నారాయణీయము/దశమ స్కంధము/48వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
48వ దశకము - యమళార్జునోద్ధారము
48-1
ముదా సురౌఘ్తైస్త్వముదారసమ్మదైరుదీర్య దామోదర ఇత్యభిష్టుతః।
మృదూదరః స్త్వరములూఖలే లగన్నదూరతో ద్వౌ కకుభావుదైక్షథాః॥
1వ భావము:-
కృష్ణా! నీ తల్లి యశోద - నిన్ను రోలుకు కట్టి - గృహములోపలికి వెడలెను. నీ ఉదరము (పగ్గముతో) రోలుకు కలిపి - కట్టబడుట చూచిన దేవతలు - ఆనందముతో నిన్ను "దామోదరుడు" అని కీర్తించిరి. ప్రభూ! నీవు సుకుమార దేహముతోనున్న బాలుడవు; అయినను దేవతలు నిన్నట్లు కీర్తించుట విని ఆనందించుచుంటివి. అప్పుడు నీకు కొంతదూరమున రెండు మద్దిచెట్లు కనిపించెను.
48-2
కుబేరసూనుర్నలకూబరాభిధః పరో మణిగ్రీవ ఇతి ప్రథాం గతః।
మహేశసేనాధిగతశ్రియోన్మదౌ చిరం కిల త్వద్విముఖావఖేలతామ్॥
2వ భావము:-
ఆ మద్దిచెట్లు శాపగ్రస్తులగు 'కుబేరుని' పుత్రులు. వారు 'నలకూబరుడు' మరియు 'మణిగ్రీవుడు' అను పేరుగల ప్రముఖ యక్షులు. వీరు పరమశివుని భక్తులు. శివుని అనుగ్రహముతో సకల ఐశ్వర్యములను పొంది - గర్వాంధులై, ప్రభూ! వీరు నీయెడల నిర్లక్ష్యముతో వ్యవహరించుచుండిరి.
48-3
సురాపగాయాం కిల తౌ మదోత్కటౌ సురాపగా యద్భహుయౌవతావృతౌ।
వివాససౌ కేళిపరౌ స నారదో భవత్పదైకప్రవణో నిరైక్షత॥
3వ భావము:-
ఆ కుబేరుని పుత్రులు - ఒకనాడు తమ స్త్రీజనముతో కలిసి దేవనదియగు గంగానదిలో జల- క్రీడలాడుచుండిరి. సంపదగర్వముతో మదించియున్న - వారు- అప్పుడు అతిగా మద్యము సేవించియుండిరి; తమ దేహములపై వస్త్రములు లేని సంగతి సహితము గమనించక గానముచేయుచు క్రీడించుచుండిరి. ఎల్లవేళల నీపాదములనే నమ్ముకొనిన 'నారద ముని' ఆ సమయమున అచ్చటకు వచ్చి - వారిని చూచుట తటస్థించెను.
48-4
భియా ప్రియాలోకముపాత్తవాససం పురో నిరీక్ష్యాపి మదాంధచేతసౌ।
ఇమౌ భవద్భక్త్యుపశాంతిసిద్ధయే మునిర్జగౌ శాంతిమృతే కుతస్సుఖమ్॥
4వ భావము:-
నారదమునినిచూచి - భయపడిన స్త్రీలు - వస్త్రములను ధరించి అచ్చటనుండి వెడలిపోయిరి. కాని ఆ కుబేరుని పుత్రులు మాత్రము మధాంధచిత్తులై - నారదుని ఉపేక్షించి అట్లే క్రీడించుచుండిరి. ప్రభూ! వారికి నీయందు భక్తి - వారి చిత్తములకు శాంతి కలుగు సమయము ఆసన్నమయ్యెను. అందులకే వారు నారదమునిని చూచినను అలక్ష్యము చేసిరి; ఆ ముని శాపమునకు గురి అయిరి. చిత్తశాంతి లేనివానికి భక్తి ఎట్లు కుదురును?
48-5
యువామవాప్తౌ కకుభాత్మతాం చిరం హరిం నిరీక్ష్యాథ పదం స్వమాప్నుతమ్।
ఇతీరితౌ తౌ భవదీక్షణస్పృహం గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతుః॥
5వ భావము:-
అప్పుడు నారదముని - ఆ యక్షుల నిరువురను - మద్దిచెట్లు రూపమును పొందమనియు; చాలాకాలము గడిచిన పిదప వారికి విష్ణు దర్శనము కలిగి నిజరూపమును పొందెదరనియు శపించెను. అప్పటినుండియు, ఆ యక్షులు, మద్దిచెట్లు రూపముతో - వ్రజమునకు (గోకులమునకు) అతి సమీపమున - విష్ణుదర్శనమునకై - నిరీక్షించుచుండిరి.
