నారాయణీయము/దశమ స్కంధము/71వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

71 వ దశకము - కేశి, వ్యోమాసురుల వధ


71-1
యత్నేషు సర్వేష్వపి నావకేశీ కేశీ స భోజేశితురిష్టబంధుః।
త్వం సింధుజా౾వాప్య ఇతీవ మత్వా సంప్రాప్తవాన్ సింధుజవాజిరూపః॥
1వ భావము :-
భగవాన్! భోజరాజగు కంసునికి - 'కేశి' అను నామముగల - సహచరుడగు - ఇష్టబంధువు ఒకడు ఉండెను. చేపట్టిన కార్యమేదైనను దానిని సాధించుటలో ఇతడు బహు నేర్పరి; విఫలమెరుగనివాడు. కంసునిచే నియోగించబడి - ఈ 'కేశి' ఒకరోజున - సింధుదేశపు (తెల్లని) అశ్వరూపమును ధరించి నీ ముందుకు వచ్చెను. (సింధుజను (లక్మీదేవిని) నీకు స్పురణకు తెచ్చి -సులభముగా, (ఏమరిచి) నిన్ను చేరవచ్చునని భావించెనో ఏమో! ఆ రూపముతో వచ్చెను).

71-2
గంధర్వతామేష గతో౾పి రూక్షైర్నాదైః సముద్వేజితసర్వలోకః।
భవద్విలోకావధి గోపవాటీం ప్రమర్ద్య పాపః పునరాపతత్ త్వామ్॥
2వ భావము :-
భగవాన్! మాయావియగు ఆ 'కేశి' - అప్పుడు గంధర్వుని ముఖమును పోలిన ముఖముతో నుండెను. (నీ వద్దకు అనాయాసముగా వచ్చుటకే అయి ఉండవచ్చును). తనగిట్టలతో అచ్చటి ప్రదేశములను ధ్వంసముచేయుచు ఆ కేశి భయంకరముగా సకిలించసాగెను. అతడు తన రూపమును మార్చుకొనగలిగెనేగాని – స్వరమును కాదు. అదిచూచి ఆ గోకులవాసులు భయభ్రాంతులు అగుచుండిరి. ప్రభూ! నిన్ను చూడగనే ఆ కేశి - నిన్ను ఎదుర్కొనెను.
  
71-3
తార్ క్ష్యార్పితాంఘ్రేస్తవ తార్ క్ష్య ఏష చిక్షేప వక్షోభువి నామపాదమ్।
భృగోః పదాఘాతకథాం నిశమ్య స్వేనాపి శక్యం తదితీవ మోహాత్॥
3వ భావము :-
భగవాన్! రాక్షసుడగు ఆ కేశి - గరుడునిపై నిలుపు నీ పాదములను - తనకాళ్ళతో త్రొక్కుటకు యత్నించి, అది అసాధ్యమగుటతో - ప్రభూ! భృగుమహర్షి తనపాదముతో నీ వక్షస్థలమును తాకెనని వినియుండెనో ఏమో!, ఆ దురాత్ముడగు కేశి తన ఎడమకాలితో నీ వక్షస్థలమును బలముగా తాకెను.
 
71-4
ప్రవంచయన్నస్య ఖురాంచలం ద్రాగముం చ చిక్షేపిథ దూరదూరమ్।
స మూర్ఛితో౾పి హ్యాతిమూర్చితేన క్రోధోష్మణా ఖాదితుమాద్రుతస్త్వామ్॥
4వ భావము :-
భగవాన్! నీవు ఆ రాక్షసుడు - అశ్వరూపుడు అగు 'కేశి' కాలితాపులనుండి - వడివడిగా తప్పించుకొనుచు - అతనిని ప్రతిఘటించుచు - తటాలున అతని కాళ్ళను పట్టుకొని బలముగా - దూరముగా విసరివేసితివి. దానితో ఆ రాక్షసుడు మూర్చిల్లి - ఆపైన తేరుకొని - మరల ఆగ్రహావేశముతో నీపైకివచ్చి నిన్ను ఎదుర్కొనెను.
 
71-5
త్వం వాహదండే కృతధీశ్చ బాహాదండం న్యధాస్తస్య ముఖే తదానీమ్।
తద్వృద్ధిరుద్ధశ్వసనో గతాసుః సప్తీభవన్నప్యయమైక్యమాగాత్॥
5వ భావము :-
భగవాన్! నీవు ఆ అశ్వరూపుడగు 'కేశిని' దండించవలెనని నిశ్చయించుకొంటివి. వెంటనే నీ హస్తమును - లాఘవముగా ఆ అశ్వము నోటిలోనికి చొప్పించితివి. క్షణములో నీ హస్తము దీర్ఘమై - ఆ అశ్వము గొంతునంతను ఆక్రమించెను; ఆ రాక్షసుడు ఊపిర ఆడక తన తుదిశ్వాశను విడిచెను. నీచే చంపబడిన పుణ్యమున – సప్తి (గుర్రము) రూపము ధరించి - నిన్ను సంహరించుటకే వచ్చినను - ఆ రాక్షసుడు, ప్రభూ! నీలో ఐక్యమయ్యెను.
 
