నారదీయపురాణము/అమృతనవనీతం

నారదీయపురాణ అమృతనవనీతం

ఆర్షవాఙ్మయం

'శ్రుతి, స్మృతి పురాణేతిహాసా" అన్నది అతిప్రాచీనమై, అత్యంతసామాన్యమై, సత్యశ్రీశోభితమైన వాక్యం. అయితే శ్రుతుల వెంటనే స్మృతు లుద్భవించాయని గాని, ఆవెనువెంటనే క్రమంగా, పురాణేతిహాసాలు అవతరించాయని గాని చెప్పడానికి అవకాశం లేదు. "అనంతావై వేదాః' అన్న వేదవాక్యం ప్రకారం, వేదాలు గాని, వేదదేవులు గాని, వేదర్షులు, వేదచ్ఛందస్సులు గాని, అనంతాలు. ఆర్షవిజ్ఞానదృక్పథంతో చూచినప్పుడు వేదఋషులందరూ వేదద్రష్టలే కాని, వేదస్రష్టలు కారు. మామూలుగా పండితులైనవారు కూడా గురుముఖతః నేర్చుకునేవి కాబట్టి, గురువు నోటినుంచి ఉచ్చరించడంవల్ల వినడం ద్వారా నేర్చుకునేవి కాబట్టి, వేదాలకు శ్రుతులన్న నామం వచ్చినట్లు గతంలో భావించడం జరిగింది. వాస్తవాని కిది మూలార్థం కాదు. వేదర్షులు వేదద్రష్ట లయ్యారంటే చర్మచక్షువులైన నేత్రాలవల్ల చూడడంవల్ల కాలేదు. తమ అమోఘతపస్సంపత్ఫలితమైన దివ్యజ్ఞానంతో, శ్రోత్రేంద్రియాలతో వినుకలికారణంగానే వాటిని నేర్చుకొనడంవల్ల, అవి శ్రుతులుగా వర్ణించబడ్డాయి. ఈదృక్పథంతోనే కాక వాస్తవికదృక్పథంతో కూడా ఆలోచించినపుడు వేదాలు అపౌరుషేయాలుగా గోచరమౌతాయి. అసలు, అలౌకికమైన సంస్కృతభాషను మన ప్రాచీనులందరూ ఏకకంఠంతో 'దేవభాష' - 'అమరభాష' ఇత్యాద్యర్థబోధకాలైన వివిధనామాలతో పేర్కొన్నారంటే, వేదాలు అపౌరుషేయాలని నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించినట్లే. ఆర్షవిజ్ఞానందృష్ట్యా వేదాలు అపౌరుషేయాలేనని ఆచరణపూర్వకంగా తిరుగులేనివిధంగా నిరూపించడానికి తగినమార్గాలు కొన్ని నాపరిశోధనలలో లభ్యమైనాయి. అయినపుడు యథార్థస్థితిని గుర్తించలేక, ఆర్షవిజ్ఞానం లోతుపాతులు తెలియక, “వేదాలు పౌరుషేయాలా? అపౌరుషేయాలా?" అని చర్చించుకుంటూ, చారిత్రకదృష్టితో రకరకాల ఊహాగానాలు చేస్తున్నారంటే, ఇది నేల విడిచిన సామువంటిదే కదా!

వేదాలు అనంతాలన్న మాటను అలా వుంచుదాం. వాస్తవానికి వేదం ఎంతగ్రంథమైనా, వేదం వేదమే కదా! అంటే ఏకైకమేకదా మరి. అయితే కల్పవృక్షం వలెనో, కామధేనువు వలెనో అనేకార్థదాయకాలైన ఈవేదమంత్రా లను బ్రహ్మ చతుర్ముఖాలనుంచి నాలుగువేదాలు ఆవిర్భవించాయన్న మాటను విడిచిపెడితే తనకు లభ్యమైనంతలో విశిష్టదృక్పథంతో వేదవ్యాసుడు ఋగ్యజుస్సామాథర్వభేదాలతో నాలుగువేదాలుగా విభజించినట్లు కనిపిస్తున్నది. యజుర్వేదంలో ప్రత్యేకించి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద మని రెండు భేదా లున్నాయి. అనంతాలైన వేదాలను ఒక అనంతుడే తప్ప లేదా అనంతునివంటివాడైనా తప్ప మానవమాత్రుడు మనిషి అయినా, మహర్షియే అయినా, పూర్తిగా అవలోకన చేయడం సాధ్యంకాదు. అతిప్రాచీనకాలంలోనే వేదవిభజన జరిగిన తరువాత కూడా, మొత్తం వేదం మాట దేవు డెరుగును కాని, విభజితాలైన వాటిల్లో ఒక్కొక్కదాన్నైనా అవగాహన చేసుకొనడం మహర్షులకే కష్టసాధ్యం అయిపోయింది. కాగా వాటిని శాఖోపశాఖలుగా విభజించి కొందరు కొందరికి ఒక్కొక్కశాఖవంతున నేర్పి పరివ్యాప్తి చెందించడం జరుగుతూ వచ్చింది. కాలక్రమేణా వివిధశాఖలను అభ్యసించి పరిరక్షించేవారే కరువై పోవడంతో, అనేకవేదభాగాలకు అసలుకే మోసం వచ్చింది.

ఋగ్యజుస్సామాథర్వవేదాలు మనకు పూర్తిగా లభ్యమైనాయని కొందరు అనుకుంటున్నారు కాని అది వాస్తవం కాదు. పైలమహర్షి ఋగ్వేదాన్ని 21 శాఖలుగాను, వైశంపాయన మహర్షి యజుర్వేదాన్ని 101 శాఖలుగాను, జైమినిమహర్షి సామవేదాన్ని 1000 శాఖలుగాను, సుమంతమహర్షి అథర్వవేదాన్ని 9 శాఖలుగాను విభజించి ప్రచారం చేయడంలో ప్రవర్తకులై వర్తించినట్లు సంప్రదాయసిద్ధమైన ప్రసిద్ధి వున్నది. ఈ పైల, వైశంపాయన, జైమిని, సుమంత మహర్షులే రోమహర్షుడనే నామాంతరంగల సూతమహర్షికి వివిధపురాణాలను ఉపదేశించినట్లు వేరొకప్రసిద్ధి వున్నది.

వేదాదుల్లో విభాగాలు

లభించిన ఋగ్వేదంలో వివిధ అష్టకాలతోపాటు మండలభాగాలు కూడా వున్నాయి. లభ్యమైన కృష్ణ, శుక్ల, యజుర్వేదాలలో అధ్యాయవిభాగా లున్నాయి. అష్టాదశపర్వసంభృతమైన మహాభారతం పర్వవిభజనతో వున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే సహస్రశాఖాత్మకమైన సామవేదంలో, ఇప్పటికి లభ్యమైన కౌతుక - జైమిని - రాణాయణీయ నామకాలై మూడుశాఖలలోను ప్రత్యేకించి రాణాయణీయశాఖలో దశరాత్ర - అహీన - క్షుద్ర - ప్రాయశ్చిత్త - సత్ర - ఏకాఃభేదాలతో వివిధపర్వభాగా లున్నాయి. అంటే భారతంలో పర్వవిభజనకు సామవేదంలోని పర్వవిభజనమే మూలాధారం అన్నమాట. లభ్యమైన అథర్వవేదంలో సైతం యజుర్వేదంలో వలెనే వివిధ అధ్యాయాలున్నాయి.

వేదాదిగ్రంథాలలోవున్న విభాగాత్మకాలైన ప్రాచీననామాలన్నీ ఆర్షవిజ్ఞానపరమైనవే. ఋగ్వేదంలోని అష్టకవిభాగం మర్మపూర్వకమైనది. ప్రాణపూర్వకమైనది కూడా. ఖగోళ, జ్యోతిషశాస్త్రాలదృష్ట్యా అష్టమం మర్మస్థానం, ఆయుస్థానం కూడా. అత్యంతనిగూఢాలూ ప్రాణప్రదాలూ అయిన అమూల్యవిషయాలు కొన్ని ముగిసిన తరువాత అష్టకవిభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తున్నది. మండలవిభజన వైజ్ఞానికంగా చక్రనేమిక్రమాన్ని అనుసరించి యేర్పరచినట్లు కనిపిస్తున్నది. ఋగ్వేదం "కృ" పూర్వకమైన వివిధసౌరమండలాలరహస్యాలను వెల్లడించేది కాగా, యజుర్వేదం అమృతశశికళాత్మకమై ఖగోళపరంగా పరమవైజ్ఞానికంగా శుక్ల-కృష్ణపక్షాత్మకమై ద్వివిధాలైనా విభిన్నభాగాలను దృష్టిలో పెట్టుకొని అధ్యాయాత్మకంగా అవతరించింది. సామవేదం శబ్ద - నిశ్శబ్దశక్తి సంపూర్ణమై బహుముఖ, గాన - (బహిర్గాన) - మౌనగాన (అంతర్గాన) - పర్వాత్మకమైనది. ఒకపర్వం పూర్తి అయినదంటే, ఒకపర్వం (పండుగ) అంటే ఒకానొకమహిమోత్సవం జరుపుకొన్నట్లే నన్నమాట.

"స్మృతి" జ్ఞానధారణ పటుత్వానికి సంబంధించిన జ్ఞాపకశక్తివిషయకమైనది. పురాణం అతిపురాతనతకు సృష్టిస్థితిలయాత్మకమైన ప్రకృతిస్వరూపస్వభావచైతన్యసాంకేతికచారిత్రకకథారూప మైనది. బ్రహ్మాండభాండంలో సృష్టివ్యవస్థలో యేర్పడే పరిణామాలకు, ఫలితాలకు ప్రతిబింబక మైనది. ఇతిహాస మన్నది ఏదైనా ఒకానొకవిశిష్టమైన, విచిత్రమైన వినవలసిన కథను విని చివరికి పెద్దపెట్టున కడుపుబ్బ నవ్వు పుట్టించేటటువంటిది. ఈనవ్వులో అగాధమైన వేదాంతభావం పరిగర్భితమై వుంటుంది. భారతమంతా చదివి ఉభయపక్షాలలో జరిగిన ప్రాణనష్టాన్ని - దేశభ్రష్టతను - దృష్టిలో పెట్టుకొని పాండవులకు మిగిలిన విజయఫలితాన్ని చూచినా శ్రీకృష్ణనిర్యాణానంతరం ప్రత్యేకించి అర్జునుడు, మిగిలిన సహోదరులు శక్తిహీనులై నామమాత్రులుగా మిగలడం చూస్తే "హారి, యెంత వెర్రివాళ్లురా' అని మనకు తోచి నవ్వు రాకతప్పదు. ఆజగన్నాటకసూత్రధారి నడిపినకథకు ఫలితంగా మనకు మిగిలేది భగవద్గీతామయమైన తత్త్వచింతనమే. ఇది కూడా విష్ణుమాయలో, కృష్ణలీలలో ఒకహాసం వంటిదే.

కాండ, సర్గాది విభజనలు సైతం ఒకానొకవిధమైన విశిష్టగ్రంథవిభజనను సూచిస్తూ యేర్పడినవే.

అనంతరకాలంలో కావ్యాదులలో వచ్చిన ఆశ్వాస, ఉచ్ఛ్వాస, ఉల్లాసాది విభాగాలు సైతం ఒకపెద్దకథను విన్న తరువాత “హమ్మయ్య" “హారి బాపురే” వంటి పదాల ననుకుంటూ నిట్టూర్పులు విడవడం, లేదా "భలేగా జరిగిందిరా! మహా బాగా జరిగింది" అనుకొనడం రూపంగానో ఉత్సాహాన్ని అభివ్యక్తీకరించే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అవతరించినవే.

శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలన్నమాట యేవిధంగా యెప్పుడు రూపొందిందో సాధికారికంగా చెప్పలేము. శ్రుతులకు ఉపశ్రుతులు లేవుగాని, విశిష్టార్థంలో ఉపశ్రుతి శబ్దం ప్రాచీనకాలంనుంచి వ్యవహారంలో వున్నది. అయితే స్మృతులకు ఉపస్మృతులు, పురాణాలకు ఉపపురాణాలు అవతరించాయి. కాని ఇతిహాసానికి ఉపేతిహాసాలు అవతరించలేదు. అయితే ఉపకథలు లేకపోలేదు. శ్రుతి, స్మృతి, పురాణాలు విభిన్నాలుగా వున్నట్లే, ఇతిహాసాలుకూడా విభిన్నాలుగా వున్నాయి. మహాభారతం వొక్కటే ఇతిహాసనామకమని చాలామంది అభిప్రాయం. కాని ప్రాచీనులు అద్భుతరామాయణం - అధ్యాత్మరామాయణం - ఆనందరామాయణం - గర్గసంహితవంటి గ్రంథాలనుకూడా ఇతిహాసాలుగానే పేర్కొన్నారు. అంతేకాదు. 'ఇతిహాససముచ్చయం' అన్న పేరుతో వేరొక విశిష్టగ్రంథం కూడా వున్నది. కాగా ఇతిహాసం ఒక్కటిమాత్రమే కాదని గ్రహించక తప్పదు.

ఆర్షవాఙ్మయంలో బ్రాహ్మణాలు - ఆరణ్యకాలు - ప్రాతిశాఖ్యాదిగ్రంథాలే కాక వేదాంగాలుగా శిక్ష - వ్యాకరణం - ఛందస్సు - నిరుక్తం - ఆదిత్యాది వివిధజ్యోతిషగ్రంథాలు - ఆశ్వలాయనాదుల అనేక కల్పగ్రంథాలు ఉన్నాయి. యాస్కకృతమైన ఒక్కనిరుక్తాన్ని విడిచిపెడితే మిగిలినవన్నీ ఆర్షగ్రంథాలుగానే కనిపిస్తున్నాయి. శిక్షావ్యాకరణాలు కేవలపాణినీయాలు మాత్రమే అని చెప్పే అవకాశం లేదు. పాణినికి పూర్వకాలంలో శిక్షావ్యాకరణగ్రంథాలు లేవని చెప్పడానికి బొత్తిగా ఆస్కారంలేదు. అదేవిధంగా పింగళునికి పూర్వం ఛందోగ్రంథం ఒక్కటికూడా అవతరించలేదని చెప్పలేము. ఇక జ్యోతిషకల్పగ్రంథాలవిషయంలో చర్చించడానికి అవకాశమే లేదు. ఉపనిషత్తులు, ఇతర సూత్రగ్రంథాలు, ఆగమాలు, బ్రహ్మసూత్రాలు, ఖగోళ, కామ, మంత్ర, తంత్ర, వైద్యగ్రంథాలు, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసాది గ్రంథాలు, ఇతర ధర్మశాస్త్రగ్రంథాలు, చివరికి రామాయణాది కావ్యాలు, లౌకికవాఙ్మయంలో చేరినవే అయినా యేకొంతైనా ఆర్షవిజ్ఞానాన్ని యేదోవొకరూపంలో ప్రతిబింబించేవే. అయితే ఇవన్నీ శ్రుతి, స్మృతి పురాణేతిహాసాలు అన్న వాక్యంలో అంతర్భూతాలై నిండి నిబిడీకృతాలై లేవు. కాని శ్రుతులు అలౌకికవాఙ్మయం కాగా, స్మృతి పురాణేతిహాసాలు లౌకికవాఙ్మయంలో చేరిపోయాయి. ఉపనిషత్తులు వేదభాగాలని చాలామంది పండితులు భ్రమపడుతారు కాని వాస్తవానికి అవి వేదభాగాలు కావు. కొన్ని కొన్ని వేదమంత్రాలకు వ్యాఖ్యారూపంలో అవతరించిన గ్రంథాలే ఉపనిషత్తులు.

వేదోత్పత్తి

శ్రుతులు అనంతాలని గతంలో పేర్కొనడం జరిగింది. అనంతాలైన శ్రుతులకు చతుర్విధాలుగా విభజనను, చతుర్ముఖుడైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకొని విభజించి వుండవచ్చు. వాస్తవానికి వేదాల సృష్టికర్త బ్రహ్మకాడు. బ్రహ్మకు వేదాలను అమూలాగ్రం నేర్పినవాడు, వేదవిజ్ఞానాన్ని ప్రసాదించినవాడు శ్రీమహావిష్ణువు. అనేక సందర్భాలలో వేదవిజ్ఞానాన్ని రాక్షసులు అపహరించినపుడు సృష్టినిర్మాణంలో బ్రహ్మ అశక్తుడు కాగా మహావిష్ణువు వివిధ అవతారాలెత్తి వేదాలను అపహరించిన, ఆ రాక్షసులను సంహరించి, వేదాలను తీసుకొనివచ్చి బ్రహ్మకు తిరిగి వేదజ్ఞానభిక్షను పెట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. బ్రహ్మకు వేదాలను శ్రీ మహావిష్ణువే బోధించాడన్న విషయాన్ని ప్రస్తుత నారదీయపురాణంలో "శ్రీహరి నాభికమలమునఁ జతుర్ముఖ బ్రహ్మ ముదయించిన" అనంతరఘట్టంలో "ప్రణవంబునకుఁ గారణం బకారం, బకారంబున కర్థంబు పరబ్రహ్మంబగు నారాయణపదంబు. ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం జూచి భగవంతుండు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁజేసె." (నార. 97. పుట. 18 వచనం.) అని విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. అనంతుడైన విష్ణువు సృష్టించిన వేదాలకు అంతత్వ మెక్కడిది? కాగా చతుర్విధాలుగా వేదాలను విభజించడం చతుర్ముఖుడైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకొని జరిగివుంటుంది.

అష్టాదశ సంఖ్యావైశిష్ట్యం

వేదాలను విడిచిపెడితే స్మృతులు, ఉపస్మృతులు పురాణాలు, ఉపపురాణాలు 18 విధాలుగా విభజింపబడ్డాయి. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలలో చివర పేర్కొనబడిన ఇతిహాసం 18 ఇతిహాసాలుగా రచియింపబడ్డాయో లేదో గ్రంథాలు అలభ్యాలైన కారణంగా చెప్పలేము. కాని భారతేతిహాసం మాత్రం 18 పర్వాలతో విభజనమై రచింపబడ్డ విషయం విస్పష్టం.

మను, దక్ష, యమ, బృహస్పతి, శంఖ, పరాశర, యాజ్ఞవల్క్య, విష్ణు, అత్రి, అంగిరస, సంవర్త, శాతాతప, ప్రాచేతస, హరీత, ఆపస్తంభ, గౌతమ, ఉషనస, ఆశ్వలాయన, కృతాలైన స్మృతులు 18 వున్నాయి. వీటిలో బృహస్పతి, యాజ్ఞవల్క్య, సంవర్త, ఆపస్తంభ, ఆశ్వలాయన, స్మృతులకు మారుగా మరికొందరు బ్రహ్మ, యోగీశ్వర, సంవర్త, ఆపస్తంభ, లిఖిత, మహర్షి కృతాలైన స్మృతులను పేర్కొన్నారు.

జాబాలి, నాచికేతు, కంద, లౌగాక్షి, కాశ్యప, వ్యాస, సనత్కుమార, శాంతన, జనక, కత్రు, కాత్యాయన, జాతుకర్ణ్య, కపింజల, బోధాయన, కౌణాచ, విశ్వామిత్ర, పైఠీన, గోబిల, నామకాలైన ఉపస్మృతులు 18 వున్నాయి. వీటిల్లో కూడా ఆశ్వలాయన, యజ్ఞవల్క్యాది మహర్షుల నామాలలో ఉపస్మృతులు కొన్ని వున్నాయి. ఏది యేమైనా స్మృత్యుసస్మృతులు 18 సంఖ్యకు పరిమితాలన్న సంగతి మనం విస్మరించరాదు.

మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వామన, వాయువ్య, విష్ణు, వరాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు 18 వున్నాయి. బ్రాహ్మపురాణస్థానంలో బ్రహ్మకైవర్తపురాణాన్ని, భాగవతస్థానంలో దేవీభాగవతాన్ని కొందరు పేర్కొన్నారు. ఈ అష్టాదశపురాణాలను పేర్కొంటూ సంప్రదాయసిద్ధమైన శ్లోకం వొకటి పండితలోకంలో ప్రసిద్ధంగా వున్నది. అది యిది -


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం!
అ, నా, ప, లిం, గ, కూ, స్కా, ని పురాణాని పృథక్పృథక్!

సనత్కుమార, నృసింహ, స్కాంద, శివధర్మ, నందికేశ్వర, దౌర్వాస, నారదీయ, కాపిల, మానవ, ఔషనస, వారుణ, కాశీ, సాంబ, సౌర, పరాశర, మారీచ, భార్గవ, లింగ, పురాణములు 18 ఉపపురాణాలుగా పేర్కొనబడుతున్నాయి. మరికొందరు స్కాందపురాణానికి మారుగా బ్రహ్మాండ ఉపపురాణాన్ని పఠిస్తారు. మరికొందరు స్కాంద, నందికేశ్వర, పరాశర, మారీచ, భార్గవ, లింగపురాణాలకు మారుగా కౌమార, బ్రహ్మాండ, మాహేశ్వర, ప్రవర, శ్రీభాగవత, దేవీభాగవతాలను ఉపపురాణాలుగా పేర్కొంటారు. మరికొందరు స్కాంద, శివధర్మ ఉపపురాణాలకు మారుగా వాశిష్ఠ, అంగిరస, ఉపపురాణాలను పేర్కోంటారు.

కొందరు విద్యలు 18 అంటూ పేర్కొంటూ 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు, 4 వేదోపాంగాలు ఉదాహరించారు. మరికొందరు ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, అర్థశాస్త్రాలతోపాటు చతుర్దశవిద్యలను సమ్మేళనంచేసి 18 విద్యలని పేర్కొన్నారు.

ప్రాచీనమహర్షులు 18 విధాలైన సూత్రగ్రంథాలను రచించడం జరిగిందని అగస్త్యశాకల్యం, అగ్నివైశ్యం, ఆపస్తంభం, ఆశ్వలాయనం, కాత్యాయనం, కౌండిన్యం, కౌపీతం, జైమినీయం, ద్రాహ్యాయసం, బోధాయనం, భారద్వాజం, మాధ్యందినం, వాధూలం, వైఘానసం, శాంభవీయం, శౌనకీయం, సత్యాశాఢి, హిరణ్యకేశి సూత్రగ్రంథాలను పేర్కొనడం జరిగింది.

ఇదేవిధంగా 18 విధాలైన పరిశిష్టలక్షణగ్రంథాలు ఆవిష్కృతాలైనట్లు కూడా ప్రాచీనులు పేర్కొన్నారు. అవి యివి ఉపలక్షణం, భాగలక్షణం, ప్రతిజ్ఞ అనువాకసంఖ్య, శరణవ్యూహం, శ్రాద్ధకల్పం, శుల్బం, పార్శ్వదం, ఋగ్యజుస్సులు, ఇష్టకాపూరణం, ప్రవరాధ్యాయం, ఉబ్ధశాస్త్రం, క్రమసంఖ్య, నిగమం, యజ్ఞపార్శ్వం, హేత్రికం, ప్రసవోదానం, కూర్మలక్షణం.

నాటిక, త్రోటిక, గోష్ఠి, సత్తకం, నాట్యరాసకం, ప్రస్థానం, ఉపలాస్యం, కావ్యం, ప్రేంకణం, రాసకం, సల్లాపకం, సృగాదికం, శిల్పకం, విలాసికం, దుర్మలికం, ప్రకరణికం, ఫల్లీనకం, భాణీకం, అని నాటికలు 18 విధాలుగా ప్రాచీనులు పేర్కొన్నారు. కొందరు సత్తక, ఉపలాస్య, సృగాదికాలగు మారుగా నట్టక, ఉల్లాస్య, శ్రీగదిత భేదాలను పేర్కొన్నారు. వీటిని ఉపరూపకాలని కూడా అంటారు.

కావ్యాల్లో వర్ణనలు సైతం 18 గానే పేర్కొనబడ్డాయి. అవి యివి - నగర, సముద్ర, ఋతు, చంద్రోదయ, అర్కోదయ, ఉద్యానవన, జలక్రీడ, మధుపాన, రథోత్సవ, విప్రలంభ, వివాహ, పుత్రోత్పత్తి, మంత్ర, ద్యూత, ప్రయాణ, నాయకాభ్యుదయ, శైల, యుద్ధవర్ణనలు. మరికొందరు వీటిలో కొన్నింటిని తొలగించి, నది, స్త్రీవర్ణనలను, బ్రాహ్మణాది చతుర్వర్ణవర్ణనలను, చతురంగసైన్యవర్ణనలను, వేదాంగవిచారవర్ణనలను సైతం చేర్చి మొత్తం 18 వర్ణనలుగా పేర్కొన్నారు. ఇదేవిధంగా కావ్యదోషాలను సైతం 18 సంఖ్యకే పరిమితం చేశారు. అప్రయుక్తం - అపుష్టార్థం- నేయార్థం- అసమర్థం- నిరర్థకం-గ్రామ్యం- చ్యుతసంస్కారం- గూఢార్థం- అన్యార్థం- అశ్లీలం- అప్రతీత - అప్రయోజనం- క్లిష్టం- సందిగ్ధం- విపరీతథీప్రథం- అనిమృష్టవిధేయం- పరుషం ఈ 18 ప్రాచీనులు పేర్కొన్న కావ్యదోషాలు- బహుముఖమైన వాఙ్మయవిభేదాలకు యేంవచ్చింది కాని, అసలు భాషాభేదాలే 18 విధాలని వక్కాణించినవారుకూడా లేకపోలేదు. ప్రాకృతభాషలు షడ్విధాలు. ఈ షడ్విధప్రాకృతాలలోనూ తత్సమ, తద్భవ, దేశ్య నామకాలుగా త్రివిధభేదాలున్నాయి. అందువల్ల ప్రాకృతభాషాభేదాలు 18 పొమ్మన్నారు కొందరు. సంగీత పదార్థాలలో సైతం, నాదం-శృతి-స్వరం- గ్రామం- మూర్ఛన- తానం- వర్ణం- అలంకారం - గమకం - జాతి- రాగం- గానం- భాష- భాషాంగం- విభాష- అంతర్భాష- ఉపాంగం- క్రియాంగం- అని 18 పదార్థాలు శాస్త్రాలలో ప్రవచించబడ్డాయి. ఆ వరసకు వస్తే ప్రస్తుతకాలంలో మనం ఆమోదించలేం కాని, అసలు మానవులలోనే అష్టాదశజాతిభేదా లున్నాయని ప్రాచీను లన్నారు. మరింతగా పరిశీలించి చెప్పాలంటే ఆకలి, దప్పి, భయం, కోపం, సంతోషం, కోరిక, నిద్ర, వార్ధక్యం, మరణం, జననం, మదం, స్వేదం, దుఃఖం, జాగ్రత, స్వప్నం, బాల్యం, కౌమారం, యౌవనం, అని దేహసంభవగుణాలు 18 గా పేర్కొన్నారు. చివరికి మానవులలో వుండే వివిధ వ్యసనాలను కూడా 18కే పరిమితి చేశారు. వేట, జూదం, పగటినిద్ర, పరనింద, దివామైథునం, మద్యపానం, నృత్యవ్యసనం, గానలోలత, వాద్యవ్యసనం, వ్యర్ధదండనం, చాడీలు చెప్పడం, అతిసాహసం, ద్రోహచింత, కాపట్యం, అసహనం, పరుషభాషణం, దూషణం, అన్యాయదండన అని వీటిని కామ, క్రోధ జన్యాలుగా పేర్కొన్నారు. ఇంతటితో ఆగక మానవుని వివాదస్థానాలకు కూడా 18కే పరిమితంచేసి పేర్కొన్నారు. అవి యివి. అప్పు సకాలంలో తీర్చకపోవడం - ఇతరులవద్ద సొమ్ము దాచడం - హక్కులేని ఆస్తి అమ్మడం- ఉమ్మడి వ్యాపారం - దానమిచ్చి తిరిగిపుచ్చుకొనడం - కూలి వగైరాలు యివ్వకపోవడం - నియమోల్లంఘన - క్రయవిక్రయాలలో మాట తప్పడం - పశుపాలకులతో సంబంధం - సరిహద్దుల విషయం - పరదూషణం - కొట్టడం - దొంగతనం - బందిపోటుతనం - స్త్రీలను చెరపట్టడం - పురుషపరస్పరధర్మాల యేర్పాటు - దాయభాగం వివిధ జూదాలు.

మానవులు పండించే వివిధధాన్యాలు కూడా 18 రకాలని పేర్కొన్నారు. అవి యవలు - గోధుమలు - వరి - నువ్వులు - కొఱ్ఱులు - ఉలవలు - మినుములు - పెసలు - సిరుసెనగలు - అనుములు - ౘామలు - ఆవలు - గవేధుకములు - నివ్వరిధాన్యం - కందులు - సతీనకాలు - సెనగలు - చీనధాన్యం. (ఈ ధాన్యాలలో ఇప్పుడు లభ్యమయ్యే ధాన్యాలు కొన్ని చేరివుండకపోవచ్చును.) పరోపకారబుద్ధితోగాని దోషారిష్టనివారణార్థంకాని, పుణ్యసముపార్జనార్థంగాని చేసే దానాలు కూడా అష్టాదశ సంఖ్యకే పరిమితాలని ప్రాచీనులు పేర్కొన్నారు. ఆ 18 దానాలు యివి. తులాపురుషం, హిరణ్యగర్భం, బ్రహ్మదండం, స్వర్ణం, పంచలాంగలం, స్వర్ణధేనువు- సాలంకృతహేమవృషభం - సాలంకృతలక్ష్మీప్రతిమ - సాలంకృతసప్తాచలం - సప్తసముద్రం - గజం - స్వర్గచ్చాయ - భూగోళం - కనకపర్వతం - కామధేనువు - కల్పవృక్షం - రజతపర్వం - సహస్రధేనువు. ఈదానాలు ఆర్షవిజ్ఞానపరమైనవేకాని మామూలు తిలతండులాది దానాలవంటివి కావు.

కాలం యెంత సుదీర్ఘమైనదనా 18 రెప్పపాట్ల కాలాన్ని ప్రాచీనులు "కాష్ఠం"గా పేర్కొన్నారు. ఇంతెందుకు? అసలు మొత్తం భూమండాలాన్నే 18 ద్వీపాలుగా మన మహర్షులు విభజించి వర్ణించారు. వాటికి రమ్యకం - రమణకం ద్వారకం - సింహళం - కైవల్యం - మలయం - అశ్వభద్రం - కేతుద్వీపం - మాల్యవంతం - పుష్కరం - వృషభం - రైవతం - నిమ్నోచనం - నియామ్యం - పారావారం - చౌరకృతం - మాల్యద్వీపం - గోభిద్వీపం - అని పేర్లు పెట్టారు. కొందరు రమణకద్వీపాన్ని 'రమళిక'ద్వీపంగా పేర్కొన్నారు. ఈభూమండలంమీద వున్న పాపప్రణాశకాలు, అత్యంతపుణ్యప్రదాలైన తీర్థాలు కూడా 18 కే పరిమితమైనట్లు ఆర్షవిజ్ఞానులు పేర్కొన్నారు. ప్రస్తుతం తీర్థాలుగా భావిస్తున్న పెక్కుపుణ్యస్థలాలు వీటిల్లో లేనేలేవు. ఆర్షవిజ్ఞానులు పేర్కొన్న 18 పవిత్రమహాతీర్థాలు యివి. అంతర్గంగ - పాపనాశని - ప్రథమబ్రహ్మ - ఛాయామల్లికార్జున - వేదసంగమేశ్వర - గణికాసిద్దేశ్వర - మోక్షేశ్వర - భుజంగ - బ్రహ్మనారాయణ - మణికర్ణిక - ప్రయాగ - మాధవ - సోమసిద్దేశ్వర - దేవద్రోణ - నాదాతుంగసంగమ - కులకేశ్వర - నాగభోగేశ్వర - శుక్లేశ్వర - అగ్నేశ్వరమహాతీర్థములు.

కేవల తీర్థాలుమాత్రమే కాదు ఆదిశంకరాచార్యులు శక్తిపీఠాలు స్థాపించారని కొందరంటున్నారు కాని, అవి ఆదిశంకరాచార్యులవారికాలంలోనే స్థాపించబడినవని నిరూపించడానికి పూర్తి అవకాశాలు లేవు. అయితే వాటిని యెవరు యెప్పుడు నిర్మించారో చెప్పలేము కాని శక్తిపీఠాలుసైతం అష్టాదశసంఖ్యకే పరిమితాలై నిర్మింపబడ్డాయి. ఈ 18 శక్తిపీఠాలు యివి - శ్రీలంకలో శాంకరీపీఠం - కంచిలో కామాక్షీపీఠం - మధురలో మీనాక్షీపీఠం - కాళహస్తిలో జ్ఞానప్రసూనాంబాపీఠం - ప్రద్యుమ్నస్థలంలో శృంఖలాపీఠం[1] - క్రౌంచపట్టణంలో చాముండీపీఠం[2] - అలంపురంలో జోగులాంబాపీఠం - శ్రీశైలంలో భ్రమరాంబాపీఠం - ఉద్యానపట్టణంలో (విరజా)గిరిజాదేవిపీఠం[3] - పిఠాపురంలో పురుహూతిపీఠం - మాణిక్యపట్టణంలో చిత్రకోటికాపీఠం - హయశ్చిత్ర(అపాచ్ఛత్ర)పురంలో కామరూపిణి(కామాఖ్య)పీఠం[4] - ప్రయాగలో మాధవీపీఠం[5] - కొల్లాపురంలో మహాలక్ష్మీపీఠం[6] - జ్వాలాపట్టణంలో జ్వాలాముఖీపీఠం[7] - వాసరాపట్టణంలో సరస్వతీపీఠం - కాశీలో అన్నపూర్ణా పీఠం - గయలో మాంగల్యగౌరీపీఠం - మధుర, కాళహస్తి, మాణిక్య, వాసరపట్టణాలలో వున్న శక్తిపీఠాలకు మారుగా కొందరు, మయూరపురంలో ఏకనీరికాంబాపీఠం - ద్రాక్షారామం (తూర్పు గోదావరిజిల్లా) లో మాణిక్యాంబాపీఠం - ఉజ్జయినిలో మహాకాళీపీఠం - కాశ్మీరంలో సరస్వతీపీఠం - అన్న నాలుగుపీఠాలను పేర్కొంటున్నారు.

స్మృత్యుపస్మృతులు మొదలు బహుముఖవాఙ్మయరూపంలోను, ప్రకృతిరూపంలోనూ మాత్రమేకాక పవిత్రదైవీయాలైన తీర్థశక్త్యాదులరూపంలో సైతం అష్టాదశసంఖ్యయే ప్రాధాన్యం వహించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాని, ఆర్షవిజ్ఞానం దృష్ట్యా, అమూలాగ్రంగా అవలోకన చేస్తే యిందులో ఆశ్చర్యపడవలసిన దేమీ కనిపించదు.

మన ప్రాచీనవేదర్షులు తమదివ్యజ్ఞానంతో అనంతమైన ఖగోళవేధ చేసి సృష్టిస్వరూపభావాలను గుర్తించి వీటికి మూలభూతమైన విభిన్నదైవీయాలైన శక్తులను గుర్తించారు. మహావిష్ణువు మొదలు రకరకాలుగా అవతరించిన బహుముఖాలైన విభిన్నశక్తులుగల దేవగణాలు మొత్తం 18 వర్గాలుగా వున్నట్లు తమ అమూల్యపరిశోధనల ద్వారా గుర్తించి ప్రకటించారు. అమర - సిద్ధ - సాధ్య - గరుడ - కిన్నర - కింపురుష - గంధర్వ - యక్ష - విద్యాధర - భూత - పిశాచ - రుద్ర - ఉరగ - ముని - తుషిత - దైత్య - భాస్వర - గుహ్యక - గణాలుగా యీదేవగణాలను పేర్కొన్నారు. వివిధదేవగణాలు 18 వర్గాలుగా వున్నాయి కాబట్టి వీటికి భిన్నమైన, అతీతమైన గణవర్గశక్తు లేవీ లేవన్న నిశ్చితాభిప్రాయంతో, దివ్యజ్ఞానంతో పరమవైజ్ఞానికంగా 18 గా విభజించి పేర్కొనడం జరిగింది. ఈ అష్టాదశదేవగణాలలో భూత, పిశాచాలతోపాటు, దైత్యగణంకూడా చేరడం చాలామందికి ఆశ్చర్యసంభ్రమాలను కలిగించవచ్చును. కాని, యిందులో అనార్షేయమూ, అవైజ్ఞానికమూ, అవాస్తవికమూ, అయిన విషయమేమీలేదు. వేదవిజ్ఞానందృష్ట్యా రాక్షసులు, భూతపిశాచాలు వాస్తవానికి దేవగణాలే. కారణాంతరాలవల్ల తాము చేసిన దుష్కర్మలఫలితంగా వివిధదేవగణాలలోనివారే దైవీయాలైన శాపశక్తులపాలై రాక్షస, భూతపిశాచాలుగా అవతరించడం జరిగింది. ప్రాచీనగ్రంథాలలో అనేకసందర్భాలలో రాక్షసులను "పూర్వదేవతలుగా" పేర్కొనడం జరిగింది. పూర్వదేవతలు అంటే మొట్టమొదట దేవతలుగానే వుండి కర్మవశాత్తు తరువాత రాక్షసత్వం పొందినవారని అర్థం. అందువల్లనే విభిన్నాలైన బహుముఖదైవీయశక్తులు కేవల వివిధదేవగణాలపరం మాత్రమే కాకుండా రాక్షసులకుకూడా సంక్రమించడం జరిగింది. అదేవిధంగా భూత, పిశాచాలకు సైతం విభిన్నశక్తులు సంప్రాప్తమవడం జరిగింది. అయితే దైవీయాలైన అనంతశక్తులతో అన్నీ అందరివద్దా వుండాలని యెక్కడా లేదు. అటువంటి ఏకైకవ్యవస్థకే స్థానం వుంటే ఈవిభిన్నవర్గాల ఉనికికి అవకాశమే లభించేది కాదు. కాగా విభిన్నదేవగణాలలో తరతమభేదాలతో కూడిన విభిన్నశక్తు లుండవచ్చునని తేటతెల్లమవుతున్నది.

వేదాలు తప్ప, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థవేదం వంటి ఉపవేదాలతోసహా స్మృతులు, ఉపస్మృతులు, పురాణాలు, ఉపపురాణాలు, మాత్రమేకాక, వివిధవిభిన్నబహుముఖశాస్త్రీయగ్రంథాలన్నీ లౌకికవాఙ్మయంగానే రూపొందాయి. స్మృత్యుపస్మృతి, పురాణోపపురాణాలు అష్టాదశసంఖ్యకే పరిమితం కావడం చూస్తే అత్యంతప్రాచీనకాలంలో ఇతిహాసనామకగ్రంథాలు సైతం 18 అవతరించి కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయేమో అనిపిస్తున్నది. ఉపనిషత్తులు మొదలైన గ్రంథాలు కొన్ని కొన్ని వేదమంత్రాలకు వ్యాఖ్యారూపంగా అవతరించిన గ్రంథాలైనందువల్ల వాటిల్లో అష్టాదశసంఖ్యాపూర్వకమైన విభజనకు అవకాశం లేకుండాపోయింది.

అయితే అసలు దేవగణాలే 18 విధాలని ఆమోదించినపుడు దేవవేదవాక్కులైన శ్రుతులుసైతం 18 విధాలుగా యెందుకు విభజింపబడలేదని కొందరికి సందేహం కలుగవచ్చును. "అనంతా వై వేదాః" అని మొట్టమొదటే పేర్కొనడం జరిగిందిగదా! దేవగణాలనైతే 18 వర్గాలుగా వున్నట్లు తమదివ్యదృష్టికి కనిపించడంవల్ల ప్రాచీనవేదర్షులు విభజించారు తప్ప, దైవీయాలైన అనేకకోట్లాదిగాగల, అనంతశక్తులను 18 వర్గాలుగా విభజించే అవకాశం వొక్కఆర్షవిజ్ఞానం దృష్ట్యానే కాదు, ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశోధించినప్పటికి కూడా అణుమాత్రమైనా లేదు. వేదాలు బహుముఖాలై అనంతాలైన దైవీయాలైన శక్తులను ప్రతిబింబించే బహుళార్థదాయకాలు కాగా వేదాలను 18 భాగాలుగా విభజించడానికి బొత్తిగా అవకాశంలేదు. అనేకార్థదాయకాలైన వేదమంత్రాలను వొక్కొక్కవిశిష్టదృక్కోణంతో పరిశీలించడంవల్ల ఆపరిశీలకుల దృష్టికి గోచరమైనవిధంగా ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, అర్థవేదాలవంటి పరిమితార్థదాయకాలైన ఉపవేదాలు లౌకికంగా అవతరించాయేగాని అవి చతుస్సంఖ్యకే పరిమితం కావాలని యెక్కడా లేదు. అవి అష్టాదశసంఖ్యకు పరిమితం కావాలనికూడా యెక్కడా లేదు. పైగా "అనంతా వై వేదాః" అన్నట్లు బహుముఖార్థదాయకాలుగా విభిన్నాలుగా, ఉపవేదా లవతరించాలంటే అనంతాలుగానే కాదు అనంతానంతాలుగా అవతరించవలసి వుంటుంది. దైవీయాలైన ఆర్షశక్తులను విభిన్నదృక్సథాలతో ఆలోచించినప్పుడు వాటి అగాధత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఒక్క ఆర్షవిజ్ఞానం దృష్ట్యానే కాదు. ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశీలించినప్పటికీ మనం అయోమయంలో పడక తప్పదు. అందువల్ల ఉపవేదాలంటూ నాలుగు లౌకికవేదాలను ప్రాచీనులు పేర్కొన్నారంటే మామూలుగా వేదాలు నాలుగన్నదృష్టితో దూరాలోచన లేకుండా ఆర్షవిజ్ఞానాన్ని విస్మరించి ఏకైకదృక్పథంతో వక్కాణించడమే జరిగింది కాని, అది వాస్తవం కాదు. అసలు వేదాలలోనే అష్టాదశవిభాగవిభజనకు, ఆస్కారం అణుమాత్రమైనా లేనప్పుడు వేదాలపై ఆధారపడి పరిమితగ్రంథాలుగా అవతరించిన ఉపవేదాలలో యీవిభజనకు అసలే అవకాశం లేదు. కాగా, అష్టాదశదేవగణాలమీద ఆధారపడి వేదాలను అష్టాదశవేదాలుగా విభజించడానికి అవకాశం లేదని స్పష్టపడుతున్నది. అయితే స్మృత్యాదిలౌకికగ్రంథాలు, అష్టాదశదేవగణవిభజనను దృష్టిలో పెట్టుకొని 18 భేదాలుగా అవతరించినట్లు తేటతెల్లమౌతున్నది. కాగా, పురాణ, ఉపపురాణాలు సైతం అష్టాదశసంఖ్యకు పరిమితం కావడం ఆర్షవిజ్ఞానందృష్ట్యా సమంజసమైనదీ, సత్యసమ్మతమైనదీ కాగలదు.

పురాణాలు - ఉపపురాణాలు

పురాణాలగురించి, ఉపపురాణాలగురించి ప్రాచ్యపాశ్చాత్యపండితులనేకమంది వివిధ పరిశోధనలు చేసి, అనేకాభిప్రాయాలు వెల్లడించారు. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలన్న వాక్యంప్రకారం శ్రుతిభిన్నాలైన ఆర్షవిషయకగ్రంథాలను త్రోసిరాజని స్మృతులతరువాత పురాణాలు స్థానం సంపాదించాయన్నమాట అక్షరాలా యథార్థం. అయితే అనంతరకాలంలో చతుర్దశవిద్యలలోను - కొందరిమతంలో చతుర్దశకళలలోను, పురాణాలు ఒకటిగా పేర్కొనబడ్డాయి. అత్యంతపురాతనాలైన విషయాలను పెక్కింటిని తెలియచేసేవి కాబట్టి వీటికి పురాణాలన్న నామం వచ్చిందని అందరూ అభిప్రాయపడ్డారు. రామాయణం కావ్యం కాగా, భారతం ఇతిహాసం కాగా, యీరెండింటికీ భిన్నమై శ్రుతి, స్మృతి భిన్నాలైన లౌకికకవితావాఙ్మయం పురాణవాఙ్మయంగా పేర్కొనబడింది. రామాయణ, మహాభారతాలవలె మిత్రసమ్మితాలుగా శ్రవణ, పఠనవ్యవహారాలలో సార్వజనీనకాలై ప్రఖ్యాతి గాంచాయి ఆర్షవిజ్ఞానాత్మకాలైన యీ పురాణాలు, ఉపపురాణాలు.

"సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వన్తరాణిచ
వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణమ్॥"

అని సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితాలు వర్ణింపబడిన గ్రంథాలుగా లక్షణం చెప్పబడింది. పంచలక్షణాత్మకాలైన పురాణాలకు మాత్రంగానే పేర్కొనబడిన పైలక్షణాలు, ఉపపురాణాలకుకూడా వర్తిస్తాయి. ఈలక్షణాల కనుగుణంగానే పురాణాలలో పూర్వసృష్టి, స్థితిలయాల గురించి, పునస్సృష్టి దేవతావంశక్రమాలను గురించి బ్రహ్మర్షి, రాజర్షుల గోత్రక్రమాలగురించి, మన్వంతరాలగురించి, సూర్యచంద్రవంశరాజుల చరిత్రలగురించి, ఖగోళ, జ్యోతిర్మంత్రాది విషయాలతో యితరవిషయా లనేకం వర్ణించడం జరిగింది. సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులలోని విషయాలు వీటిల్లో వివరంగా వర్ణింపబడినాయని పెక్కురు భావించారు. ఒకపురాణంలో వున్న విషయాలే మిగిలినపురాణాలలోకూడా వున్నాయని చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు. అయితే రామాయణ, భారతాలలో సూక్ష్మంగా పేర్కొనబడిన విషయాలు, వివరంగా యీ పురాణాలలో వర్ణింపబడినాయన్న కారణంతో, పురాణాలన్నీ, రామాయణంకంటే ప్రాచీనతరాలయిన గ్రంథా లన్నమాటను త్రోసిరా జనడమేకాక మహాభారతకాలంకంటేకూడా, తరువాతికాలంలోనే పురాణాలు సృజింపబడినాయని, యివి అతినవీనాలని కొందరు విమర్శకులు భావించారు. పురాణాలలో వొకదానిలో వున్న విషయం మరొకదానిలో లేకపోయినా, వీటన్నిటిమధ్యా ఒకానొకవిధమైన ఏకీభావాన్ని సమకూర్చే సమన్వయం అంతర్గతసూత్రదృక్పథం ఒకటి కనిపిస్తుంది. ఒకటి వాయుప్రోక్తంగా, వేరొకటి పరాశరప్రోక్తంగా, మరొకటి నారదప్రోక్తంగా, యీవిధంగానే విభిన్నపురాణాలకర్తృత్వం, విభిన్నవ్యక్తుల కున్నట్లుగా విస్పష్టంగా గోచరమౌతున్నా, సామూహికంగా యివన్నీ వ్యాసప్రోక్తాలేనని, లేదా వ్యాసవిరచితాలేనని సర్వసామాన్యంగా ఒకఅభిప్రాయం పాతుకుపోయింది. అందువల్ల వీటికర్తృత్వంగురించి విమర్శకు లెవరూ ఒకసుస్థిరమైన నిర్ణయాన్ని చేయలేకపోయారు. ఏపురాణం, యేకాలంలో పుట్టిందో యీవిమర్శకులు గుర్తించలేకపోయారు. అష్టాదశస్మృతులలోనూ దేని కదే ప్రాచీనమని కొందరు మూర్ఖంగా విశ్వసించగా ఆధునికవిమర్శకులు సైతం అవిధంగానే భావించి పురాణాలుకూడా దేని కదే ప్రాచీనమని అభిప్రాయపడి వీటికాలం భారతంకంటే అధునాతనమని అభిప్రాయపడినా వీటిల్లో పూర్వాపరత్వాలను పరిశోధకవిమర్శకులు పేర్కొనలేకపోయారు.

బ్రాహ్మణారణ్యకాలంలో పురాణశబ్దం ప్రయోగింపబడినా, ఈప్రయోగాన్ని పరిశోధకులు గుర్తించి కూడా - అసలు పురాణశబ్ధార్థాన్నే విస్మరించి - అది ప్రాచీనగాథాపరమని భావించి పురాణాలన్ని క్రీస్తుకు తరువాతివేనని చాలామంది విమర్శకు లభిప్రాయపడ్డారు. ఆపస్తంభధర్మసూత్రాలలో భవిష్యపురాణప్రస్తావన వున్నది. ఈ 18 పురాణాలసారాన్ని సంగ్రహించి వ్యాసుడు భారతాన్ని రచించినట్లు పారాశర ఉపపురాణంలో పేర్కొనబడింది. 18 పురాణాలను వ్యాసుడే రచించాడని అన్నిపురాణాలలోను, ఉపపురాణాలలోనూ కనిపిస్తున్నది. పాద్మ, వరాహ, శ్వేతాదికల్పాలలో బ్రాహ్మ - పాద్మ - వాయువ్యాది పురాణాలు అవతరించినట్లు మత్స్యాదిపురాణాలు వక్కాణించాయి. అయినా ఈకల్పాదివ్యవస్థలనుగాని, వివిధపురాణాంతర్గతాలైన ఆర్షవిజ్ఞాన, ఖగోళశాస్త్ర విషయాలనుగాని అంతరాంతరాల్లోకి వెళ్ళి పరిశీలించకుండా - ప్రక్షిప్తాప్రక్షిప్తాలజోలికి పోకుండా కొందరు పాశ్చాత్యపరిశోధకులు పురాణాలు క్రీస్తుశకంనాటివన్నమాట దేవు డెరుగునుగాని వాటికాలం క్రీస్తుశకం 6 వ శతాబ్దందాటి అంతకుపూర్వానికి యేపరిస్థితులలోనూ వెళ్లజాలదని, పేర్కొనడం మరీ విడ్డూరంగా కనిపిస్తున్నది. ఉత్తరధ్రువంగా ఒకఅభిప్రాయమూ - దక్షిణధ్రువంగా వేరొకఅభిప్రాయమూ ఒకరు యేదాడంటే మరొకరు కోదాడుగా వైజ్ఞానికమై స్థిరమై ప్రామాణికమైన దృక్పథం లేకుండా తమకు తోచినట్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

కొందరు ఆధునికప్రాచ్యపరిశోధకులు సైతం పురాణాల అవతరణగురించి వాటి వ్యవస్థగురించి రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు. రామాయణ భారతాలలోని విషయాలేకాక హరివంశంలో వర్ణితమైన విషయాలుకూడా కొన్ని వాయు - విష్ణు - భాగవతాది గ్రంథాలలో కనిపిస్తున్నాయి. కాబట్టి పురాణాలు భారతాది రచనలకు ప్రాచీనాలనడానికి వీలులేదని వీ రభిప్రాయపడ్డారు. వైదికగ్రంథాలలో పురాణేతిహాసాది సంజ్ఞ లున్నప్పటికి ఆపస్తంభాది సూత్రగ్రంథాలలో పురాణాలను పేర్కొన్నా వ్యాసవినిర్మితాలైన ఈ పురాణాలన్నీ ఇప్పటి నామాలతోనే పూర్వం వ్యవహరింపబడ్డాయని అభిప్రాయపడినా వీటి చరిత్ర వేదాంగాల పుట్టుకవంటిదని కొంద రభిప్రాయపడ్డారు.

అమరసింహుని కాలానికే పురాణం పంచలక్షణసమన్వితమని పేర్కొనబడడంవల్లనూ భాస, కాళిదాస, ఆశ్వఘోషాదులు పురాణజ్ఞానం కలవారుగా విస్పష్టంగా రూఢి అవుతున్న కారణంగానూ పురాణాలు క్రీస్తుశకానికి పూర్వపువని కొందరు విమర్శకులు భావించారు. వీరుకూడా పౌరాణికమైన, ఆర్ష - వైజ్ఞానిక - చారిత్రక విషయాలను లోతుగా పరిశీలించి యీ నిర్ణయానికి వచ్చినట్లు కనబడదు. అంతేకాదు. వీరు వెల్లడించిన మరొక అభిప్రాయంకూడా వున్నది. కర్మ - భక్తి - జ్ఞానమార్గాలను సులభంగా ఉపదేశిస్తూ, మధ్య మధ్య తలయెత్తుతున్న వివిధనాస్తికమతాల నణగద్రొక్కుతూ, శైవ, వైష్ణవ మతాలను విగ్రహారాధనను పరివ్యాప్తి చెందించుతూ, అవతరించిన ఈ పురాణాలు, హరివంశానికి, క్రీస్తుశకప్రారంభానికి మధ్యకాలంలో అవతరించి వుంటాయనే వీ రభిప్రాయపడ్డారు. అంతే కాదు. క్రీస్తుశకానంతరం శైవ వైష్ణవాది మతాలు పరస్పరం యుద్ధాలను ప్రకటించుకున్నకాలంలో అంటే క్రీస్తుశకం 6, 7 శతాబ్దాలలోపల ఉపపురాణాలు ఆగ్నేయస్కాందాది పెక్కుపురాణాలలోని వివిధభాగాలు అవతరించి వుంటాయనికూడా వీ రభిప్రాయపడ్డారు.

పురాణాలు ఒకవర్గానికి చెందినవని ఇవి మహాపురాణాలని, ఉపపురాణాలని రెండువిధాలుగా వున్నట్లు కొంద రభిప్రాయపడ్డారు. పురాణాలు 18 సంఖ్యకు పరిమితాలన్నది సర్వవ్యాప్తమైన విషయంగా కనిపిస్తున్నా పురాణ పురాణేతర గ్రంథవ్యవస్థలగురించి సరైన అవగాహనలేనందువల్ల పురాణాలు అష్టాదశసంఖ్యను మించి వున్నాయని కొంద రభిప్రాయపడ్డారు. కొందరు బ్రహ్మాండపురాణాన్ని విడిచిపెట్టి వాయుపురాణాన్ని గ్రహించగా, మరికొందరు వాయుపురాణాన్ని విడిచిపెట్టి బ్రహ్మాండపురాణాన్ని పరిగ్రహించారు. మహాపురాణాలలో దేవీభాగవతాన్ని కొందరు పరిగ్రహించగా మహాభాగవతగ్రంథాన్ని మరికొందరు పరిగ్రహించారు. కొందరు నారదీయపురాణాన్ని మహాపురాణంగా గ్రహించగా, మరికొందరు దాని నసలు సంగ్రహించనేలేదు. మరి ఉపపురాణాలుసైతం పేరుకు 18 గా పరిమితాలే అయినా అవికూడా అష్టాదశాధికంగానే లెక్కకు వస్తున్నట్లు కొంద రభిప్రాయపడ్డారు. విష్ణుపురాణాన్నిబట్టి పరిశీలిస్తే ఈ క్రింది 18 మహాపురాణాలుగా వైష్ణవ - బ్రాహ్మ - శైవపురాణాలుగా కనిపిస్తున్నాయి.

వైష్ణవీయపురాణాలు
వైష్ణవం
నారదీయం
భాగవతం
గారుడం
పాద్మం
వారాహం

బ్రాహ్మమతపురాణాలు
బ్రహ్మాండం
బ్రహ్మకైవర్తం
మార్కండేయం
భవిష్యం
వామనం
బ్రాహ్మం

శైవమతపురాణాలు
మాత్స్యం
కౌర్మం
లైంగం
శైవం
స్కాంధం
ఆగ్నేయం

వీటిల్లో వైష్ణవీయపురాణాలు శ్రీమన్నారాయణుని సంస్తుతించేవి కాబట్టి సాత్వికాలూ మోక్షప్రదాలూ అయిన పురాణాలు అనీ - బ్రాహ్మమతపురాణాలు సరస్వతీచతుర్ముఖకుశానులను వర్ణించేవి కాబట్టి రాజసాత్మకాలూ స్వర్గప్రదాలూ అనీ - శైవమతపురాణాలు దుర్గామాహేశ్వరవిఘ్నేశకుమారస్వాములను వర్ణించేవి కాబట్టి అవి తామసాత్మకపురాణాలనీ, కాగా దుర్గతిదాయకాలనీ కొందరు ఆర్షవిజ్ఞానవిరుద్ధంగా, వాస్తవికతకు భిన్నంగా అభిప్రాయపడ్డారు. ఇంకా విచిత్రమేమంటే శైవపురాణాలను కలలోనైనాసరే చూడకూడదనీ వాటిని విన్నవారికి మతి పోతుందనీ పారాశర్య ఉపపురాణంలో శివద్వేషులు అవైజ్ఞానికంగా, అజ్ఞానపూర్వకంగా సృష్టించి పెట్టిన ఒక ప్రక్షిప్తశ్లోకాన్ని ఆధారంగా చేసుకొని కొంద రభిప్రాయపడ్డారు.

విష్ణుపురాణంలోనే పైన పేర్కొన్న పురాణనామాలలోని నారదీయ - బ్రహ్మకైవర్త - వామన - పురాణాలకు మారుగా వాయువ్య - బ్రహ్మవైవర్త - మహాభాగవత - లేదా దేవీమహాభాగవత పురాణాలు పాఠాంతరాలుగా పేర్కొనబడ్డాయి. నారసింహపురాణాన్ని మరికొన్నిచోట్ల పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చూస్తే మహా పురాణాలు 22 వరకూ తేలుతున్నాయని కొంద రభిప్రాయపడ్డారు. అయితే శైవవాయుపురాణాలు ఏకైకపురాణానికే నామాంతరాలని నిర్ణయానికి వచ్చినవారు కూడా లేకపోలేదు.

మత్స్యవిష్ణుపురాణాదులను బట్టి పురాణాల అవతరణ గురించి కొంతవిషయం తెలుస్తున్నది. అది యిది. అయితే ఈమత్స్యవిష్ణుపురాణాదివిషయాల్లో సైతం పొరపాట్లు లేవని ప్రక్షిప్తాలు లేవని సాధికారికంగా చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు.

"కృతయుగంలో బ్రహ్మ శతకోటిప్రవిస్తరం బ్రాహ్మసౌంజ్ఞాత్మకం అయిన పురాణసంహితాస్కంధాన్ని నిర్మించాడు. దానిసారాన్ని వేదవ్యాసుడు నాలుగులక్షలశ్లోకాలకు సంగ్రహపరచి అష్టాదశపురాణసంహితలుగా విరచించి సూతుడైన రోమమహర్షణునికి చెప్పాడు. ఆసూతుడు తనకొడుకైన ఉగ్రశ్రవనునికి బోధించాడు. తరువాత ఆసూతుడే నైమిశారణ్యంలో శౌనకాదిమహర్షులకు ఈఅష్టాదశపురాణాలనూ చెప్పాడు. పురాణాలన్నింటిలోనూ బ్రాహ్మపురాణం మొట్టమొదటిది. బ్రహ్మ మరీచిమహర్షి కుపదేశించిన యీపురాణంలో 10 వేల శ్లోకా లున్నాయి. పద్మపురాణంలో 55 వేల శ్లోకా లున్నాయి. సర్వధర్మాత్మక మనిపించుకున్న విష్ణుపురాణంలో శ్లోకాలు 6 వేలని కొందరూ, 8 వేలని ఇంకొందరూ, 9 వేలని మరికొందరూ, 10 వేలని వేరొకకొందరూ, 24 వేలని మరింకొందరూ అభిప్రాయపడ్డారు. ఈఅభిప్రాయాలన్నీ పాఠాంతరాలవల్ల యేర్పడినవే. అయితే శ్రీధరీయ, విష్ణుచిత్తీయ వ్యాఖ్యానాలతో ముద్రితమై లభిస్తున్న ప్రస్తుతవిష్ణుపురాణంలో 6 వేలు శ్లోకాలు మాత్రమే వున్నాయి. శివమాహాత్మ్యాన్ని వర్ణించేదిగా వాయుప్రోక్తంగా పేర్కొనబడుతున్న శైవపురాణంలో 24 వేల శ్లోకా లున్నాయి. ఇందులో గాయత్రిని సైతం అధికరించి ధర్మం విస్తారంగా వర్ణించబడింది. భాగవతంలో 18 వేల శ్లోకాలున్నాయి. నారదీయపురాణంలో 20 వేల శ్లోకాలున్నాయి. జైమినిమార్కండేయసంవాదరూపమైన మార్కండేయపురాణంలో 32 వేల శ్లోకాలున్నాయి. ఇష్టకాగణనాది అనేకక్రతువిషయాలనూ భృగుమహర్షి చయనోత్పత్తివిషయాలనూ తెలిపిన ఆగ్నేయపురాణంలో 8 వేల శ్లోకా లున్నాయి. వ్యాసమహర్షి శిష్యుడైన సుమం తుడు శతానీకున కుపదేశించిన ధర్మసారసమ్మిళితమైన భవిష్యపురాణంలో 31 వేల శ్లోకా లున్నాయి. అంబరీశునకు వసిష్ఠమహర్షి వివిధవైష్ణవధర్మాలను బ్రాహ్మ - స్వర్గస్వరూపాన్ని ఉపదేశించిన బ్రహ్మకైవర్తపురాణంలో 12 వేల శ్లోకా లున్నాయి. నందీశ్వరప్రోక్తమై ఈశానకల్పవృత్తాంతసమ్మిళితమైన లింగపురాణంలో 11 వేల శ్లోకా లున్నాయి. విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన వరహావతారమహాత్మ్యం వర్ణించబడిన వరాహపురాణంలో 24 వేల శ్లోకా లున్నాయి. షణ్ముఖప్రోక్తమై మాహేశ్వరధర్మచరిత్రలను వర్ణించిన స్కాందపురాణంలో లక్షశ్లోకా లున్నాయి. త్రివిక్రమమాహాత్మ్యాన్ని త్రిసర్గాలనూ, త్రిమూర్తులనూ వర్ణిస్తూ చతుర్ముఖబ్రహ్మ చెప్పిన వామనపురాణంలో 14 వేల శ్లోకాలున్నాయి. దేవేంద్రుడు తనయెదుట వుండగా మహావిష్ణువు కూర్మావతారంలో మహర్షులకు ధర్మార్థకామమోక్షాలను బోధిస్తూ చెప్పిన పురాణం కూర్మపురాణం. ఈకూర్మపురాణంలో 6 వేల శ్లోకా లున్నాయి. మహావిష్ణువు మత్స్యావతార మెత్తి మనువుకు నరసింహావతారవిశేషాలను గూర్చి చెప్పగా రూపొందిన పురాణం మత్స్యపురాణం. ఇందులో 14 వేల శ్లోకాలున్నాయి. గారుడకల్పంలో విశ్వాండమంతా గారుడోద్భవమే నని విష్ణువు వర్ణించిన విశేషాలతో వున్న పురాణమే గారుడపురాణం. 16 వేల శ్లోకా లిందులో వున్నాయి. బ్రహ్మవర్ణితమైన అజాండమహత్వం కల బ్రహ్మాండపురాణంలో 12 వేల 200 శ్లోకా లున్నాయి. ఈబ్రహ్మాండపురాణంలో భవిష్యత్కల్పాలవృత్తాంతం వివరంగా వర్ణింపబడింది. వివిధపురాణాలన్నింటిలోనూ సర్గప్రతిసర్గాదికర్త శ్రీమహావిష్ణు వని మాత్రమే వర్ణించబడింది. ఈవిషయంలో పురాణాలు "యతోవా ఇమాని భూతా" నీత్యాది వేదవాక్యాలతాత్పర్యాన్ని పురాణాలు ప్రతిబింబించాయనడంలో సందేహ మేమాత్రమూ లేదు. విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడు, విష్ణువే ఆదిత్యుడు. సర్వం విష్ణుమయం జగత్. ఇదే ఏకైకమైన సమస్తపౌరాణికమైన వాక్కు. అష్టాదశపురాణాల్లోనూ, ఇటువంటి ఏకైక అద్వితీయపురుషుణ్ణే వర్ణించడం జరిగింది. ఈ అద్వితీయభావాన్ని అతిక్రమించినవారు నరకం పాలౌతారు" అంటూ మత్స్యపురాణం పేర్కొన్నది. ఈమత్స్యపురాణంలో పేర్కొన్న వివిధపురాణాల శ్లోకాలసంఖ్య సరియైనదని మనం చెప్పలేము. ఈమత్స్యపురాణంలో ప్రక్షిప్తశ్లోకాలు లేవని మనం చెప్పలేము. వాయుపురాణాన్ని బట్టి పరిశీలిస్తే మత్స్యపురాణంలో 14000 - భవిష్యపురాణంలో 14500 - మార్కండేయపురాణంలో 9000 - బ్రహ్మవైవర్తపురాణంలో 18000 - బ్రహ్మాండపురాణంలో 12100 - భాగవతంలో 18000 - బ్రాహ్మ్యపురాణంలో 10000 - వామనపురాణంలో 10000 - ఆగ్నేయపురాణంలో 10600 - వాయువ్య పురాణంలో 23000 - నారదీయపురాణంలో 22000 - గరుడపురాణంలో 19000 - పద్మపురాణంలో 55000 - కూర్మపురాణంలో 17000 - వరాహపురాణంలో 24000 - స్కాందపురాణంలో 81000 శ్లోకా లున్నట్లుగా తేలుతున్నది. అష్టాదశపురాణాల శ్లోకసంఖ్యను పేర్కొంటున్న ఈ పురాణంలో 16 పురాణాల శ్లోకసంఖ్యలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. విష్ణు, లింగపురాణాలకు సంబంధించిన నామాలు శ్లోకసంఖ్యలు పేర్కొన్న శ్లోకం లభ్యమైన వాయుపురాణంలో విలుప్తమై పోయింది. ఇది వ్రాయసగాని పొరపాటు కావచ్చును. ఏది యేమైనా అన్నిపురాణాలలోనూ రకరకాలుగా పేర్కొనబడిన, వివిధపురాణాల శ్లోకసంఖ్యలు సరియైనవని నొక్కి వక్కాణించే అధికారం యెవరికీ లేదు. సమస్తపురాణోపపురాణాలలోను సర్వసామాన్యంగా ప్రక్షిప్తగ్రంథాలు, అధికపాఠాలూ మూలచ్ఛేదకాలైన విలుప్తభాగాలూ లేవని చెప్పడానికి బొత్తిగా అవకాశం లేదు. కాగా పురాణవిషయవ్యవస్థను గురించి గాని శ్లోకసంఖ్యావ్యవస్థను గురించి గాని సాధికారికంగా మాట్లాడే అవకాశం యెవరికీ లేదు.

లండన్‌లోవున్న ఇండియా ఆఫీసులో అనేకసంస్కృతగ్రంథా లున్నాయి. ఆసంస్కృతగ్రంథాల కేటలాగులోని పురాణవిషయవివరణపట్టికను చూస్తే మనకు అనేకవిషయాలు తెలుస్తాయి. వాయుపురాణం, శైవపురాణం భిన్నపురాణాలని కొందరు భావించగా మరికొంద రివి రెండూ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. మత్స్యపురాణంలో—

"యత్రతద్వాయవీయం స్యాద్రుద్ర మాహాన్మ్యసంయుతమ్
 చతుర్వింశత్సహస్రాణి పురాణం శైవముచ్యతే"

అని వక్కాణించబడింది. మత్స్యపురాణశ్లోకంవల్ల శైవపురాణంలో 24000 శ్లోకాలున్నట్లు విదితమవుతుండగా బొంబాయిలో ముద్రితమై ప్రకటితమైన వాయుపురాణంలోని శ్లోకాలసంఖ్య 12000 మాత్రమే పరిమితమై వున్నది. శివ, వాయుపురాణాలు ఒకటే అనడానికి వీలైన ఆధారాలు శైవసంజ్ఞాముద్రితవాయుపురాణంలో యెక్కడా లేవు. ఒకవేళ శివ, వాయు పురాణాలు ఏకైకాలైనా కాకపోయినా ముద్రితవాయుపురాణం అసలు పురాణం కాకపోవచ్చును. ఉపపురాణమై వుండవచ్చును. కాగా అది 12000 శ్లోకసంఖ్యకు మాత్రమే పరిమితమై వుండడంలో అబ్బురం లేదు. లేదా వాయుపురాణంలో ఇది ఒక భాగంమాత్రమే అయి వుండాలి.

"ఇతి శ్రీవాయుపురాణం శివాపరాహ్వయం సమాప్తమ్-"

"ఇతి శ్రీవాయూక్త చతుర్వింశతి సహస్ర్యాం శివసం
హితాయా ముత్తరఖండే శ్రీనర్మదామాహాత్మ్యే—"

"ఇతి శ్రీవాయుపురాణే లక్ష్మీసంహితాయా మానందకాననమాహాత్మ్యే—"

"ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే ద్వాదశసాహస్ర్యాం
సంహితాయాం బ్రహ్మాండావర్తం సమాప్తమ్"—

"పంచదశ సహస్రాణి ఖండేస్మిన్ మునినా పురా,
గ్రంథ సంఖ్యాని గదితా—
ఇతి శ్రీ వాయుపురాణం శివా
పరాహ్వయం సమాప్తమ్"—

అంటూ అనేకవాయుపురాణవ్రాతప్రతుల్లో విభిన్నాలైన గద్యలు కనిపిస్తున్నాయి. వాయుప్రోక్తం కాబట్టి ఇది వాయుపురాణంగా ప్రసిద్దిగాంచినా ఇందులో శివమాహాత్మ్యం విషయాలే అత్యధికంగా వుండడంవల్ల దీనినే కొందరు శివపురాణంగా పేర్కొనగా, మరికొందరు సమగ్ర అవలోకన చేయకుండా గ్రంథాలను సరిపోల్చి చూడకుండా ప్రత్యేకించి లింగపురాణం ఒకటున్నదన్న విషయం విస్మరించి వాయు, శివపురాణాలు విభిన్నాలని భావించడం జరిగింది. అయితే లింగపురాణాన్నే శివపురాణంగా పేర్కొన్నారేమోనని భావించడానికి కూడా అవకాశం ఉన్నది. "ఇతి వాయుపురాణే లక్ష్మీసంహితాయా మానందకాననమాహాత్మ్యే" ఇత్యాది వాయుపురాణాధ్యాయాంత్యగద్యను పరిశీలించినపుడు వాయుపురాణంలో కేవలం శివమాహాత్మ్యం మాత్రమే వర్ణింపబడలేదనీ వైష్ణవమాహాత్మ్యం విషయాలు సైతం సందర్భవశాత్తూ పేర్కొనబడ్డాయనీ స్పష్టపడుతున్నది.

మహాభాగవత, దేవీభాగవతాలు రెండింటిలోనూ మహాపురాణంగా దేన్ని పరిగణించాలన్న విషయంలో 200 సంవత్సరాలకు పూర్వమే చాలా తర్జనభర్జనలు జరిగాయి. ఈచర్చలతో వివిధపరిశోధనాగ్రంథా లవతరించాయి. ఇటువంటి అభిప్రాయభేదాలు దక్షిణభారతదేశ పండితపరిశోధకులలో సైతం పొడసూపకపోలేదు. మహాభాగవత దేవీభాగవత గ్రంథాలు రెండూ సుప్రసిద్ధగ్రంథాలే. అయినా దేవీభాగవతంకంటే మహాభాగవతం ఒక్కకవిపండితమండలిలోనే గాక ఆబాలగోపాలమూ అతిసామాన్యప్రజలలో సైతం ఒకానొకవిశిష్టమైన స్థానాన్ని సంపాదించి ప్రఖ్యాతి సంపాదించిందనడంలో సందేహం లేదు. అయినప్పటికి కేవల మతాభిమానాలు కారణంగా భాగవత మనార్షేయమని శైవులూ, దేవీభాగవత మనార్షేయమని వైష్ణవులూ తిరస్కారభావాలను వెల్లడించారు. కాశీలో నివసించిన దక్షిణాచారప్రవర్తకుడైన గదాకాశీనాథభట్టు అనే పండితుడు "దేవీభాగవతమే ప్రామాణికగ్రంథం. మహాభాగవతం ఆర్షేయం కాదు. మహాపురాణాలలో పేర్కొనదగింది దేవీభాగవతమే," అని నిర్ణయిస్తూ "దుర్జనముఖచపేటిక" అనే పేరుతో ఒకగ్రంథాన్ని రచించి భాగవతపదువాదులకు త్రోసిరాజన్నాడు. దీనికి తగినట్లుగా మహాభాగవతగ్రంథాన్ని వ్యాసునిపేరుమీద వోపదేవుడు రచించాడే గాని అసలు వ్యాసుడు మహాభాగవతాన్ని రచించనే లేదని మరొకవాదం బయలుదేరింది. ఈవాదాలు రెండింటినీ తిరస్కరిస్తూ భట్టోజీ దీక్షితుల శిష్యుడైన రామాశ్రమపండితుడు "మహాభాగవతం అనార్షగ్రంథం కాదు. అర్షగ్రంథమే. అసలది వోపదేవవిరచితం కాదు. దేవీభాగవతం అసలు ఆర్షగ్రంథం కాదు. అనార్షం." అని నిరూపిస్తూ తిరిగి "దుర్జనముఖచపేటిక" అన్నపేరుతోనే వేరొకఖండనగ్రంథం రచించి దేవీభాగవతపక్షవాదులను తిరస్కరించాడు. ఆతరువాత వేరొకపండితుడు ఈమహాభాగవతపక్షవాదాన్ని ఖండిస్తూ దేవీభాగవత ఆర్షత్వాన్ని నిరూపిస్తూ "దుర్జనముఖపద్మపాదుక" అన్న పరిశోధనాగ్రంథాన్ని రచించాడు. మహారాష్ట్రభాషలో త్ర్యంబక గురునాథ కాలే అనే విమర్శకుడు "పురాణనిరీక్షణ" అనే విమర్శగ్రంథం వ్రాసి అందులో ఈరెండుభాగవతాల మహాపురాణత్వవిషయాలగురించి జరిగిన వాదప్రతివాదాలసారాంశాన్ని సంపూర్ణంగా ఉటంకించాడు. విద్యానిధి యోగీశ చంద్ర రాయ్ అనే విమర్శకుడు బెంగాలీలో కొంతపరిశోధన చేసి దేవీభాగవతం ఉపపురాణమేనని అభిప్రాయపడ్డాడు. బెంగాలీ సాహిత్యచరిత్రకారుడైన మణీంద్ర మోహన వసు దేవీభాగవతం మహాపురాణాలలోనిదేనని అన్నాడు. తెలుగువారిలో పెక్కురు దేవీభాగవతాన్ని ఉపపురాణంగా భావించగా తాతా సుబ్బరాయశాస్త్రిగారు మాత్రం మహాపురాణంగానే భావించారు. అయితే బృహద్ధర్మపురాణాదులు కొన్ని - ఇవి అష్టాదశపురాణాలలో చేరకపోయినా - అష్టాదశపురాణాలగురించి పేర్కొంటూ మహాభాగవత - దేవీభాగవతగ్రంథాలను రెండింటినీ అష్టాదశపురాణాలలోనివిగా పేర్కొన్నాయి. ఈదృష్ట్యా ఈరెండింటి ఆర్షేయత్వాన్ని గురించి శంకించవలసిన అవసరంలేదని కొందరు పండితులు భావించారు. అయితే మహాభాగవతం వోపదేవవిరచితమేనని అంగీకరిస్తే మహాభాగవతగ్రంథ ఆర్షేయత్వం యేవిధంగా నిలుస్తుం దన్నది సర్వసామాన్యంగా కలిగే ప్రశ్న.

క్రీస్తుశకం 1271-1300 మధ్యకాలంలో యదువంశంలో రామచంద్రుడనే నామాంతరం కలిగిన రామరాజు దేవగిరి రాజ్యాన్ని పరిపాలించాడు. అతని ఆస్థానంలో హేమాద్రి అనే పేరుగల మహామంత్రి ఒక డుండేవాడు. ఈహేమాద్రి కటకపురనివాసియైన వామదేవుడనే నామాంతరంగల కామరాజుయొక్క పుత్రుడు. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసవేత్త. గణకులలో అగ్రగామి. ఎంతో ఔదార్యవంతుడు. ఈహేమాద్రి మిత్రుడు మహాపండితు డనిపించుకున్న వోపదేవుడు. ఈ వోపదేవుడు బహుశాస్త్రవేత్తయైన ధనేశపండితుని శిష్యుడు. భిషగ్వరుడైన కేశవుని పుత్రుడు. ఉభయగురువులవల్లనూ అంటే ఇటు తండ్రివల్లనూ, అటు విద్యాగురువైన ధనేశపండితునివల్లనూ వోపదేవుడు బహుముఖప్రజ్ఞానిధి అయ్యాడు. సాహిత్య - వ్యాకరణ - వైద్య - జ్యోతిర్విషయాలలో అనేకగ్రంథాలు రచించిన మహామనీషి. ఈవోపదేవుడు మహాభాగవతం సమస్తస్కంధాలలోనూ వున్న విష్ణురక్షణ - విష్ణుభక్తి - విష్ణుతత్త్వ ప్రతిపాదకాలైన శ్లోకాల నుద్దరించి వాటిని "ముక్తాఫల" మన్నపేరుతో ఒకసంకలనగ్రంథంగా రూపొందించి దానికి "కైవల్యదీపిక" అనేపేరుతో ఒకవ్యాఖ్యానాన్ని రచించి దానికి తనమిత్రుడైన హేమాద్రి పేరు పెట్టాడు. ఈ విషయం కైవల్యదీపికావ్యాఖ్యానంలో వున్న ఈ క్రింది శ్లోకాదులవల్ల తేటతెల్లమవుతుంది.

"విశ్వద్ధనేశ శిష్యేణ బిషక్కేవసూనునా
హేమాద్రి ర్వోపదేవేన ముక్తాఫల మచీకరత్"

"చతురేణ చతుర్వర్గచింతామణి వణిజ్యయా
హేమాద్రిణార్జితం ముక్తాఫలం పశ్యతకౌతుకాత్"

"తేన ముక్తాఫలం తేనే యల్లోక మనుగృహ్ణతా
తత్రటీకాం యథాబుద్ది కుర్వే కైవల్యదీపికామ్"

"ఇహచస్వకర్తృకే౽ పియదురాజమహామంత్రిణా౽భ్యర్థిత ఆచార్యః
(వోపదేవః) తత్కర్తృకత్వం (హేమాద్రి కర్తృకత్వం) ఖ్యాపితవాన్"

"ఇతి శ్రీవోపదేవకృతా ముక్తాఫలటీకా సమాప్తా"

"ఇతి శ్రీహేమాద్రి కృతాముక్తాఫల టీకాకైవల్య దీపికాసమాప్తా"—

ఈవిధంగా వోపదేవ, హేమాద్రినామాలు రెండూ కనిపిస్తున్నా యీరెండింటికర్తాకూడా వోపదేవుడేనని సాధికారికంగా నిరూపితమవుతున్నది. అయితే ఈసందర్భాన్నిబట్టే భాగవతానికీ వోపదేవునికీ వున్న సంబంధమేమిటోకూడా బట్టబయలవుతున్నది. మహాభాగవతంలోని వివిధ స్కంధాలలోవున్న విష్ణులక్షణ - భక్తి - తత్త్వప్రతిపాదకాలైన వివిధశ్లోకాలను సంకలనం చేసి గుదిగుచ్చి "ముక్తాఫల" మన్నపేరుతో రూపొందించడమే తప్ప ఇంతకు భిన్నంగా మహాభాగవతశ్లోకరచనతో వోపదేవునికి సంబంధం లేదని విస్పష్టమవుతున్నది. అయితే ముక్తాఫలంగా సంకలనం చేసిన మహాభాగవతశ్లోకాలకు "కైవల్యదీపిక" అన్నపేరుతో వ్యాఖ్యానం వ్రాసినమాట వాస్తవమే! వ్యాఖ్యాకర్త అయినంతమాత్రంచేత, ఆవ్యాఖ్యకు మూలభూతాలైన శ్లోకాలకుకూడా కర్త కాజాలడు కదా! అక్కడక్కడా వున్న వివిధవిషయకాలైన శ్లోకాలను సంకలనం చేసి గుదిగుచ్చడం ఆశ్లోకాలమూలరచనకు, మూలకర్తృత్వానికి స్థానాన్ని ప్రసాదించదు కదా! హేమాద్రిపేరుమీద "కైవల్యదీపిక" వ్యాఖ్యను వోపదేవుడు రచించి వుండవచ్చు. ఇతరులపేరుమీద గ్రంథాలు రచించేబుద్ది వోపదేవునికి వున్నంతమాత్రంచేత - భాగవతానికి వోపదేవునికి యేదో నొకవిధమైన సంబంధం వున్నది గదా అని మొత్తం మహాభాగవతాన్ని వోపదేవుడే రచించా డనడం, మహాభాగవతం అనార్షేయ మనడానికి దుర్బుద్ధితో కుయుక్తితో వెలువరించిన భావమేతప్ప వేరు కాదు - లోతుగా పరిశీలించినపుడు మహాభాగవతవోపదేవకర్తృత్వవాదం అపహాస్యంపాలు కాక తప్పదు. గరుడ - మత్స్య - స్కందాది పురాణాలలో అనేకవిధాలుగా మహాభాగవతపురాణమాహాత్మ్యం అనేకసందర్భాలలో ప్రశంసించబడింది. వివిధపురాణాలలో వున్న ఈప్రశంస లన్నింటినీ వోపదేవుడే పరికల్పించాడంటారా? అతని తరువాత పరికల్పితాలైనాయంటారా? అస లిం తెందుకు? క్రీస్తుశకం 8 వశతాబ్దికి చివరికాలంలో జీవించారని ఏకగ్రీవంగా అందరూ ఆమోదిస్తున్న ఆదిశంకరులు మహాభాగవతానికి వ్యాఖ్య రచించారని - మహాభాగవతద్వైతవ్యాఖ్యాకర్తయైన విజయధ్వజాచార్యులు విస్పష్టంగా పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యులు మహాభాగవతవ్యాఖ్య రచించారని విస్పష్టంగా వ్రాసిన ద్వైతవ్యాఖ్యాకర్తయైన విజయధ్వజాచార్యుల వాక్యాన్ని మనం త్రోసిరా జనలేంకదా. దీనిని బట్టి ఆదిశంకరులకాలానికే అంటే క్రీస్తుశకం 8 వశతాబ్దానికే మహాభాగవతగ్రంథ మున్నట్లు చారిత్రకంగా దృఢపడుతున్నదిగదా! కాగా క్రీస్తుశకం 8 వశతాబ్దినాటికే వున్న మహాభాగవతగ్రంథాన్ని క్రీ. శ. 8 వశతాబ్దికి దాదాపు 450 సంవత్సరాల తరువాతికాలంలో వున్న వోపదేవుడు రచించాడని చెప్పడం శుద్ద అబద్ధమని తేలడం లేదా! మరి గరుడ - మత్స్యాదిపురాణాలలో వర్ణించబడిన మహాభాగవతం పురాణకాలంలోనిదేకాక ఆధునికగ్రంథం యెలా అవుతుంది?

