నారాయణీయము/అష్టమ స్కంధము/31వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము
31వ దశకము - బలిదర్పశమనము వర్ణనం
31-1-శ్లో.
ప్రీత్యా దైతస్తవతనుమహః ప్రేక్షణాత్ సర్వథా౾ పి
త్వామారాధ్యన్నజిత। రచయన్నంజలిం సంజగాద।
మత్తః కిం తే సమభిలషితం విప్రసూనో। వద త్వం
విత్తంభక్తం భవనమవనీం వా౾పి సర్వం ప్రదాస్యే॥
1వ భావము:-
వామనావతారా! నారాయణమూర్తీ! తేజోమయమయిన నీరూపమును చూచి 'బలిచక్రవర్తి' హృదయము ప్రేమోన్మత్తమయ్యెను; 'బలి' నిన్ను సకలవిధములుగా అర్చించెను. వినమ్రుడై ఆ బలిచక్రవర్తి చేతులు జోడించి నీతో ఇట్లుపలికెను. " ఓ! బ్రాహ్మణ బాలకా! నానుండి ఏమి కోరుకొనుచుంటివి? - ఆహారమా! భవనములా! భూమియా! లేక నా సర్వస్వమును కోరుకొనుచుంటివా ఏమి? నీవు ఏమి కోరిననూ తప్పక ఇచ్చెదను", అని అనెను.
31-2-శ్లో.
తామక్షీణాం బలిగిరముపాకర్ణ్య కారుణ్యపూర్ణో౾
౾ప్యస్యోత్సేకం శమయితుమనా దైత్యవంశం ప్రశంశన్।
భూమిం పాదత్రయపరిమితాం ప్రార్ధయామాసిథ త్వం
సర్వం దేహితి తు నిగదితే కస్య హాస్యం న వా స్యాత్॥
2వ భావము:-
ప్రభూ! వామనమూర్తీ! అట్లు ఉదారముగా పలికిన ఆ 'బలి' వాక్కులు నీకు అతనియందు కరుణను కలిగించెను. అయిననూ, నీవు అతని గర్వమును అణచివేయుటకే నిశ్చయించుకొంటివి. ఆ చక్రవర్తి వంశమును, వాని పూర్వీకుల దాతృత్వమును మిక్కిలి ప్రశంసించి- 'మూడడుగుల స్థలమును మాత్రము ఇమ్మని ' ఆ 'బలి చక్రవర్తిని' కోరితివి. బ్రహ్మచారి రూపమున ఉన్న నీవు త్రిలోకాధిపతివే అయిననూ, 'బలి' సర్వస్వమును అడిగినచో అది హాస్యాస్పదమే అగును.
31-3-శ్లో.
విశ్వేశం మాం త్రిపదమిహ కిం యాచసే బాలిశస్త్యం
సర్వాం భూమిం వృణు కిమమునేత్యాలపత్వాం స దృప్యన్।
యస్మాద్దర్పాత్ త్రిపదపరిపూర్త్యక్షమః క్షేపవాదాన్
బంధం చాసావగమదతదర్హో౾ పి గాఢోపశాంత్యై॥
3వ భావము:-
వామనావతారము ధరించిన నారాయణమూర్తీ! అప్పుడు బలిచక్రవర్తి నీతో ఇట్లు పలికెను. "విశ్వాధిపతినైన నన్ను మూడడుగల నేలను దానమీయమని అడిగితివి.ఇది ఏమి? దానితో ఉపయోగమేమి? నీవు బాలుడవు; నిస్వార్ధపరుడవు; అందుకే అట్లు కోరితివి. యావత్ భూమిని కోరుకొనుము - నీకు దానమిచ్చెదను" అని గర్వముగా పలికెను. (ఈ దర్పము వలననే బలి అపకీర్తిని కొనితెచ్చుకొనెను - నిందార్హుడు కానప్పటికీ ఆ దైత్య చక్రవర్తి - ఇచ్చెదనని పలికిన, మూడడుగుల నేలను ఈయలేక కించపడవలసివచ్చెను. ఏదోషము లేనివాడగుటచే నిందపడవలసివచ్చినను తుదకు పరిపూర్ణశాంతిని పొందెను).
31-4-శ్లో.
