నిర్వచనోత్తరరామాయణము
అష్టమాశ్వాసము
|
పతిగౌరీపతివా
ణీపతిలీలాచతుర్థనిజవర్తనుఁ డి
ష్టాపూర్తనిరతమతి కరు
ణాపూర్ణుఁడు మనుమసిద్ధినరవరుఁ డెలమిన్.
| 1
|
క. |
అంత నొకనాఁడు నృపుఁ డ, త్యంత మహిమఁ బెద్దకొలువునం దున్నయెడ
విం తయిన కొన్నివచనము, లెంతయు మధురములు గాఁగ ని ట్లనెఁ జదలన్.
| 2
|
కుబేరపుష్పకము రామునియొద్దకు వచ్చుట
ఆ. |
ఏను బుష్పకంబ మానవాధీశ్వర, నీవు పరమధర్మనిపుణబుద్ధి
నపుడు నన్నుఁ గిన్నరాధిపుపాలికిఁ, బోయి యతనిపంపు సేయు మనుడు.
| 3
|
మ. |
భవదాజ్ఞం జని యాధనేశుఁ గని నీపం పెప్పుడుం దొంటియ
ట్ల విధేయాత్మతఁ జేయ నన్నుఁ బనిచె లావణ్యవారాశి దా
నవవిధ్వంసనుఁ డాశ్రితాపదుదయోన్మాథక్రియాశాలి రా
ఘవచూడామణి రామదేవుఁడు గృపాకల్పాతుఁ డై నావుడున్.
| 4
|
శా. |
ఆతం డచ్చెరువాటు సంతసము వక్త్రాబ్జంబునం దోఁపఁగా
నాతో నిట్లని పల్కె రామధరణీనాథుండు లోకత్రయం
బాతంకం బెద నుజ్జగింప సుర లత్యానందముం బొంద దు
ర్జాతుం బంక్తిముఖున్ వధించి కొనియెన్ సర్వంబు లంకాపురిన్.
| 5
|
క. |
నీవును నం దొకసర కా, భూవల్లభునకు వినోదమునకును బాత్రం
బై వలసినచోటులకుం, బోవలఁతివి నిన్ను నిందుఁ బుత్తేఁదగునే.
| 6
|
చ. |
అదియునుగాక లోకముల నన్నిటిఁ గావఁ దలంచి దుష్టదు
ర్మదఖరదండమండనపరాయణు లై చనునట్టివారి కి
ట్టిది దగుఁ గాక పూని యొకటిం గడతేర్పఁ గడంగ లేక యె
ల్లిదు లగువారి కేటికి సలీలవిహారము వేడ్క సేయఁగన్.
| 7
|
ఉ. |
కావున నెల్లభంగులను గ్రమ్మఱఁ జయ్యనఁ బోయి రామధా
త్రీవిభునొద్ద నిల్వుము మదీయహితం బిది యేను బంపఁగాఁ
|
|
|
బోవుట నెగ్గు లే దతఁడు పొచ్చెము సేయక సమ్మతించి సం
భావన సేయు నన్న జనపాలక సమ్మద మంది వచ్చితిన్.
| 8
|
క. |
పనిగొనుము నన్నుఁ గైకొని, యనునప్పలుకులకు మానవాధీశుఁడు సం
జనితబహుమానుఁ డై యి, ట్లనియెం బుష్పకవిమాన మానందింపన్.
| 9
|
క. |
ఏవలన నుండి యైనను, నావలసినయపుడ గ్రక్కునం జనుదేరం
గావలయుఁ దలఁచునంతకు, నీవల నెట్లట్ల తిరుగు నిఖిలజగములన్.
| 10
|
క. |
సిద్ధులగమనంబులకు వి, రుద్ధముగాఁ జనకు మానరోషంబులు స
ద్బుద్ధులకుఁ దగమి యెఱిఁగి జ, గద్ధితమతి సంచరింపు గౌరవ మొప్పన్.
| 11
|
తే. |
అని మహీపతి ముక్తాయతాక్షతములు, గంధపుష్పంబులును గొని గౌరవమున
మన్ననకుఁ దగుదివ్యవిమానమునకు, నర్చనము నిచ్చి వీడ్కోల్ప నదియుఁ బ్రీతి.
| 12
|
క. |
తన కిష్ట మైనయెడకుం జనినయనంతరమ రాజసత్తముతో ని
ట్లనియె భరతుండు పరిజను, లనుమోదరసానుభావితాంబుధిఁ దేలన్.
| 13
|
భరతుఁడు రామునిఁ బొగడుట
ఉ. |
చోద్యముగా నమానుషవచోరచనల్ విలసిల్లె నెంతయున్
హృద్యము గాఁగ నామయవిహీనత నొప్పెఁ దపఃప్రకర్షముల్
మాద్యదరాతిసంచరణమార్గము లెల్లను మాసె నెందు సా
వద్యులు లేరు బాలమృతివాదము లేదు ధరిత్రి నెయ్యెడన్.
| 14
|
చ. |
కొడుకులఁ గాంచి రంగన లకుంఠితసిద్ధులఁ బొందెఁ గర్మముల్
గుడువఁగఁ గట్ట నెల్లజనకోటికి నేమిఁ గొఱంత లేద యి
ప్పుడు భవదీయరాజ్యమున భూవరకుంజర సౌఖ్య మంది యి
ప్పుడమికి నిన్ను శాశ్వతవిభుండుగఁ గోరెద రెల్లవారలున్.
| 15
|
క. |
అనవుడుఁ దమ్మునిపలుకులు, విని మది ముదమంది మోము వికసిల్లఁగ నా
తనిఁ బ్రీతి వొందువీక్షణ, మున సీతావల్లభుఁడు ప్రమోదితుఁ జేసెన్.
| 16
|
ఆ. |
పుష్పకప్రసంగమునఁ దనుఁ గొనియాడు, భరతు నివ్విధమున భరితపరమ
హర్షుఁ జేసి సమయ మగుడు నాస్థానమం, డపము వాసి చనియె నృపవరుండు.
| 17
|
శ్రీరామునివినోదవిహారము
ఉ. |
నిచ్చలు నిత్తెఱంగున ననింద్యచరిత్రుఁ డనేకభంగులన్
వచ్చినవిన్నపంబు లనివారణమై విని నిశ్చయంబుగా
నిచ్చుసదు త్తరంబులకు నెల్లజనంబులు సంతసిల్ల రా
లచ్చి నహీనసద్గుణకలాపములం దగిలించె దక్షుఁ డై.
| 18
|
చ. |
ప్రజ ననురాగ మందఁ బరిపాలన సేయు నరేశ్వరుండు దో
ర్విజితవిరోధి యై తుదిని వేడ్క మెయిన్ విహరించు నెందు నా
|
|
|
ర్యజనులు మెచ్చఁగా నరసి యాదిమునీంద్రనిబద్ధనీతివా
క్యజనితకౌతుకుం డగుచు నమ్మనుజేంద్రుఁడు సమ్మదంబునన్.
| 19
|
క. |
రమణీయస్థలముల హృ, ద్యము లైనపదార్థములఁ బ్రియాసహితవిహా
రము సలుపు నుచిత పరివా, రము నాగరికంబునను సరసమధురముగాన్.
| 20
|
ఉ. |
వేడుక నెత్త మాడుచుఁ బ్రవీణతమై గరువంపుఁ బన్నిదం
బాడుచుఁ జూచి యొండొరులు యంగకముల్ మది మెచ్చి యుల్లసం
బాడునెపంబు పెట్టి కొనియాడుచుఁ బువ్వులవ్రేటు లాడుచుం
జేడియయున్ విభుండు విలసిల్లిరి పొచ్చెము లేని మచ్చికన్.
