నిర్వచనోత్తరరామాయణము/దశమాశ్వాసము

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

దశమాశ్వాసము



సంపాదికటాక్షవి
లాసుఁడు బాహావధానలంపటుఁడు గళా
వాసమతి దీనజనర
క్షాసక్తుఁడు మనుమసిద్ధిజగతీశుఁ డొగిన్.

1


క.

రేపకడ నక్కుమారుఁడు, దాపసవరు వీడుకొని ముదంబున విప్ర
జ్ఞాపితపథమునఁ దత్స, ల్లాపరసాయత్తుఁడై బలంబును దానున్.

2

మునులు శత్రుఘ్నునకు లవణుని వధించునుపాయం బెఱింగించుట

చ.

చని చని విప్రులన్ లవణుజన్మము వానిభుజాబలంబు వాఁ
డనికిఁ గడంగుచందమును నద్దనుజాధముమర్మముం గ్రమం
బున నడుగంగ వారు మధుపుత్రుఁడు వాఁడు మహాబలాఢ్యుఁ డె
వ్వనికి రణంబునం జెనయ వచ్చునె యాతని నంచు వెండియున్.

3


ఆ.

అద్దురాత్ముజనకుఁ డగు మధు వెంతయు, నరిదితపము సేయ హరుఁడు మెచ్చి
యొక్కనిశితశూల మొసఁగి యద్దానవు, హృదయకమల మలర నిట్టు లనియె.

4


క.

ఇది యొకవాటున నని నీ, కెదిరినవీరునిఁ గృతాంతునేనియు నాఁ డా
మదనునిఁ గోపించిననా, నుదుటియనలశిఖగతిం దనువుపొడ వడఁచున్.

5


క.

క్రమ్మఱ నప్పుడు నీహస్తమ్మున కేతెంచు నల్పశత్రునిపైఁ గో
పమ్మున వైవకు మీ లో, కమ్ముల భస్మమ్ము సేయుఁ గావున దీనిన్.

6


చ.

అనుడుఁ బ్రమోద మంది యతఁ డాగిరిజాహృదయేశుతోడ ని
ట్లనియె భవద్వరంబునఁ గృతార్థుఁడ నైతి మదీయవంశసం
జనితుల కెల్ల నీపరమసాధన మట్టుల చెల్ల నిమ్ము భ
క్తనికరకైరవాకరసుధాకర భూరిదయా ప్రియాకరా.

7


క.

అనవుడు నటులే లగు నీ, మనోరథం బగ్గలంబు మానుము దానిం
దనయుఁడు గల్గినవానికి, బని సేయుం గాక యనియె భవుఁ డాతనితోన్.

8


తే.

అమ్మహాశూల మిప్పు డీయసురయొద్ద నునికి నెవ్వరు నెదురంగ నోప రతని
నయిన నీచేతఁ జచ్చు నన్యాయవర్తి, గాన దాని కుపాయంబు గలదు వినుము.

9

ఉ.

ఎక్కడికేనియుం జని యనేకవిధంబుల జీవరాసులం
బెక్కిటిఁ గానలోఁ గడుపు పిక్కటిలం దిని మాపు వీటికిం
జక్కగ నేగుచోఁ చెరువు సయ్యన నీ వరికట్టుకొన్న వాఁ
డుక్కఱ శూల మింటికడ నున్కి నిరాయుధవృత్తి నత్తఱిన్.

10


ఉ.

నావుడు నక్కుమారుఁడు మనంబున నెంతయు రోసి యి ట్లసం
భావితుఁ డైనవానితలపా టరయన్ నగుఁబాటు గాదె రా
మావనినాథుతమ్ములకు నట్టియపౌరుషవృత్తి మేలె మీ
రీవెర వాదరింపఁ దగునే యనినన్ మును లెల్ల నవ్వుచున్.

11


చ.

తగినతెఱంగు సేసినను దాని నెఱుంగరు చెట్ట గాంచినం
దెగడుదు రెల్లభంగి జగతీజనముల్ విను మట్లు గాకయుం
బగతు ననాయతంపుటగపాటునఁ బైపడి గెల్వ నోపినన్
మగఁటిమి దూలుటే దొసఁగు మాలఁగ దానవుఁ జంపు మెమ్మెయిన్.

12


క.

అనిన నతఁ డిదియె కర్జం, బని నిజసంరంభవృత్తి యల్పంబు నెఱుం
గనియట్లుగ వీథికి ద, వ్వునఁ బ్రజ విడియించె దానవుఁడు వచ్చుతఱిన్.

13


చ.

తెరువున కడ్డ మేగి దృఢదీప్తశరాసనబాణపాణి యై
పురములు నీఱు సేయుటకుఁ బూనినరుద్రుఁడుఁ బోలె లక్ష్మణా
వరజుఁడు నిల్చినన్ దనుజవర్గశిఖామణి గాంచి వీఁ డొకం
డెర యగుఁ బొమ్ము నా కనుచు నేడ్తెఱ నాతనితోడ నిట్లనున్.

14

లవణశత్రుఘ్నులసంవాదము

క.

నీ వెవ్వఁడ వేకార్యము, గావింపఁగఁ జూచె దేమి కారణ మిచ్చో
నావచ్చు టెఱిఁగి యెఱిఁగియుఁ, బోవక వేఱొండుతెరువుఁ బో నిల్చుటకున్.

15


మ.

అనినన్ భూపకుమారుఁ డల్లన సముద్యత్కీర్తి యారామచం
ద్రున కేఁ దమ్ముఁడ నాదునామమును శత్రుఘ్నుండు విప్రప్రియం
బొనరింపం జనుదెంచితిం దురభిమానోద్దాము ని న్నాజి మా
ర్కొని మర్దింపఁగ నున్నవాఁడ ననుడుం గోపోత్కటాకారుఁ డై.

16


శా.

ఏమేమీ రఘురాముతమ్ముఁడవె మీ రేపారి పైనెత్తి మా
మామం బంక్తిముఖున్ వధించినను మీమౌర్ఖ్యంబు సైరించి యే
నేమిం జేయక యున్నఁ క్రొవ్వి యిట నీ వేతెంచితే మేలు మే
లీమై తోడన పోదు గాక యని దైత్యేశుండు దర్పంబునన్.

17


మ.

నిలుమీ యాయుధపాణి నై రణములో ని న్నిప్డు నిర్జింపఁగా
వలయున్ వచ్చెద నంచు వీటిదెసఁ బోవం జూచినన్ వీఁడు దో
ర్బల మొప్పం దనశూల మెత్తికొని నాపై రాక కార్యంబె యా
కులతం బొందినచోన యీయసుర నాకుం జంపఁగాఁ జొప్పడున్.

18

క.

కావున నీదనుజాధముఁ, బోవఁగ నీ కాఁగవలయుఁ బొ మ్మని యడ్డం
బై వచ్చి మందహాసము, తో వానికి నిట్టు లనుఁ జతురవచనములన్.

19


క.

అగు నగుఁ బో నిత్తునె నా, పగ చేకుఱ నిపుడ యెన్నిభంగుల నయినం
దెగఁ జూతుఁ గాక విడుతునె, మగుడఁగదే పూఁట పెట్టి మా కిచ్చోటన్.

