నా జీవిత యాత్ర-4/ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు

13

ప్రకాశం మంత్రివర్గం ఏర్పాటు

ఎన్నిక అయిన వెంటనే, యథాశాస్త్రంగా గవర్నరును చూడడానికి ప్రకాశంగారు వెళ్ళారు. మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి కొంత వ్యవధి పుచ్చుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఆ వీథి అంతా కార్యదర్శులు, పెద్ద ఉద్యోగులు, అభిమానులతో నిండిపోయింది.

ఆ రోజులలో ప్రకాశంగారికి ఎమ్. కె. వి. రెడ్డి, బొప్పన హనుమంతరావు అనే ఇద్దరు బారిష్టరులు చాలా సహాయకారులుగా ఉండేవారు. ప్రకాశంగారు బసచేసిఉన్న ఇల్లు పై చెప్పిన హనుమంతరావుగారిది. ఆ వీథి వీథంతా ముఖ్యంగా ఆంధ్రులతో నిండిపోయింది. అంతవరకు కంచెమీద అటా యిటా అని సందేహంతో నిల్చున్న కొందరు శాసన సభ్యులు కూడా (వోటింగులో వారేమి చేశారో తెలియదు) వచ్చి, ప్రకాశంగారిని అభినందించారు.

మరునాడు ఉదయం - మామూలుగా ఆరోగ్య పోషణార్థం నిత్యమూ సాగించే పాదయాత్రకై వెళ్ళిన ప్రకాశంగారు, కొంతదూరంవెళ్ళి, ఎవరికీ తెలియకుండా గోపాలరెడ్డిగారి బసలోకి వెళ్ళారని ఒక వదంతి బయలుదేరింది.

నిన్నటిదాకా, పీకమీద కాలువేసి తాండవం చేస్తున్న అతని యింటికి ప్రకాశంగారు వెళ్ళడం, తమ పీకలమీద ఆయన కాలువేసి తొక్కేసినట్లే అని - ప్రకాశంగారిమీది అభిమానంవల్ల పుట్టిన ఆగ్రహంతో జనం ప్రకాశంగారి యింటి దగ్గరికి చేరి, "ఏరీ పంతులుగారు?" అని అడగసాగారు. కాని, ఆయన అప్పటికి తిరిగి రాలేదు. అ వచ్చే జనం సంఖ్య క్షణక్షణానికి హెచ్చుతూ వచ్చింది.

అంతట్లో, రమారమి తొమ్మిది గంటలకు ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. 'గోపాల రెడ్డిని మంత్రిగా చేస్తే మేము ఒప్పుకొనేది లే'దని అక్కడ చేరినవారు ఏక కంఠంగా కేకలు వేయగా, ప్రకాశం గారు వారిని సమాధాన పరచి, మెల్లిగా పంపించేశారు.

ఆ మధ్యాహ్నం, ఆయన నన్ను డాక్టర్ రాజన్‌గారి దగ్గరికి పంపారు. నేను వెళ్ళేసరికి ఆయనతోబాటు - మధురలో సుప్రసిద్ద న్యాయవాది, త్యాగశీలుడు, శాసన సభా సభ్యుడు అయిన వైద్యనాథ అయ్యర్‌కూడా ఉన్నారు.

వారితో, "తప్పకుండా మీరు మంత్రివర్గంలో చేరాలని మిమ్మల్ని ఆహ్వానించడంకోసం ప్రకాశంగారు మిమ్మల్ని కలుసుకోదలుచుకున్నారు. మీ వర్గం తాలూకువారిని రెండుపేర్లు ఇచ్చినట్టయితే నేను ప్రకాశంగారికి అందజేస్తాను. రేపటికి మంత్రివర్గం పూర్తికావాలని ఆయన అభిలాష," అని చెప్పాను.

డాక్టర్ రాజన్‌గారు క్లుప్తంగాను, వైద్యనాథ అయ్యర్‌గారు బహుళంగాను - రాజాజీకి జరిగిన అన్యాయం గురించీ, ఆయనమీద కక్ష సాధించడానికి నాడారు బయలుదేరినా; వృద్ధులు, కార్యజ్ఞులు అయిన ప్రకాశంగారు నాడారుతో కలియడం రాజనీతి ప్రమాణాలను తగ్గించిందని ఏదేదో ఉపన్యాస ధోరణిలో పడిపోయి, చివరకు తాము మంత్రివర్గంలో చేరడం రాజాజీకి అంగీకారం కాదని, అనుమానంలేని మాటలతో చెప్పివేశారు.

తిరిగివచ్చి, వారు చెప్పిన మాటలన్నీ యధాతథంగా ప్రకాశం గారితో చెప్పాను. అప్పటికే ఆయన కామరాజనాడారుగారితో మాట్లాడి ఉన్నారు. సాయంకాలం ఆయన చెప్పే పేర్ల కోసమని, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒకటో రెండో గంటల వ్యవధి కావాలని చెప్పారు. నే నింటికి వెళ్ళేసరికి, ప్రకాశంగారు - కేరళనుంచి రాఘవమేనోన్‌గారి పేరు, దక్షిణ కెనరానుంచి కె. ఆర్. కరంత్ పేరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అంతలో, నాడారుగారు పంపిన మనిషి కూడా వారి జాబితా అందజేశారు. అందులో అన్నీ దక్షిణ దేశీయులపేర్లే ఉన్నా, తమతో చేయి కలిపి, ప్రకాశంగారికి వ్యతిరేక నాయకత్వాన్ని సాధించడానికి యత్నించిన వారిపేర్లు లేవు. అయితే, వారు నాడారు వర్గంలో వారు కాబట్టి వారూవారూ చూసుకోవలసిన విషయం అది. తర్వాత, భాషాభేదాన్ని పురస్కరించుకోకుండా తమ వర్గానికి చెందిన భాష్యం అయ్యర్‌గారిని ప్రకాశంగారు తమ జాబితాలో వేసుకున్నారు.

ఏప్రిల్ 30 న ప్రకాశంగారి మంత్రివర్గం ఉద్యోగ స్వీకరణ ప్రమాణం తీసుకొన్నది. ఆయన మంత్రివర్గంలోని మంత్రులు పదకొండుగురిలోను తొమ్మిదిమంది న్యాయవాదులు.

మంత్రివర్గము వెంటనే చేసిన పనులు

ప్రమామాణ స్వీకారం జరిగిన వెంటనే, రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికీ, గ్రామాలమీద వేసిన జుల్మానాలను గ్రామస్థులకు తిరిగి ఇచ్చివేయడానికీ ప్రకాశం మంత్రివర్గంవారు నిశ్చయించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన అరవై తొమ్మిదిమంది రాజకీయ ఖైదీలను విడుదల చేస్తూ, మే 2 న ఆర్డరు పాసు చేశారు. ఒంగోలు బాంబుకేసులో లోగడ ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించి, అరెస్టు చేయమని పాస్ అయిన ఆర్డర్లను మే 9 న రద్దుచేశారు. ఆలాగుననే ప్రతివాది భయంకరం వెంకటాచారిగారికి స్థలమునుంచి స్థలమునకు కదలుటలోగల ఆంక్షలను తొలగించారు. విశాఖపట్నం ఏజన్సీనుంచి రాజకీయ ఖైదీగా ఉన్న మఱ్ఱి కామయ్యను విడుదల చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అప్పటి గవర్నమెంటు వారు చాలామంది ఉపాధ్యాయుల సర్టిఫికేట్లను కేన్సెల్ చేశారు. కొందరి ఉద్యోగాలు తీసేశారు. ప్రకశాశం మంత్రివర్గంవారు మే 23 న అలా కోల్పోయినవారికి సర్టిఫికేట్లు, ఉద్యోగాలు ఇవ్వడానికి ఆజ్ఞలు జారీ చేశారు.

స్పీకరు ఎన్నిక

ప్రకాశంగారు తమ శాసన సభా పార్టీ కార్య నిర్వాహక వర్గంలో అన్ని వర్గాలవారికి చోటు ఇచ్చారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరులను, శాసన మండలి అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకోవలసిన సమయం వచ్చింది. శాసన సభకు నన్ను స్పీకరుగాను, శ్రీమతి అమ్మన్నరాజాను డిప్యూటీ స్పీకరుగాను; తంజావూరునుంచి వచ్చిన నటరాజన్ అనే అతనిని శాసన మండలి అధ్యక్షునిగాను, దక్షిణ ప్రాంతాలనుంచి వచ్చిన మరొకరిని ఉపాధ్యక్షునిగాను ఉండడానికి కార్యనిర్వాహక సంఘంలో ఏకగ్రీవంగా నిశ్చయించారు.

అయితే, ప్రకాశంగారిని నాయకునిగా ఎన్నుకొన్నది లగాయితూ, ఎదురు వర్గాలవారు, అనగా - కామరాజనాడారుగారు, రాజాజీ, కళా వెంకటరావుగారల వర్గాలు ఏ విధంగా ప్రకాశంగారిని హింసిస్తే బాగుంటుందని అలోచిస్తూనే ఉన్నారు. అందుచేత, స్పీకరు ఎన్నిక సమయంలో ఆ మూడు వర్గాలవారు ఏకమయారు. రాజాజీ వర్గంవారు చాలామంది, నాయకుని ఎన్నికలలో పాల్గొనలేదని ఇదివరలో వ్రాశాను. కానీ, ఇపుడు వారుకూడా వీరితో కలుసుకున్నారు.

నేను ఆ రోజులలో చెన్నపట్నం కాస్మాపాలిటిన్ క్లబ్‌లో బసచేసి ఉండేవాడిని. గోపాలరెడ్డిగారుకూడా అక్కడే బసచేశారు. స్పీకరు ఎన్నిక జరిగేరోజున, ఆ విషయం మా సంభాషణలోకి వచ్చేసరికి, ఆయన - ఎగ్జిక్యూటివ్ కమిటీలో నా పేరు అంగీకరించినట్టు తమకు తెలియదన్నారు. అందుచేత, రాజాజీవర్గంనుంచి - హరిజను లయిన శివషణ్ముగంపిళ్ళైగారిని ప్రతిపాదిస్తారేమో నన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో జరిగిన నిర్ణయం ఒక పట్టుదల లేని విషయం అన్నారు.

ఇలా ఉండగా, నాడు పన్నెండు, ఒంటిగంట వేళప్పుడు కామరాజునాడారుగారు, ఫోర్ట్ సెంట్ జార్జిలోని ప్రకాశంగారి గదిలోకి వచ్చారు. అంతకు వారంరోజులక్రితం చెన్నపట్నంనుంచి తంజావూరుకు బదిలీ అయిన ఒక జిల్లా పోలీసు సూపరింటెండెంటు బదిలీ ఆర్డరును ఉత్తర క్షణంలో రద్దు చేయాలని నాడారుగారి కోరిక. మధ్యాహ్నం మీటింగు అయిన తరువాత కాగితాలు తెప్పించి చూస్తానన్నారు ప్రకాశంగారు. మీటింగుముందే ఆ పని జరగాలని నాడారుగారు ఒత్తిడి చేశారు. మీటింగుకు, ఈ కోరికకు ఉన్న సంబంధం ప్రకాశంగారు గ్రహించలేకపోయారు. రుసరుసలాడుతూ, నాడారుగారు పైకి వచ్చేశారు.

అసలు ఆ రోజు జరిగే ఎన్నికలలో - పేరుకు వారికిగాని, వెంకటరావుగారికి గాని వ్యతిరేకత లేదు. ఆ రోజు ఎన్నికలో సూచింపబడే పేర్లలో, నా పేరు ప్రకాశంగారు తనకు ముఖ్యమని అనుకుంటారనీ, అందుచేత తాము ఏకమై నన్ను ఓడించినట్టయితే, నాయకుడుగా ఎన్నుకొనబడ్డ మూడువారాలకే ప్రకాశంగారికి ప్రథమ పరాజయం కలుగుతుందని వారు ఊహించుకున్నారు. శివషణ్ముగం పిళ్ళైగారు - రాజాజీవర్గంలో వారు కావడంచేత, హరిజనులు కావడంచేత ఆయన పేరు ప్రతిపాదించడానికి ఏకమయ్యారు. ఆయన ప్రకాశంగారితో బాగా పరిచయమున్నవారే. 1932 లో ప్రకాశంగారు ఆయనను చెన్నపట్నం నుంచి పూనాకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళారు. ఇటువంటి సంబంధమున్నప్పటికి, ఆయన ప్రకాశంగారిని కలుసుకొని, తనకు స్పీకరుగా ఉండాలనే అభిలాష ఉందని చెప్పలేదు. నేను ఆయనను కలుసుకున్నప్పుడు నాతోకూడా ఈ ప్రసంగం తేలేదు. తెచ్చినట్టయితే ఏమయి ఉండేదో! పార్టీ మీటింగు ప్రారంభమయి నా పేరు ప్రతిపాదించేసరికి - నాడారు, రాజాజీల వర్గాలవారిలో ఎవరో ఒకరు శివషణ్ముగం పిళ్ళైగారి పేరు ప్రతిపాదించారు.

ఓట్లు తీసుకొని లెక్కించే సమయంలో, కళా వెంకటరావుగారు వచ్చి, నన్ను కౌగిలించుకొని, "నీ పేరు ప్రకాశంగారు మాతో చెప్పనైనా చెప్పలేదు. ఇక్కడ నీకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నట్టు కనిపిస్తున్నది" అని అన్నారు. అందుకు నేను, "పోనీ, నువ్వు చేయగలిగిన సాయమేదో నువ్వు చేయి," అన్నాను. దానికి "అదే చేస్తున్నాను" అని బదులుచెప్పి వెళ్లిపోయాడు. ఆ మాట అర్థం నాకు బాగా తెలుసు. ఆ అర్థం నాకు తెలుసునన్న విషయం అతనికీ తెలుసు.

ఎన్నిక ఫలితం వెల్లడించారు.పిళ్ళైగారు ఒకేఒక ఓటుతో గెలిచారు. ఈ మొదటి ఓటమిని ప్రకాశంగారికి కలిగించామని వ్యతిరేక వర్గాలవారు బాహాటంగా పరస్పర సంతోషాన్ని ప్రకటించుకొన్నారు. మిగిలిన ఉపాధ్యక్ష, శాసన మండలి అధ్యక్షుల ఎన్నిక సందర్భంలో ఎదురుపక్షంవారికి పట్టుదల ఏమీలేదు. వారు అనుకున్న పేర్లే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏర్పాటయినట్టు ఆమోదింపబడతాయని అనుకున్నారు.

