నారాయణీయము/దశమ స్కంధము/39వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

39వ దశకము - యోగమాయానయనవర్ణనమ్


39-1
భవంతమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్
దదర్శ గగనోచ్చలజ్జలభరాం కలిందాత్మజామ్।
అహో సలిలసంచయః స పునరైంద్రజాలోదితో
జలౌఘ ఇవ తత్ క్షణాత్ ప్రప్రదమేయతామాయయౌ॥
1వ భావము:-
భగవాన్! యదువంశోత్తముడైన వసుదేవుడు, శిశురూపముననున్న నిన్ను ఎత్తుకొని ఆ కారాగారమును వీడి - యమునానదీ తీరమును చేరెను. ఆ సమయమున యమునానది ఉత్తంగతరంగములతో నిండుగా ప్రవహించుండెను. వసుదేవుని చూచిన తక్షణమే - ఇంద్రజాల మాయవలె ఆ కళిందానది ( కళింద పర్వతమున పుట్టుటచే కళిందకన్య ఐన యమున) తన ఉధృతిని తగ్గించుకొని పాదములు మునుగునంత లోతుకు తగ్గి మీకు మార్గముచూపెను.

39-2
ప్రసుప్తపశుపాలికాం నిభృతమారుదద్బాలికాం
అపావృతకవాటికాం పశుపవాటికామావిశన్।
భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదాద్
వహన్ కపటకన్యకాం స్వపురమాగతో వేగతః॥
2వ భావము:-
భగవాన్! నిన్ను ఎత్తుకొని - వసుదేవుడు ఆ కళిందానదిని దాటి నందుని గృహప్రాంగణమును చేరెను. ఆ అర్ధరాత్రిసమయమున నీరాకకొరకే ఎదురుచూచున్నవా! అనునట్లు ఎవరి ప్రమేయము లేకనే ఇంటి తలుపులు తెరుచుకొనెను. వసుదేవుడు నందుని ఇంట ప్రవేశించి - గోపకాంతలు అచట ఆదమరిచి నిద్రించుట చూచెను; ప్రసూతిగృహమునుండి బాలికాశిశువు రోదనను వినెను. ఆ రోదనను వినిన వసుదేవుడు నిశ్శబ్ధముగా అచ్చటకు చేరెను. ఆ ప్రసూతితల్పమున నిన్నుజేర్చి ఆ బాలికా శిశువును (యోగమాయను) తీసుకొని తనపురమగు మధురానగరిని చేరెను.

39-3
తతస్త్వదనుజారవ క్షపిత నిద్ర వేగ ద్రవద్
భటోత్కర నివేదిత ప్రసవ వార్తయైవార్తిమాన్।
విముక్త చికురోత్కరస్త్వ మాపతన్ భోజరా-
డతుష్ట ఇవ దృష్టవాన్ భగినికాకరే కన్యకామ్॥
3వ భావము:-
భగవాన్! నీసోదరిని (యోగమాయను) తీసుకొని వసుదేవుడు తిరిగి రాగా - ఆ రాత్రిసమయమున ఆ బాలిక ఏడుపు శబ్ధము విని, కారాగార కావలిభటులు పరుగుపరుగున కంసుని వద్దకు వెడలిరి; దేవకి ప్రసవించినదని ఆ భోజరాజుకు (కంసునికి) తెలిపిరి. ఆ వార్త వినిన కంసుడు మిక్కిలి కలతచెందెను. ఉద్వేగముతో - తన ఊడిన జుట్టు ముడిని సహితము గమనించక వెనువెంటనే చెరసాలకు వచ్చెను; దేవకి చేతిలోని పసిపాపను (బాలికను) చూచి అసంతృప్తుడై ఏమియు తోచని స్థితికి లోనయ్యెను.

39-4
ధ్రువం కపటశాలినో మధుహారస్య మాయా భవేత్
అసావితి కిశోరికాం భగినికాకరాలింగితామ్।
ద్విపో నలినికాంతరాదివ మృణాళికామాక్షిపన్
అయం త్వదనుజామజాముపలపట్టకే పిష్టవాన్॥
4వ భావము:-
భగవాన్! వెనువెంటనే తేరుకొనిన ఆ కంసుడు - 'మధు దైత్యుని సంహరించిన మాయావి యగు శ్రీహరియే ఈ బాలిక' అని తలచెను. తనసోదరి దేవకి హస్తములలోనున్న నీ సోదరిని - ఏనుగు తామరకొలనులోని తామరకాడను పెరికిన విధముగా లాగివేసెను; ఆవేశముతో (నిర్ధాక్షిణ్యముగా) ఆ బాలికను రాతిపలకపై పడవేసి కొట్టెను.

39-5
తతో భవదుపాసకో ఝటితి మృత్యుపాశాదివ
ప్రముచ్య తరసైవ సా సమధిరూఢరూపాంతరా।
అధస్తలమజగ్ముషీ వికసదష్టబాహుస్ఫుర-
న్మహాయుధమహో గతాకిల విహయసా దిద్యుతే॥
5వ భావము:-
కంసుడు అట్లు ఆ పసిపాపను కొట్టగానే, భగవాన్! నీ ఉపాసకుడు శ్రీఘ్రముగా మృత్యుపాశమునుండి విడువడునట్లు, - ఆ యోగమాయ కంసుని హస్తములనుండి వేగముగా విడువడి భూతలమునుండి ఆకాశమునకు ఎగిరిపోవుచూ రూపాంతరము చెందెను. ఆమె అష్టభుజములతో - హస్తములలో ఆయుధములను ధరించి - మహాదేవి రూపమున ఆకాశమున ప్రకాశించుచు ఇట్లనెను.