పురాణాలు రామాయణభారతాలకంటే గొప్పవి. ప్రాచీనతరమైనవికూడా. అయినా పురాణాలకంటే రామాయణ మహాభారతాలకే భారతదేశం మొత్తంలో అత్యధికమైన ప్రాచుర్యమూ ప్రశస్తీ వచ్చింది. రామాయణ మహాభారతాల తరువాత మహాభాగవతానికి లభించినంత ప్రశస్తి మరేయితరపురాణానికీ రాలేదు. ద్వైతాద్వైతవిశిష్టాద్వైతత్రిమతాలవారికీ అవలంబనాలైన బ్రహ్మసూత్రాలవలె ఉపనిషత్తులవలె భాగవతంకూడా జీవేశ్వరతత్త్వ ఆవిష్కరణలో ఒక అమూల్యమైన అవలంబనంగా నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. ఇటీవల ముద్రితాలై మనకు లభిస్తున్న మహాభాగవతత్రిమతవ్యాఖ్యానాలే కాక వీటికి తోడు "సారార్థదర్శిని - వైష్ణవరోషణి - సుబోధిని - భాగవతప్రకాశం" మొదలైన ఇతరవ్యాఖ్యానాలుకూడా లభించాయి. ఈమహాభాగవతం ఆధారంగా భాగవతామృతం - భాగవతసందర్శం మొదలైన గ్రంథా లనేకం భాగవతగుణప్రోక్తాలుగా అవతరించాయి. ఏది యేమైనా దేవీభాగవతమహాపురాణత్వాన్ని గాని ఆర్షేయత్వాన్ని గాని నిలబెట్టడంకోసం మహాభాగవత ఆర్షేయత్వాన్ని - విష్ణుసంకీర్తన ప్రాచీనత్వాన్ని త్రోసిరాజనవలసిన పనిలేదు. ఇంతమాత్రంచేత దేవీభాగవతాన్ని ఆర్షవిజ్ఞానందృష్ట్యా తక్కువగ్రంథంగా త్రోసిపుచ్చడానికి వీలులేదు. దేవీభాగవతం కూడా అత్యంతప్రాచీనకాలంనుంచీ అత్యంతప్రశస్తి పొందినమాట వాస్తవమే. కాని ఈసందర్భంలో వున్నమాట ఒకటి చెప్పక తప్పదు. మహాభాగవతం అన్నివర్గాలప్రజలలోనూ ఆబాలగోపాలమూ ప్రశస్తి పొందింది. దేవీభాగవతం మాత్రం కొన్నివర్గాలప్రజలలో మాత్రమే ప్రశస్తి పొందింది. కొందరు పరిశోధకు లభిప్రాయపడినట్లు మహాభాగవతమే తొలుత అవతరించి అనంతరమే దేవీభాగవతం అవతరించినట్లు కనిపిస్తున్నది. మహాభాగవతంలో ద్వాదశస్కంధా లుండగా, దేవీభాగవతంలోకూడా ద్వాదశస్కంధా లున్నాయి. మహాభాగవతంలో 18000 శ్లోకాలుండగా దేవీభాగవతంలో సైతం 18000 శ్లోకాలున్నాయి. మహాభాగవతాని కసలుపేరు "శ్రీమద్మహాభాగవతం" అని మహాభాగవతానికి మొదట లక్ష్మీవాచకమైన "శ్రీ" శబ్దం వున్నది కాబట్టి దేవీభాగవతానికి మొదట "శ్రీ" శబ్దానికి మారుగా "దేవీ" శబ్దం చేర్చబడిందని కొందరు విమర్శకులు భావించారు. కాని ఇది సరికాదు. "శ్రీ" శబ్దం సర్వసామాన్యవాచకం. "శ్రీ" శబ్దం కేవలం లక్ష్మీపరమైనది మాత్రమేకాదు. దేవీపరమైనది - సరస్వతీపరమైనది కూడా. దేవీభాగవతం అసలుపేరు దేవీభాగవతం అని కానేకాదు. "శ్రీమద్దేవీభాగవతం" అని మాత్రమే. భాగవతాన్ని మహాభాగవతంగా పేర్కొన్నట్లుగానే, దేవీభాగవతాన్ని సైతం "దేవీమహాభాగవతం"గా పేర్కొన్నవారు కూడా లేకపోలేదు. అయితే ఒకటి విష్ణుమాయామయమైన కృష్ణలీలాశ్రయం కాగా, వేరొకటి పార్వతీపరమేశ్వవిలాసాశ్రయం కావడమే వీటివైశిష్ట్యం.

అష్టాదశపురాణాలలో బ్రహ్మవైవర్త - బ్రహ్మకైవర్తపురాణాలు రెండూ ఒక్కటే అని కొందరు విమర్శకుల అభిప్రాయం. ఉత్తరభారతీయులు బ్రహ్మవైవర్తమని వ్యవహరించగా, దాక్షిణాత్యులు బ్రహ్మకైవర్తమని వ్యవహరించారని వీరి అభిప్రాయం. అయితే ఒక్క బ్రహ్మవైవర్తపురాణవిషయంలోనే కాదు మిగిలిన పురాణా లన్నిటివిషయంలోనూ చివరికి రామాయణభారతాల విషయాల్లో సైతం ఉత్తరభారతదేశప్రతులకూ, దక్షిణభారతదేశప్రతులకూ అనేకవిషయాలలో కేవలం పాఠాంతరాలలోనే కాదు, గ్రంథభాగాలలో సైతం విభిన్నత్వం గోచరమవుతున్నది.

వాస్తవానికి ఉపపురాణాలు 18 సంఖ్యకే పరిమితమైనా కొందరు ప్రాచీనరచయితలు కొన్నికొన్నివిశేషవిషయాలకు ప్రాధాన్య మిచ్చి గ్రంథాలుగా రూపొందించి వాటిని ఉపపురాణాలలో చేర్చివేశారు. కాగా ఉపపురాణాల సంఖ్య 18 ని మించిపోవడంలో ఆశ్చర్యంలేదు. మరుగున పడిపోయిన ఉపపురాణాలు మరుగున పడిపోగా అసలు ఉపపురాణాలే కానివ్వండి, ఉపపురాణనామక యితరగ్రంథాలే కానివ్వండి, 34 గ్రంథాలవరకూ లభించాయి. ఆది - ఆదిత్య - ఔపనస - కల్కి - కాపిల - కాళిక - గణేశ - చండికా - దేవీ - దౌర్వాస - ధర్మ - నందీశ్వర - నారద - నారదీయ - నారసింహ - పారాశర్య - బృహద్ధర్మ - బృహన్నందీశ్వర - బృహన్నారదీయ - బ్రహ్మాండ - భవిష్యోత్తర - భార్గవ - మానవ - మారీచ - లైంగ - వామన - వారుణ - వాసిష్ఠ - విష్ణుధర్మ - విష్ణుధర్మోత్తర - శివ - శివధర్మ - సనత్కుమారీయ - సాంబవంటి ఉపపురాణాలు, ఉపపురాణనామకాలు ఉపలభ్యమానాలైనాయి. వీటిల్లో మహాపురాణమైన బృహన్నారదీయం కూడా ఉపపురాణంగా చేర్చబడడం విచిత్రం.

వాస్తవానికి పురాణాలు 18 మాత్రమే కాబట్టి ఉపపురాణాలు సైతం 18 కే పరిమితం కావాలి. అంతే కాదు అష్టాదశమహాపురాణాలు యేనామాలతో రూపొందాయో అదే అష్టాదశనామాలతో అష్టాదశ ఉపపురాణాలు అవతరించడంలో ఔచిత్యమూ, యధార్థ్యతా గోచరిస్తుంది.

"మద్వయం భద్వయంచైవ బ్రత్రయం వచతుష్టయం!
 అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథక్!

అన్న ప్రాచీనకారికప్రకారం మత్స్య - మార్కండేయ - భాగవత - భవిష్యత్ - బ్రహ్మాండ - బ్రాహ్మ - బ్రహ్మవైవర్త - వామన - వాయువ్య - వైష్ణవ - వారాహ - అగ్ని - నారద - పద్మ - లింగ - గరుడ - కూర్మ - స్కాంద పురాణాలు మాత్రమే 18 పురాణాలుగా నిలుస్తాయి. ఈ అష్టాదశమత్స్యాదినామాలతోనే 18 సంఖ్యకు మాత్రమే పరిమితమై ఉపపురాణాలు కూడా నిలువవలసి వున్నది.

అసలు అష్టాదశపురాణాలను పురాణాలనే వ్యవహరించాలి. అత్యంతప్రాచీనకాలంలో ఆవిధంగానే వ్యవహరించేవారు. "శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలు" అన్న వాక్యంలో అత్యంతప్రాచీనకాలంనుంచి కూడా మన కీపురాణశబ్దమే కనిపిస్తుంది. అయితే ఉపపురాణా లవతరించిన తరువాత ఆయా ఉప పురాణాలను, ఉపపురాణాలుగా పేర్కొనడంలో బద్దకించిన పండితులు, ఉపశబ్దాన్ని విడిచిపెట్టి సులభాపేక్షతో, సౌఖ్యాపేక్షతో, ఉపపురాణాలనుసైతం పురాణాలని వ్యవహరించడం మొదలుపెట్టారు. కాగా అసలు పురాణాలేవో, ఉపపురాణాలేవో విస్పష్టంగా సులభతరంగా గుర్తించడంలో పండితలోకంలోనే తికమక లేర్పడ్డాయి. ఈతికమకలనుంచి బయటపడడంకోసం పురాణాలుగా వ్యవహరింపబడుతున్న ఉపపురాణాలకూ, అసలుపురాణాలకూ భిన్నత్వం గోచరమవ్వాలనే దృష్టిలో అసలుపురాణాలకు మొదట "మహా"శబ్దాన్ని చేర్చి వ్యవహరించడం మొదలుపెట్టారు. అందువల్ల అసలు పురాణాలుమహాపురాణాలై ఉపపురాణాలు పురాణాలై కూర్చున్నాయి. వాస్తవానికి అత్యంతవిపులంగా వున్న మూలపురాణంలోని అసలువిషయాన్ని అంతటినీ సంగ్రహించి చెప్పేది ఉపపురాణమై ఉండాలి. ఈదృష్ట్యా అష్టాదశమూలపురాణాలకు, అష్టాదశ ఉపపురాణాలు మాత్రమే అవతరించే అవకాశం వున్నది. అయితే ఉపపురాణాలు అష్టాదశసంఖ్యను మించిపోయినట్లు కనిపిస్తున్నది. ఇందుకు కారణంకూడా లేకపోలేదు. వాస్తవానికి విష్ణుపురాణానికి ఉపపురాణంగా అవతరించిన, విష్ణుధర్మపురాణంలో, విష్ణుపురాణసారాంశమంతా వున్నదో లేదో చెప్పలేము. మొట్టమొదట అది అవతరించినపుడు, అది విష్ణుపురాణసారాంశప్రతిబింబకం అయ్యే అవతరించి వుండవచ్చును. తరువాతికాలంలో దానిలో కొంతభాగం శిథిలమై వుండవచ్చును. అప్పుడు మరొకపండితుడు తన కసమగ్రంగా లభ్యమైన విష్ణుధర్మ ఉపపురాణం సమగ్ర ఉపపురాణం కాదన్న భావంతో "విష్ణుధర్మోత్తర ఉపపురాణం" అన్న పేరుతో విష్ణుపురాణం ఆధారంగానే వేరొక ఉపపురాణాన్ని రూపొందించి వుండవచ్చును. కాగా విష్ణుపురాణానికి, వొకేవొక్క ఉపపురాణంగా వుండవలసిన గ్రంథం రెండు ఉపపురాణాలుగా, రెండు భిన్నగ్రంథాలుగా అవతరించి వుంటాయి. ఇదేవిధంగా అత్యంతవిపులమైన విభిన్నవిషయాలకు ఆలవాలాలైన మూలపురాణాలలోని వివిధవిషయాలను వివరిస్తూ, భిన్నభిన్నగ్రంథాలుగా, వేరు వేరు ఉపపురాణాలుగా మరికొన్ని అవతరించి వుంటాయి. అంటే ఒకానొకవిధమైన పురాణసారసూత్రబద్ధమై సమగ్రగ్రంథాలుగా అవతరించవలసిన ఉపపురాణాలు అసమగ్రాలై, సమగ్రనామక ఉపపురాణాలుగా అవతరించాయన్నమాట. ఈదృష్ట్యా ఖండఖండాలుగా అవతరించిన విభిన్న ఉపపురాణనామకగ్రంథాలు అసలు ఉపపురాణాలు కానేకావన్నమాట. అయితే మత్స్య - మార్కండేయాది అష్టాదశపురాణాలు సుసమగ్రంగా, యథాతథంగా ప్రక్షిప్తపాఠవిరహితంగా మనకు లభించాయని చెప్పలేము. కాగా, అసలైన, సరైన ఉపపురాణాలుకూడా మనకు ఉపలభ్యమానాలైనాయని చెప్పడం నిస్సందేహంగా సందేహాస్పదమైన విషయమే.

పురాణాల కర్తృత్వం

అష్టాదశపురాణాలన్నీ క్రీ. శ. 6 శతాబ్దం ప్రాంతంలో రచించబడినాయని కొందరు భావించినా, క్రీస్తుకు పూర్వమే యీపురాణాలన్నీ వున్నాయని మరికొందరు భావించినా చారిత్రకంగా వీటికాలంగురించి సాధికారికంగా చెప్పడానికి అవకాశం లేనట్లే యీపురాణాలకర్తృత్వం గురించి ఇతమిత్థం అని సాధికారికంగా చెప్పడానికి అవకాశంలేదు. అష్టాదశపురాణాలకు కర్త వేదవ్యాసుడే అన్నమాట అలా వుండగా యీపురాణాలలో రెండుపురాణాలు మాత్రమే వ్యాసప్రోక్తాలని విస్పష్టంగా వక్కాణిస్తూ ప్రాచీనకాలంనుంచీ అనుస్యూతంగా, ఆర్యోక్తిగా ఒక కారిక నిలిచివున్నది.

"అష్టాదశపురాణేషు వ్యాసేనకథితం ద్వయం
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్"

దీనిప్రకారం అష్టాదశపురాణాలకూ, వ్యాసుడే కర్త అన్నమాట అప్రామాణికమై అతని కర్తృత్వం రెండుపురాణాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఆర్ష విజ్ఞానందృష్ట్యా అసలు వ్యాసశబ్దం మహర్షినామం కాదు. వ్యాసమహర్షి అనబడుతున్న ఆమహర్షి అసలుపేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసశబ్దం అపసవ్యవాఙ్మయమైన ఆర్షవాఙ్మయాన్ని వ్యాసం చేసి అంటే విస్తృతం చేసి సవ్యంగా రూపొందించబడడంవల్ల అది వొకసిద్ధాంతనామంగా ప్రాచీనకాలంలో రూపొందింది. వ్యాసమహాభారతమన్నా, వ్యాసకృతమహాభారతమన్నా విస్తృతం చేయబడిన, సవ్యంగా రూపొందించబడిన మహాభారతం అనే అర్థం కాని, వ్యాసుడనే వ్యక్తిచేత రచింపబడిన మహాభారతమని అర్థంకాదు. వ్యాసః అని కాని వ్యాసమహర్షిః అని కాని ప్రాచీనకాలంలో ప్రయుక్తాలయ్యాయంటే వ్యాసం (విస్తృతం) చేసినవాడు - వ్యాసం (విస్తృతం) చేసిన మహర్షి అన్న విశేషార్థాలలోనే ప్రాచీనులు ప్రయోగించారు తప్ప, కేవల నామవాచకంగా మాత్రం ప్రయోగించలేదు. అయితే ఈవ్యాసనామకులు కూడా నొక్కరుగానే లేరని, వేదవ్యాసుడు వేరని, పురాణవ్యాసుడు వేరని, మహాభారతవ్యాసుడు వేరని యింకా యింకా అనేకమంది

వ్యాసమహర్షు లున్నట్లు భావించినవారు కూడా లేకపోలేదు. భాగవతాన్నిబట్టి చూస్తే ప్రతిద్వాపరయుగంలోనూ వేదవ్యాసుని పేరుమీద స్వయంభువు, ప్రజాపతి, శుక్రుడు, బృహస్పతి, వశిష్ఠుడూ, త్రివర్షుడూ, నద్వాజుడూ, మొదలైనవారు వేదవ్యాసులుగా ఆర్షవిద్యలను విస్తరింపచేసినట్లు తెలుస్తున్నది. కాగా ఒకమన్వంతరంలో 72 చతుర్యుగాలలోనూ 72 మంది వేదవ్యాసనామకులు విభిన్నవ్యక్తులు అవతరించి ఆర్షవిజ్ఞానవ్యాప్తి చేస్తారని తేటతెల్లమవుతున్నది. యీ లెక్క ప్రకారం చూస్తే 14 మన్వంతరాలలో 1008 మంది విభిన్నవేదవ్యాసులు అవతరిస్తారని భావించవలసి వున్నది. అయితే ప్రత్యక్ష, అప్రత్యక్షాది జీవితవిశేషాలతో కూడుకొన్న పరాశరసూను డై కృష్ణ ద్వైపాయన నామకుడైన వ్యాసమహర్షి కాలనిర్ణయవిషయంలో కూడా - అతనిది భారతయుద్ధకాలమేనని నిక్కచ్చిగా చెప్పలేము. పరాశరాదుల ఆయుఃప్రమాణవిషయంకూడా సందేహస్పదమైనదే. అష్టాదశపురాణాలను వ్యాసుడే రచించాడన్నా, అసలు వీటన్నింటికి మూలకర్త బ్రహ్మేయని పేర్కొన్నా, రకరకాలుగా వున్న యీపురాణాలన్నింటికి కర్తృత్వం అనేకవిధాలుగా గోచరమౌతున్నది. వీటన్నింటికి పురాణాలే ఆధారంగా వుండడం మరీ విచిత్రంగా కనిపిస్తున్నది. మత్స్య, విష్ణ్వాది పురాణాలను బట్టి చూస్తే, అసలు పురాణాల మూలకర్త బ్రహ్మ అని, ఆబృహద్గ్రంథాన్ని 18 పురాణాలుగా వ్యాసుడు సంగ్రహించి రోమహర్షణునికి చెప్పగా, ఆరోమహర్షణుడు సూతమహర్షికి చెప్పగా, సూతుడు శౌనకాదులకు చెప్పినట్లు వొకచోట కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా వాయుపురాణం వాయుప్రోక్తంగానూ, నారదీయపురాణం నారదప్రోక్తంగానూ, మార్కండేయపురాణం మార్కండేయప్రోక్తంగానూ, బ్రహ్మాండపురాణం వశిష్ఠబ్రహ్మప్రోక్తంగానూ, లింగపురాణం నందికేశ్వరప్రోక్తంగానూ, గారుడ, వరాహపురాణాలు విష్ణుప్రోక్తాలుగానూ, బ్రహ్మ, వామనపురాణాలు బ్రహ్మప్రోక్తాలుగానూ, స్కాందపురాణం స్కంద(షణ్ముఖ)ప్రోక్తంగానూ, కూర్మపురాణం కూర్మావతారప్రోక్తంగానూ, మత్స్యపురాణం మత్స్యావతారప్రోక్తంగానూ, వక్కాణించారు. ఈదృష్ట్యా అగ్నిపురాణం అగ్నిప్రోక్తంగానూ, విష్ణుపురాణం విష్ణుప్రోక్తంగానూ భావించవలసి వుంటుంది. పద్మపురాణం విష్ణుప్రోక్తమే అనుకున్నా, బ్రహ్మవైవర్తపురాణం వైవర్తబ్రహ్మప్రోక్తంగా భావించినా, మిగిలిన భాగవత, భవిష్యత్ పురాణాలు వ్యాసకృతాలని చెప్పవలసి వుంటుంది. ఇవన్నీ పురాణవిషయాలమీద ఆధారపడి చెప్పినవే అయినా, వీటి కథాకథనం ప్రకారం పరిశీలిస్తే వాయు, నారదాదిప్రోక్తత్వాలుగా పేర్కొనడంలో - లౌకికంగా ప్రస్తుతం నిజమేనని నిరూపించడానికి అవకాశాలు లేకపోయినా - ఆర్షవిజ్ఞానందృష్ట్యా మాత్రం అగాధమైన పరిశోధనలు చేస్తే నిజం లేకపోలేదేమో నని అనిపిస్తుంది. మత్స్యాదిపురాణాలను బట్టి చూస్తేనే, అష్టాదశపురాణాలకు కర్త వ్యాసుడేనన్న మాట వాస్తవంగా నిలువదు. కాగా ఆయాపురాణకర్తృత్వవిషయంలో ఆకర్తృత్వాన్ని వేరే మహర్షులకో, మనీషులకో, మనుషులకో ఆపాదించి నిర్ణయించడానికి పరిశోధకులకు యెటువంటి ఆధారాలూ లేవు. అధికారాలూ లేవు.

పురాణరచనాకాలవ్యవస్థ

'శ్రుతి స్మృతి పురాణేతిహాసాలు' అన్న వాక్యం ప్రకారం శ్రుతుల తరువాత స్మృతులు వాటి తరువాత పురాణాలు అవతరించినట్లు కనిపిస్తుంది. శ్రుతు లెప్పు డవతరించాయో సాధికారికంగా చెప్పలేనట్లే స్మృతుల అవతరణ గురించి కూడా చెప్పే అవకాశంలేదు. ఇదేవిధంగా పురాణాల అవతరణ గురించి, వాటికాలం గురించి చెప్పడం ఎంత అగాధమైన పరిశోధనలు చేసినా సుసాధ్యంగా కనపడడంలేదు. పురాణశబ్దానికి పురాతనవిషయాలు చెప్పేది అని పండితవిమర్శకలోకమంతా అర్థం చెప్పుకుంటున్నది. లోతుగా పరిశీలిస్తే పురాణమంటే పురాతనకాలంలో చెప్పబడింది అని మాత్రమే అర్థమేమోనని అనిపిస్తున్నది. పురాణాల ఆవిష్కరణదశలను, గాథలను పరిశీలించినపుడు వొక్కభవిష్యపురాణమే కాదు. మొత్తం పురాణాలన్నీ భవిష్యపురాణాలుగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు వొక్కనారదీయపురాణమే తీసుకొందాం. ఈనారదీయపురాణంలో విష్ణుమాహాత్మ్యంగురించి వర్ణించడంతోపాటు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మాదికాలు, ప్రహ్లాదజననం, వరాహనరసింహావతారాలు ఇత్యాది విశేషాలన్నీ భవిష్యత్తులో జరుగబోతున్నాయని నారదప్రోక్తమై వున్నది. అంటే వరాహనరసింహావతారాలకు పూర్వమే - అది ఎంతపూర్వకాలంలోనో ఇదమిత్థంగా చెప్పలేము - నారదీయపురాణం ప్రోక్తమైనదన్నమాట. కాగా యిది భవిష్యద్వాణీవిలసితమేకదా!

బ్రహ్మ, పద్మ, వరాహ, శ్వేతాది కల్పాలలో, బ్రహ్మ, పద్మ, వరాహ, వాయువ్యాది పురాణాలు ఉత్పన్నా లయినాయని మత్స్యపురాణం పేర్కొంటున్నది. పురాణాలు కల్పాలలోకే ప్రవేశించాయంటే మనం ఒక అనంతప్రపంచంలో అయోమయంలో పడిపోయామన్నమాట. ఆర్షవిజ్ఞానందృష్ట్యా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు నాల్గింటినీ చతుర్యుగాలని, మహాయుగమని పేర్కొంటారు. ఈయుగాల కాలపరిమితి మానవసంవత్సరాలలో 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి 74 చతుర్యుగాలయితే ఒక మన్వంతరం. పూర్వోత్తరసంధికాలాలతో కలుపుకొని 14 మన్వంతరాల కాలం గడిస్తే ఒకకల్పంగా పరిగణన. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణిక, దక్షసావర్ణిక, బ్రహ్మసావర్ణిక, రుద్రసావర్ణిక, ధర్మసావర్ణిక, రౌచ్య, భౌచ్య మనువుల అంతరకాలపరిమితి 432 కోట్ల సంవత్సరాలు. ఈసంవత్సరాల కాలమే ఒకకల్పం అనబడుతుంది. యీ 432 కోట్ల సంవత్సరాలూ బ్రహ్మకు ఒకపగలు. దీన్ని ఉదయకల్పం అని అంటారు. అనంతరం తిరిగి 432 కోట్ల సంవత్సరాలు నడిస్తే అది బ్రహ్మకు రాత్రి. దీన్ని క్షయకల్పం అంటారు. అంటే 864 కోట్ల మానవసంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు పగలూ రాత్రితో కూడిన ఒకరోజుక్రింద లెక్క అన్నమాట. ఇటువంటి రోజులు 365 అయితే బ్రహ్మకు ఒకసంవత్సరం. అంటే 3 లక్షల 15వేల 410 కోట్ల మానవసంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒకసంవత్సరం గడిచినట్లన్నమాట. ఇటువంటివి 100 సంవత్సరాలైతే బ్రహ్మకు పూర్ణాయుర్దాయం. అంటే 3 కోట్ల, 15 లక్షల, 41 వేల కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మ పరమాయు వన్నమాట. కల్పాలదృష్ట్యా బ్రహ్మ పరమాయుర్దాయకాలంలో పగలు, రాత్రిళ్ళుగా పరిగణించబడే వివిధకల్పాలసంఖ్య 73 వేలకు పరిమిత మౌతుంది. ఒకకల్పానికి 432 కోట్ల సంవత్సరాల కాలమని అధర్వవేదం ఈక్రిందిమంత్రంలో విస్పష్టంగా వక్కాణించింది.

"శతంతే అయుతం హాయనాన్
ద్వేయుగేత్రీణి చత్వారి కృణ్మః
ఇంద్రాగ్ని విశ్వేదేవాస్తేను
మన్వంతా మహృణీయమానాః — (అధర్వ 8-1-2-21)

బ్రహ్మ, పద్మ, వరాహ, శ్వేతాది నామాలతో వివిధకల్పాలకు నామా లున్నట్లు కనిపిస్తున్నది. అయితే బ్రహ్మ పరమాయుర్దాయంలో వచ్చే మొత్తం 73 వేల కల్పాలకు క్రమానుగతంగా ఒకపద్ధతిప్రకారం నామాలు ఆర్షవిజ్ఞానందృష్ట్యా యేర్పడి వుండవచ్చును కాని అవన్నీ మనకు లభ్యమైనట్లు కనపడదు.

అసలు స్వాభావికంగా సృష్టే చాలా విచిత్రమైనది. సూర్యోదయ, అస్తమయాలు క్రమబద్ధంగా నిర్ణీతకాలప్రకారం జరుగుతున్నట్లు చంద్రోదయ, అస్తమయాలు క్షీణాభివృద్ధి దశలు క్రమబద్ధంగా జరుగుతున్నట్లు, అశ్విన్యాది 27 నక్షత్రాలు ప్రతి 27 రోజులకు (అధికమాసాన్ని విడిచిపెట్టి) వొక్కసారి చంద్రసామీప్యాన్ని పొందుతున్నట్లు మేషాది ద్వాదశరాసులు కాలబద్దాలై క్రమంగా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు భూమ్యాదిగోళాలన్నీ యితరగ్రహనక్షత్రాలన్నీ తమచుట్టూ తాము తిరుగుతూ తమ అధిదేవత చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు సృష్టిమొత్తంలో అటు స్వరూపంలోనూ, యిటు స్వభావంలోనూ సైతం ఒకానొక విచిత్రమైన చక్రనేమిక్రమంతో కూడిన పునరావృత్తిపూర్వకమైన వ్యవస్థ వున్నట్లు అగాధమైన ఆర్షవిజ్ఞానందృష్ట్యానే కాదు ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా మనం పరిశోధన చేస్తే మనకు గోచరమౌతుంది.

"చరిత్ర పునరావృత మౌతుంది" అన్నవాక్యం సర్వసామాన్యంగా అనేకసందర్భాలలో మనందరినోటా నలిగేమాట. ఇది యేదో అలవోకగా గాని ఆషామాషిగా కాని, ఊసుపోక కాని, సృష్టించినమాట కాదు. మనం అన్నమాట మళ్ళీ అంటున్నట్లు, చేసినపని మళ్ళీ చేస్తున్నట్లు, చరిత్రలోనూ, సృష్టిలోనూ జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతూ వుంటాయి. గత 116 సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరిగిన కొన్నిసంఘటనలవిషయం యిక్కడ నేను బుద్దిపూర్వకంగానే ఉటంకిస్తున్నాను. యివి యిటీవల బైటపడినవే. లింకన్ అనేవ్యక్తి అమెరికా ప్రసిడెంటుగా 1860లో ఎన్నికయ్యాడు. సరిగ్గా 100 సంవత్సరాలుతరువాత కెనెడీ అనేవ్యక్తి 1960లో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. వీరిద్దరూ కూడా తమభార్యలు తమదగ్గర వుండగానే శుక్రవారంనాడే కాల్చి చంపబడ్డారు. ఇద్దరికీ కూడా గుండు తలలోనుంచే దూసుకు పోయింది.

లింకన్ సెక్రటరీపేరు కెనడి. సెక్రటరీ లింకన్ కు సినీమాకు వెళ్లవద్దని సలహా యిచ్చాడు. కెనెడి సెక్రటరీ పేరు లింకన్. ఈ సెక్రటరీ కెనడీని "డెల్లాస్"కు వెళ్లవద్దని సలహా యిచ్చాడు. లింకన్ను చంపిన బూత్ అనే వ్యక్తి సినీమాహాలులో లింకన్ను చంపి వేర్‌హౌస్‌లోకి పారిపోయాడు. కెనెడీని చంపిన ఆస్వాల్డ్ వేర్‌హౌస్‌లో కెనెడిని చంపి సినీమాహాలులోకి పారిపోయాడు. లింకన్ తరువాత ఎన్నికైన ప్రెసిడెంట్ పేరు జాన్సన్. కెనెడీ తరువాత వచ్చిన ప్రెసిడెంట్ పేరు కూడా జాన్సనే. లింకన్ తరువాత వచ్చిన ప్రెసిడెంటు అండ్రో జాన్సన్ 1808 లో జనించగా, కెనడీ తరువాత వచ్చిన ప్రెసిడెంటు లిండన్ జాన్సన్ 1909 లో జన్మించాడు. లింకన్ను చంపిన 'బూత్‌' 1813 లో జన్మించాడు. కెనెడీని చంపిన 'ఆస్వాల్డ్‌' 1913 లో జన్మించాడు. హంతకులైన బూత్, ఆస్వాల్డ్‌లు యిద్దరూకూడా వారిమీద విచారణలు పూర్తికాకుండానే చంపివేయబడ్డారు.

పేర్లు తారుమారైనా మిగిలిన వివిధసంఘటనలతో కూడిన విశిష్టచరిత్ర అంతా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు అద్దంలోని ప్రతిబింబంవలె పునరావృత్తంగా మనకు కనిపిస్తున్నది. అసలు సృష్టిలోనే సహజంగా యిటువంటి పునరావృత్తులు మాత్రమే కాదు. విభిన్నాలైన సర్వవిషయాలలోనూ చైతన్యవంతమైన పునరావృత్తి జరిగి తీరుతుందని ఆర్షవిజ్ఞానం వేనోళ్ల చాటుతున్నది. ఆధునికవైజ్ఞానికులు సైతం, యీ పునరావృత్తిసిద్దాంతాన్ని నిర్ద్వంద్వంగా కాదని త్రోసిపుచ్చే పరిస్థితులలో లేరు. కాగా సృష్టి స్థితిలయాలు స్వాభావికాలైనట్లే. అవి మరెన్నోసార్లు పునరావృత్తి కావడంకూడా స్వాభావికమే. అసలు సృష్టివ్యవస్థకే పునరావృత్తి కలిగే అవకాశ మున్నప్పుడు, సృష్టిమీద ఆధారపడి రూపొందే వివిధసంఘటనలకు గాని, చారిత్రకఘట్టాలకు కాని పునరావృత్తి కలగదని చెప్పే అవకాశంలేదు. ఆర్షవిజ్ఞానందృష్ట్యా ప్రస్తుతకాలంలో ఆరు మన్వంతరాలు గడచి, ఏడవ మన్వంతరంలో మనం వున్నామని చెప్పగలం కాని, యిప్పటికి మొత్తం. అసలు కల్పా లెన్ని గడిచాయో చెప్పలేము. బ్రహ్మ, పద్మాది కల్పాలలో బ్రహ్మ, పద్మాది పురాణా లవతరించాయంటే ఆకల్పా లెప్పుడు వెళ్లిపోయాయో, ఆగ్రంథా లెప్పుడు అవతరించాయో, మనం చెప్పలేము. 73 వేల కల్పాల నామాలు క్రమబద్దంగా మనకు లభించినప్పుడు ప్రస్తుతకల్పమేదో మనం గుర్తించగలిగితే, బ్రహ్మ, పద్మాది కల్పాలలో అవతరించిన పురాణాలగురించి కొంతవరకైనా ఊహించడాని కవకాశం వుంటుంది. కల్పాంతప్రళయంలో సర్వస్వం నాశనమైనట్లు పురాణాలుకూడా పోయాయంటే, అనంతర ఉదయకల్పసృష్టివ్యవస్థలో తిరిగి పురాణాలు అవతరించాయని చెప్పవలసివస్తుంది. అయితే ఆయాకల్పాలలో పురాణా లవతరించాయన్నమాట. అవాస్తవికమనో, ప్రక్షిప్తమనో త్రోసిపారవేయవచ్చును కాని ఖగోళవ్యవస్థను, తచ్చైతన్యచేష్టావ్యవస్థను తత్ప్రతిబింబకమైన భూమండలసృష్టివ్యవస్థా చైతన్యచేష్టా స్వరూపస్వభావ పరిణామక్రమాలను మనం త్రోసిపుచ్చలేము. ఇక్కడున్నది వొకటే చిక్కు. 'మఖనక్షత్రం'లో సప్తఋషులు వున్నప్పుడు మహాభారతయుద్ధం జరిగిందని అనుకుందాం. సప్తఋషిమండలం ఒక నక్షత్రంనుంచి మరొక నక్షత్రంలోకి జరుగుతూనే వుంటుంది. ఇది ఒకేవొకసారి జరిగి ఆగిపోయే వ్యవస్థకాదు. పునరావృత్తిపరంగా, యెన్నిసార్లయినా నక్షత్రచలనం జరుగుతూనే వుంటుంది. ఈదృష్ట్యా యిప్పటి కెన్నిసార్లు సప్తఋషిమండలం మఖానక్షత్రంలోకి వచ్చి వెళ్లిందో యెంతటి వైజ్ఞానికులకైనా ఊహించి చెప్పడానికి వీలులేని విషయం. కాగా, ఆర్షవిజ్ఞానందృష్ట్యా పురాణాలప్రాచీనత్వంగురించి సాధికారికంగా చెప్పాలంటే ఆయాపురాణాలలో వున్న వివిధమన్వంతరఖగోళశాస్త్రాదివిషయాలలో పరిశోధన చేసి సత్యాన్వేషణ చేయవలసివున్నది.

బ్రాహ్మణ, అరణ్యకాలంలోను, ఆపస్థంభసూత్రాలలోనూ పురాణశబ్దం ప్రయోగించబడింది. పురాణాలన్నీ ఆధునికాలని అభిప్రాయపడిన విమర్శకులు పైగ్రంథాలలో వున్న పురాణశబ్దప్రయోగానికి ప్రాచీనమనే అర్థం చెప్పి తమవాదాలను సమర్థించుకున్నారు. వాస్తవానికి బ్రాహ్మణాదులలో పేర్కొనబడిన పురాణశబ్దం అష్టాదశపురాణాలలోని పురాణవాచకమేకాని తద్భిన్నంకాదు. శ్రుతిస్మృతిపురాణేతిహాసాలన్న వాక్యంప్రకారం పురాణాల తరువాతనే బ్రాహ్మణారణ్యకాదులూ, ప్రాతిశాఖ్యలూ యితర సూత్రగ్రంథాలూ, వేదాంగాలూ, ఉపనిషత్తులు అవతరించాయని చెప్పవలసివుంటుంది. అయితే పరస్పరవిరుద్ధంగా చరిత్రకు విరుద్దంగా స్వవచనవ్యాఘాతాలుగా కనిపించే విషయాలు అనేకం మనకు పురాణాలలో గోచరమౌతాయి. ఉపనిషద్వాక్యాలప్రసక్తులేకాక పాణిన్యాదిమహర్షుల నామాలూ, జైన, బౌద్ధ, ఇతర చార్వాక, పాషండాదిమతాల ఖండనంవంటి విషయాలూ వీటిల్లో మనకు గోచరమౌతాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆయామహర్షుల మతకర్తలకాలం తరువాతనే పురాణాలు అవతరించాయని మనం ఆమోదించవలసి వుంటుంది. పురాణాలు బ్రాహ్మాణాదులకంటే ప్రాచీనతమాలని మనం ఆమోదించినప్పుడు పరస్పరవిరుద్ధాలూ, లేదా చారిత్రకవిరుద్దాలూ, స్వవచనవ్యాఘాతాలుగా వున్న పైవిషయాల గురించి రెండువిధాలైన నిర్ణయాలలో యేదో వొకనిర్ణయానికి మనం రావలసి వుంటుంది. పురాణాలను లోతుగా పరిశీలించినప్పుడు అవి అన్నీ భవిష్యపురాణంవలెనే భవిష్యద్వాణిగా అవతరించినట్లు మనం ఆమోదించవలసి వుంటుంది. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వేదవిజ్ఞానం దృష్ట్యా భవిష్యద్విషయకవాఙ్మయం అవతరించడానికి పూర్తిగా అవకాశాలున్నాయి. కాగా పాణిన్యాదిమహర్షుల ప్రసక్తి కాని, జైన, బౌద్ధాది మతప్రవక్తల ప్రసక్తి కాని ఆధునికవిషయ మనిపించుకున్న దేదైనా భవిష్యద్వాణిగా ఆమోదించినప్పుడు వాటి ఉనికిని గురించి మనం ఆక్షేపించవలసిన విషయ మేదీ వుండదు. పురాణాలను, భవిష్యద్వాణిగా ఆమోదించలేనప్పుడు వాటిల్లో ఆమూలాగ్రంగా వున్న పరమవైజ్ఞానికాలైన వాస్తవికవిషయాలను సైతం మనం వాస్తవికాలు కావని, అప్రామాణికాలని త్రోసిపుచ్చినట్లవుతుంది. ఒకవేళ పురాణాలు భవిష్యద్వాణులు కావని మనం ఆమోదిస్తే, పాణిన్యాదిమహర్షులకూ, జైనబౌద్దాదిమతకర్తలకూ, సంబంధించిన ఆధునికవిషయవిశేషాలకు సంబంధించిన వివిధప్రసక్తులన్నీ ప్రక్షిప్తాలని మధ్యలో కలుపబడినాయని మనం ఆమోదించవలసివుంటుంది. కాని యీదృష్ట్యాకూడా మరొకచిక్కు లేకపోలేదు. ఆధునికవిషయాలను ప్రక్షిప్తాలని మనం త్రోసిపుచ్చినా, అత్యంతప్రాచీనకాలంలో జరిగినచరిత్రలో యెప్పుడు జరిగాయో చెప్పలేనటువంటి నరసింహావతారాదికథలూ, ప్రహ్లాదాదిచరిత్రలూ, వారి పితృచరిత్రలూ వారివారి పూర్వజన్మలూ, భవిష్యజ్జన్మలూ మొదలైన విషయాలను గురించిన పరిపూర్ణగాథలన్నీ భవిష్యద్వాణిగానే పురాణాలలోవున్నాయి. వీటి భవిష్యద్వాణిత్వాన్ని ఆమోదించలేనివారు, అసలు భవిష్యద్వాణిత్వ మనేదే ప్రక్షిప్త మని అనక తప్పదు. ఈ విధంగా ఆర్షవిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సత్యాన్వేషణాపరత్వం లేకుండా అడ్డువచ్చినవాటి నన్నిటినీ ప్రక్షిప్తాలనో, పరికల్పితాలనో అంటూ పోతే అసలు పురాణవాఙ్మయస్వరూపస్వభావాలగురించి కాని తద్రూపంగా వేదవాఙ్మయంగురించి కాని, ఆర్షవిజ్ఞానంగురించి కాని మాట్లాడే అధికారం యీవిమర్శకులకు బొత్తిగా లేదని చెప్పవలసివస్తుంది. సత్యాన్వేషణతో ఆర్షవిజ్ఞానంలో పరిశోధన చేసే శక్తిసామర్థ్యాలు కాని, ఆవిజ్ఞానంగురించి అసలు ఆలోచించవలసిన అర్హతకాని యీవిమర్శకపరిశోధకశిఖామణులకు అణుమాత్రమైనా లేదని నిర్ద్వంద్వంగా, విస్పష్టంగా, మహత్తర ఆర్షవిజ్ఞానిగా నేను యెలుగెత్తి చాటవలసి వస్తున్నది.

పురాణాల తత్వం

పురాణాలగురించి స్కాందపురాణం పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే శైవ - భవిష్య - మార్కండేయ - లైంగ - వరాహ - స్కాంద - మత్స్య - కూర్మ - వామన - బ్రహ్మాండపురాణాలు పదీ కూడా శైవప్రశంసాపూర్వకాలేనని, వీటిల్లో మూల భూతుడై శివుడే విరాజిల్లుతున్నాడని తోస్తుంది. విష్ణు - భాగవత - నారదీయ - గారుడపురాణాలు నాలుగూ విష్ణుమాహాత్మ్యాన్ని వర్ణించేవని, బ్రాహ్మపురాణం - పద్మపురాణాలు రెండూ బ్రహ్మను వర్ణించేవని, అగ్నిపురాణం అగ్నిని వర్ణిస్తుందని, బ్రహ్మవైవర్తపురాణం, పవితృదేవతను వర్ణిస్తుందని తెలుస్తుంది. గతంలో ఒకసారి పేర్కొన్నట్లు విష్ణుపురాణాన్ని బట్టి చూస్తే, పురాణవిషయాలూ, తత్వాలూ యిందుకు భిన్నంగా గోచరమౌతున్నాయి. విష్ణు - నారదీయ - భాగవత - గరుడ - పద్మ - వరాహపురాణాలు మహావిష్ణుతత్వమాహాత్మ్యప్రతిపాదకాలనీ, బ్రహ్మాండ - బ్రహ్మవైవర్త - మార్కండేయ - భవిష్య - వామన - బ్రాహ్మపురాణాలు సరస్వతీచతుర్ముఖకృశానులమహత్వతత్వాన్ని ప్రశంసించేవనీ, మత్స్య - కూర్మ - లింగ - శివ - స్కాంద - అగ్నిపురాణాలు దుర్గాశివలింగవిఘ్నేశకుమారస్వాముల మాహాత్మ్యతత్వస్తోత్రపూర్వకాలనీ పేర్కొనడం జరిగింది. విష్ణుపురాణవక్కణం ప్రకారం ఆరుపురాణాలు విష్ణుమాహాత్మ్య ప్రతిపాదకాలు. ఆరుపురాణాలు బ్రహ్మమాహాత్మ్యప్రతిపాదకాలు. ఆరుపురాణాలు శివమాహాత్మ్యప్రతిపాదకాలుగాను వున్నట్లు కనిపిస్తుంది. అయితే మహావిష్ణువును వర్ణించే పురాణాలు సాత్వికపురాణాలని, అవి మోక్షప్రదాలని, వాటికి ఉత్తమోత్తమస్థానం యివ్వడం జరిగింది. బ్రహ్మతత్వప్రతిపాదకాలైన ఆరుపురాణాలు రాజసగుణప్రధానాలని అవి స్వర్గప్రదాలని ఒకమెట్టు క్రిందికి దించి వర్ణించడం జరిగింది. శివమాహాత్మ్యప్రతిపాదకాలైన మిగిలిన ఆరుపురాణాలు కేవల తామసపురాణాలని యీ ఆరూ దుర్గతిదాయకాలని వీటిని విన్నవారికి మతిపోతుందని అసలు యీ ఆరుపురాణాలను కలలోనైనా చూడకూడదని, స్మరించకూడదన్న ధోరణిలో తిరస్కృతాలుగా పేర్కొనబడ్డాయి. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా గాని, వేదవిజ్ఞానం దృష్ట్యా గాని బ్రహ్మ, విష్ణు, శివతత్వమాహాత్మ్య బహుముఖ స్వరూప స్వభావాల దృష్ట్యా గాని అష్టాదశపురాణాల విషయాంతర్యం దృష్ట్యా గాని సాత్విక, రాజస, తామస, గుణపూర్వకత్వాలతో పురాణవిభజన చేసి ఆయాఫలితాలను పేర్కొనడం వాస్తవంగా కనిపించదు. పురాణాలన్నీకూడా త్రిగుణాత్మకాలే. ఒక్క పురాణాలేకావు వాటి మూలమైన వేదవాఙ్మయమంతా త్రిగుణాత్మకమే. వేదవాఙ్మయానికి, ఆర్షవిజ్ఞానానికే కాదు మొత్తం సృష్టికే మూలభూతు లనుకుంటున్న విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు ముగ్గురూకూడా త్రిగుణాత్ములే. సృష్టిస్థితులు రెండూ యెప్పుడైతే లయాత్మకా లయ్యాయో అప్పుడే అవి కేవల సాత్వికత్వానికే కాదు. రాజస, తామసత్వాలకు సైతం ఆలవాలా లయ్యాయి. అంటే మంచిచెడు లన్నవి గాని, సుఖదుఃఖా లన్నవి కాని, వెలుగుచీకట్లు కాని సృష్టిలో నైసర్గికా లన్నమాట. వాటిల్లో ఒక్కొక్కప్పుడు హెచ్చుతగ్గుల వ్యవస్థ లేర్పడవచ్చును. అది వేరుమాట. సాత్విక, రాజస, తామసగుణతత్వప్రతిపాదకాల పేరుతో జరిగిన పురాణగౌరవ, అగౌరవప్రదమైన నిర్ణయం సత్యాన్వేషణాపరమైనది కాదు. అసలు సత్యావిష్కరణాపరమైన దంతకంటే కాదు. వేదాలన్నింటిలోనూ సాత్విక, రాజస, తామసాత్మకాలైన వివిధమంత్రా లున్నాయి. ఈమంత్రాలు దేవాధిదేవతలైన కేవల విష్ణుబ్రహ్మమహేశ్వరులకు సంబంధించినవి మాత్రమేకాదు. తదితరదేవతలకు సైతం సంబంధించినవిగా వున్నాయి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సృష్టిస్థితిలయకారకు లన్నప్పుడు లయకారకత్వం మహేశ్వరపక్షం కలది కాబట్టి, మహేశ్వరుణ్ని తామసాత్మకుడుగా కొందరు భావించివుంటారు. సృష్టికారకత్వం బ్రహ్మది కాబట్టి సృష్టిలో మంచి చెడు లన్నింటికి స్థానం వున్నది కాబట్టి కేవల వినాశకారిత్వాన్ని బ్రహ్మకు ఆపాదించలేక బ్రహ్మను రాజసాత్మకునిగా పేర్కొని వుంటారు. అటు సృష్టివ్యవస్థకు, యిటు లయవ్యవస్థకు సంబంధం లేకుండా సృష్టియొక్క కేవల స్థితివ్యవస్థకే విష్ణువు పరిమితుడు కాబట్టి, విష్ణువును ప్రత్యేకదృష్టితో సాత్వికస్వరూపుడుగా భావించివుంటారు. అయితే అసలు సృష్టికి మూలభూతు డనిపించుకుంటున్న బ్రహ్మను సృష్టించడానికి మూలం ఆ శ్రీ మహావిష్ణువే కదా! విష్ణువుకు యిచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి చూచినా బ్రహ్మమహేశ్వరు లిద్దరికంటే విష్ణువు గొప్పవాడు మాత్రమే కాదు, వారిద్దరికీ కూడా మహావిష్ణువే మూలభూతుడు. కాగా మహావిష్ణుకారకత్వానికి చెందని రాజసతామసత్వాలు కేవల బ్రహ్మమహేశ్వరపరాలు యేవిధంగా అవుతాయి? ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ఆంతరంగికమైన పరిశీలన చేయకుండా పైపైవిషయాలను కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మమహేశ్వరులకు రాజసతామసత్వాలను ఆపాదించినట్లు కనిపిస్తున్నది. చేతబడులన్నవి క్షుద్రప్రయోగాలు వామాచారపద్ధతులు, మంత్రశాస్త్రం దృష్ట్యా తీవ్రనిరసనకు గురి అయ్యాయి. శైవమతపరంగా వామాచారపద్ధతులు అతిగా వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో పెట్టుకొని శివునికి తామసత్వాన్ని ఆపాదించినట్లు కనిపిస్తున్నది. వాస్తవం పరిశీలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ శుద్ధసాత్వికస్వరూపులే. జగన్నాటకసూత్రధారి అని శ్రీ మహావిష్ణువును సామాన్యంగా పేర్కొంటామే గాని, బ్రహ్మ, మహేశ్వరులు సైతం జగన్నాటకసూత్రధారులే. వాస్తవం పరిశీలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి ఆయుధాలున్నాయి. విష్ణువు తనచక్రాన్ని యెన్నిసార్లు ఉపయోగించలేదు? యెన్నిసార్లు దుష్టశిక్షణ చేయలేదు? అదేవిధంగా బ్రహ్మ, మహేశ్వరులు మాత్రం యెంతమంది రాక్షసులను సంహరించలేదు. చేతబడులను, వామాచారప్రయోగాలను, క్షుద్రవిద్యలని మన మందరం నిరసిస్తాం. కాని వేదోక్తాలైన ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, గారుడాస్త్రం, నాగాస్త్రం, శూలప్రయోగం, గదాప్రయోగం మొదలైన అనేకప్రయోగాలతో పాటు విష్ణుచక్రప్రయోగపరమైన సుదర్శనప్రయోగం సైతం ఒకానొకవిశిష్టమైన, ఉన్నతస్థాయికి చెందిన చేతబడి ప్రయోగాల వంటివే. యివి దుష్టశిక్షణార్థం యేర్పడి శత్రువినాశనార్థం రూపొందించబడిన వివిధమంత్రప్రయోగాలే. అయితే మహావిష్ణువు కాని, మహేశ్వరాదిదేవతలు కాని, మహామాత గాయత్రివంటి స్త్రీదేవతలు కాని, యిటువంటి మహత్తరశక్తులను దుష్టశిక్షణార్థం శిష్టరక్షణార్థం కేవలం లోకశ్రేయస్సు దృష్ట్యా మాత్రమే వీటిని వినియోగించినట్లు కనిపిస్తున్నది. అవసరమైనపుడు దేవతలందరూ తమవద్ద గల శక్తులను ఉపయోగించినవారే. అసలిం తెందుకు? అటు దక్షిణాచార, యిటు వామాచారప్రయోగా లన్నింటికి మూలభూతమైన వేదవాఙ్మయం యెక్కడా శివుని తామసాత్మకునిగానూ, బ్రహ్మను రాజసాత్మకునిగాను, వర్ణించినట్లు కనబడదు. వాస్తవానికి హరిహరులకు భేదంలేదు. హరిహరనాథుణ్ని తిక్కన సోమయాజి —

కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా!
పరిష్క్రియాయాం బహుమన్యసేత్వమ్!
కిం కాలకూటః కిమువా యశోదా!
స్తన్యం తవ స్వాదువద ప్రభోమే!!

అని వర్ణించడం కొత్తవిషయం యేమీ కాదు. హరిహరుల అభేదత్వం తెలుగువారు తిక్కనసృష్టి అనుకొనడం శుద్ధపొరపాటు. ఋగ్వేదం పురుషసూక్తంలో ఒక్క హరిహరబ్రహ్మలకే కాదు, దేవతలందరికీ అభిన్నత్వాన్ని చాటడం జరిగింది. ప్రత్యేకించి ఆ మహాఫణిశాయి అయిన హరికి రాజఫణిభూషణభూషితుడై విరాజిల్లే హరునకూ అభేదత్వాన్ని గురించి పురాణవాక్కును ఉటంకించాలంటే నారదీయపురాణంలోనే యీ అభిన్నత్వం యెలుగెత్తి చాటబడిందని పేర్కొనవచ్చు. "కిం లక్షణా భాగవతా జాయంతే కేనకర్మణా" అని మార్కండేయుడు ప్రశ్నిస్తే, భగవంతుడు భాగవతోత్తమలక్షణాలు వక్కాణిస్తూ

"శివప్రియాః శివాసక్తాః శివపాదార్చనేరతాః
త్రిపుండ్రధారిణో యేచతేవై భాగవతోత్తమాః॥
వ్యవహరింతిచ నామాని హరేః శంభో ర్మహాత్మనః
రుద్రాక్షాలంకృతా యేచతేవై భాగవతోత్తమాః॥
యే యజంతి మహాదేవం క్రతుభిర్భహు దక్షిణైః
హరింవా పరయా భక్త్యాతేవ భాగవతోత్తమాః॥
శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని
సంబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతాః స్మృతాః॥
                  (నారదీయపురాణం : పూర్వ. భా. 5. అధ్యా.)

అని హరిహరులకు అభేదం చాటడం జరిగింది. ఇదేవిధంగా మరొకసందర్భంలో శివకేశవులకు అభిన్నత్వాన్ని చెప్పినవారికి, భావించినవారికి ఇహపరసౌఖ్యాలతోపాటు మోక్షప్రాప్తికూడా కలుగుతుందని పేర్కొనడం జరిగింది. హరిహరుల అభిన్నత్వాన్ని వేదవాఙ్మయంతోపాటు పురాణవాఙ్మయంకూడా చాటుతున్నప్పుడు ప్రత్యేకించి విష్ణుతత్వబోధకాలని, సాత్వికాత్మకాలని, భావించబడిన ఆరుపురాణాలలో వొకటైన నారదీయపురాణంలోనే హరిహరుల అభిన్నత్వాన్ని చాటడం జరిగినపుడు శివతత్వప్రబోధకాలైన పురాణాలు తామసాత్మకాలనీ, పరిత్యాజ్యాలనీ యేమెమో వ్రాయడం అనార్షేయం కాదా? అవైజ్ఞానికం కాదా? అప్రామాణికం కాదా? ఇంతెందుకు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ముగ్గురికి అభిన్నతత్త్వాన్ని చాటుతూ యేర్పడిందే కదా దత్తాత్రేయమూర్తిత్త్వం. ఈదత్తాత్రేయత్వం సైతం అత్యంతప్రాచీనతరమైనదే కాని కొంద రనుకునే పురాణకాలపునాటిది కానేకాదు. ఈదత్తాత్రేయత్త్వాన్ని శాస్త్రీయంగా కాని ఆర్షవిజ్ఞానపరంగా కాని కాదని త్రోసిపుచ్చగలవారు లేరు. కాగా అసలు దేవతలలోనే సత్వరజస్తమోగుణాల ప్రాధాన్యత లేనప్పుడు పురాణాలలో సాత్విక - రాజస - తామస భేదాలను యేవిధంగా కల్పించగలము?

"తత్త్వమసి త్వమసి తత్" - "సోహం హంసః" - అన్న వేదార్దప్రతిపాదకవాక్యాల అంతర్యాన్ని గుర్తించినవారు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల విభిన్నత్త్వాన్ని పరిగణించలేదు. "శివో౽హం," "అహం బ్రహ్మాస్మి," "విష్ణ్వహం" వంటి అర్థాద్వైతవాక్యాలను కాకుండా "శివో౽హం, అహమేవ శివః - "అహం బ్రహ్మాస్మి - బ్రహ్మఏవ అహమస్మి," "విష్ణ్వహం, అహమేవ విష్ణుః," వంటి పరిపూర్ణసార్థక ఆర్షవిజ్ఞాన అద్వైతవాక్యాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు త్రిమూర్తుల మతవిభేదాలను విజ్ఞులెవరూ పరిగణనలోకి తీసుకొనబోరు. అద్వైతసిద్ధాంత మన్నది ఆదిశంకరులు క్రొత్తగా రూపొందించిన సిద్ధాంత మేమీ కాదు. అనంతమైన వేదవిజ్ఞాన అంతర్యాన్ని గుర్తించి ప్రవచించబడిన మతమే కాని అద్వైతమతం వేదభిన్నమైన అపూర్వమత మేమీ కాదు. అసలు శివో౽హం, అహం బ్రహ్మాస్మి - విష్ణ్వహం వంటి మాటలు యెవరు పడితే వారు ఉపయోగించడానికి వీలైనవి కావు. కొంతకాలంగా కాషాయాంబరధారులైన ప్రతివారూ వీటిని ఉచ్చరిస్తూ ఉండవచ్చునుగాని అవి సార్థకంగా అతిప్రాచీనకాలంనుంచీ ఉపయోగించబడడం లేదు. వాస్తవానికి శివపరమైన శక్తు లన్నింటినీ సంపాదించినవాడే "శివో౽హం" అనడానికి అర్హు డవుతాడు. బ్రహ్మపరమైన శక్తులన్నీ తనవశం చేసుకొనగలవాడే "అహం బ్రహ్మాస్మి" అనడానికి సమర్హు డౌతాడు. ఇదేవిధంగా విష్ణుశక్తు లన్నింటినీ సాధించగలిగినవాడే "విష్ణ్వహం" అనడానికి యోగ్యత సంపాదించుకుంటాడు. ఇటువంటిశక్తు లేమీ సంపాదించకుండానే ఆయావాక్యాలను ఉచ్చరించడం ఆర్షవిజ్ఞానసమ్మతం కాదు.

నరసింహకవి పౌండ్రకవాసుదేవుని సంహారసందర్భంగా యీ క్రిందిపద్యం వ్రాయడం యెంతోసముచితంగా ఉన్నది.

చింతించి "యచ్యుతో౽హమ
నంతో౽హం హరిరహమ్మురారి రహం శ్రీ
కాంతో౽హ"మ్మను నాతని
నంతం బందించె దానవాంతకుఁ డంతన్
                 (నార. 337 పుట.76 ప)

దీని వల్ల ఒక్కసన్యాసులే కారు యెంత మహాశక్తిసంపన్ను డైనా సరే ఆమహావిష్ణుశక్తిసముచ్చయాన్ని సంపాదించకుండా 'అచ్యుతో౽హం" వంటివాటి నుచ్చరించరాదని స్పష్టపడడం లేదా? ఒకవేళ వారు ఉచ్చరించినా పాపాత్ము లైతే సంహారయోగ్యులేనని తేలడంలేదా? కాగా వేదవాఙ్మయాన్ని ప్రతిబింబించిన ఆర్షవిజ్ఞానసాంకేతికాత్మకాలైన పురాణా లేవైనా సరే ఒకే ఒక్కకోవకు చెందినవనీ ఏకైకపరమార్థం కలవనీ మనం సత్యసమ్మతంగా భావించవలసి ఉంటుంది.

నారదుడు

నారదీయపురాణకర్త యైన నారదుణ్ణి మామూలుగా మనం మహర్షి అనుకుంటాంకాని అతడు మహర్షిమాత్రుడే కాడు. అసలు దేవర్షి. త్రిలోకసంచారి. త్రికాలజ్ఞుడు. మామూలుగా మనం శ్రీ మహావిష్ణువును జగన్నాటకసూత్రధారి అని అంటాం కాని లోతుగా పరిశీలిస్తే నారదమహర్షికూడా ఒక విశిష్టత కల జగన్నాటకసూత్రధారిగానే మనకు దృగ్గోచర మవుతాడు. దాదాపు నారదునిపాత్ర లేకుండా యేదుష్టసంహారమూ, యేశిష్టరక్షణా లేదనియే చెప్పవచ్చును.

నారదుడు బ్రహ్మకంఠప్రదేశంనుంచి సంజనితు డయ్యాడని బ్రహ్మవైవర్తపురాణం పేర్కొనగా బ్రహ్మతొడనుంచి ఆవిర్భవించాడని భాగవతం పేర్కొన్నది. బ్రహ్మవైవర్తపురాణంలోనే వేరొకచోట బ్రహ్మ దనపుత్రికయైన ప్రియను వివాహం చేసుకోగా ఆప్రియాబ్రహ్మలకు నారదుడు సంజనితుడైనట్లు మరొకవిధంగా ఉన్నది. భాగవతప్రవచనం ప్రకారం చూస్తేనే నారదునిజన్మ యింకొకవిధంగా వేరొకచోట కన్పిస్తున్నది. అది యిది. ఉపబర్హణుడు అన్న పేరుతో ఒకానొకగంధర్వు డుండేవాడు. అతడు సుందరాంగనలకు లోలుడై ప్రియుడై క్రీడిస్తూ ఉండేవాడు. విశ్వస్రష్టలైన బ్రహ్మలు "దేవసత్రం" అనే యాగం చేస్తూ శ్రీ మహావిష్ణువు కథలు గానం చేయడానికై గంధర్వులనూ, అప్సరసలనూ ఆహ్వానించారు. గంధర్వుడైన ఉపబర్హణుడు సైతం గంధర్వగణంతో కలిసి వెళ్ళి కొంతసేపు గానంచేసి అక్కడ ఉన్న అప్సరోవనితలను చూచి మోహితుడై గానాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అందువల్ల "నీవు శూద్రయోనిలో పుట్టవలసిందని" ఉపబర్హణుని బ్రహ్మ శపించాడు. ఆ తరువాత ఉపబర్హణుడు ఒకదాసికి పుట్టి అనంతరజన్మలో శాపవిమోజనం జరిగి అంతకు పూర్వపుజన్మలో అంటే గంధర్వుడైన ఉపబర్హణుడుగా చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణుసంకీర్తనం చేసినందువల్ల నారదమహర్షిగా జన్మించాడు.

నారదుడు పూర్వజన్మంలో వేదవాదుల ఇంటిలో దాసికి పుట్టిన ఒకానొకవ్యక్తిగా చాతుర్మాస్యవ్రతంతో ఏకాంతవాసం చేస్తున్న మహర్షులకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. చిన్నతనం నుంచీ మహర్షులనే ఆశ్రయించి ఉండడంవల్ల ఆ దాసీపుత్రునికిసైతం బ్రహ్మజ్ఞానం అలవడింది. అతని తల్లి పాలుపితుకుతున్న సమయంలో పాముకాటుతో మరణించింది. ఆ విధంగా సంసారబంధం తెగిపోవడంతో ఆ దాసీపుత్రుడైన బ్రహ్మజ్ఞాని మహదానందం పొంది ఉత్తరాభిముఖుడై ప్రయాణం చేసి ఒకానొకమహారణ్యంలో ప్రవేశించి అక్కడ మహేశ్వరుని గురించి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైనా అతడు చూడలేకపోయాడు. అనంతరం అతడు ఈశ్వరుని కొకరూపాన్ని కల్పించుకొని మనస్సులో నిల్పుకుందామని ప్రయత్నం చేశాడు. కాని అది అతనికి సాధ్యం కాలేదు. "మహర్షివర్యులు చూడగల్గిన నారూపాన్ని నీవు చూడలేవు. ఈ సృష్టి అంతా లయం చెందుతుంది. అప్పుడు నీవు యీదేహాన్ని పరిత్యజించి ముందుజన్మలో నా అనుమతితో నారూపాన్ని చూడగల్గుతావు." అన్న మహేశ్వరవాక్యం అతనికి వినపడింది. కొంతకాలానికి ప్రళయం రానే వచ్చింది. అప్పుడతను కర్మస్వరూపమైన ఆదేహాన్ని పరిత్యజించి హరికృపావనంలో శుద్ధసత్వమహత్వంతో నిండిన దేహంలో ప్రవేశించి శ్రీ మహావిష్ణుమూర్తిలో నిద్రపోవాలని ఇచ్చగించే బ్రహ్మ ఉఛ్వాసనిశ్వాసలవెంట బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మప్రాణంతో మరీచిప్రభృతి మునిముఖ్యులతోపాటు ఆ దాసీపుత్రుడైన బ్రహ్మజ్ఞానియే నారదుడై పుట్టినట్లు భాగవతం పేర్కొంటున్నది.

వరాహపురాణకథనంప్రకారం సారస్వతుడనే పేరు కలిగిన బ్రాహ్మణు డొక డుండేవాడు. ఆసారస్వతుడు సంసారభారమంతా తనకొడుకుమీద పెట్టి అడవికి వెళ్ళి విష్ణువు నుద్దేశించి ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై సారస్వతు నుద్దేశించి నీకేం కావాలో వరం వేడుకోవలసిందని చెప్పగా అప్పుడు సారస్వతుడు శ్రీ మహావిష్ణువు సాయుజ్యాన్నే - నిత్త్యాతిసన్నిహితత్త్వాన్నే అభిలషించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు "నాకు అతిసన్నిహితుడై నాతరువాత ఉండేవాడు బ్రహ్మ. నీవు బ్రహ్మకు పుత్రుడవై జన్మించి నాసాయుజ్యాన్ని పొందగలవు" అని అనుగ్రహించాడు. అంతేకాదు "నీవు పితృదేవతలకు "నారము"ను అంటే నీటిని యెల్లప్పుడూ యిస్తూ ఉంటావు. కాబట్టి నీవు నారదుడవని ప్రసిద్ధి పొందుతావు" అని వరం ఇచ్చినట్లు తెలుస్తున్నది.

భాగవతంలోనే మరొకసందర్భంలో పేర్కొన్నదాన్నిబట్టి చూస్తే అసలు శ్రీ మహావిష్ణువే నారదుడనే దేవర్షిగా పుట్టి కర్మనిర్మోచకమైన వైష్ణవతంత్రాన్ని విరచించినట్లు తెలుస్తున్నది. నారదమహర్షి గురించి భాగవత - వరాహపురాణ - మార్కండేయపురాణాది గ్రంథాలవల్ల అనేకవిధాలైన మరికొన్నివిశేషాలు తెలుస్తున్నాయి. ఆవిశేషాలను సంగ్రహంగా యిక్కడ క్రోడీకరిస్తున్నాను.

"నారదునికి సంసారం కాని సంతతి కాని అసలు లేనేలేదు. అతడు అస్ఖలితబ్రహ్మచారి. అతనికి యేలోకంలోనూ స్థిరత్వం లేదు. ఇందుకు కారణం దక్షుని శాపం. నారదుడు "మహతి" అనే పేరుగల వీణమీద సదా మహావిష్ణునామగానం చేస్తూ త్రిలోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఆయాలోకాల్లోని విశేషాలు తెలుసుకుంటూ అవసరమైనవారికి తనకు చేతనైన ఉపకారం చేస్తూ ఉంటాడు. ఆపదల్లో చిక్కుకున్నవారికి భగవద్విలాసాన్ని గురించి చెప్పి వారి హృదయాలలో శాంతి కలుగజేస్తాడు. ఒకప్పుడు అకంపనుడనేవాడు తనపుత్రుడు మృత్యువాత పడగా యేడుస్తుంటే నారదుడు అతనివద్దకు వెళ్ళి మృత్యుస్వభావంగురించి వివరించి అతనికి దుఃఖోపశమనం కావించాడు. సృంజయుడనేవానికి షోడశరాజులచరిత్ర వివరించి అతని విచారాన్ని రూపుమాపి చనిపోయిన సృంజయుని కుమారుని బ్రతికించి తిరిగి అతనికి పుత్రభిక్ష పెట్టాడు. హిరణ్యకశిపుని భార్యయైన లీలావతిని యింద్రుడు సంహరించాలని చూడగా నారదుడు అడ్డుపడి లీలావతి సద్గుణాలనే కాక ఆమెగర్భంలో పెరుగుతున్న మహావిష్ణువుకు పరమభక్తాగ్రేసరుడు కానున్న ప్రహ్లాదునివిషయం చెప్పి ఆమెను సంరక్షించాడు. అవసరమైనప్పుడల్లా ధర్మరాజుకు ప్రత్యక్షమై యెన్నెన్నోహితవులూ, సలహాలూ బోద్ధించాడు. రామలక్ష్మణు లిద్దరూ ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రంతో బంధితులుకాగా నారదుడు వచ్చి గరుత్మంతుణ్ణి ప్రార్థించవలసిందిగా రామలక్ష్మణులకు బోధించి వారిని నాగాస్త్రవిముక్తులను కావించాడు. ఇదేవిధంగా నారదుడు అనేకమందికి అనేకవిధాలైన ఉపకారాలు చేశాడు. స్త్రీల నోట్లో మాట దాగదన్నమాట నిజమో కాదో చెప్పలేము. కాని - స్త్రీల నోట్లో నువ్వుగింజైనా నానదన్నమాట యేమోగాని నారదమహర్షి నోట్లోమాత్రం యేఒక్కమాటకూడా దాగదు. ఎంత రహస్యమైనా గూఢాతిగూఢమైన విషయమైనా సరే తాను ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. విష్ణువు రామావతారం ఎత్తబోతున్నట్లు నారదుడే వాల్మీకికి ముందుగా తెలియచెప్పాడు. లోకంలో సామాన్యంగా తగాదాలు పెట్టే వ్యక్తిని నారదు డనడం పరిపాటి. ఇక్కడి వక్కడా అక్కడి విక్కడా చెప్పి తగవులు పెట్టడం నారదుని కొకసరదా. అసలు తగాదాలు పెట్టకుండా నారదు డుండలేడు. అందుకే అతనికి కలహభోజనుడు అనే పేరు వచ్చింది. తగాదాలు పెట్టడం నారదునికి మహదానందదాయకంగా కనిపిస్తుంది. ఇంతటి తగాదాలమారివాడైనా యితని నెవ్వరూ అగౌరవపరచిన సంఘటన లంతగా కనిపించవు. ఒకవేళ నారదుడు ఎటువంటి తగాదా పెట్టినా లోకక్షేమం దృష్ట్యా పెట్టినట్లే కనిపిస్తుంది గాని తద్భిన్నంగా కనిపించదు.

జలంధరాసురుణ్ణి యెంతోమంది దేవతలు ప్రయత్నం చేసి జయించలేకపోయారు. చివరికి వారంతా నారదునితో తమగోడు మొరపెట్టుకున్నారు. నారదుడు అంతా విని తల పంకించి తగిన ఉపాయం ఆలోచిస్తానని చెప్పి వారిని ఓదార్చి సాగనంపి సరాసరి జలంధరుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అనేకవిధాల అతన్ని స్తుతించాడు. "జలంధరా! నీకు అశ్వరత్నాలూ, గజరత్నాలూ, సౌధరత్నాలూ, యింకా యింకా అనేకం ఉన్నాయి. సమస్తభోగభాగ్యాలూ ఉన్నాయి. కానీ నీకు జాయారత్నం లేదు." అని అసలులోపాన్ని యెత్తి చూపించాడు. "ఆలోపాన్ని నే నేవిధంగా తీర్చుకోవాలి. నా కర్హురాలై సతిగా ఉండదగిన పడతి ఎవ్వరు?" అని జలంధరుడు నారదుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు "శ్మశానంలో ఉండే మహేశ్వరుడికి జగత్సుందరియైన పార్వతి యెందుకు? ఆమెను నువ్వు పట్టుకో" అని సలహా యిచ్చాడు. వెంటనే జలంధరుని హృదయం పార్వతికోసం ఆరాటపడింది. అందువల్ల శివజలంధరులకు యుద్దం తప్పలేదు. ఆయుద్దంలో జలంధరుడు దుర్మరణం పాలయ్యాడు. ఒకసారి నారదుడు గరుడుని వద్దకు వెళ్ళి "నీ బల మెక్కడ! సర్పాల బల మెక్కడ? నిన్ను కన్నతల్లి వారికి దాసిగా ఊడిగం చేస్తూ ఉంటే నీవు మిన్నకుండడం గౌరవప్రదమేనా" అని గరుడుణ్ని పురికొల్పాడు. దానితో గరుడసర్పవైరం యేర్పడి గరుడుడు సర్పవినాశకుడుగా రూపొందాడు. ఉతథ్యుని అర్థాంగిని వరుణుడు యెత్తుకొనిపోగా ఆవిషయాన్ని నారదుడు గ్రహించి ఉతథ్యునికి తెలియచేశాడు. కాగా వరుణుడు ఉతథ్యుని ఆగ్రహానికి గురయ్యాడు. కాలయవనుడనే మ్లేచ్ఛరాజు మహాబలవంతుడై గర్వపోతుగా నా అంతటివాడు లేడని రొమ్ము విరచి తిరుగుతున్నాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని పీచ మడచినతరువాత నారదమహర్షి కాలయవనుని వద్దకు వెళ్ళి "శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి ఓడించాడని మహాగర్వంతో విఱ్ఱవీగుతున్నాడు. నీవు శ్రీకృష్ణుని యెరుగవా? లేకపోతే తెలిసికూడా భయపడి పిరికిపందవై ఊరుకున్నావా? అని పురికొల్పి కాలయవనుడు మథురాపురం మీద దండెత్తేట్లుగా ప్రోత్సాహపరిచాడు. దానితో కాలయవనుడు మధురపై దండెత్తి ముచుకుందునివల్ల సంహరింపబడ్డాడు. సత్యభామకోరికపై దేవపారిజాతాన్ని శ్రీకృష్ణుడు తీసికొనివచ్చి ఆమె యింటిముందు పెట్టడం నారదుడు కారణంగానే. చెట్టు మాత్రమే అక్కడ ఉండి ఆ పారిజాతవృక్షపుష్పాలన్నీ తెల్లవారేసరికి ప్రతినిత్యమూ రుక్మిణి యింట్లో ఉండడం సుప్రసిద్ధమైన విషయమే.

ఒకనాడు ఇంద్రసభలో రంభాదులు మనోహరంగా గానం చేస్తూ నృత్యం చేస్తుండగా నారదు డక్కడికి వెళ్ళాడు. కొంతసే పైన తరువాత ఇంద్రుడు నారదుణ్ణి చూచి "మునీంద్రా! నీకు యెవరి గానం నచ్చింది?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు "ఎవ్వరు హావభావాలతో విఱ్ఱవీగుతారో వారి సంగీతం బాగుంటుం"దని సమాధానం చెపుతాడు. అప్పుడు నే నెక్కువంటే నే నెక్కువని అప్సరోవనిత లంతా తమలో తాము వాదులాడుకుంటారు. చివరికి వారిలో యెవరు గొప్పవారో నారదుడే నిర్ణయించాలని ఇంద్రుడు కోరుతాడు. అప్పుడు నారదుడు యేవనిత దూర్వాసమహర్షిని చలింపచేయగలుగుతుందో ఆమె గొప్పది అని సమాధానం చెపుతాడు. అప్పుడు వపువు అనే అప్సరోవనిత దూర్వాసుణ్ణి నేను చలింపచేయగలనని వెళ్ళుతుంది. మహాతపోనిమగ్నుడై ఉన్న దూర్వాసమహర్షివద్దకు వెళ్ళి గానం చేస్తూ అతనికి తపోభంగం కలిగిస్తుంది. అప్పుడు దూర్వాసమహర్షి వపువును పక్షిరూపం దాల్చి భూమిమీద జన్మించవలసిందిగా శపిస్తాడు. తరువాత వపువు ప్రార్థించగా భారతయుద్ధసమయంలో అర్జునుని బాణాహతిచే క్షతురాలవై శాపవిముక్తి పొందగలవని అనుగ్రహిస్తాడు.

మహాభారతాన్ని బట్టి నారదమహర్షి మహిమ యెంతటిదో యీ క్రిందికథవల్ల తెలుస్తున్నది.

కొంతకాలం నారదపర్వతు లిద్దరూ సృంజయునివద్ద ఆతిథ్యం పొంది వెళ్ళబోతూ సృంజయుని కేదైనా ఉపకారం చెయ్యాలనే దృష్టితో యేదైనా ఒక వరం కోరుకొమ్మంటారు. అప్పుడు సృంజయుడు "మీ అనుగ్రహం ఉండడంకంటె నాకు వేరే వరంతో పనేముంది" అని అంటాడు. అప్పుడు నారదుడు సంతోషించి "నీకు దేవతలను మించగల పుత్రుడు సంజనితుడవుతాడు" అని వరమిస్తాడు. నారదుడు వర మిచ్చిన వెంటనే "అయితే ఆ పుట్టే పుత్రుడికి ఆయుష్కాలం తక్కువ" అని పర్వతు డంటాడు. పర్వతుని వాక్యం విని రా జెంతో దుఃఖితు డవుతాడు. సృంజయునిమీద ఉన్న కరుణతో నారదుడు అనుగ్రహించి "ఇంద్రుడు నీకుమారుణ్ని చంపుతాడు. అప్పుడు నన్ను నీవు స్మరించుకో. నీపుత్రుణ్ని నీకు పునర్జీవితునిగా చేసి నీ కిస్తాను." అని చెప్పుతాడు. అనంతరం సృంజయునికి పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని నిష్టీవనాదులు అన్నీ సువర్ణమయాలుగా ఉండడంవల్ల "సువర్ణష్టీవి" అని ఆ బాలునికి పేరు పెట్టారు. అతని నిష్టీవనాదులన్నీ ఎప్పటికప్పుడు బంగారంగానే ఉంటూ వచ్చాయి. అయితే సువర్ణష్టీవి శరీరం అంతా బంగారమేనని భావించి కొందరు చోరులు అతనిని చంపి కోశారు. అప్పుడు సృంజయుడు నారదుని స్మరించుకొనగా నారదుడు ప్రత్యక్షమై దొంగలు చేసిన దుష్కృత్యాన్ని తెలియజేసి ఆబాలుని బ్రతికించి సృంజయుని కిచ్చాడు. అనంతరం కొంతకాలానికి సువర్ణష్టీవిని చూచి మహేంద్రుడు అసూయపడి బృహస్పతితో ఆలోచించి సువర్ణష్టీవి వనవిహారం చేస్తున్న సమయంలో తన వజ్రాయుధాన్ని శార్దూలరూపంలో పంపి అతన్ని చంపిస్తాడు. అప్పుడు సృంజయుడు నారద మహర్షిని స్మరించగా అతడు ప్రత్యక్షమై సువర్ణష్టీవిని తిరిగి బ్రతికించి సృంజయుని కిచ్చాడు.

వరాహపురాణాన్ని పరిశీలిస్తే ఈక్రిందివిశేషాలు మరికొన్ని తెలుస్తున్నాయి. నారదు డొకసారి రావణాసురునివద్దకు వెళ్ళాడు. రావణుడు నారదుడిని ఎంతో గౌరవించి ఏమిటి విశేషాలని అడిగాడు. అప్పుడు నారదుడు 'రావణా! నీవు నరుల్నందరినీ జయించావు. దానివల్ల నీకు లభించిన లాభ మేమిటి? దేవతలంతా ఎంతో గర్వించి వున్నారు. వారిలో యమధర్మరాజు మరీ మహాగర్వంతో ఉన్నాడు. వారినందరినీ ఓడించు' అని రావణాసురుణ్ణి పురికొల్పి దేవతలమీదికి రావణుడు యుద్దానికి వెళ్ళడానికి ముందుగానే గబగబా నారదుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి "చూచావా! రావణాసురుడి గర్వం! వాడు నీమీదికి యుద్ధానికి రాబోతున్నాడు. వాడి పొగరు అణచి పారవెయ్యి" అని యమధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు యమధర్మరాజుతో జరిగిన యుద్దంలో రావణునికి గర్వభంగం జరిగింది.

మహిషాసురుడు కారణంగా దేవతలు యమయాతన పడుతున్నారు. అతనితో ఎంత యుద్ధం చేసినా దేవత లతన్ని ఓడించలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో నారదుడు మలయపర్వతంమీద ఉన్న దేవీస్వరూపిణియైన నారాయణి వద్దకు వెళ్ళి "విన్నావా, మహిషాసురుని కళ్ళకావరం, వాడు నిన్ను వివాహం చేసుకుంటాడట. వాడిని సంహరించు" అని నారాయణికి చెప్పాడు. ఆమాట నారాయణితో చెప్పి వెనువెంటనే బయలుదేరి మహిషాసురునివద్దకు వెళ్ళి "ఓ అసురరాజా! మలయపర్వతంమీద ఉన్న నారాయణిని సతిగా స్వీకరించని నీయౌవనం యౌవనమేనా నీ కెంత బలపరాక్రమాలుండి యేమిలాభం! ఏ విధంగానైనా నీవు ఆమెను వివాహం చేసుకో!" అని చెప్పి మాయమయ్యాడు. అనంతరం మహిషాసురుడు తనను వివాహం చేసుకోవలసిందిగా నారాయణికి సందేశం పంపించాడు. చిట్టచివరికి దేవీమహిషాసురులకు మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహిషాసురుడు సంహరింపబడ్డాడు.

నారద మహర్షి ఒకసారి సరదాగా శ్వేతద్వీపాన్ని చూద్దామని వెళ్ళాడు. అక్కడ మన్మధాకారులు అనేకమంది విష్ణురూపులుగా గోచరం కావడంతో వారిలో అసలు మహావిష్ణువెవరో గుర్తించలేక విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నీ కేమి వరం కావాలో కోరుకో మన్నాడు. అప్పుడు నారదుడు నాకు విష్ణుమాయలు తెలియజేయవలసిందని కోరాడు. అప్పుడు విష్ణువు సరే అని నారదుణ్ణి "అదుగో దగ్గరలో ఒక చెరువుంది. ఆ చెరువులో స్నానం చేసి రా!" అని చెప్తాడు. అప్పుడు నారదుడు వెళ్ళి ఆచెరువులో మునిగి లేచేసరికి స్త్రీరూపం దాల్చుతాడు. అనంతరం నారదుడు స్త్రీగా చారుమతి అన్నపేరుతో కాశిరాజుకు కూతురుగా జన్మిస్తాడు. ఆచారుమతికి శిబిరాజుతో వివాహమవుతుంది. చారుమతి శిబిరాజులకు నగ్నజిత్తి, విప్రజిత్తి, విచ్ఛిత్తి, చారువక్త్రుడు, చిత్తుడు, అనే కుమారులు పుడతారు. ఈపుత్రులు తండ్రితో కలిసి అనేకమంది రాజులతో యుద్ధాలు చేస్తూ వారిని ఓడిస్తారు. చివరికి తమ తాత అయిన కాశిరాజుమీదకూడా వీరు దండెత్తుతారు. అయితే కాశిరాజు చేతుల్లో వీరు హతులు కాగా చారుమతి భర్తృపుత్రవిహీనయై మహాదుఃఖితయై చితి పేర్చుకుని అందులో దూకబోగా తన పూర్వరూపమైన నారదరూపం లభించింది. స్వస్వరూపం పొందిన నారదుడు మహాశ్చర్యపడి ఇదంతా కలయా! భ్రాంతియా! అని ఆలోచించి చివరికి ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు.

దేవీభాగవతం నారదపరంగానే విష్ణుమాయ గురించి ఈక్రిందివిధంగా పేర్కొన్నది. నారదుడు రావడం చూచి మహావిష్ణువుప్రక్క నున్న లక్ష్మీదేవి ప్రక్కకు తప్పుకుంటుంది. అప్పుడు నారదుడు నేను వృద్ధ మహర్షిని. నన్ను చూచి లక్ష్మి ప్రక్కకు తొలగడం బాగుండలేదు అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు పరపురుషులను చూడటం మంచిది కాదుకదా. మాయ యెంతైనా చేయగలదు అని అంటాడు. అప్పుడు నారదుడు మాయాప్రభావం చూపించవలసిందిగా కోర తాడు. అప్పుడు విష్ణువు నారదుణ్ణి గరుత్మంతునిమీద యెక్కించుకుని కన్యాకుబ్జం తీసికొని వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో నారదుణ్ణి స్నానం చేయవలసిందిగా చెపుతాడు. అప్పుడు నారదుడు కొలనులో స్నానం చేసి రాగా అతిలోకసుందరియైన ఒకయువతిరూపం తాల్చుతాడు. అనంతరం శ్రీ మహావిష్ణువు తనదారిని తాను వెళ్ళిపోతాడు. తరువాత ఈసుందరిని తాళధ్వజుడనే రాజు చూచి మోహించి తననగరానికి తీసికొని వెళ్తాడు. అనంతరం ఆసుందరిని వివాహం చేసికొని పట్టపురాణిని చేస్తాడు. ఈదంపతులకు అనేకమంది పుత్రులు కలుగుతారు. కొన్నిసంవత్సరాలు గడచిన తరువాత శత్రురాజులు తాళధ్వజునిమీద దండెత్తి పుత్రులతోసహా తాళధ్వజుని సంహరిస్తారు. తాళధ్వజుని భార్య దుఃఖసముద్రంలో మునిగి వుండగా శ్రీమహావిష్ణువు వృద్ధబ్రాహ్మణరూపంలో వచ్చి సంసారమూ పతీ పుత్రాదులూ శాశ్వతం కాదని తెలియజెప్పి తనవెంట రమ్మని తీసికొనివెళ్ళి ఒకచెరువులో స్నానం చెయ్యమంటాడు. వెంటనే ఆ పడతికి పూర్వరూపం వచ్చి నారదుడుగా రూపొందడం జరుగుతుంది. అప్పుడు నారదుడు అసలువిషయం గ్రహించి తన ఎట్టయెదుట వున్న మహావిష్ణువును చూచి ఇదంతా అతని మాయామాహాత్మ్యమని గ్రహిస్తాడు.

