నారాయణీయము/ద్వాదశ స్కంధము/99వ దశకము

||శ్రీమన్నారాయణీయము||

ద్వాదశ స్కంధము

99- వ దశకము - భగవన్మహిమ



99-1
విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణేః కశ్య రేణూన్మిమీతే
యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమితం మోదతే పూర్ణసంపత్।
యో౾సౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం
త్వద్భక్తా యత్ర మాద్యంత్యమృతరసమరందస్య యత్ర ప్రవాహః॥
1వ భావము:-
దేవా! శ్రీమహావిష్ణుస్వరూపా! ధరిణిపైగల ఇసుకరేణువులను లెక్కించుట ఎవరితరమూ కాదనినచో, అంతకు మించిన లెక్కకు అందని విష్ణుమహిమలను లెక్కించుట ఎవరితరమగును? ఎవరు త్రిలోకములను మూడు అంగలలో కొలెచెనో, సమస్త జగత్తునకు సిరిసంపదలను ప్రసాదించి వారిని ఆనందింపజేయుచున్నాడో, ఏ పరమాత్మ ఎల్లవిశ్వమునకు ఆధారభూతుడై నిలచియున్నాడో, ఎవని లోకమున భక్తులు ఆనందముగా పరతత్వ ఆనందామృతమును అనుభవించుచుందురో, అట్టి నీకు ప్రియమైన 'పరంధామమును' నేను అశ్రయించెదను.

99-2
ఆద్యాయాశేషకర్త్రే ప్రతినిమిషనవీనాయ భర్త్రే విభూతేః
భక్తాత్మా విష్ణవే యః ప్రదిశతి హవిరాదీని యజ్ఞార్చనాదౌ।
కృష్ణాద్యం జన్మ యో వా మహదిహ మహతో వర్ణయేత్ సో౾యమేవ
ప్రీతః పూర్ణో యశోభిస్త్వరితమభిసరేత్ ప్రాప్యమంతే పదం తే॥
2వ భావము:-
దేవా! విష్ణుమూర్తి! సకలమును సృష్టించినవాడు, ప్రతిక్షణము నిత్యనూతనమై ప్రకాశించువాడు, సకలైశ్వర్య సంపన్నుడు అయిన నీగురించి ఏ భక్తుడు యజ్ఞయాగదులచే హవిస్సులు సమర్పించునో, కృష్ణాది అవతారములు ధరించిన అత్యంత మహిమాన్వితుడయిన పరమాత్మ వైన నీ కథలను వర్ణించునో ఆ భక్తుడు శీఘ్రమే ఇహలోకమున ఆనందమును, యశస్సును పొంది అంత్యమున తన దేహమువీడి నీ స్థానమును చేరును.

99-3
హే స్తోతారః।కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ
వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపాత్తలీలాకథాభిః।
జానంతశ్చాస్య నామాన్యఖిలసుఖరాణీతి సంకీర్తయధ్వం
హే విష్ణో।కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్త్వబోధం భజేయమ్॥
3వ భావము:-
ప్రశంసించుచు, కీర్తించుచూ కవిత్వములు వ్రాయు ఓ! కవీంద్రులారా! విష్ణువును గురించి మీకేమేమి తెలియునో అదియంతయూ వ్రాయుడు! వేదసారమంతయూ ఎవనిని ప్రశంసించుచున్నదో ఆ విష్ణువు యొక్క అవతారములను, లీలలను స్తుతించుడు. ఎవని నామసంకీర్తన సకల సుఖములను, ఆనందమును కలిగించుచున్నదో ఆ విష్ణునామములను కీర్తించుడు. హే! విష్ణుదేవా! నిన్ను నేను నా కీర్తనాదులతో ఆశ్రయించి తత్వజ్ఞానమును పొందెదను.

