నారాయణీయము/షష్ఠ స్కంధము/22వ దశకము

||శ్రీమన్నారాయణీయము||

షష్ఠ స్కంధము

మార్చు

22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనం

22-1-శ్లో.
అజామిలోనామ మహీసురః పురాచరన్ విభో! ధర్మపథాన్ గృహాశ్రమీ।
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్ సుదృష్టశీలాం కులటాం మదాకులామ్।।
1వ భావము
భగవాన్! పూర్వము 'అజామిలుడు' అను ఒక విప్రుడు కలడు. అతను ధర్మమార్గమున జీవించు గృహస్థుడు. ఆ అజామిలుడు ఒకానొకనాడు తన గురువు (తండ్రి) ఆజ్ఞననుసరించి హోమసమిధలు తెచ్చునిమిత్తము అడవి మార్గమున వెళ్ళెను. అచ్చట అతనికి , విచ్చలవిడిగా విహరించుచున్న గుణహీనురాలైన ఒక యువతి తారసపడెను.

22-2-శ్లో.
 స్వతః ప్రశాంతో౾ పి తదాహృతాశయః స్వధర్మముత్స్యజ్య తయా సమారమాన్।
అధర్మకారీ దశమీభవన్ పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్।।
2వ భావము
స్వాభావికముగా నిర్మల చిత్తుడైననూ, అజామిలుడు ఆ స్త్రీ బాహ్యసౌందర్యమునకు ఆకర్షితడయ్యెను. తాను వచ్చిన పనిని మరచి - స్వధర్మమును వీడి, ఆమెతో సహజీవము చేయుచూ కాలక్రమమున వృద్ధుడయ్యెను. అజామిలుని సంతతిలో నీ నామము పేరుగాకల 'నారాయణ' అను ఒక పుత్రుడు ఉండెను. ఆ 'నారాయణ' అనినచో అజామిలునికి మిక్కిలి వాత్సల్యము.

22-3-శ్లో.
స మృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాన్ త్రీనభిలక్షయన్ భియా।
పురా మనాక్ త్వత్స్మ్ర్రుతివాసనాబలాజ్జుహావ నారాయణనామకం సుతమ్।।
3వ భావము
వృద్ధుడైన అజామిలునికి మరణ సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు అతనికి భయంకరులగు ముగ్గురు యమకింకరులు కనిపించిరి. వారిని చూచిన అజామిలుడు మిక్కిలి భయకంపితుడయ్యెను. ప్రభూ! అప్పుడు (పూర్వ జీవన సంస్కారము వలన) నీ నామము గల తన కుమారుడు నారయణను , "నారాయణా!" "నారాయణా!" అని గట్టిగా పిలిచెను.

22-4-శ్లో.
దురాశయస్యాపి నతదాస్యనిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్।
పురో౾భిపేతుర్భవదీయపార్షదాశ్చతుర్భుజాః పీతపటామనోహరాః।।
4వ భావము
చెడుతలంపులతో జీవించియుండిననూ - అజామిలుడు మరణాసన్న సమయమున (అప్రయత్నముగా నైననూ), నీ "నారయణ" నామమును పలికెను. అంతట ప్రభూ! మనోహరరూపులు, పీతాంబరధరులు అయిన నీ పార్షదులు, ఆ అజామిలుని ముందు వచ్చి నిలిచిరి.

22-5-శ్లో.
అముం చ సంపాశ్య వికర్షతో భటాన్ విముంచతేత్యారురుధుర్భలాదమీ।
నివారితాస్తే చ భవజ్ఞనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్।।
5వ భావము
అజామిలుని తమపాశములతో యమభటులు లాగుకొని పోవుచుండగా, అతనిని వదలివేయమని, విష్ణు పార్షదులు వారిని గట్టిగా అడ్డగించిరి. అట్లు అడ్డగించబడిన యమకింకరులు - విష్ణు పార్షదులకు, అజామిలుని పాపపంకిల జీవితవృత్తాంతము నంతయు తెలిపిరి (అతనికి యమలోకమే సరియైనది అని అనిరి).