ఈవిశేషాలన్నీ వివిధాలుగా ఇలా ఉండగా అసలు నారదుడు బ్రహ్మచారి కానేకాదని అతడు వివాహం చేసుకుని సంసారం చేశాడనికూడా కొన్నిగాథ లున్నాయి.

"నారదుడు అతని మేనల్లుడైన పర్వతుడు త్రిలోకసంచారం చేస్తున్నారు. వారిద్దరూ ఒకరి హృదయంలో ఉన్నది ఒకరు దాచకుండా పరస్పరం విషయాలు చెప్పుకొనడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుని ప్రమాణాలు చేసుకున్నారు. ఈ ఒప్పందానికి భిన్నంగా వారుభయుల్లోనూ ఏ విషయాన్నైనా దాచడం జరిగితే శాపగ్రస్తు లవడానికికూడ ఆమోదించారు. తరువాత ఒకరోజున వారిద్దరూ సృంజయుడనే రాజువద్దకు వెళ్ళారు. ఆ రాజు తన పుత్రిక అయిన సుకుమారిని పరిచర్య చేయడానికై ఈమహర్షులవద్ద నియమించాడు. సుకుమారిని చూచి నారదుడు ప్రేమించాడు. అయితే ఈవిషయాన్ని సిగ్గువల్ల నారదుడు పర్వతునికి చెప్పలేదు. నారదుని హృదయంలోని వాంఛను పర్వతుడు గ్రహించి "మన ఒడంబడిక ప్రకారం నీహృదయంలోని విషయాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టావు కాబట్టి నీవు సుకుమారిని వివాహం చేసుకున్నతరువాత నీముఖం వానరముఖం అవుతుంది" అని నారదుణ్ణి పర్వతుడు శపించాడు. అప్పుడు నారదునికి కోపంవచ్చి "నీవు నాకలోకసంచారవిరహితుడవు అవుదువు గాక" అని ప్రతి శాపం యిచ్చాడు. అనంతరం నారదుడు సృంజయరాజు నడిగి తనహృదయంలోని విషయం చెప్పి సుకుమారిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తరువాత నారదుడూ పర్వతుడూ కలుసుకున్నారు. గతాన్ని ఆలోచించుకుని వారిద్దరూ పరస్పరశాపవిమోచనం చేసుకున్నారు. శాపవిమోచన అనంతరం అంతకు పూర్వం వానరముఖంగా ఉన్న నారదముఖం మారిపోయి అసలు పూర్వరూపం వచ్చినందువల్ల సుకుమారి అతన్ని గుర్తించలేక తన భర్త అయిన నారదుడు కాడని అనుకున్నది. అప్పుడు పర్వతుడు అతడు అసలు నారదుడేనని జరిగినవిషయమంతా తేటతెల్లం చేశాడు." అని మహాభారతంవల్ల తెలుస్తున్నది.

గతంలో ఒక సందర్భంలో శ్రీమహావిష్ణువు ఒక్కడే జగన్నాటకసూత్రధారి కాడని నారదమహర్షికూడా జగన్నాటకసూత్రధారి పదానికి సమర్హుడే నని పేర్కొనడం జరిగింది. ఈ మాట ఊరికే అనలేదు. నారదుడు యెన్నెన్నివిచిత్రాలు నడిపాడో శిష్టరక్షణార్థం దుష్టశిక్షణార్థం యెటువంటి మహత్తరసూత్రధారిగా వ్యవహరించాడో గతంలో గుర్తించాం. అక్కడితో నారదుని మహత్తరశక్తి ఆగలేదు. నారదుడు బ్రహ్మదేవుణ్ణి, లక్ష్మీమాతను చివరికి ఆజగన్నాటకసూత్రధారియైన శ్రీ మహావిష్ణువునుసైతం అతని భక్తుడై ఉండికూడా శాపగ్రస్తులను చెయ్యడం జరిగింది.

దక్షప్రజాపతి కుమారులు తండ్రి ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇంతలో నారదుడు వారివద్దకు వెళ్ళి "మీరు ముక్తిసాధనగురించి ఆలోచించక ఈ సాంసారికలంపటంలో పడి కొట్టుకుంటా రేమిటి" అని బోధ చేసి వారు సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తించకుండా ఆపివేయించాడు. తనపుత్రుల సృష్టికార్యక్రమానికి నారదుని వల్ల భంగం యేర్పడిందని దక్షునకు తెలిసి అతను బ్రహ్మవద్దకు వెళ్ళి ఆవిషయాన్ని తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ నారదుణ్ని దక్షపుత్రికకు నీవు సంతానంగా సంజనితుడవవుదువుగాక" అని శపిస్తాడు. అంతేకాదు దక్షుడుకూడా ఆగ్రహం పట్టలేక "నారదునికి యెక్కడా నిలకడ అనేదే లేకుండా పోవుగాక అతడు సంసారి అయినప్పటికీ సృష్టికార్యక్రమానికి భంగం కలిగించాడు కాబట్టి అతడు అనపత్యుడవుగాక" అని శపిస్తాడు.

సృష్టిని అభివృద్ధి చెయ్యవలసిందిగా నారదుడిని బ్రహ్మఒకసారి కోరతాడు. కాని నారదుడు "నేను సంసారసాగరనిమగ్నుడనై ఉండలేను. నాకు మోహబంధనాలతో పనిలేదు. నేను సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తించలేను" అని తిరస్కరిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆగ్రహోదగ్రుడై "నీవు మహాకాముకుడవై స్త్రీలోలుడవై శూద్రయోనిలో జన్మించుదువుగాక. అనంతరం బ్రాహ్మణసంపర్కంతో విష్ణుభక్తి కల వాడవై కీర్తి పొందుదువుగాక" అని శపించి అనుగ్రహిస్తాడు. అప్పుడు నారదుడు బాధపడి మహోగ్రుడై "నీకు పూజాకవచాదులు దేవాలయాలు లేకుండా పోవుగాక" అని బ్రహ్మకు ప్రతిశాపం యిచ్చాడు. ఈవిషయాలు బ్రహ్మవైవర్తపురాణం వల్ల అవగత మవుతున్నాయి. ఈ కథలు వాస్తవాలు అనుకున్నా అవాస్తవికాలనుకున్నా అటు శాస్త్రపురాణాదుల్లో కాని ఇటు లోకంలో కాని బ్రహ్మకు సంబంధించిన అర్చనాదివిషయాలు లేకపోవడం, దేవాలయాలూ విగ్రహపూజలూ లేకపోవడం అనేక శతసహస్ర అబ్దాలుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది.

అద్భుతరామాయణాన్ని పరిశీలిస్తే నారదుడు లక్ష్మిని రాక్షసగర్భంలో జన్మించవలసిందని రాక్షసులవల్ల కష్టాలు పొందవలసిందని శపించినట్లు కనిపిస్తున్నది. ఈశాపానికి మూలభూతమైన విషయం యిది.

కౌశికుడు ఒకరోజున స్వర్గంలో గానంచేస్తుండగా లక్ష్మీ ఆమె పరిచారకులూ, మునులూ నారదుడు మొదలైనవారుకూడా వింటున్నారు. అప్పుడు పరిచారకులు ఋషులను దూరంగా తొలగిఉండుండని బెత్తాలు పుచ్చుకొని వారిని దూరంచేశారు. లక్ష్మి తుంబురునిపట్ల ఒకానొకవిశిష్టమైన అభిమానం కలిగినదవడంవల్ల కౌశికునితో కలిసి గానం చేయవలసిందిగా కోరి తుంబురునికి పారితోషికం యిచ్చింది. అది నారదుడు అవమానంగా భావించి లక్ష్మిని రాక్షసగర్భంలో జనించవలసిందిగా శపించి రాక్షసులవల్ల ఇదేవిధంగా శిక్షింపబడుదువుగాక అని కూడా శపించాడు.

అప్పుడు విష్ణువు నారదుణ్ణి ఊరడించి "భక్తిగానం చెయ్యడం రూపంగా తుంబురునికి మహాగానప్రభావం లభ్యమయింది. నీకు కూడా అటువంటి ఉత్తమగానం లభించాలంటే మానసోత్తపర్వతం మీద "గానబంధువు" అనే గూబ ఉన్నది. దాని దగ్గరకు వెళ్ళి గానాభ్యాసం చేయవలసింది"గా సలహా యిచ్చాడు. అప్పుడు నారదుడు అక్కడకు వెళ్ళి గానబంధువు వల్ల సుశిక్షిత పొంది తిరిగి తుంబురునివద్దకు వచ్చి గానవిషయంలో తుంబురునితో సమానత్వాన్ని సాధించలేక అతనిమీద అసూయపడి తిరిగి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. తనకు తుంబురుని గానసామర్ధ్యాన్ని మించగల గానాన్ని అనుగ్రహించవలసిందిగా కోరాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు నేను శ్రీకృష్ణుడుగా జనించినప్పుడు నీకు గానం నేర్పుతానని మాట యిచ్చాడు. శ్రీకృష్టావతారకాలంలో గతంలో యిచ్చిన మాటప్రకారం నాకు గానాన్ని నేర్పవలసిందిగా శ్రీకృష్ణుణ్ని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మొదట జాంబవతివద్ద తరువాత శ్రీకృష్ణుని భార్యలవద్ద ఒక్కొక్కభార్యవద్ద ఒక్కొక్కసంవత్సరం వంతున గానం నేర్చుకోవలసిందిగా చెప్పాడు. ఆ ప్రకారం చేసినా నారదుడు సంపూర్ణగానకౌశలం సంపాదించలేనందువల్ల చివరికి శ్రీకృష్ణునివద్ద గానాభ్యాసం చేసి మహాపండితుడై తుంబురునిపట్ల ఈర్ష్యారహితుడై సుఖంగా ఉన్నాడు.

శ్రీమహావిష్ణువు మానవుడుగా శ్రీరాముడుగా జన్మిచడానికి నారదుడే మూలకారకుడని లింగ, శివపురాణాలు రెండూ పేర్కొంటున్నాయి. వాటివల్ల తెలుస్తున్న విషయాలు యివి.

నారదుడు హిమాలయపర్వతంమీద తపస్సు చేసుకుంటూ ఉండగా తపోభంగం కలిగించడానికై ఇంద్రుడు దేవకన్యలను పంపిస్తాడు. నారదుడు తన దివ్యతపశ్శక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు. దేవకన్యలు నారదుని మనస్సుని చలింపచేయాలని యెంతప్రయత్నం చేసినా శివప్రభావంవల్ల నారదుని హృదయం నిశ్చలంగా నిలిచి ఉన్నది. అందువల్ల నారదునికి "నా హృదయాన్ని దేవకన్యలు సైతం చలింపచేయలేకపోయారు కదా" అని బాగా గర్వం వచ్చింది. తనమహిమవల్లనే మన్మథుడిని జయించగలిగానని కూడా నారదుడు అనుకుంటూ ఉండేవాడు. నారదుడు తపస్సు ముగించి శివదర్శనం చేసి తరువాత బ్రహ్మనూ, శ్రీ మహావిష్ణువునూ చూడడానికి వెళ్ళాడు. విష్ణువు శివమాహాత్మ్యాన్ని గుర్తించినప్పటికి కూడా నారదుడు తన శక్తిసామర్థ్యాలవల్లనే కామాన్ని జయించానని యితరులసమక్షంలోనే కాదు విష్ణుసమక్షంలో సైతం చెప్పుకునేవాడు. నారదుడు విష్ణుదర్శనం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు అతను ప్రయాణం చేసే మార్గంలో ఒక సుందరతరమైన నగరాన్ని నిర్మించి ఆనగరంలో మహాసౌందర్యవంతురాలైన శ్రీమతి అనే సుందరాంగిని విష్ణువు సృష్టించాడు. నారదుడు ఆ శ్రీమతిని చూచి మోహించాడు. అనంతరం నారదుడు శ్రీమతి స్వయంవరానికి వెళ్ళేముందు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి విషయం చెప్పి విష్ణురూపాన్ని తనకు అనుగ్రహించవలసిందిగా కోరతాడు అని ఒక అసమగ్రకథ.

నారదుడూ, పర్వతుడూ లోకసంచారం చేస్తూ అంబరీషనగరానికి వచ్చి అతని సమ్మానాదులందుకుని అతని యింట్లో వున్న అతిలోక సుందరియైన అతనిపుత్రిక శ్రీమతిని చూస్తారు. ఈ కన్య యెవరని వారిద్దరూ అడుగుతారు. అప్పుడు అంబరీషుడు ఆమె తన కుమార్తె అని చెప్పుతాడు. ఆమెను తమ కీయవలసిందని నారద పర్వతులిద్దరూ కోరతారు. అప్పుడు అంబరీషుడు "ఒకే కన్యను ఇద్దరి కివ్వడం సాధ్యంకాదు కదా! మీ ఇద్దరిలో ఆమె ఎవ్వరిని వరిస్తే వారి కిస్తా"నని చెప్పుతాడు. అనంతరం శ్రీమతి కొకరోజున స్వయంవరం యేర్పాటు చెయ్యడం జరిగింది. అంతకు పూర్వమే నారదపర్వతులిద్దరూ ఒకరి కొకరు తెలియకుండా శ్రీమహావిష్ణువుదగ్గరకు వెళ్ళి శ్రీమతి స్వయంవరసందర్భంగా పర్వతునిముఖం వానరముఖంగా చేయవలసిందని నారదుడూ, నారదునిముఖం వానరముఖంగా చేయవలసిందని పర్వతుడూ కోరతారు. విష్ణువు వారిద్దరి కోరికను మన్నించి అనుగ్రహిస్తాడు. శ్రీమతి స్వయంవరానికి అనేకమంది వెళ్ళారు. నారదపర్వతులే కాక శ్రీమహావిష్ణువు కూడా వెళ్ళాడు. నారదపర్వతుల వానరముఖాలను చూచి అందరూ నవ్వారు. శ్రీమతి పవిత్రదివ్యసుందరరూపుడైన మహావిష్ణువును వరిస్తుంది. ఆమెను విష్ణువు స్వీకరించి వెళ్ళిపోయాడు. నారదపర్వతులిద్దరికీ కోపం వచ్చింది. అప్పుడు వారిద్దరూ "మా యిద్దరిలో ఒకరి కిస్తానని మాట యిచ్చిన నీవు శ్రీమతిని మా యిద్దరిలో ఏ ఒక్కరికీ ఇవ్వకుండా ఇతరునికి ఇచ్చావు కాబట్టి నీవు తమోమయుడవు అవుదువు గాక" అని అంబరీషుణ్ని శపించారు. ఆ వెంటనే శ్రీమహావిష్ణువుచక్రం వచ్చి నారదపర్వతులను వెంటాడం మొదలు పెట్టింది. వారిద్దరూ సరాసరి వైకుంఠానికి పరుగెత్తి శ్రీ మహావిష్ణువు వద్ద ఉన్న శ్రీమతిని చూచారు. "మాముఖాలు వానరముఖాలుగా చేసి అంతకు పూర్వమే మేము ప్రేమించిన పిల్లను నీవు తెచ్చుకున్నావు. కాబట్టి నీవు నరుడవై జన్మించి భార్యావియోగదుఃఖాన్ని అనుభవించి చిట్టచివరికి వానరులసహాయంతో నీ భార్యను నీవు పొందుతావు." అని శ్రీ మహావిష్ణువును శపిస్తారు. అప్పుడు విష్ణువు ఇదంతా మహేశ్వరుని ప్రభావంతో జరిగిందని నారదునికి వివరించి చెప్పి అదృశ్య మవుతాడు. ఈ శాపకారణంగానే విష్ణువు రామావతారం పొందడం, భార్యావియోగదుఃఖాన్ని అనుభవించడం, ఆంజనేయాది వానరులసహాయంతో రాముడు తన భార్యయైన సీతను పొందడం సంభవించింది.

ఈ విధంగా శ్రీమహావిష్ణువును శపించడం లక్ష్మీమాతను శపించడం రూపంగా సీతారామ అవతారాలకు మూలకారకుడైన నారదుణ్ని, మహాసృష్టికి మూలభూతుడైన విష్ణుపుత్రుడై విష్ణుసాన్నిధ్యంలో తనకంటె ముందుగా ప్రథమస్థానంలో ఉన్న బ్రహ్మకు పూజార్చనాదులు లేకుండా చెయ్యడంలో కూడా పాత్ర వహించిన నారదుణ్ని, మొత్తం దేవరాక్షసవ్యవస్థల్లో దుష్టులను శిక్షించడంలోనూ, శిష్టులను రక్షించడంలోనూ బహుముఖాలుగా పాత్ర వహించిన నారదుణ్ని అపరజగన్నాటకసూత్రధారి అంటే తప్పేముంది. అందుకే మొట్టమొదటే శ్రీ మహావిష్ణువే జగన్నాటకసూత్రధారి అనుకుంటాం గాని నారదమహర్షి కూడా జగన్నాటకసూత్రధారియే అని పేర్కొనడం జరిగింది.

సంస్కృత నారదీయపురాణం

అపూర్వమహర్షిగా దేవర్షిగా అపరజగన్నాటకసూత్రధారిగా పేర్కొనదగిన ఈనారదమహర్షిచేత ప్రోక్తమైన సంస్కృత నారదీయపురాణంలో అసలు మొట్టమొదట యెన్నిపాదాలు యెన్నిఅధ్యాయాలు యెన్నిశ్లోకాలు ఉన్నాయో సాధికారంగా ప్రమాణపురస్సరంగా మనం యేమీ చెప్పలేము. లభ్యమై నారదీయమహాపురాణంపేరుతో ముద్రితమైన నారదీయపురాణంలో పూర్వోత్తరభాగాలపేరుతో రెండుభాగా లున్నాయి. పూర్వార్థం నాలుగుపాదాలుగా విభజింపబడి ఉత్తరార్థం పాదవిభజనరహితంగా ఉన్నది - పూర్వార్థంలో నూట యిరవైయైదు అధ్యాయాలూ ఉత్తరార్థంలో యెనభైరెండు అధ్యాయాలుగా మొత్తం గ్రంథం 207 అధ్యాయాలతో ఉన్నది. పూర్వార్థంలో 12,774 శ్లోకా లుండగా ఉత్తరార్థంలో 4,525 శ్లోకాలున్నాయి. అంటే ముద్రితమైన నారదీయపురాణంలో మొత్తం 17,299 శ్లోకా లున్నాయన్నమాట.

ముద్రితమైన ఈ నారదీయపురాణంలో అధ్యాయ విభజనాత్మకంగా వివిధశ్లోకాలలో ఈక్రిందివిషయాలు వర్ణితాలైనాయి.

ప్రథమః పాదః

ధర్మకామార్థ మోక్షోపాయా న్వేదితుం శౌనకాదిభిః కృతే
ప్రశ్నే సూతస్య నారదాయ సనకాదిభిర్నిరూపిత పురాణస్య
నారదీయస్య కథనోపన్యాసే పురాణమాహాత్మ్యకథనమ్॥

1వ అధ్యాయం


బ్రహ్మసభాప్రస్థితసనకాదీనాం గంగాతీరే విష్ణుప్రసాదనో
పాయబోధనాయ నారదప్రశ్నే పురాణోపన్యాసే విష్ణుస్తుతి॥

2వ అధ్యాయం


భగవద్విరచితసృష్టినిరూపణప్రసంగేన భూగోళవర్ణన
భరతఖండోత్పత్తి ప్రాశస్త్యవర్ణనమ్॥

3వ అధ్యాయం


హరిభక్తి నిరూపణే మృకండ మునేస్తపసా తోషితస్య భగవ
తో౽హం తవపుత్రతాం యాస్యామీతి మనోభీష్టవరప్రదానమ్॥

4వ అధ్యాయం


మార్కండేయస్య ప్రళయదర్శనాంతే పురాణసంహితాం
విరచ్య పరంపదమేష్యసీతి హరేర్వరవితరణమ్॥

5వ అధ్యాయం


గంగాయమునయోః సమాగమా త్ప్రయాగక్షేత్రప్రశంసా
పూర్వకం గంగామాహాత్మ్యకథనమ్॥

6వ అధ్యాయం


గంగామాహాత్మ్యప్రసంగేన రిపుజితస్య బాహు భూమిపతే
రౌర్వ మునే రాశ్రమ సవిధే మృతస్య గర్భవత్వాః సహ
గమనోద్యతాయాః ప్రియపత్న్యా మునికృతః సహగమననిషేధః ॥

7వ అధ్యాయం

బాహుసుత సగరాన్వయ జాత భగీరథ నృపానీత గంగా
సంగమాత్ కపిలమహాముని కోపానలదగ్ధ తత్పూర్వజానాం
పరమపదావలంబనమ్॥

8వ అధ్యాయం


కులగురు వసిష్ఠమహర్షి శాపలబ్ధ రాక్షసదేహస్య సౌదాన నృపతేః
గంగోదక సంబంధాచ్ఛాపమోచనమ్॥

9వ అధ్యాయం


గంగోత్పత్తి ప్రసంగేన దేవాసురయుద్ధే దేవపరాజయ
దుఃఖితాయా హిమాద్రౌ భగవదారాధనోద్యతాయాః అదితేర్వి
నాశా యోత్పాదితేగ్నౌ దైతేయవినాశః॥

10వ అధ్యాయం


త్రైలోక్యరాజ్య మింద్రాయ పునఃప్రదాతుం గృహీత
వామనావతారస్య బలియజ్ఞ మాస్థితస్య భగవతస్త్రీ విక్రమస్య
చరణతలా ద్గంగోత్పత్తిః॥

11వ అధ్యాయం


ధర్మాఖ్యానే సత్పాత్రబ్రాహ్మణలక్షణం, మహావనే తడాగ
బంధనాత్ వీరభద్రనృపతే రుత్తమలోకావాప్తిరితి భగీరథాయ
ధర్మరాజ ద్విజనివేదనంచ॥

12వ అధ్యాయం


దేవతాయ తనవాపీ కూపతడాగాది నిర్మాణం, నానా దానాది
నిరూపణంచ॥

13వ అధ్యాయం


శ్రుతిస్మృతి ప్రతిపాదిత వర్ణత్రయ ధర్మనిరూపణే పాతక
ప్రాయశ్చిత్త నివేదనం, శ్రాద్ధపంచకకథనంచ ॥

14వ అధ్యాయం


పాతకినాం పృథక్ పృథఙ్నిరయ యాతనావర్ణనపూర్వకం
నృపపూర్వజానాం నరకోద్ధారాయ ధర్మరాజ ద్విజస్య భూతలే
గంగానయనార్థ భాగీరథయో ద్యోతనమ్॥

15వ అధ్యాయం


ద్విజరూపిణో ధర్మస్య వచనాత్పిత్రుద్ధరణాయ భూతలే భగీరథస్య
గంగా నయనం, నిజకులోద్ధారశ్చ॥

16వ అధ్యాయం


వ్రతాఖ్యానే మార్గశీర్ష మారభ్య కార్తికమాసపర్యంతం
సోద్యాపనం శుక్లద్వాదశీవ్రతకథనమ్॥

17వ అధ్యాయం


ప్రతిమాసం పౌర్ణిమాయాం సోద్యాపనవిధి లక్ష్మీనారాయణవ్రతం॥

18వ అధ్యాయం


కార్తికస్య శుక్లపక్షే దశమ్యాం హరిమందిరే ధ్వజారోపణవ్రతమ్॥

19వ అధ్యాయం

ధ్వజారోపణప్రసంగా త్సోమవంశోద్భవ నరపతేః సుమతే
ర్విభాండక మునయే స్వపూర్వజన్మేతిహాసకథనమ్॥

20వ అధ్యాయం


మార్గశీర్ష శుక్లపక్షే దశమీ మారభ్య పౌర్ణమాసీపర్యంతం
హరిపంచరాత్రవ్రతమ్॥

21వ అధ్యాయం


ఆషాడ శ్రావణ భాద్రపదాశ్వినే ష్వేకస్మిన్మాసే మాసోప
వాసవ్రతమ్॥

22వ అధ్యాయం


ఏకాదశీవ్రతప్రసంగేన భద్రశీల ద్విజోపాఖ్యానమ్॥

23వ అధ్యాయం


బ్రాహ్మణ క్షత్రియ విశాం స్త్రీ శూద్రాణాంచ సదాచరవర్ణనమ్॥

24వ అధ్యాయం


వర్ణాశ్రమధర్మిణాం స్మార్తాచారేషు అధ్యయనా న్నధర్మనిరూపణమ్॥

25వ అధ్యాయం


ద్విజాతీనాం స్మృతి నిరూపిత వేదాధ్యయనాది ధర్మనిరూపణమ్॥

26వ అధ్యాయం


సదాచారేషు గృహస్థ వానప్రస్థ సన్యాసినాం ధర్మనిరూపణమ్॥

27వ అధ్యాయం


శ్రాద్ధకృత్యవివరణమ్॥

28వ అధ్యాయం


ప్రాయశ్చిత్తపూర్వకం తిథ్యాదినిర్ణయమ్॥

29వ అధ్యాయం


పంచమహాపాతకినా ముపపాతకీనాంచ ప్రాయశ్చిత్తకథన
పూర్వకం, పాతకనివృత్తయే భగవదుపాసనాకథనమ్॥

30వ అధ్యాయం


పుణ్య పాపవతాం నృణాం సుఖదుఃఖ ప్రదస్య యమమార్గస్య
సమ్యక్తయా నిరూపణమ్॥

31వ అధ్యాయం


సంసార నానావిధ యాతనా కథన పూర్వకం తన్ని వృత్తయే
హరే రాధన కథనమ్॥

32వ అధ్యాయం


భగవద్భక్తి మతాం పాపక్షయే భోధైక లభ్య మోక్షోపాయ
భూత యమా ద్యష్టాంగయోగ నిరూపణమ్॥

33వ అధ్యాయం


ఐహలౌకిక, పారలౌకిక సుఖావాప్తి సాధన హరిభక్తి లక్షణ
నిరూపణమ్॥

34వ అధ్యాయం


కర్మపాశ విచ్ఛేదక భగవద్భక్తి మాహాత్మ్య నిరూపణే వేదమాలి
ద్విజేతిహాస కథనమ్॥

35వ అధ్యాయం

విష్ణుసేవా ప్రభావేణ యజ్ఞమాలి సుమాలి ద్విజయో రుత్తమ
లోకావ్యాప్తి కథనమ్॥

36వ అధ్యాయం


విష్ణుమాహాత్మ్యే గులికాభిధలుప్త కోత్తం కేతిహాన కథనమ్॥

37వ అధ్యాయం


భగవత్త్సు వనాదుత్తంక మునేర్విష్ణు పదవాప్తి కథనమ్॥

38వ అధ్యాయం


హరి మందిర సమ్మార్జన దీప దానకర్తుర్జయధ్వజ నరపతే రితిహాస
కథనమ్॥

39వ అధ్యాయం


సుధర్మోదిత బ్రహ్మకల్ప మధ్యే మను మన్వంతరేంద్ర దేవతా
నిరూపణమ్॥

40వ అధ్యాయం


యుగ చతుష్టయస్థితి కథన పూర్వకం కలౌ భగవన్నామ స్మరణత
ఏవ ముక్తిరితి నామ మాహాత్మ్య కథనమ్॥

41వ అధ్యాయం

ద్వితీయః పాదః

భరద్వాజ భృగు సంవాదే జగత్సృష్టి నిరూపణమ్॥

42వ అధ్యాయం


సృష్టి నిరూపణే వర్ణాశ్రమ ధర్మ కథనమ్॥

43వ అధ్యాయం


భూతసృష్టి ప్రసంగేన ధ్యానయోగ కథనమ్॥

44వ అధ్యాయం


జనక పంచశిఖ సంవాదేన మోక్ష ధర్మ నిరూపణమ్॥

45వ అధ్యాయం


ఆది దైవికాది తాపత్రయ నిరాసాయ భవోపర మాయ
చాధ్యాత్మకథనమ్॥

46వ అధ్యాయం


చిత్తవృత్తి నిరోధతో భగవద్ధ్యానే నాత్మ సదావాప్తి
నిరూపణమ్॥

47వ అధ్యాయం


భరతస్య రాజర్షేరేణ శాపక సంగేన జన్మత్రయ గ్రహణే
తిహాసః॥

48వ అధ్యాయం


భరతముని రహుగణయోః సంవాదే మోక్షధర్మావిష్కరణమ్॥

49వ అధ్యాయం


శుకమునిచరిత్రే వేదచతుష్టయస్య స్వర వర్ణవ్యవస్థా
వర్ణనమ్॥

50వ అధ్యాయం


నక్షత్ర వేదసంహితాది కల్ప నిరూపణమ్॥

51వ అధ్యాయం


వ్యాకరణ నిరూపణమ్॥

52వ అధ్యాయం

నిరుక్తి నిరూపణమ్॥

53వ అధ్యాయం


జ్యోతిషే గణితభాగవిచారణమ్॥

54వ అధ్యాయం


జ్యోతిర్నిరూపణే జాతకభాగావిష్కరణమ్॥

55వ అధ్యాయం


గ్రహవిచారణపూర్వకం, నానావిధమహోత్పాతాది
నిరూపణమ్॥

56వ అధ్యాయం


సంక్షేపతశ్ఛందోవర్ణనమ్॥

57వ అధ్యాయం


జనకరాజగృహగమనపర్యంతం శుకేతిహాసనిరూపణమ్॥

58వ అధ్యాయం


జనకశుకసంవాదే నాధ్యాత్మతత్వనిరూపణమ్॥

59వ అధ్యాయం


వ్యాసాశ్రమే శుకసనకసంవాద గ్రథితమోక్షార్థసాధక జ్ఞాన
వివరణమ్॥

60వ అధ్యాయం


దేహధారిణా మనేకాపాయదర్శనపూర్వకం నివృత్తి ధర్మ
మహత్వవర్ణనమ్॥

61వ అధ్యాయం


శుకేతిహాసముఖేన మోక్షధర్మనివేదనమ్॥

62వ అధ్యాయం

తృతీయః పాదః

సంసారబంధవిచ్చేదాయ పాశుపతదర్శనతత్వ నిరూపణమ్॥

63వ అధ్యాయం


మంత్రసిద్ది ద దీక్షా విధి నిరూపణమ్॥

64వ అధ్యాయం


శ్రీపాదుకామంత్రకథనపూర్వకం మంత్ర జపవిధి కథనమ్॥

65వ అధ్యాయం


గాయత్రీ మంత్ర జపవిధి కథనపూర్వకం సంధ్యాది
నిరూపణమ్॥

66వ అధ్యాయం


అర్ఘ్యపాద్యాది విధానసహిత షోడశోపచారయుక్త దేవతా
పూజానిరూపణమ్॥

67వ అధ్యాయం


గణేశ మంత్ర తద్విధి నిరూపణమ్॥

68వ అధ్యాయం


రవి సోమ మంగళ బుధ గురు శుక్రాణాం యంత్ర విధి పూజావిధి
పూర్వకం మంత్ర జపవిధి కథనమ్॥

69వ అధ్యాయం


పూజావిధి పూర్వకం మహావిష్ణు మంత్ర జప విధానమ్॥

70వ అధ్యాయం

శ్రీ నృసింహస్య యంత్ర కథన పూర్వకం మంత్రోపాసన
గాయత్ర్యాది నిరూపణమ్॥

71వ అధ్యాయం


పీఠదేవతాసహిత పూజావిధి పురస్సరం హయగ్రీవ
మంత్రోపాసనా నిరూపణమ్॥

72వ అధ్యాయం


శ్రీ లక్ష్మణ మంత్ర సహిత శ్రీరామ మంత్రజపవిధానమ్॥

73వ అధ్యాయం


హనుమన్మంత్ర నిరూపణమ్॥

74వ అధ్యాయం


మంత్రాంతరకథనపూర్వకం హనుమద్దీపదానవిధి
ప్రకరణమ్॥

75వ అధ్యాయం


శ్రీ దత్తాత్రేయ ప్రసాదలబ్ధ మాహాత్మ్య కార్తవీర్యనృప మంత్ర
దీప కథనమ్॥

76వ అధ్యాయం


శ్రీ కార్తవీర్య కవచ నిరూపణమ్॥

77వ అధ్యాయం


హనుమత్కవచ కథనమ్॥

78వ అధ్యాయం


హనుమచ్చరిత వర్ణనమ్॥

79వ అధ్యాయం


సకలాభీష్టప్రద పూజావిధానపూర్వకం కృష్ణ మంత్రారాధన
కథనమ్॥

80వ అధ్యాయం


పీఠ దేవతారాధన పూర్వకం కామనాభేదేన కృష్ణ మంత్ర భేద
నిరూపణమ్॥

81వ అధ్యాయం


కైలాసే నారదాయ శ్రీ శివ నిరూపిత మనేక కామనా
పూర్వకం శ్రీ రాధాకృష్ణ సహస్రనామస్తోత్రమ్॥

82వ అధ్యాయం


మంత్రారాధన పూర్వకం రాధాంశ భూత పంచప్రకృతి లక్షణ
నిరూపణమ్॥

83వ అధ్యాయం


జప హోమ విధి సహిత దేవీమంత్ర నిరూపణమ్॥

84వ అధ్యాయం


వాగ్దేవతావతార భూత కాల్యాది యక్షిణీ మంత్ర భేద
నిరూపణమ్॥

85వ అధ్యాయం


మహాలక్ష్మ్యవతార భూత భగలాది యక్షిణీ మంత్ర సాధన
నిరూపణమ్॥

86వ అధ్యాయం


విధాన సహిత దుర్గామంత్ర చతుష్టయ నిరూపణమ్॥

87వ అధ్యాయం


శ్రీ రాధావతార భూతషోడశ దేవతానాం మంత్ర యంత్ర
పూజావిధి నిరూపణమ్॥

88వ అధ్యాయం

విజయాది సకల కామనా సిద్ధయే కవచసహిత లలితా సహస్ర
నామస్తోత్ర నిరూపణమ్॥

89వ అధ్యాయం


అర్చనావిధి సహితం నిత్యాపాటల కథనమ్॥

90వ అధ్యాయం


స్తోత్రసహిత శ్రీమహేశ్వర మంత్రవిధి నిరూపణమ్॥

91వ అధ్యాయం

చతుర్థః పాదః

సంక్షేపతో బ్రహ్మ పురాణేతిహాస నిరూపణమ్॥

92వ అధ్యాయం


పంచఖండ సహిత పద్మపురాణస్థిత విషయానుక్రమ కథనమ్॥

93వ అధ్యాయం


పురాణశ్రవణఫలకథనసహితం విష్ణుపురాణానుక్రమ కథనమ్॥

94వ అధ్యాయం


వాయుపురాణానుక్రమ నిరూపణమ్॥

95వ అధ్యాయం


శ్రీమద్భాగవత ద్వాదశస్కంధ నిరూపిత విషయానుక్రమ
కథనమ్॥

96వ అధ్యాయం


శ్రీనారదీయ పురాణానుక్రమ కథనమ్॥

97వ అధ్యాయం


మార్కండేయ పురాణానుక్రమ నిరూపణమ్॥

98వ అధ్యాయం


అగ్నిపురాణస్థిత విషయానుక్రమ నిరూపణమ్॥

99వ అధ్యాయం


భవిష్య పురాణస్థిత విషయానుక్రమ వర్ణనమ్॥

100వ అధ్యాయం


బ్రహ్మవైవర్త పురాణస్థిత విషయానుక్రమ వర్ణనమ్॥

101వ అధ్యాయం


లింగపురాణస్థిత విషయానుక్రమ నిరూపణమ్॥

102వ అధ్యాయం


వారాహ పురాణస్థిత విషయానుక్రమ కథనమ్॥

103వ అధ్యాయం


స్కంద పురాణోక్త విషయానుక్రమ నిరూపణమ్॥

104వ అధ్యాయం


వామన పురాణస్థిత విషయానుక్రమ నిరూపణమ్॥

105వ అధ్యాయం


కూర్మ పురాణస్థిత విషయానుక్రమ నిరూపణమ్॥

106వ అధ్యాయం


మత్స్య పురాణస్థిత విషయానుక్రమణీ కథనమ్॥

107వ అధ్యాయం


గరుడ పురాణస్థిత విషయానుక్రమ కథనమ్॥

108వ అధ్యాయం


బ్రహ్మాండ పురాణస్థిత విషయానుక్రమ నిరూపణమ్॥

109వ అధ్యాయం


చైత్రాది ద్వాదశ మాసగత ప్రతిపద్వ్రత నిరూపణమ్॥

110వ అధ్యాయం


ద్వాదశ మాసగత ద్వితీయావ్రత కథనమ్॥

111వ అధ్యాయం

ద్వాదశ మాసగత తృతీయావ్రత నిరూపణమ్॥

112వ అధ్యాయం


ద్వాదశ మాసస్థిత చతుర్థీవ్రత నిరూపణమ్॥

113వ అధ్యాయం


ద్వాదశ మాసస్థిత పంచమీవ్రత నిరూపణమ్॥

114వ అధ్యాయం


ద్వాదశ మాసగత షష్ఠీవ్రత నిరూపణమ్॥

115వ అధ్యాయం


ద్వాదశ మాసగత సప్తమీవ్రత నిరూపణమ్॥

116వ అధ్యాయం


ద్వాదశ మాసస్థితాష్టమీవ్రత నిరూపణమ్॥

117వ అధ్యాయం


ద్వాదశ మాసగతశ్రీరామనవమ్యాదినవమీ వ్రతనిరూపణమ్॥

118వ అధ్యాయం


ద్వాదశ మాసగత దశమీవ్రత నిరూపణమ్॥

119వ అధ్యాయం


ద్వాదశ మాసస్థితైకాదశీ నామనిర్దేశ పూర్వకం దినత్రయ
సాధ్యవ్రత కథనమ్॥

120వ అధ్యాయం


ద్వాదశ మాసగత ద్వాదశీవ్రత నిరూపణమ్॥

121వ అధ్యాయం


ద్వాదశ మాసగత త్రయోదశీవ్రత నిరూపణమ్॥

122వ అధ్యాయం


ద్వాదశ మాసగత చతుర్దశీవ్రత నిరూపణమ్॥

123వ అధ్యాయం


ద్వాదశ మాసస్థిత పౌర్ణమీవ్రత నిరూపణమ్॥

124వ అధ్యాయం


ఏవం పూరాణం సంశ్రావ్య సనకాది మహర్షిషు గతేషు నారదస్య
కైలాసగమనం, తత్ర శంకరా త్పాశుపత జ్ఞాన మవాప్య
నారాయణాశ్రమగమనం, సూతేన శౌనకాదిభ్యః పురాణ
మాహాత్మ్య కథనంచ॥

125వ అధ్యాయం

ఉత్తరార్థస్థిత విషయానుక్రమణిక

వసిష్ఠం ప్రతి పాపేంధనస్య దాహకః కోవహ్నిరితి మాంధాతుః
ప్రశ్నే ఏకాదశీవ్రత రూపోగ్ని రశేష పాపేంధనదాహక ఇతి
తద్వ్రతస్య మాహాత్మ్య నిరూపణమ్॥

1వ అధ్యాయం


దేవ పితృ కార్యేషు తిథీనాం పూర్వాపర తిథి విద్ధానాం కీదృశీ
గ్రహణ వ్యవస్థేతి శౌనకాదీనాం ప్రశ్నః కేషుకేషు కార్యేషు
తిథీనాం పూర్వాపర వేధగ్రహణ మితి సూతస్య కథనోపక్రమ
స్తత్రైవైకాదశీ పూర్వవిద్ధా నకర్తవ్యేతి విశేషతో
నిరూపణమ్॥

2వ అధ్యాయం

దురితౌఘ నివారణాయ భగవద్భక్తేః ప్రాధాన్య ముక్త్వా
తత్ప్రసంగేన రుక్మాంగదస్య నరపతేః ప్రజాభిః నమైకాదశీ
వ్రతం కుర్వాణస్య రాష్ట్రేమృతానాం సహపితృభిః స్వర్యా
సేసశూన్య నిజలోకావలోకనేన పరితప్తస్య యమస్య బ్రహ్మ
లోకగమనమ్॥

3వ అధ్యాయం


కార్యమకృత్వా ప్రభోర్వేతన గ్రహణమతి పాపకరం యత
ఏకాదశీవ్రత కరణాన్నిరయాధిష్ఠిత పూర్వజైః సహాధునా
రుక్మాంగద రాష్ట్రవాసినాం స్వర్లోకావస్తానా చ్ఛూన్యలోక పరి
పాలన మశ్రేయస్కరమితి యమవాక్య నిరూపణమ్॥

4వ అధ్యాయం


దండం పటంచాగ్రేసంస్థాస్య యమస్య నిలావకరణమ్॥

5వ అధ్యాయం


ఏకాదశీవ్రత కర్తౄణాం పాపినామపి స్యర్వాసోనియతం
భవిష్యతి సః తై ర్విరోధం కర్తుం నాహంపా రయిష్యే ఇతి బ్రహ్మ
వాక్య నిరూపణమ్॥

6వ అధ్యాయం


యమగ్రహాత్ మోహినీనామ్నీం యోషిద్వరా ముత్పాద్య
రుక్మాంగదస్య నృపంతరేకాదశీవ్రత భంగాయ బ్రాహ్మణో
నిర్దేశకారణమ్॥

7వ అధ్యాయం


బ్రాహ్మణో నిదేశ మంగీకృత్య మోహిన్యాం మందరాచల
గమనమ్॥

8వ అధ్యాయం


రాజ్య ధురం వోఢుం క్షమే ధర్మాంగద పుత్రే రాజ్యం
న్యస్య సహ ప్రజాభిరేకాదశీవ్రతం పాలనీయమితి సందిస్య మృగ
యార్థం గంతు మిచ్ఛామీతి రాజ్ఞోభార్యాయై కథనమ్॥

9వ అధ్యాయం


వనవిహరణోద్యతస్య నరపతే ర్వామదేవాశ్రమగమనం, తత్ర
వామదేవాయ సర్వసంపత్ప్రాప్తిర్మమై తజ్జన్మసంపాదితా వా
పూర్వ సంపాదితేతి ప్రశ్నకరణంచ॥

10వ అధ్యాయం


వామదేవకృతం నరపతేః ప్రాక్జన్మవృత్తవర్ణనం. రాజ్ఞో
మందరాచలగమనం. గిరిశోభావలోకనప్రసంగేన మోహినీ
దర్శనంచ॥

11వ అధ్యాయం


మోహినీరూప మోహితస్య నరపతేస్తస్యాసహ యాచిత
దానే సమయ కరణం, స్వవృత్తకథనం తద్వృత్తశ్రవణంచ॥

12వ అధ్యాయం


రుక్మాంగదస్య నరపతే రాత్మవినాశాయ మోహిన్యా సహ
వివాహో గిరేరవతరణంచ॥

13వ అధ్యాయం

మోహేన్యా సహ స్రస్థితస్య నరపతే రశ్వశిఖరాగ్ర ప్రహృ
తాయా గృహగోధాయాః ప్రాగ్జన్మవృత్తకథనం. నిజ
యైకాదశీ పుణ్యదానేన తస్యా ఉద్ధారశ్చ॥

14వ అధ్యాయం


గృహగోధాముద్దృత్య సహ భార్యాయా నరపతే ర్నిజనగర
గమనం సమ్ముభాగతేన ధర్మధ్వజపుత్రేణ సహవార్తాలాప
కరణంచ॥

15వ అధ్యాయం


ధర్మధ్వజేన వస్త్రాలంకారదిబిః పూజితాయా మోహిన్యాః
సేవార్థం సంధ్యావల్యా నియోజనం తత్ప్రసంగేన
పతివ్రతోపాఖ్యానమ్॥

16వ అధ్యాయం


సంధ్యావల్యోపాస్యమానయా మోహిన్యాః సన్నిధౌ నరపతే
రాగమనం తస్యాస్తేన సహసంవాదః॥

17వ అధ్యాయం


ధర్మధ్వజస్య సుతస్యాగ్రహా త్సంధ్యావలీప్రభృతిభి ర్వస్త్రాలంకార
పూజితాభి ర్నృపస్త్రీభిః సహమోహిన్యా విలాసోపభోగార్థం
నృపస్యాభ్యనుజ్ఞానమ్॥

18వ అధ్యాయం


మోహిన్యాసహ నృపస్య విలాసవర్ణనమ్॥

19వ అధ్యాయం


ధర్మధ్వజస్య మలయే విద్యాధరాన్ విజిత్య సంచమణినాం
ఆహరణం, నాగలోకే నాగన్ విజిత్యాయుత నాగకన్యా
హరణం, దిగ్విజయం కృత్వా నానావిధద్రవ్యాహరణం పిత్రే
సర్వవృత్తి నివేదనంచ॥

20వ అధ్యాయం


ధర్మధ్వజస్య నాగకన్యాభి ర్మహోత్సవేన వివాహకరణం రాష్ట్రే
ప్రజానాం శిక్షానిరూపణంచ॥

21వ అధ్యాయం


విషయాభిసేవనరతస్య నరపతే రుక్మాంగద స్యాగామికార్తిక
మాసస్మరణం. మోహిన్యై కార్తికమాసమాహాత్మ్య
కథనంచ॥

22వ అధ్యాయం


మోహిన్యానురోధా న్నృపస్య సంధ్యావల్యై కార్తికమాసోప
వాసకరణానుజ్ఞానం. మోహిన్యా రుక్మాంగదసమీపే
సమయానుసారే ణైకాదశ్యాం భోజనసంబంధేన యాచనా
కరణంచ॥

23వ అధ్యాయం


ఏకాదశ్యాం నాహం భోక్ష్యే ఇతి రాజ్ఞోనిశ్చయం జ్ఞాత్వా
మోహిన్యా గౌరమాది బ్రాహ్మణేభ్యో రాజ్ఞోపవాసకరణం
యుక్త మయుక్తమితి ప్రశ్నకరణమ్॥

24వ అధ్యాయం

ఏకాదశ్యాం భోజనే సతే దోషః ఇతి ద్విజవాక్యశ్రవణాత్
పరమకృద్ధస్య వ్రతభంగ మసహమానస్య నరపతేర్వచనాత్
ప్రస్థితాయా మోహన్యా ధర్మధ్వజస్య వినయార్పునః పరా
వర్తనమ్॥

25వ అధ్యాయం


ధర్మాంగదసమీపే మోహిన్యై అన్యత్సర్వమపి ప్రయ చ్ఛామి
నత్వేకాదశ్యాం భోక్ష్య ఇతి రాజ్ఞో నిశ్చయపూర్వకం వచనమ్॥

26వ అధ్యాయం


సుతవచనా న్మోహినీ మనునేతు ముద్యతాయాః సంధ్యావల్యాః
కాష్ఠీలా దేహమాపన్నాయాః కౌండిన్యభార్యాయాః పూర్వ
వృత్తీ కథనమ్॥

27వ అధ్యాయం


ధనాశయా స్వభార్యాం పరిత్యజ్య సముద్రమధ్యగతస్య
కౌండిన్యస్య రాక్షస్వాపసథగమనం, రాక్షసంహత్వారాక్షస్యా
సహధనం గృహీత్వా రాక్షసాహృతాం రత్నావలీం స్వాపసథం
ప్రేషయితుం కాశ్యా మాగమనమ్॥

28వ అధ్యాయం


బ్రహ్మణఃశిరః కర్తనే హస్తేలగ్నంశిరః పాతయితు మశ క్తస్య
శివస్య బ్రహ్మహత్యా పీడితస్య కాశ్యాముభయ నివృత్తౌ తత్రైవ
హరేరాజ్ఞయా నివాస ఇతి కాశ్యా రాక్షసీకృత మాహాత్మ్య
వర్ణనమ్॥

29వ అధ్యాయం


రాక్షసీ సమ్మత్యా రత్యావల్యాః పాణిగ్రహణం కృత్వా స్వనగర
మాగతస్య ప్రథమభార్యాం సత్కృత్యభార్యాభిస్తినృభిః
కౌండిన్యస్య సంసారకరణం, భర్తృవంచనాపాపాత్ ప్రథమ
భార్యాయాః కౌష్ఠీలాదేహావాప్తి కథనంచ॥

30వ అధ్యాయం


మాఘమాసపుణ్యప్రదానేన కౌష్ఠీలాయా ఉత్తమలోకావాప్తి
కథనం పత్యురర్థే జీవిత మపిదాస్యామీతి మోహి న్యగ్రే
సంధ్యావల్యాః కథనమ్॥

31వ అధ్యాయం


ఏకాదశీ వ్రతభంగమనిష్టం మస్యసేచేత్స్వపుత్రస్యశిరః పత్యాపహ
నికృత్యదీయతామితి మోహిన్యా వచనం శృత్వా సభార్యస్య
నిరోచనస్యాఖ్యాయికాముక్త్వా సంధ్యావల్యాప్త ద్వచో౽౦గీ
కరణమ్॥

32వ అధ్యాయం

మోహిన్యాః ప్రియచికీర్షయా స్వపుత్రం హన్తుంభర్తురగ్రే
సంధ్యావల్యా అభ్యర్థనా రాజ్ఞోన్య వరార్థే మోహిన్యాః
ప్రార్థనా ధర్మాంగదస్యపితరం ప్రతిస్వశిరః కృంతనే౽నునయ
కరణంచ॥

33వ అధ్యాయం


సంధ్యావల్యాసహా విషణ్ణేన రాజ్ఞాసుతస్య శిరః కృంతనాత్
భగవత్ప్రాదుర్భావః సభార్యస్య రాజ్ఞః సుతేన సహభగవత్సా
యుజ్యలాభః తత్ప్రసంగేన మోహిన్యా అనుతాపకరణంచ॥

34వ అధ్యాయం


మోహినీం ప్రతిబోధయితుం దైవతానాం తత్సన్నిధావా
గమనం, సాంత్వనపూర్వకం వరప్రదాన యోద్యతానాం దేవతా
నామగ్రే రాజ్ఞః పురోహితేనస్య ధిక్కారపూర్వకం మోహిన్యై
శాపప్రదానమ్॥

35వ అధ్యాయం


బ్రహ్మశాప దగ్ధాయా స్త్రైలోక్యే౽పి స్థానమాలభమానాయా
మోహిన్యాగతిప్రదానాయ సహదేవై ర్బ్రహ్మణో రాజపురోహి
తాశ్రమగమనం, తత్ప్రసాదనంచ॥

36వ అధ్యాయం


బ్రహ్మణః ప్రార్థన యా దశమీ విద్ధెకాదశ్యాం మోహిన్యై స్థాన
ప్రదానం, బ్రహ్మశాప దగ్ధాయా మోహిన్యాః పురోహి
తానుమత్యా పునః స్వశరీరలాభః సహదేవై ర్బ్రహ్మణో నిజలోక
గమనంచ॥

37వ అధ్యాయం


మోహిన్యా స్వపాపక్షాలనాయ ప్రార్థితేన వసుపురోహితేన
తీర్థాయాత్రాప్రసంగాత్కృతం గంగామాహాత్మ్యవర్ణనమ్॥

38వ అధ్యాయం


గంగాస్నానమాహాత్మ్యవర్ణనమ్॥

39వ అధ్యాయం


గంగాయాం స్థలవిశేషణ స్నానఫలకథనమ్॥

40వ అధ్యాయం


గంగాతీరే ఆరామాదికరణ నానావిధ దానఫల కథనమ్॥

41వ అధ్యాయం


గంగాతీరే గుడధేన్వాది దశధేను దానవిధానం, ఆ సంవత్సరం
గంగార్చన విధి కథనంచ॥

42వ అధ్యాయం


మాఘశుక్ల దశమ్యాం దశహరాయ గంగాయాః పూజన
విధానం తన్మాహాత్మ్యకథనంచ॥

43వ అధ్యాయం


విశాలనృపేతిహాసకథనపూర్వకం గయాయాం పిండదానాత్
పితౄణాం నరకపతితానామప్యుత్తమలోకావాప్తి రితి గయా
మహాత్మ్యకథనమ్॥

44వ అధ్యాయం

గయాయాం ప్రథమ ద్వితీయ దినయోః శ్రాద్ధపిండదాన
విధి నిరూపణమ్॥

45వ అధ్యాయం


గయాయాం తృతీయ చతుర్థ దినయోః విష్ణ్వాదిపదే పిండదాన
విధి నిరూపణమ్॥

46వ అధ్యాయం


గయాయాం పంచమే౽హ్ని గయాకూపాంతం స్నాన శ్రాద్ధ
పిండదానాది విధి మాహాత్మ్య నిరూపణమ్॥

47వ అధ్యాయం


కాశీక్షేత్ర స్థితి నానావిధ శివలింగ నిరూపణ పూర్వకం
కాశీమాహాత్మ్యకథనమ్॥

48వ అధ్యాయం


కూపహ్రద వాపీకుండాదిషు స్నాన శివపూజా పూర్వకం
కాశ్యా స్తీర్థయాత్రావర్ణనమ్॥

49వ అధ్యాయం


యాత్రాకాలకథనపూర్వకం నానావిధ శివలింగస్థాప నేతిహాస
కథనం తత్తల్లింగదర్శన పూజనఫల కథనంచ॥

50వ అధ్యాయం


కాశ్యాం గోదాయా ముత్తరవాహిన్యాం పంచనదే చ
స్నాతౄణాం మహాపాతక నిరసన పూర్వకం శివలోకా వాప్తి
కథనమ్॥

51వ అధ్యాయం


దక్షిణోదధితీరే ఉత్కలదేశే పురుషోత్తమక్షేత్రే సుభద్రాకృష్ణ
సంకర్షణారాధనే నేంద్రద్యుమ్న నృపతే ర్భగవత్పాదా వాప్తి
రిత్యాఖ్యాయికా కథన పూర్వకం పురుషోత్తమ (జగన్నాథ)
క్షేత్ర మాహాత్మ్య వర్ణనమ్॥

52వ అధ్యాయం


ఉత్కలదేశే పురుషోత్తమక్షేత్రే అశ్వమేధయాజినా, భగవన్మూర్తి
లబ్ధుకామే నేంద్రద్యుమ్న నృపేణ కృతా భగవత్స్తుతిః॥

53వ అధ్యాయం


నృపతిస్తవేన సంతుష్టో భగవాన్రాత్రౌ స్వప్నేతం ప్రబోధ్య
సింధోః కూలాశ్రితం వృక్ష ముత్పాట్యతస్య మూర్తి విధాయ
స్థాపనీయా ఇత్య శిక్షయత్. నరపతిః ప్రభాతే సింధు కూలం
గత్వా వృక్షముత్పాట్య తత్ర విష్ణు విశ్వకర్మాణావ పశ్యత్,
భగవ న్నిర్దేశాత్ కృష్ణ రామ సుభద్రామూర్తి ర్విధాయ
సుముహూర్తే౽స్థాపయత్. తతో భగవదర్చన తోరాజ్ఞో మోక్షా
వాప్తిః పురుషోత్తమక్షేత్ర మాహాత్మ్యం చ॥

54వ అధ్యాయం

జ్యేష్ఠశుక్ల ద్వాదశ్యాం పురుషోత్తమక్షేత్ర మభిగమ్యయాత్రా
విధేయా, తత్ర మార్కండేయహ్రదే శివంప్రణమ్య కల్పవృక్షం
దృష్ట్వా పురుషోత్తమదర్శనం. తత్రైవ నృసింహారాధన
విధానమ్॥

55వ అధ్యాయం


అనత మత్స్య మాధవశ్వేతమాధవ దర్శన ఫలనిరూపణం.
జ్యేష్ఠమాసే పౌర్ణిమాయాం జ్యేష్ఠా నక్షత్రే తత్ర సముద్రస్నాన
విధి నిరూపణంచ॥

56వ అధ్యాయం


సముద్రతీరే మండలకరణపూర్వకం మండలే భగవదర్చన విధిపల
కథనమ్॥

57వ అధ్యాయం


పురోషోత్తమక్షేత్రే స్నానదాన పితృశ్రాద్దాది ఫల నిరూపణం,
రాధికాశాపేన సింధుజలస్య క్షారత్వ కథనం, గోలోక నివాసి
రాధా కృష్ణ తత్వనిరూపణ ప్రసంగేన రాధా కృష్ణతఏవాఖిల
బ్రహ్మాండోత్పత్తి కథనంచ॥

58వ అధ్యాయం


గోలోకస్థిత రాధాకృష్ణయోః పంచధా రూపగ్రహణనిరూపణమ్॥

59వ అధ్యాయం


జ్యేష్ఠశుక్ల దశమీ మారభ్య పౌర్ణమాసీ పర్యంతం రామ కృష్ణ
సుభద్రా దర్శనే మహాయాత్రా ఫలావాప్తి కథనం పౌర్ణిమాయాం
భగవత్స్నాన విధినిరూపణంచ॥

60వ అధ్యాయం


పురుషోత్తమ మాహాత్మ్యసహితం తత్క్షేత్రయాత్రావిధి ఫల
కథనమ్॥

61వ అధ్యాయం


తీర్థరాజప్రయోగ తీర్థవిధిప్రసంగేన స్నానదాన శ్రాద్ధముండనాది
విధినిరూపణమ్॥

62వ అధ్యాయం


మకరసంక్రమణగతే రవౌ పంచయోజన పరిమాణ ప్రయాగరాజ
స్థితానేక విధ తీర్థస్థాన మాహాత్మ్య వర్ణనమ్॥

63వ అధ్యాయం


కురుక్షేత్ర మాహాత్మ్యే క్షేత్రప్రమాణాది నిరూపణమ్॥

64వ అధ్యాయం


కురుక్షేత్ర గత కామ్యకాదివనేషు సరస్వత్యాది తీర్థేషుచ దక్షేశ్వ
రాది శివలింగపూజావిధి సహితం, తీర్థయాత్రావిధి వర్ణనమ్॥

65వ అధ్యాయం


స్వపితుర్గృహే మహాన్యజ్ఞోత్సవం ఇతిశృత్వైకాకినీ దాక్షాయణే
శివమనాదృత్య ప్రాప్తాశివాపమానం యత్రదృష్ట్వా ప్రాణాన్
జహౌ తదేవ "హరిద్వార సంజ్ఞకంక్షేత్రం" తత్రత్య
తీర్థయాత్రావర్ణనమ్॥

66వ అధ్యాయం

బదరీక్షేత్రప్రతిష్ఠిత నరనారాయణ మాహాత్మ్య పూర్వకం తత్క్షేత్ర
యాత్రా విధివర్ణనమ్॥

67వ అధ్యాయం


గంగాతీరాదిష్ఠతి కామోదాఖ్య దేవీక్షేత్ర యాత్రా విధి
నిరూపణమ్॥

68వ అధ్యాయం


శ్రీసిద్దనాథచరిత్ర సహితం కామాక్షీ మాహాత్మ్యవర్ణనమ్॥

69వ అధ్యాయం


నానావిధతీర్థ శివలింగ విరాజిత ప్రభావక్షేత్ర యాత్రా విధి
మాహాత్మ్య వర్ణనమ్॥

70వ అధ్యాయం


యాత్రావిధాన పూర్వకం పుష్కరక్షేత్ర మాహాత్మ్య వర్ణనమ్॥

71వ అధ్యాయం


తపః ప్రభావేతిహాస కథన పూర్వకం గౌతమాశ్రమ
మాహాత్మ్య వర్ణనమ్॥

72వ అధ్యాయం


పుండరీకపురే జైమిని మునేః శివసాక్షాత్కార సంతుష్టస్య గణైః
సహ శివస్య తాండవ నృత్యాత్పరాం ముద ముపగతస్య వేద
పాదేనస్తుతిం కుర్వాణస్యాభ్యర్థనయా శివస్య నివాసాత్ తత్పురుస్య
క్షేత్ర నిరూపణం, త్య్రంబకేశ్వర క్షేత్ర యాత్రా నిరూపణంచ॥

73వ అధ్యాయం


సార్థా యోజన ప్రమాణ పశ్చిమ సముద్రతీర స్థిత గోకర్ణ క్షేత్ర
మాహాత్మ్య వర్ణనమ్॥

74వ అధ్యాయం


సంక్షేపేణ రామలక్ష్మణ చరిత ముక్త్వాంతే రామవచనాన్ని
ష్క్రాంతో లక్ష్మణో యస్మిన్నచలే యోగధారణ యాతను
మజహాత్, తస్య లక్ష్మణాచలస్య మాహాత్మ్య నిరూపణమ్॥

75వ అధ్యాయం


దక్షిణోదధితీరే రామస్థాపిత రామేశ్వర శివలింగ మాహాత్మ్య
సహిత సేతుమాహాత్మ్య వర్ణనమ్॥

76వ అధ్యాయం


నర్మదా తీర్థసంగ్రహ మాహాత్మ్య నిరూపణమ్॥

77వ అధ్యాయం


శ్రీ మహాకాళేశ్వరాధిష్ఠి తా వంతికా క్షేత్రయాత్రా
మాహాత్మ్య వర్ణనమ్॥

78వ అధ్యాయం


పద్మభువార్థితస్య భగవతో౽వతార గ్రహణాన్మథురా మాహాత్మ్య
వర్ణనమ్॥

79వ అధ్యాయం


నారదాఖ్యాయికా కథన పూర్వకం బృందావన మాహాత్మ్య
వర్ణనమ్॥

80వ అధ్యాయం

వసుర్న రపత్యు పాధ్యాయో మోహిన్యై తీర్థయాత్రా
విధిముక్తాతాం యాత్రా కరణాయ నియోజబ్రహ్మణే మోహినీ
వృత్తం, నివేద్యతతో బృందావనే తవస్తప్తుం గతవాన్, తత్ర
తస్య నారదముని నిరూపిత భావికృష్ణావతార చరిత్ర విలోక
నౌత్సుక్యా న్నివాస వర్ణనమ్॥

81వ అధ్యాయం


మోహిన్యా స్తీర్థయాత్రాకరణే నోత్తమలోకావాప్తి
వర్ణనం, దశమీవేధే మోహిన్యావస్థానాత్ ద్వాదశీ విద్ధైకాదశీ
వ్రతస్యై నోక్త ఫల దాతృ నిరూపణమ్. శ్రీ నారదీయ
పురాణోత్తర ఖండ పఠన శ్రవణఫలవర్ణనం చ॥

82వ అధ్యాయం

ఇన్నిన్నివిషయాలలో యీ నారదీయ పురాణం ఉన్నా పూర్వార్థగ్రంథం నాలుగుపాదాలుగా విభజింపబడడం ఉత్తరార్థగ్రంథం అసలు పాదవిభజనతో విభజింపబడకపోవడం - మొత్తం పురాణంలో లక్షకు పైగా శ్లోకాలు ఉండవలసి ఉండగా కేవలం 17,299 శ్లోకాలకు మాత్రమే యీ ముద్రిత సంస్కృత నారదీయమహాపురాణగ్రంథం పరిమితం అయివుండడం చూడగా యిది సుసమగ్రపురాణం కానేకాదని స్పష్టపడుతున్నది.

గతంలో పేర్కొన్న ఉపపురాణాలలో నారదీయపురాణానికి సైతం ఉపపురాణం ఉన్నట్లు గుర్తించాము. అసలు పురాణాలన్నింటికి ఉపపురాణ లున్నాయి గదా! నారదీయపురాణం అసలు అష్టాదశపురాణాలలోనే ఒకటిగా ఉన్నప్పుడు దానికి ఉపపురాణం ఆవిష్కృతం అవడంలో విచిత్రం కాని విప్రతిపత్తి కాని వుండడానికి అవకాశమే లేదు. అయితే ఒకవిశేషాన్ని యీసందర్భంలో మనం గుర్తించక తప్పదు. గతంలో పేర్కొన్న సంస్కృత ఉపపురాణాలలో నారదీయపురాణంతోపాటు "బృహన్నారదీయం" అన్నపేరుతో కొందరిమతంలో వేరొక ఉపపురాణం ఉన్నట్లు కూడా గుర్తించి వ్రాయడం జరిగింది. అయితే అసలు నారదీయ ఉపపురాణం మనకు యిటీవలకాలంలో ప్రచురితమైనట్లు కనపడదు. అది ఉపలభ్యమానమైందని కూడా చెప్పలేము. కాని తెలుగులోకి ప్రాచీనకాలంలో అనువదింపబడిన బృహన్నారదీయపురాణవిషయాలకు నారదీయమహాపురాణంగా - అంటే - అసలు పురాణంగానే భావింపబడి ముద్రింపబడిన 207 అధ్యాయాలతోను 17,299 శ్లోకాలతోను ఉన్న సంస్కృత నారదీయపురాణవిషయాలకు సాజాత్యం గోచరమవుతున్నది. ముద్రిత సంస్కృత నారదీయమహాపురాణంలో ఉన్నవిషయాలు అధ్యాయాత్మకాలుగా యథాతథంగా పూర్వమే ఉటంకించడం జరిగింది.

తెలుగులో నారదీయపురాణాలు

తెలుగులో క్రొత్తలంక విశ్వనాథకవికి పుత్రుడైన మృత్యుంజయకవి రచించిన 'బృహన్నారదీయం' అన్న పేరుతో వొకటి - కంజర్ల చెన్నయామాత్య పుత్రుడైన శ్రీమదల్లాడు నరసింహకవి విరచించిన 'నారదీయపురాణం' అన్నపేరు గల కృతివొకటి కనిపిస్తున్నది. మృత్యుంజయకవి విరచితమైన 'బృహన్నారదీయ' తాళపత్రప్రతులు మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలోనూ, కాకినాడలో వున్న ఆంధ్రసాహిత్యపరిషత్తులోనూ వున్నాయి. ఇటీవల పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంవారు సేకరించి భద్రపరచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసర్చ్ ఇన్ట్సిట్యూట్‌కు అప్పగించిన 160 తాళపత్రగ్రంథాలలోనూ మృత్యుంజయకవి విరచితమైన 'బృహన్నారదీయం' ఆరాశ్వాసాలగ్రంథంగా కొంత అసమగ్రంగా లభించింది. కీర్తిశేషులు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు ప్రకటించిన ముద్రితాముద్రితగ్రంథసూచికాగ్రంథంలో కాకినాడ, మద్రాసు, తంజావూరులలో వున్న తాళపత్రగ్రంథనామాది విషయాలు ప్రకటించడం జరిగింది. ఈగ్రంథంప్రకారం చూస్తే మద్రాసులోని ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలో వున్న మృత్యుంజయకవి రచించిన "బృహన్నారదీయం" అసమగ్రంగా వున్నట్లు, కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో వున్న 'బృహన్నారదీయపురాణం' సమగ్రంగా వున్నట్లు పేర్కొనబడింది. అల్లాడు నరసింహకవి విరచించిన 'నారదీయపురాణం' ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో అసమగ్రంగా వున్నది. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలోమాత్రం నరసింహకవికృతమైన 'నారదీయపురాణం' సమగ్రంగా వున్నది. అయితే నరసింహకవి విరచించిన నారదీయపురాణం ముద్రితమై మనకు లభిస్తున్న సంస్కృత నారదీయమహాపురాణంతో సరిపోల్చిచూస్తే యిది మహాపురాణానికి సంపూర్ణమైన అనువాదం కాదని ముందుముందు నిరూపితమౌతుంది. అయితే మృత్యుంజయకవి రచించిన బృహన్నారదీయం లభ్యమైనదానినిబట్టి చూస్తే మృత్యుంజయకవి నారదీయమహాపురాణాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువాదం చేయాలని సంకల్పించాడేమో నని అనిపిస్తుంది. మృతుంజయకవి అవతారికలో తన వంశాదికవిషయాలను ప్రస్తావిస్తూ -

"సకలవిద్వత్కవీంద్రుని సమ్మతించి
ప్రస్తుతింపంగఁ గావ్యముల్ విస్తరించి
పలుకనేర్తును నుభయభాషలను నేను
నబ్బురంబుగ మృత్యుంజయాఖ్యకవిని."

అని తనను గురించి తాను పేర్కొని ఆ తరువాత తాను రచింప బూనిన బృహన్నారదీయం గురించి యీ క్రిందివిధంగా ఉటంకించినట్లు కనిపిస్తున్నది.

"నేనాంధ్రభాష రచియింపఁబూనిన బృహన్నారదీయంబునకు నాఖ్యాయికాప్రకారం బెట్టిదనిన నిప్పురాణంబు నందు వివరింపనైన యవి యాలకింపుడు.

నైమిశవనవాసులైన మహామునులు ధర్మార్థకామమోక్షసాధనోపాయంబు లడుగ శౌనకు నొద్దకుఁ జనుటయు, నతండు అమ్మునులతోఁ గూడ సిద్ధాశ్రమంబున నున్న సూతుం జూడ నరుగుటయు, నా సూతునితోడఁ దమరు వినందలఁచిన యర్థంబు లడుగుటయు, నతండు నారదసనత్కుమారసంవాదంబైన బృహన్నారదీయంబను పురాణంబు చెప్పందలచి తన్మహత్వంబు గొనియాడుటయు, మేరుశృంగంబున నారదసనత్కుమారసంయోగంబును, సనత్కుమారుడు తమకు వినం దగిన యర్థంబులు నారదు నడుగుటయు, నారదుం డనేకప్రకారంబుల హరిం బ్రశంసించుటయు, సృష్టిప్రకారంబును, భారతవర్షమాహాత్మ్యంబును, భక్తిప్రశంసయు, నాచాప్రశంసయు, మృకండు మహాముని తపంబు సేయుటయు నాతపంబునకు వెరచి దేవత లందరు హరిశరణంబు వేడుటయు, వారి కతండు ప్రత్యక్షంబై యభయం బిచ్చుటయు, నద్దేవుండు మృకండునికి సాక్షాత్కారం బగుటయు, హరి తాన మృకండునకు కుమారుండనై పుట్టెదనని వరం బిచ్చుటయు, మార్కండేయసంభవంబును, నతని కచ్యుతుండు సకలపురాణసంహితలు దెలుపుటయు, నేకార్ణవంబున హరి పవ్వళించుటయుఁ, గాలప్రమాణపరికీర్తనంబును, మార్కండేయమహామునికి సర్వేశ్వరుండు భాగవతలక్షణం బానతిచ్చుటయు, గంగామహాత్మ్యంబును, హరిహరభేదరాహిత్యంబును, పురాణశ్రవణ గంగా గాయత్రీ తులసి భక్తివిశేషంబులును, బాహునృపతి భూపాలనంబును, నతని కహంకారంబు ప్రవేశించుటయు, హైహయులకు నోడి బాహునృపతి భార్యాసమేతంబుగా వనంబున కరుగుటయు, నతని పత్నికి శత్రువులు గరళంబు వెట్టుటయు, వారు కార్వాశ్రమంబు ప్రవేశించి యుండుటయు, నచ్చట బాహునృపతి మరణంబును, గర్భిణియైన తత్పత్ని యనుగమనంబు సేయు తలం పెరింగి వచ్చి యౌర్వముని వారించుటయు, నక్కాంతకు సగరుండను కుమారుండు పుట్టుటయు, నతం డౌర్వునివలన సకలశాస్త్రంబులు చదివి ప్రబుద్దుండై శత్రువులపైఁ జని మహాయుద్ధంబు చేసి వారల వధించి నిజరాజ్యంబు చేకొనుటయు, సగరుండు నిద్దరభార్యల వివాహం బగుటయు, నొక్కభార్యకు నరువదివేవురు పుట్టుటయు నొకర్తెకు వంశకరుండైన సుతుండొకడు పుట్టుటయు, నా యరువదివేవురును జగతులకు బాధ గావించుటయు, ననమంజసుఁడను నేకపుత్రునకు నంశుమంతుండు పుట్టుటయు, సగరుం డశ్వమేధంబు సేయ నుపక్రమించి విడిచిన యశ్వంబును నింద్రు డెత్తుకొనిపోయి పాతాళంబున కపిలసన్నిధానమున నునుచుటయు, సాగరు లరువదివేలును నచ్చటికిం జని కపిలుని కోపంబున నిహతులగుటయు, నంశుమంతుం డచ్చటికిం జని కపిలానుగ్రహంబున నశ్వంబు గొనివచ్చి యాగపూర్తి గావించుటయు నయ్యంశుమంతునకు దిలీపుండును, దిలీపునకు భగీరథుండును జన్మించుటయు, సాదాసుండను రాజు వసిష్ఠుశాపంబున రాక్షసత్వంబు నొంది గంగాజలక్షణమాత్రస్పర్శంబున శాపవిముక్తుం డగుటయు, బలి మహాదైత్యుండు దేవ, స్వర్గంబు మొదలైన దేవపదంబులు తా నాక్రమించి ప్రబలుండై యున్న యతని భంగించుటకై యదితి తపంబు చేసిన, యాయమకు హరి ప్రత్యక్షంబై తద్గర్భంబున వామనాకారంబున జనియించి, బలి యింటి కరిగి తక్షణంబ త్రివిక్రమాకారంబున సకలలోకంబులు నాక్రమించు నవసరంబునఁ దదీయాంగుష్ఠంబు సోకి బ్రహ్మాండంబు భిన్నంబై తద్వారంబున బాహ్యజలంబు ప్రవహించిన నది గంగ యనం బ్రసిద్దం బగుటయు, నంత బలిని బంధించి పాతాళంబున కనిచి, దేవతలకు రాజ్యం బిచ్చి వామనుండు తపంబు సేయ నరుగుటయు, దానప్రతిగ్రహంబుంయందు పాత్రాపాత్రంబులు వివరించుటయు, యముండు భగీరథుండను రాజుం జూడ వచ్చి యతనికి పుణ్యంబులు తత్ఫలంబులైన స్వర్గాదిభోగంబులు, పాపంబులు తత్ఫలంబులైన నరకయాతనలు చెప్పుటయును, నంత భగీరథుండు గంగావతరణనిమిత్తంబు శీతాచలంబునందు తపంబు సేయందలచి చనుచు, నానడుమ భృగుమహామునిం జూచి యతనివలనఁ గొన్నిధర్మంబులు దెలుసుకొని యంత నతనిచేత ననుజ్ఞాతుండై చని నాధేశ్వరం బన్న క్షేత్రంబున దపంబు సేయుటయు, నతనికి విష్ణుండు ప్రత్యక్షంబై మనోరథంబు ఫలియించు శివుని నారాధించుమని చెప్పిన నతం డట్లు చేసిన హరుండును బ్రసన్నుండై జటాజూటంబున నున్న గంగను భగీరథున కిచ్చిన నమ్మహానదియు నతనివెంటం జని, సాగరభస్మరాసులపైఁ బ్రవహించిన, వారందరు నూర్ధ్వలోకంబునకుం జనుటయు, ద్వాదశివ్రతమహాత్మ్యకీర్తనంబును, బూర్ణిమావ్రతప్రశంసయును, ఇతిహాసయుక్తంబైన ధ్వజారోపణవ్రతకథనంబును, హరిపంచకప్రకాశంబును, మాసోపవాసవ్రతలక్షణంబు ప్రకటించుటయు, నేకాదశీవ్రతసమాచరణంబు నితిహాసపూర్వకంబుగా నుగ్గడించుటయు, వర్ణాశ్రమాచారంబులు దెలుపుటయు, పితృకార్యప్రకారంబును, తిథినిర్ణయంబును ప్రాయశ్చిత్తవిధానంబులును, యమపురమార్గంబు వివరించుటయు, జీవులు భూలోకంబునకు వచ్చి నానావిధశరీరంబులు ధరియించుచందంబును, యోగలక్షణంబు తేటపరచుటయు, హరిభక్తిమహిమంబును, వేదమాలిచరితంబును నతని పుత్రులైన యజ్ఞమాలి సుమాలులు మోక్షంబు నొందుటయు, నుదంకమాహాత్మ్యంబును, జయధ్వజుఁ డనురాజు చరిత్రంబును, నింద్రసధర్మసంవాదంబును జతుర్యుగధర్మంబులును, కీర్తితంబు లయ్యె."

ఈపైన పేర్కొన్న విషయాలన్నీ మొత్తం అసలు నారదీయమహాపురాణానికి అనువాదగ్రంథంగా అవతరించనున్న విషయాలతో కూడిన బృహన్నారదీయపురాణవిశేషాలుగా కనిపిస్తున్నాయి. ఈ పైవచనంలో సూచితాలైన విషయాలన్నీ మృత్యుంజయకవి రచించిన ఆరాశ్వాసాలకృతిలో యిమిడివున్నాయి. అయితే యీ ఆరాశ్వాసాలలోనూ వర్ణంచబడిన విషయాలను, సంస్కృత నారదీయమహాపురాణంతో సరిపోల్చి చూస్తే యివి సంస్కృతపురాణంలో ప్రథమపాదంలోని 41 అధ్యాయాలకు మాత్రమే పరిమితమై వున్నట్లు స్పష్టపడుతున్నది. అయితే బృహన్నారదీయ ఆశ్వాసాంతగద్యలలో "మృత్యుంజయనామధేయప్రణీతంబైన బృహన్నారదీయంబను మహాపురాణంబునందు" అని బృహన్నారదీయం మహాపురాణగ్రంథంగా విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. కాని మృత్యుంజయకవి రచనగా లభించిన ఆరాశ్వాసాలగ్రంథమే సంపూర్ణగ్రంథం అయ్యేట్లైతే అది సంపూర్ణనారదీయమహాపురాణం కాజాలదు. అవతారికలో మృత్యుంజయకవి రచించిన "నే నాంధ్రభాష రచియింపఁబూనిన బృహన్నారదీయంబునకు నాఖ్యాయికాప్రకారం బెట్టిదనిన, నిప్పురాణంబునందు వివరింపనైన యవి యాలకింపుడు." అన్నవాక్యం సరిగ్గా మృత్యుంజయకవి రచించినట్లుగా యథాతథంగా వున్నదో? లేదో? చెప్పలేకుండా వున్నాము. కేవలం ఒకమహాపురాణంలోని ప్రథమపాదవిషయానికి మాత్రమే తనఅనువాదకృతిని పరిమితం చేసి, దాన్ని సంపూర్ణమహాపురాణంగా మృత్యుంజయకవి పేర్కొంటాడని మనం భావించలేము. అవతారికలో పేర్కొన్న "నే నాంధ్రభాష రచింపఁబూనిన" ఇత్యాదివాక్యంలో "నిప్పురాణంబునందుఁ బ్రథమపాదంబునందలి వివరింపనైనయవి యాలకింపుడు" అని మృత్యుంజయకవి కేవల ప్రథమపాదవిషయాలను మాత్రమే వివరించాడా! ఆరాశ్వాసాల తరువాత సప్తమాశ్వాసప్రారంభంలో ద్వితీయపాదవిషయాలను యిదేవిధంగా క్రమానుగతంగా అనేకాశ్వాసాలతో కూడిన బృహన్నారదీయపురాణంలో పాదాత్మకంగా విషయాలను విభజించి మృత్యుంజయకవి విషయానుక్రమణికను పేర్కొనదలచాడా! అని అనిపిస్తున్నది. అయితే యీసందర్భంలో 'ప్రథమపాదంబునందలి' అన్నపదాలను అసలు మృత్యుంజయకవి బృహన్నారదీయకృతికి ప్రతి వ్రాసిన వ్యక్తులు విడిచిపెట్టి వుంటారని మనం భావించవలసి వుంటుంది. కాని యీ అభిప్రాయానికి వొకవిప్రతిపత్తి సైతం లేకపోలేదు. ఒకసంస్కృతమహాపురాణాన్ని తెలుగులోకి అనువదించదలచిన యేకవియైనా అవతారికలో ఆమహాపురాణంలోని విషయాలను చెప్పదలిస్తే విభాగాలతోకాని పాదాధ్యాయాలతోకాని, ప్రమేయం లేకుండా మొత్తం మహాపురాణగతవిషయాలనన్నింటినీ పేర్కొంటాడే తప్ప, కేవలం ఏకైకపాదానికి పరిమితంకాగల విషయాలను మాత్రమే పేర్కొని అనౌచిత్యానికి పాల్పడతాడా! అన్నదికూడా ఆలోచించవలసిన విషయమే. గ్రంథగతవిషయవివరణాన్ని చేసినపుడు అవతారికలో గ్రంథవిషయసర్వస్వాన్ని సమకూర్చినట్లు నన్నయభట్టుప్రభృతుల భారతాదిగ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఏతత్ సాంప్రదాయనికి విరుద్ధంగా మృత్యుంజయకవి నారదీయమహాపురాణగతవిషయా లన్నింటినీ పాదాత్మకాలుగా విభజించి పేర్కొంటాడా! అన్నది సందేహాస్పదంగా వున్నది. అయితే వొకవిషయంమాత్రం విస్పష్టంగా, వాస్తవంగా ఆశ్వాసాంత్యగద్యలను చూచినపుడు నారదీయమహాపురాణాన్ని మృత్యుంజయకవి సుసమగ్రంగా అనువదించాలని అభిప్రాయపడ్డాడని, తన బృహన్నారదీయపురాణం సంస్కృత నారదీయమహాపురాణ అనువాదగ్రంథంగానే భావించాడని మనకు తేటతెల్ల మౌతుంది. ఈ దృష్ట్యా ప్రథమాశ్వాసగత అవతారికలో పేర్కొన్నవిషయాలు సంస్కృత మహాపురాణంలోని ప్రథమపాదగతవిషయాలు మాత్రమే అవడంవల్ల సంప్రదాయభిన్నంగా పాదాత్మకంగా విషయవివరణ చేసి బృహన్నారదీయపురాణాన్ని రచించాలని మృత్యుంజయకవి సంకల్పించి వుంటాడని మనం భావించవలసి వస్తుంది. కాగా మనకు ఉపలభ్యమానమైన తెలుగు బృహన్నారదీయం ఆరాశ్వాసాలకు మాత్రమే - అంటే సంస్కృతంలో నారదీయమహాపురాణ ప్రథమపాదానికి మాత్రమే పరిమితమై వున్నందువల్ల మృత్యుంజయకవి నారదీయమహాపురాణాన్ని పరిపూర్ణంగా అనువదించాడో లేదో చెప్పలేము. మృత్యుంజయకవి పూర్ణానువాదమే చేసివుంటే సప్తమాశ్వాసాదిగా గల గ్రంథం మనకు లభ్యం కాలేదని భావించవలసి వుంటుంది. మృత్యుంజయకవి ఆరాశ్వాసాల తరువాత మిగిలినభాగాన్ని అనారోగ్యాదికారణాలవల్లకాని, అకాలమరణంవల్లకాని విరచించి వుండకపోవచ్చునని ఊహించవలసి వున్నది. అయితే మృత్యుంజయకవి రచించబూనిన ఆరాశ్వాసాలగ్రంథంగా రచించిన బృహన్నారదీయపురాణం మాత్రం అసలు సంస్కృత నారదీయమహాపురాణాన్ని, అంటే యిప్పుడు మనకు ముద్రితమై లభ్యమౌతున్న నారదీయమహాపురాణాన్ని అనుసరించి అనువదింపబడిందనడం యథార్థం. ఈ మృత్యుంజయకవి క్రీస్తుశకం 17వ శతాబ్దంలో వున్నట్లు కనిపిస్తున్నది.

అల్లాడు నరసింహకవి కృతమైన తెలుగు నారదీయపురాణం యెనిమిది ఆశ్వాసాలతో 2317 గద్యపద్యాలతో వున్నది. మద్రాసులోని ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో ఆర్. సి. నెం. 547. కె-1-59 గారి కాగితపుసంపుటాలలో యీ యెనిమిది ఆశ్వాసాల కృతి 1918 లో తాళపత్రప్రతిని చూచి కాపీ వ్రాయడం జరిగింది. కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తులో సైతం నరసింహకవి కృతమైన నారదీయపురాణతాళపత్రప్రతి వొకటున్నది కాని అది అసమగ్రంగా వున్నది. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభండాగారంలోని 8 సంపుటాలలో వున్న వ్రాతప్రతి ఆధారంగా ప్రస్తుత నారదీయపురాణం పరిష్కరించి ప్రకటించడం జరిగింది.