20


ఉ.

ఎక్కడఁ బోవవచ్చు నిదె యేచి మదీయశరాంధకార మే
దిక్కును గానకుండ దివి దీటుకొనన్ నినుఁ జుట్టుముట్టుచున్
మిక్కుట మయ్యెడున్ రణము మేకొని చేయఁగఁ బూని యియ్యెడం
జక్కనిబంట వై నిలుము చచ్చుట తప్పునె యెందుఁ బాఱినన్.

21


తే.

తొల్లి రాముబాణాహతిఁ ద్రెళ్లియున్న, దశముఖునిఁ జూచుసురలచందమున నాదు
నిశితశరములఁ గూలిననిన్ను భూమి, సురలు గన్నార నిప్పుడు చూచువారు.

22


క.

అప్పలుకులు విని కన్నుల, నిప్పులు రాలంగ నసుర నృపనందనుతోఁ
జెప్పఁ బలు కొండు గానక, యప్పటియని కియ్యకొని తదనురూపముగన్.

23

శత్రుఘ్నుఁడు ద్వంద్వయుద్ధమున లవణాసురుం జంపుట

శా.

ఆటోపంబున నొక్క టెక్కటియ శౌర్యావేశి యై నిల్చి య
చ్చోటం గల్గు తరువ్రజంబును శిలాస్తోమంబునుం బూన్చి యా
స్ఫోటక్ష్వేళనదృప్తమూర్తి యగుడున్ భూపాత్మజుండుం బటు
జ్యాటంకార మొనర్చె భూమివలయం బాకంపముం బొందఁగన్.

24


క.

ఒకమ్రాను పెఱికికొని సు, భ్రుకుటితముఖుఁ డగుచు దనుజఃపుంగవుఁడు గుమా
రకు వైవఁ బూఁచుటయు నది, శకలములుగ సేసె నిశితశరసంఘములన్.

25


చ.

నృపతనయుండు దైత్యవిభునిన్ రభసంబునఁ దీవ్రబాణజా
లపరివృతాంగుఁ జేయఁగ శిలాతతి నమ్ముల నిల్వరించి గ
ర్వపుఁబలుకుల్ వెసం బలికి వారనికోపరసంబుపేర్మి వాఁ
డుపలమహోగ్రవర్షము సముద్ధతి మైఁ గురిసెం గుమారుపై.

26


చ.

అతఁడు నిశాతసాయకము లద్దనుజుం గని తూఱ నేయఁ గో
పితుఁ డయి నింగితోఁ గదియఁ బేర్చిన యొక్కమహామహీరుహం
బతులబలంబునం బెఱికి హస్తయుగంబున నొక్కలావ కా
నతిశయలీలఁ ద్రిప్పి కదియంబడి దైత్యుఁడు బిట్టు వ్రేసినన్.

27


ఆ.

అమ్మహీరుహంబు నదరంటఁ దాఁకిన, నొచ్చి పంక్తిరథతనూభవుండు
మూర్ఛ వచ్చి యంగములు శిథిలంబులై, మిడుక లేక పుడమిమీఁదఁ బడియె.

28


క.

పఱతెంచి కరి మదము నే, డ్తెఱఁ దొండం బెత్తివేయ దెప్పఱికమునం
గొఱసంది దాఁకి నేలకు, నొఱఁగిన సింగంపుఁగొదమయొ ప్పమరంగన్.

29


క.

ఉన్న నది చావుగాఁ గొని, యన్నరభోజనుఁడు దుర్మదాంధుం డయి శౌ
ర్యోన్నతి నార్చి బ్రమరి గాఁ, జన్నయెడం తెలిసి రోషసంరంభమునన్.

30

మ.

అవనీనాయకనందనోత్తముఁ డమోఘాస్త్రంబు సంధించి క
ర్ణవతంసప్రభ లంగుళీయకముపైఁ బ్రాఁకంగ నాకర్షణం
బవగాఢంబుగఁ జేసి తైజసముతో నాలక్షితోరస్కుఁ డై
లవణుం గూలఁగ నేసె రౌద్రరసలీలాస్ఫూర్తి శోభిల్లఁగాన్.

31


ఆ.

అసురపాటు చూచి వసుమతీసురులు దీ, వనలు మున్ను గాఁగ వచ్చి యక్కు
మారుఁ బొదివి సంభ్రమంబును హర్షంబు, నెసక మెసఁగ నతని కిట్టు లనిరి.

32


శా.

ఈతం డప్రతిమానబాహుబలుఁ డై యేపారి మీతాత మాం
ధాతం దొల్లి వధించె నాపగ భవద్వంశంబునం దెవ్వరున్
వే తీర్పంగఁ దలంప రైరి త్రిజగద్విఖ్యాతిగా నిఫ్డు నీ
చేతం జచ్చెఁ గులంబుఁ దేజముఁ బ్రతిష్ఠింపంగఁ దా నల్పమే.

33


క.

అనుచుండ నాకసంబున, ననిమిషు లేతెంచి రఘువరానుజ నీ చే
సినలోకహితపరాక్రమ, మున కెద మెచ్చితిమి వేఁడుము వరం బనినన్.

34


తే.

నన్ను మధురాపురం బేల నన్న పనిచె, రాష్ట్రమునకు వృద్ధియుఁ బ్రజారంజనంబు
వినుతసద్వర్తనము మఱి విప్రభక్తి, నాకు దయసేయుఁ డనియె నన్నరవరుండు.

35


క.

వా రమ్మాటకు మెచ్చుచు, గౌరవ మెసఁగంగ నట్ల కావుత మని మం
దారప్రసూనవర్షము, బోరనఁ గురియించి దివికిఁ బోయిరి ప్రీతిన్.

36

లవణు వధించి మధుర నేలుచున్న శత్రుఘ్నుఁడు పండ్రెండేండ్లకు నన్నం జూడవచ్చుట

తే.

ఇవ్విధంబున నద్దానవేంద్రుఁ జంపి, మునులచిత్తంబు దేవసమూహకృపయుఁ
బడసి మధురాపురం బేలెఁ బరమధర్మ, నిరతుఁ డై ప్రజ రాగిల్ల నృపవరుండు.

37


క.

ఆదిమహీపతులక్రియన్, వేదోచితనిఖిలమార్గవేదితముగ ని
త్యోదయమహనీయుం డై, ద్వాదశవర్షముల కన్నవలనితలఁపునన్.

38


క.

కతిపయపరివారముతో, నతఁ డేగెడునెడఁ బ్రమోద మడర నరిగె నం
చితధర్మకర్మనిత్యో, దృత మగువాల్మీకిమునివరాశ్రమమునకున్.

39


క.

అం దభ్యాగతపూజా, నందితుఁ డై యానరేంద్రనందనుఁ డమృత
స్యందముచందం బగు ముని, బృందారకుచూడ్కి యెడఁదఁ బ్రీతి యొనర్పన్.

40


క.

అతఁడు దను లవణయుద్ధ, స్థితి యడుగఁగ నల్ల నల్లఁ జెప్పుచు సంభా
వితుఁ డగుచు గాఢలజ్జా, నతిఁ బొందుచు నుండె మునిజనంబులలోనన్.

41


క.