99-4
విష్ణోః కర్మాణి సంపశ్యత మనసి సదా యైస్స ధర్మానబధ్నాద్
యానీంద్రస్యైష భృత్యః ప్రియసఖ ఇవ చ వ్యాతనోత్ క్షేమకారీ।
వీక్షంతే యోగసిద్ధాః పరపదమనిశం యస్య సమ్యక్ప్రకాశం
విపేంద్రా జాగరూకాః కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతే॥
4వ భావము:-
ధర్మమును రక్షించుటకు ఒకానొకసమయమున దేవేంద్రునకు భృత్యునిగాను, లోకశ్రేయస్సుకొఱకు మరొకసమయమున ఆ దేవేంద్రునికే సఖునిగాను వ్యవహరించిన శ్రీమహావిష్ణువు లీలలను, సదా మీ మనస్సులలో నిలుపుకొనుడు. విప్రులు, ఋషులు పరమ భక్తిశ్రద్ధలతో అనేకనేక విధములగా స్తుతించుచు ప్రకాశింపజేసిన ఆ విష్ణుతత్వమును; యోగులు తమచిత్తములలో స్తుతించి నిలుపుకొనిన ఆ విష్ణుమూర్తియొక్క 'పరమపదమును', మీ మనస్సులలో భావనచేసుకొని ఆరాధించుడు.

99-5
నో జాతో జాయమానో౾పి చ సమధిగతస్త్వన్మహిమ్నో౾వసానం
దేవ।శ్రేయాంసి విద్వాన్ ప్రతిముహురపి తే నామ శంసామి విష్ణో
తం త్వాం సంస్తౌమి నానావిధనుతివచనైరస్య లోకత్రయస్యా-
ప్యూర్ధ్వం విభ్రాజమానే విరచితవసతిం తత్ర వైకుంఠలోకే॥
5వ భావము:-
దేవా! నీ మహిమలు ఇంతకుమునుపు జన్మించినవారు గాని, ఇకముందు జన్మించుబోవువారుగాని ఆద్యంతములు తెలుసుకోలేనంతటి అనంతములు. నీ నామములు సకలశ్రేయములు కలిగించునవి. నేను నీ నామమును ప్రతిక్షణము స్మరించుచు, ఉచ్చరించుచు నిన్ను స్తుతింతును. ముల్లోకములకు పైన వైకుంఠలోకమును సృష్టించుకొని, అచ్చట నివసించుచున్న ఓ! విష్ణుమూర్తీ! నిన్ను నేను అనేక విధములగు స్తోత్రవచనములతో స్తుతింతును.

99-6
ఆపః సృష్ట్యాదిజన్యాః ప్రథమమయి విభో।గర్భదేశే దధుస్త్వాం
యత్ర త్వయ్యేవ జీవా జలశయన ।హరే।సంగతా ఐక్యమాపన్।
తస్యాజస్య ప్రభో।తే వినిహితమభవత్ పద్మమేకం హి నాభౌ
దిక్పత్రం యత్కిలాహుః కనకధరణిభృత్కర్ణికం లోకరూపమ్॥
6వ భావము:-
విభో! సృష్టిప్రారంభమున జలములు ఉద్భవించెను. అప్పుడు ఆజలములు నిన్ను ధరించియుండెను. ఆ జలములలో జీవరాశులు జన్మించి అవి సమస్తమూ నీలో ఐక్యముచెందుచుండెను. జలములలో శయనించి పవళించియుండిన జన్మరహితుడవగు ఓ! విష్ణుదేవా! నీ నాభినుండి అప్పుడు ఒకపద్మము ఉద్భవించెను. ఆ పద్మమునకు దళములే దిక్కులు, మేరు పర్వతమే కర్ణిక. ఆ పద్మమే 'జగత్తు' రూపమున ఆవిర్భవించెను.

99-7
హే లోకా విష్ణురేత్భువనమజనయత్తన్న జానీథ యూయం
యుష్మాకం హ్యంతరస్థం కిమపి తదపరం విద్యతే విష్ణురూపమ్।
నీహారప్రఖ్యమాయాపరివృతమనసో మోహితా నామరూపైః
ప్రాణప్రీత్యేకతృప్తాశ్చరథ మఖపరా హంత నేచ్ఛా ముకుందే॥
7వ భావము:-
ఓ! లోకులారా! విష్ణువే ఈ లోకమును సృష్టించినవాడు అను సత్యమును మీరు తెలుసుకొనలేక పోవుచుంటిరి. మీ అంతరంగములో మీరెరుగని ఒక విష్ణురూపమున్నది. మంచుపొరవంటి మాయ మీహృదయమును కప్పివేయుటచేతనే దీనిని మీరు గ్రహించలేక పోవుచుంటిరి. మీరు ఈ ప్రపంచములోని అనేకనేక రూపములకు, నామములకు మోహితులై, ఇంద్రియసుఖములు ప్రసాదించు యజ్ఞయాగాదులు చేయుచూ ముకుందుని స్మరించుటయందు ఇచ్ఛలేక మెలగుచున్నారు.