71-6
ఆలంభమాత్రేణ పశోః సురాణాం ప్రసాదకే నూత్న ఇవాశ్వమేధే।
కృతే త్వయా హర్షవశాత్ సురేంద్రాస్త్వాం తుష్టువుః కేశవానామధేయమ్॥
6వ భావము :-
భగవాన్! అశ్వమేధ యాగక్రతువు - ఏమియూ ఇచ్చట జరగకపోయినను , వినూత్నముగా నీవుచేసిన - ఈ అశ్వమేధమును ఆకాశమునుండి దేవతలు తిలకించిరి. హర్షాతిరేకములను పొందిరి. రాక్షస - 'కేశి' సంహారము చేసిన ప్రభూ! వారు నిన్ను అప్పుడు "కేశవ" అను నామముతో కీర్తించిరి.
 
71-7
కంసాయ తే శౌరిసుతత్వముక్త్వా తం తద్వధోత్కం ప్రతిరుధ్య వాచా।
ప్రాస్తేన కేశిక్షపణావసానే శ్రీనారదేన త్వమభిష్ణుతో౾భూః॥
7వ భావము :-
భగవాన్! ఇదిజరిగిన పిదప, నారదముని - కంసుని వద్దకు వెళ్ళెను; నీవు వసుదేవసుతుడగు 'శౌరివి' - అని నీగురించి తెలిపెను. నిన్ను వధించవలెనని కృతనిశ్చయముతోనున్న అతనికి ఆ ప్రయత్నము విరమించుకొనమని ఉద్భోదించెను. అచ్చటనుండి ప్రభూ! నారదముని నీ చెంతకు వచ్చెను; నిన్ను స్తుతించెను.
 
71-8
కదా౾పి గోపైస్సహా కాననాంతే నిలాయనక్రీడనలోలుపం త్వామ్।
మయాత్మజః ప్రాప దురంతమాయో వ్యోమాభిధో వ్యోమచరోపరోధీ॥
8వ భావము :-
భగవాన్! ఒకరోజు - నీవు నీతోటి గోపబాలురతో కలిసి 'దాగుడుమూతలు' మొదలగు ఆటలలో నిమగ్నుడవై ఉంటివి. అప్పుడు 'వ్యోమాసురుడు' అను దానవుడు మీ వద్దకు వచ్చెను. ఇతడు 'మయుడు' అను రాక్షసుని కుమారుడు; ఆకాశములో ఎగురగలవాడు. అందుచేతనే అతనికి వ్యోమాసురుడు అను నామము కలిగెను. ఇతడు వ్యోమచరులగు దేవతలకు - ఉపద్రవములు కలిగించువాడు; మాయావి.
 
71-9
స చోరపాలాయితవల్లవేషు చోరాయితో గోపశిశూన్ పశూంశ్చ।
గుహాసు కృత్వా పిదధే శిలాభిస్త్వయా చ బుద్ధ్వా పరిమర్ధితో౾భూత్॥
9 వ భావము :-
భగవాన్! నీవు నీతోటి గోపబాలురతో కలిసి 'చోరుడు - రక్షక భటులు' అను ఆటను మొదలుపెట్టితివి. మాయావి అగు 'వ్యోమాసురుడు' గోపబాలుని రూపములో - చోరుడై - గోవులను, గోపబాలురను అపహరించి, ఒక కొండగుహలో ఉంచెను; ఆ గుహను పెద్ద బండరాతితో మూసివేయసాగెను. అది చూచి, ప్రభూ! నీవు. తక్షణమే ఆ 'వ్యోమాసురుని' వధించితివి; గోవులను - గోపాలురను రక్షించితివి.
 
71-10
ఏవంవిధైశ్చాద్భుతకేళిభేదైరానందమూర్ఛామతులాం వ్రజస్య।
పదే పదే నూతనయన్నసీమాం పరాత్మరూపిన్।పవనేశ।పాయాః॥
10 వ భావము :-
భగవాన్! నీవు - ఆ గోపాలురను పలురకముల క్రీడలతో ఆనందపరచుచు, ప్రభూ! నీ లీలలతో, మహత్యములతో - ఎప్పటికప్పుడు - ఆ వ్రజవాసులకు ఆశ్చర్య ఆనంద అనుభూతులను కలిగించుచుంటివి. అట్టి పరమాత్మ స్వరూపా! గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపుము.
 
దశమ స్కంధము
71వ దశకము సమాప్తము
-x-