ఎగ్జిక్యూటివు నిర్ణయం విశ్వనాథం విషయంలో పార్టీ త్రోసివేసినపుడు, శాసన మండలి అధ్యక్ష పదవికి నటరాజన్‌గారిని ఎందుకు ఆమోదించాలని చిత్తూరుజిల్లానుంచి వచ్చిన బి. రామకృష్ణరాజుగారు - తన పేరు ఎవరిచేతనో ప్రతిపాదింపజేసుకున్నారు. ఒక్కవోటుతో ఆయన గెలిచాడు. రామకృష్ణరాజుగారు ప్రకాశంగారిమీద అభిమానం కలవాడే. కాని, ప్రకాశంగారి అనుయాయులు యావన్మందీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం ప్రకారమే ఓటు చేశా రనుకుంటాను. అందుచేత ప్రకాశంగారికి, పార్టీలో ఏదైనా పట్టుదల వస్తే, సగంమందే తమవైపు ఉన్నట్టు తేలింది. అయితే, ఇది మంత్రివర్గ కార్యకలాపానికి అడ్డురాగూడదనే ధైర్యంతోనే, మిగిలిన కార్యకలాపాన్ని నడిపించేవారు. మరునాడు అసెంబ్లీలో పార్టీ నిర్ణయం ప్రకారం పిళ్ళైగారిని స్పీకరుగా ఎన్నుకోవడం జరిగింది.

మంత్రివర్గము - ఇతర ఉత్తరువులు

క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో కాంగ్రెసు జండాగాని, ఇతర రాజకీయపార్టీల జండాలుగాని, పురపాలక సంఘ భవనాలపైన, స్థానిక సంస్థల (District Boards) భవనాలపైన ఎగురవేయ కూడదనే ఆంక్ష వుండేది. జూన్ 5 న ఆ ఆంక్షను ప్రకాశంగారు రద్దు చేసేశారు.

ఆ ఉద్యమం సమయంలో గ్రామస్థులకు పాఠం చెపుదామనే ఉద్దేశంతో అప్పటి గవర్నమెంటువారు జుల్మానాలు విధించారు. అనగా, నేరంతో సంబంధం ఉన్నా, లేకపోయినా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామస్థుడూ ఆ జుల్మానాలో భాగం ఇచ్చుకోవలసిందే. ఇటువంటి జుల్మానాలను 1942 ఆగస్టు నెలలో - పది లక్షల ముప్పై మూడువేల రూపాయలమేరకు విధించారు. 1946 జూన్ 10 న వాటిని ప్రకాశంగారు రద్దు చేసేశారు.

1940, 41, 42 లలో సత్యాగ్రహులపైన వివిధ ఉద్యమాల సందర్భంగా విధింపబడిన జుల్మానాల నన్నిటిని 1946 జూన్ 17 న రద్దు చేసేశారు.

అన్ని దేవాలయాలలోకి - అంతవరకు లోనికి పోగూడదని ఎవరిపై ఆంక్ష ఉన్నదో, వారందరూ ప్రవేశించడానికి హక్కు కల్పిస్తూ ఒక బిల్లు జూన్ 20 న కేబినెట్‌లో ఆమోదించారు.

అదేరోజున, యుద్ధ సందర్భంలో నిలుపుదల అయిన మద్య నిషేధ చట్టము తిరిగి - సేలమ్, ఉత్తర ఆర్కాడు, చిత్తూరు, కడప జిల్లాలలో ప్రవేశ పెట్టడానికికూడా కేబినెట్ తీర్మానం జరిగింది.

అదే సమయంలో - మలబారు జిల్లాలో సర్వగ్రామవ్యాప్తంగా కొనుగోలు, ఉత్పత్తిదారుల కో - ఆపరేటివ్ సంఘాలు ఏర్పాటు చేయడానికీ కేబినెట్ తీర్మానించింది. ఇక్కడ మద్యనిషేధం విషయమై మరికొంత వివరంగా వ్రాయాలి. జూన్ 20 కి ముందే, ఈ మద్యనిషేధం రాష్ట్రంలోని ఇరవైనాలుగు జిల్లాలలోనూ ఒకేసారిగా తక్షణం ప్రకాశం ప్రభుత్వం అమలులోకి తేవలసిందని - వీథి వీథిని రాజాజీ వర్గీయులు తీవ్ర ప్రచారం ఆరంభించారు. రాజాజీ ఇంతకన్నా బలంగా, ముఖ్యమంత్రిగా పలుకుబడి గలిగిన రోజులలో ఒక జిల్లాకు మించి ఈ చట్టాన్ని అమలుపరచ లేకపోయారన్న విషయం అందరికీ తెలిసిందే.


యుద్ధానంతరం అనేక గడ్డుసమస్యలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాయి అయినా, ఒక జిల్లాలో గాక, నాలుగు జిల్లాలలో మద్యనిషేధం అమలు జరపడానికి ప్రకాశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాని, ప్రకాశంగారికి గట్టిగా బాధ కల్పించడమన్నదే పార్టీలో ఎదురుగా ఉన్న మూడువర్గాలవారి ముఖ్యోద్దేశం గనుక, వారు ఏకమై, పార్టీలో - ఇరవైనాలుగు జిల్లాలలో మద్యనిషేధమనే నినాదం లేవదీశారు. ప్రకాశంగారు తాము మొదట చెప్పిన నాలు జిల్లాలలోనే గాక - అదనంగా కోయంబత్తూరు, అనంతపురము, కర్నూలు, బళ్ళారి అనే మరి నాలుగుజిల్లాలలోకూడా మద్యనిషేధం అమలుచేయడానికి అంగీకరించారు. దాంతో ఎదురుపక్షంవారు లేవదీసిన ప్రచండవాయువు పలచబడింది.

ఈ విధంగా, ఎన్నికయిన మర్నాటినుంచి ప్రకాశంగారి వర్గం - ఎదురుపక్షంగా ఉన్న మూడువర్గాలతో నిత్యమూ మల్లయుద్ధాలు చేయవలసి వస్తూండేది.

గ్రామాభ్యుదయ కార్యక్రమము

పదవీ స్వీకారం చేసిన పదిహేను రోజులలోనే, అనగా 15-4-46 న ప్రకాశంగారు ఆహార పదార్థాల కొనుగోలు, సరఫరా విషయమై ఒక స్కీము రూపొందించారు. అది రెండునెలలకు గవర్నరు దగ్గరికి వెళ్ళింది. అప్పటి గవర్నర్ సర్ ఆర్థర్ నై 13-6-46 న ఆ ఫైలుమీద "నేను చాలా శ్రద్ధతో మీరు పంపించిన స్కీమంతా చదివాను. ఇది నిర్దుష్టంగా ఉన్నది," అని వ్రాశారు. తమ స్కీము "యుద్ధానంతర పునర్నిర్మాణ సంఘంవారి స్కీముకన్నా ఉత్కృష్టమయిన"దని చెప్పిన ప్రకాశంగారు, దాన్ని గురించి ఇంకా ఇలా చెప్పారు:

"మన రాష్ట్రం ఆహార పదార్థాల విషయంలో స్వయం పోషకంగా ఉండాలి. 1937-39 లలో, నేను రెవిన్యూమంత్రిగా ఉన్న రోజులలోనే, త్వరలో మనకు ఆహారపు దినుసులకు సంబంధించిన గడ్డు సమస్యలు వస్తాయని ఊహించగలిగాను. ఇపుడు ఆహారశాఖవారు చేస్తున్న ప్రొక్యూర్‌మెంటు (ఆహారపు దినుసుల సేకరణ) సరఫరా విషయమై చేస్తున్న కార్యక్రమం - సమస్యా పరిష్కారాత్మకమైనది కాదు. మన ఉత్పత్తితో నూటికి యాభై వంతులు ఆహారపు దినుసుల ఉత్పత్తే గనుక, మన రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలు కాకున్నా, కొన్ని ఫిర్కాలయినా స్వయంపోషకంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వశాఖలు వహించాలి."

అందరు మంత్రులూ ఆ స్కీము ఆగస్టునాటికి ఒప్పుకొనడం జరిగింది. ఆ స్కీములో ముఖ్యసూత్రం క్లుప్తంగా చెబుతాను. ఫిర్కాల అభివృద్ధి, కొనుగోలు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గ్రామ సీమలలో సాంస్కృతికాభివృద్ధి - ఈ మూడూ ఒకదాన్ని అంటిపెట్టుకొని మరొకటి ఉంటాయి.

మలబారులో ఈ సంఘాలు అప్పుడే ఏర్పాటుచేసినట్టు చెప్పి ఉన్నాను. వీటి తాలూకు ముఖ్యమైన పని ఉత్పత్తిదారుల దగ్గర ఉన్న ఆహార దినుసుల సేకరణ, సరఫరాయేగాక - గ్రామస్థులకు నిత్యావసరాలైన కట్టుబట్టలు, కిరసనాయిలు, కట్టుపుల్లలు, పంచదార, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు మొదలైన వస్తువులనూ సేకరించి, అవి కావలసినవారికి సరఫరా చేయడంకూడా, ఈ సంఘాల భవనాలు - గొడౌన్సు గాను, వేర్ హవుసులుగాను ఉండి, గ్రామస్థులకు కావలసిన - కంట్రోలు నిబంధనలో ఉన్న అన్నివస్తువుల సేకరణ, వితరణ కార్యాలు చేయడమే గాక; వారికి కావలసిన బాంకింగు (పరపతి) సంస్థలుగానూ పనిచేయించ డానికి ఏర్పాటయింది. ఇటువంటి పనులు ఏవైనా, వేరువేరుగా చేసే సంస్థలున్నా - వాటిని ఈ నూతన సంస్థలలో విలీనం చేయాలని నిర్ణయించారు.

మలబారులో ఈ సంఘాలు జయప్రదంగా సాగడం చూచి, ఈ స్కీము కోస్తా జిల్లాలలో కూడా అమలుజరిపించడానికి యత్నం జరిగింది. నాలుగు కోస్తా జిల్లాలలో 47 జనవరికి ఇటువంటివి 108 సంఘాలు ఏర్పడినాయి. ఈ స్కీముకు ముందు లక్ష టన్నుల సేకరణకూడా జరగని కోస్తా జిల్లాలలో, ఈ స్కీము అమలు జరిపిన తర్వాత, ఎవరినీ నిర్భంధించకనే మూడులక్షల నలబై వేల టన్నుల ధాన్యసేకరణ జరిగింది.

రేషనింగు విధానం బందోబస్తుగా జరిగింది. అయిదేసి మైళ్ళలో గల గ్రామాలన్నీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేయబడినాయి. ఆ ప్రాంతంలోని ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు యావన్మందిని సహకార సంఘంలో వాటాదారులుగా తీసుకున్నారు. వాటా ధనం ఒక్కొక్క గ్రూపులోను నాలుగులక్షల రూపాయలకన్న మించకుండా ఏర్పాట్లు జరిగినాయి. ఖరీదులు వాటంతటవే పెరిగి పోకుండా ఉండడానికీ, నిర్ణీతమైన తేదీలోగా ప్రొక్యూర్‌మెంటును ఉత్సాహంగా జరిపించడానికీ బోనసులు ఏర్పరచబడినవి. ఈ సంఘాలలోను, ఒకటి ఇంకొకదానితో పోటీపడి, ఖరీదులు హెచ్చించడానికిగానీ, సేకరణ స్తంభింపజేయడానికిగానీ వీలులేకుండా నిబంధనలు చేయబడినాయి. అంతవరకు వ్యక్తికున్న ప్రాముఖ్యం తగ్గి, వ్యక్తులతోకూడిన సహకార సంఘానికి ప్రాముఖ్యం వచ్చింది. దురాశాపరులై వ్యక్తుల కవకాశాలు సన్నగిల్లినవి. దినుసుల అమ్మకంవల్ల వచ్చిన లాభాలు వ్యక్తులకుగాక, సహకార సంఘాలకే చెందునట్లు ఏర్పాటయింది. అన్ని ప్రాంతాలలోను ఉన్న ధాన్యపుమిల్లులకు పనికలగడానికై, మిగులు ప్రాంతములకు పూర్వం వలె బియ్యం కాక, ధాన్యమే పంపడానికి నిబంధనలు చేయబడినవి.

ఈ స్కీమువల్ల హోల్‌సేలు వర్తకుల ప్రాముఖ్యం తొలగి పోయింది. వచ్చిన లాభమంతా ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులే అను భవించే వీలు కలిగింది. ఈ స్కీమువల్ల గ్రామస్థుల జీవనపద్ధతిలో ఒక విప్లవాత్మకమైన మార్పు కలిగింది.

గోపన్నపాలెము - జోగన్నపాలెము

గ్రామ స్వరాజ్యం; గ్రామాలను స్వయంపోషకంగా అభివృద్ధిచేయడం అనేవి ప్రకాశంగారి మనసులోని గాఢమైన లక్ష్యాలని లోగడ వ్రాశాను. 1937 లో రెవిన్యూ మంత్రిగా ఉన్నరోజులలో, కాగితాల మీద కొన్ని స్కీములు వ్రాయడంతోనే సరిపోయింది. మంత్రివర్గం రాజీనామా చేసిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని జోగన్నపాలెం అన్న గ్రామంలో "ఆదర్శగ్రామం" అనే లక్ష్యంతో నిర్మాణ కార్యక్రమం ప్రారంభించారు.

అక్కడే, గ్రామీణ విద్యాకేంద్రం (గ్రామ విశ్వ విద్యాలయం) అనే సంస్థను లేవదీసి, దానికి బాబూ రాజేంద్రప్రసాదుగారిని కులపతిగా ఏర్పాటు చేశారు. ప్రకాశంగారే దానికి ఉపకులపతి. గాంధీగారు చెప్పిన నిర్మాణ కార్యక్రమం, నూలు వడకడం, చేనేత, గ్రామ కుటీర పరిశ్రమలు మొదలైనవికూడా ఏర్పాటు చేయడమైనది. అయితే, రాను రాను అది క్షీణించింది. అయినా, ఇంకా సంపూర్ణంగా పోకుండా ఖాదీ పరిశ్రమ నడుస్తున్నట్టు తెలుస్తున్నది. 1946 లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామసౌభాగ్యం పెంచడంకోసమని అమలుపరచిన స్కీములలో ఒకటి గోపన్నపాలెం అనే గ్రామంలో ఉండేది దానిపేరు గ్రామసేవకుల శిక్షణ కేంద్రము. ఈ శిక్షణ కేంద్రంలో - (1) ఖద్దరు విషయమై తీవ్రమైన కృషి; (2) హరిజనోద్దరణ; (3) గ్రామీణులకు రవాణా; (4) మంచినీటి సరఫరా సౌకర్యముల విషయము; ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటినిగురించి శిక్షణ ఇచ్చే ఏర్పాటు జరిగింది. [1]

ఇది ఉత్తర జిల్లాలలో ఏర్పాటయిన కేంద్రము. ఇదేవిధంగా దక్షిణ జిల్లాలలో టీ - కల్లుప్పటిలో ఏర్పాటు జరిగింది. గోపన్నపాలెంలో పైన చెప్పిన శిక్షణ కార్యక్రమమే కాక గ్రామ పరిశ్రమలకు మాడల్ కేంద్రంగా ఏర్పాటు చేసిన శిక్షణ ఇచ్చే కార్యప్రక్రియ కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో దాదాపు వేయిమందిదాకా కార్యకర్తలు శిక్షణ పొందారు. వరుసగా, ఒకేసారి సంవత్సరం శిక్షణ పొంది, కార్యరంగంలోకి వెళ్ళడం అనే పద్ధతిగాక, మొదటి మూడు నెలలు శిక్షణ, ఆ తర్వాతి మూడు నెలల్లో కార్యరంగంలో పని చేయడం అన్న పద్ధతి ఉండేది. అలా పని చేసివచ్చి తిరిగి రెండోమారు పొందే శిక్షణ మొదటిసారికన్నా హెచ్చుగా ఉండేది. అది కాగానే తిరిగీ కార్యరంగంలో ప్రవేశించేవారు. ఇందువల్ల మొదట సూత్రప్రాయంగా నేర్చుకొన్నది వెంటనే కార్యరంగంలో ప్రక్రియగా అమలు జరిపి, అందులో ఉన్న లోటుపాట్లను రెండోమారు శిక్షణద్వారా సరిదిద్దుకొని సక్రమమైన పనులు చేయడానికి అవకాశం ఉండేది. ఈ శిక్షణ పొందినవారు రోడ్లు నిర్మించడం, నూతులు త్రవ్వడం మొదలైన కార్యాలన్నీ స్వయంగా చేసుకొనేవారు. కూరగాయలు, ఆహారపు దినుసులు పండించేవారు. ఒక క్రమపద్ధతిలో, వారిలో వారే కార్యక్రమాన్ని చర్చించుకొని, ఒకరి భావాలు మరొకరు తెలుసుకొని, కార్యక్రమాలు చక్కజేసుకొనేవారు. రాత్రివేళలలో వయోజన పాఠశాలలు నడిపేవారు. ఈ విధంగా ఒక్క గోపన్నపాలెంలోనేగాక, చుట్టుప్రక్కల గ్రామాలలోను ఒక నూతన చైతన్యం స్వయంపోషకమైన గ్రామ జీవనం ఏర్పాటు చేయడానికి ప్రాతిపదికలు వేశారు.