39-6
నృశంసతర। కంస। తే కిము మయా వినిష్పిష్టయా
బభూవ భవదంతకః క్వచన చింత్యతాం తే హితమ్।
ఇతి త్వదనుజా విభో। ఖలముదీర్య తం జగ్ముషీ
మరుద్గణపణాయితా భువి చ మందిరాణ్యేయుషీ॥
6వ భావము:-
"క్రూరుడా! కంసా! నన్ను వధించుటవలన నీకేమి ప్రయోజనము? నిన్ను అంతమొందించువాడు వేరొకచోట పెరుగుచున్నాడు. నీ ప్రాణరక్షణకై చింతనచేయుము". అని పలికి నీ సోదరి - దేవతలు తనను స్తుతించుచుండగా అంతర్ధానమయ్యెను; ఆమె అనేక శక్తులుగా దేవతారూపములలో భూమిపై పలు దేవాలయములలో ఆరాధించబడుచుండెను.

39-7
ప్రగే పునరగాత్మజావచనమీరితా భూభుజా
ప్రలంబబకపూతనాప్రముఖదానవా మానినః।
భవన్నిధనకామ్యయా జగతి బభ్రముర్నిర్భయాః
కుమారకవిమారకాః కిమివ దుష్కరం నిష్కృపైః॥
7వ భావము:-
పార్వతి (యోగమాయ) తనను వధించు శిశువు వేరొకచోట పెరుగుచుండెనని పలికిన పలుకులు విని - భగవాన్! కంసుడు మరుసటిరోజు ఉదయముననే నిన్ను హతమార్చుటకు ప్రయత్నములను ప్రారంభించెను. కంసుని ఆజ్ఞతో 'ప్రలంబ’, ‘బక’, ‘పూతన ' మున్నగు రాక్షసులు నిన్ను వెదికి హతమార్చుటకై లోకములనెల్లెడలా నిర్భయముగా సంచరించసాగిరి. కానవచ్చిన నవజాత శిశువులెల్లరును వారు చంపసాగిరి. దయలేని వారికి చేయకూడనిది ఏమియుండును?

39-8
తతః పశుపమందిరే త్వయి ముకుంద । నందప్రియా-
ప్రసూతిశయనే శయే రుదతి కించిదంచత్పదే।
విబుధ్య వనితాజనై స్తనయసంభవే ఘోషితే
ముదా కిము వదామ్యహో। సకలమాకులం గోకులమ్॥
8వ భావము:-
భగవాన్! గోకులాధిపతియగు 'నందుని' గృహమున అతని భార్య'యశోద' శయ్యపై 'వసుదేవుడు' నిన్ను వదలి వెళ్లిన పిదప, నీవు నీ చిరుపాదములను కదిలించుచూ రోదించితివి. ఆ శబ్ధమునకు గోపకాంతలు మేల్కొని యశోదాదేవిని మేల్కొలిపిరి. ఆమెకు పుత్ర జననము కలిగినదని ప్రకటించిరి. ఆహా! ముకుందా! నీ జనన ఆగమన వార్త ఆ గోకులవాసులకు వర్ణింపశక్యముగాని ఆనందమును కలిగించినది.

39-9
అహో। ఖలు యశోదయా నవకలాయచేతోహరం
భవంతమలమంతికే ప్రథమమాపిబంత్యా దృశా।
పునస్తనభరం నిజం సపది పాయయంత్యా ముదా
మనోహరతనుస్పృశా జగతి పుణ్యవంతో జితాః॥
9వ భావము:-
నీలికలువ పువ్వువలె మెరయుచూ తన ప్రక్కనే పవ్వళించియున్న నిన్ను చూచి, భగవాన్! ఆ యశోదాదేవి కన్నులనుండి ఆనందభాష్పములు రాలెను; ఆమె ఆనందామృతమును గ్రోలెను. ఆమె నిన్ను తనవద్దకు ప్రొదివి పట్టుకొని తన క్షీరమును నీకు త్రాగించెను. మనోహరమైన నీ రూపమును పదేపదే తాకుచూ ఆనందానుభూతిని పొందసాగెను. యశోదను మించిన అదృష్టవంతులు ఈ లోకమున ఎవ్వరుందురు?

39-10
భవత్కుశలకామ్యయా స ఖలు నందగోపస్తదా
ప్రమోదభరసంకులో ద్విజకులాయ కిం నాదదాత్।
తథైవ పశుపాలకాః కిము న మంగళం తేనిరే
జగత్త్రితయమంగళ। త్వమిహ పాహి మామామయాత్॥
10వ భావము:-
భగవాన్! నీ జననముతో గోకులాధిపతియగు 'నందుడు'కూడా మిక్కిలి ఆనందభరితు డయ్యెను. నీ క్షేమముకోరి, బ్రాహ్మణులకు ఆయన చేయని దానమేదియును లేదు; చేయని వేడుకలేదు. పురజనులెల్లరూకూడా వారివారి గృహములలో సంబరములు జరుపుకొనిరి. ముల్లోకులకు శుభము కలిగించు కృష్ణావతారా! నీవు గురవాయూరులో వెలసితివి. అట్టి నిన్ను ప్రభూ! నన్ను నా రోగమునుండి రక్షింపమని ప్రార్ధించుచున్నాను.

దశమ స్కంధము
39వ దశకము సమాప్తము.
-x-