నా జీవిత యాత్ర-4/మంత్రివర్గాల రాజీనామా

7

మంత్రివర్గాల రాజీనామా

కాంగ్రెసు మంత్రివర్గాలు చురుగ్గానో, మందకొడిగానో కొన్ని కార్యకలాపాలు సాగించుకుంటూ వస్తూన్న రోజులలో యూరపు ఖండంలో ఒక మహాయుద్ధం ప్రారంభమైంది. ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరం శాంతి సంప్రదింపుల మిషపైన ఓడిపోయిన జర్మనీని గెలిచినవారు అణగద్రొక్కగా, జర్మనీ ప్రజల హృదయాలలో ఉడుకు కలిగి, దూరదృష్టిలేని ఒక నాయకుని ఉద్ధతివల్ల ఈ యుద్ధం ఆరంభమయింది. జర్మనీవారు తమకు - ఇంగ్లండు, ఫ్రాంసు, అమెరికా వారు ముఖ్య శత్రువులనే భావం పెంచుకున్నారు. ఒక లంఘింపుతో హిట్లరు, ప్రక్కనున్న చిన్నదేశాల నాక్రమించుకుని, యుద్ధ భేరీ మ్రోగించాడు. ఇంగ్లండుపై యుద్ధం ప్రకటించాడు. మన దేశానికీ జర్మనీకి మధ్య యుద్ధానికి ఏ విధమైన కారణమూ లేదు. కాని మనదేశం ఈ యుద్ధంలో తమకు సాయం చేయాలని ఇంగ్లండు పాలకుల వాంఛ. గాంధీగారేమో అసలు అహింసావాది. యుద్ధ విముఖుడు. కాంగ్రెసు ఆయన నాయకత్వం క్రింద నడుస్తున్నది కదా! అందుచేత, ఆగస్టు మొదటి వారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై, భారత దేశాన్ని ఐరోపా సంగ్రామంలోకి దించగూడదని తీర్మానం చేసింది. దీనికి జవాబుగా 3 - 9 - 1939 నాడు, బ్రిటిషు రాజప్రతినిధి భారత దేశం యుద్ధంలో ఇంగ్లండు పక్షాన చేరినట్లుగా ఒక ప్రకటన చేశాడు. అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు, గాంధీగారి అహింసా తత్వం అటుంచి, వారం రోజులపాటు చర్చజేసి, ఆ నెల 14 వ తేదీన భారతదేశాన్ని స్వతంత్రమైన దేశం క్రింద గౌరవిస్తూ ఇంగ్లండు ప్రభుత్వంవారు తమ యుద్ధోద్దేశాలను ప్రకటించినట్లయితే వారికి సాయం చేస్తామని తీర్మానించారు. గాంధీగారిని కాదని ఈ విధంగా తీర్మానిస్తే, బ్రిటిషువారు కాంగ్రెస్ అభిప్రాయాన్నే గౌరవిస్తారని కాంగ్రెస్ వారనుకున్నారు. అయితే, బ్రిటిషువారు ఈ తీర్మానానికి ఎట్టి విలువా ఇవ్వలేదు. 22 - 10 - 39 న కాంగ్రెస్ కమిటీ తిరిగీ సమావేశమై, ఆత్మ పరీక్ష చేసుకుని, బ్రిటీష్‌వారికి యుద్ధంలో సహాయం చేయకూడదనీ, కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేయాలనీ ఆదేశించారు. దాని ప్రకారం 26 - 10 - 39 నాడు చెన్నపట్నంలో, శాసన సభలో మంత్రివర్గం రాజీనామా చేయాలని ప్రతిపాదించిన తీర్మానం అంగీకరింపబడింది. 29 వ తేదీన రాజాజీ మంత్రివర్గం రాజీనామా పత్రం గవర్నరుకి అందజేశారు. ఆ రోజే హోల్డ్సువర్త్ అనే రెవిన్యూ కార్యదర్శి ప్రకాశంగారి గదికి వచ్చి, బాగా నడుస్తున్న మినిస్ట్రీ రాజీనామా చేయడం అంత వ్యవహార జ్ఞానంతో కూడిన పని కాదని సానుభూతి పరంగా అన్నాడు. ప్రకాశంగారి కేమో జమీందారీ బిల్లు పాసు కాకుండా రాజీనామా ఇవ్వడం ఇష్టంలేదు. కాని, ఆ రాజీనామా ఇవ్వడం మంచిదే అని పైకి కార్యదర్శితో అన్నారు. రాజీనామా ఇవ్వపోయినట్లయితే - గవర్నరు కాన్ట్సిట్యూషనల్ గవర్నరుగా మాత్రం ఉండి, మంత్రుల సలహా ప్రకారం నడుస్తానని ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకో గలడు? యుద్ధానికి మన రాష్ట్రంలోంచి ఏ విధమైన సాయమూ చేయమని మంత్రివర్గం చెప్పినమాట ఎలా నిలబడు తుంది? వెంటనే రాజీనామా చేయకపోతే కాంగ్రెసు నీతికి భంగంగా ఎన్నెన్నో ఆర్డర్లు మన మంత్రివర్గంవారు చేయవలసి వచ్చేది.