ఈ కేంద్రంలో హెచ్చు జీతాలు యిచ్చి ప్రొఫెసరులను నియమించలేదు. కానీ, తమ రక్తనాళాలలో దేశభక్తి, ప్రజాసేవ జీర్ణించి ఉన్న మహనీయులు వచ్చి, వారి ప్రత్యేకాభిమాన విషయాలపై ఉద్బోధక ప్రసంగాలు చేశారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు పుస్తక భాండాగార ఉద్యమం, తదనుబంధము లయిన ఉద్యమాలను గురించిన శిక్షణ ఇచ్చేవారు. గొల్లపూడి సీతారామశాస్త్రి గారు గాంధీ తత్వం గురించీ, దానిపై ఆధారపడిన గ్రామ పునర్నిర్మాణం గురించీ చెప్పేవారు. అమరజీవి పొట్టి శ్రీరాములుగారు హరిజనాభ్యుదయ కార్యక్రమాలను గురించి ఉపన్యసించేవారు. వీరు సర్వాంధ్ర ప్రఖ్యాతి గన్న పెద్దలు. వీరికి జీతాలు ఇవ్వవలసివస్తే, వాటి విలువ ఏ ప్రభుత్వంవారు కట్టగలరు? వీరుగాక, తల్లాప్రగడ ప్రకాశరాయుడు, వేగిరాజు కృష్ణంరాజు, లింగంరాజు గోపాలరావు, మల్లిమడుగుల కోదండరామస్వామిగారలు-గాంధీ జీవనం, ప్రకృతివైద్యం, బేసిక్ ఎడ్యుకేషన్ (మౌలిక విద్యావిధానం), ఖాదీ ఉత్పత్తి, ఆర్థిక సంపద మొదలైన విషయాలను గూర్చి ఈ కేంద్రంలో బోధించేవారు. గ్రామాభ్యుదయానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, మంచి నీటి సౌకర్యాలు మొదలైన పెద్ద పెద్ద పనులను కూడా గ్రామీణుల సహాయంతో తక్కువ వ్యయంతో చేయించేవారు. ముఖ్యంగా, హరిజన వాడల అభ్యుదయానికై గట్టి యత్నం చేశారు. 1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయి, మొదటి బడ్జటులో హరిజనాభ్యుదయయానికై ఒక కోటి రూపాయలు లంప్‌సమ్ (అనగా, చేయబోయే స్కీము లేవో తెలియనక్కర లేకుండానే ఎంతయితే అంత ఇచ్చేందుకుగాను కేటాయించబడిన మొత్తం అని అర్థము) కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ కారణంచేత గోపన్నపాలెం ప్రాజెక్టులో, హరిజనాభ్యుదయానికి ప్రాముఖ్యం ఇవ్వబడింది.

అయితే, ప్రకాశంగారి ప్రభుత్వం పడిపోయిన తర్వాత - ఈ లక్ష్యాలను ఆయన అనుకున్న విధంలో సాధించకపోయినా, ఈ కేంద్రం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (సమాజ వికాసం) కేంద్రాలనే క్రొత్త పథకంలో కలపబడింది. ప్రకాశంగారి ఉద్దేశాలకు, ఈ వికాసకేంద్రాల ఉద్దేశాలకు చాలా భేదముంది. ఆయన పథకంలో స్వయం పోషక గ్రామ స్వరాజ్యముంది. సమాజ వికాస కేంద్రాలకుగూడా గ్రామాల వికాసమే లక్ష్యమయినా, స్వయం పోషకత్వమనే లక్ష్యం లేదు. స్వయంపోషక గ్రామ స్వరాజ్య పథకంలో ఇతరగ్రామాల రాజకీయాల ప్రభావంగానీ, రాష్ట్రంలో జరుగుతుండే రాజకీయాల చదరంగపుటెత్తులతో సంబంధంకానీ ఉండదు. వికాసకేంద్రాలు అటువంటి చదరంగం ఆడడానికి ముఖ్య కేంద్రాలుగా మారడంవల్ల, తరువాత పంచాయితీ రాజ్యభావంలో లీనమై, చివరకు పంచాయతీ రాజ్యం పార్టీ కక్షలకు కదనరంగంగా పరిణమించింది. ఇటువంటి దుష్పరిణామాలు రాకుండా ఉండానికే గాంధీగారు, ప్రకాశంగారు స్వయంపోషక గ్రామస్వరాజ్య భావాన్ని పెంపొందించడానికి యత్నించారు. కాని, ఈ దేశం 'జాతకం' ఏలాగున సాగుతుందో వారు గ్రహించలేకపోయారు. దాని ఫలితమే, ఇపుడు దేశంలో రాజకీయరంగంలో అనేక సమరాలకు మూలమయింది.

ఫిర్కా అభ్యుదయ ప్రణాళిక

గ్రామాభ్యుదయం కొంతవరకు ప్రక్రియాత్మకంగా జరిగితే తప్ప సార్వజనికమైన అంగీకారం పొందడం కష్టమని, అందుకు కావలసిన ధనము ఏర్పాటుచేసే సౌకర్యంకోసం జిల్లాకు రెండు ఫిర్కాల చొప్పున ఈ స్కీములో చేర్చబడినవి. ఫిర్కా అంతటినీ ఒక ఖండం క్రింద స్వయంపోషకంగా చేయడానికీ, సాంస్కృతికంగా అభ్యుదయం పొందేటట్టు చేయడానికీ - ఈ స్కీములను ఎంతో అభిమానంతో, ఉత్సాహంతో - ప్రకాశంగారి లక్ష్యములకు అనుగుణంగా పనిచేయ గలిగిన వారిని, మిగిలిన గవర్నమెంటు ఉద్యోగాల రాంకులతో సంబంధించ కుండా, ఫిర్కా డెవలప్‌మెంట్ ఉద్యోగులుగా నియమించారు. ఇందులో చాలామంది స్వాతంత్ర్య సమర యోధులు.

రాను రాను, స్వయంపోషక సూత్రాన్ని మాత్రం వదిలిపెట్టి, కొన్ని కొన్ని ఫిర్కాలు ఒక బ్లాకుగా మార్పుచెంది, ఆ బ్లాకు లిప్పుడు సమితులుగా పరిణమించాయి. స్వయంపోషక సూత్రం మరుగు పడడమే గాక, గ్రామ స్వరాజ్యంతో సంబంధించని రాజకీయ సోపానాలుగా అవి ప్రస్తుతమున్న రూపాన్ని పొందాయి.

ఖాదీ అభ్యుదయ ఉద్యమము

రాష్ట్రంలో ఖద్దరు ఉత్పత్తిచేసే కొన్ని కేంద్రాలలో ప్రత్యేకంగా, హెచ్చుగా ఖద్దరు వ్యాప్తి కావడానికి ఒక స్కీమును ప్రకాశంగారు ప్రతిపాదించారు. ఈ స్కీము క్రింద ప్రత్యేకింపబడిన కేంద్రాలలో మిల్లుబట్ట వంతు, సంపూర్ణంగా ఖద్దరే ఉత్పత్తి అయి వినియోగమయేటట్టు ఏర్పాటు చేయబడింది.

ఇందుకు అనుబందంగా మరొక పనికూడా చేయవలసి వచ్చింది. ప్రకాశంగారి మంత్రివర్గం ఏర్పాటు కావడానికి ముందే - మిల్లుబట్ట అధికంగా ఉత్పత్తిచేయడానికి, బట్టల మిల్లులను రాష్ట్రంలో అభివృద్ధిపరచడానికీ కేంద్రప్రభుత్వంవారు కొన్నివేల మరకదుళ్ళను (Spindles) కేటాయించగా, ఆ కార్యక్రమం సాగించడానికి అప్పటి గవర్నరు ప్రభుత్వం అంగీకరించింది.

ఆ విధంగా మిల్లులను విస్తృతపరచడం - ఖద్దరు ఉద్యమానికి విరుద్ద కార్యక్రమం గనుక, మరకదుళ్ళు అక్కరలేదని ప్రకాశంగారు పైకి వ్రాసేశారు. కాబినెట్‌లో ముగ్గురు, నలుగురు మంత్రులు ప్రత్యేకించి ఈ విషయంలో ప్రకాశంగారికి వ్యతిరేకు లయ్యారు.

అంతకు ముందే, ప్రకాశంగారు పట్నంలో ఉన్న మోటార్ బస్సులను జాతీయం చేసేశారు. అందుచేత, పై స్కీములవల్ల రాజకీయంగా ఉన్న ఒడిదుడుకులతోపాటు వర్తకులు, రైసు మిల్లులవారు, బట్టల మిల్లుల యజమానులు, మోటారు బస్సుల యజమానులు - మంత్రివర్గానికి వ్యతిరేకమై పోయారు.

గ్రామస్థుల స్వయంపోషకత్వం, బస్సులను జాతీయం చేయడం, మరకదుళ్ళ తిరస్కారం, ఇవి అన్నీ కలిసి - ప్రకాశంగారికి ఇదివరలోనే ఉన్న గాంధీగారి విముఖత, రాజకీయంగా పార్టీలో ఎదురు పక్షాలవారి వైమనస్యానికి తోడయి, ఆయనను ఒక్కపాటుగా ఎదుర్కోవడం మొదలు పెట్టాయి.

శాసన సభ ప్రథమ సమావేశము

1946 మే నెల 25 న అధ్యక్షుని ఎన్నికయిన తర్వాత, శాసన సభ ప్రథమ సమావేశం మే 27 న జరిగింది.

నాటి కార్యక్రమంలో మొదటి విషయం - మంత్రుల జీవితాలను హెచ్చించడానికి ప్రతిపాదింపబడిన బిల్లు. సహజంగా సభ్యుల వేతనాలు హెచ్చించే విధి కూడా అందులో ఉంది.

ఇటువంటి బిల్లు వచ్చినపుడు సభ్యులు వ్యతిరేక ప్రకటన చేయడం సంప్రదాయంగా వస్తున్న లాంఛనము. బిల్లు పాస్ అయిన తర్వాత ఎదురు పక్షంవారు కూడా దాని లాభం పొందుతారు గదా! అయినప్పటికి అందులో కొందరు, వారి పార్టీ సూత్ర ప్రకారంగా గట్టిగా ఎదిరి స్తారు. వారు చాలా మైనారిటీలో ఉంటారు గనుక, బిల్లు పాసుకాదన్న భయం వారి కుండదు. బిల్లు పాసయిన లాభము, ఎదిరించిన లాభము కూడా వారు పొందుతారు. వేతనం పెంచడానికి ఒక బిల్లు వచ్చినపుడు నేను ఎదిరించాను. బిల్లు పాస్ అయిన తరువాత, అదనంగా పెంచిన వేతనాన్ని తీసుకోడానికి నేను నిరాకరించాను. వావిలాల గోపాలకృష్ణయ్యకూడా అలా నిరాకరించినట్టు నేను విన్నాను. ఇంతకు తప్ప, ఏ రాష్ట్రంలోనూ, ఏ శాసన సభ్యుడూ వేతనం పెంపుదలను ఎదిరించి, దాని లాభాన్ని నిరాకరించినట్టు నేను వినలేదు.

1946 లో అటువంటి బిల్లుకు వచ్చిన అభ్యంతరాలకు జవాబుగా, "దేశంలో ఉన్న పరిస్థితి కాంగ్రెసు అధిష్ఠాన వర్గం వారికి తెలుసు. పరిస్థితి ఆలోచించి, కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పాటు చేస్తున్నపుడు, కాంగ్రెసు మంత్రులు అలవెన్సులతో కలిపి, 1600 రూపాయలు పుచ్చుకోవచ్చునని, శాసనంతో తగిన మార్పు చేయవలసిందని సలహా యిచ్చిన మీదటనే ఈ బిల్లు ఇక్కడ ప్రవేశ పెట్టడమైనది", అన్నారు ప్రకాశంగారు.

బిల్లు సులభంగానే పాస్ అయిపోయింది.

ఆ ప్రథమ సమావేశంలోనే రాష్ట్రంలో ఆహార పరిస్థితుల విషయమై, ప్రకాశంగారు కొన్ని వివరాలు చెప్పారు. మన రాష్ట్రంలో ఆనాడు 49 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయ్యేది. అది చాలక, 4 లక్షల 51 వేల టన్నులు మనము దిగుమతి చేసుకోవలసిన స్థితిలో ఉండే వాళ్ళము. భారత దేశం మొత్తం పైన చూసినట్టయితే (అనగా బర్మా మన దేశంతో కలిసి ఉన్న పరిస్థితులలో) మనకు పై దేశాలనుంచి బియ్యం దిగుమతి చేసుకొనే అవసరం లేకపోయింది. కాని, 1941 డిసెంబరులో జపాన్ ప్రపంచ సంగ్రామంలో పాల్గొనడం ప్రారంభించి నప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి.