| 21
|
సీ. |
కలపంబు లభినవగంధంబులుగఁ గూర్చి తనువల్లిఁ గలయంగఁ దాన యలఁదుఁ
బువ్వులు బహువిధంబుగఁ గట్టి ముడి కొకభంగిగా నెత్తులు పట్టి యిచ్చు
హారముల్ మెఱయ నొయ్యారంబుగా గ్రుచ్చి యందంబు వింతగా నలవరించు
మృగమదపంకంబు మృదువుగా సారించి తిలకంబు పెట్టి నెచ్చెలికిఁ జూపు
|
|
ఆ. |
జనకరాజతనయమనము దలిర్పంగ, వివిధనిపుణలీల వెలయ నిట్లు
చతురముగ నొనర్చు సౌభాగ్యసారాభి, రామమూర్తి యగుచు రామవిభుఁడు.
| 22
|
మ. |
ప్రణయక్రోధముఁ దాన యొక్కమెయి సంపాదించుఁ బాదాంబుజ
ప్రణతిం గ్రమ్మఱఁ దీర్చు నేర్చి ధరణీపాలుండు సాకూతభా
షణముల్ వీనుల నించు మన్మథకళాస్వాతంత్ర్య మానందపూ
రణమార్గంబునఁ జెల్ల నిచ్చు రమణీరాగాబ్ధిపూర్ణేందుఁ డై.
| 23
|
సీతారాము లుద్యానవనమున విహరించుట
చ. |
ఉపవనదేశకేలిజనితోత్సుకతాభరితాంతరంగుఁ డై
నృపుడు సఖీసమేతధరణీతనయాసహితంబు గాయకా
దిపరిజనంబుతోఁ జని తదీయసమీరుఁడు దన్నుఁ గానరా
కపగిది వీచినం గొలువు గైకొని యిం పెద నాదరించుచున్.
| 24
|
క. |
చొత్తెంచిన వనపాలిక, మత్తమధుపములకుఁ దప్పి మధుభరితం బై
కొత్తావి గ్రమ్మునరవిరి, గుత్తి విభున కిచ్చె వినయకుంచితతను వై.
| 25
|
చ. |
జనపతి యందఁగా వెఱచుచాడ్పున జానకిఁ జూపి కానుకల్
గొనఁ దగువార లుండ మనకుం జనునే యని చేయి వాయఁ బె
ట్టిన వనపాలికాకరపుటీకలిత స్తబకంబు వుచ్చె మె
ల్పున సతి లేఁతనవ్వునఁ గపోలతలంబులఁ గాంతి వింతగాన్.
| 26
|
క. |
తరుపోతలతాకృత్రిమ, సరిదంబుజషండకేలి శైలముల మనో
హరము లగునెడలఁ గ్రీడా, పరతంత్రాత్ము లయి లలితభంగిఁ జతురతన్.
| 27
|
చ. |
అరవిరు లెవ్వ రెక్కుడుగ నారసి మేలుగ నేఱి కోయఁగా
వెరవరు లెవ్వ రొక్కొ కడువేగమ సెజ్జకుఁ జాలఁ గందునం
|
|
|
బొరయనియట్ల కెంజిగురుఁ బ్రో వొడఁ గూర్తురు చూత మంచు న
న్నరపతియుం దలోదరియు నర్మవచోరచనార్ద్రచిత్తు లై.
| 28
|
చ. |
అలరులఁ గోయుచున్ మధుకరావళిఁ జోపుచుఁ గీరపోతకం
బులపలు వాఱు మాటలకుఁ బొంచుచు నంచలఁ బట్టఁ దారుచున్
లలితమయూరనర్తనవిలాసముఁ జూచుచు బోటిపిండుతోఁ
గలయుచుఁ బాయుచున్ బహులకౌతుకవృత్తి రమించి రెల్లెడన్.
| 29
|
సీ. |
తీఁగెయుయ్యెల లెక్కి తూఁగియాడుచుఁ గూడి పాడెడు మత్తాళిబాలికలను
బలుకులతోడన యలవడఁ దొడఁగియు నేరనికీరకుమారికలను
నింపారు లేఁదూడు లేఱి పిల్లలకుఁ బెట్టుచు నున్నహంసకుటుంబినులను
ఫలరస మొండొంటి కెలిమిఁ జంచుల నించు తఱిఁ జొక్కుకోకిలదంపతులను
|
|
తే. |
జూచి చూచి యొండొరులకు జూపి చూపి, చెలుల కెఱిగించి కొనియాడి చెప్పి చెప్పి
చిత్తహారివిహారసంసేవఁ దగిలి, యుల్లసిల్లిరి వనితయు వల్లభుండు.
| 30
|
ఉ. |
అల్లవె లెస్సపువ్వు లని యందనిగుత్తులదిక్కు సూపి తా
నల్లన చేరి నేను నెగయ న్నిను నెత్తెదఁ గోయు మంచు భూ
వల్లభుఁ డాదటం బొదివి వామవిలోచన నెత్తెఁ దత్తనూ
వల్లికతోన మైఁ బులకవర్గము కాముఁడు నారు వోయఁగన్.
| 31
|
చ. |
నవకపుమావిమోకులఁ బెనంగినతీవలు వేడ్కఁ బెంపఁ బ
ల్లవములసెజ్జ లుల్లముల లజ్జ లడంపఁగఁ దేటితండముల్
దివుటలు ముంపఁగా సమదలీల మనోజవినోదసక్తు లై
యవసరసేవ మెచ్చి మలయానిలు సౌరభధన్యుఁ జేయుచున్.
| 32
|
ఆ. |
ఇవ్విధమునఁ బతియు నెలనాఁగయును వివిధప్రకారలీలఁ దగిలియుండఁ
జెలులఁ గేలివనము గలయంగఁ జొచ్చి నె, మ్మనములందుఁ గోర్కికొనలు నిగుడ.
| 33
|
చ. |
అలరులు గోయుచోట మధుపావళిమ్రోఁతకు ముగ్ధ లుల్కినం
గలకల నవ్వుచుం దొలుతఁ గైకొని మవ్వపుఁదీఁగె లాగి పు
వ్వు లొరులు గోయ నింకఁ దలఁపుం డని యొప్పుగ జంకె సేయుచున్
లలిఁ దమలోన మత్సరములం దుదికొమ్మలగుత్తు లందుచున్.
| 34
|
సీ. |
మావిలేమోకల మవ్వంపుఁదీవలఁ జెన్నొందఁ బెండ్లిండ్లు సేసి చేసి
పలుదెఱంగుల క్రొవ్విరులు నేర్పు వాటించి తోడవులు గావించి తొడివి తొడివి
పతులను బ్రియలఁ గా భావించి పొదరిండ్ల నిక్కలుగాఁ జేసి యేగి యేగి
చెట్టుపల్ నెఱయని చిలుకబోదులఁ బట్టి తెచ్చి బిడ్డలుగఁ జ న్నిచ్చి యిచ్చి
|
|
తే. |
బొదివి పుప్పొళ్లు సల్లియుఁ బువ్వుఁ దేని, యలఁ బదంపడి తడిపియు నలి వసంత
మాడి యాడి యుద్యానవిహారలీల, సలిపి రంభోరుహానన లెలమి మిగుల.