ప్రకాశంగారి కాంగ్రెసు ప్రచారము

రాజీనామా ఇచ్చిన వెంటనే ప్రకాశంగారు తిరిగి కాంగ్రెస్ పని చేయడంలో నిమగ్ను లయ్యారు. 1937 లో ప్రకాశంగారు మంత్రి అయిన తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారికి అప్పజెప్పారు. ప్రకాశంగారు రాజీనామాచేసి రాగానే సీతారామయ్యగారు, రాష్ట్ర కాంగ్రెస్ సంఘపు అధ్యక్ష పదవిని ప్రకాశంగారికి సురక్షితంగా అప్పజెప్పారు. అప్పటికి కాంగ్రెసులో తీవ్రమైన అడ్డు కెరటాలు పుట్టలేదు.

ప్రకాశంగారు ఆ తర్వాత తెలుగు ప్రాంతాలలో మూల మూలలకు ప్రయాణం చేస్తూ - కాంగ్రెసు మంత్రివర్గ పాలనలో జరిగిన లోపాలను ప్రజలలో ఎవరైనా విమర్శిస్తే పరిపాలనను సమర్థిస్తూ, జమీందారీ బిల్లు మొదలయిన బిల్లు లెందుకు ఆలస్యమైనవో బోధపరుస్తూ మంత్రివర్గం ఏ కారణంచేత రాజీనామా ఇవ్వవలసి వచ్చినదీ వివరిస్తూ గంభీరోపన్యాసాలిస్తూ రాష్ట్రంలో పర్యటన చేశారు. 1941 జనవరిలో నూజివీడులో జరిగిన రాష్ట్ర రాజకీయ సభకు ప్రకాశంగారే అధ్యక్షత వహించారు. స్వాతంత్ర్య సమరం గూర్చి మాట్లాడి, గ్రామస్వరాజ్యము, ఖద్దరు ప్రాముఖ్యము, హరిజనోద్ధరణము మొదలైన విషయాలపై ఆయన గంభీరోపన్యాసాలు చేశారు.

ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరొకసారి సమావేశమై, రాష్ట్రాలలో కాంగ్రెస్ మంత్రివర్గాలు తిరిగీ స్థాపించే ప్రసక్తి వదలుకుని, గాంధీగారి నాయకత్వాన సంపూర్ణంగా బలపడడానికి తీర్మానించుకున్నారు. మార్చిలో బీహారు రాష్ట్రంలోని రామ్‌ఘర్‌వద్ద అఖిల భారత కాంగ్రెస్ సాంవత్సరిక మహాసభ జరిగింది. సభ జరగడానికి ఏర్పాటయిన స్థలం చిన్న అడవి వంటిది. చాలా చెట్లను కొట్టి, కాంగ్రెస్‌కు వచ్చిన వారికి వసతులూ, సభా స్థలమూ ఏర్పాటు చేశారు. అసలు సభ ఏమో బహిరంగ స్థలంలోనే జరగడానికి ఏర్పాటు జరిగింది. అయితే, దురదృష్ట వశాత్తు మధ్యాహ్నం రెండు గంటలవేళ అయ్యేసరికి మేఘాలు దట్టంగా కమ్మి, కుండలతో దిమ్మరించి నట్టు వర్షం పడసాగింది. తడవకుండా ఉందామనే ఆశతో, కొందరు వేదికపై నున్న తివాసీల క్రింద జంబుకానాల క్రింద ప్రవేశించారు. అయితే ఆ రక్షణ వారికి ఒక పదినిమిషాలు మాత్రమే కలిగింది. తర్వాత ఆ పెద్ద పెద్ద తివాసీలు, జంబుకానాలు కూడా పూర్తిగా తడిసి బరు వెక్కడంతో, వాటి క్రింద ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారిని ఎలాగో కష్టంమీద పైకి లాగవలసి వచ్చింది. అందులో చాలామంది అప్పు డలా చాలాసేపు తడవడంవల్ల జబ్బు పడ్డారు. చెన్నరాష్ట్రంలో పబ్లిక్ వర్క్స్‌మంత్రిగా పనిచేసిన యాకూబ్ హుసేన్‌గారు అలా తడియగా చేసిన జలుబు న్యూమోనియా క్రిందికి మారగా, జబ్బుపడి, చెన్నపట్నానికి తిరిగి వచ్చిన కొంత కాలానికి దివంగతులయ్యారు.

