నారాయణీయము/దశమ స్కంధము/61వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

61వ దశకము - ద్విజపత్నులను అనుగ్రహించుట


61-1
తతశ్చ బృందావనతో౾తిదూరతో వనం గతస్త్వం ఖలు గోప గోకులైః।
హృదంతరే భక్తతర ద్విజాంగనాకదంబకానుగ్రహణాగ్రహం వహాన్॥
1వ భావము. :-
భగవాన్! నీయందు ధృడభక్తి- కలిగియున్నటువంటి కొందరు - బ్రాహ్మణస్త్రీలను -అనుగ్రహించవలెననెడి తలంపుతో - ఒకనాడు - నీవు - గోవులు, గోపాలురతో కలిసి బృందావనమునకు దూరముగానున్న ఒక వనమునకు వెళ్ళితివి.
 
61-2
తతో నిరీక్ష్యాశరణే ననాంతరే కిశోరలోకం క్షుధితం తృషాకులమ్।
అదూరతో యజ్ఞ పరాన్ ద్విజాన్ ప్రతి వ్యసర్జయో దీదివియాచనాయ తాన్॥
2వ భావము. :-
ఆ వనము - బృందావనమునకు - బహు దూరముగా నున్నది. చాలాదూరము ప్రయాణము చేయుటచే గోవులు- గోపాలురు ఆకలి దప్పికలకు గురి అయిరి. అది గ్రహించిన భగవాన్! వారిని - నీవు - అచ్చటకు సమీపమున - బ్రాహ్మణులు యజ్ఞము చేయుచున్నట్టి - ఒకప్రదేశమును చూపి - అచ్చటకు వెళ్ళి ఆహారము అర్ధించమని చెప్పి - వారిని పంపితివి.
 
61-3
గతేష్వథో తేష్వభిదాయ తే౾భిధాం కుమారకేష్వోదనయాచిషు ప్రభో।
శ్రుతిస్థిరా అప్యభినిన్యురశ్రుతిం న కించిదూచుశ్చ మహీసురోత్తమాః
3వ భావము. :-
ఆ గోపాలురు - యాగముచేయుచున్న బ్రాహ్మణులవద్దకు పోయి - ప్రభూ! నీ నామమును వారికి తెలిపి - వారిని ఆహారముకొరకు అర్ధించిరి. వేదములను - వేదార్ధములను చదివిన - ఆ బ్రాహ్మణులు - గోపాలుర మాటలను పెడచెవినిబెట్టిరి; ఏమాత్రము స్పందించలేదు.
 
61-4
అనాదరాత్ ఖిన్నధియో హి బాలకాః సమాయయుర్యుక్తమిదం హి యజ్వసు।
చిరాదభక్తాః ఖలు తే మహీసురాః కథం హి భక్తం త్వయి తైః సమర్పృతే॥
4వ భావము. :-
బ్రాహ్మణుల నిరాదరణకు - నిరాశచెంది, ఆగోపబాలకులు నీవద్దకు తిరిగి వచ్చిరి. ఆ బ్రాహ్మణులు తాముచేయుచున్న యజ్ఞయాగ - క్రతువులయందు మాత్రమే శ్రద్ధాళువులు; కాని యజ్ఞపురుషుడవగు నీయందు శ్రద్ధ లేనివారు. అట్టి ఆ బ్రాహ్మణులు, భగవాన్! నీవే స్వయముగా కోరిననూ - నీకు ఎట్లు ఆహారము సమర్పించగలరు?
 
61-5
నివేదయధ్వం గృహిణీజనాయ మాం దిశేయురన్నం కరుణాకులా ఇమాః।
ఇతి స్మితార్ధ్రం భవతేరితా గతాస్తే దారకా దారజనం యయాచిరే॥
5వ భావము. :-
బ్రాహ్మణుల నిరాదరణతో తిరిగివచ్చిన ఆ గోపాలురను చూసి, భగవాన్! చిరునవ్వుతో నీవిట్లంటివి. "(నిరాశపడవలదు) మీరిప్పుడు-నేనిచ్చటకు వచ్చియున్నానని- ఆ విప్రపత్నులకు తెలియజేయుడు. వారు దయార్ద్రహృదయులు - మీకు (తప్పక) ఆహారమునొసగెదరు." అంతట - ఆ గోపబాలురు ఆ విప్రపత్నులకు అట్లేచెప్పి - యాచించిరి.
 