నరసింహకవి కృతమైన యీ నారదీయపురాణం ముద్రితమైన సంస్కృత నారదీయమహాపురాణానికి అనువాదం కాదు. నారదీయ ఉపపురాణం మనకు ఉపలభ్యమానం కానందువల్ల నరసింహకవి కృతమైన యీ నారదీయపురాణం ఆ ఉపపురాణానికి అనువాదగ్రంథమని దృఢంగా చెప్పలేము. సామాన్యంగా ఉపపురాణాలు తొలుత మహాపురాణాలకు సంగ్రహస్వరూపంగా అవతరించినవే అయినా వాటిలో అనంతరకాలంలో వివరణాత్మకాలుగా - మూలపురాణాలలో లేనటువంటి విషయాలు - ఆ పురాణాలకు అనంతరకాలంలో అవతరించిన వివిధవిభిన్నశాస్త్రీయాలైన విశేషాలు చొప్పించడం జరిగింది. దీనివల్ల ఉపపురాణాల ప్రామాణికత దెబ్బతిన్నది. మృత్యుంజయకవి రచించిన బృహన్నారదీయం పూర్వార్థంలోని ప్రథమపాదానికి మాత్రమే పరిమితమై 41 అధ్యాయాలతో కూడిన సంస్కృతమూలానికి ఆరాశ్వాసాల అనువాదగ్రంథంగా మనకు ఉపలభ్యమానమైనది. నారదీయమహాపురాణంలో పూర్వార్థమంతా అనువాదం కావాలంటే, మరి మూడుపాదాలు, 84 అధ్యాయాలతోను మొత్తం 9545 శ్లోకాలతో వున్న (ప్రథమపాదం-3229 శ్లో. ద్వితీయ, తృతీయ, చతుర్థపాదాలు 9545 శ్లో. అనగా నాలుగుపాదాలలో మొత్తం 12774 శ్లోకాలు వున్నాయి) మిగిలినభాగం అనువదించవలసి వున్నది. విచిత్రమేమంటే నరసింహకవి కృతమైన నారదీయపురాణం 99 పాళ్లు సంస్కృతమూల నారదీయమహాపురాణంలోని ఉత్తరార్థంలో వున్న కొన్నివిషయాలకు మాత్రమే పరిమితమై సంగృహీతమై వున్నది. అయితే సంస్కృత నారదీయపురాణంలో పూర్వార్థంలో ప్రథమపాదం చివర వర్ణింపబడిన చతుర్యుగధర్మాలలోని కలియుగధర్మాలు తెలుగులో కొన్ని వివరింపబడ్డాయి. ఒకవేళ మృత్యుంజయకవి నారదీయమహాపురాణపూర్వభాగాన్నిమొత్తం అనువదించి వుంటే, అతని తరువాతికాలంలోనే వున్న నరసింహకవి దానికనుబంధంగా ఉత్తరార్థాన్ని పరిగ్రహించి దీన్ని రచించాడా అని సందేహం కలుగుతున్నది. అయితే మృత్యుంజయకవి బృహన్నారదీయపురాణరూపంగా అనుసరించిన అనువాదపద్ధతికి, నరసింహకవి అనుసరించిన అనువాదపద్ధతికి బొత్తిగా సాజాత్యం కనిపించడంలేదు. మూలపురాణంతో నరసింహకవి నారదీయపురాణాన్ని సరిపోల్చి చూచినపుడు ఉత్తరార్థంలో 3వ అధ్యాయం మొదలు 37వ అధ్యాయం వరకూ వున్న రుక్మాంగదచరిత్ర దాదాపు తెలుగులో వర్ణింపబడింది. మిగిలిన మోహినీసంబంధవృత్తాంతం - ఆమె గంగాది పుణ్యక్షేత్రాలను సందర్శించిన విషయం తెలుగులో లేదు. అంతేకాక కాశీప్రయాగాది పుణ్యక్షేత్రాలలో పిండదానవిధి నిర్ణయం - వివిధక్షేత్రమాహాత్మ్యాలూ - గంగాతీరస్థ జగన్నాథక్షేత్రాది మాహాత్మ్యాలూ యీఅనువాదంలో పరివర్జితాలయ్యాయి. భావి కృష్ణావతారచరిత్రాదివిషయాలు మాత్రం అత్యంతక్లుప్తంగా పేర్కొనబడ్డాయి. సంస్కృత నారదీయమహాపురాణంలోని పూర్వార్థాన్నిఅనువాదంలో పరిగ్రహించాలన్న దృష్టి అసలు నరసింహకవికి వున్నట్లే కనపడదు. అందువల్ల సంస్కృత నారదీయపురాణం పూర్వభాగంలోగల వివిధశాస్త్రాదివిషయాలూ సృష్టినిరూపణప్రసంగం - భూగోళవర్ణనం - భరతఖండోత్పత్తిప్రాశస్త్వవర్ణనలూ - మొదలైనవి అనేకవిషయాలు యథాతథాలుగా అనువాదితాలు కాకపోవడం ఆశ్చర్యకరంకాదు. అయితే సంస్కృతపూర్వార్థంలో వున్న కొన్ని కొన్ని విషయాలు - ఒక క్రమపద్దతిలో కాకుండా బహువ్యత్యస్తాలుగా విభిన్నప్రదేశాలలో సంగ్రహంగా ఉటంకించడం జరిగింది. కాని సంస్కృతంలో ప్రథామాధ్యాయలతో వర్ణింపబడిన నారదీయపురాణానికి మూలభూతాలైన పురాణమాహాత్మ్యకథనాది విశేషాలు కూడా తెలుగు నారదీయపురాణప్రారంభంలో నరసింహకవి వర్ణించకపోవడంవల్ల అసలు గ్రంథప్రాశస్త్యాన్నే విస్మరించిన ట్లవుతున్నది. అసలు నారదీయపురాణపూర్వోత్తరార్థాల్నే సంగ్రహపరచి వ్యత్యస్తం చేసి తన ఇష్టంవచ్చినచోట్ల కొన్నికథలను వివరించి రచించాడో, తనకు లభ్యమైన అసమగ్ర ఉపపురాణంమీద ఆధారపడి యీ నారదీయపురాణకృతిని రచించాడో, ఇదమిత్థంగా చెప్పలేము. అయితే నరసింహకవి అనువాదపద్ధతి మాత్రం నన్నయాదుల భారతాది గ్రంథాల అనువాదపద్ధతిలోనే నడచిందని చెప్పవచ్చును. కాని లభ్యమైన సంస్కృత నారదీయమహాపురాణాన్ని దృష్టిలో పెట్టుకొని చూచినపుడు నరసింహకవి కృతమైన నారదీయపురాణంలో అసలు సంస్కృతమూలంలో లేనటువంటి అనేకవిషయాలు కనిపిస్తున్నవి.

తెలుగు నారదీయపురాణ ద్వితీయాశ్వాసంలో వున్న కల్యాణతీర్థోత్పత్తి - మహిమ, సుచరిత్రుని చరిత్ర, కనకమాలిని యదుశేఖరుల కథ, యాదవాద్రివర్ణనం, చతుర్వేది కథ, ఇత్యాది విషయాలు మూల నారదీయపురాణంలో అసలు కనిపించడం లేదు. తెలుగు నారదీయపురాణంలో తృతీయాశ్వాసంలో వర్ణించిన పాషండమతభేదం, వ్యాఘ్రవానరకిరాతసంవాదం, నాళీజంఘుని కథ, తులసీమాహాత్మ్యం, ధర్మ కేతువు చేసిన నారాయణార్చనావిధానం, విష్ణుచిత్తుని కథ, న్యాసమాహాత్మ్యం, వంటివి మూలసంస్కృతపురాణంలో కానరావడం లేదు. తెలుగునారదీయపురాణంలో షష్ఠాశ్వాసంలోవున్న వైష్ణవమతవిషయాలూ, వైకుంఠలోకపంచావరణవర్ణనాదివిషయాలూ, సంస్కృతమహాపురాణంలో కానరావడంలేదు. సప్తమాష్టమాశ్వాసాలలోవున్న ప్రహ్లాదచరిత్రకాని, ప్రసంగవశాత్తూ మధ్యలో వర్ణించబడిన ధ్రువచరిత్ర కాని సంస్కృతమూలంలో కానరావడంలేదు. ఒకవేళ నరసింహకవికి లభించిన సంస్కృత ఉపపురాణప్రతిలో యివన్నీ వున్నాయేమో మనం చెప్పలేము. పురాణ ఉపపురాణాలలో భారత, భాగవతాది గ్రంథాలలోవలెనే ఉత్తర, దక్షిణ భారతదేశప్రతులలో విభిన్నత్వమున్నట్లు గతంలోనే ఒకసందర్భంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ప్రచురితమై లభిస్తున్న సంస్కృత నారదీయమహాపురాణాన్ని మృత్యుంజయకవి అనుసరించగా వేరొకదక్షిణాది సంస్కృతపురాణప్రతిని నరసింహకవి అనుసరించి యీ కృతిని రచించాడో యేమో చెప్పలేము. సరైన మూలప్రతి లభించనప్పుడు యిటువంటివాటినన్నింటినీ ఊహించి చెప్పవలసిందే కాని సరైననిర్ణయం చేసి ఇదమిత్థమని తేల్చి చెప్పలేముకదా! ఒక వేళ అతనికి లభించిన మూలగ్రంథంలో వుండివుంటే, అని అతని స్వకపోలకల్పితవర్ణనలు కాజాలవు. పాఠకపరిశోధకవిమర్శకులసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కృతమూల నారదీయపురాణభాగాలను, నరసింహకవికృత నారదీయపురాణంలోని ఘట్టాలను కొన్నింటిని తులనాత్మకపరిశీలనాదృష్టితో యీక్రింద పేర్కొంటున్నాను. వీటిల్లో కొన్ని యథామూలానువాదాలుగాను, కొన్ని అత్యంతసంగ్రహితాలుగానూ, మరికొన్ని మధ్యమంగానూ విరచింపబడినట్లు కనిపిస్తున్నాయి.

పాపేంధనస్య ఘోరస్య శుష్కార్ద్రస్య ద్విజోత్తమ।
కోవహ్నిర్దహతే తస్యతద్భావాన్వక్తు మర్హతి॥

నాజ్ఞాతం త్రిషులోకేషు చతుర్ముఖసముద్భవః।
విద్యతే తవ విప్రేంద్ర త్రివిధస్య సునిశ్చితం॥

అజ్ఞాతం పాతకం శుష్కంజ్ఞాతం చార్ద్రముదాహృతం।
భావ్యం వాప్యథవాతీతం వర్తమానం వదస్వనః॥

వహ్నినాకేన తద్భస్మ భవేదేతస్మతం మమ।

వసిష్ఠో వాచ :

శ్రూయతాం నృపశార్దూలవహ్నినాయేనతద్భవేత్॥

భస్మశుష్కంతథార్ద్రంచ పాపమస్యహ్యశేషతః॥

అవాప్యవాసరం విష్ణోర్యోనరః సంయతేంద్రియః।
ఉపవాసవరోభూత్వాపూజయేన్మధుసూదనం॥

సధాత్రీస్నానసహితో రాత్రౌ జాగరణాన్వితః।
విశోధ యతి పాపాని కితవోహియథా ధనం॥

(సం. నార. ఉత్తరార్ధం-ప్ర. అ-3శ్లో. నుండి 9శ్లో. వరకు)

క.

ఏపున శుష్కార్ద్రములౌ
పాపేంధనకోటులెల్ల భస్మము సేయన్
దీపించు వహ్ని యెయ్యది
తాపసకులనాథ! తెలుపు దయతో మాకున్.


సీ.

మూఁడులోకంబుల మునినాథ! నీ వెఱుం
        గని యది లేదు నిక్కముగఁ ద్రివిధ
కర్మ నిశ్చితము విఖ్యాతమైన జాత
        కలుషంబు లెంచ శుష్కములు జాత
కలుషంబు లార్ద్రముల్‌గా విన్నవించితి
        వార్తకెక్క నతీతవర్తమాన
భావికాలోచిత పాపేంధనంబు లే
        వహ్నిచేనడఁగుఁ బావనచరిత్ర


తే.

యనిన హరివాసరము నియతాత్మమనుజుఁ
డుపవసించి హరి భజించి యుచితభక్తిఁ
గాంచి నిశినెల్లఁ దామేలుకాంచి ధనము
జూదరియుఁ బోలెఁ బాతకస్తోమమడఁచు.

(తె. నార. చతుర్థాశ్వాసము-189పుట. 3, 4 వ.)

ఏకాదశీ సమాఖ్యేన వహ్నినాపాతకేం ధనం।
భస్మతాం యాతి రాజేంద్ర అపిజన్మశతోద్భవం॥

నేదృశం పావనం కించిన్నరాణాం భూప విద్యతే।
యాదృశం పద్మనాభస్య దినం పాతక హానిదం॥

తావత్పాపాని దేహేస్మిం స్తిష్టంతిమనుజాధిప।
యావన్నోప వసేజ్జంతుః పద్మనాభదినం శుభం॥

అశ్వమేధ సహస్రాణి రాజసూయ శతానిచ।
ఏకాదశ్యుపవాసస్యకలాం నార్హంతి షోడశీం॥

ఏకాదశేంద్రియైః పాపం యత్కృతం భవతిప్రభో।
ఏకాదశ్యుపవాసేన తత్సర్వం నిలయంవ్రజేత్॥

ఏకాదశీ సమం కించిత్ పాపనాశం నవిద్యతే ।
వ్యాజేనాపికృతారాజన్నదర్శయతి భాస్కరీం॥

స్వర్గమోక్షప్రదాహ్యేషా రాజ్యపుత్రప్రదాయినీ।
సుకలత్రప్రదాహ్యేషా శరీరారోగ్యదాయినీ॥

(సం. నార. ఉత్తరార్థం-ప్ర. అ-10 నుండి 16 శ్లో.)

వ.

వినుము రాజేంద్రా! ఏకాదశీ సముద్భవాసరంబుచే జన్మశతోద్భవంబులైన
పాతకేంధనంబులు భస్మంబగు. హరిదివసంబువంటి దివసంబు లేదు. హరి
వాసరంబున నుపవసించు తన కనేకదేహంబుల పాపంబు లుడుగు. హరివాస
రోపవాస షోడశాంశంబునకు నశ్వమేధసహస్రంబులు వాజపేయశతంబులు
సమంబులు గావు. హరివాసరోపవాసంబున నేకాదశేంద్రియకృతపాపంబు
లన్నియు నాశంబు నొందు. హరివాసరసమంబుగాఁ బాపంబులవలన రక్షించునది
యొక్కటి లేదు. ఒక్కొక్కవ్యాజంబున హరివాసరోపవాస మాచరించి
దండధరునిం జూడఁడు. స్వర్గమోక్షప్రదంబును, శరీరారోగ్యకరంబును,
సుకళత్రసుపుత్రలాభకారణంబును నగు. మఱియును,

(తె. నార. చతుర్థాశ్వాసము-190పుట. 5వ.)

నగంగా నగయా భూప నకాశీ నచ పుష్కరం।
నచాపి కౌరవం క్షేత్రం నరేవా నచదేపికా॥

యమునా చంద్రభాగాచ పుణ్యా భూప హరేర్దినాత్।
అనాయాసేన రాజేంద్ర ప్రాప్యతే హరి మందిరం॥

రాత్రౌ జాగరణం కృత్వా సముపోష్య హరేర్దినం।
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకేవ్రజేన్నరః॥

దశైవ మాతృకే పక్షే దశ రాజేంద్ర పైతృకే।
భార్యయా దశ పక్షేచ పురుషానుద్ధరేత్తథా॥

ఆత్మానమపి రాజేంద్ర ననయేతద్వైష్ణవం పురం।
చింతామణి సమాహ్యేషా అథవాపి నిధేస్సమా॥

సంకల్ప పాదప ప్రఖ్యావేదవాక్యోప మాధవా।
ద్వాదశ్యాం యేప్రపన్నాహి నరా నరవరోత్తమ॥

తే ద్వంద్వ బాహవో జాతా నాగరీకృత వాహనాః।
స్రగ్విణః పీత వస్త్రాశ్చలే యాంతి హరిమందిరం॥

ఏష ప్రభావోహి మయా ద్వాదశ్యాః పరికీర్తితః।
పాపేంధనస్య ఘోరస్య పాపకాఖ్యో మహీపతే॥

హరేర్దినం సదోపోష్యం నరైర్ధర్మపరాయణైః।
ఇచ్ఛద్భిర్విపులా న్భోగా న్పుత్రపౌత్రాదికాం స్తథా॥

హరిదిన మిహనుర్త్యోయః కరోత్యానరేణ।
నరవర సతు కుక్షిం మాతురాప్నోతినైవః॥

బహువృజిన సమేతో౽ కామతః కామతో వా
వ్రజతిపదమనంతం లోకనాథస్య విష్ణోః॥

(సం. నార. ఉత్తరార్థం-ప్ర. అ. 17 నుండి 26 శ్లో.)

క.

కురుగంగా కాశీ పు
ష్కర రేవావేణికా వికర్తన తనయా
సరయూ గయాది తీర్థము
లరయన్ సరియనఁగఁ దగునె హరిదినమునకున్.


మ.

అవనీనాయక! కల్గులోకుల కనాయానంబునన్ నేఁడు వై
ష్ణవధామం బుపవాసజాగరము లిచ్చంజేయ నేకాదశిన్
సవిశేషంబుగ మాతృపక్ష పితృపక్ష స్వప్రియాపక్ష వం
శవతంసంబులు వార్తగాఁ బదియు మోక్షంబందుఁ దానుందగున్.


క.

ఏకాదశి చింతామణి
యేకాదశి కామధేను వింద్రమహీజం
బేకాదశి మోక్షప్రద
మేకాదశి వేదమార్గ మేకాదశియే.


శా.

ద్వాదశ్యుత్సవ మాచరించు నరుఁ డుద్యద్దోశ్చతుష్కరంబుతోఁ
గాదే నాహితదివ్యవాహనముతోఁ గౌశేయవస్త్రంబుతో
నాదిత్యుల్ గొనియాడ నా హరిపురోదంచన్మణీవేదికన్
మోదంబందుచునుండు వైష్ణవసభాముఖ్యుల్ ప్రశంసింపఁగన్.

కం.

హరివాసరోపవాసాం
తరమున జన్మాంతరముం దరలని పాపాం
తరములు జననీగర్భాం
తరవిణ్మూత్రాదిలిప్తతయుఁ దొలఁగు ధరన్.

(తె. నార. - చతుర్థాశ్వాసము, 190-191 పుటలు-6 నుండి 10 ప.)

వసిష్ఠ ఉవాచ :-
ఇమమే వార్థముద్దిశ్య నైమిశారణ్య వాసినః।
ప్రప్రచ్ఛుర్మునయః సూతం వ్యాసశిష్యం మహామతిం॥

సతుపృష్టో మహాభాగ ఏకాదశ్యాః సువిస్తరం।
మాహాత్మ్యం కథయామాన ఉపవాసవిధిం తథా॥

తద్వాక్యం సూతపుత్రస్య శృత్వా ద్విజవరోత్తమాః।
మాహాత్మ్యం చక్రిణశ్చాపి సర్వపాపౌఘశాంతిదం॥

పునః ప్రస్రచ్ఛురమలం సూతం పౌరాణికం నృప।
అష్టాదశపురాణాని భవాన్ జానాతి మానద॥

కానీనస్య ప్రసాదేన మహాభారత ముప్యుత।
తన్నాస్తి యన్నవేత్సిత్వం పురాణేషు స్మృతిష్యపి॥

చరితే రఘునాథస్య శతకోటి ప్రవిస్తరే।
అస్మాకం సుంశయః కశ్చిద్దృదయే సంప్రవర్తతే॥

తంభవానర్హతి ఛేత్తుం యాథార్థ్యేన సువిస్తరాత్।
తిథేః ప్రాంత ముపోష్యం స్యాదాహోస్వి న్మూలమేవచ॥

దైవేపైత్ర్యే సమాఖ్యాహి నావేద్యం విద్యతేతవః।
సౌతిరువాచ:-
తిథేః ప్రాంతం సురాణాంహి ఉషోష్యం ప్రీతివర్ధనం॥

మూలం తిథేః పితౄణాంతు కాలజ్ఞైః ప్రియమీరితమ్।
అతః ప్రాంత ముపోష్యంహి తిథే ర్దశఫలేప్సుభిః॥

మూలంహి పితృతృప్త్యర్థం విజ్ఞేయం ధర్మకాంక్షిభిః।

(సం. నార. ఉత్తరార్థం-ద్వి. అ. ప్రథమపాదం 1 నుండి 10 శ్లో.)

వ.

ఈ ప్రశ్నంబె నైమిశారణ్యవాసులు వ్యాసశిష్యుండగు సూతునిం జూచి
మహాభారతంబు మొదలుకొని యష్టాదశపురాణంబులు నీ వెఱుంగనివి
లేవు. వేదశాస్త్రపురాణస్మృతులందు లేనిది యెద్దియును లేదు. కావున
సర్వంబును నీ వెఱుంగుదువు. మాహృదయంబుల నింత సంశయం బున్నది.
తత్సంశయంబు దీర విస్తరంబున నెఱిగింపు. తిథిప్రాంతంబున నుపవసింప
వలయునో? తిథిమూలంబున నుపవసింపవలయునో? అందు దేవపితృ
కార్యంబులకు నుపయోగించినయవి యెఱింగింపవే యని యడిగిన నా
సూతుండు శౌనకాదుల కిట్లనియె. తిథ్యంతంబున దేవపితృహితంబుగా నుప
వసింపవలయును. తిథిమూలంబునఁ బైతృకం బాచరింపవలయు.

(తె. నార-చతుర్థాశ్వాసము-191 పుట. 41 వ.)

పూర్వవిద్ధానకర్తవ్యా ద్వితీయాచాష్టమీ తథా॥

షష్ఠీచైకాదశీ భూపధర్మకామార్థలిప్సుఖిః।
పూర్వవిద్ధా ద్విజశ్రేష్ఠాః కర్తవ్యా సప్తమీసదా॥

ధర్మశ్చ పౌర్ణమాసశ్చ పితుః సాంవత్సరం దినం।
పూర్వవిద్ధాని మాలస్త్యక్త్వాం నరకం ప్రతిపద్యతే॥

హానించ సంతతే రూపదౌర్భాగ్యం సమవాప్నుయాత్।
ఏత చ్ఛృతం మయావిప్రాః కృష్ణద్వైపాయనాత్పురా॥

ఆదిత్యోదయవేలాయాం యాతో కాపి తిథిర్భవేత్।
పూర్వవిద్ధాతు మంతవ్యా ప్రభూతానోదయం వినా॥

(సం. నార. ఉత్తరార్ద. ద్వి. అ. 10శ్లో. నుండి 14 శ్లో.)

ఆ.

సాధు లాద్వితీయషష్ఠి యష్టమి భూత
తిథి హరిదివసములఁ దెలిసి పూర్వ
విద్ధయైన దాని విడువనగుఁ ద్రివర్గ
కాంక్షు లుపవసింపఁగాదు ధరను.


సీ.

వాసిగాఁ బ్రాతి సాంవత్సరీక దశమి
         పౌర్ణమాసీ దరశి భవ్యతిథులు
పూర్వవిద్ధములైనఁ బూని సేయఁగఁ దగు
         నట సేయకుండిన నతఁడు ఘోర

అల్పాయామథ విప్రేంద్ర ద్వాదశ్యా మరుణోదయే।
స్నానార్చనక్రియాకార్యా దానహోమాదిసంయుతా॥

త్రయోదశ్యాంహి శుద్ధాయాం పారణేపృథివీ ఫలం।
శతయజ్ఞాధికం వాపినరః ప్రాప్నోత్యసంశయం॥

ఏతస్మాత్కారణాద్విప్రాః ప్రత్యూషః స్నానమాచరేత్।
పితృతర్పణ సంయుక్తం న దృష్ట్వా ద్వాదశీ దినం॥

మహాహానికరాహ్యేషా ద్వాదశీలంఘితానృభిః।
కరోతి ధర్మహరణ మస్నాతేవ సరస్వతీ॥

మయే వాప్యధవావృద్ధౌ సంప్రాప్తేవా దినోదయే।
ఉపోష్యా ద్వాదశీపుణ్యా పూర్వవిద్ధాం వివర్జయేత్॥

(సం. నార. ఉత్తరార్థం-ద్వి. అ. 21 నుండి 21 శ్లో.)

కం.

ద్వాదశి యల్పమయిన నరు
ణోదయమున లేచి స్నానహోమార్చన దా
నాదికము సేయఁదగు నా
వేదజ్ఞుల కెల్ల ధర్మవృత్తి యెసంగన్.


కం.

శుద్ధిఁ ద్రయోదశి సత్క
ర్మోద్ధతిఁ బారణ యొనర్చి యురుధాత్రదా
నోద్ధతబల మున్నతయ
జ్ఞోద్ధరణబలంబు మనుజుఁ డొందుచునుండున్.


సీ.

అదిగాన ద్వాదశి యల్పమయినను స్నా
         న పితృతర్పణము లెన్నంగనాడి
జరపి తద్ద్వాదశి సాధింపవలయు సా
         ధింపకుండిన మహోదీర్ణవర్ణ
హానియు నిజధర్మహానియు నగు సమ
         గ్రముగ నస్నాత సరస్వతి గతి
భూరిదోషంబులు పుట్టిన నణఁగించి
         వర్తించు శ్రీహరి వాసరంబు


తే. గీ.

నకును ద్వాదశియే మహోన్నతఫలప్ర
దయగు వృద్ధిదినక్షయాంతరములందు
నపరిమితభక్తి ద్వాదశియందు నుపవ
సింపఁగాఁ దగు విద్ధ వర్జింపవలయు.

(తె. నార. చతుర్థాశ్వాసము-192, 193 పుట. 11నుండి 17 వ.)

బ్రాహ్మణ ఉవాచ :-

యదాచ ప్రాప్యతేసూత ద్వాదశ్యాం పూర్వసంభవా
తదోపవాసోహికథ కర్తవ్యో మానవైర్వద॥

ఉపవాసదినంవిద్ధం యదాభవతి పూర్వయా।
ద్వితీయే౽హ్ని యదానస్యాత్స్వల్పాప్యేకాదశీతిథిః॥

తత్రోపవాసో విహితః కథం తద్వన సూతజ।

(సం. నార.ఉత్తరార్థం-ద్వి. అ. 26నుండి 28శ్లో.)

వ.

మఱియు ద్వాదశి పూర్వసంయుతయై యొప్పుచుండు నప్పు డుపవాసంబు
నరు లెల్లం జేయవలయునన నుపవాసదినము పూర్వవిద్ధయై ద్వితీయ దినము
నందు లేకయుండిన నేకాదశి యె ట్లాచరింపవలయు ననిన సూతుం
డిట్లనియె.

(తె. నార. చతుర్థాశ్వాసము-193 పుట. 18వ.)

యదా నప్రాస్యతే విప్రా ద్వాదశ్యాం పూర్వసంభవం।
రవిచంద్రార్క జాహంతు తదో పోష్యం పరం దినం॥

(సం. నార-ఉత్తరార్థం-శ్లో.28, 2వపాదం-నుండి శ్లో.29, 1వ పాదం.)

తే. గీ.

ద్వాదశీదినమునఁ బూర్వవాసరంబు
నందునేనియు సూర్యచక్రార్థమాత్ర
మొందినను బరదినమున నుపవసింప
యుక్తమైయుండు సజ్జను లుల్లసిల్ల.

(తె.నార. చతుర్థాశ్వాసము-193 పుట. 19 ప.)

బహ్వాగమ విరోధేషు బ్రాహ్మణేషు వివాదిషు।
ఉపోష్యా ద్వాదశీ పుణ్యాత్రయోదశ్యాంతుపారణం॥

(సం. నార-ఉత్తరార్థం-ద్వి. అ-శ్లో.29, 2వ పాదంనుండి-శ్లో.30 1వ పాదం)

వ.

అనేకాగమవిరోధంబులు నైననే మి? బ్రాహ్మణులు వివాదించిన నేమి?
ద్వాదశ్యుపవాసంబునుం ద్రయోదశి పారణయుం జేయవలయు.

(తె. నార.చతుర్థాశ్వాసము-193 పుట. 20. వ.)

ఏకాదశ్యాంతు విద్ధాయాం సంప్రాప్తే శ్రవణేతథా।
ఉపోష్యా ద్వాదశీ పుణ్యపక్షయో రుభయోరపి॥

(సం. నార. ఉత్తరార్థం-ద్వి-అ-శ్లో. 30, 2వ పాదంనుండి శ్లో. 31, 1వపాదం)

తే. గీ.

అరయ నేకాదశి యవిద్ధయైననేని
శ్రవణమునఁ గూడి పాపసంక్షయ మొనర్చు
నట్టి ద్వాదశి యుపవాస మందవలయు
ఘనతమై శుక్లకృష్ణపక్షముల యందు.

(తె. నార. చతుర్థాశ్వాసము-193 పుట. 21 ప.)

ఏషవో నిర్ణయ ప్రోక్తోయయా శాస్త్ర వినిర్ణయాత్।
కిమన్య చ్ఛ్రోతు కామాహ తద్భవంతో బృవంతుమే॥

ఋషయః ఊచుః :-
యుగా దీనాం వద విధిం సౌతేసమ్యగ్యథాతథం॥

(సం. నార. ఉత్తరార్థం-శ్లో. 31. 2వ, పాదనుండి శ్లో. 32 వరకు)

వ.

ఏకాదశీద్వాదశీనిర్ణయంబు తెలిపితి మఱియుం దెలియవలయునని యడుగుం
డనిన ఋషులు యుగాదినిర్ణయం బడిగిన సూతుం డిట్లనియె.

(తె.నార.చతుర్థాశ్వాసము-193 పుట. 22 వ.)

సౌతిరువాచ :-
ద్వేశుక్లే ద్వేతథా కృష్ణేయుగాద్యాః కవయో విధుః।

శుక్లే పూర్వాహ్ణికేగ్రాహ్యే కృష్ణేగ్రాహ్యే పరాహ్ణికే।
అయనం దినభాగఢ్యం సంక్రమః షోడశః ఫలః॥

పూర్వేతు దక్షిణభాగే న్యతీతే చోత్తరోమతః।
మధ్యకాలేతు విషువేత్వక్షయాపరికీర్తితా॥

జ్ఞాత్వావిప్రాస్థితిం సమ్యక్సాంవత్సర సమీరితాం।
కర్తవ్యో హ్యుపవాసస్తు అన్యథా నరకం న్రజేత్॥

పూర్వ విద్ధాం ప్రకుర్వాణోనరో ధర్మం నికృంతతి।
సంతతేస్తు వినాశాయ సంపదాం హరణాయచ॥

ఫలవేధేపి విప్రేంద్రా దశమ్యా వర్జయేచ్ఛివాం।
సురాయా విందునాస్పృష్టం యథాగంగాజలం త్యజేత్॥

శ్వహతం పంచగవ్యంచ దశమ్యా దూషితాం త్యజేత్।
ఏకాదశీం ద్విజశ్రేష్ఠాః పక్షయోరుభయో రపి॥

పూర్వవిద్ధా పురాదత్తా సాతిథిర్యదుమౌలినా।
దానవేభ్యో ద్విజశ్రేష్ఠాః ప్రీణనార్థం మహాత్మనాం॥

అకాలే యద్ధనం దత్తనుపాత్రేభ్యో ద్విజోత్తమాః।
సంకృద్ధైరపి యద్ధత్తం యద్దత్తం చాప్యసత్కృతం॥

పూర్వ విద్ధతి ధౌదత్తం నద్ధత్తముసురేష్వథ।
యదుచ్ఛిష్టేన దత్తంతు యద్దత్త నతితేష్వపి॥

స్త్రీజితేఘచ యద్దత్తం యద్దత్తంజలవర్జితం।
పునఃకీర్తన సంయుక్తం తద్దత్తమసురేషువై॥

తస్మాద్విప్రానకర్తవ్యా విద్దాప్యైకాదశీతిథిః।
యథాహంతిపురా పుణ్యం శ్రాద్ధంచ వృషలీపతిః॥

దత్తం జప్తం హుతం స్నాతంతథాపూజాకృతాహరే।
తిథౌ విద్ధేక్షయంయాతి తమః సూర్యోదయేయథా॥

జీర్ణం పతింయౌవన గర్వితాయథా।
త్యజంతినార్యో ఝషకేతునార్దితాః॥

తథాహివేదం విబుధాస్త్యజంతి।
తిథ్యంతరం ధర్మ వివృద్దయే సదా॥

(సం. నార. ఉత్తరార్థం. ద్వి. అ. శ్లో. 33, 2 వ పాదం నుండి శ్లో. 46 వరకు)

సీ.

అనఘాత్ములార! యుగాదులు శుక్లప
         పక్షమునందుఁ గృష్ణపక్షమునందు
రెండు రెండఁగ వర్తిల్లు వైశాఖ శు
         క్ల తృతీయయుం గార్తిక సితపక్ష
నవమి నభస్య కృష్ణ త్రయోదశి మాఘ
         పంచదశమియును బావనములు
గ్రాహ్యంబు శుక్లపక్షమునఁ బౌర్వాహ్నిక
         మావరాహ్ణికము గ్రాహ్యంబు కృష్ణ


తే. గీ.

పక్షమున నయనము దినభాగకంబు
సంక్రమణము షోడశాంశంబునదియె
నిది యెఱింగి బుధోత్తము లెల్ల సకల
దానములు సేయవలయు ననూనమహిమ!

తే. గీ.

ఉత్తరాయణ ముడిగి సూర్యుండు వేగ
దక్షిణాయనమున కేఁగు తఱి మెలంగు
మధ్యకాలంబు విషమమై మహిఁ జెలంగు
నదియె ముక్తకనామధేయము వహించు.


మ.

తిథి సాంవత్సరికోపదేశమున బుద్ధింజాల శోధించి సు
ప్రధిత శ్రీ నుపవాస మున్ననగు ధర్మంబున్ శుభంబున్ మనో
రథముల్ సద్గతులున్, మహాదురిత చర్యంబూర్వ సంవిద్ధయౌ
తిథియందే యుపవాసమున్నఁ గలదే తేజంబు పుణ్యస్థితుల్.


తే. గీ.

ఉత్తమోత్తమమైన గంగోదకంబు
నందు సురబిందుమాత్రంబు నందెనేని
యతిపవిత్రంబు గాని యట్లయ్యె దశమి
హరిదినమునఁ గళామాత్ర మంటెనేని.


ఆ.

ఉభయపక్షముల మహోత్తముండగు కుశ
కేతుఁ డఖిల దనుజజాతి యాత్మఁ
బొంగి సన్నుతింపఁ బూర్వ విద్దములైన
తిథుల నుపవసింపఁ దెలిపె మున్ను.


సీ.

తర్కింపఁగ నకాలదత్తమ పాత్ర ద
        త్తం బన త్కాలదత్తంబు క్రోధ
దత్తంబు పూర్వ విద్ధతిథి దత్తంబు ను
        చ్ఛిష్టదత్తంబును శ్రితజనైక
దత్తంబు పతితదత్తం బేకవస్త్రతా
        దత్తంబు జలవరదత్త మగ్ర
కీర్తన దత్తంబు కేవలాసురజన
        ప్రీతికరంబు ధాత్రీస్థలమున


తే. గీ.

నట్లుగావున విద్దమౌ హరిదినమున
నుపవసించినఁ బూర్వపుణ్యోత్కరంబు
లణఁగు వృషలీపతి యొనర్చినట్టి శ్రాద్ద
కర్మమును బోలె సకలలోకములు నెఱుఁగ.


తే. గీ.

చక్రధరనామకీర్తన స్తవన భజన
జప్తదత్త హృతస్నాత సవన ముఖ్య
ములును బోవుఁ దిథిని వేధమున మహోద్భ
టాంధతమసంబు సూర్యోదయమునఁ బోలె.

కం.

ముదిసిన మగనిన్ యౌవన
మదవతులైయున్న సతులు మనసిజకేళిన్
గదియని యట్లనె వేదా
స్పదమగు తిథియందు ధర్మసంఘము దొలఁగున్.

(తె. నార. చతుర్థాశ్వాసము. 194,195 పుటలు. 23నుండి 30 ప.)

ఋషయః ఊచుః :-
విస్తరేణ సమాఖ్యాహి విష్ణోరారాధన క్రియాం।
యయాతోషం సమాయాతి ప్రదదాతి సమీహితం॥

లక్ష్మీభర్తా జగన్నాథోహ్య శేషాఘౌఘనాశనః।
కర్మణాకేన సప్రీతో భవేద్యః సచరాచరః॥

సౌతిరువాచ :-
భక్తిగ్రాహ్యో హృషీకేశోనధనైర్ధరణీధర।
భక్త్యా సంపూజితో విష్ణుః ప్రదదాతి మనోరథం॥

తస్మాద్విప్రాః సదాభక్తిః కర్తవ్యాచక్రపాణినః।
జలేనాపి జగన్నాథః పూజితః క్లేశహాభవేత్॥

పరితోషం ప్రజత్యాశు తృషితస్తుజలైర్యథా।
అత్రాపిశౄయతే విప్రా ఆఖ్యానం పాపనాశనం॥

రుక్మాంగదస్య సంవాద మృషిణా గౌతమేనహి।

(సం. నార. ఉత్తరార్థం-తృ. అ. 1వ శ్లో. నుండి 6వ శ్లో. 1 వ పాదంవరకు)

వ.

అనిన విని ఋషులు శ్రీ భగవదారాధనక్రియ విస్తరంబున నెఱింగింపు
మెందున హరి ప్రసన్నుండై సమీహితంబు లిచ్చు ననిన సూతుండు భక్తియే
ప్రధానంబు. భక్తియుక్తుండై జడుండేని భగవంతుం బూజించిన గ్లేశంబు
లణంగు తృష్ణ నొందినవాఁడు జలంబునఁ దృప్తుండైన కరణిఁ బూజించిన
మాత్రనె హరి పరితోషంబు నొందు నిందునకుఁ బాపనాశనం బగు. ఋషి
గౌతమసంవాదంబు నందునైన రుక్మాంగదోపాఖ్యానంబు విన్నవించెద
వినుండు.

(తె. నార. చతుర్థాశ్వాసము-195 పుట. 31వ.)

నారదీయపురాణ కృతికర్త వంశాదికం - కాలం

అసాధారణమైన ఒకానొకవిశిష్టతగల తెలుగుకృతిగా నారదీయపురాణాన్ని విరచించిన అల్లాడు నరసింహకవి ఈక్రిందిపద్యాలలో తనవంశాదివిశేషాలను వర్ణించాడు.

శ్రీమద్వేద మయాంగు శోభనకళా శృంగార లీలా మహో
ద్దామున్ శ్రీరమణీ మనోహర హయోత్తంసంబు, సమ్యక్పురా
ణామోఘార్ధ శుభాంజనంబుఁ బతగాధ్య క్షోత్తముంగన్న యా
ధీమద్గ్రామణి కశ్యపాహ్వయుఁడు కీర్తిన్‌ మించె లోకంబులన్.


తద్వంశంబున

కరుణాకర మంత్రీంద్రుఁడు
కరుణా వరుణాలయుండు గంభీరుండా
తరుణార్క దివ్యతేజుం
డరుణానుజ రాజరాజితాత్మఁడు గలిగెన్.

ఆ మహామహుభార్య విఖ్యాతచర్య
సారగుణధుర్యయైన నాంచారు చారు
భాగ్య సౌభాగ్యకీర్తి యాపద్మపద్మ
సద్మముననుండి కావించె సద్వ్రతముల.

రామానుజాచార్య రత్నకల్పిత చతు
        స్సింహాసనస్థసుశ్రీ భజించి
యుభయ వేదాంత మహోన్నత సాత్వికా
        చారలక్షణ సత్ప్రశస్తిగాంచి
శ్రీకృష్ణపూజా విశేషలబ్ధ సమస్త
        సౌశీల్యగరిమచేఁ జాలమించి
ప్రాక్తన దివ్య ప్రబంధాను సంధాన
        సంతత మహిమఁదేజము వహించి
వెలసె వైష్ణవమాత్రుఁడె విబుధకోటి
యాశ్రయింపంగ సద్భక్తి నాదరించె
సిరుల నల్లాడు చెన్నప్ప శ్రీకరంపు
భావభావుక కీర్తి ప్రసన్నమూర్తి.

మా జనకుఁడు చెన్నప్ప ర
మాజనక గభీరతా సమగ్రత మించెన్
రాజోత్తములున్ వైష్ణవ
రాజోత్తములున్ నుతింప బ్రజ్ఞాశక్తిన్.

ఆంబకుజోడు పంచవిశిఖాంబకుజోడు విదేహరాజ జా
తాంబకుజోడు సాయక శయాంబకుజోడు పతంగలోక రా
జాంబకుజోడు మజ్జననియై భువనంబుల మించినట్టి కృ
ష్ణాంబ గుణావలంబ విబుధావళినేలు భళీభళీయనన్.

లక్ష్మీసమాఖ్యయౌ లలనతో గృహమేధి
       భావంబుచేఁ జాలఁ బ్రబలినాఁడఁ
గవిత వైభవులు సింగన్న యనంతుండు
      నాదిగా పుత్రుల నందినాఁడ
శోభితాప స్తంభ సూత్ర పవిత్ర కీ
      ర్తిస్ఫూర్తిచే వర్తిల్లినాఁడ
నఖిలవైష్ణవరహస్యార్ధోపదేశంబు
      లనుపమభక్తిమై నందినాఁడ
నందనందన పూజనందవార్ధి
నోలలాడుచు సద్గోష్ఠినున్నవాఁడ
సూరిమాన్యుండ నల్లాడు నరసింహ
నామకుఁడ సంతతగురు ప్రణామకుండ.

ఈ పై పద్యాల ననుసరించి నారదీయపురాణ కృతికర్తయైన అల్లాడు నరసింహకవి వంశం ఈక్రిందివిధంగా అవతరించినట్లు అవగతమవుతున్నద

కశ్యపుడు

కాశ్యప వంశం

ఆ వంశంలో

అల్లాడుమంత్రి - నాంచారు (భార్య)

చెన్నప్ప - కృష్ణాంబ (భార్య)

నరసింహకవి - లక్ష్మి (భార్య)

సింగన్న - అనంతుడు - ఇంకా మరికొందరు పుత్రులు.

నరసింహకవి తాతయైన మంత్రి ఉదారశీలుడుగాను, దయామయుడుగాను, అతనిభార్యయైన నాంచారు గొప్పవ్రతశీలిగాను వర్ణించబడింది. నరసింహకవి తండ్రి యైన చెన్నప్ప మహాపండితుడై శ్రీకృష్ణభక్తుడై ఉభయవేదాంత మహాసారలక్షణలక్షితుడై రామానుజాచార్య రత్నమయ చతుస్సింహాసనా ప్రవృద్దకారకుడై ప్రాక్తన దివ్యప్రబంధానుసంధాన నిరంతర మహిమకలవాడై వైష్ణవులలో అగ్రగామిగా మహాకీర్తి వహించాడట. చెన్నప్ప సతీమణి కృష్ణాంబ మహాసౌందర్యవతియై సద్గుణశోభితగా విద్వాంసురాలుగా అనేక ప్రశంస లందుకున్నదట.

లక్ష్మీనరసింహకవి దంపతులకు సింగన్న, అనంతుడు మొదలైన పుత్రులు కలిగారట. వీరి కెందరు పుత్రులు గలిగారో వారందరినీ పేర్కొనలేదు. సింగన్న, అనంతులు నామాలు రెండు మాత్రమే పేర్కొన్నాడు. తన పుత్రులు సైతం కవితావైభవులుగా చాటుకున్నాడు. శ్రీకృష్ణభక్తుడు. అనుపమమైన భక్తితో సమస్తవైష్ణవరహస్యార్థాల నన్నింటినీ గురువులద్వారా ఉపదేశం పొందిన పండితుడు. ఈ నరసింహకవి తనది ఆపస్తంభసూత్రంగా పేర్కొన్నాడు. నరసింహకవి యింటిపేరు "అల్లాడు" వారుగా కొన్నిచోట్ల "అల్లాడ" వారుగా మరికొన్నిచోట్ల కనిపిస్తున్నది. నరసింహకవి తన కవితాపాండితీబహుముఖప్రతిభలకు మూలకారకులైన తన గురువు కొండమాచార్యులగురించి వారి వంశంగురించి ఈ క్రింది పద్యాలు విరచించాడు.

ఏదేశికాధీశుఁ డిద్ధ బుద్ధి స్ఫూర్తి
        బ్రహ్మరాక్షసుల శాపం బణంచె
నేదేశికోత్తముఁ డెదిరించి నిలిచిన
        భక్తికిఁ జక్రాంకశక్తి యొసఁగె
నేదేశికాధ్యక్షుఁ డేకశిలాపురి
       నిజమతంబంతయు నిర్వహించె
నేదేశికాశ్రేష్ఠుఁ డాదియై రామాను
       జాచార్య విజయధ్వజాంకమయ్యె
నతఁడు వైష్ణవవీరసింహాసనస్థుఁ
డుభయవేదాంతవిద్యామహోన్నతుండు
శుద్ధసాత్వికధర్మప్రసిద్ధకీర్తి
శాలి కంచర్ల కేశవార్యమౌళి.

తద్వంశంబున
సిరులన్ సద్గురుశేఖరుం డనఁగ మించెన్ గొండమార్యుఁ డా
హరియే యీ ఘనుడంచు శిష్యవరు లాత్మాయత్తులై కొల్వఁగా
వరవేదాంతరహస్యవేదియు భరద్వాజర్షి గోత్రాబ్ధిభా
సురశీతాంశుఁడునై ప్రసిద్ది వెలసెన్ సూరుల్ ప్రశంసింపఁగన్.

ప్రాచీనకాలంలో కంచర్ల కేశవాచార్యుడనే వైష్ణవమతస్థుడైన మహానుభావుడు మంత్రోపాసనార్చనాబలంతో, విష్ణుమహిమతో ఉభయవేదాంతవిద్యామహోన్నతుడై వీరవైష్ణవపీఠాధిపుడై ప్రఖ్యాతి వహించాడట. బ్రహ్మరాక్షసుల్ని శాపంతో అణచాడట. ఈ సందర్భంలో నరసింహకవి వ్రాసిన "ఏదేశికాధీశుఁడిద్ద బుద్ది స్ఫూర్తి బ్రహ్మరాక్షసుల శాపంబణంచె" అన్నపాదానికి బ్రహ్మరాక్షసులను శాపంతో అణచాడనీ, బ్రహ్మరాక్షసులను శాపవిముక్తులుగా చేశాడనీ రెండు విధాలుగానూ అర్థం చెప్పవచ్చును. కేశవాచార్యుడు తన్నెదురొడ్డి నిలిచిన ఒకానొకశక్తిని సైతం లొంగదీసుకొని చక్రాంకితాలు వేశాడట! వరంగల్లును వైష్ణవమతమయంగా మార్చి తన హస్తగతం చేసుకొని రామానుజాచార్యుని విజయధ్వజాంకంగా నిలిచాడట! ఈ కేశవాచార్యుని వంశంలో భరద్వాజగోత్రికుడై సాక్షాత్తు శ్రీహరియే యీ కొండమాచార్యులుగా అవతరించాడు అని శిష్యవరులు కొలువగా వేదాంతరహస్యజ్ఞుడై యెంతో కీర్తి వహించాడట. ఈకొండమాచార్యులే ప్రస్తుత నారదీయపురాణకృతికర్తయైన అల్లాడు నరసింహకవికి గురువు. ఈ కొండమాచార్యులు కీర్తిశేషులైన తరువాతనో సజీవులై వుండగనేనో ఒకనాడు నరసింహకవికి స్వప్నంలో కనిపించి నారదీయ సాత్వికపురాణాన్ని లోకోపకారార్థంగా ఆంధ్రభాషలో విరచించి శ్రీకృష్ణుని కంకిత మీయవలసిందిగా ఆజ్ఞాపించాడట. తదాజ్ఞమేరకు శ్రీకృష్ణాంకితంగా ఈ నారదీయపురాణాన్ని నరసింహకవి రచించాడు.

నరసింహకవి సంస్కృతకవులలో క్రీస్తుశకం 11వ శతాబ్దంలో వున్న జయదేవకవిని సంస్తుతించాడు. తెలుగుకవుల్లో ప్రత్యేకించి కవిత్రయాన్ని మాత్రమే ప్రస్తుతించాడు. కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రగడ క్రీ. శ. 13వ శతాబ్ది లోని వాడు, కాబట్టి మన ఈ అల్లాడు నరసింహకవి క్రీస్తుశకం 13వ శతాబ్దికి తరువాతి వాడేనని దృఢంగా చెప్పవచ్చును.

కవి ప్రారంభంలో ఇష్టదేవతాస్తుత్యాదికం చేస్తూ శ్రీకృష్ణుణ్ని - రుక్మిణీదేవిని - ఆదిశేషువును - చింతామణిని - పంచాయుధుని - విడివిడి పద్యాలలో కీర్తించాడు. ద్రావిడవేదానికి మూలకర్తయైన పరాంకుశ మహాయోగిని - భాష్యకారాది ఆచార్యవర్యులను ఒక సీసపద్యంలో నుతించాడు. అనంతరం రామాయణ భారతకర్తలైన వాల్మీకి వ్యాసులను ఒక పద్యంలో నుతించి, కాళిదాసు - భవభూతి - మురారి - మయూర - బాణ - శంకర - జయదేవ - మాఘ ప్రభృతులైన సంస్కృతకవివర్యులను వేరొకపద్యంలో ప్రస్తుతించాడు. తరువాతి పద్యంలో తెలుగులో కవిత్రయంగా ప్రసిద్ధివహించిన నన్నయ - తిక్కన - ఎఱ్ఱనలను నుతించి వేరొకపద్యంలో కుకవులను ఘోరఘూకోత్కరాలుగా తిరస్కరించాడు. నరసింహకవి నారదీయపురాణాన్ని ఎనిమిదాశ్వాసాల గ్రంథంగా విరచించాడు. ప్రథమాది అష్టమాశ్వాసాంత్యపర్యంతం ఆయా ఆశ్వాసాలపరంగా ఈ క్రింది విధంగా వచనాలు పద్యాలు వున్నాయి.

ప్రథమాశ్వాసం - 516

ద్వితీయాశ్వాసం - 252

తృతీయాశ్వాసం - 189

చతుర్థాశ్వాసం - 354

పంచమాశ్వాసం - 235

షష్ఠాశ్వాసం - 264

సప్తమాశ్వాసం - 230

అష్టమాశ్వాసం - 277

మొత్తం నారదీయ పురాణంలో అవతారికా పద్యాలతో సహాకలిపి మొత్తం 2317 పద్యాలు వచనాలు వున్నాయి.

నారదీయపురాణం అష్టాశ్వాససంభరితమేకానీ వాస్తవానికి కేవల నారదీయపురాణానికి సంబంధించిన గ్రంథం ఏడాశ్వాసాలు పైగా మాత్రమే వున్నది. ప్రథమాశ్వాసంలో వున్న మొత్తం 516 పద్య గద్యాలలోను ఇష్టదేవతాస్తుత్యాదికాలుగా 24 పద్య గద్యాలను, నారదీయపురాణ కథాప్రారంభాదిగా వున్న మొత్తం 36 పద్య గద్యాలను తొలగిస్తే మిగిలిన 456 పద్యగద్యాలలో నారదీయపురాణ కృతిపతియైన శ్రీకృష్ణచరిత్రను అతిలోకకవితావైభవంతో వర్ణించడం జరిగింది.

"ఆ మహాగురు శిఖామణియొక్కనాఁడు స్వప్నంబున నన్నుఁగరుణించి నారదీయ సాత్విక పురాణంబు లోకోపకారార్థంబుగా నాంధ్రభాష రచియించి శ్రీకృష్ణాంకితంబు సేయుమని యానతిచ్చిన మేల్కాంచి కృష్ణభగవంతుని మనంబున నిడుకొని రచియింపబూనితిఁ దదవతార క్రమంబెట్టిదనిన" అని నరసింహకవి కృష్ణావతారక్రమాన్ని 456 పద్యాలలో దాదాపు ప్రథమాశ్వాసం తుదివరకూ అత్యంతమధురమై మంజులమైన కవితతో వర్ణించాడు. "మధురాపురవర్ణన - శ్రీకృష్ణ జననము - శ్రీకృష్ణలీలలు, దుష్టసంహారము - శ్రీకృష్ణుఁడు దావాగ్నిని గ్రోలుట - వర్షాగమము - వసంతాగమము - గోపికావిహారము - నందుఁ డేకాదశి నుపవసించుట - అక్రూరుఁడు యమునాజలముల రామకృష్ణులఁ గాంచుట - శ్రీకృష్ణుఁడు కంసుని సంహరించుట - శ్రీకృష్ణుఁ డుద్థవుని గోపికలకడకంపుట - శ్రీకృష్ణుఁడు జరాసంధ కాలయవనుల జయించుట - శ్రీకృష్ణుఁడు రుక్మిణి సత్యభామల పరిణయమాడుట - నరకసంహారము, పారిజాతాపహరణము - ప్రద్యుమ్నవృత్తాంతము - శ్రీకృష్ణుఁడు బాణాసురుని నోడించుట - నృగమహారాజు వృత్తాంతము, పౌండ్రకవాసుదేవుఁడు - కౌరవ పాండవ సంబంధము - కుచేలోపాఖ్యానము - శ్రీకృష్ణుఁడు వృకాసురుని బంధించుట - అర్జునుఁడు సుభద్రం గొంపోవుట - ద్వారకలో శ్రీకృష్ణుని జీవితము." అన్న వివిధశీర్షికలతో శ్రీకృష్ణుని అవతారవిశేషాలను వర్ణించాడు. అనంతరం కృతిపతియైన శ్రీకృష్ణసమర్పణంగా ఐదు షష్ఠ్యంతాలైన కందపద్యాలను రచించి, అసలు నారదీయపురాణంలో "మునులు నారాయణుని దర్శించడం"తో కథా ప్రారంభం చేశాడు.

నన్నెచోడుడు మొదలుకొని అనేకమంది కవులు యీ షష్ఠ్యంతాలు ప్రయోగించారు - అయితే కొందరు సార్థకంగా షష్ఠ్యంతాల పుట్టుకను దృష్టిలో పెట్టుకొని ప్రయోగించగా మరికొందరు నిరర్ధకంగా ప్రయోగించారు.

షష్యంతాల చరిత్ర

శ్రీకృష్ణాంకితమైన యీ నారదీయపురాణంలో నరసింహకవి అత్యంతసార్థకంగా షష్ఠ్యంతకందపద్యాలు విరచించాడు. ప్రాచీనకవు లనేకమంది తమకావ్యాలలో షష్ఠ్యంతాలు రచించారు గాని అవన్నీ సార్థకాలుగా విరచించా రనడానికి అవకాశం లేదు. 1960 వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలో కర్నూలు ఉస్మానియా కళాశాలలో నన్నయవర్ధంతి సందర్భంగాను - ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాలల దశమాంధ్ర అభ్యుదయోత్సవాల సందర్భంగానూ నన్నయభారతరచనలో ఉన్న వైశిష్ట్యాన్ని గురించి ఉపన్యసిస్తూ షష్ఠ్యంతాలగురించి కొన్ని మాటలు చెప్పాను. నన్నయ కవితావిషయికప్రసంగానికే యెక్కువ అవకాశం ఉన్న ఆ సభలో షష్ఠ్యంతాలచరిత్ర విషయమై సామాన్యం గాను సూక్ష్మంగాను ప్రస్తావించాను. అప్పటి నా ఉపన్యాసాల సారాంశం జనవరిలో ఆంధ్రప్రభ ప్రచురింపగా నేను షష్ఠ్యంతాలపై సామాన్యంగా వెలువరించిన భావాలు ఈ క్రింది రూపం దాల్చినాయి.

"ఎకాడమీ బహుమానం పొందిన వేదం వెంకటరాయశాస్త్రిగారి కుమారసంభవ విమర్శలో నన్నెచోడుడు తిక్కనకు సైతం తర్వాత వాడని కేవలం షష్ఠ్యంతాల మీదనే ఆధారపడి వ్రాయడం జరిగింది. ఇది కేవలం షష్ఠ్యంతాలచరిత్రను గమనించకపోవడం వల్లనే జరిగిం దనుకుంటాను. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఇత్యాదిగాఉన్న కేశవనామాలను ఆధారం చేసుకునే తెలుగులో షష్ఠ్యంతాలు వెలిశాయి. సంస్కృతంలో చతుర్థ్యంతాలుగా ఉన్న పదాలు తెలుగులో సమూలంగా షష్ఠ్యంతవిభక్తి కువర్ణాంతాలుగా ఉంటాయి.

తెలుగులో రామునికొరకు సీత నిచ్చెను అనడం అస్వాభావికం. రామునికి సీత నిచ్చె ననడమే స్వాభావికంగా ఉంటుంది. అందువల్ల కేశవనామాల్లో ఉన్నచతుర్థి విభక్తులను అనుసరించి తెలుగుకు స్వాభావికమైన షష్ఠీవిభక్తి కుప్రత్యయప్రయోగంతో షష్ఠ్యంతాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ షష్ఠ్యంతాలు కేశవనామాలవలెనే మొదట దైవపరంగా - అంటే - కావ్యాన్ని దేవునికే అంకితమిచ్చినప్పుడే యీ షష్ఠ్యంతాలు ఉపయోగింపబడేవి అని అనిపిస్తుంది. దైవపరంగా ఉపయోగింపబడే యీ షష్ఠ్యంతాలను మానవపరంగా చేసిన మొదటికవి నన్నెచోడుడే. నన్నెచోడుడు తన గురువైన మల్లికార్జునుని దేవుడుగా భావించాడు. శివుడికి మలికార్జునుడికి అభేదంచేసి తన కావ్యాన్ని గురువుకే అంకితమిచ్చి దేవునికిచ్చినట్లే సంతృప్తి చెందాడు. దేవుడుకి తన గురువుకి అభేదం చేసినందువల్ల దైవపరంగా వాడబడుతున్న షష్ఠ్యంతాలను తన గురుపరంగా కూడా వాడినాడు. ఇలా మానవపరంగావాడబడిన కుమారసంభవంలోని షష్ఠ్యంతాలను చూచే తిక్కన ఉత్తరరామచరిత్రలో మనుమసిద్ధికి షష్ఠ్యంతాలు వేశాడు. నన్నయ్య భారతాన్ని రాజరాజుకి వినిపించినట్లు వ్రాసినాడే కాని అంకితమివ్వలేదు. అసలు నన్నయ తన భారతాన్ని ఎవరికి అంకిత మివ్వలేదు. అందువల్ల భారతంలో షష్ఠ్యంతాలు వెయ్యవలసిన అవసరం కనిపించలేదు-" (భారతరచనలో వెల్లివిరిసిన నన్నయ కవితాప్రాభవం - ఆంధ్రప్రభ దినపత్రిక. 1960 జనవరి 10.)

సామాన్యంగా చెప్పిన యీ షష్ఠ్యంతాల విషయమైన పైవాక్యాలు చూచి వాటిలోని భావాలనే చిలువలు పలువలు చేర్చి అసంబద్దాలైన అనేకవిషయాలతో కూడిన ఒకవ్యాసం "షష్ఠ్యంతముల పుట్టుపూర్వాలు" అన్న శీర్షికతో భారతిలో ప్రచురింపబడింది. యీ వ్యాసకర్త ఆంధ్రప్రభలోని పైవాక్యాలు చూచినట్లు తన వ్యాసంలో పేర్కొనకపోయినా యీ రెండూ చూచినవారికి వస్తుస్థితి బోధపడకుండా ఉండదు. నిజానికి "షష్ఠ్యంతముల పుట్టుపూర్వాలు" అన్న శీర్షికతో వెలువడిన యీ వ్యాసవిషయాలు అసలు షష్ఠ్యంతాల చరిత్రను ప్రాచీనకావ్యాల కృత్యవతారికా విషయాలను వెల్లడించలేదు సరిగదా వాస్తవవిషయాలకు దృగ్గోచర మవుతున్న పరమసత్యాలకు విరుద్ధాలుగా వెలువడడం విచారనీయమైన విషయం.

నా ఉపన్యాస వాక్యాల సారాంశంగా నాటి ఆంధ్రప్రభలో వెలువడిన వాక్యాలు అతిసామాన్యమైనవి. అంతకు మించి షష్ఠ్యంతాల చరిత్ర గురించి మనం గమనించవలసిన విషయాలు అనేకంఉన్నాయి. వాస్తవవిషయాలన్నిటినీ కూలంకషంగా విమర్శించి నిగ్గునుతేల్చి యీ క్రింది విషయాలు వెల్లడించాను.

"నన్నెచోడుడు తన కుమారసంభవమును భక్తితో గురువగు మల్లికార్జునునకు అంకితము గావించినాడు. కాని నన్నయవలె విన్పింపలేదు. ఇట్లనుటచే మల్లికార్జునునకు కుమారసంభవము బొత్తిగా వినిపింపలేదనుటకాదు. ఆయనను కేవలము శ్రోతగా గ్రహింపలేదనుట మాత్రమే. అనగా మల్లికార్జునుడు కుమారసంభవమునకు కృతిపతియే కాని కృతిశ్రోత కాదనుట. కనుకనే కుమారసంభవమునం దాశ్వాసాద్యంత పద్యములలో సంబోధనాంతముల కవకాశము లేకపోయినది. పైగా చోడుడు తనగురువునకును శివునకును అభేదమును గల్పించి యాశ్వాసాంతములలో శివునివర్ణన వచ్చునట్లు కూర్చుకొని యాశ్వాసాద్యంత పద్యములను కృతినాయక కృతిపతుల కిరువురకు (కథానాయక కృతిపతుల కిరువురకు అని ఈ రచయితభావం కాబోలు) నన్వయించునట్లు విభిన్నవిభక్తికములుగా రచించినాడు. ఇక్కడ కృతిప్రదానము కలదు గనుక షష్ఠ్యంతముల రచనకు ప్రసక్తి కలిగినది" - అని ఒకరు వ్రాశారు.

ఈ అభిప్రాయాలన్నీ చాలా ప్రమాదభరితాలు. నన్నెచోడుడు తన కుమారసంభవాన్ని మల్లికార్జునునకు అంకితం యిచ్చాడనడం ఒక పొరపాటు. నన్నయవలె మల్లికార్జునునికి వినిపింపలేదనడం రెండవపొరపాటు. మల్లికార్జునుని కృతిశ్రోతగా యెంచి కుమారసంభవ రచన చెయ్యలేదు. కావుననే సంబోధనాంతాల కవకాశం లేకపోయిందనడం మూడవ పొరపాటు. నన్నెచోడుడు కృతిప్రదానం చేసినాడు కాబట్టే షష్ఠ్యంతాల రచనకు ప్రసక్తి కలిగిందనడం నాల్గవ పొరపాటు. సూక్ష్మంగా, వివరంగా కుమారసంభవాది గ్రంథాలు పరిశీలించకుండా వ్యాసరచనకు దొరకొన్న యీ రచయిత యీ నాల్గు పొరపాటు భావాలేకాదు మరెన్నోవిషయాలు పొరపాటుగా పేర్కొన్నారు. క్రమానుగతంగా వాటి నన్నిటిని చర్చించుదాము.

షష్ఠ్యంతాలు ఉన్న కావ్యం ప్రతిదీ అంకితం యివ్వబడిందేననీ కృతిసమర్పణవిషయకంగానే షష్ఠ్యంతాలు వేయబడినవనీ, ఒక దురభిప్రాయం దేశంలో పాతుకుపోయింది. ఇది కేవలం భ్రమాపూరితమైన భావం. ఈ భ్రమకారణంగానే నన్నెచోడుని కుమారసంభవంలో షష్ఠ్యంతాలున్నవి కాబట్టి ఆ కావ్యం మల్లికార్జునునికి అంకితమిచ్చాడనే భావం యేర్పడింది. కృతి సమర్పణ సందర్భంగానైనా షష్ఠ్యంతాలు వ్రాశాడా అన్న విషయ మాలోచించిన వారేలేరు. తన గురుదేవుడైన మల్లికార్జునుని కేవల శ్రోతగానే గ్రహించి కుమారసంభవరచనకు నన్నెచోడుడు దొరకొన్నాడే గాని, తన కావ్యాన్ని అంకితమివ్వలేదు. [8]తాను అంకిత మిస్తున్నట్లు ఏ పద్యంలోనూ చెప్పలేదు. పైగా

గురువున కిష్ట దైవమునకుం
        బతికిం గృతి చెప్పి పుణ్యమున్
వరమును దేజముం బడయ
        వచ్చు జగంబుల నిశ్చయంబు మ
ద్గురువును నిష్టదైవమును
       గూర్చు నిజేశుడు దాన నాకుఁగా
కొరునకు నిట్లు సేకురునె
       యొక్కట లాభము లెన్నియన్నియన్.

(కు. ప్ర. అ. 50. ప.)

అని స్పష్టంగా 'కృతి చెప్పి' అని వాడి తన కావ్యాన్ని మల్లికార్జునునికి వినిపిస్తూ చెప్పినట్లే భావించాడు.

మల్లికార్జునునికి కథానాయకుడైన ఈశ్వరునికి అభేదం చాటినందువల్ల మల్లికార్ఝునుని ఎక్కడ పేర్కొన్నా, కథానాయకుడుగానే పేర్కొన్నాడుగాని కృతినాయకుడుగా పేర్కొనలేదు. నన్నెచోడుడు స్వవిషయం, కృతివిషయం మొదలైనవి చెప్పగా పోతన రచనలో ఒక పద్యానికి మార్గదర్శకమైన "రవికులశేఖరుండు కవిరాజశిఖామణి" అన్న పద్యంలో (కు. ప్ర. ఆ. 57ప) కూడా "సత్కథాధిపతి భవ్యుడు జంగమ మల్లికార్జునుండు" అని కథాధిపతిగానే పేర్కొన్నాడు గాని కృతి కధిపతిగా పేర్కొనలేదు. అంతేకాదు, నన్నెచోడుడు వేసిన షష్ఠ్యంతాలు కృతిసమర్పణ సందర్భమయినవి కానేకావు. "మునిజన ముఖమణి ముకురుండైన జంగమ మల్లికార్జునదేవునకు"అని షష్ఠ్యంతంగా వచనం ముగించి (58 ప్ర. ఆ) ఎనిమిది షష్ఠ్యంతాల తరువాత కావ్యారంభానికి పూర్వం "పరమభక్తియుక్తి నావర్జితహృదయుండనై సకలభువనభవనావతారకారకుండైన పరమేశ్వరు నవతారం బగుటయుం దదంశావతారంబుగా వర్ణించి, నా చెప్పఁబూనిన దివ్యకథాసూత్రం బెట్టి దనిన" అని వచనం వ్రాసి "సతి జన్మంబున్" అని కథాప్రారంభం చేశాడు. ఈ వచనానికి పూర్వంలో ఉన్న యెనిమిది షష్ఠ్యంతపద్యాలు నా చెప్పంబూనిన అన్నపదాలతో అన్వయిస్తాయి. వినుత బ్రహ్మర్షికి...వ్యావర్ణించి చెప్పబూనిన, అత్యనుపమసంయమికి...నా చెప్పంబూనిన అని సజ్జనాభరణునకు...నా చెప్పంబూనిన మల్లికార్జునమునికి ... నా చెప్పంబూనిన అని షష్ఠ్యంతముల కన్వయం. నన్నెచోడుడు వేసిన షష్ఠ్యంతాలన్నీ, మల్లికార్జునుని శ్రోతగా యెంచి అతనికి తాను కృతి చెప్పుతున్నట్లుగా వేసినవే గాని కృతి సమర్పణ (అంకితం) సందర్భంగా వేసినవి మాత్రం కావు.

షష్ఠ్యంతాలు వ్రాయడంలో నన్నెచోడునే ఆదర్శంగా తీసుకున్న తిక్కనకూడా తన భారతాన్ని హరిహరనాధునకు అంకిత మిచ్చినప్పటికీ, తాను వేసిన షష్ఠ్యంతాలు కృతిసమర్పణపరంగా వ్రాయలేదు. తాను మహాభారతగాథను హరిహరునకు విన్నపం చేస్తున్న సందర్భానికి అనుగుణంగా వేశాడు. "కృతిపతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ" అని హరిహరనాథుడే స్వయంగా స్వప్నంలో అన్నట్లు తిక్కన పేర్కొన్నాడు. "ఇట్టి పదంబు గాంచి పరమేశ్వరునిం కృతినాథుచేసి" అని తిక్కన కూడా స్వయంగా చెప్పాడు. కాబట్టి భారతాన్ని హరిహరనాథునికి అంకిత మిచ్చాడనే విషయం విస్పష్టం. కాని షష్ఠ్యంతాలు మాత్రం తిక్కన కృతిసమర్పణపరంగా వెయ్యనే లేదు. "మహాకవిత్వదీక్షావిధి నొంది, పద్యముల గద్యములం రచియించెదన్ గృతుల్" అని పూని యీ దృశంబులగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్కయారాధన విశేషం బగుటం జేసి" అని వచనం వ్రాసి, అనంతరం "ఓంకారవాచ్యునకు ఇత్యాది అయిదు షష్ఠ్యంతాలు రచియించి, ఏను విన్నపంబు సేయు తెరంగుగా" నని వ్రాశాడు. ఓంకారవాచ్యునకు అని మొదలుపెట్టి "భక్తవరతంత్రునకున్" అని షష్ఠ్యంతాలు ముగించి, "ఏను విన్నపంబు చేయు తెరంగుగా" అనడంవల్ల ఈ షష్ఠ్యంతాలు అయిదూ హరిహరనాథునకు విన్నపసందర్భంగా వేసినవే కానీ, కృతిసమర్పణవిషయకంగా వ్రాసినవి కావని తేటతెల్లమవుతున్నది. అంకితం యివ్వడానికి, షష్ఠ్యంతాలు వెయ్యడానికి తిక్కన భారతంలో బొత్తిగా సంబంధం లేదు.

తిక్కన భారతంకంటే ముందుగా అవతరించి, తిక్కననే వరించిన కావ్యం కేతన దశకుమారచరిత్ర. తిక్కన కేతనను సగౌరవంగా రావించి "నీవు సంస్కృతానేకభాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గావున నొక్కకావ్యంబు రచియించి నన్ను కృతిపతిం చేయవలయునని సగౌరవంబుగా బ్రార్థించిన నేనును మత్కావ్యకన్యకు దగిన వరుండగు నతని మనోరథంబు సఫలంబు గావింపం దలచి" తాను దశకుమారచరిత్ర రచనకు ఉపక్రమించినట్లు కేతనే చెప్పాడు కాబట్టి తన కావ్యాన్ని అంకితమిచ్చాడనటం సుస్పష్టం. కేతన అవతారికలో తిక్కనవంశాన్ని వర్ణించి తుదకు తిక్కన గుణగణాలు అభివర్ణించి, "కొమ్మనామాత్యుతిక్కన కొలది సచివు లింక నొక్కరు డెన్నంగ నెండు గలడు?" అని తిక్కన వర్ణన ముగించి "ఈ దృశగుణభూషణమునకు" ఇత్యాదిగా ఏడు షష్ఠ్యంతాల అనంతరం తిరిగి షష్ఠ్యంతాలుగానే మూడు (శార్దూలం, కందం, మాలిని) పద్యాలు ఆశ్వాసాంతాలుగానూ వేసి తిరిగి ద్వితీయాశ్వాసాదిగా షష్ఠ్యంత కందంవేసి, ఆ కందం చివర "తిక్కనామాత్యునకున్" అన్నప్రయోగం చేసి, "అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాచెప్పంబూనిన కథానికాయం బను సురలతాబాణం బెట్టిదనిన" అని కృతి రచించాడు. కేతన చేసిన షష్ఠ్యంతాలుకూడా తిక్కనను శ్రోత గావించి వేసినవే గాని తిక్కనకు కృతి సమర్పిస్తున్నట్లుగా వేసినవి కావు.అనగా దశకుమారచరిత్రలో కూడా కృతిసమర్పణకూ, షష్ఠ్యంతాలకు సంబంధం లేదని తాత్పర్యం.

మారన మార్కండేయపురాణాన్ని నాగయ గన్నయకు అంకిత మిచ్చినట్లు స్పష్టంగానే చెప్పాడు.

నాగయ గన్నయ మార్కండేయ పురాణం వినవలెనని కుతూహలం వున్నట్లు నిండుసభలో వెల్లడించడం (మార్కండేయాఖ్యమహాపురాణము వినం గౌతూహలం బయ్యడిన్) మారన తనరచనను అతనికి వినిపిస్తున్నట్లుగానే సంబోధనాంతపద్యాలతో సహా వ్రాయడం జరిగింది. మారన నాగయ గన్నయకు షష్ఠ్యంతాలు వేశాడుగాని, అవి కృతిసమర్పణ విషయికంగానూ వ్రాయలేదు. కృతిశ్రోతత్వపరంగానూ వెయ్యలేదు. "మేరుధీరుడు నాగయమేచశారి" అని మూడవషష్ఠ్యంతపద్యం ముగించి, రమకళ్యాణపరంపరాభివృద్ధిగా నారచియింపంబూనిన యిమ్మహాపురాణంబునకు గథాక్రమం బెట్టిదనిన అని పురాణం ప్రారంభించాడు. ఈ సందర్భాన్నిబట్టి చూస్తే , "గన్నరథినీపతికి పరమకళ్యాణపరంపరాభివృద్ధి"

కలుగునట్లు వేసిన షష్ఠ్యంతపద్యాలే గాని కృతిసమర్పణసందర్భంగా వేసినవి కావని సుస్పష్టంగా తెలుస్తుంది.

ఎర్రాప్రగడ తన నృసింహపురాణం అహోబల నృసింహస్వామికి అంకిత మిచ్చాడు. ఆస్వామినే శ్రోతగాచేసి, ఆశ్వాసాద్యంతాలతో సంబోధనాంతాలు వేశాడు. నృసింహపురాణంలో ఎర్రన షష్ఠ్యంతాలు వేసినా అతడు తిక్కనవలె నృసింహపురాణాన్ని నృసింహస్వామికి విన్నపం చేస్తున్నట్లే షష్ఠ్యంతాలు వేశాడు. "అత్యుదాత్త భక్తప్రయుక్తోల్లాసభాసితుండనై, కృతి చేయందొడంగి" అని వచనం వ్రాసి, ఆతర్వాత పదకొండు షష్ఠ్యంతాలు వేసి పదకొండవ షష్ఠ్యంతాన్ని "భక్తచింతామణికిన్" అని ముగించి "ఏను విన్నపంబు సేయంగల లక్ష్మీనృసింహావతారంబును పురాణకథకుఁ బ్రారంభం బెట్టిదనిన" అని కథాప్రారంభం చేశాడు. కాబట్టి ఎర్రన వేసిన షష్ఠ్యంతాలు సైతం కృతిసమర్పణకు సంబంధించినవి కావని కృతివిజ్ఞాపనానికి సంబంధించినవని తేటతెల్ల మవుతున్నది.

నన్నెచోడుడు తనకావ్యాన్ని అంకితం యివ్వనేలేదు - కాబట్టి అతను వేసిన షష్ఠ్యంతాలకు అంకితానికి సంబంధం మొదటనే సున్నగదా! తిక్కన, కేతన, మారన, ఎర్రాప్రగడలు అంకితం యిచ్చినా తాము వేసిన షష్ఠ్యాంతాలు అంకితవిషయికంగా వెయ్యనేలేదు.

అంకితపరంగా వ్రాయబడిన షష్ఠ్యంతాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. పోతన తన వంశావతారం వర్ణించి తననుగురించి ఒక పద్యం వ్రాసి "అయిన నేను నాచిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని - హరికి నందగోకులవిహారికి" అంటూ షష్ఠ్యంతాలుగా నాలుగు ఉత్పలమాలలు రచియించాడు. షష్ఠ్యంతాల తరువాత (శేషశాయికిన్) "సమర్పితంబుగా నే నాంధ్రంబున రచియింపఁబూనిన భాగవతపురాణంబునకున్ గథాక్రమంబెట్టి దనిన" అని కథాప్రారంభం చేశాడు. షష్ఠ్యంతాలతో సమన్వయమయ్యే విధంగా, సమర్పితశబ్దాన్ని ప్రయోగించడంతో శ్రీహరికి అంకితమిచ్చే సందర్భంగా షష్ఠ్యంతాలు వేసినవాడయ్యాడు. పోతన వేసిన పద్ధతిలో షష్ఠ్యంతాలు కృతి సమర్పణ సందర్భంగా తిక్కన, మారన, కేతన, ఎర్రయలు వెయ్యలేదు. వారు వేసిన సందర్భాలు కృతిసమర్పణకు సంబంధించినవి కానేకావు. కృతిప్రదానం ఉన్నప్పుడే షష్ఠ్యంతాల రచనాప్రసక్తి కలిగిందనుకొనడం పొరపాటు. నన్నెచోడుడు తన కావ్యాన్ని అంకితం ఇవ్వకుండానే మల్లి కార్జునిపై షష్ఠ్యంతాలు రచించాడుగదా!

కుమారసంభవంలో ఆశ్వాసాద్యంతాలలో సంబోధనాంతాలైన పద్యాలు లేకపోవడంచేత కుమారసంభవానికి మల్లికార్జునుడు శ్రోత కా డనడం సబబు కాదు. మల్లికార్జునుని శ్రోతగా చేసుకొని అతనికే ఈకృతి తాను చెప్పుతున్నట్లు నన్నెచోడుడు యెలుగెత్తి చాటిన విషయం మొదటే పేర్కొన్నాను. ఇంకా ఆశ్వాసాద్యంతపద్యాలరచనలో కుమారసంభవానికి భారతాది గ్రంథాలకు ఉన్నతేడాను గురించి చర్చించుకొందాము.

భారత కృతి శ్రోతగా రాజరాజు నుంచి భారత ఆశ్వాసాద్యంతాలలో రాజరాజును సంబోధించి సంబోధనాంతాలైన పద్యాలు రచియించాడు నన్నయ. ఈ సంబోధనాంతాలు నన్నయ భారతం ప్రథమాశ్వాసం చివరనుంచి రచియించాడే కాని ఆది నుంచి రచియించకపోవడం ఒక లోపమనే చెప్పాలి. శ్రీవాణీగిరిజాశ్చిరాయ ఇత్యాది ప్రథమశ్లోకం దగ్గరనుంచి "సారమతింగవీంద్రులు" అన్నపద్యం వరకూ ఉన్నది నన్నయ భారతావతారిక. రాజరాజు నన్నయను రావించి తనకిష్టమైన వేవేవో వివరించి "పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మె మ్మెయిన్" అని వచించి భారతం "తెనుగున రచియింపు మధికధీయుక్తిమెయిన్" అని ఆనతిస్తాడు. తరువాత నన్నయ భారతరచనలో ఉన్న కష్టమును వర్ణించి "అయినను దేవా! నీయనుమతంబున ... నిక్కావ్యంబు రచియించెద" అని పేర్కొన్నాడు. తన భారతాన్ని రాజరాజును వినవలసిందిగా అవతారికలో నన్నయ పేర్కోలేదు. "సారమతింగవీంద్రులు ... జగద్దితంబుగాన్" అన్న పద్యం తరువాత "తత్‌కథాక్రమం బెట్టిదనిన" అని భారత కథాప్రారంభం చేస్తాడు. కృత్యవతారిక పూర్తికాగానే అనగా - సారమతింగవీంద్రులు అన్న పద్యం తరువాత రాజరాజును సంబోధించి రెండు మూడు పద్యాలుగాని కనీసం ఒక పద్యం గాని నన్నయ రచించి ఉండవలసింది. భారత కథాప్రారంభానికి ఆదిలో సంబోధనాంతపద్యాలు రాజరాజు నుద్దేశించి వెయ్యకపోవడంతో భారతానికి రాజరాజు శ్రోత అనే విషయం కావ్యాదిని మరుగుపడిపోయినది. ప్రధమాశ్వాసం చివరికి వెళ్తేనేగాని నన్నయ భారతాన్ని "రాజరాజుకు వినిపిస్తున్నట్లు వ్రాశాడు" అన్న విషయం బోధపడదు. కాబట్టి కథాప్రారంభానికి ఆదిలో సంబోధనాంతాలు వెయ్యకపోవడం ఒకలోపంగానే తేలుతుంది.

ననయ్య చేసిన యీ పొరపాటును తిక్కన గమనించి తనరచనలో యిటువంటి పొరపాటు రాకుండా సర్దుకున్నాడు. తిక్కన విరాటపర్వాదిని కథాప్రారంభానికి ముందు (హరిహరనాథునకు) "ఏను విన్నపంబుసేయు తెరంగుగా నంత సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు చేసెద" అని వ్రాసి హరిహరు నుద్దేశించి మూడు సంబోధనాంతపద్యములు వ్రాసి ఆ తర్వాత "దేవా! దివ్యచిత్తంబున నవధరింపుము" అనిగాని భారత కథాప్రారంభం చెయ్యలేదు. తిక్కన హరిహరుణ్ని సంబోధించినవిధంగా నన్నయకూడా కథాప్రారంభానికి ఆదిలో రాజరాజును సంబోధిస్తూ ఒక పద్యం వ్రాసినా కనీసం ఒకవాక్యం వ్రాసినా ఆయన కృత్యాది నిర్దుష్టంగా ఉండేది. నన్నయ చేసిన యీ పొరపాటును పొరపాటుగా గుర్తించలేక, తిక్కన చేసిన సర్దుబాటులో విశిష్టతను సంపూర్ణతను గుర్తించలేక అనేకమంది తర్వాతికవులు నన్నయవిధానాన్నే అనుసరించి తమ తమ కావ్యావతారికలను లోపభూయిష్టమే చేశారు. మారన, పోతన, శ్రీనాథుడు, పెద్దన, పింగళి సూరన, రాజరాజభూషణుడు, కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు మొదలైన ప్రముఖ కవులంతా నన్నయపద్ధతినే అనుసరించి - అనగా - కృతి శ్రోతను కథాప్రారంభానికి పూర్వం సంబోధించకుండానే తమ రచన సాగించారు. నాచనసోముడు తిక్కన చేసిన సర్దుబాటును గమనించాడు కాబోలు! తమ కావ్యకథాప్రారంభానికి ముందు హరిహరనాథుణ్ని ఉద్దేశించి సంబోధనాంతంగా కందం వ్రాసి "దేవా" అని వచనంతో కూడా సంబోధించి "వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె" అన్నమాట వ్రాసిగాని కథాప్రారంభం చెయ్యలేదు. పైన పేర్కొన్న మారనాదుల కావ్యాలన్నిటిలోనూ ప్రథామాశ్వాసం చివరినుంచే (భాగవతంలో ప్రథమస్కంథం చివరినుంచే) గాని సంబోధనాంతపద్యాలు కానరావు. తిక్కన సవరించినా తిక్కనను, సోము డనుసరించినా ప్రమాదభరితంగా మొదట నన్నయరచనలో జరిగిన పొరపాటును గమనించిన తర్వాతి కవులంతా తమ తమ రచనలను కూడా ప్రమాదభరితాలుగా చేశారు.

ఇంక నన్నెచోడుని ఆశ్వాసాద్యంతపద్యాలను గురించి, తిక్కన నిర్వచనోత్తరరామాయణం, కేతన దశకుమారచరిత్రల ఆశ్వాసాద్యంత పద్యాలను గురించి చర్చించవలసి ఉన్నది.