99-8
మూర్థ్నామక్షాం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం
తత్ప్రోత్ర్కమ్యాపి తిష్ఠన్ పరిమితవివరే భాసి చిత్తాంతరే౾పి।
భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కిం దేహేంద్రియాది-
ష్వావిష్టోహ్యుద్గతత్వాదమృతసుఖరసంచానుభుంక్షే త్వమేవ॥
8వ భావము:-
దేవా! విష్ణుమూర్తీ! నీవు వేలకొలదీ శిరములు, నేత్రములు, పాదములు కలిగి ఈ విశ్వమంతటనూ వ్యాపించియుంటివి. ఈ విశ్వమునుదాటి - దానికి ఆవల కూడా నీవే ప్రకాశించుచుంటివి. భూత, భవిష్యత్, వర్తమానకాలములందు నీవేయుంటివి. అతిచిన్న పరిమాణముతో, పరమపురుషా! నీవు సకల జీవుల దేహములలోను ప్రవేశించి, వారి ఇంద్రియములుచేయు కర్మలకు అతీతడవై, అమృతమయమగు పరమానందమును అనుభవించుచు వారిలో సాక్షీభూతుడవై నిలిచియుంటివి.

99-9
యత్తు త్రైలోక్యరూపం దధదపి చ తతో నిర్గతానంతశుద్ధ-
జ్ఞానాత్మా వర్తసే త్వం తవ ఖలు మహిమాసో౾పి తావాన్ కిమన్యత్।
స్తోకస్తే భాగ ఏవాఖిలభువనతయా దృశ్యతే త్ర్యంశకల్పం
భూయిష్ఠం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే॥
9వ భావము:-
దేవా! స్పష్టముగా దృగ్గోచరముకాని త్రిలోకరూపము ధరించి నీవు త్రిలోకములలోనేగాక, ఆ లోకములకు అతీతముగా కూడా 'అనంత శుద్ధ జ్ఞానాత్మగా' వ్యాపించియుంటివి. నీ మహత్వములోని స్వల్పము మాత్రమే ఈ సకల భువనములుగా గోచరించును. (మిగిలిన) అత్యధిక భాగము 'శాశ్వతమయిన సంపూర్ణ జ్ఞానాందాత్మక రూపము'; అది త్రిలోకములకు అతీతముగా ప్రకాశించుచున్నది. అటువంటి పరమాత్మా! కృష్ణా! నీకు నమస్కారము.

99-10
అవ్యక్తం తే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైకసత్త్వం
వ్యక్తం చాప్యేతదేవ స్ఫుటమమృతరసాంభోధి కల్లోలతుల్యమ్।
సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతీం
మూర్తిం తే సంశ్రయే౾హం పవనపురపతే పాహి మాం కృష్ణ।రోగాత్॥
10వ భావము:-
భగవాన్! అవ్యక్తమగు నీ శుద్ధసత్వరూపమును తెలుసుకొనుట దుర్లభము. నీ శుద్ధసాత్వికరూపమే ఈ 'జగత్తుగా' వ్యక్తమగుచున్నది. అవతారరూపము ధరించి, వ్యక్తమగుచున్న నీ రూపము అమృతము నిండిన సముద్ర కెరటమువంటిది. నీ రూపము సర్వోత్తమమయినది; ఎల్లరకూ ఇష్టము కలిగించునది; భక్తులమనస్సును రంజింపజేయునది. అట్టి వ్యక్తమగు నీ రూపముననే నేను శరణుకోరెదను. ప్రభూ! ఓ! గురవాయూరు పురపతీ! కృష్ణా! నా రోగమును హరించుము. నన్ను రక్షించుము.


ద్వాదశ స్కంధము
99వ దశకము సమాప్తము
-x-