ఆశ్రమము నెల్లయెడలను, విశ్రుతమునిదారకులు ప్రవీణతమై మం
జుశ్రుతిమేళన మానం, దాశ్రులుఁ బులకలును దాల్చు నట్లుగఁ బాడన్.

42


తే.

అభినవాకృతి యగుకృతి యగుట జేసి, యాత్మఁ గౌతుక మంతంత కగ్గలింప
నమ్మునీశ్వరు చెప్పిన యాదికావ్య, మయినరామాయణము చెవులార వినుచు.

43


క.

సరసం బగురఘుకులపతి, చరితం బొక్కొక్కచో నిజస్వాంతఁబుం
గరఁగింపఁ దన్మయత్వముఁ, బొరయుచు నద్దినము నృపతిపుత్త్రుఁడు గడపెన్.

44

మ.

మఱునాఁ డమ్మునినాథు వీడ్కొని జగన్మాన్యత్వవిఖ్యాతికిన్
గుఱి యై యుండెడిగంగ దాఁటి మదిఁ గోర్కుల్ ప్రోవుగా వీడు డ
గ్గఱఁ బోఁబోవఁగఁ జూడ్కి యారఘువరాగారంబుపై వేడుకం
బఱచెం గ్రమ్మెడుసమ్మదాశ్రువులతోఁ బల్మాఱుఁ ద్రోపాడుచున్.

45


ఆ.

ఇట్టు లరిగి మేదినీశ్వరుఁ గని తత్ప, దాంబుజంబు లుత్తమాంగమునకు
భూషణముగ మేను పులకలప్రోవుగాః, బ్రణతుఁ డయ్యె నానృపాలసుతుఁడు.

46


చ.

తిగిచి కవుంగిలించి నరదేవకులోత్తముఁ డక్కుమారు నె
మ్మొగము మొగంబునం గదియ మోపుఁ గరాంగుళులం గపోల మిం
పుగఁ బుడుకుం బొరిం బొరి నపూర్వవిలోకన మాచరించుఁ గ
ప్పగుమృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్.

47


చ.

తనుఁ గొనియాడునాతనికిఁ దమ్ముఁడు గేలు మొగిడ్చి యల్ల ని
ట్లను భవదాజ్ఞ మోచి చని యద్దనుజాధము సంగరాంగణం
బున వధియించి విప్రుల కపూర్వమహోత్సవ మాచరించి వా
రనికృప వారు పంప మధురాపురి రాజ్యము సేయుచుండితిన్.

48


క.

మిముఁ గొలుచుసుఖమునకు రా, జ్యము సౌఖ్యం బీడు గామి నం దునికికిఁ జి
త్తము గొలుపక నావచ్చుట, సముచిత మనుచితము నాక చననిండు దయన్.

49


ఉ.

నావుడు నల్ల నవ్వి నరనాథుల కి ట్లనఁ జెల్లు నయ్య య
చ్చో వసియించిన సరిగఁ జుట్టముఁ బాసియు నిల్వఁ జాలి నా
నావిధదేహదుగఖము మనంబున నోర్చినఁ గాక రాజ్యల
క్ష్మీవిభవంబు సొప్పడునె కేవలమే నృపతిత్వ మారయన్.

50


క.

అని బోధించి మగుడ నే, డెనిమిది దివసములలో నరేశ్వరుఁ డటఁ బోఁ
బనిచిన నాతఁడుఁ బ్రీతిం, జని మధురాపురము రాజ్యసంపదఁ బొందెన్.

51


క.

భూనాథుఁ డిట్లు దమ్ములుఁ, దానును వివిధప్రకారధర్మనిరతు లై
నానావిధసజ్జనస, మ్మానసదాదాననిపుణుమతి నున్నయెడన్.

52

ఒకానొకబ్రాహ్మణుఁడు చచ్చినకొడుకుం దెచ్చి రామునినగరివాకిటఁ బెట్టి దుఃఖించుట

ఉ.

చచ్చినపుత్రు నెత్తుకొని జానపదుం డొకవిప్రుఁ డార్తుఁ డై
వచ్చి నరేంద్రుమందిరము వాకిట నాలును దాను నిల్చి వా
పుచ్చి మహోష్ణబాష్పములు బోరనఁ గ్రమ్మఁగ నేడ్చి యేడ్చి క
న్విచ్చుచు మోడ్చుచుం గోడుకు వేఁడుచు నెవ్వరి నేనిఁ జూచుచున్.

53


మ.

తనయుం డొక్కఁడ కాని నాకు మఱి సంతానంబు లే దేను భా
మినియుం బిమ్మటిసత్క్రియల్ పడయ లేమిం జూడఁ డయ్యెం గటా
చనునే వీనికి నిట్లు సేయ మరణోత్సాహంబు శోకాపనో
దన మంచుం బలుమాట లాడుచుఁ బరీతాపంబు దీపింపఁగన్.

54

క.

కాలునకు నాతనూజు న, కాలంబునఁ దనవశంబు
గావింపంగాఁ
బోలునె దుష్పథవర్తులఁ, జూలఁడె శిక్షింప రామజనపతి యనుచున్.

55


ఉ.

ఇట్టివి గల్గునే జనుల కెవ్వరికిన్ నరనాథునెల్ల నే
పట్టున నైన నేల ననుఁ బాపము చుట్టెనొ కాక దీని నే
నెట్టని నిర్ణయింతు నిది యింతయు భూపతిచెట్ట గా మదిం
బుట్టెడు నొక్కశంక యిది పోలుట పోలమి దోఁప దయ్యెడున్.

56


ఉ.

ఎయ్యది యెట్టు వోయినను నీతనికిం బ్రియ మెచ్చునట్లుగా
నియ్యెడ నగ్ని పెట్టుకొని యెల్లజనంబులు సూచుచుండఁగాఁ
జయ్యన మ్రంది పోయెద విచారము లిన్నియు నేల యంతతో
దయ్యమునెత్తికోలు తుదిఁ దాఁకెడు నంచు బహుప్రలాపుఁ డై.

57


క.

పొరలుచు లేచుచు నలుదెసఁ, దిరుగుచు భూపాలవర్యుఁ దిట్టుచుఁ దనయుం
బొరిఁబొరిఁ జూచుచుఁ బిలుచుచుఁ, బరిరంభము సేయుచుండె బలువేదనతోన్.

58


క.

ఉన్నంత నంతయును విని, యన్నరనాయకుఁడు హృదయ మాకులముగ నా
పన్నశరణ్యుఁడు గావున, విన్న నగుచుఁ జక్కఁ బెట్టు వెర వారయుచున్.

59

వసిష్ఠాదిఋషులు విప్రకుమారునిమృతికారణము రాముని కెఱింగించుట

ఉ.

భేదముఁ బొంది మంత్రుల నకిల్బిషవృత్తులఁ దమ్ముల వసి
ష్ఠాదిమునీంద్రముఖ్యుల రయంబునఁ బిల్వఁగఁ బుచ్చి వారితో
నాదురవస్థ యున్నతెఱఁ గంతయుఁ జెప్పిన నమ్మునుల్ సుక
ర్మాదరవృత్తి ని ట్లనిరి యాదట నర్కకులాగ్రగణ్యుతోన్.

60


చ.