6వ భావము:-
ప్రభూ! బాల కృష్ణా! నీవు నిదానముగా - మందగమనముతో, నీ ఉదరమునకు కట్టిన ఆ రోలును లాగుకొనుచు....త్రోసుకొనుచు....ఆ మద్దిచెట్లును సమీపించితివి; ఆ రెండు మద్దివృక్షముల మధ్యగా వెళ్ళితివి. రోలు వృక్షముల నడుమ నిలచిపోయెను. రోలు కదలకపోవుటచే నీవు ఆరోలును (బలముగా) లాగుటకు ప్రయత్నించితివి. దానితో చిరకాలముగా అచ్చటనే నిలచియున్న ఆ చెట్లు విరిగి పడిపోయెను.
48-6
అతంద్రమింద్రద్రుయుగం తథావిధం సమేయుషా మంథరగామినా త్వయా।
తిరాయితోలూఖలరోధనిర్ధుతౌ చిరాయ జీర్ణౌ పరిపాతితౌ తరూ॥
6వ భావము:-
ప్రభూ! బాల కృష్ణా! నీవు నిదానముగా - మందగమనముతో, నీ ఉదరమునకు కట్టిన ఆ రోలును లాగుకొనుచు....త్రోసుకొనుచు....ఆ మద్దిచెట్లును సమీపించితివి; ఆ రెండు మద్దివృక్షముల మధ్యగా వెళ్ళితివి. రోలు వృక్షముల నడుమ నిలచిపోయెను. రోలు కదలకపోవుటచే నీవు ఆరోలును (బలముగా) లాగుటకు ప్రయత్నించితివి. దానితో చిరకాలముగా అచ్చటనే నిలచియున్న ఆ చెట్లు విరిగి పడిపోయెను.
48-7
అభాజి శాఖిద్వితయం యదా త్వయా తదైవ తద్గర్భతలాన్నిరేయుషా।
మహత్విషా యక్షయుగేన తత్ క్షణాదభాజి గోవింద। భవానపి స్తవైః॥
7వ భావము:-
గోవిందా! ఆ విరిగిన మద్దివృక్షముల నడుమనుండి - ఆక్షణముననే శాపవిమోచనులై ఆ ఇరువురు యక్షులు బయటకు వచ్చిరి. ప్రకాశించుచున్న ఆ యక్షులు, ప్రభూ! తక్షణమే నిన్ను స్తుతించసాగిరి.
48-8
ఇహాన్యభక్తో౾ పి సమేష్యతి క్రమాత్ భవంతమేతౌ ఖలు రుద్రసేవకౌ।
మునిప్రసాదాత్ భవదంఘ్రిమాగతౌ గతౌ వృణానౌ ఖలు భక్తిముత్తమామ్॥
8వ భావము:-
ప్రభూ! ఈ లోకమున- ఇతర దేవతల భక్తులు సహితము కాలక్రమమున నీయందు భక్తిని పొంది నిన్ను చేరుదురు. కుబేరుని పుత్రులు శివభక్తులే అయినను నారదముని అనుగ్రహముతో నీ పాదములను ఆశ్రయించిరి. ముక్తిని కోరుచు నిన్ను స్తుతించిరి; వారి స్థానములను వారు తిరిగి పొందిరి.
48-9
తతస్తరూద్ధారణ దారుణారవప్రకంపి సంపాతిని గోపమండలే।
విలజ్జిత త్వజ్జననీ ముఖేక్షిణా వ్యమోక్షి నందేన భవాన్ విమోక్షదః॥
9 వ భావము:-
వృక్షములు విరిగిపడిన భీకర శబ్ధమునకు భీతిచెందిన గోకులవాసులు పరుగు పరుగున అచ్చటకు వచ్చిరి. నిన్ను బంధించినందుకు - నీ తల్లి యశోద మిక్కిలి వ్యధచెంది సిగ్గుతో తలదించుకొనెను. సకల జీవులకు ముక్తిని (మోక్షమును) కలిగించు నీకు, ప్రభూ! నీ తండ్రి నందుడు - త్రాళ్ళను త్రెంచి ఆ రోలు బంధమునుండి నిన్ను విముక్తుని చేసెను.
48-10
మహీరుహోర్మధ్యగతో బతార్భకో హరేః ప్రభావాదపరిక్షతో౾ధునా।
ఇతి బ్రువాణైర్గమితో గృహం భవాన్ మరుత్పురాధీశ్వర పాహిమాం గదాత్॥
10వ భావము:-
"ఆహా! ఇది ఎంత అద్భుతమో! వృక్షములు విరిగి పడుచున్నప్పుడు ఈ పసివాడు ఆ వృక్షముల మధ్యనే ఉండెను కదా! భగవంతుని దయవలననే ఇతడు క్షేమముగానున్నాడు. ఏ హానియు జరుగలేదు", అని ఆశ్చర్యముగా ఆ గోకుల జనులు - వారిలో వారు చెప్పుకొనుచు - ప్రభూ! నిన్ను నీ గృహమునకు చేర్చిరి. భగవాన్! గురవాయూరుపురాధీశా! నా రోగమునుండి - నన్ను రక్షింపుము.
దశమ స్కంధము
48వ దశకము సమాప్తము.
-x-