ప్రకాశంగారు ప్రభుత్వంలోకి వచ్చే నాటికి, 68 వేల టన్నుల బియ్యము, లక్షా అరవై ఆరు టన్నుల ఇతర ఆహార ధాన్యాలు - కొరతగా ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం చిక్కుకొని ఉంది. రేషన్ నిబంధనలు గట్టి పరిచి, ఆహార పదార్థాలు వృథాకాకుండా ఉండడానికి గట్టి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆహార పదార్థాలను సేకరించే సంస్థలను పునర్నిర్మించి బలపరిచారు. ఆహారపు దినుసులను సేకరించే అధికారులకు వాటిని అమ్మడం పవిత్రమైన విధి అని రైతులకు బోధపడేటట్టు స్వయంగా ప్రకాశంగారే సమావేశాలలో చెప్పేవారు. డిసెంబరులోగా 3 లక్షల 36 వేల టన్నుల సేకరణ చేయడానికి నిశ్చయించి, ఆ లక్ష్యం సాధించారు. సాంఘిక న్యాయం కోసం, మన రాష్ట్రంలో రేషను ఇచ్చే మొత్తంలో బియ్యం కొంత తగ్గించారు. తక్కువ కాలంలో పండే ధాన్యానికి ఎకరానికి 15 రూపాయల చొప్పున బోనసు ఇచ్చారు. అలాగే పంట నూతులకు కూడా కొంతబోనసు ఇచ్చారు. విత్తనాలు, ఎరువులు తక్కువ ధరకు అమ్మే ఏర్పాట్లు చేశారు. దుంపలు, వేరుశనగతో చేసిన ఆహారాలు అందరికీ అందేటట్లు చేశారు. మాటిమాటికీ ధరలు మార్పు చెందకుండా ఏర్పాట్లు చేశారు.

ధాన్యం మిగిలి పోకుండా, సులభంగా సేకరించడానికి ఇరవై వేల గ్రామ ఆహార సంఘాలను ఏర్పాటు చేశారు. రాజకీయ, కులమత వర్గాలతో ఎటువంటి సంబంధమూ లేకుండా, గ్రామంలో నిజముగా ప్రాతినిధ్యమూ, పలుకుబడీ గలవారిని ఈ సంఘాలలో సభ్యులుగా చేర్చారు. ఆ సంఘాల అధ్యక్షులను ఆ సంఘాలవారే ఎన్నుకొనేవారు. ఆ గ్రామ సంఘాలలోంచి ఫిర్కా సంఘాలు, ఫిర్కా సంఘాలలోంచి జిల్లా సంఘాలు ఎన్నుకొనేటట్టుచేశారు. జిల్లా సంఘాలలో శాసన సభ్యులు, కేంద్ర శాసన సభ్యులతోసహా సభ్యులుగా ఉండేవారు. ఆహార సేకరణకు గ్రామంలోంచి రావలసిన ధాన్యం మొత్తం ఎంత అని రెవిన్యూ శాఖవారు చేసే లక్కలను ఈ గ్రామ సంఘాలు తనిఖీ చేసేవి. రైతుదగ్గర - అతని కుటుంబానికీ, వ్యవసాయపు ఖర్చులకూ కావలసినంతమటుకు వదలిపెట్టి, మిగిలిన ధాన్యాన్ని మాత్రం సేకరించే ఏర్పాటు చేశారు. దీంతో, లెక్కలలో పెద్ద పెద్ద తప్పులు,రెవిన్యూ సప్లై ఉద్యోగుల వ్యక్తిగతమైన లోటుపాట్లు బాగా తగ్గిపోయాయి. రైతుల దగ్గర అద నంగా ఉండే ధాన్యం లెక్క వేయడమేగాక, రేషన్ నిబంధనల ప్రకారం ధాన్యం ఉత్పత్తిచేసే వృత్తిలోలేని జనాభాకు ఎంత ధాన్యం అవసరమో కూడా ఆ గ్రామ సంఘాలవారే నిర్ణయించేవారు. గ్రామస్థులు ఈ విధంగా పరిపాలనలో అనుకోకుండానే భాగస్వాము లయ్యారు. అదే విధంగా గ్రామస్థులకు కావలసిన ఇతర కంట్రోలు వస్తువుల అవసరాన్ని కూడా ఈ గ్రామ సంఘంవారు చూడడానికి ఏర్పాటు జరిగింది. అంతేకాక, గ్రామస్థుల పరపతి, అవసరాలు కూడా గ్రామ సంఘాలు మదింపుచేసే, ఏర్పాటు ఈ స్కీములో అంతర్భాగము.

గ్రామ సంఘాలనుంచి వచ్చిన రిపోర్టులనుబట్టి ఫిర్కా సంఘము ఫిర్కా సంఘాలనుంచి వచ్చిన నివేదికలనుబట్టి జిల్లా సంఘము, వీటి సలహాపైని సప్లై డిపార్ట్‌మెంట్‌వారును నడచుకోవడానికి - అనగా, సేకరణ, సరఫరా, పరపతి (రూరల్ క్రెడిట్) సదుపాయాలు సమగ్రంగా జరగడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అంతేకాక, గ్రామాలలో క్రిమి కీటకాదుల బెడదలేని గిడ్డంగులు నిర్మించడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి, గ్రామస్థులకు సరఫరా చేయగా మిగిలిన బియ్యం, పంచదార, కిరసనాయిలు, నూలు, బట్ట, వ్యవసాయ పనిముట్లు, బండ్లకు, ఇనుప పట్టాలు మొదలైనవి అదనంగా ఉంటే, వాటిని తాలూకా సంఘం అవసరమైన చోట్లకు పంపడానికి, అక్కడా అదనంగా ఉన్నవాటిని జిల్లా సంఘాలకు అప్పజెప్పడానికి ఏర్పాట్లు జరిగాయి.

ఇవి బహుళార్థ సాధక లక్ష్యాలుగల సహకార సంఘాలు (Multi-purpose Co-operative Societies) కావడంచేత-ప్రభుత్వం, ఈ సంఘాలు, ప్రజలు అనే మూడు పక్షాలు ఐకమత్యంతో ముందుకు నడవడానికి ఉపయోగపడతాయి. స్వయంపోషక గ్రామ స్వరాజ్య సంస్థాపనకు ప్రకాశంగారు ఏర్పాటు చేసిన ఈ బహుళార్థ సాధక సహకార సంఘాలు పునాదులు కాగలవని ప్రజలకు విశ్వాసం కలిగింది.

ఈ స్కీము విషయాలన్నీ ప్రకాశంగారు శాసన సభ ప్రథమ సమావేశంలోనే వెల్లడించారు. ఆ తరువాత ప్రకాశంగారు, నేను దక్షిణ జిల్లాలలో పర్యటించినపుడు - ఈ స్కీము వివరాలు వింటూ కొందరు యువకులు, దాన్ని అమలు పరిస్తే తాము కమ్యూనిస్ట్ పార్టీలో చేరబోమని ప్రకాశంగారికి యిచ్చిన విజ్ఞప్తి పత్రాలలో పేర్కొన్నారు.

సమ్మెల పరిష్కారం - ప్రకాశంగారి చాకచక్యము

ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, చెన్నపట్నంలో బకింగ్ హామ్ కర్నాటిక్ మిల్లులో పదివేలమంది జరుపుతున్న సమ్మెను, మధురా మిల్లులలో జరుగుతున్న సమ్మెను- అలాగే దక్షిణ ఇండియా రైల్వే లేబరు జరుపుతున్న సమ్మెను - కేవలం తమ వ్యక్తిగతమైన పలుకుబడివల్ల పరిష్కరించ గలిగారు.

దక్షిణ ఇండియా రైల్వే వర్కరుల సమ్మె జరుగుతున్నప్పుడు ప్రకాశంగారి పలుకుబడి తగ్గించేందుకని, రాజాజీ గవర్నరు దగ్గరికి వెళ్ళి-ప్రధాన న్యాయమూర్తి, డాక్టర్ సుబ్బరాయన్, డాక్టర్ రాజన్ గారలు గల ఒక ఉప సంఘం నియమించి, దాని ద్వారా ఆ సమ్మెను పరిష్కరించవలసిందని సలహా ఇచ్చారు. గాంధీగారు లోగడ జరిపిన ఒప్పందం ప్రకారం-గవర్నరు, కేవలం కాన్ట్సిట్యూషనల్ గవర్నరే అని తెలిసీ, రాజాజీ ఆయన దగ్గరికి వెళ్ళడం సరయిన పనికాదు.

గవర్నరు, ప్రకాశంగారితో ఈ విషయం చెప్పగా - ఆయనకీర్తి అయినా, అపకీర్తి అయినా తన బాధ్యతేకాని, ఇతర కమిటీలతో ఎట్టి ప్రమేయమూ పెట్టుకోనని చెప్పారు. ఆ మీదట గవర్నరు ఏమీ కలుగజేసుకోలేదు.

ఈ సమ్మె నాయక వర్గంలో నంబియార్ అనే శాసన సభ్యుడుండేవాడు. ఈ సమ్మెతోపాటు చాలా అల్లరులు, అరెస్టులు జరిగాయి.

అందులో ఒక రోజున ఆ నంబియారు కార్మికులముందు ప్రసంగిస్తూ, ఇలా అన్నాడు: "ప్రకాశానికి 75 ఏండ్లు. ముసలివాడు, నాకు 28 ఏండ్లే, నన్ను అరెస్టుచేస్తే ఆయన ఎన్నాళ్ళు రాష్ట్రంలో ప్రధానిగా ఉండగలడో చూద్దాము. నేను శాసన సభ్యుణ్ణి, నేను అరెస్టయితే 1942 తిరిగీ ప్రవేశిస్తుంది. అసెంబ్లీలోనే ఆయన్ను చెప్పు పుచ్చుకొని కొడతాను. నేను అరెస్టయితే మృత్యు దేవత భూమిని ఆవరిస్తుంది.

"ఓ, రైనాల్డ్స్! నీవు దక్షిణ ఇండియా రైల్వేకి జనరల్ మేనేజరువి. నీవు జవహర్‌లాల్ నెహ్రూ దగ్గరికి వెళితే తాపులు తింటావు. నీవు ఉరికంబ మెక్కుతావు.

"ఈ అధర్మ కాంగ్రెస్ ప్రభుత్వం నశిస్తుంది. దిక్కులేని కార్మికులు కాల్చబడుతున్నారు. శాసన సభకు కార్మికుల్ని పంపిస్తాము. వారు ప్రకాశంగారి చేతులను కొట్టేస్తారు.

"హిట్లరుకు వ్యతిరేకంగా సోవియట్లు గొరిల్లా యుద్ధం చేశారు. ఆ యుద్ధం ఇటుపై ఇక్కడ సాగుతుంది. సమ్మెను పాడుచేసే కార్మికుడు (నల్లకాలు) ఉంటే, వాడి కాలు ఎర్రబడి పోతుంది.

ఈ విధంగా సమ్మె సాగించేవారిని, తమిళ ప్రాంత కాంగ్రెసు సంఘపు కార్మిక (లేబర్) ఉపసంఘంవారు తమ ధర్మ ప్రకారంగా అన్ని స్థలాలలో వీలైనంతమటుకు ప్రోత్సహిస్తూండేవారు.

అయినప్పటికి ప్రకాశంగారు, కార్మిక నాయకులైన గిరిగారు తిరుచినాపల్లికి వెళ్ళి, మేనేజ్‌మెంటును, కార్మికులను సమావేశపరిచి రాజీ చేసేశారు.

ఇంత పెద్ద సమ్మెలు ప్రకాశంగారు పరిష్కరించినపుడు, కాంగ్రెసులో వ్యతిరేకవర్గానికి సంతృప్తికి మారుగా మరింత మాత్సర్యమే కలిగింది.

బకింగ్‌హామ్ కర్నాటిక్ మిల్లుల సమ్మె సందర్భంగా ఏంథోనీ అనే ఆయన అరెస్టయి ఉండెను. ప్రకాశంగారు, కచేరి గదిలోకి వెళ్ళిన మొదటిరోజునే ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆయన పేరు బిషప్‌గారు) ఆయన్ను చూడ్డానికి వచ్చి మర్యాదగా, సూటిగా రెండు ప్రశ్నలు వేశారు.

మొదటిది - "మీరు ముఖ్యమంత్రి అయ్యారు గనుక, కమ్యూనిస్టుల విషయమై ప్రభుత్వం పాలసీ (నీతి)లో ఏవైనా మార్పులు కలుగవలెనా?" అన్నది.

అది విని, ప్రకాశంగారు, "నీవు లా అండ్ ఆర్డరుతో సంబంధించిన వాడవు కదా! రాజకీయ పార్టీల పేర్లతో సంబంధ మెందుకు? లా అండ్ ఆర్డర్, పార్టీలతో సంబంధం లేకుండానే అమలు పరచవలె గదా!" అన్నారు.

ఆ తర్వాత బిషప్ వేసిన రెండవ ప్రశ్న - "బకింగ్‌హామ్‌ కర్నాటిక్ మిల్లు సమ్మెలో కొందరిని తన వెంటబెట్టుకొని ఏంథోనీ అనే కార్మిక నాయకుడు అల్లరులు చేసి, చివరకు సమ్మెలో దింపాడు. అతడు ఇప్పుడు అరెస్టు అయి, ఖైదులో (under trial) ఉన్నాడు. అయితే, ఈ సమ్మె విషయమై ఏం చేయమన్నారు?" అన్నది.

అందుకు ప్రకాశంగారు, "ఆ ఏంథోనీ అనే ఆయనను ఇక్కడికి తీసుకురండి. పరిష్కారం చేద్దాము," అన్నారు.

దానిపై బిషప్, "ఈ విధంగా ఎన్నడూ జరగలే దండీ!" అన్నాడు.

"అయితే, కార్యదర్శి నీకు కావలసిన ఆర్డర్ల నిస్తాడులే," అన్నారు ప్రకాశంగారు.

కాని బిషప్, "సర్లెండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఏంథోనీని ఇక్కడికి ఎప్పుడు తీసుకు రమ్మాన్నారు?" అని అడిగాడు.

"వెంటనే తీసుకురండి," అన్నారు ప్రకాశంగారు.

ఒక రెండుగంటల తర్వాత, బిషప్ ఏంథోనీగారితో ప్రకాశంగారి గదిలో హాజరయ్యాడు. ప్రకాశంగారు సమ్మె వివరాలు అన్నీ తీసుకొని, మిల్లు యజమాన వర్గంతో మాట్లాడి రెండు మూడు రోజులలో ఆ సమ్మె సమస్యను పరిష్కరించేశారు.

గాంధీగారి ప్రశంస

ఇటువంటి పరిస్థితులలో సంవిధాన సభకు ఎన్నికలు జరపవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వారు కొందరి పేర్లు పంపించి, వారిని చెన్నరాష్ట్ర శాసన సభవారు ఎన్నుకో వలసిందని సూచించారు. అందులో చాలా మంది నిజంగా గొప్పవారు కాబట్టి, (అందులో ఎస్. రాధాకృష్ణ, అల్లాడి కృష్ణస్వామి అయ్యరు గారల పేర్లు ఉన్నవి.) ఎన్నికలు జరిపించడం అంత కష్టం కాకపోయింది. అయితే, ప్రకాశంగారు - ఈ ఎన్నికయిన వారిలో సామరస్యం కోసం, కాంగ్రెసు పార్టీలో తమకు ఎదురు పక్షం ఉన్నవారికి స్థలాలు వదలి పెట్టడం జరిగింది. అయితే వారు ఎన్నికయిన తర్వాత పదే పదే ఢిల్లీకి వెళ్ళి, అదేపనిగా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంలో ప్రకాశంగారిమీద చాడీలు చెబుతుండేవారు.

