నారాయణీయము/దశమ స్కంధము/78వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

78- వ దశకము - శ్రీకృష్ణునకు రుక్మిణీ సందేశము


78-1
త్రిదశవర్ధకి వర్ధిత కౌశలం త్రిదశదత్తసమస్తవిభూతిమత్।
జలధిమధ్యగతం త్వమభూషయో నవపురం వపురంచితరోచిషా॥
1వ భావము :-
భగవాన్! సముద్రమధ్యమున విశ్వకర్మ తన నిర్మాణకౌశలముతో నిర్మించినది, దేవతలు సమకూర్చిన సకల సంపదలతో శోభిల్లుచున్నది అగు ఆ నవ (ద్వారకా) నగరము నీ రూపసౌందర్యముతో మరింత ప్రకాశించుచుండెను.
 
78-2
దదుషి రేవతభూభృతి రేవతీం హాలభృతే తనయాం విధిశాసనాత్l
మహితముత్సవఘోషమపూపుషః సముదితైర్ముదితై స్సహ యాదవైః॥
2వ భావము :-
భగవాన్! బ్రహ్మదేవుని ఆదేశముతో 'రేవతుడు' అను రాజు తన కుమార్తెయగు 'రేవతి'ని 'బలరామునికిచ్చి వివాహము జరిపించెను. రేవతి బలరాముల వివాహమును, ఆ మహోత్సవమునకు వచ్చిన యాదవులతోకలిసి నీవు గొప్ప వేడుకగా జరిపించితివి.
 
78-3
అథ విదర్భసుతాం ఖలు రుక్మిణీం ప్రణయినీం త్వయి దేవ సహోదరః।
స్వయమదిత్సత చేదిమహీభుజే స్వతమసా తనుసాధుముపాశ్రయన్॥
3వ భావము :-
ప్రభూ! కృష్ణా! విధర్భరాజ పుత్రికయగు 'రుక్మిణి' నీయందు అనురాగము కలిగియుండెను. కాని అవివేకియగు ఆమె సోదరుడు ‘రుక్మి' మాత్రము రుక్మిణిని తన మిత్రుడు, దుష్టుడు అగు ఛేదిరాజయిన శిశుపాలునికిచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించెను.
 
78-4
చిరధృతప్రణయా త్వయీ బాలికా సపది కాంక్షితభంగసమాకులా।
తవ నివేదయితుం ద్విజమాదిశత్ స్వకదనం కదనంగనినిర్మితమ్॥
4వ భావము :-
ప్రభూ! కృష్ణా! బాలికయగు 'రుక్మిణి' మాత్రము చిరకాలముగా నిన్నే మనసులో నిలుపుకొని, నిన్నే పరిణయమాడవలెనని తలచుచుండెను. తన కోరికకు భంగకరమగు 'రుక్మి' నిర్ణయమువిని ఆమె మిక్కిలి వ్యధచెందెను; మధనపడి తన వ్యధను, మదన తాపమును తెలియజేయుటకు తన సందేశముతో ఒక విప్రకుమారుని నీ వద్దకు పంపెను.
 
78-5
ద్విజసుతో౾పి చ తూర్ణముపాయయౌ
తవ పురం హి దురాశదురాసదమ్।
ముదమవాప చ సాదరపూజితః
స భవతా భవతాపహృతా స్వయమ్॥
5వ భావము :-
ప్రభూ! కృష్ణా! దురుద్దేశముతో ప్రవేశించువారికి దుస్సాధ్యమగు నీ ద్వారకాపురిని, ఆ బ్రాహ్మణుడు అత్యంతవేగముగా చేరెను. జీవుల సంసార తాపము పోగొట్టి, వారిని అనుగ్రహించు పరమాత్మస్వరూపుడవగు భగవాన్! నీవే స్వయముగా ఆ విప్రుని సగౌరవముగా ఆహ్వానించితివి. నీ ఆదరణకు ఆ బ్రాహ్మణుడు మహదానందమును పొందెను.
 
78-6
స చ భవంతమనోచత కుండినే నృపసుతా ఖలు రాజతి రుక్మిణీ।
త్వయి సముత్సుకయా నిజధీరతారహితయా హి తయా ప్రహితో౾స్మ్యహమ్॥
6వ భావము :-
భగవాన్! అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీతో ఇట్లు పలికెను. "విధర్భరాజధానియగు కుండిననగరమున ఆ దేశపు రాకుమార్తెయగు 'రుక్మిణి' నీయందు అత్యంత అనురక్తితో ఉన్నది. క్లిష్ట పరిస్థితిలో ధైర్యమును కోల్పోయి ఆమె సందేశము పంపగా నేను నీ వద్దకు వచ్చితిని".
 
78-7
తవ హృతాస్మి పురైవ గుణైరహం హారతి మాం కిల చేదినృపోధునా।
అయి కృపాలయా।పాలయ మామితి ప్రజగదే జగదేకపతే। తయా॥
7వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఆ విప్రుడు రుక్మిణీదేవి సందేశమును ఆమె మాటగా ఇట్లుచెప్పెను "సద్గుణములచే నా మనుస్సును హరించిన ఓ! దయానిధీ! ఇప్పుడు ఆ ఛేదిరాజగు శిశుపాలుడు నన్ను హరించనున్నాడు. జగదేకపతీ! నీవే నన్ను రక్షించవలయును".
 
78-8
అశరణాం యది మాం త్వముపేక్షసే
సపది జీవితమేవ జహామ్యహమ్।
ఇతిగిరా సుతనోరతనోద్ భృశం
సుహృదయం హృదయం తవ కాతరమ్॥
8వ భావము :-
ప్రభూ! కృష్ణా! ఆ విప్రుడు ఆ రాకుమారి సందేశమును ఇంకనూ ఇట్లు వినిపించెను. "రక్షించువారు ఎవ్వరూలేని నన్ను నీవు ఉపేక్షించితివేని తక్షణమే నా ప్రాణమును త్యజించెదను" అని ఆ రాజకుమారి పలికెననిచెప్పి, సహృదయుడయిన ఆ విప్రుడు నీ హృదయమును కలవరపరచెను.
 
78-9
అకథయస్త్వమథైనమయే సఖే। తదధికా మమ మన్మథవేదనా।
సృపసమక్షముపేత్య హరామ్యహం తదయి తాం దయితామసితేక్షేణామ్॥
9వ భావము :-
భగవాన్! ఆ విప్రుడు అట్లుచెప్పగానే నీవతనితో ఇట్లంటివి. "మిత్రమా! ఆమెకంటెను నేను అధికముగా వ్యధ చెందుచుంటిని. అచ్చటకు తక్షణమే వచ్చి ఆ నల్లకలువలవంటి కన్నులుగల రుక్మిణిని రాజులందరూ చూచుచుండగా నేను తీసుకొని వచ్చెదను", అని పలికితివి.
 
78-10
ప్రముదితేన చ తేన సమం తదా రథగతో లఘు కుండినమేయివాన్।
గురుమరుత్పురనాయక। మే భవాన్ వితనుతాం తనుతామఖిలాపదామ్॥
10వ భావము :-
భగవాన్! నీ మాటలకు సంతసించిన ఆ బ్రాహ్మణునితో కలిసి వెంటనే నీవు రథమునధిరోహించితివి; ఆ కుండిన నగరమునకు పయనమయితివి అట్టి గురవాయూరు పురాధీశా! నా సకల ఆపదలను హరించుము అని నిన్ను ప్రార్ధించుచున్నాను.
 
దశమ స్కంధము
78వ దశకము సమాప్తము
-x-