| 35
|
చ. |
నినుపు లొకర్తుచేతఁ గమనీయలతాంతము లున్న నొక్కెడం
గనుఁగొని ముగ్ధ యొక్కతె వికాసిని యై నవకంపుఁదీఁగెఁ బా
సినయెలగొమ్మగుత్తి సవిచేరి నయంబునఁ బట్టి కోయఁ జూ
చిన నగి యల్ల నవ్వ నది సిగ్గువడం గని యార్చి రందఱున్.
| 36
|
మ. |
కుచముల్ వాఱెడినీటిమీఁది విలసత్కోకంబులం గ్రేణి సే
యుచు నుండన్ మెడ యెత్తి పాదయుగళం బూఁదంగ బాహాలతల్
పచరింపం గరమూలకాంతి నిగుడన్ భావంబు రంజిల్లఁ బా
డుచుఁ గ్రీడించిరి పువ్వుఁబోఁడులు లతాడోలాకళాప్రౌఢులన్.
| 37
|
సీ. |
చిగురాకు గెంగేలి చెలిమి యొనర్పంగ మవ్వంపులేఁబొదల్ మలఁచిపట్టి
పెఱచేతినఖపంక్తి గిఱికొని చెన్నొంద నెగయుదీప్తుల విరు లినుమడింప
గురులు గన్గవమీఁద నెరసిన నెమ్మొగ మడ్డ మంకించి చూ పలవరించి
తనుగెంపు గడ చని దళములు సడలఁ బువ్వులు గోయ నొల్లక తొలఁగ నెత్తి
|
|
తే. |
యడరునెత్తావి పొలిలోని యలరు లేఱి, మెలపునలవాటు నెడఁదల మేకొనంగఁ
బ్రణయసఖులకుఁ గన్నులపండు వగుచుఁ, జతురముగ నోర్తు పుష్పాపచయము చేసె.
| 38
|
క. |
చెలిచెక్కుచెమట యొక్కతె, యలకులఁ గొని తుడువ రెంటియందలి మెఱుఁగుల్
పొలివోవుట సరి యై యి, ట్టలముగ నొండొండ రాయుటయు జిగి దఱిఁగెన్.
| 39
|
ఆ. |
వనజవదన లిట్లు వనకేలి సలిపి చా, లించి జలవిహారలీలఁ గోరి
జనకరాజతనయ సముచితముగఁ జేరి, యిష్ట మెఱుకపడఁగ నిట్టు లనిరి.
| 40
|
ఉ. |
నీదుకృపాకటాక్ష మను నీరజషండమునందు నిర్భరా
హ్లాదముఁ బొందఁగా వనవిహారపరిభ్రమవృత్తి యెమ్మెయిన్
ఖేదము సేయలేకునికిం గమలాకరకేలిమీఁద లే
దాదర మించుకేని నలినాయతలోచన మాకు నిత్తఱిన్.
| 41
|
చ. |
అనుడు విదేహరాజసుత యల్లన నవ్వు దొలంకుదృష్టులం
గనుఁగొనియెన్ సముల్లసితఘర్మజలాంకురజాలకంబు చె
న్నున విలసత్సుధారణమనోహర మైనళశాంకబింబమో
యనఁ జెలువొందు రామవిభునానన ముల్లము పల్లవింపఁగన్.
| 42
|
క. |
చెలుల చతురోక్తిరచనకు, నలినాయతనేత్ర నెమ్మనము విలసిల్లం
గొలన విహారము సలుపం, దలఁచినఁ బతికౌతుకంబు దనమదిఁ గదురన్.
| 43
|
సీతారాముల జలవిహారవర్ణనము
క. |
అనుచరుల నడిగియడిగియుఁ, బనిగొండ్రే వలయునెడలఁ బ్రభువులు పొద లెం
డని కమలవనము తెరువునఁ, గొనిపోవఁగ జానకియు సఖులుఁ జని రెలమిన్.
| 44
|
చ. |
చెలు వగునాననాబ్జముల చేరువఁ గుంతలభృంగమాలికల్
మెలఁగ వళీతరంగములమీఁద ఘనస్తనచక్రయుగ్మకం
|
|
|
బులు విలసిల్లఁ గూడుకొని పొల్తులు పద్మినిపొంత వింతసొం
పొలయఁగ వేడ్కమై నరిగి రొండొకపద్మినిఁ బోలి లీలతోన్.
| 45
|
తే. |
అందఱకుమున్న సలిలవిహారమునకుఁ, గడఁగి యొక్కర్తు గ్రక్కునఁ దొడవు లూడ్చి
నెలఁతుకలమొత్త మనుపచ్చవిలుతుననుఁగు,టంపపొదిలోనిబరిగోల యట్టులుండె.
| 46
|
చ. |
పొలయుసమీరణంబు నినుపుం దనుపుం దగ నింపు నెమ్మనం
బుల నొకయింపుఁ బెంప రతిబోటులు విభ్రమ మొప్ప వీఁగుఁజ
న్నులపయిఁ గే లమర్చుచుఁ దనూలత లించుక గొంకఁ గుంతలం
బులు మెలపొందఁగాఁ జెవులపొందునఁ జేర్చుచుఁ గూడి వేడుకల్.
| 47
|
క. |
మగుడఁబడి కరళు లక్కడ, నిగుడఁగఁ దనుపారుకొలనినీరు పులకముల్
నెగయించుచుఁ దొలుసోఁకున, సొగయింపం గూడి యాడఁజొచ్చిరి సుదతుల్.
| 48
|
సీ. |
నునుఁగాంతి దొలఁకెడు ఘనకుచయుగళంబు లదరంగఁ జిలుకుల నాడి యాడి
మెఱుఁగులు దూఁగెడు మృదుకరవల్లిక లల్లాడఁ జల్లు పోరాడి యాడి
జిగితొలం కెసఁగెడు మొగములు నిక్కుచు నడఁగుచుండఁగ నీఁదులాడి యాడి
మిం చెల్లదిక్కులు ముంచి చెల్లెడుమేను లలసి క్రాలఁగ నోల లాడి యాడి
|
|
తే. |
యోలి నిలుచుచుఁ గరళులఁ దేలి చనుచు, మునిఁగిపోవుచు నోర్తోర్తు ముంచిపట్టి
లోఁతునకునొయ్యఁ దిగుచుచు నీఁత లేని, యచట మిన్నక యీఁదుచు నాడి రర్థి.
| 49
|
చ. |
ప్రియమునఁ దూఁగి యాడు భ్రమరీతతిసోఁకునఁ, జక్రవాకికా
చయమున మందహంసికలసందడి ముం జెలువొందుకంటె న
న్నియు నెడగాఁ దొలంగినను నీరజషండము పొల్చె విన్నగా
క యువతు లాటమైఁ జెలఁగుక్రందున నొందినక్రొత్తసొంపునన్.
| 50
|
చ. |
తరఁగల తూలుచందమునఁ దమ్ముల కమ్మనితావి హంసికా
విరుతములన్ సమీరణము వీచునయంబున నీరియింపునం
జరతరసౌఖ్యసంపదలు సేకుఱఁ గైకొని తారతార య
త్తరుణులయింద్రియంబులు ముదంబునఁ జొక్కుచు నుండె నత్తఱిన్.
| 51
|
ఉ. |
తుమ్మెదపిండు మెండుకొని త్రొక్కిన ఱేకులసందుసందులం
గ్రమ్మి చలత్తరంగశిఖరంబులఁ దూలెడుతమ్మిపుప్పొడు
ల్గ్రొమ్ముడు లూడి క్రమ్ముపొదిలోపల నొక్కొకచోటఁ గెంపుచం
దమ్మునఁ జెన్ను చేసె వనితల్ గమలాకరకేళి సల్పఁగన్.
