నారాయణీయము/దశమ స్కంధము/73వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
73- వ దశకము - మధురానగరయాత్ర
73-1
నిశమయ్య తవాథ యానవార్తాం భృశమార్తాః పశుపాలబాలికాస్తాః।
కిమిదం కిమిదం కథం న్వితీమాః సమవేతాః పరిదేవితాన్యకుర్వన్॥
1వ భావము :-
భగవాన్! నీవు అక్రూరునితో కలిసి మధురకు పయనమగుచున్న సంగతివిని గోపికలు దుఃఖితులయిరి. వారందరూ ఒక ప్రదేశమున గుమిగూడి - "ఇదేమి! ఇది ఏమి! ఏమి జరిగినది? ఇప్పుడు ఏమి అవనున్నది?" అని వారిలో వారే సంభాషించుకొనుచు పరిపరివిధములగ వ్యాకులపడసాగిరి.
73-2
కరుణానిధిరేష నందసూనుః కథమస్మాన్విసృజేదనన్యనాథాః।
బత నః కిము దైవమేవమాసీదితి తాస్త్వద్గతమానసా విలేపుః॥
2వ భావము :-
భగవాన్! ఆ గోపికలు ఇంకను ఇట్లనుకొనసాగిరి. "తనే తప్ప వేరేదిక్కు లేనివారమే! మన మనసులలో అతనినే నిలుపుకొని ఉంటిమే! ఇదియేమి - కృష్ణుడు మనలను విడిచి వెళ్ళుచున్నాడా? విధిరాత మననొసట ఇట్లున్నదా! ఏమి?" - అని పరిపరి విధములుగా భావించుచు - బిగ్గరగా విలపించసాగిరి.
73-3
చరమప్రహరే ప్రతిష్ఠమానః సహ పిత్రా నిజమిత్రమండలైశ్చ।
పరితాపభరం నితంబినీనాం శమయిష్యన్ వ్యముచస్సఖాయమేకమ్॥
3వ భావము :-
భగవాన్! వేకువజాముననే నీ తండ్రినందునితోను, నీ మిత్రబృందముతోను కలిసి మధురకు బయలుదేరుటకు నిశ్చయించుకొని, గోపికల వ్యధనెరిగిన ప్రభూ! నీవు నీ కొరకు పరితపించుచున్న ఆ గోపికలను అనునయించమని - నీ మిత్రునొకనిని - వారి వద్దకు పంపితివి.
73-4
అచిరాదుపయామి సన్నిధిం వో భవితా సాధు మయైవ సంగమశ్రీః।
అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే ద్రుతమిత్యాశ్వసితా వధూరకార్షీః॥
4వ భావము :-
భగవాన్! “త్వరలోనే వ్రజమునకు తిరిగి వచ్చెదననియు - మన సమాగమము అతిత్వరలోనే జరగుననియు - మిమ్ము తప్పక ఆనందామృతాబ్ధిలో ముంచివేయుదు ననియు" ఆ గోపికలకు చెప్పి - వారిని అనునయించమని, ప్రభూ! నీ మాటగా వారికి - ఈ వార్తను పంపితివి.
73-5
స విషాద భరం। సయాచ్ఞముచ్చైరతిదూరం వనితాభిరీక్ష్యమాణః।
మృదు తద్దిశి పాతయన్నపాంగాన్ సబలో౾క్రూరరథేన నిర్గతో౾భూః॥
5వ భావము :-
భగవాన్! నీవు నీ అన్న బలరామునితో కలిసి - అక్రూరుని రధము ఎక్కి - మధురకు బయలుదేరుచున్న - వేళకు గోపికలు విషణ్ణవదనములతో నీ వద్దకు వచ్చిరి; (తమను విడిచి వెళ్ళవద్దని) గొంతెత్తి బిగ్గరగా విలపించుచు, నిన్ను వేడుకొనుచు నీ రధమువెంట రాసాగిరి. ప్రభూ! నీవు వారిపైనే నీదృష్టిని నిలిపి కరణార్ధ్రదృష్టితో వారినే చూచుచు వ్రజమును వీడితివి.