కృతయుగవర్తనంబున నభిన్నమతిం బృథివీసురుల్ దపం
బతులముగా నొనర్తురు నియంత్రితవృత్తిఁ దగంగఁ ద్రేతఁ బూ
జితగుణు లైనరాజులును జేయుదు రాపరిపాటితో నన
ర్హత గను నాయుగద్వయమునందును దక్కటిరెండుజాతులన్.

61


ఉ.

ఇమ్మెయి దప్పి శూద్రుఁ డొకఁ డిప్పుడు నీ దగుభూమిలోనఁ దీ
వ్రమ్ముగ నిష్ఠ మైఁ దపము వారక సేయుచు నున్నవాఁడు గాఁ
గొ మ్మిది తప్పనేర దనరఘుం డగు నీతఁడు బాలుఁ డేల తు
ర్యమునఁ బొందు నీదురిత మయ్యపచారము లేక పుట్టునే.

62


ఉ.

కావున నెందు నారసియు కార్యము తెల్లము గాఁగఁ జూచి సం
భావితమైనచిత్తమునఁ బాయఁగఁ జేయఁగఁ గర్మసిద్ధి నా
శావలయంబునన్ యశము సాంద్రముగాఁ గృపఁ గొంకు లేక నీ
వే వధియింపకున్న శిశువేదన క్రమ్మఱు టేల చొప్పడున్.

63


క.

అనవుడు మో మలరఁగ న, జ్జనపతి లక్ష్మణునిఁ జూచి చయ్యన జని వి
ప్రుని నూఱడింపు తత్సుతు, తనువు తగన్ సంగ్రహింపు తైలద్రోణిన్.

64

క.

అని చెప్పి భరతుఁ దగ నా, తనిఁ బురమున నిలువఁ బంచి తనదుమనోవ
ర్తన ఘనపుష్పకమును న, మ్మనుజేంద్రుఁడు దలఁచె నదియు మసలక వచ్చెన్.

65

రాముఁడు పుష్పకారూఢుఁ డై శూద్రతపస్విని వెదకి ఖండించుట

శా.

చాపంబుం బటుబాణతూణయుగమున్
శాతాసియున్ వర్మమున్
భూపాలుండు విమానరత్నముపయిం బూజాసమేతంబు ని
క్షేపింపం దగువారిఁ బుచ్చి మును లాశీశీర్వాదముల్ సేయఁ ద
చ్ఛ్రీపాదంబులు శేఖరద్యుతుల నర్చించెం వినీతాత్ముఁ డై.

66


తే.

వారి వీడ్కొని యిక్ష్వాకువంశవరుఁడు, పుష్పకం బెక్కి ఖేచరపూజ్యుఁ డగుచు
మున్ను పశ్చిమదిగ్భాగమునకు నేగి, యందుఁ గలయఁ దపస్వుల నరసి యరసి.

67


క.

చూచుచుఁ బలుకుచు వినుచు య, థోచితసంభాషణంబు లొనరించుచు ని
ష్ఠాచారుల నెల్లను ధ, ర్మాచార్యుం డతివిదగ్ధుఁ డయి శోధించెన్.

68


క.

ఉత్తరమునందుఁ దూర్పున, నిత్తెఱఁగున మునులలోన నెల్లను గలయం
జిత్తానురూప మగుస, ద్వృత్తంబునఁ జొచ్చి వారి వెదకుచు వచ్చెన్.

69


క.

అక్షయపుణ్యుం డిట్లు ప్ర, దక్షిణముగ భూమిలోనఁ దడవుచు మునిసం
రక్షలు సేయుచు వచ్చెను, దక్షిణదిక్కునకు వగపు దనమదిఁ గదురన్.

70


ఉ.

అం దొకకొండచేరువ సితాబ్జవనంబులతీరభూమి మా
కందముకొమ్మునన్ బిగియఁ గాళులు రెండుఁ దగిల్చి వ్రేలుచుం
క్రింద హుతాశనార్చుల నఖేదమునం గబళించి మ్రింగుచు
న్డెందము కాంతి నొంద మహనీయతపం బొకఁ డాచరింపఁగన్.

71


క.

కని యల్లల్లన యచటికిఁ, జనుచు నిరూపించి యతనిచందము దననె
మ్మనమున కెర వయి తోఁచిన, మనుజేంద్రుఁడు చేర నరిగి మధురోక్తి మెయిన్.

72


క.

ఏమికులంబునఁ బుట్టితి, నామం బెయ్యది తపంబునకు ఫల మై నీ
కామించిన తెఱఁ గెట్టిది, నీమది నున్నట్లు నాకు నిక్కము సెపుమా.

73


చ.

అనినఁ దపస్వి యిట్లను మహాత్మ జనించితి శూద్రయోనిఁ బే
రుకు విను శంబుకుండ గతరోషమదభ్రమచిత్తవృత్తి ని
ట్లనితరసాధ్య మైనతప మర్థి నొనర్చెద మేనితో దివం
బునకు జగత్ప్రశస్తముగఁ బోవుట కోర్కి నిజంబు సెప్పితిన్.

74


ఉ.

నా విని భూవిభుండు మునినాయక సత్యహితోపదేశవా
ణీవిభవంబు చిత్తమున నెక్కొన నచ్చెరు వంది గాఢసం
భావన చేసి శూద్రమునిపై సదయం బగు చూడ్కి నిల్పి చిం
తావివశత్వ మొందె నృపధర్మము నీచము గాఁ దలంచుచున్.

75


చ.

తనయశవంబు మోచికొని తన్వియుఁ దానును వచ్చి యేడ్చువి
ప్రునియడ లంతరంగమునఁ బోక పెనంగిన ఖడ్గముం గనుం

గొనుచు మునీశ్వరానుమతిఁ గ్రూరత కైనను నోర్చువాఁడఁ బొ
మ్మని తలపోయుచుండెఁ గృపయం దెడ సేయుచుఁ జిన్నవోవుచున్.

76


క.

కరుణాతిశయంబుఁ బ్రజా, పరిపాలనరతియుఁ బెసఁగు వడి యుల్లములోఁ
బిరిగొన నిశ్చయమునకుం, జొరఁజాలక తలఁకు పాలసుండునుబోలెన్.

77


క.

వెడఁగుపడి యచటఁ బెద్దయు, వడి నిలిచి తలంచుకొని యవశ్యంబును ని
ప్పు డితనిఁ దెగఁజూడక చొప్పడునే యావిప్రశిశువుప్రాణం బనుచున్.

78


క.

తల కంటగించుచుండఁగ, బలిమిని నౌషధరసంబు పానము సేయం
దలకొనురోగార్తునిక్రియ, నలమటతో బెరయు తెగువ నలుగుల పడుచున్.

79


మ.

నరనాథుం డిటు లెట్టకేలకు విలీనం బైనచిత్తంబు సు
స్థిరభావంబునఁ బట్టుకొల్పికొని నిశ్చింతాత్ము నత్తాపసున్
శరణార్థిస్ఫుటరక్ష గోరి తునిమెన్ సంరంభశూన్యాంగుఁ డై
కరవాలంబు మృదుక్రియం బెఱికి రేఖాహీనదీనస్థితిన్.

80


ఆ.