ముఖ్యంగా ఖాదీ స్కీము విషయమై వారు అక్కడ చెప్పగా, ప్రకాశంగారు - తాము అమలు జరుపుతున్న గ్రామ సౌభాగ్య ఉద్యమాలను, ఫిర్కా అభ్యుదయము, ఖాదీ ఉద్యమము, ఉత్పత్తి కొనుగోలు దారుల సహకార ఉద్యమము మొదలైన వాటిని అన్నిటినీ గాంధీగారికి బోధపరచడానికి ఒక అధికారిని పంపించారు. గాంధీగారు వాటిని చూసి, తమ అభిప్రాయ ప్రకారంగానే స్కీములు నడుస్తున్నాయని సంతోషించారు. ఖాదీ విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఆయన ఖాదీ కేంద్రాలలో, ఖాదీ అభివృద్ధి నిరోధకమైన మిల్లులను ప్రకాశంగారు నిషేధించినందుకు ప్రత్యేకంగా అభినంధించారు. ప్రకాశంగారు నడిపిస్తున్న కార్యక్రమం జయప్రదమైతే భారతదేశ మంతటా అవలంబించడానికి మార్గదర్శి కాగలరని గాంధీగారు అన్నారు. ఆయనతో ఆ స్కీము వివరాలు చెబుతున్న ఉద్యోగి - ప్రకాశంగారికి ఇచ్చిన సలహా ప్రకారంగానే, ఆ మరునాడు డిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రధానిగా పదవి స్వీకరిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూగారికి కూడా ఈ స్కీము అమలు పరచవలసిందని సలహా ఇమ్మనగా, గాంధీగారు "ఓయి వెఱ్ఱివాడా! ఇటువంటిది ప్రకాశంగారి వంటివారే చేయగలరు. పండిట్ జీ కాదు," అని బదులిచ్చారు. ప్రకాశంగారు మిల్లుదారము ఖాదీ కేంద్రాలలోకి రాగూడదని చేసిన నిషేధము, చెన్నరాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మర కుదుళ్ళను తిరస్కరించడం అనే రెండు పనులను గాంధీగారు సంపూర్ణంగా బలపరుస్తూ 'హరిజన్‌' పత్రిక కని ఒక వ్యాసం వ్రాశారు. కానీ, అది అచ్చయ్యే సమయంలో, ఆ విధంగా ప్రకాశంగారిని పొగడడం తనకు మంచిది కాదని రాజాజీ చెప్పుకోవడం వల్ల, గాంధీగారు దాన్ని ప్రకటించడం మానుకున్నారని అక్కడున్నవారు, అది తెలిసినవారు చెప్పారు. అయితే ప్రకాశంగారికి మాత్రం ఆయనను బలపరుస్తూ గాంధీగారు ఉత్తరం వ్రాసి పంపించారు. దాన్ని ఏ కారణంచేతో ప్రకాశంగారు పార్టీ మీటింగులో చదవలేదు. కాని, శాసన మండలిలో బడ్జెట్టుకు జవాబిస్తూ, గాంధీగారి ఉత్తరం యావత్తూ చదివి వినిపించి, తాను అధిష్ఠానవర్గానికి వ్యతిరేకంగా తన త్రోవను తానొక్కడే పోతున్నాడన్న వాదం ఆధార రహితమని చెప్పారు.

ప్రకాశంగారి ఆత్మగౌరవం

అయితే ఏమి? పార్టీలో ఎదురు పక్షం వారంతా అప్పటికే రాజకీయంగా తమకు ప్రకాశంగారిపై గల వైముఖ్యంతోపాటు, గ్రామ స్వరాజ్య ఫిర్కా అభ్యుదయ, ఉత్పత్తి క్రయవిక్రయ సహకార సంఘ ఉద్యమములు, ప్రత్యేక ఖాదీ ఉద్యమము మొదలైన వాటివల్ల వ్యక్తిగతంగా నష్టపడే మధ్యవర్తులకు సహాయదారులుగా ఉన్న శాసన సభ్యుల బలవత్తరమైన వైమనస్యతా కలిసి, ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉండగూడదన్న నిశ్చయానికి వచ్చేశారు.

చివరి రోజులలో రాజాజీ వర్గంవారికి రెండు మంత్రి పదవులు ఇచ్చి మంత్రివర్గాన్ని విస్తృత పరిస్తే అది నిలిచి ఉంటుందని, మొదట వారికీ మంత్రివర్గంలో స్థాన మిచ్చే ఉద్దేశం ఉండినందువల్ల, ఈ పరిస్థితులలో వారు మంత్రివర్గంలో చేరడానికి ఒప్పుకున్నపుడు తప్పకుండా ఆ రెండు స్థానాలు ఇస్తామన్నారు.

పేర్లు అడిగేసరికి, మూడు స్థానాలు కావాలన్నారు. సంఖ్యా బలాన్నిబట్టి చూస్తే వారికి మూడు స్థానాలు చాలా హెచ్చు. అయినా సరేనని మూడు స్థానాలు ఇవ్వబోయేసరికి, నాలుగు కావాలని కబురు చేశారు, నాలుగు ఇవ్వకపోతే కామరాజ నాడారుగారితో చేయి కలుపుతామన్నారు. ప్రకాశంగారు - ఇటువంటి బేరంలోకి దిగి ముఖ్య మంత్రి పదవి నిలబెట్టుకోవడం ఆత్మగౌరవానికి భంగకరమన్నమాట అలా ఉంచి, ప్రజారాజ్య తంత్ర ప్రక్రియకు అపారమైన నష్టం వస్తుందని అందుకు అంగీకరించక, మంత్రివర్గ పతనమే శ్రేయస్కరమని - దానినే అంగీకరించారు.

వృత్తి విద్యాసంస్థల్లో విద్యార్థులను చేర్చుకొనే సమస్య

ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉన్న రోజులలో, వైద్య, ఇంజనీరింగు కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశం పెద్ద సమస్య అయింది. ఉద్యోగాలలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించినట్టే, ఈ రెండు రకాల వృత్తి విద్యల కాలేజీలలోను బ్రాహ్మణులను వారి జనాభా నిష్పత్తికి మించి చేర్చుకోరాదని ఒక ఏర్పాటు ప్రకాశంగారు మంత్రివర్గం అధికారంలోకి వచ్చేనాటికి అమలులో ఉంది.

మంత్రివర్గ పాలన ప్రారంభమయిన మరి రెండు నెలలకు కాలేజీలు తెరవబడతాయి. కాబట్టి, వెంటనే ఈ సమస్య పైకి వచ్చింది. విద్యలో ముఖ్యంగా సాంకేతిక విద్యలో కులమువారీ నిష్పత్తులపైన విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు ప్రభుత్వం పరిమితంచేస్తే, ఆ నిష్పత్తులను అడిగేవారికే రానురాను నష్ట కలుగుతుందనిగాని, దేశంలో గల మేధాశక్తి భస్మం అవుతున్నదని గాని, ఈ నిష్పత్తి కోరేవారు గ్రహించ లేదు. విద్యార్థుల మేధాశక్తికి వారు పరీక్షలలో తెచ్చుకున్న మార్కులు ఒక విధమైన ప్రమాణము. ఆ ప్రమాణం నూటికి నూరుపాళ్ళు సరి అయిన ఫలితం ఇచ్చినా, ఇవ్వకున్నా, దానికి పర్యాయంగా వేరే ప్రమాణం దొరకలేదు. అందుచేత, ప్రకాశంగారు ఈ కాలేజీలలో ఒక పద్ధతి చెప్పారు. నూటికి యాభై సీట్లు మొట్టమొదట విద్యార్థుల మార్కుల ననుసరించి ఇవ్వవలసిందనీ, తక్కిన యాభై సీట్లను అప్పుడు అమ లులో ఉన్న కులమువారీ నిష్పత్తి ప్రకారము ఇవ్వవలసిందనీ కేబినెట్ ముందు తీర్మానం ప్రతిపాదించారు. అయితే, కేబినెట్‌లో మంత్రులు నూటికి ఇరవైచోట్లే మార్కులనుబట్టి యివ్వవలసిందనీ, మిగిలినచోట్లు కులమువారీ నిష్పత్తి ప్రకారము ఇదివరకు లాగానే ఇవ్వవలసిందనీ తీర్మానించారు.

న్యాయ, కార్యనిర్వాహక శాఖల విభజన

ప్రభుత్వాలు, తమ పలుకుబడిని నిలబెట్టుకొనేందుకు, లా అండ్ ఆర్డర్‌తో సంబంధించిన అనేక విషయాలను, న్యాయస్థానాలకు వదలక, తమ చెప్పు చేతలలో ఉన్న మాజిస్ట్రేట్ల చేతులలో ఉంచడం మామూలు. అందుచేత, కాంగ్రెసువారు దాదాపు నలభై, యాభైఏండ్ల నుంచి ఎగ్జిక్యూటివ్‌నుంచి జ్యుడిషియరీని (ప్రభుత్వ కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయశాఖను) సంపూర్ణంగా విడదీయవలసిందని కోరుతూ వచ్చారు.

రాజాజీ మంత్రివర్గంలో 20-3-38 న ఈ ప్రశ్న ఉదయించినపుడు, "ఈ సమస్య పరిష్కరించడానికి ఆర్థిక సంబంధమైనవీ, పరిపాలనా సంబంధమైనవీ అయిన అనేకమైన క్రొత్త సమస్యలు ఉద్బవిస్తాయి గనుక, వీటిని విడదీయాలని అసెంబ్లీలో ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరిస్తున్నది" అని కాబినెట్ తీర్మానం వ్రాయించారు.

కానీ, ప్రకాశంగారు 1946 లో ముఖ్యమంత్రి కాగానే, భాష్యంతో చెప్పి, కుట్టి కృష్ణమేనోన్ అనే న్యాయవాది అధ్యక్షతను ఏర్పరచిన ఉపసంఘం సలహా ప్రకారం కాంగ్రెసువారి చిరకాల వాంఛను తీర్చి, ఆ విభజనను ఏమీ ఆర్భాటం లేకుండా అమలులోకి తెచ్చారు.

ప్రకాశంగారి దృఢ చిత్తత

పార్టీలో ఉన్న తమ ఎదురు పక్షంవారు చేస్తున్న ప్రచారమెంత ముమ్మరంగా ఉన్నా, ప్రకాశంగారు కొంత సమత, సహన భావాలను ప్రదర్శించేవారు. 1947 మార్చిలో, పార్టీలో ఆయనకు ఎదురుపక్షంలో ఉన్న మూడు వర్గాలవారూ ఏకమయ్యారనీ, ఆయనమీద విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదిస్తారనీ పత్రికలలో వార్త పడగా శాసన సభలో ప్రతిపక్షంవారు ఆ ప్రశ్న లేవదీశారు.

ఆ విషయంపై మాట్లాడుతూ ప్రకాశంగారు ఇలా అన్నారు:


"మాలో మాకు భేదాలున్నాయని మీరంతా అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను వినండి. ఈ కాంగ్రెసుపార్టీకి తనపని ఎలాగు చేసుకోవాలో తెలుసు. భేదాలు ఒకప్పుడు ఉంటాయి. ఒకప్పుడు అవి అపమార్గం కూడా పట్టవచ్చు. కానీ, అధ్యక్షా! నే నొకటి మనవి చేస్తున్నాను. ముఖ్యమైన విషయాలపై మా పార్టీలో భేదాభిప్రాయాలు లేవు. ఈ మంత్రివర్గం ఎన్నాళ్ళుంటుందని ప్రతిపక్షంవారెవరో అడిగారు. ఇప్పుడిక్కడ ఉన్న మంత్రులు రేపు లేకపోయినా, రేపు వచ్చేవారూ కాంగ్రెసువారేగాని ఇంకొకరు కారు. మాకు భేదాలు లేవని చెప్పాను. అందుచేత రేపు వారు కూడా ఇప్పుడు నడిపిస్తున్న విధానాలనే నడిపిస్తారు."

ప్రకాశంగారు ఈ మాటలు గాంధీగారు తమ స్కీములను ఆమోదించి, ప్రశింసించారన్న ధైర్యంతో చెప్పగలిగి ఉంటారు. కానీ, పార్టీలో తమ కెదురుగా ఉన్నవారు తమ్ము కాదన్నపుడు గాంధీగారు మరి మాట్లాడరన్న సంగతి ఊహించుకోలేకపోయారు. నా వంటి వాళ్ళము కూడా అది ఊహించలేకపోయాము.

ప్రకాశంగారు ఇంకా ఇలా అన్నారు:

"నేను ఈ ప్రజారంగంలో 26 సంవత్సరాలగా పనిచేస్తూ వస్తున్నాను. ఈ శాసన సభలో ప్రధాన మంత్రిగా కూర్చుండడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పబ్లిక్ రంగంలో నేనా పని చేయలేదు. ప్రజాసేవకుడిగానే నేను పరిపాలన సాగిస్తున్నాను. నన్నిక్కడికి పంపించిన ప్రజలకు నేను ఎలా రాజునౌతాను? మినిస్టర్ అన్న ఇంగ్లీషు క్రియకు 'ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చు' అని అర్థము. అది తీర్చేవాడు మినిస్టరు. మినిస్టరు ప్రజలకు సేవకుడు. ఆ సేవాధర్మం సరిగా నిర్వహించకపోతే, మినిస్టర్లు అవతలికి పోవలసిఉంటుంది. అటువంటి సేవ చేసే సమయంలో మాలో మా కేవైనా భేదాభిప్రాయాలు వస్తే వాటిని సర్దుకొనే సమృద్ధి మాలోనే ఉదయించాలి. కాని, ఈ భేదాల దుష్ప్రభావం పరిపాలనమీద పడకూడదు"

ఈ సందర్భంలో గాంధీగారు, ప్రకాశంగారికి వ్రాసిన ఉత్తరం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది యిది:

"కేంద్రప్రభుత్వంవారు మీకు, మీ ప్రభుత్వం మరకదుళ్ళు తప్పక తీసుకోవాలి అని వ్రాసిన ఉత్తరం - మీ మీద సవాలు, చర్ఖా (రాట్నం) మీద చేసిన సవాలు, నోరూ వాయీలేని చెన్నరాష్ట్ర ప్రజలపై చేసిన సవాలు. ప్రజలు మీ పక్షమే ఉన్నారని నేను భావిస్తున్నాను. అందుచేత కేంద్రప్రభుత్వంవారు చేసిన సవాలును మీరు అంగీకరించండి. (అంటే, మర కదుళ్ళను తిరస్కరించమని భావము) చెన్నరాష్ట్ర ప్రజలకేగాక, భారతీయ మానవ లోకమంతటికీ మీరు ఉపకారం చేసిన వారవుతారు."