22-6-శ్లో.
భవంతుపాపాని కథం తు నిష్కృతే కృతే౾పి భో! దండనమస్తి పండితాః।।
న నిష్కృతిః కిం విదితా భవాదృశమితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే।।
6వ భావము
అంతట విష్ణు పార్షదులు యమకింకరులతో - "అజామిలుడు పాపాత్ముడేయైనను - పాప విముక్తుడయిన పిదప దండన ఉండునా! విజ్ఞులయిన మీకు ఇతని పాపవిముక్తి ఎట్లయ్యెనో తెలయకుండునా?" అని పలికిరి.

22-7-శ్లో.
శృతి స్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లువంతి వాసనామ్।
అనంతసేవా తు నికృంతతి ద్వయీమితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే।।
7వ భావము
మరల వారు ఇట్లనిరి. "శృతి స్మృతులందు వేదవిహితముగా చెప్పబడిన వ్రతములు - పాపములను హరించును. కాని అవి జీవుని అంటిపెట్టుకొనియుండు కర్మఫలముల వాసనను మాత్రము హరింపజాలవు. అనంతుని సేవ (హరినామ స్మరణ) మాత్రమే వారి పాపములను మరియు పాపకర్మల వాసనను నశింపజేయును", అని పలికిరి.

22-8-శ్లో.
అనేన భో! జన్మ సహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా।
యదగ్రహీన్నామ భయాకులో హరేః ఇతిప్రభోః త్వత్పురుషా బభాషిరే।।
8వ భావము
"అజామిలుడు అవసాన సమయమున యమభటులను చూచి భయకంపితుడై (అసంకల్పితముగానయినను - ఆర్తిగా) హరినామమును ఉచ్ఛరించెను. ఫలితముగా - వేలకోట్ల జన్మలయందు తానుచేసిన పాపములనుండి సహితము విముక్తుడయ్యెను"; అని ప్రభూ! నీ పార్షదులు యమదూతలతో పలికిరి.

22-9-శ్లో.
వృణాముబుద్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్ మహి౾ మాస్య తా దృశః।
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో! త్వత్పురుషా బభాషిరే ।।
9వ భావము
"అగ్ని కట్టెను దహించునట్లును, ఔషధము రోగమును హరించునట్లును - నరునిచే చేయబడిన 'ముకుందకీర్తన' సమస్త పాపములను హరించును. హరినామ మహిమ అట్టిది" - అని ప్రభూ! నీ పార్షదులు తెలిపిరి.

22-10-శ్లో.
ఇతీరితైర్యామ్యభటైరపాసృతే భవద్భటానాం చ గణే తిరోహితే।
భవస్మృతిం కంచన కాలమాచరన్ భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ।।
10వ భావము
హరినామ మహిమను - నీ పార్షదులు అట్లు వివరించగా, యమభటులు ఆ అజామిలుని వదిలిపెట్టిరి. విష్ణుదూతలుకూడా అంతర్ధానమయిరి. పిదప అజామిలుడు నీ నామస్మరణలో తన శేషజీవితమును గడిపి, ప్రభూ! విష్ణుదూతలు వెంటరాగా నీ సాన్నిధ్యమును చేరెను.

22-11-శ్లో.
స్వకింకరావేదనశంకితో యమస్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి।
స్వకీయభృత్యానశిశిక్షదుచ్ఛకైః స దేవ! వాతాలయనాథ! పాహిమామ్।।
11వ భావము
యమభటులు యమధర్మరాజు వద్దకు తిరిగివెళ్ళి అజామిలుని వృత్తాంతమునంతయూ తెలిపిరి. అప్పుడు యమధర్మరాజు తనభృత్యులను 'హరిభక్తుల వద్దకు మాత్రము' వెళ్ళవలదని హెచ్చరించెను. అట్టి మహిమ కలిగిన ఓ! గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపుము.

షష్ఠ స్కంధము
22వ దశకము సమాప్తము.
-x-