నన్నెచోడుడు కేవలం మహాకవేకాదు. గొప్ప మేధావి కూడా. అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత లేకుండా అతని రచన సాగనే సాగదు. తనగురుదేవుడైన మల్లికార్జునునికి కావ్యకథానాయకుడైన ఈశ్వరునికి అభేదం చేసినందువల్ల ఆశ్వాసాద్యంతపద్యాలను ప్రతి ఆశ్వాసంలోనూ కథకు అనుగుణంగా పూర్వాపరాన్వయాలకు సందర్భాలకు సరిపోయేవిధంగా రచియించాడు. నిజానికి కుమారసంభవం పండ్రెండు ఆశ్వాసాలున్న కావ్యమే అయినా ప్రతి ఆశ్వాసానికి చివర ఉన్న గద్యలు తొలగించివేస్తే మొత్తం కుమారసంభవం ఆశ్వాసాద్యంత పద్యాలలో ఏ ఒక్కదాన్నీ తొలగించకుండా లేదా విడిచిపుచ్చకుండా చదివితే ఏకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. కుమారసంభవం ఏకాశ్వాసకావ్యంగా కూడా రూపొందడానికి ఆశ్వాసానికి ఆశ్వాసానికి మధ్యలో ఉండే అద్యంత పద్యాలను సైతం కథలో కలిసేవిధంగా రచియించడమే కారణం. ఉదాహరణకు ఏ ఆశ్వాసాన్నైనా పరిగ్రంహిచవచ్చును. దక్షుడు తన అల్లుళ్ళను అందరినీ చూచి చివరికి పరమేశ్వరుణ్ని చూదామని రజతనగానికి వెళ్తాడు. "పరమేశ్వరు నాస్థానంబున కరిగి" అనడంతో ప్రథామాశ్వాసకథాభాగం ముగుస్తుంది. ఆ తర్వాత అయిదు ఆశ్వాసాంతపద్యాలూ రెండవ ఆశ్వాసం మొదటిపద్యమూ ద్వితీయాంతాలుగా ఉన్నాయి. ద్వితీయాశ్వాసం కథాభాగం మొదటిపద్యంలో "సతి నవ్వించుచు నవ్వుచున్న పరమున్ సర్వేశు దక్షప్రజాపతి గాంచెన్" అని దక్షుడు ఈశ్వరుణ్ణి చూచినట్లు చెప్తాడు. ప్రథామాశ్వాసాంతపద్యాలు, ద్వితీయాశ్వాసం ఆదిపద్యం ద్వితీయాంతాలైన యీశ్వరవిశేషణయుక్తాలుగా సమన్వయం కుదిరి ప్రథమద్వితీయాశ్వాసాలకు ఏకవాక్యత యేర్పడుతుంది.

ఈశ్వరుని రోషభీషణాగ్నికి గురైన దక్షుడు తిరిగి ఆ పరముని దయావీక్షణంతో బంధముక్తుడై శంకరుని స్తుతించడంతో ద్వితీయాశ్వాసం ముగుస్తుంది. ఆ ముగింపులో కవి వాక్యంగా "అని యనేక ప్రకారంబులఁ బరమభక్తియుక్తిం బ్రస్తుతింప దక్షునకుం ద్రక్షుండు ప్రత్యక్షంబై తదీయాధ్వరఫలంబు సఫలంబుగా బ్రసాదించి దక్షుంబ్రజాపతి నియోగంబునంద నియోగించి" అని వ్రాసినాడు. ఆ తర్వాత తృతీయాశ్వాసంలో యీశ్వరుండు సర్వమునిదేవతాపరివృతుడై పరమానందంతో ఉన్నట్లు పేర్కొంటాడు. ఆ కారణంగా ద్వితీయ తృతీయాశ్వాసాలకు ఏకవాక్యత కుదరడానికై ద్వితీయాశ్వాసాంతపద్యాలను తృతీయాశ్వాసాదిపద్యాన్ని ప్రథమాంతాలుగా రచియించాడు. ఇదేపద్ధతిలో సమస్త ఆశ్వాసాలకు కథాభాగంతో ఐక్యత కుదురుతుంది. ఈవిధంగా కుమారసంభవం ఏకాశ్వాసకావ్యంగా రూపొందటం నన్నెచోడుని రచనలో బుద్ధిపూర్వకంగా జరిగినపనేగాని కాకతాళీయంగా జరిగిన పనికాదు. ఆయా ఆశ్వాసాలకాదిలో కథాభాగంతో ఆశ్వాసాద్యంతపద్యాలు సమన్వయించేవిధంగా రచించాలని నన్నెచోడుడు సంకల్పించుకున్నాడు కాబట్టే తత్తత్కథాసందర్భాల కనుగుణంగా అన్వయం కుదిరే విధంగా పూర్వపరకథావిధానాల ననుసరించి ఆశ్వాసాలతుదిని ఆదిని తగు విభక్త్యంతాలుగా పద్యాలునిర్మించాడు. పరమేశ్వరునికి మల్లికార్జునుడనే పేరుండడం, తన గురువు పేరు మల్లికార్జునుడు కావడం ప్రత్యేకంగా తనగురువుకు పరమేశ్వరునికి అభేదాన్ని చాటడం పరమేశ్వరుడే తన కావ్యకథానాయకుడు కావటం, యివన్నీ ఒకచోట సమకూరడంతో తనకావ్యాన్ని నన్నెచోడుడు ఏకాశ్వాసకావ్యంగాసైతం రూపొందేట్లుగా కథాకథనంలో ఆశ్వాసాలమధ్య సంపూర్ణమయిన సమన్వయాన్ని సాధించగల్గాడు. కుమారసంభవం మొదటినుండి చివరివరకూ ఏకవాక్యంగల కావ్యమనీ, ఆశ్వాసాంత్యగద్యలు తొలగించితే అది ఏకాశ్వాసకావ్యంగా రూపొంది ఆశ్వాసాలన్నింటిమధ్య సమన్వయం కుదరడానికి తగిన వాక్యనిర్మాణంతోనే సృజించబడిందనీ, తిక్కన కేతనాదులు మొదట గ్రహించి ఉంటే ఆశ్వాసాలతుదిని వివిధభక్త్యంతాలుగా పద్యములు వ్రాయడానికి ఉపక్రమించేవారు కారనుకుంటాను. కథానుగుణంగా సమన్వయానికి తగేట్లు వివిధవిభక్త్యాంతాలుగా రచించడంలో నన్నెచోడుని ఆంతర్యం తిక్కనాదులు గ్రహించకపోవడంవల్లనే అతడు వ్రాసినవిధంగానే ఆశ్వాసాద్యంతపద్యాలను వివిధవిభక్త్యంతాలుగా వ్రాయాలని ప్రయత్నించి, కొన్నిచోట్ల అన్వయరహితాలయిన పద్యాలను సృష్టించి పెట్టారు. ఇది పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లున్నది. తిక్కన నిర్వచనోత్తరరామాయణ ఆశ్వాసాద్యంతపద్యాలరచనలో కుమారసంభవంలోని ఆశ్వాసాద్యంతపద్యాలను దృష్టిలో ఉంచుకుని తానుకూడా ఆ విధంగ వివిధ విభక్త్యంతాలుగా వ్రాయాలనే వ్రాశాడు. ప్రథమావిభక్త్యంతాలుగా వ్రాసిన పద్యాలకు మామూలుగా కథతో సంబంధం లేకపోయినా, సమన్వయం ఎక్కడయినా కుదురుతుంది. కాని తిక్కన రెండవ ఆశ్వాసం చివర, ఆశ్వాసం మొదట ద్వితీయాంతాలైన పద్యాలు వ్రాశాడు - నాలుగవ ఆశ్వాసం చివర, అయిదవ ఆశ్వాసం మొదట తృతీయావిభక్త్యంతాలయిన పద్యాలు వ్రాశాడు. అయిదవ ఆశ్వాసం చివర ఆరవ ఆశ్వాసం మొదట, షష్ఠ్యంతాలు వ్రాశాడు. ఈ ద్వితీయ, తృతీయ, షష్ఠీ విభక్త్యంత పద్యాలలో ఏ ఒక పద్యానికి సమన్వయం కుదరనే కుదరదు. ఉదాహరణకు ఒక్కపద్యం చూడండి.

శ్రీరమ్యతా నిరూఢమ
హోరస్కుం బుణ్యసంపదుదితయశస్కుం
గారుణ్యార్ద్రమనస్కుఁ బ్ర
జారంజనశీలు మనుమజగతీపాలున్

అని నిర్వచనోత్తరరామాయణం తృతీయాశ్వాసాదిలో మనుమసిద్దిపరంగా నున్న పద్యం యిది. "హరిగని దేవ దూ" అని యీ పద్యంతరువాత ద్వితీయావిభక్తి యుక్తమై కథాప్రారంభ మవుతుంది. అయితే మనుమసిద్దిపై ద్వితీయావిభక్త్యంతంగా పద్యం వ్రాయాలని యెక్కడున్నది? పోనీ అలా వ్రాసినప్పుడు ఆ పద్యానికి అన్వయం కుదిరేట్లు దాని తరువాత మరోవచనమయినా వ్రాయాలికదా ! అటువంటి వచనం ఏమీ లేకపోవడంవల్ల పైపద్యం అంతకు ముందున్న రెండవ ఆశ్వాసాంత పద్యాలు నిరర్ధకాలవుతున్నాయి కదా! "మనుమజగతీపాలున్" అని ముగించితే అది సంపూర్ణవాక్యయుక్తం కాలేదు గదా! "మనుమసిద్ధిని శ్రీరాముడు రక్షించునట్లుగా నాచెప్పంబూనిన యనంతర కథాక్రమం బెట్టిదనిన" అని యిటువంటివాక్యం యేదయినా ఉంటేనేగాని సమన్వయం కుదరదుకదా! ఈ విధంగానే "శ్రీరమణ....పతిచే...మను వసుమతీవల్లభుచేన్" అని తృతీయాంతపద్యం (5వ ఆశ్వా. 1 ప) ఉన్నది. దీనికి అన్వయ మెక్కడ? మనుమసిద్దిచేత యేమైనట్లు? ఈ విధంగానే కేతన వ్రాసిన ద్వితీయాది విభక్త్యంతపద్యాలు నిరర్ధకాలుగా ఉన్నాయి. కేతన వ్రాసిన సంబోధనాంతాలకు సైతం సమన్వయం కుదరదు. (చూ దశ. 3 ఆ. చివర 4 ఆ. ఆదిని) 4 ఆ. ఆదిపద్యం తర్వాత "తిక్కనామాత్యా! తరువాతికథ నవధరింపు" మన్నట్లుగా ఒకవాక్యం ఉంటేనేగానీ సమన్వయం కుదరదు. భారతరచననాటికి తిక్కన తనఉత్తరరామాయణంలో జరిగిన పొరపాటును గుర్తించబట్టే మాట్లాడకుండా భారతంలో ఆశ్వాసాద్యంతపద్యాలను సంబోధనాంతాలుగా వ్రాశాడు.

మారన మార్కండేయపురాణంలో ఆశ్వాసాద్యంతాలలో సంబోధనాంతపద్యాలే వేసినా, ప్రథమాశ్వాసంచివర మాత్రం ఒక పద్యం అనవసరంగా రచించి, ప్రథమ, ద్వితీయాశ్వాసాల మధ్య సమన్వయం కుదరకుండా చేశాడు. "హరిశ్చంద్రుడు...దివంబు కరిగెనని చెప్పి" అని వచనం ముగించి, ఆశ్వాసాంతపద్యాలు వ్రాయడానికి మారుగా హరిశ్చంద్రకథాశ్రవణఫలాన్ని చెప్పాలని "సమకూర్చున్ వివిధార్థసంపదలు" (మా. పు. 1 ఆశ్వా. 285 ప.) అన్నపద్యం వ్రాసి తర్వాతి ఆశ్వాసంలోని కథతో సమన్వయాన్ని సంబంధాన్ని త్రుంచివేశాడు. ఆ కారణంగా "దివంబున కరిగెనని చెప్పి" అన్నదానిలోని చెప్పి అనే అసమాపకక్రియ రెండవ ఆశ్వాసంలోని "పరమజ్ఞానచక్షు లయిన పక్షులు ఆజైమిని కిట్లనియె" అన్నవాక్యంతో పొంతన కుదుర్చుకోకుండా పోతున్నది. "దివంబున కరిగి" అన్నదానికి పూర్వంలోనైనా యీ పద్యం ఉంచినా సమన్వయం కుదిరేది.

సామాన్యంగా యే కావ్యమైనా ఆశ్వాసాల ఆద్యంతాలలో ఉన్నటువంటి కృతిపతులకో, శ్రోతలకో సంబంధించిన పద్యాలను తొలగించితేనే యేకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. కాని నన్నెచోడుని కుమారసంభవంలో మాత్రం ఆశ్వాసాంతాలలోనూ, ఆదిలోనూ ఉన్న మల్లికార్జునునిమీది పద్యాలను తొలగించినా, తొలగించకపోయినా అది ఏకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. ఇది కుమారసంభవాశ్వాసాద్యంత పద్యాలలోని విశిష్టత.

నన్నెచోడుడు మల్లికార్జునునికి కృతి శ్రోతపరంగా షష్ఠ్యంతాలు వేశాడని మొదటే పేర్కొన్నాను. నిర్వచనోత్తరరామాయణంలో తిక్కన అయిదవ ఆశ్వాసం చివర, ఆరవ ఆశ్వాసం మొదట షష్ఠ్యంతాలు వేశాడు. షష్ఠ్యంతాలు కృతి సమర్పించినప్పుడే (అంకిత మిచ్చినప్పుడే) వ్రాయబడతాయన్న పొరపాటు భావం సకారణంగా లోగడే త్రోసిపుచ్చబడింది. కావ్యం మధ్యలో వేసినా, కృత్యాదిలో వెయ్యకపోయినా మనుమసిద్ధిపై షష్ఠ్యంతాలను తిక్కన వ్రాశాడు. ఇప్పుడు అంకితమిచ్చినప్పుడే షష్ఠ్యంతాలు రచియింపబడతాయన్న భావం సరికాదని నిరూపించబడింది. కాబట్టి తిక్కన కృతిసమర్పణసందర్భంగా షష్ఠ్యంతాలు వెయ్యకపోయినా తర్వాత మానవపరంగా షష్ఠ్యంతాలు వ్రాసినవాడు తిక్కనే కాగలడు.

"కేతన తన దశకుమారచరితమును తిక్కనకు భక్తితో అంకితము గావించినాడు, కనుక కృత్యాదిని షష్ఠ్యంతములకు ప్రసక్తి కలిగినది." అని యీవ్రాతరి పేర్కొన్నారు.

కేతన వ్రాసిన షష్ఠ్యంతాలు అంకితవిషయమునకు సంబంధించినవి కావని లోగడనే నిరూపింపబడింది గదా! ఇంక కేతన దశకుమారచరిత్రను తిక్కనకు గౌరవంగా అంకితమిచ్చాడని చెప్పడానికి అవకాశం ఉన్నది గాని, భక్తితో యిచ్చాడనడానికి అవకాశం లేదు. "ఆసనార్ఘ్యపాద్యతాంబూలాంబరభరణదానాద్యుపచారంబులఁ బరితుష్టహృదయం జేసి నీవు సంస్కృతాద్యనేకభాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గాన నొక్కకావ్యంబు రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయునని సగౌరవంబుగాఁ బ్రార్థించిన" అని కేతన తనను తిక్కన సగౌరవంగా బ్రార్థించాడని స్పష్టంగా చెప్పుతున్నప్పుడు, ప్రార్థింపబడినవారికి ప్రార్థించినవారిపట్ల గౌరవభావం ఉండడానికి అవకాశం ఉన్నది గాని భక్తిభావం ఉండడానికి అవకాశంలేదు. కేతన తిక్కనకు శిష్యుడు కాడన్నవిషయం యీసందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాలి (చూ-ఆంధ్రభాషాభూషణం - దివ్యప్రభావివరణ సహితం - నా పీఠిక).

"కేతన గూడ నన్నెచోడునివలెనే యెనిమిది షష్ఠ్యంత కందములను వ్రాసినాడు" అని గూడ యీ వ్రాతరి వ్రాశారు.

ఆశ్వాసాంత్య పద్యాలుగా మూడు పద్యాలను తొలగించితే కేతన వేసిన షష్ఠ్యంత కందాలు యేడు మాత్రమే మొట్టమొదటగా వీరేశలింగంగారు ప్రచురించినప్రతిలో యేడు పద్యాలు మాత్రమే ఉన్నాయి. ఆశ్వాసాంత్యపద్యాలై షష్ఠ్యంతాలుగానే ఉన్న తిక్కనవి మూడూ కలిపితే మొత్తం పది పద్యాలు.

"ఎనిమిది షష్ఠ్యంతములకుఁ జివర మూఁడాశ్వాసాంతపద్యములను షష్ఠ్యంతములుగాఁ బ్రథమాశ్వాసము ముగించి ద్వితీయాశ్వాసాదిని గూడ నట్లే కందమును షష్ఠ్యంతముగా వ్రాసెను. ఇది యీతనియందలి ప్రత్యేకత. దీనిని గమనింపక కొందరు కేతన షష్ఠ్యంతకందములమధ్య దూలము వంటి శార్దూలమును వేసెనని విమర్శించిరి" - అని యీ వ్యాసకర్త వ్రాశారు.

ఇందులో యీ వ్యాసకర్త వెల్లడించదలచినభావం సువ్యక్తం కాలేదు. సామాన్యంగా షష్ఠ్యంతాలు కందపద్యాలుగానే నన్నెచోడాదులు వ్రాయడం చూచి "షష్ఠ్యంతాలు కందపద్యాలుగానే ఉండా" లన్న అభిప్రాయానికి వచ్చినవారు కొందరు షష్ఠ్యంతాలలో శార్దూలం కేతన వెయ్యడం బాగుండలేదని విమర్శించారు. తర్వాతి వారనేకులు షష్ఠ్యంతాలుగా కందాలనేకాక యితర వృత్తాలను సైతం వ్రాశారు. పోతన షష్ఠ్యంతాలన్నీ ఉత్పలమాలలుగానే వ్రాశాడు గదా! ఆశ్వాసాంతపద్యాలలో మొదట ఉత్పలమాల - చంపకమాల - శార్దూల - మత్తేభాలలో ఒక పద్యం, ఆ తర్వాత కందం - ఆ తర్వాత మాలిని మూడూ వరుసనే వెయ్యాలని కేతన నియమంగా పెట్టుకొన్నట్లు కనిపిస్తుంది. అందువల్ల తాను వేసిన యేడు షష్ఠ్యంతాల తర్వాత షష్ఠ్యంతాలుగా - శార్దూలం - కందం - మాలిని మూడుపద్యాలనూ వేసి ప్రథమాశ్వాసం ముగించాడు. ఆశ్వాసాంతంలో కేతన పెట్టుకొన్న మూడు పద్యాల నియమాన్ని గమనించనివారు చివరి మాలినివృత్తాన్ని ఒక్కదానినే ఆశ్వాసాంతపద్యంగా గ్రహించి మాలినికి పైనున్న "దేవేంద్రవిభునకు" ఇత్యాది కందపద్యాన్ని కూడా మామూలు షష్ఠ్యంతకందాలమధ్య దూలంవంటి శార్దూలం వేశాడని కేతనను విమర్శించారు.

పింగళి సూరన్న ప్రభావతీప్రద్యుమ్నంలో ఆశ్వాసాద్యంతపద్యాలు సంబోధనాంతాలుగా వ్రాయకుండా విభిన్నవిభక్త్యంతాలుగా వ్రాయడానికి కారణం కృతిపతి అయిన మారన తండ్రి మృతి పొందినందువల్ల అతనిని శ్రోతగా యెంచడానికి అవకాశం లేకపోవడమేననడం కేవలం పొరపాటు. శ్రోతగా యెన్నుకొనడానికి బ్రతికి నిజంగానే వింటూ ఉండనక్కరలేదు. మృతి పొందిన మానవునికూడా శ్రోతగా భావించి సంబోధించి కృతి చెప్పవచ్చును.

నన్నయ రాజరాజును శ్రోత గావించి భారతరచన చేశాడంటే అది భావంలోనే నిజంగానే ప్రతిమాటా ప్రతిపద్యమూ అతనికి వినిపిస్తూనే వ్రాశా డనడం, రాజరాజుసమక్షంలోనే భారతం వ్రాశా డనుకొనడం పొరపాటు - కొంతకొంతభాగం వ్రాసి రాజరాజుకు వినిపించుతూ వ్రాశా డనడం సమంజసంగా ఉంటుంది. శ్రోతగా యెంచుకొనడమనేది దృగ్గోచరుడు కాని భగవంతుని పట్లే చెల్లగా చనిపోయిన మానవునిపట్ల యెందుకు చెల్లదు? శ్రోతగా యెన్నడమనేది హృద్గతభావమే గాని యిరవై నాల్గుగంటలూ శ్రోత యెదురుగా కూర్చుని వ్రాస్తున్నదల్లా వింటూ ఉండాలనుకొనడం సరికాదు. సూరన విభిన్నవిభక్త్యంతాలుగా ఆశ్వాసాంత్యపద్యాలు వ్రాయడం అతను తిక్కనాదులను ఆదర్శంగా తీసుకొనడం వల్లనే జరిగిఉంటుంది తప్ప మరివేరుకాదు. నిర్వచనోత్తరరామాయణం, దశకుమారచరిత్రలోని ఆశ్వాసాద్యంతపద్యాలకు పట్టిన నిరర్థకత్వం అనన్వితత్వం ప్రభావతీప్రద్యుమ్నంలోని ప్రథమేతరవిభక్త్యంతాలైన ఆశ్వాసాద్యంత పద్యాలకు సైతం పడుతుంది.

షష్ఠ్యంతాలవిషయమై ఆశ్వాసాద్యంతపద్యాలవిషయమై తుదకు సంబోధనాంతాలవిషయమై కూడా యింతగా చర్చించవలసిన విశేషాలుండగా కృత్యవతారికలు గాని పూర్వ పర పద్య గద్య సమన్వయాలు గాని వేటినీ పరిశీలించకుండా షష్ఠ్యంతాల చరిత్రకు పూర్తిగా విరుద్ధమైన విషయాలను షష్ఠ్యంతాలచరిత్రగా వ్రాయడం విచారణీయమైన విషయం. (ఆంధ్రప్రభ-దినపత్రిక- 3 జూలై 1960)

ఇంతకూ యీ షష్ఠ్యంతాలచరిత్రను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు కేశవనామాదులపై ఆధారపడి అవతరించిన షష్ఠ్యంతాలు నరసింహకవి రచించిన నారదీయపురాణంలో శ్రీకృష్ణపరంగా సార్థకమై విరచింపబడ్డాయనే చెప్పవచ్చు. నారదీయపురాణం శ్రీకృష్ణాంకితమైంది కాబట్టి యిందులోని షష్ఠ్యంతపద్యాలుసైతం శ్రీకృష్ణవర్ణనాత్మకాలై ఉండడం రూపంగా షష్ఠ్యంతాల సంజనితత్వానికి సార్థకతను సమకూర్చాయనే చెప్పవచ్చు.

కృష్ణావతారవర్ణనలో అత్యంతశక్తివంతమైన తనసహజకవితామాధుర్యాన్ని, వైదుష్యాన్ని నరసింహకవి బహుముఖాలుగా చూపించాడు. ప్రబంధకవుల పోకడలను మనస్ఫురణకు తీసుకొని రాగలినట్లుగా తన కవితాధౌరంధర్యత్వాన్ని ప్రకటించాడు. మధురాపురవర్ణనాపరమై నరసింహకవి శబ్దశక్తికి ప్రతీకగా నిలువగల యీ క్రింది పద్యాన్ని తిలకించండి.

శ్రీ రాజవశ్యమై శ్రీ రాజవశ్యమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
కల్యాణ ధామమై కల్యాణ ధామమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
సుమనోభిరామమై సుమనోభిరామమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
సత్కళా పూర్ణమై సత్కళా పూర్ణమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి

ప్రబలెఁ భ్రాంతాభ్రశుభ్రతరంగిణీత
రంగ రంగన్మహాఫౌనరాజి రాజి
తాజరపయస్సుధాలేపనాంచితోచ్చ
గోపురశ్రీలనగు మథురాపురంబు.

కృతిపతి అయిన శ్రీకృష్ణావతారవర్ణనానంతరం కథాప్రారంభం కాగా మహర్షులు శ్రీమన్నారాయణుని దర్శించి నుతించి యాదవశైలక్షేత్రమాహాత్మ్యాన్ని గురించి వివరించవలసిందిగా ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు యాదవశైలక్షేత్రమాహాత్మ్యాన్ని బ్రహ్మ సనత్కుమారునికి వివరించగా ఆ సనత్కుమారుని ద్వారా నారదమహర్షి తెలుసుకున్నాడనీ ఆ నారదుడే ఆయా యాదవశైలక్షేత్రమాహాత్మ్యాలను మీకు వివరంగా తెలియజేస్తాడనీ చెప్పి విష్ణువు అదృశ్యమవుతాడు. ఈ విధంగా కథాప్రారంభం కాగా ఆ తరువాత నారదుడు మహర్షులకు ప్రత్యక్షమై యాదవశైలక్షేత్రమాహాత్మ్యం వర్ణన పేరుతో యీమొత్తం నారదీయపురాణవిశేషాలను చెప్పినట్లు స్పష్టపడుతున్నది. కాగా యీపురాణం మూలగ్రంథం నారదప్రోక్తమై నారదపురాణంగా అవతరించింది. (చూడు - తె. నార. పు. 79, 90, 93, 94, 105 పుటలు)

నారదీయపురాణం - శ్రుతులు

శృతి స్మృతి పురాణేతిహాసా లన్నది సంప్రదాయసిద్ధంగా అనాదికాలంనుంచీ వస్తున్న అనుశ్రుతవాక్యంగా గతంలో పేర్కొనడం జరిగింది. తత్కారణంగా పురాణాలలో గాని వాటి సంగ్రహరూపంగా అవతరించిన ఉపపురాణాలలో గాని వేదప్రామాణ్యం గురించి పేర్కొనబడడంలో ఆశ్చర్యకరమైన విషయ మేమీ లేదు.

అయితే శ్రుతిప్రామాణ్యందృష్టితో చూచినప్పుడు ఆర్య ద్రావిడ భాషాకుటుంబభేదాలను అనేకమంది పరిశోధకులు విభిన్నమైనవిగా పేర్కొనడం జరిగింది. ఈ రూపంగా మూలద్రావిడభాషకూ ప్రాచీనసంస్కృతభాషకూ సంబంధం లేదని పెక్కుమంది భాషాశాస్త్రవేత్తలు ఒకానొక విశిష్టనిర్ణయానికి రావడంకూడా జరిగింది. కాని గత పదిసంవత్సరాలుగా ఆర్షవిజ్ఞానం దృష్ట్యా సృష్టి - మానవజాత్యుత్పత్తి - భాషోత్పత్తి - భాషోత్పత్తికి మూలభూతమైన ముఖయంత్రప్రక్రియాసంచలనాది విశేషాలను మూలాధారంగా చేసుకుని నేను చేసిన అగాధమైన పరిశోధనలవల్ల ఆర్య ద్రావిడ భాషాకుటుంబాలు ఏకైకకుటుంబకాలన్న సంగతి తిరుగులేనివిధంగా నిరూపితమైంది. ఈ సత్యాన్వేషణాలక్ష్యంతో నృత్యసంగీతాలలో- ఛందోవిశేషాలలో - రసాలంకారాదులలో - "మార్గ-దేశి" భేదాలు లేవని దేశి మార్గాంతర్గత మైన ఒక భాగమేనని యీ రూపంగా ఆర్యద్రావిడ భాషాకుటుంబ భేదాలకు అవకాశం లేదని విస్పష్టంగా అజేయమైన పద్ధతిలో నా పరిశోధనారచన "మార్గ-దేశి" గ్రంథంలో నిరూపించి ఉన్నాను. ఈ గ్రంథంలోనే "మార్గ-దేశి" భేదాలపేరుతో భాషాపరంగా సైతం ఆర్యద్రావిడ భాషాకుటుంబాల భిన్నత్వాన్ని వక్కాణించే అవకాశం లేదనికూడా నేను సుదృఢంగా సూక్ష్మరూపంలో వెల్లడించాను. భాషాపరమై బహుముఖమైన నా మహత్తరపరిశోధనాగ్రంథం వెలుగు చూస్తేనే తప్ప యీ ఆర్యద్రావిడభాషాకుటుంబభేదాలు రూపు మాయవు. అయితే యీ సందర్భంలో ప్రాచీనకాలంలోనే ఆర్యద్రావిడభాషాభేదాలు లేవన్నదృష్టితో నరసింహకవి నారదీయపురాణ అవతారికలో

"ధరణి వేదంబులు ద్రావిడంబునఁ జేయు
            శ్రీ పరాంకుశయోగి శేఖరులను"

(నార-2 పుట. 7 ప.)

అని ఘంటాపథంగా వక్కాణించాడు. అలౌకికవాఙ్మయంగా అపౌరుషేయాలుగా భావించబడుతున్న సంస్కృతవేదాలను శ్రీ పరాంకుశయోగి ద్రావిడీకరించినట్లు పైపద్యపాదంలో నరసింహకవి సూటిగా వక్కాణించాడు. వైష్ణవమతస్థుడై ద్రావిడవేదాధ్యయనపరుడైన నరసింహకవి ద్రావిడవేదానికి మూలం సంస్కృతవేదమే నన్న సంగతిని విస్పష్టంగా పేర్కొన్నాడంటే దీనిని అంత తేలికగా మనం త్రోసిపుచ్చడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. అసలు ద్రావిడవేదాన్ని ప్రాణప్రదంగా భావించే వైష్ణవమతస్థులే సంస్కృతవేదాలను ద్రావిడంగా మార్చారనే అభిప్రాయంలో ఉన్నప్పుడు ద్రావిడవాఙ్మయానికి మూలభూతం శిరోమాణిక్యం వంటిదైన ద్రావిడవేదానికి స్వతంత్రప్రతిపత్తి లేదని యెలుగెత్తి చాటినట్లేకదా! కాగా సంస్కృతవేదాలు మూలంగా అవతరించిన ఆర్యభాషాకుటుంబం ద్రావిడవేదాల మూలంగా అవతరించిన ద్రావిడభాషాకుటుంబం విభిన్నమైనవని మనం చెప్పడం చాలా దుస్సాహసమే కాగలదు. పరాంకుశయోగి వేదాలను ద్రావిడంగా మార్చారని స్పష్టంగా వక్కాణించిన నరసింహకవి వాక్యం కేవలం నరసింహకవి పరికల్పితమని చెప్పడానికి అసలు అవకాశమే లేదు. అందువల్ల ఆర్యద్రావిడభాషాకుటుంబాలు యేకైకాలేనని మనం నిస్సంకోచంగా నిర్ణయించుకొనవచ్చును.

సంస్కృతవేదాలను పరాంకుశయోగి ద్రావిడీకరించారంటే ద్రావిడవేదంకంటే సంస్కృతవేదాలు ప్రాచీనాలన్న సంగతి నిర్ద్వంద్వంగా నిరూపితమవుతున్నది. అయితే సంస్కృత శ్రుతి, స్మృతుల మూలంగా అవతరించిన పురాణాలలో ఆయా శ్రుతి, స్మృతుల ప్రసక్తులుగాని వాటి ప్రామాణికతలుగాని పురాణోపపురాణాల్లో పేర్కొనబడడంలో విశేషంలేదు. సంస్కృతవేదాలకంటే ఆధునికమైన ద్రావిడవేదాన్నిపురాణోపపురాణాల్లో - ప్రత్యేకించి వైష్ణవపురాణాల్లో నైనాసరే ప్రామాణ్యంగా ఉదాహరించకపోవడంతో అసలే విశేషంలేదు. వివిధదృక్కోణాలలోను ప్రామాణికత అప్రామాణికతలు సహజంగానే మనకు ప్రత్యక్షమవుతాయి. కాగా పురాణోపపురాణవాఙ్మయందృష్ట్యా చూచినా ద్రావిడవేదానికి ప్రామాణ్యత కాని విశిష్టపరిగణన గాని లేదని స్పష్టపడుతున్నది. కాగా ఆర్యభాషాకుటుంబేతర మైన ద్రావిడభాషాకుటుంబవాదం త్రోసిరాజనబడక తప్పదు.

గతంలో వేదాల ఉత్పత్తి గురించి కొంత చర్చించడం జరిగింది. మామూలుగా మనం వేదాలు నాలుగూ బ్రహ్మ చతుర్ముఖాలనుంచే వెలువడ్డాయని అనుకొనడం జరుగుతున్నది. అయితే అసలు 'త్రయీవేదాః' అన్న వాక్యం వేదవాక్యంగానే మొదట వేదాలు మూడేనన్న సంగతిని స్పష్టపరుస్తున్నది. అయితే మొట్టమొదట ఋగ్యజుస్సామవేదాలు మూడూ బ్రహ్మ త్రిముఖాలనుంచి వెలువడ్డాయనీ కాగా ఈమూడు వేదాలు బ్రహ్మ మూడుముఖాలనుంచే వెలువడిన ఈ వేదాలలోనే ఉన్న వివిధ అస్త్రప్రయోగమంత్రాలను వినియోగించడానికి బ్రహ్మ తన నాలుగవముఖాన్ని ఉపయోగించాడని తద్రూపంగా వివిధ అస్త్ర మంత్ర తంత్ర యంత్ర విషయాలకు ఆలవాలాలైన వేదమంత్రాలతో అధర్వవేదం రూపొందిందనీ మనం భావించవచ్చును. కాని త్రేతనుడైన పురూరవుడు మొట్టమొదట ఏకైకంగా ఉన్న వేదాన్ని మూడువేదాలుగా విభజించినట్లు భాగవతం పేర్కొంటున్నది. అయితే వేదాలు తొలివాక్కులుగా పేర్కొనబడడంవల్ల అవి బ్రహ్మ చతుర్ముఖాలనుంచి అవతరించాయనే దృష్టితో చూస్తే భాషోత్పత్తికి మూలదేవత బ్రహ్మగా మనకు గోచరిస్తాడు. కాని మన గ్రంథాలు సరస్వతిని విద్యలన్నింటికి మూలభూతురాలుగా పేర్కొనడంకూడా కద్దు. అయినప్పుడు భాషామూలదేవతావ్యవస్థ బ్రహ్మనుంచి సరస్వతికి సంక్రమిస్తుంది. సరస్వతి బ్రహ్మముఖవాసినిగా వర్ణింపబడడంవల్ల - ఒకవేళ నాలుగువేదాలూ బ్రహ్మ చతుర్ముఖాలనుంచే వెలువడినా అవి వాణీముఖస్థాలుగా అవతరించినట్లుగా చెప్పకతప్పదు. అయితే వీటికి విరుద్ధంగా అసలు భాషలకు మూలకర్త మహేశ్వరుడే నన్న వాదం మరొకటి ఉన్నది.

"నృత్తవసానే నటరాజరాజో ననాద ఢక్కాంసవ పఞ్చవారమ్।
ఉద్ధర్తు కామస్సనకాది సిద్ధానేతద్విమర్శే శివసూత్రజాలమ్॥"

అన్న ప్రాచీనసంప్రదాయసిద్ధమైన శ్లోకం ప్రకారం మహేశ్వరుడు సనకాది మహర్షులను అనుగ్రహించే ఉద్దేశ్యంతో నృత్తావసానంలో పధ్నాలుగుసార్లు తనఢక్కాను వాయించగా భాషకు మూలభూతాలైన అక్షరసముచ్చయాదులు అవతరించినట్లు తేటతెల్లమవుతున్నది. ఈదృష్ట్యా భాషకు మూలభూతుడు మహేశ్వరుడు కాగా భాషామయమైన వేదాలకు మహేశ్వరుడే మూలకారకుడు కావలసి ఉన్నది. భాష లేనిదే వేదం లేదు కదా. భాష మహేశ్వరపరమైనప్పుడు వేదమూలకత్వం బ్రహ్మకు చెందడంలో ఔచిత్యం కనపడదు. లేదా వేదమూలకత్వం చతుర్ముఖబ్రహ్మకు చెందినప్పుడు భాషామూలకారకత్వం మహేశ్వరునికి చెందడానికి వీలు లేదు. ఈవిషయాల గురించి కొంతవరకు నేను నా "మార్గదేశి" పరిశోధనారచనలో వివరంగా చర్చించి వున్నాను.

అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో విష్ణువు కొకవిశిష్టమైన ప్రత్యేకత ఉన్నదని గతంలోనే నేను సాధికారంగా ఉటంకించాను. దీనికి తగినట్లు వేదాలమూలకారకత్వాన్ని అటు మహేశ్వరులకు గాని ఇటు వాణీచతుర్ముఖులకు గాని చెందనివ్వకుండా నారదీయపురాణంలో వేదాలకు మూలభూతుడు శ్రీ మహావిష్ణువే నని విష్ణువే బ్రహ్మకు వేదవిద్యలను నేర్పాడని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. శ్రీహరి నాభికమలం నుంచి చతుర్ముఖబ్రహ్మ ఉదయించినతరువాత బ్రహ్మ "హరిఃఓమ్" అని వేదానికి ఆదిభూతమైన అక్షరాలను ఉచ్చరించగా మహావిష్ణువు "ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం జూచి భగవంతుడు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁజేసె రహస్యం బెద్దియుఁ బ్రథమపుత్రునకుఁ బ్రియశిష్యునకు నెఱిగింపరానిది లేదు గావున సర్వంబు బోధింపవలయు" (నార. 97పుట. 18వ) అని విష్ణువు బ్రహ్మకు అనేకరహస్యాలు చెపుతాడు. నారదీయపురాణంలోనే వేరొక సందర్భంలోకూడా "వైకుంఠనాథునిచే సాక్షాత్కారంబున శ్రుత్యంతక్షీరసాగరమువలన సముద్భూతసారంబై విధాతకు నుపదేశంబయ్యె" (నార. 378 పుట. 247 వ.) అని శ్రుతిసారాన్ని విధాతకు విష్ణు వుపదేశించినట్లు మరొకసారి వక్కాణించడం జరిగింది. అంతేకాదు. బ్రహ్మ విష్ణోపదిష్టమైన వేదవిజ్ఞానసంభరితుడై సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నా ప్రళయాంతంలోనో మరొకప్పుడో రాక్షసుల బాధకు గురైకాని యితరవిధాలగాని బ్రహ్మ వేదవిజ్ఞానాన్ని కోల్పోయి సృష్టికర్మను నిర్వర్తించడంలో పెక్కుసార్లు నిస్సహాయు డయ్యాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్య, హయగ్రీవాది అవతారాలను యెత్తి వేదాలను అపహరించిన రాక్షసులను సంహరించి తిరిగి బ్రహ్మకు వేదవిజ్ఞానబిక్ష పెట్టి బ్రహ్మచేత సృష్టికర్మను యథావిధిగా నిర్వర్తింపచేసినట్లు పెక్కుపురాణాలు పేర్కొంటున్నాయి.

ఈదృష్ట్యా వేదాలు బ్రహ్మ చతుర్ముఖాలనుంచి మొదట వెలువడనే లేదని బ్రహ్మకు సార్థకంగా మహావిష్ణువు వాటిని ఉపదేశించాడని స్పష్టపడుతున్నది. కాగా వేదవాఙ్మయమూలకత్త్వం ఇటు బ్రహ్మసరస్వతులకుగాని అటు మహేశ్వరునకు గాని చెందకుండా శ్రీమహావిష్ణువుకే చెందుతున్నది. భాషామయమైన వేదమూలకత్వం విష్ణువుకే చెందినప్పుడు భాషామూలకత్వం మాత్రం విష్ణువుకు చెందదా!

వేదాలకు మూలకర్త మహేశ్వరుడే అయినా, సరస్వతే అయినా, చతుర్ముఖబ్రహ్మే అయినా, ఆ శ్రీమహావిష్ణువే అయునా వేదాలు వేదాలే. వేదాలు దైవీయాలే. "అనంతా నైవేదాః" అన్న వేదవాక్యం ప్రకారం దేవవేదాలు, అనంతశాఖాత్మకాలు. ఈ విషయాన్ని నారదీయపురాణంలో నరసింహకవి ధర్మాధర్మాభిమాన దేవతలు ఆత్మవృత్తిప్రకారం గురించి చెప్పేసందర్భంలో "మాకు సాక్షి యనంతశాఖ వేదాభిమానము గలిగిన నిత్యదేవత. ఈ నిత్యదేవత పలికిన పల్కు శంకించరాదు. నిరామయమైనది." (నార. 399 పుట. 49. వ) అని వేదాలు అనంతాలుగా పేర్కొన్నాడు. ఈ అనంతకాలంలో అనంతవేదవిజ్ఞానం బహుముఖంగా వ్యాప్తిచెందినపుడు అపౌరుషేయమైన అమరవాఙ్మయం పౌరుషేయవాఙ్మయంవలె మానవుల నోళ్ళల్లో పడినప్పుడు వాటిల్లో భ్రమ ప్రమాదాలవల్ల కానివ్వండి, మరొకకారణంచేత కానివ్వండి కొన్ని కొన్నిమార్పులు వచ్చి విభిన్నసిద్ధాంతబోధకాలైన విషయాలు విరుద్ధార్థాలు తొంగిచూడడం అసహజం కాదు. కాగా వేదవ్యాఖ్యానాలలోగాని, స్మృతుల ప్రవచనాలలోకాని భిన్నత్వం గోచరం కావడం అబ్బురం కాదు. ఈ దృష్ట్యానే "హరివాసరంబున భుజింపుమనువారు సత్పురుషులు గారు. భుజింపుమనినవి స్మృతులు గావు. వేదములు గావు." అని నారదీయపురాణం (279 పుట 70 వ) స్పష్టంగా ఉగ్గడించింది. దీనినిబట్టి వేదపాఠాలలోను, స్మృతుల పాఠాలలోను విభిన్నభావాత్మకాలైన పాఠాలున్నట్లు మనకు తేట తెల్లమౌతున్నది. అపౌరుషేయమైన వేదవాఙ్మయం మానవుల నోళ్ళల్లో పడిన తరువాత అది ఎంత దేవవాఙ్మయం అయినా దైవీయాలైన శక్తులులేని మానవుల నోళ్ళల్లో పడినందువల్ల కేవలం అర్ధభావాలలోనే కాక శబ్దస్వరాది విషయాలలో సైతం విభిన్నత్వం మహర్షులకాలంలోనే తొంగిచూచింది. ఈ విషయాన్ని నరసింహకవి "విస్వరంబగు యజుర్వేదంబునుంబోలె స్వరహీనంబగు సామంబునుం బోలెఁ బదహీనయగు ఋక్కునుంబోలె (నార. 308 పుట 191. వ) అని యజుర్వేదంబులో విస్వరత్వం యేర్పడినట్లు, సామవేదంలో స్వరహీనత్వం చోటు చేసుకున్నట్లు, ఋక్కులలో పరహీనత్వం సైతం తొంగిచూచినట్లు స్పష్టంగా పేర్కొన్నాడు. స్వరహీనత్వం వేరు, విస్వరత్వం వేరు. అసలు స్వరమే లేకపోవడం స్వరహీనత్వం కాగా, దుష్టస్వరా లేర్పడడం విస్వరం అనబడుతుంది. పురమే లేనప్పు డంతఃపురం యెక్కడ వుంటుందన్నట్లు, ఋక్కులలో అసలు పదమే లేకపోతే మనం స్వరం గురించి చెప్పగలిగిందేమీ ఉండదు కదా! వేదవాఙ్మయంలో విస్వరత్వమే యేర్పడినా, స్వర హీనత్వమే యేర్పడినా పదభ్రష్టతయే కలిగినా కేవల మానవదృష్టితోకాక ఆర్షవిజ్ఞానం దృష్ట్యా దైవీయదృక్పథంతో చూచినప్పుడు దేవత్వానికి, వేదత్వానికి భిన్నత్వం గోచరంకాదు. ఆర్షభాషావాఙ్మయవిజ్ఞానాలను దృష్టిలో పెట్టుకొని మనం పరిశీలించినప్పుడు స్వరపదాదుల అనులోమ, విలోమత్వాలతో అసలైన ఘనస్వరూపం నిరూపితమౌతుంది. ఒకానొకసందర్భంలో "ఘనము ఘనమని ఘనాఘనమని ఘనఘనమ్ముగ నెరుగు ఘనుడే జటావల్లభుడవు నతండే విటలాక్షుండగు నతండే" అని నేను వ్రాసిన చరణం నిజమైన దేవవేదఘనాపాఠిత్వానికి నిర్వచనం. అసలు ఘనాపాఠిలోని ఘనాశబ్దార్థమే తెలియని వేదపండితనామకులు దేవవేదస్వరూపాన్ని కాని, వేదదేవస్వరూపాన్ని కాని గుర్తించగలననుకొనడం హాస్యాస్పదం కాగలదు. "దేవ" శబ్దాన్ని స్వరాలతో పాటు అక్షరాలను సైతం వ్యత్యస్తం చేస్తే "వేద" శబ్దం రూపొందుతుంది. ఇదేవిధంగా "వేద" శబ్దాన్ని స్వరాలతో పాటు అక్షరాలను వ్యత్యస్తం చేస్తే "దేవ" శబ్దం రూపొందుతుంది. వేదఅనుష్ఠానపద్ధతి గాని, ఆర్షవిజ్ఞానరహస్యం గాని యీ వ్యత్యస్తపద్ధతిలోనే పరిగర్భితమై వున్నది. ఈ రహస్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వేదాలు దైవీయాలుగా పేర్కొనడం జరిగింది. మానవాళి అజ్ఞానంవల్ల పొరపాట్లు దొర్లవచ్చును గాని, భ్రమప్రమాదాలకు లోను కావచ్చునుగాని, యేమైనా దేవవేదాలు దేవవేదాలేగదా! ఈవిషయాన్ని నరసింహకవి "విష్ణుమహిమ - ఉభయపదప్రాప్తి" అన్న విషయాలను వివరిస్తూ "మహౌదార్య, సుశీలత్వ, వాత్సల్యాది నిజసద్గుణంబులతోఁ గూడినవాడై సర్వదేవవేదహృదయాహ్లాదముచే సిద్ధచతుర్దశమహాలోకంబులందు శ్రీ వైకుంఠశ్వేతద్వీపక్షీరాబ్దులయందును" (నార. 365-పుట, 193-వ) అని వేదదేవత్వాన్ని విస్పష్టంగా వక్కాణించాడు.

నరసింహకవి విభిన్నాలైన వేదవిషయాలను వివిధసందర్భాలలో నారదీయపురాణంలో వివరించాడు. కాలచక్రం గురించి వర్ణిస్తూ అది అధోముఖమై పరిభ్రమిస్తూ ఉంటుందని, త్రిగుణాత్మకమైన మధ్యభాగనాభిమిళితమై ఉంటుందని యీక్రింది పద్యంలో స్పష్టంగా పేర్కొన్నాడు:

"ఘనతరమయి యసంఖ్యమయి బ్రహ్మలోక
         మౌనట్టి పరవ్యోమ మరయ నెద్ది
యదియ విశుద్ధతత్త్వాఖ్యతత్వంబు సు
         షిరమున నామించి చెలఁగె నది త్రి
పాద్భూతితదురుత్రిపాద్భూత్యధోభాగ
        మధ్యదేశైకసమాశ్రయమునఁ
దగు నతర్క్యాద్భుతతరశక్తికంబుగ
        వ్యయముననైన కాలాఖ్యతత్వ

మది యధోముఖచక్రమై యంటి తిఱుఁగుఁ
బరగుఁ దదవస్థలీమధ్యభాగనాభి
మిళితమై త్రిగుణాత్మయై మెలఁగ నాయ
జాదులకునైన నెఱుఁగ శక్యంబె దాని."

(నార. 370-పుట. 214-వ)

ఇందులో కాలంలో త్రినాభివిభాగం గురించి నరసింహకవి స్పష్టంగా పేర్కొన్నాడు. శుక్ల, కృష్ణ పక్షాలు కలిస్తే ఒకమాసమని. రెండుమాసాలు ఒకఋతువని, ఆరుమాసాలు ఒక అయనమని యీ రూపంగా సంవత్సరాత్మకమైన కాలచక్రానికి రెండయనాలు, ఆరు ఋతువులు, పన్నెండుమాసాలు అని మాసంలో శుక్కృష్ణ భేదాలతో రెండు పక్షాలని ప్రాచీనకాలంనుంచి అందరూ భావిస్తున్నారు. నిజానికి రెండుమాసా లొకఋతు వైనట్లుగా, రెండు ఋతువులు ఒక నాభికాలమై కాలస్వరూపస్వభావాతను బట్టి ఆరు ఋతువులను రెండేసి ఋతువుల కొక నాభివంతున మూడు నాభులుగా - ఉష్ణనాభి, జలనాభి, శీతనాభులుగా - వేదర్షి గుర్తించి యీ క్రింది ఋగ్వేదమంత్రాల్లో ఒకటికి రెండుసార్లు ప్రకటించాడు.

ద్వాదశ ప్రథమః చక్రమేకం
త్రీణినభ్యానిక ఉతిచ్చికేత

(ఋగ్వే. 1 మం. 24 సూక్తం-48 ఋక్కు)

త్రినాభి చక్రమజరమనర్వం
యత్రేమా విశ్వాభువనాధి తస్థుః

(ఋగ్వే. 1 మం. 164 సూక్తం-2 ఋక్కు)

ఈ నాభికాలవిభజన గురించి మన ప్రాచీనఖగోళాదిశాస్త్రవేత్తలు యెక్కడా ప్రస్తావించకపోవడం చూస్తే మన వేదవిజ్ఞానం యెంత దుస్థితికి దిగజారిందో మనకు తేటతెల్లమౌతుంది. కాలంలో నాభిభాగం గురించి గతంలో (ఆంధ్రప్రభ-దినపత్రిక. 9-9-1962) ఒక వ్యాసంలో నేను వివరంగా చర్చించి ఉన్నాను. ఈత్రినాభికాలవిభజనను దృష్టిలో పెట్టుకొనే మన సామాన్యప్రజానీకంలో నాలుగుమాసాలు అంటే రెండు ఋతువులు ఒకనాభి అయినట్లు - నాలుగు మాసాలకాలం ఒక కాలవిభాగంగా - వేసాకాలం - వర్షాకాలం - శీతాకాలంగా చిరకాలంగా వ్యవహారంలో పాతుకొనివున్నది. ఈ త్రికాలనాభివ్యవస్థ ఇటు సామాన్యప్రజానీకవ్యవహారంలోనూ, అటు ఋగ్వేదంలోనూ సకృత్తుగా నారదీయపురాణంవంటి గ్రంథాలలోను నిలిచి వున్నదే గాని, యీ మధ్య అవతరించిన శాస్త్రవాఙ్మయంలో మాత్రం మటుమాయమైపోయింది. ఇదే నాభికాలవిభాగంగురించి మహాకవి కాళిదాసు తన కుమారసంభవంలో పార్వతితపోవర్ణనాసందర్భంగా శ్లేషాత్మకంగా యీక్రిందిశ్లోకంలో ఉటంకించాడు :-

"స్థితాః క్షణం పక్ష్మసుతాడితా ధరాః
పయోధరోత్సేధ నిపాత చూర్ణితాః
వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే
చిరేణ నాభిం ప్రథమోదబిందవః"

(కుమా. 5-సర్గ, 24-శ్లో)

మేఘాలు ఒకదాని నొకటి ఒరుచుకొనడం ద్వారా మొట్టమొదట బృహత్తరబిందువులరూపంలో పైనుంచి వర్షం ప్రారంభమవడం, రానురాను క్రిందికి వచ్చేసరికి చిన్నచిన్నముక్కలుగా విడిపోవడం, వర్షం కురిసిన తరువాత భూమిమీద వివిధప్రదేశాలలో నీరు నిలవడం, తిరిగి అది సూర్యరశ్మికారణంగా ఆవిరిరూపం దాల్చి మూలస్థానానికి అంటే నాభిస్థానానికి చేరుకుంటుందన్న విశిష్టవైజ్ఞానికశ్లేషార్థాన్ని మల్లినాథసూరి గుర్తించకపోవచ్చును గాని వేదవిజ్ఞానప్రతిబింబకమైన యీశ్లోకంలోని శ్లేషార్థాన్ని విశిష్టశబ్దప్రయోగాలను మనం కాదని త్రోసిపుచ్చలేము.

నరసింహకవి శ్రుతులతోపాటు స్మృతులను సైతం ప్రామాణికాలుగా గ్రహించాడు. "ధరశ్రుతి స్మృతి వైరుధ్యతరము చైత్య సేవనాదిక కర్మముల్ సేయుచుంద్రు.........." (నార. 442-పుట. 219-వ) అని కేవల శ్రుతివైరుధ్యకర్మలనే కాక స్మృతివైరుధ్యకర్మలను సైతం ఆచరించే మూఢులను తిరస్కరించాడు. "అఖిలము నేనె నాకంటె నన్యం బెద్దియును లే దన్యంబు గలదనుట వేదోక్తంబు గాదు. ద్విజులమైన మనకు వేద మప్రమాణ మనరాదు. వేదప్రామాణ్యవిసంవాదము బహువాదులకుం గలదని వినంబడియె. లోకాయతనాగతకాణాదులు" (నార. 430-పుట. -69-వ) అని వేదామోదాన్ని తిరుగులేని వేదప్రామాణ్యాన్ని ఒకసారి పేర్కొనడమే కాక "శ్రుతిప్రామాణ్యవిశ్వాసపరత వైదికాచారరుచియు వేదాంతవేద్యుండైన హరియందు భక్తి యనల్పతపము" (నార. 440-పుట. 210-ప) అని వేరొకసారి వేదప్రామాణ్యాన్ని పునరుద్ఘాటించాడు. అంతేకాదు. వేదాలు సత్కార్యపరాలని, సత్ఫలదాయకాలని "సమస్తవేదంబులును గార్యపరంబు, శ్రేయస్సును గార్యపరమే; శ్రుతి తాత్పర్యగోచరమైన శ్రేయస్సు దానికంటె మరియొకటి కాదు;" (నార. 403. పు. 51-వ) అని విస్పష్టంగా ఉగ్గడించాడు. విభిన్నాలైన వేదభాష్యా లేవిధంగా ఉన్నా అనేకార్థదాయకాలై, బహుముఖాలైన వేదవిషయాల అంతర్యాన్ని నరసింహకవి కొంత ఆకళించుకున్నట్లు కన్పిస్తున్నది. వేదాలు గూఢార్థకాలని, చిత్రార్థకాలని, వివిధార్థకాలని, కొన్నసందర్భాలలో విస్పష్టంగా నరసింహకవి వక్కాణించాడు.

సాంగంబులై సరహన్యంబులైన వేదంబులు చదివి వ్యుత్పత్తి లేశజనితతద్వేదార్థవివేకరేఖలు గలవారై తద్బోధశోధననయములను గురుముఖంబులువలనం దెలిసి యశేషమూర్తియైన స్వామిని సుగమార్థంబుగా నెఱుంగంగలరు.

మ.

హరిపాదాబ్జయుగంబు గొల్చి సరహస్యాశేషవేదస్ఫుర
త్పురుషోత్తంసనిజాశయం బెఱిఁగి యుద్బోధామృతాస్వాదులై
పరమోత్కృష్టులఁ జేసి తత్పదరజఃపట్టాభిషేకంబుతో
దురసంతామరు లెన్న డుండెదరొ సాధు ల్మెచ్చ వీతార్థులై.


మ.

అని యీరీతి దయాళుదివ్యనివహాత్యంతైకశోచ్యక్రియా
ఘనదుర్బోధనివిష్టచిత్తుల వృథాగర్వాంధులన్ వేదవి
త్తనిరోధార్థకరాత్ములం గని వినీతత్వంబునన్ మ్రొక్క మ
న్నన నీక్షించి ప్రియంబు వల్కఁ దగదెన్నన్ సజ్జనుం డెన్నఁడున్.

(నార. 406-పుట-51-వ 52, 53-ప)

ఆర్షవిజ్ఞానమయాలైన వేదాలకు తద్విజ్ఞానరహితులైన పండితనామకులు వేదాలకు అప్రామాణికాలైన భాష్యాలు రచించి అసలు మనమహర్షుల వేదవిజ్ఞానానికే యెసరు పెట్టారని నేను గతంలో అనేకసార్లు పేర్కొన్నాను. గత పదిహేనుసంవత్సరాలలోనూ ఆంధ్రప్రభ, గోల్కొండపత్రికవంటి దినపత్రికలలోనూ, అనేకాలైన ఆకాశవాణి ప్రసంగాలలోనూ ప్రాచీనవేదాలలో వున్న పరమవైజ్ఞానికరహస్యాలను బహుముఖాలుగా, సప్రామాణికంగా, తిరుగులేనివిధంగా నిరూపించాను. ఈదృష్ట్యా విద్యారణ్యుల వేదభాష్య మనబడిన సాయణభాష్యం సైతం ప్రత్యక్షరప్రామాణికం కాదని నిర్ద్వంద్వంగా పెక్కువ్యాసాలలో నిరూపించాను. నరసింహకవి ధర్మాధర్మాభిమానదేవతలు, ఆత్మవృత్తిప్రకారం గురించి వర్ణించినసందర్భాన్ని పురస్కరించుకుని వేదాభిమానదేవతాప్రసక్తి తెచ్చి తద్దేవతాతత్వవేది యయిన వ్యాసమహర్షిచేత యీక్రిందివిధంగా పలికించాడు.

"వత్సా! యీ దుర్వాదృగ్యాది జన్మనిమిత్తంబు నీ వెఱింగియును దద్వాక్యంబులకు క్షుద్రనయార్థిత్వప్రసిద్ధికొఱకు నడిగితివి. విను; మిటువలె వాదించు వాదులం బూర్వంబునందు నందికేశ్వరునిచేత శపింపఁబడిన దేవద్వేషులు భూమి యందుఁ బెక్కండ్రు నిర్భాగ్యద్విజులై కుమేధస్సులై పుట్టి యయాధాభిదైకదేశలేశులై తోఁచినట్లు వేదార్థనిర్ణయమునందు నింత యనియెడు పరిమితిని వేదంబునందు నింతయన్న పరిమితిని, కూపకూర్మసమానాభిమానులై వేదాంతసాగరంబుల నసంఖ్యేయంబులఁగా నెఱుఁగక దేవమాయామోహితులై తలంచిరి. సమస్తవేదంబులును గార్యపరమే కావలయునని తన్నయంబునం బలికి వేదంబునందును బదవాచ్యబుద్ధిలోకవ్యుత్పత్తిమూల మైనదియె; కార్యానన్వితసిద్దార్థవిషయమై లోకంబునందుఁ బదసంగతి లేదు."

(నార. 402,పుట.51-వ)

ఈ సందర్భంలో బ్రాహ్మణులు దేవద్వేషులై, నిర్భాగ్యద్విజులై, కుమేధస్సులై భూమిమీద పుట్టి వేదార్థవిధ్వంసం చేస్తారని నరసింహకవి సూటిగా వ్యాసమహర్షిచేత చెప్పించాడు. నరసింహకవి వెల్లడించిన యీ యభిప్రాయం నేను గతపదిహేనుసంవత్సరాలుగా బహుముఖాలుగా పరిశోధనలు చేసి రచించి ప్రకటించిన అనేకవ్యాసాలలో, రేడియో ప్రసంగాలలో ప్రాచీనవేదభాష్యాలు ప్రత్యక్షరప్రామాణికాలు కావని నిరూపించిన విషయాన్ని సుదృఢంగా బలపరుస్తున్నది.

నరసింహకవి వివిధవేదాలలో పరిశ్రమించాడనడానికి సాక్షీభూతంగా తననారదీయపురాణంలో వివిధసందర్భాలలో విభిన్నవేదమంత్రభాగాలను ఉటంకించాడు. "ఆత్మ-దేహాదుల" గుఱించి వివరిస్తూ వేదపురుషుడు నాకు తెలుసునని చెప్పే "వేదాః మేతం పురుషం మహాంతమ్" అనే వేదవాక్యాన్ని (నార. 327. పుట. 35-వ) ఉదాహరించాడు. బ్రహ్మవిద్యారహస్యవివరణసందర్భంగా

ఇలలోన బ్రహ్మవిద్యా
కలితులకుఁ బునర్భవములు గలుగవు పరుఁడై
వెలయు హరి నెఱిఁగి మృత్యు
ప్రళయముఁ దాఁటునని శ్రుతి తిరంబుగఁ బలికెన్.

(నార. 327-పుట. 40 ప)

అని శ్రుతిప్రమాణవిషయాన్ని పేర్కొన్నాడు. ఆ తరువాత "శ్రీవిష్ణుధామంబు పునరావృత్తిరహితం బని పార్థసారధి యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ' అని యానతిచ్చె." అని భగవద్గీతావాక్యాన్ని ఉదాహరించినా "యేష దేవోవమో బ్రహ్మపథానేన పరంగతా ఇమమ్ మానవ మావ రంతే" యను శ్రుతి యున్నయది గానఁ బునరావృత్తిరహితం బని పార్థస్ఫురర్ధాము లగువారికి పునరావృత్తి యెక్కడిది యని కొంద ఱాడుదురు" అని శ్రుతిప్రామాణ్యాన్ని వక్కాణించాడు. (నార. 328 పుట. 41-ప). అనంతరం ఈ బ్రహ్మవిద్యారహస్యవిషయకంగానే ఒకవంక శ్రుతిప్రామాణ్యాన్ని పేర్కొంటూనే మరోవంక బ్రహ్మసూత్రప్రామాణ్యాన్ని సైతం పేర్కొన్నాడు.

"భవాదృశబ్రహ్మవిత్పాదపద్మసేవాసుధ లేకక్షామమానవ హంసులైనవారికిఁ బ్రజ్ఞాజ్ఞప్తిపుష్టత యెక్కడిది. యజ్ఞాది శ్రుతి వలన బ్రహ్మవిద్య కర్మాంగకంబె యని వినంబడియె. ఆ బ్రహ్మవిద్యకు నశ్వంబునకు గమనసాధనంబులం బలె బ్రహ్మవిద్యకు సర్వాపేక్షయుం గలదని 'సర్వాపేక్షాచ యజ్ఞాదిశ్రుతే రశ్వవత్త'ని సూత్రం బొనర్చితివి అయినను నొకసందేహంబు గల దడిగెద."

(నార. 331-332-పు. 54-ప)

తరువాత పరబ్రహ్మరహస్యార్థాన్ని వర్ణిస్తూ "అత్రాయం పురుషః పరంజ్యోతిరూపం సంవద్య స్వేనరూపేణాభి నిష్పర్యతే అవహత పాప్మా విజరోప మృత్యుర్విశొకో విజిఘత్సో విపిపాసన సత్యకామ సత్ సంకల్ప" (నార. 343-పు, 112-ప) అని శ్రుతివాక్యాన్ని ఉదాహరించాడు. ఇదేవిధంగా వైకుంఠలోకాన్నిగుఱించి ఆవరణపంచకంగుఱించి వివరించే సందర్భంలో "మధ్యే మధ్యేత్వ సంఖ్యే యా స్తత్త ద్వ్యుహన్" (నార. 358-పు, 171 ప) అని శ్రుతివాక్యాన్ని ప్రామాణికంగా పేర్కొన్నాడు. అనంతరం విష్ణుమహిమ, ఉభయపదప్రాప్తి గుఱించి వర్ణిస్తూ మహావిష్ణువుయొక్క మహాశక్తిని అపూర్వ అమేయశక్తిని బహుముఖంగా వర్ణించే వేదమంత్రాన్ని సవివరంగా ఈక్రిందివిధంగా పేర్కొన్నాడు. ఈసందర్భంలో శ్రుతులతోపాటు స్మృతులతో సైతం తదర్థనిర్వాహకాలని శ్రుతులతరువాత స్మృతులకు స్థాన మిస్తూ స్పష్టీకరించాడు. నరసింహకవి అమోఘమైన విష్ణుశక్తిని గురించి వేదమంత్రప్రామాణ్యంతో వివరించిన ఘట్ట మిది.

"అపాణి పాదోజ వనోగ్రహితాపశ్యంత చక్షుః సశ్రుణోనకంనః
సవేత్యవేద్యం నచనశ్యవేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్
నకస్యకార్యం కరణంచ విద్యతే నతత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే
పరాస్య శక్తే ర్వివిధైవ శ్రూయతే స్వాభావిక జ్ఞాన బలక్రియాచ"

యనిన నది హస్తంబులు లేక పట్టును. పాదంబులు లేక పఱువెత్తును. చక్షువులు లేక చూచును. కర్ణంబులు లేక వినును. అవేద్యంబైన యది యెఱుంగును. త న్నొకం డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుం డని యెంతురు. అతనికిఁ గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతనిశక్తి వివిధంబైన యదియై స్వాభావికంబులు జ్ఞాన బల క్రియలు. అతని వినుతింప నలవియగునె. భగవంతుని శక్తు లవాఙ్మానసగోచరంబులని పురాణంబులం జెప్పంబడియె. ఉత్పత్తి స్థితి లయంబులయందు సర్వశక్తులు భగవంతునికే కలవు. శ్రుతి స్మృతులే తదర్థనిర్వాహకంబులై యుండు." (నార. 364-పుట. 189-వ) ప్రత్యేకించి ఈ ఉభయపదప్రాప్తివిషయకసందర్భంగానే ఈక్రింది వచనంలో నరసింహకవి వాక్యసైతంగా యజుర్వేద ప్రామాణికతను పేర్కొన్నాడు.

"ఈ యజుర్వేదంబు సత్వదవాఙ్మాననవిత్తముండవై నన్నెఱుంగక యట్లు "సహోవాచ వ్యాసః పారాశర్య" యని నిస్వోదేరితార్ధంబునందు నే వచనము ప్రమాణంబుగాఁ బలికె నింతకంటె నిన్ను నెట్లు నుతింపవచ్చు నీవే లోకోత్తరుండ వగుట." (నార. 366-పు. 195. ప.) నరసింహకవి అన్యస్థలాలలో జీవపరమాత్మలకు భేదం సిద్ధమై ఉంటుందని జీవబ్రహ్మలూ దేహదేహివత్త్వాలను పొందుతారని వేదమంత్రప్రమాణపూర్వకంగా నిరూపించాడు. శ్రుతికి వ్యాకరణం అంగం అని పేర్కొంటూ "శ్రోతామాన్తా" అని వేదోక్తచేతనాన్యత్త్వాన్ని వక్కాణించి అనంతరం జీవపరమాత్మల భేదసిద్ధిని వక్కాణిస్తూ ఈ క్రింది వేదమంత్రాన్ని ఉదాహరించాడు.

"క్షరం ప్రధాన మవృతో౽క్షరః
క్షరాత్మనా విశతే దేవమేకం,
భోక్తా భోజ్యం ప్రేరితారం చమత్వా
జుష్టస్తస్మాదమృతత్వమేతి."

(నార. 389-పుట. 14-వ)

ఈ సందర్భంలోనే అఖిలహేయప్రతిభటత్వం విష్ణువు సొమ్ముగా వర్ణిస్తూ "తమేవ విధి" ఇత్యాది "మృత్యుమేతీ" త్యాది "వేదవాక్యంబ విద్యావిషయభూతుండ" - (నార. 392-పుట. 22-వ) అని వేదవాక్యాలను ఉదాహరించాడు. ధర్మాధర్మాభిమానదేవతలు ఆత్మవృత్తి ప్రకారంగురించి తెలుపుతూ "వేదార్థం బైన మిక్కిలియుం న్నెఱుంగరు; సర్వశబ్దంబులకును లోకంబుల యందుఁ గార్యాన్వితార్థత గల దాలిజాదికంబునకు లౌకికంబునందుఁ గార్యాన్వితార్థత్వంబు లేదు గాని లౌకికమైన 'గామాన' యేతి వాక్యంబునం దానయము కార్యంబుగా దాపద మేమిటి చేతఁ గార్యాన్వితార్థ మయ్యెడి" (నార. 404-పు. 51 వ) అని వేదవిషయాలను వివరించాడు.

నరసింహకవి అపూర్వ అమేయ వేదాభిమానదేవతకు పరమభక్తుడుగా కనిపిస్తున్నాడు. తనకున్న అనుపమానమైన వేదాభిమానాన్ని యెలుగెత్తి చాటడంకోసం సనకాదులను విష్ణువు కరుణించినవిధం గురించి వర్ణించిన ఘట్టంలో వేదవైశిష్ట్యంగురించి పేర్కొంటూ వేదవిజ్ఞానరహితులైన వ్యక్తులు జీవించడంకంటే అని మాత్రమే కాదు వేదవిజ్ఞానవిరుద్ధబుద్ధులైన మానవులను ఆశ్రయించి బ్రతకడం కంటే చావడం మేలని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నరసింహకవి "నిగమాంతనిషేధకులైన వారి నాశ్రయించి బ్రతుకుటకంటెఁ దనుత్యాగంబు సేయుట మేలని బాహ్యదృష్టులు లేని దేశంబునకుఁ జని నైమిశాది పుణ్యక్షేత్రంబుల విజ్వరులై పరబ్రహ్మోపనిషద్ భావనం కొందఱు ప్రవర్తిల్లుదురు" (నార. 377-పు. 247-వ) అని స్పష్టంగా పేర్కొన్నాడు. ధర్మాధర్మాభిమానదేవతలతోపాటు ప్రత్యేకవిశిష్టతతో వేదాభిమానదేవతను సైతం ఒక అపూర్వదేవతగా వర్ణించిన నరసింహకవికి ఇంతటి వేదాభిమాన ముండడంలో మనం ఆశ్చర్యపడవలసిం దేమీ లేదు. నరసింహకవి ప్రబోధనీమహిమ గురించి వర్ణించిన సందర్భంలో వేదవాఙ్మయంయొక్క మహత్తత్వంగురించి యెంతో మహోన్నతదృక్పథంలో వర్ణించాడు.

"బహువాదమూలమై భాషించు వేదంబు
          యజ్ఞకర్మ క్రియాద్యంబు వేద
మఖిల గృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
          స్మృతి మర్మవిద్య యా హృద్యవేద
మమిత పురాణ రహస్య తంత్రము వేద
         మాదిత్య పురుష జన్మములు జగము
లట్లైన వాఙ్మయంబంతయు నీ పురా
         ణంబులయందె ధన్యత వహించె
నట్లు గానఁ బురాణార్థ మధికతరము
తెలియ వేదార్థమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము చేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబులెల్ల.

పరమార్థం బెఱుంగలేక యల్పశ్రుతులైన వారు మదర్థం బితిహాస పురాణ స్మృతి నిర్ణీతంబైన దానిం జెఱుతు రని వేదంబులు పలుకు. వేదంబునందు గ్రహసంచారంబును లగ్నశుద్ధియుఁ దిథి వృద్ధి క్షయంబులు గాన్పింపవు; యాజ్యాయాజ్యులు నేర్పడరు; బ్రహ్మహత్యాదులకుఁ బ్రాయశ్చితాదులు నిర్ణయింపఁబడవు" - (నార. 275 పు. 54-వ) అని నరసింహకవి వేదవాఙ్మయమహత్తత్వాన్ని వర్ణించి వేదంలో గ్రహసంచారాది విషయాలు లేవని విస్పష్టంగా పేర్కొనడం ద్వారా తన వేదఖగోళవిషయ అనభిజ్ఞతను వెల్లడించాడు. వాస్తవానికి వేదవాఙ్మయం బహుముఖమైన ఖగోళ జ్యోతిర్మంత్రతంత్రాది విషయాలకు మహాకల్పవృక్షం వంటిది. "దశదిశో నానాసూర్యాః" అని సౌరమండలాలు అనేకం ఉన్నాయని పేర్కొన్న వేదవాఙ్మయంలో "సూర్యఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః" అని సూర్యుడు స్వతంత్రంగా వెలుగొందుతున్నా డని సూర్యతేజఃప్రభావంతో చంద్రుడు ప్రకాశిస్తున్నా డని స్పష్టంగా పేర్కొన్న వేదవాఙ్మయంలో గ్రహగతులు గురించి వర్ణింపబడలేదనడం హాస్యాస్పదమైన విషయం. 1964 సెప్టెంబరు 13 వ తేదీన ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం నుంచి ప్రసారమైన నా ప్రసంగంలో వేదఋషుల ఖగోళవిజ్ఞానంగురించి వివరంగా పేర్కొంటూ ఋగ్వేదఋషి సధ్రి - మామూలుగా మనశాస్త్రాలు చెప్పినట్లు తొమ్మిదిగ్రహాలు కాక - మొత్తం 36 గ్రహాలున్నట్లుగా గుర్తించి ఒక ఋక్కులో స్పష్టపరచినట్లు నేను బయటపెట్టాను.

"షట్త్రింశాంశ్చ చతురః కల్పయన్త
శ్చన్దాంసిచ దధత అద్వాదశమ్।
యజ్ఞం విమాయ కవయో మనీష
ఋక్సామాభ్యాం ప్రరథం వర్తయన్తి॥

(ఋగ్వే-10 మం-8 అష్ట-114 సూక్తం-6 ఋక్కు)

వేదర్షియైన సధ్రి "షట్త్రింశాంశ్చ" ఇత్యాదిగా ఉన్న ఈ ఋక్కులో తొమ్మిదీ, పదీ, ఇరవైకావు మొత్తం 36 గ్రహా లున్నట్లు పేర్కొన్నాడు. ఈ 36 గ్రహసంఖ్యనే సంఖ్యాశాస్త్రానుగుణంగా తరువాత జ్యోతిశాస్త్రవేత్తలు 3+6 = 9 గా- నవగ్రహాలుగా తగ్గించి పేర్కొన్నట్లు స్పష్టమవుతున్నదని అప్పటి నా ఆకాశవాణి ప్రసంగంలో సప్రామాణికంగా నిరూపించాను. యజుర్వేదం శుక్లకృష్ణయజుర్వేదాలుగా రెండుగా విభజింపబడి శుక్లబహుళపక్షపరమై "దశదిశో నానాచంద్రమాః" అన్నట్లు అనేకానేకచంద్రగోళాల రహస్యాలను వాటి వృద్ధిక్షయాలను శుక్లకృష్ణపక్షాలపరంగా ఖగోళవిజ్ఞానప్రతిబింబమై ప్రత్యక్షప్రమాణంగా వెలుగొందుతూ ఉండగా వేదవాఙ్మయంలో తిథుల వృద్ధిక్షయాలగురించి పేర్కొనలేదనడం నరసింహకవి వేద ఖగోళవిజ్ఞాన అనభిజ్ఞతకు గీటురాయిగా గోచరమవుతున్నది. సూర్యచంద్రోదయాస్తమయాలను వర్ణించిన వేదాలు వివిధరాసులనేకాక దశదిక్కులనేకాక అష్టదిగ్గజాలనుసైతం ఖగోళశాస్త్రపరంగా పరమవైజ్ఞానికాలుగా వర్ణించగా లగ్నవిషయాలను వర్ణించలేదనడం కేవలం అజ్ఞానవిలసితమే కాగలదు. ఏమైనా వేదవాఙ్మయంపట్ల నరసింహకవి కున్న అధ్యయనాభివేశాన్ని అభిమానగౌరవాలను మనం హృదయపూర్వకంగా ప్రశంసించవలసిందే.

నారదీయపురాణం - ఉపనిషత్తులు

శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలన్న వాక్యం ప్రకారం గతంలో ఉటంకించిన భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు సైతం వాస్తవానికి పురాణాలకంటే ఆధునికాలుగానే పరిగణించవలసి వున్నది. కాని ఉపపురాణ, పురాణాలలోసైతం అనేకసందర్భాలలో ఉపనిషద్విషయాలను పేర్కొనడం తద్గతవాక్యాలను ఉదాహరించడం కూడా జరిగింది. అయితే యివి ప్రక్షిప్తాలుగా అనంతరకాలంలో చేర్చబడ్డాయేమోనని అనిపిస్తుంది. కొన్నిసందర్భాలలో సంస్కృతమూలపురాణోపపురాణాలలో లేనిచోట్లకూడా అనువాదకర్తలు తమ ప్రతిభాపాండిత్యాలను ప్రదర్శించడంకోసం తా మధ్యయనం చేసిన బహుళగ్రంథాలవిషయం యితరులకు తెలపడంకోసం పూర్వాపరకాలవ్యత్యాసనిర్ణయాల ఊహ లేకుండా చారిత్రకదృష్టికి భిన్నంగా పెక్కువిషయాలు ఉటంకించారు. ఇదేపద్ధతిలో నరసింహకవి సైతం వివిధసందర్భాలలో ఉపనిషద్విషయాలను పేర్కొన్నాడు. కొన్నిసందర్బాలలో ఉపనిషద్విషయం అని పేర్కొంటూ మరికొన్నిసందర్బాలలో అసలు ఉపనిషద్వాక్యాలను సైతం ఉదాహరించాడు. ఉపనిషత్తులలో వేదమంత్రాలు పేర్కొనబడి వ్యాఖ్యాతాలౌతాయి. కాబట్టి ఉపనిషత్తులలో పేర్కొనబడిన వేదమంత్రభాగాలను సైతం ఉపనిషద్వాక్యాలుగానే పేర్కొనడం జరిగింది. పరబ్రహ్మతత్త్వం గురించి వివరించే సందర్భంలో సూర్యునివల్ల ఆరోగ్యం, నలునివల్ల సంపద, శంకరునివల్ల బోధ, విష్ణువువల్ల ముక్తి పొందాలని ఉపనిషత్ప్రోక్తమైనట్లు నరసింహకవి యీ క్రింది పద్యంలో పేర్కొన్నాడు.

"అర్కుని వలన నారోగ్య మాయె నలుని
వలన సిరియును శంకరు వలన బోధ
మచ్యుతు వలన ముక్తియు నందవలయు
ననఁగ నుపనిషదుక్తి యుక్తార్థముగను"

(నారా. 327 పు. 37 ప.)

పరబ్రహ్మరహస్యార్థవిశేషాలను వర్ణిస్తూ, అనేక ఉపనిషద్విషయాలను ప్రత్యేకవిశిష్టతతో వివరించాడు. త్రిపాద్విభూత్యుపనిషత్తు వొకటి వున్నట్లు విజ్ఞులందరికీ తెలిసిన విషయమే. అయితే పరబ్రహ్మరహస్యార్థవిద్యాసాధనలో పురుషుడు అధిగమించవలసిన అత్యున్నతమైన లౌకికశక్తులలో త్రిపాద్విభూతిశక్తి వొకటి త్రిపాద్విభూత్యుపనిషద్విషయాలను జీర్ణించుకొని సిద్ధిపొందిన వ్యక్తి తద్విషయాలను అతిక్రమించగలడు. ఈ విషయాన్ని వేదప్రామాణ్యంగా వక్కాణిస్తూ నరసింహకవి యీ క్రింది పద్యం రచించాడు.

"తెలిపగఁ ద్రిపాద్విభూతి నతిక్రమించి
యే పురుషుఁడుండు శుద్ధ సమిద్ధ మహిమ
నాతఁ డాద్యుండు పరమాత్మ యవ్యయుండు
ఘనతరుండు పరంజ్యోతి యనియె శ్రుతియు."

(నార. 344 పు : 113. ప)

ఉపనిషద్విద్యలపరంగా నరసింహకవి వివిధ ఆవరణల విషయాలను పండితైకవేద్యంగా, వేదవేదాంతవేద్యంగా, అతివిపులంగా వర్ణించాడు.

ఏ యే యావరణంబుల
నే యే లోకంబు లుండు నెఱిఁగింపుము నా
కా యుపనిషదుక్తుల విని
యా యజముఖ్యులు నిజాలయస్పృహ విడువన్.

(నార. 345. పు : 120. ప)

అని శకునిచేత ప్రశ్నింపజేసి పంచావరణాగణ్యనియతలోకాలను పరాశరాత్మజునిద్వారా, ప్రకృష్ణంగా తెలియజేశాడు. వైష్ణవుల వైశిష్ట్యం గురించి వర్ణించే సందర్భంలో "ఇది మొదలుగా నేతద్వాక్యోప బృంహిత మహోపనిషదాద్యుపనిషత్తులయందును హరి లాంఛనంబు వహింపఁగా వలయునని వినంబడియె మరియు" (నార. 351 పు : 136. వ.). వైష్ణవ ప్రతికూలానుకూలానుభయభేదాలను వివరించే సందర్భంగా -

"గురుభక్తిమైఁ బ్రతికూలానుకూలాను
       భయభేదముల నేరుపడిన చేత
నుల నెఱింగి సుధీజనుండు నిజాధిక
       రోచితంబుగఁ దగు నాచరింప
నుపనిషన్మతవాక్యయోజన నూహించి
       హరి సమాధిరహితాత్ముఁ డనిన"

(నార. 353. పు : 150 ప.)

అని వైష్ణవవిభేదాలన్నీ ఉపనిషన్మతసమ్మతాలుగానే పేర్కొన్నాడు. అనంతరం వేదాంతమతవైశిష్ట్యం గురించి వివరిస్తూ "బాహ్యదృష్టులు లేని దేశంబునకుం జని నైమిశాది పుణ్యక్షేత్రంబుల విజ్వరులై పరబ్రహ్మోపనిషద్భావనం గొందరు ప్రవర్తిల్లుదురు" (నార. 377. పు : 247. వ.) అని పరబ్రహ్మోపనిషద్విషయాన్ని ఉదాహరించాడు. తరువాత ఉపనిషద్పక్షవ్యతిరేకులైన దుష్టులు సత్పురుషులను దుర్మార్గాలలో యేవిధంగా పెడతారో పేర్కొంటూ "మరియు నుపనిషత్పక్షంబున కాక్షేపంబు పుట్టించి ప్రాణసంహారపర్యంతంబు ననుదినంబును భయంబు నొందించి ఖలులు సత్పురుషులచేతఁ దత్పక్షంబు విడిపించిరి. కొందఱు బాహ్యమతవిషాబ్ధి మునింగిరి. కొందఱు నూరుసూరులు వహ్నిపరీతంబులైన భవనంబులు విడిచినయట్లు నిజదేశంబులు విడిచి చనిరి. బాహ్యాగమ్యదేశంబుఁ బ్రవేశించి సూరులు మఱికొందఱు దీనులై కానంబడక విష్ణువును భజించిరి. సంసారవిషవారాశియందు నమృతంబైన వేదాంతదర్శనంబు తద్ద్వేషోదధినిమగ్నంబై యుండిన విషయకాంక్షులగు సురలకు వేదాంతవిచారంబులు వలువదు. సాత్వికు లాసురభయంబున వేదాంతంబు నుడవ వెఱతు రది గావున వైష్ణవుల కిచ్చట నిలువం జనదని సనకాదులు హరిమాయాప్రభావంబు ప్రశంసింపుచు బ్రహ్మాండంబు వెడలి మహాభూతావరణంబునకుం జని." (నార. 378. పు. 249. వ) అని వివరించాడు. శ్రీమహావిష్ణుమహత్తరశక్తిని వర్ణిస్తూ "శ్రీ మద్విభూతిం దనరునితండు సర్వోపనిషదగ్ధంబు, మహాప్రభువు." (నార. 499 పు. 235. వ.) అని సర్వోపనిషదర్థస్వరూపుడుగా పేర్కొన్నాడు.

