నా కఠినపాద శిలల క్రింద బడి నలగి
నా కఠినపాద శిలల క్రింద బడి నలగి
పోయె నెన్నెన్నియో మల్లెపూలు మున్ను.
ధూళి కైవాలు మౌళిపై దాలిచికొన
ఇంత విరిదోటలో నపు డెంత వెదకి
వేచియున్నానో, విసువని వెర్రి కోర్కె
తొందరల చూపు లటు నిటు తూలినంత
హృదయముల నయనమ్ముల బెదరు కలత
మూసికొనబోని యొక ననముగుద లేదు.
నా కనుల క్రాగు చీకట్లు ప్రాకుచోట
లేదు నెత్తావి, మధువేని లేదు, లేదు
ప్రాణ, మొక్క లావణ్యలవమ్ము లేదు;
ఏను రుజనైతి, జరనైతి, మృత్యువైతి!
ఈ నిశావసానమ్మున, ఏ శుభాని
లమ్ము నిట్టూర్చెనో జాలి రాగ నేడు
వ్రాలె నా పాడు అడుగుల మ్రోల నొక్క
తారయే, యొక్క దివ్యమందార సుమమె!
మోహినీహాస మల్లీ ప్రఫుల్లరుచియె,
శ్రీలలిత వైజయంతీ పరీమళమ్మె,
హరజటా పారిజాత లతాంత మధువె,
నిర్దయానిశితమ్ము లీ నీచనఖర
ములకొసలె కోరి పరవశమ్మున చలించె!
ఇటు వడకు కేల దీని స్పృశింపలేను
వెరగు కనురెప్పరేకుల విరియలేను,
ఎటు లదిమికొందు నా మ్రోడుటెడద, ఎటులు
చెరగి నెరసిన చింపిరికురుల తాల్తు!