గాంధీగారు తమ స్కీముల విషయమై ఇంత గట్టిగా వ్రాయడంచేతనే, తాము లేకున్నా తమ స్కీములు నడుస్తాయని ప్రకాశంగారు భావించారు.

మొదట్లో ఫిర్కా అభివృద్ధి ఉద్యమం పెద్దదేమోనని గాంధీగారు అభిప్రాయ పడ్డారు. అయితే, ప్రకాశంగారు ఇరవైఐదు ఫిర్కాలలో పని సాగించడం ఒక పెద్ద కష్టం కాదన్నారు. గాంధీగారు తృప్తిపొందారు. తనకు స్కీములు వివరించి చెప్పడానికి వచ్చిన అధికారి (టి. రాఘవరావుగారి)తో, గాంధీగారు, "ప్రకాశంగారి స్కీము అంతా ఇదివరకు ఎవరూ అమలుపరచడానికి పూనుకోలేదు. చెన్నరాష్ట్రం ఈ ప్రణాళికను సాధించి జయం పొందితే, భారతదేశమంతా దాన్ని సాధించి జయం పొందగలిగిందన్న మాటే. తమపైన వ్యతిరేక భావం నాకు లేదని ప్రకాశంగారితో చెప్పు" అన్నారు.

ఈ విషయాలు ఇలా ఉంచి, మరొక విషయంలోకి వెళదాము. 1947 మొదటే పబ్లిక్ సేఫ్టీ ఆక్ట్ పాసు చేయవలసివచ్చింది. దీని నమునా కేంద్రనుంచి వచ్చింది. బిల్లు ప్రవేశపెట్టేముందు ఎవరినైనా ఒకరిని డిటెన్షన్ (కోర్టులో విచారణ జరపకుండా నిర్భంధము)లో ఉంచినట్టయితే, న్యాయా న్యాయాల పరిశీలనకై సలహా సంఘం (ఎడ్వైజరీ కౌన్సిల్) ఏర్పాటు చేయడానికి ఈ బిల్లులో ఒక సెక్షన్ కలిపి ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ విధంగా సలహా సంఘానికి ఏర్పాట్లు ప్రప్రథమంగా చెన్నరాష్ట్రంలోనే జరిగాయి. విదేశీయుల పరిపాలనలో జైళ్ళలో మగ్గిన కాంగ్రెసువాదులకు, ఇతువంటి శాసనం గొంతుకలో పచ్చి వెలగకాయ వంటిది. సెప్టెంబరులో పదవీ స్వీకారం చేసిన కేంద్ర మంత్రివర్గంలో హోమ్‌శాఖామాత్యులైన సర్దార్ వల్లభభాయ్ పటేలుగారు ఈ బిల్లు నమూనా పంపిస్తూ, చెన్నరాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన ప్రకాశంగారికి ఒక ఉత్తరం వ్రాశారు. దాని సారాంశం ఇది.

"రాజ్యపరిపాలన స్వీకరించినవారికి, అనధికారంగా పూర్వం వారు చెప్పిన సూత్రాలు కొన్ని, పరిపాలనా సమయంలో వర్తించవు. అధికారంలో ఉన్నపుడు సంఘ రక్షణ, ఆత్మరక్షణ చేసుకోవలసిన అగత్యం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాన్ని పడద్రోయదలచుకొన్న వారు, సంవిధానమందు (కాన్సిట్యూషన్‌లో) చెప్పిన ప్రజాతంత్రానికి (డెమెక్రాటిక్ ప్రాసెస్‌కు) విరుద్ధంగా ప్రవర్తించినపుడు ప్రజాతంత్ర ప్రాతిపదికపైన నిర్మితములైన శాసనాలు వారి ప్రవర్తనను లొంగదీయడానికి సరిపోవు. సంవిధానానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు అమలులో ఉన్న శాసనాలు చదువుకున్నవారే అయిఉంటారు. పట్టుబడకుండా సంవిధాన వ్యతిరేకమైన (అన్ కాన్‌స్టిట్యూషనల్) పద్దతులు అవలంబించినపుడు, వెంటనే వారిని అదుపులోకి తేవలసిఉంటుంది. అయితే, వారి స్వేచ్ఛ కూడా ప్రధానంగా సంరక్షించవలసిన హక్కే కాబట్టి, న్యాయవిరుద్దంకానిపద్ధతిలో పోవడం ప్రతి ప్రభుత్వానికీ అత్యవసరము."

దేశ పరిస్థితులే ఇటువంటి శాసనాలకు మూలకారణము. కాంగ్రెసు శాసన సభ్యుల పార్టీ సమావేశంలో తర్జన భర్జన కొంత జరిగిన తర్వాత, పటేలుగారి ఉత్తరాన్ని ప్రకాశంగారు చదివి వినిపించగా అందరూ బిల్లును ఆమోదించారు. శాసన సభలో, ప్రతిపక్షులు సంప్రదాయానుసారం అభ్యంతరాలు చెప్పినా, మొత్తంమీద ఆ బిల్లు నిరాటంకంగానే ఆమోదింపబడింది.

రాజాజీ హాలు

పోర్టు సెంట్ జార్జిలో శాసన సభ జరుపుకునేందుకు, 1919 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ఆమోదమయిన తరువాత, ఒక హాలు నిర్మించారు. కాని, అది విస్తృతమైన అప్పటి శాసన సభను జరపడానికి ఎంత మాత్రమూ చాలదు. అది అలా ఉండగా, అప్పటికి శాసన సభ్యులకు సరి అయిన వసతి గృహాలు లేవు.

నగరంలో మౌంటురోడ్డు నానుకొని గవర్నరుగారి బంగళా ఆవరణ ఉండేది.

యుద్ధానంతరం గవర్నరు ఆ బంగళాలో నివసించేవారు కారు. చెన్నపట్నానికి ఎనిమిది, తొమ్మిది మైళ్ళ దూరంలో ఉండే గిండీలో నివసించేవారు.

ఇక్కడ గవర్నరు బంగళాను ఆనుకొని - విందులు జరుపుకొనేందుకు పెద్ద పెద్ద స్తంభాలతో ఒక ప్రత్యేకమైన భవనం ఉండేది. శాసన సభ సెనేటు హాల్లో జరుగుతున్నపుడు శాసన మండలి సమావేశాలు ఈ విందుల భవనంలో జరుగుతూండేవి. గవర్నరు ఆవరణ మొత్తం నూట పది ఎకరాలు ఉండేది. యుద్ధకాలంలో గవర్నరుకు దగ్గరగా ఉండవలసిన ఒకరిద్దరికి కూడా చిన్న భవనాలు ఆ ఆవరణలోనే నిర్మింపబడ్డాయి.

ఈ భవనంతో సహా, గవర్నరుగారు తన మౌంటురోడ్డు భవనము, ఆవరణ ప్రభుత్వ ప్రయోజనాలకని ప్రభుత్వానికి అప్పజెప్పాలని, గవర్నరును రాజాజీ తాము ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కోరారు. ఆ కోరిక ఫైలు రూపంలో గవర్నరు దగ్గరికి వెళ్ళింది. గవర్నరు దానిపైన, "నేను ఈ భవనము, ఆవరణ ఏదీ ప్రభుత్వానికి అప్పగింపదలచుకోలేదు. దీనికింత ఫైలు ఎందుకు పెంచారు?" అని వ్రాశారు. దాంతో ఆ ప్రసక్తి అప్పుడే వదలుకున్నారు.

ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల తర్వాత, ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినపుడు, అప్పటి గవర్నరు 'నై' గారితో ఆ ఆవరణ అంతా ప్రభుత్వానికి అప్పజెప్పవలసిందని చెప్పారు. అ రోజున గవర్నరుగారికి - ప్రకాశంగారు, వారితోబాటుగా నేను - ఫోర్టులోని సచివాలయం, శాసన సభ ఎంత ఇరుకుగా ఉన్నవో చూపించి, మౌంటురోడ్డు భవనంలోకి వెళ్లాము. గవర్నరుకు బంగళా అన్ని అంతస్తులు చూపించాము.

విందుల హాలు ప్రస్తుతం గవర్నరుగారికి ఏమీ ఉపయోగం లేకుండా ఉన్నదనీ, ప్రభుత్వానికి అనేక విధాలుగా ఉపయోగకరం అవుతుందనీ చూపించాము. ఇంతేగాక, శాసన సభ్యుల వసతి సౌకర్యాలకు గల ఇబ్బందులను గూడా చెప్పాము. ఆయన ఆలోచించుకొనడానికి రెండు, మూడు రోజులు వ్యవధి కోరారు.

తరువాత ఆయన, "వాడుకొనేందుకైతే ఇస్తాము. మీ ప్రభుత్వపు ఆస్తి క్రిందకు ఎందుకు ఇవ్వా"లని ఒక ప్రశ్న లేవదీశారు. అప్పుడు, "అ విధంగా మేము వాడుకొంటే మరమ్మత్తులు వగయిరా ఖర్చులు గవర్నరు అకౌంటులోనే పెట్టుకొంటారా?" అని ప్రశ్నించాము. "వాడుక మీది, ఖర్చు నాది - ఎలా కుదురుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

"హక్కు గవర్నరు దయితే ప్రభుత్వంవారు మరమ్మత్తుల కెందు కంత ఖర్చుపెట్టాలి? అందులో క్రొత్త భవనాలు కట్టుకోవచ్చా, కూడదా? ఇంతకూ గిండీలో ఉండే గవర్నరుగారు పది మైళ్ళ దూరాన, తనకు వాడుకకు అక్కరకురాని మౌంటురోడ్డు భవనంపై ఎందుకు ఖర్చు పెట్టాలి? అపుడు, గవర్నరు కిచ్చే అలాట్‌మెంటు ఈ ఖర్చులు భరించడానికి సరిపోతుందా?" - ఇత్యాది అనేక ప్రశ్నలు అనవసరంగా లేస్తాయనీ, ఇంతకూ గవర్నరు నివసించే బంగళాలు, భవనాలు పాతపద్ధతి ప్రకారం గవర్నరు పేరిట ఉన్నా, అవికూడా చెన్నరాష్ట్రపౌరులు పన్నుల మూలంగా ఇచ్చిన డబ్బుతో కొనబడినవే అనీ, మౌంటురోడ్డు ఆవరణ కొనినప్పటి లెక్కలు మొదలైనవి ఆయనకు ఒక రెండుగంటలు ప్రకాశంగారు ముఖాముఖి చర్చలో తెలియజేశారు.

ఆయన మరల, నిర్ణయించుకోవడానికి మరికొంత వ్యవధి అడిగారు.

ఆ తర్వాత, మరొకమారు ఈ విషయం ఒక పావు గంటసేపు మాటాడిన తర్వాత, మౌంటురోడ్డులోని గవర్నరు బంగళా, యావదాస్తీ ప్రభుత్వంపేర నమోదు చేయడానికి ఆర్డరు జారీ అయింది.

ఇది జరిగిన కొంత కాలానికి ప్రకాశంగారి ప్రభుత్వం పడిపోయింది. తర్వాతి ప్రభుత్వంవారు, ఈ ఆస్తి నంతటినీ ప్రభుత్వపరంగా వ్రాయించిన ప్రకాశంగారి విషయం మరచిపోయి, ప్రయత్నించి విఫలులైన రాజాజీ పేరిట ఆ విందుల హాలుకు 'రాజాజీ హాలు' అని నామకరణం చేశారు.

ఆ పేరుతోనే అది యిప్పటికీ ఉన్నది.

విదేశాల్లో ఉన్నత విద్యకు స్కాలర్ షిప్పులు

ప్రకాశంగారి ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది రోజులకు ఒక ఫైలు వచ్చింది. పట్టభద్రతానంతర ఉన్నత విద్యా శిక్షణకై ప్రభుత్వం వారిచ్చే వేతనాలపైన, నూట నలభై మందిని విదేశాలకు పంపడానికి కేంద్ర ప్రభుత్వం వారి ప్రతిపాదన అందులో ఉన్నది. రెండు వందలపైగా విద్యార్థుల పేర్లు, వారి అర్హతలు వ్రాసి, అందులో ప్రభుత్వానికి తోచిన నూట నలభై మంది పేర్లు [2] ఖాయం చేయాలి.

మామూలు ప్రకారం సచివాలయంవారు, వారికి తోచిన సూచనలు చేశారు. అటువంటి వాటిలో సాధారణంగా మంత్రులు వ్యక్తి గతంగా జోక్యం కల్పించుకోరు. ప్రకాశంగారి సంతకం కోసం ఆ ఫైలు అందిస్తున్నప్పుడు రెండు మూడు కాగితాలు అటూ ఇటూ తిప్పడంలో విద్యాశాఖ మంత్రి వ్రాసిన మినిటు (ఫైలుమీద మంత్రులు వ్రాసే అభిప్రాయం లేక నిర్ణయము) కంటబడింది. అందులో ఒక పంక్తి కంట్లో కొట్టినట్టుగా టైపయి ఉంది. అది - "నెంబరు - పేరుగల అభ్యర్థి బ్రాహ్మణుడు. అతని పేరు తీసివేయండి. ఈ నెంబరుగల ఆసామి పేరు ఇక్కడ కలపండి," అని.

జస్టిస్‌పార్టీ మంత్రి అయినా బహుశ: అలా వ్రాసి ఉండడు. ఎందు కిలా వ్రాశాడని పైలులో ఆ పేర్లుగల విద్యార్థుల అర్హతలు చూశాము.

తీసివేయవలసిందనే సూచనగల అభ్యర్థి ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆనర్సు ఫస్ట్ క్లాస్‌లో పాసయిన విద్యార్థి. రెండవ అభ్యర్థి దక్షిణ జిల్లాలలోంచి మూడవ క్లాసులో పాసయివచ్చిన విద్యార్థి. ప్రకాశంగారు విద్యామంత్రిగారి సూచన కూడదని, తిరిగి సచివాలయం వారు చెప్పిన సూచననే సమర్థించారు.

కార్య నిబంధనల ప్రకారం ఈ ఫైలు విద్యామంత్రికి వెళ్ళింది. అప్పటికి ఆయన వివేకం తెచ్చుకొని, ప్రకాశంగారు చెప్పిన దానికి ఒప్పుకొని సంతకం పెట్టేశాడు. ఆ మంత్రే మెడికల్, ఇంజనీరింగు కాలేజీలలో మార్కుల ప్రకారంగా నూటికి యాభై స్థలాలు ఉంచాలని చెబితే కాదని, కులము వారీగా ఉండాలని వాదించిన వ్యక్తి.

వానియంబాడి అల్లరులు

ఒక రోజు తెల్లవారు జామున మూడు గంటలప్పుడు, ప్రతిపక్ష నాయకుడైన ఇస్మాయిల్ సాహేబుగారు, మరి కొంతమంది ముస్లిం సోదరులూ కలిసివచ్చి, ప్రకాశంగారిని నిద్రనుంచి లేపారు. వారు - వానియంబాడిలో హిందువులకు, ముస్లింలకు తగాదా వచ్చి, ముస్లింల తోళ్ళ కర్మాగారాలు, గొడొనులు తగుల పెట్టారని చెప్పి, అగ్నిజ్వాలలు రాత్రి మొదలు అప్పటి దాకా ఆకాశం ఎత్తున లేస్తున్నాయనీ, కనుక ప్రకాశంగారు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫోన్‌చేసి వానియంబాడీ ముస్లింలకు తక్షణ రక్షణకు ఏర్పాట్లు చేయించవలెనని ప్రార్థించారు.

ప్రకాశంగారు, "ఇస్మాయిల్ సాహేబుగారు! మీరు ప్రతిపక్ష నాయకులు. నేను ముఖ్య మంత్రిని. ఈ పని మన ఇద్దరిదీ. మనము లేనిదే ఫోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఏమి చేయగలడు? వెంటనే మనం ఇక్కడనుంచే బయలుదేరుదాము" అని వారితో చెప్పి, వెంటనే కారులోకి దూకారు. తాము అక్కడికి బయలుదేరి వెళుతున్నట్టుగా ఇన్‌స్పెక్టర్ జనరలుకు ఫోను చేయించారు.

వారిద్దరు వానియంబాడి చేరకునేసరికి, పట్టపగలు సూర్య కాంతిలా పొగలు కమ్ముకుంటున్న ఎఱ్ఱని అగ్ని జ్వాలలు ఎత్తుగా లేస్తూనే ఉన్నాయి.

ఆ సాయంకాలం లోపున అక్కడ శాంత పరిస్థితులు కల్పించి, రాత్రికి మళ్ళీ ప్రకాశంగారు చెన్నపట్నం తిరిగి వచ్చారు.

ఇటువంటి సాహసం ఆయన కుండడంచేతే, తర్వాత ఆయనపై విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చినపుడూ, ఆ తర్వాత ప్రకాశంగారు తమ్ము పదవిలోంచి దించివేసిన మంత్రులపై అధికార దుర్వినియోగం చేసిన నేరాలపై చర్చ జరిగినపుడూ ముస్లిం సభ్యుల సానుభూతి సంపూర్ణంగా ప్రకాశంగారి పైనే ఉండేది.

డాక్టర్ బి. విశ్వనాథ్

డాక్టర్ బి. విశ్వనాథ్, డైరక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా ఉండేవారు. ఆయన విజయనగర వాస్తవ్యుడు. ఇక్కడ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యే అవకాశాలు లేనందున, విదేశాలకు వెళ్ళి, వ్యవసాయ సంబంధమైన పెద్ద డిగ్రీలు పొంది, డిల్లీలోని పూసా వ్యావసాయిక మహా సంస్థకు పెద్ద అయ్యాడు. ఆ తర్వాత, యుద్ధ సమయంలో భోర్ కమిటీ అనే సంఘంలో దేశపు ఆహార, ఆరోగ్య విషయమై బాగా పరిశోధించినవాడు.

అంత పెద్ద అర్హతలుగల వానిని మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు పెద్దగా చేస్తే మనకు లాభిస్తుందని - ప్రభుత్వం ఆయనతో కొన్ని షరతులు కుదుర్చుకొని, డైరక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా నియమించింది. కృష్ణ, గోదావరి డెల్టాల భూసారం విషయంగాను, తంజావూరు డెల్టా భూసారం గురించీ చాలా పరిశోధనలు చేసి, నివేదికలు సమర్పించిన ఉద్యోగి ఆయన.

అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి - రాజపాళయానికి చెందిన టి. ఎస్. కుమారస్వామిరాజా, తరువాత ప్రకాశంగారి మంత్రివర్గ పతన కారకులలో ఒకడు. ఆ తరువాత ప్రకాశంగారిని పడద్రోసిన రామస్వామి రెడ్డిగారిని పడద్రోసి, 1949 లో తానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత 1950 లో ఒరిస్సా గవర్నర్‌గా ఉన్నాడు.

అప్పటి వ్యవసాయ కార్యదర్శి సుందరం అనే ఐ.సి.ఎస్. ఉద్యోగి.

కుమారస్వామిరాజాగారు, చాలా చీటీలను ఉద్యోగుల నియామకం, బదిలీలు, ప్రమోషన్ల విషయంగా ప్రతిరోజూ డాక్టర్ విశ్వనాథ్ గారికి పంపిస్తూ ఉండేవాడు. అది మొదట్లో మా కెవరికీ తెలియదు.

ప్రకాశంగారి గదిలోకి విశ్వనాథ్‌గారు చనువుగా వెళ్ళడము, రావడము సుందరంగారు కనిపెట్టి కోపం తెచ్చుకుంటూండేవారు.

కుమారస్వామిరాజావారు పంపించిన సిఫారసులలో కొన్ని మాత్రమే డాక్టర్ విశ్వనాథ్‌గారు కార్యరూపంలో పెట్టగలిగేవారు. హెచ్చు భాగం త్రోసివేయడంవల్ల కుమారస్వామి రాజాకు కూడా విశ్వనాథ్‌గారిపై ఆగ్రహం పెరుగుతూ వచ్చింది.

ఈ అన్ని కారణాలు కలిపి - ఒక రోజున ఏవో చిల్లర కారణాలుగల ఒక ఆరోపణ డాక్టర్ విశ్వనాథ్‌గారిపై చేసి, ఆయనను డిస్మిస్ చేయవలసిందని సుందరంగారి నోటుపైన, కుమారస్వామి రాజాగారు అంగీకార సూచకంగా సంతకం పెట్టారు.

ఆ ఫైలు ప్రకాశంగారికి వచ్చింది.

అంతకు కొంచెం ముందుగానే ఈ వాసన తగిలి, డాక్టర్ విశ్వనాథ్‌గారు - తనకు కుమారస్వామి రాజాగారు పంపిన సిఫారసు చీటీలు ఒక వందదాకా తెచ్చి, వాటిలో పదో పదిహేనో తప్ప తక్కినవి అంగీకరించక పోవడంవల్ల తనకా ఇబ్బంది కలుగుతున్నదనీ, ఢిల్లీలో అంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు రాలేదనీ, తా నీ ఉద్యోగం వదలుకుంటాననీ చెప్పడానికి ప్రకాశంగారి దగ్గరికి వచ్చాడు.

ఇంతట్లో సుందరంగారినుంచి ఆయనను డిస్మిస్ చేయాలని ఫైలు మీద ఫైలు వచ్చింది. ఏ ఫైలులోను రెండు, మూడు కాగితాల కంటె ఎక్కువ ఉండేవి కావు. వారే నేరారోపణ చేయడము, వారే తీర్పు చెప్పివేయడము - అంతమాత్రమే అందులోని విషయము.

ఈ వ్యవహారం క్రమబద్ధం కానందున, విషాద పరిణామాలకు దారి తీయకుండా ఆపివేయడానికి వీలైనది.

పార్లమెంటరీ సెక్రటరీలు

1937 లో మంత్రివర్గం ఏర్పడినపుడు, ఇంగ్లండులో వలెనే ఇక్కడా పార్లమెంటరీ సెక్రటరీల పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. పరిపాలనలో వీరికి భాగం కల్పించాలని ప్రకాశంగారి ఉద్దేశము. కానీ, పై ఉద్యోగులుగా ఉన్న ఐ.సి.ఎస్. వారు దీనికి సంపూర్ణంగా వ్యతిరేకులు. వారి అభిప్రాయ ప్రకారంగా మంత్రులు ఒక రోజు ఉండి, మరొక రోజు వెళ్ళేవారు గనుకా, తాము ముప్పైఏండ్ల బట్టి ఉద్యోగంలో ఉండడంవల్ల ప్రభుత్వపు పోకడలు పూర్వాపరాలు తెలియగలవు గనుకా, మంత్రులు వ్యవధిలేక చూడలెని కాగితాలను తామే చూసి, ప్రభుత్వమే ఆర్డరు జారీ చేసినట్టు చేసే హక్కు తమకు ఉండాలి.

ఈ అభిప్రాయ ప్రకారంగా నూటికి 75 ఫైళ్ళకుపైగా మంత్రులకు సంబంధం లేకుండా ఆర్డర్లు జారీ చేసే పద్ధతిలో పరిపాలన సాగుతూండేది. ప్రజారాజ్య సూత్రానికి ఎన్నికైన మంత్రులు ప్రభుత్వ పక్షాన నిర్ణయం తీసుకొని, ఆర్డర్లు జారీ చేస్తున్నారని ప్రజలు అనుకొనేవారు. వారి అభిప్రాయానికి ఈ అలవాటు వ్యతిరేకమైనది ఇటువంటి అలవాటు మన సచివాలయాలకు ఇంగ్లండునుంచి దిగుమతి అయింది. ఈ పద్ధతి తప్పు అని చెప్పడానికి నే నొక ఉదాహరణ చూపించాను.

పీనల్ కోడ్ ప్రకారం ప్రభుత్వపక్షాన కొన్ని ప్రాసిక్యూషన్లు (అనగా, మేజిస్ట్రేటు కోర్టులలో దోషులపై చర్యలు) తీసుకొనే ముందు, ప్రభుత్వంవారి శాంక్షను కావాలని ఆదేశింపబడి ఉన్నది. ప్రజాప్రభుత్వమనే సూత్రం అమలులోకి రాకపోయినా, 1914 లో, ప్రకాశంగారు ప్రాక్టీసు చేస్తున్న రోజులలో, వరదరాజులు నాయుడుగారనే వారిపైన రాజద్రోహం చేశారనే నేరం ఆరోపించబడి, మేజిస్ట్రేటు కోర్టులో చర్య ఆరంభమయింది.

విచారణ సమయంలో, ప్రభుత్వం - అనగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌వరకు ఫైలు వెళ్ళకుండానే, కార్యదర్శి సంతకంపైన చర్య ఆరంభమైనట్టు, కార్యదర్శి కోర్టులో దాఖలు చేసిన ఒక ఎఫిడవిట్టువల్ల బయట పడింది. ఈ విషయమై అప్పీలు వింటున్నప్పుడు హైకోర్టువారు ప్రభుత్వం అని చెప్పినచోట కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలరు ప్రమేయం లేకుండా ఏ ఆర్డరు జారీ చేయలేడనీ, అటువంటి ఆర్డరు చెల్లదనీ తీర్పు చెప్పారు.

అటువంటి పరిస్థితులలో, ప్రజా ప్రభుత్వ సూత్రం అమలు పరిచే మనదేశంలో మంత్రిదో, పార్లమెంటరీ సెక్రటరీదో అయినా అనుమతి లేకుండా - కార్యదర్శులు ఆర్డర్లు పాస్ చేయజాలరనీ, మంత్రులకు వ్యవధి లేనప్పుడు ఏ ఆర్డరు పాస్ చేయాలో, పార్లమెంటరీ సెక్రటరీల ఎరుకపైగాని, అనుమతిపైగాని కార్యదర్శులు వ్యవహరించాలనీ చెప్పిన అభిప్రాయంతో ప్రకాశంగారు సంపూర్ణంగా ఏకీభవించారు.

దానిపై, ఐ.సి.ఎస్. ఉద్యోగులందరూ కలిసి, పార్లమెంటరీ సెక్రటరీ అనే అతనికి ఫైలులో విషయం మాట అటుంచి, అసలు ఫైలు ముట్టుకొనడానికే హక్కు ఉండకూడదని వాదించారు. అసలు, కార్యదర్శులకు ఆర్డర్లు పాస్ చేసే హక్కు ఏ శాసన పూర్వకంగాను సంక్రమించలేదు. అయినా, రాజాజీ ప్రకాశంగారితో ఏకీభవించలేదు. కాని, 1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినపుడు, పార్ల మెంటరీ సెక్రటరీలకు ఆ హక్కును మంత్రివర్గంచేసే కార్యనిబంధనలకు లోబడి సంక్రమింపచేస్తారని అనుకున్నాము. అయితే ఆ సమయంలో శొంఠి రామమూర్తిగారు (ఐ.సి.ఎస్) ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన ప్రజాహితైక జీవి, న్యాయబుద్ది, విజ్ఞానము కలవాడే అయినా, ఇంగ్లీషు ఐ.సి.ఎస్. ఉద్యోగులకన్నా హెచ్చుగా ఐ.సి.ఎస్. తత్త్వం ఆయనలో ఉండేది.

ఈ సమయంలో నేను, ప్రకాశంగారికి ఇంగ్లండులో జరిగిన ఒక ఉదంతం చెప్పాను.

ప్రపంచ యుద్ధమప్పుడు దేశ సంరక్షణ నిబంధనల క్రింద ప్రభుత్వం, ఏ వ్యక్తినైనా దేశరక్షణకు ప్రతికూలుడుగా ఉన్నాడని భావించితే, ఏ విచారణా లేకుండా కారాగృహంలో ఉంచవచ్చుననే నిబంధన ఉండేది.

ప్రభుత్వం (అనగా మంత్రి) ప్రమేయం లేకుండానే ఒక వ్యక్తిని కారాగృహంలో ఉంచడానికి ఒక కార్యదర్శి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ వ్యక్తి ఇది అక్రమమని హైకోర్టులో రిట్ ఇవ్వవలసిందని పిటీషన్ దాఖలు చేసుకొన్నాడు. హైకోర్టువారు - ప్రభుత్వం, మంత్రి అన్నచోట కార్యదర్శి మంత్రి ప్రమేయం లేక ఎన్నడూ ఆర్డర్ పాస్ చేయలేడని తీర్పు ఇచ్చారు. [3]

1946 లో ఐ.సి.ఎస్. ఉద్యోగుల అభ్యంతరమే కాక, లోగడ 1938 లో పార్లమెంటరీ సెక్రటరీగా ఉన్నపుడు పార్లమెంటరీ సెక్రటరీలకు హక్కులు కావాలని వాదించిన మిత్రుడు, 1946 లో మంత్రి అయి, అ హక్కులు కూడదని వాదించ సాగాడు.

ప్రకాశంగారికి, రామమూర్తిగారి అభిప్రాయమంటే మంచి నమ్మకము. దానికితోడు, పై చెప్పిన మంత్రికూడా ఐ.సి.ఎస్. ఉద్యోగుల అభిప్రాయాన్ని బలపరచినపుడు - ప్రకాశంగారు, మొత్తంపైన ఎన్నికై, సహచరులుగా ఉన్న పార్ల మెంటరీ సెక్రటరీలకు ఫైలుచూసే అధికారాలు ఉండవని కాబినెట్‌లో నిర్ణయించారు. ఇప్పుడు కూడా అదే విధంగా, జీతం పుచ్చుకొని ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులే ప్రభుత్వం పేరున, మంత్రుల ప్రమేయం లేకుండానే - ఫైలు మంత్రివరకు వెళ్ళేటంత ముఖ్యం కాదన్న నెపంపైనో, ఇటువంటి విషయముపై మంత్రి పూర్వం ఒకప్పుడు తన అభిప్రాయం చెప్పాడు గనుక, అధే విధంగా చేతిలోని ఫైలుకూడా నిర్ణయం కాగలదన్న నెపంపైనో కార్యదర్శులు తామే ఆర్డర్లు జారీ చేస్తుంటారు.