61-6
గృహీతనామ్ని త్వయి సంభ్రమాకులాశ్చతుర్విధం భోజ్యరసం ప్రగృహ్య తాః।
చిరం ధృతత్వత్ప్రవిలోకనాగ్రహాః స్వకైర్నిరుద్దా అపి తూర్ణమాయయుః॥
6వ భావము. :-
నీ నామమును వినీవినగనే, భగవాన్!- నిన్నుచూడవలెననెడి చిరకాలకోరికతోయున్న - ఆ విప్రపత్నులు సంభ్రమాశ్చర్యములతో - నాలుగువిధములగు ఆహారపదార్ధములను తీసుకొని - వారి బంధుమిత్రులు వలదని వారించుచున్ననూ వారు నీ వద్దకు శీఘ్రమేవచ్చిరి.
 
61-7
విలోలఫింఛం చికురే కపోలయోః సముల్లసత్కుండలమార్ధ్రమీక్షితే।
నిధాయ బాహుం సుహృదంససీమని స్థితం భవంతం సమలోకయంత తాః॥
7వ భావము. :-
భగవాన్! (వారు వచ్చుసమయమునకు) నెమలిపింఛముచే అలంకృతమైన శిరోజములతో - చెక్కిళ్ళను కాంతివంతముచేయు కర్ణకుండలములతో - దయార్ధ్రనేత్రములతో - ఒక మిత్రుని భుజముపై నీ చేతిని నిలిపి - మనోహరముగా నీవు నిలిచియుంటివి. అట్టి నీ రూపమును ఆ విప్రపత్నులు అలవికాని ఆనందముతో దర్శించిరి.
 
71-8
తదా చ కాచిత్ త్వదుపాగమోద్యాతా గృహీతహస్తా దయితేన యజ్వనా।
తదైవ సంచింత్య భవంతమంజసా వివేశ కైవల్యమహో కృతిన్యసౌ॥
8వ భావము. :-
ప్రభూ! ఆ విప్రపత్నులలోని ఒక స్త్రీ - నిన్ను (దగ్గరనుండి) చూడవలెనని - ఆతృతతో త్వరత్వరగా ముందుకు వచ్చుచుండెను. ఆమెను వారించవలెనని ఆమెభర్త-యజ్ఞకర్తయగు బ్రాహ్మణుడు ఆమెను నివారించుటకు ఆమెహస్తమును పట్టుకొనెను. ఆమె నిన్నుధ్యానించుచూ - మరుక్షణమే ప్రాణమువీడెను; నీలో ఐక్యమయ్యెను; ఎంత ఆశ్చర్యము!. ఆహా! ఆమె ఎంతపుణ్యాత్మురాలో కదా!
 
61-9
ఆదాయ భోజ్యాన్యనుగృహ్య తాః పునస్త్వదంగసంగ స్పృహయోజయితీర్గృహమ్।
విలోక్య యజ్ఞాయ విసర్జయన్నిమాశ్చకర్థ భర్తౄనపి తాస్వగర్హణాన్॥
9వ భావము. :-
భగవాన్! ఆ విప్రపత్నులు తెచ్చిన ఆహారపదార్ధములను స్వీకరించితివి. నీ వెంటనే ఉండి, నిన్ను సేవించుచూ, నీలో ఐక్యమగు భాగ్యమును కోరిన ఆ విప్రపత్నులను వారించి - ధర్మకార్యము చేయుచున్న వారిభర్తల కార్యమునకు విఘ్నము కలుగకుండుటకును, అపార్ధము కలుగకుండుటకును - వారిని - వారిగృహములకు తిరిగి పంపివేసితివి.
 
61-10
నిరూప్య దోషం నిజమంగనాజనే విలోక్య భక్తిం చ పునర్విచారిభిః।
ప్రబుద్ధతత్త్వైస్త్వమభిష్టుతో ద్విజైర్మరుత్పురాధీశ। నిరుంధి మే గదాన్।
10వ భావము. :-
భగవాన్! (ఇది చూచి) యాగము నిర్వర్తించుచున్న విప్రులు వారి పొరపాటును గ్రహించుకొనిరి. తమ పత్నులలోని భక్తిని చూచి- తాము వైదిక క్రతువులుచేయుచూ భక్తిని నిర్లక్ష్యము చేసితిమనియు, తమ పత్నులలోని నిర్మలభక్తియే వారిని శ్రీకృష్ణునివద్దకు చేర్చినదనియు తెలుసుకొనిరి. నిన్ను ప్రశంసించిరి. అట్టి కృష్ణునిరూపములో నెలకొనియున్న ఓ! గురవాయూరు పురాధీశా! నా రోగమును నిర్మూలించుము. నన్ను రక్షించుము.

 
దశమ స్కంధము
61వ దశకము సమాప్తము.
-x-