అపుడు కుసుమవర్ష మాకసం బెల్లను, బోదివె దేవదుందుభులు సెలంగె
హరిహరాదిదివిజు లంతరిక్షంబున, నిలిచి సంస్తుతించి రెలమి మిగుల.

81

శూద్రమునిని వధించినరాముని దేవతలు ప్రత్యక్షమై గారవించుట

ఉ.

వారలు రాముతోడ రఘువంశనృపోత్తమ యిత్తపోధనుం
డేరికిఁ బొందరానిగతి కేగె సుకర్మము మెచ్చి యేము నీ
కోరినయట్ల యిచ్చెదము కొమ్ము వరం బనినం బ్రమోద మే
పారఁగ విప్రబాలుబ్రదు కాధరణీరమణుండు వేఁడినన్.

82


క.

ఏప్రొద్దు శూద్రముని విగ, తప్రాణునిఁ జేసి తీవు ధర్మనిరతి నా
విప్రశిశువుచైతన్యము, నాప్రొద్ద యనూనముగ సమాహిత మయ్యెన్.

83


చ.

అని విభునెమ్మనంబు ప్రమదాతిశయంబును బొందఁజేసి య
య్యనిమిషసంఘ మి ట్లనియె నాతనితో మఱియు మహీశ యే
మనఘుఁడు కుంభసంభవునియజ్ఞముతీఱుదలం దదీయద
ర్శనమున కర్థి నేగెదము ర మ్మట నీవుఁ దగం దదర్థమై.

84

దేవతలు చెప్పినచొప్పున నగస్త్యునియజ్ఞము చూడ రాముఁ డరుగుట

చ.

అనుచు విమానముల్ నడప నన్నరనాథుఁడు పుష్పకంబుపై
ననుగమనంబు సేసె నమృతాశనులుం జని యమ్మునీంద్రుపూ
జనములఁ దృప్తిఁ బొంది రఘుసత్తము ధర్మవిధిప్రయత్న మా
తని కెఱిఁగించి యేగి రుచితంబుగ సంయమిఁ గాంచె రాముఁడున్.

85


క.

అతఁ డభ్యాగతపూజా, ప్రతిపాదనకౌశలమును రాఘవు సంతో
షితహృదయుఁ జేసి యిట్లనుఁ, గతిపయసల్లాపజనితకౌతూహలుఁ డై.

86

మ.

అవనీదేవకుమారుచావునకు నీ వత్యంతఖేదంబుఁ బొం
ది వివేకంబున ధర్మనిర్ణయము సంధిల్లం బ్రతీకారక
ర్మవిధానంబున వానిమేన మగుడం బ్రాణంబు గల్పించుటల్
దివిజవ్రాతము సెప్పఁగా విని కృతార్థీభూతచిత్తుండ నై.

87


క.

నీ కెదురుసూచుచుండితిఁ, గాకత్స్థాన్వయవరేణ్య కడునద్భుత మీ
లోకమున నిట్టిచరితం, బేకందువ నైనఁ గలదె యెవ్వరి కయినన్.

88


క.

అని యమ్మునిపతి లజ్జా, వనతుం డగు రామధరణివల్లభునకు ని
చ్చె నతి ప్రియపూర్వకముగ, ననర్ఘ్యమణిరుచుల వెలుగుఁ నాభరణంబుల్.

89


ఆ.

ఒసఁగి యిట్టు లనియె ముర్వీశ యొకదివ్య, పురుషుఁ డొక్కకొలనిపొంత నన్నుఁ
గాంచి వినయ మొప్పఁగాఁ దనదురితంబు, నాకు నెఱుఁగఁ జెప్పి నాకతమున.

90


క.

ఆదురితము వాసిన స, మ్మోదమున బ్రహ్మలోకమున కరుగునతం
డాదరవృత్తి నొసఁగం, గా దన కీభూషణములు గైకొంటిఁ దగన్.

91


తే.

దేవభరణీయ మిది నరదేవసేవ్య, నీక భరియింపఁ దగు నని నెయ్య మొంద
దేవకార్యంబు మేదినీదేవహితముఁ, గేలిమైఁ జేయు మని విభుకేలఁ దొడిగె.

92


క.

పలుకుల నాదశరథుగా, దిలిసుతుఁ దుష్టాత్ముఁ జేసి దీవనలఁ బొగ
డ్తల సముచితోపదేశం, బులఁ దాపసవరుఁడు ప్రొద్దు పుచ్చుచు నుండెన్.

93

రాముఁ డగస్త్యునిచే సమ్మానితుఁడై యయోధ్య కేతెంచుట

తే.

అధిపుఁ డాదివసంబున కయ్యామినియును, గడపి మఱునాడు మునిపద్మకమలములకు
నెఱఁగి వీడ్కొని పుష్పకం బెక్కి, సిద్ధ, సాధ్యపూజితుఁ డగుచు నయోధ్య కరిగి.

94


చ.

తనుఁ గని భక్తి మ్రొక్కుటయుఁ దమ్ములఁ గౌఁగిటఁ జేర్చి యాత్మవ
ర్తన మెఱిఁగించి తల్లులకు దండనమస్కృతు లాచరించి భృ
త్యనికరపౌరభూజనముదావహుఁ డై కొలు విచ్చి కొంతసే
పున కనుజాదిసేవకులఁ బొమ్మని భూపతి సమ్మదమునన్.

95


క.

సమయకరణీయకవిజన, సముదయగోష్ఠీవినోదసారస్యాసం
గమునఁ దగఁ బ్రొద్దు పుచ్చె, న్సముచితచతురాల్పపరిజనంబులతోడన్.

96


క.

మనుజపతి తాను దమ్ములు, జనమానసరంజనార్యసమ్మదచరితం
బున నెల్లలోకములుఁ గీ, ర్తన సేయఁగ నిట్లు పూజ్యరాజ్యము నడపెన్.

97


ఆ.

అంత నొక్కనాఁట ననుజుల రావించి, ధర్మసంగ్రహైకృతత్పరాత్ముఁ
డగుటఁ బుణ్యకర్మయత్నాదరమున వా, రలకు నిట్టు లనియె రామనృపతి.

98


చ.

క్రతువులయందు మేటి యనఁగా నుతి కెక్కిన రాజసూయ మ
ప్రతిహతవృత్తిఁ జేయునృపభావము గౌరవ మొందఁ జేఁత యీ
ప్సిత మిది మీకుఁ జూడ సవిశేషసముద్యమమేనిఁ దత్త్రియా
రతమతి నుత్సహింపుఁ డభిరామముగా విభ వస్పదంబుగన్.

99

చ.

అనుడు వినీతిమై భరతుఁ డారఘునందనుతోడ నల్ల ని
ట్లనుఁ గరుణావిధేయమతి యై పొగడొందిననీకు విశ్వభూ
జనమనుజేశ్వరప్రకరసంక్షయమూలము నాఁ బ్రసిద్ధి కె
క్కినక్రతు వేల యెండొకటికిం దొడఁగ మముఁ బంపు పెంపునన్.

100


ఆ.

అనినపలుకు లియ్యకొను రాఘవునకు సౌ, మిత్రి యిట్టు లనియె సత్రసమితి
యందు ముఖ్య మగుట నశ్వమేధంబు పూ, జ్యంబు దానిఁ జేయు మధిప నీవు.

