నారాయణీయము/అష్టమ స్కంధము/27వ దశకము

||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము

27వ దశకము - కూర్మావతారము వర్ణనం

27-1-శ్లో.
దుర్వాసాః సురవనితాప్తదివ్యమాల్యం
శక్రాయ స్వయముపదాయ తత్ర భూయః
నాగేంద్రప్రతిమృదితే శశాప శక్రం
కా క్షాంతిస్త్వదితరదేవతాంశజానామ్।।
1వ భావము:
పూర్వమొకనాడు, దూర్వాసమహాముని (అత్రి అనసూయల పుత్రుడు), దేవవనితలు తనకిచ్చిన పూలహారమును, దేవతలకు రాజయిన దేవేంద్రునికి బహుకరించెను. ఆసమయమున దేవేంద్రుడు తనవాహనమగు ఐరావతముపై వెళ్ళుచుండెను. అతడు పూలహారమును ఐరావత కుంభస్థలమున ఉంచగా, ఆ ఐరావతము ఆ హారమును క్రిందపడవైచి తన కాలితో త్రొక్కివేసెను. అదిచూచిన దూర్వాసుడు మిక్కిలి కోపించి దేవేంద్రుని (శక్తిహీనుడవమని) శపించెను. భగవాన్! నీ అంశతో జన్మించిన వారికి తప్ప ఇతరు దేవతాంశులకు ఓరిమి ఎట్లు కలుగును?

27-2-శ్లో.
శాశేన ప్రథితజరే౾థ నిర్జరేంద్రే దేవేష్యప్య సురజితేషు నిష్ర్పబేషు।
శర్వాద్యాః కమలజమేత్య సర్వదేవా నిర్వాణ ప్రభవ సమం భవంతమాపుః
2వ భావము:
ఓ మోక్షప్రధాతా! భగవాన్! వృద్ధాప్యమేలేని దేవేంద్రుడు - దూర్వాసుని శాపవశమున వృద్ధుడయ్యెను. దేవతలు అసురులచేతిలో ఓడి - వారి ప్రాభవమును కోల్పోయిరి. అప్పుడు శివుడు ఇతర దేవతలు బ్రహ్మను తోడ్కొని నిన్ను శరణుజొచ్చిరి.

27-3-శ్లో.
బ్రహ్మద్యైస్తుతమహిమా చిరం తదానీం ప్రాదుష్షన్ వరద! పురః పరేణ ధామ్నా।
హేదేవా! దితిజకులైర్విధాయ సంధిం పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వమ్।।
3వ భావము:
భగవాన్! బ్రహ్మాదులు నీమహిమలను చాలాకాలము స్తుతించిరి. అప్పుడు, ప్రభూ! నీవు అపూర్వ తేజస్సుతో ప్రకాశించుచు బ్రహ్మాదిదేవతల ఎదుట సాక్షాత్కరించితివి. అసురులతో సంధిచేసుకొని, క్షీరసాగర మథనము చేయమని వారిని ఆజ్ఞాపించితివి.

27-4-శ్లో.
సంధానం కృతవతి దానవైస్సురౌఘే
మంథానం నయతి మదేన మందరాద్రిమ్।
భ్రష్టే౾ స్మిన్ బదరమివోద్వహన్ ఖగేంద్రే
సద్యస్త్వం వినిహితవాన్ పయః పయోధౌ॥
4వ భావము:
భగవాన్! నీ ఆజ్ఞననుసరించి దేవతలు అసురులతో సంధి చేసుకొని, వారితో కలిసి క్షీరసాగర మథనమునకు ఉపక్రమించిరి. క్షీరసాగరమును మథించుటకై మందరపర్వతమును పెకిలించి తెచ్చుచుండగా వారిలో గర్వము ప్రవేశించెను. ప్రభూ! (నీ లీలచే) ఆ మందరపర్వతము వారివశము తప్పి పడిపోవసాగెను. అంతట గరడవాహనుడవైయున్న నీవు, ఆ మందరపర్వతమును రేగుపండువలె అవలీలగా ఎత్తి క్షీరసాగరమున నిలిపితివి.

27-5-శ్లో.
ఆధాయ ద్రుతమథ వాసుకిం వరత్రాం
పాథోధౌ వినిహితసర్వబీజజాలే।
ప్రారబ్ధే మథనవిధౌ సురాసురైస్తైః
వ్యాజాత్ త్వం భుజగముఖే౾కరోస్సురారీన్॥
5వ భావము:
శీఘ్రమే - ఆ దేవదానవులు మందరపర్వతమును కవ్వముగాను, సర్పరాజగు వాసుకిని - ఆ కవ్వమునకు తాడుగాను - చేసుకొని పాలకడలిని మథించసాగిరి. ముందుగా ఆ కడలిలో దివ్యఔషధ విలువలు కలిగిన బీజములను వేసిరి. భగవాన్! భక్తజనపక్షపాతీ! నీ వప్పుడు మాయోపాయముతో దానవులు వాసుకి శిరమువైపు ఉండునట్లుజేసితివి.