| 52
|
సీ. |
కలయ నెల్లెడ నాడుక్రందునఁ బడి నీరిమీఁద దాఁటెడు గండుమీలతోడ
మక్కువఁ దేఁకువ దక్కి లోఁ దవిలి యాడెడుచక్రవాకులగెడలతోడఁ
దిరుగుడుపడి తూఁగుతరఁగలు దాఁకి యల్లాడెడునంభోరుహములతోడఁ
వనజంబు లొల్లక వచ్చి యూర్పులతావి యన్నునఁ జొక్కెడు నళులతోడఁ
|
|
తే. |
గ్రాలుకన్నులు వలిచన్నుఁగవలుఁ దెలివి
మొగములుఁ గురులు బంధురముగను బెరసి
చూడఁ దడఁబాటుగా జలక్రీడ సలిపె
నెలమి మనముల నెలకొనఁ జెలువపిండు.
| 53
|
క. |
చేయిచ్చి యబల నధిపతి, తోయజషండంబు సొరఁగఁ దోకొని చనఁ జే
దోయి పులకించెఁ గనుఁగవ, దో యలరుచు బెరసెఁ గోర్కితో నెద గూడెన్.
| 54
|
క. |
పొలఁతుక లోఁతని చొరఁగా, నలుకుచుఁ బిఱిఁది కడుగు లిడ నప్పటిదృగ్దీ
ప్తులక్రందు సెందుసందడి, పొలపంబును నధిపునుల్లమున కిం పొసఁగెన్.
| 55
|
క. |
కొలను సనఁ జొచ్చి యిది లోఁ, తల యిది యని క్రమ్మఱంగ నరిగి విభుం డు
త్పలదళలోచనఁ దోకొని, మెలపున మగుడఁ జని లీలమెయి నాడునెడన్.
| 56
|
సీ. |
కరయంత్రధారలఁ గప్పక పొరిఁ బాఱి విభుమీఁదఁ జూడ్కులు వెల్లి గొలుపు
లీల నంబుజముఁ గెంగేలఁ దెమల్పక ధరణీరమణుపాణితలము పట్టుఁ
దను పారునీటిపైఁ దను విడి నలిఁ గ్రీడ సలుపక రాగరసమునఁ దేలు
గొలఁకున నాడునారులపజ్జఁ బోవక శృంగారచేష్టలఁ జెంది క్రాలు
|
|
తే. |
సలిలశైలికి నొలసియు నొలయ కిట్లు, ప్రాణవల్లభుమీఁదికిఁ బ్రాఁకి వేడ్క
నలమి యలమిమైఁ బెనఁగొను నతనియండ, నిలిచి విహరించుచుండె నన్నలినవదన.
| 57
|
చ. |
కలయఁ జరించుతేఁటిపొదిఁ గైకొనఁ డాధవళాయతాక్షి వే
నలిపయిఁ జూడ్కి నిల్పు నలినంబులఁ జేకొనఁ డాలతాంగిచూ
డ్కులు మది మెచ్చు హంసికల కోమలనాదము లాలకింపఁ డా
వెలఁదిమృదూక్తినిస్వనము వీనుల నించు విభుండు వేడుకన్.
| 58
|
తే. |
చెలువచివురుఁగెంగేలఁ గాశ్మీరజలము, నతివనగుమోమునను జందనాంబువులును
నెలఁత వేనలిఁ గస్తూరినీరు నయ్యె, నయ్యెడల కాంతిఁ బతికరయంత్రవారి.
| 59
|
క. |
తడిసి మెఱుఁగుఁబొగ రెక్కిన, పడఁతుకలలితాంగయష్టి పదనికి రాఁ బుల్
గడిగినమరుఖడ్గలతిక, వడువున మోహనవిలాసవైభవ మొందెన్.
| 60
|
చ. |
వెలఁదికి మోవికెంపు నెఱివేనలికప్పును దంతపంక్తినుం
దెలుపును బేర్చి యొప్పెసఁగె నీళులపొందున నట్ల యెవ్వరిం
గలసిన వారివారి దెసఁ గల్గుగుణం బనుకూలవృత్తి ని
ర్మలమధురస్వభావులు సమగ్రవిలాసము వొందఁ జేయరే.
| 61
|
సీ. |
నెత్తమ్మిపుప్పొడి నెఱినీర నిడుపుగాఁ బాపట సిందూరభంగిఁ బోయుఁ
జెందొవఱేకు ముయ్యందంబుగాఁ దీర్చి కమనీయముగఁ దిలకంబు పెట్టు
నిందీవరములబహిర్దళములు డుల్చి కర్ణావతంసముల్ గా నొనర్చుఁ
గుముదనాళము పుచ్చికొని పేరుగా గిల్లి హారంబువడువున నలవరించుఁ
|
|
తే. |
గమలదళము మృణాళకాండమునఁ జేర్చి, యాలవట్టంబు గావించి లీల మెఱయ
విసరు నల్లన రామభూవిభుఁడు జనక, రాజనందనమన మనురాగ మొంద.
| 62
|
చ. |
తమతమయంత నెచ్చెలులుఁ దారును నెప్పటియట్ల యాటఁ జి
త్తము దనివోక వారిగెడఁ దామరసాక్షియు రామదేవుఁడున్
సముచితలీల మై వివిధచారువిహారము లర్థి సల్పి రం
గము లభిరామరేఖ నవకాంతివిలాసముఁ బొంది క్రాలఁగన్.
| 63
|
ఆ. |
ఇట్లు కమలషండ మిక్కడక్కడ వడ, నభిమతప్రకారహారిలీలఁ
గేలి సలిపి వేడ్కఁ జాలించి వెడలిరి, విభుఁడు జానకియును వెలఁదిపిండు.
| 64
|
క. |
జలసిక్తము లగునంగక, ములచెలు వొండొరుల భావముల నత్యార్ద్రం
బులు సేయఁ బతియు నాతియు, నిలిచి పొలిచి రవుడు కమలినీతటభూమిన్.
| 65
|
క. |
కలిరుగతిఁ గాంతి మేనుల, జలకణములు గోరకములచందంబునఁ జె
న్నలవఱుపఁ గొలనివెలి నిం, తులు నిలిచిరి తీరలతలతోఁ దడఁబడుచున్.
| 66
|
సీతారాముల లీలావిహారవర్ణనము
చ. |
వలయు తెఱంగునన్ విభుఁడు వస్త్రవిలేపనమాల్యభూషణం
బులు దగఁ దాల్చి వందిజనముల్ చతురంబుగ సంస్తుతింప వా
రల నభివాంఛితార్థముల రంజితచిత్తులఁ జేసె నెమ్మనం
బలర నలంకరించిరి వయస్యలు సీతయు రేఖవింతగాన్.
| 67
|
క. |
లలితకమనీయమహిమల, నెలనాఁగయు సఖులుఁ గలసి యేతేరఁగ ముం
గల నడచి కంచుకులునుం, దలతల మనఁ బతియుఁ జతురతరముగ నడచెన్.
| 68
|
క. |
ఇమ్మెయి నిష్టవినోదము, లమ్ముదితయుఁ దాను రఘుకులాధీశుఁడు చి
త్తమ్ములఁ జిగురొత్తఁగ ని, త్యమ్మును నిలిపె ననురాగతత్పరవృత్తిన్.