101

రాముఁ డశ్వమేధయాగము సేయుట

మ.

అనినం దమ్మునిమాటఁ గైకొని మహీశాగ్రేసరుం డాతనిం
బనిచెన్ రాజుల విప్రకోటి మునులన్ బంధువ్రజంబుం గరం
బనురాగంబునఁ బిల్వఁ బంప నతఁడున్ యజ్ఞోచితామంత్రణం
బొనరించెన్ సకలావనీశజనచిత్తోల్లాససంపాది యై.

102


క.

జనపతి వసిష్ఠముఖస, న్మునులయనుజ్ఞ గొని లక్ష్మణుని ఋత్విజులం
గనకాదివస్తుయుతముగ, వెనుకం బోఁ బనిచి హయము విడిచె నియతుఁ డై.

103


తే.

పుణ్యతర మగునైమిశారణ్యభూమి, భాగమున యజ్ఞవాట మపారవిభవ
భాసితంబును శుచియుఁగాఁ జేసియున్న, నందులకుఁ జని మంత్రతంత్రాన్వితముగ.

104


క.

క్రతు వొనరింపఁ దొడఁగి భూ, పతి పత్నీకృత్యములకుఁ బసిఁడిని సీతా
ప్రతిమ నొడఁ గూర్చుకొని హృ, ద్గతఖేదము లోన నడఁచి దైర్యముపేర్మిన్.

105


క.

నానాదేశసమాగతు, లైనవివిధజనములం బ్రయత్నంబున స
మ్మానించి తత్తదుచితా, నూననిఖిలసంవిధాప్రయోజకుఁ డగుచున్.

106


క.

అన్నంబు వస్త్రములు సం, పన్నహిరణ్యంబు రుచిరబహుమణులును శ
శ్వన్నిరతి నొసఁగుఁ బ్రియమున, నన్నరపతి విప్రకోటి కచ్చెరు వారన్.

107


క.

సరసఫలకందమూలో, త్కరములు వేర్వేఱ బహులకటములుఁ దెప్పిం
చి రఘువరేణ్యుఁడు సంయమి, వరులకు నొప్పించె శిష్యవర్గము లలరన్.

108

కుశలవులు యాగశాలకు వచ్చి రామాయణగానము సేయుట

ఉ.

ప్రీతి జగంబుచిత్తములఁ బెంపు వహింపఁగ నిట్లు చెల్లఁ బ్రా
చేతసుఁ డమ్మఖంబునకు శిష్యయుతంబుగ వచ్చి దారచిం
తాతురుఁ డైన రాముని యుథార్హవిధానము శాతకుంభసీ
తాతనుసంవిధానచరితం బగు టెల్ల నెఱింగి హృష్టుఁ డై.

109


క.

సీతాతనయులఁ బ్రీతిస, మేతుం డై పిలిచి వారి కి ట్లనియె జఘ
న్యేతరుఁ డగురఘునందను, చేతోగతిఁ దెలియఁ గోరు చిత్తముతోడన్.

110


ఉ.

గేయరసంబు నింపున నకిల్బిషవర్ణములందు మాగధ
శ్రీ యలవడ్డకోవిదుల చిత్తము లార్ద్రతఁ బొందునట్లుగా

నీయెడ నధ్వరాగతమునీంద్రనరేంద్రులపాలి కేగి రా
మాయణ మర్థిఁ బాడుఁడు సమాహితమానసవృత్తి నిత్యమున్.

111


తే.

యాగశాలోపకంఠంబునందుఁ బోయి, వెరపుమై మీర లొక్కొక్కమరి క్రమమున
రాముచెవి సోఁకునట్లుగా నేమిభంగి, నైనఁ బాడుఁడు తగుసమయంబు లెఱిఁగి.

112


క.

జను లెవ్వ రేని మి మ్మా, మనుజేంద్రుం డున్నయెడకు మన్ననమైఁ దో
డ్కొని చనినను నాకర్ణన, మునఁ బతి పిల్పించె నేని ముదమునఁ జనుఁడీ.

113


క.

మనుజేశ్వరుసభ నే ను, న్నను లేకున్నను మనంబునం గొంకక పా
వన మగునానృపుచరితము, వినిపింపుఁడు చొచ్చి యతని వేడుకకుఁ దగన్.

114


చ.

అని ముని చెప్పి వేడ్క హృదయంబులఁ బట్టుకొనంగ మైథిలీ
తనయులు దాని కియ్యకొని దండనమస్కృతు లాచరించి వీ
డ్కొని పరిషత్ప్రదేశములకుం జని పాడుచు నల్లనల్ల నే
ర్పున మఘశాలచేరువకుఁ బోయి నృపశ్రుతిగోచరంబుగాన్.

115


క.

సరసధ్వనిఁ బాడఁగ న, న్నరపతి యాలించి నిజగుణస్తవనకథా
విరచన యగు టెఱిఁగి తదీ, యరసానుగుణప్రకర్ష మభినందింపన్.

116


చ.

తలఁచి మహీశులన్ మునులఁ దమ్ముల బంధుల సత్కవీంద్రులం
గలల విదగ్ధు లైననటగాయకవైణికవాంశికాదులం
బిలువఁగఁ బంచి వైభవము పెం పెసలారఁగ వార లెల్లఁ దన్
గొలువఁగ నాకుశలవులకుం దగ దర్శన మిచ్చె నిచ్చినన్.

117


క.

చొత్తెంచి రామువడు వ, చ్చొత్తినచందమునఁ దనువు లొప్పఁగ రూపా
యత్తంబు లైనజనముల, చిత్తములు వికాస మొంద సీతాతనయుల్.

118


తే.

రాముచరితంబు గేయాభిరామమధుర, పదవిలాసమనోహరభావభంగిఁ
జతురవాక్యార్థసువ్యక్తసరసలీల, వివిధగతిఁ బాడుచున్న యయ్యవసరమున.

119


క.

వీరలమునివేషంబుల, కారణమునఁ గాక యొడలికట్టడయు ముఖ
శ్రీరామణీయకంబు మ, హీరమణుని యట్ల కాదె యిరువుర కరయన్.

120

రాముఁడు కుశలవుల గానము విని సమ్మానించుట

క.

అని యెల్లజనంబులు నె, మ్మనములఁ దలపోయుచుండ మనుజేశ్వరుఁ డ
మ్మునిబాలకులకు నొసఁగెను, గనకము నాభరణములును గారవ మెసఁగన్.

121


చ.

ఒసఁగిన నిక్కుమారు లవి యొల్లక పల్కిరి మాకుఁ గాయలుం
గసురులు వేళ్లు వెల్లఁకులుఁ గాక సముజ్జ్వలభూషణంబులుం
బసిఁడియు నేల యుక్తమె తపస్విజనంబులకుం బరిగ్రహం
బసమభవద్గుణస్తుతికథైకపరత్వవిభూతి సాలదే.

122


చ.

అన విని గారవంబు హృదయంబునఁ బుట్టఁగ వారిఁ జూచి య
య్యినకులముఖ్యుఁ డుత్సుకత నెవ్వరివారల రీప్రబంధ మే

మునికృత మన్న నాదికవి మోము గనుంగొని యక్కుమారు లం
దనుమతి గాంచి యి ట్లనిరి యానృపచంద్రునకుం బ్రియంబుగన్.