పరబ్రహ్మతత్త్వాన్ని వివరించే సందర్భంలో సర్వాంతర్యామి అయిన హరిని వర్ణిస్తూ "ఇందునకు 'యో బ్రహ్మణా విదధాతిపూర' మ్మను నుపనిషద్వాక్యంబు గలదు." (నార. 326. పు. 33. వ) అని ఉపనిషద్వాక్యాన్ని ఉదాహరించాడు. నరసింహకవి అనేక ఉపనిషత్తులను ప్రత్యేకంగా పరిశోధించినట్లు కనిపిస్తున్నది. మామూలుగా పండితమండలిలో ఉపనిషత్తులు అష్టోత్తరశతసంఖ్యకే పరిమితాలని ఒక అభిప్రాయం వున్నా కల్పితాలుగానో, కాకుండనో 120 వరకూ ఉపనిషత్తులు అవతరించాయి. నరసింహకవి 'విశ్వైక్యోపనిషత్తు' అనే పేరుగల ఒక ఉపనిషత్తును పరిశోధించినట్లు జీవపరమాత్మల భేదసిద్దిగురించి వివరించే సందర్భంలో "తేజంబు వోయినవెనుక మందిరం బంధకారావృతంబయిన నంధకారంబ యని యందురు; ఇత్తెఱఁగున విశ్వైక్యోపనిషద్వాక్యంబులకు గతి గలిగియుండుటం జేసి యైక్యవాక్యంబులకు శ్రుత్యేపికావగతమహదార్యచేతనైక్యవాక్యంబులకు ముఖ్యార్థహీనత యెక్కడిది?" (నార. 390. పు. 14. వ.) అని విశ్వైక్యోపనిషద్విషయాన్ని పేర్కొన్నాడు. అంటే నరసింహకవికాలంలో వున్న విశ్వైక్యోపనిషత్తు మన కిప్పుడు లభ్యం కాలేదు కాబట్టి, ప్రాచీనకాలంలో ప్రామాణికాలుగా భావించబడిన ఉపనిషత్తులు కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయని మనకు తేటతెల్ల మవుతున్నది. విష్ణుమహిమ-ఉభయపదప్రాప్తి గురించి వర్ణిస్తూ "శ్రుతి స్మృతులే తదర్థనిర్వాహకంబులై యుండు? (నార. 364. పు. 189. వ.) అని ఉపనిషత్తులను విడిచిపెట్టి శ్రుతి, స్మృతులను మాత్రమే ప్రామాణికాలుగా పేర్కొన్నాడు. అయితే ఆధునికా లనబడుతున్న ఉపనిషత్తులు నరసింహకవి దృష్టిలో నరసింహావతారకాలంకంటే పూర్వమే స్థానాన్ని సంపాదించుకొన్నాయి. హిరణ్యకశిపుడు బ్రహ్మవల్ల వరాలు పొందిన తరువాత పేరోలగంలో మాట్లాడుతూ "ఉపనిషత్తులకు సిద్ధవస్తువిషయంబైన ప్రామాణ్యం బంగీకరింపఁబడదు." (నార. 431. పు. 169. వ.) అని ఉపనిషత్తుల ప్రామాణికత్వాన్ని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంలో ఉపనిషత్తులు నరసింహావతారకాలానికి పూర్వమే ఆవిర్భవించినట్లు స్థానం సంపాయించుకున్నాయన్నమాట. అలా వుండగా - శౌరి, సనకాదులకు కర్మకాండాది విషయాలు తెలిపేసందర్భంలో అసలు విష్ణువే "ఇట్లు నాకు స్వాధీనవిశ్వత్వ ముపనిషత్తులు పలికెనట్లనే నాకుఁ గర్మకాండంబును సావకాశంబయ్యె నిందునకు సందేహంబు లేశంబును లేదు; నన్ను నెవ్వి యడుగవలయు రహస్యం బడిగెద రది యెఱింగింతు వినుండు." (నార. 413-పు. 83. వ) అని ఉపనిషత్తుల గురించి పేర్కొన్నట్లు నరసింహకవి రచించాడు. కొన్నిసందర్భాలలో కేవల శ్రుతి స్మృతులే పరమప్రామాణికాలని నరసింహకవి పేర్కొన్నా, అసలు ఉపనిషత్తులుకూడా వేదాలవలెనే దేవవాఙ్మయంగా భావించినట్లు కనిపిస్తున్నది. సర్వేశ్వరుని సర్వజనేచ్ఛానువృత్తిని గురించి వివరించే సందర్భంలో ప్రత్యక్షమైన విష్ణువును నుతించిన తరువాత వైష్ణవేతరులైన మూర్ఖుల గురించి చెబుతూ

కొందఱు మూఢులు గురుతత్వధీవాత
         భావతావన్మాత్ర దేవతోప
నిషదాగమములు కొన్ని యెఱింగికొని స్వమ
         నీషానుసారైకనియతమహిమ"

(నార. 382 పు 260. ప)

అని ఉపనిషదాగమాలు దేవవాఙ్మయంగా విస్పష్టంగా వక్కాణించాడు. నరసింహకవి ఉపనిషత్తులను వేదాలవలె దేవవాఙ్మయంగా భావించబట్టే, అటు హిరణ్యకశిపుని నోటివెంట, యిటు శ్రీ మహావిష్ణువు నోటితోసైతం ఉపనిషద్విషయాలను ప్రస్తావింపజేసినట్లు కనిపిస్తున్నది.

పురాణగాథల కాలనిర్ణయంలో వ్యత్యాసాలు - స్వవచనవ్యాఘాతాలు

పురాణం వివిధవేదార్థాలను సూటిగా ప్రతిబింబస్తాయని నరసింహకవి యీ క్రిందిపద్యంలో విస్పష్టంగా వక్కాణించాడు.

"బహువాదమూలమై భాషించు వేదంబు
        యజ్ఞకర్మక్రియాచ్యంబు వేద
మఖిలగృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
        స్మృతి మర్మవిద్యయౌ హృద్యవేద

మమితపురాణరహస్యతంత్రము వేద
         మాదిత్యపురుషజన్మములు జగము
లట్లైన వాఙ్మయంబంతయు నీపురా
         ణంబులయందె ధన్యతవహించె
నట్లుగానఁ బురాణార్థ మధికతరము
తెలియ వేదార్థమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము జేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబులెల్ల."

(నార. 275. పు. 53 ప.)

అయితే కొన్నిసందర్భాలలో ఉపనిషత్తులకు తరువాత - పురాణాలమాట చెప్పలేము కాని - ఉపపురాణాలు అవతరించాయన్న భావంతో నరసింహకవి అనేకసందర్భాలలో ఉపనిషద్వాక్యాలను ఉదాహరించాడు. ఆత్మదేహాదుల విషయమై వివరించే సందర్భంగా "క్షతం ప్రధాన మమృతాక్షరమ్మ" నియెడి యుపనిషద్వాక్యంబు గలదు............. 'ఏకోదేవ సర్వభూతేషు' అనియెడి యుపనిషద్వాక్యంబు గలదు.................... 'సపర్యగాచ్ఛుక్రమకాయ మప్రణమ్మ'ను ఉపనిషద్వాక్యంబు గలదు.... 'నిత్యోనిత్యానామ్‌' అనియెడి యుపనిషద్వాక్యంబు గలదు." (నార. 325. పు. 29. వ) అని అనేక ఉపనిషద్వాక్యాలను ప్రామాణికాలుగా ఉదాహరించాడు. ఇదేవిధంగా వేదాంతరహస్యంగురించి వివరించేసందర్భంలో సైతం విప్రుడనేవాడు అంగాలతో సహా ఉపనిషత్పూర్వకాలుగా వేదాలు చదవాలని యీక్రిందిపద్యంలో స్పష్టంగా పేర్కొన్నాడు.

"సాంగోపనిషత్పూర్వక
ముంగా వేదములు చదవి మురజిత్సేవా
సంగంబులేని విప్రుఁడు
వెంగలి తజ్జన్మ మెల్ల విఫలం బెంచన్."

(నార. 335. పు: 68. ప)

వాస్తవం పరిశీలిస్తే పురాణగాథలు కాని, ఉపపురాణగాథలు కాని సూత్రప్రాయంగా ఏకైకసూత్రబద్ధాలేనని పూర్వాపరకాలవ్యత్యాసాలకు అవకాశం కల్పించేవి కావనీ, కల్పాలపరంగా కాని, యుగాలపరంగా కాని మనం ఆమోదించవలసివుంటుంది. కాని దేశభాషలలోకి పురాణోపపురాణాలను అనువదించేటప్పుడు అనువాదకులు యీపూర్వాపరకాలవ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకొని భూత భవిష్యద్వర్తమానకాలాదిక్రియలను ప్రయోగించినట్లు కనపడదు. నారదీయపురాణాన్ని చదివితే ప్రహ్లాదుడు సంజనితుడవ్వడానికి పూర్వమే ప్రహ్లాదాదిచరిత్రలు నారదుడు చెప్పినట్లు అర్థమవుతుంది. కాని కొన్నిసందర్భాలలో భూతభవిషద్వాచకాలైన క్రియలను ఉపయోగించడంలో నరసింహకవి తికమకలు పడినట్లు స్పష్టంగా విదిత మౌతున్నది. విష్ణుచిత్తుడు ప్రహ్లాదునికంటె పూర్వుడు. విష్ణుచిత్తునికథావర్ణనాసందర్భంలో నరసింహకవి యీ క్రింది పద్యం రచించాడు.

"విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి
యరుగుదెంచితిఁ బ్రహ్లాదుఁ డండ్రు నన్ను
నీమహత్వంబు విని విని నీరజాక్ష
భక్తినిష్టాపరత్వ మేర్పడఁగఁ గంటి."

(నార. 168. పు. 105. ప.)

ఆతరువాత విష్ణుచిత్తునికి విష్ణువు ప్రత్యక్షమైన విషయాన్ని వర్ణించి "కాంచి మ్రొక్కి నుతించి బ్రహ్మాదిలోకంబులు నిరసించిన యమ్మహానుభావుండు సద్యోముక్తుం డయ్యెనని చెప్పిన, ఋషులు విని నారదున కిట్లనిరి." (నార. 169. పు.112. వ.) అని నరసింహకవి వ్రాయడంద్వారా - ప్రత్యేకించి "సద్యోముక్తుం డయ్యె" అన్న భూతకాలక్రియను ప్రయోగించి నారదుడు చెప్పినట్లుగానే వ్రాయడంద్వారా ప్రహ్లాదాదిచరిత్రలు జరిగిన అనంతరమే నారదుడు ఋషుల కీకథను చెప్పినట్లు ద్యోతకమవుతున్నది. రత్నావళి వృత్తాంతవర్ణనాసందర్భంగా ఒకరాక్షసుడు కాశీపతిపుత్రియైన రత్నావళిని హరించిన సందర్భంలో నరసింహకవి "దశాననుండు సీతంబోలె హరించి, మొఱలిడ నంకంబున నిడికొని" (నార.288. పు. 118. వ) అని సీతను రావణాసురు డపహరించినవిషయంతో పోల్చి నరసింహావతారానికి పూర్వమే వ్రాయబడిన నారదీయపురాణం రామాయణంతరువాత రచింపబడిందన్న అభిప్రాయం కలిగేట్లుగా నరసింహకవి పూర్వపరదృష్టిలేకుండా రచించాడు. పరబ్రహ్మరహస్యార్థంగురించి వివరించే సందర్భంలో నరసింహకవి "ప్రథితేతిహాసపురాణోపబృంహితోపనిషన్మతము పరబ్రహ్మపరమధామాక్షరాదిపదవిశిష్టసంజ్ఞక మాగమేతరదూర మనఘతరము" (నార. 342. పు.105. ప) అని భారతేతిహాసాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినట్లు కనిపిస్తున్నది. ఇదేవిధంగా మోహిని, రాజు ధర్మాంగదుణ్ని చంపాలని కోరేసందర్భంలో "పురందరునకుఁ గర్ణుండు చర్మం జొప్పింపఁడె?" (నార. 302. పు. 168. వ.) అని ధర్మాంగదుని కథ భారతగాథానంతరం జరిగినట్లుగా పొరపాటున పేర్కొనబడింది. ఇదేవిధంగా నరసింహకవి మోక్షోపాయతహితాన్ని వివరించే సందర్భంగా "ఖట్వాంగుఁడను రాజర్షి ముహూర్తాయుఃప్రమాణం బెఱింగి సర్వంబు విసర్జించి హరిం జెందె. పరీక్షితుండు సప్తాహంబు జీవితావధిగాఁ దెలిసి నిఖిలంబుం బరిత్యజించి యపవర్గంబు గాంచె నట్లగుట న్యాసవిద్య సర్వఫలప్రద." (నార. 340 పు. 95. వ) అని ద్వాపరయుగాంతంలో వున్న పరీక్షిత్తుగురించి పేర్కొని 'అపవర్గంబు గాంచె" అని భూతకాలక్రియను ప్రయోగించడం రూపంగా యీ నారదీయపురాణం పరీక్షిత్తుకు తరువాతనే అంటే కలియుగంలో రచించబడిందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాడు. ఇదేవిధంగా అనేకసందర్భాలలో కలియుగంలో బాగా ఆధునికా లనుకొన్న విషయాలను సైతం "అంగవేదియైన పాణిని యజిధాతువును దేవపూజయందు విధించెను." (నార. 400. పు. 49. వ.) అని "విధించెను" అనే భూతార్థకక్రియను వాడడంద్వారా నారదీయపురాణం పాణినికి తరువాత రచింపబడిందన్న అభిప్రాయాన్ని కలిగించాడు. ఈ నరసింహకవే శౌరిసనకాదులకు కర్మకాండాదివిషయాలు తెలిపేసందర్భంగా "అనీశ్వరాత్ములై కర్మములందు స్వతంత్రులు గానివారికిఁ గర్తృత్వ మెక్కడిది? పాణిని స్వతంత్రః కర్తా యనఁడు గాన," (నార. 409. పు. 63. వ.) అని 'అనఁడు' అను భవిష్యదర్థకమైన క్రియను ప్రయోగించడంద్వారా "భవిష్యత్తులో పాణిని చెప్పడు" అని శౌరి పేర్కొన్నట్లు స్పష్టంగా ఉటంకించాడు. "వేదాంతమతమునకంటె నన్యమగు మతము మంచిదికాదని తెలియక యీ వేదాంతమతము నాదరించక యీ ప్రకారమునను స్వగోష్ఠినిష్ఠులైన ఛాందసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతికల్పనులైన మోహంబు నొందించి రప్పుడు.

మహిని సురాచార్యమతము లోకాయత
         మతమును సౌగతమతము భార
తీశమతంబు మిహేశమతంబును
         జైమినిమతమును జైనమతము
కాణాదమతమును గౌతమమతమును
         గపిలమతంబును ఘనత కెక్క
నంతకంటెను బ్రశస్తంబె వేదాంతమ
         తంబు సభాసమ్మతంబె తెలియ
నభ్రపుష్పోపమంబు వేదాంతమతము
తన్మహాసౌరభాఘ్రాణతత్పరాభి
మానమాయామిళిందాయమానమాన
మానవులు గొంద రంద్రు దుర్మత్సరమున.

అద్దురాత్ములు పలికిన ట్లపుడె నమ్మి
యందుఁబడి యాసురాత్ములై యఖిలజనులు
వైదికాచారవిముఖులై వైష్ణవులును
విష్ణుదేవుని నిందించి విమతులైరి."

(నార. 377. పుట, 244, 245, 246.ప)

ఇత్యాది సందర్భాలలో భూతకాలక్రియలను ఉపయోగించడం ద్వారా పురాణప్రామాణికతను, ప్రాచీనతను ఆధునికయుగానికి తీసుకొనివచ్చి, అసలు పురాణాలు భవిష్యద్వాణిగా ప్రోక్తా లయ్యాయనే అభిప్రాయానికి గొడ్డలిపెట్టుగా ప్రాచీనాధునాతనకాలచరిత్రజ్ఞానవిరహితత్వంవల్ల స్వవచనవ్యాఘాతంగా రచన కొనసాగించాడు. అనేకానేకాలైన ఆధునికమతాలను పేర్కొనడంద్వారా చివరికి "జైమినియందు జైనవీరులయందు మొదలు సత్పురుషులకు విశ్వాసంబు పుట్టింపుచున్నవాఁడై యతివాదంబుచేతం గర్మైకప్రాధాన్యాదికంబును సూచించె."

(నార. 406. పు. 51. వ.)

అమరగురు బుద్ధకణ భుగర్హజ్జినేంద్ర
గౌతమాదులు సాధులోకద్విషద్బ్ర
మంబు గావింప బాహ్యశాస్త్రంబులెల్ల
మేరమీఱఁగఁ గొన్ని నిర్మించి రంత"

(నార. 441. పు. 216. ప.)

అని బుద్ధమతాలన్నే కాక, జైనవీరమతాన్నిసైతం పేర్కొనడంద్వారా నారదీయపురాణప్రాచీనత్వాన్ని అర్వాచీనం చేసి అప్రామాణికం చేశాడు. చివరికి హిరణ్యకశిపుని వర్ణించిన సందర్భంలోసైతం "ఆజ్ఞాసిద్ద శ్రౌతహింస జైనుండుఁ బోలె దూషింపుచు." (నార. 433. పు. 176. వ) అని హిరణ్యకశిపుని జైనమతస్థునితో పోల్చి నరసింహకవి తన పూర్వాపరకాల అనభిజ్ఞతను నిరూపించుకున్నాడు. నరసింహకవి తృతీయాశ్వాసంలో పాషండమతభేదాల గురించి చెపుతూ భవిష్యద్వాణిగా కాణాద, శాక్త్య, పాషండ, జైనాది మతాలు భవిష్యత్తులో తలయెత్తుతాయని యీ క్రిందివిధంగా పేర్కొన్నాడు. "అనిన (నతఁడు వారికి) నిట్లనియె. కాణాద శాక్త్య పాషండ జైన ప్రముఖులు నరకాంగారవర్ధనులై విజ్ఞానం బొకానొకప్పుడు చెఱచి దేహవ్యతిరిక్తంబైన యాత్మలేదు. కేవలమును దేహమె యాత్మ యనుట యర్హంబని తెలియంబడుచున్నది గాన దేహాను రూఫంబుగా వర్తింపవలయు. తపోయజ్ఞదానయోగార్చనంబులు సేయుట వృథాయాసంబులని తత్త్వంబునం జూచువారిని మహీతలంబున మోహంబు నొందింతురు. కొంద ఱాత్మదేహభిన్నంబని యెఱింగియు నాదేహంబునకు క్షణవినాశత్వంబు తర్కకర్కశులై పల్కుదురు. (నార. 147, 148. పు. 5. ప.) అని ఈ సందర్భంలో నారదుడు మునులకు చెప్పినట్లుగా సూతుడు శౌనకాదులకు చెప్పిన ప్రవచనంలో భవిష్యదర్దకమైన "పల్కుదురు" అన్న క్రియను విస్పష్టంగా ప్రయోగించడం మనం గుర్తించవలసి వున్నది. అనంతరం సరిగ్గా నాలుగుపద్యాల తరువాతనే "శఠునఁ బాషండజనులను సంహరించె" అని శాండిల్యుడనే మహర్షి పాషండజైనులను సంహరించినట్లు భూతార్థకక్రియను సూటిగా ప్రయోగిస్తూ నరసింహకవి యీ క్రిందిపద్యం రచించాడు.

"రూఢి శాండిల్యుఁ డను మునీంద్రుండు మున్ను
పాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌ నట్లొనర్చు
శఠులఁ బాషండజనులను సంహరించె."

(నార. 149. పు. 10. ప.)

ఇదేవిధంగా ప్రహ్లాదుడు సభలో నిలిచి తన పాండిత్యతత్త్వ విష్ణుభక్తి మహత్వాలను వివరించిన సందర్భంలో-

"పాషండమతగర్వపర్వతంబులమీఁద
         దంభోళియై మహోద్ధతి వహించి
చార్వాకమతమహాసాగరావళిమీఁద
         నౌర్వానలస్ఫూర్తి నాక్రమించి
బౌద్ధదంతావళోద్భటఘటార్భటిమీఁద
         సింహరాజంబు ప్రసిద్ధి నెదిరి
జైనమహారణ్యసంఘాతములమీఁద
         నతులదావానలంబై స్ఫురించి
కపిలాక్షపాద కాణాచ వైరించ
మత ఘనాంధరమున మండలార్క
మండలప్రకాండఖండనోద్దండత
నట జయించె నాకయాధసుతుఁడు."

(నార. 445. పు. 5. ప.)

ఇందులో చార్వాక, బౌద్ద, జైనాది మతాలను నరసింహకవి తనకు పూర్వకాలంలో అవతరించి వ్యాప్తిచెందిన వాటి నన్నిటిని పేర్కొన్నాడు. నారదుడు మునులకు చెప్పినట్లు సూతమహర్షి శౌనకాదులకు చెప్పిన పద్ధతి చూస్తే, శాండిల్యమహర్షితోపాటు వివిధపాషండమతాలన్నీ నారదమహర్షికి పూర్వకాలంలోనే వున్నట్లు మనం

భావించవలసి వస్తుంది. నరసింహకవి తన రచనను కొనసాగించేటప్పుడు, సరైన ఆలోచనాక్రమం లేకుండా, పూర్వాపరకాలవిచక్షణ లేకుండా భూతార్థకక్రియలు ప్రయోగించడంవల్ల లేనిపోని తికమకలు తెచ్చిపెట్టాడు. ఇదేవిధంగా ఏకాదశీమాహాత్మ్యవర్ణన సందర్భంలో

"సరణిఁ గానరు యోగంబు సాంఖ్యయోగ
మనఁగ విన రెన్నఁడేని స్వాధ్యాయమైన
హవనకృత్యంబుఁ జేయరు దివిరి వారు
హరిపదముఁ గాంచి రిట్ల యత్యద్భుతంబు."

(నార. 201. పు. 59. ప.))

అని ఆధునిక మతమైన సాంఖ్యయోగప్రసక్తి తెచ్చి "కాంచిరి" అని భూతార్థకక్రియను సైతం ప్రయోగించాడు.

సుచరితునకు కల్యాణతీర్థమహిమను గంగానది చెప్పిన సందర్భంలో నరసింహకవి భూమండలంమీద ద్రవిడదేశాన్ని దారిద్ర్యవారణుడనే రాజు పరిపాలిస్తున్నట్లు "భూతలమునందు ద్రవిడదేశం బేలు దారిద్ర్యవారణుండను రాజు వేఁడిన యంతకంటెఁ దెలివితో నిచ్చుననుచు బోధింప" (నార. 115. పు. 107. ప.) అని తద్దర్మర్థకమైన 'ఇచ్చు' ధాతుప్రయోగంతో పద్యం రచించినా అనంతరవిషయాన్ని బట్టి దారిద్ర్యవారణుడు సుచరితుని సమకాలికుడైనట్లు వీరు నారదమహర్షికి పూర్వులైనట్లు మన కవగతమవుతుంది. అయితే కృతయుగానికి పూర్వంనుంచీ కూడా ద్రావిడదేశం, ద్రావిడజాతి వున్నదన్న అభిప్రాయం స్పష్టమవుతున్నది. పూర్వదేవత లనబడిన రాక్షసులు, మొట్టమొదట దేవతలుగానే వుండి, శాపవశానో, కర్మవశానో రాక్షసులుగా ఆవిర్భవించినప్పటినుంచీ 'విద్రావణ'శబ్దంమీద ఆధారపడి విధ్వస్థకారకులుగా 'వి' నిలుప్తమై 'ద్రావణ' శబ్దం 'ద్రావడ' 'ద్రావిడలు'గా మారి అతిప్రాచీనకాలంలోనే పరిణామం చెందినట్లు కనిపిస్తున్నది.

నరసింహకవి చతుర్వేదికి భాగవతానుగ్రహంతో బ్రహ్మరాక్షసత్వం తొలగినవిధాన్ని వర్ణించిన సందర్భంలో "గృధ్రరూపులైయున్న భార్యాపుత్రులును దానును హరిభక్తి దర్శన కీర్తనంబుల హృదయంబు ప్రసన్నంబైన ఆ విష్ణుభక్తపదాంభోజసంగపూతజలంబు దృష్టిపథంబున నున్నఁ బానంబు చేసి యా రాక్షసుండు వైకుంఠతద్భక్తభుక్తశిష్టపాత్రక్షాళనతోయపరికీర్ణాన్నకబళంబులు భుజించి గృధ్రంబులు దాను జాతిస్మరత్వంబు నొంది వైవస్వతుఁ డానతి యిచ్చిన క్రమంబుఁ దలంచుకొని విష్ణుభక్తాంఘ్రితీర్థంబున ముక్తియె ఫలియించె" (నార. 139. పు. 213. ప.) అని వైవస్వతుడు ఆనతియిచ్చిన క్రమాన్ని తలచుకొన్నాడని పేర్కొనడంద్వారా వరాహ నరసింహాది అవతారాలు వైవస్వతమన్వంతరంలోనే జరిగినట్లు నరసింహకవి అభిప్రాయపడినట్లు కనిపిస్తున్నది. ఏకాదశీమాహాత్మ్యాన్ని వర్ణిస్తూ "వైమనస్య మందె వైనస్వతుం డంతఁ! జిత్రగుప్తలేఖ్య పత్రలిఖిత! దురితపుణ్య లిపుడు తుడుపులు వడిరి తద్విష్ణుదివసమహిమ వింతకాదె!" (నార. 197. పు. 39. ప.) అని వైవస్వతుని తరువాతనే నారదీయపురాణరచన జరిగిందన్నభావాన్ని వ్యత్యస్తంగా వ్యక్తీకరించాడు. గతంలో పురాణాలచరిత్రను గురించి అవతరణను గురించి చర్చించిన సందర్భంగా వివిధకల్పాలలో విభిన్నపురాణాలు అవతరించినట్లు ప్రాచీను లభిప్రాయపడిన విషయం అభివ్యక్తం చేయబడింది. కాగా నరసింహకవి దృక్పథంతో ప్రస్తుత వైవస్వతమనువు ఆనతి గురించి విస్పష్టంగా, ఇదమిత్థంగా, చతుర్యుగాలపరంగా మనం యేమీ చెప్పలేము. వైవస్వతమన్వంతరంలోనే యిప్పటికి 26 చతుర్యుగాలు నడచి 27 వ చతుర్యుగంలో చివరిదైన కలియుగం నడుస్తున్నది. ఈ దృష్ట్యా వేలకొలది అవతారాలను పేర్కొన్న వేదవాఙ్మయాన్ని ప్రమాణంగా తీసుకొన్నప్పుడు, దశావతారాలు కేవలం పరిమితాలై యుగకాలనిర్ణయాలలో ఒక విస్పష్టమైన అభిప్రాయానికి రావడానికి నిక్కచ్చిగా తోడ్పడుతాయని మన మేమీ చెప్పలేము.

నిజానికి నారదీయపురాణం యెపుడో కృతయుగంలోనే (ఏ కృతయుగంలోనో చెప్పలేము) వ్రాయబడిందని, లేదా నారదప్రోక్తమైందని, నారదీయపురాణంవల్లనే మనకు సుస్పష్టం అవుతున్నది. రామగాథ భవిష్యత్తులో జరుగబోతున్నదని, భవిష్యద్వాణిగా యీ కృతిలో పేర్కొనబడడమే కాక, ఆ రూపంగా రామగాథకు పూర్వమే యీ కృతి రచింపబడిందని యీ క్రిందిపద్యంవల్లనే స్పష్టమవుతున్నది.

"రాఘవుని యాజ్ఞ సౌమిత్రి రణమునందు
నింద్రజిత్తునిఁ దునుమ నా యింద్రజిత్తుఁ
డతిసహాయంబు తానెయై యవనియందుఁ
గలిపురుషుఁ బాయక చరించుఁ గలుషవృత్తి."

(నార. 173. పు. 126. ప.)

ఈ సందర్భంలో 'తునుమన్‌' అని అన్నఁ తార్థకక్రియను 'చరించున్‌' అని తద్ధర్మార్థకక్రియను ప్రయోగించడం ద్వారా యిది భవిష్యత్తులో జరుగబోతుందన్నవిషయాన్ని నరసింహకవి తేటతెల్లం చేశాడు. ఇదేవిధంగా నరసింహకవి రత్నావళి వృత్తాంతవర్ణనాసందర్భంలో భవిష్యద్భారతపురాణవిషయాన్ని భవిష్యత్తులో జరుగనున్న విషయంగానే యీ క్రిందివిధంగా పేర్కొన్నాడు. "భవిష్యద్భారతపురాణంబున హిడింబి యను రాక్షసి భీమసేనుం డను పాండవునకు భార్య గాఁగలదు. అతనికంటె బలాధికుండైన ఘటోత్కచుండను తనయుండు జనియింపఁ గలండు. వాని నేశస్త్రంబుల వధింపఁ దరంబుగాదు. ఇంద్రశక్తిచేత సాధ్యుండు గాఁగలఁడు." (నార. 290. పు. 129. వ.). నిజానికి నారదీయ పురాణం వరాహ నరసింహావతారాలకు పూర్వమే ప్రోక్త మయిందని శౌరి సనకాదులకు మోక్షప్రాప్తివిధానాన్ని యెరిగించిన సందర్భంలో విస్పష్టంగా తేటతెల్ల మవుతున్నది.

"ఔరసపుత్రుఁడై శ్రుతి శిఖార్థము లాడుచు మామకుం డొకం
డీరస మొప్పఁ దండ్రిఁ గవయించఁగ మీఁదనె తీర్చు వాదులన్
సూరల గెల్చి శౌరి నిదె చూపెద నెందు నటంచు నాడినం
జేరి మహోగ్రవీరనరసింహనిజాకృతిఁ గాంచి నిల్చెదన్.

పాటిల్లెడు నీ మాయా
నాటకసూత్రంబునందు నా ప్రతిహారుల్
మేటులు జయవిజయులు ని
త్యాటోపులు మత్ప్రయోజనాయత్తు లిలన్.

(నార. 417. పు. 102, 104. ప.)

ఈ సందర్భంలో విష్ణువు జయవిజయులు హిరాణ్యాక్ష, హిరణ్యకశిపులుగా సంజనితు లవ్వడానికి పూర్వమే తన నరసింహావతారవిశేషాన్ని గురించి విస్పష్టంగా వక్కాణించినట్లు ద్యోతక మవుతున్నది. అంతేకాదు, నారదప్రోక్తమైన యీపురాణంలో నారదుని కంటే అతిప్రాచీనకాలంలోనే జరిగిన చతుర్వేది కథను నారదుడు మునులకు వివరించినపద్ధతి చూడగా నారదీయపురాణప్రాచీనత్వమేకాదు, నారదప్రోక్తత్వంసైతం స్పష్టంగా తేటతెల్లమవుతున్నది. "అనిన మునులం జూచి నారదుండు మద్గురుండు నాకు నానతి యిచ్చిన క్రమంబు వినుం డెఱింగించెదనని యిట్లనియె" (నార. 129. పు. 166. వ) అని నారదుడు తనకు తన గురువు చెప్పిన రాజపురోహితుడైన చతుర్వేది కథ చెపుతాడు. ఈ కథారూపంగా చతుర్వేది బ్రహ్మరాక్షసు డవ్వడం, అనంతరం భాగవతానుగ్రహంతో ఆ బ్రహ్మరాక్షసత్వం పోవడం, తద్రూపంగా విష్ణుభక్తిమాహాత్మ్యాన్ని వివరించడం జరిగింది.

ప్రహ్లాదుని విద్యాభ్యాసవర్ణనాసందర్భంగా - నరసింహావతారానికి పూర్వమే విష్ణువు నుద్దేశించి - యీ క్రిందిపద్యంలో కృష్ణావతారం జరగకముందే 'కృష్ణ' శబ్దాన్ని ప్రయోగించాడు.

"ఘనదైవపౌరుషాగత
ధనమంతయు నాశ్రితజనతతి వీడ్కొని తా
ననుభవమునకుం గొనుపా
వని కృష్ణుఁడు జగతిలోన ఒక వృత్తి యగున్..

(నార. 442. పు. 223. ప.)

దీనివల్ల కృష్ణావతారానికి పూర్వమే విష్ణువుకు కృష్ణనామం వున్నదని మనం ఆమోదించవలసి వస్తుంది. విష్ణువును మహత్తరదైవస్వరూపునిగా మనం ఆమోదించినపుడు అతని సహస్రనామాత్మునిగా సైతం ఆమోదించి కృష్ణావతారానికి పూర్వమే విష్ణువుకు కృష్ణనామం వున్నట్లు మనం ఆమోదించవలసి వుంటుంది. నారదీయపురాణం భవిష్యద్వాణిగా నారదప్రోక్తంగా మనం ఆమోదించినప్పుడు సైతం భవిష్యత్తులో రాబోయే రామ, కృష్ణావతారాల గురించి నారదుడు చెప్పడం సమంజసమే కాబట్టి విష్ణుపరంగా కృష్ణశబ్దాన్ని ప్రయోగించడంలో మనకు విప్రతిపత్తి యేమీ కనిపించదు.

విశిష్ట విషయాలు

నరసింహకవి కృత్యవతారికలో కృతిపతి అయిన శ్రీకృష్ణుని అవతారవిశేషాలను అనేకవిధాలుగా దాదాపు కృష్ణచరిత్రను వర్ణనారూపంగా చిత్రీకరించాడు. శ్రీకృష్ణ జాంబవంతులకు జరిగిన యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయిన తరువాత అతనికి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువుగానే కాక శ్రీరామచంద్రుడుగాసైతం కనిపించినట్లు ఈ క్రింది పద్యంలో స్పష్టంగా జాంబవంతుని స్తుతిరూపంలో వర్ణించాడు.

<poemజాంబవంతుఁ డాత్మశక్తి జయించిన

శక్తి గలుగు కృష్ణు జగముఁ బ్రోచు నాదిదేవుఁ డా చరాచరకర్త నా

రాయణుండె యనుచుఁ బ్రస్తుతించె.</poem>

జయ జయ రఘుకులచక్రీశ తాటకా
         హరణ, విశ్వామిత్రయాగభరణ,
అనఘ, యహల్యాఘహారి, శంకరధను
         ర్భంజన, జానకీప్రాణనాథ,
భార్గవభుజదర్పభంజన, పితృవాక్య
         పాలన, ఖరముఖప్రళయకాల,
సుగ్రీవవరద, యశోనిధి, వాలిమ
         ర్దన, వారిబంధన, దర్పితోగ్ర
కుంభకర్ణాతికాయాది కుటిలదైత్య
వీరసంహార, రావణద్విపమృగేంద్ర,
పుష్పకాన్వితసాంకేతపురినివేశ,
రామ, శైలతనూజాభిరామనామ.

(నార. 54. పు. 301, 302. ప)

నాళీజంఘునికథను వర్ణించిన సందర్భంలో పరాశరునకు దత్తాత్రేయునకు జరిగిన సంభాషణాసందర్భంగా సీతారామలక్ష్మణులు రాజ్యాన్నివిడిచి అడవులకు వెళ్ళిన తరువాత పర్ణశాలను ఉత్తరభారతదేశంలో కళ్యాణతీర్థానికి ఉత్తరంగా ఉన్న పరాశర ఆశ్రమానికి పశ్చిమతీరంలో పంచభాగవతస్థానం ఉన్నదనీ, ఆ పంచభాగవతస్థానానికి సమీపంలో వరాహదేవతాస్థానం ఉన్నదనీ దానికి దక్షిణదిశలో సీతారణ్యం ఉన్నదనీ ఆ సీతారణ్యంలోనే లక్ష్మణుడు పర్ణశాల కట్టాడనీ నరసింహకవి నారదీయ పురాణవిషయంగా ఈ క్రిందిపద్యంలో వర్ణించాడు.

తనదు కల్యాణతీర్థమునకుఁ గించిదు
         త్తరభాగమున మహోదారమగు ప
రాశరాశ్రమ మఘరాశి మాలానల
         మాతీర్థమణి ప్రతీచ్యంతరమునఁ
దగు పంచభాగవతస్థాన మాతీర్థ
         మున కెంచఁ భ్రాగ్భాగమున వరాహ
దేవతాస్థాన మాతీర్థంబు దక్షిణ
         స్థలిని సీతారణ్య మలరు నచట
లక్ష్మణుఁడు గట్టెఁ బర్ణశాలాగృహంబు
రామజనకసుతామనోరమము గాఁగ
స్థానములు నాల్గు నిట్టివి సంభవించె
నట్టి పుణ్యస్థలంబున యతివరేణ్య!

(నార. 153-154 పు. 30. ప)

రామాయణంమీద పరిశోధనలు చేసిన అనేకమందికీ సీతారాముల పర్ణశాల ఉన్నదని తెలుసునుగాని నారదీయపురాణరూపకంగా బయటపడిన సీతారణ్యం అనే పేరుగల అరణ్యం ఉన్నదన్న సంగతి అసలు తెలియనే తెలియదు.

నరసింహకవి యాదవశైలం అక్కడ విశేషాలు వర్ణించిన సందర్భంలో వివిధతీర్థాలను వర్ణిస్తూ "ఈ నారాయణహ్రదంబునకు దక్షిణంబునఁ గల్యాణతీర్థంబునకు నుత్తరంబునఁ బారాశరతీర్థంబు గలదు. మన్నియోగంబుచే మద్భక్తుండగు పారాశర్యుండు విష్ణుపురాణంబుఁ దత్తటంబున రచియించె" (నార. 87. పు. 501. వ) అని వ్రాసి కల్యాణతీర్థానికి ఉత్తరంలో ఉన్న పారాశరతీర్థంలో పారాశర్యుడు విష్ణుపురాణాన్ని విరచించినట్లు వెల్లడించాడు.

నరసింహకవి రత్నావళీవృత్తాంతాన్ని వర్ణించిన సందర్భంలో వివిధధర్మాలను గురించి వ్రాస్తూ రత్నావళి రాక్షసునితో ఈ క్రిందివిధంగా చెప్పినట్లు పేర్కొన్నాడు.

పరిణయము లేని కన్యను
గరిమన్ రతి సల్పఁ బాతకంబని శాస్త్రాం
తరములఁ బల్కిరి ధరణీ
సురవర్యులు వెనవె ధర్మసూక్ష్మక్రమముల్.

(నార. 291. పు. 131. ప.)

ఈ సందర్భంలో శాస్త్రాంతరాల ధర్మసూక్ష్మాన్ని చెపుతూ వివాహం కానటువంటి కన్యతో సంభోగం చెయ్యడం పాపమని పేర్కొనడం ద్వారా వివాహితురాలైనస్త్రీతో అతిచరించడం పాపంకాదని చెప్పినట్లవుతున్నది.

విష్ణుచిత్తుని కథకూ దానికి సంబంధించిన యితరగాథలకూ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదాది గ్రంథాల విమర్శనాసంధర్భంలో పెక్కుప్రాచీనమూలగ్రంథా లున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే నారదీయపురాణంలో వర్ణింపబడిన విష్ణుచిత్తుని కథలో విష్ణుచిత్తుడు ప్రహ్లాదుని కంటె పూర్వుడనీ ప్రహ్లాదుడు విష్ణుచిత్తుని దర్శించి ధన్యుడయ్యాడనీ ఈ క్రిందిపద్యంలో పేర్కొనబడడం ద్వారా విష్ణుచిత్తుడు నరసింహావతారానికి పూర్వమే ఉన్నాడని తేటతెల్లం చేసినట్లయింది.

విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి
యరుగుదెంచితిఁ బ్రహ్లాదుఁ డండ్రు నన్ను

నీ మహత్వంబు విని విని నీరజాక్ష
భక్తినిష్టాపరత్వ మేర్పడఁగ గంటి

(నార. 189. పు. 105.ప)

బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతల గురించి తపస్సు చేసిగాని వారిని భక్తితో పూజించి గాని వివిధవరాలనూ ఐశ్వర్యాదులను పొందవచ్చునన్న విషయం సర్వవిదితం. కుబేరుడు మహైశ్వర్యవంతుడనీ ధనాగారాలకు మూలభూతుడని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే విశిష్టంగా నరసింహకవి నలమహారాజువల్ల సంపదలు పొందవచ్చునని నారదీయపురాణవచనంగా ఈ క్రింది పద్యంలో ఉటంకించాడు.

అర్కునివలన నారోగ్య మాయె నలుని
వలన సిరియును శంకరువలన బోధ
మచ్యుతువలన ముక్తియు నందవలయు
ననఁగ నుపవిషదుక్తియుక్తార్థముగను.

(నార. 327-పు. 37. ప)

ఇది అత్యంతవిపులంగా వర్ణించబడిన వివిధనలచరిత్రలలో కూడా కానరానివిశిష్టవిషయం.

నరసింహకవి వైకుంఠలోక ఆవరణపంచకాలను వర్ణిస్తూ వైకుంఠలోకంతో పాటు దానికి చుట్టూ వివిధదిక్కులలో ఉన్న అనేకలోకాలను వర్ణించాడు. "విశేషంబున మరియు వైకుంఠలోకంబు వర్ణించెద వినుము. ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబునకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండు నగు సంకర్షణవిభుండుండు. ఆ సంకర్షణలోకంబునకు పశ్చిమంబున నిర్మలానందనీరధి నిత్యంబు నగు సరస్వతిలోకంబులఁ దగు ప్రత్యగవాచిని సరస్వతిలోకంబున కుత్తరంబున బ్రద్యుమ్నలోకంబు చెలంగు. ప్రతీచీనయుతార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై ప్రద్యుమ్నపదంబు దగ్గర రవిదిక్కున నిత్యాప్సరో౽లంకృతంబై రతిలోకంబు విరాజిల్లుఁ దత్ప్రాచీననిరుద్ధలోకంబు రాణించు నుదీచిం బ్రకాశించి యానందవారిధి యగు నా యనిరుద్ధలోకంబునకు బ్రాచి యగు విదిక్కున సద్గుణసాగరంబగు శాంతిలోకంబు విజృంభించు. ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు. నాలుగును బ్రదక్షిణక్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీ వ్యూహాష్టకంబు ప్రథమావరణంబున నుండు. 'మధ్యే మధ్యేత్వ సంఖ్యే యాస్తత్త ద్వ్యూహ'మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయావరణంబునం బ్రాచ్యాదిదిక్కుల వరాహ జామదగ్న్య శ్రీ నరసింహ రఘువల్లభ శ్రీధర వామన హయగ్రీవ వాసుదేవ లోకంబులు గలవు. తవధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట శ్రీ వైకుంఠేశ్వరప్రీతి సాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృతభూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచజన్య ముసల చక్ర ఖడ్గ గదా శార్జ్గాది వైజయంతంబులు నిలుచు. నిత్యానవధికనిరతిశయానందంబగు భగవత్సేవ గావించు. చతుర్థావరణంబునఁ గుముద కుముదాక్ష పుండరీక వావన శంఖకర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానలదండధరనిరృతియాదసాంపతిగంధవాహధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు. ఇది యావరణపంచకంబు. (నార. 358, 359-పుట. 171వ.) అని వివిధలోకాలను వివరించి అనంతరం "తృతీయావరణబహిర్దేశంబున విష్వక్సేనులోకంబు గలదు." (నార. 360. పు. 176 వ.) అని తృతీయావరణలో విష్వక్సేనులోకం ఉన్నట్లు పేర్కొన్నాడు. వేద ఖగోళశాస్త్రాల దృష్ట్యా ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ఆధునికఖగోళవిజ్ఞానం దృష్ట్యా కూడా శేషశాయి అయిన శ్రీ మహావిష్ణు నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆయా వివిధలోకాలగురించి ఆధునికవైజ్ఞానికులు పరిశోధనలు కొనసాగించవలసి ఉన్నది.

ఖగోళవిశేషాలు

నరసింహకవి వివిధసందర్భాలలో అనేక వేద ఖగోళశాస్త్రాది విశేషాలను తెలియచేశాడు. ధ్రువుని చరిత్రను వర్ణించే సందర్భంగా "యవికృతనిజరూపుండ వగుట నీకు వివిధభావము మాయచే విరుద్ధంబు గాదు. దినకర కరజాల మూషరస్థానసంగంబున నవికృతమేనియు నిజరూపవికారంబు వహించునట్లు నీ రూపంబు వైకృతంబును గారణంబునన వినంబడియె. ఆ వైకృతరూపము జగత్తిని వేదంబులు పలికె. కారణంబగునవి బ్రహ్మమును, సత్తునని విన్నవించు నట్టి దేవవంద్యంబులైన యీ రెండు రూపంబులు భజించెద. విశ్వమూర్తి! నిన్ను వేదంబులు దశశతముఖునింగా, సహస్రాక్షిపాదునింగా బలికె. మఱియును సహస్రముఖ పాదాక్షిబాహూరునింగాఁ బలికె. వితతునింగా నణువుంగాను దీర్ఘునింగాను పలికె. బ్రహ్మభూతుండవై వితతవిమలరూపుఁడవైన నీయందు నివిశ్రుతము వేఱైయున్న యదియుంబోలెఁ జూడంబడి స్వాశ్రయాభిన్నంబయ్యె. జలమయంబగు ఫేనంబు గాన్పించి లయకాలంబున వేఱుగాని యట్లు వివిధరూపంబు లన్నియు నిన్నుంగలయు." (నార. 450, 451 పు. 29. వ) అని పురుషసూక్తవిషయాలను సంగ్రహపరిచాడు. నారాయణగిరిమహత్వవర్ణనాసందర్భంలో "అది దక్షిణదేశంబున" ఇత్యాది పదాలను ప్రయోగించడం ద్వారా భూమండలాన్ని స్ఫురణకు తెచ్చినా "దక్షిణోత్తరభేదంబున నాకు రెండాశ్రమంబులు గలవు. సర్వోత్తరంబులు; ఆధిక్యంబున నదియే సర్వోత్తరగిరి యగు. గుణత్రయభేదంబున నరులకుం బ్రకృతి భిన్నంబైన నారాయణాద్రి నిష్ఠులకు రజస్తమోగుణంబులు లేవు వినుండు" (నార. 82. పు. 472. వ). అని ఖగోళగతమైన సర్వోత్తరగిరిని, వైకుంఠాద్యచ్యుతస్థాన లోకసారమైన యదుశైలాన్ని వర్ణించాడు. బ్రహ్మ మోహినికి కర్తవ్యాన్ని ఉపదేశించినసందర్భంలో నరసింహకవి మందరగిరి ఉనికినిగురించి, మందరగిరి కైవారంగురించి, తన్మందరగిరిమీద వున్న దివ్యశివలింగం గురించి సూక్ష్మదృష్టితో వర్ణించాడు. మందరగిరి భూమిమీద వున్నదని మనం సామాన్యంగా అనుకుంటాం. కాని అది ఖగోళంలో అత్యున్నతస్థానంలోవున్న క్షీరమహాసముద్రనామకాలైన (Thick Milky Way) నక్షత్రాలగుంపుమధ్యలో వున్నదని నరసింహకవి వేదఖగోళాన్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా పేర్కొన్నాడు. మందరగిరిగురించి, దానికైవారం గురించి, దానిమీద వున్న దివ్యశివలింగాన్ని గురించి నరసింహకవి యీ క్రింది విధంగా వర్ణించాడు.

"ప్రబలసురాసురప్రవరుల కెడలింప
          నలవిగాని నగేంద్ర మరయ నెద్ది?
హరికి వ్యామగ్రాహ్యమై భుజాంగదసము
          త్కాషసారంబైన గ్రావ మెద్ది?
పుక్కిటి జంటిగాఁ ఖూర దుగ్ధాంభోధి
          నోలలాడెడు మహాశైల మెద్ది?
భూతజాలావృతపురమర్దనైకవి
          హారసౌధంబైన యచల మెద్ది?
దివిజులకు రచ్చ, తాపసప్రవరులకుఁ ద
పంబు పంట, సురాధిపభామలకు ర
తి ప్రవర్తన వశ్యాధిదేవత, వివి
దౌషధంబుల కాకరం బట్టి శిఖరి.

అయుతము వేయు యోజనము లగ్గిరిమూలము దానియంతయే
నియతముగా వెడల్పును వినిర్మలకాంచనరత్నశృంగముల్.

సప్తయోజన విశ్రుత శక్రనీల
కలిత తచ్ఛిల దివ్యలింగంబు మెఱయు

నది వియల్లింగ మన దశహస్తమిత మ
హోచ్చతయు నిన్మడి వెడల్పు నొనరి వెలయు.

(నార. 211. పు. 106, 107, 109. ప.)

ప్రహ్లాదుడు హరిస్మరణమహిమను ప్రశంసించే సందర్భంలో "స్వభిన్నునింగా నీశ్వరుని వేరుగాఁ దలంచినవాడు విషయార్థప్రత్యగాత్మయైన యీశ్వరు నెట్లు సేవించు? యామ్యదిశకుం బోయినవాఁడు మేరునగంబు విలోకించునే?" (నార. 475. పు. 140. ప) అని మేరుపర్వతం యామ్యదిశలో లేదని సూటిగా పేర్కొన్నాడు. అయితే గతంలో కొందరు పరిశోధకులు మేరుపర్వతం భూమిమీదనే వున్నదని అభిప్రాయపడడంలో వాస్తవికత లేదని "శ్రీ విరూపాక్ష-శ్రీరామశాసనములు-ఆరవీటివంశచరిత్ర"[9] అన్న నా పరిశోధనాగ్రంథంలో సవివరంగా 'శ్రవణానక్షత్రానికి అత్యంత ఉన్నతస్థానంలో వున్న విష్ణుస్థానానికి కొంత దిగువుగా యీ మేరుస్థానం వున్నట్లు" తెలియజేశాను. (చూ. CXV-CXVL. పు.)

మామూలుగా వైజ్ఞానికదృక్పథంతోనేకాక, సంప్రదాయసిద్ధంగా కూడా సూర్యోదయసమయంలోని యెండ ఆరోగ్యకరం కాదని, సూర్యాస్తమయకాలంలోని వృద్ధాతపం చాలా ఆరోగ్యప్రద మయినదని, భావించడం జరుగుతున్నది. నారదీయపురాణంలో నృసింహావిర్భావం తరువాత "సదా సూర్యుండు బహుయోజనసహస్రంబు లక్షణంబునఁ బోవుచు వేగంబున జనుల యాయువు చయింపంజేయు నార్తప్రమత్తసుప్తవ్యాదితులైన వారి నుష్ణధాముండు హ్రాసంబు నొందించుంగాని విడంబంబు సేయందు" (నార. 509. పు. 273. వ) అని అసలు సూర్యుడే మానవుల ఆయుర్దాయాన్ని క్షయింపచేస్తాడని నరసింహకవి యే మూలగ్రంథం ఆధారంగానో పేర్కొంటున్నాడు. ఆర్షవిజ్ఞానదృక్పథంలో వున్న యీ విషయాన్ని ఆధునికవైజ్ఞానికులు పరిశీలించవలసి వున్నది.

నరసింహకవి యుగాదినిర్ణయవివరణాసందర్భంలో సూర్యుడు ఉత్తరాయణాన్ని విడిచి దక్షిణాయణంలో ప్రవేశించే మధ్యకాలం విషమకాలమని, దాన్ని ముక్తకకాలం అంటారని యీక్రింది పద్యంలో తెలియచేశాడు.

"ఉత్తరాయణ ముడిగి సూర్యుండు వేగ
దక్షిణాయనమున కేఁగుతఱి మెలంగు
మధ్యకాలంబు విషమమై మహిఁ జెలంగు
నదియె ముక్తకనామధేయము వహించు."

(నార. 194. పు. 24. ప.)

ఇదికూడా ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశోధించవలసిన విషయమే. "సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః" అని వేదం సూర్యుడు స్వతంత్రంగా ఏకైకుడై సంచరిస్తున్నాడనీ సూర్యునివల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడనీ స్పష్టంగా పేర్కొన్నప్పటికి సూర్యుడు కేవలం ఒక్కడేనని మాత్రం వేదం ఆమోదించలేదు. ఈ సృష్టిలో ఏయే దిక్కుల్లో ఎన్నెన్ని సౌరమండలాలు ఉన్నాయో చెప్పడం సాధ్యపడదన్న ధోరణిలో "దశదిశో నానా సూర్యాః" అని అష్టదిక్కుల్లోనే కాదు దశదిశల్లోనూ అనేకమంది సూర్యులున్నారని వేదం పేర్కొన్నది. అయినా ఈ అనంతమైన వేదవిజ్ఞానాన్ని గుర్తించలేక కొంద రవ్యక్తులు పురాణాలలో సూర్యపరంగా సూర్యు డొక్కడేనని ఆ సూర్యుడే చైత్రాది ద్వాదశమాసాలలోనూ ద్వాదశనామాలతో పేర్కొనబడతాడని అ రూపంగా ఏకైకుడైన ఆదిత్యుడే ద్వాదశాదిత్యులుగా పరిగణనలోకి తీసికొనడం జరిగిందని ఈ క్రిందివిధంగా పేర్కొనబడడం జరిగింది. చైత్రమాసంలో సూర్యుణ్ణి "ధార" అంటారనీ అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురులు పరిజనంగా ఉంటారనీ పేర్కొన్నారు. వైశాఖమాసంలో సూర్యుడు "అర్యముడుగా" పేర్కొనబడి పులహ, భోజ, ప్రహేళి, పుంజకస్థలి, నారద, కంజనీరులు పరిజనంగా వెలుస్తారని ఉటంకించారు. జ్యేష్ఠమాసంలో సూర్యుడు "మిత్ర" నామకుడై అత్రి, పౌరుషేయ, తక్షక, మేనక, హాహా, రథ స్వనులనబడే పరిజనంతో విరాజిల్లుతాడన్నారు. ఆషాడమాసంలో "వరుణుడు"గా పేర్కొనబడే సూర్యుడు వశిష్ఠ, రంభ, సహజన్య, హూహు, శుక్ర, చిత్రస్వనులు పరిజనంగా విరాజిల్లుతాడు. శ్రావణమాసంలో సూర్యుడు "ఇంద్ర" నామకుడై విశ్వానసు, శ్రోత, ఏలాపుత్ర, అంగిరస, ప్రమ్లోచి, చర్ములనబడే పరివారంతో భాసిల్లుతాడు. భాద్రపదమాసంలో "వివస్వంత" నామకుడై సూర్యుడు ఉగ్రసేన, వ్యాఘ్ర, అసార, భృగు, అనుమ్లోజ, శంఖపాల నామకులైన పరిజనంతో విలసిల్లుతాడు. ఆశ్వీయుజమాసంలో సూర్యుడు 'త్వష్ట' నామకుడై అంబళాస్వ, తిలోత్తమ, బ్రహ్మోపేత, శతజిత్, ధృతరాష్ట్ర, ఇషంభరులు పరివారంగా ఉంటాడు. కార్తీకమాసంలో సూర్యుడు "విష్ణువు"గా విరాజిల్లుతూ అశ్వతర, రంభ, సూర్యవర్చస, సత్యజిత్, విశ్వామిత్ర, మఘోపేత నామకులైన పరివారంతో ప్రకృష్టుడై ఉంటాడు. మార్గశిరమాసంలో సూర్యుడు "తుర్యమ" నామకుడై కశ్యప, తార్క్ష్య, ఋతసేన, ఊర్వశి, విచ్యుచ్ఛతు, మహాశంఖనామకులైన పరిజనావృతుడై ఉంటాడు. పుష్యమాసంలో సూర్యుడు "భగ" నామకుడై స్ఫూర్జ, అరిష్ఠనేమి, ఊర్ణ, ఆయు, కర్కోటక, పూర్వజిత్తి నామకులైన పరివారంతో విరాజిల్లుతాడు. మాఘమాసంలో సూర్యుడు "పూష" నామకుడై ధనంజయ, వార, సుషేణ, సురిచి, ఘృతాచి, గౌతమ నామకులైన పరివారంతో విలసిల్లుతాడు. ఫాల్గుణమాసంలో సూర్యుడు "క్రతు" నామకుడై వర్యస, భరద్వాజ, సేనజిత్, విశ్వ, ఐరావత, నామ్నులైన పరివారంతో ప్రకృష్టు డవుతాడు. ఈవిధంగా చైత్రాదిగా ఫాల్గుణాంతంగా ఉన్న ద్వాదశమాసాలలోనూ ఏకైకసూర్యుడే ద్వాదశభిన్ననామాలతో ద్వాదశాదిత్యులుగా పరిగణించబడతాడని పేర్కొన్నారు. మరికొందరు తుర్యమ, క్రతువులకు ధాతలకు మారుగా అంశుమంత, పర్జన్య, అజులను గ్రహించారు. మరికొందరు అర్కశబ్దాన్ని సైతం గ్రహించారు. వేదవిజ్ఞానానికి భిన్నంగా మనకు కనిపిస్తున్న ఏకైకసూర్యుణ్ణే చైత్రాది వివిధమాసాలలో ద్వాదశాదిత్యులుగా పరిగణించారు. కాని నరసింహకవి రుక్మాంగదచరిత్రలో అతని రాజ్యకాలంలో అతనితోపాటు ప్రజలందరూకూడ రాజాజ్ఞానువర్తులై ఏకాదశీవ్రతనిష్ఠులై కేవలం పరమపదాన్నే చేరుకుంటున్నారని అటు స్వర్గానికికాని ఇటు యమలోకానికిగాని ఎవ్వరూ రావడంలేదని యమధర్మరాజు బ్రహ్మతో మొరపెట్టుకుంటాడు. ఈసందర్భంలో తనకు యమధర్మరాజపదవే అక్కరలేదని వక్కాణిస్తూ "ఈ నియోగంబు నే నొల్ల, యజ్ఞ తీర్థ దాన యోగ సంయోగంబుల నిటువంటి సద్గతిలేదు. ధాత్రీఫలానులిప్తులై వాంఛ లుడిగి, రసభోజనోద్భవవాంఛలు విడిచి విభ్రష్టకర్ములేని హరిలోకంబు గాంచిరి. గళరజ్జుబంధనంబుల మద్దూతలు దెచ్చినవారల హరిదూతలు శిక్షించికొని చనిరి. ద్వాదశాదిత్యతీవ్రతాపదుర్గమంబైన మన్మార్గంబు భగ్నం బయ్యె నేమి విన్నవింతు నింక" (నార. 201-పు. 60. వ) అని అంటాడు. ఈసందర్భంలో పేర్కొనబడిన ద్వాదశాదిత్యులు ఇతరపురాణాలవలె ఏకైకాదిత్య విభిన్నచైత్రాది మాసగత విశిష్టనామకులు కారు. యమధర్మరాజుమార్గం ద్వాదశాదిత్య తీవ్రతాపదుర్గమ మయినదట. అంటే ద్వాదశాదిత్యులు విభిన్నంగా ఉన్నారనీ ఒకేసారిగా అ పన్నెండుసూర్యుల తీవ్రతాపం ప్రసరించేమార్గం యమధర్మరాజుమార్గమనీ అర్థమవుతున్నది. చైత్రాదిమాసాలలో విభిన్ననామాలతో విరాజిల్లే ఏకైకసూర్యుని తాపం ఏకమాసాత్మకంగా ప్రసరించడానికి వీలున్నది గాని ద్వాదశమాసాలతో సంకలితమైన పరిపూర్ణతాపం ఒకేసారి యమలోకమార్గంమీద ప్రసరించడానికి వీలులేదని స్పష్టపడుతున్నది. ద్వాదశాదిత్యుల తీవ్రతాపం ఒకేసారిగా ప్రసరిస్తున్న దన్నాడంటే నారదీయపురాణకర్త దృష్టిలో ద్వాదశాదిత్యులు మాసాత్ములుగాకాక విభిన్నసౌరమండలాలకు చెందినవారని విదిత మవుతున్నది. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ద్వాదశాదిత్యులుగా పేర్కొనబడినవారు విభిన్న సౌరమండలాలలో ఉన్న ప్రత్యేకసూర్యులే నని చైత్రాది ఫాల్గుణాంతంవరకూ ద్వాదశమాసాలలోనూ ఉన్న మాసాత్ముకుడై ద్వాదశనామకుడైన ఏకైకసూర్యుడు కాడని తేటతెల్ల మవుతున్నది. కాగా "దశదిశో నానా సూర్యాః" అన్న వేదవాక్యంలో ఒక భాగంగానే ఈ ద్వాదశాదిత్యులు నారదీయపురాణోక్తంగా విరాజిల్లారని పరమవైజ్ఞానికంగా ఆమోదించవలసి ఉంటుంది.

ఆర్షవిజ్ఞానం దృష్ట్యానేకాక ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా ఖగోళంలో తోకచుక్కలు, అనేకరకాలైనవి ఉన్నవి. వాటిల్లో రకరకాలశక్తు లున్నవి కూడా వున్నాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కతోకచుక్క పొడిస్తే యెవరో వొకమహాపురుషుడో, మహాత్ముడో, గొప్పపరిపాలకుడో అంతరిస్తాడని లోకంలో వాడుక వున్నది. నరసింహకవి కల్యాణతీర్థమహిమను గురించి వర్ణిస్తూ దుర్భిక్షాన్నిసైతం కలిగించి లోకాన్ని సంక్షోభపరిచే తోకచుక్క వుంటుందని యీ క్రిందిపద్యం ద్వారా తెలియజేశాడు.

"అశ్మవర్షవిపాభిహతసమస్త
సస్యసంపత్సమృద్దియై జగతియందుఁ
బొడమె దుర్భిక్ష మొకయేఁడు పూర్ణమగుచు
ధూమకేతువు చిందులు ద్రొక్కఁదొణఁగె."

(నార. 115. పు. 105. ప.)

కాగా వివిధ అరిష్టాలకు మూలకాలైన విభిన్నధూమకేతువు లున్నాయని పరమవైజ్ఞానికంగా మన మామోదించక తప్పదు.

వివిధమన్వంతరాలలో సప్తఋషులు విభిన్నులుగా వున్నట్లు శాస్త్రీయంగానూ, ఆర్షవాఙ్మయం దృష్ట్యానూ, పౌరాణికంగా సైతం మనకు తెలుస్తున్నది. స్వాయంభువమన్వంతరంలో మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అనే మహర్షులు - స్వారోచిషమన్వంతరంలో ఔర్య, వసిష్ఠపుత్ర, స్తంబ, కశ్యప, పాణ, బృహస్పతి, దత్త, చ్యవనాత్రులు అనే మహర్షులు - ఉత్తమమన్వంతరంలో గురు వాసిష్ఠులు, ఊర్జులును, హిరణ్యగర్బులు అనే మహర్షులు - తామసమన్వంతరంలో పృథుడు, కావ్యుడు, అగ్ని, జహ్నుడు, ధాత, కపీవంసుడు, అకపీవంసుడు అనే మహర్షులు - రైవతమన్వంతరంలో యదుధ్రుడు, వేదశిరుడు, హిరణ్యరోముఁడు, పర్జన్యుడు, ఊర్ద్వబాహుడు, సత్యనేత్రుడు, దేవబాహుడు అనే మహర్షులు - చాక్షుషమన్వంతరంలో భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, అతినాముడు, నహిష్ణుడు, అనే మహర్షులు - వైవస్వతమన్వంతరంలో వసిష్ఠ, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్రా దులయిన మహర్షులు - సూర్యసావర్ణికమన్వంతరంలో గౌతమ, అజర, శరద్వంత, కౌశిక, కాశ్యప, ఔర్యులు అనే మహర్షులు - దక్షసావర్ణికమన్వంతరంలో మేధాతిథి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు, హవ్యవాహనుడు అనే మహర్షులు - బ్రహ్మసావర్ణికమన్వంతరంలో రామ, వ్యాస, ఆత్రేయ, దీప్తిమంత, బహుశ్రుత, భరద్వాజ, ద్రౌణి (అశ్వత్ధామ), అనేమహర్షులు ఉన్నారు. ఇదేవిధంగా ధర్మసావర్ణిక, రౌచ్య, భౌచ్యమన్వంతరాలలో విభిన్నులైన సప్తర్షులు ఉన్నట్లు ప్రాచీనగ్రంథాలు పేర్కొన్నాయి. ధర్మ, సూర్యసావర్ణికమన్వంతరాలలో ఒకదానికి మారుగా మేరుసావర్ణికమన్వంతరాన్ని కొందరు పరిగ్రహించారు. కాగా వివిధమన్వంతరాలలో విభిన్నసప్తఋషిమండలాలు ఉన్నట్లు మనకు తేటతెల్ల మవుతున్నది.

మన్వంతరాలలో విభిన్నులైన సప్తమహర్షులకు స్థానం వున్నట్లుగానే మనువులకుకూడా ఆ స్థానం శాశ్వతంకాదనీ తెలుస్తున్నది. అంటే వైవస్వతమన్వంతర మన్నది వొకటున్నదిగదా! ఆ మనుస్థానంనుంచి వైవస్వతుణ్ని తప్పించి సమర్హుడైన మరొకవ్యక్తి ఆ స్థానాన్ని పొందవచ్చు నన్నమాట. గృహగోధి మోహినుల సంభాషణాసందర్భంలో "అట్లు గావునఁ దత్ఫలంబు నాకు నొసంగి ధర్మమూర్తీ! వైవస్వతపదధ్వంసీ! పాలించవే యని గృహగోధి పల్కిన విని మోహిని యిట్లనియె." (నార. 233. పు. 213. ప.) అని నరసింహకవి పేర్కొనడంద్వారా వైవస్వతాదిమనుపదాలకు కాదు, మనుపదస్థులైన వైవస్వతాది మహర్షులకు సైతం విభ్రష్టత్వం తప్పదని తెలియజేశాడు.

ఇదేవిధంగా కుబేరు డొక డున్నాడని అనేకగ్రంథాలద్వారా సుప్రసిద్ధమైన విషయం. కాని సప్తఋషులవలెనే కుబేరత్వానికిసైతం మార్పు వున్నదని నారదీయపురాణంవల్ల తెలుస్తున్నది. సప్తఋషులు మన్వంతరాలలో మారగా కుబేరుడు కల్పాంతంలో మారుతాడని నారదీయపురాణం పేర్కొంటున్నది. కల్యాణతీర్థమహిమావర్ణనలో నరసింహకవి "కల్యాణతీర్థతీరంబున ధనం బొకనికిం జాలున ట్లొసంగినఁ గల్పాంతరంబునఁ గుబేరుండై జనించు" (నార. 184, 185 పు. 178 . వ.) అని పేర్కొనడంద్వారా కుబేరత్వంసైతం శాశ్వతం కాదని తేటతెల్లం చేశాడు. అసలు నరసింహకవి పేర్కొనని ఆర్షవిజ్ఞానరహస్యం మరొకటి వున్నది. కుబేరుడు వొక్కడే ధనవంతుడుకాడు. దౌర్జన్యంతో రాక్షసులనే కాక వివిధచక్రవర్తుల నందరిని సైతం వోడించి ధనరాసులను నిలువ చేసుకున్నవాడు "కుబేరుడు". నిజానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యా కుబేరుడంటే "దుర్ధనవంతు డ"ని అర్థం. ఈ దృష్ట్యానే సద్ధర్మపథంలో సవ్యంగా మహత్తరమైన సంపదను ప్రోది చేసినవాడు కుబేరుడు కాడు. సుబేరు డనబడుతాడు. ఆర్షవిజ్ఞానం అడుగంటినకారణంగా యీ కుబేర, సుబేర విభిన్నత్వాన్ని ప్రాచీను లెవరూ గుర్తించలేదు.

మంత్ర శాస్త్రాది విశేషాలు

"క్షరం ప్రథాన మమృతాక్షరమ్" (నార. 325. పు. 29. వ.) అని ఉపనిషద్వాక్యం పేర్కొన్నట్లు ధ్వన్యాత్మకాలు, శబ్దాత్మకాలయిన వర్ణాలన్నింటిని మనం మామూలుగా అక్షరాలంటున్నాం కాని అది యథార్థం కాదు. 'అకారాదిక్షకారాంతాః వర్ణాః' అన్న వాక్యం ప్రకారం అక్షరశబ్ద మన్నది యేర్పడిందని కొంద రంటారు కాని అది కూడా యథార్థం కాదు. వర్ణాలన్నీ అక్షరాలు కావు. క్షరాలు, అక్షరాలని ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వర్ణాలు ద్వివిధాలు. అమృతసిద్ధి కలిగించేవి మాత్రమే సార్థకమైన అక్షరాలు. తద్భిన్నాలైనవన్నీ నామమాత్రపు అక్షరాలైన క్షరాలు. అయితే అమృతబీజాలు కానటువంటి అక్షరాలు శక్తిరహితాలని చెప్పడానికి బొత్తిగా అవకాశంలేదు. క్షరంకాని, అక్షరంకాని యే వర్ణమైనాసరే శక్తివంతమైనదే. ధ్వన్యాత్మకమైన శబ్దం శక్తివంతం కాగా, అదే ధ్వన్యాత్మకమైన నిశ్శబ్దశక్తి మహాశక్తివంతమైనది. కాగా, వివిధశబ్దాత్మకాలైన విభిన్నమంత్రాలకు, విభిన్నశక్తు లున్నా యన్నమాట యథార్థం. ఏ మంత్రసిద్ధిలోనైనా, మానసికజపం మహాశక్తివంతమైందన్న ఆర్షవిజ్ఞానదృష్టి, ఆధునికవైజ్ఞానికదృక్పథంలోకూడా సత్యసమ్మతమైనదే. అనంతమంత్రాలతో, అపూర్వశక్తుల కాలవాలాలైన, వేదాలను ప్రతిబింబించిన పురాణాలలో వివిధమంత్రశక్తుల ప్రసక్తు లుండడం అబ్బురం కాదు. విష్ణు, బ్రహ్మ, మహేశ్వరాది దేవతలందరికి విభిన్నరాక్షసులెల్లరకూ, ఉన్న ఆయుధాలన్నీబహుళమంత్రశక్తిసంభరితాలే. నరసింహకవి రత్నావళి వృత్తాంతసందర్భంలో "రాక్షసి నిజమందిరంబునంగల సకలధనంబులు సంగ్రహించుకొని ఖరేణురూపంబున బ్రాహ్మణునిం బై నిడుకొని రాజపుత్రియైన రత్నావళి నదృశ్యకరణశక్తిం దోడుకొని తృతీయముహూర్తంబున శంకరాలయమున కరుదెంచి, కాశీపురంబు చూపి యిది పాపతరుకుఠారంబు" (నార. 294. పు. 144. వ). అని రాక్షసివల్ల 'ఖరేణురూప అదృశ్యకరణశక్తి' మంత్రప్రయోగాలను చూపించాడు. ఇదేవిధంగా కాశిరాజు పుత్రికను కౌండిన్యున కిచ్చి వివాహం జరిపించిన సందర్భంలో రాక్షసి కరణిరూపం ధరించి రత్నావళిని నిజపురానికి తోడ్కొనివచ్చిన సందర్భంగాను, వివిధ మంత్ర, తంత్ర విద్యల ప్రభావాలను చూపించినట్లు పేర్కొన్నాడు. అయితే మంత్రోపాసనలో, సన్మంత్రోపాసనలు, దుర్మంత్రోపాసనలు, యెప్పుడూ వుండనే వుంటాయి. నరసింహకవి కలియుగధర్మాలను వివరించే సందర్భంలో "ద్విజాధములు నారాయణు వర్జించి దేవాంతరసేవకులై యుంద్రు. దుష్టద్రవ్యంబుచేత దుర్గారాధనక్రియలు హరిబాహ్యులగు నృపద్విజులు ప్రాణిహింసచేఁ గావింపుదురు. శ్మశానదేవతార్చనంబు శ్రేయస్కరంబని యొనరింపుదురు. హరిపదం బెఱుంగక యహోరాత్రంబు స్వోదరపూరకులై పరులు వర్తింపుదురు. (నార. 174. పు. 131. వ). అని వామాచారపరమైన శ్మశానపూజలను గురించి పేర్కొన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని విషప్రయోగాదులతో బాధించినపుడు రాక్షసబ్రాహ్మణులు అనేక అభిచారక్రియలు చేసినట్లుకూడా వర్ణించాడు. చివరికి దైత్యయాజ్ఞికులైన మాంత్రికులు పాపకోదితమైన కృత్తికను సైతం ప్రహ్లాదునిమీద ప్రయోగించినట్లు నరసింహకవి వర్ణించాడు. (చూ. నార. 483. పు. మొదలు. 494. పు. వరకు.) శ్రీకృష్ణ బాణాసుర యుద్ధసమయంలో హరుడు త్రిశిరఘోరమూర్తియైన ఉగ్రజ్వరాన్ని కల్పించగా దాని నతిశీతలజ్వరాన్ని కల్పించడంతో హరి హరించాడని నరసింహకవి పేర్కొన్నాడు. (నార. 63. పు. 369. వ). ఈ సందర్భంలో జ్వరీకరణమహామంత్రప్రయోగాన్ని, దానికి విరుగుడుగా నిలువగలిగిన శీతలీమంత్రప్రయోగాన్ని నరసింహకవి విస్పష్టపరచాడు.

బ్రాహ్మణవృత్తాంతవర్ణనాసందర్భంగా శాకలాపురంలో దురాచారుడైన బ్రాహ్మణునికి లభ్యమైన వేశ్యాకాంత అనేక వశ్యమోహకాలైన ఔషధాలు ప్రయోగించి అతని భార్యనుంచి అతని మనస్సును విరిచి వశ్యంచేసుకొన్నట్లు పేర్కొనడం జరిగింది (నార. 242. పు. 260. ప.). మోహినీరాజుల సంభాషణసందర్భంగా "తద్వశీకరణౌషధాంతరములడుగ" (నార. 230. పు. 203. ప.) అని వశీకరణ ఔషధాలవిషయం పేర్కొన్నాడు. అయితే ఒక యోగిని యిచ్చిన వశీకరణ ఔషధాలను ఉపయోగించిన విధాన్ని పేర్కొని యిటువంటి వశీకరణౌషధప్రయోగాలవల్ల వివిధరోగాలు సంభవిస్తాయంటూ "ఈ చూర్ణంబు క్షీరంబులతోఁ గూర్చి భర్తకుఁ ద్రావించిన, వాఁడు నీ దాసుండగు నీ రక్ష నీవు గళంబునం దాల్చిన నిఖిలవశీకారం బగునని నియోగించిన నేను నట్ల కావించితి. తన్మహిమచే భర్త దినదినంబును గృశియించి ముఖంబున వ్రణంబులు పుట్టి తద్వ్రణంబులం గ్రిమిసహస్రంబులు వొడిమ నస్థిచర్మావశిష్టుండై యుండి నన్నుం బిలిచి నీ దాసుండనైతి నన్యగృహంబుల కేఁగ నన్నుం గటాక్షింపవే యనిన నేను దద్యోగిని విన్నవించిన యుపశమనౌషధంబు దెచ్చిఁ స్వస్థునిఁ జేసితి నంత." (నార. 231. పు. 205. వ.) అని నరసింహకవి వివరించి యీ దుష్టౌషధాలకు విరుగుడుగా పనిచేయగల సదౌషధాలుకూడా వుంటాయన్న సంగతిని మంత్ర, తంత్ర, వైద్యశాస్త్రాలరీత్యా సూచించాడు.

రుక్మాంగదచరిత్ర విశేషాలు

రుక్మాంగదుడు విష్ణుభక్తులలో చాలా గొప్పవాడు. పెక్కురాజ్యాలనుజయించినవాడు. అనేకమంది భార్యలతో సుఖభోగలాలసుడైనవాడు. చంద్రవంశపు రాజైన యయాతి దేవయానిని వివాహం చేసుకొనడం, అనంతరం దేవయానిదాసీయైన శర్మిష్ఠతో సంగమంచేసిన కారణంగా శుక్రశాపానికి గురియై వార్ధక్యాన్ని పొందడం, చివరికి ధర్మసూక్ష్మవివరణతో శుక్రుని అనుగ్రహంవల్ల పుత్రయౌవనాన్ని యయాతి స్వీకరించి చిరకాలం శృంగారప్రియుడై, సకలభోగోపజీవియై జీవించి తనకు యౌవనాన్ని అడిగినవెంటనే యిచ్చివేసిన తనపుత్రుడైన పూరునికి తన యౌవనాన్ని తిరిగి యిచ్చి రాజ్యపట్టాభిషిక్తుని చేసి, ఆశ్రమవాసానికి వెళ్లడం సుప్రసిద్ధమైన కథ. యయాతి జీవితంలో అకాలంలో వార్దక్యం రావడం, తన పుత్రుడైన పూరుని యౌవనాన్ని తాను పొంది అనేకసంవత్సరాలు శృంగారప్రియుడై సుఖలాలసుడై జీవించడం కేవలం దేవయానితండ్రియైన శుక్రాచార్యుని శాపానుగ్రహాలవల్లనే జరిగింది కాని, సహజంగా జరగలేదు. కాని రుక్మాంగదుని జీవితంలో, ఉద్దేశపూర్వకంగా బ్రహ్మ విశిష్టంగా సృష్టించిన మోహినిని మందరనగసీమనుంచి పరిగ్రహించి, ఆమె మోహానికి లోనౌతాడు. నిజాని కప్పటికి రుక్మాంగదుని కుమారుడైన ధర్మాంగదుడు యువకుడైనా కాడు. కుర్రవాడు. కాని రుక్మాంగదుడు వార్ధక్యదశలోనే మోహినిని పరిగ్రహిస్తాడు. సప్తద్వీపపరీతభూవలయాన్ని పరిపాలింపవలసిందిగా తనపుత్రుడైన ధర్మాంగదుడిమీద రుక్మాంగదుడు భారం పెడతాడు. అయితే జగన్మోహినియైన మోహినితో విహరించడానికి తగిన యౌవనశక్తి రుక్మాంగదునికి లేదు. కాని ధర్మాంగదుడు తెచ్చిన మణుల కారణంగా రుక్మాంగదుడు, యౌవనం పొంది చిరకాలం భోగా లనుభవించినట్లు కనిపిస్తున్నది. వృద్ధుడైన రుక్మాంగదునికి యౌవనప్రాప్తిలో యయాతిచరిత్రలోవలె, యెటువంటి శాపానుగ్రహాల ప్రసక్తి లేదు. "నీవు సుతుండ వైన కతన నాకు నీ జగన్మోహినియైన మోహినితోడ విహరింపఁ బునర్యౌవనప్రాప్తి యయ్యెడు. మనుష్యలోకంబున వృద్ధునకు సురతానురాగంబు గలుగుట హాస్యకరంబు. మేను జీర్ణంబయ్యె. శిరోరుహంబులఁ బలితంబు వొడమె. జీర్ణుండనైన నీచే నజీర్ణుండ నై భోగంబు లనుభవించెద. నే నీకాంత నాకాంతంబు విడిచి నాకాంతయై వచ్చుటం జేసి భవద్బాహుగుప్తుండనై బర్హినిర్ఝరదివ్యనదీతటంబుల విహరింతు నీపురంధ్రి మత్ప్రాణంబు. దివ్యకాంత. ఏతన్నిమిత్తంబుగా దేవతలు ఖేదంబు నొందుచుం జనిరి. దీని సంరక్షింపవలయుననిన తండ్రి వాక్యంబులు విని యుపచారంబులు గావింప నాజ్ఞానువర్తుల నియోగించి రాజ్యభారంబు వహింపు చుండె." (నార. 253. పు. 309. వ.) ఆర్షవిజ్ఞాను లైన రుక్మాంగద, ధర్మాంగదులు కేవలం తమ మహత్తరాలైన మణులశక్తుల వల్లనే నిత్యయౌవన, శక్తులను సముపార్జన చేసుకున్నట్లు అర్థమవుతున్నది. విదిశాపురాధిపతియైన రుక్మాంగదునికుమారుడు ధర్మాంగదుడు తండ్రిని మించిన తనయుడు. సప్తద్వీపాలను సైతం జయించి పరిపాలించగల సమర్థుడు ధర్మాంగదుడు. మీదు మిక్కిలి పితృవాక్యపరిపాలకుడు. రుక్మాంగదుడు అకలంక అచంచల మహావిష్ణుభక్తి వ్రతనిష్ఠుడు. రుక్మాంగదుణ్ని విష్ణుభక్తినుంచి మరలించి, అతని ధ్వంసనార్థమై బ్రహ్మ మోహినిని సృష్టించి కర్తవ్యం ఉపదేశించి పంపిస్తాడు. మోహినీ రుక్మాంగదుల వివాహం అయిన తరువాత కొంతకాలానికి మోహిని బ్రహ్మ కిచ్చిన మాటప్రకారం రుక్మాంగదుని విష్ణువ్రతానికి భంగం కలిగించాలని విశ్వప్రయత్నం చేస్తుంది. మోహిని కోరిక మేరకు సప్తద్వీపవిజేతయై, పితృవాక్యపరిపాలకుడై తండ్రిని మించిన కొడుకనిపించుకొన్న ధర్మాంగదుణ్ని రుక్మాంగదుడు వధించడానికి సైతం సంసిద్ధుడవుతాడు తప్ప, విష్ణుపరమైన ఏకాదశీవ్రతనిష్ఠను విసర్జించడానికి మాత్రం ఆమోదించడు. మోహిని కోరికప్రకారం, ధర్మాంగదుని వధకు రుక్మాంగదుడు సంసిద్ధుడు కాగా, అతని విష్ణుభక్తితత్పరతకు బ్రహ్మాది దేవతలంతా ఆశ్చర్యపడి ప్రత్యక్షమై యెటువంటి విపరిణామం జరుగకుండా సంరక్షిస్తారు. ఈ రుక్మాంగదునిచరిత్ర సావిత్రీ సత్యవంతుల జీవితం తరువాత జరిగినట్లు కనిపిస్తున్నది. రుక్మాంగదునిభార్య అయిన సంధ్యావళి మోహినిని అనునయించే సందర్భంలో

"భర్త సువ్రత మొనరింప భార్య యాత్మ
నానుకూల్యంబు పాటించి యాచరించి
యందుఁ బోఁ బుణ్యలోకంబు లమితకీర్తి
వెలయు సావిత్రివోలెఁ బవిత్ర యగుచు."

(నార. 284. పు. 102. ప.)

అని సావిత్రిని ఉపమానంగా పేర్కొనడం ద్వారా, సావిత్రీ సత్యవంతులకథ రుక్మాంగదునికంటె ప్రాచీనమైనదని నరసింహకవి తెలియచేశాడు.

రుక్మాంగదుని కుమారుడైన ధర్మాంగదుడు తనకు తొమ్మిదవయేటనే మహాబలపరాక్రమవంతుడై మలయపర్వతంమీద వున్న విద్యాధరుల్ని యుద్ధంలో గెల్చి మణులతో సహా ఆ విద్యాధరుల భార్యలను తీసుకొనివచ్చి మోహినికి సైరంధ్రులుగా నియమించాడు. సామాన్యంగా మణిత్రయమని మణులు త్రిసంఖ్యకే పరిమితా లైనట్లు ప్రసిద్ధి. అవి కౌస్తుభం, చింతామణి, శ్యమంతకమణులు. ఇవికాక సూర్యకాంతమణులు చంద్రకాంతమణులు వేరుగా విశేషంగా వున్నాయి. కౌస్తుభమణి విష్ణువు ధరించేది కాబట్టి దానిని ధర్మాంగదుడు తీసుకొని రాలేదన్న విషయం స్పష్టం. ధర్మాంగదుడు తెచ్చిన మణులలో విభిన్నాలైన అపూర్వశక్తివంతాలైన పెక్కుచింతామణులు తెచ్చినట్లు స్పష్టపడుతున్నది. కాని ధర్మాంగదుడు అయిదుగురు విద్యాధరులను గెల్చి విభిన్నాలై మహత్తరశక్తివంతా లైన అయిదు మణులను తీసుకొనివచ్చి తండ్రి పాదాలముందు వుంచినట్లు నరసింహకవి యీ క్రింది విధంగా వర్ణించాడు. ఈ వర్ణనవల్లనే నాగశతావృతమైన భోగవతిని జయించి, అయుత నాగకన్యలను, ఫణిఫణారత్నాలను, యింకా యింకా అనేకానేక విజయఫలాలను తెచ్చి తండ్రికి సమర్పించినట్లు స్పష్టపడుతున్నది.

"అప్పన దెచ్చె విద్యాధరుల జయించి
        మణులేను నిజశక్తి మహిమ నొకటి
హాటకమయ లక్షకోటి ప్రదంబగు
        నొకటి సహస్ర శతోత్తమ పట
దాయకం బొక్కటి తారుణ్య సంపద్వి
        ధాయక నవసుధాధార లొలుకు
నొకటి గృహ ప్రధానోత్కట ధాన్య సా
        ధనమయి కీర్తిని దనరు నొకటి
వ్యోమగమనంబు నొందించు నొరపు మెఱయ
నట్టి మణి రాజములు దెచ్చి యధిక శౌర్య
ధనులు విద్యాధరాగ్రణుల్ దారు నశ్రు
పూర్ణ నేత్రాంతలై తదంభోజ ముఖులు.

