నారాయణీయము/తృతీయ స్కంధము/13వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

13వ దశకము - హిరణ్యాక్ష వధ వర్ణనం

13-1-శ్లో.
హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణపరం
చరంతం సాంవర్తే పయసి నిజజంఘాపరిమితే।
భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిః।
శనైరూచే నందన్ దనుజమపి నిందంస్తవ బలమ్||
1వ. భావము.
వరదా! తనతో యుద్ధము చేయగల శత్రువు విష్ణువే అని వరుణదేవుడు చెప్పగా వినిన హిరణ్యాక్షుడు, తన కాలి పిక్కల లోతు గల ప్రళయ జలమందు సంచరించుచూ నిన్ను అన్వేషించెను. అప్పుడు నీ భక్తుడూ, మాయాద్యూత నేర్పరి అయిన నారదముని ఆ హిరణ్యాక్షుని సమీపించి, నిదానముగా, ఆ అసుర నందనుని శక్తిసామర్ధ్యములను పొగుడుచూ, నీ శక్తిని తక్కువ జేసి ఇట్లు పలికెను.

13-2-శ్లో.
స మాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం
ప్రభో! కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః।
నదన్ క్వా౾సౌ క్వాసావితి స మునినా దర్శితపథో
భవంతం సంప్రాపత్ ధరణీధరముద్యంతముదకాత్||
2వ. భావము.
“ప్రభో! పరాక్రమముతో నీవు పొందిన పుడమిని, మాయావి యైన విష్ణువు అపహరించుకొని పోవుచున్నాడు. అయ్యో! నీకు ఎంత కష్టము కలిగినది?“ అని నారదుడు పలికాడు; “విష్ణువా ఏడి? ఎక్కడున్నాడు?“ అని బిగ్గరగా అరుచుచున్న ఆ హిరణ్యాక్షునికి, నారదమహర్షి, రసాతలమున నిన్ను చూపెను. అంతట హిరణ్యాక్షుడు నిన్ను చేరి, సముద్రగర్భమునుండి ధరణిని నీవు కోరలపై నిలుపుకొని పైకిలేచుట చూచెను.

13-3-శ్లో.
అహో! అరణ్యో౾యం మృగ ఇతి హసంతం బహుతరైః
దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్!
మహీందృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా
పయోధావాధాయ ప్రసభముదయుంక్థా మృధవిధౌ||
3వ. భావము.
హిరణ్యాక్షుడు, అనూహ్యమైన నీ వరాహరూపమును చూచి ఆశ్చర్యచకితడై, “ఆహా!! వనచరమృగమిది!!“ అని నానా దుర్భాషలాడుచు, పరిహసించుచూ నిన్ను అనేక విధములుగా భాధింప సాగెను. అవివేకి ఐన ఆ దైత్యుని ఆగడములను చూచి నీ కోరలపై నిలిచి యున్న ధరణి మిక్కిలి భీతిల్లినది. ఆ ధరణిని సముద్ర మద్యములో ఒక యోగ్యస్థానమున నీ మహిమచే నిలిపి, ఆ రాక్షసునితో తీవ్రముగా యుద్ధము చేయుటకు ఉద్యుక్తుడవైతివి.

13-4-శ్లో.
గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నతగదో
నియుద్దేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్టవియతా।
రణాలోకౌత్సుక్యాన్మిళతి సురసంఘే దృతమముం
నిరుంధ్యాస్సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే||
4వ. భావము.
అప్పుడు, హిరణ్యాక్షుడు గదను ధరించి నీతో యుద్ధమునకు తలపడెను. నీవు కూడా హిరణ్యాక్షుని గద కంటెను ఉన్నతమైన గదను ధరించితివి. మీరిరువురును గదాయుద్ధము చేయుచుండగా కలుగు ‘ఘట ఘట‘ యను ఘోర ధ్వనిచే ఆకాశము ప్రతిధ్వనించుచుండెను. మీ ద్వంద్వయుద్ధమును దేవతలు గుంపులుగా చేరి కుతూహలముతో వీక్షించసాగిరి. అచటకు వచ్చిన బ్రహ్మదేవుడు, తక్షణమే - సంధ్యాసమయమునకు ముందే ఆ రాక్షసుని సంహరించి జగత్తునకు మేలు కలిగించమని నిన్ను ప్రార్ధించెను.

13-5-శ్లో.
గదోన్మర్దే తస్మింస్తవ ఖలు గదాయాం దితిభువో
గదాఘాతాద్భూమౌ ఝటితి పతితాయామహహ భోః।
మృదుస్మేరాస్యస్త్వం దనుజకులనిర్మూలనచణం
మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే||
5వ. భావము.
ఆ ఘోర సంగ్రామమున, హిరణ్యాక్షుని గదాఘాతమునకు నీ చేతినుండి కౌమోదకము (గద) అకస్మాత్తుగా క్రిందపడెను. అయినను నీవు వెఱవక, దైత్యులను సంహరించు సుదర్శనమను మహాచక్రమును స్మరించితివి. ప్రభూ! ఆ క్షణమున మృదుమధుర ధరహసము నీ మోమును అలరించుచుండగా - ధరణిని ఉద్ధరించుటకు చక్రాయుధమును చేపట్టి మెరసిన నీరూపము -అద్భుతమైనది మరియు దేవతలకు హర్షము కలిగించునది.