| 69
|
సీ. |
కర్పూరధూపాదిశగంధసంవాసితాభ్యంతరరమణీయహర్మ్యములను
వర్ణచిత్రితపటవర్గనిర్మితతిరస్కరిణీమనోహరాగారములను
గోకిలకలహంసకులమృదుమంజులారవరమ్యనవలతాభవనములను
గృతకమయూరలాజితనిజాంగణచిత్తరంజితలీలాద్రికుంజములను
|
|
ఆ. |
బహువిధాభిరామవిహరణస్థలములఁ, దత్తదంతరంగవృత్తితోడ
మనుజవిభుఁడు ప్రియకు మది ముద మెలరార, లోలుఁడై మనోజకేళి నొలయు.
| 70
|
చ. |
ప్రమదము మూర్త మైనటులు రాగము రూపు వహించినట్లు వి
భ్రమ మొడ లెత్తినట్లు రతిరాజవిహారకుతూహలంబు దే
హముఁ దగఁ దాల్చినట్లు హృదయంగమ యై విలసిల్లుచున్న యా
రమణిఁ బ్రమోదరూఢమదరంజితఁ జేయు విభుండు ధీరుఁ డై.
| 71
|
సీ. |
చూడ్కికి సందడి సొరనీక యెందేనిఁ జూచు చాడ్పున నొప్పు చూఱవిడిచి
తగవుమై సోపాన మగునునుఁబల్కుల నెక్కి సరసముల నెలమి వడసి
|
|
|
తనదు మైదీవకుఁ దావలంబుగఁ జేసి పులకలచిత్తంబు నెల వెఱింగి
బెరసినమేవడి సరులఁగాయువు గని కన్నులచెన్నున నన్నుఁ గాంచి
|
|
తే. |
సొగిసి కౌగిట సోలెడు మగువయంత, రంగ మావిష్ట మైనటు లంద కలసి
తగులు దగిలించుటయును నిద్దఱకు సరియ, కాఁగ నధిపతి లలితాంగిఁ గవసె నర్థి.
| 72
|
చ. |
ఎడఁ బొలివోనివేడుకల యేడ్తెఱసొంపున నంతకంత కె
క్కు డగుమదంబుపేర్మి రతికోర్కులు గొమ్మలు వోవ నప్పుడ
ప్పుడ నలిఁ జేరినట్టులు విభుండును వారిజపత్రనేత్రయుం
గడపల లేనికేలితమకంబున నుల్లము లుల్లసిల్లఁగాన్.
| 73
|
సీ. |
ఎలమి నొండొరులకుఁ దలయంపులుగఁ జేయు బాహాలతలు జన్మఫలము లొంద
నలి నొండొరులమీఁదఁ బొలుపారుకనుదోయి సుఖములఁ జుబ్బనుచూఱ లాడఁ
గాయ్వున నొండొంటిఁ గదిసినతనువులు పులకాంకురంబులఁ బ్రోది గాఁగ
నిచ్చమై నొండొంటిఁ జొచ్చినమనములు నినుపారునింపుల నెలకొనంగఁ
|
|
ఆ. |
గడఁక లొండొరువులఁ గడవఁ గేలీచతు, రతలు వెలయఁ జూడ్కు లతిశయిల్ల
సుఖముసొంపు నొక్కసూటిన నడవంగ, సతియుఁ బతియుఁ గ్రీడ సల్పి రర్థి.
| 74
|
ఉ. |
లేని నెపంబు పెట్టి, మదలీలకు నాఁక యొనర్చి మానముం
బూనినయట్లు సౌ రెదకుఁ బుక్కిటిబంటిగఁ జేసి యల్క వే
పో నొకకారణంబుపయిఁ బూని వెసం బయిపాటు మున్నుగాఁ
దేనియ లుట్టఁ దేఱు జగతీపతి కుగ్మలి రాముఁ డింతికిన్.
| 75
|
సీ. |
అదరులు గదిరిన నఱిముఱి వర్తిల్లు చెయువులక్రందునఁ జిక్కువడుచు
నేర్పులు గడఁగిన నిరతంబు లై చెల్లు కామతంత్రంబులఁ గళుకు లగుచుఁ
గోర్కు లేచినఁ ద్రిప్పికొనునింద్రియంబుల యక్కఱ దీర్పంగ నడరఁ బడుచు
మెచ్చులు వచ్చిన మిగుల నానందించు మనములతలపోఁత కనువు గొనుచుఁ
|
|
తే. |
దనివి వొందిన నల్లన తలఁపు మగుడ, వేడుకలయెడఁ గొసరుల వింతతమక
ములకు మొదలైనఁ బొదలుచు నెలఁతుకయును, మనుజపతియు నొనర్చిరి మదనకేలి.
| 76
|
క. |
ఒండొరువులమదనకళా, పాండిత్యము మెచ్చమియు నెపం బిడ నెపమై
యెండొరులకు నానంద మ, ఖండము గావించురతము గైకొండ్రు తగన్.
| 77
|
సీ. |
తూలెడునునుగురుల్ దోతెంచుఘర్మాంబువులఁ దోఁగి నుదుటిపై మలఁగుచుండ
లలిసొంపుపెంపునఁ బొలయక కనుదోయి నానుచు నెడనెడ మ్రానుపడఁగఁ
గుచములనడుమఁ దూగుచు నున్నహారము లల్లన చనుమొనలందుఁ గ్రాల
బెడఁ గొంద నల్లాడు తొడవులమెఱుఁగులు వెడలక యచ్చోటఁ గడలుకొనఁగఁ
|
|
తే. |
గేలికడఁక దోడ్తో నడఁగించి యవయ, వములు సడలంగఁ జేయుచు వచ్చుచొక్కు
లేఁతదమిఁ గ్రొత్త చెన్నొందు లేమచంద, మధిపుడెంద మానందమయంబు సేసె.
| 78
|
క. |
మఱపు ముసుఁగుపడ వేడ్కలు, దెఱపులు గొని నిగుడ రెండుదెఱుఁగులచేతం
బొఱివోవు నెమ్మనంబుల, నెఱి నిరువురు నలవరింప నేరరు రతులన్.
| 79
|
సీ. |
మానవనాథుఁ డుగ్మలిఁ గౌఁగిలించుచో సడలుకే ల్బిగియించు కడఁక లేమి
యతివ భూధవునధరామృతం బానుచో దొప్పవాతెఱ యంటు తొట్రుపాటు
నృపతి లేమను గేలి నిపుణత నొరయుచో వెడఁగులై చెయ్యులు వీడుపాటు
వామాక్షి మేదినీవల్లభుఁ గొసరుచోఁ గొదలు పల్కులక్రియ గూడ కునికి
|
|
తే. |
యొండొరులచిత్తముల నాఁటి యొలయుచున్నఁ, జొక్కు లెక్కుడు సేయంగసోల మడరి
యిరువురును సౌఖ్యరసములఁ గరువు గట్టి, పోసి చేసినరూపుల పోల్కు లైరి.
| 80
|
క. |
భూపాలుఁ డిట్లు మోదం, బేపారఁగ మోహములకుఁ నెల్ల నివాసం
బై పాలించెను రాజ్య, శ్రీపెం పభిరామముగ నశేషధరిత్రిన్.
| 81
|
సీతాదేవి గర్భము దాల్చుట
ఉ. |
అత్తల కెల్ల భూరివినయంబునఁ బంపు దగంగఁ జేయుచుం
జిత్త మెలర్ప నాథుపని సేయుచు బాంధవతుష్టి సేయుచున్
విత్తముల మహీసురుల వేమఱుఁ దృప్తులఁ జేయుచున్ మహో
దాత్తగుణాలి నొప్పె వసుధాసుత నిత్యశుభంబు పెంపునన్.