పాదత్రయ్యా యది న ముదితో విష్టపైర్నాపి తుష్యేత్
ఇత్యుక్తే౾స్మిన్ వరద। భవతే దాతుకామే౾థ తోయమ్।
దైత్యాచార్యస్తవ ఖిలు పరీక్షార్థినః ప్రేరణాత్ తం
మా మా దేయం హరిరయమితి వ్యక్తమేవాబభాషే॥
4వ భావము:-
వరదా! అప్పుడు బలిచక్రవర్తితో నీవిట్లంటివి. "మూడడుగులతో తృప్తినొందనివాడు ముల్లోకములతోనైననూ తృప్తిపొందజాలడు. తృప్తికలిగినవానికి మూడడుగులైనను చాలును". అని నీవనినంతనే ఆ దైత్యచక్రవర్తి నీవడిగిన మూడడుగుల నేలను దానము చేయుటకు ఉద్యుక్తుడై జలము విడుచుటకు సిద్ధపడెను. నీవు ఆ బలిచక్రవర్తిని మరల పరీక్షించదలచితివి. ప్రభూ! అప్పుడు నీచేతనే ప్రేరేపింపబడి- దైత్యుల గురువగు 'శుక్రాచార్యుడు' బలిచక్రవర్తితో - "వచ్చిన వాడు విప్రకుమారుడు కాడు, సాక్షాత్తూ 'హరియే!', ఈ దానము ఈయవలదు", అని చెప్పి వారించెను.
31-5-శ్లో.
యాచత్యేవం యది స భగవాన్ పూర్ణకామో౾స్మి సో౾హం
దాస్యామ్యేవ స్థిరమితి వదన్ కావ్యశస్తో౾పి దైత్యః।
వింధ్యావల్యా నిజదయితయా దత్తపాద్యాయ తుభ్యం
చిత్రంచిత్రం సకలమపి స ప్రార్పయత్ తోయపూర్వమ్॥
5వ భావము:-
అప్పుడు బలిచక్రవర్తి ఆ శుక్రాచార్యునితో- "నన్ను యాచించునది వాస్తవముగా 'శ్రీహరియే' అయినచో నాసకల అభీష్టములు ఈడేరును. నేను మాటతప్పక దానము ఇచ్చెదను", అని పలికెను. దైత్యగురువు శాపమునకు వెరువక, 'బలి' తన భార్య, వింధ్యావళి నీరు పోయగా నీ పాదములను కడిగెను. ఆ బలిచక్రవర్తి, ఆశ్చర్యముగా- తన సకలమును, ప్రభూ! జలధారాపూర్వకముగా నీకు అర్పించెను.
31-6-శ్లో.
నిస్సందేహం దితికులపతౌ త్వయ్యశేషార్పణం తత్
వ్యాతన్వానే ముముచుః ఋషయః సామరాః పుష్పవర్షమ్ ।
దివ్యం రూపం తవ చ తదిదం పశ్యతాం విశ్వభాజామ్
ఉచ్చైరుచ్యైరవృధదవధీకృత్య విశ్వాండభాండమ్॥
6వ భావము:-
శ్రీహరీ! అట్లు ఆ దైత్యచక్రవర్తి నిశ్శంకగా తన సమస్తమును నీకు అర్పణచేసెను. అట్లు దానముచేసిన ఆ క్షణమున దేవతలు, ఋషి పుంగవులు పూలవాన కురిపించిరి. ప్రభూ! నీ దివ్యరూపము - వారెల్లరూ చూచుచుండగనే ఉన్నతముగా పెరుగుచు విశ్వమంతటనూ ఆవరించసాగెను; బ్రహ్మాండమును అవధిగా చేసుకొని పెరగసాగెను.
31-7-శ్లో.
త్వత్పాదాగ్రం నిజపదగతం పుండరీకోద్భవో౾సౌ
కుండీతోయైరసిచదపునాద్యజ్జలం విశ్వలోకాన్।
హర్షోత్కర్షాత్ సుబహు ననృతే ఖేచరైరుత్సవే౾స్మిన్
భేరీం నిఘ్నన్ భువనమచరజ్జాంబవాన్ భక్తిశాలీ॥
7వ భావము:-
శ్రీహరీ! బ్రహ్మాండమును అవధిగా చేసుకొని నీ రూపము పెరిగెను. అప్పుడు సత్యలోకమున తన స్థానమున ఉన్న బ్రహ్మదేముడు నీ పాదాగ్రమును తన కమండలములోని నీటితో కడిగెను. నీ పాదములను కడిగిన ఆ నీరు విశ్వమంతటనూ పవిత్రముచేసెను. ఆ శుభ సందర్భమున దేవతలు, విద్యాధరులు, గంధర్వులు ఆనందముతో నృత్యము చేసిరి. నీకత్యంత భక్తుడగు జాంబవంతుడు- భేరీ మ్రోగించుచు లోకమంతటా తిరిగెను.