13-6-శ్లో.
తతశ్శూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి
త్వయి చ్ఛిందత్యేతత్ కరకలితచక్రప్రహరణాత్
సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదంస్త్వాం సమతనోత్
గళన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః||
6వ. భావము.
అనంతరము హిరణ్యాక్షుడు - రుద్రునివలె నీపై ప్రయోగించిన త్రిశూలమును, నీవు చక్రాయుధముతో ఛిద్రముచేసితివి. అసహనముతో అసుర డప్పుడు నిన్ను సమీపించి పిడికిలితో నిన్ను పొడిచెను. ఆపై, తన మాయాబలముతో - లోకము మోహమునకు వశమగునట్టి మాయలను ప్రయోగించెను.

13-7-శ్లో.
భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుతే
తతో మాయా చక్రే వితతఘనరోషాంధమనసమ్।
గరిష్ఠాభిర్ముష్టిప్రహృతిభిరభిఘ్నంతమసురం
స్వపాదాంగుష్ఠేన శ్రవణ పద మూలే నిరవధీః||
7వ. భావము.
హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయాచక్రము - అగ్నికణములను వెదజల్లునది మరియు మిక్కిలి ప్రకాశవంతమైనది అయిన నీ చక్రాయుధపు స్వల్ప తాకిడికే చిన్నాభిన్నమయినది. అప్పు డసురుడు -రోషముతో తన మనసు రగులుచుండగా, అంధునివలె తన చేతులతో నిన్ను కొట్టుచు హింసించుటకు ప్రయత్నించెను. అంతట -నీ పాదములతో హిరణ్యాక్షుని కర్ణమూలమును గాయపరిచితివి.

13-8-శ్లో.
మహాకాయస్సోయం తవ చరణపాతప్రమథితో
గళద్రక్తో వక్త్రాదపతదృషిభిః శ్లాఘితహతిః।
తదా త్వాముద్దామప్రమదభరవిద్యోతి హృదయా
మునీంద్రాస్సాంద్రాభిస్స్తుతిభిరనువన్నధ్వరతనుమ్||
8వ. భావము.
మహకాయుడగు ఆ రాక్షసుని కర్ణమూలమును గాయపరిచి, ఆపై - అతనిని నీ పాదములతో అణచివేసితివి. నోటినుండి రక్తము స్రవించుచుండగా క్రిందపడి మరణించిన ఆ అసురుని చూచి ఋషులు, మునీంద్రులు ఆనందభరిత హృదయములతో ‘యజ్ఞేశ్వరా!‘ అని నిన్ను స్తుతించిరి.

13-9-శ్లో.
త్వచి చ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం
చతుర్హోతారో౾0 ఘ్రౌ స్రుగపి వదనే చోదర ఇడా।
గ్రహా జిహ్వాయాం తే పరపురుష! కర్ణే చ చమసా
విభో! సోమో వీర్యం వరద! గళదేశే౾ప్యుపసదః||
9వ. భావము.
వరదా! మునులు నిన్ను ‘‘యజ్ఞస్వరూపునిగా‘‘ కీర్తించిరి. ఎట్లనగా - నీ చర్మము ‘చందస్సు‘ (వేదములు); నీ రోమములు ‘ధర్భలు‘ ; నీ నేత్రములు ‘ఘృతము‘(నేయి); నీ పాదములే యజ్ఞముచేయు నలుగురు ‘ హోతలు‘ ; నీ వదనము ‘సృక్కు‘(హోమమునందు నేయి వేయు సాధనము); నీ ఉదరము ‘ఇడా‘(హోమద్రవ్యములను ఉంచు పాత్ర); నీ జిహ్వయే ‘గ్రహము‘ (నీ నాలుకయే సోమరసము ఉంచెడు పాత్ర); నీ కర్ణములే ‘చమసములు‘ (యజ్ఞమునకు ఉపయోగించు చెక్కతోచేసిన చతురశ్రమగు పాత్రలు); ప్రభూ! నీ వీర్యము ‘సోమము‘ ; నీ గళము ‘ఉపసదము‘ ( యజ్ఞవిశేషము) అని నీ శరీరావయవములను కీర్తించుచూ మునీశ్వరులు నిన్ను “యజ్ఞ వరాహమూర్తీ“ అని స్తుతించిరి.

13-10-శ్లో.
మునీంద్రైరిత్యాదిస్తవనముఖరైర్మోదితమనాః
మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్।
స్వధిష్ణ్యం సంప్రాప్తః సుఖరసవిహారీ మధురిపో
నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే!
10వ. భావము.
మునీంద్రాదులు అట్లు నిన్ను కీర్తించుచుండగా, ప్రసన్నుడవై వైకుంఠమునకు చేరిన - నీ కీర్తి నిర్మలమైనది మరియు మహోన్నతమమైనది. మధుదైత్య సంహారీ! జ్ఞానానంద విహారీ! గురవాయూరు పురాధీశా! నా రోగమును సమూలముగా నిరోధించుము.

తృతీయ స్కంధము
13వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:42, 8 మార్చి 2018 (UTC)