| 82
|
క. |
సమ్మదమున భూచక్రము, తొమ్మిదివేలేఁడు లేలి తుది రాముఁడు దా
నెమ్మనమున నినకులము ధ్రు, వమ్ముగ సత్సుతులఁ బడయవలె నని తలఁచెన్.
| 83
|
ఆ. |
తొమ్మనూటిమీఁదఁ దొంబదితొమ్మిది, వర్షములకు నంత వసుధపట్టి
యతిథివిప్రదేవపితృతర్పణంబుల, గర్భమహిమఁ దాల్చెఁ గౌతుకమున.
| 84
|
క. |
అంత నొకనాఁడు లీలం, గాంతారత్నంబు నాథుకడ మెలఁగఁగ నే
కాంతంబునఁ గనుఁగొని య, త్యంతమనోమోద మడర నతఁ డి ట్లనియెన్.
| 85
|
సీ. |
చంద్రికపైఁ బర్వు చారువల్లికవోలె వెలఁది నీయంగంబు వెలుకఁ బాఱె
హేమకుంభములపై నింద్రనీలములట్లు కాంత నీచనుమొనల్ గప్పు మిగిలె
వెడవాడులీలారవిందయుగ్మముమాడ్కి సుదతి నీకనుఁగవ సోల మందెఁ
బెన్నిధిఁ గాంచిన పేదచందంబునఁ బొలఁతుక నీకౌను పొదలుకొనియె
|
|
ఆ. |
లలన నీదు చెయ్వు లలసంబు లయ్యె ల, తాంగి నీదుమందయానలీల
జడను దాల్చె గర్భసంపదకలిమి నీ, యందుఁ దేటపడియె నిందువదన.
| 86
|
ఉ. |
మొగ్గల మైనకోర్కి దుదిముట్టఁగ నుత్సవలీలఁ జూడ నా
కగ్గము గాఁగ వంశము సుధాంశుఁడు గల్గిన రాత్రివోలె నీ
విగ్గురుగర్భసంపద వహించియుఁ జెప్ప వదేమి నావుడున్
సిగ్గును లేఁతనవ్వుఁ గదిసెం గమలాననముద్దుమోమునన్.
| 87
|
రాముఁడు కోరిక యడుగఁగా సీత గంగాతీరవనములకుఁ బోఁగోరుట
చ. |
తనమదిలజ్జ వాపి వసుధాపతి మేవడి యైనమాట పొం
|
|
|
దునఁ దగఁ జేరి కోరికలు దోఁచుతెఱం గెఱుఁగం దలంచి, య
ల్లన యడుగంగ సమ్మదవిలాసము నేడ్తెఱ నెమ్మొగంబు నూ
తనరుచి నొప్పఁగా వికచుతామరసానన వేడ్క ని ట్లనున్.
| 88
|
శా. |
సింగంబుల్ మునిబాలకుల్ దిరుగుచోఁ జెయ్వేది మో మియ్య పా
రంగంబుల్ దిరుగం దపోధనసతుల్ రాజీవముల్ గోయుటల్
రంగద్వీచులఁ బద్మముల్ మెఱయు ధర్మప్రీతి మైఁ జూచుచున్
గంగాతీరముకానలోనఁ దిరుగంగాఁ గౌతుకం బయ్యెడిన్.
| 89
|
ఆ. |
అనిన రఘువరేణ్యుఁ డమ్మాటలకు నియ్య,
కొని లతాంగి నీవు గోరినట్ల
చేయు టెంత పెద్ద శీఘ్రంబ యచటికిఁ, బుచ్చువాఁడ ననుచు నిచ్చ మెఱసి.
| 90
|
క. |
ఆసతికడ సరసంబుగఁ, బాసి నడిమికొలువునకు నృపాలుఁడు సనినన్
దాసి నిరంతరమును సే, వాసౌఖ్యముఁ బొందఁ బడయువారలు ప్రీతిన్.
| 91
|
రాముఁడు నర్మసచివులవలన లోకాపవాదము నెఱుంగుట
క. |
పొడసూపి యుచితముగ నలు, గడ వల్లన చేరి కొలువగాఁ దగుమాటల్
వొడమినసమయంబునఁ బతి, పడుచుం బైదలను బోవఁ బనిచి నయమునన్.
| 92
|
తే. |
ఫుల్ల రాజీవదళములఁ బొల్ల సేయు, వెడఁదకన్నుల నునుఁగాంతి వెల్లి గొనఁగ
నర్మసచివుల మొగములు నగుచుఁ జూచి, వారిలో భద్రుఁ డనియెడువానితోడ.
| 93
|
శా. |
పౌరశ్రేణియు భూజనంబు నను సంభావించి కీర్తించునో
నేరం డున్మదుఁ డంచు లాఘవముగా నిందించునో దీని నీ
వేరూపంబున వింటి విన్నతెఱఁ గొక్కింతేనిఁ బోనీక వి
స్తారం బొప్పఁగఁ జెప్పు మన్న నతఁ డుద్యత్ప్రీతిమై ని ట్లనున్.
| 94
|
మ. |
జనకుం డానతి యీఁ దపంబునకు నిష్ఠం గానకుం జన్న పెం
పును దుఃఖం బొకయింత లేక లవణాంభోధిం గళామాత్రఁ గ
ట్టినసామర్థ్యము దేవబృందమునకు డెందంబుపై రావయనం
జను నాపంక్తిముఖున్ వధించినమహోత్సాహంబుఁ గీర్తింపఁగన్.
| 95
|
క. |
కలయంగ నెల్లయెడలం, బలుమాఱును విందు ననినఁ బ్రమదం బెసఁగం
గల దున్నరూప యిది నీ, పలుకులు మాకెక్కె నని నృపాలుఁడు మఱియున్.
| 96
|
తే. |
తొలుత రాజ్యంబు సేయంగఁ దొడఁగి మనము
వివిధవర్ణాశ్రమంబుల వృత్త మరసి
యలవరించుచోఁ గొందఱ కహిత మగుటఁ
గొన్నిమాటలు పుట్టక యున్నె యనిన.
| 97
|
ఉ. |
ఈయనుమాన మేటికి నరేశ్వర మీపరిపాలనక్రియో
పాయము ధర్మనిష్ఠయుఁ గృపాగుణమున్ వినయంబు పెంపునున్
|
|
|
న్యాయవిశోధనంబును నియంత్రితసత్యవచోవిలాసముం
బాయక విందు నెందు నరిభంజన సూరి జనానురంజనా.
| 98
|
చ. |
అనవుడు భద్రుఁ జూచి ముద మందుచు రామధరాధినాథుఁ డి
ట్లనియె మదీయసంస్తుతులు నన్నియుఁ జెప్పితి కీడుమాట సె
ప్ప నగునొ కాదొ నాక ననుఁ బాపము సుట్టక యుండ నేమి గ
ల్గినఁ గలయంతవట్టును నకిల్బిషమానస చెప్పు మేర్పడన్.
| 99
|
క. |
అనుటయు నతండు వెలవె, ల్ల నగుచు డెందంబు గొందలం బందఁగఁ జె
ప్పను జెప్పకుండ నేరక, యనుమానముతోడ నిక్కడక్కడ పడినన్.
