నారాయణీయము/దశమ స్కంధము/53వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

53వ దశకము - ధేనుకాసురవధ

53-1
అతీత్య బాల్యం జగతాంపతే। త్వముపేత్య పౌగండవయో మనోజ్ఞమ్।
ఉపేక్ష్య వత్సావనముత్సవేన ప్రావర్తథా గోగణపాలనాయామ్॥
1వ భావము:-
భగవాన్! నీవు బాల్యమును దాటి పౌగండ బాలుని వయస్సు లోనికి ప్రవేశించితివి. ఆ పౌగండ వయస్సులో మనోజ్ఞమైన రూపముతోనున్న నీవు గోదూడలను వదలి. గోవుల పర్యవేక్షణను ఉత్సాహముగా స్వీకరించితివి.

53-2
ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ।తవ ప్రవృత్తిః।
గోత్రాపరిత్రాణకృతే౾వతీర్ణస్తదేవ దేవా౾౾రభస్తథా యత్॥
2వ భావము:-
గురువాయూరు పురాధీశ్వరా! గోపాలుడవై - గోవుల సంరక్షణమునకు నీవు ఉపక్రమించుట అను ఈ కార్యము - నీ అవతార లక్ష్యమైన భూ పరిరక్షణకు సరియైనది.

53-3
కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్ష్య చరన్ సుఖేన।
శ్రీదామనామ్నః స్వసఖస్య వాచా మోదాదగా ధేనుకకాననం త్వమ్॥
3వ భావము:-
ఒకనాడు నీ సోదరుడు - బలరామునితో కలిసి సుందరమైన ఆ వనములలో విహరించుచుంటివి. ఆ సమయమున నీ మిత్రుడగు శ్రీధాముడు, అచ్చటకు సమీపమున ఉన్న ధేనుకవనమును గురించి నీకు చెప్పెను. అంతట నీవు నీ మిత్రులతో కలిసి ఆనందముగా ఆ ధేనుకావనమును ప్రవేశించితివి.

53-4
ఉత్తాలతాలీనివహే త్వద్యుక్త్యా బలేన ధూతే౾థ బలేన దోర్భ్యామ్।
మృదుః ఖరశ్చాభ్యపతత్ పురస్తాత్ ఫలోత్కరో ధేనుకదానవో౾పి॥
4వ భావము:-
భగవాన్! నీవు ప్రేరేపించగా బలరాముడు తన రెండు చేతులతో బలముగా - ఎత్తయిన తాటిచెట్లను ఊపెను. అప్పుడు తాటిపండ్లు మరియు తాటికాయలు మీ ఎదుట గుట్టలు గుట్టలుగా పోగుపడెను. అదే సమయమున, ధేనుకాసురుడు అను దానవుడు ఒక గాడిద రూపమున మీ ఎదుటకు వచ్చెను.

53-5
సముద్యతో ధైనుకపాలనే౾హం కథం వధం ధైనుకమద్య కుర్వే।
ఇతీవ మత్వా ధ్రువమగ్రజేన సురౌఘయోద్ధారమజీఘనస్త్వమ్॥
5వ భావము:-
“గోవుల సంరక్షణలోనున్న నేను ఎట్లు - ఈ ధేనుకాసురుని సంహరించగలను?” అని యోచించితివో ఏమోగానీ! ప్రభూ! ఆ దేవతల శత్రువగు ఆ ధేనుకాసురుని వధించమని నీవు నీ అగ్రజుడు బలరాముని నియమించితివి.

53-6
తదీయ భృత్యానపి జంబుకత్వేనోపాగతానగ్రజసంయుతస్త్వమ్।
జంబూఫలానీవ తదా నిరాస్థస్తాలేషు ఖేలన్ భగవన్।నిరాస్థః ॥
6వ భావము:-
ప్రభూ! అప్పుడు ధేనుకాసురుని అనుచరులగు దానవులు జంబుక రూపమున, మిమ్ములను వధించుటకు వచ్చిరి. వారిని బలరామునితో కలిసి అనాయాసముగా - జంబుక ఫలములను కొట్టినట్లుగా తాటి చెట్లకు కొట్టి వధించి వేసితిరి.

53-7
వినిఘ్నతి త్వయ్యథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్।
భయాకులో జంబుకనామధేయం శ్రుతి ప్రసిద్ధం వ్యధితేతి మన్యే॥
7వ భావము:-
ప్రభూ! నీవు మరియు బలరాముడు అట్లు - ఆ జంబుకముల గుంపును వధించుటచే “జంబుక” అను నామధేయముతో వేదములలో ప్రసిద్ధుడైన వరుణదేముడు తన ఈ జంబుక నామమును మీ భయముచేతనే వేదములకు మాత్రమే పరిమితము చేసుకొనెను - అని తలచుచుంటిని.

53-8
తవావతారస్య ఫలం మురారే। సంజాతమద్యేతి సురైర్నుతస్త్వమ్।
సత్యం ఫలం జాతమిహేతి హాసీ బాలైస్సమం తాలఫలాన్యభుంక్థాః॥
8వ భావము:-
మురారీ! ధేనుకాసుర సంహారము అనునది నీ అవతారఫలము అని దేవతలు స్తుతించుచుండగా - "నిజమైన ఫలము ఇక్కడ ఉన్నది” అని నీవు హాస్యముగా పలుకుచూ ఇతర గోపాలురతో కలిసి అక్కడ ఉన్న తాటిపండ్లను భుజించితివి.

53-9
మధుద్రవస్రుంతి బృహంతి తాని ఫలాని మేదోభరభృంతి భుక్త్వా।
తృప్తైశ్చ దృప్తైర్భవనం ఫలౌఘం వహద్భిరాగాః ఖలు బాలకైస్త్వమ్॥
9వ భావము:
ప్రభూ! ఆ వనములోని తాటిపండ్లు తేనెలూరుచూ తీయని రసముతో, గుజ్జుతో నిండియున్నవి. ఆ పండ్లను మీరు తృప్తిగా భుజించిరి. పిదప విజయోత్సాహముతో మోయగలిగినన్ని ఫలములను మోసుకొని మీరు మీమీ ఇళ్లకు తిరిగి వచ్చిరి.

53-10
హతోహతో ధేనుక ఇత్యుపేత్య ఫలాన్యదద్బిర్మధురాణి లోకైః ।
జయేతి జీవేతి నుతో విభో। త్వం మరుత్పరాధీశ్వరా।పాహి రోగాత్॥
10వ భావము:-
ప్రభూ! అప్పుడు బృందావన వాసులు “ధేనుకాసురుడు మరణించెను!” అని సంతోషముగా పలుకుచూ, మీరు తెచ్చిన మధుర ఫలములను ఆరగించుచూ, “జయము జయము” - "చిరంజీవ” అని నిన్ను స్తుతించిరి. ధేనుకాసురుని సంహరించిన గురువాయూరు పురాధీశ్వరా! నన్నురక్షించుము. నా రోగములు హరించుము.

దశమ స్కంధము
53వ దశకము సమాప్తము.
-x-