వెంటరా ధర్మాంగదుండు రుక్మాంగద క్షితీశు పదంబులపై వ్రాలి వీరె యేవురు విద్యాధరులు మలయాచలంబున వీరి జయించితి వీక్షింపు మేతద్భార్యలు సైరంధ్రులయి యీ మణులచే మోహినీకాంత నలంకరింతురు. సర్వకామ ప్రదంబులై పునర్యౌవనదాయకంబులై యుండు నీ మణులు దాల్చిన జీర్ణవంతులేని లావణ్యవంతు లగుదురు. ఈ మణులు వళిపలిత నాశకంబులు. వస్త్ర హర్మ్య సువర్ణాది చింతితసిద్దిమూలంబులు. చింతామణులే కాని యితర మణులు గావు. గంధర్వులు నేనును ముప్పది దినంబులు రణం బొనర్చి నీ తేజంబున జయించి యప్పన గొంటి. ఏను సముద్రంబు ప్రవేశించి సముద్రగర్భంబున నొక యేఁడు వర్తించితి. నాగశతావృతమైన భోగవతి నిర్జించి యయుత నాగకన్యలం గొనివచ్చితి. ఫణిఫణా రత్నంబులు దెచ్చితి. నచ్చట దానవ మందిరంబున కేఁగి యెనిమిది వేవుర దానవీ కన్యకలనాహరించితి. శతకోటి రత్నంబులు దీపార్థంబుగా నాపాదించితి. యుష్మత్పరాక్రమపాలితుండ నై రసాతలస్థితంబగు వారుణ లోకంబు చొచ్చి వరుణుం గాంచి బ్రతుకవలసెద నేని తండ్రి యాజ్ఞం దిరుగు మనంగ నలిగి యుద్దసన్నద్ధుండై యొక వత్సరంబు పోరె. అతని నారాయణాస్త్రంబునం దూలించిన సమీరవేగంబులై విజితచంద్రప్రభాభోగంబులై యొక్కొక్కకర్ణంబు శ్యామంబై తృణతోయంబులు లేక బ్రతుకు తురంగాయుతంబును బుష్కరానుజయైన త్రిలోకసుందరి యగు నొకకన్యను భార్యార్థంబుగా సమర్పించె. (నార. 255, 256. పు. 318. ప. 319. వ.). ఈసందర్భాన్ని బట్టి ఆయామణులు యెంతటి మహత్తరశక్తివంతాలో మణిధారణాప్రభావంతో రుక్మాంగదు డేవిధంగా ప్రవృద్ధుడైన పునర్యౌవనవంతు డయ్యాడో స్పష్టపడుతుంది.

పూర్వజన్మలలో యెన్ని జన్మలలోనైనాసరే చేసిన యెంతటి ఘోరాతిఘోరాలైన పాపాలనైనా పోగొట్టి పవిత్రాత్ములుగా చేయగల శక్తి "పూర్వదుర్గతినాశినీ" మంత్రానికి వున్నదని మన మహర్షులు పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రబోధనియైన కార్తీక శుక్లైకాదశినాడు యథావిధిగా ఉపవసించి విష్ణ్వర్చన చేస్తే యెంతటి బ్రహ్మహత్యాది పాపాలైనా నశించుతాయని నరసింహకవి రుక్మాంగదుని ద్వారా మోహినికి యీ క్రింది పద్యాలలో వివరించాడు.

"అక్లేశకరము కార్తిక
శుక్లైకాదశి యముండు చూడ వెఱచు రో
పక్లిన్నాక్షుండై హరి
విక్లబులను గావఁగాఁ దవిలి మేల్కనఁగన్.

బ్రహ్మహత్యాది దుస్తరపాతకములు
కామచారకృతంబులై కలిగిన యవి
యైన విలయంబు నొందు నన్యూనమహిమ
నిది ప్రబోధని యండ్రు యతీంద్రవరులు.

(నార. 270. పు. 28,29. ప.)

ప్రహ్లాదకథావైశిష్ట్యం

భాగవతాది యితరపురాణాలలో వున్న ప్రహ్లాదునికథకు, నారదీయపురాణంలో వున్న ప్రహ్లాదునికథకు మౌలికంగా కొంతభిన్నత్వం గోచర మవుతున్నది. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ, విజయు లిద్దరూ మునులవల్ల శాపగ్రస్థులై రాక్షసులుగా జన్మించిన విషయం సుప్రసిద్ధం. కృతయుగంలో జయ విజయులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి, బ్రహ్మకు, మహేశ్వరునకూ భక్తులై మహావిష్ణువుపట్ల త్రికరణశుద్దిగా విద్వేషభావాన్ని వహించినట్లు అనేకగ్రంథాలవల్ల మనకు ద్యోతక మవుతున్నది. అయితే నారదీయ పురాణంలో మాత్రం, హిరణ్యకశిపునకు అంతరంగికంగా విష్ణుభక్తి వున్నట్లు విష్ణుభక్తి లేనివానివలె అతడు పైకి, అతని జీవితకాలం మొత్తంలో విష్ణువిద్వేషిగా నటించినట్లు అనేకసందర్భాలలో స్పష్టంగా పేర్కొనబడింది "ఇట్లు వివిధభోగంబు లనుభవించుచు, భోక్త హరి యని లోనందలంపుచు స్వేశశేషత్వదృష్టిజనితప్రీతిం జనింపంబడుచు, బాహ్యుండునుంబోలె బాహ్యంబున మాయానాటకసూత్రంబున గడపుచుఁ జార్వాకుండునుంబోలె దేహాత్మాభేదసూచకక్రియలు గావింపుచుఁ గైశికవృత్తి కామినులంగూర్చి కబ్బంబు లొనర్చుచు, 'కాముకేషు సుఖాలాభ' యనుచు నొకానొకచోటం బల్కుచు జగంబు శూన్యశేషంబని మాధ్యమికుండునుబోలె నుచ్చరింపుచు, బహిర్దేశంబున, సేష్టవస్తువులు చూడని యట్లుండి హృదయంబున భావించు యోగియునుం బోలె సర్వంబు నంతరంగంబుననే చూచుచు, బాహ్యంబున లేదని యాడుచు" .............. "బాహ్యంబున దైత్యుఁ డంతరంగంబునఁ బరమ వైష్ణవుండై వర్తించు నమ్మాయావివలన." (నార. 432, 433. పు. 176. వ.) అని వొకటికి రెండుసార్లు హిరణ్యకశిపుని అంతరంగికవిష్ణుభక్తి గురించి స్పష్టంగా ఉటంకించడం జరిగింది. అనంతరం తన పుత్రుడైన ప్రహ్లాదుని మహత్తరవిష్ణుభక్తి గురించి హిరణ్యకశిపు డాంతరంగికంగా యెంతో సంతోషపడినట్లు యీ క్రింది పద్యంలో నరసింహకవి మరింత విస్పష్టంగా పేర్కొన్నాడు.

సంపూర్ణకళాలక్ష్మీ
సంపన్నుండైన సుతు నిశాచరపతి వీ
క్షింపుచు నానందము నను
కంపయు నుప్పొంగఁ బలికెఁ గడు మన్ననతోన్.

(నార. 464. పు. 89. ప.)

అంతేకాదు నరసింహకవి హిరణ్యకశిపుడు హరిభక్తి విడిచిపెట్టవలసిందని ప్రహ్లాదుణ్నిమందలించిన సందర్భంలో ప్రహ్లాదుడు తండ్రితో మాట్లాడుతూ, అసలు హిరణ్యకశిపుడు విష్ణ్వంశలోనే సంజనితుడైనట్లు ప్రహ్లాదునినోటివెంటనే చెప్పించాడు.

"దైత్యేంద్ర! యిన్నియుఁ దగుఁ ద్రిజగజ్జయ
        సంపదనీకు; నో స్వామి; నేఁడు
ప్రాకృతుండవు నీవు పరమాత్మయైన యా
       హరి నిజాంశంబున నవతరించి
యిట్ల యుండకయున్న నీశౌర్య మీశక్తి
      యీమహైశ్వర్యంబు నేలకలుగు;"

(నార. 461. పు. 76. ప.)

విష్ణువు సనకాదులకు మోక్షప్రాప్తివిధానంగురించి వివరించిన సందర్భంలో విష్ణువే రాక్షసులు బాహ్యంగా కుదృష్టి, ఆంతరంగికంగా విష్ణుభక్తి కలిగివుంటారన్నభావంతో "దీవించి బాహ్య కుదృష్టి సమ్మతమైన మతమునఁ బ్రియతమస్థితి వహించి." (నార. 417. పు. 100. వ.). "అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతినొందుచుఁ దామసులు తన వారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్యయంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుంబలె నటించి మత్పదాంభోజంబు లందెదరు. బాహ్యంబున నసురతాఖ్యాతికై సురల బాధించెదరు." (నార. 417. పు. 101. వ.) అని పేర్కొనడమేకాక యీ మాయానాటకసూత్రంలో విష్ణుప్రయోజనాయత్తులై, జయవిజయులు రాక్షసులుగా జన్మిస్తారని విష్ణువే చెపుతాడు.

ప్రహ్లాదుడు పూర్వజన్మలో ధర్మవత్సలుడనే పేరుతో వేదవేదాంగవేత్తయై ఒకానొకపండితసభలో యశోనిధియైన ధర్మబంధు వనే మునీశ్వరుణ్ని వాదప్రతివాదాలలో గెలువగా, అత డాగ్రహించి, దైత్యకులముఖ్యుడ వవుతావని మొదట శపిస్తాడు. అతడు తిరిగి ధర్మవివేకోద్దీపితుడై బ్రహ్మవిద్యారూపుడైన ధర్మవత్సలుణ్ని అకారణంగా శపించానని బాధపడి, రాక్షసముఖ్యుడ నైనప్పటికికూడా బ్రహ్మవిద్యావివేకపరిపూర్ణుడవై వర్ధిల్లుతాడని పలుకుతాడు. ఆ ధర్మవత్సలుడే హిరణ్యకశిపునకు కృతయుగంలో ప్రహ్లాదుడై పుడతాడు. జయవిజయులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా సంజనితు లయ్యారని గతంలోనే పేర్కొనబడింది. త్రేతాయుగంలో ఆ జయవిజయులే రావణకుంభకర్ణులై పుడితే, ధర్మవత్సలుడు విభీషణుడుగాను ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్రులై పుడితే, ధర్మవత్సలుడు సహదేవుడై తత్త్వబోధనిరూపణం చేస్తాడని విష్ణువే పలుకుతాడు. ఈకృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో తాను నరసింహ, రామ, కృష్ణ, కల్కినామాలతో అవతరించి దుష్టసంహారం చేస్తానంటాడు. కల్కి అవతారం సంభవించి, దుష్టులను సంహరించేది కలియుగ చతుర్థపాదంలోనే, నరసింహావతారానికి పూర్వం విష్ణువే వరహావతార మెత్తి హిరణ్యాక్షుణ్ని సంహరించిన విషయం విస్పష్టం. హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో రావణాసురుడుగాను, ద్వాపరయుగంలో శిశుపాలుడుగాను, జన్మించి రామకృష్ణావతారాలచేత సంహరింపబడతాడు. అతనికి పునర్జన్మ తిరిగిలేదు. అంతే కాదు. "కృష్ణాశ్రయంబైన క్రోధంబును, కృష్ణాశ్రయంబైన కామంబును దైత్యులకు గోపికలకు మోక్షహేతువు" (నార. 509. పు. 273 వ.) అనికూడా విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. మామూలుగా భాగవతాదిగ్రంథాలలో హిరణ్యకశిపుడు, మహోదగ్రుడై, తన సభాస్థలిలో వున్న ఒకస్తంభంలో విష్ణువును చూపవలసిందని ప్రహ్లాదుణ్ని అడుగగా విష్ణువు నరసింహావతారంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించినట్లు ప్రసిద్ధమైన విషయం. భాగవతాది గ్రంథాలలో ప్రహ్లాదాదులందరికీ నరసింహావతారంగానే విష్ణువు మొట్టమొదట ప్రత్యక్షమవుతాడు. అయితే నారదీయపురాణంలో దీనికి భిన్నంగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యమయాతనలు పెట్టి, నాగపాశబద్ధుణ్ని చేసి, సముద్రంలోకి తోయించినపుడు విష్ణువు ప్రహ్లాదునికి విష్ణుస్వరూపుడుగానే ప్రత్యక్షమై ప్రహ్లాదుణ్ని అనునయించి వరం వేడుకోమంటే నీ పాదారవిందాలు చూడడంకంటే నాకు వేరేకోరిక లేదని ప్రహ్లాదు డంటాడు. చివరికి విష్ణువు ప్రహ్లాదుణ్ని మోక్షలక్ష్మీసామ్రాజ్యపట్టభద్రుడుగా అనుగ్రహించినప్పటికి ప్రహ్లాదుడు విష్ణుపదభక్తి తప్ప వేరొకటి కోరనంటాడు. చివరికి విష్ణువు నేను క్షీరాబ్దిలో వున్నవిధంగా నీ హృదయంలో వుంటానంటూ మూడురోజులకు నరసింహావతారంలో తిరిగి నన్ను నీవు చూస్తావని యీ క్రిందివిధంగా పేర్కొంటాడు.

"ప్రియవత్స! నీకు నభీష్ట మెయ్యది యది
          ప్రాపించు; సుఖమున బ్రతుకు మింక;
నంతర్హితుండనై యరిగిన ఖేదంబు
          నొందకు; క్షీరాబ్ధి నున్న యట్లు
నీ హృదయంబున నిల్తు; లక్ష్మికి నాకు
          భక్తహృదయమె శోభనగృహంబు;
వైకుంఠదుగ్దాబ్దివాసవర్ణన నిత్య
         శోభయె తెలియ; రక్షోభయములు
తలఁగఁ జేయుదు దారుణతనువు గాన
మందిరము నిలుపుకొనఁగ మనుజసింహ
మూర్తి ననుఁ జూచెదవు; భక్తి మూఁడుదివస
ములకు నని యేగె విస్మయమున భజింప"

(నార. 501. పు. 247. ప.)

కాగా, యితరగ్రంథాలలోవలే కాక నారదీయపురాణంలో ప్రహ్లాదునికి విష్ణువు హిరణ్యకశిపుసంహారసందర్భంలో నరసింహావతారరూపంలోనే కాక, అంతకు పూర్వమే అసలు సహజవిష్ణుస్వరూపంలోనే, ప్రత్యక్షమైనట్లు స్పష్టపడుతున్నది.

పేరోలగంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని ఉద్దేశించి యీ స్తంభంలో విష్ణువును చూపించవలసిందని స్తంభాన్ని చేతితో కొట్టినట్లు, పిడికిలితో గుద్దినట్లు, కాలితో తన్నినట్లు, గదతో మోదినట్లు వివిధగ్రంథాలలో పేర్కొనబడింది. కాని నారదీయపురాణంలో మాత్రం "అని స్తంభంబునం జూపు" మని ఖడ్గంబున స్తంభంబుం దాటించిన." (నార. 504. పు. 257. ప.) అని కత్తితో కొట్టినట్లు కనిపిస్తున్నది.

ప్రహ్లాదుని విద్యాభ్యాసవర్ణనాసందర్భంలో కాణాదాదిసిద్ధాంతాలు ప్రహ్లాదునికి పూర్వమే వున్నట్లు

"అంత నద్దైతేయుఁ డాత్మజు ప్రతిన స
        త్యము సేయఁ దలఁచి యుదగ్రబుద్ది
గురు సుగత కాణాద గిరిశార్హ దక్షపా
        ద విరించి కపిలశాస్త్రజ్ఞ నాది
నరులనందఱఁ బిల్చి వాదింపుఁ డితనితో"

(నార. 443. పు. 227 ప.)

అన్న పద్యంద్వారా స్పష్టపడుతున్నది. అయితే యీ సిద్ధాంతాలు కృతయుగంలోనే ప్రశస్తి గాంచివున్నాయని ఆధునికచరిత్రకారులుగాని, శాస్త్రజ్ఞులుగాని అంగీకరించక పోవచ్చును. కాని వేదవాఙ్మయ ఆర్షవిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించినపుడు, ఆ యా అణుపరమాణ్వాది సిద్ధాంతాలు, అత్యంతప్రాచీనాలని ఆమోదించక తప్పదు.

ప్రహ్లాదుడు దైత్యకుమారులకు పరమార్థరహస్యబోధపేరుతో ఆత్మానాత్మవివేకం దగ్గరనుంచి, అణిమాద్యష్టసిద్ధులతోసహా అన్నింటినీ తిరస్కరించి అనేకతత్వవిషయాలను ప్రబోధించి "విష్ణుసేవియైన జనునకు విముక్తియే సత్ఫలంబు" అని విపులంగా, సునిశితంగా తత్వబోధ చేస్తాడు. (చూడు. నార. 480. పు. మొ. 487. పు. వరకు.)

హిరణ్యకశిపుని సంహారానంతరం నరసింహావతారంలో వున్న విష్ణువు ప్రహ్లాదుని చేరదీసి, అనుగ్రహించి, రాజ్యాధినేతను చేస్తాడు. అనంతరం ప్రహ్లాదుడు చాలాకాలం రాజ్యపరిపాలన చేస్తూ, ఆ రాజ్యభోగతృష్ణలో మునిగితేలక, కేవల జ్ఞానాచ్యుతాంఘ్రిభక్తిరాజ్యాన్ని సైతం అనుభవిస్తూ చిరకాలం జీవించినట్లు కనిపిస్తున్నది. (నార. 508. పు. 268 వ.)

ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు అనన్యసామాన్యమైన మహావిష్ణుభక్తుడు. ఇతని తండ్రి హిరణ్యకశిపుడు. తల్లి లీలావతి. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుద్దేశించి ఘోరమైన తపస్సు చేయడానికి పూనుకొనగా దేవతలు రాక్షసులమీదకు యుద్ధానికి వెళ్లారు. ఆయుద్ధంలో రాక్షసులంతా వోడిపోయారు. అప్పుడు ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్య గర్భవతియైన లీలావతిని పట్టుకొనగా నారదు డడ్డుపడి లీలావతి సచ్చరిత్ర అనీ, ఆమె గర్భంలోవున్న బాలుడు, మహావిష్ణుభక్తు డవుతాడనీ, ఆమెను చంపవద్దని చెప్పి, విడిపించి, తన ఆశ్రమానికి తీసుకొనివెళ్లి కాపాడి, పోషించి ఆమెకు ఆమె గర్భస్థుడైవున్న ప్రహ్లాదునికి మహత్తరమైన విష్ణుతత్త్వోపదేశం చేశాడు. ఈవిషయంతోపాటు మిగతావిషయాలన్నీ, భాగవతాది గ్రంథాలద్వారా విజ్ఞులకు సువిదితాలే. అయితే దేవీ భాగవత, భారత, వామనపురాణాలవల్ల మరికొన్నివిశేషాలు తెలుస్తున్నాయి. అవి ప్రహ్లాదుని జీవిత మధ్య, ఉత్తరచరిత్రలకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయి.

వాటిని యీక్రింద సంగ్రహంగా ఉటంకిస్తున్నాను. ప్రహ్లాదుని అర్థాంగిపేరు దేవి. ఈ దంపతులకు ఆయుష్మంతుడు, శిబి, విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే అయిదుగురు పుత్రులు కలిగారు. ప్రహ్లాదు డొకసారి ఒకమునీశ్వరుణ్ని అవమానించాడు. అతని శాపం కారణంగా ప్రహ్లాదుడు విష్ణుభక్తిరహితు డైపోయాడు. అనంతరం విష్ణుమూర్తికి, ప్రహ్లాదునికి పరస్పరం యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో ప్రహ్లాదునికి శాపవిముక్తితోపాటు, తిరిగి విష్ణుభక్తి ప్రబుద్దమైనది.

ఒకసారి చ్యవనుడు స్నానంచేస్తూ వుండగా, అతనిని పాతాళలోకవాసులు, పాతాళానికి యీడ్చుకొనిపోయారు. అప్పుడు పాతాళంలోవున్న ప్రహ్లాదుడు చ్యవనుణ్ని చాలా గౌరవించాడు. అపుడు చ్యవనుడు తానుచేసిన తీర్థయాత్రలమహాత్మ్యాలనుగురించి వివరంగా వర్ణించి చెప్పగా, ప్రహ్లాదుడు చ్యవనునితోపాటు తీర్థయాత్రలు చేయడానికి సపరివారంగా వెళ్లాడు.

ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేస్తూ, నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్లి, వారినీ, వారిసమక్షంలోవున్న వివిధ అస్త్రాలనూ చూచి "వీరు నిజంగా మునీశ్వరులే అయితే వీరికి అస్త్రాలతో పనేంవున్నది. బహుశా వీరు వంచకులై వుంటారు." అని అన్నాడు. ఆ మాటలు విన్న నరనారాయణులకు ఆగ్రహం వచ్చి వారు ప్రహ్లాదునితో యుద్ధానికి తలపడ్డారు. ఆపోరాటంలో ప్రహ్లాదు డోడిపోయి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నరనారాయణు లిద్దరూ తన అంశతో జనించినవారే అని వివరిస్తాడు, అని దేవీభాగవతంవల్ల తెలుస్తున్నది.

ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడూ, సుధన్వుడనే బ్రాహ్మణుడూ ఒకకన్యాప్రతిగ్రహవిషయంలో వాదులాడుకుంటారు. అప్పుడు వారు తమయిద్దరిలో, గుణగణాలలో గొప్పవాడెవ్వరో నిర్ణయించి చెప్పవలసిందని యిద్దరూకూడా ప్రహ్లాదుని వద్దకే వెళ్తారు. అప్పుడు సుధన్వుడు నీవు ధర్మాధర్మాలను విచారించకుండా పక్షపాతంతో యేదైనా నిర్ణయానికి వచ్చేట్లయితే, నీ తల ముక్కలు చెక్కలవుతుందని అంటాడు. ఈ మాటలకు ప్రహ్లాదుడు భయపడి కశ్యపునివద్దకు వెళ్లి, విషయమంతా వివరిస్తాడు. అప్పుడు కశ్యపుడు "సాక్షీభూతుడైనవాడు, ధర్మదర్శుడు, విధి తప్పకూడదు. ఎవరైనా ధర్మం చెప్పవలసిందని వచ్చినప్పుడు, ధర్మం చెప్పకపోతే పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ధర్మాధర్మాలను విచారించి ధర్మోద్ఘాటన చేయవలసిం" దని చెబుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, విరోచన, సుధన్వుల గుణగణాలను విమర్శించి, సుధన్వుడే గుణవంతుడని మేటి అని, నిష్పక్షపాతంగా చెప్పినట్లు భారతం పేర్కొంటున్నది.

ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడు, సుధన్వుడు ఒకసందర్భంలో పందెం వేసుకొని తమ తమ ప్రాణాలను పణంగా వొడ్డుతారు. అనంతరం తమ తగవు తీర్చవలసిందని వీరిద్దరూ ప్రహ్లాదునివద్దకు వెళ్తారు. విరోచనుడు తన పుత్రుడనికాని, సుధన్వు డన్యుడనికాని, తలంచకుండా సుధన్వునికి న్యాయం సమకూరుస్తూ, ధర్మబుద్ధితో తీర్పు చెప్పి తన తనయుని ప్రాణాలు పోగొట్టడాని కంగీకరిస్తాడు. అయితే తరువాత ప్రహ్లాదుడు ఆ సుధన్వుని వల్లనే తన తనయుని జీవితాన్ని దానంగా గ్రహించి విరోచనుణ్ని పునర్జీవితుణ్ని చేస్తాడని భారతంలో మరొకచోట పేర్కొనబడింది.

ప్రహ్లాదుని మనుమడు విరోచనుని పుత్రుడైన బలి రాజ్యంచేస్తూ వుంటాడు. "ఇప్పుడు దైత్యుల మహిమ, శక్తి, యుక్తులు, క్షీణించిపోతున్నాయి. ఇందుకు కారణం యేమి"టని ప్రహ్లాదుణ్ని బలి ప్రశ్నిస్తాడు. మహావిష్ణువు కారణంగానే దైత్యులశక్తి క్షీణిస్తున్నదని ప్రహ్లాదుడు చెపుతాడు. అప్పుడు బలి "ఆఁ! విష్ణుమూర్తి అంటే యెంత? అతణ్ని ఓడించగలిగిన వీరులు మనలో లేరా?" అని బలి విష్ణుధిక్కరణతో మాట్లాడుతాడు. అప్పుడు ప్రహ్లాదుడికి కోపం వచ్చి "నీవు విష్ణుమూర్తి వల్లనే అణగద్రొక్కబడతావు" అని బలిని శపిస్తాడు. అని వామన పురాణంవల్ల తెలుస్తున్నది. విష్ణుమూర్తి వామనావతారం దాల్చి, బలిని అణగద్రొక్కిన విషయం సుప్రసిద్ధమే కదా!

బలికి ప్రహ్లాదుడు వివిధధర్మవిశేషాలన్నీ చెపుతూ వుండేవాడు. విష్ణుమూర్తి వామనావతారం తాల్చి బలిని అణగత్రొక్కుతుంటే ప్రహ్లాదు డడ్డుపడి, "బలి హంతవ్యుడుకాడు. సద్ధర్మపరుడు నీతిపరుడు కాబట్టి అతనిని కాపాడవలసింది"గా విష్ణువును ప్రార్థించగా అప్పుడు విష్ణువు అతనిని సంహరించకుండా విడిచిపెట్టాడని కూడా వామనపురాణం పేర్కొంటున్నది.

అవతారాలు

వేదవాఙ్మయం ప్రకారం చూస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి అనేకానేకావతారా లున్నాయి. ఒక్క విష్ణువుకు సంబంధించి సుప్రసిద్ధమైనవి పది అవతారాలేయైనా వేదవాఙ్మయంలో మాత్రం విష్ణ్వవతారాలు అతీతదశదశాలుగానే కాదు, దశశతాలకంటే యెక్కువగానే వున్నాయి. సుప్రసిద్ధాలై యిప్పటి కవతరించిన తొమ్మిది అవతారాలలోనూ, వరాహ, నృసింహ, కృష్ణావతారాలు మాత్రమే, అన్యశక్తులవల్ల శ్రీ మహావిష్ణువులో అంతర్లీనమైనట్లు కనిపిస్తున్నవి. హిరణ్యాక్షసంహరణార్థం మహావిష్ణువు వరాహావతార మెత్తి హిరణ్యాక్షుని రక్తాని త్రాగి మదించి స్వైరవిహారం చేస్తూ లోకాలన్నింటినీ భయపెడుతూ, ఆ వరాహరూపంలోనే సంచరిస్తుండగా బ్రహ్మాది దేవతలందరూ భయపడి, మహేశ్వరునితో మొరపెట్టుకొన్నారు. అప్పుడు మహేశ్వరుడు శరభరూపం తాల్చి ఆ స్వైరవిహారం చేస్తున్న ఆదివరాహం బృహద్దంతాన్ని లాగివేసి దాని పీచమడగించినట్లు భాగవతస్కాందపురాణాలు పేర్కొంటున్నాయి. నారదీయపురాణంలో నరసింహావతారం ముగింపుగురించి ప్రత్యేకంగా యేమీ పేర్కొనలేదు. కాని శివపురాణ లింగపురాణాల ప్రకారం హిరణ్యకశిపుని సంహారానంతరం ఆ నరసింహుడు సగర్వంగా, విచ్చలవిడిగా తిరుగుతుంటే శివుడు శరభరూపం తాల్చి నరసింహావతారాన్ని ముగింపచేసి ఆ చర్మం తీసి తాను కప్పుకొన్నాడని తెలుస్తున్నది. అనంతరం ఆ నరసింహావతారంలోని నరరూపం నరుడుగాను, సింహరూపం నారాయణుడుగాను రూపొందినట్లు కూడా శివ-లింగ-పురాణాలు పేర్కొంటున్నవి. మహేశ్వరుడు గజచర్మధారిగా, అజనాషాడధరుడుగా, ప్రసిద్ధివున్నది కాని నరసింహచర్మధారుడుగా యే విధమైన ప్రసిద్ధీలేదు. యీ విషయంలో ఒక్క శివ లింగ పురాణాలవాక్కు తప్ప మరే యితరశాస్త్రాధారం కూడా కనిపించడం లేదు. పరశురాముడు రాముని చేతిలో వోడిపోయినా, సుదీర్ఘకాలం అంతర్ముఖుడై తపోనిధిగా కాలం గడిపినట్లు కనిపిస్తున్నది. రామావతారకాలంలో రాముడు వాలిని సంహరించిన సందర్భంగా వాలి సుగ్రీవులకు భార్యగా విరాజిల్లిన తారశాపం కారణంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడుగా అవతరించిన తరువాత అవతారాంతిమదశలో - త్రేతాయుగంలో వాలిగా జీవించి, ద్వాపరయుగంలో ఒకబోయవాడుగా జన్మించిన వ్యక్తి వేసిన బాణాహతితో పాదాంగుష్ఠవిచ్ఛేదనం జరిగి శ్రీకృష్ణావతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడు ఒకచెట్టుక్రింద కాళ్లు చాపుకొని కూర్చొని వూపుకుంటూ పిల్లనగ్రోవి ఊదుతూ వుండగా దూరంగావున్న బోయవాడు కదిలాడుతున్న కాలిబొటనవ్రేలిని చూచి చెవులపిల్లి (కుందేలు) చెవి ఆడిస్తున్న దనుకొని గురిచూచి బాణం వేయగా ఆ బాణం శ్రీకృష్ణుని బొటనవ్రేలికి తగిలి, కృష్ణుడు అవతారం చాలిస్తాడు.

మహావిష్ణువు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఖగోళశాస్త్రరీత్యా గాని, మంత్రశాస్త్రరీత్యా గాని, మరేదృష్టితో చూచినా విష్ణువును ఒక అసాధారణమై, అపూర్వామేయమైన స్థానం వున్నదని మనం ఆమోదించక తప్పదు. శ్రీ మహావిష్ణువు గురించి వేదవాఙ్మయంలో బహుముఖంగా వర్ణించబడింది. శ్రీసూక్తం బహుముఖాలైనవిశేషార్థాలతో లక్ష్మీపరమై అవతరించగా, అదేవిధంగా పురుషసూక్తం మహావిష్ణుపరమై అవతరించింది. గతంలో అనేకమంది ప్రాచ్యపాశ్చాత్యపరిశోధకులు వేదకాలంలో మహావిష్ణువుకంటే ఇంద్రుడికి మహోన్నతస్థానం యివ్వబడిందనీ, ఆకాలంలో ఇంద్రునికంటె విష్ణువు తక్కువవాడుగా చూడబడ్డాడనీ అభిప్రాయపడడం జరిగింది. వీరిలో యీ అభిప్రాయం కలగడానికి మూలకారణం విష్ణు పర్యాయపదాలలో "ఉపేంద్ర" శబ్దం ఉపయోగించబడడమే. ఉపేంద్ర శబ్దానికి "చిన్నయింద్రుడు" అని ఈపరిశోధకవిమర్శకు అర్థంచెప్పుకొని, విష్ణువును ఇంద్రునికంటె తక్కువవానిగా వేదకాలంలో భావింపబడినట్లు పేర్కొన్నారు. ఇంద్రుడు వర్షాధిదేవత కావచ్చును. వర్షాలకోసమై ప్రాచీనకాలంలో కొందరు 'ఇంద్రస్తుతి' అత్యధికంగా చేసివుండవచ్చును. వాస్తవానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యా వర్షాధిదేవత వరుణుడే కాని ఇంద్రుడు కాడు. అసలు 'ఉపేంద్ర'శబ్దానికి ఆర్షవిజ్ఞానందృష్ట్యావున్న అర్థమే వేరు. ఉపేంద్రుడంటే చిన్నయింద్రుడని ప్రాచ్యపాశ్చాత్యపరిశోధకవిమర్శకులు చెప్పిన అర్థం పూర్తిగా పొరపాటు. నరసింహకవి నారదీయపురాణంలో హిరణ్యకశిపుడు విష్ణువును కించపరుస్తూ, తూలనాడుతూ, ప్రహ్లాదునితో సంభాషించిన సందర్భంలో "అటు పల్కెద వేనిచ్చిన సుఖంబు విడిచి యుపేంద్రునివలన నేమి యనుభవించెదవు? నాయాజ్ఞ శిరంబునం దాల్చిన దేవేంద్రునిం జూడవే?" (నార. 473. పు. 125. వ.) అని దేవేంద్రునికంటే ఉపేంద్రుడైన విష్ణువు తక్కువవాడన్న అభిప్రాయం వ్యక్తీకరింపచేయడం జరిగింది. వాస్తవానికి ఉపేంద్రశబ్దానికి చిన్నయింద్రుడని అర్థం కాదు. ఇంద్రునికి సమీపంలో వుండేవాడనికూడా అర్థంకాదు. 'తన సమీపంలో ఇంద్రుడు కలవాడు' అని మాత్రమే అర్థం. "ఉపసమీపే ఇంద్రః యన్యపః ఉపేంద్రః" అని అసలైన అర్థం. ఎక్కడో కోట్లాదిమైళ్ళదూరంలో మహోన్నతస్థానంలో ఖగోళంలో నక్షత్రరూపంలో క్షీరసముద్రం (Thick Milky Way) అనబడిన పాలపుంతలో శేషశాయి అయివున్న మహావిష్ణు నక్షత్రా లెక్కడ? జ్యేష్ఠాది దేవతయైన దేవేంద్ర నక్షత్రా లెక్కడ? ఉన్నతస్థానంలోగాని, వైశాల్యంలోకాని, మహత్తరశక్తిమత్తత్వంలో విష్ణు నక్షత్రాలకు, దేవేంద్ర నక్షత్రాలకు పొంతనయే లేదు. అందువల్ల ఉపేంద్ర శబ్దానికి చిన్నయింద్రుడని కాకుండా, "తనసమీపంలో ఇంద్రుడు కలవాడు" - "ఇంద్రున కాశ్రయభూతుడైనవాడు" అని విశేషార్థాన్ని అసలైన, సిసలైన మూలార్థాన్ని చెప్పి, మహావిష్ణు స్థానానికున్న శాస్త్రీయమైన వాస్తవికతను మనం గుర్తించవలసివున్నది. కాగా దేవేంద్రుడు ఉపేంద్రునికంటే తక్కువవాడే కాని, యెక్కువవాడని చెప్పడానికి అవకాశం లేనేలేదని గ్రహించాలి. నారదీయపురాణంలో రెండు సందర్భాలలో విష్ణుపరంగా 'ప్రభువు' అనే అర్థంలో ఈశ్వరశబ్దంసైతం ప్రయోగితమయింది, "సనకాదులు శపించుట విని దయాబ్ధియు భక్తవత్సలుండును నగు నీశ్వరుండు." (నార. 421. పు. 119. వ.)

"కాన నేనును స్వప్రసిద్ధకలితసర్వ
శక్తియుక్తుండనైన యీశ్వరుఁడ నస్మ
దాజ్ఞచే లోకములకు సర్వాగమములు
నీశత వహించె నిఁక నిన్ని యెంచనేల?"

(నార. 432. పు. 172. ప.)

ఈ సందర్భాలలో ఈశ్వరుడంటే మహేశ్వరు డనికాక మహావిష్ణువని మాత్రమే అర్థం చెప్పుకోవాలి.

నారదీయపురాణంలో వైకుంఠలోకం ఆవరణపంచకాలను గురించి వేదప్రామాణికత్వంతో యీ క్రిందివిధంగా వర్ణింపబడింది. "ప్రాగవాచిని శ్రీలోకంబును బశ్చిమంబున శ్రీవైకుంఠంబునకు దక్షిణంబున నిత్యానందంబునిధియు సద్భక్తవరదుండునగు సంకర్షణవిభుం డుండు, ఆ సంకర్షణలోకంబునకుఁ బశ్చిమంబున నిర్మలానందనీరధి నిత్యంబునగు సరస్వతిలోకంబులఁ దగు ప్రత్యగవాచిని సరస్వతిలోకంబున కుత్తరంబునఁ బ్రద్యుమ్నలోకంబు చెలంగు. ప్రతీచీనయు తార్కేందుప్రభ దీపించి నిర్మలశర్మదంబై ప్రద్యుమ్నపదంబుదగ్గర రవిదిక్కున నిత్యాప్సరో౽లంకృతంబై రతిలోకంబు విరాజిల్లు తత్ప్రాచీన అనిరుద్ధలోకంబు రాణించు నుదీచిం బ్రకాశించి యానందవారధియగు నా యనిరుద్ధలోకంబునకుఁ బ్రాచియగు విదిక్కున సద్గుణసాగరంబగు శాంతిలోకంబు విజృంభించు. ఇవి చతుర్వ్యూహంబులు నాలుగు శ్రీకళలు, నాలుగును బ్రదక్షిణక్రమంబునఁ బ్రాచ్యాద్యష్టదిక్కులం బ్రకాశించు నీ వ్యూహాష్టకంబు ప్రథమావరణంబున నుండు. "మధ్యే మధ్యేత్వ సంఖ్యేయా స్తత్త ద్వ్యూహ" మ్మనిన శ్రుతివలన ననేకవ్యూహంబులు గలవు. ద్వితీయావరణంబునం బ్రాచ్యాదిదిక్కుల వరాహ జామదగ్న్య శ్రీనరసింహ రఘువల్లభ శ్రీధర వామన హయగ్రీవ వాసుదేవలోకంబులు గలవు. తదధిపతులు విభవేశ్వరులు నిత్యులు. వీరు వ్యూహాష్టవిశిష్ట శ్రీవైకుంఠేశ్వరప్రీతిసాధనంబైన బ్రహ్మవిద్య నర్వాచీనప్రాకృతభూముల నవతరించి ప్రకాశింపఁజేయుదు రీమూర్తులం గొల్చిన నపవర్గంబు లభించు. తృతీయావరణంబున నెనిమిదిదిక్కుల పాంచజన్య ముసల చక్ర ఖడ్గ గదా శార్జ్గాది వైజయంతంబులు నిలుచు. నిత్యానవధికనిరతిశయానందంబగు భగవత్సేవ గావించు. చతుర్థావరణంబును గుముద, కుముదాక్ష పుండరీక వామన శంఖర్ణ సర్పనేత్ర సుముఖ సుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానల దండధర నిరృతి యాదసాంపతి గంధవాహ ధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు" (నార. 358, 359. పు. 171. వ.) దీనినిబట్టి విష్ణుమూర్తి వహించిన వివిధావతారాది లోకాలు సైతం, విభిన్నాలుగా వున్నట్లు స్పష్టమవడమేకాక, ప్రాగవాచిలో శ్రీలోకం, పశ్చిమంలో శ్రీవైకుంఠం, అంటే మహావిష్ణుస్థానం వుండగా, పంచమావరణలో ఇంద్రానలాదులస్థానం వున్నట్లు శ్రుతిప్రామాణికత్వంతో ద్యోతకమవుతున్నది. ఇదేవిధంగా అపూర్వమైన మహావిష్ణుశక్తి గురించి, వేదమంత్రప్రామాణికత్వంతో నరసింహకవి యీ క్రిందివిధంగా వర్ణించాడు. "శ్రుతియు విష్ణునకు "అపాణి పాదోజ వనోగ్రహితా పశ్యంత్యచక్షుః నశ్రుణోనకం నః సవేత్య వేద్యం నచనశ్య వేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్ నకస్యకార్యం కరణంచ విద్యతే సతత్స మశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్యశక్తే ర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ" యనిన నది హస్తంబులులేక పట్టును. పాదంబులులేక పఱువెత్తును. చక్షువులులేక చూచును. కర్ణంబులులేక వినును. అవేద్యం బైనయది యెఱుంగును. త న్నొకం డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుం డని యెంతురు. అతనికిఁ గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతని శక్తి వివిధంబైనయదియై స్వాభావికంబులు జ్ఞానబలక్రియలు." (నార. 364. పు. 189. వ.) మహావిష్ణుమాహాత్మ్యం గురించి యెంత వర్ణించినా వొక్కమానవభాషలలోనేకాదు, దేవ భాషలోసైతం సమర్హమైన, సంపూర్ణమైన పదజాలం లేదనే చెప్పవచ్చును. విష్ణువాక్యాలుగానే నరసింహకవి వర్ణించిన విష్ణుశక్తిని కొంతలో కొంతైనా ప్రతిబింబించగల యీ క్రిందిపద్యం చూడండి.

"విశ్వసృష్టిస్థితిలయాది వివిధకర్మ
ములకు స్వాతంత్ర్యమగు నెట్ల మొదల శేషి
నైనా నా కిట్ల శేషవృత్త్యంతరముల
నాత్మలకునైన స్వాతంత్ర్య మమరియుండు.

(నార. 411. పు. 78. ప.)

ఈ అనంత విశ్వసృష్టిస్థితిలయాలలో శ్రీమహావిష్ణువు తానొక మాయానాటకసూత్రధారినని తనకై తాను నరసింహకవి కవితారూపంలో యీ క్రిందివిధంగా వెల్లడించాడు.

"ప్రకటంబగు మాయానా
టకసూత్రము నడప నతిదృఢస్థితి గల నే
నొకసూత్రధారుఁడను హృ
ద్వికలత యిఁక నేల విడువుఁడు మీరల్.

(నార. 420. పు. 117. ప.)

ఇటువంటి మాయానాటకసూత్రధారియైన మహావిష్ణుమహిమను యెంత కొనియాడినా తనివితీరదు. ఎంతగా యెన్నెన్నివిధాలుగా యెన్నెన్నిరూపాలలో అర్చించినా యెన్నిజీవితాలైనా చాలవు. ఎన్నెన్నిజన్మలైనా చాలవు. అయితే విష్ణ్వర్చనలో 21 సంఖ్యకు ఒకానొకవిధమైన వైశిష్ట్యం, ప్రత్యేకత వున్నట్లు కనిపిస్తున్నది.

విష్ణ్వర్చనలో 21 సంఖ్యావైశిష్ట్యం

నారదుఁడు విష్ణుభక్తిప్రాశస్త్యం గురించి, మునులకు వివరిస్తూ "విష్ణుభక్తాంఘ్రిరేణువులచే నణువేని పర్వతంబగు తదవమానంబునం బర్వతంబేని యణు వగుం గావునఁ గొన్ని దినంబులు దత్పలాశతీరంబుననుండి తీర్థాంతరంబుల నిరువదియొక్కదినంబు నిలిచి పాపంబులం బాసి కల్యాణతీరంబున కేఁగి తపోవిద్యాశీలపయోవిశేషంబులం బెద్దయగు రోమశమహామునిం గాంచి పాదంబులం బడి" (నార. 170. పు. 117. వ.) అని వివిధతీర్థాలలో 21 రోజులు నిలిచి పాపక్షాళనం చేసుకొన్నట్లు వక్కాణించాడు.

ఈ యేకవింశతి సంఖ్యకున్న వైశిష్ట్యాన్ని గురించి సంగ్రహంగా యిక్కడ ఉటంకిస్తున్నాను. సంగీతశాస్త్రంలో 21 మూర్ఛన లున్నాయి. ఉత్తరమంద్రరంజని, ఉత్తరాయత, రుద్ధపడ్జ, మత్సరికృతు, అశ్వక్రాంత, హిరుగ్గత, యివి యేడూ షడ్జగ్రామాంతృత మూర్ఛనలు, ముఖ, ఆలాప, చిత్ర, చిత్రవతీ, సుముఖి, విశాలా, నంద, యివి యేడూ గాంధారగ్రామాంతర్గతాలు. నవ్వీరి, హరిణాశ్వ, కలోపగత, శుద్ధమధ్య, మార్గ, కౌరపి, హృశ్య, అని యేడు మధ్యగ్రామాంతర్గతమూర్ఛన లున్నాయి. వీటిల్లో గాంధారగ్రామాంతర్గతమూర్ఛనలు నారదుడు స్వర్గంలోనివారి కుపదేశించినట్లు ప్రసిద్ది. మనశాస్త్రాల్లో వీటికి వ్యవహృతి లేదు. వీటిని గురించి సంగీతశాస్త్రజ్ఞులకు మాత్రమే కాదు, సంగీతశాస్త్రకారులకు సైతం తెలియదని చెప్పవచ్చును.

కాలంలో మహాదోషాలుగా పరిగణింపబడిన యేకవింశ న్ముహూర్తదోషాలున్నాయి. అవి పంచాంగశుద్ధి, సూర్యసంక్రాంతి, కర్తరి, షష్ఠాష్టరి, (ఫకచంపు దోషాలు) ఉదయాంతశుద్ధి, దుర్ముహూర్తదోషం, గండదోషం, కుజాష్టమదోషం, భృగుషట్కదోషం, లగ్నాష్టదోషం, చంద్రసగ్రహదోషం, గ్రహణోత్పాతదోషం, క్రూరవిరుద్ధం, విషనాడీఘటికదోషం, క్రూరసంయతం,కుపవంశ, వాగజనితదుర్ముహూర్తం, ఖర్జూరికసమాంఘ్రి, అకాలగద్యుతం, మహాపాతం, వైధృతిదోషం. యీ యిరవైయొకటి ముహూర్తగతాలైన దోషాలుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

వాక్యగతాలైన కావ్యాదోషాలనుసైతం 21 సంఖ్యకు పరిమితంచేసి లక్షణకర్తలు పేర్కొన్నారు. అవి అక్రమం, విసంధి, ప్రక్రమభంగం, పునరుక్తి, అపూర్వం, వాద్యసంకీర్ణం, వ్యాకీర్ణం, అధికపదదోషం, వాచ్యవివర్జితం, అరీతి, న్యూనోపమ, అధికోపమ, సమాప్తపునారాప్తం, ఆస్థానసమానదోషం, ఛందోభంగం, యతిభంగం, పతప్రకర్షం, భిన్నలింగం, భిన్నవచనం, అక్రియ, (అశరీరదోషం), సంబంధ వివర్జితదోషంగా లక్షణకారులు పేర్కొన్నారు.

విరాగమోక్తాలైన దీక్షలుసైతం 21 సంఖ్యకు పరిమితాలుగా తత్వవేత్తలు పేర్కొన్నారు. ఇవన్నీ శాంభవనిర్మితాలని సంప్రదాయజ్ఞు లంటారు. వీటిని శివదీక్షలనిసైతం పేర్కొంటారు. ఈ 21 మహాదీక్షలు యివి. ఆజ్ఞ, ఉపమ, కలాభిషేచన, స్వస్తికారోహణ, భూతిపట్టా, ఆయత్త, స్వాయత్త, యీ యేడు దీక్షలు క్రియాదీక్షాంతర్గతాలు. ఏకాగ్ర, దృఢవ్రత, పంచేంద్రియార్పణ, అహింస, లింగనిజ, మనోలయ, సద్యోముక్తి, దీక్షలు యేడు = మనుదీక్షాంతర్గతాలు. సమయ, నిస్సంసార, నిర్వాణ, తత్త్వ, ఆధ్యాత్మ, అనుగ్రహ, సత్వశుద్ధి, నామకాలైన యీ యేడుదీక్షలు వేధాదీక్షాంతర్గతాలు.

మహాభారతోక్తి ననుసరించి ప్రజాపతులుసైతం 21 సంఖ్యకే పరిమితమై కనిపిస్తున్నారు. బ్రహ్మ, స్థాణు, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, పరమేష్ఠి, సూర్యుడు, సోముడు, కర్దముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు.

గణపతి లీలావిశేషాలుగా ఏకవింశల్లీల లున్నట్లు గణపతిపురాణం పేర్కొంటున్నది. వీటన్నిటికి మూలంగా శ్రీమహావిష్ణువు ఏకవింశతి అవతారాలను తాల్చి తన మాయావిలసనాన్ని విరాజిల్లచేయడమేనని కనిపిస్తున్నది. మామూలుగా మనం దశావతారాలనే విష్ణ్వవతారాలుగా భావిస్తాంకాని శతాధికంగా అవతారా లున్నట్లు వేదప్రమాణంగానే వున్నట్లు గతంలో పేర్కొనడం జరిగింది. అయితే విశిష్టదశావతారాలకు భిన్నంగా, ఆ దశావతారాలతోసహా, మరికొన్ని అవతారాలను కలిపి మహావిష్ణువు అవతారాలు ఏకవింశతిసంఖ్యకు పరిమితాలైనట్లు వైష్ణవీయగ్రంథాలలో కనిపిస్తున్నది. విధాత, యజ్ఞవరాహ, నారద, నరనారాయణ, కపిలసిద్ధ, దత్తాత్రేయ, యజ్ఞ, ఉరుక్రమ, (ఋషభ), పృధుచక్రవర్తి, మత్స్య, కూర్మ, ధన్వంతరీ, మోహినీ, నృసింహ, వామన, భార్గవ, (పరశురామ), వ్యాస, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, బుద్ధ, లేదా కల్కి అవతారాలుగా యీ 21 ని పేర్కొనడం జరుగుతున్నది. బుద్ధ, కల్కి, అవతారాలకు మారుగా కుమారస్వామి అవతారాన్ని సైతం వొక అవతారంగా పేర్కొన్న గ్రంథాలు లేకపోలేదు. కేవలం విష్ణ్వవతారాలేకాక అటు గణపతిలీలలూ, చివరికి శివదీక్షలుసైతం 21 సంఖ్యకు పరిమితమవడం చూస్తే మొత్తంమీద శ్రీమహావిష్ణువు తాల్చిన 21 అవతారాల వైశిష్ట్యం ప్రసిద్దిలోకి వచ్చిన రోజుల్లో కేవలం విష్ణుపరంగానేకాక, అటు శివపరంగాసైతం వేదోక్తమైన హరిహరాభేదం లక్ష్యంగా యీ 21 సంఖ్యకు పరిమితంచేసి అటు విష్ణ్వర్చనలను యిటు శివదీక్షలను ప్రాచీను లేర్పరచినట్లు కనిపిస్తున్నది. ఈ దృష్ట్యానే అటు విష్ణ్వర్చనలోనూ, యిటు శివార్చనలోనూ దీపారాధన చేయడంలో విడివిడిగా 21 వత్తులతో దీపాలుగల కుందెను పెట్టి వెలిగించి యేకవింశద్దీపజ్యోతులతో ఆరాధన చేసేసంప్రదాయం ఊభయమతాల్లోనూ ఒకనొకవైశిష్ట్యంతో అత్యంతప్రాచీనకాలంనుంచీ నేటివరకూ కూడా ఆచరణలోవున్నది.

వర్ణనలు - ప్రత్యేకత

నరసింహకవి నారదీయపురాణంలో కొన్నికొన్నిసందర్భాలలో ఒకానొకవైశిష్ట్యంకల వర్ణనావిశేషాలను ప్రదర్శించాడు. తులసీహరివాసరాది మహత్వవర్ణనలోనూ ధర్మకేతుడనే రాజు భక్తితో చేసే నారయణార్చనావిధానం గురించి చెపుతూ భగవద్దర్శనం యేవిధంగా చేయాలో పేర్కొంటూనూ, తులసీమాహాత్మ్యం గురించి చక్కగా వర్ణించాడు. తులసీపద ఉచ్చారణతోనే విష్ణుపాదార్చనాసత్ఫలితాన్ని పొందుతాడని పేర్కొంటూ "దర్శన శ్రవణ కీర్తన పరిస్పర్శన స్మరణంబు లొనరించు జనులనెల్లఁ దులసీవనము పవిత్రులఁ జేయు వెనుకటి పదితరంబులు మీఁది పదితరములు తులసీదళంబు లెందు వసించు" (నార. 159. పు. 57. ప.) అని తులసీశక్తిని మహత్తరంగా వర్ణించాడు. ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రాలప్రకారం చూస్తే తులసి కృష్ణతులసి కాని, లక్ష్మీతులసి కాని యేదైనా అష్టాదశకుష్ఠురోగాలను నిర్మూలించడమేకాక, హృదయాన్ని బలవత్తరంగా రూపొందించి భూతాది వివిధబాధలను సైతం తొలగింపచేస్తుందని తెలుస్తున్నది. బ్రహ్మవైవర్తపురాణాన్నిబట్టి చూస్తే విష్ణుపూజలో ప్రత్యేకత వహించిన తులసికి మూలభూతమైన చరిత్ర యీ క్రిందివిధంగా తెలుస్తున్నది. లక్ష్మ్యంశతో మాధవీధర్మధ్వజ దంపతులకు తులసి అనే పేరుగల కూతురు పుట్టింది. ఈమె చిన్నతనంలోనే బదరీవనంలో ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం వేడుకొనవలసిందని అంటే, విష్ణుమూర్తి తనకు భర్త అయ్యేట్లుగా వర మిమ్మని కోరుతుంది. బ్రహ్మ ఆ వరం యిచ్చి "నీవు విష్ణుశాపంవల్ల వృక్షరూపం పొంది, అతిపవిత్రతతోపాటు వాస్తవంగానే విష్ణువును పొందగలవని చెపుతాడు. తులసి విరహవేదనతో వనంలో సంచరిస్తూ వుండగా యీమెను శంఖచూడుడనే రాక్షసుడు చూచి మోహించి దరి చేరి "నీ వెవ్వరవు? ఇక్క డెందుకు తిరుగుతున్నావు?" అని సంభాషణ ప్రారంభిస్తాడు. కొద్దిసేపట్లోనే వారిరువురి మనోభావాలు వొకరివొకరు తెలుసుకుంటారు. ఇంతలో నారదుడు వచ్చి "యీ తులసికి శంఖచూడుడే అర్హుడు. యీ శంఖచూడునకు తులసియే తగును. మీ రిద్దరూ తప్పక వివాహం చేసుకోండి" అని చెపుతాడు. అనంతరం వారిద్దరూ గాంధర్వవివాహం చేసుకొంటారు. శంఖచూడు డది మొదలుకొని దేవతలతో యుద్ధం చేయడం మొదలుపెడతాడు. అనేకమంది దేవత లతనిచేతిలో ఓడిపోతారు. చివరికి కాళికాదేవి కూడా వోడిపోతుంది. దేవతలప్రార్థనమీద కుమారస్వామి రంగంలోకి వచ్చి, మూర్ఛపోతాడు. చివరికి శివుడు స్వయంగా శంఖచూడునిపై దండెత్తి అతణ్ని సంహరిస్తాడు. అనంతరం శివుడు శంఖచూడుని కవచం తీసుకొని, అతని రూపంతోపాటు కవచాన్నికూడా ధరించి తులసి యింటికి వెళ్తాడు. తులసి తనభర్త యుద్ధంలో విజయం సంపాదించి వచ్చాడని తలంటిస్నానం చేయించి, భోజనం పెట్టి పర్యంకంమీదకు చేరుతుంది. వా రనేకవిధాలుగా రతిక్రీడలతో మునిగితేల్తారు. మాయారూపంలో వున్న శంఖచూడుణ్ని నిజమైన శంఖచూడుడని భావించి, సంభాషించడం మొదలుపెట్టి, కొద్దిసేపట్లోనే తాను వంచింపబడినట్లు తులసి గ్రహిస్తుంది. గ్రహించినవెంటనే గభుక్కున లేచి, దూరంగా నిలబడి, వికలమనస్కతతో చూస్తూవుంటుంది. అప్పుడు శివుడు లేచి, ఒకవేళ తులసి శపిస్తుందేమోనని సందేహించి తాను శివుడనని, తనను వివాహం కాగోరి నీవు తపస్సు చేయడంవల్ల యిది జరిగిందనీ, శంఖచూడుడు నిన్ను వివాహం చేసుకోవాలని తపస్సు చేయడంవల్ల అతనితో వివాహం జరిగిందనీ వివరిస్తాడు. అప్పుడు తులసి తానుకోరిన విష్ణువే శివునిరూపంలో వచ్చాడని గ్రహించి సంతోషపడి ఆమె ఆ శరీరాన్ని విడిచి వృక్షరూపం ధరించింది. శివపురాణాన్ని బట్టి చూస్తే తులసిపుట్టుక మరొకవిధంగా తెలుస్తున్నది. కాలనేమికి 'వృంద' అనే పుత్రిక పుట్టింది. వృంద భర్త జలంధరుడు. జలంధరుఁ డొకసారి పార్వతివద్దకు శివునిరూపంలో వెళ్ళి, ఆమెను వంచించుదా మనుకున్నాడు. ఈవిషయం గ్రహించిన పార్వతి జలంధరుని భార్యఅయిన వృంద పాతివ్రత్యాన్ని భంగపరచవలసిందిగా విష్ణువును కోరుతుంది. జలంధర మహేశ్వరులకు యుద్ధం సంభవించింది. తనభర్త మహిషాన్నెక్కి దక్షిణదిశవైపు వెళ్ళుతున్నట్లూ, అతనినగరం తగలబడుతున్నట్లూ వృందకు స్వప్నాలు వచ్చాయి. ఇవన్నీ అపశకునాలని ఆమె భావించి వ్యాకులమైన మనస్సుతో యేమీ తోచక ఉద్యానవనానికి వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు మతిస్థిమితంలేక, అడవులలోకి వెళ్లింది. ఒకచోట చెట్టుక్రింద మహావిష్ణువు వృద్ధముని రూపంలో కూర్చొనివున్నాడు. అదే చెట్టుమీద రెండుకోతులు కూడా కూర్చొని వున్నాయి. ఈ వృద్ధమునివద్దకు వృంద వెళ్లి "ఓ మునీశ్వరా! మీవంటివారికి తెలియనివి లేవు. నాభర్త క్షేమంగా వున్నాడా? లేడా! చెప్పవలసిం"దని వేడుకుంటుంది. ఆ ముని "నీ భర్త శివునివల్ల చచ్చిపోయాడని" చెపుతాడు. వెంటనే ఆమె మూర్ఛపోయి కొంతసేపటికి తేరుకొని "అయ్యా! నీమహత్వం సామాన్య మయినదికాదు. నా భర్త నెట్లాగైనా బ్రతికించండి" అని అతిదీనంగా వేడుకుంటుంది. అప్పు డతడు సరే అని, ఆమె నక్కడే వుండవలసిందని చెప్పి, సమీపంలో వున్న చెరువులో ఆ వృద్ధముని మునిగి, తానే జలంధరుని రూపం తాల్చి, వృందవద్దకు వస్తాడు. అతడు తన భర్త అని నమ్మి వృంద కౌగలించుకుంటుంది. మాయాజలంధరుడు వృందను ముద్దాడి, రతికేళిలో తేలిస్తాడు. చివరి కామె వంచింపబడినట్లు గ్రహించి శరీరత్యాగం చేయాలనే నిర్ణయానికి వచ్చి, చితి పేర్చుకొని తాను వంచింపబడడంవల్ల కలిగిన దుఃఖాన్నీ, కోపాన్నీ ఆపుకోలేక ఆ మాయాజలంధరుణ్ని "నీవుకూడా నీభార్యావియోగదుఃఖాన్ని పొంది వానరుల సహాయంతో నీ భార్యను తిరిగి పొందుతావ"ని శపించి వృంద చితిలో దూకి కాలిపోతుంది. ఆ శాపవాక్కులు విని విష్ణువు నివ్వెరపోయి నిలిచి వుండగా దేవతలంతా వచ్చి విష్ణువును యథాస్థితికి తెచ్చి, వృంద శరీరభస్మంమీద కొన్ని గింజలు చల్లారు. అవి తులసి, ఉసిరి, మాలతి, మొక్కలుగా మొలిచాయి. అప్పటినుండి తులసి విష్ణ్వర్చనలో ముఖ్యస్థానాన్న్ని పొందడమేకాక ప్రత్యేకించి విష్ణుమంత్రజపంలో తులసిపూసలమాలకు ఒకానొక విశిష్టప్రతిపత్తి లభించింది. ఈ కథనుబట్టి చూస్తే రామావతారానికి మూలం తులసిగా కనిపిస్తుంది కాని గతంలో నారదునిగురించి తెలుసుకున్న విశేషాలలో రామావతారానికే కాక, అటు లక్ష్మికూడా రాక్షసగర్భంలో పుట్టి రాక్షసులచేత బాధింపబడుతుందని నారదపర్వతులవల్ల శాపాలు కారణంగా సీతారాముల గాథ జరిగినట్లు గుర్తించాము. ఏది యేమైనా ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్రాల ప్రకారమే కాకుండా ఆధునిక వైద్యశాస్త్రాల దృష్ట్యాకూడా, తులసి కొకవైశిష్ట్యం వున్నది. తులసిలో వున్న మహత్తరమైనశక్తి హృచ్ఛక్తిని పెంపొందింపచేయడం. మంత్రసిద్ధులకై చేసే మామూలుజపంలో కాని, ప్రత్యేకించి మానసికజపంలో కాని తులసి హృచ్ఛక్తిని పెంపొందించడంద్వారా మానవులలో మహత్తరమైనశక్తిని ఉద్భవింపచేయగలదు. అందువల్లనే తులసీమాలధారణకు వైశిష్ట్యం యేర్పడింది. శ్రీకృష్ణుడు బృందావనవిహారిగా వర్ణింపబడడంలోకూడా తులసికున్న హృచ్ఛక్తిమత్తత్వం సువ్యక్తమవుతుంది.

ఏకాదశీమాహాత్మ్యం గురించి, వైశిష్ట్యంగురించి నారదీయపురాణంలో రుక్మాంగదచరిత్రలో విపులంగా వర్ణించబడింది. తులసీమాహాత్మ్యం వర్ణనం తరువాత ఏకాదశీవ్రతప్రాశస్త్యంగురించి యీ క్రిందివిధంగా శ్రుతి ప్రమాణంగా పేర్కొనబడింది.

"ఏకాదశి వంటి వ్రతం
బేకలుషాత్ముండు సేయఁ డిల నెన్నిక దా
నా కలుషాత్ముని సుకృతం
బా కడ భస్మాహుతి యగు ననియెన్ శ్రుతియున్..

(నార. 160. పు. 61. ప.)

ఖగోళశాస్త్రరీత్యా కూడా కీర్తిశేషులు, మిత్రులు శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావుగారు "నక్షత్రములు" అన్నగ్రంథంలో వివరించిన విధంగా మహావిష్ణుపరంగా ప్రతి ఏకాదశికి ప్రత్యేకించి ప్రతిమాసంలోనూ ప్రతి శుక్లపక్ష ఏకాదశికి విశేషమైనస్థానం వున్నది. ఆషాడ శుక్ల ఏకాదశినాడు సూర్యాస్తమయం కాగానే మహావిష్ణు నక్షత్రాలు ఉత్తరాకాశంలో శయనించినట్లుగా చక్కగా కనిపిస్తాయి. చాతుర్మాస్యవ్రతం యీ యేకాదశినుంచే ప్రారంభమవుతుంది. విష్ణుశయనమాసాలలో నాల్గింటిలోనూ యిది మొట్టమొదటి యేకాదశి కాబట్టి దీనిని తొలి యేకాదశి అంటారు. ఇదే శయన ఏకాదశి కూడా. తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాటికి విష్ణునక్షత్రాలు పశ్చిమాన అంతర్హితమవుతూ వుంటాయి. అందువల్ల భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పేర్కొంటారు. శ్రావణ భాద్రపదమాసాలలో, భాద్రపద శుక్ల ఏకాదశినాటికి ఉత్తరదిక్కునుండి పశ్చిమదిక్కుకు వొత్తిగిలినట్లు, ప్రక్క మారినట్లు విష్ణునక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి యిది సార్థకంగా పరివర్తన ఏకాదశి అనబడింది. తరువాత సరిగ్గా రెండునెలలకాలం పరివర్తనస్థితిలోనుండి దిశమార్చి కార్తీక శుక్ల ఏకాదశినాడు తూర్పుదిక్కున సూర్యోదయంకంటే పూర్వం విష్ణునక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి కార్తీక శుద్ద ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, బోధన ఏకాదశి అని వ్యవహరించడం జరిగింది. కార్తీక శుక్ల ఏకాదశినాడు ఆ మహావిష్ణునక్షత్రాలు నిద్రనుంచి లేచినట్లుగా కనిపిస్తాయి. ఈ యేకాదశినే ప్రబోధినీమహిమగా (నార. 270. పు.) నరసింహకవి రుక్మాంగదచరిత్రలో వర్ణించాడు. కార్తీక శుక్ల ఏకాదశి తరువాత మార్గశిర శుక్ల ఏకాదశినాడు విష్ణునక్షత్రాలలో ఉపరి అర్థభాగనక్షత్రాలు మాత్రం కనిపిస్తాయి. వాస్తవానికి నరసింహకవి పేర్కొన్నట్లు "కార్తీకసమంబైన మాసంబును, గృతయుగసమంబైన యుగంబును," (నార. 260. పు. 337. వ.) లేవన్నట్లుగా కార్తీకమాసానికున్న ప్రత్యేకత మరే యితరమాసానికీ లేదు. అయితే కృష్ణుడు భగవద్గీతలో "మాసానాం మార్గశీర్షోహమ్" అని పేర్కొనడం అర్జునునికి గీతోపదేశకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణుడు అనూరుడైన రథసారథిగావుండి పేర్కొనడాన్ని దృష్టిలో పెట్టుకొని మార్గశిరమాసానికి వైశిష్ట్యం యివ్వబడిందే కాని కార్తీకంకంటే మార్గశిరం గొప్పదని కాదు. పుష్య శుక్ల ఏకాదశి నాటికి, విష్ణుమూర్తి నక్షత్రాలన్నీ సూర్యోదయానికంటే ముందు తూర్పున ఉదయిస్తాయి. నక్షత్రరూపుడైన పరిపూర్ణమహావిష్ణువును మనం పుష్యశుద్ధ ఏకాదశినాడు తెలతెల్లవారే సమయంలో చూడవచ్చును. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని మన ప్రాచీనులు పేర్కొన్నారు. ఇదేవిధంగా మాఘశుద్ధ ఏకాదశిని భీష్మైకాదశిగా, ఫాల్గుణశుద్ధ ఏకాదశిని కల్యాణ ఏకాదశిగా, చైత్రశుద్ధ ఏకాదశిని (శ్రీరామపరంగా) సైతం కల్యాణ ఏకాదశిగా, మరికొందరు వైశాఖ శుక్లఏకాదశిని (రాధామాధవ పరమైన) కల్యాణ ఏకాదశిగా భావిస్తారు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు త్రివిక్రమైకాదశిగా భావించి మహావిష్ణువును త్రివిక్రమునిగా పూజిస్తారు. (చూడు నక్షత్రములు, 157. పు. నుంచి 164. పు. వరకు).

నరసింహకవి సూర్యోదయహీనమైన దశమిని ఏకాదశీసంకలితమైనప్పటికి కూడా పుణ్యప్రదం కాదని త్రోసిపుచ్చాడు.

"ఆదిత్యోదయహీనత
నా దశమీప్రాంత మున్న హరిదివసముగా
నాదటఁ గైకొని యుండెడు
నా దుర్మదుఫలము నీకు నర్పించు నిఁకన్.

సూర్యహీనంబగు దశమీప్రాంతం బేకాదశీమిశ్రంబు నాశంబు నొందించిన నుపవాసవ్రతదానజాగరణంబులచే నార్జించిన పుణ్యంబు నీకగు." (నార. 316 పు. 229 ప. 230. వ.) అని ఏకాదశీమిశ్రితమైన దశమినాడు చేసిన ఉపవాసాది అర్చనం ఫలితాలన్నీ ఆ పూజలు చేసినవారికి దక్కవని స్పష్టపరిచాడు.

నారదుడు విష్ణుమాహాత్మ్యంగురించి, అర్చనావిశేషాలనుగురించి, విధానాలగురించి వివరంగా పేర్కొంటూ విష్ణుచిత్తుని కథావివరణసందర్భంలో న్యాసవిద్యామహాత్మ్యం గురించి విశేషంగా వర్ణించాడు. అంగన్యాస కరన్యాసల మించి మాత్రమేకాక భూమ్యాదిగోళాల వివిధ విభిన్న ఆకర్షణశక్తులకు సైతం లోబడక వాటి నతిక్రమించి యెక్కడికైనా పయనించగల హృచ్ఛక్తిని సైతం మించినదిగా వర్ణించబడిన యీ న్యాసవైశిష్ట్యం గురించి శక్తిమత్తత్వాన్ని గురించి మాటల్లో యెంత వర్ణించినా దాని శక్తిని పరిపూర్ణంగా పేర్కొనలేము. న్యాసమాహాత్మ్యం గురించి నరసింహకవి అనేకవిధాలుగా వర్ణించినదానిలో యీ క్రింది పద్యాలను రెండింటినీ చూస్తే న్యాసమాహాత్మ్య మెంతటిదో మనకు తేలిగ్గా అవగాహన మవుతుంది.

"ఒనర విద్యలకెల్ల నుత్తమోత్తమము లీ
        వేదవేదాంతముల్ వివిధగతుల
విఖ్యాతమగు న్యాసవిద్య పూజ్యం బని
        చాటి లోకములు ప్రశంససేయ
శరణాగతియును న్యాసము సంవదనము న్యా
        సంబు న్యాసంబు త్యాగంబు ననఁగ
సకలపురాణప్రశస్తంబు న్యాసంబు
        పాంచరాత్రములందుఁ బ్రబలె న్యాస
మఖిలధర్మంబులను న్యాస మభిమతంబు
సర్వనియమంబులందు న్యాసంబు ఘనము
సర్వయత్నంబులందు న్యాసంబు శుభము
న్యాసమునకంటెఁ గలదె యన్యతర మొకటి.

తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను
         తపమునకంటెను దమము యోగ్య
మా దమంబునకంటె నర్హంబు శమము శ
         మంబునకంటె దానంబు ముఖ్య
మా దానమునకంటె నధికంబు ధర్మమా
         ధర్మరహస్యకృత్యమునకంటెఁ
బ్రవ్రజనము మహాభవ్యంబు తత్ప్రవ్ర
         జనమునకంటె శస్తంబు వహ్ని
వహ్ని కంటెను యజ్ఞంబు వరతరంబు
మానసము యజ్ఞమునకంటె మహితతరము
ఘనము న్యాసంబు మానసగరిమకంటెఁ
దద్విశేషంబు లెంచంగఁ దరముగావు.

(నార. 171, 172. పు. 120, 121. ప.)

రుక్మాంగదుడు వేటకు వెళ్ళిన సందర్భంలో నరసింహకవి చేసిన వర్ణన పరమాద్భుతంగా నరసింహకవి శబ్దశక్తికి పదప్రయోగనైపుణ్యానికీ బహుముఖమైన లోకానుభవానికి ప్రతీకగా విరాజిల్లుతున్నది. రుక్మాంగదుడు "హరి కరిగిరి గండక కాసరగవయ తరక్షుఋక్ష శల్యకులంగోత్కర భీకర ఘోరవనాంతరములకు" ఉత్కంఠతో వేటకు వెళ్ళగా అనేకమంది చెంచుదొరలు నేల ఈనినట్లుగా రుక్మాంగదుని సమక్షంలో

పరిపక్వబహువిధఫలశిక్యములతోడ
         క్షౌద్రవీవధసహస్రములతోడఁ
బంచషసారంగబాలోత్కరముతోడఁ
         జంజరకీరడింభములతోడఁ
బరిరటత్సంకుశాబకవితానముతోడఁ
         గస్తూరికామృతగోత్కరముతోడఁ
బల్యంకికాదండబహుదండములతోడ
         భవ్యచామరకదంబములతోడ

(నార. 218-పు. 143-ప.)

మొక్కి వయారపు మొనలుదీర్చి ఒకానొకవిడ్డూరం వలె ఎంతో వింతగా విశిష్టంగా తమ తమ వేటల నేర్పరితనాన్ని ఉగ్గడిస్తూ విన్నవించారని నరసింహ కవి చక్కని పదలాలిత్యంతో సార్థకమైన పదప్రయోగాలలో తన లోకానుభవానికి ప్రతీకలుగా ఈ క్రింది పద్యాలు రచించాడు.

"గావు పట్టెదఁ దొలంగక నిల్చెనేని బె
        బ్బులుల నెన్నిటినైనఁ బూని తెత్తు
బెలుఁగుఁ గూల్చెద నొక్కయలుగున నిపుడునా
        యెలుఁగునఁ గడకడ కేఁగకున్నఁ
దగరుతాఁకుల బోడతలలుగాఁ దాఁకింతుఁ
        గారుపోతులఁ గొమ్ముగములు విఱిచి
యొంటిగాఁ డెదురైన బంట పోకు మటంచు
        ఢాకమై విదిలింతు నీ కటారి
భీకరంబుగఁ దముఁ దామె పెట్టికొనిన
ఓరుచు లేటికిఁ జూడు నా పెంపు సొంపు
పట్ట నేటికి జముదాళిబాకు కిరుసు
మరియ విలునమ్ములున నేఁడు చూడు రాజ."


"పులి యెలుఁగు పంది దుప్పి కార్పోతు మన్ను
జింక యననెంత నేఁడు నాచంక నిఱికి
వేనవేలుగఁ దెత్తు నా వేఁట చూడు
సామిఁ బంటుతనంబును సాహసమును."


"నూటి కొక్కండు నామూఁక పోటు బంటు
సామి! పులుఁగైన వెలుఁగైన నేమి విడువు
కత్తియుఁ గటారి నేఁటికి కదిసి నపుడె
చంకఁ గొట్టి యడంతు నిశ్శంకవృత్తి."

(నార. 218, 219-పు. 144, 145, 146-ప.)

సూతుడు బ్రహ్మజ్ఞానతత్వం బోధించే సందర్భంగా నరసింహకవి ఒకానొక విశిష్టచమత్కృతిగల యీ పద్యాన్ని విరచించాడు.

"ఆత్మవేదులు కర్మ మర్హంబె సేయ
నంద్రు కొందఱుసూరు లయ్యాత్మవేదు
లైనవారికిఁ గర్మమర్హంబె సేయ
నంద్రు కొందఱుసూరు లత్యంతమహిమ."

(నార. 323. పు. 25. ప.)

చక్కని పాండిత్యం, ప్రతిభాసంపద కలిగిన నరసింహకవి చారిత్రకమైన ప్రాచీన, అర్వాచీన విషయజ్ఞానం లేనందువల్ల అనేకాలైన భ్రమప్రమాదాలకులోనై కొన్నివిషయాలు పేర్కొన్నట్లు గతంలో గుర్తించాము. ఇదేవిధంగా నారదీయపురాణ ప్రథమాశ్వాసంలో కృష్ణుడు దావాగ్నిని క్రోలిన తరువాత వర్షాగమాన్ని వర్ణిస్తూ, వివిధనదులు మహాజనపరిపూర్ణాలై పొంగినట్లు, దేశకాలోచితభిన్నంగా యీ క్రిందిపద్యాన్ని విరచించాడు.

"గంగాసరస్వతీతుంగభద్రాయము
          నాకవేరసుతాపినాకినీశ
రావతీసింధుగోదావరిగోమతి
          కృష్ణవేణ్యా గండకీ మలాప
హారిణీ చంద్రభాగాలక చర్మణ్వ
          తీ నర్మదా బాహుదానదీశ
తద్రుపేనా విపాట్తాపి పయోష్ణి ప
          యః ప్రవాహములు మిన్నంది వేగఁ
దద్దయును బొంగుచును విటతాటములగు
తటజకుటజము ల్వీచికాపటలిఁ దేల
దశదిశాచక్రనిమ్నోన్నతస్థలంబు
లేకమైయుండ నిండె సమిద్ధమహిమ."

(నార. 21. పు. 120. ప.)

"గండకీ చంద్రభాగ"వంటి నదులు ద్వాపరయుగంనుంచీ వున్నాయని చెప్పడానికి బొత్తిగా అవకాశాలు లేవు. ఏది యేమైనా నరసింహకవి సందర్భోచితాలైన, సార్థకాలైన శబ్దప్రయోగాలనుచేసి తన కవితాప్రౌఢిమను బహుముఖాలుగా నారదీయపురాణంలో చూపించాడు. ప్రత్యేకించి హరిని స్తంభంలో చూపించవలసిందని హిరణ్యకశిపుడు కత్తితో కొట్టినప్పుడు వెనువెంటనే ఆ స్తంభంనుంచి నృసింహావతారరూపంలో విష్ణువు ఛట్ ఫట్ మని పెఠిల్లున ఆస్తంభం పగిలిపోగా ఆవిర్భవించినసందర్భంగా నరసింహకవి తన బహుముఖశబ్దార్థపటిమావీరభావస్ఫోరకత్వాన్ని యీ క్రిందిపద్యంలో ప్రస్ఫుటంగా మహాద్బుతంగా వెల్లడించాడు.

"పటపటత్కటు సముద్భట పటుధ్వని విశీ
         ర్యద్ఘన స్థూణాసభాంతరంబు
చట చటన్నట దుగ్ర చటులరంగస్ఫులిం
         గాచ్ఛాద్య మాన గృహాంగణంబు

తట తట స్ఫురదురోదైతేయశలభసం
         ఘాతప్రతాపనిర్భరతరంబు
కటకట దంష్ట్రాగ్రఘట్టితకహకహో
         త్తర్జన గర్జాతి దుర్జయంబు
భూరిభూషణ తీవ్రదంభోళి ఘోర
సారవారు సటాచ్ఛటా సంకులంబు
సంభ్రమాతభ్రధరణితలాభ్రతలము
వీరనరసింహరూప మావిర్భవించె."

(నార. 505. పు. 258. ప.)

విశేషాలు

నరసింహకవి గోపికావిహారవర్ణనలో "అధరామృతము జిహ్వనానుకొనిన" (నార. 29. పు. 159. ప.) అని అధరామృతపురుచి గురించి పేర్కొన్నాడు. వాస్తవానికి సంస్కృతాంధ్రాది వాఙ్మయాలలో అధరామృతాస్వాదనం గురించి వర్ణించని ప్రాచీనకావ్యాలు లేవు. నిజానికి ప్రతివ్యక్తి అధరోష్ఠంలోనూ అమృతం వుండదు. ప్రేమికులందరూ పరస్పరం యువతీయువకుల అధరోష్ఠాన్ని చీకవచ్చును. కాని వారికి తద్రూపంగా లభించేది ఉమ్ము, లేదా చొంగ, లేదా లాలాజలం వంటిదే కాని అమృతం మాత్రం కాదు. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వాస్తవానికి ఊర్వశీ, రంభా, మేనకా ప్రభృతులు అమృతసిద్ధి పొంది మహాతపస్సంపన్నులైన మహర్షుల తపోభంగం కలిగించడానికో, లేదా వారిని సహజంగానే ప్రేమించి వారి సంభోగసుఖానుభూతిని అనుభవించడానికో వారి అధరామృతాన్ని ఆస్వాదించనీయవలసిందిగా అభ్యర్ధించేవారు. అమృతసిద్ది పొందిన వ్యక్తి లాలాజలం అత్యంతమధురంగా వుంటుంది. అందువల్ల అటువంటివారి అధరంనుంచి లభించే లాలాజలాన్ని అమృతంగా భావించేవారు. అమృతసిద్ది పొందడంవల్ల అమృతమయమై మధురాతిమధురంగా వుండే లాలాజలం అమృతం కాక మరేమవుతుంది? అయితే అమృతసిద్ధి పొందిన మహర్షివంటి వారిపట్లనే అధరామృతశబ్దాన్ని అతిప్రాచీనకాలంలో వ్యవహరించేవారు. అయితే క్రమంగా, అమృతసిద్ధి పొందనటువంటి అతిసామాన్యమానవులకు సైతం శృంగారవర్ణనలలో యీ అధరామృతశబ్దం నిరర్థకంగా ప్రయోగించడం జరిగింది.

విగ్రహారాధన అత్యంత ఆధునికకాలంలో ప్రారంభించబడిందని చాలామంది పరిశోధకులు భావించారు. వాస్తవానికి విగ్రహారాధన యెంత ప్రాచీన తరమైనదో చెప్పలేము. వేదా లెప్పటివో విగ్రహారాధన అప్పటిదేనని ఆమోదించవలసివుంటుంది. విష్ణువుకు సనకాదులు విన్నపం చేసుకున్న్న సందర్భంలో "నీకు నుపనిషద్వేద్యంబైన హేమదివ్యమంగళవిగ్రహం బుపాత్త్యర్థంబుగా నారోపింతురు." (నార. 383. పు. 261. వ.) అని విష్ణుమూర్తి హేమదివ్యమంగళవిగ్రహరూపంలో ఆరాధ్యదైవమని ఉపనిషత్తులు పేర్కొన్నట్లు నరసింహకవి వక్కాణించాడు. అసలు శ్రీమహావిష్ణువు బ్రహ్మను సృష్టించిన తరువాత బ్రహ్మకు ఒకటికి రెండుసార్లు స్వయంగా తనవిగ్రహాన్ని అర్చామూర్తిగా శ్రీ మహావిష్ణువే అనుగ్రహించి యిచ్చినట్లు వర్ణించడం జరిగింది.

"ఏల విషాదము నొందెదు
బాలక! యిది యిమ్ము పరమభాగవత సభా
మౌళిమణికి నీ కిత్తు ద
యాళుత నొకదివ్య విగ్రహము గొను మింకన్.

అనుచుఁ గమలాగళాభరణాంకశాలి
యైన నిజకరమున నిచ్చె నాత్మదివ్య
విగ్రహముఁ బద్మజునకు నావిగ్రహంబు
చక్కఁదనమునకై యాత్మఁ జొక్కె సలుప."

1

(నార. 106. పు. 67, 68. ప.)

కాగా విగ్రహారాధన యెంత ప్రాచీనతరమో యెవ్వరూ చెప్పలేరు. శిల్పశాస్త్రంప్రకారం చూచినా విష్ణ్వాదిమూర్తులకు రూపకల్పన మొట్టమొదట యెప్పుడు జరిగిందో సాధికారికంగా యెవ్వరూ చెప్పలేరు. వాస్తవానికి శిల్పాలను చెక్కేప్రతివారూ చాలాకాలంగా శిల్పులుగా పరిగణింపబడుతున్నారు. కాని వారంతా శిల్పులుగా పరిగణనకురారు. తపశ్శక్తితో, దివ్యదృష్టితో విష్ణ్వాదిమూర్తులను చూచి తాము చూచిన రూపానికి చిత్రరూపంలోనో, భాషాయుక్తమైన రచనావర్ణనారూపంలోనో, ఆయామూర్తులకు మొట్టమొదట ప్రతిరూపకల్పన చేసినవారే శిల్పులు. అయితే దివ్యచక్షువుతో అసలుమూర్తిని కాంచకుండా యెవ్వరో మహర్షులు చిత్రరూపంలోనో శ్లోకరూపంలోనో మూర్తిలక్షణం నిర్వచించినదానినిబట్టి, అంటే ఒకశిల్పాన్ని చూచి, మరొకశిల్పరచన చేసినవారు అసలైనశిల్పులు కారు. అటువంటివారిని ప్రాచీనశిల్పశాస్త్రాలలో శిల్పులుగా పేర్కొనలేదు సరికదా "కారుకులు"గా పేర్కొన్నారు. అయితే యిటీవలికాలంలో శిల్పాలు నిర్మించి, శిల్పు లనిపించుకుంటున్నవారంతా అసలైన శిల్పులు కాకుండా కారుకులే నన్నమాట. విష్ణువును బ్రహ్మ సృష్టించి ఆ బ్రహ్మకు శ్రీమహావిష్ణువే వేదవిజ్ఞానభిక్షతోపాటు, అష్టాక్షరమంత్రోపదేశంకూడా చేయగా, ఆ అష్టాక్షరమంత్రావృత్తిప్రభావంతో సమస్తదేవతలనూ, సమస్తప్రపంచాన్ని సృష్టించాడట.

"ఏతన్మంత్రరహస్యము
స్వాతి సృజించెదవు సకలజగదంతరముల్
ఖ్యాతిగ నధికారాంతం
బేతెంచిన నన్ను నాశ్రయించెదు మీఁదన్.

సారతర పరమతంత్ర స
మారబ్ధావృత్తి పూని యబ్జభవుఁడు స
ర్వారంభోన్ముఖుఁడైతా
నారూఢస్థితిఁ బ్రపంచమంత సృజించెన్.

(నార. 98. పు. 23, 24. ప.)

'సీత అయోనిజ' అని అనేకసందర్భాలలో పెక్కుగ్రంథాలలో పేర్కొనబడినా, ఆమె యోనిజ అనడానికి సైతం చిరాక్షేపణీయమైన కథ ప్రసిద్ధమై లేకపోలేదు. అయితే మహేశ్వరుని విషయంలో మాతాపితృరహితుడని అనేకగ్రంథాలు వేనోళ్ల కీర్తించాయి. కాని తద్భిన్నంగా నారదీయపురాణంలో మహేశ్వరుడు బ్రహ్మపుత్రుడని యీ క్రిందివిధంగా పేర్కొనడం జరిగింది.