31-8-శ్లో.
తావద్దైత్యాస్త్వను మతిమృతే భర్తురారబ్ధయుద్ధాః
దేవోపేతైర్భవదనుచరైస్సంగతా భంగమాపన్।
కాలాత్మా౾యం వసతి పురతో యద్వశాత్ ప్రాగ్ జితాస్మ్సః
కిం వో యుద్ధైరితి బలిగిరా తే౾థ పాతాళమాపుః॥
8వ భావము:-
అదిచూచిన అసురులు తమనాయకుడగు 'బలి' అనుమతికొరకు వేచియుండక, నీ అనుచరులగు దేవతలతో యుద్ధమునకుదిగి ఆ యుద్ధమున పరాజయమును పొందిరి. బలిచక్రవర్తి అప్పుడు ఆ అసురులను అనునయించుచు ఇట్లుపలికెను. "కాలాత్మకుడగు పరమాత్మ మనకు అనుకూలుడై ఉండుటవలన, పూర్వము మనము సురులపై విజయము పొందితిమి. కాని ఇప్పుడు ఆ పరమాత్మ ఈ వటువు రూపమున మనకు ప్రతికూలముగా నుండెను. మనము యుద్ధము చేయుటవలన ప్రయోజనము ఏమియును ఉండదు". ఆ వాక్కులను విని, అసురులు పాతాళలోకమును చేరిరి.
31-9-శ్లో.
పాశ్చర్బద్ధం పతగపతినా దైత్యముచ్చైరవాదీః
తార్తీయీకం దిశ మమ పదం కిం న విశ్వేశ్వరో౾సి।
పాదం మూర్ధ్ని ప్రణయ భగవన్నిత్యకంపం వదంతం
ప్రహ్లాదస్తం స్వయముపగతో మానయన్నస్తవీత్త్వామ్॥
9వ భావము:-
ఆ దైత్యచక్రవర్తిని 'పతగపతి'యగు గరుడుడు పాశముతో బంధించెను. ప్రభూ! నీవు విశ్వేశ్వరుడువు కదా! రెండు పాదములతో భూమ్యాకాశములను కొలిచితివి. "మూడవ అడుగు ఎక్కడ?" అని నీవు బిగ్గరగా 'బలిని' అడిగితివి. దానికి బలిచక్రవర్తి ఏమాత్రము చలించక ధృఢముగా “నాశిరమున పెట్టుము” అని వినమ్రముగా పలికెను. అప్పుడు ప్రహ్లాదుడు స్వయముగా వచ్చి తన మనుమడయిన బలిచక్రవర్తిని శ్లాఘించి నిన్ను స్తుతించెను.
31-10-శ్లో.
దర్పోచ్ఛిత్త్యై విహితమఖిలం దైత్య। సిద్ధో౾సి పుణ్యైః
లోకస్తే౾స్తు త్రిదివవిజయీ వాసవత్వం చ పశ్చాత్।
మత్సాయుజ్యం భజ చ పునరిత్యన్వగృహ్ణా బలిం తమ్।
విప్రైస్సంతానితమఖవరః పాహి వాతాలయేశ।
10వ భావము:-
శ్రీహరీ! అంతట నీవు ఆ దైత్యచక్రవర్తితో ఇట్లనితివి. "నీ గర్వమును అణచివేయుటకే ఇదియంతయూ జరిగినది. దైత్యుడివే అయిననూ నీవు చేసిన సత్కార్యములుచే సిద్ధిని పొందితివి. స్వర్గలోకమును మించిన సుతలలోకమున నివసించగలవు. పిదప ఇంద్రపదవిని తదనంతరము నా సాయుజ్యమును పొందెదవు". అని పలికి 'బలిని' అనుగ్రహించితివి; 'బలి' నిర్వహించుచున్న యజ్ఞమును బ్రాహ్మణులచేత పరిసమాప్తిగావించితివి. ఈ విధముగా బలిచక్రవర్తిని అనుగ్రహించిన ఓ! గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపుము.
అష్టమ స్కంధము
31వ దశకము సమాప్తము.
-x-