27-6-శ్లో.
క్షుబ్ధాద్రౌ క్షుభితజలోదరే తదానీం దుగ్దాబ్దౌ గురుతరభారతో నిమగ్నే।
దేవేషు వ్యధితతమేషు తత్ప్రియైషీః కమఠతమం కఠోరపృష్ఠామ్॥
6వ భావము:
ఆ క్షీరసాగరమును దేవతలు - దానవులు మథించుచుండగా, ఆ మందరపర్వత భారమునకు సముద్రము కల్లోలభరితమయ్యెను. మథించుచున్న ఆ మందరపర్వతము - పెనుభారముచే, ఒత్తిడికిలోనై మునిగిపోయెను; దేవతలు (లేవనెత్తు శక్తిలేక) మిక్కిలి వ్యధ చెందగా, ప్రభూ! నీవు వారికి ఆనందము కలిగించుచూ కఠోరమైన మూపుభాగము కలిగిన 'కూర్మరూపమును' ధరించితివి.

27-7-శ్లో.
 వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో। విస్తారాత్ పరిగతలక్షయోజనేన।
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నివేథః॥
7వ భావము:
ప్రభూ! విష్ణుమూర్తీ! వజ్రముకంటె గట్టిది, స్థిరమైనది, లక్షయోజనముల విస్తీర్ణముగల మూపు కలిగినది అయిన "కూర్మావతారమున", నీవు సముద్రగర్భమున మునిగియున్న ఆ పర్వతమును పైకి లేవనెత్తి నీ మూపుపై నిలుపుకొంటివి.

27-8-శ్లో.
ఉన్మగ్నే ఝటితి తదా ధరాధరేంద్రే నిర్మేథుర్దృఢమిహా సమ్మదేవ సర్వే।
ఆ విశ్య ద్వితయగణే౾పి సర్పరాజే వైవశ్యం పరిశమయన్నవీవృధస్తాన్॥
8వ భావము:
మందరపర్వతమును నీవట్లు లేవనెత్తగానే, సురాసురులిరువురు ఉత్సాహముగా ఆ క్షీరసముద్రమును తిరిగి మథించసాగిరి. వారు అట్లు మథించుచుండగా, దేవదానవగణములును మరియు సర్పరాజగు వాసుకియు మిక్కిలి అలసట చెందిరి. వారి అలసటను ఉపశమింపజేయుటకై నీవు వారిలో ఆవహించి, వారిని బలోన్నతులను జేసితివి.

27-9-శ్లో.
ఉద్దామభ్రమణజవోన్నమద్గిరీంద్రన్యస్తైకస్థిరతరహస్తపంకజం త్వామ్॥
అభ్రాంతే విధిగిరిశాదాయః ప్రమోదాదుద్భ్రాంతా నునువురుపాత్తపుష్పవర్షాః॥
9వ భావము:
వేగముగా మథించబడుచూ పైకి లేచుచున్న ఆ మందరపర్వతము - స్థిరముగా తిరుగుటకై, ప్రభూ! నీవు నీ పద్మహస్తమును ఆ పర్వతముపైనుంచితివి. అప్పుడు బ్రహ్మదేముడు, శివుడు మొదలగు దేవతలు ప్రభూ! విష్ణుమూర్తీ! నిన్ను స్తుతించుచూ, ఆకాశమునుండి నీపై పుష్పవర్షము కురిపించిరి.

27-10-శ్లో.
దైత్యౌఘే భుజగముఖానిలేన తస్తే తేనైవ త్రిదశకులే౾పి కించిదార్తే।
కారుణ్యాత్ తవ కిల దేవ వారివాహాః ప్రావర్షన్నమరగణాన్న దైత్యసంఘాన్॥
10 వ భావము:
క్షీరసాగర మథనము జరుగుచున్నప్పుడు, (ఆ రాపిడికి) వాసుకి ముఖమునుండి విషవాయువులు వెలువడగా, ఆ వేడికి దైత్యులకు మిక్కిలి తాపము కలిగెను. దేవతలు భుజగము వెనుక (తోక) భాగమున ఉన్ననూ, వేడిమి వారినికూడా కొంత భాధించెను. నీకరుణకు పాత్రులయిన దేవతలపై ఆ సమయమున మేఘములు వర్షము కురిపించెను. దైత్యులపై మాత్రము వర్షము కురియలేదు.

27-11-శ్లో.
ఉద్భ్రామ్యద్బహుతిమినక్రచక్రవాలే తత్రాబ్దౌ చిరమథితే౾పి నిర్వికారే।
ఏకస్త్వం కరయుగకృష్ణసర్పరాజః సంరాజన్ పవనపురేశ। పాహి రోగాత్॥
సప్తమ స్కంధము పరిపూర్ణం
11వ భావము:
దేవదానవులు అట్లు క్షీరసాగరమును, మథించుచుండగా, మకర, మత్స్య, తిమింగలాది జలచరములు ఆ సముద్రగర్భమునుండి పైకివచ్చుచు - లోనికి పోవుచు మరల పైకి వచ్చుచు తిరుగు చుండెను. అంతియేకాని వేరేమియు వెలువడలేదు. అట్టి సమయమున, ప్రభూ! నారాయణమూర్తీ! నీవే స్వయముగా నీ హస్తములతో ఆ సర్పరాజగు వాసుకిని చేతపట్టి మథించుచు ప్రకాశించితివి. గురవాయూరుపురనాథా! నారోగముల బారినుండి నన్ను రక్షింపుము.

27వ దశకము సమాప్తము.
-x-
 

Lalitha53 (చర్చ) 16:19, 9 మార్చి 2018 (UTC)