"అక్షీణశక్తిని విరూ
పాక్షుండన నొక్కపుత్రుఁ డతనికిఁ గల్గెన్
దక్షుఁడు హరిభక్తి రతుం
డక్షయవిజ్ఞానవైభవాధిక్యుండై."

అంత విధాత పురందరాది దివిజస్తుతుండై దేవదేవుండన వెలసిన తనయునకు భవోత్తారకం బుపదేశించి వేదవేదాంతంబులు చదివించిన నతం డైశ్వర్యంబు వహించి సర్వభూతంబులకు నైహికంబులు కృపసేయుచునుండ. (నార. 99. పు. 25. వ. 26. ప.)

మామూలుగా పండితపామరులంతా 'గాయత్రి' అని, 'గాయత్రీమంత్ర మని' అనుకుంటూ వుంటారు. వాస్తవానికి "తత్సవితుర్వరేణియం" ఇత్యాదిగా వున్న మంత్రం చాలామంది గాయత్రీమంత్ర మనుకుంటారు. నిజాని కిది గాయత్రీఛందంలోవున్న సవితృదేవతాత్మకమైన మంత్రమని అనేకమంది పండితులకు కూడా తెలియదని చెప్పడంలో ఆశ్చర్యకరమైన విషయ మేమీలేదు. అసలు గాయత్రీచ్ఛందం వేరు - గాయత్రీదేవతాత్మకాలైన మంత్రాలు వేరు. గాయత్రీమంత్రాలలో విష్ణు గాయత్రి, బ్రహ్మ గాయత్రి, మహేశ్వర గాయత్రి, అని మూడువిధాలైన గాయత్రు లున్నాయి. విష్ణుగాయత్రి గురించి నరసింహకవి "దీనియందు వ్యాప్య వ్యాపకవిశేషావభోధంబు గలుగుం గాన విష్ణు గాయత్రియం దాద్యం బీమంత్రంబు" (నార. 98. పు. 18. వ.) అని పేర్కొన్నాడు.

పుష్పకవిమానం గురించి దాని వైశిష్ట్యం గురించి చాలామంది పండితులకు తెలుసును. అయితే శ్రీహరి దివ్యవిమానానికున్న వైశిష్ట్యం పుష్పకవిమాన వైశిష్ట్యంకంటే మహత్తరమైన వైశిష్ట్యం కలది. బ్రహ్మ శ్రీహరి దివ్యవిమానాన్ని పూజించే సందర్భంలో 40 లక్షల మైళ్ల ప్రమాణంకల ఆ విమానం పంచపురుషమాత్రారూపానికే పరిమితమైనదని, శ్రీహరిసైతం స్వలీలతో తదంతఃపరిమితరూపాన్ని పొంది నిలిచాడని నరసింహకవి వర్ణించాడు. (నార. 109. పు. 85. ప.)

శ్రీహరివలెనే లక్ష్మీమాత సర్వకామవరప్రదాయని అన్న సంగతి అందరికి తెలిసిందే. శ్రీ మహావిష్ణువు ఆయుధాలలో వొకటైన 'సుదర్శనం' శత్రుసంహారంలో తిరుగులేనిదన్న సంగతి కూడా ఆర్షవిజ్ఞానులైన వారందరికీ పూర్తిగా తెలుసును. సుదర్శనప్రయోగానికి వ్యతిరేకంగా యెవరైనా యేదైనా ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం చేసిన వ్యక్తి అస్త్రశస్త్రసన్యాసం చేసి దాసోహం అని అననైనా అనాలి, లేదా సుదర్శనశక్తికి ప్రాణాన్ని బలిగానైనా యివ్వాలి. ఈవిషయం ఆర్షవిజ్ఞానులకూ, మంత్రశాస్త్రవేత్తలకూ సువిదితమైనదే. కాని నరసింహకవి "విమానపశ్చాద్భాగంబునఁ బ్రాకారమధ్యంబున సుదర్శనమును లక్ష్మియు సర్వకామంబుల నిచ్చుచుండు." (నార. 95. పు. 493 వ.) అని పేర్కొని లక్ష్మీమాతతో పాటు సుదర్శనం సైతం సర్వకామాలను ప్రసాదిస్తుందని నూతనవిషయాన్ని తెలియచేశాడు.

గతంలో విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుల సత్వరజస్తమోగుణాల గురించి కొంత చర్చించడం జరిగింది. కాని నరసింహకవి నారదీయపురాణ ప్రథమాశ్వాసంలో అర్జునుడు సుభద్రను తీసుకొని వెడలిన తరువాత మునీశ్వరులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్ష చేసి, వారి గుణాలను తెలుసుకొనవలసిందిగా భృగుమహర్షిని పంపగా ఆ మహర్షి ముగ్గురినీ పరీక్షించి, చివరికి మహావిష్ణువు మాత్రమే శుద్ధసత్వమూర్తి అని మునులకు చెప్పినట్లు పేర్కొన్నాడు (నార. 71, 72, పు. 429 వ 430, 431. ప. 432. వ.) మహావిష్ణువును శుద్ధసత్వమూర్తిగా పేర్కొనడంలో విశేషం లేదు కాని, మునులు భృగుమహర్షి ద్వారా త్రిమూర్తులను పరీక్ష చేయించారనడం విశిష్టమైన విషయం. గతంలో నారదపర్వతులు విష్ణువును శపించిన విషయం గుర్తించాం కాని త్రిమూర్తుల శక్తిస్వభావాలను మునులు పరీక్షించారన్న విషయం మాత్రం యీ సందర్భంలో మనం గుర్తించవలసిన విశేషం.

నరసింహకవి పాషండమతభేదాలను వచించే సందర్భంలో శాండిల్యుడనే మహర్షి పాషండ, జిన మతకారకులను వోడించడం కాదు వారిని సంహరించాడని యీ క్రిందిపద్యంలో పేర్కొన్నాడు.

"రూఢి శాండిల్యుఁను మునీంద్రుండు మున్ను
బాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌన ట్లొనర్చు
శఠులఁ బాషండజినులును సంహరించె."

(నార. 149. పు. 10. ప.)

వెలుగును వెన్నంటి చీకటి వున్నట్లుగా కష్టసుఖాలు కావడికుండ లన్నట్లుగా ఆస్తికత్వానికి భిన్నంగా దాని వెనువెంటనే నాస్తికమతం ఆవిర్భవించడంలో విచిత్రం లేదు. నరసింహకవి పేర్కొన్న సందర్భాన్ని పట్టిచూస్తే, పాషండజినమతాలు మన చరిత్రకారు లూహించినంత ఆధునికమతాలు కావని తేటతెల్లమవుతున్నది.

"అపకారికి నుపకారము నెప మెన్నక సేయువాడు నేర్పరి" అన్నభావం కేవలం సుమతీశతకకర్తనాటిభావమే కాదు. నేర్పరితనం మాట దేము డెరుగును కాని విద్రోహులకు సైతం మేలే చేయాలని వేదదేవగణాలు హార్దికంగా అభిలషించి నట్లు వ్యాఘ్రవానరకిరాతసంవాదంలో నరసింహకవి స్పష్టపరిచాడు. (నార. 149, 150. పు. 12వ, 13. 14. ప)

భస్మాసురుని కథ చాలా సుప్రసిద్ధమైనది. భస్మాసురుడు మహేశ్వరునిగురించి తపస్సు చేయడం, అతడు ప్రత్యక్షమై వరం కోరుకోవలసిందిగా చెప్పడం, నేను యెవనిశిరస్సుమీద చేయి పెడతానో అతడు భస్మం అవ్వాలని అతడు కోరడం, ఈశ్వరుడు సరే అని వరమివ్వడం, అసలు యీవరం ఫలిస్తుందో లేదో చూస్తాను. నీనెత్తిమీదే చేయి పెడతానని భస్మాసురు డీశ్వరునివెంట పడడం, చివరికి శ్రీమహావిష్ణువు మహేశ్వరుణ్ని కాపాడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అటు పామరులకు కాని యిటు పండితులకు కాని, ఆవరం పొందిన రాక్షసునిపేరు భస్మాసురుడనే అందరికీ తెలుసు. అసలుపేరు తెలియదు. ఈభస్మాసురుని అసలుపేరు నరసింహకవి విష్ణుచిత్తునికథలో "వృకాసురుడు"గా తెలియచేశాడు. (నార. 167. పు. 99. వ.)

సంసారవివర్జితుడై సన్యాసిగా జీవించడమన్నది బౌద్ధమతం తరువాత పరివ్యాప్తిలోకి వచ్చినవిషయమే కాని ఆర్షసంప్రదాయసిద్దం కాదు. వాస్తవానికి సప్తఋషులందరికీ భార్య లున్నారు. వివాహితుడు కాని మహర్షి యెంతటివాడైనా తప్పటడుగులువేసిన సందర్భాలు లేకపోలేదు. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా సంసారిగా జీవిస్తూ ఉపవాసరహితుడై వుంటూ కూడా వివిధ ఆధ్యాత్మికశక్తులు పొందవచ్చు నని చెప్పవలసివుంటుంది. సంసారి అయివుండి నిత్యభోక్త అయివుండీ కూడా నియమితాచారం కలవాడై నారాయణనామస్మరణ చేస్తూ నిత్యోపవాసిగా నెగడొందవచ్చునని వశిష్ఠునిచేత నరసింహకవి యీక్రిందివిధంగా చెప్పించాడు.

"నియమంబున స్వభార్యనియతుండనై యుక్త
        కాలంబుననె రతికేలి సలిపి
యుండుట మఱి నాకు యుక్తంబు బ్రహ్మచా
       రిత్వంబు జగము వర్ణించి పొగడ
గాధిపుత్రుఁడు కమలాధిపభక్తిని
      ష్ఠాపరాయణుఁడు ప్రశస్తి గాంచి
జాత్యశ్రయనిమిత్తసత్కర్మములు పూని
      వీతదోషముగ నైవేద్య మొసఁగి
యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ
యనుచు గోవింద యనుచుఁ బరాత్మ యనుచుఁ
బ్రతికబళమును నుడువుచుఁ బరిభుజించె
వాసి నటుగాన నిత్యోపవాసి యయ్యె."

(నార. 181. పు. 165. ప.)

ఉపవాస, నిరుపవాసస్థితుల గురించి ఆగమవాఙ్మయావిష్కరణకు పూర్వకాలంలోనే పెక్కువివాదాలు జరిగినట్లు కనిపిస్తున్నది. తిథిఫలనిర్ణయాదివిషయాలను వర్ణిస్తూ సూతుడు మునులకు వివరించిన సందర్భంలో "అనేకాగమవిరోధంబులు నైన నేమి? బ్రాహ్మణులు వివాదించిన నేమి? ద్వాదశ్యుపవాసంబునుం ద్రయోదశిపారణయుం జేయవలయు" (నార. 193. పు. 20. వ.) అని విస్పష్టంగా ద్వాదశ్యుపవాసాన్ని త్రయోదశిపారాయణను నియతంగా ఒనరించాలని పేర్కొన్నాడు.

మనకు మామూలుగా చాతుర్మాస్యవ్రతం గురించి అందరికీ తెలిసినవిషయమే. అయితే చాతుర్మాస్యవ్రతం వలెనే శ్రావణశుద్ధవిదియ మొదలు నాలుగుమాసాలపాటు అంటే మార్గశిరశుద్ధవిదియవరకూ శూన్యశయనవ్రతాన్ని సంశుద్ధితో విష్ణువు నర్చిస్తారని వాసుదేవుడు రుక్మాంగదునికి అతని పూర్వజన్మవృత్తాంతం తెలిపిన సందర్భంలో వివరించడం జరిగింది. (నార. 223. పు. 167. ప.)

బహుభార్యాత్వం అంత్యంతప్రాచీనకాలంనుంచీ వున్నది. దశరథునికాలంనుంచే కాక అంతకుముందు కృతయుగంనుంచే బహుభార్యాత్వం వున్నదని రుక్మాంగదునిచరిత్ర నిరూపిస్తున్నది. అయితే బహుభార్యాత్వవిషయంలో ప్రథమభార్య వుండగా, రెండవవివాహం చేసుకునేట్లయితే రెండవభార్య కిచ్చే ధనంకంటే (కన్యాశుల్క మన్నమాట) రెట్టింపుధనం ప్రథమభార్యకు యివ్వాలట. తృతీయవివాహం చేసుకుంటే ఆతృతీయభార్య కిచ్చే ధనంకంటే రెట్టింపుధనాన్ని ద్వితీయభార్యకు, ద్వితీయభార్య కిచ్చినధనంకంటే రెట్టింపుధనాన్ని తిరిగి ప్రథమభార్యకూ యిదేవిధంగా యెన్నెన్ని వివాహాలు చేసుకొన్నా క్రమానుగతంగా రెట్టింపుకు రెట్టింపుగా అంతకుపూర్వపుభార్యలకు ధనం యివ్వవలసిన నియమ మున్నట్లు నారదీయపురాణంలోని రుక్మాంగదచరిత్రవల్ల తెలుస్తున్నది. ఈవిధంగా ర్తెట్టింపుధనాన్ని పూర్వపుభార్యల కివ్వకుండానే పునర్వివాహాలు చేసుకుంటే భర్త పూర్వపుభార్యలకు ఋణగ్రస్థు డవుతాడని కూడా యీ సందర్భంలో నరసింహకవి యీ క్రిందివిధంగా స్పష్టపరిచాడు.

"వాసి కెక్కి ద్వితీయవివాహమునకుఁ
గూడి ప్రథమపరిణయద్విగుణధనంబు
లోలి సేయంగఁ దగుఁ గాక యున్న జ్యేష్ఠ
భార్య కాభర్త ఋణికుఁడై పరఁగియుండు."

(నార. 251. పు. 303. ప.)

వాస్తవానికి శాస్త్రీయంగా చూస్తే సంభోగసమయాలు, దినాలు పరిమితంగా వుంటాయి. సంభోగం చేయవలసిన శుభదినాల గురించి, అశుభదినాలగురించి అనేకసందర్భాలలో శాస్త్రాలలో విధినిషేధాలు యేర్పరచడం జరిగింది. సామాన్యంగా దివామైథునం అన్నది ప్రాచీనకామాదిశాస్త్రాలప్రకారమేకాక, ఆధునికవిజ్ఞానందృష్ట్యా కూడా ఆరోగ్యకరమైనది కాదు సరికదా ఆయుక్షీణకరమైనది కూడా. ఉత్తమసంతానం సంజనితం కావాలంటే మంచిమంచి శుభముహూర్తాలను సంభోగసమయాలుగా ప్రాచీనజ్యోతిశ్శాస్త్రవేత్తలు కొన్నిటిని పేర్కొన్నారు. కాని నరసింహకవి యిందుకు భిన్నంగా శాస్త్రీయమైన దృక్పథం లేకుండా చెప్పాడో, అతిశయోక్తిగా వర్ణించాడో, మూలా న్ననుసరించి చెప్పాడో లేదో మనం యేమీ చెప్పలేంకాని రుక్మాంగదుడు మోహినితో సుఖించిన విషయాన్ని వర్ణించినసందర్భంలో "ఇది దిన మిది రే యిది క్షణ మిది జా మిది పక్ష మనుచు నెఱుఁగక భోగాస్పదమగు పదమన నావిభుఁ డెదమాడి సంభోగబోగ మెసఁగ రమించెన్. (నార. 254. పు. 312. ప.) అని సర్వవేళలా శుభాశుభాలతో నిమిత్తంలేకుండా, రాత్రింబవళ్లతో పనిలేకుండా రుక్మాంగదుడు సుఖించినట్లు వర్ణించాడు.

మామూలుగా తండ్రి ఆస్తి సంతానానికి దక్కడం సర్వసామాన్యమైన విషయం. తల్లిదండ్రుల ఆస్తులమీద వారిపిల్లలకు హక్కుంటుందనడం కూడా సామాన్యమైన విషయమే. కొన్నిసందర్భాలలో తండ్రి ధనహీనుడై పుత్రుడు స్వార్జితమైన ధనంతో మిక్కిలి ధనవంతుడు కావచ్చును. తండ్రి పుత్రునిమీద ఆధారపడి పోషింపబడవచ్చును. కాని తండ్రిదగ్గర "ఈ ధనం నాది. నేను సముపార్జించినది." అని పుత్రుడు సగర్వంగా మాట్లాడితే ఆభావం కలిగివుంటే ఆపుత్రుడు నరకంలోకి పోతాడని నారదీయపురాణం చెపుతున్నది. ధర్మాంగదుడు అనేకమందిని జయించి రత్నరాసులనూ, వివిధసంపదలనూ కొల్లగొట్టుకొనివచ్చి తండ్రిపాదాలవద్ద సమర్పించి వీటి ననుభవించవలసిందని ప్రార్థించిన సందర్భంలో "పుత్రార్జితవిత్తంబు గ్రాహ్యంబు శంక వలవదు. వ్యయంబు సేయుము. తండ్రియెడ నీధనంబు నే నార్జించితినని గర్వంబున నాడికొను పుత్రుం డాభూతసంప్లవంబుగా నరకం బనుభవించు. కుఠారంబునుంబలెఁ బిత్రధీనుండగు కుమారుం డిచ్చెనని తండ్రియు ననుకొనందగదు." (నార. 256. పు. 319. వ.) అని నరసింహకవి ఉటంకించాడు.

వైదికబ్రాహ్మణకుటుంబాలలో మాత్రం విధవలు, అకేశలుగా వుండడం చాలాకాలంనుంచి ఆచారంలో వున్నది. నియోగులలో లేదు. ఈ సంప్రదాయం యెప్పటినుంచి యేర్పడిందో చెప్పడానికి మనసంస్కృతీ, చరిత్రను పట్టి చూస్తే సరైన ఆధారాలేవీ కనిపించడంలేదు. అయితే కొందరు సంప్రదాయజ్ఞులు పూర్వం దశరథుడు చనిపోయినప్పుడు కౌసల్యా సుమిత్రా కైకేయీలు శిరోముండనం చేయించుకున్నారని ఆ సంప్రదాయాన్ని మే మనుసరిస్తున్నామని చెప్పడంకద్దు. కాని యిందుకు ప్రామాణికంగా వాల్మీకి రామాయణంలో యెటువంటి శ్లోకమూ లేదు. కనీసం ప్రక్షిప్త మనదగినటువంటి శ్లోకమైనా లేదు. పైగా క్షత్రియులలో అస లీసాంప్రదాయమే లేదు. అయితే నరసింహకవి ధర్మాంగదుని వివాహానంతరం అతనిపరిపాలనావ్యవస్థను వర్ణిస్తూ "ఎచ్చట గూఢవిభవులై లోకులు వర్తింతు, రెచ్చట భర్తృమతియైనయింతి కంచుకరహితయై యిల్లు వెడలి తిరుగు నెచ్చట సకేశయై విశ్వస్త గనఁబడు, నెచ్చట నకేశ యగుచుఁ బుణ్యపురంధ్రి రాణించు." (నార. 258, 259. పు. 332. వ.) అని విధవలు సకేశలుగానూ, పుణ్యపురంధ్రులు అంటే పుంస్త్రీలు, సభర్తృకలైన స్త్రీలు అకేశలుగానూ ఉండరాదని పేర్కొన్నాడు.

1960 వ సంవత్సరంలో ఒక సందర్భంలో నే నుటంకించినట్లుగా - వాస్తవానికి వేదర్షులకాలంలో మృతభర్తృకలైన విధవలు శుభకార్యాలలో పాల్గొనరాదన్న నియమం ఉన్నట్లు కానరాదు. వేదర్షులలో దీర్ఘతముడు గొప్పవాడు. కేవలం ఆర్షదృక్కుతోనేకాక అమేయశక్తివంతాలైన తన చర్మచక్షువులతో సైతం సూర్యాది మహాగ్నిగోళాలను బహుముఖంగా పరిశోధించి అఖండఖగోళవేధ చేసిన మహర్షి దీర్ఘతమునికి మామతేయు డనికూడా నామాంతరమున్నది. దీర్ఘతముడు సూర్యాద్యగ్నిగోళాలను అనవరతం పరిశోధనలు చేసి, నేత్రాలు పోగొట్టుకున్నాడు. అంధుడై పోయాడు. అమృతసిద్ధి పొందకుండా, చర్మచక్షువులతో సూర్యాద్వగ్నిగోళాలపరిశోధనకు దొరకొన్న ఫలితమిది. మహాభారతకథనం ప్రకారం దీర్ఘతముడు గ్రుడ్డివాడైన తరువాత భార్యాబిడ్డలను పోషించలేకపోయాడు. "భార్యను భరించి పోషించవలసిన బాధ్యత భర్తమీద వున్నది. నీవు నన్నూ, కుమారులనూ పోషించడంలేదు. సరికదా యేవిధమైన సంపాదనా లేకుండా నీవు మామీద ఆధారపడి బ్రతుకుతున్నావు. పైగా మమ్మల్ని సాధిస్తున్నావు. వేధిస్తున్నావు" అని దీర్ఘతముని భార్య ప్రద్వేషిణి ఆగ్రహించి మాట్లాడుతుంది. అప్పుడు దీర్ఘతముడు విపరీతంగా ఆగ్రహోదగ్రు డవుతాడు. అప్పుడు ప్రద్వేషిణి మరింతగా కినిసి "కుటుంబపోషణ చేయలేని గ్రుడ్డివాడై అసమర్థుడైన మీతండ్రిని ఒకతట్టలో కూర్చోపెట్టి, తీసుకొనివెళ్లి నదిలో వదిలిపెట్టవలసిం" దని పుత్రులకు చెపుతుంది. తల్లి ఆజ్ఞమేరకు దీర్ఘతమునిపుత్రులు ఆపనికి పూనుకుంటారు. అప్పుడు దీర్ఘతముడు తీవ్రమైన కోపంతో "పతి హీనలైన స్త్రీలకు సంఘంలో గౌరవస్థానం వుండదనీ, శుభకార్యాలలో పాల్గొనే అవకాశంలేకుండా పోవుగాక" అనీ శపిస్తాడు. ఈ దీర్ఘతముని శాపం తరువాతనే విధవలైన స్త్రీలకు సంఘంలో గౌరవస్థానం లేకుండాపోయి, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లేకుండాపోయినట్లు కనిపిస్తున్నది. మనసంఘంలో విధవలపట్ల యేర్పడిన యీదుర్వ్యవస్థ దీర్ఘతముని శాపానికి పూర్వకాలంలో అప్పటి వేదర్షులకాలంలో వున్నట్లు కనిపించదు.

ఒక మంచిపని చేసినా, యేదైనా ఉత్తమవస్తువును తయారుచేసినా, గ్రంథరచన చేసినా, వివిధకళానైపుణ్యాలను చూపించినా సమర్థులై సమర్హులైన పెద్దల ఆమోదముద్రపడితే అది సార్థక మవుతుంది. ఇదేవిధంగా దైవార్చనలో ఉపయోగించే తీర్థాన్ని శంఖంలో పోస్తేనేతప్ప అది పవిత్రతీర్థం కాదని ప్రాచీనకాలంనుంచీ వొక అభిప్రాయం వున్నది. ఏ సందర్భంలోనైనా సరే పెద్దల ఆమోదముద్ర కావలసినప్పుడు "శంఖంలో పోస్తేనేకాని తీర్థం కాదుకదా!" అన్న సామెత చిరకాలంగా జనుల నానుడిలో నానుతున్నది. నారదీయపురాణంలో యిందుకు భిన్నంగా శంఖంలో పోసిన నీరు త్రాగడం పాపకర్మగా పేర్కొనడం జరిగింది. ప్రబోధనీమహిమగురించి మోహినికి రుక్మాంగదుడు వివరించిన సందర్భంలో "శంఖంబుతో జలంబు ద్రావుట, కూర్మసూకరమాంసంబులు భక్షించుట పాపంబులని తెలియంబడియె నేకాదశిభోజనంబును నగమ్యాగమనంబును, నభక్ష్య భక్షణంబును నకార్యకరణంబును గోసహస్రవధతుల్యం బని యెఱింగించె. ఏకాదశి నర్హంబె భుజింప? ఏకాదశిని బురోడాశంబును భుజింపంగాదు" (నార. 274. పు. 49. వ.) అని పేర్కొని శంఖంతో జలం త్రాగడం పాపకర్మగా వక్కాణించాడు.

ఆర్షవిజ్ఞానంప్రకారం దైవారాధనలో యేస్థాయిలోనూ హింసకు స్థానం లేదు. కన్నులు పొడుచుకొనడం, ముక్కు, చెవులు, నాలుక కోసుకోవడం, కుత్తుక నుత్తరించుకొనడం యిటువంటివి స్వయంగా చేసుకొనడమే కాదు, చేయడం కూడా వేదవిజ్ఞానందృష్ట్యా, ధ్యానదృక్పథప్రత్యక్షప్రమాణపరమైనవే కాని, ఆచరణపూర్వకమైనవి కావు. కాని వేదవిజ్ఞానం అంతర్ముఖంనుంచి సకలకాలస్వార్థశక్తులకారణంగా బహిర్ముఖమైపోయిన తరువాత హింసాప్రక్రియ లవతరించాయి. నారదీయపురాణంలో మోహినిమాటప్రకారం ధర్మాంగదుడు తన్ను చంపవలసిందని తండ్రిని కోరిన సందర్భంగా "సర్వమేధమఖంబున స్వసుతుఁ బశువుఁ జేసి వ్రేల్చిన తండ్రికి సిద్దమై లభించు నుత్కృష్టపదము గాంభీర్యధైర్యశౌర్యశాలివి నీ కింక శంక యేల?" (నార. 305. పు. 176. ప.) అని సర్వమేధమఖంలో స్వపుత్రుణ్ని పశువుగా వ్రేల్చడం గురించి ఉత్కృష్టకార్యంగా పేర్కొనబడింది. కాగా ఆర్షవిజ్ఞానం వక్రముఖం దాల్చిన తరువాతనే యిటువంటి హింసాప్రక్రియలు అవతరించాయని భావించవలసి వున్నది.

దేవత లనేకమంది వున్నారు. కాని నారదీయపురాణంవల్ల ధర్మదేవత, అధర్మదేవతలేకాక ధర్మాభిమానదేవత, అధర్మాభిమానదేవత, కాలాభిమానదేవత, వేదాభిమానదేవత. విద్యాభిమానదేవత వంటి విశిష్టదేవతలగురించి విపులంగా వర్ణించడం జరిగింది. (చూడు. నార. 399, 400, 407, 408 పు.)

ఆంతరంగికంగా వాస్తవాన్ని పరిశీలిస్తే అస్తి, నాస్తి మతాలకు భిన్నత్వం లేదు. లఘుదీర్ఘాదికాలపరిమితులతో సృష్టి అంతా అశాశ్వతమే. ఈదృష్ట్యా విభిన్నదేవతలకుసైతం కాలపరిమితి వున్నది. అంతత్వం వున్నది. జగన్మిథ్య బ్రహ్మ సత్యమన్న సిద్ధాంతంతో జగత్తంతా వున్నదనీ దానికి శాశ్వతత్వం లేదనీ ఆమోదించడం జరుగుతున్నది. జగతతీతమైనశక్తి యేదీ లేదన్న దృష్టితో నాస్తికత్వం ప్రబలినా, సృష్టివ్యవస్థ గురించిన అశాశ్వతత్వాన్ని గురించి నాస్తికులు సైతం 'ఔనని' ఆమోదించక తప్పదు. వాస్తవానికి జగత్తు అస్తి, నాస్తి వాదుల ఉభయులదృష్టిలోనూ వున్నది. దీని అశాశ్వతత్వం కూడా ఉభయవాదులూ ఆమోదించే విషయమే. అయితే ఒకశక్తిని మించిన వేరొకశక్తి వున్నదా? లేదా? అంటే ఆస్తికు లున్నదంటారు. నాస్తికులుసైతం దైవీయంపేరుతో లేదన్నా, ఉన్నదని వైజ్ఞానికంగా సత్యసమ్మతంగా ఆమోదించక తప్పదు. ఈదృష్ట్యానే నరసింహకవి విష్ణువుగురించి వర్ణిస్తూ "అవ్యయుండును, నిరాధారుండును, నిష్ప్రపంచుండును, నిరంజనుండును, విష్ణుండును, శూన్యుండును, వేదస్వరూపుండును, ధ్యేయుండును, ధ్యేయవర్జితుండును" అని పేర్కొనడమేకాక "అస్తి నాస్తి వాక్యవర్తియు, ధూరవర్తియు నంతికవర్తియు" (నార. 310. పు. 197. వ.) అని కూడా పేర్కొని అస్తి, నాస్తికత్వాల మూలతత్వం ఒకటే పొమ్మన్నాడు.

వ్యుత్పత్తి లోకవేద భేదాలతో ద్వివిధమై వుంటుందని నరసింహకవి వివరిస్తూ అలౌకికులుగా జన్మించిన బాలకులు, జననం మొదలు లోకానుభూతితో లౌకికులుగా మారిపోతారని చక్కగ తెలియచేశాడు. "ఆ మూకబాలకులు జన్మంబు మొదలుకొని నయనములు దెఱచి ప్రతిదివసంబునందును దృశ్యములు చూచుచు నున్నవారలై కార్యంబునందు స్వపరవైషమ్యంబు దెలిసి తలిదండ్రులం జూచి దైవవశంబునం బ్రథమవాసన గలవారలై యంతఁ దాత యనియు నంబి యనియుఁ దన్నామంబులం బల్కుదురు. సత్సంజ్ఞాసంజ్ఞాసంబంధ జ్ఞానజిజ్ఞాసు లైన స్వకీయులచేత 'మీ తండ్రి యేఁడీ' యనియు 'మీ తల్లి యేది' యనియు నడుగంబడిన నా బాలకు లా తండ్రినిం దల్లినిఁ దర్జనిచేత నిరూపించి తాతాంబేత్యాది శబ్దములకు నా వాక్యంబునందుఁ గార్యాన్వితతగదా? వారికిం బ్రథమశబ్ద మగుటంజేసి మున్ను గార్యపదాన్వయములేదు." (నార. 405. పు. 51. వ.) నిజానికి మాయ అంటే యేమో తెలియకుండా కుల, మత, జాతి వర్గాది భేదాలు లేకుండా ఈర్ష్యాద్వేషాల కతీతంగా కేవల సచ్చిదానందస్వరూపులుగా కనిపించే పసికందులు మాతాపిత్రాదులు కారణంగా, లోకంకారణంగా పచ్చిలౌకికులుగా మారిపోతారు.

భూమి బల్లపరుపుగా వుందని మన ప్రాచీనులు భావించినట్లు ఆధునికహేతువాదనామకులు కొందరు విమర్శిస్తూ వుంటారు. కాని ప్రాచీనులెవ్వరూ భూమి బల్లపరుపుగా వున్నదని యెక్కడా చెప్పలేదు. పైగా "ధరణీచక్రము దిర్దిరం దిరిగె" ఇత్యాదిప్రయోగాలతో అనేకమంది ప్రాచీనకవులు భూమిని చక్రాకారంలో వున్నట్లు పేర్కొన్నారు. నారదీయపురాణంలో ప్రహ్లాదచరిత్రలో మహావిష్ణువు తన ద్వారపాలకులు భూలోకంలో జన్మిస్తారని చెప్పే సందర్భంలో "మద్ద్వారపాలురు మత్పూర్వసంకల్పవైభవమాయానాటకంబున నధోలోకచక్రంబు బ్రవేశించి యీ శాపంబున నట్ల యవతరించి తరించెదరు" (నార. 422. పు. 123. వ) అని భూలోకాన్ని అధోలోకచక్రంగా సార్థకంగా ప్రయోగించడం జరిగింది. అంతేకాదు హిరణ్యకశిపుని పరిపాలనను వర్ణిస్తూ సమస్తదిశలను సైతం చక్రంగానే నరసింహకవి పేర్కొన్నాడు. "చక్రమును బోలి జితదిశాచక్రమునను" (నార. 429. పు. 159. ప.) కాగా దిశలన్నిటినీ కలిపి చూచినపుడు చక్రాకారంలో కనిపించడం అవాస్తవికమైన విషయంకాదు.

హిరణ్యకశిపునికి అంతరంగికంగా విష్ణుద్వేషం లేదని, బహిర్నాటకంగానే విష్ణుద్వేషాన్ని ప్రకటించాడని విశిష్టంగా గతంలో గుర్తించాం సనకాదులకు మోక్షప్రాప్తివిధానం గురించి తెలియచేసిన సందర్భంలోనే అసలు రాక్షసులందరూ కూడా అంతరంగికంగా సద్దృష్టితోనూ, బాహిరంగా దుష్టదృక్పథంతోనూ సురద్వేషులై తనలీలవల్లనే వ్యవహరిస్తారని మహావిష్ణువు పేర్కొంటాడు.

"నా మాయామయమోహిని
పామరదానవుల భ్రాంతిపఱచుట యఱుదే;
నా మాయఁ దెలియఁ జిత్రము;
సామాన్యులకెల్ల నెఱుఁగ శక్యంబగునే?

మన్నింత్రు కింకరుల్ మాననీయులు మన్ని
        యోగంబు కతన ననూనయశులు
సత్యసంకల్పు లాసురవంశమునఁ బుట్టి
        తత్సమాకారేంగితప్రకార
శక్తిగుణోదయసంపద తద్దైత్య
        జాతికినెల్ల విశ్వాస మొదవ
దీపించి బాహ్య కుదృష్టిసమ్మతమైన
        మతమునఁ బ్రియతమస్థితి వహించి
నిస్త్రయులు నిర్దయులు నతినీచతరులు
నగుచు ఘోరతరక్రియ లాచరించి
వైష్ణవద్రోహబుద్దిమై వార్త కెక్కి
సాధుదూషణపరిచితాచారు లగుచు.

అవైష్ణవులంబోలె నాయందు ద్వేషంబు గావింపుచుఁ గపటంబునం దిరుగుచు, జితత్రిలోకాధిపతులై జగత్రయంబున ఖ్యాతి నొందుచుఁ దామసులు తన వారన తామసోపాస్యచరణులై వారలకుం బ్రత్యయంబుగా బ్రహ్మరుద్రాద్యుపాస్తి గావించి వారలవలన బహువరంబులు గావించి యత్యాద్యైశ్వర్యపరాక్రమపయోనిధులై విరోధులుంబలె నటించి మత్పదాంభోజంబు లందెదరు. బాహ్యంబున నసురతాఖ్యాతికై సురల బాధించెదరు" (నార. 416, 417. పు. 99, 100. ప. 101. వ.) అంతేకాదు అస లంతకుపూర్వమే మొత్త మసురులందరికీ విష్ణుసత్వవిజ్ఞానోదయాన్ని కలిగిస్తానని విస్పష్టంగా పేర్కొంటాడు.

"అఖిలవేదాంతవేద్య విశ్వాత్మశీల
మైన సుత్సత్వవిజ్ఞాన మసురులకు జ
నింపఁజేసెద మన్మనోన్నిద్రశక్తి
ఘనతరంబైన సంవృతి క్రమమునందు."

(నార. 415. పు. 94. ప.)

ఈ లక్ష్యసిద్దికై మహావిష్ణువు అనేకానేకావతారాలు ధరించాడు. ధరిస్తాడు కూడా.

నరసింహకవి హిరణ్యకశిపుని శక్తిమత్తత్వాన్నిగురించి అతనిచేతనే చెప్పిస్తూ "గుణాన్వితత్వంబు వలన మానతయు దోషాన్విరత్వంబు వలన నమానతయు నగు; నిశ్చితంబైన మానత లేదు;" (నార. 431. పు. 169. వ.) అని మానతామానతల భిన్నత్వాన్ని ఉగ్గడించినా మానతకు నిశ్చితత్వం లేదు పొమ్మన్నాడు.

ప్రహ్లాదుని జననానంతరం అతడు ఓంకారనాదోచ్చారణ చేస్తూ "సో౽హం" - "హంసః" అన్న శబ్దాలలోని లోచనబంధయోగానికి సంబంధించిన బ్రహ్మను భవానుభూతితోపాటు అమృతసిద్ధిత్వాన్ని సైతం అధ్యాత్మానుభూతిపరంగా నరసింహకవి తేటతెల్లంగా వర్ణించాడు. (నార. 434, 435. పు. 182. వ.)

ప్రహ్లాదుడు తండ్రితో మాట్లాడుతూ మోక్షదాయకమైన దేవవేదకర్మపూర్ణమైన సద్విద్యగురించి చెపుతూ మోక్షభిన్నమైనదంతా కేవల శిల్పంవంటిదంటాడు.

"ఏది బంధకంబు గాదిది సత్కర్మ
మరయ మోక్షమునకు నయ్యె నెద్ది
యది సువిద్య దుఃఖ మన్యకర్మము శిల్ప
మన్య విద్య నిశ్చయముగ వినుము."

(నార. 437. పు. 195. ప.)

వాస్తవం పరిశీలిస్తే దేవతలకు ప్రతికృతులైన శిల్పాలే అయినా, ఆ మహావిష్ణుమూర్తి శిల్పమే అయినా కారుకులు రూపొందించినవి మాత్రమేకావు. అసలు శిల్పులు రూపొందించినవే అయినాసరే శిల్పాలు శిల్పాలే. విష్ణువు సర్వాంతర్యామి అయినప్పటికీ యెంత ప్రాణప్రతిష్ఠ జరిగిన శిల్పమైనా అసలు విష్ణువుకు దీటురాదు. కదా! కాగా మోక్షజ్ఞానానికి భిన్నమైనదంతా శిల్పంవంటిదని అనడంలో అవాస్తవికత యేమీ లేదు.

ధ్రువచరిత్రను అనేకగ్రంథాలలో విపులంగా వర్ణించడం జరిగింది కాని, ధ్రువుడు తపోధ్యాననిమగ్నుడై జపించిన మూలమంత్రాన్ని యే గ్రంథమూ ఉటంకించలేదు. ధ్రువుడు "హిరణ్యగర్భపురుషప్రధానావ్యక్తరూపిణే, ఓం నమో భగవతే వాసుదేవాయ శుద్దజ్ఞానస్వరూపిణే" (నార. 448. పు. 21. వ.) అన్న వేదమంత్రాన్ని జపించి సిద్ధి పొంది మహావిష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందగలిగాడని నరసింహకవి పేర్కొన్నాడు.

నరసింహకవి న్యాసమాహాత్మ్యాన్ని వర్ణిస్తూ ప్రస్తావనవశాత్తు కలియుగంలో త్రివిధతత్వపాషండులు, దొంగవైదికులు, దొంగయాజ్ఞికులు జన్మించి ప్రతిభావిరహితులై దుర్దేశికులుగా జీవిస్తారని వేదప్రమాణంతో పేర్కొన్నాడు. (చూడు. నార, 173. పు. 124. వ.)

వివాహాలలో మంగళసూత్రాలు కట్టడం, తలంబ్రాలు పోయడం యిటీవల నెలకొన్న సంప్రదాయం కాదని రుక్మిణీపరిణయసందర్భంగా నరసింహకవి వర్ణించిన పద్యాలలో "శుభకరంబైన మంగళసూత్ర మపుడు కట్టెఁ గృష్ణుండు రుక్మిణిగళమునందు".... "తలఁబ్రాలు వోసెఁ గృష్ణుండు కలకంఠీమణికి భీష్మకన్యకకు" (నార. 51. పు. 282, 283 ప.) అని నరసింహకవికాలానికి కూడా మంగళసూత్రాలూ, తలంబ్రాలు ప్రసిద్ధమై ఆచారంలోవున్నట్లు స్పష్టపరిచాడు.

సామాన్యంగా పరిపాలకులు యుద్ధాలు చేసి అనేకరాజ్యాల నాక్రమిస్తూ వుంటారు. ఇటువంటి సందర్భాలలో అనేకమంది ప్రజల పరిపాలకుల భూమి విజయం చేపట్టిన పరిపాలకునికి స్వాధీనమవుతుంది. వీటిల్లో యితర పరిపాలకులు దానంగా యిచ్చిన భూములుకూడా వుంటే వుండవచ్చును. విజయం చేపట్టిన పరిపాలకుడు తనకు లభించిన భూమిలో కొన్నిభాగాలను కొందరకు దానాలుగా యివ్వవచ్చును. ఇటువంటి సందర్భాలలో ఒకరు దానమిచ్చిన భూమినే తిరిగి మరొకరు దానంగా యివ్వడంకూడా జరుగుతుంది. అయితే ఒకసారి దాన మిచ్చినదానిని తిరిగి దాన మివ్వడం మహాదోషంగా మన ప్రాచీనులు భావించారు. కృష్ణునివలన కృకలాసవం శాపవిముక్తి పొందిన ఘట్టంలో తాను పూర్వజన్మలో రాజునని, ఒకరికి దానంగా యిచ్చిన ధేనువును మరొకరికి దానంగా యిచ్చి ధారవోసినందువల్ల తాను ఒకవిప్రుని ఆగ్రహానికి గురియై పరిశప్తుడ నయ్యానని చెపుతూ "ఏభవత్ప్రీతిగా జగతీసురుల గణేయంబులగు ధేనువుల దానం బొనర్చితి నందు నొకరికి నిచ్చిన ధేనువు నొకనికి నజ్ఞానంబున ధారవోసి యిచ్చితి. అన్యోన్యమత్సరంబుననున్న యాభూమీసురులలో నొకవిప్రుండు నన్నుఁ గృకలాసవం బగుమని శపియించె", (నార. 65. పు. 378. వ.) అని ఒకరు దానంగా యిచ్చినదాన్ని కాని, ఒకరికి దానంగా యిచ్చినదాన్నికాని మరొకరికి దానంగా యివ్వకూడదని పేర్కొన్నాడు.

ధర్మాధర్మాభిమానదేవతలు ఆత్మవృత్తిప్రకారం గురించి తెలియజేసేసందర్భంలో వివిధకాలక్రియాశబ్దవాక్యాది వ్యాకరణవిశేషాలను నరసింహకవి తెలియచేశాడు. (నార. 404, 405. పు.)

భాషాలంకారవిశేషాలు

నరసింహకవి అత్యంతవిశిష్టతగల యీ నారదీయపురాణకృతిలో అనేకజాతీయప్రయోగాలను, నానుడులను, సామెతలను యితర విశేష ప్రయోగాలను కొన్నిటిని ప్రయోగించాడు. కృష్ణుడు గోవర్ధనాన్ని యెత్తిన సందర్భంగా "ఉఫ్" అని తానూఁదనుండునే మింటిపైఁ బుష్కలావర్తకాంభోధరములు" (నార. 14. పు. 78. ప.) అని మనం మామూలుగా 'ఉఫ్‌' అని ఊదివేశాడు, అని వాడే 'ఉఫ్‌' పదాన్ని చక్కగా ప్రయోగించాడు. మామూలుగా పంచె కట్టుకొని పైపంచె వేసుకునేవారు ఆనందాతిరేకం కలిగినప్పుడు పైపంచె యెగరవేసుకుంటూ సంతోషంతో గంతులువేయడం జరుగుతుంది. యాదవాద్రిమీద శ్రీహరి దివ్యవిమానాన్ని సనత్కుమారుడు నిలిపినప్పుడు కల్యాణతీర్థంలోని ప్రజలు యెంతోసంతోషపడి పైపంచె లెగరవేస్తూ నర్తించారన్న విషయాన్ని నరసింహకవి యీక్రిందివిధంగా వెల్లడించాడు. "ఆ విచిత్రతఁ జూచి యౌర శ్రీ నారాయణాదిదేవుఁడు జగదద్భుతముగ నప్రమేయప్రమేయాకారముల రెంటఁ గనిపించె ననుచు వల్కలము లంత బొడవుగా నెగవైచి పొగడి నర్తింపుచు" (నార. 110. పు. 86. ప.) మామూలుగా 'కుక్కతోక పట్టి గోదావరి నీదడం', 'గోవుతోక పట్టి గోదావరి నీదడం' 'ఓటిపడవ నెక్కి ప్రయాణం చేయటం' వంటివి తెలుగులో నానుడులుగా వున్నాయి. నరసింహకవి కలియుగధర్మాలను వివరించే సందర్భంలో హరిభక్తి గొప్పదనం గురించి చెపుతూ హరిని మినహా యితరదేవతల నర్చించడం పగిలిన కుండ నాధారం చేసుకొని నది దాటాలని అనుకొనడం వంటిదని యీ క్రింది పద్యంలో చక్కగా వర్ణించాడు.

"హరిఁ దక్క నితరు నొక్కరు
శరణం బని తలఁచు టెల్ల సారతరంబై

తరిగలుగ భిన్నకుంభాం
తరమున నది దాఁట నాత్మఁ దలఁచుటగాదే!"

(నార. 178.పు. 152. ప.)

జనవ్యవహారంలో 'నివురు గప్పిన నిప్పు' అన్నది 'ధూళిధూసరితమైన రత్నం' వంటిదన్నట్లుగా తరచు ప్రయోగించబడుతూ వుంటుంది. నివురు అంటే బూడిద అనే అర్థం. నిప్పుకణం తెల్లని బూడిదతో కప్పబడినప్పుడు అది నిప్పు లేని మామూలు వట్టి ఆరిపోయిన బొగ్గు అనుకొని దాన్ని అంటుకున్నా, తొక్కినా ఛుర్రుమని కాలి తీరుతుంది. నిత్యవ్యవహారంలోనూ, సాహిత్యప్రపంచంలోనూ నివురు గప్పిన నిప్పు అని యీ సందర్భంలో 'నివురు' శబ్దాన్ని ఉపయోగించడమే ప్రసిద్ధమై వున్నది. బూడిద పర్యాయపదాలలో 'నివురు' తోపాటు 'నీరు' పదంకూడా వున్నది. 'నీరు' అంటే జలమని మాత్రమే అర్థంకాదు 'బూడిద' అనికూడా అర్థం వున్నది. జలార్థకమైన నీరుశబ్దం సాధురేఫయుక్తమని బూడిద అర్థం కలిగిన 'నీఱు' శబ్దం శకటరేఫయుక్తమని మామూలు సాంప్రదాయసిద్ధంగా పండితులంటారు. అయితే సాధు, శకటరేఫల భిన్నవ్యవస్థ అతిప్రాచీనకాలంలోనే ప్రథ్రష్టమైనది. కలగాపులగమైనది. 'నివురుగప్పిన నిప్పు' అనడానికి మారుగా 'నీరు గప్పిన నిప్పు' అని విశిష్టంగా నరసింహకవి వైకుంఠలోక ఆవరణపంచకవర్ణనాసందర్భంలో "నీరు గప్పిన నిప్పులై నిష్ప్రథత్వపూర్తి పరధామ లోకోపభోగభోగ్యులయ్యు" (నార. 361. పు. 179. ప.) అని ప్రయోగించాడు.

ఎవరైనా మనకు యిష్టంలేనిపనిగాని, వ్యతిరేకమైన పనిగాని చేసినప్పుడు "ఫో, ఫో, మంచిది -వెళ్లు, వెళ్లు, బాగాచేశావ్, బాగాచేశావ్" వంటి పదాలను వికటంగా, అసహ్యంగా వెటకారంతో ఉపయోగిస్తాం. ప్రహ్లాదుడు మహావిష్ణుభక్తు డయ్యాడని తెలుసుకొన్న తరువాత లోకవ్యవహారాని కనుగుణంగానే హిరణ్యకశిపుడు గురువును చూచి "తద్గురుని వక్రంబుగాఁ జూచి పొమ్ము పొమ్ము లెస్స లెస్స! యీ శిశువునిట్లనే చేసితివి" (నార. 464. పు. 88. ప.) అని అన్నట్లు నరసింహకవి జాతీయప్రయోగం చేశాడు. కొడుకును 'బాబూ' అనికాని 'నాయనా' అనికాని 'నాన్నా' అనికాని చివరికి 'బిడ్డా' అనికాని ప్రేమతో పిలవడం లోకంలో వ్యవహారంగా వున్నది. నరసింహకవి కాలంలో కొడుకును ముద్దుగా 'అన్నా' అని పిలిచే అలవాటుకూడా వున్నదికాబోలు. సునీతి తన కుమారునితో మాట్లాడుతూ "అన్న! దుఃఖ మేల యాసురుచి యథార్థమైన యట్ల పల్కె" (నార. 447. పు. 18. ప.) అని కొడుకును "అన్న!" అని సంబోధించినట్లు ప్రయోగించాడు. శృంగారవర్ణనలలో ప్రత్యేకించి విరహవేదనలలో చందమామ చల్లనివెన్నెలలు అతపకిరణాలవలే బాధించినట్లు వర్ణించడం కావ్యాల్లో తరచుగా చూస్తూ వుంటాం. చకోరాలు వెన్నెలను భక్షించి జీవిస్తాయనే విషయంకూడా సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధమైన విషయం. అయితే ఆ చకోరాలుసైతం మామూలు వెన్నెలను తట్టుకొని భక్షించి జీవించుతాయి తప్ప సాంద్రమైన చంద్రకిరణాలను చకోరాలు ఓర్చుకోలేవని, ఆ ధట్టమైన వెన్నెలలు, అతపాలవంటివై చకోరాలకు విజ్వరత్వాన్ని కలిగిస్తాయని నరసింహకవి శృంగారవిరహవర్ణనాసందర్భంలో కాదు, ఈశ్వరసాక్షాత్కార నిరంతరానందవర్ణనాసందర్భంలో పేర్కొన్నాడు. "నిల్చిన సేవించి యుపాసీనులై పరబ్రహ్మానందసింధువులగు బయాదికుల వెంట నిక్షురసవీచికా సంగతి నిక్షురసాంభోధినింబోలె నీశ్వరసాక్షాత్కారంబు గలిగి నిరంతరానందంబు వహించియున్నప్పు డొకయనిర్వాచ్యానందంబుగాంచి సాంద్రచంద్రాతపాతంత్రచకోరంబులుంబోలె విజ్వరత్వంబు నొంది యీశవిగ్రహదివ్యస్తదృష్టులై యనిమిషత్వంబు వహించి రప్పుడు" (నార. 379. పు. 252. ప).

చిత్రానక్షత్రయుక్తమైన పౌర్ణిమిగల మాసం చైత్రమాసంగాను ఇదేవిధంగా ఆయానక్షత్రాలతో కూడిన పౌర్ణమిగల మాసాలకు, ఆయానక్షత్రసంబంధనామాలే మాసనామాలుగా యేర్పడ్డాయి. ఈ రూపంగా శ్రవణానక్షత్రయుక్తమైన పౌర్ణమిగల మాసాన్ని శ్రావణమాసమని అనడం వేదఖగోళశాస్త్రబద్ధమైన విషయం. శ్రావణమాస ద్వాదశి అని శ్రావణద్వాదశి అని అనడానికి మారుగా శ్రవణద్వాదశియని నరసింహకవి ఒకమత్తేభంలో విశిష్టంగా ప్రయోగించాడు. "శ్రవణద్వాదశినాఁటిపుణ్య మిడి రాజా! నన్ను రక్షించు" (నార. 232. పు. 210. ప.). ప్రాచీనవాఙ్మయంప్రకారం 'ఛాందస' శబ్దానికి వేదపండితుడు, ఛందశ్శాస్త్రవేత్తవంటి అర్థాలు మాత్రమే వున్నాయి. ఇటీవలికాలంలో ఛాందసుడనే మాటకు పిచ్చిపిచ్చి నమ్మకాలున్నవాడని, మూఢవిశ్వాసలూ, ఆచారాలూ కలవాడని అర్థంవచ్చింది. ఈ విధంగా ఛాందసశబ్దార్థం పరిణామం చెందడం నరసింహకవి నాటికే జరిగిందని నారదీయపురాణంలోని యీక్రిందిప్రయోగంవల్ల తెల్లమవుతున్నది. "వేదాంతమతముకంటె నన్యమగు మతము మంచిదిగాదని తెలియక యీ వేదాంతమతము నాదరించక యీప్రకారమునను స్వగోష్టినిష్టులైన ఛాందసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతికల్పనులైన మోహంబు నొందించి రప్పుడు (నార. 376. పు. 244. వ.)

ఆధునికయుగంలో పద్య, గేయ, వచనాత్మకంగా ఒకానొకవైశిష్ట్యం కలిగిన సాహిత్యప్రక్రియ హరికథ పేరుతో అవతరించింది. హరికథావాఙ్మయంలో మొట్టమొదట 'హరికథ'నే అంటే విష్ణువుకథనే మొట్టమొదటిరచనలో వర్ణించడంవల్ల దానికి 'హరికథ' అని పేరు వచ్చివుంటుంది. క్రమక్రమంగా 'హరికథ' అన్న పేరు ఆప్రత్యేకసాహిత్యప్రక్రియకు రూఢనామంగా రూపొంది గిరికథ వర్ణింపబడినా, సిరికథ వర్ణింపబడినా మరే మహేశ్వర, రామాయణ, భారతాదికథలు, వివిధ ఉపాఖ్యానాలేకాక చివర కాసాహిత్య ప్రక్రియలో సాంఘికచరిత్ర కల కథ చేరినా ప్రస్తుతకాలంలో 'హరికథ'గానే రూఢమైపోయి విపులంగా చలామణి అవుతున్నది. అయితే నరసింహకవి యీ ఆధునికసాహిత్యప్రక్రియావైశిష్ట్యం కల హరికథను దృష్టిలో పెట్టుకొని ఉండడనడం అక్షరాలా సత్యమేకాని 'విష్ణుకథ' అనే అర్థంలో "హరికథ" అని వొకసారి "హరికథాసుధా" అని వేరొకసారి రెండుసందర్భాలలో 'హరికథ' శబ్దాన్ని ప్రయోగించాడు. "ఈశానిష్కృత గురుసత్కృప చేసైన యేవివక్షచేత నీప్రకారమున హరికథ మాకు రుచించునయ్యా వివక్షకొఱకు మఱియు మఱియు నమస్కారంబులు." (నార. 424. పు. 134. పు.) - "సూతుండు శౌనకాదులకు హరికథాసుధాప్రవాహంబు వెల్లివిరియ నిట్లనియె ననిన వారలు నిజశాస్త్రధౌరంధర్యప్రాగల్భ్యంబున వచ్చి నిలిచినయప్పుడు" (నార. 445. పు. 2. వ.).

మందరగిరి భూలోకంలో లేదనీ ఖగోళంలో యెక్కడో ఉత్తరదిగ్భాగంలో దూరతీరాలలో వున్నదనీ నారదీయపురాణం ఆధారంగానే వేదవిజ్ఞానపరంగా గతంలో గుర్తించాము. సంస్కృతంలో లౌకికవాఙ్మయం దృష్ట్యా గిరివాచకాలైన పర్యాయపదాలలో, భూధరం, ధరణీధరంవంటి శబ్దాలుకూడా చేరాయి. భూలోకంలో లేనటువంటి పర్వతాలను భూధరంవంటి పదాలలో వ్యవహరించడం శుద్ధపొరపాటు. మందరగిరి భూమిమీద లేదని తెలిసిన నరసింహకవే 'భూధర' శబ్దాన్ని సర్వసామాన్యపర్వతవాచకంగా భావించి "మందరభూధరోత్తమము" అని మందర పర్వతవర్ణనాసందర్భంగా ప్రయోగించి పప్పులో కాలు వేశాడు. "దాని మందరభూధరోత్తమముఁ గాంచి" (నార. 224. పు. 172. ప.) కొండలు భూమండలంమీదనే ఉండాలని లేదు. యేగోళంమీదనైనా ఉండవచ్చును. భూమికి భిన్నమైనగోళాలలో ఉన్న పర్వతాలను భూధరాలని అనడానికి వీలులేదు.

అనుకరణంలో నమశ్శబ్దం విసర్గకు ఓత్వంవచ్చి 'నమో' అని రూపొందడం వ్యాకరణసమ్మతమై ప్రాచీనకవిప్రయోగప్రసిద్ధమై వున్నది. ప్రాచీనకవులే కొందరు అనుకరణవిరహితత్వంలో సైతం నమోశబ్దాన్ని ఓకారాంతంగానే ప్రయోగించారు. సంస్కృతంలో నమశ్శబ్దమేకాక 'నమో' అనే ఓదంత అవ్యయంకూడా ఒకటి వున్నది. ఈవిషయం ప్రౌఢవ్యాకరణకర్త కూడా తెలియచేశాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని నుతించిన సందర్భంగా నరసింహకవి రచించిన యీ క్రిందిపద్యంలో 'నమో' అనే అవ్యయాన్నికూడా ప్రయోగించినట్లు స్పష్టపడుతున్నది.

'కారణాయ నమో రక్షకాయతే న
మో నమో వరదే నమో మునిజనైక
కుశలదాయ పరేశ వైకుంఠవాసి
నే నమః శ్రీనివాసాయ నిఖిలశరణ.'

(నార. 103. పు. 48. ప.)

ఈ పద్యంలో "కారణాయ నమో-రక్షకాయతే నమో" అన్నప్పుడు అవ్యయాలైన "నమో" లను, మిగిలినచోట్ల నమశ్శబ్దాలను ప్రయోగించినట్లు స్పష్టపడుతున్నది.

ప్రాచీనకాలంలో కొందరు కవులు అనుకరణవిరహితంగా సంస్కృతవాక్యాలను ప్రయోగించిన సందర్భాలు లేకపోలేదు. ఇదేవిధంగా నరసింహకవికూడా "కదళీనకదాచన యని యనిరి"అని అనుకరణసహితంగా ప్రయోగించవలసివుండగా ఈ క్రింది పద్యంలో అనుకరణవిరహితంగానే సంస్కృతవాక్యాన్ని ప్రయోగించాడు.

"చకచక నేమించినయా
ముకురానన యూరుయుగము మోహనకాంతుల్
ప్రకటించి మెఱయఁ "గదళీ
నకదాచన" యనిరి బుధజనంబులు భళిరే!"

(నార. 49. పు. 267. ప.)

తెలుగులో "అయి-అవులకు ఐ,ఔ"లు రావడం సుప్రసిద్ధమైన విషయం. వ్యావహారికంగానూ, గ్రాంథికభాషాపరంగానూ యీ అయి, ఐ, అవు, ఔ ల మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రాచీనకాలంలో పండితకవులు సైతం తికమకలుపడి తారుమారులుచేసి 'ఐ, ఔ' లకు 'అయి, అవు'లను-ప్రత్యేకించి యీ మార్పురావడానికి వీలు లేకుండా వుండే సంస్కృతంలో సహజంగా ఐకార, ఔకార యుక్తాలైన పదాలలోని ఐ, ఔ లను కూడా అయి, అవులుగా మార్చి తప్పటడుగులు వేసి ప్రయోగించారని 20 సంవత్సరాల క్రిందట నేను రచించి ప్రకటించిన ప్రాచీనవాఙ్మయంలో వ్యావహారికభాష, లేక "ధ్వని-లిపి-పరిణామం" అన్న పరిశోధనాగ్రంథంలో నిరూపించివున్నాను. నైవేద్యశబ్దం సంస్కృతంలో ఐ కార యుక్తమైన నకారంకలది. ఇది వ్యావహారిక వశాత్తూ, ఐ-అయి గా మారి నైవేద్యశబ్దం నయివేద్యంగా మారిపోయింది. నరసింహకవినాటికే యీమార్పు వచ్చిందని "భక్తిమై సహస్రభార స్రమిత నయివేద్య మిచ్చి" (నార. 156. పు. 44. ప.) అన్న ప్రయోగం ద్వారా రూఢి అవుతున్నది. సంస్కృతీయమైన అచ్చుకు సాధారణంగా సంధిని ప్రాచీనులు ఆమోదించలేదు. ప్రత్యేకించి సంస్కృతపదాలలో వున్న ఇత్వానికి సంధిని అసలే ఆమోదించలేదు. కాని నరసింహకవి "పొగడినవరాహమూర్తగు భగవంతుని" (నార. 85. పు. 488. ప.) అని మూర్తి + అగు అన్నప్పుడు సంధిచేసి "మూర్తగు" అని ప్రయోగించాడు. ఇది అగతికంగాచేసిన ప్రయోగంవలె కనిపిస్తున్నది.

నరసింహకవి నారదీయపురాణంలో వివిధ అలంకారాలను అనేకసందర్భాలలో ప్రయోగించాడు. అయితే రెండే రెండు సందర్భాలలో అత్యంతరమణీయమై, కమనీయమై హృదయానికి హత్తుకొనిపోయేవిధంగా అనుపమానమైన ఉపమాప్రయోగాలను నరసింహకవి చేశాడు. అత్యంతవిశిష్టంగా మనదృష్టి నాకర్షించే ఆ పద్యరత్నా లివి.

"అంబుజాక్షు నాత్మయందు నిల్పక యధ
మాధములఁ దలంచు టరయఁ దండ్రి
నాఁటి ధనము విడిచి నరుఁడు స్వప్నాగత
నిధి గృహంబునందు నిలిపికొనుట."

(నార. 179. పు. 159. ప.)

"ఏఁ దక్క నితరుల కెఱుఁగంగ రాకుండఁ
         జేసితినేనె విచిత్రమైన
మామకసంకల్పమహిమ తద్భక్తిమై
         మత్తత్త్వధీసుధామధురరసము
లసురులఁ గ్రోలింతు నతిరోగశిశువులఁ
         జక్కెర యనుచు నౌషధముఁ దల్లి
ద్రావించునట్లు తత్త్వజ్ఞాన ముదయింప
         బోధించునట్టి దుర్బోధమతుల"

(నార. 416. పు. 97. ప.)

ఛందోవిశేషాలు

నరసింహకవి సంస్కృతాంధ్రాలలో బహుముఖమైన పాండితీప్రతిభలు కలవాడు. మన ప్రాచీనకవులవలెనే నరసింహకవి కూడా ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేభాది సంస్కృతవృత్తాలను, కందం, సీసం , తేటగీతి, ఆటవెలది వంటి జాత్యుపజాతి పద్యాలనే కాక స్రగ్ధర, మహాస్రగ్ధర, లయగ్రాహి, కవి రాజవిరాజితం, భాషిణి, మత్తకోకిల, మయూరవృత్తం, మాలిని, తరళవృత్తం వంటి వాటిని దండక, రగడలతోపాటు విశిష్టగద్యరచనసైతం విరచించాడు.

దివ్యవిమానస్థుడైన శ్రీహరి అర్చామూర్తిని మహేశుడు స్తుతించేసందర్భంలో తెలుగు యతిప్రాసనియమాలను పాటించి సంస్కృతభాషలో మత్తేభవృత్తాన్ని రచించాడు. (నార. 108. పు. 70. ప.) ఇదేవిధంగా అంతకుముందు బ్రహ్మ శ్రీమన్నారాయణుని స్తుతించిన సందర్భంలో కేవల తెలుగుఛందస్సు లనిపించుకుంటున్న రెండుతేటగీతులను, తెలుగులక్షణం ప్రకారం అక్షరమైత్రి గల యతులను ప్రయోగిస్తూ సంస్కృత భాషలో రెండుపద్యాలు రచించాడు. (నార. 103. పు. 47, 48. ప.)

నారదీయపురాణంలో రెండుసందర్భాలలో ఆటవెలదులు గీతపద్యాలుగా "గీ" అని పేర్కొనబడడంద్వారా ముద్రితమయ్యాయి. (నార. 241. పు. 255. ప; 262. పు. 345. ప.) ఆటవెలదిని గీతంగా పేర్కొనడం పొరపాటని కొందరు భావించవచ్చును. నారదీయపురాణం వ్రాతప్రతిలో చాలావరకు ఆటవెలదులు గీతులుగానే పేర్కొనబడ్డాయి. వాస్తవానికి ఆటవెలదిని సైతం గీతమనడం దోషం కానేరదు. మన ప్రాచీనలాక్షణికులు గీతులు సమగీతులు, విషమగీతులని రెండు విధాలని, విషమగీతుల్లో యెత్తుగీతి, పవడగీతి, మేళనగీతులువంటివి

చేరగా, సమగీతులలో ఆటవెలది, తేటగీతి చేరినట్లు పేర్కొన్నారు. అందువల్ల ఆటవెలదిని తేటగీతిగా పేర్కొనరాదు కాని గీతంగా పేర్కొనడంలో పొరపాటు లేదు. ఈ గ్రంథపరిష్కర్తలలో ఒకరు మూలంలో ఆటవెలదులను గీతంగా పేర్కొనడంవల్ల ఆపద్యాలన్నీ తేటగీతి లక్షణానికి విభిన్నంగా వున్నాయని భావించి నరసింహకవి సహజంగా రచించిన ఆటవెలదులను, తమభాష నుపయోగించి పరిష్కరణలో తేటగీతులుగా మార్చివేయడంజరిగింది. నరసింహకవి సహజంగా ఆటవెలదులను రచించి వాటిని గీతాలుగా పేర్కొనవచ్చునన్న అభిప్రాయంతో సలక్షణంగా పేర్కొన్నాడన్న విషయాన్ని గుర్తించకపోవడంవల్ల గీతి భేదాలలో ఆటవెలది వొకటన్నసంగతి గమనించనందువల్ల పొరపాటుగా నరసింహకవి పద్యాలను కొన్నింటిని సవరించి వేయడం జరిగింది. అయితే పరిష్కృతమైన నారదీయపురాణాన్ని మూలప్రతితో సరిపోల్చిచూచి నేను పునఃపరిష్కరణ కావించిన సందర్భంలో నరసింహకవి సహజరచనలైన ఆటవెలదులను యథాతథంగానే వుంచడంజరిగింది. నరసింహకవి కల్యాణతీర్థమహిమ - సుచరితుని కథను వర్ణిస్తూ మొదట సీసపద్యం వ్రాసి, సీసంలో తేటగీతిని విశిష్టంగా పంచపాదిగా రచించాడు. (నార. 112. పు. 94. ప.)

మామూలుగా మనం గద్యమన్నా, వచనమన్నా, ఒకటే ననుకుంటాము. రెండింటినీ పర్యాయపదాలుగా సైతం భావిస్తాము. సంస్కృతంలో సైతం యీ అభిప్రాయమే వున్నా సంస్కృతాంధ్రాలలో రెండింటా ఒకానొకపదబంధశయ్యావిశిష్టమైన వచనరచనను ప్రత్యేకించి గద్యగా పేర్కొనడం ప్రాచీనకాలంనుంచీ వున్నది. నిజానికి చెప్పాలంటే వచనమన్నా గద్యమన్నా ఒకటే కాబట్టి సంస్కృతంలో శాకుంతలాదినాటకాలలోవున్న సంభాషణారూపాలైన వచనాలను, వాక్యాలను గద్యా లనవలసి వుంటుంది. దశకుమారచరిత్ర, కాదంబరివంటి విశిష్టగద్యకావ్యాలలోని గద్యాన్ని మనం మామూలుగా గద్యమని అంటాముకాని వచనమనికూడా పేర్కొనవలసి వుంటుంది. అదే తెలుగులో మామూలుగా గ్రాంధికనాటకాలలోవుండే వచనాన్ని, చిన్నయసూరి నీతిచంద్రికలో ఉపయోగించిన విశిష్టపదగుంభనాశయ్యాభరితమైన రచననూ వచనమే అని మన మనుకుంటున్నా రెండింటిలోని భిన్నత్వాన్ని, వైశిష్ట్యాన్ని మనం గుర్తించలేకపోము. శివకవిగా ప్రసిద్ధికాంచిన పాల్కురికి సోమన ఒకానొక వైశిష్ట్యంగల వివిధగద్యలను రచించాడు. నిజానికిని వచనరచనలే అయినా ఒక ప్రత్యేకతగల గద్యలుగా పేర్కొనబడడమేగాక సాహిత్యవేత్తలచేత పరిగణింపబడ్డాయి కూడా. ప్లవనామ సంవత్సరం ఉగాదినాడు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రవారు యేర్పాటుచేసిన "నాకు నచ్చిన వచనశైలి" అన్న విద్వద్గోష్ఠిలో గద్య, వచనాల విభిన్నత్వాన్ని, విశిష్టత్వాన్ని గురించి నేను విపులంగా ప్రసంగించాను. ఎంతటి పదబంధశయ్యాభరితమైన గద్యమైనా "బసవాంకగద్య" "శివాంక గద్య" "సాంబాంకగద్య" వంటి నామాలతో వ్యవహరించినట్లే "బశవాంకవచనం" "శివాంకవచనం" "సాంబాంకవచనం" వంటి వచనశబ్దప్రయోగాలతో కూడా గద్యలను వచనాలుగా పేర్కొనవచ్చును. అయినప్పటికీ జటిలపదసంభరితమై కూడా సమాసభూయిష్టమైన వచనాన్ని వచన మనడంకంటే గద్య మనడమే ప్రసిద్ధంగా వున్నది. ప్రత్యేకించి ఆశ్వాసాంతంలో ఉపయోగించే వచనాన్ని అది నిజానికి వచనమే అయినా దాన్ని యెవ్వరూ కూడా ఆశ్వాసాంతవచనంగా వ్యవహరించలేదు సరికదా, ఆశ్వాసాంతగద్యంగా మాత్రమే అతిప్రాచీనకాలంనుంచి వ్యవహరించడం జరుగుతూ వచ్చింది. నారదీయపురాణంలో నరసింహకవి సైతం చిన్న పెద్ద వచనాలను పెక్కింటిని రచించాడు. కాని సనకాదులు యితరదేవతలు శ్రీమన్నారాయణుని నుతించిన సందర్భంలో నరసింహకవి గద్యము పేరుతో విశిష్టసమాసభూయిష్టమైన గద్యాన్ని రచించాడు. (నార. 381. 382. పు. 259. గద్యము). నారదీయపురాణం మొత్తంలో వున్న యితరవచనాలకూ, యీ గద్యానికీ రచనావిధానంలో హస్తిమశకాంతరం మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి గద్య, వచన శబ్దాలు పర్యాయపదాలే అయినా రచనాపరంగా కొన్ని కొన్ని సందర్భాలలో గద్యం ఒకానొక విశిష్టస్థానం సంపాదించింది. ఈ విశిష్టత ఆశ్వాసాంతాలలో గద్యంగా మాత్రమే పేర్కొనబడడంద్వారా మరింత దృఢపరచుకొన్నది.

ఛందశ్శాస్త్రవేత్త అయిన నరసింహకవి మామూలు యతిప్రాసలనే కాక కవులు అరుదుగా వాడే వృద్ధియతి, ఉభయవళులను, అభేదవళులను కూడా ప్రయోగించాడు.

"ఆజానుబాహు నీలాంబుదనిభదేహుఁ
గౌస్తుభాభరణు లోకైకశరణు."

{{right|(నార. 46. పు. 248. ప.) ఈసందర్భంలో లోకైకశబ్దంలో వృద్ధివళిక్రింద 'కై' లోని 'ఐ' కారానికి 'ఏక' లోని 'ఏ' కారానికి రెండచ్చులకూ యతి వేయవచ్చును. ఉభయవళి పేరుమీద అజ్ఝల్లులకు రెండింటికీ యతి వేయవచ్చును. కాగా నరసింహకవి "గౌస్తుభా" అన్నప్పుడు "గౌ" కారానికి 'లోకైక' అన్నప్పుడు 'కై' కారానికి స్వరమైత్రియుక్తాలైన హల్లులకు వర్గవృద్ధ్యుభయవళిగా యతిని ప్రయోగించాడు. ఈక్రిందిపద్యంలో చివరిపాదంలో 'రడ'ల అభేదమైత్రిని పాటించి విశిష్టమైన అఖండయతిని సైతం నరసింహకవి ప్రయోగించాడు.

"హరిభక్తిసమేతులఁగని
ధరలోపల శంఖచక్రధారణ ముసఖాం
తరముల నిందించినవాఁ
డరయఁగఁ బాషండు లండ్రు రాజన్యవరుల్.

(నార. 145 పు. 248. ప.)

నారదీయపురాణం 30 పు. 162 వ. పద్యమైన "సొగసుగా పింఛంబు" ఇత్యాది సీసపద్యంలో

"తళుకుబంగరుచీర గట్టించి గళమున
          నవరత్నహారముల్ వైచి వైచి"

అన్నమూడవపాదంలో "గట్టించి" అని ముద్రింపబడి యతి తప్పినది అని పుట్ నోట్ లో పేర్కొనడం జరిగింది. వాస్తవాని కిక్కడ నరసింహకవిచేత ప్రయుక్తమైనపదం గట్టించికాక, ధట్టించిగా కనిపిస్తున్నది. కాగా యతిదోషం లేదని గ్రహించాలి. ఇదేవిధంగా ఉపపాదంలో వైచి వైచి అని ప్రయోగించడంద్వారా యతిలోపం పేర్కొనబడింది. కాని నవచి నవచి అని కవిహృదయంగా ప్రయుక్తమైనట్లు కనిపిస్తున్నది.

నారదీయపురాణం 34. పుట 108. సీసపద్యంక్రింది తేటగీతి ప్రథమపాదం "హస్తములఁబట్టి బిరబిరఁ ద్రిప్పి యార్చి" అని ముద్రితమై యతిభంగం జరిగినట్లు కనిపిస్తున్నది. కాని వాస్తవానికి నరసింహకవి ఆ పాదాన్ని హస్తములఁ బట్టి బిరబిర నార్చి ద్రిప్పి అని రచించివుంటాడని ప్రతివ్రాసిన వ్యక్తి పొరపాటున మాటలను ముందువెనుకలుగా మార్చి వ్రాశాడని భావించవలసివున్నది.

నరసింహకవి కొన్నిసందర్భాలలో అసాధారణమై ప్రాచీనకవులచేత సకృతులుగా ప్రయోగించబడి లాక్షణికులు గుర్తించనటువంటి కేవలస్వరయతిని కూడా ప్రయోగించాడు.

"తరులతాకుంజఖగమృగతతుల నడిగి
గగనభూవారిపవనతేజో౽౦తరముల."

(నార. 3-. పు. 169. ప.)

ఈ పైతేటగీతిలోని రెండవపాదంలో గగనశబ్దగతమైన తొలి 'గ' కారంలోని 'అ' కారానికి "తేజో౽౦తర" అన్నప్పుడు పూర్వరూపసంధిలో గూఢమై వున్న 'అంతర' శబ్దంలోని 'అ' కారానికి కేవల స్వరయతిగా విశేషయతి ప్రయోగం చేయబడింది.

నారదీయపురాణం 100వ పుట 35వ పద్యమయిన సీసంలోని యీ క్రింది రెండవపాదంలో

"అన్యగాథలు మాని నారాయణుని నభో
         భ్యంతరాళమున గానం బొనర్ప"

నభోభ్యంత అన్నప్పుడు 'భ్య'లోని 'య'కారానికి 'గానం' అన్నప్పుడు 'న' వర్ణంలో 'అ' కారానికి కేవలస్వరయతి ప్రయోగించబడింది. ఈసందర్భంలో అభ్యంతరశబ్దాన్ని 'అభి + అంతర' అని విభజించినప్పటికి కూడా ఉపసర్గయతి దృష్ట్యా 'అంతర' లోని అకారస్వరానికి యతివేశాడని అనుకొన్నా 'న' వర్ణంలోని కేవల అకారస్వరానికి మాత్రమే యతిమైత్రిని పాటించాడని మనం ఆమోదించకతప్పదు.

"అలఘులు వీతరాగులు ................................... లా
జలుగొన ................................................... వై
ద్యులువలె భూమిఁ ద్రిమ్మరుచుఁ బూర్ణదయాగుణవారిరాసులై.

(నార. 376. పు. 240. ప.)

అన్న చంపకమాలలో మూడవపాదంలో యతిమైత్రిలో 'ద' కార 'బ' కారాలకు అసలు సంబంధం లేనేలేదు. "ద్యు"లోని 'యు'వర్ణానికో 'ఉ'స్వరానికో "బూ" లోని 'ఊ'కారంతో కేవలస్వరయతిని నరసింహకవి ప్రయోగించాడని మనం విస్పష్టంగా గుర్తించవలసి వున్నది. ఇదేవిధంగా యీ క్రింది తేటగీతి మూడవపాదంలో,

"కాన గోవిందమాహాత్మ్యకథలయందు
నిరుపమానంద మొంది వర్ణించి సన్ను
తించి నర్తించినట్టి యానియమపరుఁడు
పరమభక్తుండు ఘనుఁడు సద్భాగవతుఁడు.

(నార. 453. పు. 41. ప.)

"సన్నుతించి" శబ్దంలోవున్న 'ఇంచుక్‌'లోని 'ఇ'కారానికి 'నియమ'శబ్దంలోని 'ని' వర్ణగతమైన 'ఇ' కారానికి కేవల స్వరయతిని పాటించాడు. ఒకవేళ యిక్కడ నరసింహకవి కేవలస్వరయతిని ప్రయోగించలేదని అనుకున్నా అగ్రాహ్యవళులుగా కొందరు లాక్షణికులు తిరస్కరించిన "త-న" లమైత్రిని నరసింహకవి ఆమోదించి ప్రయోగించాడని మనం అంగీకరించవలసివస్తుంది. ఈ కేవలస్వరయతిని ప్రాచీనకాలంలో కొందరు ప్రామాణికులైన కవులు సకృత్తుగా ప్రయోగించారు. 1950 - 1951 సంవత్సరాలలో "అప్పకవీయవివరణవిమర్శనాలేశము" అన్న శీర్షికతో "త్రిలిజ్గ" వారపత్రికలో నేను వ్రాసిన వ్యాసపరంపరలోని 24వ వ్యాసంలో ఈకేవలస్వరయతిని గూర్చి చర్చిస్తూ శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో (ప్ర. ఆ. 69. ప) కేవల స్వరయతిని ప్రయోగించాడని యీ క్రిందిపద్యాన్ని ప్రమాణంగా ఉదాహరించాను.

"చాలదళంబుగాఁ బృథులచంపకకీలనఁ బొల్చుబొందుఁడో
మాలె లనంగఁ బండి మహిమండలిఁ జీఱుచు వ్రాలి గ్రంథమూ
ర్ఛాలసయైన భృంగతతినాఁ దుద కప్పమర న్ఫలావళు
ల్వ్రీలిగెల ల్సుగంధికదళీవనపఙ్క్తుల నొప్పు నప్పురిన్.

పైపద్యంలో మూడవపాదంలో 'మూర్ఛాలస' అన్నప్పుడు "అలస" శబ్దంలోని అకారానికి "నాన్" అన్నప్పుడు 'నా'కారంలోవున్న "ఆ"కారానికి కేవలస్వరయతిని వేయడం జరిగింది. వాస్తవానికి 'అనన్‌' అనే అన్నంతక్రియమీద 'నాన్‌' అనే రూపం రూపొందినప్పటికి లాక్షణికంగా "నాన్"లోని స్వరసహితమైన "నా" వర్ణానికే యతి వేయవలసివున్నదికాని 'నా'లోని "ఆ"కారానికి స్వరయతిని వేయడం లాక్షణికం కానేరదు. కాగా యీ సందర్భంలో కృష్ణదేవరాయలు కేవలస్వరయతిని పాటించి ప్రయోగించాడని మనం ఆమోదించక తప్పదు. కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి సంపాదకత్వాన గుంటూరునుండి వెలువడిన "సుభాషిణి" మాసపత్రికలో 1951లో నేను అనంతుని ఛందస్సుపై వ్రాసిన పరిశోధనాత్మకాలైన విమర్శావ్యాసాలలోసైతం యీ కేవలస్వరయతి ప్రయోగంగురించి సప్రామాణికంగా, సోదాహరణంగా చర్చించివున్నాను. ఇంతకూ యీసందర్భంలో నేను పేర్కొనేదేమంటే కొన్నిపద్యాలలో నరసింహకవి ఉపయోగించిన కేవలస్వరయతి వినూతనమైం దేమీ కాదనీ ప్రాచీనప్రామాణికకవులచేత ప్రయుక్తమైనదేనని మాత్రమే.

శివకవులు తదితరప్రామాణికకవులు రేఫయుక్తమైన అక్షరాలకూ రేఫవిరహితాలైన అక్షరాలకూ ప్రాసమైత్రిని పాటించారు. నరసింహకవి యీక్రిందిసీసపద్యంలోని తేటగీతి మొదటిపాదంలో "వర్తిలుచుఁ గోటిసూర్యవిస్ఫురితకోటి" (నార. 369. పు. 210. వ.) "వర్తి" అన్నప్పుడు వర్తిలోని "ర్తి" వర్ణానికి "స్ఫురిత" లోని "రి" వర్ణానికి సంయుతాసంయుతప్రాసయతిని విశిష్టంగా పాటించాడు. ప్రాచీనకవులు సంయుతాసంయుతప్రాసలో రేఫసహితరహితత్వాలకే ప్రాధాన్యం యివ్వగా నరసింహకవిమాత్రం రేఫస్థితిని యథాతథంగానే ఉంచి రేఫభిన్నమైన ఇతర హల్ విరహితంగా సంయుతాసంయుతప్రాసను విశేషంగా ప్రయోగించాడు.

ఉపసంహారం

నరసింహకవి విరచించిన యీనారదీయపురాణం అసలు సంస్కృతమూలపురాణానికి గాని, ఉపపురాణానికి గాని సరియైన అనువాదమని సాధికారికంగా చెప్పే అవకాశం లేదని గతంలోనే మనం గుర్తించాము. అయినా నరసింహకవి విశిష్టప్రతిభాసంపన్నవంతమై బహుముఖకవితావైభవంతో విరాజిల్లే యీనారదీయపురాణం ఆంధ్రవాఙ్మయంలో ప్రత్యేకస్థానం వహించుతుందనడంలో యేమాత్రమూ సందేహం లేదు. ఇంక దేవర్షిగా, త్రికాలజ్ఞుడుగా, త్రిలోకసంచారిగా, అపరజగన్నాటకసూత్రధారిగా, ఆచంద్రతారార్కుడై నిలిచిన నారదునివల్ల ప్రోక్తమై అవతరించిన నారదీయపురాణకృతికి ప్రతికృతిగా అలవోకగా ఆవిష్కృతమై వెలసిన నరసింహకవి తెలుగు నారదీయపురాణంలోని రవిశశితేజోమయనేత్రసంకలితుడై, శంఖచక్రగదాశార్జ్గపాణియై, కౌస్తుభమణిశ్రీవక్షస్థలహృదయుడై, మహారాజఫణిశాయిగా, సృష్టిస్థితిసత్యశ్రీమహావిభుడై, అసాధారణ, అపూర్వ, అమేయ జయశ్రీసంశోభితుడై నిరంతరనిర్వికారనిరంజనరూపుడై విరాజిల్లే జగన్నాటకసూత్రధారియైన ఆ శ్రీ మహావిష్ణుదేవుని శక్తిమత్తత్వబోధాత్మకమైన అమృతరసాన్ని ఆస్వాదనం చేసి తరింతురుగాక.

ఇట్లు

అఫ్ జల్ గంజ్,

వాఙ్మయమహాధ్యక్ష

హైదరాబాదు.

డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య

1-11-1976

కళాప్రపూర్ణ

డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్

లైబ్రరీ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్.

  1. ఇప్పుడు బెంగాల్ దేశంలో పాండ్వాప్రాంతంలో వున్నది.
  2. ఇది పశ్చిమసముద్రతీరంలో వున్నది.
  3. వైతరణినదీతీరంలో ఇప్పటి జాజిపూర్ సమీపంలో వున్నది.
  4. ఇది అస్సాం రాష్ట్రంలో వున్నది.
  5. దీని నిప్పుడు అలోపీశాంకరీపీఠం అంటున్నారు.
  6. ఇది బొంబాయి రాష్ట్రంలో వున్నది. కరవీరపురంగా పేర్కొనబడింది. ఇదే కొల్హాపూర్.
  7. కాంగ్రా ప్రాంతంలో వున్న దీనిని వైష్ణవీపీఠంగా సైతం పేర్కొనడం జరుగుతున్నది.
  8. నన్నెచోడుడు కుమార సంభవాన్ని మల్లికార్జునునికి సతిగా అంకిత మివ్వలేదనీ అతనిపేర సంతానంగా వెలయించాడనీ "సప్తసంతానాలలో కృతి సతియా? సుతయా?" అన్న బృహద్ వ్యాసంలో నిరూపించాను. (కృష్ణాపత్రిక 1961, ఆగష్టు, సెప్టెంబరు.)
  9. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురణ.