నారాయణీయము/దశమ స్కంధము/68వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
68-వ దశకము - భగవత్ సాక్షాత్కారము
68-1
తవ విలోకనాద్ గోపికాజనాః ప్రమదసంకులాః పంకజేక్షణ।
అమృతధారయా సంప్లుతా ఇవ స్తిమితతాం దధుస్త్వత్పురో గతాః॥
1వ భావము
పంకజాక్షా! నీవట్లు తిరిగి కనిపించగనే ఆ గోపవనితలు అత్యంత ఆనందభరితులయిరి. అమృతధారలలో మునిగితేలినట్లుగా వారు పులకించి నిశ్చేష్టులయిరి.
68-2
తదనుకాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణతీ నిర్విశంకితమ్।
ఘనపయోధరే సంనిధాయ సా పులకసంవృతా తస్థుషీ చిరమ్॥
2వ భావము
ప్రభూ! అప్పుడు ఒకగోపిక - పద్మమువంటి నీహస్తమును తనచేత పట్టుకొని నిస్సంకోచముగా తనవక్షస్థలమన నిలుపుకొనెను; పులకితురాలై చాలాసమయము అట్లేనిలిచిపోయెను.
68-3
తవ విభో।పరాకోమలం భుజం నిజగలాంతరే పర్యవేష్టయత్।
గలసముద్ గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతీవాతిహర్షులా॥
3వ భావము
భగవాన్! మరియొక గోపవనిత - నీ సున్నిత హస్తమును తీసుకొని తనకంఠమునకు చుట్టుకొనెను. ఎట్లనగా - కుత్తుకనుండి తనప్రాణము ఎగిసిపోవుటను ఆపుటకా అనునట్లు నీ హస్తమును తనమెడచుట్టూ వేసి పట్టుకొనెను.
68-4
అపగతత్రపా కా౾పి కామినీ తవ ముకాంబుజాత్ పూగచర్వితమ్।
ప్రతిగృహయ్య తద్ వక్త్రపంకజే నిదధతీ గతా పూర్ణకామతామ్॥
4వ భావము
ప్రభూ! వేరొక గోపిక ఆతృతతో నీవు నమలుచున్న తాంబూలమును నీనుంచి తీసుకొని - ఏ సంశయములేక - తాను తినెను. అట్లుచేసి - తనకోరిక సిద్ధించినంత ఆనందమును పొందెను.
68-5
వికరుణో వనే సంవిహాయ మామపగతో౾సి త్వామిహ స్పృశేత్।
ఇతిసరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్॥
5వ భావము
భగవాన్! ఇంకొక గోపిక - నిన్నుచూడగానే - తన కన్నులలో నీరు నిండగా - నిన్ను రోషముతో చూచుచు - "దయలేనివాడా! నన్ను (నిర్దయగా) అడవిలో వదలి వెళ్ళితివి. మాలో ఇంక నిన్నెవరు తాకుదురు?" అని పలికెను.
68-6
ఇతి ముదాకులైర్వల్లవీజనైః సమముపాగతో యామునే తటే।
మృదుకుచాంబరైః కల్పితాసనే ఘుసృణభాసురే పర్యశోభథాః॥
6వ భావము
ప్రభూ! అప్పుడు ఆనందభరితమయిన హృదయములతో ఆ గోపికలు - కుంకుమ పుప్పొడులతో అలరారుచున్న తమ పైటకొంగులను ఆ యమునానదీతీరమున నీకైపరచిరి. నీవా ఆవస్త్రములపై ఆసీనుడవై- శోభిల్లితివి.
68-7
కతివిధా కృపా కే౾పి సర్వతో ధృతదయోదయాః కేచిదాశ్రితే।
కతిచిదీదృశా మాదృశేష్వపీత్యభిహితో భవాన్ వల్లవీజనైః॥
7వ భావము
భగవాన్! ఆ గోపికలు నీతో ఇట్లుసంభాషించిరి. "లోకములో కొందరు అందరిపట్ల సరిసమానమయిన దయ కలిగియుందురు. ఇంకొందరు తమను ఆశ్రయుంచిన వారిపట్లమాత్రమే దయకలిగియుందురు. కాని నీవంటివారు నీవే సర్వస్వమని నమ్మిననూ వారిపై జాలిలేక యుందురు"
68-8
అయి కుమారికా।నైవ శంక్యతాం కఠినతా మయి ప్రేమకాతరే।
మయి తు చేతసో వో౾నువృత్తయే కృతమిదం మయేత్యూచివాన్ భవాన్॥
8వ భావము
ప్రభూ! నీవప్పుడు ఆ గోపికలతో ఇట్లంటివి. " ఓ! ప్రియతమ గోపికలారా! మీకంటెను నాకు ప్రియమయినవారు -ఎక్కువయినవారు ఎవ్వరునులేరు. ఈ అందమయిన వెన్నెలరాత్రులలో నాతో విహరించండి", అని పలికితివి.
68-9
అయి నిశమ్యతాం జీవవల్లభాః।ప్రియతమో జనో నేదృశో మమ।
తదిహ రమ్యతాం రమ్యయామినీష్వనుపరోధమిత్యాలపో విభో।॥
9వ భావము
ప్రభూ! ఇంకనూ వారితో ఇట్లంటివి. "ప్రియగోపికలారా! నన్ను కఠినాత్ముడని తలచవలదు. నామాట వినండి. నేను అదృశ్యమగటతో నాయెడల మీ అనురాగము ఇంకనూ బలపడునని భావించి అట్లుచేసితిని. వేరొక విధముగా కాదు", అని పలికితివి.
68-10
ఇతి గిరాధికం మోదమేదురైర్ర్వజవధూజనైః సాకమారమన్।
కలితకౌతుకో రాసఖేలనే గురుపురీపతే।పాహిమాం గదాత్॥
10వ భావము
భగవాన్! ఈ విధముగా నీవు పలుకగనే - ఆ గోపస్త్రీలు అత్యంత ఆనందమును పొందిరి. ఆ గోపస్త్రీలతో విహరించుచూ, రాసక్రీడ నృత్యము చేయుచూ వారిని ఆనందంపజేసిన గురవాయూరు పురాధీశా! నా వ్యాధులనుండి నన్ను రక్షింపుము.
దశమ స్కంధము
68వ దశకము సమాప్తము
-x-