73-6
అనసా బహుళేన వల్లవానాం మనసా చానుగతో౾థ వల్లభానామ్।
వనమార్తమృగం విషణ్ణవృక్షం సమతీతో యమునాతటీమయాసీః॥
6వ భావము :-
భగవాన్! ఆ గోపికల హృదయములు నిన్నువెన్నంటి వచ్చుచుండగా - నీవెంట వచ్చుచుండిన (వ్రజవాసులగు) ఇతర గోపాలుర బండ్లు అక్రూరుని రధముననుసరించి రాసాగెను. బృందావనములోని మృగములు, వృక్షములు సహితము- నీ వియోగమునకు విషాదము చెందుచున్నవా ! అనునట్లు కనబడుచుండగా, ప్రభూ! మీరు యమునానదీతీరమును చేరిరి.
73-7
నియమాయ నిమజ్జ్య వారిణి త్వామభివీక్ష్యాథ రథే౾పి గాందినేయః।
వివశో౾జని కిన్న్విదం విభోస్తే నను చిత్రం త్వవలోకనం సమంతాత్॥
7వ భావము :-
భగవాన్! గాందినీ పుత్రుడగు అక్రూరుడు - ప్రాతఃకాల దైనందిన సంధ్యావందన కార్యక్రమమును నిర్వర్తించుటకు ఆ యమునానదీతీరమున - రధమును ఆపెను. స్నానమాచరించుటకు అతడు యమునానదిలో దిగెను. ఆ అక్రూరునికి అప్పుడు ఆ నదిలో నీవు కనిపించితివి. ఆశ్చర్యముతో వెనుకకు తిరిగి చూడగా అతనికి, ప్రభూ! నీవు రధముపైనను కనిపించితివి. ఆశ్చర్యముతో అతడు వివశుడయ్యెను. సర్వాంతర్యామివగు నీవట్లు కనిపించుటలో ఆశ్చర్యమేమున్నది?
73-8
పునరేష నిమజ్జ్య పుణ్యశాలీ పురుషం త్వాం పరమం భుజంగభోగే।
అరికంబుగదాంబుజైః స్ఫురంతం సురసిద్ధౌఘపరీతమాలులోకే॥
8వ భావము :-
భగవాన్! ఆ పుణ్యశాలియగు అక్రూరుడు మరల ఆ నదీజలములలో మునిగెను. ప్రభూ! అప్పుడు నీవు అతనికి - వేయిపడగల అనంతునిపై శయనించి శంఖు, చక్ర, గదాయుధములతో - చేతిలో పద్మమును ధరించి - సిద్ధులు, దేవతలు పరివేష్టించి యున్న పరమపురుషుడుగా (విష్ణుమూర్తిగా) కనిపించితివి.
73-9
స తదా పరమాత్మసౌఖ్యసింధౌ వినిమగ్నః ప్రణువన్ ప్రకారభేదైః।
అవిలోక్య పునశ్చ హర్షసింధోరనువృత్త్యా పులకావృతో యయౌ త్వామ్॥
9వ భావము :-
భగవాన్! పరమాత్మవయిన నిన్ను దర్శించి - అక్రూరుడు ఆనందానుభవసాగరములో మునిగెను; అనేకవిధములుగా స్తుతించెను. అతను చూచుచుండగనే ప్రభూ! నీవు అదృశ్యమయితివి; అద్వితీయానుభూతితో పులకాంకితుడయిన అక్రూరుడు - నీ వద్దకు వచ్చెను.
73-10
కిము శీతలిమా మహాన్ జలే యత్ పులకో౾సావితి చోదితేన తేన।
అతిహర్షనిరుత్తరేణ సార్ధం రథవాసీ పవనేశ।పాహిమాం త్వమ్॥
10వ భావము :-
ప్రభూ! ఆ అక్రూరుని శరీరము రోమాంచితముగానుండుట చూచి - "నదీజలములు అతి శీతలముగానున్నవా? ఏమి? నీ శరీరము రోమాంచికమయినది?" అని ప్రశ్నించితివి. ఆనందానుభూతితో నిరుత్తరుడైయుండిన అక్రూరుడు ఏమియు బదులు పలకలేకపోయెను. పరమభక్తుడయిన అక్రూరునితో కలిసి రధములో ప్రయాణముచేసిన పరమాత్మా! గురవాయూరు పురవాసా! రోగమును హరించుము అని నిన్ను ప్రార్ధించుచున్నాను.
దశమ స్కంధము
73వ దశకము సమాప్తము
-x-