నా జీవిత యాత్ర-4/జమీందారీల రద్దు బిల్లు: శాసన సభలో చర్చలు
5
జమీందారీల రద్దు బిల్లు:
శాసన సభలో చర్చలు
అయితే, ఈ బిల్లుకు వచ్చిన అడ్డంకులు అప్పటితో ఆగిపోలేదు. ప్రభుత్వం కార్యనిబంధనల ప్రకారం బిల్లులో ఉన్న ప్రతి క్లాజు (ఖండము) యొక్క భాష, ఉద్దేశము, పొందిక సంబంధించి సచివాలయంలో ఆ బిల్లుకు సంబంధించిన శాఖవారు తమ వ్యాఖ్య వ్రాయాలి. ఆ విషయానికి సంబంధించిన ఇతర ప్రభుత్వ శాఖలు, ఈ ఫైలు వెళ్ళిన పిదప వారి వ్యాఖ్యకూడా పొందుపర్చాలి. వాటిపైన న్యాయ శాఖ, సచివాలయం వారు తమ వ్యాఖ్యానం ఖండ ఖండానికి ప్రత్యేకంగా వ్రాయాలి. ఇటువంటి వ్యాఖ్యానాలు అయిన పిదప మంత్రిమండలిలో గల మంత్రులలో జూనియర్ అయిన మంత్రి మొదట తన వ్యాఖ్య వ్రాయాలి.
అలాగు ఉత్తరోత్తరా సీనియారిటిని బట్టి మంత్రులు తమ వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. ఆ పిమ్మట ముఖ్యమంత్రిగారికి ఫైలు చేరుతుంది. వారి వ్యాఖ్యలు వ్రాసిన పిమ్మట సంపూర్ణమైన ఆ వ్యాఖ్యాన గ్రంథమంతా బిల్లుకు సంబంధించిన మంత్రిగారికి వస్తుంది. వ్యాఖ్యలు అనగానే ప్రతి ఖండంపైన ప్రతి వ్యక్తీ ఏదో వ్రాస్తారని భావించనక్కరలేదు. అలాగున వ్రాయరు. తమకు ముఖ్యమనిపించిన అంశం ఏదైనా ఉంటే - చేర్పో, మార్పో వ్రాస్తారు. లేకపోతే, పొడి అక్షరాలతో అంగీకార సూచకంగా సంతకం చేస్తారు. ప్రకాశంగారి నివేదికలో మూడు బిల్లులున్నవి. అందుచేత ఈ వ్యాఖ్యాన క్రమం మరీ ఆలస్యమైంది. మంత్రిమండలిలో ఒకరిద్దరు జూనియరు మంత్రుల చేతులలోనే ఫైలు నడవక వారి ఆఫీసు బల్లలపైనే యోగ నిద్రలో ఉండేది.
గిరిగారు మినహాయిస్తే, తక్కినవారు వ్యతిరేక వ్యాఖ్యలే వ్రాసినట్లు నాకు జ్ఞాపకము. ఈ సంబంధమైన రికార్డులు, పాత జి. ఓ. లు మన ఆంధ్ర ప్రభుత్వానికి నేటిదాకా అందకపోవడం చేత ఈ విషయం ఇంతకన్న వివరంగా వ్రాసే వీలులేకపోయింది.
చివరకు 1939 సెప్టంబరులో యుద్ధ ప్రకటనకు విరుద్ధంగా మంత్రివర్గం రాజీనామా చేసే నాటిదాకా, ముఖ్యమంత్రిగారి వ్యాఖ్యతో ఆ ఫైలు ప్రకాశంగారికి చేరలేదు. ప్రకాశంగారికి ఈ ఆలస్యంతో శాసన సభలో తనను బలపరచిన నాడు ముఖ్యమంత్రిపై కలిగిన కృతజ్ఞతా సంతోషములు సంపూర్ణంగా నాశనం కావడమేగాక, ముఖ్యమంత్రితో యధాలాపముగా ఇష్టాగోష్ఠి ఎవరు చేసినా వారందరూ ఆలస్యానికి కారకులే నన్న చికాకు కలిగింది. అయితే ప్రకాశంగారు సహ జంగా గాంభీర్యంగల వ్యక్తిగనుక, కొందరే ఆ విషయం కనిపెట్టగలిగినారు. దీనికి తోడు ఆ ఫైలు మీద ఆమోద సంతకం తాను పెట్టేముందు వల్లభభాయి పటేలుగారితో సంప్రతింపు చేయాలని ఆయన అనుకున్నట్టూ, ఒకమారు ఆ ఫైలుతనతోబాటుగ బొంబాయి పట్టుకువెళ్ళినట్టు ఒక వదంతి బయలుదేరేసరికి ప్రకాశంగారి కోపతాపాలు మరింత హెచ్చినవి.