వారికికూడా వ్యవధిలేదన్న నెపంపైన వారి వరకు వచ్చే ఫైళ్ళలో సగం ఫైళ్ళను వారి ప్రమేయం లేకుండానే డిప్యూటి సెక్రటరీలు తమకు తోచిన రీతిని ఆర్డర్లు వేయవచ్చనీ, వారికీ వ్యవధిలేదన్న నెపంపైన అసిస్టెంటు సెక్రటరీలుగాని, అండర్ సెక్రటరీలుగాని ఆర్డర్లు పాస్ చేయవచ్చనీ సచివాలయం కార్య నిబంధనలలో వ్రాసి ఉంటుంది. ఈ కార్య నిబంధనలకు గవర్నరు ఆమోద ముద్ర వేస్తాడు. ఈ ఆమోద ముద్రే, శాసనాలు ఏవీ లేకున్నా తమకు అధికారాన్ని సంక్రమింప జేస్తున్నదని ఉద్యోగుల వాదము. మొత్తంపైన ఇపుడు వారి వాదమే ప్రబలమై, డిల్లీ ప్రభుత్వంలోను, రాష్ట్ర ప్రభుత్వాలలోను సాగుతున్నది.

ఇందుకు నా కొక మూలకారణం కనిపిస్తూంది. ఈ ప్రధానులు రాజాజీ అయినా, ప్రకాశంగారు అయినా, పండిట్ నెహ్రూజీ అయినా ఒకటే పద్ధతి. బలవంతంగా కొందరిని తమ మంత్రివర్గంలో చేర్చుకుంటారు. అటువంటి వారికి వారి అంగీకార, అనంగీకారాలతో ప్రసక్తి లేకుండా ఆ ముఖ్యమంత్రిగాని, ప్రధానిగాని తనకు తోచిన ఒక శాసన సభ్యుణ్ణి ఆ మంత్రి దగ్గర పార్ల మెంటరీ సెక్రటరీగా నియమిస్తాడు. ఆ పార్లమెంటరీ సెక్రటరీ పైన ఆ మంత్రికి విశ్వాసముండదు. మంత్రి తనకు ఇష్టంవచ్చిన కాగితాలను మాత్రం పార్లమెంటరీ సెక్రటరీకి చూపించవచ్చనే రాజీ సూత్రంపైన ఏవైనా కొన్ని కాగితాలను చూపించవచ్చు. లేకుంటే లేదు. పరస్పర విశ్వాసంలేని మనుష్యులను ఒక కూటమిలో చేర్చడానికి యత్నించడంవల్ల, ఈ ప్రతి కూలతలు ప్రారంభమై, కొన్ని సమయాలలో మంత్రివర్గాలకు చేటును గూడా కలిగిస్తాయి.

ఇన్ని కారణాలవల్ల, పార్లమెంటరీ సెక్రటరీల వ్యవస్థ అంతరించి పోయింది.

అయితే, కేంద్రప్రభుత్వంలో ఇటువంటి దుస్థితి కొంచెం కొందరు డెప్యూటి మంత్రుల విషయంలో ఉండడం కద్దు.

సామాన్య ప్రజానీకానికి మాత్రం, గవర్నమెంటు అనగా మంత్రివర్గం నుంచిగాని, గవర్నరువద్ద నుంచిగాని ఆర్డరు జారీ అయినట్టు ఉన్న కాగితాలు చూచినపుడు, అవి మంత్రుల అనుమతిపైన, ఎరుకపైననే జారీ అవుతున్నాయనే ఒక భ్రమ కదు.

ఆ కాగితాలు ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి శాసనాధికారం ఉండడంవల్ల, అసలు గుట్టు - ఏ వ్యవహారమైనా కోర్టు కెక్కినపుడుతప్ప, ఎవరికీ తెలియదు.

పరిపాలనలో మరికొన్ని విశేషాలు

మంత్రివర్గం ఏర్పడిన తర్వాత నాడారు వర్గానికి, ప్రకాశంగారి వర్గానికి భేదాలు ఏవీ ఉండవని ఆశించాము. కాని, గాంధీగారు - ప్రకాశంగారితో బాటుగాక, ప్రత్యేకంగా నాడారుగారిని పిలిచిన సాయంత్రం ఏమి బీజం వేశారోగాని, ప్రకాశం నాడారుగార్ల, మధ్య డిల్లీకి వెళ్లేముందున్న సామరస్యం డిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత వై మనస్యంగా మారింది. ప్రకాశంగారిలో ఉన్న దోషము లేవో కనిపెట్టడమే నాడారుగారి కార్యక్రమంగా మారింది.

ఇంతేగాక, ఆంధ్రులకు ప్రాముఖ్యం కలగడం తీవ్ర భాషావాదులైన తమిళ సోదరులు కొందరికి నచ్చలేదు. నాయకుని ఎన్నికయిన మరునాటినుంచి సంతోషం చేత ప్రకాశంగారిని అభినందించడానికి, తెలుగు జిల్లాలోంచి, ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి వచ్చి, ఫోర్టు సెంట్ జార్జిలో సచివాలయం నిండుగా మెండుకొనే ప్రేక్షక తరంగాలు - ఒక నూతన ఆంధ్రత్వాన్ని, పూర్వం వెంకటాద్రి నాయకుడు ఇచ్చిన స్థలంలో అతడే అప్పుగా ఇచ్చిన డబ్బుతో కట్టిన కోటకు కలగజేశాయి.

ఆంధ్రులు ఒకమూల ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్న సమయంలో, ఈ విధంగా చెన్ననగరాన్ని తెలుగు వాతావరణంలో ముంచివేయడం ఏమి బాగుంది? ఇందుకు కారణం - కామరాజనాడారు గారు, రాజాజీ విడిపోవడమే గదా! కనుక, ఏలాగైనా వా రిద్దరు మనసులు మార్చుకొని ఏకం కాకుంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయేవేళ చెన్నపట్నం ఆంధ్ర పట్నంగా మారిపోతుందనే భయం కలిగి వారిని కలపడానికి సర్వప్రయత్నాలు సాగించారు.

రాజాజీ కేంద్రప్రభుత్వంలో మంత్రి అయినది మొదలు ఈ స్నేహం గట్టిపడింది. కాన్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన నిర్ణాయక సభ) సమావేశాలు, వీరిరువురూ పదేపదే కలుసుకోడానికి అవకాశాలు కలిగించాయి. రాజాజీ, నాడారుగారలు గడుసువారు గనుక - కళా వెంకటరావు, గోపాలరెడ్డి వర్గాలను, తాము భాషా ద్వేషాలకు అతీతులని అంటూ తమతో కలుపుకున్నారు.

ఈ విధంగా, ప్రకాశంగారికి కాంగ్రెసులోనే ఎదురు పక్షం నెలనెలకూ గట్టిపడింది. చివరికి, వీరికి తోడుగా ప్రకాశంగారి స్కీముల వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న వారంతా ఏకమయ్యారు.

1947 మార్చిలో, పార్టీ మీటింగులో ముప్పైమంది సంతకం పెట్టి, విశ్వాస రాహిత్య తీర్మానాన్ని చర్చించవలెనని నోటీసిచ్చారు. ఫిబ్రవరి 28 న జరిగిన సమావేశంలో ప్రతిపాదించిన ఆ తీర్మానాన్ని ప్రకాశంగారు చదవగానే రూల్ అవుట్ చేశారు. (అనగా, పార్టీ కార్య నిబంధనలకు అటువంటి తీర్మానం ప్రతిపాదించడం వ్యతిరేకమని తీర్పు చేశారు.)

అధ్యక్షునిగాని, కార్యదర్శినిగాని ఎన్నుకొనే పద్ధతి ఉన్న కార్య నిబంధనలలోనే ఆ నిబంధనకూడా ప్రత్యేకంగా వ్రాసి ఉంటే తప్ప విశ్వాస రాహిత్య తీర్మానం ప్రతిపాదించడానికి అవకాశం లేదు. ఏటేటా ఎన్నికైన అధ్యక్షునిపైన విశ్వాస రాహిత్యం అంటూ ఒక తీర్మానం సంవత్సరం మధ్యలో ప్రతిపాదించడం పార్టీని బలహీనపరుస్తుందని, అటువంటి ఏర్పాటు మా కార్య నిబంధనలలో చేర్చలేదు.

ఈ పై చెప్పిన భాష్యం ఒక వాక్యంలో సూచిస్తూ, ప్రకాశంగారు ఆ తీర్మానాన్ని రూల్ అవుట్ చేశారు. సమావేశం ముగిసిందని ఆయన ప్రకటించారు. అపుడు, సమావేశంలోంచి ఒకరు లేచి, "మీరు సమావేశం ముగిసిందన్నారు గనుక, మేమంతా కలిసి సమావేశ మౌతున్నా" మన్నారు.

అందుకు ప్రకాశంగారు, "మీరు కూర్చున్నప్పటికీ, కార్య నిబంధనల ప్రకారంగా అది శాసన సభ్య సమావేశం కానేరదు. అక్రమ సమావేశమే అవుతుంది," అన్నారు.

అయితే నేమి, తమలో ఒకరైన రామస్వామి రెడ్డిగారిని ముందుకు తీసుకువచ్చి, ఒక కుర్చీలో కూచోపెట్టారు. ప్రకాశంగారపుడు మరొక మాట కూడా అన్నారు: "సంవత్సరాంతంలో (మార్చి నెలాఖరులో) జరగవలసిన జనరల్ బాడీ (సర్వసభ్య) సమావేశాన్ని కొంత ముందుగానే సమావేశ పరుస్తాను. మీకు కావలసిన నాయకుణ్ణి అప్పుడు ఎన్నుకోండి. ఈ అక్రమమైన తీర్మానం ఎందుకు? అక్రమమైన నాయకుని ఎన్నిక ఎందుకు?"

కాని, వా రది వినలేదు. ఇదంతా జరుగుతున్నపుడు, కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి చెందిన శంకరరావు దేవుగారు అక్కడే మౌనంగా కూచున్నారు. అక్రమంగా జరిగే సమావేశాన్ని వద్దని అయినా ఆయన వారించలేదు.

తరువాత, తప్పు సవరించుకుందామన్న బుద్ధి అధిష్ఠాన వర్గానికి పుట్టినట్టుంది. అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్ కమిటీవారు డిల్లీలో సమావేశమై, అధ్యక్షులయిన కృపలానీగారే చెన్నపట్నం వెళ్ళి, కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశం జరిపి, క్రొత్తనాయకుని ఎన్నుకోడానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆయన మార్చి 10 న చెన్నపట్నం వచ్చారు. 22 న నాయకుని ఎన్నిక జరుగుతుందని నోటీ సిచ్చారు. అయితే, అంతవరకు, ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉండవలసి వచ్చింది.

ఈ విషయాన్ని గూర్చి ప్రకాశంగారు ఆ నెల 15 వ తేదీన శాసన సభలో ఇలా అన్నారు:

"ఈ రోజున నేను ఎలా ముఖ్యమంత్రిగా నిలుచున్నానో మీకు చెప్పవలసి ఉంది. నేను ఈ ఉద్యోగాన్ని అంటి పెట్టుకొని, వదలకుండా ఉన్నానని ఒక విమర్శ బయలుదేరింది. అయితే, నాకు ఆ ఉద్దేశం లేదు. నిన్న ఉదయం గవర్నరుకు నా రాజీనామా అందజేశాను. ఆయన వెంటనే దాన్ని అంగీకరించలే మన్నారు. ఆయన నాతో - 'మరొకరు మీ పదవి స్వీకరించడానికి ఎన్నుకోబడి తయారుగా లేరు. కాబట్టి మీ రాజీనామా అంగీకరించి నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు 93 వ సెక్షన్ ప్రకారం నేను రాజ్యాధికారం తీసుకోవలసి వస్తుంది. బడ్జెట్టు నేనే సర్టిపై చేయవలసి ఉంటుంది. శాసన సభ్యుల ఆమోదం లేకుండానే అది గవర్నమెంట్ బడ్జట్టే అని దానిమీద నా అనుమతి వ్రాయవలసి ఉంటుంది. ఇది నాకు మనస్కరించడం లేదు. మీ పార్టీ మీటింగు 22 న జరుగుతుంది కాబట్టి, అందులో ముఖ్యమంత్రి ఎన్నిక అయ్యేవరకు, మీరు ముఖ్యమంత్రి పదవి నిర్వహించవలసిం'దని అనడంవల్ల నా కిష్టం లేకపోయినా, ఇక్కడ - ఈ రోజున - మీ ముందు - ముఖ్యమంత్రిగా నిల్చున్నాను.

"93 వ సెక్షన క్రింద గవర్నరు పాలన రాకూడదని కృపలానీగారు కూడా అనుకున్నారు. ఇది ఫిబ్రవరి 28 నుంచి జరిగిన ముచ్చట. అందుచేత బడ్జెట్టు పాసయేవరకు మన సమావేశం సవ్యంగానే జరుగుతుంది. నా పార్టీలో ఉన్న వ్యతిరేకులకూ, నాకూ కార్యక్రమాలపట్ల భేదమేమీ లేదు కాబట్టి, మీరు చేయబోయే చర్చలు, ఉపన్యాసాలు క్రమబద్దమైనవిగానే ఉండగలవు." అది మొదలు, బడ్జెట్టు చర్చలో పదవీ విరమణ దాకా ఆయన చేసే ఉపన్యాస ధోరణిలో, పదవీచ్యుతి అవుతుందనే బాధగాని, ఆందోళనగాని ఏమీ వ్యక్తం కాలేదు. పార్టీలో ఆయనకు వ్యతిరేకులుగా ఉన్న వారందరు "శుద్ధ గాంధేయులు." కానీ, గాంధీ తత్వానికి కార్యరూపం కల్పించి, నడిపించగలిగిన ప్రకాశంగారు వారికి పనికి రాకపోయారు.

అంత ముఖ్యమయిన కార్యక్రమం మధ్య ప్రకాశంగారున్నప్పుడు నాయకత్వంలో మార్పు తేకూడదని, ఆ గాంధేయులతో గాంధీగారు కూడా అనలేదు. ఇదే మన రాజకీయాలలో విషాద ఘట్టము.

మరి ఒకరు దొరకక పోవడంవల్ల, గాంధీగారి నాయకత్వాన్ని ఈ "గాంధేయులు" ఒప్పుకున్నారు. అంతేకాని, ఆయన సూత్రాలలోగల నూతనమైన ఆర్థిక, సాంఘిక వ్యవస్థా పునర్నిర్మాణంలో వారికేమీ నమ్మకం లేదు. వాటిలో నమ్మకమున్న ప్రకాశంగారు అందుచేతనే వారికి పనికి రాలేదు.

  1. జి.ఓ. నెంబర్ 757 / సెప్టెంబర్ 1946.
  2. ఈ సంఖ్య నాకు సరిగా జ్ఞాపకం ఉండక పోవచ్చును.
  3. ఆ వ్యక్తి విన్‌స్టన్ చర్చిల్ గారి అల్లుడని నాకు జ్ఞాపకము.