నారాయణీయము/దశమ స్కంధము/66వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
66వ దశకము - రాసక్రీడ
66-1
ఉపయాతానాం సుదృశాం కుసుమాయుధబాణపాతవివశానామ్।
అభివాంఛితం విధాతుం కృతమతిరపి తా జగాథ వామమివ॥
1వ భావము
ఆ విధముగా నీవద్దకు వచ్చిన, సౌందర్యవతులు - మదవతులు నగు ఆ గోపకాంతల మనసెరిగిన భగవాన్! ఇచ్చిన మాటప్రకారము వారి కోరిక (సముచితముకాకున్ననూ) తీర్చవలెనని సంకల్పించుకొనియూ - వారిని నిరూత్సాహపరచుచూ ప్రతికూలముగా పలికితివి.
66-2
గగనగతం మునినివహం శ్రావయితుం జగిథ కులవధూధర్మమ్।
ధర్మ్యం ఖలు తే వచనం కర్మ తు నో నిర్మలస్య విశ్వాస్యమ్॥
2వ భావము
భగవాన్! గగనతలమున సమస్త మునిగణము వినుచుండగా, ఆ మదవతులకు - గృహిణీ ధర్మములు - కర్తవ్యములయెడ వారికిగల భాద్యతలను తెలిపితివి. పరమాత్మా! నీ చర్యలు నీకు మాత్రమే పరిమితము. లోకులు నీ సందేశమును ఆచరించవలెనేకాని నీ చేతలనుకాదు.
66-3
ఆకర్ణ్వ తే ప్రతిపాం వాణీమేణీదృశః పరం దీనాః।
మా మా కరుణాసింధో।పరిత్యజేత్యతిచిరం విలేపుస్తాః॥
3వ భావము
భగవాన్! లేడి కన్నులవంటి కన్నులు కలిగిన ఆ గోపకాంతలు - వారి వాంఛితమునకు విరుద్ధమగు నీ పలుకులు విని మిక్కిలి వ్యధచెందిరి. కరుణాసింధో! అట్లుపలకవలదని పదేపదే నిన్ను ప్రార్ధించిరి.
66-4
తాసాం రుదితైర్లపితైః కరుణాకులమానసో మురారేత్వమ్।
తాభిః సమం ప్రవృత్తో యమునాపులినేషు కామమభిరంతుమ్॥
4వ భావము
భగవాన్! నీవు వారి దీనాలాపములకు దయతలచితివి; వారితో కలిసి ఆ యమునానదీతీరమున విహరించి వారిని ఆనందింపజేయుటకు నిశ్చయించుకొంటివి.
66-5
చంద్రకరస్యందలసత్ సుందరయమునాతటాంతవీథీషు।
గోపీజనోత్తరీయైరాపాదితసంస్తరో న్యషీదస్త్వమ్॥
5వ భావము
భగవాన్! పున్నమి వెన్నెల - కాంతికిరణములు, ఆ యమునానదీ ఇసుకతీరముపై మనోహరముగా ప్రసరించుచుండెను. ఆ ఇసుకతిన్నెలపై గోపకాంతలు నీకై వారి ఉత్తరీయములను పరిచిరి. వానిపై నీవు ఆసీనుడవైతివి.
66-6
సుమధుర నర్మాలపనైః కరసంగ్రహణైశ్చ చుంబనోల్లాసైః।
గాఢాలింగనసంగైస్త్వమంగనాలోకమాకులీ చకృషే॥
6వ భావము
ప్రభూ! నీవప్పుడు ఆ గోపికలతో సరససంభాషణలు చేయుచు వారి హస్తములను పట్టుకొని విహరించితివి; వారిని ఆలింగనము చేసుకొంటివి; పరవశింపజేసితివి.
66-7
వాసోహరణదినే యద్ వాసోహరణం ప్రతిశ్రుతం తాసామ్।
తదపి విభో రసవివశస్వాంతానాం కాంతసుభ్రువామదధాః॥
7వ భావము
భగవాన్! కాత్యాయనీవ్రత ముగింపుదినమున - గోపికా వస్త్రాపహరణము జరిగినసమయములో ఆ వ్రజాంగనలకు నీవు చేసిన వాగ్ధానమును - ఈ విధముగా అనుగ్రహించితివి.
66-8
కందళితఘర్మలేశం కుందమృదుస్మేరవక్త్రపాథోజమ్।
నందసుత।త్వాం త్రిజగత్ సుందరముపగూహ్య నందితా బాలాః॥
8వ భావము
నందుని పుత్రుడవైన శ్రీహరీ! అప్పుడు నీ దేహమునకు చిరుచెమట పట్టెను. మల్లెమొగ్గలను తలపించు తెల్లని పలువరసతో నీ మోము మందహాసముతో విరిసియుండెను. ముల్లోకములకు అధిపతివి - త్రిలోకసుందరుడవు అగు నిన్ను భగవాన్! అప్పుడు ఆ గోపికలు ఆలింగనము చేసుకొని పరమానందమును పొందిరి.
66-9
విరహేష్వంగారమయః శృంగారమయశ్చ సంగమే హి త్వమ్।
నితరామంగారమయస్తత్ర పునః సంగమే౾పి చిత్రమిదమ్॥
9వ భావము
భగవాన్! నీ భక్తులు నిన్నుదర్శించుకొన లేని ఎడబాటు సమయములలో వారిహృదయములను అంగారమయము (నిప్పు కణిక) వలె దహింపజేసెదవు. గోపికల విషయమననూ అదేజరిగినది. అప్పుడు నీవు అంగారమయుడివి (ఆనందింపజేసితివి).
66-10
రాధాతుంగపయోధరసాధుపరీరంభలోలుపాత్మానమ్।
ఆరాధయే భవంతం పవనపురాధీశ।శమయ సకలగదాన్॥
10వ భావము
భగవాన్! లక్ష్మీదేవిని సదా వక్షస్థలమునధరించిన లక్ష్మీనారాయణుడవు నీవు. రాధా ఆలింగనాభిలాషివలె కనిపించినను - నీ లీలలు బాహ్య స్మృతికి అగోచరములు. అట్టి గురవాయూరు పురాధీశా! నన్ను నా రోగమునుండి కాపాడుము.
దశమ స్కంధము
66వ దశకము సమాప్తము
-x-