ఈ కాంగ్రెస్ పూర్తి అయిన తర్వాత నేను, డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు కలసి తిరుగు ప్రయాణం చేయడం సంభవించింది. ఆయనపై నాకు అపారమైన గౌరవ ముండేది. ఆంధ్ర ఉద్యమం ప్రారంభకాలంలో ఆయన మహానాయకత్వాన్ని వహించారు. నిశితమైన విమర్శనా శక్తి, వాడియైన వాగ్ధాటి గల ఆయన కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంలో కొంతవరకు గాంధీగారికి ఆప్తుడు. 1935 లో కాంగ్రెస్ స్వర్ణోత్సవ సమయంలో కాంగ్రెస్ చరిత్రనంతా ఒక ఉద్గ్రంథంగా వ్రాసి ప్రశంసలు పొందారు ఆయన. అయితే, ఆయనకు మొదటినుంచీ ప్రకాశంగారంటే కొంచెం ద్వేషం, మాత్సర్యం ఉండేవి. అవి అనేక సమయాలలో బయల్పడుతూ ఉండేవి. కబుర్ల ధోరణిలో, చెన్నరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగు నడచిందో అని ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబుగా, రాజాజీ ఐ. సి. యస్. ఉద్యోగుల చెప్పుచేతలలో ఉండేవారనీ, తాను ఎంచుకున్న మంత్రివర్గంపై అట్టే నమ్మకం కనబర్చేవారు కారనీ నేను సోదాహరణంగా చెప్పగా, సీతారామయ్యగారు "నువ్వు చెప్పిందంతా బాగుందయ్యా? అసలు మన వాడు మంచివాడయితే సరిపోయేది కదా?" అన్నారు. ఆయన సూచించింది ప్రకాశంగారి విషయము. ఆ విధంగా ఆయన అనేసరికి నాకు ఆశ్చర్యం వేసి, "మీ రెందుకిలా అంటున్నా"రని అడిగాను. దానిపై పట్టాభిగారు "ఒక జమిందారుకి, కోర్టు ఆఫ్ వార్డ్సుకి జరిగిన వివాదంలో ప్రకాశంగారు పాస్‌చేసిన ఆర్డరు సంగతి నువ్వేమంటావు?" అన్నారు. అది విజయనగరం జమీందారుకు సంబంధించినది. ఆ ఫైలు విషయమై తెలిసినవారు రెవిన్యూ సెక్రటరీ, ప్రకాశంగారు, నేను, లా మినిష్టరయిన డాక్టర్ సుబ్బరాయన్‌ గారు మాత్రమే. నాకు ఆ ఫైలుని గురించిన సంపూర్ణ విషయాలు తెలుసు గనుక, ఆ వివరాలు ఆద్యంతం ఆయనకు చెప్పి, "దీనిపైన మీరే ఆర్డరు వేయవలసివస్తే ప్రకాశంగారు వేసినట్లుకాక వేరుగా వేయగలరా?" అని ప్రశ్నించాను. దానిపైన ఆయన, "ఈ సంగతులన్నీ మాకు సరిగ్గా చెప్పేవా డెవడున్నాడయ్యా?" అన్నారు.

'మాకు' అంటే కాంగ్రెస్ కమిటీ పెద్దలకు అన్నమాట.

"ఉన్న సంగతులు చెప్పే వా రెవరున్నారని మీ రడుగుతున్నారు. లేని సంగతులను ఉన్నట్లు మీకు చెప్పిన వా రెవరో చెప్తారా? పోనీ, ఒకవేళ అనుమానం వస్తే ప్రకాశంగారిని కనుక్కోగూడదా? కాకుంటే, నన్నడగరాదా? ఏమీ లేకుండానే ఒక మహావ్యక్తి పైన ఇటువంటి అనుమానాలు మీలో మీరు పెంచుకోవడం మంచిదా?" అన్నాను.

అందుకు, "విశ్వనాథం! నువ్వింకా చిన్నవాడివి. లోకంలో అనేక సంగతులు జరుగుతాయి. నీకు తెలీదు," అన్నాడు ఆయన. అది విని నా కాశ్చర్యం వేసి వివరాలు మళ్ళీ చెప్పవలసిందని రెట్టించగా, ఆయన "సరైన ఆర్డరు పాస్ చేయడానికి కొంతమంది డబ్బు పుచ్చుకుంటా రన్నది నీకు తెలీదులే," అని పూచీ పేచీలేని పద్ధతిలో మాట విసిరేశారు.

బేసబబైన మాటలకు వారి మాటే పరాకాష్ఠగా కన్పించింది నాకు.

అది మొదలు, వారితో సంభాషణ నేను వీలైనంత మట్టుకు తగ్గించుకొంటిని. తర్వాత చరిత్రలో ప్రకాశంగారికీ, వీరికి వైషమ్యాలు ప్రాణం పోయేవరకు హెచ్చిపోతూనే వచ్చిన మాట అందరికీ తెలిసినదే.