123


క.

ఈసందర్భము వీరలు, సేసినయది మేము వీరిశిష్యులము రసో
ల్లాసమధుర మగుదీని ను, పాసింతుము ప్రీతి నేతదనుమతి నెందున్.

124


చ.

అనుడు వికాస మంది విభుఁ డమ్మునినాథుముఖారవిందముం
గనుఁగోని మీకృపామహిమ గావ్య మయోజ్జ్వలమూర్తిఁ దాల్చి పా
వనముగఁ జేసె నాదులఘువర్తనమున్ భువనంబు లాదరం
బునఁ గొనియాడు నింక ననుఁ బుణ్యుఁడ నైతిఁ ద్రిలోకపూజితా.

125


క.

ఈవాత్సల్య మధికసం, భావనమై మీర లెఱుక పఱుప కునికి యే
మో వీర లెవ్వరో వినఁ, గావలయున్ గూఢపథము గాఁ దగు నేనిన్.

126

వాల్మీకి రామునికి సీతావృత్తాంతము చెప్పి కుశలవుల నతని కొప్పించుట

క.

అనురఘునాయకుపలుకులు, విని మునిపతి జనకతనయవృత్తాంతం బీ
తని కెఱుఁగింపఁగ నిది తఱి, యని యతనికి నిట్టు లనియె నందఱు వినఁగన్.

127


చ.

వినయముఁ బెంపు నేర్పును వివేకమునుం గలనీవు మేదినీ
తనయఁ దొఱంగు టెట్టు లుచితంబుగఁ జూచితి విట్లు వోలునే
యనలవిశుద్ధ యైనసతి నక్కట యెక్కడ నేనిఁ బొమ్ము నీ
వని వెడలంగఁ ద్రోచిన దయాగుణకీర్తికి హాని పుట్టదే.

128


క.

నాఁ డగ్నిలోనఁ ద్రోచిన, వాఁడ వకట యంతఁ బోక వల్లభ నిమ్మై
నేఁ డడవిఁ ద్రోచి తెదఁ గడు, వాఁడి గదే నీకు రాఘవకులప్రవరా.

129


తే.

అంతనుండియు నీతోడ నలిగి యున్న, వార మే మది యట్లుండె వారిజాక్షి
తెఱఁగు విను మని యిట్లను మఱియు ముని వి, నీతజాతోత్సుకుండగు నృపవరునకు.

130


ఉ.

క్షత్త్రియపుత్త్రికాభరణగౌరవలీల వెలుంగు మేదినీ
పుత్త్రి మదాశ్రమస్థలముపొంత వనంబునఁ ద్రోచి వచ్చె సౌ
మిత్రి తపస్విబాలకులు మెలుకఁ గన్గొని వచ్చి నాకుఁ ద
న్మాత్ర నెఱుంగఁ జెప్పుటయు మానిని యున్నెడ నేను గ్రక్కునన్.

131


క.

చని యనునయించి యాశ్రమ, మునకుం గొని పోయి యచటిమునివరపత్నీ
జనములభంగి నుటజవ, ర్తినిఁ జేసినయంతఁ గొన్నిదినములు సనిసన్.

132


క.

చకితాత్ము లగుమహీసురు, లకుఁ బ్రీతి యొనర్ప నాఁడు లవణునివధసేఁ
తకు నీ వనుపఁగ శత్రు, ఘ్నకుమారుం డందుఁ బోవు కందువఁ బ్రీతిన్.

133


క.

జనకసుత కవలవారిం, గనుడు ననుష్ఠితసమస్తకరణీయుఁడ నై
మనువంశముఖ్య కుశలవు, లనియెడు నామంబు లిడితి నయ్యిరువురకున్.

134


శా.

కాలౌచిత్యము మీఱఁ బెక్కువలమైఁ గల్యాణసౌమ్యాంగులై
కేలీలోలతపస్విదారకసహక్రీడం బ్రవర్తిల్లుచున్

బాలేందుద్వయిలీల నుజ్జ్వలకళాప్రౌఢత్వముం బొందుచున్
శీలం బాకృతు లొందిన ట్లగుచు సత్సేవం బ్రియం బందుచున్.

135


తే.

సకలవిద్యలయందుఁ బ్రశస్తి కెక్కి, యక్కుమారులు రామాయణాఖ్య మైన
మత్ప్రణీతప్రబంధంబు మధురగేయ, సహితముగ నభ్యసించిరి సచ్చరిత్ర.

136


క.

అని తెలియఁ బలుకుతనదువ, చనపద్ధతిమై నెఱిఁగియు సంశయమతిఁ ద
న్నును సుతులఁ జూడ నమ్ముని, మనుజేంద్రున కిట్టు లనియె మఱియుం బ్రీతిన్.

137


క.

వారల నివ్విధమున సం, స్కారవిశేషాభిమతులఁ గావించితి నా
చారవిజితసంయము లగు, వీరులు వా రప్రతర్క్యకవిభవైకనిధీ.

138


తే.

ఎంతకాలంబు వోయిన నెరవ కాదె, యొరులసొ మ్మని తలఁచి యాగోత్సవమున
కిదియ కానుకగా వీరికి నిట్లు తెచ్చి, నిన్నుఁ జేర్చితి రఘుకులనృపవరేణ్య.

139


క.

అనవుడు జనపతి నెమ్మన, మున నచ్చెరువాటు ముదము ముప్పిరిగొనఁగాఁ
గనుదోయి సమ్మదాశ్రుల, మునుఁగఁగఁ బులకములు మేన ముసుఁగువడంగన్.

140


క.

ఆనందము గదిరిన నభి, మాని యగుట నయ్యవస్థ మది నిడుకొని య
ట్లేనిం గర్తవ్యము దగ, నానతి యిం డనిన మునిజనాగ్రణి ప్రీతిన్.

141

సీత నిజపాతివ్రత్యప్రభావంబున భూమిం గ్రుంగుట

సీ.

జనకతనూజఁ గైకొను మిది మామతం బనిన వినీతుఁ డై యవ్విభుండు
మునినాథ యవిచారకముఖ్యంబు గాని లోకంబు మెచ్చించుట కరిది గాదె
ముద్దియ మీచిత్తమునకుఁ బోలినభంగి నీయెడ శపథంబు సేయుఁ గాక
యనవుడు నిది వోలు నని ముని శాసింపఁ దాపసీజనసహితంబు గాఁగ


తే.

సీత యచ్చటి కేతెంచి మాతయయిన, భూమిదెసఁ జూచి యెమ్మెయి రామనృపతి
నేను దప్పనిదాననయేని నన్నుఁ, జేర్చికొను మని తడవ నచ్చెరువు గాఁగ.

142


మ.

అవనీదేవత సింహపీఠగత యై యచ్చోటఁ దోతెంచి రా
ఘవుదేవిం దొడదోయిపై నునిచి లోకం బద్భుతం బంద నే
ల వెసం జొచ్చిన ధాత్రి కల్గునృపురౌల్యంబు న్మునీంద్రుండు యో
గ్యవచోయుక్తులఁ బాపి పుత్త్రయుగయోగానంద మగ్గించుచున్.

143


క.

ఇహపర సౌఖ్యనిదానము, మహితాపత్యంబ యనుచు మనుజేంద్రుమనో
విహరణముఁ బుత్రలాభ, ప్రహర్షవిషయంబుఁ జేసెఁ బరమ ప్రీతిన్.

144


తే.

అక్కుమారులు రాముపాదాంబుజముల, కెరఁగి భూదేవితప్పు సహింపవలయు
దేవ యని ముద్దుపుట్టఁ బ్రార్థించునట్లు, గాఁగ నత్తఱి వాల్మీకి గఱపుటయును.

145

రామచంద్రుండు పుత్రసహితుం డై నిజనగరంబుఁ జొచ్చుట

క.

వారలు నవ్విధమున నా, భూరమణునిమదికి నింపు పుట్టింపఁగ మం
దారకుసుమములు దొరఁగెను, బోరన దివి దేవదుందుభులు గర్జిల్లెన్.

146

చ.

జయజయశబ్దముల్ సెలఁగ సర్వజనంబు నెలర్ప నర్మిలిం
బ్రియసుతయుగ్మముం దిగిచి పెద్దయుఁబ్రొ ద్దొగిఁ గౌఁగిలించి మో
దయుతమనస్కుఁ డై నృపతి దమ్ముల సమ్మద మొందఁ జేసి య
న్వయపరివృద్ధి తల్లులమనం బలరం బ్రకటించి వేడుకన్.

147


క.

నగరం బుత్సవరమ్యం, బుగ నప్పు డలంకరింపఁ బుచ్చి సముచితం
బుగ సకలజనముఁ బొమ్మని, తగువారును మునివరుండు దమ్ములుఁ దానున్.

148


క.

కొడుకులతపస్వివేషము, లుడిపి నరేశ్వరకుమారయోగ్యపరికరం
బొడఁగూర్చి వార లుచితపు, నడవడి వర్తిల్లఁ గ్రతుదినంబులు సనినన్.

149


క.

ధరణీసురగణము మునీ, శ్వరులను భూపతుల నర్థివర్గము నయ్యై
వెరవున సంభావించుచుఁ, బరువడి వీడ్కోలిపె రఘునృపాలుం డెలమిన్.

150


తే.

వినయ మొప్పంగ వాల్మీకమునికి నచ్చ, లిచ్చి మీకృపపెంపున నెల్లవగలుఁ
బాపి నాహ్లాద మొనఁగూడె భవదనుగ్ర, హంబ మాకేడుగడయును ననుచు నతని.

151


క.

అనుచుటకును బెద్దయుద, వ్వనుగమనము సేసి భక్తి నడుగులఁ బడి వీ
డ్కొని యమ్మునిసత్తముదీ, వనలం బ్రీతాత్ముఁ డగుచు వచ్చెం బురికిన్.

152


తే.

ఇట్లు కృతకృత్యుఁ డగు రాఘవేంద్రు నెల్ల, వారు నయ్యైవిధంబుల వచ్చి కాంచి
మన్ననలు మున్నుగాఁ దమవిన్నపములు, సఫలములు సేయఁ దోషితస్వాంతు లైరి.

153


క.

తనకన్నప్రజయ కాఁ గైకొని భూప్రజ నెల్ల నొక్కకొఱఁతయు లేకుం
డ నడపి పాలించుచు న, మ్మనుజేంద్రుఁడు పూజ్యరాజ్యమహిమాన్వితుఁడై.

154

కుశలవులకు రాముఁడు రాజవిద్యలు నేర్పించుట

క.

మునులకడఁ దత్ప్రకారం, బున నునికిం జేసి ము న్నపూర్వం బని నం
దనులకు నుచితపరిశ్ర ను, మొనరించువిధంబునకు సముత్సుకుఁ డగుచున్.

155


సీ.

భరతవాత్స్యాయనప్రభృతి నాగరికశాస్త్రంబులదెస నైపుణంబు వడయ
హయగజస్యందనాద్యారోహణక్రియాదక్షతవలన వైదగ్ధ్య మొందఁ
గోదండకరవాలకుంతముఖ్యాయుధశ్రమములయందుఁ బ్రశస్తి నొంద
వేణువీణాప్రౌఢవివిధకళాభ్యాసములయెడఁ బ్రాశస్త్యములు వహింపఁ


తే.

జేసి తజ్జ్ఞులమనము లచ్చెరువడంగ, నక్కుమారుల నొక్కొక్కయవసరమున
నేర్పు మెఱయించి ముదము దలిర్ప శిక్ష, కులకుఁ బసదన మొసఁగు నిట్టలము గాఁగ.

156


క.

ఇత్తెఱఁగునఁ గుశలవులు ను, దాత్తపరిశ్రములఁ జేసి తద్విమలగుణా
యత్తమతిఁ జేసి శస్త్రా, ద్యుత్తమబాణములవిధము లుపదేశించెన్.

157


ఆ.

సర్వకార్యములను శత్రుఘ్న లక్ష్మణ, భరతు లరసి తీర్ప ధరణియెల్లఁ
బొగడుతోడియాజ్ఞ నెగడి ప్రవర్తిల్ల, నతఁడు సద్వినోదరతిఁ జరించు.

158

క.

సుతులఁ గొనియాడు విద్వ, త్ప్రతతి నుపాసించు భూమిప్రజ నరయు మహా
క్రతువు లొనరించు గురుదై, వతపూజలు సేయు సాధువర్గముఁ బ్రోచున్.

159


తరలము.

ధరణి నెందును గాలవర్షము దైవయోగసమగ్ర మై
గురియ మోదముఁ బొంద సస్యము కోటికొండలు పండ ధ
ర్మరతి సర్వజనంబు నుత్తమమార్గవర్తనశీలతం
బొరయ ధారుణి యేలె రాఘవపుంగవుండు మహోన్నతిన్.

160

ఆశ్వాసాంతము

మ.

మురజిత్కల్పుఁడు కల్పవృక్షకుసుమామోదప్రతీకాశకీ
ర్తిరమాధాముఁడు ధామమాలితులనాశ్రీపాత్రతేజోనిరం
తరదిక్చక్రుఁడు చక్రభృత్పదయుగధ్యానక్రియాభ్యాసత
త్పరతానిత్యుఁడు భవ్యకృత్యుఁ డసమాచార్యుండు సౌమ్యుం డిలన్.

161


క.

మనుజాభ్జాకరసవితృఁడు, వినయస్తవనీయవిభవవిశ్రుతనిజవ
ర్తనుఁడు పరివాహసన్నా, హనబిరుదాంకుండు శస్వదభివిజయుఁ డిలన్.

162


మాలిని.

ధరణిభరణదృప్యత్పార్థివార్థప్రకాండా
హరణపరిణతుం డుద్యద్గుణాఢ్యక్షితీంద్రా
భరణకరణగాథాపండితోద్యత్సదావి
స్ఫురణవరణనిత్యస్తుత్యలక్ష్మీశుఁ డుర్విన్.

163


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర, బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు సర్వంబును దశమాశ్వాసము.

నిర్వచనోత్తరరామాయణము

సంపూర్ణము

————