ఇదిగాక, ఇంకా మరొకటి కూడా సచివాలయంలో జరిగింది. ప్రకాశంగారి నివేదికలో గల శిఫార్సులకు ఉండగల అభ్యంతరాలను గూర్చి రెవిన్యూశాఖ ఉద్యోగి ఒకరు ఒక వ్యాఖ్య వ్రాయడం జరిగింది. బిల్లులోని ఖండ ఖండముల మీద శాఖవారు వ్రాసిన వ్యాఖ్య సంపుటివలె ఆ వ్యాఖ్యలు కనిపించినాయి. శాసన సభ నివేదిక భాగంగా ఆమోదించిన బిల్లుపైని ఎటువంటి వ్యాఖ్యానాలు చేయగూడదని, అట్లా చేయవలసిందని ఎవరైనా తనకు తెలియకుండా ఆదేశిస్తే, అది ద్రోహచ్చాయగల కార్యమని ప్రకాశంగారి అభిప్రాయము. మంత్రి మండలి బిల్లును అంగీకరిస్తే ఈ వ్యాఖ్యలు నిర్వీర్యమైపోతాయి. బిల్లును మంత్రిమండలి అంగీకరించకపోతే ఈ వ్యాఖ్యలకు అర్థం లేకుండా పోతుంది. అయినా, మొత్తం మీద శాసన సభలో ఆమోదింపబడిన తరువాత ఈ సందిగ్ధ పరిస్థితులలోనే ప్రకాశంగారినివేదికకు సంబంధించిన కాగితాలు ఎనిమిది నెలలు అలాగే పడి ఉండడం జరిగింది.
1946 లో ప్రకాశంగారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మిగిలిన ప్రజోకార యోగ్యమైన కార్యక్రమం చాలా జరిగింది. కాని యీ బిల్లులు శాసన సభ ముందుకు తెచ్చుకొనే అవకాశం లేకపోయినది.
1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అడ్డంకికూడా పోవడంవల్ల అప్పటి గవర్నమెంటులో మంత్రి అయిన కళా వెంకటరావు ద్వారా, జమీందారీలో శిస్తుల తగ్గింపు బిల్లు, జమీందారీ రద్దు బిల్లు పాసు చేయించడం జరిగింది. అయితే, వారు ప్రకాశంగారి అభిప్రాయాలు పూర్తిగా ఒప్పుకోక పోవడంవల్ల ఒక ముఖ్యమైన భేదం కలిగింది. జమీందారీలలో 1802 నాడు అమలులో ఉన్న సిస్తులు అమలు పరచవలెనని ప్రకాశంగారి నివేదిక. వెంకటరావుగారి బిల్లులో, ప్రక్కనున్న ఇప్పటి రైత్వారీ భూమిరేటు ఏదో అ రేటు ప్రకారం సిస్తులు ఏర్పాటు కావాలని ప్రతిపాదింప బడింది. చెన్నరాష్ట్రపు దక్షిణ భాగంలోని కొందరు జమీందారులు శాస్త్రీయముగా నడుచుకొన్న కారణంచేత పెర్మనెంట్ సెటిల్మెంటునాటి రేట్లే ఆ నాడు అమలులో ఉండడముచేత ప్రక్కభూముల రైత్వారీ రేట్ల సూత్రం వారు ఇవ్వ వలసిన సిస్తులను పెంచింది. ఈ రైత్వారీ సెటిల్మెంట్ అన్నది 1823 నాటికి పూర్తి అయింది. జమీందారీ శిస్తుల కన్న అ కాలంలో రైత్వారీ సిస్తులు కొంచెం ఎక్కువగా ఉండేవి. తర్వాత క్రమేణా రెండు మూడు పర్యాయాలు సిస్తులు హెచ్చింప బడినవి. ఆ కారణంచేత పైన చెప్పిన వ్యత్యాసం కొన్ని చోట్ల కలిగింది. అందుచేత ప్రకాశంగారు శాసన సభలో, కళా వెంకటరావు గారు పెట్టిన బిల్లు చర్చింపబడే ముందు "ఇది సిస్తుల హెచ్చింపు బిల్లు; తగ్గింపు బిల్లుకాదు" అని వ్యాఖ్యానించారు.