముగ బెగ్గలించుబలఘస్మరు నమ్ముల నోడు సేసి ని
ట్టల మగుడప్పి సోలుటయు డాసి దశానననందనుండు వి
చ్చలవిడిఁ బట్టి కట్టి జయశంఖముఁ బట్టఁగఁ బంచి యార్చుచున్.

144

రావణుఁ డింద్రునిఁ బట్టి లంకకుఁ గొనిపోవుట

చ.

అరదముమీఁదఁ బెట్టుకొని యాతనిఁ దండ్రికిఁ జూపి యింక సం
గర మిది ఏటికిన్ జయము గైకొని పోదము రమ్ము నావుడుం
గరము ప్రియంబునం దనయుఁ గౌఁగిటఁ జేర్చి త్రిలోకరాజ్యవి
స్ఫురణము నాకు దక్కె నని పొంగి దశాస్యుఁడు మిన్ను వ్రేయుచున్.

145


ఉ.

మోదమునం దనూభవుని ముంగలిగా నడపించి తాను దు
ర్భేదబలాన్వితుం డగుచుఁ బింగలి యై చన దేవకోటి శౌ
ర్యోదయలీలఁ గూడుకొని యొండొరుఁ బల్కుచు శక్రమోక్షణా
హ్లాదము గోరి పెంపున రయం బెసఁగం బఱతెంచి తాఁకినన్.

146


ఉ.

ఎత్తెల గొందుదిక్పతుల నిందఱ ముంద ఱెఱుంగనట్ల యీ
తత్తబడం బిఱిందిదెసఁ దాఁకిన దీనికి సంభ్రమంబు మై
నిత్తల కేగుదేవలవ దేడ్తెఱఁ బొమ్మని చెప్పి పుచ్చినం
జిత్త మెలర్పఁగా సుతుఁడు శీఘ్రమునం జనఁ దా నుదగ్రుఁ డై.

147


క.

బకమరి తిరిగిన నమరులు, పికపిక లై పోవ లావుఁ బెం పేర్పడ సే
నకు వెనుకై చనియెను లం, కకు దానవవిభుఁడు బాహుగర్వోద్ధతుఁ డై.

148

ఆశ్వాసాంతము

మ.

అతులౌదార్యుఁ డహీనశౌర్యుఁడు సముద్యద్ధైర్యుఁ డత్యంతవి
శ్రుతచారిత్రుఁడు సూరిమిత్రుఁడు జనస్తోతవ్యగోత్రుండు సం
భృతసత్కీర్తి పవిత్రమూర్తి యసుహృద్బృందార్తినిర్వర్తి పూ
జితధీమంతుఁడు పుణ్యవంతుఁడు జయశ్రీకాంతుఁ డిమ్మేదినిన్.

149


క.

సన్మార్గచతురపథికుఁడు, జన్మవిశేషప్రసిద్ధసగరకులుఁడు భూ
భృన్మకుటఘటితచరణుఁడు, మన్మథనాథుఁడు కవీంద్రమందార మిలన్.

150


మాలిని.

నిరుపమజయలక్ష్మీనిత్యవిస్తారవక్షుం
డరిబిరుదమహోత్సాహప్రతిక్షేమదక్షుం
డరుణకిరణదీప్తవ్యాప్తపద్మాయతాక్షుం
డురగశయనరేఖాయుక్తసంరక్షుఁ డుర్విన్.

151


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయ ప్రణితం బైనయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు షష్ఠాశ్వాసము.

————