| 100
|
ఆ. |
అధిపుఁ డింగితజ్ఞుఁత డై యితఁ డొప్పని, పలుకు వినఁగఁ జెప్ప నలికియున్న
వాఁడు గొంకుఁ బాపవలయుఁ బొమ్మని తన, యెదఁ దలంచి యతని కిట్టు లనియె.
| 101
|
క. |
లోకులమాటలు సెప్పిన, నా కెగ్గగునే ప్రియం బొనర్పు హితుఁడ వై
నీ కింత వెఱవ నేటికి, నేకాంతం బయినచోట నే నడుగంగన్.
| 102
|
ఆ. |
కీడు గాంచి మనల నాడెడువారల, నోళు లుడుపఁగా మనోముదంబు
నొందుఁ గాన దీన నొండెగ్గు లే దని, తఱిమి యడుగుటయును వెఱపుఁ బాసి.
| 103
|
క. |
ఇతఁ డెటు సెప్పు నొకో నా, మతి గలఁగెడు జనులపనులు మఱవక యుచిత
స్థితి నడపుదు నని తలఁకెడు, పతి కాతం డెలుఁగు రాలు పడ ని ట్లనియెన్.
| 104
|
సీ. |
ఎల్లలోకంబులు నెఱుఁగ నత్యంతదురాచారుఁ డైనదశాననుండు
చెఱఁ బట్టికొనిపోయి యఱిముఱిఁ బెద్దకాలం బేనిఁ గేలివనంబులోన
నునిచిన నున్నయాజనకరాజాత్మజ నెడ నించు కేనియు నెగ్గు గొనక
ధైర్యంబు వాటించుతలఁపు వోవిడిచి మన్మథగోచరుం డయి మగుడఁ దెచ్చి
|
|
ఆ. |
యనుగలంబు సేసికొనియున్నవాఁ డని, యజ్ఞు లయినజనము లాడుచుండ
నెల్లచోట విందు నింత నిక్కువ మని, పల్కుటయును రఘునృపాలకుండు.
| 105
|
క. |
సుఱసుఱు డెందము సూఁడిన, తెఱఁగున నొక్కింత స్రుక్కి ధీరుం డగుటం
గొఱఁతవడకుండ వినుటకుఁ, బెఱవారల కిట్టు లనియెఁ బ్రియవదనుం డై.
| 106
|
క. |
మీరలు నాసత్కీర్తియ, కోరుదు రేప్రొద్దుఁ గాన గురుదురితపరీ
హారము సేయం దగు నే, నీరూపమ యగుట నిశ్చయింపఁగవలయున్.
| 107
|
చ. |
అనుడు విషాద మంది విజయాదులు దేవ భవచ్చరిత్ర మ
త్యనఘము దీనిఁ జూచి చెడనాడఁగ నాలుక యెట్టు లాడు దు
ర్జను లగువారు కొందఱు విచారవిహీనత నిట్లు పల్కఁగా
విని విని వారిమాటలకు వేసరి యుండుదు మెఫ్టు నెల్లెడన్.
| 108
|
లోకాపవాదభీతుఁ డై రాముఁడు తమ్మునితో నాలోచించుట
ఉ. |
నావుడు మూర్ఛవచ్చినమనంబునకున్ ధృతి యూఁత యిచ్చి సం
భావన వారిఁ బోఁ బనిచి పార్థివముఖ్యుఁడు దల్లడంబునం
|
|
|
దావుకొనంగలేక తనతమ్ముల నప్పుడు పిల్వఁ బంచి నా
నావిధచింత ముట్టికొనినన్ వెగ డందుచు నార్తమూర్తి యై.
| 109
|
ఆ. |
అధికవినయ మెసఁగ నాభరతాదులు, నగరి కేగుదెంచి నరవరేణ్యుఁ
డేకతంబ నీకు వీకాడువగలచే, వందుచుండఁ జేర వచ్చి వచ్చి.
| 110
|
సీ. |
తారలు లేని సుధారోచియునుబోలె నొంటి యేలొకొ నృపుఁ డున్నవాఁడు
చిత్రరూపంబున చెలువున నేలొకో పతిమూర్తి నివ్వెఱపాటు నొందె
సాపరాధులఁ జూచున ట్లేలకో రాజు మనమీఁది చూడ్కులు మగుడఁ బెట్టెఁ
గౌముది పైఁ బర్వు కమలంబుచాడ్పున విభుముఖం బేలొకో విన్న నయ్యె
|
|
తే. |
ననుచు నల్లనిమాటల నక్కుమారు, లుత్తరములేని యడుగుట లొండొరువుల
నడుగు చంతంత నిలుచుచు నగ్రజన్ము, పాలి కేతెంచి భక్తిమైఁ బ్రణతు లైరి.
| 111
|
చ. |
తగఁ బ్రణమిల్లినం దనదుతమ్ముల నందఱఁ జూచి వేడి పై
నెగయుకరంబులం గొని మహీపతి యల్లన యెత్తి బాష్పవా
రి గడలుకొన్న నాఁగుచు శరీరము నేలకు వ్రాల వచ్చినన్
మగుడఁగ నిల్పుచున్ వెగడుమాటలు గుత్తుకలోనఁ బట్టుచున్.
| 112
|
క. |
ఈరాజ్యసంపదున్నతి, మీ రిచ్చినయదియ నాకు మీర విపత్సం
తారకులును జుట్టంబులు, విూర చెలులు మీర ధనము మీర తలంపన్.
| 113
|
క. |
కావున నెయ్యది పుట్టిన, మీవలనన తెగువ యగుట మీ కెఱిఁగింపం
గావలయు లోకజననిం, దా వాదము తెఱఁగు వినుఁడు తాత్పర్యమునన్.
| 114
|
క. |
అనుతనమాటకు ము న్నీ, మనుజపతికి నింత యేమి మాడ్కినొకో నేఁ
డనుపగ డోలాందోళిత, మనుస్కు లై యున్న యక్కుమారులు వినఁగాన్.
| 113
|
ఉ. |
రావణునింట నుండఁగ ధరాసుత నే మరలంగఁ దెచ్చినం
భావన సేఁత కష్ట మని పల్కిరి చూచితె లక్ష్మణా మహా
దేవుఁడు బ్రహ్మయున్ మునులు దేవగణంబులు మెచ్చ నయ్యెడం
బావకుఁ డిచ్చె నాకు సతిఁ బాపపుమాటలు పుట్టె నియ్యెడన్.
| 116
|
ఉ. |
వేవురు నేల నేను బృథివీసుతచిత్తము పెం పెఱుంగనే
భూవలయంబు సంచలతఁ బొందిన వారిధి మేర దప్పినన్
దేవనగంబుపాఁ తగలి త్రెళ్లిన నం దొకకీడు గల్గునే
యావనజాక్షి నిట్లు సెడనాడిన నక్కట నోరు ప్రువ్వదే.
| 117
|
లోకాపవాదమునకై రాముఁడు సీతను విడనాడ నిశ్చయించుట
ఉ. |
ఐనను మీకు నొక్కతెఱఁ 6 గస్ఖలితంబుగ నేను జెప్పెదన్
దానికిఁ గాదు నాకభువనంబులకు నను శుద్ధుఁ జేయుఁ డ
జ్జానకి నెల్లభంగుల నిజంబుగ నిఫ్టు పరిత్యజించినం
గాని యకీర్తి వాయ దటు గాదని నోళ్లులు మూయవచ్చునే.
| 118
|
క. |
జడమతు లయిన జనంబులు, వెడమాటలు మాన్ప నిదియ వెర వెబ్భంగిన్
సడికంటెఁ జావు మే లని, యెడిపలుకు దలంపవలదె యిలఁ బురుషులకున్.
| 119
|
ఆ. |
పూని జీవితంబు లైన మి మ్మైనను, వలయుచోట విడువవచ్చుఁ గాని
వర్తనంబు గౌరవం బొకయించుక, యైన విడువ దుస్సహంబు నాకు.
| 120
|
క. |
ఒకభంగిఁ బాపికొన రా, దొకొ మిథ్యానింద యనుచు నొండుదెఱుఁగు మీ
రకుటిలచిత్తుల రై చూ, డకుఁడీ నామదికి సంకటం బిది యెల్లన్.
| 121
|
క. |
ఏ నెఱిఁగి యయిన నెఱుఁగక, యైనను నిత్తెఱఁగ నిశ్చయము సేసితి నా
యాన సుఁడీ నా కడ్డము, గా నొకపలు కైనఁ జెప్పఁ గడఁగితి రేనిన్.
| 122
|
చ. |
అనవుడు వార లొండొరులయాననముల్ గలయంగఁ జూచి య
జ్జనపతి తెంపు వాపెడువిచారము చిత్తములం దొకింత యై
నను మొలతేర కవ్విధమునం దమనిశ్చయ మైన లేక యే
మనియును బల్క రాక వెఱగందఁగ వెండియు నాతఁ డి ట్లనున్.
| 123
|
ఉ. |
సూక్ష్మముగాఁ దలంచిన విశుద్ధచరిత్రము దుఃఖహేతువే
లక్ష్మియుఁ బ్రాణముల్ సరియె లజ్జకు రిత్త విచార మేటికిన్
లక్ష్మణ యెల్లి నీవు చటులస్థిరవాజులఁ దేరఁ బూన్చి యా
పక్ష్మలనేత్రఁ గోరిక నెపంబునఁ దోకొని పొమ్ము కానకున్.
| 124
|
క. |
ఇమ్ములఁ జని గంగాతీ, రమ్ముతపోవనములందు రమియింపఁగ నా
సమ్ముఖమునఁ గోరినయది, యమ్ముద్దియ నచటి కనుప నగు సుకరముగాన్.
| 125
|
క. |
కొని చని వాల్మీకితపో, వనపరిసరభూమిఁ ద్రోచి వచ్చెడి దయ్యం
గనకును నాకును నిదె విధి, యనుమానింపకుఁడు నిశ్చయం బైనయెడన్.
| 126
|
క. |
అని పలికి తనదు తెగువకు, ననుజన్ములు తలలు వంచు టనుమతిగాఁ గై
కొని వారి నిండ్లకును బోఁ, బనిచి యచటు వాసి ధరణికపాలుం డరిగెన్.
| 127
|
క. |
ధాత్రీపతి కనుజులకును, నేత్రంబుల బాష్పవారి నిద్ర నుడుప నా
రాత్రి యొకభంగిఁ జనిన, సు, మిత్రానందనుఁడు వంత మిగిలినమదితోన్.
| 128
|
రాముఁడు లక్ష్మణునివెంట సీత నడవులకుఁ బంపుట
చ. |
దివసముఖోచితక్రియలు దిగ్గన సల్పి సుమంత్రుఁ జూచి దా
నవకులమర్దనుండు రఘునాయకుఁ డెక్కురథంబుఁ బూన్పు గా
రవమున దేవి నిర్జరతరంగిణిపొంతఁ దపోవనంబులన్
వివిధవినోదముల్ సలుపువేడుక నాథుననజ్ఞ నేగెడున్.
| 129
|
ఆ. |
అనుడు నతఁడు గడఁక నరదంబు సక్కగాఁ, బెట్టి ఘోటకములఁ గట్టి తెచ్చి
సవినయంబు గాఁగ సౌమిత్రిముందట, నిలిపె నంత మేదినీవిభుండు.
| 130
|
క. |
అడ లడఁచి నెమ్మనంబున, వెడతెలి వొడఁగూర్చి మాట వేర్పడకుండం
జిడిముడిపడక నయంబున, నెడమడు వొక్కింత లేక యిట్లను సతితోన్.
| 131
|
చ. |
పొలఁతుక గంగచేరువ తపోవనభూములు సూడ నీమదిన్
మొలచిన కౌతుకంబు దుది ముట్టఁగ లక్ష్మణదేవు నిన్ను నం
దులకు మనోముదం బెసఁగఁ దోకొని పో నియమించితిన్ సము
జ్జ్వలమణికాంత మైనరథరసత్తమ మెక్కుదు రమ్ము నావుడున్.
| 132
|
ఉ. |
అక్కట నాదువేడ్క కుచితానుచితంబులు సూడకే విభుం
డొక్కతలంపువాఁ డయి సముత్సుకతన్ నను దవ్వు పుచ్చఁగా
నిక్కమ యియ్యకో లరయ నెయ్యము తియ్యము గాదె యంచు నిం
పెక్కఁగ రాముడెంద ముడు కెక్క రథంబు లతాంగి యెక్కినన్.
| 133
|
ఉ. |
అత్తఱి నున్నధైర్యమున కచ్చెరువందుచు జీవితేశుహృ
ద్వృత్త మెఱుంగమి మదిని దీనికి నమ్ముట కుమ్మలించుచుం
జిత్తము ఖేద మాననముఁ జెందిన మాన్పఁగ లేక లక్ష్మణుం
దుత్తల మందుచున్న విభుఁ డుగ్మలి కాతనిఁ జూపి యి ట్లనున్.
| 134
|
ఉ. |
దూరము నాక ఘోరవనదుర్గతలంబులఁ గేలి సల్పఁగాఁ
గోరెడుభామలం బ్రియలఁ గోరినయట్టుల పుచ్చు రాజులన్
ధారుణి నెందుఁ గాన మని తా మును దీనికి నడ్డపెట్ట నే
బోరితమాడి యిట్లు నినుఁ బుచ్చుట కల్గినవాఁడు సూచితే.
| 135
|
క. |
అని తన మొగ మొప్పమి క, మ్మనుజేంద్రుఁడు నెపము దప్పి మా టాడినఁ దా
నును దదనురూపవచనము, లను సంభాషణ మొనర్చె లక్ష్మణుఁడు దగన్.
| 136
|
ఆశ్వాసాంతము
ఉ. |
పుణ్యుఁడు భారతీవిభవపూతవికాసముఖారవిందలా
వణ్యుఁడు దీవ్రకోపదపరవహ్నినిరర్గళదగ్ధశాత్రవా
రణ్యుఁడు మానినీహృదయరంజననైపుణరూఢరూపతా
రుణ్యుఁడు భీతివిహ్వలవిరోధిశరణ్యవరేణ్యుఁ డున్నతిన్.
| 137
|
క. |
దుర్జయవైరిధరాధిప, తర్జననిస్సాణగర్జితస్ఫురణుం డ
త్యూర్జితబాహాసంపదు, పార్జితవిఖ్యాతకలియుగార్జునుఁ డెలమిన్.
| 138
|
మాలిని. |
వితరణఖని యుద్యద్వీరశృంగారలక్ష్మీ
పతి రతివరలీలాషంగకృత్సంగతాంగుం
డతులితమతివిస్తారాప్త దేవేజ్యుఁడిజ్యా
ప్రతిదినపరితృప్తిప్రాప్తసప్తార్చి ధాత్రిన్.
| 139
|
గద్యము. |
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బైనయుత్తరరామాయణం బనుమహాకావ్యంబునం
దష్టమాశ్వాసము.
|
|